ఆంధ్ర రచయితలు/త్రిపురాన తమ్మయదొర

వికీసోర్స్ నుండి

త్రిపురాన తమ్మయదొర

1849 - 1890

తెలగావంశీయుడు. తల్లి: చిట్టమాంబ (చిట్టెమ్మ). తండ్రి: వేంకటస్వామిదొర. జన్మస్థానము, నివాసము: విశాఖమండలములో శ్రీకాకుళము తాలూకా సిద్ధాంత గ్రామము. జనను: 1849 సం. సౌమ్య సంవత్సర శ్రావణ శుద్ధ చరుర్దశి గురువారము. నిర్యాణము: 1890 సం. వికృతి సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ. ముద్రిత శతకములు: 1. నీతిశతకము. 2. పాండురంగాష్టోత్తరశతము. 3. కామినీ నిర్మోహజననతారావళి. 4. విటీవిట నటనార్థమాల. 5. ముఖలింగేశ్వరశతకము. 6. నిద్రా విజయము. 7. శ్రీ దేవీ భాగవత మహాపురాణము (1883 విరచితము - అచ్చుపడలేదు.)

త్రిపురాన తమ్మయ్య దొరగారు మంచికవులుగా బేరుగాంచి "దేవీ భాగవతము" నాంధ్రీకరించిన వారని తెలుగువారికి వేఱే తెలుపనవసరము లేదు. దేవీభాగవతము నిప్పటికి నలువురు తెలిగించరనియు, నానాల్గిటిలోను మూడు ముద్రితములైన వనియు ననుకొని, తమ్మన కవిగారిది మాత్ర మచ్చుపడవలయునని మలము కోరుకొనుచుందుము. మన కోరిక సమకూరుగాక!

తమ్మయ్యకవిగారు తెలగ దొరలు. దంతహుందామాలుకుదారులు. సిరికి దగినయీవి.ఈవికి దగ్గపాత్రవివేకము.కవులను సంభావించిరి. పండితులను గారవించిరి. పేదసాదుల నాదరించిరి. ఉర్లాము జమీందారులు శ్రీ కందుకూరు బసవరాజుగారు ప్రతిశ్రావణికి వేద శాస్త్రపండితుల నాహ్వానించి, పరీక్ష చేయించి వర్షాశనము లొసంగుచుండువారు. అక్కడకు వచ్చిన పండితులెల్ల నిక్కడ తమ్మయ్యదొరగారినిగూడ దరిసించి సత్కారములంది పోవుచుండువారు. వీరినాటి కవులుగాదు, పండితులుగాదు, వీరి గౌరవము నొందనివారు లేరని చెప్పుకొందురు. శ్రీ ముక్కవిల్లిసాంబయ శాస్త్రిగారు వీరి యాస్థానకవులు.ఆయన సంస్కృతాంధ్రములలో నిరూడపాండితి యుండి యుభయ భాషా కవితలయందు నేర్పుగలకవులు. వీరి "జానకీశ్వరశతక" మొకటి ప్రకటితము. ఇట్టిపండితుని తనసంస్థానమున నుంచుకొని తమ్మయ్యకవి పోషించెను. కళాప్రపూర్ణులని విశ్వవిద్యాలయము వారిచే నెన్నబడిన త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయ కవి తమ్మయ్యదొరగారి కుమారరత్న మేసుడి! బాణభట్టుడు, తత్పుత్రుడు భూషణభట్టువలె నీతండ్రి కొడుకులిరువురు పండితులును, గవులు నగుట మెచ్చుకోదగినది. తమ్మయ్యదొర కడు ధన్యుడు. దేవీ భాగవతుడై పోతరాజు "భాగవతకవిత" నారాధించుచు "దేవీభాగవతము" తా నాంధ్రమున రచించినాడు. శ్రీ సూర్యప్రసాదరాయకవి తండ్రిని గూర్చి యిటులువ్రాసెను.

ఉ.భాగవతోత్తముండనగ బ్రస్తుతికెక్క జతుర్హరిద్దరీ

భాగవదాతకీర్తియయి భాసిలె శక్తి కథాసుధాడ్యమౌ

భాగవతంబు దా దెలుగుబాస రచించెదగంగ నమ్మహా

భాగవ రేణ్యు నెన్నగను బన్నగనాథున కైన శక్యమే!

"నిర్వచన కుమారసంభవము"

అదియుగాక తమ్మయ్యదొరగారి కుమారుడు ప్రసాదరాయకవి తండ్రిగారి స్వర్గతికి వగచుచు "మృతజీవి జీవితామృతము" అనుపేరితో రచించినకృతిలో పద్యములు చదువవలసినవి. మూడు పద్యములు మాత్రము ప్రచురించెదను.

మ.నిను మూడేడులప్రాయమంద విడిచెన్ నీతండ్రి, నీవంతకుం

జిననాట న్నను బాసిపోయితి నిదే చిత్రంబు నీయట్ల నే

మనునయ్యో! పితృసౌఖ్యముంబడయగానో చన్, బితంబాయునం

దను కల్ముల్ వృధగానే తమ్మయ్యవిభూ! తండ్రి! కవిగ్రామణీ! మ. అవసానంబున దారపుత్రికల డాయంబిల్చి నాకోస మీ

రు వగం బొందకు డీకులాంకురము పేరుం బెంపునుం బొంది ప్రా

పవు మీ కంచును నప్పగించితట మాయక్కయ్యకున్నను నెం

త విశేష జ్నాండవయ్య తమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ!

మ. పదుమూడేడుల ప్రాయమంద కవితాప్రావీణ్యముం జూపి న

ల్వది రెండేడులు మాత్రమే బ్రదికియున్ భాస్వద్యశో పల్లి క

ష్టదిశల్ ప్రాకులు సేసి యారవి ని వేశస్థాయివై నిల్చి త

త్పదముం జేరితి వౌర తమ్మయవిభూ!తండ్రి!కవిగ్రామణీ!

తమ్మయకవి దేవీభాగవత రచనకు సరిగా స్వభాను సంవత్సరచైత్ర శుద్ద ప్రతిపత్తు [ 1888-ఏప్రియల్ 8 తేది] నాడు శ్రీకారము చుట్టి, రెండుమూడేండ్లలో సమాప్తి గావించి రని తెలియుచున్నది. ఈరచన మయినపిమ్మట దమ్మయకవి మూడునాలుగేండ్ల కంటే నెక్కువ కాలము బ్రదికియుండ లేదు. ఆయన నిరాణ్యము 1890 లో. జీవితము పూర్వార్ధమున నేవో కొన్ని శతకములు, కొన్నిచిన్నకృతులు రచించి పరిపాక దశలో భాగవతము ప్రారంభించిరి. ఆసంగతి మనకు గవిత్వములోనే పొడంట్టుచున్నది. "గడియలోని నొక్క కావ్యంబు రచియించు భూరితర కవిత్వధార గలడు" అని వీరిని గూర్చి చేసిన ప్రశంస సుప్రశంస. కాకున్న--వేల గ్రంధము రెండేండ్లలో నెట్టులు వ్రాయుదురు! శ్రీదాసు శ్రీరామకవిగారు "దేవీభాగవతము" ను నాలుగునెలలో వ్రాసిరంట. పట్టుదల వచ్చినపు డట్టులు రచించువారని మనము చాలమంది నెఱుగుదుము. తమ్మయకవిగా రాశుగతిని రచించినను వీరి దేవీభాగవతము సుందరతరముగా సాగినది. పూర్వకవులు తిక్కనాదులకు వలెనే వీరికిని కృతిరచనారంభమున గలవచ్చినది. కలలో శ్రీరంగపతి సన్నధి చేసి నాకంకితముగా దేవీభాగవతము దెలిగింపుమనెనట. యథార్థముగ దమ్మయదొర యట్టిరామభక్తుడు. ఆయన కృతులెల్ల భగవ దర్పితములే. తమ్మయరాట్కవీంద్రుని భాగవతకవితలోని కమ్మదనము చూరలిచ్చుట కీపద్యము లుదాహరణముగ నిచ్చుచున్నాడను.

క. కాలము గడచుట నైజం

బేలీలలనైన గడచు హీనులకు, సము

ద్వేల వ్యసనమ్ముల, గుణ

శాలురకున్ హరికథా ప్రసంగవశములన్.

సీ. దేవీపద ధ్యాన దినకర ప్రభలచే

ఘోరసంసారాంధ కారిమణగు

దేవీపదాబ్ద సంసేవానిలంబుచే

దాపత్రయ మహాంబుదమ్ము లణగు

దేవీ వివిధ నామధేయ స్తవాగ్నిచే

గలుష శుష్కారణ్య గణము లణగు

దేవీనమస్కార దివ్యౌషధమ్ముచే

బ్రబలేంద్రియోప తాసమ్ము లణగు

గీ. భక్త జన పరిరక్షణానక్త యగుచు

దేవీ సర్వోత్తమస్థితి దేజరిల్లు

సత్య మిది నిగమాగమ సమ్మతమ్ము

శౌనకమునీంద్ర! నీ కేల సందియమ్ము.

         [వ్యాసకృతతపశ్చర్య-శుకోత్పత్తి]

శా. కన్యన్ నవ్యవయోవిలాస లలితాకారాంగ రంగత్కళా

ధన్యన్ సత్కుల సంభవామలచరిత్ర స్ఫీత సౌజన్య స

మ్యాన్యన్ దుష్కృత పంధ్యతో పథికథా మాత్సర్యరోగక్రుథా

శూన్యన్ బొందిన బొందవచ్చును, దనూజన్ నాకదెట్లబ్బెడున్. ఉ. అబ్బునుగాక! బంధనము లైన లతాంగుల పొదుమేలె? య

బ్బబ్బ! జగంబునం బురుషుడన్మదహస్తికి గాలినంశెలల్

గుబ్బెత లెంచిచూడ నిది గూడదు సంసృతిగూడి చిక్కడే

గిబ్బపటాణి రౌతు తమకించి సతీతనుపాశ బద్ధుడై.

      [మింటదోచిన ఘృతాచిం జూచి]

సీ. కాదంబినియొ కైశికమొ యెఱుంగ గరాదు

     ద్విజరాజో వదనమో తెలియరాదు

కనకాంబుజమ్ములో కరములో గనరాదు

     తారలో సఖములో తలపరాదు

స్వర్ణదీ వీచులో పళులో పలుకరాదు

     గగనమో మధ్యమో గాంచరాదు

చక్రవాకములో కుచములో యరయ రాదు

      మెఱుపో, మేనో యేరుపఱుపరాదు

గీ. నన్ను వంచింపవచ్చిన నవ్యదివ్య

కామ మోహన దేవతా కార ముదియ.

నిక్కమని మౌని లోలోన న్రుక్కిచిక్కె

మాటలనవచ్చు, వచ్చునే మనసువిలువ?

ఉ. చన్నులపెంపు,పాద జలజమ్ములకెంపు, మనోహరమ్ములౌ

కన్నులసొంపు, మైయగరుకంపు, కనుబొమ వంపు, శ్రోణులన్

తిన్నెల నింపు, నెన్నడల తీఱనిజంపు, నఖాలీతెంపు, పత్

క్రొన్నసయింపు, ముంగురులగుంపు దలంప వరింపకెట్లగున్.

[ప్రథమస్కంధము]