Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కుమ్మర మొల్ల

వికీసోర్స్ నుండి

వ్రాయుట యుచితముకాదు. అయినను గవిత్వరీతి దెలుపుట కయి కవిచింతామణినుండి రెండుపద్యముల నిందుదాహరించుచున్నాను-


క. ఆది బురాణాగమములు

వేదంబులు నోరగాయవేయక నుడువన్,

నాదేలా కవినరులకు

మేదిని నెవ్వారు సాటి మించినగరిమన్.


శా. ని న్నాడింపగవచ్చు గోపతనయుల్ నెయ్యంబున న్వేదిపె

నున్నా రీకడిగొమ్ము జోగులు కరాళోష్మతులై వచ్చెదల్

వెన్నా మీగడయున్ ఫలం బొసగెదన్ వేగంబెరా రమ్ము మా

యన్నాయంచును వ్రేతపెట్టు హరి యో యమ్మా నగు న్మాటిచె.

                            __________


13. కుమ్మర మొల్ల

రామాయణమును తెనుగున రచియించిన యీమొల్ల ఆతుకూరి కేసనసెట్టి కూతురు. ఈమె తనపుస్తకమున వంశమునుగూర్చి చెప్పుకొనకపోయినను, ఈమె కులాలవ ..... పరంపరగా వాడుకవచ్చుచున్నది. ఈమె నివాసగ్రామము ...... డనియు, ఈమెయు తిక్కన సోమయాజులు భారతమును రచించి నప్పుడు లేఖకుడుగానుండిన కుమ్మరగురునాథుడును సోమయాజుల తండ్రియైన కొమ్మనకు రంగప్ప యనుకుంభకారుని పుత్రివలన జన్మించిరనియు, కొందరు వ్రాసియున్నారుకాని యావ్రాత నిరాధారమయినది. ఈమొల్ల తిక్కనసోమయాజి కాలములోనే యుండిన దయిన పక్షమున, "స్తుతగుణోద్దాము నాచన సోము భీము

నన్యమంజులవాగ్ధుర్యు నన్నపార్యు

రసికు డైనట్టి శ్రీనాథు రంగనాథు"


అని తనరామాయణమందలి కవిస్తుతిలో దిక్కనసోమయాజి కించుమించుగా నిన్నూఱుసంవత్సరముల తరువాత నున్న శ్రీనాథుని స్తుతించుట సంభవింపనేరదు. కాబట్టి మొల్ల శ్రీనాథునికాలమునకు దరువాత నున్నదనుటకు సందేహము లేదు. ఈమె కృష్ణదేవరాయల కాలములోని యల్లసాని పెద్దనాదుల నెవ్వరిని స్తుతియించి యుండక పోవుటచేత మొల్ల యాకాలమున కెంతో తరువాతిది కాదనియు స్పష్టపడుచున్నది. ఈమె కృష్ణదేవరాయలకాలములోనే యున్నట్టు కథలనేకములున్నవి. మొల్ల యాకాలమునందలి కాదని సంశయించుటకు హేతువులేవియు గానరానందునను, ఆకాలపుకవులను స్తుతింపనందునను, ఆమె కృష్ణదేవరాయలకాలమందే యున్నదని నిశ్చయింపవలసి యున్నది. ఇప్పుడున్న తెలుగుగ్రంథములను బట్టిచూడగా, ఆంధ్ర కావ్యములను జేసినస్త్రీలలోనెల్ల నీమెయే ప్రాచీనురాలుగా గానబడు చున్నది. ఈమె తన రామాయణములో,

"... ... ... ...గోప

వరపుశ్రీకంఠమల్లేశువరముచేత నెఱి గవిత్వంబు చెప్పంగ నేర్చినాను"

అని చెప్పుకొనుటచేత నీమె నివాసస్థలము నెల్లూరిమండలము లోని గోపవర మని తెలియవచ్చు చున్నది. ఈమె కవిత్వమునుజూచి తెనాలిరామకృష్ణు డింటిపేరును గూర్చి యడిగి యాక్షేపించిన ట్లొక కథ కలదుగాని యది యిం దుదాహరింపదగినదికాదు. అక్కడక్కడ గొన్నివ్యాకరణదోషము లున్నను మొత్తముమీద నీమెకవిత్వము మిక్కిలి మృదువయి మధుర మయి రసవంతముగా నున్నది. ఈరామా యణమును గొంతకాలముక్రిందటివఱకును వీధిబడులలో బాలురకు పాఠమునుగా జెప్పుచుండిరి. ఇది పురుషులుచెప్పినగ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌడమై యున్నది. మొల్ల రామాయణము నందలి కొన్నిపద్యముల నిం దుదాహరించుచున్నాను-

ఉ. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు వాహినీ

రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియందు, గో

రాజులు భోగమందు, దినరాజులు సంతతతేజమందు, రా

రాజులు మానమందు, నగరంబున రాజకుమారు లందఱున్. [బాలకాండ]


చ. సుడిగొని రాముపాదములు సోకినధూళి వహించి రాయి యే

ర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగ నీతనిపాదరేణు వి

య్యెడ వడినోడసోక నిది యెట్లగునోయని సంశయాత్ముడై

కడిగె గుహుండు రాముపదకంజయుగంబు భయంబు పెంపునన్. [అయోధా]


చ. చించెదదైత్యసంఘముల జిందఱ వందఱ చేసి బ్రహ్మ బా

ధించెద లోకపాలకుల ద్రెళ్ళగ నేసెద భూతలంబు గ్ర

క్కించెద శైలజాలముల గీ టడగించెద భూమినందనన్

గాంచెద దల్లడిల్లకుము కంజహితాన్వయవార్థిచంద్రమా. [అరణ్యకాం]


ఉ. సాలముపొంత నిల్చి రఘుసత్తము డ మ్మరివోసి శబ్దవి

న్మూలముగాగ వి ల్దివిచి ముష్టియు దృష్టియుగూర్చి గోత్ర భృ

త్కూలము వజ్రపాతహతి గూలువిధంబున గూలనేసె న

వ్వాలి బ్రతాపశాలి మృదువందనశీలి సురాలి మెచ్చగన్. [కిష్కింధాకాం]