ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నాచన సోముఁడు
నాచన సోముఁడు
నాచన సోముఁ డనెడి కవి యెఱ్ఱాప్రెగడ కిరువది ముప్పది సంవత్సరముల తరువాత సుప్రసిద్దపండితకవిగా నుండినవాఁడు. ఈ కవి యెఱ్ఱాప్రెగడ వృద్దదశలో బాలుఁడయి కొంతకాలము సమకాలీనుఁడయి యుండి యుండ వచ్చును. ఇతcడు రచించిన హరివంశముయొక్క మొదటియాశ్వాసము లోని యవతారిక మాకు దొరకనందున కవియొక్క గోత్రాదులను చెప్పఁ జాలము. ఇతఁడు నియోగి, నాచన కొమారుఁడు. [నాచన సోముఁడు. అనుచోఁ గల "నాచన" శబ్దము వంశనామమో, పితృనామమో స్పష్టముగాఁ దెలియుట లేదనియు, శాసనములోని 'సోమాయ నాచనాంభోధే - సోమాయ" అని యుండుటచే వంశనామమే యని యూహీంప నవకాశ మున్నను, కొక్కోక కవి యెఱ్ఱన సోమన నాచన సుతుఁడని చెప్పుటచేతను, సింహాసన ద్వాత్రింశతికను రచించిన కొఱవి గోపరాజు "నాచిరాజు సోమన" యని పేర్కొనుటచేతను, "నాచన" యనునది తండ్రి పేరే యని నిశ్చయింప వచ్చుననియు 'ఆంధ్రకవి తరంగిణి' (నాలుగవ సంపుటము, పు 116)లోఁ జెప్పఁబడినది. ఇతఁడు తన గ్రంధమును నెల్లూరియందలి హరిహరనాధునకు గృతి యిచ్చుటచేత నీతనినివాసస్థలము నెల్లూరిమండలములోని యేదో గ్రామమని తోఁచున్నది. యెఱ్ఱాప్రెగడ చేసిన హరివంశము ప్రౌఢముగా నుండలేదన్న యభిప్రాయముతో నీతడీ యుత్తర హరివంశమును రచించినట్టు కనఁబడుచున్నది. [నాచన సోముఁడు. యెఱ్ఱాప్రెగడ వలెనే హరివంశము నందలి పూర్వోత్తరభాగములను రెండింటిని రచించెనని *ఆంధ్రకవి తరంగిణి" కర్త, మఱికొందఱును తలంచుచున్నారు. ఇతని పూర్వహరివంశ మెచ్చటను లభింపలేదు. ఇతఁడు త్తర హరివంశమునే రచించియుండునని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మున్నగువారి యాశయము. సోమన పూర్వ హరివంశమునుకూడ రచించెననుటకుఁ దగిన ప్రమాణములు కావలసి యున్నది. [ఇంచుమించుగా నెఱ్ఱనయ, సోమనాథుఁడు నేకకాలీనులు గనుక, శంభుదాసునికవిత్వమునందీత నికంత గౌరవము కలిగి యుండకపోవచ్చును. సోమనాధునికవిత్వము మిక్కిలి ప్రౌఢముగాను, సర్వవిథముల నెఱ్ఱాప్రెగడ కవిత్వమునకంటె మేలైనదిగాను ఉన్నది. ఒక్క యెఱ్ఱాప్రెగడకవిత్వమే కాదు. భారతమును రచించిన కవిత్రయములో ననేకులకవిత్వమును గొన్ని విషయములలో సోమునికవనముతో సరి రాదని నా యభిప్రాయము.[1]
ఇతనికవిత్వపటుత్వసంపదనుబట్టి యీతనికి సర్వజ్ఞుడని బిరుదుపేరు వచ్చినది. ఆపేరున కీతఁడు తప్పక తగినవాఁడే. ఇటీవల నితనికాలమును దెలిపెడి తామ్రశాసన మొకటి దొరికినది. అది బుక్కదేవరాయల రాజ్యకాలములో నాచన సోమనకును, మఱి యైదుగురు బ్రాహ్మణులకును గలిపి రాజొకగ్రామము నగ్రహారముగా నిచ్చినప్పడు పుట్టిన శాసనము. ఈ శాసనమునుబట్టి యితఁ డాపస్తంభసూత్రుఁడనియు, భారద్వాజ గోత్రుడనియు యజుశ్శాఖవాఁడనియు సకలాగమవేది యనియు నష్టాదశ పురాణార్ధ విదుఁడనియు నష్టభాషాకవిత్వరచనా విశారదుఁ డనియు నాచనకులాంభోధిసోముఁ డనియుఁ దెలియవచ్చు చున్నది. ఈ శాసనము నిచ్చటఁ బూరముగా వ్రాయుచున్నాను. ఇది మైసూరురాజ్యములోని కోలారు మండలమునందలి హోబ్లీరామపురపు పటేలయిన జటావల్లభుఁ డను విప్రునినుండి గైకొనఁబడి ఎఫిగ్రాఫికాకర్ణాటికాలో జీ. డీ. 46 వ సంఖ్యను బ్రకటింపఁబడిన తామ్రశాసనము.
శ్రీగణాధిపతయే నమః
శ్లో. నమ సుంగశిరశ్చుంబిచన్ద్రచామరచారవే,
తైలోక్యనగరారంభమూల స్తభాయ శంభమే. 1
ఆవ్యా దవ్యాహతైశ్వర్యకారణో వారణాననః
వరద స్తీవ్రతిమిరమిహిరో హరనందనః. 2
శ్రీమా నాది వరాహో య శ్శ్రియం దిశతు భూయసీం,
గాఢ మాలింగితా యేన మేదినీ మోదతే సదా. 3
అస్తి,కౌస్తుభమాణిక్యకామధేనుసహోదరః
రమానుజః కళానాథః క్షీరసాగరసంభవః 4
ఉదభూ దన్వయే తస్య యదుర్నామ మహీపతిః
పాలితా యత్కులీనేన వాసుదేవేన మేదినీ. 5
తత్కులే బుక్కనామా యః కీర్తి శౌర్యవిచక్షణః
మంగాంబికా౽భవద్రాజ్జీ లక్ష్మీరివ హరే ర్యధా. 6
అభూ త్తస్య కులే శ్రీమా నభంగురగుణోదయః
అపాత్త దురితాసంగః సంగమో నామ భూపతిః. 7
మాలాంబికా౽భవద్రాజ్ఞీ తస్య రాజ్ఞః శుచిస్మితా,
దమయంతీ నళస్యేవ ఇంద్రస్యేవ యథాశచీ. 8
ఆసన్ హరిహరః కంపో బుక్కరాయమహీపతిః.
మారపో ముద్దప శ్చేతి కుమారా స్తస్య భూపతేః. 9
పంచానాం మధ్యగ స్తేషాం ప్రఖ్యాతో బుక్క భూపతిః
ప్రచండ విక్రమో మధ్యే పాండవానా మివార్జునః. 10
భంగా కళింగామిత శౌర్యవృత్తే
ర్వంగా విభిన్నాంగవిఘూర్ణనేత్రాః,
ఆంధ్రాశ్చ రాంధ్రాణి విశంతి యస్య
బాహోగ్రఖడ్గేన విశీర్యమాణాః.
తురుష్కా, శ్శుష్కవదనాః పాండ్యభూపాః పలాయితాః,
స్వభుజార్జితవీర్యేణ తస్మి న్రాజ్యం ప్రశాసతి. 12
బుక్కరాయో౽భవ చ్ఛ్రీమాన్ భుజార్జితపరాక్రమః,
మేదినీవ ప్రజా యేన స్వపుత్రా ఇవ రక్షితాః. 13
రాజాధిరాజ స్తేజస్వీ యో రాజపరమేశ్వరః
భాషాలంఘితభూపాలభుజంగమవిహంగమః. 14
రాజారాజభుజంగో యః పరరాజభయంకరః.
హిందురాయసురత్రాణ ఇత్యేతై రుపశోభితః 15
విద్యాభిధాననగరీ విజయోన్నతిశాలినీ,
విద్యారణ్యకృతా తస్యాం రత్నసింహాసనే స్థితః 16
యస్మిన్ షోడశదానానాం ధరా యా పరిశోభితే,
దానాంబుధారయా తస్య వర్ధతే ధర్మపాదపః. 17
అలంకృతే శకస్యాబ్దే రసభూవయనేందుభిః
తారణాబ్దే చైత్రమాసే నవమ్యాం శుక్లపక్షకే 18
పంపాయా భాస్కర క్షేత్రే విరూపాక్షస్య సన్నిధౌ
ఆపస్తంభాఖ్యసూత్రాయ భారద్వాజాన్వవాయినే. 19
యాజుషాణాం వరేణ్యాయ సకలాగమవేదినే,
అష్టాదశపురాణానా మభిజ్ఞాతార్థ వేదినే. 20
అష్టభాషాకవిత్వశ్రీ వాణీ విజితసంపదే
సోమాయ నాచనాంభోధేః సోమయామిత తేజసే. 21
గుత్తి దుర్గాభిధే రాజ్యే కోడూరాజ్యమహీతలే.
పెన్నమాగాణి విఖ్యాతే సర్వసస్యోపశోభితే, 22
కోడూరునాగమల్లాఖ్యదిన్నాభ్యా మపి పశ్చిమం
గ్రామోత్త మాద్వేళుమంకూరోః ప్రాచ్యాద్దిశి సమన్వితం 23
ఊరచింతలనామ్నశ్చ గ్రామా ద్దక్షిణసంస్థితం,
వంగలూర్కోడు తాళాభ్యా ముత్తరాళాముపాశ్రితం. 24
పినాకినీతటే పెంచుకలదిన్నాహ్వయం పురా,
బుక్కరాయపురాఖ్యాత ప్రతినామ్నా చ శోభితం. 25
నిధినిక్షేపసంయుక్తం జలపాషాణసంయుతం,
అక్షిణ్యాగామి సహితం సిద్ధసాధ్యసమన్వితం. 26
అష్టభోగ మిదం సర్వస్వామ్య మాచంద్ర తారకం
సహిరణ్యపయోధారాపూర్వకం దత్తవాన్ముదా. 27
శ్రీమన్నాచన సోమాఖ్యమహాకవివరో౽ప్యధ,
రాజాన మాశిషం చైవ చిరజీవీ భవత్వితి. 28
స్వయ మన్వకరోద్వృత్తిం దశోత్తరశతం కవిః
షట్త్రింశ దత్ర భాగాః స్యు ర్యజమానాహ్వయస్తతః 29
భారద్వాజాన్వయే జాతః తల్లపో నాప యాజుషః,
అష్టావింశతివృత్తినా మధిపో నాచనాత్మజః 30
కాశ్యపాన్వయసంభూత అన్నదాతాధ్వరీంద్రజః,
యాజుషైకాదశాంశీ చ సర్వజ్ఞః సింగయో బుధః. 31
దేవణస్య సత శ్రీమాన్ సింగపో నామ యాజుషః
కౌండిన్యాన్వయసంభూతో దశవృత్తీశ్వరః స్మృతః 32
నాగయస్య సుతః శ్రీమాన్ వత్సయో నామ యాజుషః
కాశ్యపాన్వయసంభూతో వృత్తిత్రయ మిహాశ్నుతే. 33
శ్రీవత్సాన్వయసంభూత స్తిమ్మయస్య తనూభవః
యాజుషో భాస్కరశ్చేతి వృత్తిద్వయ మిహాశ్నుతే. 34
అస్యాగ్రహారవర్యస్య చతుస్సీమావినిర్ణయం.
సర్వేషాం సుఖబోధాయ లిఖ్యతే దేశభాషయా 35
తూర్పుకు నాగమలదిన్న - అసందుకు చింతకోట. అందుకు దక్షిణము రగదిలోని నల్లగుట్ట - అందుకు దక్షిణాన కప్పలవాగు మేర - అందుకు పశ్చిమానక.... అందుకు దక్షిణాన వేంపమ్రాకు. అందుకు దక్షిణాన కోడూరి రాట్లపువాల్లి ఆరతిపెద్దరావిమాకు నాగమల్లదిన్న - ఆసందుకు ముగ్నుడ్డ పొలాన.... అమ్మిమ్రాకు మేర, అందుకు దక్షిణాన కలవిగుట్టం - అందుండి పెన్న యేటిగడ్డను ఉప్పారగోడలు-దక్షిణాన కవంగలూరును కొడతాళాను ఆసందుక పెన్న మేరర్షె-పడమటికి వెలునుకూరు - ఆసందుకు యేటకలసిన కొనవాంగు మేర - పడుమటికి గడ్డమేర - అందుకు ఉత్తరాన నాయనిచింత అందుకు ఉత్తరాన చోటమిట్టమీది జమ్మిమాకు. అందుకు ఉత్తరాన దండు తెరుపు వేంపమామ్రాకు. అంఉత్తరాన కప్పలవాంగుగడ్డను తుమ్మమ్రాకు అందుకు ఉత్తరాన కాశంవాంగు మేర చేసికొని నక్కలతిప్ప - పడమట అంచు మేర చేసికొని కొండమేర - ఉత్తరానకు ఊరచింతల అసందుకున్ను కొండమేర - మానుచింతకాననుకలశన్ను.
ఇది మఖిలరాజశేఖరమధుకర ఝేంకార గీత మాహాత్మ్యం
శ్రీమద్బుక్కరాజేంద్రనృపతేః శాసన మచలైకపారిజాతస్య
ఆత్రేయాణాం యాజషః కోటిదేవా
రాధ్యాచార్యస్యాంగ జో మాథమూర్తిః
చక్రే సమ్యక్సర్వశాస్త్ర ప్రవీణః
శ్లోకానేతాన్ మల్లనారాధ్యవర్యః. 30
త్వష్ట్రైతచ్చాసనం స్వామి శాసనేన నివిర్మితం!
శాసనాచార్యవర్యేణ నాగిదేవేన శిల్పినా. 38
దానపాలనయోర్మధ్యే దానా చ్ఛ్రేయోనుపాలనం.
దానాత్స్వర్గమాప్నోతి పాలనా దచ్యుతం పదం. 38
స్వదత్తా ద్ద్విగుణంపుణ్యం పరదత్తానుపాలనం,
పరదత్తాపహారేణ స్వదత్తం నిష్పలం భవేత్. 40
సామాన్యోయం ధర్మసేతుర్నృపాణాం
కాలే కాలే పాలనీయో భవద్బిః,
సర్వా నేతాన్ భావినః పార్టివేంద్రాన్
భూయో భూయో యాచతే రామచంద్రః 41
శ్రీవిరూపాక్ష
ఈ శాసనమునుబట్టి పెంచుకలదిన్న యను పూర్వనామము గల గ్రామము బుక్క-రాయపురమను నూతననామముతో నూటపది భాగములుగాఁ జేయఁబడి, వానిలో 36 భాగములు యజుర్వేదియ భారద్వాజగోత్రుఁడు నయిన నాచనసోమునకును, 28 భాగములు భారద్వాజ గోత్రుఁడునునాచనపుత్రుఁ డునైన తల్లప్పకును, 11 భాగములు కాశ్యపగోత్రుఁడును అన్నదాతాధ్వరిపుత్రుడు నైన సింగయ్యకును, 10 భాగములు కౌండిన్యగోత్రుఁడును రేవణునిపుత్రుడును నైన సింగప్పకును, 13 భాగములు కాశ్యపగోత్రుఁడును నాగయ్యపుత్రుఁడును నైన వత్సయ్యకును, 12 భాగములు శ్రీవత్స గోత్రుఁడును తిమ్మయ్య పుత్రుఁడు నైన భాస్కరునికిని, గ్రామ మాఱుగురు బ్రాహ్మణుల కగ్రహారముగా నియ్యఁబడినది. ఆ యాఱుగురికిని వేఱువేఱుగా రాగి రేకులమీఁద దానశాసనములు చెక్కించి యియ్యఁబడినట్లున్నవి. ఈ శాసనమునకే పుత్రికగా నున్న యింకొక తామ్ర శాసనము ముడియనూరిలోని వేంకటరామశాస్త్రిగారివద్దనుండి గైకొనఁబడి యెపి గ్రాఫికా కర్ణాటికాలో ఎమ్. బీ 158 వ సంఖ్యను బ్రకటింపఁబడినది.
ఈ రెండు శాసనములును బుక్కరాయలయాజ్ఞచే తన్నియుక్తాధికారి యగు విరూపాక్షుని సంతకముతో నేకకాలమున నేకకవి (మల్లనారాధ్యకవి) చే రచియింపఁబడి యేకశిల్పి (నాగిదేవుని) చేతినే చెక్కcబడినవే యయినను, అందందు ముఖ్యభాగములలోనే పాఠ భేదములను గలిగియుండుట వింతగా నున్నది. ఒకదానిలో నాచన సోముని కియ్యఁబడిన భాగములు (36) షట్త్రింశత్తని యుండఁగా రెండవదానిలో (28) షడ్వింశ త్తని యున్నది. ఇరువదియెనిమిది యని చెప్పినచో మొత్తము నూటపది భాగములకు సరిపోదు గాన (ముప్పదియాఱు) షట్త్రింశత్తని యుండుటయే సరియైనది. కవి కాలము ననఁగా దానకాలమును దెలిపెడి ముఖ్యభాగమే వ్యత్యాసము కలదిగా నున్నది. మొదటిదానిలో 'రసభూనయనేందుభిః" అని యున్నపాఠము రెండవదానిలో 'రసాభ్రనయనేందుభిa" అని యున్నది. దానకాలము మొదటి పాఠమునుబట్టి శాలివాహనశకము 1216 వ సంవత్సర మనఁగా క్రీస్తుశకము1294 వ సంవత్సర మగుచున్నది, రెండవ పాఠమునుబట్టి శాలివాహనశకము 1284 వ సంవత్సర మగుచున్నది. ఈ రెంటిలో నే కాలమును బుక్కరాయలరాజ్యకాలములోనిది కాదు. ఆ కాలములో బుక్క రాయలు రాజ్యముచేయకుండుటయేకాక యప్పటి కాతఁడు పుట్టియైన నుండఁడు. శాసనములోని వాక్యములనుబట్టి చూడఁగా బుక్కరాయలు తాను రాజ్యము చేయుచున్న కాలములోనే నాచనసోమునికి దానముచేసినట్టు స్పష్టముగాc దెలియవచ్చుచున్నది. శ్రీచిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రులచరిత్రమునుబట్టి వీరబుక్కరాయలు 1355 వ సంవత్సరము మొదలుకొని 1377 వఱకును భూపరిపాలనము చేసెను. కాcబట్టి శాసనకాలము 1355 నకును 1377 నకును మధ్య దేదో యొక సంవత్సరమయియుండవలెను. అగ్రహారదానసంవత్సరము తారణ యని శాసనము చెప్పుచున్నది. రాజ్యారంభ సంవత్సరము మన్మథ (1555) యు, అంత్యసంవత్సరము నల (1376) యు అగుచున్నవి. ఈ మధ్య ననఁగా బుక్కరాయల రాజ్యకాలములో తారణసంవత్సరము లేనేలేదు. ఉన్న సంవత్సరములో వర్ణోచ్చారణమునుబట్టి తారణకు చేరువ సంబంధముగలది సాధారణ. ఇది బుక్కరాయల రాజ్య కాలములో నుండుటచేత శాసనసంపాదకులైన రైసుదొరగారు తమ పండితులతో నాలోచించి సాధారణసంవత్సరమునకు సరిపోవునట్లుగా 'రనభూసయనేందుభిః" అన్నదానిని 'కరాజనయనేందుభి' అని సవరించి శాలివాహనశకము 1292 అనఁగా క్రీస్తుశకము 1330 వ సంవత్సరమగునట్లు చేసిరి. అప్పడు శాసనశ్లోక మీ విధముగా మాఱుచున్నది.
"అలంకృతే శకస్యాబ్దే కరాజనయనేందుభిః
సాధారణే చైత్రమానే నవమ్యాం శుక్లపక్షకే."
కర-2, అజి - 9, నయన -2, ఇందు -1-2921 కుడినుండి యెడమకు 1292 శకవర్షమగుచున్నది. శాసనసంవత్సర మిదియే కావచ్చును గాని యీ యూహాయే సరియైన దని నిశ్చయముగాఁ జెప్పవలనుపడదు. ఈ మార్పును సూచించిన శాసనసంపాదకులగు రైసుదొరగారు తమ యింగ్లీషు భాషాంతరములో పుట యడుగున నీక్రింది నివేదనము చేసి యున్నారు.
Note - “Thıs is given as the Saka year rasa bhu nayana indu (= 1216), the year Tarana. Buat This does not fall within Bukka’s reign, during which there was no Tarana. Hence Sadharana, Saka 1292 expired has been conjecturally taken." షిమోగా మండల (TL No. 154, Shimoga Dt. Ep. Carn ) టీ యల్ 154 వ సంఖ్యశాసనములో బుక్కదేవరాయలు శకవత్సరము 1268 వ్యయ సంవత్సర మార్గశీర్ష శుద్ధ ద్వితీయనాఁడు సింహాసనమెక్కినట్టు చెప్పఁ బడియుండుటచేత క్రీస్తుశకము 1346 వ సంవత్సరాంతమునుండియే యాతని పరిపాలన మారంభమయ్యెనని కొందఱు చెప్పుచున్నారు. అట్లయినను తారణసంవత్సరము కాని శకవర్షము 1216 గాని యీతని రాజ్యకాలములో రావు. ఇఁక "రసాభ్రనయ నేందుభిః" అన్న రెండవ పాఠమును జూడుఁడు. ఇందుఁ జెప్పఁబడిన తారణసంవత్సరమును హరిహర బుక్కరాయలకాలములోనికిఁ దెప్పించుటకు శకవర్షమును 1268 నకు మార్పవలెను. అట్ల మార్చుటచే "రస్నాభ్ర' యని యున్నదానిని "రసర్తు"నుగా సవరించిరి. అట్లుచేసినను బుక్కరాయలకాలములోనికి రాక తారణసంవత్సరము హరిహరరాయలరాజ్యకాలములోనికి వచ్చినది. అందుచేత శాసన కాలము 1344 అనుటకంటె 1370 ఆనుటయే సత్యమునకు సమీపమయి యుండును. శకవర్షము 1298 (క్రీస్తు, శ. 1376) నలసంవత్సర ఫాల్గణ బహుళపాడ్యమి భానువారమునాడు బుక్కరాయలు మృతినొందెను. బుక్కరాయనికాలములో నుండి యాతనిచే నగ్రహారమును బడసి నాచన సోమనాధుఁ డెఱ్ఱాప్రెగడకంటె బూర్వుఁ డని చేసెడి వాదము విశ్వాసార్హమందినది కాదు.
[శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సోముని ఉత్తర'హరివంశపీఠికలో శాసనమునందలి 'రసాభ్రనయనేందుభిః' అనుదానిలోని "భ్ర" ను "రు" గా సవరించి, శాసనకాలము శా. శ.1266 గా నిర్ణయించిరి. నాగరలిపిలో 'భ్ర, ర్తు’ లకు ఎక్కువ పోలికయుండుటచే శాసనమును వ్రాసినవారుగాని పఠితలుగాని పొరపాటుపడియుందురని శ్రీ శాస్త్రులుగారి యాశయము. కాఁగా నీతc డెఱ్ఱాప్రెగడకు సమకాలికుఁడో, కొంచెము తర్వాతివాఁడో అయియుండును. ఆంధ్రకవితరంగిణియందు నీ యాశయమే తెలుపcబడినది.] అందందు నెఱ్ఱాప్రెగడ హరివంశములోవి పద్యము నొకదానిని సోముని హరివంశములోని పద్యము నొకదానిని తీసి పోల్చుటవలన నుభయ కవుల తారతమ్యమును తేటపడ నేరదు. కవిత్వతత్త్వమును మొత్తముమీఁద విచారింపవలెను. అప్పడు సహిత మభిప్రాయభేదముండక మానదు. ఒకరికి రుచించినది యింకొకరికి రుచింపదు. లోకోభిన్న రుచి యన్నది కొత్తది కాదు గదా. ఇతడు హరివంశముఁగాక పసంతవిలాసమను ప్రబంధమును నొకదానిని కూడ రచియించి యున్నాఁడఁట. [2] దానిలోని పద్యముల మూటి నీ క్రింద నుదాహరించుచున్నాను.
క. అత్తఱి విటనాగరికులు
చిత్తమున వసంతికేళి చిగురొత్తంగా
మొత్తములు గట్టి తెచ్చిరి
ముత్తెపుఝల్లరులతోడి బుఱ్ఱటకొమ్ముల్.
క. అంజెదవుగాక ననుఁ జెం
తల జేరఁగ నీక యెంతతగ్గిన మిరియా
లుం జొన్నలసరిగావే
లంజెతనమునందుఁ గొమిరెలం గెలువవొకో.
శా. ప్రాలేయప్రతివీరసేనఁ బఱపెన్ బై పై వసంతం బిలన్
గాలోన్మీలిత కోరకోదరపరాగ ప్రౌఢకోపాగ్నియై
హాలాపానవిహార సౌరమహిళాహంకార దోస్సారమై
హేలాపల్లవహేతిఖండితమహాహేమంతసామంతమై.
ఇట్లొక పద్యమును రెండు పద్యములను జూపుటవలన నీతనికవిత్వశైలి తెలియఁజాలదు గనుక సోముని హరివంశమునందలి యుషాకన్యాపరిణయ కథలోని కొంత భాగము నిందుఁ బ్రకటించుచున్నాను. ఇతనికిఁ దిక్కన సోమయాజియందు మిక్కిలి గౌరవ ముండుట యితఁడు హరివంశము నందుఁ జెప్పిన 'ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణితం బయిన శ్రీమహాభారత కథానంతరంబున శ్రీమత్సకలభాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీనగుణసనాథ సోమనాధ ప్రణీతం బయిన'యను గద్యము వలన స్పష్టముగా దెలియవచ్చుచున్నది. ఎఱ్ఱాప్రెగడకు డెబ్బది యెనుబది సంవత్సరములకుఁ దరువాత నున్న బ్రౌఢకవి మల్లన మొదలయినవా రీతనిని పూర్వకవినిగా స్తుతించినారు.
ఉ. నన్నయభట్టుఁ దిక్కకవి నాచనసోమని భీమనార్యుఁ బే
రెన్నికఁ జిమ్మపూడియమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్
సన్నుతి చేసి వాక్యసరసత్వము వీనుల కింపుమీఱ న
త్యున్నతిగా నొనర్తు నెఱయోథులు మేలనఁ గావ్య మిమ్ములన్.
అని పోతనామాత్యుని పుత్రుఁడయిన ప్రౌఢకవి మల్లన [3] తన రుక్మాంగద చరిత్రమునందు సోముని స్తుతించి యున్నాఁడు.
సీ. ................నన్నపార్యువర్ణనలఁ బొగడి.
గీ. వెలయఁ దిక్కనసోమయాజుల భజించి
యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చ నునిచి
సుకవి సోముని నాచనసోము నెరఁగి
కవి మనోనాధు శ్రీనాధు ఘనత మెచ్చి.
మ. ఒకనాఁ డిందుధరుండుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి
న్ని కటానేక విహారదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పైఁ జల్ల ద
ర్పకబాణంబుల కెల్ల నెల్ల యగు సౌభాగ్యంబుతో నాడఁగన్
ప. అట్టియెడ.
సీ. కిసలయంబులతోడఁ గెంగేలు తడవెట్టి
విరులపై నఖకాంతి విజ్జి రాల్చి
లేఁదీగలకు దనూలీలఁ గానుక యిచ్చి
గుత్తులఁ బాలిండ్లు గొలిచి చూచి
చలిగాలి నిశ్వాససౌరభంబుల నాcగి
యళిపంక్తి కురులతో నలుక దీర్చి
పుప్పొళ్ళ నెలగంధములు వియ్యమందించి
పూcదేనెచెమటల బుజ్జగించి
తొడలు ననcటికంబంబులు మెడలుఁ బోక
బోదెలు నెలుంగులును బరపుష్టతతులు
మాటలును గీరభాషలు మక్కళించి
చిగురుఁబోఁడులు వస కేళి చేయఁ జేయ.
వ. వారిలో నొకర్తు.
మ. సహకారాధిపు గౌఁగిలించుకొని వాసంతీలతాకాంత సా
రహరిద్రారసగౌరకేసరములన్ రంజిల్లు మాధ్వీకవా
ర్ల హరి స్వేదముఁ జూపఁ బట్టపగ లేలా యింతటన్ సిగ్గు లే
దహహా! యంచు దొలంగి నవ్వెఁ జెలిమాటై ముద్దరా లయ్యెడన్
మ. ఒక రామాతిలకంబు రత్నరుచితో నొప్పారు మందారకో
రకముం గర్ణవతంసత న్నిలుపుచున్ రాఁగా లతాసక్తచూ
చుకచేలాంచలమై మలగి విడు మంచున్ గేలు సాcచెన్ - ససా
యకమౌర్విం దెగఁగొన్న మన్మథుని ప్రత్యాలీఢపాదంబులన్.
చ. ఒక చపలాక్షి లేఁజిగురుటూయెలఁ గోయిలరాచవారి ని
క్కకు నెలయింపవచ్చు కలకంఠికటాక్షము ఱెక్కదారు స్రు
కక్క పలుమాఱుఁ జూపఁ జెలికత్తెలు ముద్దులబావ పొమ్మనన్
మొకము సగంబు వాల్చె మణిముద్రికలం జిఱునవ్వు గప్పుచున్
చ. లలన లతావితానముల లత్తకఱేకుల చాయ చల్లచే
తుల నెలగొమ్మ లందికొనిఁ దోరపునవ్వులు పిక్కటిల్ల నె
చ్చెలులు చెలంగి మావిరులు చెందొవ లయ్యె ననం దడంబడన్
దలిరులఁ గోయు రాచిలుకదాఁటులుఁ దేఁటులు నాసచేయఁగన్.
సీ. సుడిగొన్నచిగురాకుజొ పంబు గెంపారఁ దలమీఁద మల్లికాదామ మడఁచి నిడదతామరతూఁడు నెట్టెంబు చుట్టి పైఁ బటికంపుఁ గడియంపుభాగ మదిమి తోన యాక్రేవఁ గెందొవఱేకు హత్తించిమెడచక్కిఁ గస్తూరి మెదిచి పూసి
పాయగొమ్మల నల్లపట్టు దగిల్చి య
క్కొనయాకుపై వెండికోర పెట్టి
ధవళ కేతకధూళి గాత్రమునఁ జఱిచి
మోకఁమామిడి కొకకొంత మ్రొక్కి నిలిచి
యొడలిలోఁ జక్క-సగము నా కొసఁగు మనుడు
నద్రికన్యక తల వంచె హరుఁడు నవ్వె.
చ. నడక తెఱంగు మాటజతనంబు నపాంగవిలాసమున్ ముసుం
గిడిన తెఱంగు ముద్దుమొగ మించుకపంచిన సిగ్గుఁ బార్వతిం
దడఁబఱుపంగ నొ ప్పెసఁగె దర్పకవైరికి నాసపాటుగా
నడరుచుఁ జిత్రరేఖ యను నచ్చర నెచ్చెలు లిచ్ప మెచ్చఁగన్,
* * * * * * *
క. ఆవసధశోధనమునకు
సావాసులు వచ్చి కనిరి సౌధముపై సం
భావితుడై దనుజసుతా
సేవితుఁడై యున్న మనుజసింహుఁ గుమారున్.
మ. కని యక్కోమలికిం గుమారునకు సంగం బంగజాయత్తమై
యునికిన్ బాణునితోడఁ జెప్పఁ జని వా రొండేమియున్ శంక లే
క నరుం డొక్కఁడు దేవ ! నీనగరిలోఁ గన్యాజనాంతఃపురం
బున నున్నాఁడు భవత్సుతావిభూత నిప్పొందియ్యకొన్నాcడవే.
ఉ. నావుడు రోషపహ్నివలనం బొగ రేcగినభంగి మోమునం
గావిరి పర్వ నంగమునఁ గంపము నివ్వటిలంగ బాణుఁ డ
త్యావిలచిత్తుఁడై మనుజుఁ డట్టె మదీయపురంబు చొచ్చె న
చ్చేవయ కాక నానగరు చెర్చె నిసీ మగమాట లేటికిన్ ?
క. ఏ నీనటె నాకూఁతును
మానవుఁడటె నగరు చొచ్చి మాకులమునకున్
హాని యొనరించెఁ గన్నులఁ
గానఁడు దలయెత్త రోఁత గాదే నాకున్.
క. మనుజాంగనం బట్టుట
దనుజులకుం జెల్లఁగాక దనుజాంగనలన్
మనుజులు పట్టుటకును దొర
కొని రే బెండులు మునింగి గుండులు తేలెన్.
క. అని తన కింకరసైన్యము
ననిరుద్దునిమీఁదఁ బనిచె నదియు భయోత్పా
దనమతిఁ బట్టుడు కట్టుఁడు
తునుముఁ డను నెలుంగు లడరఁ దోతెంచె వడిన్.
క. అప్పలుకుల కలుకలు మది
నుప్పర మెగయంగ నొనఁగె నుల్లాసము మై
నొప్పారఁగ బరిగోలల
నొప్పించిన భద్రగజము నూల్కొన్నగతిన్.
వ. అక్కుమారకంఠీరవుండు,
క. ఆతరుEణి వలదు వల దని
భీతిం దనుఁ బట్ట బట్ట భీకర తరని
ర్ఘాతరవసింహనాదుం
డై తత్సౌధంబు డిగ్గా నవుడుగఱచుచున్.
ఇట్ల డిగ్గి తదంతఃపురద్వారంబున నిలిచి దారుణ తరంబగు పరిఘంబుపుచ్చుకొని.
మ. తన ఫెూరధ్వనికిం గలంగఁ బడు తత్పైన్యంబు దైన్యంబునం
దునుకొందం బరిఘంబు పై విసరుచున్ దుర్వారుఁడై పైపయిన్
మునాగంబాఱు శరాసిముద్గరగదాముఖ్యాయుధ శ్రేణిచేఁ
గినియం జేసిన వేసవిన్ రవి దివిం గ్రీడించుచందంబనన్.
క. మండి పదాతులఁ గొందఱఁ
జెండాడిన నున్నవారు చెడి పాఱిరి బా
ణుం డున్నయెడకు నొడళుల
నిండను నెత్తురులు గ్రమ్మ నిట్టూర్పులతోన్.
వ. అప్పుడద్దనుజేంద్రుండు.
క. వెఱవకుఁడు వెఱవకుఁడు చిం
దఱవందఱగాకుఁ డేల ధైర్యముఁ దూలన్
మఱచితిరె కులముఁ గీర్తియుఁ
బిఱుకులగతి నింతవలదు బీరము చెడఁగన్.
ఉ. పాకెడుతోవ మీకు నలవాటుగఁ జేసిన శూరుఁ డెవ్వఁడో
మీఱి యనేకయుద్ధముల మీరు జయించుట లెల్ల నింతతోఁ
దీఱె ననుం గనుంగొనుఁడు ధీరతఁ దోడ్పడ రండు నాకునుం
బాఱుడు పాఱుఁ డందుఁ బరిపంధుల నాఱ్పుఁడు చాలు మీపనుల్.
వ. అని వారి నడికించియు నదలించియుఁ బొదుపుచేసి పోరికిఁ బురి కొల్పి మఱి మహావీరులం బదివేవురఁ బదివేవురఁగా బలుతెఱంగుల మూఁకలుచేసి ప్రమధగణంబులం గలపి పంచిన.
శా. నేలం గొందఱు మింటఁ గొందఱు గజానీకంబుఁ గీలాలము
గ్జాలంబుం బురుడింప నంచితమదోత్సాహంబు దేహంబులం
జాలం గ్రాల నిశాతహేతిలతికాసౌదామినీదామభీ
మాలంకారము బీరముం దెలుప నుద్యద్విక్రమక్రీడతోన్.
వ. వచ్చి యదల్చి నిలునిలు మని తాకిన.
క. ఒక్కనికిఁ బెక్కుమొనలకుఁ
దక్కక పో రగుట యరిది దానవజల మన్
క్రిక్కిఱిసిన తిమిరమునకు
స్రుక్కక యాదవకుమారసూర్యుఁడు నిలిచెన్.
వ. ఇట్లు తన చేతిపరిఘంబు కంధరంబునం జేర్చి
గీ. పరిఘతోమరాదులఁ దన్నుఁ బరులు వైవ
వారివారికై దువులనె వారి వైచె
మఱియుఁ దనతొంటిపరిఘం బమర్చి చేత
నాసురారాతిసేనపై నడరె నపుడు.
క. ఇరువదినాలుగువేవుర
వరభటులం గింకరుల నవారణలీలన్
బరిమార్చి పేర్చి విక్రమ
ధురంధరుం డయిన విజయదోహలి మఱియున్.
క. పలుకఁయు గరవాలముఁ గొని
పొలికలనం గెలవఁ జదలఁ బొదల మెఱుంగుల్
వల నొప్పారఁ బ్రచారం
బులు ముప్పది రెండు నిండుమొనలకుఁ జూపెన్.
పంచమాశ్వాసము.
సోముని హరివంశములోని మఱికొన్ని పద్యములు.
ఉ. రెండుబలంబులందు నరరే యరరే యవురే యనంగ నొం
డొండఁ జెలంగు సన్నుతుల నుబ్బచు నీయదువీరుఁ జంపఁ బౌం
డ్రుం డనువారు సాత్యకి కఠోరభుజాప్రతిముండు పౌండ్రభూ
మండలనాధుఁ జంపు ననుమానము లే దనువారుఁ బోరిలోన్
శా. ఓరీ దానవధూర్త ! నీదు వచనోద్యోగంబు లె ట్లేగెరా
రారా యింకిట నేమి చేసెదవురా క్రౌర్యంబు శౌర్యంబు స
ద్వీరత్వంబును గల్గెనేని దనుజా! తెల్లంబుగాఁ జూపుమం
చా రాజీవవిలోచనుండు వచనవ్యాపారపారీణతన్.
చ. ఇతని కితండె సాటి యగు నీతని కీతఁడె సాటి వచ్చు ను
ద్ధతిఁ జనువెంట వింట నడిదంబున నింతటివారు లే రుమా
పతి కొకరుండు శిష్యుఁ డురుబాహుఁడు ద్రోణున కొక్కరుండు ధీ
రతముఁడు శిష్యుఁడి ట్లిరువురన్ రణధీరతఁ జెప్ప నేటికిన్.
చ. మఱకువ కత్తరించి మదమానములం జుఱవుచ్చి మెచ్చుఁ జా
గఱకొని క్రోధకామముల గండడఁగించి పరోపకారముం
జఱిపడఁ ద్రోచి వాచవులచట్టలు వాపి తొలంగి చిత్తముల్
జఱిఁ బడియున్న నీకు నొకచక్కటి నెక్కటి వేఁడఁ గల్గెనే
చ. ఎఱుఁగరుగాక లోకమున కెవ్వరికైనమ మేలు సేయఁగా
నొఱపగు నాశ్రమంబున సమున్నతమైన గృహస్థధర్మముం
బఱగడ వై చి గోఁచిగొని పాఱిన పొల్లకు ముక్తి కల్గునే
పఱిగల నేఱినం గొలుచు పాఁతటికిం గలదే తలంపఁగన్
చ. తిరిసిన కూడు దెచ్చి నలుదిక్కుల బోడలు తిండి పెట్టఁగాఁ
బెరిఁగిన పొట్టతోడ నౌక పెంటపయిం దొరవోలె నెవ్వరిన్
సరకుగొనండు పట్టుకొని చాఁగఱగొన్న బలే! యెుఱుంగుఁ డ
క్కరిబలు మోపు మోచు నయగారితనం బఱ నుట్టి గట్టినన్.
చ. పెఱిగితిగాక నీవు నొకప్రెగ్గడవే సభ లుండుభంగి ము
న్నెఱుఁగనివాఁడవై భ్రమసి యెవ్వరిముందఱ నేమి మాటలో
యఱచిరి వారిజంకెలకు నంతట ద్రోవడి వచ్చి తిచ్చటన్
గఱువఁగ వచ్చునే బలిమి గాడిదకుం బులితోలు గప్పినన్.
మ. అరిఁ జూచున్ హరిఁజూచు సూచకములై యందంద మందారకే
సరమాలా మకరందబిందుసలిలస్యందంబు లందంబులై
దొరఁగం బయ్యెదకొం గొకింత దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృతసారముం గురియుచుం దన్వంగి కేలీగతిన్
చ. చొరని బిలంబులు న్వెడలఁ జూడని క్రంతలు గాలు రాపడం
దిరుగని తోవలు న్విడియ దీర్పని గొందులు నాలుబిడ్డలే
కరయని రేలు చీమ చిటుకన్నను విప్పనిమూఁటలం బయిం
జిరుగని కోకలుం గలవె చేరిన యీ సురకోటి కచ్యుతా !
చ. అరదముపై నుదగ్రుఁ డగు నంగిరునిం గని నెమ్మొగంబునం
దరహసితంబు చెన్నొసఁగ దానవసూదనుఁ డల్ల నిట్లనున్
మరలు మునీంద్ర ! నీకు వసమా యసమాయుధ కేళి కేలికిం
దరమె మదీయసాయకవితానము లిప్పడు గోలుపుచ్చవే !
చ. తరుణుల వీరముద్దియలతాఁకునఁ జిందఱవందఱైన క్రొ
న్నురువులలోన శైవలము నూలుకొనంగ నితంబపంక్తిపైఁ
బొరలు తరంగరాజి విరిపువ్వులు వీడిన కుంతలంబులన్
బరఁగఁ బదంబులం దెఱఁగి పైcబడ నేడ్చు విటాలికైవడిన్
శా. ఈ రూపంబున సంసృతిం దొఱగి మీ రెంతెంత యేచింతలన్
జేరం గోరక యూరకున్న నిటు విచ్చేయంగఁజేయం గడున్
భారంబే విను నంతయుం గలిగెనో బాలార్కబింబింబులో
నారంగూరిన యంధకారమన నాహా ! సాహసం బెట్టిదో !
శా. ఓరీ ! బ్రాహ్మణధూర్త! నాయెదుట నోహో ! సాహసం బెట్టిదో
వైరిం గోరి నుతించు మాట లెటుగా వచ్చెం గృతఘ్నా ! యిది
న్నోరే యెవ్వరి కెవ్వ రయ్యెదరు నిన్నుం బెంచి మన్నించినన్
గారామై యిటు చేసితే తొలఁగు మింకం జాలు నీకార్యముల్.
- ↑ [ఎఱ్ఱాప్రెగడ కవిత్వముకంటే సోముని కవిత్వమే ప్రశస్తతరమని శ్రీబహుజనపల్లి సీతారామాచార్యులు గారు, నడకుదుటి వీరరాజుగారు మున్నగువారి యభిప్రాయము. ఎఱ్ఱనకవిత ప్రశస్తతరమని శ్రీరాళ్లపల్లి ఆనంత కృష్ణశర్మగారు మున్నగు వారి యాశయము.]
- ↑ ['వసంత విలాసము' మాచయబ్రహ్మయ కంకితము చేయcబడినదని శ్రీమానపల్లి రామకృష్ణకవిగారు తెల్పినారు. యీ బ్రహ్మని శాసనమొకటి పల్నాడు తాలూకా లోని కారెమపూఁడిలో నున్నదని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తరహరివoశ పీఠికలో వ్రాసియున్నారు. ఈ మాచయబ్రహ్మనివిూcద కొన్ని చాటువులు కలవు. నాచనసోముని హరవిలాసములోనివని కస్తూరి రంగకవి రంగరాట్ఛందములో గొన్ని పద్యముల నుదాహరించినాఁడు. ఈ గ్రంథము హరవిలాసము కంటె భిన్నవెూ అభిన్నమో]
- ↑ ఇతఁడు పోతనామాత్యుని పుత్రుఁడు కాఁడు. ఇతఁడు శ్రీవత్సగోత్రుఁడు.పోతన కౌండిన్యగోత్రుఁడు. ఈ మల్లన తండ్రి పోతయమంత్రి.