ఆంధ్ర రచయితలు/మతుకుమల్లి నృసింహకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మతుకుమల్లి నృసింహకవి

1816 - 1873

ఆరువేలనియోగి. కృష్ణయజుశ్శాఖీయుడు. ఆపస్తంబ సూత్రుడు. కాశ్యపగోత్రుడు. జన్మస్థానము: తెనాలి. తల్లి: జానకమ్మ. తండ్రి కనకాద్రిశాస్త్రి. జననము: 1816 - ధాతృ సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి. నిర్యాణము: 1873 - శ్రీముఖ సంవత్సర శ్రావణ బహుళ తృతీయ. గ్రంథములు: 1. ఆంధ్రమేఘసందేశము. 2. వేంకటాచలయాత్రా చరిత్రము. 3. ఆజచరిత్రము. (ఆంధ్ర ప్రబంధము 1912 ముద్త్రి) 4. చెన్నపురీ విలాసము (ప్రౌఢప్రబంధము. 1920 ముద్రి) 5. శ్రీకృష్ణ జలక్రీడా విలాస నాటకము. 6. నృసింహసహస్ర నామావళి (సం.) 7. పుండ్రకళానిధి (సం.) 8. ఆంధ్ర సిద్ధాంత కౌముది. 9. భరతశాస్త్ర సర్వస్వము. 10. సంగీతసార సంగ్రహము (ఆముద్రి.)

మూడుశతాబ్దులనుండి వీరిది పండితవంశము. ఈ నృసింహ విద్వత్కవి ప్రపితామహుడు మాధవకవి. ఈయన వ్యాసభారతము యధామాతృకముగ ననువదించి "అభినవభారతము" అని పేరుపెట్టెను. ఈ మిశ్రకావ్యమున బ్రస్తుత మాదిపంచకము మాత్రము మిగిలియున్నది. తక్కుగల పర్వములు తాడిపత్రి గ్రామమున దగులబడినట్లు చెప్పుదురు. తెనాలి గోవర్ధనస్వామి కోవెల యెదుటగల గరుడవిగ్రహము మాధవకవి శిల్పకళాకుళలతకు దార్కాణ. ఈయన పుత్రులు నృసింహశాస్త్రి గారు. వీరు వేదవిదులు. గొప్ప వైయాకరణులు. కనకాద్రిశాస్త్రిగారు వీరికు గుమారులు. వీరే మన ప్రస్తుత కవివరుని జనకులు. కనకాద్రిశాస్త్రిగారు సకలశాస్త్ర ప్రవీణులు. శ్రీ మల్రాజు గుండారాయుడుగారి సంస్థాన పండితులు. గుండా రాయడుగారు నాడు పేరుమోసిన పెద్ద జమీందారులలో నొకరు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వీరిని గూర్చి యీకథ ముచ్చటించిరి:

"ఒకప్పుడు వాసిరెడ్డి వేంకటాద్రినాయడునును, నర్సారావుపేట మల్రాజు గుండారాయడును, నూజవీటి అప్పారావును, చల్లపల్లి అంకి నీడును గూడి యిష్టాగోష్టి సల్పుకొను సందర్భమున హాస్య చతురుడు గుండారాయడు 'మన జీవితములు కడచిన తర్వాత లోకము మనల నెటు ప్రశంసించునో తలచి చూచుకొందమా? అనెనట. అందఱు నంగీకరించిరట. నూజవీటి అప్పారాయడు చనిపోయెనా బైరాగులందఱును బలవించెదరు. తాను చనిపోయితినా వేశ్యలందఱు పలవించెదరు. వేంకటాద్రి నాయుడు చనిపోయెనా అందఱు ఆహా యని సంతోషించెదరు."

ఈ గుండారాయని యాస్థానమున నుండి పాండిత్య శక్తిచే నీ కనకాద్రి శాస్త్రిగారు స్థిరమైన భూమి నార్జించి సుఖించెను. నృసింహవిద్వత్కవి తల్లి కూడా విదుషి. ఆమె పేరు జానకమ్మ. చదలపాక సుబ్బయా మాత్యుని కొమార్తె. ఈ పద్యము లామెయే చెప్పినదట:

"మతుకుమల్లియిల్లు మహి విద్య వెదచల్లు
పరబుధేంద్రులకును బ్రక్కముల్లు
ఎఱిగి మెలగి రేని నెలమిచే వాటిల్లు
గాన వారి యిల్లు ఘనత జెందె"
అతి చమత్కృతి గలిగిన మతుకుమల్లి
వారు శబ్దము గొల్పిన కారణమున
వసుధ లోపల మంచెళ్ళ వారియిల్లు
శారదాదేవి నాటకశాల యండ్రు
వాసుదేవుని కవితావిలాస మచట
మొలక బంగరు గజ్జెల మ్రోత గాదె?

మన కవివరుని తమ్ముడు కృష్ణశాస్త్రి. ఆయన తన యన్నగారి "అజ చరిత్రము" లో నక్కడక్కడ నాశ్వాసాంతపద్యములు పోయినవి మరల వ్రాసెను. అతడు కూడా జక్కని కవితాధార కలవాడు.

మన నృసింహవిద్వత్కవి పూర్వులను మించిన పండితుడు అజచరిత్రమును ప్రౌఢ ప్రబంధ మితని కృతులలో నుతికెక్కినది. ఇందలి శైలి వసుచరిత్రకు సహపాఠి. తెలుగు కంటె సంస్కృతపుబాలు వీరి కవితలో హెచ్చు. భావములు మహోన్నతములు. భావ నిర్దుష్టము. ఈ పద్యమిన్నిటికి నాదర్శమైనది.

సీ. ఘనఘన శ్రీసముత్కట జటావరవర
          క్రమయుక్తయీమయరమ్యవేణి
నానాస్వరవ్యంజన ప్రతాపానూన
         శబ్దమహాశబ్దశాస్త్ర వీణ
భూరిగుణవిశేష పుంజైక నిత్యసం
         బంధవత్తర్క విభ్రాజుశని
సరసాలంక్రియోజ్జ్వల సువర్ణపదోరు
         సంగీతసాహితీ స్తనభరాఢ్య

గీ. క్షిప్రసద్ధతి ముఖరభాట్ట ప్రభాక
రీయమంజీరముహ రమణీయ చరణ
జలజనిత్య ప్రగల్భ వాచాల వాణి
నిలుచుగాత మదీయాస్య జలరుహమున.

ఈ అజచరిత్రకే ఇందుమతీ పరిణయ మని మాఱుపేరు. ఇందున్నవి యాఱాశ్వాసములు. ఆద్యంత మొక్కరీతిని కవిత మహాప్రౌఢముగా నడిచినది. వసుచరిత్రాదుల ఛాయలు పెక్కులున్నను గవి ప్రతిభావ్యుత్పత్తులు వానిని కప్పిపుచ్చినవి. ఈ కావ్యము మంగళాంతము.

క. పాణిగ్రహణ మొనర్చిరి
యేణాక్షియు వరుడు సాత్త్వికైకస్యిద్య
త్పాణీశ్లథభావము స్ఫుర
మాణహ్రీకైతవమున మాటుపఱుచుచున్

ఈ కవి శ్రీమన్మాల్యశైలనృసింహభక్తుడు.

గ్రంథాంత గద్య మరయునది:-

"శ్రీమన్మాల్య శైల నృసింహ వరప్రసాద సమా
సాదిత సకల శాస్త్ర సంవిదుపస్కృత సంస్కృ

తాంధ్ర సాహితీ పురస్కృత సరస సారస్వత
చతుర వాగ్ధోరణి..............

ఈ కృతి యానృసింహస్వామికే యంకితము.

ఈ కవిసింహుని యతర కృతులలో "చెన్నపురీవిలాస" మొకటి చెప్పుకొనదగినది. ఇది శ్రీరాజా బొమ్మదేవర నాగన్ననాయడు జమీందారువారి యాజ్ఞచే రచియింపబడిన కృతి. ఈయన కృష్ణా మండలములోని "తోట్లవల్లూరు" సంస్థానాధిపతి. ఆ సంస్థానమున నీ నృసింహకవి పండితుడుగను, బరీక్షాధికారిగను నుండెను. సంస్థాన ప్రభువువలన మన కవి మహాసన్మానముల నందుచుండెను. కొమ్ములు తిరిగిన పండితులు వార్షికములకు వచ్చినపుడు వీరే పరీక్షాధికారులు. తర్కాదిశాస్త్ర పండితులగు శ్రీ ప్రభల సుందరరామశాస్త్ర ప్రభృతులను వీరు శాస్త్రవాదమున నోడించిరని యందురు. శ్రీ జగద్గురు శంకరాచార్యులవారి పీఠ విద్వాంసుల సమక్షమున బైవారికిని మన శాస్త్రిగారికిని దర్కశాస్త్రీయవాద మిరువదియొక్క దినము జరిగినదట. అప్పుడు వీరి విజయము నెఱిగి పీఠాచార్యులీపండితు నేనుగుపై నూరేగించిరట. ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములలో వీరి వాదప్రావీణ్యము మగణ్యము. నృసింహోపాసకుడగుటచే నీయనయెదుట వాదముచేసి నెగ్గిన వారు లేరని వచింతురు. వీపి బుద్ధిలో బ్రతిఫలిపని శాస్త్రము లేదు. కళ లేదు. ఇందులకు వారి గ్రంథమలే సాక్షులు. ఈయన ముప్పది యేండ్లు వచ్చువఱకు బితురంతే వాసియై షట్ఛాస్త్రములు లోతులుమాట్ట వ్యాసంగించెను. అప్పుడు వాక్యార్థములకు గ్రంథరచనకు గడగెను. లోకమర్యాదకు సంస్థానపండితుడుగా నుండెగాని ప్రభువుకు లొంగియుండలేదు.

సంస్థాన ప్రభువు నాగయ్యనాయడుగారితో కలిసి నీ కవి చెన్నపురము వెళ్ళినపు డాపట్టనవిలాసములు ప్రబంధరూపముగ వర్ణింపుడని యడుగనీ "చెన్నపురీవిలాసము" రచించిరట. అది 1860 ప్రాంతము. నాటి మదరాసులోని విశేషములన్నియు నిందు గన్నులకు గట్టినట్లు వర్ణింపబడినవి. వీధులు, మేడలు, సముద్రము, రైలు, పోటోగ్రాపు, అచ్చు కూటములు, ఆసుపత్రులు, మ్యూజియము, లైటుహౌసు, హార్బరు పువ్వులయంగడి మున్నగు నెన్నో ప్రకరణము లిందు గలవు.. కావ్యము గద్యపద్యాత్మకము. కవిలోకజ్ణత కిది యద్దము. ఆకాలమున నిట్టిక్రొత్తయూహ లూహించిన కృతికర్తను నేటిచారిత్రకులు ప్రశంసింప దగియున్నది. ఇందలిపద్యము లన్నియు గొప్పవి. అచ్చటచ్చటివి మచ్చు.

మ. ఎరణాయూరును గత్తివాక యడసూరిరెన్నెళుంబూరు మే
ల్తిరునట్టూరును రాయపేట తిరుపల్లిక్కేళి చేపాకమున్
బరశుంవాక పరంగికొండ మరకృష్ణాంపేటయన్ లోనుగా
బురిచుట్టున్ విలసిల్లునాటుపురమల్ భూతింద దేకాకృతిన్.

గీ. సరకు నింపను దింపను సారెసారె
దరులయొద్దకు దరియొద్ద కరుగుపడవ
లోడలకు మేడలకు మైత్రినొసరగూర్ప
నిటు నటు చరించుచారుల నెనసి వెలయు.

మ. అల మోగ్మేను సరంగి బొంబయియు బర్మాసీమపైగోవ బం
గళ కోరంగియు నాదిగాగలుగు ప్రఖ్యాతంపుకోస్తాల నా
వలరాక ల్నగరీజనంబులకు రేవల్ దెల్పు రంజిల్లు ను
జ్జ్వల'సీకష్ట' నివిష్ట కేతన పటు స్తంభాగ్రచేలచ్చటల్.

సీ. క్షమవిహరించువాక్సతి పుట్టినయిలు మ
          తుకు మల్లి కులమతల్లిక తదస్వ
యోదితు వేంగళార్యాదులు మాల్యశై
          ల నృసింహ కరుణోపలబ్ధ పర చ
తుష్షష్టి విద్యావిదులు భవత్ప్ర పితామ
          హుండు మాధవకవీంద్రోత్తమ డభి
నవభారతాది నానాగ్రంథకర్త నీ
          తాత నృసింహ విద్వద్వరుండు

గీ. శబ్దశాస్త్ర త్రయీ విచక్షణుడు నీదు
జనకు డైనట్టి కనకాద్రిశాస్త్రివర్యు
డఖిల శాస్త్రార్థవేది నీవద్భుత ప్ర
సిద్ధసారస్వతుడవు నృసింహశాస్త్రి!

                         _________________