Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/పొన్నికంటి తెలగన్న

వికీసోర్స్ నుండి

21. పొన్నికంటి తెలగన్న

ఈతెలగనార్యు డచ్చతెనుగు గ్రంథములు చేసినవారిలో మొదటివాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భావనార్యుని పుత్రుడు. అచ్చతెనుగునందు గ్రంథములు రచియించుట మిక్కిలి కష్టము. ఈకవికి బూర్వమునం దెవ్వరును శుద్ధాంధ్రభాషలో ప్రబంధములు చేయుటకు ప్రయత్నించినవారైనను లేరు. ఇట్టిగ్రంథరచన కీతడు మొట్టమొదటివాడే యయినను, ఈకవి రచియించిన యయాతి చరిత్రము సర్వవిధములచేతను కూచిమంచి తిమ్మకవి రచియించిన యచ్చతెలుగు పుస్తకములకంటె శ్రేష్ఠతరముగా నున్నదని నాయభిప్రాయము. ఈయనకు బూర్వమునం దుండినకవులు కొందరు తమ కృతులలో నక్కడక్కడ నొక్కొక్క యచ్చతెలుగు పద్యమును వేయుచు వచ్చిరి. అట్టివానిని జూచియే జను లత్యాశ్చర్యపడుచుండిరి. ఈయంశము కృతిపతి యన్నట్లుగా యయాతి చరిత్రముయొక్క పీఠిక యం దీక్రిందిపద్యముతో జెప్పబడినది.-


ఉ. అచ్చ తెనుంగుపద్దె మొక టైనను గబ్బములోన నుండినన్

హెచ్చని యాడు చుందు రదియెన్నుచు బెద్దలు పొత్త మెల్లని

ట్లచ్చ తెనుంగున న్నొడువ నందులచంద మెఱుంగువారు నిన్

మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినున్.


ఈకవి తనగ్రంథము నమీనుఖానునకు కృతి యిచ్చెను, ఈ యయాతిచరిత్రముగాక యింకొక తెలుగు గ్రంథము మాత్రము మహమ్మదీయప్రభువున కంకితము చేయబడెను. అమీనుఖాను ఇభరాముశాయొద్ద కొలువున్నట్టు యయాతి చరిత్రములోని యీక్రిందిపద్యము వలన దెలియవచ్చు చున్నది. సీ. తెలివి సింగంపుగద్దియలరాతెఱగంటిదొరలెల్ల మోడ్పుచేతులనెకొల్వ

బూనియేబదియాఱుమానిసినెలవులపుడమిఱేండ్లూడిగంబులకుజొరగ

ఠీవి మున్నీటిలో దీవు లన్నియు నేలుమన్నీలు మెట్టదామరల కెరగ

దనతేజు సుడిగట్టువెనుక చీకటి నెల్ల విరియించు తమ్ములవిందుగాగ


వెలయు మలికిభరాముశా గొలిచిమనుచు

కలన దనచెయ్యి మీదుగా గడిమిమెఱసి

మేలుసిరు లందునట్టి యమీనుఖాన

యొడయ డొకనాడు నిండుపేరోలగమున.


ఇబ్రహీమునే మనవారు గ్రంథములలో నిభరామని వాడి యున్నారు. ఈతనిపేరనే కృష్ణామండలములో నిభరామపురమని యొకయూరు కట్టబడినది. ఈతని పూర్ణమైన పేరు ఇబ్రహీమ్ కుతుబ్‌షా. ఇతడు కుతుబ్‌షా వంశీయులయిన గోలకొండనవాబులలో మూడవవాడు. ఈతని తండ్రిపేరు జామ్‌షీద్‌కులికుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కాబట్టి గ్రంథకర్త యయిన తెలగనార్యుడును ఈకాలములోనే యున్నట్టు స్పష్టమగుచున్నది. యయాతి చరిత్రములోని యీక్రింది పద్యములో నమీనుఖానుని కొడుకయిన ఫాజిలఖాన్ విజయనగరపురాజైన శ్రీరంగరాయని గోలకొండకు దీసికొనివచ్చి మైత్రిచేసినట్టు చెప్పబడి యున్నది.


చ. కని తను రాజు లెన్నుకొనగా బెనుపౌజులతో సిరంగరా

యనికడ కేగి మాటలనె యాయన దేఱిచి తెచ్చి మల్కకున్

మనుకువ నంటుచేసి యొరిమం దగ మెచ్చులుగొన్నమేటి నే

మని పొగడంగవచ్చు నవునౌ నిక ఫాజిలఖానరాయనిన్.


ఇందువల్ల శ్రీరంగరాయని రాజ్యకాలములో యయాతిచరిత్రము రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. తిరుమలదేవరాయని పుత్రుడైన














6ష్ శ్రీరంగరాయడు క్రీస్తుశకము 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసెనట్టు కానబడుచున్నది. శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చినతరువాతను, ఇబ్రహీమ్‌షా మరణము పొందకమునుపును, యయాతిచరిత్రము రచియింపబడి యున్నందున, 1574 వ సంవత్సరమునకును 1581 వ సంవత్సరమునకును మధ్యకాలమునందు యయాతిచరిత్రము రచియింపబడినట్టు నిశ్చయముగా దెలియవచ్చుచున్నది. ఈ కవియొక్క శైలి మొదలైనవి మిక్కిలి చక్కగా నున్నవని యీ వఱకే చెప్పియున్నాను. శైలి తెలియుటకయి యయాతిచరిత్రములోని రెండు పద్యముల నిందుదాహరించుచున్నాను.


ఉ. పిన్నవుగాన నీవు కడుబ్రేముడి ముంగిటిలోన దిమ్మరన్

నిన్నబలెం దలంపబడు నీ విటనిల్చిన పెక్కులేండ్లు మా

కన్నును వాచు నీ మొగము గానక యెప్పుడు జూడ కున్న నా

యన్న యిదేటి కీతమక మారసిచూచిన వింతవాడవే- [ఆ.3]


ఉ. తొంగలిపువ్వుదేనియల దూకొని మత్తలి తుమ్మెదల్ పయిన్

బొంగుచు వ్రాల నొ ప్పెనగ బూచినపొన్న గడంగికాంచి మున్

మ్రింగినయావిసంబు వెస మీదికి బిచ్చిలు వేడికంటియా

జంగ మటంచు మ్రొక్కె నొకచాన నెలంతలు చూచి నవ్వగన్- [ఆ.4]