ఆంధ్ర రచయితలు/చిలుకూరి వీరభద్రరావు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిలుకూరి వీరభద్రరావు

1872 - 1939

ఆరువేల నియోగిబ్రాహ్మణులు. అభిజనము: తణుకు తాలూకాలోని ' రేలంగి '. నివాసము: రాజమహేంద్రవరము, కొవ్వూరు. జననము: 17-10-1872. నిర్యాణము: 1939 సం. రచిత కృతులు: రాజమహేంద్రపుర చరిత్రము. ఆంధ్రుల చరిత్రము - జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము. తిక్కన సోమయాజి, తిమ్మరుసు మంత్రి - శ్రీనాథకవి - శివాజీ చరిత్ర, కర్ణసామ్రాజ్యము, నవరసిక మనోల్లాసిని, స్వయం సహాయము, వరలక్ష్మీ విలాసము, హిందూసంసారము, హిందూ గృహము, హాస్యతరంగిణి, సుమిత్ర, ఆళియ రామరాజులు, నాయకురాలి దర్పము.

వీరభద్రరావుగారు చరిత్రచతురాననులు. ' ఆంధ్రుల చరిత్ర ' తో వీరికఖండకీర్తి వచ్చినది. ఆంధ్రులప్రాచీనచరిత్రమును బరిశోధించి వెలువరించినవారిలో నీయనయే కనిష్ఠికాధిష్ఠితులు. వీరియనంత పరిశోధనములనుండియే నేటి పలువురు రచయితలు చక్కని విషయములు సంగ్రహించి పత్రికాపాఠకుల కిచ్చుచున్నారు.

వీరభద్రరావుగా రాంధ్రభాషకు బ్రాణములు ధారవోసిరి. ఆంధ్రజాతిపై వీరికవ్యాజమైన యాదరము. వీరు సంఘసంస్కృతి నభిలషించిన సదాశయులు. జాతివికాసము కలిగింప నెంచి దేశోపకారి, విబుధరంజని, ఆంధ్ర కేసరి పత్రికలు ప్రకటించిరి.

పంతులుగారి కలము జంకుకొంకులు లేనిది. వాదోప వాదములలో విలయనాట్యము సలిపినది. కలములో నున్నంత నిరంకుశత నోటిలో లేదందురు. ఎంతయావేగముగా వాదించినను జివరకు నవ్వుకొనుచు మరియొక సంభాషణములోనికి మార్చివైచుటమాత్రము వారియెడ గల మంచిగుణము. ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము వీడక చేతలలో స్వాతంత్ర్యము చూపిన నిరంకుశు డీయన. తెలుగువారిలోని కొన్ని జాతులను గురించియు గొన్ని వర్ణములను గురించియు మన రావుగారు వెలువరించిన నిర్ణయములు కొన్ని సంస్థానములకు గోపకారణము లైనవి. సంస్థానప్రభువులు కొందరు వీరభద్రరావుగారిపై నాగ్రహము చూపుచుండిరి. వారు తలచినచో నేమి చేయలేరు ? వేదము వేంకటరాయ శాస్త్రిగా రిది గుర్తించి ' వీరభద్రరావుగారు ! ప్రమాదము సుమండీ ' యని మందలించిరట. వీరది లెక్కసేయుదురా ? సత్యప్రకటనమే సత్పరిశోధన లక్షణమని నమ్మిన నిర్భీకు డాయన. పంతులుగారు ' అళియరామ రాయలు ' అను గ్రంథములో ' రివరెండుహీరాసు ' గారి వ్రాతలను సయుక్తికముగ ఖండించిరి. ఆంధ్రేతిహాస పరిశోధక మండలి వెలువరిచిన కాకతీయ సంచికపై వీరిఖండనము సప్రమాణమై మెచ్చు నందినది. వీరి ' జీర్ణకర్ణాటసామ్రాజ్యము ' యాంధ్రాభిజ్ఞఉలు పెక్కు 'రౌ' ననిరి. ఇదియే వీరి తొలిరచనము.

పంతులుగారి విమర్శన శక్తి చవిచూడనివా రుండరు. వీరి యాంధ్రుల చరిత్రలోని కొన్నికొన్ని సిద్ధాంతములు నూతన పరిశోధనముల వలన నిలుచునవిగావు. ప్రథమప్రయత్నము లన్నిటిలోను గొన్నిదోషము లుండుట క్రొత్తగాదు. అది యాక్షేపణియమును గాదు. వీరి విమర్శలో మొగమాట మనునది పూజ్యము. సత్యపరిశోధనమునకు దమయాస్తిని దమయారోగ్యమును దుదకు దమప్రానములను గోల్పోయిన మృతజీవులు. జననము మొదలు మరణము వరకు గష్టపరంపరలతో నిండిన జీవితము వీరిది. దానికి హేతువు నిరంతర పరిశోధనపరత్వమే. ఒక సభలో కట్టమంచి రామలింగారెడ్డి ' వీరభద్రరావుగారి విమర్శనశక్తి చాల గొప్పది. దానిని వర్ణింప నా కర్హతలే ' దని యుట్టంకించినారు. ఆంధ్రచరిత్రకారులలో వీరభద్రరావుగారు, లక్ష్మణరావుగారు, రామయ్యపంతులుగారు, వీరేశలింగముపంతులుగారు నొక్క శ్రేణికి జెందినవారు.

వీరభద్రరావుగారు చదివినది ' స్కూలు ఫైనలు ' వరకే యనుకొందుము. అయిననేమి ? వారు చరిత్రచతురాననులు. పదవుల కొరకు బ్రాకులాడక యాంధ్రచరిత్ర పరిశోధనమునకు దమయావజ్జీవనము ధారవోసి తరించిన యిట్టిమహాపురుషుడు చిరస్మరణీయుడు.

వీరభద్రరావుపంతులుగారి ' ఆంధ్రులచరిత్ర ' యే తెలుగువారిలో జాతీయావేశము రగుల్కొల్పినది. భావిచరిత్రనిర్మాతల కాంధ్రుల చరిత్ర మొకపెన్నిధి. చిలుకూరివారి చరిత్రపరిశోధనరంగములో బ్రాచీనాంధ్రసౌభాగ్యము ప్రాచినసామ్రాజ్య విభవము తెరను దెరచుకొన్ వచ్చి మధురనాట్యము చేసినది.

ఆయన భౌతికదేహ మింక మనకు గానరాదు. ఆంధ్రుల చరిత్రము మాత్రమే యాంధ్రదేశమందెచ్చట జూచినను గనవచ్చును. నేడు పరిశోధకులలో బేరందుచున్న శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వీరభద్రరావుగారిత్రోవ నభినందింతురు. శ్రీ కుందూరి ఈశ్వరదత్తు బి.ఏ. గారు వీరి మేనల్లురు. వీరేశలింగము పంతులుగారి తరువాత నాంధ్ర చరిత్రకారులకు వీరభద్రరావుగా రాదర్శకులని యాంధ్రు లైకకంఠ్యముగా నంగీకరింపవలసినదే.

రాజమహేంద్రవరమున గల ఆంధ్రచరిత్రపరిశోధకసభా ప్రతిష్ఠాపకులలో శ్రీ వీరభద్రరావుగా రొకరు. ఇట్టి పంతులుగారికి 1928 లో నంద్యాలయందు సర్వేపల్లి రాధాకృష్ణుని యాజమాన్యమున జరిగిన ' ఆంధ్రమహాసభ ' లో ' ఆంధ్రచరిత్రచతురానన ' యను బిరుద మిచ్చి సత్కరించిరి.