Jump to content

ఆంధ్ర రచయితలు/రాయప్రోలు సుబ్బారావు

వికీసోర్స్ నుండి

రాయప్రోలు సుబ్బారావు

1892

జననము: 1892. నివాసము: హైదరాబాదు. గ్రంథములు: 1. కవితాంజలి (తృణకంకణము, స్నేహలతాదేవి, స్వప్నకుమారము గల సంపుటము) 2. జడకుచ్చులు 3. మధుకలశము 4. రమ్యాలోకము 5. తెనుగుతోట 6. ఆంధ్రావళి 7. లలిత 8. వనమాల 9. మధురయాత్ర 10. మాధురీదర్శనము - ఇత్యాదులు.

అభినవాంధ్ర కవితావతరణమునకు దారిచూపినవారిలో రాయప్రోలు సుబ్బారావుగా రొకరు. సారస్వత పురోహితులగు సుబ్బారావుగారే యొకజాతి తెలుగుకైతకు 'భావకవిత్వము' అను నామకరణ చేసినట్లు విందుము. నేడు 'భావకవిత్వము' సర్వతోముఖముగా విస్తరిల్లినది. కవిత్వములో నవ్యమార్గము గురుజాడ అప్పారావుగారితో నారంభమైనదని కొందఱు, సుబ్బారావుగారితో బుట్టినదని కొందఱును. అదియెట్టులయినను, సుబ్బారావుగారితో నూతనకవిత్వమున నొకమెఱుగు వచ్చినదని చెప్పవచ్చును. ఈ గౌరవము వారి మీద మనతెనుగు వారిలో జాలమందికి బొందుపడినది. సుబ్బారావుగారి వ్రాతలు క్రొత్తలో యువకవుల హృదయములలో నూతన సంస్కృతి బీజములు నాటినవి. ఈయన కలిగించిన సంస్కారమువలన గలిగిన యెగ్గు లగ్గులు ప్రస్తుతము ముచ్చటింపరాదు.

భావకవిత్వ మనుపేరిలోనే పెద్దపోరు. "భారతాదులలో గవిత్వములేదా? భావములేదా?" అని ప్రశ్నములు చాలబుట్టినవి. అందుగొన్ని సందర్భములేని ప్రశ్నములు. ఆలంకారికదృష్టిలేనివారు మాత్రమే 'భావకవిత్వము' అనుపేరు లెస్సగా లేదనుటకు సాహసింతురు. కాని ఒకటి 'నవ్యకవిత్వము నాస్తిక కవిత్వము' అనునూహ కొందఱిలో కలిగించినది మనవారే. భాషాసంస్కారము బహుస్వల్పముగానున్న కొందఱు నూతనకవులు చేతగాని వ్రాతలు వ్రాసి, వానిపై భావకవిత్వ ముద్రవేసి బ్రతుకు తెరువు చూచుకొనుచుండుటవలన నీ కొంపమునక యైనది.

రాయప్రోలువారు పరిపక్వమతులు; పాశ్చాత్య సాహిత్యవిశారదులు; నవ్యకవితో పాసకులు. పడమటి కవులలోని ప్రకృత్యారాధన పరత్వము వీరిలో బుంజీభవించినది. వీరిభావన గభీరమధురమైనది. స్వరకల్పనము అభినవమైనది. వీరికవితకు ద్రాక్షా - కదళీపాకములు సహజములు.

మామిడి కొమ్మ పైన గల మంత్రపరాయణు డైన కోకిల

స్వామికి మ్రొక్కి నేనభినవస్వర కల్పన కుద్యమించితిన్

గోమల గోస్తనీ రుచులకుం గదళీఫలపాక సిద్ధికిన్

లేమల దేరు మా తెలుగు లేతముదళ్లు వెలార్చు వేడుకన్.

రమ్యాలోకము

1912 సం.న నవ్యకవిత్వ నేపథ్యమునుండి క్రొత్త నడలతో గొత్తవిలాసములతో గ్రొత్త హావభావములతో 'లలిత' కావ్యము రంగమునకు వచ్చినది. తోడనే రసజ్ఞభావకుల చక్షూరాజీవములు దానిపై బడినవి. 'లలిత' తో యువకవు లువ్విళూరిరి. ప్రాచీనసాహిత్య పరాయణులు 'లలిత' స్వేచ్ఛాప్రవృత్తికి లోలోపల బాధపడిరి. ఆంగ్లేయవాసన పట్టి క్రమముగా దెలుగువారు నవ్యకావ్య పఠనమున కలవాటు పడినారు. 'తృణకంకణము' వెలువడినది. శాబ్దికముగా గొన్ని దొసగులు దొరలినను సుబ్బారావుగారిది మంచి నిబ్బరమైన కవితా ధోరణి యగుటచే యువకుల గుండెలకు బట్టుకొన్నది. కష్టకమల - స్నేహలతాదేవి - స్వప్నకుమారము - తెలుగుతోట - ఆంధ్రావళి - రమ్యాలోకము మున్నగా నెన్నోకృతులు వీరివిగా వ్యాపించినవి.

రాయప్రోలు కవి 'శాంతినికేతనము'న గొంతకాలముండి రవీంద్ర సాహచర్య మనుభవించెను. ఆ సాహచర్యము వీరికవితా శక్తికి వికాసము. పెక్కుభాషల నెఱిగి ప్రకృతిరహస్యముల నాకళించి రవికవి కవితాచ్ఛాయలు తెనుగునకు దింపుచు రాయప్రోలుకవి పలువురపొగడ్తలకు బాత్రు డయ్యెను. కట్టమంచి రామలింగారెడ్డి యీయనను స్తుతించినాడు.

మఱియొకటి: శ్రీ సుబ్బారావుగారితో జాతీయాభిమానము సహజమైనది. ఈయన అచ్చముగా దెనుగువాడుగా వర్తించును. ఆంధ్రోద్యమము వీరి కవితకు రంగస్థానమైనది. 1918 నాటికి "రాయప్రోలు" జాతీయ కవితావాహిని పొంగినది. ప్రాంచీనాంధ్ర సామ్రాజ్యమహోన్నతి, ప్రాచీనసాహిత్యకళోన్నతి కన్నుల కెదురుగా గట్టి యీ కవి మురిసిపోవును. "జారిన దేశగౌరవము చక్కగ దిద్ది మహాంధ్రమండలీ, భారము శ్లాఘనీయముగ బాలన చేసి సమానరాష్ట్రముల్, కూరిమినాస జేయ దెలుగుంబుడమిన్." సముద్ధరింపుడని తెలుగువారికి మేలుకొలుపు పాడిన రాయప్రోలు 'జాతీయకవు' లలో మొదటివాడు. ఈయన 'ప్రబోధము' సూర్యకిరణ్ము వంటిది.

అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వ

విద్యాలయములు స్థాపించునాడు

ఓరు గల్లున రాజవీర లాంఛనముగా

బలు శస్త్రశాలలు నిలుపునాడు.

విద్యానగరరాజ వీథుల గవితకు

బెండ్లి పందిళ్లు కప్పించునాడు

పొట్నూరికి సమీపమున నాంధ్రసామ్రాజ్య

దిగ్జయస్తంభ మెత్తించునాడు,

ఆంధ్రసంతతి కే మహితాభిమాన

దివ్య దీక్షానుఖ స్ఫూర్తి తీవరించె

నా మహావేశ మర్థించి యాంధ్రులార

చల్లు డాంధ్రలోకమున నక్షతలు నేడు.

                * తనగీతి యఱవ జాతిని పాటకులను గా

దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి

తనపోటులు విరోధి తండంబులకు సహిం

పనివిగా మెరసిన తెనుగు కత్తి

తనయందములు ప్రాంతజనుల కభిరుచి వా

సన నేర్ప నలరిన తెనుగు రేఖ

తన వేణికలు వసుంధరను సస్యశ్యామ

లను జేయ జెలగిన తెనుగు భూమి

అస్మదార్ద్ర మనోవీధి నావహింప

జ్ఞప్తి కెలయించుచున్నాడ; చావలేదు,

చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర!

హృదయములు చీల్చి చదువుడో సదయులార!

రాయప్రోలు కవిగారి యీప్రబోధము ప్రజలనే కాక, యువకవులను సైతము తొలి దినములలో లేపినది. పయిపద్యములు జీవన్మూర్తులై నేడు తెలుగునాడన సంచరించుచున్నవి. సుబ్బారావుగారి రచనలు రెండుగా వేఱువఱచుకొన్నచో నొకటి జాతీయ రచనల సంపుటము, రెండు ప్రేమకావ్యసంపుటము కాగలదు. వీరి ప్రేమ తత్త్వ సద్ధాంతములు పవిత్రములయినవి. ఆధ్యాత్మిక తత్త్వ జిజ్ఞాస రాయప్రోలు కవీంద్రునిలో నుండవలసినంతగా నున్నది. "సచ్చి దానంద కల్యాణ సదన మయిన, యీ మనోహర జగతికి నేగుదెంచి ప్రేమలక్ష్మి నారాధింపవేమి యకట!" యిది వీరి యభిప్రాయము. కావ్యములలో సుబ్బారావుగారు ప్రదర్శించిన ప్రేమ లౌకిక సాధారణమైనదికాదు.

నడచి బడలిన యాయాన మెడలలేదు,

చీర చెఱగుల తడి యైన నాఱలేదు, లేడి సరసిన యపుడె ముద్దాడి కొనియె,

నహహ! యెంతటి ప్రేమార్ద్ర మామె మనసు.

'తృణకంకణము'

                *

ప్రియముతో బెంచి కొన్న తీవియలు కొన్ని

విషలత లటంచు దోచి నన్ బెరికి వైతొ?

పూలు పూయవొ? పరిమళంబులను విడవొ?

చూడ సుందరములు కావొ? సొగసులాడి!

'కష్టకమల'

                 *

నరనారీ సంబంధము

పరిభావింపుము దిశావిభాగము వరుసన్

ధర, జననీ భగినీ సహ

చరీ కుమారీ క్రమము నిజం బగుట సఖా!

'మాధురీదర్శనము'

                   *

తేనెమీద సుతారంపు ఠీవి నిలిచి

పగల బడి నవ్వు పువ్వుపై కెగయు అళిని;

ప్రియుడు ప్రియురాలి నట్లు చేర్చె నొక సుకవి,

బిడ్డ తల్లిని భాతి కల్పె మరొకండు.

'రమ్యాలోకము'

పవిత్ర ప్రేమతత్త్వమును గనుగొన్న రాయప్రోలుకవి ధన్యజీవి. ఈ కవిశేఖరునిలోని ఆధ్యాత్మికదృష్టికి అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యనుగ్రహము పుష్టి నిచ్చినది. శాస్త్రిగారు సుబ్బారావుగారి మేనమామ. ఆబ్రహ్మణ్యుని పోలిక యీయనలో జాలభాగ మున్నది. మేనమామతో గలసి కొంతకాల మవధాన ప్రదర్శన యాత్రసాగించి, బుచ్చి రెడ్డి పాలెములో మనస్సు హఠాత్పరివర్తనము పొందగా నాశుకవితా సన్న్యాసము చేసిరని సుబ్బారావుగారిని గూర్చి చెప్పుకొందురు. దైవదయ నిండారుటవలన గలిగిన యీ మార్పు సుబ్బారావుగారిచే రసభావ భరితమైన కబ్బములు వ్రాయించినది. రవీంద్రుడు - విధుశేఖర భట్టాచార్యులు - ఆంధ్రరత్న గోపాలకృష్ణడు - సముద్రాల అప్పలాచార్యులు మున్నుగాగల సహృదయుల సాహచర్యము సుబ్బారావుగారి భావమణులకు శాణోపలము. సాహితీ సమితి కార్యదర్శి నోరి నరిసింహ శాస్త్రిగారు వీరిని గుఱించి యిట్లు ముచ్చటించుచున్నారు.

"సుబ్బరాయ కవిశేఖరునకు కవితావతారము, అక్షరరమ్యత అభిమాన పాత్రములైన విశిష్ట విషయములు. వీని నీకవి రమణీయమార్గమున బహుముఖముల ప్రదర్శించుచుండును. కవులు ఉత్తమ విషయములను సందర్భాను సారముగా లోకమునకు ఆస్థ దృడమగుటకు వివిధ వివిధములవర్ణించుట మనపురాణకవుల నాటినుండియు సంప్రదాయ సిద్ధమే. ఈకవి ప్రకృతి శోభను మైత్రిని భక్తిని, జగత్కల్యాణమును కావ్యసందోహములో నిబద్ధముచేసి రమణీయోపదేశవ్యంజనచే ఉత్తమ బోద్ధ అయినాడు."

శ్రీ సుబ్బారావుగారి కబ్బములకు మొదటిదశలో నున్న ప్రజాదరణము నేడు కొంత కొఱవడినది. అనగా, తెలుగు చదువురులలోని భావుకత సన్నగిల్లుచున్నదనియే విచారింపు డని యొక పెద్దమానిసి సమాధానము. ఆధ్యాత్మిక శక్తి సంవలితమైన యీయన యగాధభావన, అక్షరరూపము తాల్చునపుడు మిక్కిలి చిక్కగా బిగువుగా నుండును. అది పాఠకసాధారణ్యమున కందదు. అదిగాక యన్వయములో గొంతతిరుగుడు. దాన, దీన - సుఖవంతుడైన చదువరి రాయప్రోలు వారి రచనలు నేడు పాడుకొనుట తగ్గించినాడు. ఈనాటి పాఠకునకు ఆపాతరుచికరమైన శైలి కావలయు నట! దానిలో, పిండి యున్నను లేకున్నను వాని కిబ్బందిలేదు! ఇందాక, సుబ్బారావుగారి యాశుకవితా సన్న్యాసమును గూర్చియను కొంటిమి. ఈ పద్యము లాసన్నివేశములోనివి:-

                         *

నతమున్ ధేనువ కొండవారి నిజవాసంబందు మృష్టాన్న సం

గతసౌఖ్యం బమరెన్, వధానమును సాంగం బయ్యె పట్టాభిరె

డ్డి తురాసాహుని మ్రోల నాకు కవితోడ్డీన క్రియావేళ నా

యత వాగ్బంధనమున్ తవిల్చితి తుషారాహార్యపుత్రీ! యిదే

హితమం చెంచితె బుచ్చి రెడ్డి నగరీ శృంగాటకంబందునన్.

                         *

తెనుగే తీయని దందు పద్యపద రీతిక్రీడ లత్యంత మో

హనముల్ శోభనముల్ తదీయరసరక్తాలావనంబుల్ లభిం

చిన వాగర్థ కలా కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే

జననీ, యేమిటి కింక, అశుకవితా సన్న్యాస మిప్పింపవే!

                         *

రసమో, భావమొ, జీవదర్థ సుకుమార వ్య్ంజనా మంజు శ

బ్ద సమాసారచనంబొ, సాధు హృదయస్పంద ప్రతిష్టా కథా

వినరంబో సకలార్థశూన్యమగు నీ వేగాతివేగోక్తి దు

ర్వ్యసనం బేటికి త్రిప్పు మింక జననీ, రమ్యాక్షరక్షోణికిన్,

ఈపరిణామముతో నక్షరరమ్యత సుబ్బారావుగారిని వలచివచ్చినది. పద్యబంధములేకాక , పాటలుకూడ రాయిప్రోలుకవి తియ్యగా బాడుకొనెను.

పదవేచెలి, కాళ్ళగజ్జియల్, రవళింపగ వెదుళ్ళపల్లికిన్

తొలి ప్రొద్దుల చల్ది యన్నమున్, తిని త్రిమ్మరవచ్చు స్వేచ్ఛగా

మధుమాసపు కన్నె యెండలో, ఎలకొబ్బరితోట నీడలన్

పసుపాడిన నిమ్మచెంగటన్, వయసారిన మావిపొత్తునన్ ఎల కోయిల యీల నేర్పగా, పసితెమ్మర సేద తీర్పగా

చెయి చేయి బిగించి యింపుగా, విహరింతము తోడు తోడుగా.

మనరూపము వ్రాయగా సొనల్, మనవేసము దాచగా పొదల్

మనసోపని పచ్చిముచ్చటల్, తనినోవగ చెప్పికొందమో!

కవితలో నవీనరుచులు పొదిగించిన యీ కవికోకిలము ఉస్మానియా విశ్వవిద్యాలయమున నుపన్యాసకుడుగా నుండి ప్రకృతము విశ్రాంతి గయికొనుచుండెను. 'త్రివేణి' లో వీరి ఆంగ్ల రచనలు ప్రచురితము లయినవి. ఆంగ్లసాహిత్యమున లోతులు ముట్టి ప్రాచ్యభాషాపాండిత్యము సంపాదించి సుబ్బారావుగారు కృతిగా బేరుపెంపులు సమార్జించిరి.

"శాంతి నికేతనము" రవీంద్రుడు ఈయక్షరము లాయన యొడలు పొంగించుచుండును. రవీంద్రాస్తమయమునకు 'రాయప్రోలు' ఇటులు వగచినాదు.

సీ. ఆరిపోయినది దివ్య స్నేహశృంగార

దీపంబు నివ్వాళి తీసి నట్లు

పండిరాలినది పక్వప్రసాదఫలంబు

మొలక మోజున క్రమ్మరిలినయట్లు

నిష్క్రమించినది నాందీముఖోజ్జ్వల తార

చిత్రాంక యవనిక చినిగి నట్లు

తెగి జాఱినది జగత్ప్రియ రాగ మాలిక

గాంధర్వ జీవాళి కదలినట్లు

సోలినది శ్రీరవీందుని సుస్వరంబు

వ్రాలినది సుకవీంద్రుని రమ్యరచన

మ్లానమయ్యె నుపాసనామందిరంబు

ఖిన్న మయ్యెను శాంతి నికేతనంబు.

                  *

నిదురించున్ శ్రుతులాసి కిన్నెరలు, వన్నెల్ చిత్రపాత్రంబులన్

చెదురుల్ చిన్నెలు మాఱి, కావ్యకలకంఠీ కంఠరాగబుగ

ద్గదికాలాపము నంది కుందును రవీంద్రా! సర్వసౌభాగ్య సం

పద మానం బగు తావకీన చరితా శ్వాసాంత సంధ్యాగతిన్.

                   _______________