ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కంచి వీరశరభకవి

వికీసోర్స్ నుండి

విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి

పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప

గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ

నరసి రక్షింపవయ్య జోహారునీకు.


శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే

క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని

శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్

బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]


మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ

త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల

ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా

జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

                           _______

28. కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-


చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్

నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి

న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని

ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]


ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ

పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం

తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ

మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]


చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ

త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే

హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్

సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]


ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స

త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్

బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే

నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4]