ఆంధ్ర రచయితలు/కందుకూరి వీరేశలింగకవి

వికీసోర్స్ నుండి

కందుకూరి వీరేశలింగకవి

1848 - 1919

ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. జన్మస్థానము: రాజమహేంద్రవరము. తల్లి: పున్నమాంబ. తండ్రి: సుబ్బారాయడు. జననము: 16-4-1848. నిర్యాణము: 27-5-1919. విరచిత గ్రంథముల సంఖ్య 130-ప్రబోధచంద్రోదయము, మాలతీమధుకరము, మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞానశాకుంతలము, రత్నావళి, హరిశ్చంద్ర నాటకము, సత్యరాజ పూర్వదేశయాత్రలు, వినీసు వర్తకుని చరిత్ర, రాగమంజరి, రాజశేఖరచరిత్ర, నీతిచంద్రిక, ఆంధ్రకవుల చరిత్రము, స్వీయచరిత్రము, ప్రహసనములు మొత్తము 58. ఇత్యాదులు. విపులచరిత్రమునకు వీరి స్వీయచరిత్ర (2 భాగములు) చదువుకొనవలయును.

వీరేశలింగంగారు తెలుగు వాజ్మయమున దొల్లి త్రొక్కని క్రొత్తదారు లన్నియు ద్రొక్కి యాధుని కాంధ్రవాజ్మయమునకు మార్గదర్శి యనిపించుకొనినకవి. ఆయన రచించిన గ్రంధములు నూట యిరువదికి బైగా నున్నవి."అయిదవవాచకము" మొదలుకొని "ఆంద్ర కవుల చరిత్ర" వఱకు వ్రాసినారు. నవలలకు దారిచూపినారు నాటకములు రచించినారు. కథలల్లినారు. వ్యాసములు వెలువరించినారు. ప్రహసనములు ప్రకటించినారు. గ్రంధవిమర్శలు సంధానించినారు. శాస్త్రగ్రంధములు సంతరించినారు. చారిత్రక కృతులు ప్రచురించినారు. వార్తా పత్రికలు సంపాదించినారు. విశేష మేమనగా నీ సారస్వతశాఖలకు గొన్నిటికి ద్రోవచూపినవారు, కొన్నిటికి రాచబాట వేసినవారు నైరి.

పందొమ్మిదవశతాబ్ది శేషార్ధమునుండి తెలుగున నొక క్రొత్తయుగ మారంభమైనది. దానికి గద్యయుగ మని సాధారణపు బేరు పెట్టవచ్చును. అంతకు బూర్వము వచనగ్రంధములు మిక్కిలి తక్కువ. చంపూపద్ధతిని పురాణములలో నక్కడక్కడ వచన ముపయోగింపబడినది. ప్రబంధములలో వచనము ఛందోనిర్బంధము లేనిపద్యములవలె నడిపించిరి. ఇంతియేకాని ఇతిశ్రీ గా గద్యము గలగ్రంధములు 17 వ శతాబ్దిలో మధురా పరిపాలకుడైన విజయగంగ చొక్కనాధుని కాలము నుండి కాని బయలు దేఱలేదు. మధురాంద్ర వాజ్మయములో బుట్టిన వచనరచన లన్నియు బౌరాణిక గాధాగ్రధితములు. పోనీ, కృష్ణమిశ్రుని ప్రబోదచంద్రోదయ నాటకమును నంది మల్లయ్య, ఘంట సింగన కవులు ప్రబంధముగా మార్చిరిగాని నాటకము నాటకముగా నాంధ్రీకరింపలేదు. "విద్దసాల భంజిక" ను మంచనకవి "కేయూరబాహు చరిత్ర" కావ్యముగా మార్చెను. ప్రాచీనాంధ్రకవులకు వచనములపై గల యుపేక్షాభావమున కిది నిదర్శనము. క్రొత్త తీరుగల చిన్నయసూరి "నీతిచంద్రిక" తెలుగున మొట్టమొదటి వచనగ్రంధము. చిన్నయ్యసూరి వేసిన వచన వాజ్మయబీజమును వీరేశలింగం పంతులుగారు మొలపించి వెలయజేసిరి. వీరేశలింగముగారి రాజశేఖరచరిత్రకు గోపాలకృష్ణమసెట్టి "రంగరాజుచరిత్ర" తో బోలికలు గలవని యొకరు చూపించిరి. అగుగాక! తిక్కన కవిబ్రహ్మ యనునట్లు పంతులుగారు గద్యబ్రహ్మ. సూరి నీతిచంద్రిక తరువాత సుప్రసన్న భాషలో వీరేశలింగముగారు సంధివిగ్రహములు వ్రాసిరి. వీరిశైలి సుమధురము సులభమునై సర్వజనగ్రాహ్యముగా నుండును. సంధులచ్చ టచ్చట సడలించినను రచనలో మాధుర్యమునుమాత్రము తొలగించలేదు. అన్య దేశములు కొన్ని యుపయోగించినను నందము చెఱుపలేదు. ప్రజాసామాన్యమున కర్ధము కావలయుననియు సంఘసంస్కార ప్రచారార్ధమనియు వీరిశైలి తేలిక పఱుచుకొనిరి. వీరి రాజశేఖరచరిత్రము, సత్యరాజా పూర్వదేశయాత్రలు ఆంగ్లేయరచనలకు ఛాయలైనను స్వతంత్ర రచనములవలె నుండి నవలలకు దారి చూపినవి. వీరేశలింగము పంతులుగారు వచనములో నొకవిలక్షణత వెలయించిరి.

ఇక నాటకముల మాట యోచించినచో నివి యింతకు బూర్వము తెలుగున లేవు. యక్షగానములుమాత్ర మున్నవి. కాళిదాసకృత శాకుంతలము పంతులుగా రనువదించి 1883 లో నావిష్కరించిరి. అది మొదలు వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతులు పదిమందివఱకు నా నాటక మెవరిశక్తికొలది వా రాంధ్రీకరించికొనిరి. వీరేశలింగముగారి ఆంధ్రశాకుంతలము రంగస్థలములకెక్కి యనేకులచే నభినందింప బడినది.

చల్లనివై శ్రమం బడవజాలిన తామరపాకు నీవనల్
మెల్లన గొంచు వీచుదునో మిక్కిలిశీతలమైన నాయువుల్
సల్లలితారుణాబ్జ సదృశంబగు నీచరణద్వయంబు నో
పల్లవపాణి! నాతొడలపై నిడి హాయిగ బట్టువాడినో?

కొందలమందెడెందము శకుంతల తానిపు డేగునం చయా
క్రందుగ బాష్పరోధమున గంఠమునుంజెడె, దృష్టిమాంద్యముం
బొందె నొకింతపెంచిన తపోధనులే యిటుకుంద నెంతగా
గుందుదురో తమంత గనుకూతుల బాయు గృహస్థులక్కటా!

ఇత్యాది పద్యములు తెలుగున మఱుమ్రోసినవి. శాకుంతలమేగాక ప్రబోధచంద్రోదయము, మాళవికాగ్నిమిత్రము, రత్నావళి మున్నగు నాటకము లాంధ్రీకరించిరి. ఆంగ్లేయనాటకముల బట్టి చమత్కార రత్నావళి, కల్యాణ కల్పవల్లి, రాగమంజరి అనువానిని రచించిరి. ప్రహ్లాద దక్షిణగోగ్రహణాది పురాణ నాటకములు వ్రాసిరి.

పంతులుగారు కృతికర్తలేకాక, ప్రాచీనమహాగ్రంధముల నెన్నిటినో ముద్రింపించిన భాషాపోషకులు కూడను . నాచనసోమనాధుని యుత్తర హరివంశము, అనంతుని భోజరాజీయము, చఱిగొండధర్మన చిత్రభారతము, నందిమల్లయ, ఘంట సింగయకవుల వరాహ పురాణము, నారాయణకవి పంచతంత్రము, కాకమాని మూర్తి పాంచాలీ పరిణయము,మొల్లరామాయణము మున్నగు కబ్బములకు వీరేశలింగము పంతులుగారే తొలుత నచ్చు వెలుగు చూసి పున్నెము గట్టుకొనిరి.

వీరేశలింగముగారికి దొల్లి తెలుగులో ప్రహసనములు లేవు."చంద్రరేఖావిలాసము" వంటి తిట్టుకవితలు మాత్రము గలవు. సంస్కృతమున జాలనున్నవి. ప్రహసననిర్మాతలలో పంతులుగారే ప్రథములు."ఆచారము" అను ప్రహసనములో చేదస్తపు చెలమమ్మమాటలు కొన్నిమచ్చు:

"నీవు అదృష్టవంతురాలవు గనుక నొక్కమోస్తరుగా ఆచారం జరుపుకుంటున్నావు. నాకు నీలాగుజరుగదు అక్కడికి నేను రోజుకు రెండు వందలస్నానాలు చేస్తాను. ఈవేళ మట్టుకు ఇప్పటికి పదిస్నానాలు చేసినాను. తెల్లవారిలేచి దొడ్లోకివెళ్ళినప్పుడు కాలికింద యేమో మెత్తగా తగిలి అది యేమిగుడ్డో అని తలనిండా స్నానముచేసినాను. తరువాత మాకోడలు దగ్గరనుంచి వెళ్ళినప్పుడు పైట కొంగు తగిలినట్టు అనుమానం కలిగి మళ్ళీస్నానము చేసినాను. గోదావరికి వెళ్ళి స్నానముచేసి బిందె ఎత్తుకొని వస్తూ బట్టలు వుతుక్కునే వాళ్ళ నీళ్ళుపడ్డట్టుతోచి మళ్ళీవెళ్ళి ములిగినాను. తీరా వడ్డుకు వచ్చేటప్పుడు నీళ్ళలో కాలికేదో ఆకుతగిలి అంటతప్పెళాలు తోమెవాళ్ళు వేసిన అంటాకని నీళ్ళుపారపోసి వెళ్ళి మళ్ళీ స్నానం చేసినాను. తరువాత బిందెత్తుకొని సఘం దూరం వచ్చేటప్పటికి ఇరవైగజాల దూరంలో మాలవాడు కనబడి నీళ్ళు నడి వీధిలో పారపోసి వాణ్ణినాలుగు తిట్టి వాడిజివానికి ఉసూరుమంటూ మళ్ళీ వెనుకకు గోదావరికి వెళ్ళి స్నానముచేసి నీళ్ళు తెచ్చుకున్నాను......ఎన్నిస్నానాలయినవో లెక్క పెట్టినావా" ఈయన మొత్తము--ప్రహసనములు కూర్చిరి. అందు పదునాల్గు పెద్దవి. వీరి ప్రహసనభాష సొగసుగానేయుండును. స్వాభావికత కొంతతక్కువ.

వీరు"తర్కసంగ్రహము" నకు జక్కని తెనుగు వ్రాసిరి.జ్యోతిశ్శాస్త్రము--శారీరశాస్త్రము ననువదించిరి. ఆంగ్లేయభాషలో నుండు భౌతికశాస్త్రము లాంధ్రీకరించుత్రోవ పంతులుగారే చూపిరనవచ్చును.

జీవితచరిత్రరచనమునకు దెలుగున సూత్రము వేసినవారు వీరేశలింగము పంతులుగారే. వేమభూపాలీయ రఘునాధాభ్యుదయాదులు సంస్కృతములో వెలసినవి. దానిలో గవితకున్నంత ప్రాధాన్యము చరిత్ర మునకు లేదు. ఆంధ్రమున రామరాజీయాదులు రెండుమూడు చారిత్రకకృతు లున్నవి. ఇవియు లిట్టివే. ఆంగ్ల సంప్రదాయము ననుసరించి పంతులుగారు తొలుత విక్టోరియా మహారాణి చరిత్రము. జీవసుచరిత్ర తెలుగులో వెలయజేసిరి.అక్కడనుండి యనేక జీవితచరిత్రలు చిత్రింపబడినవి. "స్వీయచరిత్ర" రచనారంభము చేసినవారును వీరే. ఇది 1910 లో వెలువరింపబడినది. పంతులుగారి చిన్నతనమునుండియు గలచరిత మందు సమగ్రముగా రాయ బడినది. సూక్ష్మాంశములు కూడ విస్మరింపక వీరీ చరిత్రము సంధానించిరి. ఇది వీరిమేధాబలమునకు బలకరమగు నిదర్శనము ఈచరిత్రము చదువునప్పుడు సమకాలికులకు నాత్మస్తుతిగాను పరనిందగాను నున్నట్లు కొన్ని పట్టుల గోచరించును. ఈ విషయమే పంతులుగారు తొలుత బేరుకొనిరి. ఈ పంత్తు లరసిన వారిస్వరూప,స్వభావాదులు తెలియును.

"ఎక్కడ నేయక్రమము కనబడినను నాది సహించి యుండెడి స్వభావముకాదు ఆయక్రమమునకు ప్రతిక్రియ జూచువఱకును నామనస్సున కూఱట కలుగదు."

"ఈశ్వరుడు నాకు వేగముగా వ్రాయుశక్తిని ప్రసాదించియున్నాడు. పద్యమునుగాని, వచనమునుగాని నేనొక సారియే వ్రాయుచుందును. వ్రాసినదానిని మరల దిద్ది వ్రాయుట నాకలవాటులేదు. అందు చేత నావ్రాత దిద్ది దిద్ది మరల మరల వ్రాయుచుండువారి దానివలె నంత మెఱుగుగా నుండదనుకొనెదను.

"ఏకసంధాద్విసంధాగ్రాహుల కుండుబుద్ధివిశేషము కొంతకలవాడ నగుటచేత నేనింటనుండి పాఠశాలకు బోవుచు నొకసారియో రెండుసారులో దారిలో బాఠము చూచినంతమాత్రముననే నాకది ముఖస్థమై యప్పటికి దప్పులేక యప్పగింపశక్తుండ నగుదుంటిని."

స్వయముగా దమచరిత్రము తామే వ్రాసికొనుటచే నీపై మాటలు స్వాహంకారపూరితములుగా స్థూలదృష్టికి దట్టును. కాని యధార్థ మరసినచో వీరేశలింగకవి యట్టివాడే. అద్యతనాంధ్రవాజ్మయములో ననేకనూతన మార్గములు వేసి శతాధికకృతులు రచియించి యఖండ కీర్తి నార్జించిన యీకవివరుని యెడ ఏకసంధాగ్రాహిత్వాధలక్షణము లుండుననుట స్వభావోక్తికి దవ్వుగానిమాట.

అచ్చ తెనుగు కృతులు రచించుటలో వీరేశలింగకవిది గొప్పచాతుర్యము. ఈయన శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచననైషధము ప్రసిద్ధమైనది. బిల్వేశ్వరీయములో కొక్కొండ వేంకటరత్న పండితుడు పంతులుగారి నిటులు కొండాడినాడు:

అచ్చ తెనుగు గబ్బ మలవరించుట కూచి

మంచి తిమ్మనయను, మంచి తెలగ

నయును, లింగనయును నయమున స్వీయభా

షాభిమాన మాన్యు లని నుతింతు.

తిమ్మనార్యుడు, తెలగన్నలతోపాటు వీరేశలింగకవి కూడ అచ్చ తెనుగు గబ్బములు కూర్చుటలో దిట్ట.

ఇక గవిచరిత్రరచనము ప్రచురము చేసినవారును పంతులుగారే. శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు ఆంగ్లేయుల ననుసరించి తొలుదొల్త దెలుగున కాంధ్రకవిజీవితములు వ్రాసిరి. దానితరువాత వీరేశలింగకవి గారు "ఆంధ్రకవులచరిత్రము" మూడు భాగములుగా వ్రాసిరి. శ్రీరామమూర్తి గారి గ్రంధము కంటె నిది పెద్ద గ్రంధము. దానికంటె దీనిలో జారిత్రక చర్చ మిన్నగా నున్నది. కవికాలనిర్ణయాదులు లెస్సగనిందు గూర్చిరి. కవుల గ్రంధములలో గుణదోష వివరణము గావించిరి. ఈ గ్రంధము వీరేశలింగముగారి శక్తి సామర్థ్యములను జాలభాగము చూరకొనినది. వీరు కొందఱు కవులనుగూర్చి వ్రాసిన కాలనిర్ణ యాదులకు నవీను లంగీకరింపలేదు. ప్రధమ ప్రయత్నమున నిది యాక్షేపణీయము గాదు. పంతులుగారనంతమగు భాషాసేవచేసిన మహాశయులు. సంఘ సంస్కరణప్రియులును. స్త్రీ పునర్వివాహకరణోద్యమమునకు బరిపుష్టి గావించిరి. ఈవిషయమున వీరు పెద్దప్రచారము గావించిరి. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారికిని వీరికి బహుకాలము వివాద మీవిషయమున సాగినది. ఇది యాంధ్రమునకు బరిచితము.

వీరేశలింగముగారు పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నల వాటుకలవారు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండువారు. ఈయనకలమునకు మొగమోటమి యనునది కలలోనైనలేదు. సంఘాచారములకు వ్యతిరేకమై పెద్దలకు బ్రతిషాభంగము కలిగించి యీయన వ్రాత యభియోగముల కెక్కినది. కాని యీయన సత్య వాదిత విడువలేదు. చివరికాలమున నవనిందల బాలయ్యెను. చెలికాండ్ర సహవాసము వీడవలసివచ్చెను. ధనవ్యయ మయ్యెను. ఆరోగ్యము చెడెను. ఎట్టిక్లిష్టపరిస్థితులు తటస్థించినను కర్మకూరత్వము సత్యవాదిత్వము విడునలేదు. ఈయన వాజ్మాధుర్యముకంటె వ్రాతనేర్పు గొప్పది. వీరేశలింగంపంతులు వంటి దీక్షాపరుడు, కర, శూరుడు, ధైర్యవంతుడు, కార్యదక్షుడు, స్వార్దత్యాగి, స్వతంత్రుడు ఆంధ్ర మహారచయితలలో లేడు. ఉండడు.