ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/మట్ల అనంతభూపాలుడు

వికీసోర్స్ నుండి

ఉ. కౌరవనాథ యే గలుగగా గలశీతనయుండు గల్గగా

బౌరుషసింహమూర్తులగు బాహ్లికముఖ్యులు కల్గియుండగా

నూరక కుందె దేటి కిది యోధులచందమె శీరసాధనున్

వారణచేసి సాంబు నని వ్రాలిచి లక్షణ దెత్తు గ్రమ్మఱన్. [ఆ.5]

                              _____

25. మట్ల అనంతభూపాలుడు

ఈక్షత్రియకవి కాకుస్థవిజయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి తనతండ్రి యైన యెల్ల భూపాలున కంకితముచేసెను. తనతండ్రి సభాసీనుడయి యభినవాంధ్రకవితాపితామహు డైనయుప్పుగుండూరిపురి వేంకటకవినిజూచి శాశ్వతమగు ధర్మ మెద్దియని యడుగగా నక్కవికంఠీరపు డిట్లనియెనని తనకృత్యాదిని వ్రాసికొనియున్నాడు-


ఉ. కోనయయెల్ల వైరినృపకుంజరభంజన కంజదళాక్షసే

వానిరపద్య యాద్యజనవల్లభనీతిసార యౌ

రా నవఖండ రాజర సనాంచలరంగముల న్నటింప ద

న్మానసగర్వపుందెర దెమల్చి యమర్చితి కీర్తినర్తకిన్.


శా. థారాపాతము వాసినప్పుడు ఘనత్వం బేర్పడున్ జంద్రహా

సారూడి న్విలసిల్లుచున్నపుడ శైత్యం బెల్ల గాన్పించు రా

నీరాజద్భుజఖడ్గరాజ మభివర్ణింప న్వశంబే మహో

గ్రారిధ్వంసక మట్ల కోనవిభునెల్లా రాజకంఠీరవా.


గీ. అమితచారిత్ర పుణ్యమార్గములు గలవు

పెక్కులయ్యును సత్కీర్తి కెక్కుననియ

సప్తసంతానములు నందు శాశ్వతంబు

కావ్య మందుము సత్కవి కలిగె నీకు. క. మహి నీపుత్రు డనంతుడ

బహుమహిమం జెప్పనేర్చు భమౌళిధునీ

లహరీఘుమఘుమితవచో

మహితముగా నెల్ల శౌర్యమాయాభిల్లా.


ఈకవి పూర్వులలో వరదరాజను నతడు కృష్ణదేవరాయని కల్లుడైనట్లు కవి యీక్రిందిపద్యమున జెప్పియున్నాడు-


చ. వనజదళాక్షశంకరులు వార్ధికి నద్రికి బోలె గృష్ణరా

యనికి ననుంగుటల్లు డటులై తనరున్ వరదక్షమాధవుం

డనిమిష వాహినీమునిగజాశ్వమహీరుహధేనుభీమవా

హనమకుటావతంసకుధరాభరణాదిక హేతుకీర్తియై.


కవి తనతండ్రిని,


ఉ. ఎక్కడ గాన మెల్ల ధరణీశ్వరు హేతి కరాతి భీతిమై

నెక్కనిధారుణిధరము లేగనిదుర్గదిగంతరాళమున్

ద్రొక్కవికాననాంతరము దోగనిదివ్యనదీహ్రదంబులున్.

మ్రొక్కనిఱాలునుం దిననిమూలపలాశిపలాశజాలమున్.


ఇత్యాది పద్యములలో వర్ణించిన వర్ణననుబట్టి యతడు క్షత్రియుడగుటయేకాక భూపాలుడనియు దెలియవచ్చుచున్నది. తండ్రిమాత్రమే కాక కుమారుడైన యనంతభూపాలుడు గోలకొండ నవాబయిన యిబ్రహీముషాకాలములో రాజ్యపరిపాలనము చేయుచుండినట్లు చరిత్ర నిదర్శనములు కనబడుచున్నవి. కాబట్టి కవి 1550-80 వ సంవత్సర ప్రాంతములయం దుండినవా డయినట్టు తెలియవచ్చుచున్నది. ఈకవి సూర్యవంశజుడు; రంగాంబాపుత్రుడు; తిరుమల తోళప్పాచార్య శిష్యుడు. ఈతనికవిత్వము నిర్దుష్టమయిన హృదయంగమముగానున్నది. కాకుస్థవిజయములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను.


ఉ. మనుతనయుండు నంతట సమాధిసమాపనవేళయైన లో

చనములు విచ్చి ముందట బ్రసన్నపరిస్ఫుటబింబ మొప్ప ని

ల్చిననెల నిల్వుటద్దమువలెన్ మెఱయంగ మరుండు మాధవుం

డును నునుగాడ్పు మేనులకు నోచగ నచ్చర లాట లాడగన్. [ఆ.1]


చ. కలువలవిందున క్తమును గమ్మకొలంకులగాడ్పుక్రుంకు జె

ల్వలజడలున్ వసంతువనవాసము గ్రొవ్విరికత్తికోతలున్

వెలసిన నాదుమాధుకరవృత్తి విశిష్టగుణంబు నెంచియో

చెలిమియు బ్రేమయు బొదల జేసె మహాముని యాతిథేయముల్. [ఆ.2]


ఉ.నీ విదియెక్కి పద్మభవనిర్జరనాథుల జూడ నెప్పుడుం

బోవుచు వచ్చుచుండి పనిపుట్టిన వేల్పుల పాలగల్గి చే

చేవయొకింత చూపు మని చెప్పి తిరోహితు డయ్యె నయ్యెడన్

దైవతలోకశిల్పి యరదం బటువెట్టి మహాద్భుతంబుగన్. [ఆ.2]


చ.పుడమికి నీవు రాజ వయి పుట్టితివెన్నడు నాటనుండియున్

గొడవలు గట్టిపెట్టి నిను గొల్చిరి రాజులు కన్నుదోయికిన్

బడలిగాక యేకలహపారణ గఱ్ఱున ద్రేచెదన్ వ్యధం

దడవులబట్టి చూడనికతంబున మాసెజుమయ్య వీణయున్. [ఆ.2]


ఉ. వేల్పులకంటె ము న్నసురవీరుల మేము సృజించుటెంచి స

కల్పము మాప్రసన్నతకుగా నొనరించితి నన్న వీవచ:

కల్పన కర్థ మేమి యలకయ్యము మాకు ననిష్టమంచునో

యల్పుల ద్రుంచి లోకములయాపద దీర్చితి వింతయొప్పదే. [ఆ.3]


ఉ. వచ్చిన నిచ్చట న్మొలచి వచ్చితిరే యన నోల లాడుచున్

వచ్చితి మమ్మ యేము నొకవారిరుహాకరవీధి నీజటా భృచ్చతురాసనుండు మొలపింపగ దమ్ములతోడబుట్టి మా

కిచ్చె సుగంధగంధి పదహీరకిరీటము లబ్జనామముల్. [ఆ.3]]


చ. అడవుల నీవుదాల్చువడియాలపుసొమ్ము లటుండు గాని మా

తోడవులు వెట్టుమంచు గృపతో మణిమంజులభూష లాదిగా

నుడుగర లిచ్చిన న్వెఱచు చొయ్యన నంది యతండు సై చుమీ

విడువనితప్పు నేడు వెత బెట్టక మానితి వేటకానుకల్. [ఆ.4]


ఉ.ఎల్లరు దృప్తులైన నొకయించుకసే పట విశ్రమించి రా

గిల్లినమూకతోద దమకింపనియానముతోడ భిల్లరా

డ్వల్ల భలక్ష్మీతోడ వనవల్లభుతోడ జయంబుతోడ భూ

వల్లభనందనుండు హయవల్గన మొప్పగ వచ్చె వీటికిన్. [ఆ.4]


ఉ. ఆరభసంబునప్డు కఠినాథులచే దలలేని బొందులన్

జూరె గడంక లూరెనని చూపఱుమెచ్చుల మూరిబోయి రా

సూరెల మున్ను కన్నిడినసూటిన వామభుజాభుజాదులన్

బీరముసూపి త్రెళ్లె నవి భీమమహోక్షఖురాహతంబులై. [ఆ.5]


ఉ. అక్కడజూడు నిన్న యొడయం డరదీఱెను దల్లితండ్రితో

నక్కట నేడు కల్యకఠినాదులలోపల నొక్క డేనియున్

ద్రిక్కకపోయెనే యిసుకదేఱెనె తానకశౌర్యవార్థియం

దుక్కివు లైరె వేల్పు లొక డూఱటగా నిక నేమిచెప్పుదున్. [ఆ.5]