ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/హుళక్కి భాస్కరుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హుళక్కి భాస్కరుఁడు


భాస్కరుఁ డనెడి యీ కవి రామాయణము పద్యకావ్యముగా తెనిఁగింపc బడుటకు ముఖ్యకారకుఁడు. తిక్కనసోమయాజుల పితామహుఁడును. గుంటూరిసీమకు పాలకుఁడు నగు మంత్రి భాస్కరునిచే రామాయణ మంతయు తెనిఁగింపఁబడినదనియు, ఆది యే హేతువు చేతనో యొక్క యారణ్యపర్వము తప్పఁ దక్కినభాగ మంతయు నుత్సన్నము కాఁగా పిమ్మట హుళక్కి భాస్కరుఁడు మొదలయినవారు తక్కిన కాండములను మరల రచించి గ్రంధపూర్తి చేసిరనియు ఒక ప్రతీతి కలదు. ఈ రామాయణమునకు భాస్కరరామాయణ మన్న పేరు మంత్రిభాస్కరునిచేత నయినను, హుళక్కి భాస్కరునిచేత నైనను రావచ్చును: గాని, ఆరణ్య కాండము తక్కినకాండములవలెఁ గాక యా శ్వాసములను కలిగి యుండుటను బట్టియు దాని శైలినిబట్టియు విచారించి చూడఁగా భాస్కరరామాయణము లోని యారణ్యకాండము మంత్రి భాస్కరునిచేతనే రచియింపఁబడినదేమో యని సందేహము కలుగుచున్నది. యుద్ధకాండములోని 1134 పద్యములను హుళక్కి భాస్కరుఁడు రచియించినను, దాని నా శ్వాసములుఁగా విభాగింపకుండుటయు, ఆరణ్యకాండ మంతటిలోను 830 పద్యములకంటె నెక్కువ లేకపోయినను దానిని రెండాశ్వాసములుగా భాగించుటయు, విచారింపఁగా నీ రెండు కాండములను రచియించినవా రొక్కరు కారనియు వేఱువేఱు భాస్కరులనియు నూహింపఁదగి యున్నది. యుద్ధకాండములోని "శ్రీయుత మూర్తియైన" యను పద్యము మొదలుకొని వేదగిరినాయనింగారి ప్రేరణమువలన నయ్యలార్యునిచే రచియింపఁబడినట్టు ప్రాచీన తాళపత్రసంపుటములలోఁ గొన్నిటిలో వ్రాయఁబడియున్నది.

ఒక్క యారణ్యకాండమునం దక్క మఱి యేకాండములోను నాశ్వాస విభాగము చేయఁబడలేదు. అంతేకాక యారణ్యకాండమునందలి ప్రథమ ద్వితీయాశ్వాసాంతపద్యములు కృతిపతినిగూర్చిన సంబోధనములు గాక

  శా. "పుణ్యుం డూర్జితశౌర్యధైర్యమహిమస్పూర్తిస్ఫురద్వైభవా
        గణ్యుం డార్యజనానురంజితమహాకారుణ్యుఁడున్ శ్లాఘ్యసౌ
        గుణ్యుం డన్వయవార్ధిచంద్రుఁడు రిపుక్షోణీశ్వరస్థాపితా
        రణ్యుం డార్త శరణ్యుఁ డుజ్జ్వలఁ యశోరమ్యుండు సౌమ్యుండిలన్
                                          [అరణ్య. ఆ.1-291 ]
అనియు
   
   శా. వైరిక్ష్మాతలనాధపర్వతమహావజ్రాయుధున్ ఘోరదు
       ర్వారాఁహః ప్రథితారిదుస్సహతమిస్రప్రస్ఫురద్భానుగం
       భీరాంభోనిధి ధీరతానిమిషభూభృన్నాధు నత్యంతవి
       స్తారోదారగుణప్రసిద్ధినవరాధాపుత్రు సన్మిత్రునిన్."
                                          [అరణ్య. ఆ.2-433 ]

అనియు. వరుసగాఁ బ్రథమ,ద్వితీయాంతములుగా నుcడుటచేతను దిక్కనకవి కృతమయిన నిర్వచనోత్తరరామాయణమునందలి యాశ్వాసాంతపద్యములుకూడ నీ విధముగానే వివిధ విభక్త్యంతములుగా నుండుటచేతను వన కాండమును భాస్కరమంత్రి రచించెననియు, బితామహునియందలి గౌరవముచేతఁ దిక్కనయుఁ దన యాశ్వాసాంత పద్యముల నాతఁడు చూపిన దారినే రచియించెననియు నూహించుచున్నారు. ఎంత సయుక్తికముగానున్నను, ఇవి యూహలేకాని సిద్ధాంతములు కానేరవు. అరణ్యకాండము సాహిణిమారని కంకిత మొనర్చుట యీ యూహలను బాధించుచున్నది. పండ్రెండవ శతాబ్దమునందుcడిన మంత్రిభాస్కరుఁడు పదుమూడవ శతాబ్దాంతమునను, పదునాల్గవ శతాబ్దాదియందును ప్రజాపాలనము చేసిన ప్రతాపరుద్రునికాలములో సాహిణిమారని కంకితము చేసె ననుట పొసగియుండనేరదు. కాబట్టి యారణ్యకాండమునుగూడ హుళక్కి భాస్కరుఁడే రచియించియుండును. తిక్కనసోమయాజిని గాని యూతనివంశమును వర్ణించిన కేతనకవి గాని భాస్కరమంత్రి రామాయణమును రచించెనని చెప్పి యుండకపోవుటచేతను, పదునాల్గవ శతాబ్దాంతమువఱకు నుండిన కవులెవరును భాస్కరుని పూర్వకవినిగా స్తుతించియుండకపోవుటచేతను, పదునేనవ శతాబ్దాంతమునుండి కవు లొక్కభాస్కరునే పూర్వకవినిగా స్తుతించుచుండుటచేతను, కవిత్వము నకుఁ బ్రసిద్ధికెక్కిన భాస్కరుఁ డొక్కఁడే యనియు, కొందఱు భాస్కర శబ్దమునకు హుళక్కిపదమును గూడఁ జేర్చుచు వచ్చుటచేత నాతఁడు హుళక్కి భాస్కరుఁడే యనియు, ఊహింపఁదగి యున్నది. అదియే నిజమైనచో భాస్కరరామాయణము పదునాల్గవ శతాబ్దాదిని రచియింపఁబడెనని చెప్పవలసి యుండును.

       చ. సహజకళంకమూర్తులు కుజాతులు గూఢతరోదయ ప్రభా
           మహిములు గోత్రవిద్విషదమాత్యులు రాత్రి చరానుకూలధీ
           సహితులు మందవర్తనులు సర్పసమానులు రాజసేవక
           గ్రహములు గాననయ్యె నల రాయని భాస్కరుఁడస్తమించినన్.

       శా. రెండా నాల్కలు, సంప్రదాయకునకున్ లెక్కింపఁగా నొక్కటే
           గండా మొండి శిఖండిబండలకు లెక్కల్లేనినాల్కల్గదా!
           చండారాతికులాటవీదహనచంచజ్జైత్రయాత్రాలస
           త్కాండా ! రాయని మంత్రిభాస్కరునికొండా ! దండనాధాగ్రణీ !

       శా. కాండావిర్భవభాండభూపరివృఢగ్రైవేయశైలేయ సూ
           కాండాటాధిపకేతుమాతులబలాకాశస్రవంతీమరు
           త్కాండాఖండలతుండిపాండురయశఃకర్పూర పేటీభవ
           త్కాండా! రాయనిమంత్రిభాస్కరునికొండా ! దండనాధాగ్రణీ.

వెనుకటికూర్పులం దుదాహరింపఁబడిన పయి పద్యములు మంత్రిభాస్కరుని గూర్చినవియు, గొమ్మనామాత్యునిగూర్చినవియుఁ గాక రాయని భాస్కరుని గూర్చినవియు, నాతని పుత్రుఁడై న కొండామాత్యునిగూర్చినవియు నయి యున్నవి. మంత్రిభాస్కరుడాఱు వేల నియోగి. హుళక్కి భాస్కరుఁడు కొడుకైన మల్లికార్జునభట్టు, భట్ట నామము కలవాఁడగుటనుబట్టి వైదిక బ్రాహ్మణుడని యూహింపఁదగి యున్నది కాని విక్రమార్కచరిత్రము రచించిన యాఱువేలనియోగి యైన కోవెల గోపరాజు హుళక్కి భాస్కరుని గూడఁ దనకులమువారైన నియోగి కవులలోనే చేర్చియున్నాఁడు చూడుఁడు.

        చ. అనఘు హుళక్కిభాస్కరు మహామతిఁ బిల్లలమఱ్ఱి పెద్దిరా
             జును బినవీరరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమయాజిఁ గే
             తనకవి రంగనాధు నుచితజ్ఞుని నెఱ్ఱన నాచిరాజుసో
             మన నమరేశ్వరుం దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్."

భాస్కరరామాయణ మంకితము చేయఁబడిన సాహిణిమారఁడు బుద్ధరాజు కొమారుఁ డయిన ట్లయోధ్యాకాండములోని యీ క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

        క. 'శ్రీరమణీరమణసుధా
            ధారాళదయాకటాక్షదామస్మితదృ
            క్కైరవ వితరణకరణవి
            శారద బుద్ధయకుమార ! సాహీణిమారా ! [ అయోఁ 1 ]

ఈ బుద్ధరాజునకు నవనాధుఁ డనియు పేరు గలదు. రంగనాథరామాయణము బుద్ధరాజు రచియించిన ట్లుండుటచేతను, భాస్కరరామాయణ మా రాజపుత్రుఁ డయిన మారని కంకితము చేయఁబడుటచేతను సాహిణి మారఁడా బుద్ధరాజు కొడుకే యైనపక్షమున రంగనాధరామాయణము భాస్కరరామా యణమకంటె నిరువది, ముప్పది సంవత్సరములు ముందుగా రచియింపఁబడినదని చెప్పవలసి యుండును. సాహీణి మారఁడు గుఱ్ఱపువాఁడని చెప్పెడి కథ కేవలకల్పితము. అతఁడు రాజపుత్రుఁడు. అతఁడు క్షత్రియ కులజుడు కాక రెడ్డివంశపువాఁ డయినను, రాజ్యభారమును వహించిన వాcడగుటచే రా జయ్యెను. తండ్రిజీవితకాలములో సేనాధిపతిగా నుండి, తరువాత రాజయ్యెను, ఈతనిది సాహిణివంశము. ఇతని కుమారుఁడు కుమారరుద్ర దేవుఁడు. ఇతఁడే రామాయణమందలి యయోధ్యాకాండమును తెనిఁగించిన కవి. అందుచేతనే గద్యమునం దీతఁడు "మారయకుమార కుమారరుద్ర దేవ ప్రణీతం" బని వ్రాసికొన్నాఁడు. కోనకాటభూపతి కుమారుఁడు రుద్రరాజు, రుద్రరాజుకుమారుఁడు బుద్దరాజు; బుద్ధరాజు కుమారుఁడు విట్టలరాజు, విట్టలరాజకుమారుఁడు బుద్ధరాజు, మారయ సాహిణి బుద్ధరాజు కుమారుఁడే యయినను, రంగనాథరామాయణకృతికర్త యీ బుద్ధరాజగనో, కాఁడో యని సందేహింపవలసినదిగా నున్నది.సందేహింపవలయు నను టేల ? కాలవ్యత్యాసమునుబట్టి కాఁడనియే నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఆ బుద్ధరాజీ బుద్దరాజు తాత కావచ్చును, లేదా యీతనితో సంబంధమే లేని వేరొక బుద్ధరాజు కావచ్చును. సాహిణి మారన్న ద్వితీయ ప్రతాపరుద్రునికాలములో నాతని యశ్వసేనాధ్యక్షుఁడుగా నుండి తద్రాజ్యము తురుష్కాక్రాంతమైన యనంతరమున స్వతంత్రుఁ డయి యొక దేశ పాలకుఁ డయ్యెను. భాస్కరరామాయణ మా కాలమునందే రచియింపఁబడి 1330-వ సంవత్సర ప్రాంతమునం దీ సాహిణిమారన కంకిత మొనర్చబడి యుండును. సాహిణి మారన రాజయినట్లే క్రింది హుళక్కి భాస్కరుని చాటుధారను బట్టి సులభముగా దెలిసికోవచ్చును.

       క. అప్పు లిడునతఁడు ఘనుఁడా ?
           యప్పు డొసఁగి మరలఁ జెందునాతఁడు రాజా ?
           చెప్పఁగవలె సాహిణి మా
           రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్

మారన్న రాజనియు, సేనాధిపతి యనియు స్థాపించు పద్యములు రామాయణములోనే యున్నవి.

        క. శ్రీరామాకుచయుగళీ
           హారిద్రోల్లసితవక్షహరిచరణసరో
           జారాధ్యుఁడు మారయధర
           ణీరమణోత్తముఁడు సాహిణీ తిలక మిలన్.
                                            [ఆరణ్యకాండము, ఆ 2--]

       శా. లాటీచందనచర్చ చోళ మహిళాలావణ్యసామగ్రి క
           ర్ణాటీగీతకలాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా
           వాటీమంజరి గౌడవామనయనావక్షోజహారాళియై
           సాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ! సాహిణీ !
                                            [కిష్కింధాకొండము, 8-26]

బుద్ధరాజు తన బంధుఁడైన రంగనాధునిచేత ద్విపదరామాయణము చేయించుచున్నట్లును, ఆ గ్రంథము మూఁడు వంతులు ముగింపఁబడిన వెనుక మంత్రియైన భాస్కరుని కా సంగతి దెలిసి యతఁడు రాజుతోఁ దాను రామాయణమును పద్యకావ్యమునుగాఁ జేసి కృతి యిచ్చెదనని చెప్పఁగా ముందుగాఁ జేసి తెచ్చిన గ్రంథము కృతినందెద నని రాజు చెప్పినట్లును. అందుమీఁద నతఁడు గ్రంథమును శీఘ్రముగాఁ జేయింప నెంచి తన యాశ్రితుఁడును, కవీంద్రుఁడునైన హుళక్కి భాస్కరువి బిలిపించి చెప్పఁగా నతc డారణ్యకాండమును మాత్రము చెప్పక తక్కిన భాగమును తెనిఁగించి తెచ్చెదనని యొప్పుకొని పోయినట్టును, ఆరణ్యపర్వమును తెనిఁగించిన నన్నయభట్టునకు వచ్చిన దురవస్థయే యారణ్యకాండ మును జేసినయెడలఁ దనకును వచ్చునని హుళక్కి భాస్కరుఁడు జడియుట చేత దానినిమాత్రము మంత్రి భాస్కరుఁడు రచియించినట్లును, హుళక్కిభాస్కరుఁ డింటికిఁ బోయి తన పుత్రుఁడైన మల్లికార్డునభట్టుచేత బాల కాండమును, కిష్కింధాకాండమును, సుందరకాండమును, శిష్యుఁడైన కుమారరుద్రదేవునిచేత నయోధ్యాకాండంబును, మిత్రుఁడై న యయ్యలార్యునిచేత తాను రచియింపఁబూనిన యుద్ధకాండమునందలి కడపటి భాగమును జేయించి తాను యుద్ధకాండము యొక్క మొదటిభాగమును రచియించి మంత్రి భాస్కరునియొద్దకుఁ గొనిపోయి సమర్పించినట్లును, మంత్రి భాస్కరుఁడు తాను రచించిన యారణ్యకాండమునుగూడఁ జేర్చి రామాయణము నంతను రాజునొద్దకుఁ గొనిపోయినప్పడే రంగనాధుఁడును తన ద్విపద రామాయణమునుగూడ తేఁగా రాజు కుడిచేతితో రంగనాధుని రామాయణమును, ఎడమచేతితో భాస్కరుని రామాయణమును గ్రహించినట్లును, అందుమీఁదఁ దన్ను లాఘవపఱచినందునకయి భాస్కరునికి గోపమువచ్చి, యిటువంటి రాజునకు గ్రంథమును కృతి యిచ్చుటకంటె గుఱ్ఱములను కాచువాని కీ కృతి యిచ్చుట మేలని పలుకుచు నతఁడు కొలువువిడచి లేచిపోయినట్టును, ఆతఁడు పోవుచుండఁగా నక్కడనుండి యా మాటలు వినుచున్న మారడన్న గుఱ్ఱపువాఁడెదురుగా వచ్చి యాతనికి నమస్కరించి "స్వామీ! సత్యసరస్వతులగు మీ రాడినమాట దాఁటగూడ" దని ప్రార్ధింపఁగా భాస్కరుఁడు రామాయణమున కాతనిని కృతిపతినిగాc జేసినట్టును, ఒక కథ చెప్పుచున్నారు.

కాని యది సత్యముకాదు. ఇటీవలివారు "సాహిణి" యను పదమును జూచి భ్రమించి యీ కథ కల్పించియుందురు. రాజు గ్రంథమును శీఘ్రముగా సాంతము చేయింపవలెనని కోరియుండుటచేత భాస్కరరామాయణ మి ట్లందరిచేత వ్రాయఁబడియుండును. కొందఱీ సంబంధమున మంత్రి భాస్కరుని విడచి హుళక్కి భాస్కరుఁడే రంగనాధుని మీఁది పోటికిఁ దన పుత్ర మిత్రచ్చాత్రులచేతఁ బుస్తకమును బూర్తి చేయించెనని కథ యింకొకవిధము మార్చి చెప్పుదురు. అప్పుడు సహిత మీ కథ యధిక విశ్వాసార్హమైనది కాఁజాలదు. రంగనాధుఁడును, హుళక్కి భాస్కరుఁడును నేకకాలమునందుండినవారు కారు. ఇరువురకు నడుమను నూఱు సంవత్సరములంతరము గలదు. ఒకఁడు ముత్తాత బుద్ధరాజు కాలములోనుండిన, రెండవవాఁడు మునిమనుమనికాలములో నుండినవాఁ డగును. హుళక్కి భాస్కరుఁడు యుద్ధకాండమునందలి పూర్వభాగమును రచియించిన ట్లయ్యలార్య ప్రణీతంబయిన యూ క్రిందిపద్యమువలన నెఱుఁగవచ్చును.

        చ. 'అమర హుళక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం
            డమతరువాయి చెప్పె వికట ప్రతిభాషణుఁ డప్పనార్యస
            త్తమసుతుఁ డయ్యలార్యుఁడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
            హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్."
                                            [యుద్ధకాండము 2583]

భాస్కరరామాయణము మొదట పదునాల్గవ శతాబ్దారంభమునందుఁ దెనిఁ గింపఁబడియుండుటచేత భాస్కరరామాయణము పుట్టి యిప్పటి కాఱువందల సంవత్సరములు కావచ్చినది. సోమదేవరాజీయమునందుఁ బ్రతాపరుద్రుఁడు కొలుపుతీఱి యున్నప్పుడు దర్శింప వచ్చినవారిని వర్ణించుచో "శాకల్లి మల్లికార్జునభట్టు మొదలైన బ్రహ్మవిద్వాంసులు నూటయేబండ్రును, హళక్కిభాస్కరుఁడు మొదలుగాఁగల ప్రబంధ కవీశ్వరు లిన్నూఱుగురును ......ఆశ్వంబుల కధికారియైన సాహిణి మారనయు . కొలువఁ బేరోలగంబున సుఖోపవిష్ణుండై "- అని వ్రాయcబడియున్నది. వీ రందఱును ప్రతాప రుద్రునికాలములోనే యుండినందున, వీరు పదుమూడవ శతాబ్దాంతము నందును పదునాలవ శతాబ్దారంభమునందును నుండి యుండవలెను. సాహిణి మారని కాలములో ననఁగా 1295 వ సంవత్సరము మొదలుకొని 1320 వ సంవత్సరప్రాంతమువఱకును రాజ్యపాలనముచేసిన ద్వితీయ ప్రతాపరుద్ర చక్రవర్తికాలములోను, దరువాతను మహావిద్వాంసుఁడును మహాకవియు నయి హుళక్కిభాస్కరుఁడు మిక్కిలి ప్రసిద్ధిచెందినవాఁడు. అందుచేత నాతవికిఁ గవులును, పండితులును మిత్రులయి యుండుటయే కాక విద్యను, గవిత్వమును నేర్చుకొనుచుండిన ఛాత్రులును పలువురుండి యుందురనుటకు సందేహము లేదు. శ్రీనాధునికాలములో ననఁగా పదునాల్గవ శతాబ్దాంతమునందును పదునైదవ శతాబ్దాదియcదును నుండిన వల్లభామాత్యుఁడు [1] తన క్రీడాభిరామమునందు

      ఉ. "నన్నయభట్టతిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం
           డన్నను జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
           నెన్నుదుటం గరాంజలులు [2] నింతలు చేయనిరావితాపాటి తి
           ప్పన్నయు నంతవాఁడె తగునా యిటుదోసపుమాట లాడఁగన్."

అని తనకంటె నేఁబదియఱువది సంవత్సరములు పూర్వమునం దుండిన హుళక్కి భాస్కరుని నన్నయతి క్కనాదులతో సమానునిగాఁ బొగడుటయే యాతని ప్రసిద్ధిని వేయినోళ్లఁ జాటుచున్నది. అట్టి సుప్రసిద్దకవికడ మిత్రులను బలువురు చేరి కవిత్వమును నేర్చుకొనుచుండుటయుఁ దాము చేసిన గ్రంధములను పద్యములను గురువునకుఁ జూపి దిద్దించుకొని యాతని మెప్పు పడయఁ జూచుచుండుటయ వింత కాదుగదా! భాస్కరుఁడు రామాయణరచనకుఁ బూనినప్పుడు తామును గొంతభాగమును జేసి చూపెద మని వేఁడఁగా మిత్రానురాగముచేతను శిష్యవాత్సల్యముచేతను వారి కోరికను నిరాకరింపక యంగీకరించుట స్వాభావికసౌజన్యసూచకముకాదా ? ఈ ప్రకారముగాఁ దన పుత్త్రునకును ఛాత్రునకును మిత్రునకును భాస్కరుఁడు కొంతకొంత భాగ మిచ్చి తా నొక భాగమును బుచ్చుకొని వారు చేయుచు వచ్చినదానిని తా నప్పడప్పడు చదివి సంస్కరించుచు నడుమ నడుముఁ దన పద్యములను జేర్చుచు శ్లాఘ్యముగా నున్నదానిని తన పుస్తకములోని భాగముగా స్వీకరించుచు వచ్చి యుండును. ఈ హేతువు చేతనే రామాయణమునకు మూఁడు కాండములు చేసిన మల్లికార్జనభట్టు పేరురాక యొక కాండమునో, కాండమునరనో చెసిన భాస్కరుని పేరు వచ్చెననుటకు సందేహములేదు. తండ్రికి కుమారుని పేరు ప్రసిద్దికి వచ్చునప్పటి కంటె నెక్కువ సంతోషము వేఱొకప్పడు కలుగదు. అందుచేత నే తన కుమారునిని మూఁడు కాండములు తన రామాయణములో నుంచుట కంగీకరించి యతఁడు కృతార్ధుఁడయ్యెను. సద్గురువునకు స్వపుత్రునియందు వలెనే సచ్ఛాత్రుని యందును నత్యంత ప్రీతి యుండును. అందుచేతనే భాస్కరుఁడు తన ప్రియశిష్యుఁడు చేసిన కాండమును సహితము తన పుస్తకములో నుంచుట కంగీకరించి యుండును. ఈ కుమారరుద్రదేవుఁడు సామాన్య శిష్యుఁడు గాక భాస్కరమహాకవి కాశ్రయుc డెన సాహిణి మారయ ప్రభువునకు పుత్రుఁడయి కూడ నుండెను. తన సుతుఁడు కవియగుటయు నాతనికవిత్వము తన కంకిత మొనర్పఁబడిన పుస్తకములో నుండుటయు రాజునకు సహితము పరమ ప్రీతికరముగానే యుండును.

భాస్కరుఁడు మొట్టమొదటఁ దన కుమారుఁడైన మల్లికార్జునభట్టునకు బాల కాండమును, శిష్యుఁడైన కుమారరుద్ర దేవున కయోధ్యాకాండమును తెనిఁగించుట కిచ్చి తా నారణ్యకాండమును బుచ్చుకొని యుండును. తానే మొదటిదైన బాలకాండమును బుచ్చుకొని యితరులకే తరువాతి కాండముల నియ్యక తా నేల యారణ్యకాండమును బుచ్చుకోవలెనని కొంద ఱడుగ వచ్చును. వర్ణిష్ణువులయి చిరకాలము మనఁగోరెడి తరుణ వయస్కు లైన వారి కా కాండము నియ్యక వారి శ్రేయస్సును గోరియే యతఁడు తాను వయస్సు చెల్లినవాఁడయి మోక్షార్థి యయి యున్నవాఁ డగుటచేత నారణ్య కాండమును గై కొని యుండును. ఆ కాలమునందుసు సకారణముగానో యకారణముగానో భారతారణ్యపర్వమువలనే రామాయణారణ్యకాండము శుభదాయకము కాదన్న నమ్మకము సామాన్యముగా జనులలో వ్యాపించి యున్నది. పిన్నయీడువాఁడైన మల్లికార్జునభట్టేండ్లు చెల్లినవాఁడైన తండ్రికంటె నధిక వేగముగా పద్యరచన చేయఁగల కవితాధార కలవాఁ డగుటచే జనకుఁ డారణ్యకాండమును ముగింపకముందే తన బాలకాండమును ముగించి తన సహపాఠియైన కుమారరుద్ర దేవుని కిచ్చిన యయోధ్యాకాండమును, తండ్రి చేయుచుండిన యారణ్యకాండమును విడిచిపెట్టి కిష్కింధా కాండమును జేయనారంభించెను ఇంతలోపల భా స్కరుఁడు తన యారణ్య కాండమును ముగించి కొడుకు చేయుచున్న కిష్కింధాకాండము తరువాయి నందుకొని దానిని పరిసమాప్తినొందించి సుందరకాండమును జేయ నారంభించెను. తరువాత మల్లికార్జునభట్టందుకొని సుందరకాండమును జేయుచుండఁగా మిత్రుఁడై న యయ్యలార్యుఁ డాతని యనుమతిమీఁదనే యుద్ధకాండముయొక్క యుత్తరభాగమును గైకొని రామాయణమును తుదముట్టించి యుండును[3]

ఈ రామాయణము పలువురచేఁ దెనిఁగింపబడిన దగుటచేత శైలియు బహువిధములుగా నుండును అరణ్యకాండముకవిత్వము తక్కినవాని కవిత్వము కంటె రసవంతముగా నుండును ఇందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కానఁబడుచున్నను, పూర్వలాక్షణికు లెల్లరు భాస్కరరామాయణమును ప్రామాణిక గ్రంథముగా నంగీకరించి యున్నారు. వారివారి శైలులు తేటపడుటకయి యిందు క్రిందఁ గొన్ని పద్యముల నుదాహరించుచున్నాను.

   1. మల్లికార్జునభట్టు.

      ఉ. జంగమవల్లులో యమృతసాగరవీచులొ రత్నమూర్తులో
          యంగజు మోహనాస్త్రములొ యంచిత హేమశలాకలో మహీ
          రంగనటత్తటిల్లతలొ రాజకళానఖులో యనంగఁ ద
          న్వంగులు వాద్యసంగతుల నాడుచుబాడుచునుండ నత్తఱిన్.
                                                           [బాలకాం. 308]

      శా. ప్రాణంబు ల్వల తేవి రామునకు నేర్పారంగ నన్నిచ్చిన
          ప్రాణుండై మను, మట్లుగాక మదిలో దర్పించినం దద్రణ
          క్షోణీయుక్తఖరాస్రసిక్తపటుదోస్త్సూణోగ్రబాణాసనా
          క్షీణస్పారకఠోర ఫెూరశరము ల్చెండాడు నీకంఠముల్.
                                                       [సుందరకాండ.195]
   2. కుమారరుద్రదేవుఁడు

      ఉ. వేఁడిన వేఁడి మాట నృపవీరుఁడు సై(పక కర్ణరంధ్రముల్
          సూఁడిన భంగి దాకుఁటయు స్రుక్కి మనంబున నొచ్చి నిన్ను నే
          నాఁడు నృపాలపుత్రి వని నమ్మి వరించితిఁగాక! యిమ్మెయిన్
          నేఁ డొక కాలసర్పమయి నీ విటుచేయుట నాకుఁ దోcచెనే?
                                                             [అయో. 19]

      చ. తలఁపఁగ నీ వశక్తునివిధంబున నాడెదు రామచంద్ర నీ
          కొలఁది యెఱుంగఁ డీతఁ డతికుత్సితుఁడై మతిదప్పి యాలిమా
          టలు విని యింతతెంపున కొడంబడెఁ దా నొక సత్యవాదియై
          పలుకఁడె మొన్న నేఁడు నినుఁ బట్టముఁగట్టెద నంచు బొంకొకో
                                                              [అయో.49]
   3. భాస్కరుఁడు.

      ఉ. 'ఓరి నిశాచరాధమ! మదోద్ధతిఁ దాపసవిప్రకారముల్
           వారక చేసి తా ఫల మవశ్యముఁ బొందక పోపునే? యమా

        గారగతుండపై కుడువఁ గాలము నీ కిదె చేరె; నింక నా
         ఫెూరశ రంబుల న్జమునికోర్కులు దీఱఁగ నిన్నుఁ ద్రుంచెదన్.
                                                      [ఆరణ్య.ఆ.1.238]

     ఉ. ఈ కొఱగానికార్య మిటు లెవ్వఁ డొకో యనుకూలశత్రుఁడై
          నీకుఁ బ్రియంబుగాఁ బలికె నీవును నిత్తెఱఁ గాచరింపఁగా
          రాక తలంచిచూడ నిది రాక్షసవంశ వినాశకాలమో
          కా కటుగాన నీకొనునె కాదన కీదృశ మెవ్వఁడేనియన్.
                                                         [ఆర.ఆ.2.14]
  4. హుళక్కి భాస్కరుఁడు

     చ. చనదు మహద్విరోధ మని చక్కటి చెప్పిన నింతతప్పునన్
          గనలితి; నీతిశూన్యులకుఁ గార్యము లేటికిఁ దోఁచు? నిప్డు వే
          యును బనిలేదు; నీవలన నొప్పని నావచనంబు లెల్ల నీ
          వనిమొన రాముచేఁ బడినయప్పు డెఱింగెదుగాక పోయెదన్ ?
                                                   [యుద్ధకాండము 154]

     శా. కామక్రోధమదాతిరేకమున నేకగ్రాహివై యున్న ని
          న్నే మార్గంబునఁ దెల్పవచ్చు ? నధికుం డెగ్గేల సైఁచున్? బర
         స్త్రీ మాయం గొనివచ్చు టేతగవు ? నీచేఁ గాక సామంతమి
          త్రామాత్యాదులు నేఁడు శాత్రవులచేనా చచ్చి రూహింపఁగన్ ?
                                                         [యుద్ధ. 883]

   5.అయ్యలార్యుఁడు

     శా. పాతాళంబుననుండి వచ్చెనొ, నభోభోగంబునందుఁడి సం
         ఘాతవ్యగ్రత నేగుదెంచెనొకొ దిక్చక్రంబునందుండి యు
         జ్ఞాతంబై యరుదెంచెనొక్కొ యనఁగా సర్వంకషంబై తమో
         జాతం బంతఁ బదార్ధదర్శనవినాశస్థేమవైు పేర్చినన్
                                                          [యుద్ధకాండ]

     మ. మదధీనంబగు జీవితంబును మనోమానానురాగంబులున్
         ద్వదధీనంబులు చేసి యన్యజనచింతాదూరనై తావకా

     భ్యుదయం బెప్పుడుఁ గోరుచుండ నిట నీ వుగ్రంబుగాఁ బల్క వ్ర
      య్యదు కంటే హృదయంబు వజ్రకఠినంబైయున్న దిప్పట్టునన్.
                                                [యుద్ధకాండ 2348]

తెలుఁగుభారతమును రచియించిన కవులవలెనే రామాయణమును రచించిన కవులును మూలగ్రంథమును మిక్కిలి సంగ్రహపఱిచి కథను కూడ కొన్ని చోట్ల నిష్టానుసారముగా మార్చివేసినారు. ఆందుచేత సంస్కృతమున నిరువదినాలుగువేల గ్రంథముగా నున్న రామాయణము తెనుగున పదునేను వేల గ్రంథమయినది. ఈ కవులు మొత్తముమీఁద గ్రంధమును సంగ్రహపఱిచినను, కొన్నిచోట్ల పెంచను సహితము పెంచిరి ఎట్లన యుద్ధకాండమునందు మాఘకావ్యమునందలి యేడవ సర్గము చేర్పఁబడినది. గ్రంధవిస్తర భీతిచేత సంస్కృతరామాయణమునకును తెలుఁగురామాయణమునకును గల భేదము లిం దేమియు వివరింపలేదు. హుళక్కిభాస్కరుని కవిత్వము మనోహరముగా నుండును. మల్లి కార్డున భట్టకవిత్వములో సంస్కృతపదములును, సమాసములు నధికముగా సున్నవి. మొత్తము మీఁద పుస్తకముశైలి యంతయు శ్లాఘనీయముగానే యున్నది. ఈ రామాయణము గాక హుళక్కిభాస్కరుఁడు దశగతు లను గ్రంథమును గూడ రచించి సాహిణి మారనికి అంకితముచేసెనని రామకృష్ణకవిగారు క్రీడాభిరామపీఠికలో వ్రాసిరి.

ఆంధ్రుల చరిత్రము ద్వితీయభాగములో శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు భాస్కరరామాయణ కర్తల నొక్కొకరినే యెత్తుకొని మల్లికార్డున భట్టునుగూర్చి "యితఁడు సాహిణిమారన యాస్థానకవి యగు భాస్కరుని పుత్రుఁడే యైన, వారియాజ్ఞాప్రకారము రామాయణము రచింపఁబూనిన వాఁడే యైనయెడల బాలకాండము మొదట కృతినాయకుని సంబోధింపక కాండాంతమున శివుని సంబోధించి యుండఁడనియు, కిష్కింధాకాండాదినున్న పద్యము సాహిణిమారనసంబోధనము కాక పోవుటయే కాక కాండాంతమునందలి పద్యములు రెంటిలో నొకటి శివుని గూర్చిన సంబోధనము కలది యనియు, సుందరకాండము మొధట సాహిణి

మారని సంబోధించిన పద్యమున్నను కాండాంతమునందలి పద్యములు రెండును శివుని సంబోధించునవిగా నున్న వనియు, అందుచేత మల్లికార్జున భట్టు రచియించిన భాగములు శిపుని కంకితము చేయఁబడినవి గావి సాహిణి మారన కంకితముచేయఁబడినవి కానట్టును సాహిణిమారనను గూర్చిన రెండు పద్యముల నెవ్వరో చాటువులుగాఁ జెప్పిన నిటీవలి లేఖకులు వానినిదెచ్చి వీనికి ముడిపెట్టినట్టును మల్లికార్జునభట్టు సాహీణిమారనకాలమువాడు కానట్టును నూహింపవలసియున్న" దనియు వ్రాసి, తరువాతఁ గుమార రుద్రదేవునిగూర్చి యతఁడు "తనభాగమును (అయోధ్యాకాండముమ) సాహిణిమారని కంకితముచేసినది వాస్తవ మనుటకు సందియములేదు గాని యతఁడు భాస్కర శిష్యుఁ డన్న మాట విశ్వసింపఁదగినదిగా గనుపట్ట" దనియు, "ఇంత విద్యావంతుఁడై న కుమారుఁడు కలిగి యుండియు సాహీణిమారc డీ రామాయణము నంతయు నీతనిచేతనే వ్రాయింపకుండుటకుం గారణంబు' లేదనియు, వ్రాసి, యటు పిమ్మట భాస్కరునిగూర్చి 'అరణ్యకాండము సాహిణి మారని కంకితము చేయఁబడియున్నది గాని రచనా విధాన మంతయు నన్నెచోడ, తిక్కనాది కవివరుల రచనావిధానక్రమమును బోలియున్నది" యనియు, "ఈ కాండమున నాశ్వాసవిభాగము చేయబడినది. అంతియగాక యీ కాండమునందలి ప్రధమ ద్వితీయాశ్వాసాంతపద్యములు కృతిపతినిగూర్చి సంబోధనములు గాక ప్రధమ ద్వితీయాంతములుగా నున్నవి. ఇట్టి మార్గమును తదితర కాండములను రచించిన కవులెవ్వరు నవలంబించి యుండలేదు" అనియు, వ్రాసి, అటుతరువాత నయ్యలార్యనిఁ గూర్చి యతఁడు 'యుద్ధకాండములో కొంత భాగము హుళక్కిభాస్కరుఁడు చెప్పెనని చెప్పెనేకాని హుళక్కిభాస్కరుఁడు తనకు మిత్రుడని యెక్కడను జెప్పి యుండలేదు. మఱియు యుద్ధకాండమునందలి పద్యములు శివుని సంబోధించునవిగా నున్నవి గనుక నితఁడు సాహిణిమారనికాలములోనివాఁడు కాఁడనుట నిశ్చయము అనియు వ్రాసి, కడపట రామాయణములో విశేషభాగము సాహిణిమారని మరణానంతరమే రచింపఁబడి యుండవలయును. అట్లుగాక యున్న శివునిం గూర్చిన సంబోధనములు గల పద్యము లీ రామాయణమున నుండుట కే ప్రమేయము గానరాదు. ఎన్ని విధములుగాఁ బరిశీలించి చూచినను ఆరణ్య కాండము తక్కిన భాగములకంటెఁ బూర్వము రచియింపఁబడి యుండు నని విదిత మగుచున్నది. అట్లయినయెడల ... ... సాహిణిమారుఁడు రామాయణము నంతయు విడిచి ముందుగా భాస్కరమహాకవిచే నారణ్యకాండము నంకితము పొందుట కేమి హేతువో తెలియరాదు " ఆని వ్రాసి, భాస్కర రామాయణమునుగూర్చి యథార్థకధనము నింకను బరిశీలింపవలసియున్నదని తేల్చిరి

మల్లికార్జునభట్టు తన గద్యమునందు 'అష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవి పుత్ర మల్లికార్జునభట్ట ప్రణీతం బయిన ...'

అని స్పష్టముగా తాను భాస్కరసత్కవి పుత్రుఁడనని చెప్పకొనుచుండcగా కొడుకు తనతండ్రి కాశ్రయుఁడయి యున్న మారనకాలములో లేఁడన్న విపరీతాభిప్రాయము శ్రీవీరభద్రరావు పంతులుగారి కేల కలిగెనో దురూహ్యముగా నున్నది. మల్లికార్డున భట్టు తాను జేసిన రామాయణభాగమును రాజాజ్ఞచేతఁగాక తండ్రియిష్టమును బట్టియే చేసి యుండుటచేత స్వాభావికముగాఁ దన యిష్టదైవతమైన శివునినే సంబోధించి యున్నాడు. రాజున కాశ్రితుఁడును, విహితుఁడును నైన భాస్కరుఁడు రాజానుమతితో నా పద్యముల నట్టే యుంచి యుండవచ్చును. భాస్కరుఁ డాస్థానకవిగాను, మారన యశ్వసేనా నాయకఁడుగాను ప్రతాపరుద్రునియొద్దc గొలువుకుదిరియుండుట ప్రసిద్ధము. ఒక్క ముద్రితరామాయణమును మాత్రమే కాక పూర్వ లిఖితపుస్తకములనుగూడ పరిశీలించినచో పూర్వో క్తములయిన యనేకాంశములు తేటపడును. చెన్నపురిలోని దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో రామాయణములు 82, 83 సంఖ్యలు గలవియు, 138 మొదలుకొని 158 వఱకు సంఖ్యలు గలవియు, 24 తాళపత్ర లిఖితపుస్తకములు నున్నవి. కిష్కింధాకాండముచివర నొక పుస్తకములో మాత్రము భాన్కరునిగద్య మున్నది; ఇంకొక పుస్తకములో (143) కుమారరుద్రదేవుని గద్య మున్నది. సుందరకాండముచివరను 82 సంఖ్య గల పుస్తకములో 'శ్రీమదష్టమభాషాకవిమిత్ర కులపవిత్రయశస్కర భాస్కరప్రణీతంబైన' యని యున్నది. ఈ ప్రకారముగానే 144, 148, 150, 151 సంఖ్యల పుస్తకములలోను భాస్కరునిగద్యమే యున్నది. ఈ పుస్తకములలో పద్యములు సహిత మనేకములు భిన్నములుగా నున్నవి. ఈ పద్య భేదములనుబట్టి పుస్తకములో నొక్కరికంటె నెక్కువమంది హస్తము తగిలినట్టు కనఁ బడుచున్నది. మల్లికార్డున భట్టున కిదియే నూతన కవిత్వ మగుటచేతఁ దన పాండిత్యప్రకర్షమును కనఁబఱుపవలె నన్న యుద్దేశముతోఁ గాఁబోలును సాంస్కృతికదీర్ఘ సమాసములు మొదలై నవానిని విశేషముగా వాడి యున్నాఁడు.

రెండవదియైన యయోధ్యాకాండము మారయకుమారుఁడై న కుమారరుద్ర దేవునిచే రచియింపబడిన ట్లున్నది అతనియాశ్వాసాంతగద్య మిది.

"సకలకళావిశారద శారదాముఖముకురాయమాణ సారస్వతభట్టబాణ నిశ్శంకవీర మారయకుమార కుమారరుద్రదేవ ప్రణీతంబైన......."

ఈ గద్యములోఁ దాను భాస్కరశిష్యుఁడనని చెప్పకపోయినను తన తండ్రికాశ్రిత కవియైన భాస్కరకవితోఁ గలిసి తన తండ్రి పేర రచియింపఁబడు చున్న రామాయణరచనలో దాను పాలుగొనుచుండుటయుc, దన పద్యములను భాస్కరునిచే సంస్కరింపించుకొనుచుండుటయు నాతనిశిష్యత్వమును చెప్పకయే చెప్పచున్నవి. కొన్ని వ్రాఁత పుస్తకములలో నీ కాండాంతము నందు భాస్కరుని గద్యమే యున్నది. పద్యములను పెక్కులు భిన్నములుగా నున్నవి. ఇది యంతయు భాస్కరుని హస్త మిందులోను దగిలి యున్నదని తెలుపుడుచేయుచున్నది. కుమారరుద్ర దేవుఁడు తరుణవయస్కుఁడైన రాజకుమారుఁ డగుటచేఁ దన స్తోత్రప్రియత్వమును నిశ్శంకవీర త్వమును గద్యములోఁ గొంత చూపుకొని యున్నాఁడు.
ఇది యుద్ధకాండములోని భాస్కరుని కడపటి పద్యము.
            
             ఉ. "ఇంక బలీముఖుల్ బలిసి రెక్కడిరావణుఁ డేటిలంక పొం
                 డింకను మేఘనాథునగరీ పెనుమంటలతోడిచిచ్చుల

             భ్రంకష శాతకుంభశిఖరంబగు వెూసలఁ గంటి రెట్లు నా
             వంకఁ జరింప దగ్ని యవి వారివిభీషణుపుణ్యగేహముల్"
                                                    [యుద్ద 1133 ]
ఇక్కడనుండి యయ్యలార్యుని కవిత్వము. " ఇకమీఁద శాకల్యమల్లభట్టు చెప్పిన కవిత్వము" అని కొన్ని వ్రాఁతప్రతులలోను, 'ఈ మీఁద వేదగిరి రాయనింగారు శాకల్యమల్లుభట్టుగారి మనుమcడు అయ్యలుభట్టుగారిచేత చెప్పించిన యుద్ధకాండ శేషము" అని కొన్ని వ్రాఁత ప్రతులలోను ఉన్నది. యుద్ధకాండాంతపద్యము కొన్ని ప్రతులలో

 "అష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవిమిత్రాయ్యలార్య విరచితంబైన........"

అనియు, కొన్నిప్రతులలో

  "ఇది శ్రీశాకల్యమల్లకవివర రామనరసింహావరజాప్ప లార్యవరనందనోభయభాషాకవితావి శారద శారదాచరణకమల పరిచరణ మానసాయ్యలార్య విరచితంబై_న......."

అనియు నున్నది. ఇందలి మొదటి గద్యములో నయ్యలార్యుఁడు భాస్కరుని మిత్రుఁ డనియు, రెండవ గద్యములో శాకల్యమల్లనియెుక్కయు.రామనృసింహుని యొక్కయు తమ్ముడైన యప్పలార్యుని పుత్రుడనియు చెప్పఁబడెను. అయ్యలార్యుఁడెట్లయినను భాస్కరకవికి సమకాలీనుఁడే. ప్రతాపరుద్రునియాస్థానములో శాకల్యమల్లభట్టు పండితుఁడు గాను, భాస్కరుఁడు కవిగాను, ఉండినందున శాకల్యమల్లకవి తమ్మునికొడుకైన యయ్యలార్యుఁడు మల్లికార్జునభట్టు, కుమారరుద్రదేవులతోడి యీడువాఁడయి యుండును. కవి చెప్పినదానికి ప్రత్యక్షవిరోధముగా నెవ్వడో లేఖకుఁ డెవ్వడో వేదగిరిరాయనింగారు చెప్పించిరని వ్రాసిన మాట పాటింపఁదగినది కాదు. 150 వ సంఖ్యగల వ్రాఁతప్రతిలో గద్య యయ్యరుల్యానిదే యున్నను, "శ్రీమద్రామాయణమహాకావ్యంబున యుద్ధకాండ శేషంబునందు సర్వంబును షష్ణా శ్వాసము" అని యున్నది. 155-వ సంఖ్య గల వ్రాఁతప్రతియందు గద్య సహితము భాస్కరునిదే యుండి "యుద్ధకాండంబునందు సర్వంబును షష్ణా శ్వాసము" అని యున్నది. దీనిని బట్టి చూడఁగా భాస్కరుడే యుద్ధకాండంబునంతను రచించి, దాని నారణ్యకాండమును వలెనే యా శ్వాసములుగా భాగించి యుండునని తోఁచుచున్నది. అయినను యుద్ధకాండము కడపట షష్ఠాశ్వాసమని యుండుటయే కాని లోపల నాశ్వాస విభజనము కానరాదు. దీనినంతను విచారించి చూడఁగా రామాయణ మంతయు భాస్కరునికాలములోను సాహిణిమారనకాలము లోను రచింపఁబడినదే యని విస్పష్ణ మగుచున్నది. రామాయణ కవిత్వ మంతటిలోను మొట్టమొదట నారణ్యకాండకవిత్వమును, దానికిఁ దరువాత యుద్ధకాండకవిత్వమును మేలయినదిగాc గానఁబడుచున్నది.

భాస్కరరామాయణమునందలి బాల, అరణ్య, కిష్కింధాసుందరకాండములను మంత్రి భాస్కరుఁడును, అయోధ్యాకాండమును కుమారరుద్ర దేవుఁడును, యుద్ధకాండములోని కొంతభాగమును హుళక్కిభాస్కరుఁడును, మిగిలిన భాగము నయ్యలార్యుఁడును రచించిరనియు, బాల, కిష్కింధా, సుందరకాండములలో మల్లికార్డున భట్టు కవిత కొంత చేరియుండుటవలన కాండముల చివరికి గద్యము లాతని పేరిటనే కానవచ్చుచున్నవనియు "ఆంధ్రకవి తరంగిణి" కారుల యభిప్రాయము. బాలకాండము, అయోధ్యా కాండము, ఆరణ్యకాండమును మంత్రి భాస్కర విరచితములయి యుండునని "తెనుగుకవుల చరిత్ర" కర్తల యభిప్రాయము. భాస్కరరామాయణములోని బాల, కిష్కింధా, సుందరకాండములను భాస్కరుని కుమారుఁడగు మల్లికార్జునభట్టు రచించినట్లు గద్యములవలన దెలియవచ్చుచున్నది. ఆ కాండములలో నీతని కవిత కొంత చేరియం డును. ఇతcడు హుళక్కిభాస్కరుని పుత్రుఁడు ఇతఁడు తన గ్రంధభాగములను పరమేశ్వరాంకితములుగా నొనర్చెను. ఇతని యితర గ్రంథము లేవియు లభింపలేదు. హుళక్కిభాన్కరుని కాలము పదుమూఁడవ శతాబ్ది ద్వితీయ పాదమునుండి పదునాల్గవ శతాబ్ది ప్రథమపాదము వఱకు నగుటచే మల్లికార్జునభట్టు క్రీ.శ.1280-13౩౦ నడుమనుండి యుండునని 'ఆంధ్రకవి తరంగిణి' కారుల యభిప్రాయము, (మూcడవ సంపుటము పుట 218) ఇందలి యయోధ్యాకాండమును రచించిన కుమారరుద్రదేవుని గ్రంథాంతరములు కానరాలేదు. ఈతఁ డోరుగంటిని పాలించిన రుద్రదేవుని బంధువై యుండునని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారును, కృతిపతి యగు సాహిణిమారన పుత్రుఁడని (శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారును భావించిరనియు, వారియూహలు సరికావనియు "ఆంధ్రకవి తరంగిణి"లోఁ గలదు. (మూడవ సంపుటము-" కుమారరుద్రదేపుఁడు") ఇతఁడు 13 వ శతాబ్దిచివఱను, 14 వ శతాబ్ది తొలిపాదమునను ఉండియుండును.

యుద్ధకాండమును పూరించిన (శాకల్య) అయ్యలార్యుఁడు మల్లాభట్టు మనుమఁడు; అప్పలార్యుని నందనుఁడు; ఇతడు రామాయణ యుద్ధకాండమును క్రీ.శ.13౩౦ ప్రాంతమున పూర్తిచేసియుండునని 'ఆంధ్రకవి తరంగిణి' (నాలుగవసంపుటము-పుట 154) లోఁ గలదు.]

  1. [* క్రీడాభిరామము శ్రీనాథ కృతియని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మున్నగు వారు, వల్లభరా యకృతియని శ్రీబండారు-తమ్మయ్య ప్రభృతులు.]
  2. ['నింతురు జేయని' అనునది సరియైన పాఠము.]
  3. [ఈ వాక్యములన్నియు నూహలపైనే యాధారపడియున్నవనియు, ఆ యూహలలోఁ గొన్ని పరిశీలనము చేసి చూచునప్పడు నిలుచునవి కావనియు 'ఆంధ్ర కవితరంగిణి'లోఁ గలదు.]