Jump to content

ఆంధ్ర రచయితలు/ఆదిభట్ట నారాయణదాస కవి

వికీసోర్స్ నుండి

ఆదిభట్ట నారాయణదాస కవి

1864 - 1945

పేరూరు ద్రావిడ శాఖీయ బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. తల్లి: లక్ష్మీ నరసమాంబ. తండ్రి: వేంకటచయనులు. జన్మస్థానము: అజ్జాడ గ్రామము. నివాసము: విజయనగరము. పుట్టుక: 1864 ఆగష్టు 31 వ తేదీ. నిర్యాణము: 1945 జనవరి 3 వ తేదీ. ముద్రిత గ్రంథములు: హరికథలు:- 1. జానకీశపథము 2. రుక్మిణీ కల్యాణము 3. అంబరీష చరిత్రము 4. హరిశ్చంద్రోపాఖ్యానము 5. భీష్మచరిత్రము 6. గజేంద్ర మోక్షము 7. మార్కండేయోపాఖ్యానము 8. ప్రహ్లాద చరిత్రము 9. సావిత్రీ చరిత్రము 10. ధ్రువోపాఖ్యానము 11. యదార్థ రామాయణము 12. భగవద్గీత [వేల్పుమాట] శతకములు:- 13. రామశతకము 14. శివశతకము 15. ముకుంద శతకము. 16. మత్యుంజయ శతకము 17. సూర్యనారాయణ శతకము 18. సత్యవ్రత శతకము 19. నూరుగంటి 20. వేల్పువంద 21. బాటసారి [కావ్యము] 22. నవరస తరంగిణి (షేక్సుపియర్, కాళిదాసకవుల కవిత్వపు సొగసులు విమర్శించునది) 23. పురుషార్థబోధిని 24. ఉమర్ ఖయామ్‌ (పారశీక కృతికి సంస్కృతాంధ్రములలో పరివర్తనము) 25. బుక్సం గ్రహము (తెలుగులో సంగీత కృతి) 26. వెన్నుని వేలుపేరుల వెనుకరి (విష్ణుసహస్రనామ సంకీర్తనమునకు దెలుగుసేత) సంస్కృతభాషలో:- 1. కాశీ శతకము 2. రామచంద్ర శతకము 3. శ్రీకృష్ణ కథామృతము (సంస్కృతభాషలో హరిగాథ) 4. తారకమ్‌ (కావ్యము)

ప్రఖ్యాతపురుషుల జాతకములు బహువిచిత్రముగ నుండును. సాధారణముగ జిన్ననాట బడరానిపాట్లు పడినవారు పెద్దతనమున విడుపు లేని విభవము లనుభవించుట చూచుచున్నాము. విశ్వఖ్యాతి నార్జించిన నేటి దేశనాయకుల, నేటి మహాకవుల, నేటియుత్తమపురుషుల జీవిత చరిత్రములు చదివికొన్నచో మన కీవిషయము నిస్పష్టమగును. ఆదిభట్ట నారాయణదాసుగారి నెఱుగనివారు తెలుగువారిలో నుండరు. ఆయన హరికధాకధనమున కాద్యబ్రహ్మ, సంస్కృతములో, ఆంధ్రములో, ఆంగ్లములో నాయనయందె వేసినచేయి.ఎన్నోభాషలయం దద్బుతముగా గవిత చెప్పెను. ఎన్నో భాషలయం దనన్య సామాన్యముగా హరికధలు పాడెను. ఆంద్రదేశీయు లేకా, యన్య దేశస్థు లెందరో నారాయణ దాసుగారిని బ్రహ్మరథము పట్టిరి. అట్టి మహాశయుని చిననాటి మనుగడను గూర్చి యాలోచించినచో నేణాశ్చర్యపడుదుము, దాసుగారిది సిరిగల కుటుంబముకాదు. తండ్రి వేంకట చయనులుగారు శ్రౌతస్మార్తములు దిట్టముగా వచ్చిన లబ్దవర్ణులు. ఆయనకు గల యైదుగురు పుత్రసంతానములోను కడపటివాడు నారాయణదాసు. పై పలువురు సోదరులు నేదోరకముగా విద్యావంతులై ప్రయోజుకు లయిరి. కడకు కడపటి సంతతి ప్రయోజకతనుగూర్చి తల్లికి వెఱపు. పసినాటనే తండ్రి నెడబాసిన కొడుకును తల్లిగారు లక్ష్మినరసమాంబ బుజ్జగించి యుగ్గుబాలతో భాగవతతత్త్వమును బోధించినది. ఒకముచ్చట చెప్పుకొందురు. 'గుంప' యను శివక్షేత్రమున శివరాత్రికి గొప్పతీర్థముజరుగును. ఆతీర్థమునకు దల్లితో నారాయణదాసు ప్రయాణమాయెను. బండి యెక్కి తల్లీ కొడుకులు వచ్చు చుండగా బుస్తకములమ్ము నంగడి పసిదాసు కంటబడెను. ఆదుకాణములో పోతనగారి భాగవతము బొమ్మలతో నున్న ప్రాతప్రతి యుండెను. అదిచూచుసరికి నారాయణదాసు తనయొడలు గగుర్వొడున, వెంటనే బండియుఱికి సాహుకారునొద్దకుబోయి యా భాగవత మర్థించెను. ఆసాహుకారిపేరు దాసుగారి చరింత్రములో బంగారునీట వ్రాయదగ్గ "రంగయ్య" యని అతడు "పసివానికి నీకు భాగవత మేలనయ్యా" అని వెటకారముచేయుట తల్లి బండిలోనుండి విని, "కాదు, వాడు చదువుకొందమని యభిలాషతో నడిగె నోయీ" యని సమాధానము చెప్పెను. వర్తకుడు భాగవతము తీసి బాల నారాయణదాసును బఠింపుమనెను. అతడు గణగణ తడువుకొనకుండ రాగధోరణలో జదివెను. ఇటులే మఱొకఘట్టము, మఱొక ఘట్టముగా సాహుకారు పిల్లవానిచే జదివించి విని బ్రహ్మానందపడి, భాగవతపు బ్రతియేకాక మరియొక యైదురూపాయ లుపాయనముగా గూడ వానిచేతిలో బెట్టెనట. ఆబేహారి 'రంగయ్య' పేరు వేఱొకతూరి స్మరించు కొందము. పసినాట మాతౄపదేశము, భాగవతసందేశము గుండియలకు బట్టించుకొనియే నారాయణదాసు క్రమముగా కళాప్రపూర్ణుడై వాసికెక్కినాడు.

దాసుగారికి సహజముగ నాటపాటలయందు మేటి యాసక్తి మోసులెత్తినది. అయిదాఱేండ్ల యీడునకే కళాబీజములు పొటమరించినవి. విజయనగర మహారాజుగారి రాజకీయాంగ్ల పాఠశాలలో నాంగ్ల విద్యాభ్యాసమునకు విఘ్నేశ్వరపూజ జరిగినది. ఆనాటికి వీరివయస్సు పదునాఱు సంవత్సరములు. 1886 లో 'మెట్రికులేషన్' పరీక్షయందు నెగ్గి ఎఫ్.ఏ. విశాఖపట్టణము ఏ.వి.యన్ కళాశాలలో జదువుకు మొదలిడిరి. 1888 సం|| ఎఫ్.ఏ పరీక్ష వీరిని తప్పించినది. అంతతో దానికి స్వస్తి. నిర్బంధపఠనము వదిలిన పిదప ఆంగ్లములో నెన్నో మెలుకువలు, మఱుగులు గుర్తించుటయేగాక పారసీకము, అరబ్బీ, ఉర్దూ, సంస్కృతము చదివి తన పాండితికొక క్రొత్తవన్నె తెచ్చుకొనెను.

తొలుతనే ముచ్చటించవలసిన విషయమొకటి యిప్పుడు జ్ణప్తికి వచ్చుచున్నది. అసలు, తల్లిదండ్రులిడిన నామకరణమువీరికి 'సూర్యనారాయణ' యని. "నారాయణదాసు" అనుటయేకాని యాపేరు చాలామంది యెఱుగరు. వారిబంధుకోటిలో మాత్రము 'సూరన్న' యని పిలుచుట వాడుక. 'దాసు' అనునుత్తరపదముతో గూడిన వ్యవహారము 1886 సం|| నుండి తెలుగునేలలో మంచి ప్రచారములోనికి వచ్చినధ్మి నారాయణదాసుగారి 'హరికధా' కల్పవృక్షమునకు బ్రాకుడుగొను యైన జయంతి కామేశము గారిని తలపోసికొనవలసియున్నది. ఆయన బరంపురం నివాసి. దాసుగారి తొట్టతొలిహరికథకు సన్మానముచేసి, ప్రోత్సహించిన మహోదారుడాయన. అదియాది, మైసూరు సంస్థానములోనేకాక, పిఠాపురము, ఉర్లాము, చీకటికోట, కిర్లమపూడి, మందసా, సిరిపురము, లక్షీనరసాపురము, సంగెడిగూడెము, నూజవీడు, వేంకటగిరి మున్నుగా నెన్నో దేశ సంస్థానములలో వీరి కఖండ సత్కృతులు జరిగినవి. మైసూరు సంస్థానమునకు వీరువెళ్ళినప్పటి ముచ్చట చెప్పవలసియున్నది. నారాయణదాసుగారి అన్నగారు సంగీతజ్ణలు ఈయన యభివృద్ధికి గొంతకారణ మాయన్నగారేయని కొందరు చెప్పుకొందురు. ఆయన గాత్రము సన్నవిడిది. నారాయణదాసుగారిది చెప్పనక్కరలేదు. బ్రహ్మాండమంతగొంతు. తమ్మునివెనుక నన్నగారు సహకారగానము చేయుచుండు నలవాటు. మైసూరు వీరిరువురును వెళ్ళిరి. సంస్థాన విద్వాంసుల పరీక్షల కాగినగాని ప్రభుదర్శనము కాదు. మొత్తముమీద బెక్కునాళ్ళకు దివాణములోని గాయకులు వీరిపాట వినుట కేర్పాటు చేసిరి. కొమ్ములుతిరిగిన పండితులు కూర్చుండి, నారాయణదాసుగారిని, వీణవాయించుటకును, వారియన్నగారిని పాటపాడుటకును నియమించిరి. ఇది బొత్తిగా రక్తి కట్టలేదు. అపుడు దాసుగారు "తానుపాడెదనని, అన్నగారు వీణవాయించు" నని చెప్పి గొంతెత్తెను. ఇక బట్టబగ్గములులేవు. కొంతదూరములో బచారు చేయుచున్న మహారాజు చెవిలో నమృతవర్తి వలె నారాయణదాసుగారి కంఠస్వరము చొఱబడినది. ఆశ్చర్యపడి, ఆయన తిన్నగావచ్చి స్వయముగా దాసుగారి విషయమడిగి తెలిసికొని యభినందించి బహుమానించెను. అది దాసుగారికి మైసూరు గాయకుల యెదుట, పండితుల యెదుట నొక జయధ్వజ ప్రతిష్ట. మైసూరు వృత్తాంతము పత్రికలలో జదివి విజయనగరము మహారాజు ఆనందగజపతి నారాయణదాసును గుర్తించి, కానిపించుకొని సంస్థాన విద్వాంసునిగా జేసెను. ఈయనకు మహాకవిగా రావలసినపేరు హరికథకుడుగా వచ్చినది. హరికథా కథనములో వీరికి జెప్ప దగిన శిష్యులు నేతి లక్ష్మినారాయణ, వాజపేయయాజాల సుబ్బయ్య, చొప్పల్లి సూర్యనారాయణ మున్నుగా బెక్కురున్నారు, వారెల్ల గురువుల స్మరణకు దెచ్చు హరికథాకేసరులు. నారాయణదాసుగారు ఆడువారు మగవారు కలిసి గజ్జెకట్టు మరాఠీ హరికథా విధానమును మార్చి మన దేశపద్ధతిలో గ్రొత్తమెఱుగులు కలిగించినారు. ఆయన త్యాగరాజువంటి భక్తుడు. సరిగా, త్యాగరాజు జయంతి నాడే దాసుగారు పరమపదము చేరుట మరచిపోరాని ఘట్టము. అదియటుండ, ఈయన జీవితము తిరుపతి వేంకటకవుల జీవితముతో గొంత పోలియుండుట మనము గమనింతుము. కవిత్వముపేరు చెప్పుకొని వారు ప్రతిసంస్థానము, ప్రతిగ్రామము చూచినారు. హరికథల పేరుచెప్పుకొని నారాయణదాసు చూడని సంస్థానము, చూడని పురములేదు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికి నేడు కవిత్వము చెప్పువాడెల్ల శిష్యుడు. నారాయణదాసుగారికి నేడు గజ్జె కట్టినవాడెల్ల శిష్యుడు. ఈయిరువురికి సాక్షాచ్చిష్యులో, పరంపరాశిష్యులో, ఏకలవ్య శిష్యులో కానివారు తెలుగువారిలో నెందఱుందురు? చెళ్ళపిళ్ళకవిని స్మరింపక శతావధానము, నారాయణదాసును స్మరింపక హరికథా లే దన్నట్లుగా నున్నది. నారాయణదాసు పండితులలో బండితుడు, కవులలో గవి. గాయకులలో గాయకుడు. ఆయన నేటి సాధారణదాసులవలె మాటలు, పాటలు నోటబట్టుకొని చెప్పవలసిన ప్రారబ్ధయోగము కలవాడు గాడు. అశువులో నప్పటి కప్పుడు చెప్పుటయే యాయన యలవాటు. పరవాదులతో భాషించునపుడు, అంత నిర్బీతి, అంత స్వపక్షస్థాపనప్రీతి కలవారరుదుగానుందురు. నారాయణదాసు జీవితము మదపుటేనుగు మనుగడ. ఆ భోగ త్యాగములు వేఱొకనికి సాగుట కష్టము. వీరు విజయనగరము మహారాజుగారి గానకళాశాలలో 1913 లో బ్రధమాచార్యులుగా బ్రవేశించి 1936 వరకు సక్రమముగా నిర్విహించిరి. నాడు అధ్యాపకులుగనున్న శ్రీ ద్వారము వేంకటస్వామినాయుడు గారు--ప్రధానాచార్యులు. ఇపుడీ పయి ననుకొన్న విషయమంతయు ఆదిభట్ట నారాయణదాసుదారి జీవితములో నొక కళాభాగము. ఇక నామహాకవి రచనా విశేషములు:-

అచ్చ తెలుగు పొలుపులు నారాయణదాసునకు దెలిసినంతగా మరియొక యాధునిక కవికిగాని, ప్రాక్తన కవులయిన కూచిమంచి తిమ్మన, మున్నయినవారికి గాని తెలియవని చెప్పివేయుటకు దఱచుగా సాహసము కలుగుచుండును. అబ్బా! తెలుగుపై నెంత నిబ్బరపు బ్రేముడిగల వ్యక్తి నారాయణదాసు!

గీ. మొలక లేతదనము, తలిరుల నవకంబు,
మొగ్గ సోగదనము, పూవుతావి,
తేనె తీయదనము తెన్గునకే గాక
పరుష సంస్కృతాఖ్య భాష కేది?

సంస్కృతములో నీయన కవిత బహుమనోహరముగా నుండును. 'ఉమరుఖయ్యాము' సంస్కృతాంధ్రములలో ననువదించి "ఫిడ్జిరాల్డు" ఆంగ్లముతో, పారశీకమూలముతో వెలువరించిన వీరికృతి తెలుగు వాజ్మయములో సుస్థిరముగా నిలబడునది. దాని తెనుగుపీఠికలోని యీభాగము పరికించుట యవసరము. ఈ మహాకవి తెనుగు వచనరచన సొంపుల కది మహోదాహరణము కాగలదు.

"ఉమరుకయ్యా మల్లిన మాటవన్నికంబట్టి యామేటి మాటకారి చదువరి వేల్పుల నెఱింగించుటకై పన్నిన గుడిబొమ్మలవలె వేల్పునెడ నెఱకువగలవారి కుండదగిన తగులే వెఱ్ఱ్నీళ్ళనియు వేల్పున్మత్తఱుల వేడుకొను తలంపే యక్కలు ద్రావించుమిటారి యనియు న్బిన్న పెద్ద లిరువురుకున్గూడ మిగుల గొప్పదని పుట్టించుచు జేయున దొకటి చెప్పునదింకొకటియున్గా లేనిపోని వాలకముల దాము నలచిన కూడు గూర్కుల దమతోటిపాటివారి నందఱం జెఱచియున్దామొక్కరే హాయిగానుండంగోరి పెద్దల నడువడికింగనెంతయు న్బెడదారి ద్రొక్కమని గోటునందెగనీల్గుచు బ్రాజదువుల బిక్కపెట్టి గ్రుడ్డెద్దు చేల బడునట్లు ఱువ్వి రోలుచు లోలోన జెడుపను లెన్నెన్నో చేయునాలి ముచ్చు పొగరు బోతులపరువు బయలుపెట్టి తనతోటిపాటివారికి మంచివెరవు నేర్పుటయే యని నాచేత వెల్లడింపించు నాయిలువేల్పు ప్రొద్దు న్గొని యాడుచు నుమరు కయ్యాము పద్దియమ్ములకు వివరముగా నాయల్లిన యీ తెలుగు పద్దెముల న్వేల్పునుడి జోలినంతయును లేని నాటు పాటి మాటలతోడనే యిదివఱకే మాటలల్లువారు న్గూర్ప దొరకన దెగింపని పట్టుదల న్టొంటి పెద్దలనుడివడికట్లొక్కింతయు న్దప్పకేరికైన నిట్లిపారసి నుదుల వివరించు నాటుమాటలం బన్ననిక నలవికాని తెన్నుపంగూర్ప గల్గితినని చాటుచు మఱియు మొట్టమొదట వెగటుగా దోచిన దిను సైనం జవి చూచినకొలంది నలవాటుమై నింపుగాక మానదు కనుక నోర్మిగల మంచి చదువరుల కీ నాపన్నిక కొనముట్ట నా రనసికొలది జవిగొల్పక తీరదను నిండునమ్మిగ నింతతో నీప్రాంత ముగించు నాడను"

అచ్చ తెనుగు రచన యింతస్వాధీనము చేసికొన, రచయితలు చాల దక్కువగా నుందురు. వచనమేకాక పద్యము కూడ హాయిగా సోయగ గా నడపించునేర్పు నారాయణదాసుగారితో బుట్టినది 'ఉమరుకైయాము' లోనివే కొన్ని సంస్కృతాంద్ర పద్యోదాహరణము లీయకుండ నుండ గూడదు.

గీ. నడికారునకు న్జేలకు
నడుమ వలరు తోటలోన నా విడదట సం
దడి లేదు కొద్దిగొప్పల
గొడవ మఱి బ్రదుకు కోరుకొన్నటు కడచున్.

ఆ .వె. పట్టనీ పొటేలు చట్ట సైదము రొట్టె
కోలుబుడ్డిలాలు కోపుమడ్డి
నేను నీవు చాటుగా నెనసిన వేడ్క
దొరకుటెట్టు లెట్టిదొరలకైన.

చె. ఏటియొడ్డున జివురెత్తిన బీడు
వేలుపునడుచు మోవిన్బుట్టె ననెదు
త్రొక్క గూడదు కాలితో నిద్దిచెల్వ
చిన్నారి పొన్నారి చెక్కిలినిగ్గు.

క. ఏరు న్మారన నేరక
యూరక యున్నార లెవ్వరో పల్కె ని-
రౌరా దూరకుడీతా
నారయ కావేల్పు గూడనై పొనరించున్.

శ్లో. భూతకాల పరోక్షోస్తి భావికార్య మనిశ్చితమ్‌
వృధా గతా నాగతయో శ్చర్చా పిబపిబాపిబ
అనంబద్ద శ్చేతనో-యం జడప్రకృతితో నత
స్వతంత్రస్య తథాప్యన్య వృథాకర్మ విధీయతే.
యావత్సితృ గృహం గచ్చే త్స్వం శనై: ప్రాణవల్లభే
తావ దేవాను సృత్యత్వాం సాయుజ్య పదవీ మియామ్‌.

ఈతీరుగల సంస్కృతాంధ్ర కవితలు సంతరించు నారాయణదాసు మహారచయితలలో రచయిత. వీరి "తారక" కావ్యము, పరికించి Gildner అను ప్రొఫెసరు Marburg నుండి పంపిన యీ యభిప్రాయము ప్రకటింపదగియున్నది.

జానాతే యన్న చంద్రార్కౌ జానతేయన్న యోగిన:
జానీతే యన్న భర్గో-పి తజ్జానాతి కవిస్స్వయం.
వచ స్సుధామయం కావ్యం పీత్వాహం తృప్తమానస:
కృతజ్ఞభిప్రశంసామి భవంతం కవిశేఖరం.

దేశీయ స్వదేశీయ పండితులచే మెప్పులుగాంచిన నారాయణదాసు కవిత్వము తెనుగు వాజ్మయమున కొక మేలివెలుగు. ఆయన యాట పాటల వేవెలుగు నెదుట కొన్నాళ్ళు కవిత్వము కాగడావలె గాంతి హీనముగా నుండిపోయినది. ఇపు డది విద్యుద్దీపిక. ఆధునికకాలములో నచ్చ తెనుగున కొక యుజ్జ్వలతనిచ్చు రచనకు నారాయణదాసుది యమృతభిక్ష. ఆమహాకవి సర్వభాషాప్రవేశమున కీసీసము సముదాహరణము.

-: పీఠికాపుర వర్ణనము:-

     సంస్కృతము
భ్రాజతేకుక్కటేశ్వర మాధవాలయాభ్యాం ఘనారూడసౌధాంతరేణ
     పార్శి
హాసిల్ హమీష జహాన్ తాజ్ నమూన బి హష్మత్త్ముసా పిర్చి హి రిసాల
     ఇంగ్లీషు
రావుసూర్యారావు రాజాబహాదుర్ది చారిటబిల్రూల్స్రెజెంట్స్ ఎరన్రి
     తెలుగు
చదువుల పుట్టిల్లు చల్వతెమ్మరజల్లు మేల్నొల్లు పొగడిక మీరజెల్లు

మేటి పంటల టెంకి కల్మిమెడలంకి
బెష్టుటౌ ని న్గొడావరి యీస్ట్ ది సీజె
మర్బు నీర్వ జవాన్ జవాల్ మీర్జనాన
పీఠికాపుర మేన త్రివిష్టప మిహ.