ఆంధ్ర రచయితలు/చిలకమర్తి లక్ష్మీనరసింహము

వికీసోర్స్ నుండి

చిలకమర్తి లక్ష్మీనరసింహము

1867 - 1946

ఆరామ ద్రావిడశాఖీయులు. కాశ్యపసగోత్రులు. అశ్వలాయన సూత్రులు. తల్లి: రత్నమ్మ. తండ్రి: వెంకయ్య. జన్మస్థానము: ఖండవల్లి. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 26-9-1867 సం. (ప్రభవ సం|| భాద్రపద బ|| చతుర్దశి రాత్రి) - నిర్యాణము: 1946 జూన్ 17 వ తేదీ. కవికర్తృగ్రంథములు మొత్తము సంఖ్య 90. రఘుకుల చరిత్ర, స్వప్నవాసవదత్తము, సౌందర్యతిలక, హేమలత, భారతకథా మంజరి, సర్వశాస్త్రార్థ సంగ్రహము, కృష్ణవేణి, సుధాశరచ్చంద్రము, అహల్యాబాయి, ప్రసన్నయాదవ నాటకము, పారిజాతాపహరణము, పార్వతీ నాటకము, మణిమంజరి, సువర్ణగుప్తుడు, నానకుచరిత్ర, నందనచరిత్ర, కర్పూరమంజరి, వినోదములు, వాల్మీకిరామాయణ సంగ్రహము, గయోపాఖ్యానము, గణపతి, ప్రచ్ఛన్న పాండవము, గ్రీకుపురాణ కథలు, మహాపురుషుల జీవితములు, మధ్యమ వ్యాయోగము, వేమనకవి, రామచంద్ర విజయము, రాజా రామ మోహనరాయి, రాజారత్నము, రాజాస్థాన కథావళి, స్వీయచరిత్ర, ఇత్యాదులు.

గయోపాఖ్యానము తెలుగులో బహుజనామోదము బడసిన నాటక రాజము. ఆంధ్రుల కీనాటకముపై నసాధారణాదరము కల దనుట కది నేటికి లక్షపై బాతికవేలప్రతు లమ్ముడు పడియుండుటయే తార్కాణ. రంగస్థలములపై రక్తికట్టునాటకములలో నిది మొట్టమొదటిది. గయోపాఖ్యానము చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారు తమ యిరువది రెండవ యేట రచించిరి. ఈనాటకమే కవిగారిని మహాకీర్తిసంపన్నులను గావించినది. శ్రీకృష్ణుని సందేశముగొని యక్రూరు డర్జునునితో "నీతో ముఖ్యముగా నీబావ చెప్పుమన్న సందేశము వినుము" అని యిట్లు చెప్పెను. ప్రాతచుట్టాల మని నొక్కి పలుకు మనియె

నొరులకై పగబూనుట యొప్ప దనియె

బడుచుదనపుబింకమ్ములు విడువు మనియె

దలకు మీఱినపని చేయదగని దనియె.


దీనికి బత్యుత్తరముగా యుధిష్ఠిరుడు "సీ. నళినగర్భుని గన్న నారాయణుడు తాను బాంధవుండగుట మా భాగ్య మనుము...గయునిక్షమియించి పార్థుని గాపు మనుము." అని వచించెను. ఆసమయమున నర్జునుడుకూడ బావ కిట్లు ప్రత్యుత్తర మంపెను.


" అతిరాగంబు సుభద్రపై బొడమ సన్యస్తాన్యకామస్థితిన్

మతి యొక్కింతయు బ్రాజ్యరాజ్యపదవిన్యస్తంబుగాకుండ నే

యతిగానుండినవేళలం బిలిచి నెయ్యం బాఱ నన్ సోదరీ

పతిగా జేసిననాటి మేటికృప నాపై జూపవే శ్రీహరీ!


ప్రాణంబులు మాయధీనము చేసిన విపన్నుని బగతున కొప్పగించి శరణాగతత్రాణ బిరుదాంకమగు భరతవంశమునకు గళంకము తేజాల నని మనవిచేయుము." ఈగధ్యపద్యముల సొగసు పరికించితిరా ?


సుభద్ర యర్జునుని గావుమని శ్రీకృష్ణునితో జెప్పినది. అప్పు డతడు రోషావిష్టుడై చెల్లిలితో "ఔను తప్పు నీమగనిది కాదు. నాదే.


నీనాథునకు నేను మేనమఱందినై

యుదయంబు నొందుట యొక్కతప్పు

అన్నయానతి ద్రోసి యామహాత్మునకు ని

న్ను ద్వాహ మొనరించు టొక్కతప్పు

చిన్న నాటనుగోలె జెలిమిమై వారికి

సవకారమ లు చేయు టొక్కతప్పు గర్వితమతి వారు గావించుదౌష్ట్యంబు

నొప్పరికించుట యొక్కతప్పు

ఒప్పులే మేము చేయుట యొక్కతప్పు

తప్పు చేయక యుంటయే గొప్పతప్పు

అన్నితప్పులు మాయందే యున్న వబల!

తలచి చూడ బార్థునియందు దప్పుగలదె?"


అనెను. ద్రాక్షాపాకముతో, సుప్రసన్నశైలితో, సుమధురముగా నాటకపద్యములు నడపించుటలో లక్ష్మీనరసింహముగారిది గొప్పశక్తి. గయోపాఖ్యానమున కృష్ణార్జునుల క్రోధసంభాషణము చదువదగినది. 'సీ. నీచముచ్చము నాక రాచపాడి దొఱంగి బిడియ మించుక లేక బిచ్చమెత్త...మీసహోదరులకు సాటి మీరె సుమ్ము.' అని కృష్ణు డధిక్షేపించెను. 'సీ. అల్లుడారమ్మని యాదరమ్మున బిల్వబంపు మామనుబట్టి చంపగలమె ?' ఇత్యాదిగా నర్జును డాక్షేపించెను. ధీరోదాత్తులగు కృష్ణార్జునుల సంభాషణము హద్దుమీఱియున్నను గయోపాఖ్యానము సముచితవర్ణనాకరమై మనోహరముగ నున్నది. కనుకనే తెలుగున నీనాటక మింత ప్రశస్తి కెక్కినది.


లక్ష్మీనరసింహకవిగారు నాటకరచనలో నెట్టిదిట్టలో నవలారచనలో నంతకంటె నధికులు. వీరు కందుకూరి వీరేశలింగకవివలె నాంగ్లేయ గ్రంథానుసారముగ గాక చాల భాగము స్వతంత్రముగా నవలలు రచించిరి. వీరి చరిత్రాత్మకకథలలో కర్పూరమంజిరి, కల్పితకథలలో గణపతియు నుత్తమస్థానము నలంకరింపదగిన రచనలు. కథనచాతుర్యము, కథాసృష్టి, రసపుష్టి గల గద్యరచనమున వీరు సిద్ధహస్తులు. లక్ష్మీనరసింహకవి హాస్యరసాదరము కలవాడు. వీరేశలింగముగారి హాస్యరచనయు, పానుగంటికవి హాస్యరచనయు కొంచెము మోటుమార్గమున నడచినవి. చిలకమర్తికవి దట్టిదికాదు. మార్దపము తప్పని హాస్యముతో నీలక్ష్మీనరసింహకవి యెనుబదిమూడు ప్రహసనములు వ్రాసి ప్రకటించెను. జయంతి రామయ్యపంతులుగారు చెప్పినట్లు "వీరేశలింగముగారి హాస్యము చిక్కనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము పలుచనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము గిలిగింతలు పెట్టి నవ్వించును. వీరేశలింగముగారి హాస్యము గిల్లి బాధించును."


లక్ష్మీనరసింహముగారి "గ్రంథప్రకటనము" అను ప్రహసనమునుండి వారి హాస్యరచనకు గొన్ని పంక్తు లుదాహరించెద. "వెక్కిరింతల వెంగళప్ప" తాను రచించిన "వెఱ్ఱిపప్పీయ" మను గ్రంథముయొక్క ఔత్కృష్ట్యము ప్రకటించుచు నాగ్రంథమునుగూర్చి యిద్దఱుపండితు లిచ్చిన యభిప్రాయములగూడ బ్రకటించినారు. వారిలో మహామహోపాధ్యాయ కొంకనక్క గురులింగశాస్త్రిగా రిట్లు వ్రాసినారు.


"మీ వెఱ్ఱిపప్పీయమ ను నేను సమగ్రముగా జూచితిని. కాళిదాస, భవభూతి, మయూర, వ్యాస, వాల్మీకుల కవిత్వములకంటె నిందలికవిత్వము వేయిరెట్లధికముగా బాగున్నది. ఇందలి పద్యములు గారిముక్కలవలె నెంతో రుచిగా నున్నవి. వీనికి అల్లపుపచ్చడివలె చిన్న వ్యాఖ్యానముకూడ గ్రంథకర్తగారే రచించినందున సర్వజన గ్రాహ్యమైయున్నది. ఇట్టిగ్రంథము జన్మయెత్తి చూచి యెఱుగను. ఇకముందు చూడబోను. ఇంకొకజన్మమునకుగూడ జూడ గలనని నమ్మకములేదు. ఇందలి వీరరసపద్యములు రెండు చదువగానే నా కావేశమెత్తి గొడుగుకామతో నాభార్యను మెత్తగా మర్దించితిని. మీగ్రంథ మందలి పై రెండుపద్యములును నేను చదువుచుండగా దగ్గరనుండి విన్నమా నిళ్ల బ్రాహ్మణుడుకూడ ఆరసము గ్రహించి కావడిబద్ద తిరగవేసి నన్ను వెన్ను పూస బిరుగునట్లు కొట్టెను.కాబట్టి యీగ్రంథము మందఱు కొనదగినది. ఈవిధముగా సప్రయత్న ప్రహసనరచనాకౌశలము చిలకమర్తి కవి కలవడినది. లక్ష్మీనరసింహగారు బహుచమత్కారభాషి. మాటమాటకు జమత్కారముచూపి మాటాడుటలో వీరిది మేనమామపోలిక. సుప్రసిద్ధపండితులైన పురాణపండ మల్లయ్యశాస్త్రులుగారు లక్ష్మీనరసింహకవికి మాతులుడు. వారి మాట నేర్పు నాంధ్రమండలిలో జాలమంది యెఱుగుదురు.


లక్ష్మీనరసింహకవిగారి ధారణాబల మసాధారణము. తమ కుటుంబములో గాని, తా మెఱిగియున్న బంధుమిత్త్రకవి కుటుంబములలో గాని: యెవరేనా డెన్ని గంటల యెన్ని నిమిషములకు జన్మించినదియు - ఎవ రెప్పుడేమేమి యొనరించినదియు మున్నగువిషయములు చెప్పుచు నత్యాశ్చర్యము గలిగించుచు కక్కని ప్రస్తాననము చేయుచుందురు. వీరి ధారణాశక్తికి 1897 సంవత్సరమునాడు జరిగిన చిన్న కథ యిది.


కందుకూరి వీరేశలింగము పంతులుగారు అతిప్రయత్నముమీద తంజావూరునుండి నాచనసోమనాథుని "ఉత్తరహరివంశము" సంపాదించి తెచ్చి రాజమహేంద్రవరములో బ్రథమముద్రణము వేయించుచుండిరి. ఆసందర్భమున మన కవిగారు ఆముద్రాలయమున నున్న "ప్రూపురీడరు" నొద్దకు బోయి యేనాటికానాడు మెల్లమెల్లగా ప్రూపు కాగితము లింటికి గొనివచ్చుచు గవితాప్రౌడత కబ్బురపడుచు హరివంశమంతయు నించుమించుగ ధారణపట్టిరి. గ్రంథముద్రణము పూర్తికాగా వీరేశలింగముపంతులుగారు లక్ష్మీనరసింహముగారి కొకప్రతి యీయబోయిరట. అంతట మన కవివరుడు సోమనాథుని కవిత్వము నుగ్గడించుచు గ్రంథములోని పద్యములెన్నో గబగబ చదివి యుపన్యాసరీతిగా విశేషములు వెల్లడింప మొదలుపెట్టిరట. అది విని వీరేశలింగముగా రాశ్చర్యభరితులై "ఉత్తర హరివంశము" ప్రాచీనపు బ్రతి మీయొద్ద నేదైనగలదా ? యని యడుగ "దమ రనుగ్రహించినదే" యని సమాధానముచెప్పి జరిగినకథ వెల్లడించిరట.


ఇంతకును జెప్పబోవున దేమన ? ఏనాడో యట్లు ధారణపట్టిన పద్యములు నేటికిని వారు చదువుచు బ్రాచీనకవుల కవిత్వ విశేషములను శ్లాఘించుచుందురు.


పంతులుగారు గొప్ప యుపన్యాసకులు. వీరి యుపన్యాసము దూరాన్వయములు లేక మృదువుగానుండి హాస్యరస ప్రచురములగు నుదాహరణములతో శ్రోతల కానంద మొదవించును.


వీరు 'మెట్రుక్యులేషన్‌' పరీక్షలో గృతార్థులై యాంగ్లసారస్వతమును లెస్సగా నెఱిగిరి. గురుశుశ్రూష చేసి సంస్కృతభాష నభ్యసింపక పోయినను నేత్రావరోధము వాటిల్లినతరువాతనే భానకాళిదాస భవభూత్యాది సంస్కృతకవుల రచనలు చదివించి స్వారస్యముల దెలిసికొని భాసనాటకచక్రము (13 నాటకములు) మధురరీతి నాంధ్రీకరించి తమ యనల్పప్రతిభ వెల్లడించికొనిరి. కొన్నిపట్ల వీరి తెలుగుసేత మూలానుకూలముగ నుండకున్నను నాటకరచనలో సిద్ధహస్తులగుటచే భాననాటకాంధ్రీకరణము మనోహరముగా నున్నది. సీసపద్యముల దిగువ నెత్తుగీతములు లేకుండ వ్రాసిరి. ఇది క్రొత్తపద్ధతి.


హోమర్ (గ్రీకుజాతీయకవి) మేధావిభట్టు, కుమారదాసుడు,మెల్టను మున్నగు మహాకవులవలె లక్ష్మీనరసింహముగా రంధులయ్యును ప్రకృతిరహస్యములు ప్రతిభాబలముచే బ్రత్యక్షీకరించుకొని కవిత్వము చెప్పిన మహాకవులు. వీరు కొన్ని పద్యములు మన:ఫలకముమీద వ్రాసి వుంచుకొని యెవరైన లేఖకు లున్నపుడు వెల్లె వేసినపద్యములు చెప్పుచున్నట్లు చెప్పి వ్రాయించుచుందురు. ఇట్లే వీరు లెక్కలేనన్ని గ్రంథ ములు వ్రాసిరి. లక్ష్మీనరసింహకవి జ్ఞానైకచక్షుష్కుండు. వీరికి 40 వత్సరములు యీడు వచ్చువఱకు సంపూర్ణనేత్రావరోధము కలుగలేదు. 1909 నుండి మాఱెను. 'కృపాంభోనిధి' నీకవి యీవిధముగ బ్రార్థించు చున్నాడు:


అన్నా ! నీద గుమూర్తి యెట్టిదియొ జాత్యంధుడు కాలాద్యవ

చ్ఛిన్నంబై జగదేక పూర్ణమగు నీ చిన్మాత్ర దివ్యాకృతిం

గన్నారం గను బుండరీకదళసంకాశ స్ఫురన్నేత్రుడున్

నిన్నుం జూడగలేడు చిత్ర మిది తండ్రీ ! సత్కృపాంభోనిధీ !

అందలి యమృతనిష్యందులగు పద్యములు మఱికొన్ని:


శా. తోలుంగన్నులు చూడలేవుగద విద్యుత్కోటి భాస్వత్ప్రభా

జాలాతీత జగత్ప్రపూర్ణ ఘన తేజో రాశి నీమూర్తి నిన్;

నాలోగన్న యినం గనుంగొను నటన్నన్ జ్ఞాననేత్రంబు లే

నేలే; దేగతి నిన్ను జూడనగు దండ్రీ సత్కృపాంభోనిధీ !


మ. బలిమిన్ రబ్బరు లాగ సాగి మొదటన్ స్వస్థానముంజేరు నా

వల, నట్లే బలిమి స్మనస్సును భవత్పాదద్వయి న్ని ల్ప నా

స్థలమందయ్యది నిల్వ కెప్పటియటుల్ దౌర్గత్యముంజెందు, ని

ష్ఫలమౌ నాజతనం, బి కేమిగతి దేవా ! సత్కృపాంభోనిధీ !


శా. ఆకుంబచ్చల పళ్లెరంబుల బ్రవాళాలి న్ని వాళుల్ తగన్

నీకర్పించి, విహంగనాదమను మేల్గీతంబులంబాడి, తా

మేకాలంబును బూలు కాంకలిడి తండ్రీ ! భక్తి వృక్షాంగనల్


నీ కాత్మీయకృతజ్ఞతం దెలిపెడు న్నేర్మిన్ కృపాంభోనిధీ !

మ. గగనం బద్భుతలీల నీదగు నిరాకారత్వమున్ గాలి నీ

దగు విష్ణుత్వము, నీరు నీకరుణ, దీప్యద్వహ్ని నీతేజు నీ

దగు శాంతిన్ ధర చాటుచున్నయవి, యాహా! పంచభూతంబు లే

పొగడున్నీ గుణరాజి వందులయి శంభూ ! సత్కృపాంభోనిధీ! వర్ధమానులగు యువకవుల నాదరించి వారి నేదో విధముగ నభివృద్ధిలోనికి దీసికొనిరాగోరు దయాహృదయులువీరు. వీరిమనసు కడుమెత్తన. సజ్జనశబ్దమునకు లక్ష్మీనరసింహముగారు సరిపడిన యుదాహరణము. "మృదుళం నవనీతమీరితం నవనీతాదపి సజ్జసన్య హృత్,"


పేదవారల కెందఱకో వీరు చదువులు చెప్పించిరి. నిరుద్యోగుల నెందఱనో వాక్సాహాయ్యముచే నుద్యోగుల నొనరించిరి. వీరు కేవల కవులే కాక వీరేశలింగముగారివలె సంస్కరణాభిషులు; దేశసేవకులు. దేశమాత, మనోరమ మొదలగు పత్రికలు ప్రచురించి దేశభాషాసేవ గావించిరి. వీరేశలింగము పంతులుగారి సంస్కరణోద్యమ మందును, వారి భాషాసేవ యందును వీరి కనుపమానమగుభక్తి. సర్వవిధముల వారి యుద్యమములను క్షుణ్ణముచేసినవారు వీరే. కందుకూరివారు ఖడ్గవాదులు. చిలకమర్తి వారు కార్యవాదులు. ఇది యీ యిర్వురకును గలతారతమ్యము. 'లక్ష్మీనరసింహముగారిది యీమతము' అని చెప్పుట కష్టము. ఆయన సంస్కారవాదులగు వీరేశలింగకవిగారికి గుడిభుజముగ బనిచేసిరి. పీఠికాపుర ప్రభువులతో జెలిమి వాటించిరి. దేశనాయకుడు టంగుటూరి ప్రకాశముపంతులుగారిని గౌరవించిరి. 'అన్యుల మనమున్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు' కాన లక్ష్మీనరసింహకవిగారి నేవిషయమునను నాక్షేపించువారు లేరు.


చిలకమర్తికవి యార్జనము లక్షకు దాటినది. గ్రంథముల వలన నింతసంపాదనము చేసినవారు తెలుగువారిలో దక్కవ.


మఱియొకవిషయము 1907 లో వంగదేశమునుండి 'విపినచంద్రపాలు' అనునాతడు వచ్చి 'గోదావరీమండలమహాసభ'లో నుపన్యసించుచుండెను. ఉపన్యాససందర్భమున అశువుగ లక్ష్మీనరసింహముగా రీపద్యము చదివిరి.

భరతఖండంబు చక్కనిపాడియావు

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ

తెల్లవారను గడుసరిగొల్లవారు

పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. నాడు కొన్నినా ళ్లీగీతము చదువనివారు లేరు. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు తెల్లవారను= తెల్లవారగా, అను నర్థము చెప్పి ప్రభుత్వము నోదార్చిరి. అప్పుడే వీరిపేరు మాఱుమ్రోగినది. బహుజనముచే నాదరింపబడు కవితయే కవిత. అదియే శాశ్వతముగా నిలుచును. మన చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి పద్య మొక్కటైన కంఠపాఠము చేసికొననివారు తెలుగువారిలో నుండరు.


తుహినాద్రి మొదలు సేతువుదాక రాజ్యంబు జరిపె నీ యాంగ్లేయ దొరతనంబె, జాతిమతాచార సర్వస్వతంత్రముల్ నెఱపె నీ యాంగ్లేయ దొరతనంబె, ఇత్యాది స్తుతులతో 1895 లో చిలకమర్తి కవి పద్యములు రచించెను. ఆ చిలకమర్తికవి మఱల గొన్నేండ్లు గడచిన తరువాత నాంగ్లేయప్రచురణసంస్థవారొకరు వాచకములు వ్రాసి పెట్టుడని వేడగా "ఆంగ్లేయులు మన దేశములోనిగనులవలనను, టీ కాఫీలవల్లను, రైలుబండ్లవల్లను, మరి యితరసాధనముల వల్లను ధనమంతయు పట్టుకొని పోవుచున్నారు. తెనుగుదేశములో పుట్టి తెనుగుముక్కలు నాలుగు వ్రాయనేర్చిన మనము తెనుగుపుస్తకములవల్ల వచ్చు లాభము అనుభవించకుండ నదికూడ నాంగ్లేయులకే యీవలెనా ? నేనెన్నడు నింగ్లీషు కంపెనీలకు గ్రంథములు వ్రాసి యీయను. స్వదేశీయు లెవ రేని చేరి యొక కంపెనీ పెట్టినపక్షమున వారికి వ్రాసియిచ్చెదను. లేదా, నాకు నేనే వ్రాసికొనెదను." అని చెప్పివైచెను. ఈవిధమైన దేశాభిమానమభినందనీయము.


నవలారచనమునను, నాటకకర్తృత్వమునను, ప్రహసనపు గూర్పునను సిద్ధహస్తుడై, దీనావనదీక్షితుడై, దీర్ఘాయుష్కుడైన లక్ష్మీనరసింహకవి కాంధ్ర విశ్వవిద్యాలయమువారు మొన్న 1943 లో కళాప్రపూర్ణ బిరుదము నొసగి సముచితముగ సత్కరించిరి. ఇట్టి యీమహాకవి వీరేశలింగకవి తరువాత 'స్వీయచరిత్ర' వ్రాసికొనెను. వీరి స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్రయు-ఆంధ్రదేశచరిత్రము నన గలిగి మహోపకారకమయిన గ్రంథము.


                            ________