ఆంధ్ర గుహాలయాలు/భైరవకోన గుహాలయాలు

వికీసోర్స్ నుండి

భైరవకోన గుహాలయాలు

అత్యధికముగా ఇటుక, కలపలతో నిర్మింపబడు చుండిన నిర్మాణములతో బాటు అశోకుని కాలమందు భారత దేశమున మొట్టమొదటి గుహాలయాలు శిలలందు రూపొందించుట ప్రారభమైనది. అశోకుడు, అతని మనుమడైన దశరథుడు ప్రాంతీయమైన అతి కఠిన శిల (Quartzose -gneiss) యందు నిర్మించిన తొలి గుహాలయాలు గయ దగ్గర లోని బారాబర్, నాగార్జుని,సితామర్హి పర్వతమందు గలవు. వాటిలో సుదామ, లోమస్ రిషి గుహాలయాలు ముఖ్యమైనవి. క్రీ.పూ. 200 ___ క్రీ.శ. 200 మధ్య కాలమందు దక్కన్ యందు పూనా, నాసిక్, ఆజంతా, ఔలింగాబాద్, ఎల్లోరా లందు మెతువుశిల (softer trap rock) యందు చైత్య గృహాలు, విహారాలు ఏర్పరచ బడినవి. ఉత్తర కోస్తా ఆంధ్ర యందు, దక్షిణ ఒరిస్సా యందు ఖందగిరి, ఉదయగిరి, గుంటుపల్లి, శంకరం వంటి ప్రాందాలలో మెతువు శిల యందు ఇవి నిర్మించ బడినవి. గుంటు పల్లి గుహాలయాలు సుదామ, లోమస్ రిషి గుహాలయలను పోలి యున్నవి. అజంతా యందలి గుహాలయాలలో ఎనిమిది క్రీ.ఫూ. 2 వ శతాబ్దము మధ్య భాగాన నిర్మించ బడినవి. మిగిలినవి 4 వ శతాబ్దము తరువాత నిర్మించ బడినవి. ఇది వాకాటక రాజుల కాలమందు క్రీ.శ. 450-650 మధ్య కాలమున నిర్మింప బడినవి. ఈ నిర్మాణాలు రాష్ట్ర కూటుల కాలమందు ఎనిమిది, తొమ్మిది శతాబ్దముల వరకు కొన సాగినవి. ఎల్లోరా గుహాలయాలు క్రీ.శ. 4 శతాబ్దము నుండి క్రీ.శ. 7 శతాబ్దము మధ్య కాలమున నిర్మింప బడినవి.

క్రీ.శ. మొదటి మిలినీయం యెక్క రెండవ అర్థ భాగమున హిందు, జైన, బౌద్ధ శిలా గుహాలయాల నిర్మాణము వాతాపి (బాదామి) చాళుక్యులు, వేంగీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు దక్షిణ భారత దేశమందు రాజ్యాలను స్థాపించుటతో ప్రారంభమైనది. క్రీ.శ. 6 వ శతాబ్దము మొదలు 9 వ శతాబ్దము వరకు వీరి కాలము లందు జరిగిన నిర్మాణాలు ముఖ్యమైనవి. ఈ విధానము 10 వ శతాబ్దము కొనసాదినది. రాజకీయాలందే గాక వాస్తు, శిల్ప,సాహిత్య పోషణ లందు కూడ వీరు, ఇతర చిన్న రాజ వంశాల వారు పోటీ పడుచుండిరి. చాళుక్య రాజైన మంగకేస, ఇతని సమ కాలికుడు పల్లవ రాజైన ఒకటవ మహేంద్ర వర్మ లతో గుహాలయాల నిర్మాణము దక్షిణ దేశంలో ప్రారంభమైనది. క్రీ.శ. 578 లో బాదామి యందు మొదట విష్ణు గుహాలయమును మంగళేశ నిర్మించాడు. ఒకటవ మహేంద్ర వర్మ మందగ పట్టు యందు త్రిమూర్తుల కొరకు తనమొదటి గుహాలయము నిర్మించాడు. మంగళేశ మౌర్యుల కాలమునుండి వాడుకలో నున్న మెతువు రాళ్ళయిన sand stone, trop or lime stone లందు గుహాలయ నిర్మాణములు చేయగా మహేంద్ర వర్మ( క్రీ.శ. 530- 630) కఠిన శిల (hard granite rock) లందు నిర్మించినాడు. మహేంద్ర వర్మ అశోకుని తరువాత మొదట తన కాలమందు ఇటుక,కలప, లోహములు లేని "లక్షితము" లేక దేవ గృహము త్రిమూర్తులకు నిర్మించినట్లు చెప్పుకొని యున్నాడు. కావున పల్లవులు కఠిన శిలలందు, చాళుక్యులు మెతువు శిలలందు గుహాలయములు రూపొందించెడు రెండు విధానాలను దక్షిణ దేశమందు ప్రారంభించిరని చెప్పవచ్చును. ఇట్టి శిలా సాంప్రదాయాలు విజయనగర కాలమువరకు కొనసాగినవి.

పల్లవ రాజైన మొదటి మహేంద్ర వర్మ (క్రీ.శ. 580-630) కాలానికి చెందిన గుహాలయాలు ముఖ్యముగా 10 కలవు. వానిలో లక్షిత యాతన (మందగప్పట్టు) పంచ పాండవ గుహాలయం (పల్లవరం) మొదలగునవి కలవు.

ఇతని కుమారుడు మొదటి నరసింహ వర్మ మామల్ల (క్రీ.శ. 630- 72) ఒకటవ పరమేశ్వర వర్మ (672- 700,రాజ సింహ లేక రెండవ నరసింహ వర్మ (700-723) ఇతని నిర్మాణ రీతిన కొనసాగించి ఓరగడం, మందవ (తిరుక్కల్ కున్రం) కోటికల్ మండప (మహాబలిపురం ) మొదలగు వాటిని వీరు నిర్మించిరి.

మహేంద్ర వర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ మామల్ల (630- 688) మహేంద్ర రీతిలోని గుహాలయాలను, ఏక శిలా రథములను రూపొండిచినాడు. ఇవి చాల వరకు మహాబలిపురమందు గలవు.

తూర్పు చాళుక్యులు కూడా మెతువు శిలయందు కృష్ణకు ఇరువైపులా సుమారు 12 గుహాలయాలను నిర్మించిరి. ఇవి ఉండవల్లి, మొగల్ రాజపురము, విజయవాడ, పెనమాగ, సీతారామపురములందు గలవు. ఇవి క్రీ.శ. 7 - 8 శతాబ్దములకు చెందినవి. ఆంధ్రదేశమున శిలాపర్వతములను తొలిచి గుహాలయాలను ఏర్పరచుట మౌర్యుల కాలము తుదినుండి ఆరంభమయ్యెను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరునకు 25 మైళ్ళ దూరమున నుండు 'గుంటుపల్లి' లోని కొండలను తొలిచి నిర్మించిన చైత్యగృహములను, విహారములను పరిశీలించినచో ఇవి మౌర్యకాలము తరువాతివని తెలియుచున్నది.

మౌర్యవంశానంతరము ధాన్యకటక, ప్రతిష్టానపురములు ముఖ్యపట్టణములుగా కలిగి సముద్రతీర ఆంధ్ర దేశమును పరిపాలించిన ఆంధ్ర శాతవాహనులు వైదికమతాన్ని అనుసరించినను ఆనాటి బౌద్ధులకు విహారములు, చైత్యగృహాలు నిర్మించి దానము చేసిరి.

విజయవాడకు తూర్పున గల మొగల్ రాజపురము, కృష్ణకు దక్షిణతీరమున గల ఉండవల్లి గుహలనుబట్టి ఈ గుహల నిర్మాణము ప్రోత్సహించినవారు శాతవాహనులని యనవచ్చును. తరువాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు,శాలంకాయనులు వీటిని ప్రోత్సహించిరి. ఇక్ష్వాకుల తుదిదశయందు పల్లవులు తాత్కాలికముగా నెల్లూరు ఉత్తరమునకు వ్యాపించి కొంతకాలము ధాన్యకటకము పాలించిరి.

పల్లవరాజగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా యుండగా ఇట్టి గుహాలయ నిర్మాణములను గూర్చి తెలుసుకొని కలప, ఇటుక, లోహనిర్మితములకంటె శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించెను. కొంతకాలమునకు పల్లవులు జయింపబడి దక్షిణదేశమునకు పారద్రోలబడినందున పెన్నవరకు వెనుకకు వచ్చి, పెన్న పరిసర దక్షిణ ప్రాంతములను ఆక్రమించిరి అట్టి ఆక్రమణ కాలమున నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పములే తార్కాణమని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారి అభిప్రాయం. కాసి. ఇచ్చటి గుహాలయాలు క్రీ.శ 8వ శతాబ్దమునకు చెందినవిగా కొందరు శాస్త్రవేత్తలు భావించుటవలన మహేంద్రవర్మ క్రీ.శ. 7 వ శతాబ్దము వాడు గనుక, ఇవి మహేంద్రవర్మచే నిర్మింపబడినవనెడి డా॥సుబ్రమణ్యంగారి అభిప్రాయం భేదాభిప్రాయానికి తావిచ్చుచున్నది.

భైరవకోన నెల్లూరు జిల్లా, ఉదయగిరి తాలూకాయందు కొత్తపల్లివద్ద కలదు(మాప్ నం. 1,2 చూడుము). నెల్లూరునుండి, కావలినుండి యిచ్చటకు మార్గములు కలవు. ఇది కావలికి సుమారు 70 మైళ్ళ పశ్చిమాన 'కొత్తపల్లి కొండలలో కలదు. ఇచటి దేవాలయమందు భైరవమూర్తి కన్పించుచుండుటచే ఈ ప్రాంతమునకు భైరవకోన లేక భైరవకొండ యను పేరు వాడుకలోనికి వచ్చినది. ఈ భైరవమూర్తి శిల్పము ఇచటి సెలయేటి తూర్పు ఒడ్డు భాగమున ఒక పెద్ద బండ విభాగమున చెక్కబడియున్నది. ఈ శిల్పము చుట్టూ తరువాతి కాలములో దేవగృహ నిర్మాణము చేయబడినది. దీని చెంతనే కొన్ని చిన్న చిన్న దేవగృహములు (memorial shrines) గలవు వీటిలో దక్షిణ కొనలోని దేవగృహ ద్వారమున కిరువైపులా రెండు బ్రహ్మ, నాల్గు చేతుల విష్ణువుల ఆర్ధశిల్పములు గలవు ద్వారము పై విభాగమున 'రాజపొరేరి' రాజు కుమార్తెయైన 'గోయింద పొరేరి' మనుమరాలైన 'లోకమ' చే ఈ చిన్న గుహాలయము రూపొందింపబడినదని తెలుపబడియున్నది. ఈ శాసనము క్రీ.శ. 9 వ శతాబ్దమునాటి తెలుగు చోడరాజులకు చెందినదిగా తెలియుచున్నది.

భైరవకోనవద్ద గల ఒక కొండపై ఉన్న 'లింగాలదొరువు'నందు ఉద్భవించు గంగ భైరవకోనవద్ద జలపాతముగా మారి దుర్గా భైరవాలయమునకు. గుహాలయములకు మధ్య 'సోనవాన' యను పేరుతో ప్రవహించెడి సెలయేటికి కొంతదూరములో soft schist శిలయందు నిర్మింపబడిన వల్లన వాస్తు శిల్పశైలి యనబడెడి ఎనిమిది గుహాలయములు గలవు (11 నుండి 22 వరకు గల చిత్రపటాలు చూడుము). మహాబలిపురమున గల గుహల శిల్పశైలితో ఇవి పోలిక కలిగియున్నవి. కాని గుహలు చాలా చిన్నవి. చెక్కిన సంప్రదాయమా, పైనించి క్రిందకు సాగినందులనూ, గర్భాలయాల ముందు ప్రాంగణములను నిర్మించినట్లు కానవస్తున్నది. కాని మహాబలి పురములో వలె గళ్ళు కొట్టి నడిమి ముక్కలను చెక్కుతూ సాగినట్లు కానరాదు. ఆ రీతినే అవలంబించియుంటే ఈ గుహలు బాగా లోతుగా ఉండియుండును. ఇవన్నీ ఒకే కాలానివిగా ఆగుపడవు. ఇచటి శిల్పనిర్మాణశైలి క్రీ.శ. 7వ శతాబ్దము మొదలు క్రీ.శ. 8 వ శతాబ్దము ఉత్తరార్ధమువరకు చెందినవై యుండునవి. దక్షిణ భారతదేశ గుహాలయాలలో ప్రాచీనమైనవని లాంగ్ హర్ట్స్ అభిప్రాయపడిరి కాని నూతన పరిశోధనలనుబట్టి ఈ గుహాలయాలు 8వ శతాబ్దమునకు చెందినవని చెప్పవచ్చునని డా॥బి. రాజేంద్రప్రసాద్ గారు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇవి రెండు దశలలో నిర్మింపబడినవిగా అగుపడును. మొదటి నాలుగు గుహాలయాలు మొదటి దశకు. మిగిలిన నాలుగు మలిదశకు చెందినవని నిర్మాణరీతినిబట్టి చెప్పవచ్చును. ఒక పెద్ద గుఱ్ఱపునాడా ఆకారంలో గల ఏకశిలా గుట్టమొక్క ఏటవాలు ముఖభాగాన ఇవి వరుసగా నిర్మింపబడియున్నవి (చిత్రపటాలు11 నుండి 22 వరకు చూడుము) మొదటి గుహమాత్రము ఉత్తర ముఖమును, మిగిలినవన్నియు తూర్పు ముఖమును కలిగియున్నవి. ఇది పల్లవ సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. మొదటి నాలుగు చతురస్రాకార గర్భగృహను మాత్రము కలిగి దానిమధ్య శివలింగము, పానవట్టమును కలిగియున్నది. ఈ గుహల ముందుభాగాన మండపములు లేవు (33 . 35 వ చిత్రపటములు చూడుము). వీటి కపోత సరిగా రూపొందింపబడలేదు మిగిలిన నాలుగు గుహలు చతురస్రాకార మాత్రము గర్భగృహ, మండవ, మండపమందు రెండు కుఢ్యస్తంభాలను రెండు స్తంభాలను కలిగియున్నవి ( 34, 35, 22వ చిత్రపటములు చూడుము). ఇవి 'కపోత'ను కలిగియున్నవి. ఈ గుహలన్నింటికి విడివిడిగా గల చిన్న ప్రాంగణములందు ఇరువైపుల గణేశ, చండేశుల అర్ధ శిల్పములున్నవి. స్తంభాలు కొన్ని మూలములందు (base) ఆసీన సింహాలను కలిగియున్నవి. ప్రతి మండపమందు ద్వారపాలకులు, బ్రహ్మ, విష్ణువులు గలరు. ప్రతి గుహాలయము ముందు గల ప్రాంగణము మధ్య నంది ప్రతిమ గలదు. ఇచట చండేశ. గణేశ అర్ధశిల్పాలు పల్లవేతర శిల్పప్రభావాన్ని తెలుపుచున్నవి. ఇచట గుహాలయము లన్నిటియందు శివలింగము గలదు. ఇవన్నియు చాలవరకు ప్రాజ్ముఖములుగా యున్నవి. ఇందలి శివలింగములు మధ్యను పరిమాణములై గుండ్రముగా, నున్నగా యున్నవి. ఇవి నల్లరాతితో చేయబడియున్నవి. ఎచటనుండో తెప్పించి ప్రతిష్ఠింపబడినవి. పానవట్టములు ఇచటి ప్రాంతీయ కొండరాతితోనే మలచబడినవి. చచ్చౌకముగ యుండి 18 అం॥ ఎత్తు గలవు. గుహాలయాలు 6½ అ॥పొడవు. 6 అ॥ ఎత్తు కలిగి యున్నవి. ముఖ్య దేవగృహ ప్రవేశమార్గమునకు ఇరువైపులా గల వెలుపలి కుఢ్యముపై రెండు చేతులు గల ద్వారపాలక ప్రతిమలు అర్ధశిల్పమున గుహాలయ ఏకశిలయందే మలచబడియున్నవి (చిత్రపటములు 13నుండి 22 వరకు మరియు 26నుండి 28 వరకు చూడుము). తాము ధరించిన పెద్ద 'గదల'పై వారు వాలినట్లు అగపడుచున్నారు ఇది పల్లవ సాంప్రదాయము. "వీరి శృంగ యుతోష్ణీషములు. జటాజూట శిలారచన పరిశీలించినచో మహాబలిపురము, తిరుచిరాపల్లి, దలవనూరు, మందగప్పట్టు మొదలైన ప్రాంతములందలి శిల్పనై పుణ్యమున ప్రదర్శించునవిగయున్నవి" అని ప్రొ॥ఆర్.సుబ్రమణ్యంగారు అభిప్రాయపడిరి.

ద్వారపాలకులకు ప్రక్కన బ్రహ్మ, విష్ణువుల ప్రతిమలు అర్ధశిల్పమునందు రూపొందింపబడియుండుట కూడ పల్లవ శిల్పరచనాశైలియే. గుహకు కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు విష్ణువుండుటచే ఇవి కొంతవరకు త్రిమూర్తుల దేవాలయములని చెప్పవచ్చును. కాని ఇచట శివునికే ప్రాధాన్య మివ్వబడియున్నది. ఇచటి కుఢ్యమందలి మరుగుజ్జులు. ఆసీన సింహముపై పొడిగింపబడియున్న స్తంభములు. వాటిపై అడ్డముగా యుండు శిల్పములును పల్లవశైలికి చెందినవి. ఇచ్చట ప్రాచీన లిపితో వ్రాయబడిన కొన్ని శాసనములు గలవు. లిపి చదువరులు తెలుసు. కొన్నంతవరకు ఈ గుహల నిర్మాత ఎవరైనది తెలియుటలేదు. కాని స్థపకుల, శిలాచ్ఛిద్రకుల, పర్వతక్షకుల పేర్లును, ఎవరి పేరిట ప్రతిష్ఠ గావింపబడినదియును తెలియుచున్నది. రెండవ గుహయందు క్రిందివిధముగా భావము విచ్చెడి శాసనమున్నది. కులీనుడగు దామోదరేశ్వరుని గుడియనియు, వైభవోపేతమగు బ్రహ్మేశ్వర విలయమనియు, దీనిని మలచినది చామాచారి (ధీరుకమతి) అనియు కలదు. ఇచటి అష్టగుహ 'దేవయాతనము'లందు పెక్కు భక్తుల జ్ఞాపక చిహ్నములు గలవు.

మొదటి గుహాలయము

ఈ గుహాలయము ఉత్తర(దిక్కు) ముఖముగా తొలచబడియున్నది (చిత్రపటములు 13. 14 చూడుము). మిగిలినవన్నియు తూర్పు ముఖములు. ఇది ఒక చిన్న గుహాలయము. సుమారు 5 ½అ॥ చతురస్రాకారముగానున్నది. 6 అ॥ఎత్తుగల గర్భగృహ (shrine cell) ఇందు గలదు ఇందు మెరుపుగల నల్లరాతి శివలింగమున్నది. గుహ ముందు 11½అ॥పొడవు. 5½వెడల్పు గల ప్రాంగణము(open terrace) కలదు. గర్భగృహ ద్వారమునకు ఇరువైపులా వెలుపలి కుఢ్యభాగాన చట్రరూవణయందు ద్వారపాలకులు గదలు ధరించిన ప్రతిమలుగా చెక్కబడియున్నారు (చిత్రపటములు 13,14, 12 చూడుము). వీరు పల్లవరీతిలో గదలమీద వాలినట్లు చెక్కబడియున్నారు. పశ్చిమ భాగమందలి ద్వారపాలకునకు శృంగయుత శిరోవేష్టనము కలదు. ఇందు శాసనము లేదు. ఇది క్రీ.శ. 7వ శతాబ్ద పూర్వార్ధమునకు చెందినదని కొందరి అభిప్రాయము. క్రీ.శ. 8వ శతాబ్దము మధ్య భాగానికి చెందినదని మరికొందరి అభిప్రాయము.

ఈ గుహాలయ ముఖభాగాన రెండువైపులా కొనలందు ద్వారపాలకుల ప్రక్కగా బ్రహ్మ, విష్ణువుల అర్ధ శిల్పములున్నవి. గుహాలయ ప్రాంగణమున రెండువైపులా గణేశ, చండేశ అర్ధశిల్పములున్నవి. గుహాలయ 'కపోత' విభాగము సరిగా రూపొందింపబడలేదు. 'కపోత' మొరటుగా తయారయినటువంటి 'కూడు' డిజైన్లలో రూపొందింపబడియున్నది గర్భగృహలోని శివలింగానికి ఎదురుగా వెలుపల ప్రాంగణంలో నంది ప్రతిమ గలదు (చిత్రపటములు 13,14, 33,35 చూడుము).

ఈ గుహాలయమందు శిల్పుల చాతుర్య మగుపడదు. దీనినిబట్టికూడ ఇది ప్రాచీనమైనదని భావించవచ్చును. సారళ్యాన్నిబట్టి, ద్వారపాలకుని కొమ్ము కిరీటాన్నిబట్టీ ఇదే అతి ప్రాచీనమనిపిస్తుంది.

రెండవ గుహాలయము

తొలిదానికి తూర్పుభాగమున కొంత ఎత్తులో సెలయేటి దరిన ఈ గుహాలయము గలదు (చిత్రపటములు 15,16, 33,35 చూడుము). మొదటిదాని కాలముననే ఇదికూడ నిర్మింపబడినది. గర్భగుడి 4 ½ అడుగుల చతురస్రాకారముగా నున్నది. ఇందు మొదటి గుహలోని దానికన్నా సన్నటిది. కొంత పొడవైనదైన నల్లరాతి శివలింగమున్నది. ద్వారమున కిరువైపులా ద్వారపాలకులున్నారు ( 15,16 చిత్రపటములు చూడుము) కాని వీరికి శృంగయుతోష్ణీషములు (horned headgear) లేవు. ఈ గుహ ముందుభాగాన గల ప్రాంగణము 8 అ॥ చతురస్రముగా యున్నది. ఇచట భక్తులమొక్క, పోషకులయొక్క జ్ఞాపకచిహ్నములు గల శాసనములను లాంగ్ హర్ట్స్ కనుగొనిరి.

శిల్పచాతుర్యమునందు మొదటి గుహకు, దీనికి తేడా ఏమియు లేనట్లు అగుపడుచున్నది. ఇది శిధిలమైన పల్లవరీతి నంది ప్రతిమను ప్రాంగణమునందు కలిగియున్నది. ప్రాంగణమునందు రెండువైపులా చండేశ, గణేశ అర్ధశిల్పములు చిన్న దేవకోష్ఠములందు గలవు. గుహాలయ కపోత విభాగమున 'కూడు' డిజైన్లు లేవు. ఈ గుహయందు త్రిమూర్తులు లేరు, ఒకటవ గుహకు,రెండవ గుహకు మధ్య చాలా చిన్నతరహా గుహాలయ(memorial shrines) సమూహ మున్నది. వీటిలో చిన్న గర్భగృహ, అందు పానవట్టమున్నది. శివలింగము లేదు. ఈ చిన్న దేవగృహముల క్రిందిభాగమున మరీ చిన్నచిన్న గుహాలయములందు (memorial shrines) చిన్న చిన్న శివలింగములు చెక్కబడియున్నవి. వీటి చెంతనే ఒక చిన్న శాసనము 'ఐశ్వర్య దామోదరేశ్వర దేవగృహం' అనియు, మరొక శాసనములో 'ధీరుకంతి చామాచారి'చే ఈ ప్రసిద్ధ బ్రహ్మేశ్వర నివాసము నిర్మింపబడినదనియు వ్రాయబడియున్నది.

మూడవ గుహాలయము:

ఇది మునుపటి రెండు గుహలవలె 5 అ॥ చతురస్రముగ నున్నది (18, 33, 35వ చిత్రపటములు చూడుము). ద్వారమున కిరువైపులా ద్వారపాలకులు గలరు. ఉత్తర భాగమందుండు ద్వారపాలకునకు శృంగయుతోష్టేషము కలదు. ఈ గుహ ప్రాంగణము 9½అ॥పొడవు, 6 అ॥వెడల్పు గలదు (16వ చిత్రపటము చూడుము). ఇది రెండవ గుహ ప్రాంగణముకంటె పెద్దది. ద్వారపాలకుల చిత్రణలో ఇచట కొంత ఎక్కువ నైపుణ్యము కనబడుచున్నది. దీనికి అర్ధమండపముగాని,ముఖమండపముగాని లేదు. చిన్న ప్రాంగణము మాత్రమే యున్నది. శివలింగమునకు ఎదురుగా (వెలుపల) పశ్చిమ ముఖభాగముగా నంది కలదు. మూడవ గుహాలయము నందు శివలింగము ఆధునిక కాలానికి చెందినది గలదు. ప్రాంగణమునందు ఉత్తర దక్షిణములందు గణేశ,చండేశ అర్ధశిల్పములు గలవు.

ఈ గుహాలయమునకు కపోత విభాగము రూపొందింపబడలేదు. ఇచటి నంది విగ్రహము పల్లవరీతిలో యున్నది. ఈ గుహాలయము క్రిందగా రెండు చిన్న గుహాలయములందు (memorial shrines) చిన్నచిన్న శివలింగములు చెక్కబడియున్నవి.

పై మూడు గుహలను పరీక్షించినచో ఈ మూడును ఒకేరీతిగా చెక్కబడినట్లుగా మనకు తెలియుచున్నది.

నాలుగవ గుహాలయము:

ఈ గుహాలయము అసంపూర్తిగా యున్నది. గర్భగుడి 4½అ॥చతురస్రాకారము గలిగియున్నది ( 17,18, 19,33, 35వ చిత్రపటములు చూడుము). గర్భగృహ మధ్యయందు పానవట్టమున్నది. పానవట్టము నందు నల్లని రాతితో చేయబడిన మెరుపుగల శివలింగమున్నది. ద్వారపాలకులు పల్లవరీతిలోనే యున్నారు. ఉత్తర వైపున గల ద్వారపాలకునకు శృంగయుతోష్ణేషములు గలవు. ఇచటి ప్రాంగణము అసంపూర్తిగా యున్నది. ఇది 13 అ॥పొడవు. 4 అ॥ వెడల్పు గలిగియున్నది. ఈ గుహలోని శివలింగమునకు వెనుక గల కుఢ్యముయొక్క ముఖభాగమున త్రిముఖయుత శివుని ('మహేశ') అర్ధశిల్పము గలదు (24వ చిత్రపటము చూడుము) ఇతనికి మూడు తలలు గలవు. పల్లవ గుహాలయాలలో సోమస్కంధ చిత్రరూప ముండును. కాని ఇచట పేరు ఇచటి మహేశ ఎల్లోరా ప్రాంతమంతలి క్రీ.శ. 8వ శతాబ్దమునకు చెందిన మహేశ శివునివలె యున్నది (25వ చిత్రపటము చూడుము).

ప్రాంగణమునందు నంది మలచబడిన రూపురేఖలు గలవు. శిల్పము నాశనమై యున్నది. ప్రాంగణమున ఉత్తర దక్షిణ భాగములందు చిన్నచిన్న దేవకోష్ఠములు గలవు. ఈ కోష్ఠములలో ఒకదానియందు 'గణేశ' అర్ధ శిల్పము గలదు. గుహాలయముయొక్క 'కపోత' క్వార్టర్ సర్కిల్ ఆకారములో మలుచుటకు ప్రయత్నము జరిగియున్నది కాని పూర్తిచేయబడలేదు. 'కూడు' డిజైన్లు లేవు. శాసనములు లేవు.

ఇచ్చటి గుహాలయాలలో మొదటి గుహాలయమునుండి నాలుగవ గుహాలయము వరకు అతిదగ్గరి పోలికలు కనిపించుచున్నవి. కావుననే ఇవన్నీ ఒకే కాలానికి చెందినవని భావించవచ్చును.

ఐదవ గుహాలయము:

మొదటి నాలుగు గుహాలయములకన్నను నిర్మాణరీతులలో ఇది చాలా భేదమును కలిగియున్నది (17,18, 19,34, 36 వ చిత్రపటములు చూడుము). ఇది మొదటి నాలుగు గుహాలయాలకంటె తరువాతి కాలములో నిర్మింపబడినట్లు తెలియుచున్నది. ఇది క్రీ.శ. 9వ శతాబ్దమునకు చెందినదని కొందరి అభిప్రాయము. మరికొందరు ఇది క్రీ.శ 8వ శతాబ్దమునకు చెందినదందురు. ఇది నాలుగవ గుహాలయము పైన కొద్దిగా వెనుకగా నిర్మింపబడియున్నది. ఇందు 6 అ॥ చతురస్రాకార గర్భగృహ,శివలింగము కలదు. ఈ గుహాలయ ద్వారపాలకులు కుశలురగు మేటి స్థపకుల చేతి నిర్మింపబడిరని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారి అభిప్రాయము. గర్భగృహ ముందు 15 ఆ॥పొడవు. 4 ½ అ॥వెడల్పు గల మండపము. అందు రెండు కుఢ్యస్తంభాలు. రెండు స్తంభములపై ఏకశిల యందే రూపొందింపబడియున్నది (18, 19,37 వ చిత్రపటములు చూడుము). స్తంభములకు వెలుపలి ముఖమున నాలుగు చిన్న శాసనములు గలవు. వాటి సారాంశమునుగూర్చి కృష్ణశాస్త్రిగారు ఇట్లు వివరించిరి:

(1) 'శ్రీ త్రిభువనాదిత్యం' (ఇది చాళుక్యరాజుయొక్క బిరుదుగా యుండును.)
(2) 'శ్రీ దెర్లుగుముదం ఆచార్ల పపి కోసిరి' (అనగా ఈ శిల్పనిర్మాణము సుప్రసిద్ధుడగు బెర్లుగుముదం ఆచార్యులని స్పష్టము. బహుశః రెండవ గుహలోని 'ధీరుకంతి' అను పదమే ఇందలి 'దెర్లుగుముద'మై వుండును).
(3) 'దాకేరేమి' (బహుశా దాకేరేమి పదము ద్రాక్షారామ శాసనములందు కన్పించెడివి).
(4) 'శ్రీ నరనరేంద్రుండు' (ప్రఖ్యాతి రాజరాజనరుడు, చాళుక్యరాజుగా నుండవచ్చును. ఆ కాలమున కృషియొక్క పునీతత్వము శ్లాఘించబడుచుండెను).

గర్భగృహయందు పానపట్టము ప్రాంతీయమైన శిలతో నిర్మాణము చేయబడియున్నది. ద్వారపాలకుల ప్రక్కన మండపముయొక్క మూలలకు దగ్గరగా కోష్ఠములందు బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములు గలవు మండపము ముందు విభాగమున రెండు కొనలందు కుఢ్యస్తంభాలు, ఆ రెండింటి మధ్యభాగాన రెండు స్తంభములు గలవు. స్తంభముల అండ విభాగమున క్రింద, పైన చతురస్రాకారపు విభాగము గలిగి ఈ రెండింటి మధ్య అష్టకోణ విభాగం ఆందు తడి, కుంభ విభాగాలు యున్నవి. ఈ స్తంభముల 'కాపిటల్' విభాగమునందు 'కుంభ', 'వీరకంఠ', 'పొటిక' విభాగములు గలవు. (17,18, 19వ చిత్రపటములు చూడుము). స్తంభములపైన చిన్న 'దూలము' వంటి విభాగము, దీనిపైన 'కపోత', ఈ రెండింటి మధ్య 'గణమాల' కలదు. కపోత ముఖభాగమున 'కూడు' డిజైనులు కలవు. వీటిపై విభాగమున సింహపు తలలు గలవు. ఈ సింహపు తలలు పల్లవరీతి లోనివి. పశ్చిమ చాళుక్యుల కాలమందు కూడ ఈ రీతి గలదు. 'కపోత' పైన సింహపు జంటల వరుస గలదు. ఇచటి 'కూడు'ల మధ్యభాగమందు మానవ తలలుగల అర్ధశిల్పములున్నవి. ఈ గుహ ప్రాంగణము యొక్క ఉత్తర,దక్షిణములందు గణేశ,చండేశ అర్ధశిల్పములున్నవి. శివలింగమునకు ఎదురుగా ప్రాంగణాన నంది ప్రతిమ గలదు. ఈ గుహాలయములోని శిల్పసంపద ముందు చూచిన వాటిలోని శిల్పములకన్న పరిణతి దశను కలిగియున్నది. నేర్పరులైన శిల్పులు దీనిని నిర్మించినట్లు తోచుచున్నది.

ఆరవ గుహాలయము:

ఐదవదానివలెనే ఈ గుహాలయము 5 అ॥చతుర స్రాకారమును గలిగియున్నది. (20,24, 36 వ చిత్ర పటములు చూడుము) ఇందును శివలింగము,పానవట్టము గలవు. శివలింగము నల్లరాతితో చేయబడి మెరుపును గలిగియున్నది. ద్వారపాలకులు 5వ గుహలో నున్నట్లే యున్నారు. వీరి ప్రక్కలలో బ్రహ్మ,విష్ణు అర్ధశిల్పాలు ఉన్నవి (26,27, 28 వ చిత్రపటములు చూడుము). ఉత్తరవైపునున్న ద్వారపాలకునకు శృంగముతో కూడిన తలపాగ గలదు. ఈ గుహాలయము ముందు 12 ½ అ॥పొడవు,3 ½ అ॥వెడల్పు గల ప్రాంగణము చెక్కబడియున్నది. దీని ఉత్తరవైపున గల భిత్తికపై శివ ప్రతిమ చిన్నదిగా మలచబడియున్నది దాని చెంత శిలాక్షరములు గలవు. మండపము ముఖభాగమున రెండువైపులా కొనలందు కుఢ్య స్తంభాలు గలవు. ఈ రెండింటి మధ్య రెండు స్తంభములున్నవి. ఇవి 'అండము' మధ్యభాగాన అక్టాగనల్ విభాగమున కలిగియున్నవి. 'కాపిటల్' విభాగమున శిల్పములు గలవు. వీటి 'కార్బెల్' సాధారణ వంపు (simple corbel) గలిగియున్నవి. 'తరంగ' లేక 'తరంగ పట్టా' రూపులేఖలు లేవు (20వ చిత్రపటమును చూడుము). స్తంభములకు, కుఢ్యస్తంభాలకు పైన గల దూలము వంటి విభాగములో 'గణహారము' గలదు. ఈ దూలము పైన 'కపోత' క్వార్టర్ సర్కిల్ నిర్మాణములో గలదు. దీని ముఖభాగాన కూడు డిజైన్ల వరుస గలదు. ప్రాంగణాన కుడి, ఎడమల రెండువైపులా గణేశ, చండేశ అర్ధశిల్పములు ఉన్నవి. ఈ గుహాలయములోని శిల్పసంపద కూడ ఐదవ గుహాలయములోవలె పరిణతి దశకు చెందినదిగా ఉన్నది. ఇచట నంది లేదు.

ఏడవ గుహాలయము:

ఇచ్చటి గుహలన్నింటిలోను, తొలి నాల్గింటికంటెను తరువాతిదై సుందరమగు శిల్పనైపుణి గలిగి మహాబలిపుర శిల్పసౌందర్యమును ఇది స్ఫురింపజేయుచున్నది. ఆరవదానివలెనే 5 ½ అ॥చతురస్రముగ, సలింగముగ మలచబడి ఉన్నది (21,22, 34 36 వ చిత్రపటములు చూడుము). ద్వారమున కిరువైపులా పెద్ద ద్వారపాలకుల శిల్పములు గలవు (26,27, 28వ చిత్రపటములు చూడుము). ఉత్తర వైపున గల ద్వారపాలకుడు 'శృంగము','పాగా' ధరించియున్నాడు. ఆకారములో మానవ పరిమాణములో గలవు. దక్షిణవైపున ఉన్న ద్వారపాలకునకు అణగినట్లుండు 'తలపాగా', కుఱచ జడలును గలవు. ప్రాంగణము చెక్కుచెదరక యున్నది. ముందుండు మండపము సుమారు 15 అ॥పొడవు, 5 అ॥ వెడల్పు కలిగి యున్నది. దీనిని మోయు రెండు స్తంభముల మూలములలో (base) 'ఆసీన' సింహాకృతులున్నవి (22వ చిత్రపటము చూడుము). స్తంభములమీద మూడు చిన్న శాసనములు గలవు. రెంటిలో శ్రీశైలమువి. అనంతజ్యోతి అను పరివ్రాజకుల నామములున్నవి. మూడవదానిలో 'శ్రీ కరువది ఆచార్ల కోసిన పనియు' అని యున్నది. అనగా ప్రఖ్యాతుడగు కరువది ఆచార్యునిచే ఈ దేవగృహమంతయు మలచబడినట్లు తెలియుచున్నది.

మండపము మూలలకు దగ్గరగా ద్వారపాలకుల ప్రక్కన బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములున్నవి (26,27, 28 చిత్రపటములు చూడుము). ఈ రెండిటికీ కొంత ఎత్తైన పీఠములు కలవు. మండపము ముందు విభాగమునందు ఉత్తర దక్షిణ కొసలలో రెండు కుఢ్యస్తంభాలు గోడలో ఇమిడియున్నవి. మండప ముఖభాగాన కుఢ్యస్తంభాలకు మధ్య రెండు స్తంభములు గలవు (22వ చిత్రపటం చూడుము). వీటిని 'చిత్రకంఠ' స్తంభములందురు. ఈ స్తంభ 'మూలము'లందు ఆసీన సింహాలు గలవు. ఈ సింహములపైన ఒక చతురస్రాకార కళానిర్మితమైన స్తంభ 'అండ' విభాగము కలదు. స్తంభము యొక్క 'కాపిటల్' విభాగము 'బేకిభైరవ' మరియు 'కుంభ', 'వీరకంఠ', 'పొటిక' విభాగములు కలవు ( 22, 31 వ చిత్రపటాలు చూడుము). వీటి 'కార్బెల్స్' సాధారణ వంపు గలిగియున్నవి. స్తంభాలపైన 'గణమాల'తో కూడిన 'దూలము' వంటి విభాగము కలదు. దీనిపైన 'కపోత' నిర్మాణము కలదు. కపోత ముఖభాగములందు పడగ గల నాగప్రతిమలు లేక మానవ తలలు మధ్యగల 'కూడు' డిజైన్లు గలవు. ఈ డిజైన్ల పైవిభాగాన సింహపు (వ్యాళ) తలలు గలవు. ఇది పశ్చిమ చాళుక్య శిల్పరీతిని చూపుచున్నది. ఈ గుహాలయ ప్రాంగణము నందు ఉత్తర,దక్షిణములలోని చిన్న కోష్ఠములందు గణేశ, చండేశ ఆర్ధశిల్పములు గలవు. శివలింగమున కెదురుగా ప్రాంగణాన నంది కలదు.

ఈ గుహాలయ పల్లవ,పశ్చిమ చాళుక్య, రేనాటి చోడుల శిల్పరీతి ప్రభావము కలిగియున్నది. ఈ విషయము కూడులపైనున్న పశ్చిమ చాళుక్యుల సింహపు తలలు. స్తంభములు మూలముల విభాగాన గల ఆసీన సింహములు తెలుపుచున్నవి. అంతేగాక ఇందలి సింహములు ప్రాంతీయ శిల్పరీతి ప్రభావమును కలిగియుండుట గమనార్హము. ఈ విషయము శిల్పములోని ముందుభాగ రూపణనుబట్టి తెలియుచున్నదని డా॥ బి. రాజేంద్రప్రసాద్ గారి అభిప్రాయము. ఈ గుహ 'కపోత' పైన సింహముల జంటల వరుస గలదు. ఈ గుహ ఆరవ గుహకు పైన ఉన్నది.

ఎనిమిదవ గుహాలయము:

ఈ గుహాలయము ఏడవదాని ప్రక్కనే వున్నది (21, 34, 36 వ చిత్రపటములు చూడుము). శిల్పశైలి యంతయు ఏడవదానిని పోలియున్నది. గర్భగుడి 5 అ॥ చతురస్రాకారముగా యున్నది. ద్వారపాలకులు ఏడవ గుహలయందువలె వున్నారు. ప్రాంగణము 12 అ॥ పొడవు, 4 అ॥వెడల్పు కలిగియున్నది. శాసనము కనిపించదు. అయినను ఏడవ గుహ కాలమందే నిర్మింపబడినట్లు చెప్పవచ్చును. ప్రాచీన పల్లవ శిల్పమును పోలియున్నది. ఏడు, ఎనిమిది గుహలు పరిమాణములో కొంత తేడా తప్ప మిగిలిన అన్ని అంశాలలో ఒకేరీతిలో యున్నవి.

ఒకే దేవాలయమందు త్రిమూర్తులను ఆరాదించుటకు వీలు కలిగించుట ఇచట గుర్తింపతగినది.

శిల్పాలు:

నాలుగవ గుహకెదురుగాకూడా కొంతదూరములో సెలయేటి తూర్పు ఒడ్డున పశ్చిమ ముఖముగా ఒక చిన్న దేవగృహము కలదు. ఇందు శివలింగము ప్రతిష్ఠింపబడియున్నది. గృహమున కిరువైపులా బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములు కోష్ఠములందు గలవు. మూడవ గుహకు ఎదురుగా సెలయేటికి అవతలి ఒడ్డున గల శిలాఖండముపై హరిహర, పటరాజ శిల్పములు గలవు.

ఉపసంహారము:

భైరవకోన గుహాలయాలు పల్లవ,పశ్చిమ చాళుక్య. రేనాటి చోడుల వాస్తు, శిల్పరీతుల సమ్మిళితమును కలిగియున్నవని చెప్పవచ్చును. ఈ గుహలలోని heavy figures, flat modelling, revealing linearism, high curved ends of the shoulders, rigid frentality ప్రాంతీయ కళాప్రభావాన్ని తెలుపుచున్నవి. కడప ప్రాంతపు రేనాటి చోడులు ప్రాంతీయ రాజవంశంగా నెల్లూరు ప్రాంతాలనుకూడ కొంతకాలము పాలించారు. సింహ పాద స్తంభములు,బ్రహ్మ,విష్ణు,ద్వారపాలకుల అర్ధశిల్పములు,శిల్పములందు గల schematic emphasis, అభియముద్రరూపణ,శంఖ చక్రముల రూపణ,ఎత్తైన కిరీటము,కొమ్ములుగల ద్వారపాలకులు, వారి దృష్టివంటివి పల్లవరీతిని (mannerism) తెలుపుచున్నవి. నాసిక లేక కూడుల పైభాగాన గల కీర్తిముఖతలలు (సింహతలలు) 'చిత్రఖండ' స్తంభాలు, 'భేకిభైవ' శిల్పరూపము,ఏకశిలా నందివంటివి పశ్చిమ చాళుక్యుల వాస్తుశిల్పరీతి ప్రభావాన్ని తెలుపుచున్నవి. భైరవకోన గుహాలయములు రేనాటి చోడులవై(కడప). యుండవచ్చుననికూడ ఒక అభిప్రాయాన్ని కె.ఆర్.శ్రీనివాసన్ గారు తెలిపారు. డా॥రాజేంద్రప్రసాద్ గారు ఇచటి మొదటి రెండు గుహాలయాలు 'నిర్మాణ రీతినిబట్టి క్రీ.శ 8వ శతాబ్దము మొదటి అర్ధభాగ కాలానికి చెందినవనియు,మిగిలినవన్ని క్రీ.శ 750-850 మధ్య కాలానికి చెందినవనియు అభిప్రాయపడినారు.

Dr. B. Rajendra Prasad says:

"The date of this Rock-cut Temples can be fixed with the help of Inscriptions. The Inscriptional label recording 'Brahmiswara Vishnu' found between temples 1 and 2 in Pallava grantha characters is ascribed to 8th century. Another inscription on the Southern end near temple 8, records that Lokama, the daughter of a Prince Rajaporeri and grand daughter of Govindaporari caused the erection of the shrine. This is dated to 9th century A.D. The stylistic analysis of the temples suggest that the cave temples No. 1 and 2, belong to the first half of 8th century A.D., while the rest of the shrine have been excavated during 700 to 850 A.D."

కాని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారు ఇచ్చటి గుహాలయాలు పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మ కాలమున క్రీ.శ. 7వ శతాబ్దమున ఆ రాజుచే నిర్మింపబడినవని. కాని రెండు దశలలో నిర్మింపబడినవని, కావున భైరవకోన గుహాలయాలు క్రీ.శ. 7వ శతాబ్దము మొదటి అర్ధభాగము నుండి క్రీ.శ. 8వ ఉత్తరార్ధమునకు మునుపే రూపొందించబడినవని అభిప్రాయపడిరి. ఇదే అభిప్రాయమును మరుపూరు కొదండరామరెడ్డిగారు వెలిబుచ్చిరి. భైరవకోన గుహాలయాల నిర్మాణము ఉపసీక భోధిశ్రీ (238) అను బౌద్ధ భిక్షువుని కాలములో జరిగినదని శ్రీ సిరిపురం చంద్ర హాస్ గారు తెలిపిరి ఆర్.సుబ్బారెడ్డిగారు ఇవి తూర్పు చాళుక్య రాజైన కుబ్జ విష్ణువర్ధనుని కాలమునకు చెందినవై యుండవచ్చునని తెలియజేసిరి. దీనికి కారణం నెల్లూరు తూర్పు చాళుక్యుల పాలనలో యుండగా పల్లవరాజైన మహేంద్రవర్మ అతని తరువాతి రాజులు చాళుక్యులతో పోరాడి నెల్లూరును ఆక్రమించి కొంతకాలము మాత్రమే పరిపాలించిరని, కావున ఈ గుహాలయాలు తూర్పు చాళుక్యుల కాలానివేయని భావించినారు. కాని మహేంద్రవర్మ ఆంధ్రలో ఆనాటికే నిర్మించబడియున్న గుహాలయములను చూసి తన రాజ్యమున మహాబలిపురము, మొదలగు ప్రాంతములందు గుహాలయములు నిర్మించెనని వీరి అభిప్రాయము.

భైరవకోన గుహాలలో "త్రిభువనాదిత్యం" అంటూ చాళుక్యరాజుల పేర్లు మాత్రమే కాక, చాళుక్యశిల్ప గుణాలు చాలా కనపడుతున్నాయి. ఇక్కడి గర్భాలయాలలోని లింగములమీద బ్రహ్మసూత్రాలు భేదముతో కనపడుచున్నవి,అన్నీ ఒకేలాగు లేవు. రెండు నిలుపు గీతల నడిమి గీత ఇక్కడివింత. పల్లవులెరిగిన ధారా (డోరియాల) లింగము ఇక్కడ లేనేలేదు. శివలింగమునకు 'భస్కత్రి పుండ్రములు నడ్డముగా నుండక. మధ్య నొక చుక్కయు నడుమ మూడు నిలువు గీతలు,వాటి కిరువైపులా నర్ధచంద్రాకారముగా రెండు గీతలుండుట మరెచ్చటను కానపడవు'. పల్లవ గుహాలయాలలోని దేవతా విగ్రహాలకు తలచుట్టూ ప్రభామండలాలు కానరావు. చాళుక్యుల దేవతా విగ్రహాలకు ఉంటాయి. అవి ఇక్కడ హరిహరనాధునికీ, ద్వారపాలకుల ప్రక్కనున్న అర్ధశిల్ప విగ్రహాలకీ ఉన్నాయి (12, 23, 26,27,28 వ చిత్రపటములు చూడుము). హరిహరనాధుడు చాళుక్య త్రిశూలము పట్టుకొనియున్నాడు. బాదామి హరిహరునివలె గోడ కంటుకు పోయినాడు. నటరాజుకిన్నీ ఎనిమిది చేతులున్నాయి. (12, 23 వ చిత్రపటములు చూడుము). పల్లవ విగ్రహాలకు నాలుగు మించి సామాన్యంగా ఉండవు. నటరాజా వస్త్రానికి చాళుక్య శిల్పంలో లాగా గీరలున్నాయి. ఏడవ గుహ స్తంభాల హారాల అలంకారమూ, గూళ్ళ అజంతా నాతాయనపు పోలికలూ, పరశురాముని పట్టదక్కర్, విరూపాక్ష శివుని జటాభరమూ, ద్వారపాలుర వృష్ఠ స్వస్తికా విన్యాసపు జ్ఞాపకమూ ఈ గుహాలయాల చాళుక్య సాంప్రదాయాల్ని నిరూపిస్తాయి. ఇక్కడి పానవట్టాలు పశ్చిమ చాళుక్య ఆలయాలలో ఉన్నట్లే చతురస్రాలు. వాటి ముక్కులు సన్ననివి. ఈ గుహాలు రాజుల నిర్మాణాలుగా అగుపడక తపస్సుల గౌరవార్ధము శిల్పులు మలచినట్టివై యుంటాయనిపిస్తుంది (వీటి మొత్తపు చేరికలో సౌందర్యము తోపించడము చూస్తే) కనుకనే ఇంత చిన్నవిగా ఉన్నవి. అయితే ఇవి దేవాలయాలు మాత్రమౌను వీటిలోని శిల్పముల ఏర్పాటు చూస్తే ఇవి కట్టుడు అమర్చినారా అనిపిస్తుంది. పల్లవుల ఆలయాల పార్శ్వాలలోనూ, చోళ, చాళుక్య ఆలయాలలోనూ దేవతా విగ్రహాలుంటాయి. బిక్కవోలులోని చాళుక్య ఆలయాని కొకదానికి ఉత్తరాన మహిషమర్దనీ, పశ్చిమాన సూర్యుడూ, దక్షిణాన నటరాజా ఉన్నారు. చోళ ఆలయాలలో అర్ధనారి, బ్రహ్మ, దక్షిణామూర్తీ కలరు. ఇక్కడ పార్శ్వాలలో బ్రహ్మ, విష్ణువులు ద్వారపాలకుల ప్రక్కకి వచ్చారు. వేరు గూళ్ళలో ఉన్నారు.