ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/రాయసము వేంకటపతి

వికీసోర్స్ నుండి

అనుచు నబ్బాలు ఱెప్పార్ప కెంతయును

గనుగొని వేడుకకడలి నోలాడి

యానందబాష్పంబు లాననాబ్జంబు

మైనుండి దిగువార మై గరుపార

బెన్నిధి గన్నట్టిపేదచందమున

నున్నతోన్నతు డైనయోగినందనుని

దనయులు లేని యాదరమున నెత్తి

కొని కూర్మితోడ నక్కున జేర్చి వేడ్క

గొనకొని యావేత్రకుంజంబు వెడలి

తనవార లెల్ల నెంతయు జోద్యపడగ

మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి

తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.

32. రాయసము వేంకటపతి


ఇత డారువేల నియోగి; అక్కయామాత్యుని కుమారుడు. ఈకవి తన వంశమువారిని వర్ణించుచు తమది వసిష్ఠగోత్ర మయినట్లీ క్రింది పద్యమునందు జెప్పెను -


శా. శ్రీల న్మించి సమస్త ధీకలనచే జెన్నొందు నార్వేలవం

శాలంకారకరుల్ వసిష్ఠమునిగోత్రాంకుల్ బుధు ల్దీనర

క్షాలీలం బొగ డొంది రందు వెలసెన్ సన్మాని భానప్ప ది

గ్జాలలోద్వేలవిశాలకీర్తుల సుధీసందోహమందారమై.


ఇతడు లక్ష్మీవిలాసమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించెను. "రసిజనహృదయంగమ సంగీతసాహిత్యకళాధౌరంధర్య" అని గద్యములో జెప్పుకొన్నదానినిబట్టి యీకవి సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును సమర్థు డైనట్టు కనబడుచున్నాడు. ఇతడు శ్రీరంగరాయని యాస్థానమునందుండి యాతనివలన నగ్రహార రత్నాభరణాదులను బొందినట్టు లక్ష్మీవిలాసములోని యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.


మ అలఘుప్రాభవభవ్యు డాకుతపశాహామేయసైన్యంబు న

గల్గిక న్బాహులచేత గెల్చి బిరుదల్ గైకొన్న శ్రీరంగరా

యల చిత్తం బిగురింప రాయసము వ్రాయం జాలి తౌనౌ సుధీ

తిలకా యక్కయమంత్రి వేంకటపతీ దీవ్యత్కళావాక్పతీ.

ఉ. వ్రాయుచు రాజ్యవైభవ ధురంధరభూతి దలిర్ప గీర్తిధౌ

రేయసిరంగరాయమహిభృన్మణిరాయస మగ్రహారహై

మాయతరత్న భూషలు నృపాడ్యులు వర్తనలియ్య నుబ్బుచున్

వేయననేమి రాయసము వేంకటమంత్రియనన్ యశస్వివై.


ఈశ్రీరంగరాయలు వసుచరిత్రను కృతినందిన తిరుమలదేవరాయని కుమారుడు. ఇతడు 1534 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసినందున, కవియు నాకాలమునందే యుండినవాడు. లక్ష్మీవిలాసము సలక్షణమై మృధుమధురరచనను గలిగి యున్నది. కవితాశైలి జూపుట కయి గ్రంథమునుండి రెండు పద్యముల నుదాహరించుచున్నాను-


చ. తనదువిలాసహాసముల దాలిమి దూలగ రాగసాగరం

బున బలుమాఱు మారుదెస మున్గుచు దేలుచు నిచ్చ మెచ్చగా

మునుకొని వారితో భువనమోహిని యాకుహనావియచ్చరాం

గన పలికెం బికస్వరవికస్వరసుస్వరభాస్వరంబుగన్. [ఆ.3]


మ. హరికిం బట్టపురాణి వీవ యని కళ్యాణై కవాక్యస్తుతుల్

పరగం బుణ్యనదీనదోదకములం బట్టాభిషేకంబు చే

సిరినా నుజ్జ్వలహేమకుంభములచే జేత న్సుగంధాంబువుల్

హరిమధ్య ల్తగ నించి నించి జలకం బాడించి రబ్జాలయన్. [ఆ.5]