ఆంధ్ర రచయితలు/కోరాడ రామచంద్ర శాస్త్రి

వికీసోర్స్ నుండి

కోరాడ రామచంద్ర శాస్త్రి

1816 - 1900

వేగినాటి బ్రాహ్మణుడు. కౌండిన్యసగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. తండ్రి: లక్ష్మణశాస్త్రి. జన్మస్థానము: కేశనకుర్రు (అమలాపురం తాలూకా) నివాసము: బందరు. జననము: 1816 సం. అస్తమయము 1900 స. రచించిన తెలుగు కృతులు: 1. మంజరీ మధుకరీయ నాటిక. 2. ఉన్మత్త రాఘవము. 3. నయప్రదీపము (విగ్రహాంధ్రీకరణము). 4. రథాంగ దూతము (వచనము) - ఆముద్రితములు: 1. శాకుంతలాంధ్రీకరణము. 2. వేణీసంహారము. 3. ముద్రారాక్షసము. 4. ఉత్తర రామచరితము. 5. పరశురామ విజయము. (గద్యము) ముద్రిత సంస్కృత గ్రంథములు. 1. కుమారోదయము. (చంపూ కావ్యము) 2. ఉల్లాసములు మాత్రమే ముద్రితము) 2. ఘనవృత్తము (సంస్కృతాంధ్ర పద్యములు) 3. దేవీవిజయము (చంపువు) 4. శృంగార సుధార్ణవము 5. ఉపమావళి - ఆముద్రిత సంస్కృత కృతులు: మృత్యుంజయ విజయ కావ్యము. 2. పుమర్థసేవధి కావ్యము. 3. కరునానందబాణము. 4. రామచంద్రవిజయ వ్యాయోగము. 5. త్రిపురాసుర విజయడిమము. 6. ఉత్తర రామాయణము. 7. ధీసౌధము (వ్యాకరణ సంగ్రహము) 8. మంజరీ సౌరభము ఇత్యాదులు.

"ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మా" అను నిశ్చయమున--వ శతాబ్దిలో సంస్కృతాంధ్ర గ్రంధములు రచించి క్రొత్తమార్గము తీసినపండితకవి రామచంద్రశాస్త్రి. వీరిది పండితవంశము.ఈయన అమలాపురము తాలుకాలోని కేశనకుఱ్రు గ్రామమున మాతామహుని యింట బాల్యముగడపెను. రామ మంత్రోపదేశము పొందెను. శిష్టుకృష్ణమూర్తి శాస్త్రులవారి సన్నిధి నలంకార గ్రంధములు చదివెను. మంచి సాహిత్యము సంగ్రహించెను. అంత గొంతకాలమునకు,

త్వం సాహిత్యపరోసి సాధుకవితాధుర్యోసి తేవాగ్మితా

సిద్ధా ప్రప్రజ చెన్నపట్టనపురీం విద్యాలయేహునకా

అభ్యాప్యార్యతమాయ విత్తబహులందత్వా పరార్దం పరం
తేన స్యాత్తన సత్కళత్రవిభవ స్తస్మా దిహైత త్కురు.

అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున జిరపరిచయులగు శిష్టుకవిగారు రామచంద్రపురము రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని యుత్తరము వ్రాసి యీయగా వారు దేశమున క్షామము పట్టుటచే నీకవిని రెండు నెలలకంటే నెక్కువపోషింపలేమనిచెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. మదరాసు పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో మచిలీపట్టణమున నాగవలసివచ్చి ఇంగువ రామస్వామి శాస్త్రిగారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దముచేయగా నందాయనను ధిక్కరించి పెండ్లిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము నడవపల్లి. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన యీయన కదియొక లెక్కా పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.

క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. బందరు నోబిలుపాఠశాలలో నుద్యోగము లబించినది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువదిమూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతి రేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా నధికారికి గ్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు. వెనుక శ్రీవీరేశలింగం పంతులుగారు రాజమహేంద్రవరమున ఆర్ట్సు కాలేజిలో దెలుగుపండితులు నుండునపుడు కస్తూరి శివశంకర శాస్త్రి గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు 'ఇదేమిపాప' మని యడుగగా, 'ఆవిద్యార్థిపుణ్య' మని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.

మాడభూషి వేంకటాచార్యులవారు మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొకశ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధముచెప్పుటయేగాక మాకి రెండు గడ్డుశ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసి రని వదంతి.

ఈయన సంస్కృతాంధ్రములలో జాలకృతులు రచించెను. పండ్రెండవయేటనే యుపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి యుపదేశవిషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కధ కల్పితము. ఇది రంగమున కననుకూలము. ఇందలి కవిత్వము కఠినము. మచ్చున కొకపద్యము చూడుడు:

మ. పికదష్టామ్ర కిసాల దంతిపటియ త్సీనస్పుర త్సౌరభ
ప్రకటోద్గార రజోగుళుచ్చ కుచభార ప్రహ్వ సంజాతకో
రక రోమోద్గమ సాంద్రమంద్ర కలనిర్ర్హదనగ్రీవ, యీ
సకలశ్రీవని యామనిం గదిసి హృజ్జక్రీడలన్ సల్పెడిన్.

రామచంద్రశాస్త్రిగారు వేణీసంహార ముద్రారాక్షస శాకుంతలము లనువదించిరి. సంస్కృతాంధ్ర కవితలు రెంటను వీరిచేయి యారితేఱినది. మేఘసందేశము తరువాతి కథను ఘనవృత్తము అను గీర్వాణకావ్యముగ రచించిరి. దీనికి దెలుగుసేత శ్రీ మల్లాది అచ్యుతరామశాస్త్రి గారు చేసిరి. యక్షసందేశ శ్రవణానంతరము మేఘుని వృత్తాంతము తెలుపున దగుట దీనిని ఘనవృత్తమని పేరుకొనిరి. అందలి ధోరణికి కాళిదాసు నొరవడి.

శ్లో. ఇత్యుక్తోసౌ సపది జలద స్తేన దీనాత్మనాలం
శ్రుత్వా కామం సరసహృదయ ప్రాగ్రణీత్వాత్ప్రహృష్టః
లోకే దీనావన మనుపమం పుణ్య మా దత్తఏవ
సంతః ప్రోచు స్తదిహ హిమయాతో షణీయస్సఖా మే