ఆంధ్ర రచయితలు/రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ

1893

శ్రీవైష్ణవ బ్రాహ్మణులు. శఠమర్షణగోత్రులు. పెంచుకొన్న తండ్రి: అనంతాచార్యులు. అభిజనము: రాళ్ళపల్లి (అనంతపుర మండలము కల్యాణ దుర్గము తాలూకాలోనిది) కన్నతండ్రి: శ్రీవత్ససగోత్రులు కర్నమడపల కృష్ణమాచార్యులు. కన్నతల్లి: అలవేలమ్మ. జననము. 23 జనవరి 1893 సం. నందన సంవత్సర మాఖ శుక్ల షష్టి. ప్రకృత నివాసము: మైసూరు. రచనలు: 1. తారాదేవి 2. మీరాబాయి (పద్యకావ్యములు) 3. లీల (వచనము-కల్పితగాథ) 4. వేమన 5. సారస్వతోపన్యాసములు 6. నాటకోపన్యాసములు 7. శాలివాహనగాథా సప్తశతి (400 పద్యములు-ఆంధ్రీకరణము) 8. స్పర్ధాకావ్యము (సంస్కృతము) 9. మహీశూరరాజ్యాభ్యుదయాదర్శము 10. రఘువంశ భాషాంతరీకరనము (చివరివి రెండును ముద్రితములు కాలేదు).

మాధురీ మార్దనములకు దావలమైన వచనరచన యెవనిసొమ్మనగా, అది రాయలసీమలో నుదయించి మైసూరున నివసించువారదని వెంటనే వచ్చు సమాధానము. రసభాసములకు నిదానమైన పద్యరచన యెవనిసొత్తనగా, ప్రత్యుత్తరము వెనువెంటనే రాలేదు. నేటి తెలుగునాట, పద్యరచయితలు పెక్కురనియు, గద్యరచయితలు తక్కువ యనియు దీని పరమార్థము. సర్వాంధ్రము మొత్తమున, వచనరచనా విశారదుడు ఒక్కడే యనుట యతిశయోక్తికి జేరుమాట. ఇట్టి చిక్కులు రాకుండు పరిష్కార ముండనేయున్నది. అది "అనంతకృష్ణశర్మగారు నేటి ప్రముఖ వచనరచయితలు నలువురైదుగురిలో నొక్క" రనుట. శర్మగారు మంచి వచనము వ్రాయుదురు. వీరి పద్యరచనయు బహుమనోహరము. ఈకూర్పు నేర్పులకు వారికి గల కోవిదత్వము దోహద మిచ్చుచున్నది. సంస్కృతాంధ్రములలో వారు చేసినది. గీటుఱాతికి వచ్చు మేలి బంగరుపు వంటి కృషి; ప్రాకృత సారస్వతపు లోతులు తెలిసినవారు; ఆంగలములోని మెలకువలు వినుపించుకొన్నవారు. పైగా, సంగీతకళలో నఖండమైన యెఱుక. నోటిపాట వీరిది తీయనై శ్రుతి పేయముగా నుండును. సంగీత - సాహిత్యములలో సరితూకముగల విన్నాణము శర్మగారిలోనే రాణించుచున్నది. ఈ సౌభాగ్యము చేకురినవా రనేకులు లేరు. అనంతకృష్ణశర్మగారి విమర్శన వైయాత్యమునకు వారి 'వేమన' సాక్షిగ్రంథము. తెలుగులో నిట్టి విమర్శన కృతు లీవఱకు లేవనుటయు సాహసము కాదు. " ఈ పద్యము హృద్యముగా నున్నది. ఈ భావము రమణీయముగా నున్నది." ఇత్యాది గతానుగతిక వైతాళికఘోష విమర్శన వేషముతో సంచారము చేయుట సహింపరానిది. మన విమర్శకుల దృక్పధమును మంచిదారులకు జేరబెట్టిన 'రాళ్ళపల్లి' వారి మేలు మఱవరానిది. నాచన సోమనాథుని కవితా తత్త్వమునకు వీరు గావించిన భాష్యము 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు' వారి బహుమానమునకు బాత్రమైనది. ప్రక్కపాటులేని నిక్కపు విమర్శనము శర్మగారి చేతిలో నిగ్గులు దేఱి 'ఉత్తరహరివంశ' సమీక్షారూపమున బయటికి వచ్చినదని జయంతి రామయ్యపంతులు మున్నగువారు నాడు మెచ్చుకొనిరి. ఇంత దిట్టమైన విమర్శన శక్తికల మానిసికి రసవంతమైన కవితాప్రాభవమును జేతనుండుట యొక నుయోగము.

శర్మగారు రచించిన 'మీరాబాయి'-'తార'-ఈ రెండు కావ్యములు రెండు మధుకుల్యలు. ఆయన ప్రాకృతమునుండి తెనుగుపఱిచిన 'గాథాసప్తశతీసారము వాడని మల్లెపూలప్రోవు. శిరీషవేశలమైన తన తెనుగు పద బంధమునకుసరిపడిన కావ్యము నేరుకొనిరని నాకుముచ్చట. రచయిత యేరుకొన్న యితివృత్తములోనే, ఆతని హృదయ మత్తుకొని యుండును. 'సప్తశతి^ లోని మృదు ముగ్ధమైన జాను తెనుగుదనము, ఇదిగో!

పసపు నీళ్ళాడి దువ్వెన పండ్ల నడుమ

జిక్కుకొనియున్న మైలను జిన్నముల్లు గ్రుచ్చి తీసెద వెవ్వని కోర్కి పండ

జేయ నున్నావు తెల్పవే చిన్న దాన !

       *

పత్తి చేను దున్నవలసి మంచిదినాన

మడకపూజ చేయ దొడగినపుడు

కోర్కు లాత్మ గుబులుకొన గడగడమని

వడక దొడగె గాపు చెడిపె కేలు.

       *

కొండసెలయేటి సుడికి జిక్కుకొని కలగి

తిరుగుచును గేసరంబులు విఱిగిపోవ

కొంత మునుగుచు దేలుచుగొదమ తేటి

వెంట నంట గడిమిపూవు వెల్లబోయె.

       *

అద్దమందు నీడ యంటున ట్లెవ్వని

యాత్మ నొరుల వగపు లంటుకొనవొ

అట్టివాని తోడ నెట్టు నెప్పుడు నత్త,

మనసు ప్రక్కలయిన మానె గాని.

       *

పూని యూదెడు నెఱజాణ! ప్రొయ్యి మీద

నలుక గొన బోకు ; రక్త పాటల సుగంధ

మైన నీయూర్పు జవులకు నాసగొనుచు

పొగ లెగయు గాని మండ దీ ప్రొయ్యినగ్గి.

       *

కనులు కానరాని కటికి చీకటిరేయి;

వలస! పోయె మగడు ; వట్టి యిల్లు ; దొంగ లెవ్వరైన దోతురు సుమ్ము ; ని

ద్రింప వలదు ప్రక్కయింటి వాడ !

ఇంత తియ్యనైన తెనుగు శయ్య ప్రాకృత పుణ్యవాసన కలిమి అనంత కృష్ణశర్మ గారి కందినది. ప్రమాణమునందు పయి పద్యములు పొట్టి వైనను, గుణమునందు గట్టివి. కట్టమంచికవి శర్మగారి సప్తశతీసారమునకు బ్రస్తావన సేయుచు నిటులనెను: "...ఈగాథసప్తశతి బౌద్ధయుగమునాటి యుత్కృష్ట జీవితమును దెలుపుచున్నది. భావములు కోమలములు. వానికి దీటైనది అనంతకృష్ణ శర్మగారి శైలి - మధురము, లలితము, రమణీయము.వీరి సరసత్వము అర్హతకొలది పొగడుట అసాధ్యము...............ఒక్కపద్యమే వ్రాయవలయును. అది మెఱుగు దీగవలెమనల గ్రమ్మియుండు నంధకారము నొక్కక్షణము పోద్రోలి నూతనలోకములు హఠాత్తుగ గోచరింప జేయవలయును. ఆలోకము, ఒక్కనిమిషము మాత్ర మెదుట నున్న నేమి? దాని రామణీయకము జీవము నంతయు నాక్రమించి చచ్చు వఱకును తదేక ధ్యానములో మునుగున ట్లొనరించును. అట్టిదియ కవిత. గుణము ప్రధానము. రాశికాదు ..."

శ్రీ రామలింగారెడ్డిగారికి, శర్మగారికి మంచి యనుబంధము. శర్మగారిని సరససాహిత్య ప్రచారమునకు బ్రేరేచినది 'కట్టమంచి' వారి సౌహార్దమేయట! సహజ ప్రతిభామనోజ్ఞత కలిగి కవితాగానము చేయుచున్న అనంత కృష్ణశర్మగారి శమీపూజ, పెనుగొండ పాట - మొదలైనవి తెలుగులో నిలిచి వెలుగొందు మెఱపులవంటి వని పెద్దల హృదయము. ఇది యిటుండ, రసికత్వ - కవిత్వములకు విజయపతాక నెత్తిన అనంతకృష్ణుని సంసార మాధురియు భావించుకోదగినది.

అనంతపుర మండములోని రాళ్ళపల్లి వీరియభిజనము. వీరి మాతామహులు అనంతాచార్యుల వారి కాయూరు వంశ పరంపరగా వచ్చిన శొత్రియ గ్రామము. పుంసంతానము లేమి నా యనంతా చార్యులకు శర్మగారు స్వీకృతపుత్త్రుడాయెను. ఆకారణమున 'రాళ్ళపల్లి' వీరికి సంక్రమించినది. శర్మగారిగన్న తలిదండ్రులు ధన్యులు. వారికి బుట్టిన నలువురు బిడ్డలలో వీరు ద్వితీయులు.వీరి యన్నగారు గోపాలకృష్ణమాచార్యులును సుప్రసిద్ధులు. అనంతపురపు రెవిన్యూ శాఖలో హుజూరు శిరస్తాదారులుగా పనిచేసి యిపుడు వారు విశ్రాంతివేతనము పుచ్చుకొనుచున్నారు. సంస్కృతాంధ్ర సాహితీ సంపన్నులు. ప్రాచ్య పాశ్చాత్య జ్యోతి శ్శాస్త్రపు సిద్ధాంత ఫలభాగములం దసాధారణ పరిచయము గలవారు. 'భారతి' లో బ్రచురితము లగుచుండు వారి రచనలు తెలుగు వారికి విందులు. 'రాళ్ళపల్లివారి' దట్టి విద్వ దన్వయము. మన శర్మగారు చిన్ననాట పితురంతేవాసియై సంస్కృతాంధ్రములు వ్యాసంగించెను. తరువాత మైసూరు పాఠశాలలో సంస్కృత ప్రాకృత వ్యాకరణములు, అలంకార గ్రంథములు పాఠముచేసినారు. 1912 సం. లో మైసూరు కళాశాలలో బండితపదవీలాభము. నేటికిని వారాపదవిలోనే యున్నారు. సంగీత సాహిత్యములలో శర్మగారుచేయుచున్న సాధనము తెలుగువారి కారాధ్యమైనదని యామోదము ప్రకటించుచు 'వేమన' లోని వారి దివ్యవాచకములు కొన్ని స్మరించెదను.

"......త్యాగరాజు వంటివారి కీర్తినలలో భక్తి యెంతయున్నను వారి గానపాండిత్యము దానిని గప్పి పెట్టినది.పల్లవిదాటులను జూపుద మనిపించునే కాని, వానిని పాడునపుడు ప్రాయికముగ భక్తిని ప్రకటింత మనిపించును."

"......వేమన పద్యము లట్టివి కావు. అతనివి చిటుకలో ముగింపగల చిన్న పలుకులు; అచ్చ తెనుగు పద్యపునడక; గుండు దెబ్బవలె గుఱి తప్పని చిక్కని చెక్కినమాటలు. నోరుగల తెలుగువారందఱును నేర్వవచ్చును."

"బాలవ్యాకరణము, అప్ప కవీయము మొదలగువాని దెబ్బలకు వేమన పద్యము లెంత నులినులి యైనవో చెప్పితీఱదు." " మనలో నయముతోడి హాస్యము లేదని మొదలే విన్నవించితిని. నవరసములలో హాస్యమును గూడ జేర్చియున్నను ప్రాచీనుల హాస్యము అసహ్యములను అనభ్యములను వర్ణించుట యందు మాత్రము చరితార్థ మయినది."

" నిజముగా తెనుగు భాషకు మొట్టమొదట హాస్యరసము చవిచూచిన ధీరుడు గురుజాడ అప్పారావుగారే. వారి కన్యాశుల్కమునందున్నంత హాస్యరసనైర్మల్యము తక్కిన యెవరి గ్రంథములందును లేదనుట యతిశయోక్తి కాదు."

తెలుగువంటి బ్రతికియుండు భాషలలో 'ఇవేయపశబ్దములు, ఇవేసుశబ్దములు' అని నికరముగా శాశ్వతముగా నిర్ణయించుటకు బూనుకొనుట వట్టి వెఱ్ఱియని యిన్నాళ్ళకును తెలిసికొనలేకపోవుట మనతప్పు గదా!"

ఇవియెల్ల అనంతకృష్ణశర్మగారి హృదయమునుండి చిందిలిన సందేశ సుధాబిందువులు. 'ప్రబంధకవి' ని గుఱించిన శర్మగారి యాశయము తెలువు గీతములతో నిక నీవ్రాయసము ముగియుచున్నది.

ఇంతవృద్ధు డ వంతయు నెఱిగినావు

తెలిసికో జాలనేమి మా తెలివిలేమి!

అర్థమేకాని పద్యము లల్లనేల?

వీథివీథుల వినువారి వెదకనేల!

అచ్చుతేటల కాశించునట్టి మమ్ము

తాటియాకుల కంతలో దార్ప గలవె?

పూత లేనట్టివ్రాతలో పొలుపు నెఱుగు

కన్ను లెవ్వరికున్న వీ కాలమందు:

భావములు మ్రింగియున్నట్టి బంధములను,

ఆదియంతము లేని నానార్థములును

నోరు తీరుగని పదముల తీరుపులును

విచ్చి చూపేవు గాని నీవెంట దిరిగి

తెలిసికొన మాకు బ్రదుకులో తీరికేది?

మఱచిపోయిన జ్ఞాపించు మార్గమేది?

        _____________