ఆంధ్ర రచయితలు/చిలుకూరి నారాయణరావు

వికీసోర్స్ నుండి

చిలుకూరి నారాయణరావు

1890

జన్మస్థానము: విశాఖపట్టణ మండలములోని పొందూరు దగ్గరనున్న ఆనందపురము. ప్రకృతనివాసము: అనంతపురము. జననము: 1890 సం|| గ్రంథములు: మతము: 1. అధర్వవేదము (మూలము ప్రతిపదార్థము తాత్పర్యము) 2. ఋగ్వేదసాయన (భాష్యోపోద్ఘాతమునకు తెలుగు) 3. భగవద్గీత (ఆంధ్రవచనము) ఇత్యాదులు. స్మృతిగ్రంథములు: ఆపస్తంబ ధర్మసూత్రములు 2. గౌతమ ధర్మసూత్రములు (తెలుగు వచనము) ఇత్యాదులు. ఇతర మతగ్రంథములు: 1. త్రిపిటకములు 2. ధమ్మపదము 3. అశోకుని ధర్మశాసనములు (పాలిమూలము, సంస్కృతము తెలుగు) 4. గౌతమ బుద్ధుని జీవితము 5. జైనమతము 6. శైవసిద్ధాంతము 7. బసవేశ్వరుని చరిత్రము 8. అద్వైత సిద్ధాంతము 9. కురాను షరీఫు (ఇస్లామ మూలగ్రంథమునకు తెనుగు) 10. బైబులు (ప్రాత క్రొత్త నిబంధలకు తెలుగు) 11. సర్వమత సామరస్యము- సంస్కృత భాషాకృతులు: 1. సిద్ధాంతకౌముది (మూలము, తెనుగు వివరణము) 2. విక్రమాశ్వత్థామీయము- ఇత్యాదులు. శాస్త్రగ్రంథములు: 1. తర్క సంగ్రహము 2. శిశుమనశ్శాస్త్రము 3. ప్రసవశాస్త్రము ఇత్యాదులు 25 శాస్త్రగ్రంథములు. చరిత్రకృతులు: గోమను, గ్రీసు, రష్యా, చీనా, జపాను, బర్మా, ఆంధ్ర ఇత్యాది దేశ చరిత్రములు మొత్తము 20. జీవితచరిత్రములు: గాంధీ చరిత్ర, టాల్ స్టాయి చరిత్ర మున్నగునవి 8. భాషాశాస్త్రకృతులు: 1. ఆంధ్రభాషా చరిత్ర (2 భాగములు) ఇత్యాదులు మొత్తము 8. సంస్కృత ప్రాకృతాది వాజ్మయ చరిత్ర గ్రంథములు 14. భాషాస్వయం బోధినులు 15. విద్యావిధాన గ్రంథముల మొత్తము 10. ఆంధ్ర వాజ్మయ చరిత్రము (10 సంపుటములు) కవి జీవితగ్రంథములు మొత్తము 20. నాటకములు: 1. అంబ లేక మొండిశిఖండి 2. అశ్వత్థామ 3. అచ్చి లేక కాపువలపు 4. పెండ్లి 5. వాడే (పరిశోధకము) 6. నాటక నాటకము. (హాస్యము) 7. తిమ్మరుసు. 8. బొమ్మపొత్తికలు 9. మధురాంతకి ఇత్యాదులు మొత్తము 20. పద్యకావ్యములు: 1. రుబాయత్ ఉమర్ ఖయమ్‌, 2. తుకాంబ 3. జపానుదేశ కవిత (తొలిసంజ- తెలిచాయలు) ఇత్యాదులు మొత్తము 11. నిఘంటువులు: 1. సంస్కృతాంధ్ర నిఘంటువు. 2. ఆచ్ఛికపద నిఘంటువు. 3. నన్నయ భారత పదకోశము. 4. తెలుగు సామెతలు (1,50,000 సామెతలు తెలుగుదేశములోనివి) ఇత్యాదులు 18.

WORKS IN ENGLISH

(1) Translations from Tikkana.(2) Translations from Potana.(3) The songs of Tyagaraja (4) The dance of the rain-drops (Modern Poetry) (5) A Survey of Telugu literature (6) Modern trends in telugu literature-


పయిని పేర్కొన బడిన గ్రంథములలో గొన్ని మాత్రము ముద్రితములు.


డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి పేరు తెలియనివారుండరు. ఆయన ఎం.ఏ.పి.హెచ్, డి, ఎల్, టి. అనంతపురము 'ఆత్రేయాశ్రమము' వారి యునికి. కాని, ఆంధ్రభాషాచరిత్ర ప్రచారమునకు నారాయణరావుగారు యావదాంధ్రము సంచారము చేయుచుందురు. ఇప్పటి, వారి వయస్సు షష్టి. ఈముదిమిలో భావపుష్టి కలిమి దెలుగు దేశమే కాదు భారతభూమి సర్వము పర్యటింప గలుగుచున్నారు. ఈమానిసి భౌతికముగా ద్రఢిష్ఠుడుకాడు. 'దర్భపుల్ల' వలె సన్నమైన గాత్రము. ఒకకన్ను కొంచెముమెల్ల. మఱి, వ్యక్తిని జూడగా, నపాదలక్ష - పుటల పరిమితిగల వాజ్మయమును సృష్టించిన మహారచయిత యీయనయేనా, అని సంశయించుకొనునంతటి చిత్రము. ఈ నడుమనే కర్ణాటక దేశయాత్రలో ధార్వాడ, హుబ్బళ్ళి, బిజాపురము, బెళ్ళూరు మున్నుగా నెన్నో పట్టణముల సంచారము గావించి యాంధ్రవాజ్మయ ప్రశస్తి నుగ్గడించివచ్చినారు. దర్భంగ, వారణాసి మున్నుగానున్న పట్టణములలోనున్న అఖిలభారత రచయితల మహాసభలో బాలుగొని తెలుగు దేశభాష విశిష్టతయిట్టిదా! యనిపింప జేయునటులు మాటలాడినారు. ఆంధ్రరాష్ట్ర ప్రత్యేకతకై నడుముకట్టిపనిచేయు కర్మవీరులలో నారాయణరావుగారు నొకరు. ఆయనది వజ్రసంకల్పము. ఆయన కావించిన భాషా - వాజ్మయ చరిత్ర పరిశోధనము లనంతములు, ఆంధ్రవిశ్వవిద్యాలయము ప్రకటించిన రెండు పెద్ద సంపుటములలో నారాయణరావుగారి భాషాచరిత్రపరిశీలకత రూపము గట్టియున్నది. ఈ గ్రంథము రావుగారి సేవకు లక్ష్యమే కాకుండ, మనభాషకు మండనమును. ఈ గ్రంథములో గతానుగతికమైన విమర్శనము కాక, సొంతమైన పరిశ్రమము హెచ్చుగా నున్నది. అది కారణముగా నిట్టి కృతులు పెక్కుకాలము సమారాధన యోగ్యములు కాగలయవి. తెనుగునకు ద్రావిడ భాషా సంబంధమునుగుఱించి నెఱపిన 'కాల్ డ్వెల్‌' సిద్ధాంతమును గాదనుచు నారాయణరావుగారు చేసిన యమోఘ కృషికె వారి ఆంధ్రభాషాచరిత్ర' మేలిపంట. వీరి సిద్ధాంతములపై రాద్ధాంతములు వెలువడుచుండుటయు గమనించుచున్నాము. ఏమైనను, ఒకరి దారి ననుకరించుచు జేసిన విమర్శనముకంటె, స్వతంత్రుడై చేసిన విమర్శనము హృదయములకు హత్తుకొని నిలవగా నుండుటకును వీలగును. ఇట్టి స్వతంత్ర పరిశ్రమము నారాయణరావుగారిని వలచినది. వాజ్మయ చరిత్ర విషయములో నారాయణరావుగారి దారులు కొన్ని ప్రామాణిక ములు కావనుకొందురు. ఈ విషయమున నేను బొత్తిగా నజ్ఞడను.


చరిత్రపరిశోధన మొక బండపనియనియు, చరిత్రపరిశోధకుల హృదయములు రసార్దములు కావనియు ననుకొనుట పరిపాటి. అది నేటి కాలమున చాలభాగము తగ్గినది. శ్రీ ప్రభాకరశాస్త్రి, సోమశేఖరశర్మ ప్రభృతులు ఇరువైపుల వాడిగల పండితులు. నారాయణరావుగారిని గూర్చి యోచించినపుడు, వీరేశలింగముపంతులుగారు స్మర ణకు వత్తురు. పంతులుగారు పేరుగొన్న చరిత్రశోధకులే. వారి కవితాకళాభిరతియు జగద్విఖ్యాతము. కావ్యములు, ప్రహసనములు, నవలలు, నాటకములు వందలుగా రచించిరి. వారివలెనే పరిశోధనశక్తికి దోడు కవితా సౌందర్యము నుపాసించిన కవులు నారాయణరావుగారు. వీరి 'అంబ' - 'అచ్చి' మొదలయిన నాటకములకు దెలుగునాట బేరువచ్చినది. నవ్యసాహిత్యపరిషత్తు సంస్థాపకులలో, అధ్యక్షగణములో నారాయణరావుగా రొకరు. అభ్యుదయ రచయితలలోను వీరికి సభ్యత యున్నది. అనగా ఆధునిక సాహిత్యదృష్టి వీరి కత్యధికముగా నున్నదనుట. ఆయన పద్యములు ఛందో బంధమున వ్రాసెను. పాటలును వ్రాయును. 'మహానటుని మయూరనృత్యము' అను పేరుతో కాశిలో జరిగిన అఖిల భారత రచయితల మహాసభలో ఆశువుగా బాడినగేయ మొకటి నారాయణరావుగారు ప్రకటించినారు. అది కొన్ని చరణములు మనవిచేసెదను. అఱువదియేండ్లు నిండిన రావుగారు, ఈపాటలో ఇరువది యేండ్ల యువకుడై కనిపించుచుండె నని నా కానందము.


ఈసదామహాశ్మశాన - వాసి కాశికావిభుండు

విశ్వనాధుడిపు డిదేమొ - యీ చిదంబర ప్రచండ

కాలమేఘరాశి జూచి - యానందం బంతకంత

కతిశయింపగా మయూర - నృత్యముతో మూదలించి

నందికేశనాట్యరీతి - డుంఠినాధ లాస్యఫణితి

మించి తాండవించె నే డిదేమొ - రండు, గణనాధులు!

                *


కాళ్ళకు గజ్జెలు - కటిపై పులితోల్

హస్త, కంఠ, భుజ - మస్తక పూత్కృ

త్సర్పభూషణుడు - మహానటుడు

నృత్యమాడు లాస్యమాడు తాండవించు నోంకార శ్రుతితో నారాయణ రాయరచిత

గీతమునకు నా సహృదయసభ్యులెల్ల

తాళగతుల జతులతోడ మనోవీధి

తాముగూడ తాండవింప ఇదిగోనృత్యము

భారత భూమీ వాయన్య దిశా

ప్రచలిత ఝుంఝూ మారుత ప్రేరితంబై

భారభా రాలసంబై క్రూరదృక్ క్షోభితంబై

తధిగిణ తళంగ్

తళంగ్! తళంగ్! తళంగ్

                      *


ఇదిగో, ఇదిగో ప్రచండ తాండవ మిదిగో,

పాకీస్తాన్ - ద్రవిడస్తాన్

కొట్టేస్తాన్ - చంపేస్తాన్

ఖణిల్! ఖణిల్!

డమా! డాం.


ఈ యావేశము నవీన కవులలో నందఱికిని లభింపని యావేశము. నారాయణరావుగారికి దేశ మనగా భాష యనగా నెక్కడలేని యుత్సాహము పుట్టుకొని వచ్చును. వీరు వ్యావహారికభాషావాదులు. గిడుగువారి గురుత్వము. వ్యావహారికభాషలో రసవంతమైనట్టిదియు, జీవవంత మైనట్టిదియు నగు మార్గము గ్రంథరచనానుకూలమైనది యున్నదని నారాయణరావుగారు సనిదర్శనముగా జాటుచుందురు. ఈయన విమర్శనము మోమోటము లేకుండ సూటిగా బోవును. 'సజీవభాష' ను గూర్చినారాయణరావుగారు నిష్కరించి ప్రకటించిన యభిప్రాయమిది:-


"...సజీవభాషయనగా...జీవముతో కూడిన భాష. ప్రాకృత జనభాషితమైనభాష. ఆ ప్రాకృతజను డిప్పటివాడే కానక్కరలేదు. ఏనాటి వాడైన కావచ్చు. ప్రాకృతానుభవములు నాభాషలో ఎన్నడైనా వ్యక్తపరిచి ఉంటే అది సజీవభాషే అవుతుంది. కాబట్టి యీలక్షణము కలిగి ఉన్నంతసేపున్నూ కావ్యభాష సజీవభాష కాదనడానికి వీలులేదు. కావ్యములలో ఉపయోగింపబడక పోయినంత మాత్రముచేత అది సజీవభాష కాకపోదు. భాషాప్రయోజనము సిద్ధిస్తున్నంతసేపున్ను అది సజీవభాషే. కాని, ఆభాష కేవలవ్యావహారికమై స్థూలజగత్ర్పచారములో ఉన్నా కావ్యజగత్తులో తాండవించి సూక్ష్మేంద్రియగ్రాహ్యము మాత్రమే అయినా సంస్కృతవాణికి లక్షణములుగా ఆలంకారికులేర్పఱిచిన దశవిధ గుణభూషితమై దశవిధ దోషవర్జితమై మనోహర రస, రీతి, పాకశయ్యాలంకార శోభితమైఉంటే అంత ఆదర పాత్ర మౌతుందని వేరే చెప్పనక్కరలేదు. భాషాశీభ కుపకరించి దాని జీవమును ప్రకటించే విధానము నాలంకారికు లేర్పరించియున్నారు."


భాషా - వాజ్మయములకు నిరంతరసేవ గావించు నారాయణరావుగారి విద్యాభ్యాసాదులను గూర్చి ముచ్చటించు కొనవలయును. ఆయన జన్మస్థానము విశాఖపట్టణ మండలములోని ఆనందపురము. కాని, ఆయనకు రాయలసీమవారుగానే పరిగణనము. నేనిట్లనను. నారాయణరావుగారిది తెలుగుదేశము సర్వమును. ఈసీమల ద్వైతభావము నశించినగాని మనకు ముక్తిలేదు.


పర్లాకిమిడి కళాశాలలోను, విజయనగరము మహారాజ కళాశాలలోను రావుగారి ఆంగ్ల విద్యాభ్యాసము. విజయనగరములో నుండగనే సాహిత్య కృషికి బీజావాపము వాపము జరుగుట. మదరాసు విశ్వవిద్యాలయమున, తెలుగు, కన్నడములలో బట్ట భద్రతా లాభము. తరువాత కొలది కాలమునకే నారాయణరావుగారు "డాక్టరు ఆఫ్ ఫిలాసఫీ". ఈ బిరుదము 11 వ శతకములోని తెలుగు రచనను గూర్చి చేసిన పరిశోధ నమునకు బంట అసలు, పసినాటినుండి రావుగారికి భాషా - సారస్వత చరిత్రపరిశోధకతలో మంచియాస్థ. బోధనచాతుర్యము వీరిది గొప్పది. విశాఖమండలములోని 'అరసవిల్లి'లో రెండుపాఠశాలలు నారాయణరావుగారు నెలకొల్పిరనగా, ఆయన సేవాపరాయణత యెట్టిదో భావింపుడు. ఆపాఠశాలలో నొకటి రైతుపిల్లలకు, రెండవది హరిజనులకు నుపయోగించునవి. వ్యవసాయము మీద రావుగారి కెంతో మక్కువ. గంజాం జిల్లాలో జరిగిన నూతన వ్యవసాయ పరిశోధనపు బోటీలో వీరికి బంగారు పతకము బహూకృతి లభించినది. ఉత్తరసర్కారు జిల్లాలో ఇంగ్లీషు బోధనశక్తి ప్రచారము చేయుటకుగా "ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్సు" ఉద్యోగము రావుగారి కీయబడినది. ఈ యవకాశములో వీరు జర్మను - అమెరికా సంయుక్తరాష్ట్ర విద్యావిధానములను గూర్చి తెలుగున బ్రచారముగావించిరి. తరువాత, అనంతపురము కళాశాలలో నాచార్యకము. సుగృహీతనామధేయులగు నెందఱో శిష్యులు రావుగారి పేరు చెప్పుకొనుచున్నారు. ఈయదృష్టము వారిది మెచ్చదగినది. మదరాసు, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయములలో నెన్నో సంఘములకు వీరు సభ్యులుగా నుండి గౌరవముల నందిరి. రాజమహేంద్రవరము నందలి 'ఆంధ్రేతిహాస పరిశోధకమండలి' కి బెక్కుకాలము అధ్యక్షులుగా నుండి నారాయణరావుగారు చేసిన పరిశోధన కృషి యమోఘమైనది. ఆ మండలికి తాళపత్త్రగ్రంథములు, కొన్ని వందలు వీరు దారవోసిరి. చాల కాలమునుండి సేకరించిన శిలా - తామ్ర శాసనములు, నాణెములు మండలికే యిచ్చివైచిరి. ఈ యౌదార్యము చారిత్రకులకు శిరోధార్యమైనది. రాయలసీమలోని కృష్ణదేవరాయ విద్యాపీఠసంస్థకు స్థాపకత్వము, ఆధ్యక్ష్యము నారాయణరావుగారిది. ఇట్టి భాషా లోకోపకారకములగు కార్యముల వలన జిలుకూరి వంశ తిలకుడు మాయని యశస్సు సంపాదించెను. నారాయణరావుగారు వ్రాసిన గ్రంథములు శతాధికములుగానున్నవి. ఆయన సారస్వతమునకు సంబంధించిన ప్రతిశాఖలోను విలువగల వ్యవసాయముచేసి యెన్నో కృతులు పండించెను. నవలలు - నాటకములు - జీవిత చరిత్రములు - భాషాచరిత్రములు - పద్యకావ్యములు - గేయములు - ఇవన్నియు వ్రాసికొన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, అధర్వవేదము ననువదించినారు. 'ప్రపంచమతగ్రంథమాల' నెలకొలపి పెఱవాజ్మయములలోని రచనలు తెనుగులోనికి జాల బరివర్తనముచేసి యిచ్చినారు. కురాను షరీపు - జెండావెస్తా ఇత్యాదులు. నారాయణరావుగారి లేఖిని శతాధిక గ్రంథములు సృష్టించినది. ఆయన వాజ్మయ తపస్వి; సారస్వతయాజి; వాజ్మయద్వారమున దేశారాధనము, ఈశ్వరసేవ సాగించుచున్న మహాశయుడు.


శ్రీ రావుగారి కృషిని గుర్తించి బ్రిటిషు దొరతనము 1947 జూనులో 'మహామహోపాధ్యాయ' బిరుదము నిచ్చినది. నాడు ఇండియా ప్రభుత్వము, పరప్రభుత్వములిచ్చిన బిరుదములను నిషేధించినందు వలన వీరు దానిని స్వీకరింపలేదు. 1947 నవంబరులో కాశీ సంస్కృత విద్యాపీఠము 'మహోపాధ్యాయ' బిరుదముతో జోడు సాలువల నిచ్చి రావుగారిని సన్మానించినది. వీరి నాటకరచన, విమర్శన ఫక్కి గమనించి "ఆంధ్ర బెర్నార్డుషా" యనియు వ్యవహరింతురు. సత్యమైన సేవాపరాయణత గల కళాప్రపూర్ణులకు బిరుదభారముతో బనియుండదు. ఓరిమి - పరిశ్రమ పేరిమి - ప్రతిభా వ్యుత్పత్తుల నేరిమి కలసి చిలుకూరి నారాయణరావుపేర వెలసినది. అనంతపురమున, ఆత్రేయాశ్రమ వాసములో సుపవిత్ర జీవితము గడపుచున్న చరితార్థులు వారు.

                             ____________