ఆంధ్ర రచయితలు/మల్లంపల్లి సోమశేఖర శర్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మల్లంపల్లి సోమశేఖర శర్మ

1891

జన్మస్థానము: మినుమించిలిపాడు అగ్రహారము. నివాసము ప్రకృతము మదరాసు. జననము: 1891 సం. రచనలు: 1. ఆంధ్రవీరులు 2. అమరావతీ స్తూపము. 3. చారిత్రక వ్యాసములు 4. ఆంధ్రదేశచరిత్ర సంగ్రహము 5. రోహిణీ చంద్రగుప్తము (నవల) ఎన్నో వ్యాసములు, శాసన పరిష్కారములు, పీఠికలు మొదలగునవి. ఆంగ్లగ్రంథములు: 1. Forgotten Chapter of Andhra country. 2. The History of the Reddy Kingdoms.


నేటిచరిత్రపరిశీలకులలో సోమశేఖరశర్మగారి స్థానము మహోత్తమమైనది. కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారి తరువాత బ్రామాణికత వీరిదేయని తెలుగువారికి జక్కని విశ్వాసము కలదు. లక్ష్మణరావుగారు, వీరభద్రరావుగారు తొలుత శర్మగారికి లక్ష్యభూతులు. విజ్ఞానసర్వస్వ రచనలో బెద్దకాలము లక్ష్మణరావుగారికి శర్మగారి సాహాయ్యసంపత్తి చేకూఱినది. నిశితమైన చూపు - నిర్మలమైన మనస్సు - సహజమైన కళారసికత - సందర్భ శుద్ధమయిన వాక్కు - నిక్కమయిన చరిత్రజిజ్ఞాస - నిరంతరాయమైన పరిశోధనము - ఇన్ని సుగుణములరాశి, శర్మగారనగా సాధారణుడుకాడు. శాసనపరిష్కారములో నేడున్నవారిలో వారినిదాటినవా రుండరు. లిపిశాస్త్ర మీయన చక్కగా నెఱుగును. శాసన దర్శనమునకు లిపిరహస్యజ్ఞత నుధాంజనము. ఆమేలి కాటుక శర్మగారి సొంతము. ఈయనసంగ్రహించి ప్రకటించిన శాసనము లిన్ని యన్ని యని యెన్నజాలము. ప్రాచీన దక్షిణహిందూదేశ చరిత్రము సర్వము శర్మగారికి గరబదరము. బౌద్ధయుగమును గూర్చిన వీరిపరిశీలనము గొప్పవిలువగలది. రెడ్డియుగమును గూర్చిన వీరి యమోఘము, నపూర్వమునగు విమృష్టవిషయ సందోహము మహాగ్రంథమైనది. సాతవాహనులు - చాళుక్యులు - కళింగ గాంగులు - కాకతీయులు - వీరివీరియుగములను గాలించి పరమరహస్యము లెన్నో వెల్లడించిన పరిశోధకతల్లజులు మల్లింపల్లివారు. నిజమున కాయన గొప్ప యుద్యోగములో నుండవలసినది ; లేదా, మహాధనవంతుడుగా నైన నుండగిదనవాడు. ప్రస్తుతమీరెండును నెఱసున్నలు. ఆయనకు విడవరాని మహోద్యోగము పరిశోధన మొక్కటే. ఆయనకున్నమహాధనము ఆంధ్రవాజ్మయ మొక్కటే. తెలుగువారి పూర్వ సంస్కృతి త్రవ్వి త్రవ్వి తండములయిన వ్యాసములలో మనకందిచ్చిన శర్మగారు పూజనీయులు. శాసనపరిశోధకులు, భాషాపరిశీలకులు నైనవారికి సాధారణముగా గళావిలాసములు తెలియవు. అది హేతువుగా,రచనా సౌందర్యమును వారు ప్రదర్శింపలేకపోవుదురు. శర్మగారి కటులు కాదు. ఈయన యెన్నదగిన కళార్ద్రహృదయముగల వ్యక్తి. కవిత్వము లోతు లెఱుగును; కళల నెన్నింటినో పరిచితియున్నది. అందుకే, యీయనరచన సహృదయ హృదయములను స్పందింపజేయు మాధురీ మార్దవములు పొదిగించుకొన్న రచన. గ్రాంథిక - వ్యావహారికములు రెండును వడిగా, వాడిగా వ్రాయగలుగుదురు. గహనములయిన చరిత్రవిషయములు వీరి కవిత్వములోబడి సౌలభ్య వాల్లభ్యములై ప్రజాసాధారణమునకు సుఖలభ్యములగును.ఆవేశోత్సాహములు జనింపజేయు నింపయిన రచన శర్మగారిచేతిలో నున్నది - ముచ్చటకు గొన్ని మచ్చుపంక్తులు:-


"......వామనుడు తనపాదత్రయముచే ముల్లోకముల నావరించినట్లు భారతధర్మ సంస్కృతి యీమూడు ప్రస్థానములయందును దిశాష్టకము నాక్రమించి యతిశయిల్లినది. అప్పటికి నిప్పటికి బ్రపంచ చారిత్రమున ధర్మ సామ్రాజ్యమును స్థాపింప యత్నించిన వారును, స్థాపించినవారు నొక్క భారతీయులే. భారతీయుల ధర్మసంస్కృతి సామ్రాజ్య చారిత్రము అపూర్వమైన యొక ధర్మ విజయ గీతము ; ఒక అహింసావిజయగాథ, అది భారతీయుల మంజుల మధుర మనోహర స్వాప్నిక గానము.


ఏమో ఎవ్వరెఱుగుదురు, ఎప్పుడు పుట్టిపెరిగి అంతటి పెద్దవాడయ్యెనో? ఎంత కాలమునుండి యచ్చట నివాసముండెనో? చరిత్రకు కొంతప్రాజ్ఞత వచ్చునాటికే ఆయుష్మంతుడయిన ఆర్యకుమారుడు భారతభూమిని పచ్చనిపైరుచేల నడుమ, వనలక్ష్మి అందాలు దిద్దుకొని సాంద్రాటవీ సీమల మధ్య ఆశ్రమపదములు నిర్మించుకొని పర్ణకుటీరములందు కర్మపరతంత్రుడై విరాజిల్లెను. ముందగ్నిహోత్రముతో పార్శ్వములయం దధ్యయన పరాయణమైన ఛాత్ర బృందముతో వేద ఋక్కులు వల్లెవేయుచు, నెడనెడ సామగానము నాలపించుచు తాను త్రొక్కినంతమేర భూతములను కర్మనిబద్ధముగను, ధర్మనిబద్ధముగను గావించి తనచూపు ప్రాకినంత లెక్క తానే పెద్దనని గడ్డము సవరించు కొనుచు దర్పముతో ప్రవర్తించిన కర్మవీరుడతడు. జగత్తింకను నిద్రాపరవశమై యుండగనే తొలుదొలుత మేలుకాంచి తెలివి తెచ్చుకొని పెద్దఱికము వహించిన ప్రోడ యతడు. ఎవ్వ రెఱుగుదురు? ఎప్పుడు పుట్టి పెరిగి యంతటి పెద్దవాడయ్యెనో? ఎంతకాలమునుండి యచ్చట నివాసముండెనో?...."


"చారిత్రకవ్యాసములు' 2 పుట


చక్కని తీరుదల యిట్టిరచనలో నెన్నో క్రొత్తవిషయములు శర్మగారు తెలుగువారి కిచ్చుచున్నారు. విజ్ఞాన దృష్టికి మల్లంపల్లి వారి జీవితమొక వసంతారామము. ఆర్థిక దృష్టిలో, ఆయన నిరంతర శ్రమజీవి. బాల్యమునుండియు బేదఱిమికి బాలువడి విజ్ఞాన సమార్జనము చేసికొనెను. మనుగడలో నొడుదొడుకులు, దుందుడుకులు రానిచ్చుకొనని స్వభావము మొదటి నుండియు నున్నది. ఆంగ్ల విద్యలో నున్నత పట్టములు పడయ వలయుననెడి తీవ్రాశను, ధనాభావము సన్నవడ జేసినది. పసినాట సంస్కృత విద్యాభ్యాసము . మేనమామగారి సహకారముతో "స్కూలుఫైనలు" ఉత్తీర్ణత. అప్పటి శర్మగారి యీడు పదునారేండ్లు. ఆలేతవయస్సులో నుద్యోగము కోసము నవసి నవసి యెచ్చటను స్థిరపడక యుండెను. నాటి జాతీయ మహోద్యమ నాదములు శర్మగారిలో నొక నూతనచైతన్యము రేపినవి. 1911 సం.ప్రాంతములో నుద్యోగ గవేషణము వదలుకొని మదరాసు ప్రయాణము. అచట, ఆంధ్రులచరిత్ర గ్రంథము సంధానించుచున్న మహామహుడు చిలుకూరి వీరభద్రరాయనితో బరిచితి యేర్పడినది. శర్మగారికి రావుగారితో జరిత్రపరిశోధనము గావింప దలంపు కలిగినది. ఆదిలో, "కన్నమరాగ్రంథాలయము" న నచ్చుగాని కృతులకు బ్రతులు వ్రాయుట శర్మగారి యుద్యోగము. చాలీ చాలని యక్కడి జీతముతో జీవితము సాగించుకొనుచు నున్న శర్మగారికి, లక్ష్మణరావుగారి చెలికారము, భావ్యర్థ సమవలంబమైనది. 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ' రచనా సహకృతితో శర్మగారికి లక్ష్మణరావుగా "రర్థసింహాసన మిచ్చి యభినందించిరి.


1912 లో, ఆంధ్రుల చరిత్ర రచన ముగిసి వీరభద్రరావుగారు రాజమహేంద్రవరము వచ్చివేసినారు. శర్మగారును మదరాసు మకాము మాని రాజమహేంద్రవరమే వచ్చి యుండి 1914 మొదలు నాలుగేండ్లు చిలకమర్తి లక్ష్మీనరసింహరావుగారి 'దేశమాత^ పత్త్రికకు సంపాదకత నిర్వహించిరి. ఈ సంపాదకత్వము శర్మగారి పరిశోధన రచనా ప్రణాళికకు జక్కని త్రోవలు తీయించినది. మఱియొకటి చెప్పదగిన సంగతి; వీరు "ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల" నెలకొలపి ఆంధ్రవీరులు, ప్రాచీన విద్యాపీఠములు, ప్రాచీనాంధ్ర నౌకా జీవనము మున్నుగా గొన్ని గ్రంథములు వెలువరించిరి. ఈతీరున సారస్వతమును సేవించు మల్లంపల్లి శర్మగారికి, మరల మదరాసునుండి కొమఱ్ఱాజు వారి యాహ్వానము. దుర్నియతి యటులుండి, శర్మగారు చెన్నపురి చేరిన కొలది నాళ్ళకే లక్ష్మణరావుగారి యస్తమయము. అది 1923 సంవత్సరప్రాంతము. 'విజ్ఞాన చంద్రిక' సన్నవడినది. విజ్ఞానసర్వస్వమునకు అదియాది పెక్కేండ్లు శర్మగారు చేసిన కృషి మఱచి పోరానిది. ఈ వ్యవసాయమునకు ఫలముగా ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు చరిత్రపరిశీలక పండితులుగా రమ్మని శర్మగారిని పిలిచిరి. వారచట గావించిన యమోఘ పరిశ్రమమునకు సాక్షులు "ఎ ఫర్గాటన్‌చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ" - " ది హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగ్డమ్స్"- అను రెండు చరిత్రగ్రంథములు.


శర్మగారిది సంస్కృతాంధ్రాంగ్లభాషలలో 'డిగ్రీలు' లేని నిశితప్రజ్ఞ. ఆంధ్రవీరులు, రోహిణీచంద్రగుప్తము, కొన్ని చిన్నకథలు వీరికళారచనాభిరతిని దృష్టాంతీకరించుచున్నవి.


ఈయన చారిత్రకవ్యాసములలో బౌద్ధ సంస్కృతి రూపు కట్టి యున్నది. 'రేడియో' లో బ్రసారితమగు వీరి "ఆంధ్ర దేశ చరిత్ర సంగ్రహము' సంగ్రహమైనను బహూపయోగియగు కూర్పు. సహృదయులు, చరిత్రపరిశీలక శేఖరులు నగు వారి యునికి ప్రకృతము చెన్నపురిలో. నిర్బంధోద్యోగపు టుచ్చులలో నిచ్చలు ఉండలేని స్వతంత్ర జీవులు శర్మగారు. ఆంధ్రచరిత్ర - సంస్కృతులను గూర్చి యింక నెన్నో నూత్నవిషయములు మనకు వా రీయగలరు.


శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారితో శర్మగారికి మంచి నేస్తము. ఆయన 'ఆంధ్ర ప్రశస్తి' యీయనకు గృతియిచ్చుచు నిట్లు వ్రాసెను:-


నీ వనుకోను లేదు, మఱి నే నిది చెప్పను లేదు, కాని య

న్నా, వినవయ్య నేటి కిది నాచిఱు పొత్తము నీకు నంకింతం

బై వెలయింప జేతు హృదయంబులు నీకును నాకు మాతృదే

శావిల దు:ఖ దారితములై శ్రుతిగల్పె విషాద గీతికన్.

*

మల్లంపల్లి సోమశేఖరశర్మ

డిగ్రీలు లేనిపాండిత్యంబు వన్నెకు

రాని యీ పాడుకాలాన బుట్టి

నీ చరిత్ర జ్ఞాన నిర్మలాంభ:పూర

మూషర క్షేత్రవర్షోదకమయి

చాడీలకు ముఖప్రశంసల కీర్షకు

స్థానమై నట్టి లోకాన నుండి

నీయచ్ఛతర కమనీయ శీల జ్యోత్స్న

అడవి గాసిన వెన్నెలగుచు చెలగి


అంతె కాని గౌరీశంకరాచ్ఛ శృంగ

తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుగు

నాటి పూర్వ చరిత్ర కాణాచి యెల్ల

త్రవ్వి తల కెత్త లేదె యాంధ్రజనములకు

      *

కొదమ తుమ్మెద ఱెక్కల గుస్తరించు

మీసముల నీప్రసన్న గంభీర ముఖము

కన్ను లంటగ గట్టినట్లున్న నిన్ను

మఱచి పోలేను జన్మ జన్మములకైన.

         _______________