Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కాకునూరి అప్పకవి

వికీసోర్స్ నుండి

56. కాకునూరి అప్పకవి

ఇతడు వైదికబ్రాహ్మణుడు, పదునేడవ శతాబ్దమధ్యమునందుండిన లక్షణవేత్త. ఈకవి యాంధ్రశబ్దచింతామణి యనుపేరితో సాధారణముగా నప్పకవీయ మని వాడ బడెడు లక్షణగ్రంథమును పద్య కావ్యమునుగా రచించెను. ఇత డెనిమిదాశ్వాసముల గ్రంథమును జేయునట్లు ప్రతిజ్ఞ చేసినను, అయిదాశ్వాసములు మాత్రమే యెల్లయెడల గానబడుచున్నవి. తక్కిన యాశ్వాసములు చేయకమునుపే యితడు మృతినొంది యుండవచ్చును. ఈయప్పకవీయమునందు ఛందో విషయము సమగ్రముగా నున్నను, వ్యాకరణవిషయ మత్యల్పముగా నున్నది. ఇప్పుడున్నభాగములో సంజ్ఞా సంధి పరిచ్ఛేదములు మాత్రమే తెనిగింపబడినవి. ఇతడు బహుగ్రంథములు శోధించినవాడే యయినను, పూర్వగ్రంథములనుండి యిత డుదాహరించిన పద్యములన్నియు దాదాపుగా లింగమగుంట తిమ్మన్న మొదలయినవా రీతనికి ముందు చేసినలక్షణగ్రంథములలో గానబడుచున్నవి. ఇతడు తనకాలపువారయినకవుల గ్రంథములనుండి విశేషముగా బద్యములను జేకొని యున్నాడు. ప్రక్రియాకౌముదియు నాంధ్రశబ్దచింతామణియు నని నామాంతరములు గలనన్నయభట్టీయమును బాలసరస్వతికాలమువఱకు నెవ్వరు నెఱుగరు. అది నన్నయభట్టారకవిరచితమనియు, వేములవాడ భీమకవి దానిని గోదావరిలో గలుపగా నేనూఱుసంవత్సరములయిన తరువాత సారంగధరుడు దానిని దెచ్చి బాలసరస్వతి కిచ్చెననియు అప్పకవి కలగనెనట! అటు తరువాత నొక బ్రాహ్మణుడు దానిని తనకు దెచ్చి యీగా తెనిగింప నారంభించెనట! ఈగ్రంథారంభమునకు బూర్వమునం దప్పకవి యేదో తెలుగున ఘనకావ్యము చేయ సంకల్పముపూనిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.

క. అని యిష్టదేవతాస్తుతి
   యును సకలకవీంద్రులనుతియును గురునతియున్
   వినయమున సలిపి తెలుగున
   ఘనకావ్యం బొకటి సేయగా దలచుతఱిన్.


సీ. ధాత రెండవపరార్థమున నాదిదినంబుపగట వరాహకల్పంబునందు
   మహితవైవస్వతమనువేళ దేశంబు లర్థింపనైన మహాయుగమున
   గలిసమయంబున దొలిచరణంబున మానితంబగుచాంద్రమాసమునను
   శాలివాహనశకమున గజ శైల శర సుధాకిరణులసంఖ్యనడవ


   నంగజాబ్దంబుననుదక్షిణాయనమున|జలధరుర్తువు మొదటిమాసంబునందు
   బహుళమున దేవకికి జక్రపాణిపుట్టి| నట్టియష్టమి చనుదేరనధికభక్తి.
    * * * * *

క. కల్పోక్తమార్గమున సం | కల్పము గావించి గోపికావిభుపూజల్
   సల్పిమది నతనిపదములు | నిల్పి పురాణార్థగోష్ఠి నిశ గడపు నెడన్.


గీ. నుదుట గస్తూరి తిలకంబు పొదలువాడు
   తలచిచూచిన నాకులదైవ మగుచు
   బొలుచు నాకులదైవంబు బోలువాడు
   నిలిచె నొకరుడు నాదుముంగలను గలను.

ఇష్టదేవతావందనాదులును గురుదేవతాస్తుతియు జేసి తెనుగున ఘనకావ్యమొకటి చేయ నుద్యమించి శాలివాహనశకము 1578 వ దగు మన్మథనామసంవత్సర శ్రావణ బహుళాష్టమినాడు సంకల్పముచేసి కామెపల్లెదేవాలయములో రాత్రి పురాణగోష్ఠిని గడపుచుండగా శ్రీకృష్ణుడు కలలోవచ్చి యాంధ్రశబ్దచింతామణి నశించిన కథ చెప్పి-


చ. రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తి కా
   వ్యములును దొల్లియైన నిపుడైనను ముంగలనైన దీని సూ

   త్రములను దక్క వేఱొకవిధంబున నాంధ్రము జేయజాలమిన్
   క్షమ దెనిగింపు దీన నవి సర్వము జేయుఫలంబు నీ కగున్.

దానిని తెనిగింప నానతిచ్చెనట! శ్రీకృష్ణుడు స్వప్నదర్శన మిచ్చుటకు బూర్వమే గ్రంథమును జేయ సంకల్పించెనో చెప్పలేదు. ప్రక్రియాకౌముది యనబడెడి యీ యాంధ్రశబ్దచింతామణి బాలసరస్వతి కృతమనియు దానికి గౌరవము కలుగుటకయి యీ కధ కల్పింప బడినదనియు నేనీవఱకే చూపి యున్నాను. పయి పద్యములనుబట్టి యీ పుస్తకము శాలివాహనశకము 1578 వ సంవత్సరము నందనగా క్రీస్తుశకము 1656 వ సంవత్సరము నందారంభింపబడి 1660 వ సంవత్సరప్రాంతమున కింతవఱకు జేయబడియుండును. అప్పటికప్పకవి కవసానకాలము తటస్థించినందున గ్రంథము సమాప్తినొంది యుండక పోవచ్చును.


సీ. జగతి నాపస్తంబశాఖోక్తషట్కర్మపద్ధతిఖండనిబంధనంబు
   కాలబాలార్ణవాఖ్యజ్యోతిషగ్రంధసంహితాసుశ్లోకసంగ్రహంబు
   శ్రీమదనంత ప్రసిద్ధమహావ్రతకల్పకథాంధ్రోక్తి కావ్యరచన
   శ్రీనగాధీశసుశ్లేషనిందాస్తుతిభావగర్భితసీసపద్యశతము


   లలితకవిల్సకాఖ్యాసలక్షణంబు | మహితసాధ్వీజనౌఘధర్మద్విపదము
   నంబికావాదనామకయక్షగాన | కృతియు జేసితి నాకునూరికులయప్ప.

అను పద్యమువలన నప్పకవి యీ గ్రంథమును రచించుటకు బూర్వము కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథములను రచించినట్టు తెలియవచ్చుచున్నది గాని యిప్పుడాగ్రంథములు లభించుట యరుదు. ఈతని కవిత్వము సుగమమైన మృదుమధురపాకము గలదిగానున్నది. అప్పకవికి బూర్వమునందు రకార ఱకారములకు యతిప్రాసమైత్రి కలదు లేదను నభిప్రాయభేద మున్నను, "నాన్యేషాంవైధర్మ్యం లఘ్వులఘూనాం రయోస్తు నిత్యం స్యాన్" అన్నది బాలసరస్వతి సూత్రమనుకోక వాగను శాసనసూత్రమని భ్రమపడి


గీ. చెల్లునని మున్నుభీమన చెప్పెననుచు
   గలుపుదురు రేఫములును ఱకారములును
   దుష్టకవు లవి యొకటైన దొంటిపెద్ద
   లందఱును నేల విభజింతు రని తెలియరు.


అని రేఫఱకారములకు యతిప్రాసమైత్రికూర్చువారు దుష్టకవులని యప్పకవి దూషించి యున్నాడు. రకారద్వయమైత్రిని నిషేధించిన బాలసరస్వతియే తద్భేదము గ్రహింపలేక చంద్రికాపరిణయములోని యీ క్రింది పద్యమునందు రేఫఱకారములకు విశ్రమము కూర్చినాడని కూచిమంచి తిమ్మకవి వ్రాసియున్నాడు-


ఉ. అక్కమలేక్షణ న్సవినయంబుగ గాంచుము నాదుమాఱుగా
   మ్రొక్కుము సేమమా భువనమోహిని నీకనిపల్కు మార్తిచే
   జిక్కితి వేగ బ్రోవుమని చెప్పుము పొమ్మిక దేటిరాయ నీ
   ఱెక్కలమాటున న్నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్- [చంద్రికాపరిణయము]

రేఫరకారమైత్రికి సమ్మతింపనివారవి రెండును నేకాక్షరమే యందురా?భిన్నాక్షరము లందురా? ఏకాక్షరమేయయి లఘ్వులఘు రూపములుమాత్రమే యయినయెడల, యలవల లఘ్వులఘు రూపములకువలెనే వీనికి గూడ మైత్రి యేల యుండరాదు? భిన్నాక్షరము లనెడు పక్షమున, రయోస్తు నిత్యం స్యాత్తనుచోటనేక శేషవృత్తి యెట్లు కుదురును ? అవి యొకటైన దొంటిపెద్దలేల విభజింతురని యప్పకవి యడిగిన ప్రశ్నమునకు యలవల నేల విభజించిరో యా హేతువుచేతనేయని చెప్పుటయే తగిన యుత్తరమగును.