ఆంధ్ర గుహాలయాలు/భైరవకోన శిల్పసంపద
భైరవకోన శిల్పసంపద
భైరవకోనయందు హరిహర నటరాజులున్న బండమీదనే భైరవుణ్ణి నిలిపియున్నారు (12, 32వ చిత్ర పటములు చూడుము). ఇచటి భైరవ శిల్పము ఎక్కువ ప్రాచీనమైనదికాదు. విజయనగర కాలము నాటిది. భైరవుని చుట్టూ నిర్మింపబడిన ఆలయము ప్రాగుటూరు ప్రాంతపు 'ఝూర్జర', 'ప్రతీహారుల' ఆలయాలు పోలికతో వున్నది ఈ భైరవుణ్ణిబట్టి ఈ కొండనూ, కోననూ భైరవుని పేరుమీదనే వ్యవహరిస్తున్నారు. శివుడు భైరవస్వామి రూపమున సర్వసాధారణముగా ఉగ్ర లేక ఘోర రూపమును కలిగియుండును. కానీ ఈ రూపపు శివుని ఘనతలకు చెందిన ఎట్టి కథలు ఉండవు. విరూపాక్ష, వీరభద్ర, ఆఘోర, రుద్రపాశుపతి మొదలగునవికూడా ఈ తెగకు చెందినవే. ఆగమములు 64 భైరవులగూర్చి తెలుపుచున్నవి. వీరు ఎనమండ్రు లెక్కన ఎనమండ్రు కూటములుగా విభజింపబడిరి. ఒక్కొక్క కూటమి నాయకులు వరుసగా అసితంగ, రుద్రచండ, క్రీధ. ఉన్మత్తభైరవ, కపాల, భిషాణ, సంహారలు: ఉత్తర, దక్షిణ భారతదేశమున సాధారణముగా బటుక (వటుక) భైరవ లేక యునభైరవుడు. రూపమందవ గ్రంథము వటుక భైరవుడు ఎనిమిది చేతులను కలిగియుండును. ఒక చేయి అభయ హస్తముగను,మిగిలినవి ఖట్వంగ, పాశ, శూల, డమరు, కపాల, సర్పము, మాంసపు ముక్కలను కలిగియుండునని తెలుపుచున్నది (కట్వంగం మాంసపాశం చశూలంచతథతం కరౌ/డమరు చ కపాలం చ వరదం భుజంగం తథ). భైరవునికి ఒకవైపున శునకము వుండవలెను. వటుక భైరవకల్ప గ్రంథమున భైరవుడు త్రినేత్రములను, ఎర్రటి శరీరాన్ని (రక్తనిగ్రహం) కలిగియుండవలెనని చెప్పబడియున్నది. నాలుగు చేతులు కలిగి వాటిలో శూలము, పాశము, డమరు, కపాలము లుండవలెను, శునకవాహనుడై వుండవలెను నిరంబరుడుగా పిశాచములు, గణాలు చుట్టుముట్టబడి యుండవలెను. ఒక అద్భుత భైరవశిల్పము నెల్లూరు జిల్లా, వాకాడు తాలూకా, మల్లాం గ్రామంలోని సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయ కళ్యాణమండపమున కూడా గలదు. మల్లాంలోని భైరవుడు యువకుడుగా అభంగమున నిలచి, నిరంబరుడుగా వున్నాడు. నాలుగు చేతులు గలవు. కుడిచేతులలో డమరు, త్రిశూలములు. ఎడమ చేతులలో పాశము, కపాలములు గలవు. త్రినేత్రములు గలవు. శిరస్సు జటామకుట భూషణముతో వున్నది. ఇతడు చక్రకుండలములు, గ్రెమ్ వేయకలు, యజ్ఞోపవీతము, ఉదరబంధ, నాగకటి సూత, కడియాలు కంకణాలుగంటల దండలను కలిగియున్నాడు. ప్రక్క దంతములు, రౌద్రాకారము కలిగియున్నాడు. ఇతని వెనుక కొంత కుడివైపుగా ఒక శునకము గలదు. ఇది చాలవరకు "వటుకభైరవకల్ప"మందు చెప్పబడినట్లు చెక్కబడియున్నది. అనేక చోళ, విజయనగర భైరవ శిల్పాలు మనకు దక్షిణదేశమున అగుపడును. పటిపం, అండనల్లూర్, హ్రయంలలోను, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వర, కాశీవిశ్వేశ్వర దేవాలయాలలోను, విజయనగర శిల్పకళకు చెందిన తాడిపత్రి, శ్రీశైలం ప్రాంతాలలోని శిల్పాలోను ఇట్టివే మన కగుపడును.
While writing about Bhairavamurti T.N.Srinivasan says : "Siva as the protector of the world is represented as a very fierce image with protunding eyes., and there will be long curved teeth in the mouth protruding out from the upper lip. He will be represented with strange ornaments like garlands of snakes and skulls and even in the head-dress skulls will be shown. There are as many as sixty four types of Bhairava Murtis, most of them having ghastly appearanced.
Bhairava is worshipped in many Siva temples outside the main shrine but he is an important deity with village communities for whom small shrines are dedicated in the localities where they live."
శ్రీనాధ మహాకవి తన క్రీడాభిరామ కావ్యమున (వీధి రూపకమున) తిప్పయ వల్లభుడు తనకు మూడు గ్రామములు సర్వభోగములుగా ఇచ్చి 'ములికినాటి' లోని 'మోపూరి'ని పాలించుచుండెనని వర్ణించినాడు. మోపూరు నెల్లూరు మండలములోని ఉదయగిరి సీమలోని దనుట జగద్విదితము. అక్కడనే భైరవాలయమున్నది తిప్పయ వల్లభు డా భైరవస్వామి భక్తుడట. పూర్వము భైరవునికి తిరునాళ్ళు వైభవముగా జరిగెడిదవియు,ప్రజలు తండోప తండాలుగా జేరెడువారనియు, అందు జనుల యానందమునకై ప్రాయికముగా నాటకము లాడబడెడివనియు అట్టి వాటిలో క్రీడాభిరామ మొక్కటనియు దెలియుచున్నది. ఆ కావ్యమున భైరవస్వామి ఇట్లు వర్ణింపబడినాడు.
సీ॥:చంద్ర ఖండములతో సరి వచ్చుననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహముల వాని/
- భవదంపుఁ గొనలతోఁ బ్రతివచ్చుననవచ్చు కుటిల కోమల జటాచ్చటల వాని/
- నింద్రనీలములతో నెనవచ్చుననచ్చు కమనీయతర దేహకాంతి వాని/
- నుడురాజు రుచులతో నొఱవచ్చుననవచ్చు చంచన్మ దాట్టహాసముల వాని॥
గీ॥: సిగ్గుమాలిన మొలవాని జఱుతవాని
- నెల్లకాలంబు ములికి నాడేలు వాని
- వర్ధి మోపూర ననతారమైన వాని
- భైరవునిఁ చొల్వ వచ్చిరి భక్తులెల్ల (పీఠిక)
క॥: నటులది దోరసముద్రము
- విటులది యొర్గుల్లు కవిటి వినుకొండ,మహా
- పుట లేదన మీ త్రితయము
- విటఁ గూర్చెను బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్॥ (పుట 88)
దీని నాటక కర్త వినుకొండవాడని, నటులు బళ్ళాల రాజుల రాజధానియగు దోరసముద్రము (ద్వారసముద్రము) వారని ప్రదర్శన స్థానము భైరవకోన యవి తెలియుచున్నది
భైరవకోనలోని మూడవ గుహకు ఎదురుగా సెలయేటికి అవతలి ఒడ్డున పశ్చిమ ముఖముగా హరిహర నటరాజ అర్ధశిల్పములు గలవు (23, 12వ చిత్రపటములు చూడుము). ఇవి క్రీ. శ. 9వ శతాబ్దమునందు చెక్కబడినవిగా తెలియుచున్నది. హరిహరుని ప్రతిమ ఆనాటికే ప్రజ్వరిల్లియున్న మత ఉద్యమముల ప్రభావమును తెలుపుచున్నది. క్రీ.శ. 400-600 మధ్యకాలమున నయనార్లు శైవమత వ్యాప్తికి, క్రీ. శ. 5-6 శతాబ్దముల మధ్య ఆళ్వారులు వైష్ణవ మత వ్యాప్తికి భక్తి ప్రధాన సంకీర్తనలతో దేశమందు తిరిగి ప్రజలకు అర్ధమగు భాషలో భోధించి మతప్రచారము చేయసాగిరి పల్లవుల కాలము నాటికి ఈ భక్తితత్వం ప్రధాన స్థానంలో యుండి అన్ని మతముల ప్రభోదమునకు సమాన అవకాశములు గల్పింపబడెను. ఈ అన్ని మతముల లేక మత తెగల సమానత్వ భావమే మనకు భైరవకోనయందలి హరిహరుని శిలారూప రచన యందు అగుపడును. ఇచట హరిహర, నటరాజులు ఎనిమిది చేతులు కలిగి, ఆయుధములు ధరించియున్నారు. ఇవికూడ పల్లవుల కాలమునకు చెందినవి ఒక అభిప్రారము గలదు, వీరిద్దరు కర్ణకుండలములను ధరించియున్నారు. హరిహరుడు ఎత్తైన పల్లవరీతిలోని 'ఉష్ణిషను' కలిగియున్నాడు. హరిహరనాథ విగ్రహములు మహాబలిపురమందు. గంగైకొండ చోళపురములందు కూడ కలవు. భైరవకోనలోని హరిహరుడు స్థానక ఆసనములో యున్నాడు. కుడివైపు నాలుగుచేతులలో ఒకటి అభయముద్రలో యున్నది. మిగిలిన మూడింటిలో ఖడ్గము, అక్షమాల, పరశులు గలవు. ఎడమవైపు గల నాలుగు చేతులతో ఒకటి కాట్యవలంబిత లేక కటి హస్త ముద్రలో యున్నది. మిగిలిన మూడింటిలో శంఖు చక్రములు కలవు. శిరస్సుపై కరండమకుటమును కలిగియున్నాడు. యజ్ఞోపవీతమును ధరించియున్నాడు. ఉదరము వరకు వస్త్రము ధరించియున్నాడు. ప్రభామండలము గలదు.
క్రీ. శ. 13వ శతాబ్దమువాడైన తిక్కన హరిహరనాధ సంబోధనలను పర్యాలోచించినచో కూడ శివకేశవ లక్షణ లక్షితమైన హరిహరమూర్తి విశేషము తెలియును. తిక్కనకు ముందే ఆళ్వారులు హరిహర స్వరూపములు రెండును ఒకటిగనే తెలిపిరి. దీనినే తిక్కన విపులముగా ప్రచారము చేసెను రామానుజులు వైష్ణవ మతమును, బసవేశ్వరుడు శైవమును ప్రచారము చేసిరి. శైవ, వైష్ణవ భేదములు సంఘమున మత విషయకమైన అనైక్యము వేరు తన్నుకొనబోవుతున్న కాలమున "ఆంధ్రావళి మోడముం బొరయు" నొక మహనీయమైన కార్యమును నిర్వహించుటకు నవతరించిన "కారణజన్ముడు" తిక్కన. శివకేశవ భేదమును తిక్కన నిరసించెను. ఇతనిది భేదములేని భక్తి. కావుననే మహాభారతమును హరిహరనాథునకు అంకిత మిచ్చెను. హరిహరనాథునుద్దేశించి శ్రీ మహా భారతమున తిక్కన 193 పద్యములు వ్రాసినాడు. తిక్కన అద్వైత వేదాంతమునందు నిష్ఠ కలిగియుండి జీర్ణించు కొనియుండినాడు. తిక్కన కాలము శైవ, వైష్ణవ మతములకు స్పర్ధయు, తత్తన్మతావలంబులలో పరస్పర విద్వేషమును ప్రబలి, సంఘము విచ్ఛిన్నమగు లక్షణములు అంతంత కధికము కాసాగినవి. అప్పుడు కవిబ్రహ్మ అది శ్రేయోమార్గము కాదని గమనించి, శివకేశవా భేదరూప ధర్మాద్వైతమును నెలకొల్పి, ప్రజానీకమునకు ప్రబోధమొనగ సంకల్పించినాడు, తాను హరిహరనాథ రూప పరతత్త్వమును భావనచేసి, అద్వైతానుసంధానమున నారాధించి లోకమునకు ఉత్తమ మార్గదర్శియైనాడు.
తిక్కన కాలమునకు ముందే హరిహరనాథ విగ్రహము - తదర్చన బాదామి, హరిహర పట్టణము (కర్ణాటక రాష్ట్రం), భైరవకోనలోను హరిహరుల ఏకరూపమైన విగ్రహములున్నట్లు. 13వ శతాబ్దమునకు ముందు కాలమునకే చెందినట్లు తెలియుచున్నది. కాని హరిహరనాథుని నామరూపములు తిక్కనవలన ప్రచారము జరిగినదని చెప్పవచ్చును. నాచనసోముడు, వేంకటనాధుడు, గోపరాజు, కంభంపాటి నారపామాత్యుడు తిక్కన పద్ధతిని అనుసరించి శివకేశవ లక్షణ లక్షితునిగా వర్ణించి అతనికి తమ కృతులను అంకితమిచ్చిరి.
హరిహరుడు,నటరాజులు ఆలయాలకొరకు కాక శిల్పులు సరదాకు భైరవకోనలోని 3వ గుహాలయము ఎదుట ఉన్న బండలో చెక్కినట్లున్నది (12, 23వ చిత్రపటములు చూడుము).
T.N. Sreenivasan writes about Hariharamurthi (Sankranarayana) thus: This is also a combination image of Siva and Vishnu, as described in the Vamana Purana. As in case of Ardhanareesvaramurthi, the two halves have characteristics of Vishnu and Siva. Usually the image has four arms carrying Chakra on one side and Mazhu on the other side. The lower arms are in abhaya and varada poses. The famous temple at Sankaranarayana-koil is dedicated to this form of Siva and so also that at Harihar in Mysore". కాని భైరవకోనలోని హరిహరుడు ఎనిమిది చేతులను కలిగి వాటియందు ఆయుధములను కలిగియున్నాడు (12, 23వ చిత్రపటములు చూడుము).
భైరవకోనలోని మూడవ గుహాలయానికి ఎదురుగా సెలయేటికి అవతల ఒడ్డున పశ్చిమ ముఖముగా హరిహరుని ప్రక్కనే నటరాజ అర్ధశిల్పము గలదు (12, 23వ చిత్రపటములు చూడుము). నటరాజుకూడ హరిహరునివలె కర్ణకుండలములను ధరించి ఎనిమిది చేతులను కలిగి అందు ఆయుధములను ధరించియున్నాడు. నటరాజు వస్త్రానికి గీరలున్నవి. కుడివైపు గల నాలుగు హస్తాలలో ఒకటి అభయముద్రలోయున్నది. మిగిలిన మూడింటిలో డమరు, శూలము, ఖట్వంగములను కలిగియున్నాడు. ఎడమవైపు హస్తాలలో ఒకటి గజహస్తముద్రలో యున్నది మిగిలినని పాశ మొదలైన ఆయుధమునలు కలిగియున్నది. శిరస్సుపై కిరీట మకుటం గలదు. నడుముచుట్టూ సర్పము గలిగి ఎడమవైపుకు నటరాజు నడ్డి వంచియున్నాడు.
శివప్రతిమలను వాటి "గుణము"ల బట్టి స్థాపక, ఆసన విభాగాలుగా చేయవచ్చును. శివునికి సంబంధించి శయన రూపములు లేవు. శివుని రూపాలను శాంతమూర్తులు, అనుగ్రహమూర్తులు, సంహారమూర్తులు. ఉగ్రమూర్తులు, నృత్యమూర్తులు అను ఐదు విభాగాలుగా చేయవచ్చును. వీటిలో నృత్యమూర్తులు వృత్యరూపాలను కలిగియుండగా మిగిలిన మూర్తులందరూ స్థానక లేక ఆసన రూపమున వుండును.
శివునిగూర్చిన అధ్యయనంలో నృత్యరూపము చాలా ఆసక్తికరమైనది. భరతనాట్య గ్రంథమున 108 రకాల నృత్యముల ప్రసక్తి వున్నది. దీనినిబట్టి ఇవన్నియు శివుడు చేసెనని చెప్పవచ్చును. కానీ శివుని నృత్య రూపాలనన్నింటిని ఖచ్చితముగా తెలుపుట కషము. తారక వనమందలి ఋషుల గర్వాన్ని శివుడు అణచిన రీతినుండియే శివనృత్యము ఉద్భవించినదని పురాణములు తెలుపుచున్నవి. ఈ ఋషులు తపస్సులు చేసి తమ ఘనతకు గర్వపడుచుండిరి. కానీ వారి సతులు దానిని నిరసించుచుండిరి కడకు వారు దేవతాశక్తులనే నిరసించుచుండుటనే శివవిష్ణువులు వీరి చర్యలను అణచవలచిరి. విష్ణువు అందగత్తెయైన మోహిని అవతారమును ధరించగా శివుడు అందమైన నిరంబర యువకుడుగా భిక్షాటనమూర్తి రూపమున సతిని తరుముచున్నట్లు నటించుచుండగా విష్ణువు దూరముగా పారిపోయెను. అందమైన స్త్రీరూప విష్ణువును చూసిన ఋషులు తమ తపోకృషినంతటిని మరచి మోహినిపై దృష్టి కేంద్రీకరించిరి. వారి భార్యలుకూడా ఆ కన్యను పట్టుకొనిరి. శివుడు కడకు ఆ కన్యను తీసుకొని వెళ్ళెను. కాని వీరు తమ హృదయములను కోల్పోయిరి. కన్య విషయమున కల్పించుకొనుటకు కోపోద్రిక్తులై ఋషులందరు ఒక క్రతువును చేసి ఒక సర్పమును, పులిని, నాశము చేసెడి అగ్నిని, ఒక మమూలకుడనెడి రాక్షసుని సృష్టించిరి. వీరినందరినీ శివుడు నాశనముచేసి, సర్పాన్ని తన ఆభరణముగా, పులిచర్మాన్ని తన వస్త్రముగా, అగ్నిని తన ఆయుధముగా చేసుకొని మమూలకుని దేహముపై నృత్యము చేసెను. ఇది ఒక పురాణగాథ. ఈ శివరూపమునే "నటరాజు" - నృత్యకారులకు రాజు అందురు.
"In the brief the essential significance of Siva's dance is threefold.
Firstly, it is the image of His rhythmic activity as the cource of all movement within the cosmos which is represented by the encircling arch or Prabhavali.
Secondly, the purpose of His dance is to release the countless souls of men from the snare of illusion - Maya.
Thirdly, the place of His dance - Chidambaram, the centre of the universe is within everyone's heart.
In brief the dance that Siva makes is believed to symbolise the action of cosmic energy in creating, preserving and destroying the visible universe."
శివుని నటరాజ రూప దేవాలయాలలో చిదంబరమందలి దేవాలయము ముఖ్యమైనది ఇచటనే కనకసభయనెడి కేంద్ర దేవగృహమందు నటరాజు శివకామసుందరి రూపమున వున్న తన సతియైన పార్వతితోపాటువున్నాడు. శివుడు నటరాజు రూపమున అన్నిరకాలలోను స్థానక రూపమున చూపబడియుండును నటరాజు రకాలలో ఆనందతాండవ (మమూలక రాక్షసుని దేహమునై నృత్యము చేయుట), సంధ్య తాండవ (రాక్షసుడు లేకుండా ఉన్న నృత్యము). ఉమాతాండవ (ఎడమవైపున ఉమ నిలుచొనియున్న నృత్యము), గౌరీతాండవ(కుడివైపు నందికేశ్వరుడు. ఎడమ ఉమ యుండగా నృత్యరూపము), కలికతాండవ (2 కండ్లు, 8 చేతులు కలిగి త్రిశూలము. noose, kettledrum, కపాలము, నిప్పు(fire bell), అభయ,వరద పోజులుండుట, త్రిపురతాండవ (16 చేతులు, ఆయుధములు కలిగి గౌరి, స్కంధ చెరొకవైపుండుట), సంహారతాండవ (8 చేతులు కలిగి పుర్రెల హరము గలిగి ఉగ్రరూపము గలిగియుండుట). లలితతాండవ (4 లేక 8 చేతులు గలిగి పీఠముపై కాళ్ళుగలిగి కొంత లోనికి వంగియుండును). ఊర్ధ్వతాండవ (కుడికాలు తలవరకు పైకెత్తి, ఎడమకాలు అపస్మారునిపై వుంచి 16 చేతులు కలిగి ఆయుధాలనేకము గలిగి మధుర, రామనాధపురం, తిరణల్వేలిలోని స్తంభాలు పాండ్యకాల శిల్పాలవలె యుండును) ములు గలవు. ఆగమములుకూడా 108 శివనృత్యాలగూర్చి తెలుపుచున్నవి. భరతనాట్యమందలి అనేక నృత్యరీతుల అర్ధశిల్పాలు చిదంబరమందలి నటరాజ దేవాలయ తూర్పు ప్రవేశద్వారమువద్ద చెక్కబడియున్నవి.
మహేశ శిల్పసార గ్రంథము ప్రకారము శివుని రూపాలు 16, కారణాగమ ప్రకారము 25. శివుని రూపాలన్నింటిని శాంత, అనుగ్రహ, సంహార, ఉగ్ర, నృత్య మూర్తులుగా ఐదు విభాగాలు చేయవచ్చును. శివుడు లేక మహేశ్వరుడు మానవాకారంలో స్థానక లేక ఆసనరీతిలో నాలుగు చేతులు కలిగియున్నట్లు చూపబడును. పై చేతులలో ఢంక,మఝులను కలిగి క్రిందివి అభయ,వరద ముద్రలలో వుండును. జటామకుటమున శిరోజాలు, వాటి ఎడమభాగాన అర్ధచంద్రుడు, కుడిభాగాన గంగాదేవి, సర్పము, అర్క పురుషులను కలిగియుండును. త్రినేత్రములు కలిగియుండును. పీతాంబరములనుగాని, జింకచర్మముగాని, పులిచర్మముగాని మోకాళ్ళవరకు ధరించియుండును. అతికొద్ది ఆభరణములను కలిగియుండును. సాధారణముగా శరీరమునకు, చేతులకు సర్పము చుట్టుకొనియుండును. ఎడమ చెవికి స్త్రీ ఆభరణమైన లంబపాత్రను, కుడి చెవికి పురుష ఆభరణమైన మకర కుండలాలను కలిగియుండును. కొన్ని సందర్భాలలో శివుడు అనేక శిరస్సులను, నాల్గుకన్న ఎక్కువ హస్తములను కలిగియుండును. మహా సదా శివుడు సుమారు 50 శిరస్సులను కలిగియుండగా ఊర్ధ్వనృత్యమూర్తి సుమారు 16 చేతులను కలిగి అనేక ఆయుధములను ధరించియుండును. ఇట్టి ప్రతిమలు మధుర, రామనాథ్, తిన్నవెల్లి జిల్లాలలోని పాండ్యుల దేవాలయ స్తంభములపై అగుపడును కాని నెల్లూరు జిల్లా మల్లాంలోని సుబ్రమణ్యేశ్వర దేవాలయమందలి మహా సదాశివుడు 5 శిరస్సులు, 16 చేతులు కలిగి అందు వివిధ ఆయుధములను ధరించియున్నాడు. బొంబాయికి 6 మైళ్ళ దూరంలోని ఎలిఫెంటా దీవి లోని క్రీ.శ 7వ శతాబ్దమునకు చెందిన రాష్ట్ర కూట కాలమునాటి గుహాలయమున ముదురు బ్రౌన్ శిల (sand stone) యందు ముఖ్య దేవగృహానికి ఎదురుగా (దక్షిణ కుఢ్యమున చెక్కబడిన) పెద్ద 18 అ॥ గల మూడు శిరస్సుల శివమహేశమూర్తి అర్ధ శిల్పము కలదు. ఇచటి శివమహేశమూర్తి ఎడమవైపు శిరస్సు భైరవ రూపమును, కుడివైపు శిరస్సు వామదేవ రూపమును, మధ్య శిరస్సు తత్పురుష శివరూపము కలిగియున్నాడు. భైరవ రూపము ఉగ్ర వినాశ శివ అవతారము. ఇందు శివుడు క్రూర మీస మూతి (cruel moustached mouth), కొర్కెపు ముక్కు (hooked nose), అలంకార శిరోవస్త్రము, సర్పము (ornamented head dress with cobra and deaths head)లను కలిగియున్నాడు వామదేవరూపము శివుని విశ్వదృష్టి అవతార చిహ్నము. This is an aspect (Siva) of creation with feminine features and blissful softness which is enhanced by the pearls and flowers in the hair and the lotus bud in the hand.
భైరవకోనయందు కూడా మహేశ అర్ధశిల్పము 4వ గుహాలయ గర్భగృహలోని శివలింగము వెనుకగల కుఢ్య ముఖభాగమున చెక్కబడియున్నది (24 వ చిత్రపటము చూడుము). ఇది ఎలిఫెంటా యందలి మహేశుని దాదాపు పూర్తిగా పోలియున్నది (24, 25వ చిత్రపటములు చూడుము) ఎడమవైపు శిరస్సు భైరవరూపమును, కుడివైపు శిరస్సు వామదేవ రూపమును, మధ్యశిరస్సు తత్పురుష రూపమును కలిగి, ఎలిఫెంటా మహేశుని వివరాలనే కలిగియున్నాడు.
బ్రహ్మ అవతారమునకు సంబంధించి పురాణాలు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుచున్నవి. హిరణ్యగర్భ అను బంగారు గుడ్డునుండి ఉద్భవించాడనియు, విష్ణు నాభినుండి పుట్టిన తామరపుష్పమునుండి ఉద్భవించాడనియు చెప్పబడుచున్నవి. బ్రహ్మకు ఆలయాలు నిర్మింపబడియుండుట అరుదుగా అగుపడును. బ్రహ్మకు పూజలు ఉండరాదని మోహినిచే శపించబడుటే ఇందుకు కారణము. ఈ విషయము బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడియున్నది. ఐననూ బ్రహ్మ ఆలయాలు కుంభకోణం, చిదంబరం, తిరువాడి, పుష్కర్ వంటి ప్రాంతాలలో నిర్మింపబడియున్నాయి. బ్రహ్మ సాధారణంగా ఆలయాల స్తంభాలపై చెక్కబడియుండును. శివాలయాల ముఖ్య దేవగృహ ద్వారమునకు ఉత్తరవైపున గల కుఢ్యభాగమున రూపొందింపబడి యుండును. శివుడు త్రిపుర అను రాక్షసుని వధించుటకు పోవునపుడు అతని రథచోదకుడుగా యున్నట్లు శివాలయాల రథాలలో బ్రహ్మ (కొయ్యతో) చెక్కబడియుండును. బ్రహ్మ నాభినుండి పుట్టిన తామరపుష్పమునుండి ఉద్భవించినట్లు వైష్ణవాలయాలలో బ్రహ్మ చూపబడియుండును. బ్రహ్మ (శిల్పమందు) స్తానక లేక ఆసీన రూపాలలో చతుర్ముఖుడై యుండవలెనని రూపమందన అనెడి గ్రంథమునందు తెలుపబడియున్నది. చతుర్ముఖము చతుర్వేదాలకు, నాల్గుదిక్కులకు చిహ్నమని అభిప్రాయము గలదు. తొలుత బ్రహ్మ పంచముఖుడనియు, శివుడు కోపముతో ఒక శిరస్సును ఖండించివేయుటచే నాల్గుశిరస్సులే మిగిలినవి తెలియుచున్నది. బ్రహ్మ చతుర్భుజుడు. ఇతడు చతుర్భుజుడు. ఇతడు సాధారణంగా కమండలము, అక్షమాల, సృవ, శ్రిక్, అజ్యస్థళి, పుస్తకము, కుర్చీలను తన రెండు పైచేతులలో ధరించియుండును. క్రిందవైపు కుడి, ఎడమ హస్తాలు సాధారణంగా అభయ, వరద ముద్రలలో యుండును. బ్రహ్మ ఎరుపుగా యుండునని విష్ణుపురాణము, సుప్రభేదాగమము తెలుపుచున్నవి. కాని శిల్పరత్న గ్రంథము బ్రహ్మ తెల్లగా యుండునని తెలుపుచున్నది కొన్ని సందర్భాలలో ఈయన గడ్డము, మీసాలను కలిగి శిరోజాలు జటామకుటముగా కలిగియుండును. ఈయన మజరకుండల, ఉదరబంధ. కడియాలు మొదలగు ఆభరణాలను ధరించియుండును. కొన్ని సమయాలలో ఈయన సరస్వతి లేక ఇరువైపులా సరస్వతి, సావిత్రి దేవీలను కలిగి ఏడు హంసలచే లాగబడుచున్న రథమందు పయనించుచున్నట్లు చూపబడియుండును.
కుంభకోణం, తిరువాడి, చిదంబరం, కండియూర్, మామల్లపురం, తిరువొత్తియూర్ లందు అద్భుతమైన బ్రహ్మ శిల్పాలు గలవు. కుంభకోణం దగ్గరలోని స్థానక బ్రహ్మ శిల్పములు గలవు.
భైరవకోనయందలి గుహాలయాల ముఖ్య దేవగృహ ద్వారాల ఉత్తరవైపు కుఢ్యభాగాలలో కూడా స్థానక బ్రహ్మ శిల్పము రూపొందించబడియున్నది ( 26వ చిత్రపటము చూడుము). ఇది కొంతవరకు కుంభకోణం బ్రహ్మ శిల్పమును పోలియున్నది. భైరవకోనలోని బ్రహ్మ నాల్గు హస్తములను, మూడు శిరస్సులను కలిగి స్థానకరూపమునయున్నాడు. కుడివైపు ముందు గల హస్తము అభయముద్రలో యున్నది. వెనుకహస్తమందు పుస్తకము కలదు. ఎడమవైపు ముందు గల హస్తము వరదముద్రలో యున్నది. వెనుకహస్తమందు అజ్యస్థలి (ghea pot) యున్నది. ఇతడు మకరకుండలము, ఉదరబంధము, చేతికడియాలు మొదలగు ఆభరణాలు ధరించియున్నాడు. జఠామకుటములో ఇతవి శిరోజాలు గలవు.
హిందూ మతమందు విష్ణువు ఒక ముఖ్యదైవము. వేదకాలమునుండి ఇతని ఆరాధన యున్నది. వేద కాలమున ఇతనిని సూర్యుడుగా కూడా భావించుట జరిగినది. ఋగ్వేదమున ఇతనిని రక్షకుడుగా, ప్రాచీనుడుగా కూడా ఆరాధించుట జరిగినది. ఇతిహాస పురాణకాలాలలో ఇతడు మరింత ప్రముఖ దేవుడుగా ఆరాధింపబడెను, ఆగమగ్రంథాలు ఇతని అనేక రూపాలనుగూర్చి వివరించుచున్నవి. వాటిలో వైఖానస ఆగమము, పంచరత్రాగమము, మాధవాచార్యుని తంత్రసారము, విష్ణుధర్మోత్తరము ముఖ్యమైనవి. సాధారణంగా విష్ణువు చతుర్భుజాలు గలిగి వెనుక గల రెండు హస్తాలలో శంభు, చక్రాలను ధరించి, ముందు గల రెండు హస్తాలు అభయ. వరద ముద్రలలోను లేక కుడివైపు హస్తము అభయ (లేక వరద) ముద్రలోను, ఎడమవైపు హస్తము గద లేక పద్మమును కలిగియుండును. ఇతడు కిరీటమకుట, మకరకుండల, హార, రేయుర, కంకణ, ఉదరబంధ, కటిబంధ, యజ్ఞోపవీత మొదలగు ఆభరణాలను ధరించియుండును. కుడి వక్షస్థల భాగాన శ్రీవత్స అనెడి మచ్చ కలిగియుండును, దీని సమీపాన శ్రీలక్ష్మిని కలిగియుండును. అంతేగాక వైజయంతిమాలను, కౌస్తుభమణిని కూడా ధరించియుండును. సాధారణంగా ఇతని దేవీలయిన శ్రీలక్ష్మి, భూదేవి లేక పృధ్వి కూడ ఇతనితోబాటు యున్నట్లు చూపబడును. మరికొన్ని సందర్భాలలో నీలదేవికూడ చూపబడును.
విష్ణువు స్థానక, ఆసవ,శయన రూపాలలో యోగ, భోగ, వీర, అభిచారిక అనెడి 12 రకాలలో లేక ద్వాదశ మూర్తులుగా రూపొందింపబడి యుండును. స్థానక రూపమందే విష్ణువు ఎక్కువగా చూపబడును. ఆసవ రూపములో చూపబడినపుడు విష్ణువు ఆదిశేషునిపై ఆసీనుడై వున్నట్లు సాధారణముగా చూపబడును, ఆదిశేషుడు లేకుండా కేవలం ఆసనమూర్తి రూపంలో అతి అరుదుగా అగుపడును. శయనరూప విష్ణువు ఆదిశేషునిపై కుడివైపుకు వాలినట్లు శయనించి శిరస్సు కొద్దిగా దక్షిణముగా కలిగియుండును. కాని మామల్లపురం వంటి చోట్ల స్థలశయనస్వామి పేరుతో నేలపైననే పరుండినట్లు చూపబడియుండుట కూడ కలదు.
ఇక విష్ణు అవతారాలగూర్చి పరిశీలించినచో ఇతడు ముఖ్యంగా దశావతారములు కలిగియున్నట్లు తెలియుచున్నది. ఇతని అవతారాలగూర్చి పురాణాలు విపులంగా వివరించుచున్నవి. కొన్ని దశావతారాలగూర్చి తెలుపగా, భగవత్ పురాణము వంటి గ్రంథాలు విష్ణు అవతారాలు ఇరువదిరెండుగా తెలుపుచున్నవి. మరికొన్ని పురాణాలు మరి రెండింటిని చేర్చి మొత్తం ఇరువదినాల్గు అవతారాలుగా తెలుపుచున్నవి. అవి : మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన (త్రివిక్రమ), పరశురామ, రామచంద్ర (రఘురామ), క్రిష్ణ, బలరామ (లేక బుద్ధ), కల్కిపురుష, నారద, నారాయణ, కపిల, దత్తాత్రేయ, యాజ్ఞ, రిషభ, ప్రిథు, వేదవ్యాస, ధంవంత్రి, మోహిని, హయగ్రీవ అవతారాలు. ఈ అవతారాలలో విష్ణువు స్థానక రూపములో వుండి సాధారణంగా శంఖు (పాంచజన్యము). చక్రము (సుదర్శనము). పద్మము, గద (కౌమోదిక)లు కలిగియుండును. నందకం (sword), సారంగ (bow), బాణం (arrow), ఖేటక (shield) ములను కూడ కొన్నింటిలో ధరించియుండును. కాని విష్ణు సహస్రనామ గ్రంథమున వేయి అవతారాలగూర్చి తెలుపబడియున్నది. చెంగల్ పట్టు జిల్లాలో పలియశీవరం నందలి దేవాలయంలోను, తిరువేండ్రమందును మనము ద్వాదశ అవతారాల శిల్పాలను చూడవచ్చును.
భైరవకోనయందలి విష్ణు శిల్పము స్థానక రూపంలో గుహాలయాల ముఖద్వారమునకు కుడివైపు గల కుఢ్యభాగమున చెక్కబడియున్నది (27, 28 వ చిత్రపటములు చూడుము). ఇది కొంతవరకు సుందర పెరుమాళ్ కోయల్ నందలి స్థానక విష్ణుమూర్తి శిల్పమువలె వున్నది. భైరవకోన విష్ణువు చతుర్భుజములను కలిగియున్నాడు. కుడివైపున ఉన్న ముందుకు గల హస్తము అభయముద్రలో వున్నది. వెనుక హస్తమున చక్రము గలదు. ఎడమవైపు గల ముందు హస్తము వరదముద్రలో నున్నది. వెనుక ఉన్న హస్తమున శంఖు గలదు. ఈయన కిరీట మకుటము, మకరకుండలము, ఉదరబంధము, కటిబంధము, యజ్ఞోపవీతములను కలిగియున్నాడు. ఈయనకు ప్రభామండలము గలదు.
గణేశ్వరుడు శుభసూచనా నిలయుడుగాను, కోరిన వరములు తీర్చువాడుగాను భావింపబడుటచే భైరవకోనయందు ప్రాంగణమునందలి దేవకోష్ఠములలో ప్రతిష్ఠింపబడుటేగాక దాదాపు అన్ని దేవాలయాలలోను మనము గమనింపవచ్చును.
గణేశ లేక గణపతి హిందూమతమున ఒక ప్రముఖ దైవము ఇతనికే విఘ్నేశ్వరుడని పేరు. సాధారణముగా ప్రతి కార్యమునకు ప్రారంభమున ఇతనిని కొలుతురు. మలబారు ప్రాంతమందలి బ్రాహ్మణులలో ఒక తెగవారిని గణపతీయులని పిలుతురు. వీరు ఇతర దేవతలకన్నా గణపతినే ముఖ్యముగ కొలుతురు. విశ్వజ్ఞాన నిలయునిగా ఈ దేవుని హవెల్ భావించినాడు.
లింగపురాణమందు ఈ దేవుని పుట్టుక గూర్చి తెలుపబడియున్నది. ఒకానొకసారి అసురులు దేవతలను ఓడించిరి. దేవతలు శివునికి మొరపెట్టుకొనగా పరమేశ్వరుడు ఒక అసురుని సృష్టించి అతనికి విఘ్నేశ్వరుడని పేరిడెను. ఇతడు శివుని భూతగణాలకు నాయకుడయ్యెను. కాని శివపురాణమందు పార్వతీదేవి ఒక బాలుని సృష్టించి తన స్నానగది వద్ద కాపలా ఉంచెనని, శివుడు లోనికి ప్రవేశించుటకు ప్రయత్నించగా ఆ బాలుడు ప్రతిఘటించెనని, అందుచే శివుడు కోపోద్రిక్తుడై అతని శిరము ఖండించి వేసెనని, ఆ తరువాత పార్వతిచే ఆ బాలుడు సృష్టింపబడిన వాడని తెలుసుకొని దేవతలందరిని ఉత్తర దిశగా పయనించి వారు మొదట చూసిన ప్రాణి శిరస్సును తెచ్చి ఆ బాలుని మొండెమునకు అతికించవలెనని ఆజ్ఞాపించినాడని, దాని ఫలితముగనే విఘ్నేశ్వరుడు మనము చూచెడి రూపము కలిగియున్నాడని తెలుపబడియున్నది. అంతేగాక విఘ్నేశ్వరుని విధినిర్వహణకు ఎంతో సంతోషించి శివుడు విఘ్నేశ్వరుని తన భూతగణ నాయకునిగా చేసుకొనెను. ఇది శివపురాణమందలి వివరము.
ముద్గల పురాణమున గణపతియొక్క 32 రూపముల గూర్చి తెలుపబడియున్నది. శిల్పసార గ్రంథమున కూడా వీటిని కొన్నింటిని ప్రస్తావించబడి యున్నది సాధారణముగా గణపతి కూర్చొని లేక నిలుచొనినట్లు రూపొందింపబడి సమభంగ లేక అవిభంగ రీతిలో యుండును. గజశిరస్సు కలిగి తొండము ఎడమవైపుకు తిరిగియుండును. కొన్ని సందర్భాలలో కుడివైపుకు తొండముండును. ఇటువంటి సందర్భాలలో గణపతిని వలంబూరి వినాయక అందురు. సాధారణముగా ఇతడు రెండు నేత్రములనే కలిగియుండును. కాని ఆగమములు కొన్ని సందర్భాలలో మూడు నేత్రములుండవలెనని తెలిసియున్నవి, ఇతడు సామాన్యముగా నాలుగు చేతులను కలిగియుండును కాని 16 చేతులు కూడా కలిగి వాటిలో ఆయుధములను కలిగియుండుట కూడా కలదు. చేతిలో ఇతని ఆయుధాలలో పాశ, అంకుశములే గాక మోదక, ఆహార బంతి కూడా యుండును. పెద్ద ఉదరము కలిగి దానికి సర్పము చుట్టుకొనియుండుటచే ఇతనికి లంబోదరుడని పేరు కూడా కలదు. చిన్న ఎలుక వాహనము కలిగియుండును. ఇది పీఠము దగ్గరలో యుండును.
ఏకరూప గణపతి కూర్చొనిగాని, నిలుచొనిగాని యుండుటేగాక అనేక రకాలలో యుండును. తమిళులు గణపతిని పిళ్ళయ్యార్ లేక వినాయకర్ అందురు. ప్రతిచోట దేవాలయాలలో మనకగుపడును. గణపతి శుభసూచకముగను. వరములిచ్చువాడుగను భావింపబడుటచే ప్రతి గ్రామ మారుమూలలందును ప్రతిష్ఠింపబడియుండును.
ప్రసిద్ధిగాంచిన గణపతి దేవాలయాలలో తిరుచినాపల్లిలోని ఉచ్చిపిళ్ళయ్యార్ కోయిల్, నన్నిలం దగ్గరలోని తిరుచ్చెన్ గట్టన్ గుడి ముఖ్యమైనవి. తిరుచ్చెన్ గట్టన్ గుడిలో గణపతి మానవ శిరస్సు కలిగియున్నాడు. భైరవ కోన గుహల ప్రాంగణాలలో కూడ గణపతి కలడు (17, 21 వ చిత్రపతములు చూడుము), ఇచటి గణపతి ఆసీన రూపములో వున్నాడు. పాశ, అంకుశ, ఆహార బంతి, మోదకములను నాల్గు హస్తాలలో కలిగి పెద్ద ఉదరము కలిగియున్నాడు.
చండేశ లేక చండికేశ్వరుడు శివుని పరివార దేవతలలో ఒకడు (29, 30 వ చిత్రపటములు చూడుము). సాధారణముగా ఇతడు స్థానక లేక ఆసీన రూపములో రెండు హస్తములు కలవాడుగాను. ఆ హస్తములం దొకదానియందు 'టంక' లేక 'పరశు'ను కలిగి, రెండవ హస్తము అతని తొడపై వుండునట్లుగాను, కొన్ని సందర్భములలో తన భార్యయైన ధర్మనీతితో యుండునట్లు కూడ చూపబడుట గలదు. సామాన్యముగా శివ దేవాలయములందు నైవేద్యమును తొలుత చండికేశ్వరునికిచ్చి ఆ తరువాతినే శివునికిచ్చుట జరుగును. దీనికి శివుని ఆజ్ఞయే కారణమని, చండికేశ్వరుడు పొందిన వరమే కారణమని ఒక తథవము కలదు. అది ఏమనగా, శైనలూర్ అను వానికి పశువులు మేపుటకై పంపబడెను. కానీ ఇతడు పశుగ్రాస ప్రాంతమందు చిన్నచిన్న శివలింగములను ఇసుకతో రూపొందించి కొన్ని గోవుల పాలు పితికి ఆ లింగములపై పోయుచుండెను. ఒకనాడు అతని తండ్రి ఇది గమనించి కోపముతో ఆ లింగరూపములోని ఇసుకను తన్నుటకు ప్రయత్నించగా భక్తి పారవశ్యమున ఉన్న అతని పుత్రుడు కోపముతో తండ్రి కాళ్ళను గొడ్డలితో నరికివేసెను. ఇది గమనించి తన భక్తుని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై విచారశర్మను చండేశ్వర అను పేరుతో తన 'భూతగణము'లకు అధిపతిగా నియమించుకొని చండికేశ్వరునికి నైవేద్యము చేసిన తరువాతనే తనకు నైవేద్యము చేయవలెనని శివుడు ఆజ్ఞాపించెను. పార్వతీ సమేతుడుగా సోమస్కంద రూపుడైన శివుడు చండికేశ్వరుని శిరస్సును స్పృశించుచు పుష్పమాలను అలంకరించు రూపములోని ఒక శిల్పరూపమును మనము తంజావూరు జిల్లానందలి గంగైకొండ చోళపుర దేవాలయమందు గమనించవచ్చును. భైరవకోన గుహల ప్రాంగణాలలో కూడ చండికేశ్వరుడు గలడు (29, 30వ చిత్రపటములు చూడుము). ఇచటి చండీశుడు అసనరూపమున వున్నాడు. రెండు చేతులు గలవు. కుడిచేతిలో పరశు గలదు. ఎడమచేయి ఎడమతొడపై ఆన్చియున్నాడు. గుబురైన శిరోజాలను కలిగియున్నాడు. లావుపాటి మూడు వరుసలుగల యజ్ఞోపవీతమును ధరించియున్నాడు. సంహార రూపమున వున్నాడు ఎడమకాలు పద్మాసనములో ముడుచుకొని కూర్చొనియున్నాడు. కుడికాలు పైకిత్తి ముడుచుకొని పాదమును భూమిపై ఉంచియున్నాడు. కర్ణకుండలములను ధరించి, మెడలో దండను కలిగియున్నాడు. ఇచటి చండీశ శిల్పాలలో కొన్ని కొంత పరిపక్వ శిల్ప లోపమును కలిగియున్నవి. మరికొన్ని నైపుణ్యమైన శిల్పులచే రూపొందింపబడినట్లు తెలియుచున్నది.
చండీశ ఆరాధన శైవ సిద్ధాంతమున ఒక ప్రత్యేకస్థానమును కలిగియున్నది. ఒక మానవమాత్రుడు దైవత్వ స్థానమును పొందుట ఇందు మరువరాని అంశము, అరువది ముగ్గురు నాయన్మారులుగా గుర్తింపబడి యున్నప్పటికి చోళరాజ్యమందలి చేయింజలూర్ కు చెందిన యజ్ఞదత్త, భద్ర అను దంపతులకు జన్మించిన విచారశర్మ యనుబాలుడు మాత్రమే శైవ దేవగృహాలకు ముఖ్య అధిపతిగా శివునిచే నియమింపబడెను.
శివభక్తుడైన విచారశర్మ శివపూజకై ఉంచుకొన్న పాలపాత్రను తన తండ్రి తన్నినందుకు కోపముతో శివునికి అపచారము జరిగినదని తండ్రి కాళ్ళనే నరికివేయుటకు సిద్ధమగుట, ఇట్టి తరుణమున శివుడే ప్రత్యక్షమై అతని తండ్రికి కాళ్ళు వచ్చునట్లు చేసి, విచారశర్మను తన పుత్రునిగా దత్తత చేసుకొనెడి విషయము పురాణమున చెప్పబడి యున్నది. అంతేగాక అతనికి చండీశ అను బిరుదునిచ్చి తనతో సమానముగా అన్నిరకముల నైవేద్యములు ఇవ్వబడునని వరమిచ్చెడి వివరముకూడా 'థేవరం'నందు చెప్పబడియున్నది. ఈ గ్రంథ ప్రాచీనత కూడా చండీశ ఆరాధనా ప్రాచీనతను తెలుపుచున్నది.
చండీశుని శిల్పము మనకు పల్లవ రాజైన రాజసింహుని కాలమునాటి కైలాసనాధ దేవాలయమున మొట్ట మొదట అగుపడును. కాలక్రమమున చండీశ ఆరాధన ప్రచారమును పొంది చండీశునికి ప్రత్యేక దేవగృహాలు ఆలయప్రాకారాలలో 'ప్రణల'కు ఎదురుగా నిర్మించుట జరిగెడిది. తంజావూరు నందలి రాజరాజేశ్వర (బృహదీశ్వర) దేవాలయమునందలి చండీశ దేవగృహము మాత్రమే ఒకటవ రాజరాజు కాలమునకు చెందినది, మిగిలినవన్నియు తరువాత కాలమునకు చెందినవి. రాజరాజు చండీశుని పేరుతోనే ఆ దేవాలయ ఆస్తులుకూడా వ్రాయించి అతడే ఆలయ ఆస్తుల రక్షకుడుగా కూడా భావించినాడు. ఈ ఆచారము క్రీ. శ. 1118వ సంవత్సరమునాటి విక్రమచోళుని కాలమువరకు కొనసాగినట్లు తెలియుచున్నది. రాత్రిపూట ముఖ్యదేవుని పవళింపుసేవ కార్యక్రమము పూర్తయిన తరువాత ఆలయద్వారములు మూతవేసి తాళములు చండీశునివద్ద వుంచెడి ఆచారముకూడా వుండెడిది.
మొదటి రాజేంద్రుని కాలమున ఉత్తర భారతదేశముపై దండయాత్ర చేయబడి సాంస్కృతిక కలయిక ఏర్పడి నర్మదానదీ ప్రాంతమునుండి అనేకమంది శైవాచార్యులు దక్షిణదేశమునకు వచ్చిరి. దీనితో మరింత శైవసాహిత్యము వృద్ధిచెందినది. క్రీ. శ. 1158లో అఘోర శివాచార్యుడను గురవు 'క్రియా క్రమయోదిని' అను గ్రంథము రచించి అందు చండీశుని చతుర్ముల రూపముగూర్చి కూడా విశదీకరించినాడు. ఇతడు చండేశునికి ప్రత్యేక దేవగృహాన్నికూడా నిర్మించవచ్చునని తెలిసినాడు.
చండీశ ఆరాధన గంగై కొండ చోళపుర ఆలయమున మనము గుర్తించవచ్చును. మధురయందు ఆరాధనా రీతిలో చండీశుడు శిల్పమందగుపడును, చంగల్పట్టు దగ్గరలోని తిరుకాచూరు నందలి చండీశుడు చతుర్ముఖుడు. లేపాక్షియందు విజయనగర కాలమునకు చెందిన చిత్రలేఖనాలలో కూడా చండీశ అనుగ్రహమూర్తి గలడు. కాని మద్రాసు, పూనమలై మధ్య గల పోరూర్ నందలి చండీశ శిల్పము ఒక ప్రత్యేకమైనది ఇచటి రమణాదీశ్వర దేవాలయమున ఈ శిల్పము గలదు. ఇచటనే ఒకటన రాజేంద్రుని 'మెయ్ కీర్తి'గలదు, ఇది 'తిరుమన్ని వలర, ఇరు నీల మదంత్యం' అను పలుకులతో ప్రారంభమగుచున్నది, ఇచటి చండీశుడు ప్రత్యేకతను కలిగియున్నాడు. 'ఆసన' రీతిలో 'మఝు'ని కుడిచేతిలో ధరించి గుబురైన శిరోజాలు కలిగి, లావుపాటి 'యజ్ఞోపవీత'మున ధరించియున్నాడు. ఇవన్నియు పల్లవరీతిని తెలుపుచున్నవి. 'కౌపీనము' సంహార రూపమున యున్నాడు.
భైరవకోన గుహాలయాల ప్రాంగణ మధ్యభాగమున శివుని వాహనమైన నంది ప్రతిమ (11 నుండి 22 వ చిత్రపటములు చూడుము) ప్రాంగణ కుడి, ఎడమలందు కోష్టములలో చండేశ, గణేశ (11 నుండి 22, మరియు 29, 30 వ చిత్రపటములు చూడుము)అర్ధశిల్పములు మనకగుపడును. ప్రతి శివాలయ గర్భగృహలోని శివలింగము లేక శివునికెదురుగా కొంతదూరములో శివుని వాహనమైన నంది లేక నందికేశ్వర (లేక అధికార నంది) ప్రతిమ ప్రతిష్ఠించుట సాంప్రదాయము. కావున భైరవకోన ప్రాంగణమందు గర్భగృహలోని శివలింగమునకు ఎదురుగా నంది ప్రతిమయున్నది. నందికేశ్వరునిగూర్చి భగవత్ పురాణము, రామాయణములందు ప్రస్తావించబడియున్నది. లింగపురాణ మందు శైలద అనే గ్రుడ్డివాడైన మహర్షి పుత్రసంతానము కొరకు శివుని ప్రార్ధించగా శివుడు తన భక్తునికొరకు నందికేశ్వరుని సృష్టించినాడని తెలుపబడియున్నది.
ద్వారపాలురు ఆలయాల రక్షకభటులు. వైష్ణవాలయాల ముఖ్య దేవగృహాని కిరువైపులా జయ, విజయులుందురు. వీరు స్థానక రూపాలతో నాలుగు చేతులు కలిగియుందురు. పై హస్తాలలో శంఖు, చక్రాలను, క్రింది హస్తాలలో ఒకటి గదను కలిగి, మరొకటి శుచి హస్తముద్రలో యుండును. శైవ ఆలయాల ముఖ్య దేవగృహాల ఇరువైపులా కూడ మఝు, శూలములను ధరించిన నాలుగు హస్తాలు గల ద్వారపాలురుందురు. దేవీ ఆలయాలకు స్త్రీ ద్వారపాలురుండుట మనము గమనింపవచ్చును. ద్వారపాలురు సాధారణంగా శిల్పమందు కోపరూపులు కలవారుగా రూపొందింపబడి యుందురు. కాని తిరుమల వంటి దేవాలయాలో, ద్వారపాలురు రాగి లోహంతో రూపొందింప బడియున్నారు.
భైరవకోనయందు గుహాలయాల ద్వారమున కిరువైపులా ద్వారపాలురు రూపొందింపబడి యున్నారు ((12 నుండి 22వరకు, (26 నుండి 28 వ చిత్రపటములు చూడుము). మొదటి నాలుగు గుహలలో ఒక రకముగను, చివరి నాలుగు గుహలలో కొంత పరిణతి దశకు చెందిన శిల్పరూపములను కలిగియున్నట్లు ఇచటి ద్వారపాలురుయున్నారు. వీరు కొమ్ముల కిరీటమును కర్ణకుండలములను మెడలో పూనలదండను, కటిబంధమును, చేతులకు కడియాలను కలిగియున్నారు. కొన్ని గుహలవద్ద గల ద్వారపాలురు ఎడమచేతిలోని గదను కుడివైపుకు పెట్టి ఆ గదలపై వాలినట్లు నిలుచొని యున్నారు. మరికొన్ని గుహలవద్ద గల ద్వారపాలురు కుడిచేతిలో గదను ఎడమవైపుకు పెట్టుకొని ఆ గదలపై వాలినట్లు నిలుచొని యున్నారు. తొలిరకములో ఎడమకాలు నిలువుగాను, కుడికాలు వంచి ఎడమవైపుకు పెట్టుకొనియున్నారు. రెండవ రకమున కుడికాలు నిలువుగా వుంచి ఎడమకాలు వంచి కుడివైపుకు పెట్టుకొనియున్నారు. రెండింటిలో చేతులు కట్టుకొన్నట్లు యున్నారు.