ఆంధ్ర రచయితలు/కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

1877 - 1923

లింగధారినియోగి. తండ్రి: వెంకటప్పయ్య. జననస్థానము: పెనుగంచిప్రోలు (కృష్ణామండలము). జననము: 1877 సం|| నిర్యాణము: 12-7-1923 సం|| విరచితకృతులు: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము (2 సంపుటలు వీరి సంపాదకత్వమున వెలువడినవి). శివాజీ చరిత్ర, హిందూదేశ కథాసంగ్రహము, మహారాష్ట్ర విజృంభణము, లక్షణరాయ వ్యాసావళి, హిందూ మహమ్మదీయ యుగములు.

లక్ష్మణరావుగారు సిద్ధహస్తులైన యాంధ్రరచయితలు. వీరు భాషాసేవకులలో బ్రథమశ్రేణిని లెక్కింపదగినవారు. 'విజ్ఞానచంద్రిక' యాంధ్ర గ్రంథమాలలలో నెంత ప్రతిష్ట గడించినదో లక్ష్మణరావుగా రాంధ్రచరిత్రోద్ధారకులలో నంతకీర్తి సంపాదించిరి. విజ్ఞానచంద్రికకు లక్ష్మణరావుగారు జీవగఱ్ఱ. ఈ గ్రంథమాలలో నీపరిశోధకునిచేయి సోకని గ్రంథము లేదు. కలకత్తా యం.ఏ.పరీక్షలో నుత్తీర్ణులైననాటి నుండియు వీరి హృదయక్షేత్రమున వాజ్మయసేవాంకురములు రేకెత్తుచు వచ్చినవి అవియే 'విజ్ఞానచంద్రిక' కు శుక్లపక్షములైనవి. ఈగ్రంథమాలలో పదార్థవిజ్ఞాన-పారిశ్రామిక-ప్రకృతి-భౌతిక-రసాయన-వృక్ష-జీవ-వైద్యశాస్త్రములకు సంబంధించినగ్రంథము లెన్నియో వెలువడినవి. ఈగ్రంథమాలలో గావ్యనాటకములకు జోటులేదు. దేశోద్ధారకులగు మహాపురుషులజీవితచరిత్రము లిందు బెక్కు ప్రకటితములు. ఆయావిషయములలో బ్రత్యేకప్రవీణులైన చిలుకూరి వీరభద్రరావు-కట్టమంచి రామలింగారెడ్డి- గురుజాడఅప్పారావు- ఆచంట లక్ష్మీపతి-అయ్యదేవర కాళేశ్వరరావు- గోటేటి జోగిరాజుపంతులు మున్నగు వారెందఱొ దీనికి గ్రంథములు వ్రాసి యొసగిరి. 'విజ్ఞానచంద్రిక' యాంధ్రి కఖండసేవజేసి యస్వర్థమైన స్మరణీయమహాసంస్థ. అప్రస్తుతమైనను లక్ష్మణరావుగారితోపాటు దీనిని సంస్తుతింపక తప్పదు.

లక్ష్మణరావుపంతులు గారికి వీరేశలింగముగారే లక్ష్య స్వరూపులు. వీరు తమరచనము సామాన్య గ్రాంథికముగ నడపించి జనబాహుళ్యము నాకర్షించిరి. కాని నాటికి, బెచ్చుపెరిగియున్న గ్రాంథికవ్యావహారిక వాదప్రతివాదసమరములో జేయిచేసికొనలేదు. ఆ తాటస్థ్యమే వీరిచే నమూల్యమగు విజ్ఞానసేవ చేయించినది. దేశభాషయొక్క సర్వతోముఖాభ్యుదయము, దేశభాషయందు సర్వశాస్త్రములు వెలువరింప వలయునన్న యభినివేశము కలిగి కొంతవఱకు గృతకృత్యుడై ననుకృతియితడు. ఆయన యభిలషించినది భాషాజీవము, భాషాస్థిరత్వము. లక్ష్మణరావుగారుకూడ గొందఱవలె దెగుదెంపులేని భాషావివాదవాగురలో దగుల్కొనినచో 'విజ్ఞానచంద్రిక' యేతరగతిగ్రంథమాలలలో లెక్కింపబడవలసియుండెడిదో!

మనభాషలోలేని శాస్త్రగ్రంథము లుండరాదనియు, నప్పుడే వాజ్మయమునకు సుస్థిరత్వము చేకూరుట కవకాశముండుననియు వీరి ప్రధానాశయము. ఈయాశయమే పంతులుగారికి బ్రబంధములమీదను, ఖండకావ్యములమీదను మక్కువ తక్కువచేసినది. ఇంతమాత్రమున నీయనకు గావ్యకళాదృష్టి గాని, కావ్యరసాస్వాదశక్తి గాని లేదనుటకు వీలుపడదు. లలిత కళలనుగూర్చి వెలువరించిన వీరి ప్రత్యేక గ్రంథము, కావ్యకళనుగూర్చిన వీరి ప్రత్యేక వ్యాసములు వీరికి గళాపరిశీలకులలో గౌరవస్థానము నీయకపోవు. కేవలకావ్యములవలన వాజ్మయమునకు శాస్వతత్వముకలుగ దని యొక యభిప్రాయము పెట్టుకొని శాస్త్రగ్రంథ రచన ప్రకటములకు జీవితమర్పించిరి.

ఆంధ్రదేశచరిత్రరచనకు శ్రీకారముచుట్టిన మహాశయుడీతడే.నీవు నాటిన విత్తు నేటికి మహావృక్షమైనది. ఈయన యేవిషయమును బొరపడియుండలేదు. పలుసారులు పరిశీలించికాని యేరచనము ప్రచురింపలేదు. కావున నీయనయక్షరములు శిలాక్షరములైనవి. పరిశోధక లక్షణములు వీరికి బూర్తిగ బట్టినవి. పత్రికల కెక్కుట, ఉపన్యాసపీఠములపై గర్జించుట వీరికి లజ్జాకరము. ఈయన సంఘసంస్కారియే కాని వీరేశలింగాదులవలె సంస్కారవాదములో బయటకువచ్చి నడుముబిగింపలేదు. రాజకీయ -సాహిత్యరంగములు రెండింటను ముందడుగువేయు స్వభావ మీయనిది. ఈయనవేషములో నొక విద్యాధికత యుండెడిది. ఆకారము స్వచ్ఛమైనది.

పంతులుగారు గౌరవకుటుంబములోని వారు. పితృపాదులు మునగాలరాజుగారి (శ్రీ నాయని వేంకటరంగారావు బహద్దరు) ముత్తవతల్లిగారియొద్ద 'దివాను' గా బనిచేసిన ప్రసిద్ధాంద్రులు. శ్రీ మునగాలరాజుగారితో లక్ష్మణరావుగారికి బెద్దనేస్తము. పంతులుగారి వలెనే రాజుగారుకూడ భాషాభిమానులు. వీ రిర్వురకు నిరంతర సాహిత్య చర్చలతో గొంతకాలము గడచినది. రావుగారిసద్వర్తనము భాషాపరిజ్ఞానము రాజుగారిమనస్సున కెక్కినవి. దానిచే వారియొద్ద నాంతరంగిక కార్యదర్శిగాను 'దివాను' గాను బనిచేయుట తటస్థించినది. లక్ష్మణరాయరంగరాయులు కృష్ణార్జునులవలె వర్తిల్లిరి. ఉద్యోగముచేయుచున్నను వీరు భాషావలోడనము వీడలేదు. మునగాలరాజువారి సాహిత్యాభిరుచి పంతులుగారి భాషాశాస్త్రపరిశోధనమునకు మీదుమిక్కిలి దోహదమొనరించె నని పెక్కురు వక్కాణింతురు.

లక్ష్మణరావుగారు స్వతంత్రాశయులు. ఛత్రపతిశివాజీకి జన్మదేశమగు మహారాష్ట్రదేశమున బంతులుగారు బాల్య కౌమారదశల గడపిరి. కపయిత్రియగు తనయక్కగారి యాదరమునను, తమబావ బండారు మాధవరావుగారి యభిమానమునను లక్ష్మణరావుగారు నాగపూరు నివాసముచేయుచు మహారాష్ట్రము మాతృభాషవలె ధారాళముగ నభ్యసించిరి. ఆభాషలో 'వీ రనేక వ్యాసములు, పద్యములు రచించినటులు తెలియును 'మౌరోపంత్‌' అనుమహారాష్ట్రకవి వ్రాసిన కర్ణపర్వమునకు మన పంతులుగారు పరిష్కర్తలుగానుండి రన్న విషయము తెలిసినచో వారికాభాషలో గల పాండిత్యము తెలిసినట్లే యగును. వీరేశలింగముగారికి వంగభాషపై నెంతయభిమానమో, మహారాష్ట్రము మీద మనలక్ష్మణరావుగారి కంతమమకారము. ఆ దేశమందలి యభిమానము వీరిచే 'మహారాష్ట్ర విజృంభణము' వ్రాయించినది. ఈయన మధ్యపరగణాలలో బి.ఏ.పట్టభద్రుడై, వంగకళాపరిషత్తులో ఎమ్‌.ఏ.పట్టము బడసిన మేధావి. సంస్కృత పరిచయము కలవాడు. మహారాష్ట్రములో మంచిప్రవేశముగల పండితుడు. ప్రాచీనులను నర్వాచీనులను సమముగా గౌరవించినలౌకికుడు, నైతికముగ తిలకుమహాశయునిశిష్యత్వ మంగీకరించిన బుద్ధిమంతుడు. నిరంతరశాసన పరిశీలనముతోను, నిరంతర చరిత్రపరిశోధనముతోను సంసారమునుమరచిన కర్మశీలి.

'ఆంధ్రబ్రాహ్మణులలోని నియోగి వైదిక భేద కాలనిర్ణయము' - 'కృష్ణరాయలనిధనకాలము' - 'ఏకశిలానగర మోరుగల్లే' - మున్నగు చారిత్రకవ్యాసములు 'త్రిలిజ్గమునుండి తెలుగుపుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలిజ్గముపుట్టెనా?' ఇత్యాది భాషావ్యాసములు-ప్రకృతి శాస్త్రము-రసాయనశాస్త్రము-కర్మయోగము-లలితకళలు-పంచాంగము-మున్నగురచనలు లక్ష్మణరావుగారి వివిధవిషయ నివిష్టబుద్ధి కౌశములను, సునిశిత విమర్శన పటుత్వమును వేనోళ్ళ నుద్ఘోషించుచున్నవి. ఎన్నడో 12వ శతాబ్దినాటి శివతత్త్వసారమును ద్రవ్వి దానికి లక్ష్మణరావుగారు వ్రాసిన పీఠికయు దత్పరిశోధనము కనుగొన్నచో వారి శక్తిబహుధా తెల్లముకాగలదు. 'లక్ష్మణరాయ వ్యాసావళి' విజ్ఞానచంద్రికా ప్రతిబింబము. 1913 లో విజ్ఞానసర్వస్వరచనోహ పంతులుగారికి గలిగినది. వారి యావచ్ఛక్తి ఆంధ్రవిజ్ఞాన సర్వస్వ సంపుటము లపహరించినవి. అది యసంపూర్ణమైనను నాయన యశస్సున కనశ్వరత్వ మీయగల కూర్పు. పంతులుగారి యెత్తుగడలన్నియు బ్రహ్మాండమును బోలునవి. వన్నుగడవన్ని పట్టుపట్టి నిర్వహించుట వీరిలో మెచ్చదగిన సుగుణము. విజ్ఞానసర్వస్వ పునరుద్ధరణమునకు మఱియొక లక్ష్మణరావు-ఇంకొక నాగేశ్వరరావు అవతరింపవలయును. ఆ యదృష్టమెన్నటికో?

ఈమహాశయు డుద్యమించిన 'ఆంధ్రీ' సంపుట సంకలనము తుదముట్టినచో దెలుగు బాసకు వెలలేని తొడవయ్యెడిది. మల్లంపల్లి సోమశేఖర శర్మవంటివా రెందఱో లక్ష్మణరావుగారి లక్ష్యమున నడచి పరిశోధకులలో బెద్దపద్దు సంపాదింపగలిగిరి. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' రచించి తెలుగున మెచ్చులుగాంచిన బండారు అచ్చమాంబగారు లక్ష్మణరావుగారి సోదరీమణి.

            ___________________