Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/శ్రీనాథుడు

వికీసోర్స్ నుండి

శ్రీనాథుఁడు


శ్రీనాథుఁ డను కవి శైవు డైన పొఁకనాటి నియోగి బ్రాహ్మణుఁడు; భారద్వాజగోత్రుఁడు; ఆప స్తంభసూత్రుఁడు. ఇతని తండ్రి మారయ; తల్లి భీమాంబ. తాత కమలనాభుఁడు. కమలనాథకవి పద్యపురాణసంగ్రహమును జేసిన ట్లీ కవి భీమఖండములోని యీ క్రింది పద్యముచేతఁ జెప్పుచున్నాఁడు.

           మ. "కనకక్ష్మాధరధీరు వారిధితటీక్రాల్పట్టణాధీశ్వరున్
                ఘనునింబద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
                వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
                యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభా మాత్యచూడామణిన్"

శ్రీనాధుఁడు పాకనాటివాఁ డగుటచేతను, తాత సముద్రతీరపట్టణమున కధికారి యయి యుండుటచేతను, నెల్లూరిసీమలోని యేదో సముద్రతీరగ్రామ నివాసి యయి యుండును. క్రాల్పట్టణ మేదో క్రొత్తపట్టణము. ఒకవేళ నిజముగానే కొత్తపట్టణ మయి యుండవచ్చును. క్రాల్పట్టణము ప్రకాశించు పట్టణము. క్రొత్తది ప్రకాశించును గనుక క్రొత్తపట్టణ మన వచ్చును. "వినమత్కాకతిసార్వభౌము" నని చెప్పట చేతఁ గమలనాభా మాత్యుఁడు 1320 వ సంవత్సరప్రాంతమున కాకతి ప్రతాపరుద్రసార్వభౌమునికాలములొ క్రొత్తట్టణమునకు కరణముగా నుండి యుండును.

[శ్రీనాథుడు కర్ణాటకుఁడనియు, అతని తాత నివాసస్థానము పశ్చిమ సముద్ర తిరమునఁ గల పట్టణములలో నొకటియై యుండుననియుఁ గొందఱి యభిప్రాయము "శ్రీనాధుని కూరిమిసేయు మఱఁది" నని దగ్గుబల్లి - దుగ్గన చెప్పటచే శ్రీనాధుడు కర్ణాటుఁ డనుట పొసగదు. కాల్పట్టమే కాలపట్టణ మనియు, అది నల్లని పట్టణము-అనఁగా కృష్ణపట్టణమనియు, ఆది నెల్లూరు చేరువ నున్నదనియు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారి యాశయము.క్రాల్పట్టణము - క్రాల్పట్టణమై - అదియే క్రొత్తపట్టణ మనుట సరికాదనియు, కొత్తపట్టణ మేర్పడి యింకను రెండువందల యేండ్లయినను కాలేదనియు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తెల్పియున్నారు. ఆయన మతమున మచిలీపట్టణమునకుఁ దూర్పున సముద్రతీరమునఁ గల కాశీపట్టణమే కాల్పట్టణము. ఆ గ్రామము ప్రాచీన ప్రాభవమును సూచించుచున్నదఁట ! శ్రీ కొమఱ్ఱాజు - వేంకటలక్ష్మణరావుగారు ఒక శాసనమునందు "కలుపట్టణము" అను పేరు చూచి శ్రీనాధుని కాల్పట్టణ మదియే యని నిర్ణయించిరి. ఆకలుపట్టణము నేఁడు కలపటమును పేర నున్నది. అదియు కాళీపట్టణపు దరిదాఁపుననే గలదcట! శ్రీనాథుఁడు పేర్కొనిన గ్రామమిదియైనను గావచ్చును. ఈ యంశములని శ్రీ ప్రభాకరశాస్త్రిగారి "శృంగార శ్రీనాధము" నఁ దెల్పఁబడినవి. శ్రీనాథుని నివాసము "నెల్లూ" రని నేలటూరి వేంకట రమణయ్యగారును, రేపల్లె తాలూకాలోని 'నల్లూ" రని శ్రీ చాగంటి. శేషయ్యగారును అభిప్రాయ పడుచున్నారు]

కమలనాభునిఁ గాక యీ కవి భీమఖండమునందు నన్నయభట్టారకుని, తిక్కనసోమయాజిని మాత్రమే యీ క్రింది పద్యములతో స్తుతించి యున్నాడు.

           క. నెట్టుకొని కొలుతు నన్నయ
              భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
              పట్టాభిషిక్తు భారత
              ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢప్రతిభున్.

          మ. పంచమవేదమై వరఁగు భారతసంహిత యాంధ్రభాషఁ గా
              వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
              క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
              ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

కవిత్రయములో నెఱ్ఱాప్రెగడ యప్పటి కాధునికుఁ డగుటచేత నాతని నీగ్రంథమునందుఁ బొగడకపోయినను తాను రచియించిన యితర గ్రంథములయం దీకవి యాతనిని పేర్కొన్నాడు. శ్రీనాధుడు కవిత్రయమునకుఁ దరువాత మిక్కిలిప్రసిద్ధుఁడైన కవి. ఇతనికి ప్రౌఢ దేవరాయలు కవిసార్వభౌమ బిరుద మిచ్చినట్లు శీనాధవిరచితమైన యీ క్రింది చాటుపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

            సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                           దక్షిణాధీశు ముత్యాలశాల
               పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య
                           నైషధగ్రంథసందర్భమునకుఁ
               బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                           గౌడడిండిమభట్టుకంచుఢక్క
               చంద్రశేఖరుక్రియాశక్తిరాయలయొద్దఁ
                           బాదుకొల్పితి సార్వభౌమ బిరుద

               మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
               రావుసింగమహీపాలు ధీవిశాలు
               నిండుకొలువున నెలకొనియుండి నీవు
               సరససద్గుణనికురుంబ శారదాంబ.

శ్రీనాథకవి యా కాలమునం దిప్పటి వేంకటగిరిసంస్థానాదిపతులకుఁ బూర్వఁడయి గోలకొండసీమలోని మెతుకు సంస్థానమున కధీశ్వరుఁడయి యుండిన సింగమనాయని సందర్శింపఁబోయినప్ప డా రాజు తన్నేమి తప్పు పట్టునో యన్న భీతిచేతఁ దనకుఁ బరాభవము కలుగకుండఁ జేయు మని సరస్వతిని బ్రార్థించెను. పయి పద్యమునందుఁ బేర్కొనఁబడిన సింగభూపాలుఁడు మహావిద్వాంసుడు; అందుచేత నతఁడు సర్వజ్ఞ సింగమనీఁడు (నాయఁడు) అని వ్యవహరింపఁబడుచు వచ్చెను; ఇతఁడు వేంకటగిరిసంస్థానమునకు మూలపురుషుఁడయిన భేతాళనాయఁడను నామాంతరము గల చేవిరెడ్డికిఁ బదవ తరమువాఁడు. ఈ ప్రభువు సంస్కృతమున చమత్కారచంద్రికయను నలంకారశాస్త్రమును జేసెనందురు. దీనికి సింగభూపాళీయ మని నామాంత రము కలదఁట [1] ఈ కవి సర్వజ్ఞసింగమనాయని జూఁడబోవుటచేత నితఁడు పదునేనవ శతాబ్దారంభమున నున్నట్లు తేటఁబడుచున్నది. శీనాథుఁడును, బమ్మెర పోతరాజును సర్వజ్ఞసింగమనాయని యాస్థానకవీశ్వరు అయినట్టు వేంకటగిరి సంస్థావంశ చరిత్రమునందు వ్రాయబడి యున్నది. కాని యీ కవు లిద్దఱును సింగభూపాలుని కాలమువారే యైనను వీరిలో నెవ్వరు నా యాస్థానకవీశ్వరులు కారు. వీరొక సారియో రెండు సారులో తదాస్థానము: నకుఁ బోయి వారిపైఁ బద్యములను జెప్పి తమ కవిత్వ ప్రౌఢిమను జూపి రాజువలన బహుమానములను బొందిరి. శీనాధుఁడు రెడ్ల యాస్థానకవీశ్వరుఁడు. ఈత డించుమించుగాఁ దానుచేసిన గ్రంథముల నన్నిఁటిని రెడ్లకో వారి మంత్రులకో కృతి యిచ్చియున్నాఁడు. ఇతడు రాజమహేంద్రపురమునఁ జిరకాల ముండినను కొండవీటిసీమయందుఁ బుట్టినవాఁ డని తోఁచు చున్నది ఈతనికి రెడ్లకవీశ్వరుఁడని ప్రసిద్ధి. ఈతఁడు కొండవీటి రెడ్ల కడను, రాజమహేందవరపురెడ్లకడను గూడ కవీశ్వరుఁ డయి యుండి యున్నందున నీతని చరితము వివరముగాఁ దెలియుటకై రెడ్లచరిత్రము. నిచ్చట సంక్షేపించి చెప్పుట యనావశ్యకము కాఁజాలదు.

అనుమకొండయందు సామాన్యకర్షకుఁడైన దొంతి యల్లాడ రెడ్డి యను పంటకాపు ధర్మచింత గలివాఁ డొకఁ డుండె ననియు, ఆతని యింటి కొక నాఁటిరాత్రి కోమటి యొకఁడు వేమన యనువాఁడు రాఁగా నాతని నాదరించి కోమటియింట భోజనము పెట్టించి తనయింటఁ బరుండఁ దావిచ్చి, ఆతఁడు శయనించినప్ప డతని మూటలో స్పర్శవేది యుండుట గ్రహించి దాని నపహరించి, దానిమూలమున మహా ధనికుఁ డయ్యెననియు, చెప్పెడి కథ యొకటి గలదు. ఈ కథ యే యింకొక విధముగాఁ గూడఁ జెప్పఁబడు చున్నది. వేమన యను వైశ్యుఁడొకఁడు శ్రీశైలయాత్రకుఁ బోయె ననియు, అతఁ డచ్చటి మల్లికార్జునాలయమున కుత్తరమున నున్న యరణ్యములో నితర లోహములను బంగారముగా మార్పఁగల యోషధివిశేషము లున్నట్టు కనిపెట్టి యా మందుచెట్ల యాకులపసరును రెండు కుండలనిండ నింపి వానిని గొని స్వగ్రామమునకుఁ బోవుచు మార్గమధ్యమున నొకనాటి సాయంకాల మనుమకొండఁ జేరి యా రాత్రి వసించుటకు దొంతి యల్లాడ రెడ్డియింటికిఁ బోయెననియు, ధర్మాత్ముఁ డై న యారెడ్డి యాతనివస్తుపులను తన సేద్యపు పనిము ట్టున్నపాకలోఁ బెట్టనియమించి భోజనార్ధమయి యా కోమటిని కోమటియింటికిఁ బంపెననియు, అతఁడు భోజనముచేసి మరల వచ్చులోపల రెడ్డి తన పనిముట్లను సరిచూచుకొనుటకయి యా పాకలోనికిఁ బోయి యందతని నాగిలియొక్క కఱుకోల యొకటి బంగారమువలె తళ తళలాడుచుండుట చూచి యాశ్చర్యపడి చేరువకుఁ బోయి కోమటి తెచ్చు కొన్న కుండలలోని పసరొకింత దానిపైని బడుట చూచి దాని ప్రభావము వలన నా యినపకోల సువర్ణమయి యుండునని యూహించి దానినిజమును పరీక్షించుటకై సమీపమున నున్న గడ్డపాఱ నొకదానిని గొనివచ్చి దాని నా పసరుకుండలో ముంపగా నదియు బంగార మయ్యె ననియు, అది చూచి సంతోషించి యా రెడ్డి పసరుతో నిండియున్న యా రెండు కుండలను దన యింటిలోఁ బెట్టుకొని యా పాకకు నిప్పంటించెననియు, ఇంతలోఁ గోమటి భోజనము చేసి వచ్చి యాకాశము నంటుచున్న మంటలతో బగబగ మండు చున్న యా పాకను జూచి దానిలోఁ దన పసరుకుండలు రెండును మండి పోయె నని భావించి దుఃఖించి ప్రాణమున కంటెను ధన మెక్కువగా భావించెడి యా వైశ్యశిఖామణి విత్తము పోయినతరువాతఁ దన బ్రతుకెందున కని తానును మిన్నంటి మండుచుండిన యా జ్వాలలోఁబడి ప్రాణములను విడిచెననియు, తరువాత నా కోమటి వేమయ్య పిశాచమయి యల్లాడ రెడ్డి కుటుంబమును బట్టుకొని యాతనికిఁ బుట్టిన బిడ్డల నెల్లఁ జంపుచు వచ్చెననియు, దాని కా రెడ్డి దుఃఖితుఁడయి మొక్కుకొనగా నా కోమటి స్వప్నములో నాతనికిఁ గనఁబడి తన పేరు పెట్టినయెడల ముందు పుట్టఁ బోయెడు కుమారుఁడు బ్రతుకు ననియు, వంశమువారికిఁ దనపేరు పెట్టుచు వచ్చినయెడల వారు మహాధనవంతులును, ప్రభువులును నయి భువనమునఁ బ్రఖ్యాతిఁగాంతు రనియు, తన మూలమున వచ్చిన ధనములో సగము ధర్మార్ధముగానుపయోగింప వలసినదనియు చెప్పెనఁట! అల్లాడ రెడ్డి దాని కొప్పుకొని తరువాతఁ బుట్టిన తన కొమారునకు తండ్రిపేరితోఁజేర్చి కోమటి పోలయ (వేమన) యని పేరు పెట్టెను. ఆతcడు చిరకాలము జీవించి మహాధనికుఁ డయి తన పంటకులపురెడ్లలో వన్నె వాసి గాంచి తన ధనమును త్యాగభోగముల యందు సద్వినియోగము చేయుచు వచ్చెను. ఈ కోమటి ప్రోలయయే కొండవీటి పంటరెడ్ల వంశమునకు మూలపురుషుఁడయ్యెను. ఆతని పుత్రులు మహాశూరులయి పతాపరుద్రునియొద్ద దండనాథులయిరి. అల్లాడ రెడ్డియింటి పేరు దొంతివా రనియు, దేసటివా రనియు కూడ నుండి యుండును. ఈతఁడు కోమటియెుక్క కుండలదొంతిని సంగ్రహించుట దొంతివాఁ డయ్యెనని యొక కథ గలదు. ఈ యల్లాడ రెడ్డి మిక్కిలి పాటుపడువాఁడయి విశేషధనము నార్జించి ప్రసిద్దికెక్కి యుండును.

ఆతని కంత ధనము వచ్చినందుకుఁ గారణముగాఁ దరువాత నీకథ కల్పింపఁబడి యుండును. కథయెట్టిదయినను ప్రోలయ రెడ్డికిని నాతని సంతతివారికిని కోమటియనియు, వేమన యనియు, నామములు వచ్చుట కేదో కారణ ముండి యుండవలెను. అల్లాడ రెడ్డి స్పర్శవేదియను మందుపసరును గాక పోయినను కోమటిధనము నపహరించి యాతడుఁ పిశాచమయి పట్టెనన్న భీతిచేతఁ దన కుమారునికిని, సంతతివారికిని కోమిటి వేమన యను పేరులుంచి యుండవచ్చును.

1.కోమటి ప్రోలయవేమారెడ్డి

రెడ్డిరాజ్యమును స్థాపించినవాఁడు కోమటిప్రోలయ ద్వితీయ పుత్త్రుడయిన వేమారెడ్డి, కోమటిప్రోలయ కూడ దండనాథుడుగా నుండె నని చెప్పుదురు గాని యాతనికాలములో రెడ్లకు రాజ్య మేదియు లేదు. కోమటిప్రోలయకు మాచారెడ్డి, వేమారెడ్డి, దొడ్డారెడ్డి, అన్నారెడ్డి, మల్లారెడ్డి అని యేవురు పతులు. వీరిలో రెండవవాఁడయిన ప్రోలయవేమారెడ్డి మహాపరాక్రమ శాలియయి ప్రతాపరుద్రుని ద.డనాధుఁడుగా నుండి యాతని యవసాన కాలమున 1420-వ సంవత్సర ప్రాంతమున యవనులతోడఁ బోరాడి తురుష్కులు చేకొన్న రాజ్యమును గొంత వారినుండి మరల బలాత్కారముగాఁ గైకొని రెడ్డిరాజ్యమును స్థాపించెను. ఈ విషయ మొక శాసనములో నీ కింది శ్లోకములయందుఁ జెప్పఁబడినది.

           శ్లో. ఉద్దృత్య భూమిం యవనాబ్దిమగ్నాం
               సంస్థాపయంతం ప్రకృతోత్తమార్యాః
               సాక్షాత్కరో మానుష దేవభాజా
               మహా వరాహం పరికీర్తయంతి.
               శ్రీశైలగంగాతటసీమ్నిరమ్యాం
               సోపానవీధీం వదధేనవేమః
               యా దివ్యతి స్వర్గ మనోద్యతానాం
               నిశ్రేణి రివ ప్రధితా నరాణాం.

పయి శ్లోకములలో నీ వేమభూపాలుఁడు శ్రీశైలములోని పాతాళగంగకు సోపానములు కట్టించినట్లు కూడ చెప్పబడియున్నది. ఇతcడు బంధుజనానురాగము గలవాఁడయి తన బంధువులను, తమ్ములను, కొడుకులను తన క్రింది యధికారులనుగాను, దండనాధులను గౌను నియమించి వారికిఁ దాను జయించిన దేశములలోఁ గొన్ని ప్రదేశము లిచ్చి యద్దంకి రాజధానిగాఁ బ్రజా పరిపాలనము చేయుచుండెను. ఈ యంశమును హరివంశములోని యీక్రింది పద్యము తెలుపుచున్నది.
    
            గీ. తనకు నద్దంకి తగు రాజధానిగాఁ బ
               రాక్రమంబున బహుభూము లాక్రమించి
               యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె
               నెదురె యెవ్వారు వేమమహీశ్వరునకు,

వేమభూపాలుఁ డనుజులకే బహుభూము లిచ్చె నన్నప్పు డగ్రజుడైన మాచన్న కిచ్చినట్లు వేఱుగఁ జెప్ప నక్కఱయే లేదు. ఆతని కొకచిన్న సంస్థాన మిచ్చి దాని కతనిని విభునిగాఁ జేనెను. 'ఆదిరాజన్యతుల్యాచారవిధి మాచవిభుఁడు పూజ్యం డను విశ్రుతియును" అను హరివంశ పద్య మీ యంశమును సూచించుచున్నది. తనకు రాజ్యమే లేనియెడల మాచన్న విభుఁడగుటయు. నాదిరాజన్యతుల్యాచారుఁడగుటయు సంభవింపవు గదా ! మాచన్న రాజయినట్టు ఫిరంగిపుర శాసనములోని యీక్రింది శ్లోకమువలనను దెలియవచ్చుచున్నది.

           శ్లో. మాచక్షోణిపతి ర్మహేంద్ర విభవో వేమక్షితీశాగ్రజో
               హేమాద్రే స్సదృశో బభూవసుగుణైస్తన్య త్రయో నందనాః

ఒక కుమారునకు దండ్రి పేరు పెట్టుట మనలో సాధారణమైన యాచారము. అందుచేత మాచనయు వేమనయు తమ పుత్రులలో నొక్కరికిఁ గోమటి యని పేరు పెట్టిరి. ఈ యిద్దఱు కోమటిరెడ్లకును భేదము తెలియుటకయి మాచన్నకొడుకు పెదకోమటి యనఁబడుచుండెను. కోమటి గాక ప్రోలయవేమారెడ్డికి ననపోతుఁ డనియు, ననవేముఁ డనియు మఱి యిద్దఱు పుత్రులు కూడఁ గలిగిరి. ఎఱ్ఱాప్రెగడ హరివంశము రచించు నాఁటి కనవేమారెడ్డి మిక్కిలి పసివాఁడు; కోమటిరెడ్డి మృతుఁ డయ్యెను. తండ్రికాలములోనే యనపోతారెడ్డి దండనాధుఁ డయినట్టు హరివంశములోని యీ క్రింది పద్యమునఁ జెప్పఁబడెను.

          శా. వేమాక్ష్మాధిపుకూర్మి పుత్త్రుడు దయావిభ్రాజి యవ్యాజతే
               జోమార్తాండుఁడు కీర్తనీయగుణసంస్తోమంబులం దేమియున్
               రామస్పూర్తికి లొచ్చుగాక సరియై రాజిల్లె రాజార్చితుం
               డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరుం డిమ్మహిన్.

హరివంశమునందే యీతని పెదతండ్రికుమారుఁ డయిన కోమటిరెడ్డి యిట్లు వర్ణింపబడెను.

                క. దానంబునఁ గర్ణునిసరి
                  మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
                  న్మానచతురుండు మాచయ
                  సూనుఁడు కోమటి సమస్తసులభుఁడు కరుణన్.

కోమటి పోలయ వేమునియొద్ద నాంధ్రకవిత్రయములోఁ గడపటివాఁడైన యెఱ్ఱాప్రెగడ యాస్థానకవీశ్వరుఁడుగా నుండి రామాయణమును, హరివంశమును నాతని కంకితముచేసెను. ప్రబంధపరమేశ్వరుఁడైన యెఱ్ఱాప్రెగడ హరివంశములోఁ గృతిపతియైన వేమారెడ్డి తల్లిదండ్రులను గూర్చి యిట్లు చెప్పెను.

              చ. కులజలరాశిచంద్రుఁడగు కోమటిపోలనయు న్నితంబినీ
                  తిలకము పుణ్యరాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
                  కలితులు ధీరు వేమవిభుఁ గానఁగఁ గాంచినపుణ్య మెద్ది యే
                  కొలఁదుల నెన్ని జన్మములఁ గూర్చిరొనాఁ బొదలున్ జనస్తుతుల్.

యీ పోలయవేమనృపాలుఁడు 1320 మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసి కాలధర్మము నొందెను. వేముని యనంతర మన సవతి పుత్రుఁడు అనపోతారెడ్డి 1350 వ సంవత్సరమునందు రెడ్డి సామ్రాజ్యభారమును వహించెను. ఈ ప్రకారముగానే మాచన బ్రభువు యొక్క మరణానంతరమున నాతని పుత్రుఁడు రెడ్డిపోతనర పాలుఁడును, తదనంతరమున పెద్దకోమటివేమారెడ్డియు తండ్రియొక్క చిన్నరాజ్యమునకు రాజు లయిరి.

అ న పో తా రెడ్డి

ఇతఁడు 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసెను. ఈతని తోడఁబుట్టిన పడతి చైన దొడ్డాంబికభర్త కాటయరెడ్డియు, ఆమె చెల్లెలు వేమాంబిక భర్త నూకయరెడ్డియు, మంత్రి దండనాయకు లయి తనకు మహా సహాయులయి యసహాయశూరులయి రాజతంత్రము నడుపుచుండఁగా పండ్రెండు సంవత్సరములు సత్పరిపాలనము చేసి సముద్రవ్యాపారమున కత్యంత ప్రోత్సాహము కలిగించి యనపోతభూపాలుఁడు స్వర్గస్తుఁడయ్యెను. కుమారగిరిరెడ్డి యీతనికుమారుఁడు; మల్లాంబ యీతని కొమారిత, యీ మల్లాంబిక యనపోతారెడ్డి మేనల్లుఁడయిన కాటయవేమారెడ్డికి భార్య యయ్యెను.

3.అనవేమారెడ్డి

అనపోతారెడ్డి యనంతరమున నాతని తమ్ముఁడుఅనవేమారెడ్డ రాజయ్యెను. అనపోతారెడ్డివలెనే యాతని పెదతండ్రికొడుకు పెదకోమటిరెడ్డి కూడ మఱికొంతకాలమునకు లోకాంతరగతు డయినందిన ననవేమారెడ్డ రాజ్యకాలములోనే యతనికొడుకు వేమన తండ్రిరాజ్యమునకు వచ్చెను. అనవేమారెడ్డికి మామిడి పెద్దనామాత్యుఁడుసు, వేమారెడ్డికి పెద్దనామాత్యుని తమ్ముఁడు నామామాత్యుఁడును మంత్రులయినట్టు శృంగారనైషధమునందీ క్రింది పద్యములలోఁ జెప్పఁబడినది.

          మ. అనతారాతివనుంధరారమణసప్తాంగోపహార క్రియా
              ఘనసంరంభవిజృంభమాణపటుదోః ఖర్జూద్వితీయార్జునుం
              డనవేమాధిప రాజ్యభారభరణవ్యాపారదక్షుండు పె
              ద్దనమంత్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చెప్పఁగన్

          శా. స్వామిద్రోహరగండలాంఛనునకున్ సంగ్రామ గాండీవికిన్
              వేమక్ష్మాపతికార్యభారకలనావిఖ్యాతధీశక్తికిన్
              నామామాత్యున కన్యరాజనిటలాంతర్న్యస్తభాగ్యాక్షర
              స్తోమాపాకరణ ప్రవీణునకు మంత్రు ల్సాటియే యెవ్వరున్?

ఇందు మొదటి పద్యమునం 'దన వేమ' యని యున్నది; రెండవ పద్యము నందు వేమ యని యున్నది. "అనవేమ" యన్న దంతయు నేకనామధేయ ములోనిదే గాన శాసనములయందుఁ గాని పద్యములయందుఁ గాని యెక్కడ ననవేమునిఁ బేర్కొనవలసి వచ్చినను పూర్ణముగా ననవేమ యనిమే చెప్పుదురుగాని వేమ యని చెప్పరు. వేమయ లనేకులున్నచో భేదము తెలియుటకయి పోలయవేమ, కోమటివేమ, కాటయవేమ, అల్లయవేమ అని తండ్రి పేరితోఁ జేర్చికూడఁ జెప్పుదురు. ఈ రెండవ పద్యమునందుఁజెప్పఁ బడినవేమన కోమటివేమన యనుటకు సందేహము లేదు. ఆకాలమునందు రెడ్డిరాజులలో -వేఱు వేమనలు లేరు.

రెడ్డిరాజులలో అనవేమభూపాలుఁడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన వాఁడు. ఈతఁడు చేసిన విశేషదానధర్మములచేతను పండితసమ్మానము చేతను నీతవి కీప్రసిద్ధి వచ్చినది. ఇతఁడు సంస్కృతాంధ్రములయందు, మంచి పాండిత్యము గల రసజ్ఞుడు. వెన్నెలకంటిసూరన చేసిన విష్ణువురాణములోని యీక్రిందిపద్య మీతని కీర్తి యెట్టిదో తెలుపుడుచేయును.

           క. తన బ్రతుకు భూమిసురులకుఁ
              దన బిరుదులు పంట వంశధరణీశులకున్
              దన నయము భూమి ప్రజలకు
              ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్
.
అనవేముఁడు తన రాజధానిని తనపూర్వులకు రాజధాని యయి యుండిన యద్దంకినుండి కొండవీటిదుర్గమునకు మార్చినట్టు పూర్వోదాహృతశాసనము లోని యీ శ్లోకములు తెలుపుచున్నవి.

          శ్లో. తతో౽న్న వేమనృపతిః పరిపాలనకర్మణి
              ఆపాలయ స్తస్య పుత్ర స్తదం తేంద్రవసుంధరా
              కొండవీడుం రాజధానిం సతిచిత్రా మకల్పయత్
             దృష్టొ త్వష్ణాపి చిత మభూ ద్యస్యా స్సవిస్మయః.

ఆనవేమమహీపాలునికి పుత్రసంతతి లేదు. ఒక్క కొమారితమాత్రముండెను. ఆమె భక్తినశ్వర చోళృపాలపుత్రుఁ డైన భీమనృపాలువకు భార్య యయ్యెను. ఆనవేమభూపాలునిగూర్చి కవులు చెప్పిన పద్యములలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరియం దుదాహరించినవాని నిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను.

          క. 'కవితాకన్యకు నలుగురు
              కవి జనకుఁడు భట్టు దాది గణుతింపంగా
              నవరసరసికుఁడె "పెనిమిటి
              యవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా!

           క. కొంచెపుజగములలోపల
              నంచితముగ నీదుకీర్తి యన వేమనృపా!
              మించెను గరి ముకురంబునఁ
              బంచాక్షరిలోన శివుఁడు బలసినభంగిన్.

           గీ. పందికొమ్మెక్కి, పెనుబాముపడగ లెక్కి
              మేటితామేటివీc పెక్కి మెట్ట లెక్కి
              విసివి వేసారి యన మవిభునిఁ జేరి
              రాణివాసంబు గతి మించె రత్నగర్బ

           క. రాకున్నఁ బిలువఁడేనియు
              రాకకు ముద మంది చేర రమ్మనఁడేనిన్
              ఆఁకొన్న నీయcడేనియు
              నాకొలు వటు కాల్పవలయు ననవేమనృపా!

          శ్లో. అనవేమమహీపాల !
              స్వస్త్యన్తు తవబాహవే
              ఆహవే రిపుదోర్దండ
              చంద్రమండలరాహవే.

ఒకానొకనియోగి బ్రాహ్మణకవి యీ శ్లోకము ననవేమ మహీపాలుని పైని జెప్పి చదువఁగా నతఁడు సంతోషించి యాతని మూఁడువేల సువర్ణములు పారితోషిక మొసఁగఁ బోయెనట! కవి వానిని స్వీకరింపక 'నేను నాలుగువే లియ్యఁగా మీరు మూఁడువేలే యిచ్చెదరా ? ' యనెనఁట! నాలుగువే లనఁగా తాను సమర్పించిన శ్లోకములో నున్న నాలుగు "వే యను నక్షరములని కవియభిప్రాయము. అప్పడు రాజు నాలుగు వేలే యిచ్చెద ననెనఁట ! దానిపైని కవి 'నే నిచ్చినవే నా కిచ్చెదరా ?" యనెనఁట : 'ఆ ట్లయిన నయిదు వేలిచ్చెద" నని రాజు పలికెనఁట : "నే నాఱు వేలవాఁడను; నన్ను తక్కువపఱిిచెదరా?" యని కవి వచించెనcట. తక్కువపఱవక 'యాఱు వేలే యిచ్చెద°నని రాజనెనట ! అందుకు కవి *నేను పుట్టువుచేతనే యాఱువేలవాఁడనే ! యిందధిక మేమున్న" దని యడిగెనఁట ! అధికము కావలసిన చో రా "జేడు వేల నిచ్చెద" ననెనcట! కవి "యది రోదనసంఖ్య;మంచిది కాదనెనట. రాజా కవి వాక్చాతుర్యమునకు మెచ్చి యెనిమిదివేలిచ్చి సంతోషపెట్టి యాతనిని బంపివేసెనఁట ! ఇది వట్టికల్పనకధయే యైనను, ఆ వేమనృపాలుఁడు కవిత్వాభిమానము గలవాఁడనియు మహాదాత యునియు బోధించుచున్నది.

అనవేముఁడు 1362 మొదలుకొని 1383 వ సంవత్సరమువఱకును ప్రజానురంజకుఁ డయి పరిపాలనము చేసి పరమపదము నొందినతరువాత నీతనియన్న యైన యనపోతారెడ్డి కుమారుఁడు కుమారగిరి రాజ్యమునకు వచ్చెను.

4. కుమారగిరిరెడ్డి

ఇతఁడు 1383-వ సంవత్సరమునకుఁ దరువాత పినతండ్రి యనంతరమున సింహాసనమునకు వచ్చెను. ఈతనికాలములోనే శ్రీనాధకవి బైలుదేఱి రాజాస్థానకవి కాకపోయినను రాజమంత్రులకును తదితరాధికారపదస్థులకును కృతులియ్య నారంభించెను. కుమారగిరి పెదతాత మనుమడైన వేమారెడ్డియెుక్క ప్రధమమంత్రి నామనామాత్యుఁడు మృతినొందినతరువాత నాతని యన్న కుమారుఁడు మామిడిసింగవ్న కోమటివేమనకు మంత్రి యయ్యెను. ఈ సింగన్న యనవేమునిమంత్రియైన పెద్దనామాత్యుని కనిష్టపుత్రుఁడు, శ్రీనాధుడు మొట్టమొదట సింగన్నయన్న యైన ప్రెగ్గడన్నకును తరువాత సింగన్న కును, అటుతరువాత కుమారగిరి కడపటిదినములలో నాతనిసుగంథభాండారాధ్యక్షుఁడై న యవచితిప్పయ్యసెట్టికిని కృతు లొసఁగెను. తిప్పయ్య సెట్టికి గృతి యిచ్చిన హరవిలాసములో నీ క్రింది పద్యమున్నది.

       చ. హరిహరరాయఫేరొజిసహళీసురధాణగజాధిపాదిభూ
           వరులు నిజప్రభావ మభివర్ణన సేయఁ గుమారగిర్యధీ
           శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కడ నిర్వహించు మా
           తిరుమలనాథసెట్టికిని ధీగుణభట్టికి నెవ్వ రీఁడగున్ ?

పైని బేర్కొనఁబడిన హరిహరరాయలు ద్వితీయహరిహరరాయలు; అతఁడు 1377 మొదలుకొని 1404 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. అందుచేత నతఁడు కుమారగిరిరాజ్యకాలమున కీవల నాఱు సంవత్సరములు నావల నా లు గు సంవత్సరములు రాజ్యముచేసెను. రెండవవారి డయిన ఫెరోజిసహా 1393 మొదలు 1422-వ సంవత్సరము వఱకును భూపాలనము చేసెను. అందుచేత నితఁడు కుమారగిరిరెడ్డి యొక్క రాజ్యాంతకాలములో మూఁడు సంవత్సరములు మాత్రమే రాజ్య భారము వహించియుండెను. అందుచేత హరవిలాసము 1393-1400 సంవత్సరముల మధ్యమున రచియింపఁబడి యుండవలెను. కొమరగిరి విద్యా వంతుఁడు; బ్రజాపరిపాలనముకంటె వసంతోత్సవాది వినోదములయం దెక్కువ యాసక్తిగలవాఁడు. ఇతడు తన రాజ్యనిర్వహణ భారము నంతను తన మేనత్తకుమారుఁడును, మఱదియు విద్వాంసుడును సమర్థుఁడును మంత్రియునైన కాటయ వేమారెడ్డియందుంచి తాను నిర్విచారుఁడయి యుండెను. ఇతఁడు తన చెల్లెలైన మల్లాంబ యందత్యంత ప్రేమకలవాఁ డగుటచేత రాజమహేంద్రవరరాజ్యము నామె కరణముగా నామెభర్తయు దన కాప్తమంత్రియుఁ బ్రాణమిత్రుఁడునై న కాటయవేమారెడ్డికి 1386 - వ సంవత్సరమునం దిచ్చివేసెను. ఇతఁడు 1400 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి పరలోకగతుఁడు కాగా సంతానహీనుఁడైన యీతని కొండవీటిరాజ్యముకూడ నీతని పెత్తాత మనుమడైన పెద్దకోమటిరెడ్డి యధీన మయ్యెను. కొందఱు కొమరగిరిరెడ్డి కొక కొమారుడుగలఁ డనియు, ఉన్నను కోమటివేముఁడు కొండవీటిరాజ్యమును బలవంతముగా నక్రమముగా నాక్రమించుకొనెననియుc జెప్పుదురు.


5. పెదకోమటి వేముఁడు


కొమరగిరిరెడ్డి మరణానంతరమున 1400 వ సంవత్సరమునందు కోమటి వేమారెడ్డి కొండవీటిరాజ్యభారమును వహించినవాఁ డయి యంతటితోఁ దృప్తి నొంది యుండక రాజమహేంద్రవరరాజ్యమునుగూడ సంపాదింపవలె నని బహుసేనలతోఁ బలుమాఱు దండు వెడలి కాటయవేమారెడ్డితో ఘోర యుద్దములు చేసి విజయము నొందఁజాలక కాటయవేమారెడ్డిచేతను, నాతని దండనాధుఁ డయిన యల్లాడ రెడ్డిచేతను పరాభూతుఁడయి, భగ్నమనోరధుఁ డయి వెనుకకు మరలవలసినవాఁడయ్యెను. ఈ యుద్ధములవలన లాభమేమియుఁ గలగకపోవుటయే కాక బంధురాజు లైన కాటయవేమాదులతో బలవద్విరోధమును కొండవీటిరాజ్యమునకు దౌర్పల్యమును మాత్రము సంప్రాప్త మయ్యెను. కోమటివేముఁడు కొండవీటిరాజ్యమునకు వచ్చిన తరువాత శ్రీనాధునిఁ తన యాస్థానమునందు విద్యాధికారినిగా నియమించెను గాని, యతఁడేమియు రాజుపేర గ్రంథములు చేసినట్టు కనcబడదు. కోమటి వేముఁడు రచించినట్లు చెప్పఁబడెడి యమరుకవాఖ్యాన మైన శృంగారదీపికను శ్రీనాథుఁడే రచియించి దానికి రాజు పేరు పెట్టెనని చెప్పుదురు. [2] ఇది గాక యభినవభట్టబాణఁ డనఁబరఁగిన వామనభట్టు వీరనారాయణ చరిత్ర మను నామాంతరము గల వేమభూపాలచరిత్రమును సంస్కృతమున వచన కావ్యముగా రచించి దానిలోఁ గోమటివేమని సర్వజ్ఞచక్రవర్తినిగాను, వేమునిపూర్వులను గొప్పచక్రవర్తులనుగాను పొగడెను. ఈ కోమటి వేముని భార్య యైన సూరమాంబ సంతానసాగరమను తటాకమును 1410 వ సంవత్సరమునందు త్రవ్వింపఁగా దరువాత నామె కుమారుఁడు రాచవేముఁడు దానికి నీరు వచ్చుటకయి జగనొబ్బగండ నామము గల కాలువ నొకదానిని 1416- వ సంవత్సరమునందు త్రవ్వించెను. పెద కోమటివేమారెడ్డి 1420 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి యిహలోకయాత్రను చాలించెను.


6. రాచ వేముఁడు

కోమటివేముని యనంతరమున నాత నిపుత్రుఁడు రాచవేముఁడు రాజ్యమునకు వచ్చి యేదో విధముగా రాజ్యపాలనము చేసి 1424 వ సంవత్సరము నందు దేహము త్యజించెను. ఇతఁడు దుష్పరిపాలనముచేత జనకంటకుఁ డయినందున నీతని భృత్యులలో నొకఁడీతనిని పొడిచి చంపె నని చెప్పుదురు. ఈతనితండ్రికాలములోనే కొండవీటిరాజ్యము దుర్బల మయినందున నీతఁడెట్లో నాలుగు సంవత్సరములు రాజ్యతంత్రము నతృప్తికరముగా నీడ్చుకొని రాఁగా తదనంతరమున రాజ్య మన్యాక్రాంతమయి తుదకు కర్ణాటులపాలయ్యెను. ఈతనితో కొండవీటిరాజ్యమంతరించెను. ఇఁక మనము రెడ్డిరాజ్యములలో రెండవది యగు రాజమహేంద్రవరరాజ్యము నకు వత్తము.

1.కాటయ వేముఁడు

కొటయవేమారెడ్డి యనపోతభూపాలుని యల్లుఁడు; కొమరగిరి రెడ్డి చెల్లెలయిన మల్లాంబికభర్త కుమారగిరిరెడ్డి తనకు మఱదిఁయు మంత్రియు నైన యీ కాటయవేమునికి 1386-వ సంవత్సరమునందు రాజమహేంద్రవరరాజ్యము నిచ్చిన ట్టీవఱకే చెప్పఁబడెను గదా ! ఇతఁ డప్పటినుండియు సమర్ధతతో ప్రజాపరిపాలము చేయుచు, కొమరగిరి రెడ్డి మరణానంతరమున 1400 -వ సంవత్సరప్రాంతమున కొండవీటి రాజ్యమునకు వచ్చిన కోమటి వేమారెడ్డి రాజమహేంద్రవర రాజ్యమపహరించుటకయి చేసిన కృషినంతను విఫలము చేసి, బహుయుద్దములందు తన దండనాధుడును ననవేమారెడ్డి మనుమరాలి భర్తయు నైన యల్లారెడ్డి సహాయుడుగా కోమటివేముని పరాజయము నొందించి యాతని సేనలను హతముచేసి రాజమహేంద్రవర రాజ్యమును నిరపాయముగా నిలుపుకొనెను. ఇతcడు రణరంగములయందు మహావీరుఁ డగుటయే కాక సమరపాండిత్యమునకుఁ దోడు భాషాపాండిత్యమునుగూడఁ గలవాఁడయి కాళిదాస ప్రణీతము లయిన శాకుంతలాది నాటకములకు సంస్కృతమున వ్యాఖ్యానములు రచించెను. ఈతనివలెనే యీతని బావ యగు కుమారగిరి రెడ్డియు సంస్కృతభాషా పాండిత్యముగల వాc డయి వసంతరాజీయ [3] మను కావ్యముసు రచించెను. ఈ వసంతరాజీయమునుండి కాటయవేముఁడు తన వ్యాఖ్యానములయందుఁ బ్రమాణ వచనముల నెత్తి చూపెను. సంస్కృతమునందుమాత్రమే కాక యాంధ్రమునందు సహితము మంచి పాండిత్యముగలవాఁ డయి కవుల నాదరించి వారిచే శ్లాఘింపఁబడుచుండెసు. ఈతనిని సంబోధించి యొక యాంధ్రకవి చెప్పిన పద్యమని నొక దాని నిందుదాహరించుచున్నాను

          క. వెలయాలు శిశువు నల్లుఁడు
             నిలయేలిక యాచకుండు నేగురు ధరలోఁ
             గలిమియు లేమియుఁ దలఁపరు
             కలియుగమునుఁ గీర్తికామ : కాటయవేమా !

కాటయవేమారెడ్డి 1416 వ సంవత్సరప్రాంతమునఁ గాలధర్మమునొందెను. ఈతని జీవితకాలములోనే యీతని పుత్రుఁడును హరిహరరాయని యల్లుఁడునైన కాటయరెడ్డి మరణము నొందెను. ఈ వివాహమునుగూర్చి యల్లాడ రెడ్డి కోరుమిల్లి శాసనములో నిట్లన్నది.

          శ్లో. పౌత్రిం కాటయవేమయక్షితిపతేః పుత్రం చ కాటప్రభోః
             దౌహిత్రం చతురర్ణవీం హరిహరక్షోణీపతే శ్శాసితుః
             తన్నామ్నా విదితాహ్వయాం హరిహరాంబాం చారు మగ్రాహయ
             త్పాణౌ వేమమహీశమల్లనృపతిస్సామ్రాజ్యలక్ష్మ్యా సమమ్.

మరణకాలమునకుఁ గాటయవేముని కనితల్లి యను కూఁతురును కుమారగిరి యను చిన్నకుమారుఁడును నుండిరి [పౌత్రీం కాటయవేమయ..... అను శ్లోకము సరిగా లేదనుచు నందలి విషయమునుగూర్చి శ్రీ ప్రభాకర శాస్త్రిగారు శృంగార శ్రీనాధమున విపులముగాఁ జర్చించిరి. శ్లోకమునుబట్టి కాటయవేమునికిఁ గాటయ యను కుమారుఁడు కలఁడనియు, అతడు హరిహరరాయల యల్లుఁడనియు, నా కాటయ కుమార్తె హరిహరాంబయనియు దెలియుచున్నది. హరిహరాంబ భర్త వీరభద్రారెడ్డి యన్నయగు వేమారెడ్డి యగుట ప్రసిద్ధము. వీరభద్రారెడ్డి కాటయవేముని కుమార్తె యగునని తల్లికి భర్త : కాఁగా, కాటయవేమారెడ్డి తన యల్లుని యన్నకుఁ దన పౌత్రి నిచ్చి వివాహ మొనర్చినట్లు తేలుచున్నది. ఇది యసంగతము. శాసనమున 'పుత్త్రీం కాటయవేమయక్షితిపతేః పౌత్రీంచ కాటప్రభోః' అని యుండ వలెను. కాటయవేముcడు తన కుమార్తెల నిద్దఱను, వేమవీరభద్రారెడ్డ కిచ్చి పెండ్లిచే సెను అనితల్లి, హరిహరాంబ లొక్క తల్లి కడుపునఁ బుట్టిన బిడ్డలు కానందున, వారి నన్నదమ్ముల కిచ్చి వివాహము చేయుట తప్పుకాదు. ఇట్టి వివాహము లనేకములు జరుగుచున్నవి. రాజమహేంద్రవరరాజ్యమా యల్లుండ్రిర్వురకు జెందఁదగుననరాదు. కాటయ వేమనకు రాజ్యము పిత్ర్యముకాదు. భార్యయగు దొడ్డాంబిక వలననే వచ్చినది కావున, దొడ్డాంబ కుమార్తె యగు అనితల్లికిని, తద్ద్వారమున నామె భర్తకును మాత్రమే సంక్రమించినది. ఈ విషయము శృంగార శ్రీనాథమునఁ గలదు (చూ. పుటలు 286-289.) "ఆంధ్రకవి తరంగిణి" కర్త పయి యాశయముతో నేకీభవించలేదు. వీరు కాటయవేముడు హరిహరరాయల యల్లుడు కాఁడనుచున్నారు - విహహమున, శ్లోకమునుబట్టి తెలియుచున్న వావులలో అసంగతములు లేవని వీరి యభిప్రాయము, (ఐదవ సంపుటము. పుటలు 84-88]

2.అల్లాడ రెడ్డి

కాటయవేమారెడ్డి మరణము నొందఁగానే యిదే సమయమని రాజమహేంద్రవరరాజ్యము నాక్రమించుకొనుటకయి కోమటివేముఁడు మరలసైన్య సన్నాహము చేసికొని దండు వెడలెను. అల్లాడ రెడ్డి తన సేనలతో నాతనిని మార్గమధ్యముననే యెదురుకొని రామేశ్వరమువద్ద ఘోర సంగ్రామము సలిపి యతని నోడించి సైన్యమును హతముచేసి కోమటివేమారెడ్డిని వెనుకకు దఱిమివేసెను. ఈ విషయపుయి కోరుమిల్లి శాసన మిట్లు చెప్పుచున్నది -

     శ్లో. జిత్వానల్పవికల్పకల్పితబలం తం చాల్పభాసుం రణే
         మిత్రీకృత్య సమాగతంగజపతిం కర్ణాటభూపం చ తమ్
         హత్వా కోమటివేమసైన్యనికరం భూయో౽పి రామేశ్వరాత్
         రాజ్యం రాజమహేంద్ర రాజ్య మకరో దల్లాడభూమీశ్వరః.

ఆల్లాడ రెడ్డి యిట్లు కోమటివేముని నపజయము నొందించి తఱిమి వేసి, రాజద్రోహులయిన యితరుల నడఁచివేసి, రాజమహేంద్రవరరాజ్యమును బాలుఁ డైన కుమారగిరికి మాఱుగాఁ గాఁబోలును 1416- వ సంవత్సరము నుండి తానే యేలసాగెను. అల్లాడభూపతి యనవేముని పుత్రికాపుత్రిక యైన వేమాంబను వివాహముచేసికొనియె ననియు, ఆమె తండి భీమరా జనియు, పయిని జెప్పిన యంశమును కోరుమిల్లి శాసనములోని యీ శ్లోకము
స్థాపించుచున్నది

      శ్లో. శచీవ శక్రస్య శివేవ శంభోః
          పద్మేవ సా పద్మవిలోచనస్య,
          వేమాంబికా చోళకులేందుభీమ
          భూపాత్మజాభూ న్మహిళాస్య జాయా.

అల్లాడభూపతికి వేమాంబవలన వేమారెడ్డి, వీరభద్రారెడ్డి, దొడ్డారెడ్డి, అన్నారెడ్డి, అని నలుగురు కొడుకులు గలిగిరి అనితల్లి తమ్ముఁడును కాటయవేమారెడ్డి కొడుకును నయిన కొమరగిరిరెడ్డి యుక్తవయస్సు రాక ముందే యల్లాడ రెడ్డి రాజ్యము చేయుచుండఁగానే కాలగోచరుఁడైయుండును. ఈ కొమరగిరిరెడ్డి యక్కయయిన యనితల్లిని తన ద్వితీయపుత్త్రుఁడైన, వీరభద్రారెడ్డికి వివాహము చేసి యల్లాడ రెడ్డి కాటయవేమారెడ్డికి వియ్యంకుఁ డయ్యెను. అల్లాడ రెడ్డి యిట్లు 1426-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసి తరువాత రాజమహేంద్రవరరాజ్యము ననితల్లి భర్త యైన వీరభద్రారెడ్డి వశము చేసెను. రాజమహేంద్రవరరాజ్యము నల్లాడ రెడ్డి యేలినను, వీర భద్రారెడ్డి యేలినను, ఆతనియన్న యైన వేమారెడ్డి యేలినను, అందఱును ననితల్లి పక్షముననే యేలిరనుట స్పష్టము.

3. అల్లాడవీరభద్రారెడ్డి

అల్లాడభూపతికి ద్వితీయపుత్రుడైన వీరభద్రారెడ్డి 1426- వ సంవత్సర మన రాజమహేంద్రవర రాజ్యసింహాసనము నధిష్టించి భూపరిపాలనము చేయ నారంభించెను. ఈతని రాజ్యకాలములో 1430-వ సంపత్సరప్రాంత మున శ్రీనాథుఁ డీతని మంత్రి యైన బెండపూఁడి యన్నామాత్యునియొద్దఁ బ్రవేశించి, తరవాత వీరభద్రారెడ్డి యాస్థానకవియయి కాశీఖండము నాతని కంకితముఁజేసి, వీరభద్రారెడ్డి రాజ్యావసానమువఱకును నచ్చటనే యుండెను. రాజమహేంద్రవరరాజ్యము 1443 -వ సంవత్సరముఁనాటికే విజయనగర రాజులపాలయినట్లా సంవత్సరమునందలి ప్రౌఢ దేవరాయల ద్రాక్షారామ శాసనమును బట్టి తేట పడుచున్నది. అందుచేత వీరభద్రారెడ్డి 1440-వ సంవత్సరప్రాంతములవఱకు రాజ్యపాలనము చేసినట్టు కనఁబడుచున్నది వీరభద్రారెడ్డి శాసనములుగాని, అతని యన్నయైన వేమారెడ్డి శాసనములు గాని 1437-38 -వ సంవత్సరమునకుఁ దరువాత గానరావు. వీరభద్రారెడ్డితోనే రాజమహేంద్రవర రెడ్డి రాజ్యమంతరించినది.

ఇంతవఱకును తెనుఁగు దేశమును బరిపాలించిన రెడ్ల చరిత్రమును సంక్షేప రూపమునఁ జెప్పితిని. ఇక రెడ్ల కవీశ్వరుఁ డైన శ్రీనాధుని చరిత్రమును గొంత వివరింపవలసి యున్నది. అతని జన్మస్థల మేదో, అతఁడే కాలము నందుండినవాఁడో, ఏ యే దేశములను దిరిగెనో, ఏ యే పుస్తకముల నెప్పు డెప్పుడు రచించెనో, ఆతని యంత్యదినము లెట్లు చెల్లినవో సాధ్య మైనంతవఱకుఁ జెప్ప బ్రయత్నించెదను.

శ్రీనాథుడు పాకనాటిసీమవాఁడయినట్టు భీమఖండమును కృతి నందిన బెండపూడి యన్నయమంత్రి చెప్పినట్లున్న యీ క్రింది సీసమువలనఁ దెలియవచ్చుచున్నది.

            "సీ. వినిపించినాఁడవు వేమభూపాలున
                           కఖిలపురాణవిద్యాగమములు
                కల్పించినాఁడవు గాఢపాకంబైన
                           హర్షనైషధకావ్య మాంధ్రభాష
                భాషించినాఁడవు బహుదేశబుధులతో
                           విద్యా పరీక్షణవేళలందు

                పాకనాఁటింటివాఁడవు బాంధవుఁడవు
                కమలనాభుని మనుమఁడ వమలమతివి
                నాకుఁ గృపసేయు మొక ప్రబంధంబు నీవు
                కలితగుణగణ్య ! శ్రీనాధకవివరేణ్య!

ఇప్పడు పాకనాటిసీమ యేదని విమర్శింపవలసి యున్నది. భారతారణ్య పర్వశేషాంతమునం దెఱ్ఱాప్రెగడ తన వాసస్థానమగు కందుకూరి తాలూకా లోని గుడ్లూరును కూడ పాఁకనాఁటిసిమలోని దానినిగా నీ క్రింది పద్యములలోఁ జెప్పి యున్నాఁడు:-

           "సీ. భవ్యచరిత్రుఁ డాప స్తంభసూత్రుండు
                             శ్రీవత్సగోత్రుండు శివపదాబ్ద
                సంతతధ్యానసంసక్తచిత్తుcడు సూర
                              నార్యునకును బోతమాంబికకును
                నందనల డిల బాఁకనాటిలో నీలకం
                              ఠేశ్వరస్థాన మై యెసక మెసఁగు
                గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు
                              ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ

              డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిదితుఁ
               డై న నన్నయభట్ట మహాకవీంద్రు
               సరససారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
               జెందుటయు సాధుజనహర్ష సిద్ధి గోరి.

            క. ధీరవిచారుఁడు తత్కవి
               తారీతియుఁ గొంత తోఁవఁ దద్రచనయకా
               నారణ్యపర్వశేషము
               పూరించెఁ గవీంద్రకర్ణపుటపేయముగాన్ .

ఈ యిద్దఱి పద్యములను బట్టి చూడఁగా గుంటూరు మండలములోని కొండ వీడు మొదలుకొని నెల్లూరిమండలములోని కందుకూరువఱకు నున్న దేశము పాఁకనాఁ డని తోచుచున్నది.

ఇతఁడు [4] పాకనాటిసీమలోని నెల్లూరిమండలమునందలి యొక సముద్రతీర గ్రామమునందు పుట్టి పెరిగినవాఁడు. ఈ పితామహుఁడు కమలనాభుఁడు మంచి పండితుఁడు; కవీశ్వరుఁడు; తెనుఁగునఁ బద్మపురాణ సంగ్రహమును జేసెనఁట ! ఈతని నివాసస్థానము సముద్రతీరమందలి [5]క్రాల్పట్టణమయినట్టు శ్రీనాధుడు భీముఖండములో నీ క్రింద పద్యమునందుఁ జెప్పి యున్నాఁడు.

               మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీక్రాల్పట్టణాధీశ్వరున్
                   ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్య ప్రబంధాధిపున్
                   వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
                   యనుఁగుందాతఁ బ్రదాత శ్రీ కమలనాభామాత్యచూడామణిన్.

ఈకాల్పట్టణ మేదో తెలియదు; ఆప్రాంతములయందుఁ బ్రసిద్ధికెక్కిన మోటుపల్లి యను రేవుపట్టణ ముండును గాని యది యిది కాదు. మోటుపల్లికి మొగడపల్లి యని నామాంతరము గలదు. శాసనములయందీ రేవుపట్టణము ముకుళపుర మని వాడబడినది. అనపోత రెడ్డికాలము నందలి యొక శాసనములోని యూ క్రింది శ్లోకములను జూడుఁడు -

              శ్లో. ఆహితతమః, కృశాను ర్వెమభూపాలసూనుః
                  స్తుతకలిత మహీశాన్నాన్నపోతక్షి తీశః
                  శాకాబ్దే గగనాష్టసూర్యగణితే తీరే మహాంభోనిధిః
                  ప్రఖ్యాత మ్ముకుళాహ్వయే పురవరే శ్రీసోమమంత్రీకరః

ఆందుచేత క్రాల్పట్టణము మోటుపల్లి గాక వేఱొకసముద్రతీర గ్రామమయి యుండును. ఇది యేదియో నిర్ధారణ మగువఱకును క్రాలనఁ గ్రొత్త యని యర్ధము చేయవచ్చును గనుకను, కడను పట్టణశబ్దమున్నది గనుకను క్రొ_త్తవట్టణమునుగా భావింతము, కమలనాభుఁడీ క్రాల్పణట్టమునకు కరణము. ("వినమత్కాకతిసార్వభౌము" నని పద్యములో నుండుటచేత నితఁడు బాల్యములో1320 -వ సంవత్సర ప్రాంతములయందు కాకతి ప్రతాపరుద్రమహారాజులకాలములో నుండి యాతనిచే సమ్మావింపఁబడి యున్నవాఁ డనుటకు సందేహము లేదు. అతఁడా గ్రామకరణ మగుటచే నాతవి పుత్రుఁడును శ్రీనాధునితండ్రియు నగు మారయయు నా గ్రామము నందే యుండి కరణీకవృత్తిచేసి జీవనముచేయుచు నుండి యుండవచ్చును. శ్రీనాధుడు తన తాతను గూర్చియే కాని యే పుస్తకమునందును తండ్రిని గూర్చి యంతగాఁ జెప్పి యుండలేదు. అతఁడొక వేళ నిజముగా పండిత పుత్రుఁడేయేమో ! తాతయే శ్రీనాథునికిఁ జిన్నప్పడు విద్యయుఁ గవిత్వమును నేర్పియుండును. భీమఖండకృతిపతి కమలనాభుని నెఱిఁగి యుండినట్టు చెప్పుటచేత నతఁడు 1380 -వ సంవత్సరమువఱకైన బ్రతికి యుండవచ్చును. అప్పటికి శ్రీనాథునికి తప్పక పదునేను సంవత్సరములకు తక్కువకాని యీడుండును. దానినిబట్టి శ్రీనాధుడు 1365-వ సంవత్సర ప్రాంతమున జననమొంది యుండును. శ్రీనాధుఁడు తన పదునాఱవ సంవ త్సరప్రాంతముననే గ్రంథరచనమున కారంభించె ననుటకు సందేహములేదు.

       'చిన్నారిపొన్నారిచిఱుతకూకటినాఁడు
        రచియించితి మరుత్తరాట్చరిత్ర.'

అను కాశీఖండములోని పద్య మీ యంశమునకు సాక్ష్యమిచ్చుచున్నది. కాఁబట్టి యీతఁడీ మరుత్తరాట్చరిత్రమును పదునెనిమిదేండ్లలోపల నింటికడ నున్నప్పడే రచియించి యుండును. కాబట్టి మరుత్తరాట్చరిత్రము 1383-వ సంవత్సరప్రాంతమున రచించెనని చెప్పవచ్చును. నా కీ పుస్తకము లభింపనందున శైలి యెట్లున్నదో యందు వ్యాకరణాదిదోషములేమయిన నుండినవో యది యెవ్వరికైన నంకితము చేయబడినదో లేదో చెప్పఁజాలను. ఈతఁడు చేసిన రెండవ గ్రంథము పల్నాటి వీరచరిత్రము నందలి బాలునికథ. ఇదియు నింటికడ నున్నప్పడే స్వగ్రామమునందలి పల్నాటివీరుల కులమువారి ప్రోత్సాహముచేత నీతనిచేత రచియింపఁబడి యుండును. ఈ పుస్తకరచనమువలన శ్రీనాధునకుఁ గొంత ధనలాభము కలిగి యుండును. పల్నాటివీరచరిత్రము ద్విపదకావ్యము. ఇది 1384 -వ సంవత్సరప్రాంతములయందు రచియింపబడి యుండును. పల్నాటివీరుల చరిత్రద్విపద నోరుగంటిపురములో నాడినట్లు 1420-వ సంవత్సరప్రాంతములందు వల్లభరాయనిచే రచియింపఁబడిన క్రీడాభిరామమునం దిట్లు చెప్పబడినది.

          గీ. ..........విప్రుఁ డీక్షించెఁ బలనాటి వీరపురుష
             పరమదైవతశివలింగభవనవాటి,


          మ. ద్రుతతాళంబున.............
              యతిగూడం ద్విపద ప్రబంధమున వీరానీకముం బాడె నొ
              క్కత ప్రత్యేకముగాఁ గుమారకులు ఫీట్కారంబునన్ దూలగన్.

          గీ. .............పడఁతి పల్నాటివీరులఁ బాడు నపుడు. [6]

[పల్నాటి వీరచరిత్రము ద్విపదకావ్యము. ప్రస్తుతము ప్రచారములోనున్నది మంజరీఛందమున నున్నది. ఇది యసమగ్రము. ఇది శ్రీనాధుని రచన కాదని కొందఱి మతము. ఆంధ్రకవి తరంగిణీకారులు నట్లే తలంచియున్నారు. కాని కొన్ని భాగములలో శ్రీనాథుని పోకడలు, కొన్నింట శ్రీనాధుని రచన యనఁదగిన రచన కానవచ్చుచున్నట్లు కొందఱు తలంచుచున్నారు. శ్రీనాధుఁడు, కొండయ్య, మల్లయ్య అనువారు వీరచరిత్ర గ్రంథకర్తలుగా దెలియవచ్చుచున్నారనియు, శ్రీనాధుని ద్విపదకావ్యమును జూచి మిగిలిన యిర్వురును గ్రంథరచనము చేసియుందురనియును శ్రీ, సి. పి. బ్రౌను దొర గారును, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు నభిప్రాయపడినారు.

మఱియు నియ్యది శ్రీనాథుని చిన్ననాఁటి రచనగా శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తలఁపలేదు. రాణావలంబనము పోయినపిదప-అనఁగా-కొండవీటి పతనమునకుఁ దర్వాత శ్రీనాధుఁడు 'పల్నాటిప్రాంతములను బర్యటించునప్పడు, అక్కడి ప్రజల ప్రార్ధనముచేతఁగాని, దేశచరిత్రాభిమానముచేతఁగాని ఈ చరిత్రమును రచించి యుండునని శ్రీ శాస్త్రులుగారి యాశయము. [చూ. శృంగార శ్రీనాధము. పుట. పుట 240]

ఈ పుస్తకమువలనఁ గలిగిన ప్రోత్సాహమునుబట్టి శ్రీనాధుఁడు గొప్పవారికిఁ గృతు లిచ్చి ధనార్థనము చేయవచ్చునన్న యాశ గలవాఁడయి స్వగ్రామమును విడిచి స్వస్థలమునకు మిక్కిలి సమీపమున నున్న యొక చిన్న సంస్థానమునకుఁ బోయెను. ఆ సంస్థానమున కప్పు డధిపతి పెద్ద కోమటి వేముడు, అప్పు డాతని ముఖ్యపట్టణము దువ్వూరో, యేదోయయి యుండును. ఎంతటి విద్వాంసుల కయినను రాజమంత్రి యొక్కయు, తదితరోద్యోగులయొక్కయు ననుగ్రహము లేక రాజదర్శన మగుటయు, రాజానుగ్రహమునకుఁ బాత్రుఁడగుటయు సంభవింప నేరవు. అందుచేత శ్రీనాథుఁడు పెద్దకోమటి వేమనమంత్రి యైన మామిడి సింగన్న యైన ప్రెగడన్న నాశ్రయించి యాతనికిఁ బండితారాధ్యచరిత్ర మంకితమొనర్చెను. అప్పటికీ పెద్దకోమటివేమన్న యొక చిన్నసంస్థానాధిపతి యయి కొమరగిరిరెడ్డి రాజ్యకాలములో నుండినవాఁడు. పెద్దకోమటి వేమభూపాలుఁడు రెడ్డిరాజ్యసంస్థాపకుడైన ప్రోలయవేమారెడ్డియన్నయైన మాచన్నయొక్కరెండవ కుమారుని కుమారుఁడు. మాచన్నయొక్క ప్రధమపుత్రుఁడు రెడ్డిపోతన నృపాలుడు; ద్వితీయ పుత్రుఁడు పెద్దకోమటి భూపాలుఁడు; తృతీయపుత్రుఁడు నాగనరపాలుఁడు. ఈ యంశమును శృంగారదీపికలోని యీ శ్లోకము తెలుపుచున్నది.

            శ్లో. మాచక్షోణిపతిర్మహేంద్రవిభవో వేమక్షితీశాగ్రజో
               హేమాద్రేస్సదృశో బభూవ సుగుణైస్తస్య త్రయో నందనాః
               కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతి శ్శ్రీకోమటీంద్రస్తతో
               నాగక్ష్మాపతి రిత్యువాత్తవపుషో ధర్మార్థకామా ఇవ.

మాచన్న యొక్క చిన్న సంస్థానమునకు తండ్రి యనంతరమున నాతని పెద్ద కొడుకు రెడ్డిపోతభూపాలుఁడు రాజయ్యెను; రెడ్డిప్రోతభూపాలుని యనం తరమున నాతని తమ్ముఁడు పెద్దకోమటి రా జయ్యెను, ఇతఁ డనవేమభూపాలవి రాజ్యకాలములోనే మృతినొందఁగా ననవేమభూపాలుని చివర దినములలోనే పెద్దకోమటివేమభూపాలుఁడు తన తండ్రి రాజ్యమునకు వచ్చెను. అనవేమభూపాలునకు మామిడి సింగన్నతండ్రి పెద్దనామాత్యుఁడు మంత్రిగా నుండినట్టును, వేమభూపాలనకు పెద్దనామాత్యుని తమ్ముఁడై న నామామాత్యుఁడు మంత్రిగా నుండినట్టును, శ్రీనాధుని శృంగార నైషధములో నున్న రెండు పద్యములును పయి నింతకుముందే యుదాహరింపబడెను.

కుమారగిరిరాజ్యకాలమునందే హేతువుచేతనో తండ్రి యనంతరమున మంత్రిత్వము లభింపకపోఁగా మామిడి సింగన్న తన పినతండ్రి యనంతరమున వేమనృపాలునకు మంత్రి యయ్యెను. కుమారగిరిరెడ్డి రాజ్యకాలములోనే శ్రీనాధుఁడు మొట్టమొదట తన పండితారాధ్యచరిత్రమును ప్రెగ్గడన్న కంకితము చేసెను. ఈ విషయమును శ్రీ నాధుని గూర్చి మామిడి సింగన్న యన్న ట్లున్న నైషథములోని యీ క్రింది పద్యము వ్యక్షపఱచు చున్నది.

         క. జగము నుతింపఁగఁ జెప్పితి
            ప్రెగడయ్యకు నా యనుంగు పెద్దనకుఁ గృతుల్
            నిగమార్థసారసంగ్రహ
            మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.


దీనినిబట్టి చూడఁగా నొక్క యారాధ్యచరిత్రమునే గాక యితరపుస్తకములను గూడ మఱికొన్నిటిఁ బ్రెగడయ్య కంకితమొనర్చినట్టు కనుపట్టుచున్నది. శాలివాహనసప్తశతి గూడ నీతనికే యంకితము చేయఁబడినదేమో!

           "నూనూగుమీసాలనూత్నయౌవనమున
            శాలివాహన సప్తశతి నొడివితి"

అని కవియే చెప్పుకొని యుండుటచేత నిరువది రెండేండ్ల ప్రాయమున ననగా 1387-వ సంవత్సరప్రాంతమున శాలివాహనసప్తశతి రచియింపఁబడి యుండును. అటు తరువాత రెండు మూఁడేండ్ల కనఁగా 1390-వ సంవత్సర ప్రాంతమున శ్రీనాథుని కిరువదియైదేం డ్లుండి నప్పడు పండితారాధ్య చరిత్రము రచింపఁబడి యుండును. శ్రీనాథుని ప్రసిద్ధి యంతయు నైషథ కావ్యరచనమునుండి యారంభమైనది. అంతకుఁ బూర్వపు గ్రంథము లన్నియు నించుమించుగా నామమాత్రావశిష్టము లయినవి. ఒక్క పల్నాటి వీరచరిత్రములోని కొంతభాగము మాత్రము కనఁబడుచున్నది. అవి నామమాత్రావశిష్టములయినను కాకపోయినను నాకు మాత్రము దొరకలేదు. శ్రీనాధుని సప్తశతిలోని దని యే గ్రంథములోనుండియో యెత్తి శ్రీమానవల్లి రామకృష్ణకవిగారీ పద్యము నుదాహరించి యున్నారు.

             ఉ. వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేఁటి క్రొ
                 వ్వారుచు నుంట నీ వెఱుగవా ? ప్రియ ! హా తెఱగంటిగంటి కె
                 వ్వారికిఁ గెంవు రాదె ? తగవా మగవారల దూఱ నీ విభుం
                 డారసి నీనిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.[7]

నైషధమునుగూర్చి శ్రీనాధుడే తన కాశీఖండమునందు

        "సంతరించితి నిండు జవ్వనంబునయందు
         హర్ష నైషథకావ్య మాంధ్రభాష"

నని సంపూర్ణయౌవనదశయందు రచించినట్టు చెప్పెను. కాబట్టి శ్రీనాథుఁడు తాను ముప్పది సంవత్సరముల వయస్సులో నున్నప్పు డనఁగా 1395-ప సంవత్సరప్రాంతమున నైషథమును రచించి యుండును. ఇది పెద్దకోమటి వేమన్న చిన్నసంస్థానాధిపతిగా నున్న కాలములోనే యాతని మంత్రి యైన మామిడిసింగన్న ప్రేరణముచేత తదంకితముగా రచింపఁబడినది. ఈ వేమన్న పెద్దకోమటివేమన్న కాఁ డని కొందఱు భ్రమపడి యేమేమో వ్రాసిరి కాని యతఁడు పెదకోమటివేమన్నయనుటకు గ్రంధములోనే కొన్ని నిదర్శనము లున్నవి.

         క. శ్రీమహిత పెద్దకోమటి
            వేమక్షితిపాలరాజ్యవిభవకళార
            క్షామణికి సింగసచివ గ్రామణికిం బాండ్యరాయగజకేసరికిన్.

షష్ఠ్యంతపద్యములలో నిట్లుండుటయే కాక పుస్తకాంతమున ఫల శ్రుతిలో,

      "భారద్వాజ గోత్రుండును నాపస్తంభ సూత్రుండును
      నుభయకులపవిత్రుండును మామిడి పెద్దనామాత్య
      పుత్రుండును పెద్దకోమటివేమభూపాలకరుణాపా
      త్రుండును నైన వినయవివేకసాహిత్య సింగనామాత్య
      పుణ్యశ్లోకుండు. "

అని స్పష్టముగా పెదకోమటి వేమభూపాలుఁడని చెప్పఁబడి యున్నది. నైషథమును ముద్రించినవారు షష్ఠ్యంత పద్యారంభమును 'శ్రీమహీతు పెద్ద కొమరుఁడు" అని యర్ధము లే కుండునట్లు సవరించి పద్యమును పాడుచేసిరి. నైషధకావ్యకృతిపతి యైన మామిడిసింగనామాత్యుఁడు వేమనృపాలుని మంత్రి యైనట్లు కవి యీ పద్యమున జెప్పియున్నాఁడు.

        సీ. తనకృపాణము సముద్ధతవైరిశుద్దాంత
                 తాటంకముల కెగ్గుఁ దలఁపుచుండఁ
           దనబాహుపీఠంబు ధరణిభృత్కమరాహి
                 సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ

             దనకీర్తినర్తకి ఘనతర బ్రహ్మాండ
                          భవనభూముల గొండ్లిఁబరిఢవిల్లఁ
               దనదానమహిమ సంతానచింతారత్న
                          జీమూతసురభుల సిగ్గు పఱుపఁ

               బదఁగు శ్రీవేమమండలేశ్వరునిమంత్రి
               యహితదుర్మంత్రివదసముద్రావతార
               శాసనుఁడు రాయవేశ్యాభుజంగబిరుద
               మంత్రి పెద్దయసింగనామాత్యవరుఁడు.

కవి పయి పద్యమునందుఁ బెదకోమటివేమనృపాలుని మండలేశ్వరుఁడని చెప్పుటచేత నైషధగ్రంధరచనకాలమునాఁటి ఆతడు రెడ్డిసామ్రాజ్య పట్టభద్రుఁడు కాలేదనియు, రెడ్డిరాజ్యములోని మండలేశ్వరుఁడుగానే యుండెననియుఁ దెల్ల మగుచున్నది. కృతివతి తన్నుద్దేశించి పలికినట్లుగా శ్రీనాధుఁడు నైషధావతారికలో నీక్రింది వద్యమును వేసి యున్నాఁడు.

            శా. బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ పురుప్రజ్ఞా విశేషోదయా
                జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
                బ్రహ్మాండాదిమహాపురాణచ యతాత్పర్యార్థనిర్ధారిత
                బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే ?

             క. జగము నుతింపఁగఁ జెప్పితి
                ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్
                నిగమార్థసారసంగ్రహ
                మగునాయారాధ్యచరితమాదిగఁ బెక్కుల్.

                * * * * *

             గీ. భట్టహర్షుండు బ్రౌఢవాక్పాటవమున
                నెద్ది రచియించి బుధలోకహితముఁ బొందె
                నట్టి నైషధసత్కావ్య మాంధ్రభాష
                ననఘ ! యొనరింపు నాపేర నంకితముగ.

ఆంధ్రనైషధపద్యకావ్యాంతమునందు శ్రీనాధుఁడు:

        "నై_షధశృంగారకావ్యం బాంద్రభాషా విశేషంబున నశేషమనీషి
         హృదయంగమంబు గా శబ్దంబు నమసరించియు నభిప్రాయంబు
         గురించియు భావం బుషలక్షించియు రసంబుఁ బోషించియు నలం
         కారంబు భూషించియు నౌచిత్యం బాదరించియు ననౌచిత్యంబు పరిహ
         రించియు మాతృకానుసారంబునఁ జెప్పఁబడిన యీ భాషానైషధ
         కావ్యంబు"

అని తాను జేసిన భాషాంతరీకరణమునుగూర్చి చెప్పుకొనెను. తావనౌచిత్యంబు పరిహరించితి నని కవి చెప్పుకొన్నను, నశ్లీలములును ననౌచిత్యములు నయిన యీ క్రింది పద్యములవంటివానిని వేయక మానలేదు.

     ఉ. అవ్వలిదిక్కు మో మయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్
        త్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండఁగ ధూర్తుఁ డొక్కరుం
        డివ్వల వచ్చి వంచన మెయిన్ నునుమించు మెఱుంగుటద్దమున్
        నవ్వుచుఁ బట్టె దాని చరణంబులకు న్నడుమైన మేదినిన్.

ఆ కాలమునం దిట్టి వనౌచిత్యములుగా భావింపఁబడ కుండెనేమో ! నై షధమును తెనిఁగించుటలో శ్రీనాధుఁడు సంస్కృతము నత్యధికముగా నుపయోగించి బహుస్థలములలో సాంస్కృతికదీర్ఘసమాసములతో నింపి యున్నాడు.

           శ్లో. సువర్ణదండైకసితాతపత్రితజ్వలత్ప్రతాపావళికీర్తిమండల8."-
                               ప్రథమ సర్గము. శ్లో.2 అను భాగము.

           సీ. “తపనీయదండైకధవళాతపత్రితోద్దండతేజ కీర్తిమండలుండు" అని తెనిఁగింపఁబడినది. ఇందు "సువర్ష" యనుటకు 'తపనీయ' యనియు, 'సితి" యనుటకు 'ధవళ' యనియు, సంస్కృతపదములకు సంస్కృతపర్యాయపదములు వేసి గణయతిప్రాసముల కనుకూలముగా దీర్ఘసమాసమును జేయుట తప్పఁ దెలిగించిన దేదియులేదు. కడపట "కీర్తి మండలః" లను దానిని 'కీర్తిమండలుం' డని తెనుఁగువిభక్తి తోఁ గూర్చుట మాత్రమే యిందున్న తెలుఁగు.

            శ్లో. సరశీః పరిశీలితుం మయా
                గమికర్మీకృతనైకనీవృతా,
                అతిథిత్వమనాయి సా దృశోః
                సదసత్సంశయగోచరోదరీ.
                                    సర్గ 4. శ్లో.40

అనుదానిలోని గమకర్మీకృతేత్యాదిభాగమును

మ. 'గమి కర్మీకృతినైకనీవృతుడనై కంటిన్ విదర్భంబునన్' అని మార్పేమియు జేయక తుదను విభ_క్తి ప్రత్యయమైన డువర్ణకమును మాత్రము చేర్చి తెనుఁ గనిపించెను.

             శ్లో. మందాక్షమందాక్షరముద్ర ముక్త్వా
                 తస్యాం సమాకుంచితవాచి హంసః,
                 తచ్ఛంసితే కించన సంశయాళు
                 ర్గిరా ముఖాంభోజ మయం యుయోజ. -సర్గ 3.శ్లో. 20

అనుదానిలోని మందాక్షేత్యాదిప్రథమచరణమును

          గీ. రమణి మందాక్ష మందాక్షరంబు గాఁగ"

అని తెనిఁగించెను. ఇందును మూలములోని పదములలో మార్పేమియు లేక తెలుగగుటకు కడను బువర్ణకము చేర్పబడెను. ఇటువంటి వనేకములు గలవు. ఇట్టి భాషాంతరములను జాచి యా కాలపు విద్వాంసులు శ్రీనాధునితో "నీడూలును మూలునుదీసికొని మా నైషధమును మామీఁదఁ బాఱ వేయుము" అని పరిహాసముగాఁ బలికి రని యొక కథ చెప్పుచున్నారు. దానికి బహుస్థలములయందు సంస్కృత విభక్తికి మాఱుగా తెలుఁగువిభక్తి ప్రత్యయములై న డుములను జేర్చుట తప్ప వేఱుభాషాంతరము లేదని తాత్పర్యము. తెనుఁగున గమనార్థకమైన సకర్మకక్రియ లేనప్పడు 'గమి కర్మీకృత నై కనీవృతుఁడనై_" యనుటకంటె ' అనేక దేశములను దిరిగిన వాఁడనై " యను నర్ధ మిచ్చెడు వేఱొక వాక్యమును వాడుటయే సముచిత మని తోఁచుచున్నది. ఇట్టి భాషాంతరములు సంస్కృతపాండిత్యము గల విద్వాంసులకే కాని సామాన్యాంధ్రభాషాజ్ఞానము గలవారికి బోధపడవు. కొన్నిచోట్ల భాషాంతర మెట్లున్నను మొత్తముమీఁద నైషధాంధ్రీకరణము సర్వజనశ్లాఘాపాత్రముగా నున్నదనుటకు సందేహము లేదు.

                 శ్లో. విజ్ఞాపనీయా న గిరో మదర్థాః
                     కృథా కదుష్ణే హృది నైషధస్య ?
                     పిత్తేనదూనే రసనే సితాపి
                     తిక్తాయతే హంసకులావతంసః

                 గీ. అధికరోషకషాయితస్వాంతుఁడైన
                     నరపతికి విన్నవింపకు నా యవస్థ
                     పైత్యదోషోదయంబునఁ బరుస దై న
                     జిహ్వకును బంచదారయుఁ జేఁదుగాదే !

ఇత్యాదిస్థలములలో భాషాంతర మెంతో మనోహరముగా నున్నది, గుణ విశేషము కలిగియున్నదగుటచేతనే యాంధ్రనైషధ మాంధ్ర పంచకావ్య ములలో నొక్కటిగాఁ బరిగణింపఁబడుటయే కాక వానిలో నగ్రగణ్యముగా భావింపఁబడుచున్నది. ఈ నైషధకావ్యరచన వలన శ్రీనాధున కాంధ్రకవు లలో నత్యంత ప్రసిద్ధి కలిగినది. ఎంతటి ప్రసిద్ధి కలిగినను శ్రీనాధున కింతవఱకు రాజాస్థానములలోఁ ప్రవేశము కలిగినదికాదు. ధనార్జ నమున కయి పెదకోమటివేమనృపాలుని సంస్థానమునకుఁ బోయి యతని మంత్రులు మొద లై నవారి నాశ్రయించినట్టే శ్రీనాధుఁడు స్వస్థలమును విడిచి వచ్చి యారంభ దశలోనే రెడ్డిరాజ్యమునకుఁ బ్రధాననగరమయిన కొండవీటికిఁ బోయి కుమారగిరి రెడ్డి యొక్క మంత్రులు మొదలయినవారి నాశ్రయించియుండును గాని యచ్చటివా రీతని కచ్చటఁ బ్రవేశము కలుగనీయలేదు. [8] ఉభయులును శైవమతస్థు లగుటచేతనో, మఱియే హేతువుచేతనో యట్టి ప్రయాణములయందు శ్రీనాధునకు కుమారగిరిభూపాలుని సుగంధభాండాగారాధ్యక్షుడయి కోటీశ్వరుడుగా నుండిన యవచి తిప్పయనెట్టితోడి మైత్రి కలిగినది. అందుచేతనే శ్రీనాధుఁడు తిప్పయసెట్టికి బాలసఖుఁ డయ్యెను. అప్పటికి శ్రీనాధుఁ డిరువది యిరుపదియైదు సంవత్సరముల బాలుఁడే యయినను తిప్పయ్య నెట్టి యాతనికంటె మిక్కిలి పెద్దవాఁడయి యుండును. కొండ వీటియందు తప్ప శ్రీనాధున కవచి తిప్పయ సెట్టితోడిమైత్రి కల కవకాశము వేఱొకచోటఁ గానఁబడదు, శ్రీనాధుఁడు నైషధరచనానంతరమునఁ దన బాలసఖుఁ డయిన తిప్పయనెట్టిని జూచి సమ్మానమును బొందుటకు మరలఁ గొండవీటికిఁ బోయెను. అప్పడు శ్రీనాధుఁడు ధనస్వీకారము చేసి హరవిలాసమును రచించి తిప్పయనెట్టి కంకిత మొనర్చెను.

హరవిలాస మేడాశ్వముల గ్రంథము. నైషధకావ్యరచనా నంతరమున నెల్ల వారును దానిని సంస్కృతపదభూయిష్ఠముగాను, దీర్ఘసంస్కృతసమాస బహుళముగాను నుండిన దని నిందింపఁగా నా నిందను బాపుకొనుటకయి శ్రీనాధుఁడు హరవిలాసము నాంధ్రపదభూయిష్టముగాను, విశేషదీర్ఘ సంస్కృత సమాసవిరహితముగాను జేసెను. శ్రీనాధుని గ్రంథము లన్నిటిలో నిది కడపటి దని కొందఱు వ్రాసిరి గాని యది సరి గాదు. ఇది తప్పక కొమరగిరిరెడ్డికాలములోనే రచియింపఁ బడినది. దీనికృతిపతి యైన కోమటి యవచి తిఫ్పయ్య నెట్టి కొమరగిరి భూపాలునికాలములో నుండి యాతనికి సుగంథద్రవ్యంబులు తెప్పించి యిచ్చువాఁడనియు, తిప్పయ్య నెట్టి కవి నుద్దేశించి తనకు శై_వప్రబంథ మొకటి యంకితము చేయమని యడిగె ననియు, హరవిలాసములోని యీ కింది గద్య పద్యములు స్పష్టముగా జెప్పుచున్నవి. "గద్యము . . కొమరగిరి వసంతనృపాలునివలన నాందోళికాఛత్ర చామరతురంగాది రాజ్యచిహ్నములు వడసి యమ్మహారాజునకుఁ బ్రతిసంవత్సరోత్సవంబునకుం దగిన కస్తూరీ కుంకుమ ఘనసార సంకుమ దహీమాంబుకాలాగురుగంధసారప్రభృతిసుగంధ ద్రవ్యంబు లొడగూర్చియుఁ జీనిసింహళత వాయిహురుమంజిజలలోగి ప్రభృతినానాద్వీపనగరాకరంబు లగు ధనకనకవస్తు వాహనమాణిక్యగాణిక్యంబులు తెప్పించియు, గవినైగమికవాదివాంశికవైతాళికాదు లగు నర్ధిజనంబులగునర్థంబులు గుప్పించియు ధీరుండును నుదారుండును గంభీరుండును, సదాచారుండును నన విఖ్యాతిఁ గాంచిన యవచిదేవయతిప్ప ప్రభుండొక్కనాడా స్థానమండపంబున సుఖోపవిష్టండయి

         సీ. కమలనాభునిపౌత్రు గవితామహీ రాజ్య
                           భద్రాసనారూఢుఁ పరమపుణ్యుఁ
             బాత్రు నాపస్తంబసూత్రు భారద్వాజ
                           గోత్రుసజ్జన మిత్రుఁ గులపవిత్రు
             భీమాంబికామారనామాత్యనందను
                           నఖిలపురాణు విద్యా ప్రవీణు
             నధ్వర్యు వేదశాఖాతిధినిష్ణాతు
                           నంధ్రభాషానైషధాబ్జభవుని

           నుభయభాషాకవిత్వ ప్రయోగ కుశలు
            బాలసఖు గారవించి తాత్పర్య మొప్ప
            నవచిదేవయత్రిపురారి యక్షరాజు
            హితమితోక్తులు వెలయంగ నిట్టులనియె.


        క. కంటినీ విశుద్దసంతతి
            వింటిఁ బురాణములు పెక్కు విశ్వము పొగడన్
            మంటి బహువత్సరంబులు
            గొంటి యశోధనము సుకవికోటి నుతింపన్ [ పీఠిక-9.9]

              ... .... ... ..... ......

        గీ. ఆగమజ్ఞాననిధివి తత్త్వార్థనిధి
           బహుపురాణజ్ఞుఁడవు ......
           బాలసఖుఁడవు శైవ ప్రబంధమొకటి
           అవధరింపుము నా పేర నంకితముగ [ పీఠిక -12 ]

పయి వాక్యమువలన తిప్పయ్యసెట్టిపై కొమరగిరినృపాలునకు కస్తూరీఘన సారాదులు సమకూర్చువాఁడయినట్టును. ఏండ్లు చెల్లినవాఁ డయి నట్టును కవిబాలసఖుఁ డయినట్టును కనుపట్టుచున్న ది ఇందలి మొదటి రెండంశముల విషయములోను సందేహము లేదు తిప్పయ సెట్టి తండ్రి దేవయ్య సెట్టి 1320 మొదలుకొని 1340 వఱకును రాజ్యము చేసిన ప్రోలయవేమారెడ్డికాలములో నుండినవాఁ డగుటచేతను, ప్రోలయ వేమారెడ్డికొడుకు కొడు కైన కొమరగిరి రెడ్డికాలములో తిప్పయసెట్టి యుండుటచేతను, తిప్పయసెట్టి కుమారగిరిభూపాలుని తండ్రి యైన యనపోతభూపాలునియీడువాఁ డయి యుండవలెను. అప్పుడు తిప్పయసెట్టికుమారులే కొమరగిరి రెడ్డి యీడువారయి యుండవలెను. అందుచేత తిప్పయసెట్టి కప్పటి కఱువది సంవత్సరముల వయస్సుండి యుండవలెను. అంతేకాక తృతీయాశ్వాసారంభములోని యీ పద్యము తిప్పయసెట్టికూడ ప్రోలయవేమారెడ్డి కాలములోనుండినట్టు తెలుపుచున్నది.

               క. శ్రీపర్వతసోపాన
                   స్థాపక మేమక్షితీశసామ్రాజ్యశ్రీ
                   వ్యాపారిముఖ్య ! యన్వయ
                   దీపక ! యలకాధిరాజ ! దేవయతిప్పా!

ప్రోలయవేమారెడ్డికాలములోనే తిప్పయ్య సెట్టి వ్యాపారిముఖ్యుఁడయినందున నప్పటి కిరువది సంవత్సరములవాఁడయినయి యుండి, కుమారగిరిరెడ్డి రాజ్యారంభకాలమునకే యేఁబది సంవత్సరమలవాఁడయి, హరవిలాసరచన కాలమునకే యఱువదేండ్లు దాటినవాఁడయి యుండవలెను. హరవిలాసము 1440 -వ సంవత్సర ప్రాంతమున తిప్పయసెట్టి కంకితము చేయఁబడినదని చెప్పెడి బుద్ధిమంతుల యభిప్రాయ ప్రకారము తిప్పయసెట్టికి నూటపది యేండ్ల దాఁటినతరువాత శ్రీనాధుఁడు హరవిలాసము నంకితము చేసెనని యేర్పడును గనుక సది గొప్ప యసంగతము. కాబట్టి హరవిలాసము కుమారగిరిభూపాలుఁడు జీవించియుండఁగానే 1360-వ సంవత్సరమునకు లోపలనే తిప్పయనెట్టి కంకితము చేయఁబడుట నిశ్చయము. అప్పటికే తిప్పయసెట్టికి దాదాపుగా డెబ్పదిసంవత్సరములయీడుండును.1360-వ స వత్సరమునకు లోపల జనన మొందని శ్రీనాధుఁడు వృద్ధుఁ డై న తిప్పయ సెట్టికి బాలసఖు డెట్లగును ? ఇద్దఱును సమానవయస్కులు కాకపోవుట నిశ్చయము. తిప్పయనెట్టి వృద్దుఁడే ! శ్రీనాధుఁడు బాలుఁడయి యుండినప్పుడు సఖ్యము కలుగుటచేతనే తిప్పయసెట్టికి శ్రీనాథుఁడు బాలసఖుఁ డయ్యెను గాని యుభయులును బాలురయి యుండినప్పడు కలిగిన మైత్రి చేతఁ గాదు, పయి సీసపద్యములో

                   "ఆంధ్రభాషానైషధాబ్జ భవువి"

అని యున్నందున, హరవిలాసము నైషధమునకుఁ దరువాత రచింపఁబడె ననుటకు సందేహము లేదు ఇఁక హరవిలాసమును రచించిన కాలమును సరిగా నిర్ధారణము చేయుటకుఁ బ్రయత్నింతము. కవి తిప్పయ్యసెట్టితమ్ముఁడై న తిరుమలనాధ సెట్టిని వర్ణించుచు నీ రీతిని జెప్పెను.

       చ. 'హరిహరరాయ ఫేరొజసహాసురధాణ గజాధిపాదిభూ
            వరులు నిజప్రభావ మభివర్ణన చేయఁ గుమారగిర్యధీ
            శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కఁడ నిర్వహించు
            మా తిరుమలనాథ సెట్టికిని ధీగుణభట్టికి నెవ్వఁ డీ డగున్? [పీఠిక-24]

ఈ పద్యమునందు హరిహరరాయలు, ఫేరొజిసహా, మొదలయినవారు మెచ్చు నట్లుగా కుమారగిరిభూకాంతుని వసంతోత్సవ వైభవమును తిరుమలనాథ నెట్టి యొక్కఁడే నిర్వహించుచుండినట్లు చెప్పఁబడినది. కాబట్టి హరవిలాసము రచియించునప్పటికి సమకాలీనులైన యీ ముగ్గురు రాజులును జీవించి యుండుట స్పష్టము. ఈ మువ్వురిలో (రెండవ) హరి హరరాయలు 1377 మొదలుకొని 1404-వ సంవత్సరమువఱకును రాజ్య పాలనము చేసెను; "ఫేరోజిసహా 1397 మొదలుకొని 1422-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను; కుమారగిరిభూపాలుఁడు 1387 మొదలుకొని 1400-వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసెను. ఆందుచేత నీ ముగ్గురును నుండి రాజ్యపాలనము చేయుచుండిన కాలము 1397. 1398.1399 1400 సంవత్సరములు.కాబట్టి 1397 నకును 1400 లకును నడిమి కాలములో ననఁగా 1400 వ సంవత్సర ప్రాంతమున హరవిలాసము రచియింపఁబడెను. అప్పటికీ శ్రీనాధునికి ముప్పదినాలుగు ముప్పదియైదు సంవత్సరముల వయస్సుండును. కవి ధనలాభముకొఱకు కృతిపతిని "తిప్పప్రభుఁ" డనియు, "ఆస్థానమండపంబున సుఖోపవిష్టుండై " యనియు, అతిశయోక్తులతో నెంతయెక్కువగా వర్ణించినను, తిప్పయసెట్టి సముద్రవ్యాపారమును జేయుచు, కుమారగిరికి వలెనే యితర రాజులకును కస్తూరీకుంకుమాది సుగంధద్రవ్యములను, చీనాంబరాదులను హయరత్నాదులను విదేశములనుండి తెప్పించి విక్రయించుచు పెద్ద యంగడి పెట్టిన లక్షాధికారి యైన పెద్దకోమటియే గాని మహారాజు కాఁడు. ప్రథమాశ్వాసాంతమునందలి

         క . కొమరగిరివసంతనృపా
             గమకవివరగంధసారకస్తూరీకుం
             కుమ కర్పూరహిమాంభ
             స్సముదంచిత బహుసుగంధిశాలాధ్యక్షా ! [ఆ.1-ప. 30]

అన్న పద్యములోని సంబోధనము తిప్పయసెట్టి కుమారగిరినిమిత్తము తెప్పించిన కర్పూరమును,గంధసారమును, కస్తూరిని విక్రయించు గొప్ప సుగంధదవ్యముల వాణిజ్యశాల శాల బెట్టిన వాఁడని చెప్పుచున్నది. అఱువదేండ్లు దాఁటిన ముసలి కోమటి యైన తిప్ప యసెట్టిని ద్వితీయాశ్వాసాంతమున "లలనాజనతాఝషలక్ష్మనిభా " స్త్రీ జనమునకు మన్మధతుల్యుఁడా ! యనియు, సప్తమాశ్వాసాంతమున 'కామినిహృద్యమూర్తీ " యనియు, పంచమాశ్వాసాంతమున - "సమర ఫల్గుణ" యనియు, సప్తమాశ్వాసాంతమున "సంగరపార్థ" యనియు, షష్ట్యంతములలో 'వారిణీసఖముఖముఖరితవీణానిక్వాణనిభకవిత్వఫణితికిన్ " అనియు స్తుతి చేసిన యతిశయోక్తుల నటుండ నిచ్చినను ఆ కాలములోని ఆంధ్ర వణిజులు విదేశవాసులతోను, ద్వీపాంతరఖండాంతరవాసులతోను సముద్రవ్యాపారమును విశేషముగా జరుపుచుండినట్లీ క్రింది పద్యములు సహస్రముఖముల ఘోషించుచున్నవి.

           *[9] సీ. పంజాబుకర్పూరపాదపంబులు దెచ్చి
                               జలనోగిబంగారుమొలక తెచ్చి
                 సింహళంబున గంధసింధురంబులు తెచ్చి
                               హురుమంజిబలు తేజిహరులు తెచ్చి
                 గోవసంశుద్ధసంకుమదద్రవము తెచ్చి
                               యాపగనాణిముత్యాలు తెచ్చి
                 చోటంగిఁ గస్తూరికాటంకములు తెచ్చి
                               చీనచీనాంబర శ్రేణి తెచ్చి

             జగదగోపాలరాయ వేశ్యాభుజంగ
             పల్లవాదిత్యభూదానపరశురామ
             కొమరగిరిరాజ దేవేంద్రుకూర్మిహితుఁడు
             జాణజగజెట్టి దేవయచామిసెట్టి.

          గీ. తమ్ము లిద్దఱుఁ దనయాజ్ఞ తల ధరించి
             యన్ని దీవులఁ దెచ్చులాభార్థకోటి
             యర్థులకు నిచ్చి కీ ర్తి బేహారమాడు
             నవచిత్రిపురాంతకుండు వంశాబ్దివిధుఁడు

         మ. తరుణా[10]చీనితవాయిగోవరమణాస్థానంబులం జందనా
             గరుకర్పూరహిమాంబుకుంకుమరజ8కస్తూరికాద్రవ్యముల్
             శరధిం [11] గప్పిలిజోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
             నేర్పరియో వైశ్యకులోత్తముం డవచితిప్పండల్పడేయిమ్మహిన్.
                                                        [పీఠిక 26-28]

ఇటువంటి యోడలవ్యాపారియైన తిప్పయసెట్టి కిద్దఱు తమ్ములును, ముగ్గురు కొడుకులు నుండినట్లీ పద్యమునఁ జెప్పఁబడినది.

         ఉ. ధీచతురు ల్సహోదరులు తిర్మల సెట్టియుఁ జామి సెట్టియున్
             మాచన విశ్వనాథ చినమల్ల కుమారులు వీర లాత్మజుల్
             శ్రీచెలువంబు గైకొనినచేడియ యన్నమదేవి భార్యగా
             గోచరమే నుతింప సయకోవిదునిఁద్రిపురాంతకాధిపున్
                                                           [పీఠిక-31]

 

[హరవిలాస రచన కుమారగిరిరెడ్డి కాలమునందే జరిగియుండునవి కొందఱి తలంపు; కాని చాలమంది విద్వద్విమర్శకులు దాని నంగీకరించలేదు. కొండవీటి రాజ్యము పతనమైన పిదప శ్రీనాథుఁడు దేశములఁ దిరుగుచు, కంచికిఁ బోయి యుండెననియు, అప్పడచటనున్న తన బాలసఖుని (తిప్పయనెట్టి) కోరిక పయిని హరవిలాసమును రచించి, యతని కంకిత మిచ్చి, సమ్మానముపొందెననియు, కాఁగా హరవిలాసము శృంగార నైషధ, భీమఖండములు రచింపఁబడిన పిదప - కాశీఖండరచసమునకుఁ బూర్వము రచింపఁబడి యుండు ననియు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారు వివరించిరి. హరవిలాసరచనమునాఁటికి అవచి తిప్పయసెట్టి బాలసఖుఁడగు శ్రీనాథుఁడు వృద్ధుఁడే యనియు, శ్రీనాధునికంటెను గూడఁ దిప్పయనెట్టి మఱీవృద్ధుఁ డనియు శ్రీశాస్త్రిగారు హరవిలాస పీఠికలోఁ దెల్పియున్నారు. [చూ. ఆనందముద్రణాలయము వారి హరవిలాసము - పీఠిక-4] ఏతద్రచనా కాలమునాఁటికి శ్రీనాధునికి నలువది, నలువదియైదు సంవత్సరముల ప్రాయమును, తిప్పయకేఁబది యేcబదియైదు సంవత్సరముల వయసును నుండియుండునని "ఆంధ్రకవి తరంగణి" యందుఁ గలదు. [చూ. సంపుటము.5 పుట. 53]

భాగవతముదశమస్కంధము శ్రీకృష్ణునిలీలలను దెలుపునట్లుగానే యీహర విలాసము హరుని విలాసములను దెలుపుచున్నది. ఇందలి శివవిలాసములలో మొదటిది చిఱుతొండనంబి చరితమును గూర్చినది. శైవాచారపరాయణుఁడైన చిఱుతొండనంబి కృతిపతి యైన తిప్పయనెట్టివంశమునకు మూలపురుషుఁడైనట్లీ గ్రంథమునఁ జెప్పఁబడినది. వీరశైవశిఖామణి మైన చిఱుతొండనంబి యను వైశ్యరత్నము నిత్యమును దనపంక్తిని జంగమ ప్రమధులు లేక భుజించెడువాఁడు కాఁడఁట! ఒకసారి ఇరువది రెండుదినము లేక వృష్టి గురిసి తనవాస స్థానమైన కాంచీనగరమునందు సహ పంక్తిని గుడుచుటకు జంగమ మాహేశ్వరుఁ డొక్కఁడును దొరకకపోఁగా వ్రతభంగము కలుగకుండుట కయు చిఱుతొండనంబి యూరంతయు వెదకుచుఁ బోయి పోయి తుద కూరిబైట నున్న యొక పాడు దేవాలయ ములో భార్యయైన గ్రుడ్డిముసలియవ్వతో నుండిన వృద్ధుడై కుష్ఠు వ్యాధి పీడితశరీరుఁడై న జంగమమాహేశ్వరుఁ డొక్కcడు కానcబడెనట! "చిఱు తొండనంబి యాతనిని దనతోడి సహజభోజనమునకుఁ బిలువఁగా నతడు కొత్తగా నుపనీతుఁడయి పదియేండ్ల యీడుగల కుమారునిఁ దల్లియే, చంపి వండి వడ్డించెడు గృహస్థునిపంక్తిని గానీ భుజింప రాననెనఁట. దుష్కరమగు నా కోరికను జెల్లించుటకు చిఱుతొండనంబియు నాతని దేవి యైన తిరువేంగనాచియు నొప్పుకొని యా ముసలిజంగమును సకళత్రముగా స్వగృహమునకుఁ గొనిపోయి యావఱకే తాను జంగమమాహేశ్వరున కాహార మగుటకు సంతోషపూర్వకముగా నంగీకరించి యుండిన సిరియాలుని పాఠశాలనుండి కొని వచ్చి యుపనీతునిఁజేసి తల్లియైన తిరువెంగనాంచి యే యా బాలుని తఱిగి వండి మగనిపంక్తిని గూరుచుండిన యా ముసలి జంగమునకు వడ్డించెనcట. అప్పుడా జంగము చిఱుతొండనంబియెుక్కకొడు కొకఁడుకూడఁ గూరుచుండక యపుత్రకుని పంక్తిని భుజింపనొల్ల ననెనట ! దానికి [12] చిఱుతొండనంబి తనకు సిరియాలుఁ డేకపుత్రుc డగుటచేత వేఱొక పుత్రుఁడు లేఁడని విన్నవింపగాఁ వానినే తల్లి చేతఁ బిలిపింపు మని యా వృద్దమాహేశ్వరుఁ డా జ్ఞాపించెనఁట ! తదాజ్ఞానుసార ముగాఁ దల్లి యైన తిరువెంగనాంచి "సిరియాలా" యని కేకవేయఁగా నందఱు నాశ్చర్యసంతోషమగ్నమానసు లగునట్లుగా మృతినొందిన సిరియాలుఁడే కసుగందని శరీరముతో బ్రతికి వచ్చెనఁట ! ఆ ముసలిజంగమును ముసలియవ్వయు నా వీరశైవ దంపతీపుత్రులయెుక్క- భక్తిని నిశ్చల శైవాచారానుర క్తిని పరీక్షించుటకయి కైలాసముననుండి కపటవేషముతో భూమి కవతరించి వచ్చిన పార్వతీపరమేశ్వరులఁట ! పార్వతీపరమేశ్వరు లా కుటుంబము యొక్క శైవాచారపరాయణత్వమునకు మెచ్చి కడపట వారికి ముగ్గురకు మాత్రమే కాక కాంచీపురములో నుండిన వారియాప్తబంధువులైన వైశ్యుల కందఱికిని గూడ కైలాసనివాసప్రాప్తి ననుగ్రహించిరcట ! కవికల్పన కొంత యున్నను హరవిలాసములోని శివలీల లన్నియు శ్రీనాథుని యితర గ్రంథములవలెనే సంస్కృతమునుండి భాషాంతరీకరింపఁబడినవే. శ్రీనాథుఁ డా వఱకు వాడుకలో లేని పదములను నన్యదేశ భాషా పదములను హరవిలాసములోఁ బ్రయోగించుట కారంభించెను. "తరుణా చీనితవాయి" యన్న పద్యములో "సామాను" లని ప్రయోగించుట కనిపెట్టి యున్నారుగదా ! ఈ క్రింది పద్యమున 'ఖుసిమీఱ" నని వాడి యున్నాఁడు.

       మ. ఖుసి [13] మీఱన్ సురథాణి నిండుకొలువై కూర్చన్నచో నీక రా
           భ్యసనంబున్ నుతియించురా యవచి తిప్పా ! చంద్రసారంగనా
           భిసముత్పాదితతాళవృంతపవన ప్రేంఖోలన ప్రక్రియా
           వనరోదంచితసారసౌరభరసవ్యాలంబరోలంబముల్ [పీఠిక–22]

హరవిలాసము రచియింపఁబడినతరువాత నత్యల్పకాలములోనే కుమారగిరి నరపాలుఁడు పరలోకగతుఁ డయ్యెను. అతని యనంతరమునఁ బెదకోమటి వేమభూపాలుఁడే కొండవీటిరాజ్యమున కంతకును బ్రభువయి 1400-వ సంవత్సరములోఁ దనమంత్రియైన మామిడిసింగనామాత్య సహితముగా వచ్చి కొండవీటియందుఁ బ్రవేశించెను. అటుతరువాతఁ గొుతకాలమునకు సింగనామాత్యుని యనుగ్రహమువలన శ్రీనాధునకుఁ మొదట రాజస్థానప్రవేశము కలిగెను. శ్రీనాథుఁడు వేమనృపాలుని యాస్థానమునందు విద్యాధికారిగా నియమింపఁబడినందున నప్పటినుండి స్థిరముగా కొండవీటినివాసుఁడయ్యెను.

ఈ పెదకోమటివేమభూపాలునియొద్ద శ్రీనాథుఁ డాంధ్రకవిగాను, పార్వతీ పరిణయమును రచించిన వామనభట్టు సంస్కృతకవిగాను ఉండిరి. వామనభట్టు సంస్కృతమున వేమభూపాలీయ మను పేర నీతని గూర్చియే యొక వచనకావ్యమును రచించెను. వేమభూపాలీయమునందు వామనభ ట్టితనిని సర్వజ్ఞ చక్రవర్తినిగాను, ఈతని పూర్వులను మహాచక్రవర్తులనుగాను పొగడెను. వేమభూపాలునకు దాను గ్రంథభర్త యగుటకంటె గ్రంథకర్త యగుటయం దెక్కువ యిష్టము కలిగి యుండినట్టు కనుపట్టుచున్నది. వేమభూపాలుఁడు సంస్కృతాంధ్రములయందు మంచి పాండిత్యము కలవాఁడయినట్టు చెప్పుచున్నారు. అమరుక మను శృంగార కావ్యమునకు సంస్కృతమున శృంగారదీపిక యను వ్యాఖ్యానము నీతఁడు రచించెను. ఈ గ్రంథ రచనమునందు శ్రీనాథ వామనభట్టు లీతని సహాయులుగా నుండి నట్టు కొందఱును, శ్రీనాధుఁడే గ్రంథము నంతను వేమభూపాలుని పేరు పెట్టి రచించెనని కొందఱును చెప్పుచున్నారు. శ్రీనాధుఁని శాసనములలో శ్లోకములే భేద మించుకయు లేక సరిగా నిందుఁగనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగారదీపికను రచించి యుండును. [14]ఫిరంగిపురశాసనము 1410 -వ సంవత్సరమునందు శ్రీనాథునిచే రచింపఁబడినది. ఇది గుంటూరు మండలము లోని సత్తెనపల్లి తాలూకా యందలి ఫిరంగిపుర గ్రామమున శ్రీ వీరభద్ర స్వామివారి యాలయమున కెదుట సున్న శిలా స్తంభముమీఁదఁ జెక్కఁ బడినందున నీ శిలా శాసనము ఫిరంగిపుర శాసన మనcబడును. ఇది ధరణికోటకు ప్రభువయిన గన్నమనాయని కూఁతురును వేమభూపాలుని భార్య యును నై సూరాంబ త్రవ్వించిన సంతానసాగర మను చెఱువును శకసంవత్సరము 1331 విరోధిసంవత్సర ఫాల్గుణ బహుళ ద్వితీయా శుక్రవారమునఁ బ్రతిష్టచేయు సందర్భమున శ్రీనాథునిచే రచియింపఁబడినది. ఈ సంతాన సాగర ప్రతిష్ఠాతిథి క్రీస్తుశకము 1410-వ సంవత్సరము ఫిబ్రవరి నెల 21-వ తేదీ యగును. ఈ శాసనము నిందు క్రిందఁ బూర్ణముగాఁ బ్రకటించుచున్నాను.

పడమటివైపు.

      శ్లో. కళ్యాణం జగతాం తనోతు స విభుః కాదంబినీ మేచకః
         క్రీడాక్రోడతనుః పయోధిపయసో విశ్వంభరా ముద్వహన్
         భారాపేతఫణావివర్తనవశా న్మోదాయ య స్యాభవన్

      నిర్యత్నా భుజగేంద్రమౌళిమణిభి ర్నీ రాజనప్రక్రియా. 1

       తమో హరేతాం తవ పుష్యవంతౌ రాకాసు పర్వాపరశైలభాజౌ
       రథాంగలీలా మిద దర్శయంతౌ పరా పురారేః పృథివీరథస్య 2

       మానుషా కారకిమ్మీర స్తంబేరమవపు ర్మహ8.
       ఉన్నిద్రయతు భద్రాణి రుద్రాణీ యేన సుప్రజాః 3

       యన్మౌళో నిహితం చిరాయ నిగమైర్ద్యేయం చ యుద్యోగిభి
       ర్యల్లక్ష్మీ మృదుపాణిపద్యయుగళీసంవాహనై ర్లాలితం,
       జాతా యత్ర వియన్నదీ త్రిజగతీ సంతాపనిర్వాపణీ
       తస్మా త్కంసభిద8 పదా దుదభవ ద్వర్టో గుణార్జోనిధి8. 4
 
       త త్రాభవత్సప్తమచక్రవర్తీ వేమక్షితీశో జగరక్షపాల8
       ఏకాదశీతి ప్రతిభాతి శంకా యేనావతారా8 పరమస్య పుంస8. 5

       రాజ్యం వేమ న్స చిర మకరో త్ప్రాజ్యదానై కతానో
       భూమీదేవై ర్భువ మురుభుజో భుక్త శేషా మభుఙ్త్క,
       శ్రీశై_లాగ్రాత్ప్రభవతి పథి ప్రాప్తపాతాళగంగే
       సోపానాని ప్రమధసదవీ మారురుక్ష శ్చకార. 6

       మాచక్షోణిపతి ర్మహేంద్రమహిమా వేమక్షితీశాగ్రజో
       రామాద్యై స్సదృశో బభూవ సుగుణై స్తన్య త్రయో నందనా8
       కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతిః శ్రీకోమటీంద్ర స్తతో
       నాగక్ష్మాపతి రి త్యుపాత్తవపుషో ధర్మార్థకామా ఇవ. 7
 
       అసూత పుత్రం పెదకోమటీంద్రో విశ్రాణనే కర్ణ మసూత పుత్రం,
       వేమాభిధానం సుగుణై కతానం పాథోనిధిర్నాధమినౌషధీనాం. 8

       ధాటీదుందుభిభాంకృతిం కలయ గో నిర్ఘాతరావం రిపూన్
       నామాని ద్రుత మర్జునస్య జపతో య స్యాజి గాండీవిసః
       సంగ్రామోపపదాని తాని భవతాం రక్షాకృతే సర్వదా
       వర్థ్యంతామితి బోధయం త్య... ధీయంత్రినో మంత్రిణః 9

          శ్రీశైలే స్థిరమూలతా ముపగతా వృద్ధిం కుమారాచలే
          పంచారామతలే ప్రతాపసుషమా సింహాచలేంద్రే తతః,
          శ్రీకూర్మే పురుషోత్తమే క సుమితా యద్దర్మకీర్త్యోర్ల తా
          కాశ్యాం విశ్వపతేః పుర8 ఫలవతీ నిత్యోపహారోచితం.

          అభిమన్యుకరగ్రాహ్యాముత్తరాం ఖడ్గపుత్రికాం
          నర్తయ త్యాహవే రంగే య8 సంగ్రామధనంజయః. 1

          అశ్రాంతం గృహరాజసౌధనివసల్లక్ష్మీకరాభ్యంతర
          క్రీడాంభోరుహతాలవృంతనటనప్రస్తావవిస్తారిత8,
          వాయుః కేసరవాసనాసురభితో య స్యార్థిచింతామణే
          ర్ద్రా గాచామతి దాన కేళిజనితం స్వేదాంభసాం జాలకం.

          సప్త సంతానవ త్యాసీ ద్యేవ సర్వంసహేత్యలం,
          స్పర్ధయేవ ధృతాః కీర్తా గర్బే లోకా శ్చతుర్దశ
          రాజ్ఞ స్తస్య మహాదేవీ రాజమౌళే రివాంబికా
          రత్నసింహాసన స్యార్థే రాజతే సూరమాంబికా
          శాకాబ్దే శశిరామరామధరణీ సంఖ్యే విరోధ్యాహ్వయే
          వర్షే ఫాల్గునామ్ని మాసి బహుళే పక్షే ద్వితీయాతిథౌ
          దేవీ సొ పెదకోమటీశ్వరభువః శ్రీవేమపృధ్వీపతేః
          శ్రీ సంతానపయోనిధేః కృతవతీ సమ్యక్ప్రతిష్ఠావిధిం.
          లీలాలీఢతరంగశీకరకణం రాకావిధౌ రంకుణా
          హేరంబేణ మదోష్మశాంతివిధయే హేలావగాఢం ముహుః
          రాజీవాసనరథ్యహంసపరిషచ్చంచూపుటీ చర్విత
          స్వచ్ఛాంభోజ మృణాళికాకిసలయచ్ఛేదం యదీయం పయనః
          ఘొంటాకంఠకఠోరగర్భకుహళీపాళీమధూశీరస
          స్రోతస్సౌరభటీకమానమధులిడ్ఝంకారకోలాహలైః
          వాచాలాని వనాని యస్య సవిధే సో౽యం సుధానిరః
          శ్రీసంతానసముద్ర ఏష పయసాం రాః ర్జను...త్యప్త..

       వైడూర్యరత్నశకలామల వారిపూరే
        మంక్తుం కిమత్ర భగవా న్మధుకై టభారిః,
        ఆంగీచకార గజతా మవనచ్ఛలేన
        ...... నవరాహమహావతారాన్

        శ్రీమహాభారతే. 18

        దేవా మనుష్యాః పితరో గంధర్వోరగరాక్షసాః,
        స్థావరాణి చ భూతాని సంశ్రయంతి జలాశయం. 19
        తటాకే యస్య గావస్తు పిబంతి తృషితాం జలం
        మృగపక్షి మనుష్యాశ్చ సో౽శ్వమేధఫలం లభేత్ 20
        ఆస్పోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః
        అపి నః సకులే జాతో య స్తటాకం కరిష్యతి. 21
        విద్యాధికారీ శ్రీనాథో వీరశ్రీవేమభూపతేః,
        ఆకరో దాకరో వాచాం నిర్మలం ధర్మశాసనం. 22

    సీ. శాకాబ్దములు సహస్రమును మున్నూటము
                        ప్పదియొక్కఁడును నైన భవ్యసంఖ్య
        వఱలు విరోధిసంవత్సరంబున ఫాల్గు
                        నంబున బహుళపక్షంబు విదియ
        శుక్రవారంబున శుభముహూర్తంబున
                        శ్రీధాన్యవాటీపురాధిపతియుఁ
        కృష్ణవేణ్ణాజలక్రీడావినోదుండు
                        నగు గన్నభూపాలుననుఁగుఁబుత్రి

        వీరనారాయణుఁడు వేమవిభునిదేవి
        భూరిసద్గుణనికురుంబ సూరమాంబ
        జగము వినుతింప సంతానసాగరాఖ్య
        వరతటాక ప్రతిష్ఠోత్సవం బొనర్చె.

      సీ. జాహ్నవీయమునాది సకలపావననదీ
                         విమలతీర్థాంఃభ పవిత్రితంబు
          సవిధ దేశస్థాయి శివమౌళిబాలేందు
                         కామినీసంపుల్లకైరవంబు
          బహుమహాపరివాహపాథోభరద్ఘన
                         ఘుమఘుమాయితదిశాగోళకంబు
          జలసారణి నేకసంవర్ధితానేక
                         వనివినీతాధ్వగాధ్వశ్రమంబు

          బలవదురుమత్స్యకచ్చపఢుళికుళీర
          తిమితిమింగిల విక్రమక్రమవిహార
          తరళతరతుంగభంగ కదంబచుంబి
          తాభ్రవీథి సంతాన మహాపయోధి.

     సీ. కపటసూకరమైన కైటభానురవైరి
                         ఖురపుటంబులC బరిక్షుణ్ణమయ్యె
          రఘుకులోద్వహధనుర్యంత్రముక్తము లైన
                         చిచ్చుఱమ్ముల వేఁడిఁ జేవ దఱిగె
          గుంభసంభవుని హస్తాంభోరుహంబున
                         నాపోసనం బయి హ్రాస మొందెఁ
          బాషాణముల నచ్చభల్లగోలాంగూల
                         కపియూథములచేతఁ గట్టుపడియె

          వనధి యే భంగి సరివచ్చు ననఁగ వచ్చు
          నారసాతలగంభీరవారి యగుచు
          నపగతాపాయ మగుచు శోభాఢ్య మగుచు
          ననుపమం బైన సంతానవనధితోడ.

శ్రీనాధవిరచిత మైన రెండవ శాసనము ఫిరంగిపురమున కంటియున్న యమీనాబాదు గ్రామసమీపమునందున్న యొక గుట్టఁమీదఁ జెక్కఁబడియున్న శిలా శాసనము. అందుచేత దీని నమీనాబాదుశాసనమందురు. ఈ శాసనము సంతానసాగరమను పూర్వోక్తతటాకముసకు నీరు వచ్చుటకయి జగనొబ్బ గండకాలువ యను పేరితో 1332-వ శకవర్షముసకు సరియైన మన్మథ సంవత్సర మాఘశుద్దపూర్ణిమనాఁడు సూరాంబయెుక్కయుఁ, బెదకోమటి వేమభూపాలునియొక్కయు కుమారుఁడైన రాచవేమారెడ్డి త్రవ్వించి ప్రతిష్టించిన సందర్భమునఁ జెక్కింపఁబడినది. ఈకాలువ త్రవ్వించిన కాలము క్రీస్తు శకము 1416 అగును, ఈ కాలమునాటికి గోమటివేమారెడ్డి జీవించియే యుండెను. అతఁడు జీవించియుండఁగానే యీ కాలువ యేల కొడుకు పేరఁ ద్రవ్వింపఁబడెనో తెలియకున్నది. ఆ సంవత్సరమునఁ గాటయవేమారెడ్డి మృతినొందఁగా రాజమహేంద్రవరరాజ్యము నాక్రమించుటకయి పెద్ద కోమటివేమభూపాలుఁడు దండెత్తి పోయినప్పడు కొండవీటి పాలనమునకు రాజ వేమారెడ్డిని నియమించి యుండును. పెదకోమటివేమభూపాలుఁడు రాజమహేంద్రవరరాజ్యసంపాదన ప్రయత్నమునందు లబ్దమనోరధుఁడు గాక యల్లాడ రెడ్డిచేత నపజితుఁడయి, హతశేష సైన్యముతో నిజరాజదానిని మరలవలసినవాఁ డయ్యెను. కొండవీటిరెడ్డిరాజులకు జగనొబ్పగండబిరుద ముండెను దానికి జగదేకవీరుఁడని యర్ధము. అందుచేతనే కాలువకు జగనొబ్బగండకాలువ యని పేరు పెట్టఁబడెను, శ్రీనాథకవివిరచిత మయిన యీ శాసనము నిందు క్రిందఁ బొందు పఱచుచున్నాసు.

              సీ. శాకాబ్దములు సహస్రంబును మున్నూట
                             ముప్పదియేడును నొప్పు మిగుల
                  మహనీయమైన మన్మథవత్సరంబున
                             మాఘమాసముగపూఁర్ణిమాదినమున
                  హేమాద్రిదానచింతామణి యరిరాయ
                       బసవశంకరుఁ డాజిఫల్గుణుండు

              సమదారిరాయవేశ్యాభుజంగుండు వే
                         మయరాచవేమనక్ష్మావరుండు

              తల్లి సూరాంబచే సముత్పన్న మగుచుఁ
              బరఁగు సంతానవార్థి వరుసగాఁగ
              నొలయు గిరివాహినుల జగనొబ్బగండ
              కాలువ ఘటించె నా తారకంబుగాఁగ. "శ్రీనాధకృతి"

ఈ రెండు శాసనములకును నడిమికాలములో శ్రీనాథునిచే రచియింపఁబడిన తామ్ర శాసన మొకటి కనఁబడుచున్నది. దాని నాలపాడు శాసనమందురు . అది 1413-వ సంవత్సరము న రచియింపఁబడినది. ఆ తామ్ర శాసనము నిందు క్రిందఁ బొందుపరుచుచున్నాను.

          శ్లో. కళ్యాణం జగతాం తనోతు స విధుః కాదంబినీ మేచకః
             క్రీడాక్రోడతనుః పయోధిపయసో విశ్వంభరా ముద్వహన్,
             భారాపేతఫణావివర్తనవశా న్మోదాయ యస్యాభవ
             న్నిర్యత్నా భుజగేంద్రమౌళిమణిభి ర్నీ రాజనప్రక్రియా. 1

             లీలాద్యూతజితాం కళాధరకళాం మౌళౌ దృఢం కీలితా
             మాహర్తుం యుగ మున్నమయ్య భుజయో ర్విక్లేశ యంత్యా మిధ8,
             పార్వత్యాః కుచకుంభపార్శ్వయుగళే సుప్రేమలోలేక్షణః,
             కాలక్షేపణ మిందు మోచనవిధౌ కాంక్షన్ శివః పాతునః 2

             భవతు భవతాం ఫలాప్యై కల్పలతా కాపి కరటిరాజముఖీ,
             మధుర సుధారసధారామధులవలలితేందుమంజరీమంజుః. 3

             తమో హరేతాం తవ పుష్పవంతౌ
             రాకాసు పూర్వాపరశైలభాజౌ

   
         రథాంగలీలా మివ దర్శయంతౌ
         పురా పురారేః పృథివీరథస్య
         యన్మౌళౌ నిహితం చిరాయ నిగమై ర్ధ్యేయం చ యద్యోగిభిః
         యల్లక్ష్మీమృదుపాణిపద్మయుగళీసంవాహనైర్లాలితం
         జాతా యత్ర వియన్నదీ త్రిజగతీసంతాపనిర్వాఫణీ
         తస్మాత్కంసభిదః పథా దుదభవ ద్వర్ణో గుణార్ణోనిధిః 5
        
        తస్మా దభూత్ ప్రేలయవేమనామా
        శ్రీశైలసోపానవిధాన శాలీ,
        హేమాద్రికల్పోదిత దానదక్షో
        నిస్సీమభూదాననిరూడకీర్తిః. 6
        
        వేమక్షితీశో వృష మేకపాదం
        ఖంజప్రచారం కలికాలదోషాత్,
        దత్తాగ్రహారద్విజ వేదశక్త్యా
        పద క్రమై రస్ఖలితం చకార 7

        మాచక్షోణిపతి ర్మహేంద్రమహియా వేమక్షితీశాగ్ర జో
        రామాద్యై స్సదృశో బభూవ సుగుణై స్తస్య త్రయో నందనాః,
        కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతిః శ్రీకోమటీంద్ర స్తతో
        నాగక్ష్మాపతి రిత్యుపాత్తవపుషో ధర్యార్థకామా ఇవ 8

        వేమాధిపో మాచవిభు శ్చ నందనౌ
        శ్రీకోమటీంద్రస్య గుణై కసంశ్రయౌ,
        భూలోక మేకోదరజన్మవాంఛయా
        భూయో౽వతీర్ణా వివ రామలక్ష్మణౌ. 9
 
        చూడామణి ర్నృపాణాం దుర్మదపరిపంథిశిఖరిదంభోళిః
        సర్వజ్ఞ చక్రవర్తీ పెదకోమటివేమభూపతి ర్జయతి. 10

        సో౽యం వేమమహీపాలో భూపాలపరమేశ్వరః

       భూదానవీరమూర్ధన్యో ధీరోదాత్తగుణోత్తరః 11

        శ్రీశాకాబ్దే పయోరాశిరామరామేందుసమ్మితే
        నందనే మాసి మాఘాఖ్యే శివరాత్య్రాం రవిగ్రహే 12

        పితః పితామహో యస్య మహనీయయశోనిధిః,
        మాధవో నామ మేధావీ విశ్వవిద్యావిహారభూః 13

        పితామహో మహావిద్వాన్ యస్య శ్రీగుండయాభిదః,
        వేదాదీనాం విశుద్దానాం విద్యానాం జన్మమందిరం. 14

        శాపానుగ్రహదక్షో లక్ష్మీనరసింహమంత్రసంసిద్ధః,
        సకలకవిసార్వభౌమో మాధవభట్టః పితా యస్య 15

        శ్రీవిశ్వేశ్వరవిదుషే భారద్వాజాన్వయావతంసాయ,
        స్మయవిరహితాయ తస్మై విద్యావినయాన్వితాయ పుణ్యాయ. 16

        ప్రదా త్త్రిలింగవిషయే వెలనాcడౌ మనోరమే,
        తుంగభద్రాతరంగిణ్యాs ప్రాక్తీరే పర్యవస్థితం. 17

        ఆలపాడు రితి ఖ్యాతం గ్రామ మాచంద్రతారకం,
        సాష్టైశ్వర్యం హృష్టభోగం ధారాపూర్వం ధరాధిపః. 18

ఈదానశాసనము శాలివాహనశకము 1335 నందనసంవత్సర మాఘమాసము శివరాత్రినాఁ డనఁగా 1413-వ సంవత్సరము జనేవరు నెల 31 వ తేదీని భారద్వాజగోత్రుఁ డైన విశ్వేశ్వర పండితునకు వెలనాటిసీమలో తుంగభదా తీరమునందుండిన యాలపాడు గ్రామము నగ్రహారముగా నిచ్చిన సందర్భమున వ్రాయబడినది. పయి మూఁడు శాసనములను గాక శ్రీనాథవిరచిత మయినది పొన్నుపల్లి శాసనమనఁబడెడి యింకొక తామ్రశాసనము కూడఁ గానబడుచున్నది. పొన్నుపల్లి గ్రామము గుంటూరు మండలమునందలి రేపల్లెతాలూకాలోనిది. ఈ శాసనములోని మొదటి పది శ్లోకములను సరిగా ఇలపాడు శాసనములో నుండినవే.

        శ్లో. యత్కీర్తిగానసమయే ఫణిసుందరీణా
            మాలోకితం చ ముఖరాగ మనంగమూలం,
            శ్రోతుం చ గీతరచనాం యుగప న్న దక్షో
            నాగాధిపో న సహతే నయన శ్రుతిత్వం. 11

అను పదునొకండవ శ్లోకము క్రొత్తది. పండ్రెండవ శ్లోకము వెనుకటి శాసనములో నుండినదే. దాని తరువాతి శ్లోకములు ప్రత్యేకముగా నీ శాసనముతో సంబంధించినవి.

        శ్లో. సో౽యం వేమమహీపాలో భూపాలపరమేశ్వరః,
           భూదానవీరమూర్ధన్యో ధీరోదాత్తగుణోత్తరః. 12

           ఖరామరామేందుమితే శాకాబ్దే సర్వధారిణే,
           ఉపరక్తే సహస్రాంశౌ మానే చాశ్వయుజాహ్వయే. 13

           నప్త్రే శ్రీ పేర్య పేళ్ళస్య కళ్యాణగుణశాలినః
           అకర్తృకాణాం సాంగానాం మధ్యానాం వచసా న్నిధేః 14

           శ్రీభట్టభాస్కరార్యస్య పౌత్రాయ బ్రహ్మవాదినే,
           అష్టాదశానాం విద్యానాం మధ్వన్యస్య మహావసోః 15

           పుత్రాయ విర్లయార్యస్య వేదవేదాంగవేదినః
           ఆయుర్వేదం చ సాష్టాంంగ నిర్నిరోధమధీతినః. 16
 
           ఫణిరాజమహాభాష్యఫక్కికాపరమేష్టినే,
           కర్మబ్రహ్మపరామర్శ మీమాంసామాంసలాత్కనే 17

         కణభుగ్గ్రంధితగ్రంధసింథుమంథానభూభ్య
          అక్షపాదమతప్రేక్షపక్షిణీకృతచేతసే 18

          తస్మై కాశ్యపగోత్రాయ సింగనార్యాయ ధీమతే,
          శాంతాయ శివ భక్తాయ యజ రామ్నాయ వేదినే. 19

          ప్రాదా త్త్రిలిం విషయే వెల్నాడో ర్దివిసీమని,
          కృష్ణవేణ్యా స్తరంగిణ్యాః ప్రతీరే పర్యవస్థితం. 20

          పొన్నుపల్ల్యాహ్వయం గ్రామం నిధానం సర్వసంపదాం,
          సాష్టైశ్వర్యం సాష్టభోగం ధారాపూర్వం ధరాధిపః. 21

          అస్య గ్రామస్య చిహ్నాని దేశభాషయా లిఖ్యంతే

          ***** ***** *****

         శ్రీనాథ భట్ట శాసనాచార్య దక్షిణ భాగం వకటి.

                          **********

      శ్లో. విద్యాధికారీ శ్రీనాధో వీరశ్రీవేమభూపతేః
          అకరో దాకరో వాచాం నిర్మలం ధర్మశాసనం.

ఈ శాసనము శాకాబ్దములు 1330 సర్వధారి సంవత్సరాశ్వయుజ మాసము నందు సంభవించిన సూర్యోపరాగసమయమున ననఁగా క్రీస్తు శకము 1408-వ సంవత్సరములో వైద్యశిఖామణియు, మహావిద్వాంసుఁడు నైన సింగరార్యునకు వెల్నాటిసీమలో కృష్ణాతీరమునం దుండిన పొన్నుపల్లి గ్రామమును దాన మిచ్చిన సందర్భమున వ్రాయcబడినది. "శ్రీనాథ భట్ట శాసనాచార్య దక్షిణ-భాగం వకటి" అని శాసనాంతమునం దుండినందున శ్రీనాధున కీగ్రామములో నికొకభాగ మియ్యఁబడినట్టు కనుపట్టుచున్నది. పూర్వోదాహృతములై యీ నాలుగు శాసనములలో నీ పొన్నుపల్లి శాస నమే మొట్టమొదటిది. దీనినిబట్టి శ్రీనాధుఁడు 1408-వ సంవత్సరమునకుఁ బూర్వమునందే విద్యాధికారిగా నియమింపబడినట్టు స్పష్టపడుచున్నది.

ఈ నాలుగు శాసనములను దప్ప శ్రీనాధుఁడు "పెదకోమటి వేమారెడ్డి కొండవీటిరాజ్యపరిపాలనము చేసిన యిరువది సంవత్సరములలోను వేఱు గ్రంథ మేదియుఁ జేసినట్టు కానఁబడదు. చేసినచో శృంగారదీపికనుగూడ చేసియుండవచ్చును. అమరుకవ్యాఖ్య యైన శృంగారదీపికలోని మొదటి యెనిమిది శ్లోకములు నిట్లున్నవి.

1. శ్లో. విశంకటకటస్థలీగళదమందదానస్పృహా
       భ్రమద్భ్రమరకాకలీకలితనిత్యకర్ణోత్సవమ్.
       ప్రణమ్రజనమస్తక ప్రకటడిండిమాడంబరం
       ముఖే గజ ముపాస్మహే వపుషి మానుషం దైవతమ్.

2. అన్యోన్యమేళనవశాత్ ప్రధమం ప్రవృద్దం
       మధ్యే మనా గ్వ్యవహితం చ కుతో౽పి హేతోః
       ప్రాప్తం దశా మధ మనోరధలాభయోగ్యాం
       పాయాచ్ఛిరం రతిమనోభవయో స్సుఖం వః

3. రాజ్యం వేమ స్స చిర మకరోత్ ప్రాజ్య హేమాద్రిదానో
       భూమీదేవై ర్భువమురుభుజో భుక్తశేషా మభుంక్త,
       శ్రీశైలాగ్రాత్ ప్రభవతి పథి ప్రాప్తపాతాళగంగా
       సోపానాని ప్రమథపదవీ మారురుక్ష శ్చకార.

4. మాచక్షోణిపతి ర్మహేంద్రవిభవో వేమక్షితీశాగ్రజో
       హేమాద్రే స్సదృశో బభూవ సుగుణైస్తస్య త్రయో నందనాః
       కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతి శ్రీ కోమటీంద్ర స్తతో
       నాగక్ష్మాపతి దిత్యుపాత్తవపుషో ధర్మార్ధకామా ఇవ.

5. వేమాధిపో మాచవిభుశ్చ నందనౌ
     శ్రీకోమటీంద్రన్య గుణై కసంశ్రయౌ ?
     భూలోక మేకోదరజన్మవాంఛయా
     భూ౽యోవతీర్ణావివ రామలక్ష్మణౌౌ.

6. స వేమభూప స్సకలాసు విద్యా స్వతి ప్రగల్ఫో జగసబ్పగండ8,
     కచిదాస్థానగతః కవీనాం కావ్యామృతాస్వాదనతత్పరో౽భూత్.

7. అమరుకకవినా రచితాం శృంగారరసాత్మికాం శతశ్లోకీమ్,
     శ్రుత్వా వికసితచేతా స్తదభిప్రాయం ప్రకాశతాం నేతుమ్.

8. మూలశ్లోకాన్ సమాహృత్య ప్రక్షిపాన్పరిహృత్య చ,
     విధత్తే విదుషామిష్టాం టీకాం శృంగారదీపికామ్

9. అవతారో౽థ సంబంధో౽భి ప్రాయో భావలక్షణమ్,
     నాయికా తదవస్థా శ్చ నాయక శ్చ తధా రసః

10. అంగాని కైశికీ వృత్తే రలంకార స్తతః క్రమాత్,
     ఇత్యేతాని ప్రవక్ష్యంతే యధాసంభవ మంజసా.

పుస్తకాంతమునందీ గద్యమున్నది.

"ఇతి శ్రీవీరనారాయణ సకలవిద్యావిశారద పెద్దకోమటివేమభూపాల విరచితా శృంగారదీపికాఖ్యా అమరుకవ్యాఖ్యా సమాప్తా."

ఈ శృంగారదీపికయందలి 4, 5 పద్యములు శ్రీనాధుని శాసనములలోనివి. ఈ పుస్తకము శ్రీనాధకృత మనుట కీ రెండు శ్లోకములే యాధారములు. 1400-వ సంవత్సరము మొదలుకొని 1420-వ సంవత్సరము వఱకును మహాకవి యైన శ్రీనాధుఁ డొక్క గ్రంధమునై నను జేయక యూరకుండఁ జాలఁడు. ఇట్లు వృధపుచ్చఁబడిన దనుకొన్న కాలమిరువది సంవత్సరములే యననేల ? ఇరువదినాలుగు సంవత్సరములు కావచ్చును. శ్రీనాథుడు విధ్యాధికారిగా నున్న కాలము పెదకోమటివేమన రాజ్యకాలము మాత్రమే కాక యాతని కుమారుఁడైన రాచవేమనరాజ్యకాలముకూడ నయి యున్నది. 1400-వ సంవత్సరము మొదలుకొని 1420-వ సంవత్సరమువఱకును పెదకోమటివేమనయు, 1420 నుండి నాలుగు సంవత్సరములు రాచవేమనయు భూమిపాలనము చేసిరని కొందఱును, రాచవేమని నాలుగు సంవత్సరములును 1424-వఱకును గాక తండ్రి రాజ్యకాలమని చెప్పఁబడెడి దానిలోఁ గడపటి నాలుగు సంవత్సరములే యయి 1420-వ సంవత్సరము వఱకు మాత్రమేయనియు 1420-వ సంవత్సర ప్రాంతమునందే కొండవీటిరెడ్డిరాజ్యము కర్ణాటప్రభువుల పాలయ్యెనని కొందఱును శాసనసంశోధకులు చెప్పుచున్నారు. ఎట్లయినను వింశతిదీర్ఘసంవత్సరములు నిరర్గళకవితా ధార గల కవిచేతి లేఖినియు సనల్పకల్పనసమర్ధమైన బుద్దియు స్వసామర్థ్యమును మఱచి యస్వాభావికనిద్రను వహించుట సంభావ్యము కాదు. అందుచేత శీనాథుఁ డీ కాలములో నేదో మహాగ్రంథమును రచించుచుండియుండవలెను. ఆ మహా గ్రంథము శివరాత్రిమాహాత్మ్య మని తోఁచుచున్నది. * [15]శ్రీనాధుఁడు దీనిని తన ప్రభువై న పెదకోమటివేమవిభున కంకితము చేయ వలెనని యుద్దేశించి యుండును. కాని యింతలోపల కొండవీటిరాజ్య మన్యా క్రాంత మగుటయు, దనాకాశ్రయులైన వేమనృపాలసింగనామాత్యాదులు పరలోకగతులగుటయుఁ దటస్థిం చినందున శ్రీనాథ మహాకవి రాజధాని యైన కొండవీటియందు నిలువ నాధారము లేక తన గ్రంథపరికరములతో నా వీడు విడిచి దేశాంతరగమనమనోన్ముఖుఁడయి 1420-వ సంవత్సర ప్రాంతముల యందు ముంుదగా స్వార్ధమును తీర్ణముగలిసివచ్చునట్లుగా శ్రిశైలయాత్రకు వెడలెను. దక్షిణ హిందూస్థానములో వైష్ణవులకు విష్ణస్థలమయిన చిత్తూరు మండలములోని తిరుమల యెట్లు ముఖ్య స్థలమో యట్లే శై_వులకు శివస్థల మయిన కర్నూలు మండలములోని శ్రీశై_లము ముఖ్యస్థలము. ఒకటి సంస్కృతముగాను, రెండవది యఱవముగాను నున్నను శ్రీశైలము తిరు మల యను రెండు పదములకు నర్థ మొక్కటియే. రెంటికిని పవిత్రమైన పర్వతమని యర్ధము శ్రీశై_లస్థలాధిదేవతలు మల్లికార్జునుఁడును భ్రమరాంబయు నయి యున్నారు.అట్టి పుణ్యస్థలమయిన శ్రీశైలదివ్యక్షేత్రమునకు కొండవీటిరెడ్డిరాజ్యనాశనానంతరమున శ్రీనాధుఁడు యాత్రకుఁ బోయి దేవతా దర్శనముఁ జేయుటయేకాక యచ్చట మరాధికారు లయి యుపడిన జంగమ గురుపీఠమువారి దర్శనము చేసి వారి యనుగ్రహమసకుఁ బాత్రుఁడయి తాను రచించిన శివరాత్రి మాహాత్మ్యమును ముమ్మయపుత్రుడై_న శాంతయ్య కంకితమొనర్చెను. ఈ శివరాత్రిమాహాత్మ్యమును ఆంధ్రసాహిత్య బరిషత్తు వారు సంపాదించి తమ గ్రంథాలయమునందుంచియున్నారు. వారియొద్ద నున్న తాళపత్రపుస్తకము పురాతనమయి కొంతవఱకు భాణనామకక్రిములకాహారమయి మిక్కిలి శిథిలమయి యున్నది. ఆ పుస్తకములోని మొదటి పద్యములోని మొదటి పాదమే మొదలు చెడి యిట్లున్నది.

శా. ..................................వాశ్రితోర స్థ్సలీ
    నాగాధీశవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ
    ప్రాగాల్భ్యుం డగు శంకరుండు మనుచుం బ్రత్యక్షమై యెప్పడున్
    యోగీంద్రాఖ్యుని ముమ్మడీంద్రసుతు నయ్యుద్యుక్తశాంతాత్మునిన్.

శివరాత్రిమాహాత్మ్యములోని రెండవ పద్య మిది

శా. శ్రీరామారమణుం డశేషజగతీ క్షేమంకర ప్రక్రియా
    భారాయత్తమనస్కుఁ డార్యజనసంభావ్యుండు భవ్యాత్ముఁడై
    గారా మారఁగ నొమ్మమాంబికసుతున్ గౌరీశభక్తాగ్రణిన్
    ధీరున్ మమ్మయశాంతునిన్ మనుచు సందీర్ఘాయురర్జాడ్యుఁగన్

"స్వస్తిశ్రీపర్వత స్వయంభూశ్రీలింగచక్రవర్తి శ్రీమల్లికార్డున శ్రీమహాదేవుని ముఖమండపంబున సుఖాసీను లయి........................... బలసి యుండ శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుఁడు శివకథావిధానంబులఁ బ్రొద్దులు పుచ్చుచుఁ దన మూలభృత్యుండగు పువ్వుల ముమ్మదేవయ్య శాంతునిం గనుంగొని నీపేరన.... కవిత్వంబున నీకధ యుపన్యసింప నగునన మహాప్రసాదం బని సత్కవిసార్వభౌముcడగు శ్రీనాధకవివరేణ్యుని "కృపావిశేషంబున” వీ శివరాత్రి మాహాత్మ్యము చెప్పఁబడె నని పుస్తకమునందు వ్రాయఁబడినది. శ్రీశాంతభిక్షావృత్తి యతీశ్వరుని మూలభృత్యుఁడగు పువ్వుల శాంతయ్య కీ కృతి యియ్యఁబడినట్లు పయి వాక్యములవలన విదితమగుచున్నది. కృతిపతి యైన శాంతయ్యతండ్రి ముమ్మడి దేవయ్య; తల్లి యొమ్మమాంబ, వీ రిరువురు శివరాత్రిమాహాత్మ్యమునందిట్లు వర్ణింపఁబడిరి.

       సీ. పంచాక్షరీ మంత్రపారిజాతోద్భూత
                  ఫలము లే గురువు సంభాషణములు
          వీరశైవాచార విమలమార్గానూన
                  శాశ్వతం బే గురుస్వామి మహిమ
          నిఖిల దేవాధీశనివహ ప్రమేయక
                  పాత్ర మే గురుమూర్తి పాదయుగళి
          శంకరపూజాప్రశస్త దీక్షాజనా
                  హ్లాద మే గురువు హస్తాంబుజాత

          మనఁగఁ బండితచెనమల్లి కార్జునునకు
          బౌత్రరత్నంబు సెట్టియప్రభుసుతుండు
          మారమాంబా తనూజుండు మహితయశుఁడు
          వెలయు మమ్మిడి దేవయ వినుతకీర్తి.

      సీ. పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ
                  గౌరి కాఁటోలు నీ కాంత తలఁప
          సకలసంపత్స్ఫూర్తిచాతుర్యమహిమల
                  నిందిర కాఁబోలు నిందువదన

         సకలవిద్యాప్రౌఢి సడిసన్నగరిమల
                       భారతి కాఁబోలు భామ యెపుడు
          సర్వలక్షణ సంపన్నతోన్నతి ,
                       నింద్రాణి కాఁబోలు నిగురుబోఁడి

          యనఁగ నిద్ధాత్రి నేపొద్దు నతిశయిల్లెఁ
          బరఁగ ముమ్మిడి దేవయ్యభామ జగతిఁ
          గామితార్ధకసంధానకల్పవల్లి
          యుజ్జ్వలద్గుణ నికురుంబ యొమ్మమాంబ.

అటు తర్వాత నీ దంపతుల పుత్రుఁడు కృతిపతియైస శాంతయ్య యిట్లభి వర్ణింపఁబడెను.

      సీ. పరవాదిమత్తేభపంచాననాఖ్యుండు
                         పరవాదిమండూకపన్నగుండు
         పరవాదినవమేఘపవమానధీరుండు
                         పరవాదిసాగరబాడబుండు
         పరవాదిచయకుత్కీలభాసురదంభోళి
                         పరవాదికేంధనపావకుండు
         పరవాదిచయతమ8పటలోగ్రభానుండు
                         పరవాది భోగిసుపర్ణుఁ డనఁగఁ

         జటులజైనకోలాహలసమరబిరుద
         ఘనుఁడు సంగ్రామపార్డుండు వినుతయశుడు
         శుభుఁడు ముమ్మిడి దేవయ్యసుతుఁ డనంగ
         వెలసె శాంతయ్య విక్రమవీర వరుఁడు.

      గీ. వేఁడెఁ గవిసార్వభౌముని విమలచరితు
         స్కాందపౌరాణికము లైన కధలలోన
         ఘనత శివరాత్రిచరితంబు తెనుఁగు గాఁగఁ
         గరుణజేయుము శ్రీనాధ కవివరేణ్య.

వ. అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుండు మారయామాత్యపుత్రుండు శ్రీనాథకవివరేణ్యుండు సంతుష్ట మానసుండై శాంతస్వామి యొసంగిన కర్పూరతాంబూలజాంబూనదా భరణంబుల నంగీకరించి స్కాందపురాణంబున సీశానసంహితఁ .... జెప్పంబడ్డ . శివరాత్రిమాహాత్మ్యంబు.........."

* * * *

      
       క. వరముమ్మయశాంతునకున్
          బరమపరజ్ఞాననిధికిఁ భావనమతికిన్
          నిరుపమ విక్రమయశునకుఁ
          గరుణారసపూరితాత్మకవితాంగునకున్.

వ. అభ్యుదయపరంపరాభివృద్దియు సత్యధర్మక్రియావృద్దియు నగునట్లష్ణాదశ వర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై యుండ నా రచియింపంబూనిన కధానిధానంబు --- - నా నేర్చిన విధంబున రచియించెద".

అని శ్రీనాధుఁడు గ్రాంధావతారికయందుఁ జెప్పెను. ఆ వఱకుఁ దాను గోమటివేమనృపాలుని జీవితకాలములోనే రచియించుచుండిన గ్రంథమునే యవశిష్టమును ముగించి యవతారికను వ్రాసి యాశ్వాసాద్యంత పద్యములను జేసి శ్రీశైలయాత్రాసమయమునం దర్హసంభావనమును బడసి శ్రీనాధుఁడీ శివరాత్రిమాహాత్మ్యమహాకావ్యమును మహాధనసంపన్నుఁడైన ముమ్మడి శాంతయ్య కంకిత మొనర్చినట్లు తోఁచుచున్నది. ఈ గ్రంథము 1424 సంవత్సర ప్రాంతమునందు సంపూర్తి చేయఁబడి యుండును.

ఇట్లు శ్రీశైలయాత్ర వలన తీర్థమును స్వార్ధమును గలిసి వచ్చి యభిమతార్థ సిద్ధి యయినతరువాత శ్రీనాధుఁ డక్కడనుండి వెలువడి ధనాగమసమ్మాన సముపార్జనార్థమయి స్థలాంతరాన్వేషణము చేసికొనవలసినవాఁ డయ్యెను. ఎంతటి సమర్థుడయినను రాజాశ్రయము లేనిచోట చిరకాలము నిలిచిన యెడల ధనాగమముగాని గౌరవముగాని తగినంత యుండదు. అందుచేత నాతఁ డిప్పుడు రాజాశ్రయము లభింపఁగల స్థల మేదో యొకటి చూచుకొని యచ్చటికిఁ బోవలెను. దేశాభిమానముచేత స్వస్థలమయిన కొండవీటిసీమకు మరలఁ బోఁదలచినచో నా దేశము శత్రుభూక్రాంతమయి రాజులేని భూమియైనది. ఇఁక నప్పుడు ప్రబలమయి యుండిన రెండవ రెడ్డిరాజ్యమైన రాజమహేంద్రవరమునకుఁ బోవలె నన్నచో దానిని పాలించుచుండిన రెడ్డి రాజులు తన కేలికయయి యుండిన పెదకోమటి వేమభూపాలునితోఁ బోరాడి కష్టములపాలయిన యాతని గర్భశత్రువులయి యుండిరి. ఒకవేళ సాహసముచేసి పోయినను వారు తమ శత్రురాజుయొక్క కవీశ్వరు నాదరించి గౌరవింతు రనుట యసంభావ్యము. ఈ హేతువులచేత శ్రీనాథుఁడా కాలము నందు మహాబలిష్టమయి యుండిన కర్ణాటరాజధానికిఁ బోవలసినవాఁడయ్యెను. కర్ణాటక రాజ్య మా కాలమందు ప్రౌఢదేవరాయలచేతఁ బాలింపఁబడు చుండెను. అతఁడు 1423-వ సంవత్సరమునందు సింహాసనమెక్కి 1443-వ సంవత్సరమువఱకును రాజ్యపరిపాలనము చేసెను.

శ్రీనాథకవీంద్రుఁడు కర్ణాటరాజ్యరాజధానికిఁ బోయినప్పుడు డాతని కొక పట్టున రాజదర్శనము లభించినది కాదు. సాధారణముగా పండితు లన్యోన్య మాత్సర్యము గలవారగుటచేత కొత్తగా విదేశమునుండివచ్చిన విద్వాంసునకు భగీరథ ప్రయత్నముమీఁదఁ గాని రాజసందర్శనము కానియ్యరు. రాజసేవకుల నాశ్రయించి ముందుగా వారిని సంతోషపెట్టి, వారి యనుగ్రహమును సంపాదించువఱకును వారు సహిత మభినవాగతుల కనేకములైన ప్రతిబంధములను గల్పించుచుందురు. అందుచేత శ్రీనాథుఁడు రాజసందర్శన మగుటకు ముందా పురమునందు పూఁటకూటి యిండ్లలో వేళగాని వేళలో నపాత్రపు భోజనములు చేయుచు నోట మెతుకులు పడఁగానే యంగిలు తొడిగి, కుళ్ళాయలు పెట్టి తెల్లబట్టలు కట్టి ప్రతిదినమును రాజాస్థానమునకుఁ బోయి రాజసేవకుల ననుసరించుచు బహుదినములు పరదేశములు కష్టపడ వలసినవాఁడయ్యెను. ఆ సమయములో విసుగుచెంది కవిచెప్పిన పద్య మును చూడుcడు.

       శా. కుళ్ళా పెట్టితిఁ గోక చుట్టితి మహాకూర్పాసమం దొడ్గితిన్
           వెల్లుల్లి దిలపిష్టము న్మెసవితిన్ విశ్వస్త వడ్డింపగాఁ
           జల్లా యంబలి ద్రావితిన్ రుచుల దోసం బంచుఁ బో నాడితిన్
           దల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి ! దయలేదా ? నేను శ్రీనాథుఁడన్.

పయి పద్యములో "తల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి " యని కర్ణాటక దేశము సంబోధింపఁబడి యుండుటనుబట్టి శ్రీనాధుఁడు కర్ణాట దేశస్థుఁడని యొకానొకరు విషయవిచారము చేయక వ్రాసిరి; గాని యది గ్రాహ్యము కాదు. శ్రీనాధు డెప్పుడును దాను పాకనాఁటి సీమవాఁడ [16] ననియు, కొండవీటివాసుఁడ ననియు, జెప్పుకొనుచుండెను. కర్ణాటక రాజధానియందు రాజసందర్శనము కాకముందో, ప్రధమసందర్శన సమయమునందో మీ వాసస్థల మేది ? యని యడుగఁగా శ్రీనాథుఁడు కొండవీడని యీ క్రింది పద్యముతోఁ జెప్పినట్టు చెప్పుదురు.

      "సీ. పరరాజ్యపరదుర్గపరవై భవశ్రీలఁ
                         గొనకొని విడనాడు కొండవీడు
          పరిపంధిరాజన్యబలముల బంధించు
                         కొమరు మించినబోడు కొండవీడు
          ముగురురాజులకును మోహంబు పట్టించు
                         గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు
          చటులవిక్రమకళాసాహసం బొనరించు
                         కుటిలాత్ములకుఁ గాడు కొండవీడు

            జవనఘోటకసామంతసరసవీర
            భటనటానేకహాటక ప్రకటగంధ
            సింధురారావమోహనశ్రీలఁ దనరు
            కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

ఈ పద్యము కర్ణాటక రాజదర్శనార్థ మరిగినప్పుడు చెప్పఁబడినది కాకపోయినను శ్రీనాధునిచేఁ జెప్పఁబడిన దగుటకు సందేహములేదు. బహుదినములు విజయనగరములోఁ బ్రవాసాయాసము ననుభవించిన తరువాత తుదకు శ్రీనాథునకు రాజ[17]సందర్శనమ యి బహూకరణము జరిగినది. రాజదర్శనము క్రీడాభిరామకర్త యైన వినుకొండవల్లభరాయని నాశ్రయించి నాతని కంకితముగా వల్లభాభ్యుదయమును జేయుటవలన నాతని మూలమున లభించినదని చెప్పుదురు. వల్లభాభ్యుదయమును నేను జూడలేదు. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠికలో "శ్రీనాధుని వల్లభాభ్యుదయములోఁ గృష్ణాతీరమున నుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటె బచ్చిగా నున్నవి...... మఱియు వల్లభాభ్యుదయమున నాంధ్రవల్లభుని తిరునాళ్ళలోని విధవాదుర్వర్తనములు శ్రీనాధుఁడు విశదముగా వర్ణించి యున్నాఁడు . . . . . శ్రీనాథుడు శ్రీకాకుళాధీశ్వరుఁడగు తెలుఁగురాయని దర్శించి యతని కంకితముగా వల్లభాభ్యుదయము చెప్పెనుగదా!" అని వ్రాసి యున్నారు. ఈ వాక్యములనుబట్టి చూఁడగా వల్లభాభ్యుదయము శ్రీకాకుళాంధ్ర దేవుని యుత్సవములలో నడచుచుండెడు విశ్వస్తాదుల దుర్వర్తనాది వర్ణన ములను గలది యనియు, అది యాంధ్రవిష్ణుదేవునికే యంకిత మొనర్పఁబడిన దనియుఁ దెలియవచ్చుచున్నది.[18] ఎవరి యనుగ్రహమువలననైన నేమి ? శ్రీనాధునకు రాయల సందర్శన లాభము కలుగుటయేకాక తదాస్థానమునందు విపక్షవిద్వాంస విజయలాభమును, తద్బిరుదాంకసంపాదనలాభమును, కనకాభిషేకలాభమును గూడఁ గలిగినవి. లాభములు రాఁదొడఁగినప్పుడు లాభములమీఁదనే లాభములు వచ్చును గదా ! రాయల సంస్థానమునందు శ్రీనాధ మహాకవికి తదాస్థాన విద్వాంసుఁడగు డిండిమకవిసార్వభౌమ బిరుదాంకితునితో నుద్భట వివాద మొకటి సంప్రాప్త మయ్యెను. మహారాజాశ్రయము గల యా విద్వాంసుఁడు స్వవిజయనిశ్చయహంకారముచేతను, విద్యాగర్వముచేతను దన్నాతడోడించినయెడల తన విజయడిండిమమును బగులగొట్టించుకొని తన కవి సార్వభౌను బిరుదము నిచ్చి వేయుదునని పంతములు పలికి యుండును. తానొకటి తలఁచిన దైవ మొకటి తలఁచును గదా ! వివాద మే విషయము లోనో దెలియదు గాని యిరువురకును నడచిన యుద్భటవివాదములో శ్రీవాణీ ప్రసాదలబ్ధసకలవిద్యా సనాధుఁ డగు శ్రీనాధుఁడే విజయమునొంది యా గౌడడిండిమభట్టు కంచుఢక్కను బగులఁగొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును లాగుకొన సమర్థుఁ డయ్యెను. ఈ కవిసార్వభౌమ బిరుదసమార్జనమునకు మన కవిరాజునకు చంద్రశేఖరు క్రియాశక్తి తోడయినట్టు చెప్పుదురు "చంద్ర శేఖరు క్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమ బిరుద” మని శ్రీనాధుఁడే పయి సీసపద్యపాతమునందుఁ జెప్పెను. "శ్రీనాధుఁడు సాళ్వగుండ నరసింహరాయల కాలములో నుండినట్లును, తదాస్థానమునకుం బోయి డిండిమభట్టు నోడఁగొట్టినట్టును తెలియుచున్నది. గోకఁ జుట్టితి............తల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి ! దయలేదా నేను శ్రీనాధుఁడన్' అని చెప్పినది నరసింగరాయల యాస్థానమునందే ! డిండిమ కవిని శ్రీనాధుఁ డోడించెను గదా ! 'పగుల గొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమభట్టుకంచుఢక్క' అనునది నిక్కమే. ఈ డిండిముఁడే జైమిని భారతముఁ గృతినందిన సాళ్వగుండ నరసింహరాజు విజయములను వర్ణించుచు సాళువాభ్యుదయ మను సంస్కృతకావ్యమును రచించెను. --------------------------------చంద్ర శేఖరుఁ డను నియోగిపుంగవుఁడు నరసింగరాయల మంత్రి యని సాళువాభ్యుదయమున నున్నది. కావున 'చంద్రశేఖరు క్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమబిరుదు' అనునది స్పష్టముగా నర్థ మగుచున్నది. ఈ నరసింహ రాయలు క్రీ. శ.1450 లో నున్నట్లు తెలియుచున్నది.” అని రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠికలో వ్రాసి యున్నారు. సాళువగుండ నరసింహరాయలు 1450 వ సంవత్సరమునకు పైని 1480-90 సంవత్సర ప్రాంతములయందుండిన వాఁడగుట చేతను, శ్రీనాధకవి 1450వ సంవత్స రమునకు ముందే 1440-45 సంవత్సర ప్రాంతములయందే మృతి నొంది యుండుటచేతను, ఈ కవిసార్వభౌమబిరుదమార్జనకథ 1435-వ సంవత్సర ప్రాంతమున రచింపఁబడిన కాశీఖండరచనమునకుఁ బూర్వమునందే నడచి యుండుట చేతను, శ్రీనాధుఁడు సాళువగుండ నరసింహరాయల యాస్థానములో నుండిన డిండిమభట్టుతో వాదము చేసి జయించుట సంభవింపనేరదు. కాబట్టి శ్రీనాధునిచే నోడఁగొట్టఁబడిన డిండిమభట్టు వేఱొకఁడయి యుండవలెను. ఇప్పుడు డిండిమభట్టు లెందఱు న్నారను ప్రశ్న వచ్చును. ఆ పేరు గలవారు ముగ్గురు నలుగురున్నట్లు తెలియవచ్చుచున్నది.

యోగానంద ప్రహసమునందు తత్కర్తయైన యరుణగిరినాధుఁడు తన మాతామహాఁడు "బ్రహ్మాండభాండ పిచండమండలిత విజయడిండిమచండిముఁ” డనియు, "డిండిమప్రభుఁ" డనియు, చెప్పియున్నాడు. అందుచేత మొట్టమొదట విజయడిండిమమును సంపాదించినవాఁ డష్టభాషాకవితా సామ్రాజ్యాభిషిక్తుఁడై న యీ డిండిమభట్ట కవిసార్వభౌముఁడే యనియు, ఆతని దౌహిత్రుఁడయిన యరుణగిరీనాధునకు డిండిమకవిసార్వభౌమత్వము లభించుట తాతవలననే యనియు, విశదమగుచున్నది. "శ్రీకంఠాగమపారంగతుఁడై విజయడిండిమము నార్జించిన మాతా మహునియొద్ద నుండియే యీ యోగానందప్రసహసన కర్తకు డిండిమకవిసార్వభౌమబిరుదమును, విజయడిండిమమును లభించినవి ” అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ కనకాభిషేకమునందుఁ దెలిపి యున్నారు. ఈ ప్రధమడిండిమభట్టు 1270-వ సంవత్సరమునందు జనన మొంది 1380వ సంవత్సరము వఱకును నూఱేండ్లు జీవించెనని చెప్పఁబడెడు వేదాంతదేశికులవారితో సమకాలీనుఁడు వైష్ణవమతప్రచారకుఁడైన వేదాంతదేశికులకును, శైవమత ప్రచారకుఁడైన డిండిమభట్టునకును మతవిషయమున ననేకవాదములు జరిగినట్టును వారు వాదప్రతివాదసందర్బమున నొండొరుల నాక్షేపించుచు వచ్చినట్టును, తెలిపెడు కథలును, శ్లోకములును దక్షిణదేశమునందు వ్యాపించియున్నవి.1360-70 సంవత్సర ప్రాంతములయందుండిన యీ ప్రథమ డిండిమ భట్టును,1360-వ సంవత్సరమునకు దరువాతగాని పుట్టని శ్రీనాథుడు వాదములో నోడించె ననుట పొసఁగనేరదు. ఇక శ్రీనాథునితో వాదించి యషజయము నొందిన డిడిమభట్టు రెండవడిండిమభట్టో, మూడవడిండిమభట్టో యయి యుండవలెను.

రెండవ డిండిమభట్టు పేరరుణగిరినాధుఁడు. ఇతఁడు సంస్కృతమున యోగా నందప్రహసనమును రచించెను. ఆ ప్రహసనమునందతఁడు తన్నుఁగూర్చి "శ్రీ డిండిమకవిసార్వభౌమ ఇతి ప్రధికబిరుదాంకనామధేయః, సరస్వతీ ప్రసాదలబ్ధ కవితాసనాథః, శ్రీమానరుణగిరినాధః తేన కృతేన యోగానంద నామ్నా ప్రహసనేన సభానియోగ మనుతిష్ఠామి” అని వ్రాసికొని యున్నాడు. డిండిమకవిసార్వభౌమబిరుదాంకుఁడును, సరస్వతీ ప్రసాదలబ్ద కవితాసనాధుఁడును నైన యరుణగిరినాధుఁడు తన యోగానందప్రహసములో భరతవాక్యముగా “ దీర్ఘాయుర్దేవరాయోదధతు వసుమతీచక్రమాచంద్రతారమ్" అని దేవరాయని నాశీర్వదించి యున్నాఁడు. ఈ కవి వర్ణించిన దేవరాయఁడు విజయనగరాధీశ్వరుఁడైన ప్రౌఢదేవరాయలని యితరదృష్టాంతములవల్లఁ దేలుచున్నది. ఈ ప్రౌఢదేవరాయలు 1423 వ సంవత్సరము మొదలుకొని 1443-వ సంవత్సరమువఱకును కర్ణాటకరాజ్యపరిపాలనము చేసెను. ఈతని కాలములో శ్రీనాధుఁడుండె ననుటకు సందేహము లేదు. శ్రీనాథుఁడుద్భటవివాదప్రౌఢిచేత నోడించి కంచుఢక్క పగులఁ గొట్టించినది తప్పక యరుణగిరినాథనామము గల యీ రెండవ డిండిమభట్టునే. ఇతఁడు ప్రౌఢదేవరాయని రాజ్యకాలములో నుండినవాఁ డగుటచేత నీతనిని శ్రీనాధుఁ డోడించుట 1423-వ సంవత్సరమునకుఁ దరువాత నయి యుండవలెను. 1426 -వ సంవత్సరప్రాంతమున నని తోఁచుచున్నది. ప్రౌఢదేవరాయలు దేవరాయనామధేయము గల కర్ణాటకరాజులలో రెండవ వాఁడు. మొదటివాఁడు ప్రౌఢదేవరాయని తండ్రి యైన దేవరాయ మహారాజు. అతఁడు 1406 వ సంవత్సరము మొదలుకొని 1422-వ సంవత్సరమువఱకును కర్ణాటరాజ్య మేలెను. ఈతని కాలమునందు సహితము శ్రీనాధకవి యుండెనుగాని యతఁ డీయనరాజ్య కాలములో కొండవీటి నగరమును విడిచి దేశ సంచారము చేయ నారంభించలేదు. అంతేకాక గౌడడిండిమ భట్టుసహిత మీయన రాజ్యావసానదశయందు నుండక యీతని కొడుకై న ప్రౌఢదేవరాయని యేలుబడిలోనే తధాస్థానకవియయి యుండిన వాఁడు. ఈ గౌడడిండిమభట్టుయొక్క కవిసార్వభౌమ బిరుదమును లాగుకొని శ్రీనాధుని కిప్పించుటలో సహాయుఁడయినవాఁడు సాళువగుండనరసింహరాయని మంత్రిగా నుండిన చంద్ర శేఖరుఁడు కానేరఁడు. ప్రౌఢదేవరాయని యాస్థానములో మఱియొక చంద్రశేఖరుఁడుండి యుండవచ్చును. చంద్రశేఖర క్రియాశక్తియన్న చోట చంద్రభూషక్రియాశక్తి యని పాఠాంతరము గలదు. ఈ చంద్రభూషక్రియాశక్తిపాఠమే సరియైనదైనపక్షమున, 1340-వ సంవత్సరమునందు శ్రీ వీర బుక్కరాయలరాజ్యకాలములో వ్రాయబడిన కొండూరు శాసనములో

      శ్లో. శ్రీచంద్రభూషణాచార్యపదపంకజయో స్తథా,
          గ్రామం కొండూరునామానం బుక్కక్ష్మాపతి రార్పయత్.

అని రాజగురు వైన చంద్రభూషాచార్యుని పేరు కనబడుచున్నది గాని ప్రౌఢదేవరాయనికాలములో చంద్రభూషుని పేరెక్కడను వినబడదు. ఈ చంద్రభూషుడు “యతీంద్రస్య క్రియాశక్తిగురోః ప్రీతయే శ్రీ చంద్రభూషణాచార్యః" అని పై శాసనములోనే యుండుటనుబట్టి క్రియాశక్తి యతీంద్రునిశిష్యు డగుట స్పష్టము. క్రియాశ క్తిపీఠ మా కాలమునందు శంకరాచార్యపీఠము వంటి శైవమతపీఠమై కర్ణాటక రాజులకు గురుపీఠమయి యుండెను ఆ పీఠాధికారి విరూపాక్షాదిశంకరమఠముల కువలెనే యతీంద్రుఁ డుగా నుండెను. అయిసను వీరబుక్కరాయలనాటి చంద్రభూషాచార్యుఁడు గాని, క్రియాశక్తియతీంద్రుఁడుగాని ప్రౌఢదేవరాయలకాలములో నున్న శ్రీనాధునికవిసార్వభౌమ బిరుదముతో సంబంధించి యుండుట పొసఁగ నేరదు. క్రియాశక్తి మఠశిష్యుఁడయి శాసనములోని చంద్రభూషాచార్యునికి మనుమఁడై న మఱియొక చంద్రభూషాచార్యుఁడు రాజగురువయి ప్రౌఢదేవరాయనికాలములో నుండిన నుండవచ్చును. మధురావిజయకృతికర్త్రి యు, బుక్కరాయని కోడలును, కంపరాయనిరాణియునైన గంగాంబ తన మధురవిజయమను వీరకంపరాయ చరిత్రలో క్రియాశక్తి నిట్లు స్తుతించెను.

         శ్లో. అసాధారణసాదృశ్యం విలసత్సర్వమంగళమ్
            క్రియాశక్తిగురుం వందే త్రిలోచనమి వాపరమ్.

 1377 మొదలు 1404-వ సంవత్సరమువఱకును రాజ్యము చేసిన ద్వితీయ హరిహరరాయనిపుత్రుఁ డిమ్మడి బుక్కరాయని మైసూరుదాన శాసనములో కులగురు వయిన కాశీవిలాస క్రియాశక్తి పేర్కొనఁబడెను.

        శ్లో. శ్రీమత్కాశీవిలాసాఖ్య క్రియాశక్తీశ సేవినా
            శ్రీమత్త్య్రంబక పాదాబ్జ సేవానిష్టాతచేతసా.

మన చరితాంశమునకు చంద్రభూషుని కథ గాని చంద్ర శేఖరునికథగాని యంతగా ప్రథాన మయినది కాదు. మన శ్రీనాధునిచే నోడగొట్టఁబడి కవి సార్వభౌమ బిరుదమును గోలుపోయిన వాఁడు రెండవ డిండిమకవిసార్వభౌముఁడయిన యరుణగిరినాధుఁ డగుట నిశ్చయము విజయడిండిమమును, కవి సార్వభౌమ బిరుదాంకమును స్వయముగా సంపాదించుకొన్నవి గాక మాతామహునివలన సంక్రమించినవే యయినను, అరుణగిరినాధుఁ డసామాన్య పాండిత్యమును నిరుపమానకవితా సామర్థ్యమును గలవాఁ డయినందునకు సంశయము లేదు. ఇతఁడు యోగానంద ప్రహసనాది కావ్యములను రచియించి ప్రసిద్ధి కెక్కినట్టీవఱకే చెప్పబడెను ఇక మూడవ డిండిమకవిసార్వభౌమునిగూర్చి విచారింతము. ఇతఁడు ద్వితీయడిండిమకవిసార్వభౌముఁ డయిన యరుణగిరినాధుని పుత్రుఁడు; రాజనాథదేశికనామధేయుఁడు, తండ్రివలనను, తండ్రి తాతవలనను సంక్రమించిన డిండిమకవిసార్వభౌమబిరుదమును వహించినవాఁడు; మహావిద్వాంసుఁడయి సాళువాభ్యుదయాది గ్రంధములను రచించినవాఁడు. 1490-వ సంవత్సర ప్రాంతమున విద్యానగరరాజ్యమును వశపఱచుకొని పరిపాలించిన సాళువగుండనరసింహరాయని కాలములోను, తరువాతఁ [19] గృష్ణదేవరాయల తండ్రి యైన వీరనరసింహరాయనికాలములోను మూఁడవడిండిమకవిసార్వ భౌముఁడైన రాజనాథదేశికుఁ డాస్థానకవిగా నుండి ప్రసిద్దికెక్కెను. ఇతఁడు సాళువగుండ నరసింహరాయని విజయములను వర్ణించుచు సంస్కృతమున సాళవాభ్యుదయ మను పదునాలుగు సరములు గల కావ్యమును జేసెను, ఈ కావ్యమునం దితఁడు తా నష్టదిగ్విజయపటహీకృత బిరుద డిండమాడం బరుఁడ ననియు డిండిమకవిసార్వభౌముడ ననియుఁ జెప్పుకొనెను. ఈ బిరుదములీ వంశమువారికి పితృపితామహపారంపర్యముగా నడచుచున్నట్లు కనబడుచున్నవి. ఈ తృతీయ డిండీ మకవిసార్వభౌముఁడు వీరనరసింహాదేవరాయనికాలములోఁ గూడ నుండినట్టు కుమారధూర్జటికవి కృత మయిన కృష్ణరాజవిజయములోని యీ క్రింది పద్యములు తెలుపుచున్నవి.

     మ. రమణీయాంధ్రతరంగిణీఘుమఘుమారావార్థగంభీరవా
         క్క్రమఝంఝానిలధూతదుష్కవిమహాగర్వాభ్రసంఘుండు ది
         గ్రమణీమౌక్తికహారబంధురయశో రాజద్గుణాఢ్యుండు డిం
         డిమపుంభావసరస్వతీంద్రుఁ డనియెన్ ఠీవిం బ్రకాశించుచున్.

* * * *

         మ. అని యా డిండమసార్వభౌమకవి ప్రఖ్యాతంబుగాఁ దత్పురా
              తనవృత్తాంతము నెల్ల దెల్పినఁ జమత్కారంబు వీక్షించి యా
              జననాథాగ్రణియున్ సభాసదులు నుత్సాహంబునం బొంది కాం
              చభూషాదు లొసంగి రెంతయు దయాసంరంభధౌరేయులై .

పయిపద్యమునందుఁ బేర్కొనబడిన జననాధాగ్రణి వీరనరసింహరాయలు. ఇట్లు 1490-వ సంవత్సర ప్రాంతములయం దుడినడిండిమకవి సార్వభౌముఁడు శ్రీనాధునిచే జయింపఁబడినవాఁడు కాఁజాలఁడు. శ్రీనాధుఁడు ద్వితీయడిండిమకవిసార్వభౌముని నుద్దండవివాద ప్రౌఢిచే నోడించి యతని కంచుఢక్కను పగులగొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును స్వవశము చేసికొన్నట్లు చెప్పఁబడినను, తరువాత నాతనిసంతతివారు సహితము వంశాగతమైన విజయడిండిమమును ధరించుచు కవిసార్వభౌమ బిరుదమును వహించుచునే యుండిరి. ఈ మువ్వురు డిండిమకవిసార్వభౌములలోను ప్రథముఁడు 1380 సంవత్సర ప్రాంతమునందును, ద్వితీయుఁడు 1420 సంవత్సర ప్రాంతమునందును, తృతీయుఁడు 1480 సంవత్సర ప్రాంతము నందును, ఉండినవారగుటచేత మస శ్రీనాధకవి జయించినవాఁడు ద్వితీయ డిండిమకవి సార్వభౌముఁడే కాని తక్కిన యిద్దఱును కారని సిద్దాంతమగు చున్నది. ఈ డిండిమభట్టుయొక్క కవిసార్వభౌమ బిరుదమును స్వాధీనము చేసికొన్నాను. గొంత కాలమువఱకు దాని నుపయోగించుట కే హేతువు చేతనో శ్రీనాధుఁడు సందేహించుచుండెను.

[శ్రీనాధుఁడు వాదమున నోడించింది రెండవడిండిమభట్టునేయనియు, డిండిమభట్టబిరుదము వంశపారంపర్యముగావచ్చుచున్నదేయనియు నందఱు నంగీకరించుచున్నారు. కాని యీ డిండిమభట్టు మొదటి దేవరాయలకాలమున నుండెనని కొందఱును, రెండవ దేవరాయలకాలమున నుండెనని కొందఱును దలఁచుచున్నారు. డాక్టరు నేలటూరి వేంకటరమణయ్యగా రీతఁడు మొదటి దేవరాయల యాస్థానమున నుండెననుచున్నారు 'ఆంధ్రకవితరంగిణి' కారులు డాక్టరుగారి మతమునే యంగీకరించుచున్నారు - శ్రీబండారు తమ్మయ్య గారు, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు మున్నగువారు రెండవ దేవరాయల కాలముననే రెండవ డిండిమభట్టుండినట్లు తలంచియున్నారు. శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మగారును తమయభిప్రాయముతో నేకీభవించినట్లు శ్రీతమ్మయ్య గారు తెల్పినారఁట !]

తమ యాస్థానకవి కిట్లు విద్యావివాదములో పరాభవము జరిగిన తరువాత విజయశాలియైన శ్రీనాధసుకవిరాజమౌళికి దీనారములతోను, టంకముల తోను తమ ముత్యాలశాలలో కనకాభిషేకము చేయించి సత్కరించి రాయల వా రాతనిని బంపివేసిరి. దీనారములును, టంకములును రాయలకాలములో వాడుకలో నున్న బంగారునాణెములు. బంగారునాణెములట్లు జలమునువలె శిరస్సుపైఁ గ్రుమ్మరించి స్నానము చేయించినప్పుడవి బహు సహస్రములు కాకపోయినను సహస్రమునకు దక్కువ కాకుండ నైన నుండవచ్చును. డిండిమకవి సార్వభౌమునకు సభలో నవమానమును, తత్ప్రతిపక్షికి బహుమానమును జరిగిన యనంతరమున సహితము డిండిమభట్టును, తత్పుత్రుడును పూర్వగౌరవముతోను, పూర్వబిరుదావళీ తోను పూర్వవిజయడిండిమలతోను, రాయల యాస్థానకవీశ్వరులుగాను, విద్వాంసులుగాను యథాపూర్వముగా నుండినట్లే కనబడుచున్నది. శ్రీనాధునకిట్లు స్వర్ణాభిషేక సమ్మానము జరిగినది రాయల యాస్థానమునందుఁ గాదనియు, నొకానొక దక్షిణ దేశాధీశునిసభలో ననియు

          "దీనారటంకాలఁ దీర్థమాడించితి
          దక్షిణాదీశు ముత్యాలశాల"

అని యుండుటనుబట్టి యొకానొకరు వ్రాసి యున్నారు. ఆ కాలమునందు కర్ణాటక రాజులను దక్షిణాధీశ్వరు లనియు వ్యవహరించుచుండెడువారు, ఈ స్వర్ణస్నానసత్కారము జరిగినది గర్ణాటమహారాజసంస్థానమునందే యని శ్రీనాధకృతమైన, కాశీఖండములోవి యీ కృతిపతి సంబోధనపద్యము విస్పష్టపఱుచుచున్నది.

       శా. కర్ణాటక్షితినాధమౌక్తికసభాగారాంతసంకల్పిత
           స్వర్ణ స్నానజగత్ప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచారిత్ర ! దు
           గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్నముఖమధ్యాహ్నాపరాహ్ణార్చితా
           పర్ణావల్లభ! రాజశేఖరమణీ ! పంటాన్వయగ్రామణీ !

అంతట శ్రీనాథుఁడు రాయలకొలువు వీడ్కొని బహుధనకనకసంచయముతో మరల యశోధనార్జనముకొఱకు దేశసంచారమునకు బైలుదేఱెను. ఈ సంచారములలో నితఁ డాంధ్రవల్లభుని మైలోరు రెడ్డినాయకుని; సర్వజ్ఞసింగమ నాయనిని సందర్శించి సత్కారముఁ బడసెనని చెప్పుదురు. ఆంధ్రవల్లభుఁడు దక్షిణమున కాంచీనగరాధీశ్వరుఁడుగానుండిన సంపరాయని (శంభురాయని) కుమారుఁడైన తెలుగురాయఁడు. వీరబుక్కరాయల (1355-77) కుమారుఁడైన కంపరాయలు తండ్రి యాజ్ఞనుసారముగా మథురాసురత్రాణుని జయించుటకయి దక్షిణదిగ్విజయయాత్ర వెడలినప్పుడు త్రోవలో కాంచీపురము రాజధానిగా రాజ్యమేలుచుండిన సంపరాయని తన సేనాపతి యైన సాళువమంగుని సాహాయ్యముచేత జయించి కాంచీపుర మును దన ముఖ్యపట్టణముగాఁ జేసికొనెను. మధురావిజయమునందీ క్రింది శ్లోకములలో

        శ్లో. “అంతర్పింబితచంపేంద్రా కంపేద్ర స్యాసీపుత్రికా
             అప్సరోభ్యః పతిం దాతు మంతర్వత్నీ కిలాభవత్.
             ఆథ వంచితత్ఖడ్గ ప్రహారః కంపభూపతిః
             ఆకరో దసినా చంప మమరేంద్రపురాతిథిమ్.”

గంగాదేవి తన భర్త పౌరుషమును వర్ణించెడి యుత్సాహాముతో కంపరాజు చంపరాయని (సంపరాయని) తన ఖడ్గధారతో ఖండించి చంపెనవి గొప్ప చెప్పినను, పరాజితుఁడయిన చంపరాజు స్వర్గాతిథి గాక బ్రతికియుండి మధురాసురత్రాణుని జయించుటలో కంపభూపతికి సహాయఁడు సహిత మయ్యెను. కంపరాజు సేనాధిపతియు, నిరుపమాన పరాక్రమశాలియునైన సాళువమంగరాజు సంపరాయనిరాజ్యములోఁ గొంతభాగ మతనికి మరల నిప్పించి యాతనిని మిత్రునిఁగాఁ జేసి సంపరాయస్థాపనాచార్యుఁడని పేరు పొందెను. జైమినిభారతములో పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు సాళువమంగును వర్ణించుచు నీ యంశము నీ క్రిందీపద్యములలోఁజెప్పియున్నాఁడు.

సీ. 'దురములో దక్షిణసురతాను నెదిరించి
                       కొనివచ్చి సంపరాయనికి నిచ్చి
     సామ్రాజ్యమున నిల్చి సంపరాయస్థాప
                       నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
     శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యర్వదివేలు
                       మాడ లద్దేవునుమ్మడికి నొసఁగె
     మధురాసురత్రాణు మడియించి పరపక్షి
                       సాళువబిరుదంబు జగతి నెరపె

     గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి
     తఱిమి నగరంపుగవకులు విఱుగఁ ద్రోలి
     తాను వ్రేసిన గౌరు నుద్దవిడిఁ దెచ్చె
     సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.'

ఈ ప్రకారముగా సంపరాయని సామంతరాజునుగా రాజ్యమునందు మరల నిలిపిన కాలము 1370-వ సంవత్సర ప్రాంతము. స్వరాజ్యమునందు పునస్సంస్థాపితుఁడయి సంపరాయఁడు 1400 సంవత్సర ప్రాంతమువఱకును రాజ్య భారమును వహించి యుండును. అనంతరమున సంపరాయని పుత్రుఁడయిన తెలుగుఁరాయఁడు రాజ్యమునకు వచ్చి 1435-వ సంవత్సరప్రాంతమువఱకును రాజ్యపాలనము చేసి యుండును. ఈ తెలుఁగురాయఁడు 1428 సంవత్సరమునందు సింహాచలయాత్ర చేసి యచ్చట నృసింహస్వామివారి దేవాలయములో నీ క్రింది శాసనము వ్రాయించెను. " స్వస్తిశ్రీ శకవర్షంబులు 1350 అగు నేఁటి ప్లవసంవత్సరఫాల్గుణకృష్ణ 7 గురువారానను కన్నడ దేసమందుల సంబరాయనికొడ్కు తెలుంగురాయండుతనకు అభీష్టార్థసిద్దిగాను శ్రీనరసింగనాధునికీ నిత్యమును సన్నిధిని వెలుంగను అఖండదీపాలు రెండు సమర్పించెను"

శ్రీనాధుఁ డీతనిని 1425-వ సంవత్సర ప్రాంతమునందు దర్శనము చేసి యుండును ఈతని రాజ్యప్రదేశ మేదో సరిగా తెలిసినది కాదు: గాని

           శా. ధాటీ ఘోటకరత్న ఘట్టనమిళద్రాఘిష్ఠకళ్యాణఘం
               టాటంకారవిలు రలుంఠితమహోన్మత్తాహిక్షోణిభృ
               త్కోటీరాంకితకుంభినీధరసముత్కూటాటవీఝాటక
               ర్ణాటాంధ్రాధిపసాంపరాయని తెలుంగా ! నీకు బ్రహ్మాయువౌ

అను శ్రీనాధుని పద్యమునుబట్టి చూడఁగా కర్ణాటాంధ్రదేశమధ్యస్థమయిన యేదో యరణ్య ప్రాంతరాజ్య మయినట్టు కనిపట్టుచున్నది. ఈ తెలుఁగు రాయఁడు కవులకు కస్తూరిదానము చేయుటలోఁ బ్రసిద్ధుఁడు. శ్రీ నాధుని యీ క్రిందిపద్య మీ యంశమును తెలుపుచున్నది.

           శా. అక్షయ్యం బగు సాంపరాయనితెనుంగాధీశ కస్తూరికా
               భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకస్వామికిన్
               దాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
               వక్షోజద్వయకుంభికుంభముల పై వాసించు దద్వాసనల్.

శ్రీనాధకవీంద్రుఁ డీ పద్యములు జెప్పునప్పటి తాను దాక్షారామమునకుఁ బోవ నుద్దేశించుకొన్నట్టు కనుపట్టుచున్నది [శ్రీనాధునిచేఁ ప్రస్తుతింపఁబడిన తెలుఁగురాయనిఁగూర్చి శ్రీ ప్రభాకరశాస్త్రులు గారి 'శృంగార శ్రీనాధము'న నిట్లున్నది.

"భీమఖండరచనము తర్వాత, దాక్షారామసమాయోగము గల్గినయాపయి (క్రీ. 1435-1440 ప్రాంతమున మన శ్రీనాధునకు మేదినీమీసరగండకటారి సాళువ సంబురాయని కొడుకగు తెలుంగురాయని యాశ్రయ మేర్చడినది. ఈతని శాసనము శక 1350 నాఁటీ దొకటి సింహాచలముమీఁదఁ గలదు.

........నెల్లూరు మండలముననే యాత్మకూరు తాలూకాలోఁ దెలుంగురాయని పురమను గ్రామము గలదు. అది యీ తెలుంగురాయని పేర నేర్పడినదే కావచ్చును. కృష్ణాతీరమున శ్రీకాకుళ గ్రామముతోఁ జేరి తెలుఁగురాయని పాలెమను పల్లె యొకటికలదు. కాని, యది శ్రీకాకుళంధ్రనాయకస్వామి పేర నేర్పడినదికాని, యీ తెలుఁగురాయనికి సంబంధించినది కాదు. ఈతని కీ నామము గూడ నా శ్రీకాకుళాంధ్రనాయకుని పేరునుబట్టి వచ్చినదే యగునని నేను తలంచుచున్నాఁడను. ఆ కాలమున నీ తెలుగు రాయలను పేరు పలువురు పెట్టుకొనుచు వచ్చిరి. శ్రీకాకుళాంధ్రనాయక స్వామి యుత్సవాదులప్పుడు ప్రఖ్యాతముగాజరుగుచుండెడివి. శ్రీకాకుళాంధ్ర నాయకస్వామికిఁ దెలుఁగు రాయఁ డని కూడఁ బేరుండుట తెలియక కొందరీ సంబురాయనికొడుకు తెలుంగురాయఁడు శ్రీకాకుళమునేలినరాజని వ్రాసిరి. ఈ తెలుంగురాయఁడు (శ్రీకాకుళమునేలినవాఁ డనుటకు నాధారము మేమియుఁ గానరాదు. అట్లుంట ప్రామాదికమే ! ఈ తెలుంగురాయఁడు రాజ్యమెక్కడయేలెనో ప్రఖ్యాతముగాలేదు. విద్యానగరాధీశ్వరుని క్రింద సేనానాయకుడుగా నుండినట్టున్నాఁడు. బాపట్ల తాలూకా నూతులపాడు గ్రామమున నీ తెలుఁగురాయని పుత్త్రుఁడు తిరుమలరాయని శాసనములు శా. 1466 నాఁటివి కలవు. తెలుఁగురాయని తండ్రియగు సంబురాయఁడు శా. 1348 నను, నాతని కొడుకగు తిరుమలరాయనీ ళాసనము శా. క. 1466 నను నుండుటచేఁ దెలుఁగు రాయఁడు శా 1348 తర్వాత 1395 దాక నున్నట్లును, సింహాచలశాసనము నాఁటి కాతఁ డిర్వది యేండ్లకులోపడిన వయస్సువాఁడయినట్లును తలఁపఁ దగును. అతఁ డిప్పటికిఁ బ్రఖ్యాతుఁడుగాక, తండ్రిచాటువాఁ డగుటచేతనే యా శాసనమందు 'కన్నడ దేశమందలి సంబురాయని కొడుకు తెలుగు రాయండు' అని పేర్కొనవలసెను. ఆతని శాసనము శా. 1364 నాఁటిది నూతులపాడు గ్రామమునందున్నది. విజయనగరాధీశ్వరుఁడగు ప్రౌఢదేవరాయనికి లోపడిన యీ తెలుఁగు రాయఁ డాతని దం డయాత్రలో సింహాద్రిదాఁక వెళ్లినట్లు శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు తలంచుచున్నారు. అది సంగతముగా నున్నది. శ్రీనాథుఁడీ తెలుంగురాయని నా సందర్పముననేని, తర్వాతనేని సందర్శించి యుండవచ్చును' [శృంగార శ్రీనాథము-పుటలు 153 – 155]

తెలుఁగురాయనివలన సంభావనమును బడసి శ్రీనాధుఁ డక్కడనుండి వెడలి మహావిద్వాంసుడయి సర్వజ్ఞసింహనామము వహించి రాచకొండసంస్థానము నకు ప్రభువుగా నుండిన సర్వజ్ఞసింగమనీని సందర్శించి సత్కారము బొందుటకయి తదాస్థానమునకుఁ బోయెను. శ్రీనాధుడు రాజదర్శనము చేయుటకు ముందక్కడఁ గూడఁ దనకు విజయము కలిగింపవలెనని తనయిష్ట దేవత యయిన సరస్వతి నీ క్రింది పద్యముతో వేఁడుకొనెనని చెప్పుదురు.

           సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                           దక్షిణాధీశు ముత్యాలశాల
               పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య
                           నైషధగ్రంథసందర్భమునకుఁ
               బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                           గౌడడిండిమభట్టుకంచుఢక్క
               చంద్రశేఖరుక్రియాశక్తిరాయలయొద్దఁ
                           బాదుకొల్పితి సార్వభౌమ బిరుద

               మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
               రావుసింగమహీపాలు ధీవిశాలు
               నిండుకొలువున నెలకొనియుండి నీవు
               సరససద్గుణనికురుంబ! శారదాంబ!

ప్రౌఢదేవరాయాంధ్రవల్లభాదుల మహాసంస్థానములకుఁ బోయి వారలచే మెప్పొందిన కవిసార్వభౌముఁడీ సింగమనాయని చిన్న సంస్థానమునకుఁ బోయి యచ్చటఁ దనకు పరాభవము కలుగకుండఁ జేయుమని శారదను వేఁడి యుండునా ? యని యొకరీ విషయమున సంశయపడుచున్నారు. దేవరాయాదులు మహారాజు లయినను, వారు పండితజనపరివేష్టితులే గాని స్వయముగా పండితులుగారు; ఇక నీ సింగమనాయఁ డన్న నో చిన్న సంస్థానాధిపతి యైనను పండితులవలనఁ గృతులనందుటయేకాక, తానును స్వయ ముగా కావ్యవిరచనసామర్థ్యముగలవాఁ డయి బహు శాస్త్రములయందుఁ బ్రవీణుఁడయి సర్వజ్ఞబిరుదమును వహించినవాఁడు. అటువంటివానియొద్దం దన పాండిత్యమును జూపుటకుఁ బోవునప్పు డెంతటి విద్వాంసుఁడై నను. కొంచెము జంకి, తనకు విజయ మియ్యవలసినదని తన యిష్టదైవతమును ముందుగాఁ బ్రార్థించుట యసహాజమగునా? శ్రీనాధునకు సరస్వతి యిష్ట దేవతయగుట నైషథమునందు గృతినాయకుఁడై న మామిడి సింగనామాత్యుఁడు తన్ను బిలిపించి పలికినట్లు చెప్పఁబడిన యీ శార్దూలములు ఘోషించుచున్నవి.

శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంభసత్సూత్రు వి
    ద్యారాజీవధవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకుం
    గారామైన తనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
    త్కారం బొప్పఁగ గారవించి పలికె న్గంభీరవాక్ప్రౌఢిమన్.

శా. బ్రాహ్మీదిత్తవర ప్రసాదుఁడ పురు ప్రజ్ఞావిశేషోదయా
    జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
    బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్పర్యార్థనిర్దారిత
    బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే ?

సర్వజ్ఞ బిరుదము రావువంశ మూలపురుషుఁడైన బేతాళ నాయని కేడవతరమువాఁ డయిన సింగభూపాలునికే గాని పదవతరమువాఁ డయిన యీ సింగమనాయనికి లేదనియు, రసార్ణవనుధాకరాది గ్రంథములను రచించిన వాఁ డతఁడే కాని యితఁడు కాఁడనియు, కాలవ్యత్యాసమునుబట్టి సింగభూ పాలీయాది గ్రంధకర్త యయిన సర్వజ్ఞసింగమనాయనికాలములో శ్రీనాధుఁ డుండి యుండఁజాలఁడనియు, అందుచేత నీ మహాకవి యీ సింగభూపాలుని యొద్ద నపజయము సంభవించునేమో యని భయపడవలసిన పని యుండ దనియు, కాఁబట్టి శ్రీనాధుఁడు సర్వజ్ఞసింగమనాయని యాస్థానమునకుఁ బోయెననుటయే యసత్యమనియు, కొందఱు వాదించుచున్నారు. ఆ విషయము నిచ్చట నించుక విమర్శింతము.

బేతాళనాయనికి నేడవ తరమువాఁడు సర్వజ్ఞసింగమనాయఁడగుటకు సందేహము లేదు; రనార్జ వసుధాకరాదిసంస్కృత గ్రంథములను రచించినవాఁడతఁడే యగుటకును సందేహము లేదు. శ్రీనాథపోతనార్యులాతని కాలపు వారు కాకపోవుటయు, నందుచేత నాతని యాస్థానమునం దుండకపోవుటయు నిశ్చయమే ! అంతమాత్రముచేత బదవ తరమువాఁడైన సింగమనాయఁడు విద్వాంసుఁడును సర్వజ్ఞ బిరుదాంకితుఁడును గాఁ డన్న సిద్దాంత మేర్పడనేరదు, ఇద్దఱును విద్వాంసులుకావచ్చును; ఇద్దఱును సర్వజ్ఞబిరుదాంచితులు కావచ్చును; ఇద్దఱును గ్రంధకర్తలు కావచ్చును, ఇద్దఱును కృతిపతులు కావచ్చును. వేదాంత దేశికులు సుభాషితనీవి లోనగు గ్రంధములను బంపిన వాఁడును, వైష్ణవ గ్రంధకర్తలు తమ వ్యాఖ్యానములలో సర్వజ్ఞ బిరుదనామముతోఁ బేర్కోనినవాఁడును బేతాళనాయని యేడవ తరమువాఁడయిన మొదటి సింగమనాయఁడే యయి యుండును. అయినను పదవతరమువాఁ డయిన సింగమనాయఁడును సర్వజ్ఞబిరుదాంకుఁడే ! ప్రౌఢదేవరాయని కాలములో నుండిన యీ సర్వజ్ఞ సింగమనాయని యాస్థానమున కే శ్రీనాథకవి సార్వభౌముఁడును, బమ్మెరపోతనామాత్యుఁడును పోయి యాతనిపయిని పద్యములను జెప్పి బహుమానములను బడసిరి. ఈ విషయము వెల్గోటివారి వంశచరిత్రములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

        సీ. క్షితిలోస సర్వజ్ఞసింగభూపాలుడు
                            బలవైరిసన్ను తపౌరుషుండు

       లలి కావ్యనాటకాలంకారచతురుడు
                       సకలశాస్త్రార్ధవిశారదుండు
        వలనొప్ప సింగభూపాలీయనామక
                       గ్రంథంబు రచియించెఁ గౌతుకమున
        మును భాగవతమును దెనుఁగు చేసినయట్టి
                       బమ్మెరపోతన బాగుమీఱ

        తనకుఁ జెప్పిన భోగినీదండకమును
        వెలయ శ్రీనాథనామకవిప్రవరుఁడు
        కోరి చెప్పిన పద్యము ల్గొని ముదాప్తిఁ
        బెంపుతో వారి మన్నించి పేరువడసె.

ఉభయసింగభూపాలురనుగూర్చియు, సింగభూపాలీయములు చేయబడినవి కానీ రెంటికిని మిక్కిలి భేదమున్నది - మొదటిది రసార్ణవ సుథాకరము; [20] రెండవది చమత్కారచంద్రిక, మొదటిది సింగభూపాల రచితము; రెండవది సింగభూపాలాంకితము. రెండును నలంకార విషయకములే ! చమత్కారచంద్రిక యనఁబడెడు రెండవ సింగభూపాలీయము విశ్వేశ్వరకవిచంద్రునిచే రచియింపఁబడినది. అందలి లక్షణముల లక్ష్యములు నరసభూపాలుని పేర జెప్పబడినట్టే సింగభూపాలుని పేరఁ జెప్పఁబడినవి. కవి యీ గ్రంథమునకు సింగభూపాలకీర్తిసుధాసారశీతలనామాంతర[21] ముంచెను. అందలి విలాసాంత గద్యమును జూడుఁడు.

        “ఇతి సరససాహిత్యచాతురీధురీణ విశ్వేశ్వరకవిచంద్ర
         ప్రణీతాయాం శ్రీసింగభూపాలకీర్తిసుధాసారశీతలాయాం
         చమత్కారచంద్రికాయాం అష్టమో విలాసః.”

రసార్ణవసుధాకరము మూఁ డుల్లాసములను గండి; చమత్కారచంద్రిక యెనిమిది విలాసములను గలది. చమత్కారచంద్రికలోని రెండు శ్లోకముల నిందుదాహరించుచున్నాను.

     శ్లో. కృతి రభిమతకృతిచతురా యది చతురోదాంతనయగుణోదారా,
         ఇతి లక్షణ కృతిరత్నం రచయే సింగనృపగుణోదాహరణం.

     శ్లో. లోకే రాఘవపాండవాద్భుతకధాగ్రంథానుసంథాయినౌ
         తౌ గ్రంథా వివ తన్ముని ప్రణీహితౌ శ్రీసింగభూపాశ్రయః
         యాయా దాదరణీయతాం కృతధియాం గ్రంథో౽య మస్మత్కృతీ
         నాహం యద్యపి తాదృ శోస్మ్యయ మసౌ రాజా హి తాదృగ్గుణ8.

చమత్కారచంద్రిక సింగభూపాలకృతము గాక యన్యకృత మయినందున పయి సీసపద్యములోని మూడవ చరణమునందలి 'రచియించె నను దానిని గృతి నందెనని మార్చిన పక్షమున సింగభూపాలుని కది సరిపోవును. విల్సన్ దొరగారు తమ పుస్తకవివరణపట్టికలో 21 వ సంఖ్య గల యా చమత్కారచంద్రికనుగూర్చి “విశ్వేశ్వరకవిచే రాజమహేంద్రవరముజిల్లా లోని పిఠాపురపుజమీదారీయొక్క చిన్న రాజైన సింహభూపాలునియొక్క పద్య స్తవరూపచరిత్రము 16-వ సంఖ్య చూడుము.(A poetical and panegyrical account of Sinha Bhupala, a petty Raja of the Zamindari of Pithapur, in the Rajahmundry district, by Visweswara Kavi. See No.10 ' ఆని వ్రాసి యున్నారు 16 -వ సంఖ్యగల ప్రసంగరత్నావళినిగూర్చి చెప్పుచు దానిలో “77-వ ప్రకరణము విక్రమాదిత్యుఁడు మొదలుకొని మొట్టమొదట కనకగిరిలో చిన్న రాజయి యుండి తన యధికారమును రాజమహేంద్రమండలములోని యొక భాగము పైకి వ్యాపింపఁజేసి పిఠాపురమునో, పెద్దాపురమునో తన రాజధానిని జేసికొన్న సింహభూపుఁడనెడు సర్వజ్ఞసింహనాయఁడు వఱకునుగల ప్రసిద్దరాజులయొక్క సంక్షిప్తచరిత్రములను కలిగి యున్నది. (The 77th chapter contains short accounts of celebrated Princes from Vikramaditya to Sinha Bhupah or sarvajna Sinha Nayudu a petty prince orinally at Kanaka giri who extended his power over part of the Rajamahendri district and Pithapur or Peddapur his Capital )” అనీ వ్రాసియున్నారు. దొరగారు రావు సింగభూపాలఁ డన్న పేరు చూచి పిఠాపురములో రావువారు సంస్థానాధిపతులుగా నుండుటను బట్టి రాజమహేంద్రమండలమని భ్రమపడి యుందురు. దేశికులవారి 'సుభాషితనీవి' వ్యాఖ్యోపోద్ఘాతములో “రాజమహేంద్రవరనగరస్థితసర్వజ్ఞసింగక్షమావల్లభేన” అని యేల వ్రాయఁబడెనో తెలియరాకున్నది. ఈ రెంటినిబట్టి కాఁబోలును వెలుగోటివారి వంశ చరిత్రమును వ్రాసినవారుపోద్ఘాతములో

"తొమ్మిదవ తరమువాఁడై న లీగమనాయఁడు సింహాద్రి మొదలగు సబ్బినాటిరాజ్యము నాక్రమించి యేలినట్లును మఱియొక శాఖాంతరమునందు 9వ తరమువాఁడైన యన పోతనాయఁడు రాజమహేంద్రవరమురెడ్లను గొట్టి యా దేశము నేలినవాఁడనియు, వంశావళిలో వారి చరిత్రములలో వ్రాయఁబడి యున్నది .......... లింగమనాయఁడు అనపోతానాయఁడుగార్ల చరిత్రములలో వీరు సింహాద్రి రాజమహేంద్రవరము మొదలగు రాజ్యముల నా క్రమించినారనియు .......... కాఁబట్టి నిజముగ తొమ్మిదవతరమువా రా దేశముల నాక్రమించి యేలి తమ పుత్రాదుల నచట నిలిపి యుండవలెను" అని వ్రాసి యున్నారు.

[రపార్జవసుధాకర కర్తయగు సింగభూపాలుఁడును, శ్రీనాథాదులచే దర్శిం బడిన సింగభూపాలుఁడును భిన్నులనియు, రసార్ణవనుధాకరక ర్తకు సర్వజ్ఞ బిరుదము లేదనియు, అతని మనుమఁడును. శ్రీనాథునికాలపువాఁడునగు సింగభూపాలునికే సర్వజ్ఞబిరుదము కలదనియు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారి యాశయము. [శృంగార శ్రీనాథము పుట 211] వెలుగోటివారి వంక చరిత్రలో వీరిరువురికిని సర్వజ్ఞభిరుదమున్నట్లు చెప్పఁబడినది. శ్రీనాథుఁడు కాంచినది మొదటి సర్వజ్ఞసింగభూపతియే యని “ఆంధ్రకవి తరంగిణి' లో నున్నది (ఐదవ నంపుటము పుట.44] డాక్టరు గిడుగు - వేంకటసీతాపతిగారు రసార్ణ వసుధాకర నూతనముద్రణ పీఠికలో రసార్జవసుధాకరకర్తను శ్రీనాధుఁడు చూచినట్లు చెప్పియున్నారు ] ఈ సింగభూపాలుని రాజ్యము రాజమహేంద్ర మండలములోని కొంత భాగము వఱకును కొం తకాలము వ్యాపించినను వ్యాపింపకపోయినను సర్వజ్ఞబిరుద మీతనికిఁగూడ నుండినది. ఈ బిరుదము రెండు విధముల రావచ్చును. ఒకవిధమునఁ దాను స్వసామర్ధ్యముచేత సంపాదించు కొన్నదే ననుకోవచ్చును; డిండిమకవి సార్వభౌములకువలె పూర్వుల నుండి వచ్చినదైనను కావచ్చును. ఎట్లు వచ్చినను పదవతరమువాఁడై న యీ సింగభూపాలుఁడు పాండిత్యప్రభావముచేతను, పండితజనసమాదరణ చేతను, కావ్యప్రియత్వముచేతను సర్వజ్ఞ నామమున కర్హుడయినట్టు కనుపట్టు చున్నాఁడు శ్రీనాధుఁడీ రావు సర్వజ్ఞసింగభూపాలుని యాస్థానమునకుఁ బోయి యుండిన కాలములో

          క. సర్వజ్ఞనామధేయము
             శర్వునకే రావుసింగజనపాలునకే
             యుర్విం జెల్లును నితరుని
             సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.

అని రాజునుగూర్చి చెప్పే ఈ పదం విషయమయి యిటీవలివారొక వింతకథను గల్పించియున్నారు. పెదకోమటి వేమభూపాలుని యాస్థానములో నుండగానే శ్రీనాధుఁడు సింగభూపాలునికడకుఁ బోయి యీ పద్యముచే నాతనిని స్తుతించి మరల స్వస్థానమునకు రాగా, వేమభూపాలుఁ డిట్లు చెప్పితి వేమని యడుగగా, అదిస్తుతి కాదనియు "సర్వజ్ఞ నామ ధేయ మొక్క శర్వున కే కాని సింగభూపాలని కే యుర్వినిజెల్లు ?” నని చేసిన పరిహా సమనీయు, సమాధానము చెప్పి కవి తన ప్రభువును సంతోషపెట్టెనట. వేమభూపాలుని మరణానంతర ముననే శ్రీనాధుఁడు సింగభూపాలుని యాస్థానమునకుఁ బోయినవాఁడగుటచేతఁ దరువాతి ప్రబుద్ధులచే నీ కధ కల్పింపఁ బడుట స్పష్టము. శ్రీనాథుఁడీ పండిత ప్రభువునొద్దకుఁబోయి సమ్మానము బొందినది 1425-వ సంవత్సర ప్రాంతము. తరువాత శ్రీనాధుఁడు మైలారురెడ్డి మొదలైన సామంత సంస్థాన ప్రభువును గూడ సందర్శించి యర్హ సంభావనలు పొంది దేశ సంచారము ముగింపవలసిన వాఁడయ్యెను. ఈ సంచారమును ముగింపకముందే శ్రీనాథుఁడు ధాన్యవాటీపురమునకో, దారిలో కృష్ణా గోదావరీ మధ్యాంతర్వేదిసీమకోపోయి యచ్చటి యప్పటి సంస్థానాధిపతియైన దంతులూరి గన్న భూపాలునికడఁ గొంతకాల ముండి యాతనికి ధనంజయవిజయ మంకితము చేసినట్టు కనఁబడుచున్నది. ధనంజయవిజయ మెక్కడను గానరాలేదు గాని యీ విషయము గోదావరి మండలములో నుండిన దంతులూరి బాపనృపాలుని పేరట నూఱు సంవత్సరముల క్రిందట రచియింపఁబడిన మూర్తిత్రయోపాఖ్యానమువలనఁ దెలియవచ్చుచున్నది. బాపరాజు గోదావరీమండలములో నుండినను నాతనివంశ మూలపురుషుడైన హరిసీమకృష్ణుఁడు ధాన్యవాటీపుర ప్రభువయినట్టు మూర్తీ త్రయోపాఖ్యానములోని యీ క్రింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

    మ. కురియించెన్ బహుధాన్యవర్ష మఖిలక్షోణీప్రదేశంబునన్
        హారియించెన్ విమతాంధకారములు బాహాగ్రాసిసూర్యప్రభన్
        సిరి మించెన్ నృపవర్యు లెంచ ఘనుఁడై శ్రీధాన్యపోటీపురీ
        చిరసామ్రాజ్యమానమాశ్రయమహాసింహాసనాసీనుఁడై.

ఈ హరిసీమకృష్ణునికులమునందు భీమరాజు జనించెనఁట! ఆ భీమరాజు కొడుకు గన్న నరపతి, ఈ గన్ననరపతిని వర్ణించుచు గ్రంధకర్త

    సీ. అహితదుర్గాధ్యక్షు లందఱు భయ మంద
                              గ్రీడికై వడి నీల్చెఁ దాడినాడ
        నక్షుద్రదానవి ద్యాక్షేత్రములచేతఁ
                              బ్రతి యెవ్వరును లేక ప్రతిభఁ గాంచెఁ
        దనకీర్తి దశ దిగంతరగీయమానమై
                              కనుపట్ట ధర్మమార్గంబు నెఱపె
        శ్రీనాధసుకవీంద్రుచే ధనంజయవిజ
                              యం బను సత్కావ్య మందిదీ వెలసె

               నృపతిమాత్రుండె నిజపాదనీరజాత
                     ఘటీతకోటీర వైరిభూకాంతమాన
                     సాంతరభయాపహారి శ్రీదంతులూరి
                     గన్న భూపాలమౌళిదోర్గర్వశాలి.

అని యతఁడు శ్రీనాధకవీంద్రునిచే ధనంజయవిజయకావ్యము నందెనని చెప్పెను. అప్పటికి గన్న నరపాలుఁడు ధన్యవాటీపురములోనే యుండెనో తరువాత నాతని సంతతివారు నివాసముగా నేర్పరచుకొన్న కృష్ణా గోదావరీ మధ్యసీమకు వచ్చి యుండెనో తెలియదు.

ఇంతటితోఁ జూడఁ దగిన సంస్థానము లన్నియు నయిపోయినవి. పోయిన సంస్థానమునకే మరలఁ బోయిన కార్యము లేదు. ఇఁక నెక్కడనై నను మహదాశ్రయము సంపాదించి యక్కడ స్థిరపడవలెను. అట్టి యాశ్రయ మేదియా యని విచారింపఁగా నప్పటి కనుకూల మయినది రాజమహేంద్ర వరములో రెడ్ల సంస్థాన మొక్కటి కనఁబడినట్టున్నది.

ఇప్పుడు తన కడపటి యేలిక యైన పెద్దకోమటి వేమనకు గర్భశత్రువుగా నుండిన యల్లాడ రెడ్డి మొదలైనవా రంతరించి వారి పుత్రులు రెడ్డిసంస్థానమునకు ప్రభువు లయిరి. అంతకంటెను ముఖ్యముగా తాతనాటినుండియుఁ దన కుటుంబము నెఱిఁగినవాఁడును, బంధువుఁడునైన బెండపూడి యన్నామాత్యుఁడు రాజమహేంద్ర ప్రభువులైన వేమవీరభద్రారెడ్ల కడ మంత్రిగా నుండుట తటస్థించెను. అందుచే శ్రీనాధుఁడు 1427-28-వ సంవత్సర ప్రాంతమునందు రాజమహేంద్రవరమునకు వచ్చి యన్నయామాత్యు నాశ్రయించి తదనుగ్రహమునకుఁ బాత్రుడయ్యెను. అల్లాడ రెడ్డి 1426 -వ సంవత్సరమువఱకును రాజమహేంద్రరాజ్యపాలనము చేసి యుండుటచేతను, తదనంతరమున రాజ్యభారమును వహించిన వేణువీరభద్రరెడ్ల రాజ్యకాలము లోనే శ్రీనాథుఁడు వారిమంత్రియైన బెండపూడి యన్నామాత్యునికడకు వచ్చుటచేతను, ఆతడు రాజునుహేంద్రవరమునకు వచ్చుట 1427-వ సంవత్సరమునకుఁ బూర్వమయి యుండదు. అప్పుడు శ్రీనాధుని ముఖ్యోద్దేశము బెండపూడి యన్నామాత్యునాశ్రయించి తన్మూలమునఁ దనపూర్వపు ప్రభువయిన పెదకోమటి వేమారెడ్డి శత్రువయిన యల్లాడ రెడ్డి పుత్రుల యనుగ్రహమును సంపాదించి సాధ్యమయినంత శీఘ్రముగా వారి యాస్థానమునఁ బ్రవేశించి యచ్చట స్థిరపడుట. ఈ యభీష్టసిద్దికయి యతడు మొట్టమొదట యన్నామాత్యువిఁ బొగడి యతని దయను సంపాదింపవలెను; తరువాత వేమవీరభద్రారెడ్లను బొగడి వారిదయకుఁ బాత్రుఁడు కావలెను. ఈ రెండు పనులును నెఱ వేఱుటకయి యతఁడు భీమేశ్వరపురాణమును తొందర తొందరగా రచియించి దానిని శివభక్తుఁడైన యన్నయమంత్రి కంకిత మొనర్చెను. ఇతఁడు నైషధమహాకావ్యము నాంద్రీకరించి పెదకోమటివేముని మంత్రియైన మామిడిసింగనమంత్రికంకిత మొనర్చినప్పుడు

       సీ. తన కృపాణము సముద్ధతవైరిశుద్ఘాంత
                         తాటంకముల కెగ్గు దలఁచుచుండఁ
          దన బాహుపీఠంబు ధరణిభృత్కమరాహి
                         సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ
          దన కీర్తినర్తకి ఘనతర బ్రహ్మాండ
                         భవనభూములగొండ్లిఁ బరిఢవిల్లఁ
          దన దానమహిమ సంతానచింతారత్న
                         జీమూతసురభుల సిగ్గుపఁఱుప

          బరఁగు శ్రీవేమమండలేశ్వరునిమంత్రి
          యహితదుర్మంత్రివదనముద్రావతార
          శాసనుఁడు రాయ వేశ్యాభుజంగబిరుద
          మంత్రి పెద్దనసింగనామాత్యవరుఁడు.

అనియొక్క పద్యములో వేమభూపాలునిమంత్రి యైనట్టు చెప్పి తరువాత కృతిపతివంశాభివర్ణ నము చేసెను. ఈ ప్రకారముగానే యీ భీమఖండమును బెండపూడి యన్నయమంత్రికిఁ గృతి యిచ్చునప్పుడు

      సీ. ఏమంత్రికుల దైవ మిందుశేఖరుఁడు ద
                          క్షారామ భీమేశుఁ డఖిలకర్త
          యేమంత్రియేలిన యిక్ష్వాకుమాంధాతృ
                          రామసన్నిభుఁ డైనవేమనృపతి
          యేమంత్రిసితకీర్తి యేడువారాసుల
                          కడకొండయవలిచీఁకటికి గొంగ
          యేమంత్రిసౌభాగ్య మిగురుఁ గైదువ జోదు
                          లాలిత్యలీలకు మేలుబంతి

          యతఁడు కర్ణాటలాటబోటాంగవంగ
          కురుకుకురుకుంతలావంతి ఘూర్జరాది
          నృపసభాస్థానబుధవర్ణనీయసుగుణ
          మండనుఁడు బెండపూడన్న మంత్రివరుఁడు.

అని యొక్క పద్యములో వేనభూపాలుని మంత్రి యైనట్టు చెప్పి, యంతటితో నిలువక తరువాత ననావశ్యకముగా తదనుగ్రహసంపాదనార్థముగా వేమభూపాలుని వంశాభివర్ణనమును నడుమఁ బెట్టి

      సీ. పాతాళ భువనాధిపతికి శేషాహికిఁ
                      బ్రియలతో మసకానఁ బెఁడగఁగలిగె
         దిక్సింధురములకు దివ్యవాహిని లోనఁ
                     దేఁటిరాయిడి మా.. దేలనొదవె
         నుర్వీధరములకు నుదధిలోఁ గాపున్న :
                     కులముసాములయిండ్లఁ గడువనబ్బెఁ
         గుహనాకిటికి లక్ష్మికుచకుంభములమీఁది
                     కుంకుమంబు సుసు ల్గొనఁగఁగూడె

         రామ వేశ్యాభుజంగ వీరప్రతాప
         భాసి యల్లాడవీభువీరభద్ర నృపతి
         సర్వసర్వంసహాచక్ర సర్వభరము
         పృధుభుజావీరమున సంభరించుటయును.

లోనగు పద్యములలో వీరభద్రారెడ్డిని, తదగ్రజుఁడైన వేమారెడ్డిని యథేచ్ఛముగా స్తుతించెను. అన్నయమంత్రి తన్ను బిలిపించి

 
                సీ. వినిపించినాఁడవు వేమభూపాలున
                                  కఖిలపురాణవిద్యాగమములు
                    కల్పించినాఁడవు గాఢపాకంబైన
                                    హర్ష నైషధకావ్య మాంధ్రభాష
                    భాషించినాఁడవు బహు దేశ బుధులతో
                                    విద్యాపరీక్షణ వేళలందు
                    వెదచల్లినాఁడపు విశదకీర్తిస్ఫూర్తి
                                    కర్పూరములు దిశాంగణములందుఁ

                    బాకనాటింటివాఁడవు బాంధవుఁడవు
                    కమలనాభునిమనుమఁడ వమలమతివి
                    నాకుఁ గృపచేయు మొక ప్రబంధంబు నీవు
                    కలితగుణగణ్య : శ్రీనాథకవివరేణ్య |

అని వేఁడఁగా,


               సీ. ధరాసురత్రాణధాటీసమారంభ
                                    గర్వపాథోరాశికలశజులకు
                    సప్తమాడియ రాజఝూడియక్ష్మాపాల
                                    వందిత శ్రీపాదవనరుహులకు
                    సింహాద్రిపర్యంతసీమాంధ్రమేదినీ
                                    మండలీపాలనాఖండలులకు
                    హరిదంతదంతిదంతావళీలిఖ్యమా
                                    నానేకజయశాసనాక్షరులకు

         వీరభద్రేశ వేమపృధ్వీధవులకు
          ననుఁగుమంత్రి మహా ప్రధానాగ్రగణ్యు
          బెండపూడన్న జగనొబ్బగండబిరుద
          సచివదేవేంద్రుఁ గృతి కధీశ్వరునిఁ జేసి.

భీమేశ్వరపురాణమును రచించినట్టు కవి చెప్పుకొని యున్నాఁడు. పయివాని లోని మొదటి సీసపద్యముయొక్క నాలవచరణమువలనఁ గవి తా నావఱకే దేశాంగణములు తిరిగి కీర్తి నొందినట్లును, రెండవ సీసపద్యములోని మూడవ చరణమువలన వీరభద్రారెడ్డిరాజ్యము సింహాచలము పర్యంతమును వ్యాపించి యుండినట్టును దెలియవచ్చుచున్నది.

ఈకవికి విష్ణుకథలకంటె శివకధలమీఁద నాదర మత్యధికము. అందుచేత నీతడు భీమఖండములో సర్పపురకథయు, శ్రీకూర్మకథయు రెండు సర్గము లలో నున్నను వానిని దెనిగించుటలో నొక్క పద్యముతోను పద్యపాదము తోను సరి పెట్టెను. ఈతఁడు భీమఖండమును జేయుటలో 5-వ సర్గము నందలి

     శ్లో. అహో కి మేత న్మే బ్రూహి వైవర్జ్యం వదనే తవ.
        దృశ్యతే నేత్రయో ధైన్యం మానసవ్యథయానఘ !
        కశ్చి న్న జాతో వాగ్వాదః లోలార్కేణ సమం తవ
        డుంఠీ విఘ్నేశ్వరః కశ్చిత్ న త్వాం ధిక్కృతవా న్రుషా.
        కశ్చిత్త్వం క్షుధితః కాలే విశాలాక్ష్యా న వంచితః
        న కశ్చిత్త్వ య్యనుచితం భైరవేణ కృతం ముధా.
        కథం త్యక్తం త్వయా గంగావాహినీసైకతస్థలం
        కథం తత్పరమం స్థానం వ్యసృజ త్క్రోశపంచకం.
        కథం త్వంముక్తవాన్ప్రాప్యా మవిముక్తవసుంధరాం.
        కథం విశ్వేశ్వరం దేవం సతాముజ్ఝితవాన్ ధనం.

ఈ శ్లోకములను

          గీ. ఆననమునందు వైవర్ణ్య మగ్గలించెఁ
             గనుఁగవయందు దైన్యంబు గానఁబడియె
             నార్తి యేదేని యొకటి నీయంతరంగ
             మూని యున్నది యిది యెట్టు లొక్కొ యనఘ!

         సీ. లోలార్కునకు నీకు లోలోన నేమేని
                          పోటు వుట్టదు గదా మాటమాట
             వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి
                          ధిక్కరింపఁడు గదా తెగువ నిన్ను
             నాఁకొన్న నీన్ను మధ్యాహ్నకాలంబున
                          నరయకుండదు గదా యన్నపూర్ణ
             నెపమేమియును లేక నీయెడాటమ్మునఁ
                          బాటి తప్పఁడు గదా భైరవుండు

             ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప
             నెట్టు పాసితి వాస్థలం బేనుక్రోసు
             లెట్టు పాసితి యవిముక్త హట్టభూమి
             యెట్టు పాసితి విశ్వేశు నిందుధరుని. "

అని మూలానుసారముగా నెంతో మనోహరముగా తెనిగించిన కొన్ని స్థలములయందు మూలము ననుసరించియే యాంధ్రీకరించినను బహస్థలముల యందు మూలము నతిక్రమించి తన యిష్టానుసారముగా

        శ్లో. 'సప్తగోదావరతట క్రీడాసక్తస్య శీకరైః
             గజాస్యస్య కరోన్ముక్తైః క్లిన్న మార్తాండమండలమ్.'

(సప్తగోదావరతటమున క్రీడాసక్తుఁడయి యున్న గజాననునియొక్క తుండముచేత నెగఁజిమ్మబడిన శీకరములచేత నార్ద్రమైన సూర్యబింబమును గలది) అనుదానిని,

        “వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్త
         గోదావరసలిలధారాఝుణత్కారబృంహిత
         బ్రహ్మాండగోళంబు”

అనియు,

    శ్లో. సత్సమాగమమన్నామకథాశ్రవణ యోగతః,
         పాపక్షయో భవేద్దేవి ! మనుష్యాణాం కలౌ యుగే

(దేవీ ! సత్సమాగమమువలనను. నా నామకథాశ్రవణమువలనను కలియుగమునందు మనుష్యులకు పాపక్షయ మగును) అనుదానిని

       “పాపంబు లొకభంగిఁ బ్రక్షయం బందిన
        నామీఁద దృఢభక్తి నాఁటుకొనును”

అనియు, మూలమునకు భిన్నముగా భాషాంతరీకరించుటయే కాక యొకానొక చోట “సమర్థ స్స హి దేవరాట్' అనుదానిని “సంతతము దేవవేశ్యా భుజంగుఁడతఁడు అన్నట్లు సభ్యముగానున్న దాని నసభ్యముగాను తెనిఁగించుచు వచ్చి యున్నాఁడు. ఈ కడపటిదానిమూలమును. దాని భాషాంతరమును జూడుఁడు.

    శ్లో. కాలకూటోపసంహారీ, త్రిపురాసురమర్దనః,
       నిగ్రహానుగ్రహప్రౌఢః సమర్ద స్స హి దేవరాట్.

    గీ. కాలకూటోపసంహారకారి యతఁడు
       త్రిపుర దై త్యాధిపతుల మర్దించె నతడు
       నిగ్రహానుగ్రహప్రౌఢనిపుణుఁ డతఁడు
       సంతతము దేవవేశ్యాభుజంగుఁ డతఁడు.

“దృఢసమర్థుండు చూ దేవదేవుఁ డతడు” అను రీతి నేదో యొక విధముగా మూలానుసారముగాఁ దెనిఁగింపక దేవతావర్ణనలోఁగూడ స్వకపోలకల్పిత ముగా శృంగారమును జొప్పించుట కవియొక్క శృంగారనాయక నిపుణత్వమును వెల్లడించుచున్నది. శ్రీనాధుఁడు స్త్రీలోలుఁడని లోకములో బలమైన వాడుకయు, తదనుగుణముల్లెన కథలును, పారంపర్యముగ వచ్చుచున్నవి. ఈ పద్యమే కాక గ్రంధములోని యితరపద్యములు సహిత మనేకము లాతని శృంగారనాయికా ప్రియత్వమును దెలుపుచున్నవి. భీమేశ్వరపురాణమును మొట్టమొదట బ్రకటించిన వారు తమ పీఠికలో 'పంచారామవధూటీ! పంచాస్త్ర విహార కేళిపాంచాలునకున్' అన్న షష్ఠ్యంతభాగము నుదాహరించి, ఇది యాకృతిపతికేనిఁ బంచారామవాసులగు పుణ్యాంగనలకేని గౌరవజనకంబుగ మాకుఁ దోఁచదు' అని వ్రాసి యున్నారు. ఇది గాక వుస్తకములో దీనిని మించిన పద్యము లున్నవి.

   శా. కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూషావళుల్
       లంచం బిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూఁ డన్ననిన్
       పంచాస్త్రోపముఁ దారతార కవయం బ్రార్థించి లోలోపలన్
       బంచారామములందుఁ [22] బల్లె లఁ బురిం బ్రౌఢేందుబింబాననల్

పంచారామములందు, పల్లెలలోను పట్టణములోను గల ప్రౌఢ స్త్రీలు తాము తామే బెండపూడి యన్నయను గవయుటకు కాంచీకంకణాదులైన భూషణములను తారుపుకత్తెలకు లంచము లిత్తురట! అత్యంత శివభక్తుఁడైన బెండపూడిఁ యన్నయ్య నిజముగానే జారుఁడయినను శాశ్వతముగా నుండదఁగి యాతఁడు కృతిపతిగాఁ గల గ్రంథములలో నిట్లుండుట సిగ్గుల చేటు కాదా ? ఈ విషయమున శివునకే గతీ లేనప్పుడు శివభక్తునిమాట చెప్పనేటికి ?

  మ. ఎనయంగల్గిన కూర్మి భృంగిరిటిగానీ దుండిఁ గానీ నికుం
      భునిఁ గానీ కయిదండ పట్టుకోని సంభోగేచ్చ నంతఃపురాం
      గనలం గన్ను మొఱంగి యప్పురములోనం గన్నె కాఁదారి ప్రొ
      ద్దున భీమేశుఁడు సానివాడ కరుగున్ ధూర్త ప్రకారంబునన్.

చీఁకటిపడఁగానే భీమేశ్వరస్వామి దాక్షారామములో భృంగిరిటీనో మఱియొకరినో కైదండగొని యంతఃపురస్త్రీలను టక్కుపెట్టి సంభోగేచ్చతో సానివీధి కరుగునఁట! దీని పయి పద్యములో దక్షపురిసానికూఁతుల దవిలినాఁడు ! విశ్వలోకకుటుంబి భీమేశ్వరుండు" అని చెప్పఁబడినది దీని క్రింది పద్యములో

      క. పదునాల్గు మహాయుగముల
         ముదుకగు భీమేశ్వరునకు మొగచాటై యుం
         డదు సాని పెండ్లి యెప్పుడు
         నది దాక్షారామమహిమ మగునో కాదో !

దాక్షారామముయొక్క యీమహిమ యద్భుతమైనది. ఈ మహిమ శ్రీనాథుని కాలమునకే తగినది. ఆ కాలమునందు జారత్వము తప్పుగా గణింపఁబడక పోవుటయే కాక యది కలిగి యుండుటయే ప్రతిష్టావహముగాను, పురుషుల కది వర్ణనీయమైన గుణవిశేషము గాను తలఁపబడుచుండునట్లు శ్రీనాథమహా కవివర్ణనలవలనఁ గనఁబడుచున్నది. శ్రీనాధుఁడు కథారంభమునకు ముందు భీమఖండమునందు దాక్షారామపురవర్ణనము చేయుచు నా పురములో సానులు తప్ప బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రు లెవ్వరును లేనట్టుగా నొక్క సానులను మాత్రమే యత్యధికముగా బహుపద్యములలో నభివర్ణించెను. సప్తగోదావరము “దేవగంధర్వాప్సరోవధూటీ స్తనస్థానక శ్రీగంధధవళితం' బఁట ! ఇందుఁ బేర్కొనఁబడిన గంధర్వాప్సరోవధూటులు సానివారు. వారి నెప్పుడు వర్ణించినను శ్రీనాధుఁడు వారి గౌరవమునకు కొఱతరాకుండునట్లుగా సాధారణముగా నిటువంటి పదములనే వారియెడఁ బ్రయోగించుచుండును. అట్టిదొక్క పద్యము మాత్రము భీమఖండములోని దుదాహరించెదను.

    మ. మొరయించువ్ వరుఁ డిక్షుచాప మనిశంబుం దక్షవాటీమహా
        పురమధ్యంబున ముజ్జగంబు గెలువం బుత్తెంచులీలం బురం
        దరవిశ్రాణిత దేవతాభువనగంథర్వాప్సరోభామినీ
        చరణాంబోరుహనూపురస్వనములన్ జంకించు ఝంకారముల్.

“గంధర్వాప్సరోభామినీ” శబ్దసామ్యముచేతఁ దెలుగుఁరాయనిఁ గస్తూరి వేఁడిన పద్యము నిచ్చట మరల నుదాహరింప బుద్ధి పుట్టుచున్నది.

    శా. అక్షయ్యంబగు సాంపరాయని తెనుంగాధీశ! కస్తూరికా
        భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకస్వామికిన్
        దాక్షారామపురీవిహారపర “గంధర్వాప్సరోభామినీ
        వక్షోజద్వయకుంభికుంభములపై వాసించు నవ్వాసనల్.

ఇది దెలుగుఁరాయని కస్తూరి వేడిన పద్యము. ఈ కస్తూరిభిక్షాదాన మెవ్వరికి? సుకవిరాడ్పృందారకస్వామికి. సుకవిరాడ్బృందారకస్వామి యెవ్వరు ? సుకవి రాజేంద్రుఁ డయిన శ్రీనాథకవి కోరబడిన కస్తూరికాఁ దాన మెట్లు సార్థక మగును ? దాక్షారామపురీ విహారపరగంధర్వాప్సరోభామినీ వక్షోజద్వయ కుంభీకుంభములపై వాసించుటచేత. ఈ గంధర్వాప్సరోభామిను లెవ్వరు ? సానివారు : ఈ పద్యము సాధారణముగా "సుకవిరాడ్పుృందారక శ్రేణికిన్" అని చదువఁబడుచున్నది గాని యది సరియైన పాఠముగాదు; శ్రీనాథుఁడు కస్తూరీ వేఁడిన సందర్భమునఁ బొసఁగదు. దీనినిబట్టి శ్రీనాథునకును దాక్షా రామగంధర్వాప్సరోభామినులకును గల సంబంధ మేదో బుద్ధిమంతులు సులభముగా నూహించి గ్రహింపవచ్చును. మానవల్లి రామకృష్ణకవిగారు తమ క్రీడారామపీఠికలో “నక్షయ్యంబుగ” అను పద్యము నుదాహరించి యా సందర్భమున “దీనిచే శ్రీనాధునకు దాక్షారామవేశ్యలతో సంబంధముగలదని వేఱుగఁ జెప్పనక్కఱలేదు. వీథినాటకములోని చిన్నిపోతియే శ్రీనాథునకుఁ గూర్చు మగువయో యని సందియము కలుగుచున్నది.” అని వ్రాసిరి.

    సీ. అలకాపురంబున నంగారపర్ణుఁ డన్
                     గంధర్వపతికన్య కమలపాణి
       యా దివ్యగంధర్వి కపరావతారంబు
                     మధుమావతోర్గంటిమండలమున

             నా సుందరాంగి దాక్షారామమునఁ బుట్టు
                        భువనమోహినీ చిన్ని పోతి యనఁగ
                                                      [క్రీడాభిరామము]

ఈ భీమేశ్వరపురాణము శృంగారనైషధమువలెనే సంస్కృతపద భూయిష్ఠముగా నున్నను చక్కని లోకోక్తులతోను, భాషీయములతోను నిండియుండి మంచి కవిత్వశైలిని నేర్చుకోనఁగోరువారి కనుకరణీయములైన రచనావిశేషములతోడఁ గూడి రసికజనహృదయంగమముగా నున్నది.

ఎక్కడనుండి యైనఁ గ్రొత్తగా నొక కవీశ్వరుఁడు గాని పండితుఁడు గాని తమపట్టణమునకు వచ్చినప్పు డచ్చటి పండితులు మత్సరగ్రస్తులయి యా నూతనవిద్వాంసుని నాక్షేపించుటయుఁ బరాభవింపఁ జూచుటయు సామాన్యములే గదా ! శ్రీనాధకవి కర్ణాటక దేశమునుండి రాగానే రాజమహేంద్ర పరమునందలి పండితులు శ్రీనాథుని కవిత్వమంతయు సంస్కృతభాషయే యనియు, మాటల చమత్కారముచేతఁ దెలుఁగుభాషలాగునఁ గనఁబడు చున్నను నిజముగా కర్ణాట భాషాధోరణియే యనియు, ఆక్షేపింపఁ జొచ్చిరి. ఈ యాక్షేపణములను మనస్సునం దుంచుకొనియే శ్రీనాథుఁడు రాజమహేంద్రవరపండితులమీఁది కోపముచేత కుకవిదూషణ మను నెపముచేత భీమఖండములో నీ క్రింది పద్యములను వేసెను -

          గీ. బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు
             శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
             కూపమండూకములఁబోలెఁ గొంచె మెఱిఁగి
             పండితంమన్యులైన వైతండికులకు.

          గీ. నీటమున నుండి శ్రుతిపుటనిష్ఠురముగ
             నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు
             డుదధి రాయంచ యూరక యుంట లెస్స
             సైఁప రాకున్న నేందేనిఁ జనుట యొప్పు

    గీ. బ్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు
        పలుకునుడికారమున నాంధ్రభాష యందు
        రెవ్వ రేమన్న నండ్రుగా[23] కేమి కొఱఁత ?
        నాకవిత్వంబు నీజము కర్ణాటభాష !

ఈ కడపటి పద్యములోనివి. త న్నితరు లాక్షేపించునప్పుడు సమాధానముగాఁ జెప్పఁ బడిన పరిహాసగర్పీతములైన మాటలేకానీ తన కవిత్వము కర్ణాటభాష యని శ్రీనాథుని యభిప్రాయ మెంతమాత్రమును గాదు.[24] ఇట్లన్యాపదేశముగా దూషించుటయే కాక రాజమహేంద్రవండితులను శ్రీనాథుఁడు బహుపద్యములయం దాక్షేపించి యున్నాఁడు:

    శా. .............................................
        ..........................................వి.
        ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
        ధ్వంసాభావము ప్రాగభావము మనుచుం దరింతు రశ్రాంతమున్.

    మ. శ్రుతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుం డంత నానాధ్వర
        వ్రతుడై పోయి కనున్ బురందరపురారామద్రుమానల్పక
        ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసుప్తప్రాప్తరంభాంగనా
        ప్రతిరోమాంకురపాటనక్రమకళాపాండిత్య శౌండీర్యముల్.

     వ. “కీర్తివిహారఘంటాపధం బైన పంటమహాన్వయంబునఁ బాఁకనాటి
         దేశంబున భద్రపీఠంబున నధివసించిన -------- పోలయ వే

మాన్నెపోతాన్న వేమకుమారగిరీశ్వరాదుల ...................సంబంధ బాంధవ్యంబున వసుంధరాభారధౌరంధర్యంబు నంది.................... అల్లాడ భూవల్లంభుఁడు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రి పర్యంతంబు............విశ్వవిశ్వంభరాభువనమండలంబుఁ దదనంతరంబ.

      గీ. రాజరఘురాము లల్లాడరమణసుతులు
         ధాత్రిఁ బాలింతు రాచంద్రతారకముగ
         వేమభూవల్లభుండును వీరవిభుఁడు
         నన్నదమ్ములు హలియును హరియుఁ బోలె.

     ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రునిన్
         నమ్మదలీల రాజ్యభరణస్థితిఁ బట్టముగట్టి బహుద
         ర్పమ్మున వేమభూవరుఁడు వ్రాసె జగద్విజయప్రశస్తివ
         ర్ణమ్ములు దిగ్ధురంధరసురద్విపకుంభవిషాణమండలిన్."

అను భీమపురాణములోని గద్యపద్యములవలన నల్లాడభూపతి కొండవీటిరెడ్డి రాజులతోడి సంబంధబాంధవ్యమువలన రాజ్యలాభమును బొందినట్లగపడుచున్నది, గాని యీ బాంధవ్య మెట్టిదోమాత్ర మీ పురాణమువలన బోధపడదు. కొండవీటిరెడ్డిరాజులతోడి బాంధవ్యమువలన రాజమహేంద్రవరరాజ్యము కాటయ వేమారెడ్డికి లభించిన విధము కొంతకాలముక్రిందట చింతామణిలోఁ బ్రకటింపబడిన యీ క్రింది మల్లాంబిక (కాటయ వేముని భార్య) యొక్క తొ త్తరమూడి దానశాసనమువలనఁ దేటపడుచున్నది.

    శ్లో. తత్ర పంటకులం నామ ! ప్రసూతం బహుశాఖిని,
        తరావివ ఫలం రమ్యం వృత్తం సరస ముజ్జ్వలం,
        తత్రాసీ ద్వేమభూపాలః కులే విబుధరంజకః,
        పయోధావివ సంతానో రాజరత్నోద్భవాకరే.
        శ్రీ మాన్వేమమహీపతి స్స విదధే పాతాళగంగాతటే
        శ్రీశైలే జగనొబ్బగండ బిరుదస్సోపానవీధీం శుభాం.

          యాసౌ దీవ్యతి దీవ్యసీమ నగరారోహోద్యతానాం నృణాం
           నిశ్రేణిః పరికల్పితేన నితరా మా బ్రహృకల్పస్థిరా.
           యస్మిన్నిసీమభూదాన ఖ్యాతి సౌభాగ్యశాలిని,
           ద్విజైర్న బహుమన్యంతే బలీభౌవనభార్గవాః.
           మహా సేనో మహా దేవో దివారాతికులాంతకః
           అనపోతమహీపతౌ ధరిత్రీం పరితో బిభ్రతి పన్నగేంద్రముఖ్యాః,
           చిరముచ్ఛ్వసితాలఘూకృతే స్వేఛరణే జీవనమస్య సంస్తువంతి.
           తస్యానుజ సుజన నో౽స్తి వసంతరాయో
           వీరాన్న వేమనృపతిః క్షురికా సహాయః
           యస్మిన్మహీ మవతి సార్థ మభూ ఛ్చిరాయుః
           నామావనే సుమనసాం బహుశో వదాన్యే.
           హేమాద్రిదాననిరతే యస్మిన్ననవేమభూపతౌ ముదితాన్.
           అవలోక్య భూమిదేవాన్ దేవాః స్పృహంతి భూమివాసాయ.
           యస్మిన్ కిరతి వసంతే దిశిదిశి కామోత్సవేషు కర్పూరం,
           అధివాసితపరీధానానుభవజ్ఞో౽భూచ్చిరాయ గిరిశో౽పి.
           కుమారగిరిభూపో౽భూ దనపోతవిభోస్సుతః
           జయతో వాసవన్యేవ ప్రద్యుమ్న ఇవ శార్ఙ్గిణః
           కొండవీడు రీతి ఖ్యాతే పురే స్థిత్వా కులాగతే,
           కుమారగిరీభూపో౽యం చిరం భూమి మపాలయత్.
           తులపురుషరత్నస్య శ్రీకుమారగిరేః కుతః.
           తులాపురుషముఖ్యాని మహాదానాని యో౽తనోత్,
           ఆసీదమాత్యరత్నం కాటయవేమప్రభుస్తస్య,
           అతిసురగురుభార్గవమతి రతిభార్గవవిజయవిఖ్యాతిః
           సింహాసనే నిధాయాసౌ కుమారగిరిభూవరం,
           అతేజయ న్మహాతేజా శ్రీకృష్ణ ఇవ ధర్మజం.
           కుమారగిరిభూనాధో యస్మై విక్రమతోషితః
           ప్రాదాత్ ప్రాచీభువం రాజమహేంద్రనగరీముఖాం

       నప్తా కాటమహీభుజో గుణగణోదారస్య మారప్రభోః
        పౌత్రః కాటయవేమభూమిరమణః శ్రీవేమపృధ్వీపతేః.
        దౌహిత్రఃపునరన్నపోతనృపతే ర్ధాత్రీశచూడామణీ
        ర్జామాతా జయతి క్షితిం చిరమవన్ దొడ్డాంబికానందనః
        కాటయ వేమకటాక్షే ప్రభవతి సదయే చ నిర్దయే చ తదా.
        గజపతిముఖనృపతీనాం చిత్రం ముక్తాతపత్రతా భవతి.
        భూపాలన్నమయన్ ప్రజాన్నియమయన్ కాంతాజనం కామయన్
        భూదేవాన్ రమయ న్నరీన్విరమయన్ మిత్రాణి విశ్రామయన్.
        కీర్తింవిభ్రమయ న్నఘాని శమయన్ ధర్మం సమాయామయన్
        సో౽యం వేమమహీపతి ర్విజయతే కాటావనీశాత్మజః
        అభూ త్కాటయ వేమస్య జాయా మల్లాంబికా సతీ,
        అశేషగుణసంపూర్ణ పాతివ్రత్యధురంధరా.
        రాజద్రాజమహేంద్రనామనగరే గోదావరీతీరగం
        మార్కండేయశివాలయం పతిహితా మల్లాంబికా ధార్మికా,
        కృత్వా శుద్ధసువర్ణ రత్న ఖచితం బ్రహ్మప్రతిష్ఠాస్తదా
        సత్రాణ్యధ్వని చ ప్రసాది జయతే౽నేకాన్తటాకానపి,
        శ్రీశాకే గుణ రామవిశ్వ గణితే కార్తిక్య హేబ్దే ఖరే
        ప్రాదాత్కాటయవేమయస్య వనితా మల్లాంబికా నామతః,
        గ్రామం మల్ల వరం నృసింహవిదుషే కాణ్వద్విజాయాదరా
        దాచంద్రార్క ముదర్కలాలసమతే నైశ్వర్యభోగాష్టకం.
        కోనదేశే౽గ్రహారో యం భాతి మల్లవరాభిదః
        తీరే చ వృద్ధగౌతమ్యాః పుణ్యే ముక్తీశ్వరాంతికే.

ఈ శాసనమునుబట్టి పంటకులమునందు శ్రీశైలమునకు మెట్లు కట్టించిన వేమభూపాలుఁ డుదయించినట్టును, ఆతని కనపోతభూపాలుఁడును, అనవేమ భూపాలుఁడును పుట్టినట్టును, అనపోతభూపాలుని కుమారుఁడయిన కుమార గిరిభూపాలుఁడు కొండవీటిరాజ్య మేలుచుఁ దన తోఁబుట్టువగు మల్లాంబి కకు భర్తయుఁ దనకు మంత్రియు నగు కాటయవేమభూపాలునకు రాజమహేంద్రవరము మొదలుగాఁ గల తూర్పుదేశము నిచ్చినట్టును, ఆ మల్లాంబ రాజమహేంద్రవరమున మార్కండేయ శివాలయమును గట్టించి శాలివాహనశకము 1333-వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1400 ఖరనామసంవత్సర కార్తికశుద్ధపూర్ణిమనాడు కోనసీమలోని మల్లవరమును నృసింహశాస్త్రికి దానము చేసినట్టును, తెలియవచ్చుచున్నది. భీమఖండము 143ం-వ సంవత్సరప్రాంతమునం దనఁగాఁ గవి కఱవది సంవత్సరములు దాటిన తరువాతనే చేయబడినది. ఈ గ్రంథరచనము చేసినతరువాతఁ గాని శ్రీనాధుఁడు తన కవిసార్వభౌమ బిరుదాంకాదికథలనంత బహిరంగముగాఁ జెప్పుకొన నారంభింపలేదు, భీమఖండము తుది గద్యమునందు "సుకవిజనవిధేయ సకలవిద్యాసనాధ శ్రీనాథనామధేయ ప్రణీతం" బని మాత్రమే వేసికొనియెను. తాను కవిసార్వభౌముఁడ నని భీమఖండములో మఱి యెక్కడను చేప్పుకొనలేదు, ఈ భీమేశ్వరపురాణ రచనముచేత శ్రీనాథునకు రాజాశ్రయము లభించి సంపూర్ణ మనోరథసిద్ది కలిగెను. అతఁ డప్పటినుండియు రాజానుగ్రహమునకుఁ బాత్రుఁడయి వేమవీరభద్రారెడ్ల యాస్థానకవి యయి మహాగౌరవపదము ననుభవింపఁ దొడఁగెను. తరువాత శీఘ్రకాలములో నే శ్రీనాధమహాకవి కాశీఖండమును తెనిఁగించి దానికి వీరభద్రారెడ్డిని కృతిపతిని జేసి రాజసమ్మానమును బడసెను. కాశీఖండము 1435-వ సంవత్సర ప్రాంతమునందు రచియింపఁబడియుండును. కవి కప్పటికి దాదాపుగా డెబ్బది సంవత్సరములప్రాయముండును. తన గ్రంథరచనమునుగూర్చి శ్రీనాధుఁడు కాశీఖండములో నిట్లు చెప్పుకొనెను--

              సీ. చిన్నారిపొన్నారి చిఱుతకూకటినాఁడు
                            రచియించితి మరుత్తరాట్చరిత్ర
                 నూనూఁగుమీసాల నూత్న యౌవనమున
                            శాలివాహనసప్తశతి నొడివితి

               సంతరించితి నిండుజవ్వనంబునయందు
                                హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
               బ్రౌఢనిర్ఫరవయఃపరిపాకమునఁ గొని
                                యాడితి భీమనాయకునిమహిమఁ

               బ్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండఁ
               గాశికాఖఁడ నను మహా గ్రంధ మేను
               దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక
               పద్మవనహేళి శ్రీనాధభట్టసుకవి.

ఈ పద్యమునందు 'కర్ణాటదేశకటకపద్మవనహేళి' యని తనకు విశేషణము వేసికొని తాను గర్ణాటరాజ్యరాజధానియందు విద్యావిజయము నొంది యచ్చటి పండితులను సంతోష పెట్టితినని సూచించియున్నాఁడు. 'కర్ణాటదేశ కటకపద్మవన హేళి' యనఁగా కర్ణాటదేశరాజధాని యనెడు పద్మరాజికి సూర్యుఁ డని యర్ధము. సూర్యుఁ డెట్లు పద్మవనము నలరించునో, యట్లే తానును కర్ణాటకకటకవాసులైన బుధబృందము నలరించినవాఁడనని కవి యభిప్రాయము. ఇట్లు రాజాశ్రయబలమున ధైర్యమును వహించి కాశీ ఖండమునందు తన యాస్వాసాంతగద్యమున వెనుకటిగద్యములోని 'సకలవిద్యా సనాధ'కు మాఱుగా కవిసార్వభౌమవిశేషణమును దన పేరునకు ముందుఁబెట్టి 'సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాధనామధేయప్రణీతం' బని బహిరంగముగాఁ దాను కవిసార్వభౌముఁడ నని చెప్పుకొన సాహసించెను. అంతేకాక సప్తమా శ్వాసాంతపద్యములలో నొకదానియందుఁ గృతిపతిని సంబోధించుచు

         శా. కర్ణాటక్షితిపాలమౌక్తికసభాగారాంతరాకల్పిత
              స్వర్ణస్నానజగత్ప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచరిత్ర ! దు
              గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్ణముఖ మధ్యాహ్నాపరాహ్ణార్చితా
              పర్ణావల్లభ ! రాజశేఖరమణీ ! పంటాన్వయగ్రామణీ !

అని తాను కర్ణాటాధీశ్వరుని ముత్యాలశాలలోఁ గనకాభిషేక గౌరవమును బొందినకధను గూడ నిశ్శంకముసో జెప్పుకొనెను, దీనినిబట్టి కొందఱు భీమఖండమును రచించినతరువాతను కాశీఖండము రచియింపకముందును శ్రీనాధుఁడు కర్ణాటక దేశమునకుఁ బోయి యచ్చటఁ దన పాండిత్య ప్రకర్షము చేత డిండిమభట్టు నోడించి కవిసార్వభౌమ బిరుదమును కనకాభి షేకమును గాంచెనని చెప్పుదురు గాని శ్రీనాధమహాకవి రాజమహేంద్రవరమున స్థిర పడినతరువాత దేశాంతరగమనముచేయుట కావశ్యకముకాని యవకాశము కాని కానరాదు.[25]

అల్లాడరెడ్డి పోలయ వేమాదులగు కొండవీటి రెడ్లతోడ సంబంధబాంధవ్యంబున వసుంధరాభారదౌరంధర్యంబు నొందెనని చెప్పఁబడుటయే కాని భీమఖండములో నా బంధుత్వ మెట్టిదో వివరింపఁబడలేదు, కాశీఖండములోని యీ క్రింది పద్యమువలన నల్లాడభూపతి యనవేమారెడ్డిపౌత్రి యైన వేమాంబను వివాహమాడి వేమవీరభద్రాదిపుత్రులను బడసినట్లు బాంధవముమాత్రము తేటపడుచున్నది.

     మ. అనవేమక్షితిపాలపౌత్రి యగు వేమాంబామహాదేవికిన్
         ఘనుఁ డయ్యలడభూమి పాలునకు సంగ్రామస్థలీగాండివుల్
         తనయు ల్వేమవిభుండు ఏరవసుధాధ్యక్షుడు దొడ్డ ప్రభుం
         డును నన్నయ్యయు బాహువిక్రమకళాటోపప్రతాపోద్ధతుల్.

అల్లాడ రెడ్డి వేమాంబికను వివాహ మాడుటచేత నరణముగా రాజమహేంద్రవరరాజ్యమును బడ సెనేమో యని పయి పద్యమువలన భ్రమ కలుగవచ్చును గాని పూర్వోదాహృతమయిన మల్లాం బికయొక్క తొత్తరమూడి శాసనమువలన రాజమహేంద్రవరరాజ్య మల్లాడరెడ్డికిఁగాక కాటయ వేమా రెడ్డికి వచ్చినట్టు స్పష్టమయి భ్రమ కొంతవఱకు నివారణ మగుచున్నది. అయినను దానివలన నా రాజ్య మల్లాడరెడ్డికిని దత్సంతతివారికిని నెట్లు వచ్చెనో తెలియరాదు. ఈ యంశమును మఱికొన్ని నూతనాంశములును వీరభద్రారెడ్డి భార్యయైన యనితల్లి యొక్క కలువచేఱు శాసనమువలనఁ దెలియవచ్చుచున్నవి. కాఁబట్టి యా శాసనమును చరిత్రాంశములతో సంబం ధించినంతవఱకు నిందుదాహరించుచున్నాను.

   శ్లో. కాకత్యాః పరశక్తేః కృపయా కూశ్మాండవల్లి కా కాచిత్,
        పుత్ర మసూత తదేత త్కుల మనఘం కాకతీయసంజ్ఞ మభూత్ 21

        పిత ర్యుపర తే తిద్వ దరక్ష దఖిలాం క్షితిం,
        వీరరుద్రమదేవీతి దుహితా గుణైః 22

        అధ సా రుద్రమదేవీ ప్రతాపరుద్రే హృతారినృపభద్రే.
        దౌహిత్రే సుచరిత్రే సర్వా ముర్వీం నిధాయ ముదితవతీ. 23


* * * * *



        వరాహవ ద్వారిధివారిమగ్నౌం ధరా మశేషాం యవనోదరస్థాం,
        సముద్దరన్ ప్రోలయనాయకేంద్ర స్తతః ప్రతిష్ఠాపయతిస్మ తద్వత్ 25
   
        స్వర్గతిధౌ ప్రోలయభూమీపాలే విశ్వేశ్వరాజ్ఞా మధిగమ్య గత్వా.
        అపాలయత్కాపయనాయకేంద్ర స్తదీయరాజ్యం తరణి ప్రతాపః.
        అథ పంచోత్తరసప్తతినాయకసంసేవ్యమానపదపద్మః
        కపావనీశ్వరః శ్రీవిశ్వేశ్వరకరుణయా క్షితి మరక్షత్. 30
        తురుష్కై ర్యే సమాక్రాంతా స్తే చాన్యే కాపభూభుజా,
        అగ్రహారాః పున ర్ధత్తా భూయో భువతమభూషయన్. 31

          విశ్వేశ్వరాయ వివిధాం ప్రవిధాయ సేవాం
          యా తే విభౌ దివిః చ తత్పద సేవనాయి,
          తై ర్నాయకైః స్వనగరాణ్యధిగమ్య సర్వై
          సంరక్షితా గతవిరోధకథేః స్వదేశాః 32
          తేషాం వేమనరేశ్వరః క్షితిభుజాం ధర్మాత్మనా మగ్రణీ
          శ్శశ్వ ద్భారతదివ్యపూరుషకథా ధౌతాంతరంగ స్సుధీః,
          శ్రీమత్పంటకులోద్భవ శ్శివపదద్వంద్వైక సేవాపరో
          విప్రాశీర్వచనోన్నతో జితరిపుఃస్ఫూర్జత్ప్రతాపోదయః ౩౩
          ప్రాప్తైపాతాళగంగాయా మర్పితో వేమభూభుజా,
          సా సోపానావళీ చిత్రం స్వర్గంగా ప్త్యధిరోహిణీ 34
          పుత్రా ధాత్రీపతే స్తస్య త్రిమూర్తయ ఇవత్రయః
          అన్నపోతాన్నమాచాన్న వేమనామవిభూషణాః 35
          అన్నపోతవిభోః పుత్రః కుమారగిరి రున్నతః,
          శివావానతయా భాతి భూభృత్కులశిరోమణిః 36
          అస్తి ప్రశస్తగుణభూ రరిజిద్భుజశ్రీః
          కీర్తిప్రియో జగతి కాటయ వేమభూపః.
          భక్త్యా కుమారగిరిభూమిపతే ర్య ఆసీ
          త్సూన్వగ్రజానుజసుహృత్సచివాదిరూపః, 37
          శ్రీమత్కాటయభూపతే ర్భుజభృతో నప్తా ప్రతాపోన్నతేః
          పౌత్రో మారమహీశ్వరస్య తనయ శ్రీకాటయోర్వీవిభోః
          జామాతా ప్రభు రన్నపోతనృపతే ర్వేమక్షమాధీశ్వరో
          యస్యాసీ త్స కుమారగిర్యధిపతి స్యాలః పతి ర్దైవతం 38
          మాలా మమ్లానపుష్పా మివ శిరసి వహన్యస్య భూభర్త రాజ్ఞా
          ముర్వీం ఖర్వీకృతారిక్షితిపతి రఖిలా మప్రతీపప్రతాపః
          జిత్వా సామ్రాజ్యలక్ష్మీమనుపమవిభవాం జృంభయ న్సంభృతశ్రీ
          కీర్తి స్సేవాపరో భూ త్కొమరగిరేవిభోః కాటయాధీశ వేమః 39

        వేమవిభుర్లక్ష్మీవా నంగీకృతసర్వమంగళ్ జిష్ణుః,
        ప్రద్నుమ్నం శక్తిధరం జయంత మయతి స్మ సుతకుమారగిరిం 40
        జాతమాత్రేణ జాతో సౌ సర్వసర్వంసహేశ్వరః
        ఆదిగర్భేశ్వరః ఖ్యాతః కుమారగిరిభూపతిః 41
        యస్యా వేమనృపాలో జనకో దొడ్డాంబికా తు జనయిత్రీ,
        సా దివ్య త్యనితల్లీ సమూర్తి రివ దేవభూమిదేవశ్రీః. 42
        వేమక్షితీశతిలకే౽థ కథావశేషే
        భర్తా కుమారగిరి రస్య సుతో భువో౽భూత్.
        పశ్చాద్ధరాధిపతిభావజుగుప్సయేవ
        స్వస్థాన ఏవ స కుమారగిరీశ్వరో౽పి 43
        అథ వేమేశ్వరబంధు ర్విలసతి భువనప్రశస్తసింధుః,
        దొడ్డయయల్ల నరేంద్రః ప్రథితమహాసమర కేళినిస్తంద్రః. 44
        స్వామిద్రోహాపరాయణకునృపతిజలరాశిజలనిమగ్నధరాం,
        దొడ్డయయల్ల నరేంద్రో హరి రివ సౌకర్యత స్సముద్ధృతవాన్. 45
        దురితరహితచిత్తో దొడ్డయాల్లాడభూపో
        మవ మరిజనవశ్యాం భూయసాహృత్య దోష్ణా,
        విమలగుణయుతాయాం వేమభూపాత్మజాయా
        మవనిసురసుధాయా మన్నితల్యాం న్యధత్త. 46
        భూలోకభాగ్యోదితకల్పవల్లీ శిష్టాశ్రితానిష్టవిభేదభల్లీ,
        పవిత్రచారిత్రవధూమతల్లీ వేమక్షితీశస్య సుతాన్నితల్లీ , 47
        తస్యాః పతిః పతి రశేషమహీపతీనాం
        వేమాంబికాల్లయనృపాలవరేణ్యసూను:
        శ్రీవీరభద్ర ఇతి సర్వగుణై కభద్రః
        కీర్తిప్రతాపతులితేశ్వరవీరభద్రః 48
        తస్యాగ్రతో జయతి వేమయభూతలేంద్ర
        శ్రీ కామినీవివిధచారువిలాససాంద్రః
        ఆవ్యానభిజ్ఞ సముపాశ్రితరామచంద్ర

      ప్రత్యర్థివంశకమలాకరపూర్ణ చంద్రః
      వినతనరపాలపాళీకనదురుమౌళి స్రగుదితగంధపాదాబ్జా
      అనితల్లీ పతిదేవా ఘనసచివీభూత భావుకా భువ మవతి.
      శాకే శరయుగవిశ్వే వైశాఖే మాసి భువ మప త్యనితల్లీ.
      సురవిప్రక్షేత్రకరం మార్కండేయేశసన్నిధౌ త్యక్తవతీ


* * * * * *



     శాకాబ్దే శరవేదరామశశభృత్సంఖ్యే శుభే శోభకృ
     ద్వర్షే శ్రావణకృష్ణవిష్ణుదివసే శ్రీకల్వచేఱుం శుభం.
     గ్రామం దత్తవతీ సతీ పరహితాచార్యా శైలాధిప
     శ్రీరామేశ్వరసన్నిధౌ పతిహిత శ్రీరన్నతల్ల్యంబికా.
     గ్రామస్య కలువచేఱో రన్నవరాఖ్యాం విధాయ నిజనామ్నా,
     పరహితభిషజే ప్రాదా దనితల్లీ గ్రామ మష్టభూతియుతం.

ఈ శాసనము శాలివాహనశకము 1345 శోభకృత్సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశినా డనఁగా క్రీస్తుశకము 1423-వ సంవత్సరమునందు కలువచేఱు గ్రామమును అన్నవర మనుస్వనామముతో ననితల్లి పరహితాచార్యుఁ డను వైద్యశిఖామణి కగ్రహారముగా నిచ్చిన సందర్భమున వ్రాయఁబడినది. ఈ శాసనమునుబట్టి రాజమహేంద్రవరరాజ్యము కాటయ వేమారెడ్డి యనంతరమున నాతఁడు పుత్రహీనుఁడై న తరువాత నాతనిపుత్రిక యైన యనితల్లి కి వచ్చినట్టును, ఆమె పేరనే మొదట మామయయిన యల్లాడరెడ్డియు, పిమ్మట బావమైన వేమారెడ్డియు రాజ్యపాలనము చేసి నట్టును స్పష్టపడుచున్నది. రాజమహేంద్రవరరాజ్యము ననితల్లి పక్షమునఁ దన జీవితకాలములో నల్లాడరెడ్డి 1416-వ సంవత్సరము మొదలుకొని 1426-వ సంవత్సరమువఱకును పాలనము చేసెను. ఈతని పాలన కాలములోనే 1423-వ సంవత్సరమున ననితల్లి పేర దానశాసన ముండుట యితఁ డామె ప్రతినిధిగానే భూపరిపాలన మొనర్చినట్లు స్పష్టముగాఁ దెలియ వచ్చుచున్నది. 1429-వ సంవత్సరము మొదలుకొని భర్తయైనవీరభద్రారెడ్డియు బావయైన వేమారెడ్డియు రాజ్యమేలుట యనితల్లిపక్షముననే యని వేఱుగఁ జెప్పవలసినపనీయే లేదు. కాశీఖండమునందు రాజ్య మనితల్లి దేయని కాని, యనితల్లి మూలమున వచ్చినదని కాని యెక్కడను జెప్పక

         సీ. త్రైలోక్యవిజయాభిదంబైన సౌధంబు
                          చంద్రశాలా ప్రదేశంబునందు
             సచివ సైన్యాధీశసామంతనృపవర
                          సీమంతినీజనశ్రేణి గొలువ
             శాస్త్రమీమాంసయు సాహిత్యగోష్ఠియు
                          విద్వత్కవీంద్రులు విస్తరింపఁ
             గర్పూరకస్తూరికాసంకుమదగంధ
                          సారసౌభము దిక్పూరితముగ

             నిజభుజోవిక్రమంబున నిఖిలదిశలు
             గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి
             యన్న వేమేశ్వరునియంక మాశ్రయించి
             నిండుకొలువుండెఁ గన్నులపండువుగను.

అని యొకచోటను,

         సీ. ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ల
                              లీల మాణీక్యాంగుళీయకములు
             కల్పింప నేర్చిరి గంగమట్టియమీఁదఁ
                              గస్తూరికాపుండ్రకములు నొసల
             సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ
                              దారహారములు ముత్యాలసరులు
             చెరువంగ నేర్చిరి శిథిల నెన్నడుములఁ
                              గమ్మని క్రొత్త చెంగల్వవిరులు

                  ధామముల వెండిపై ఁడియుఁ దడఁబడంగ
                   బ్రాహ్మణోత్తము లగ్రహారములయందు
                   వేమభూపాలుఁ డనుజన్ము వీరభద్రు
                   ధాత్రినేలింప గౌతమీతటమునందు.

అని యింకొకచోటను. అల్లాడభూపతి యగ్రపుత్రుడై న వేమభూపాలుఁడు నిజభుజావిక్రమమున నిఖిలదిశలు గెలిచి రాజ్యపీఠ మెక్కించి యనుజన్ముఁడైన వీరభద్రుని ధాత్రి నేలించెనని మాత్రము శ్రీనాథుఁడు చెప్పియున్నాఁడు భీమఖండమునందు వేమవీరభద్రనరపాలురరాజ్యము సింహాద్రి వఱకు మాత్రమే వ్యాపించినదని చెప్పఁబడినను కాశీఖండమునందు

     ఉ. ప్రాకటవిక్రమస్ఫురణ రాజమహేంద్రము రాజధానిగా
         నేకసీతాతపత్రమున నేలెను వీరనృపాలుఁ డుత్తమ
         శ్లోకుఁడు వేమశౌరియనుజుండు సమున్నతవైభవాఢ్యుఁడై
         చీఁకటియుం గళింగయును జిల్కసముద్రము సింహశైలమున్.

అని వీరభద్రారెడ్డిగాజ్యము చిల్కసముద్రమువఱకును వ్యాపించినట్టు చెప్పఁబడినందున పయి సీసవద్యములోఁ జెప్పఁబడినట్టు వేమారెడ్డి తమ్ముని పక్షమున సింహాద్రి మొదలుకొని చిల్కసముద్రమువఱకును గల రాజ్యమును నిజముగానే గెలిచి తమ్ముని కిచ్చి యుండును. వీరభద్రారెడ్డి కా రాజ్యము భార్యయైన యనితల్లి మూలమునఁ గాక తండ్రిమూలముననే వచ్చినదనెడుపక్షమున నల్లాడ రెడ్డికి జేష్ఠపుత్రుఁడుండగా ద్వితీయ పుత్రునకు వచ్చుటకుఁ గారణముండదు. తవ ప్రభువునకు భార్యమూలమునఁ బ్రభుత్వము వచ్చినదనుట గౌరవలోపమని భావించి శ్రీనాథుడీ సత్యమును మఱఁగుపఱిచి యుండును. రాజ్యలాభక్రమమును జెప్పకపోయినను కవి యనితల్లి వీరభద్రుని యిల్లాలగుటను మాత్రము చెప్ప విడువక యీ క్రింది పద్యములలో వర్ణించెను.

      ఉ. రాజశశాంకశేఖరుఁడు రాజకిరీటవతంస మష్టది
         గ్రాజమనోభయంకరుఁడు రాజులదేవర రాజరాజు శ్రీ

             రాజమహేంద్రభూభువనరాజ్యరమారమణీమనోహరుం
              డాజిఁ గిరీటి కీర్తి నిధి యల్లయవీరనరేంద్రుఁ డున్నతిన్.

          మ. మనుతుల్యుం డగు కాటభూవరుని వేమక్ష్మాతలాధీశునం
              దనఁ బాణి గ్రహణంబు చేసెఁ బ్రియమొందన్ వీరభద్రేశ్వరుం
              డనితల్లిన్ వనితామతల్లి నుదయాస్తాద్రీంద్రసీమావనీ
              ఘనసామ్రాజ్యసమర్థసుప్రథిమ సాక్షాదిందిరాదేవతన్.

           గీ. అట్టి యనితల్లి పుణ్యగుణాభిరామ
              దనకుఁ బట్టంఫుదేవిగా ధన్యలీల
              వసుధ యెల్ల నేకాతపవారణముగ
              నేలు నల్లయవీరభద్రేశ్వరుండు.

ఈ కవి యనితల్లి వలన రాజ్యప్రాప్తి యయిన కధను విడిచినను. కృతిపతి తన్ను గూర్చి చెప్పినను, తాను కృతిపతినిగూర్చి చెప్పినను దాక్షారామాప్సరసలను మాత్రము విడిచినవాడు కాఁడు.

          శా. ఈ క్షోణి న్నినుఁబోలు సత్కవులు లే రీనేఁటికాలంబునన్
              దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
              వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
              ధ్యక్షించున్ గవిసార్వభౌమ ! భవదీయ ప్రౌఢసాహిత్యముల్.

           శా. పారాపారపరీతవిశ్వవసుధాభారోత్థతీవ్రక్రియా
               ధౌరంధర్య ! సరోరుహేక్షణ ! సమిద్గాండీవకోదండ ! దా
               క్షారామప్రమదాకఠోరకుచకుంభాభోగసంకౢప్తక
               స్తూరీస్థానకముద్రితస్థగితవక్షోవీథికాభ్యంతరా !

ఈ వీరభద్రారెడ్డి తన రాజ్యపరిపాలనకాలములో చుట్టుపట్ల నున్న కర్ణాటక కటకతురుష్కరాజులతో పరమమైత్రి కలిగినవాఁడయి యుండినట్టు ద్వితీ యాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమువలన కనఁబడుచున్నది.

             మ. బలవద్బారహదొంతిమన్నెధరణీపాలావరోధాంగనా
                 విలసన్మంగళసూత్రరక్షణకళావిఖ్యాతకారుణ్య ! యు
                 త్కలకర్ణాటతురుష్కరాట్పరమమిత్రా ! కుండలస్వామికుం
                 డలపూజాపరతంత్రధీవిభవ ! పంటక్ష్మాపచూడామణీ !

అనితల్లి శాసనమువల్ల కాటయవేమునకు కుమారగిరిచెల్లెలయిన మల్లాంబ గాక దొడ్డాంబ యను వేఱొకభార్య యుండినట్టును, అనితల్లి దొడ్డాంబిక కూఁతురయినట్లును దెలియవచ్చుచున్నది. తన సవతితల్లియు, కొండవీటి వారి యాడుఁబడుచును నైన మల్లాంబ తన పేర మల్లవరగ్రామమును బ్రాహ్మణుల కగ్రహారముగా నిచ్చి తొత్తరమూడి శాసనము వ్రాయించినట్లే యీ యనితల్లి తన పేర నన్నవరమును వైద్యున కగ్రహారముగా నిచ్చి కలువచేఱు శాసనమును వ్రాయించెను. మల్లాంబ కట్టించిన మార్కండే యాలయములోనే యనితల్లి మార్కండేయశివసన్నిధిని 1423-వ సంవత్సరమునందు దేవ బ్రాహ్మణ క్షేత్రములమీఁది పన్నును తీసివేసెను. [26] కలువచేఱు శాసనమువలనఁ దెలియవచ్చిన విశేషాంకములలో నొకటి యేక శిలానగరరాజ్యపరిపాలనము చేసిన రుద్రమదేవి గణపతిదేవుని దేవి గాక కూఁతురని స్థిరపడుట, 1260-వ సంవత్సరమువఱకును దేశపరిపాలనము చేసిన గణపతిదేవుని యనంతరమున నాతని రాజ్యమునకు వచ్చి 1261 మొదలుకొని 1265 వ సంవత్సరము వఱకును ప్రజారంజకముగా నోరు గంటిసామ్రాజ్యము నేలిన రుద్రమదేవి గణపతిదేవుని భార్య యని యేలాగుననో యొక వాడుక కలిగినది. తరువాతఁ గొంతకాలమున కామెమనుమఁడైన ప్రతాపరుద్రుని పైని విద్యానాధకవిచే- జెప్పబడిన ప్రతాపరుద్రీయము నకు మఱికొంత కాలమునకు వ్యాఖ్య చేసిన కుమారస్వామిసోమయాజి యెట్లో భ్రమపడి మూలవిరుద్ధముగా “పురా కిల కాకతికులసంభూతే, గణపతినామ్ని మహారాజే దుహితృమాత్రసంతానే కదాచిద్దైవయోగేన కాల పరిపాక ముపేయుషి తన్మహిషీ రుద్రదేవీ నామ రాజ్జీ బహూని వర్షాణి తద్రాజ్య మకంటకం పరిపాల్య పరిణతా సతీ దౌహిత్రే ప్రతాపరుద్రే రాజ్యధురాం నిదధే" అని పూర్వము కాకతీకులసంభూతుడైన గణపతిమహారాజు పుత్రికామాత్రసంతానము కలవాఁడయి దైవయోగముచేత కాలధర్మము నొందఁగా, నాతనిభార్య రుద్రమ దేవి బహుసంవత్సరము లా రాజ్యము నకంటకముగాఁ బరిపాలించి వృద్దురాలయి రాజ్యభారమును దౌహిత్రుఁడై న ప్రతాపరుద్రునియందుంచెనని వ్రాసెను. ఈ భ్రమ యెంతకాలమునకో వ్యాఖ్య చేసిన కుమారస్వామిసోమయాజికి మాత్రమే కాక రుద్రమదేవి రాజ్యకాలములోనే హిందూదేశ యాత్ర చేసిన మార్కోపోలో యను నిటలీ దేశీయునకును గలిగెను. అతఁడు తన యాత్రచరిత్రములలో రుద్రమదేవి వెనుకటిరాజురాణి యని వ్రాసెను. దీనిని జూచి తరువాతి చరిత్రకారు లనేకులు రుద్రమదేవిని గణపతిదేవుని దేవిని గాఁ జెప్పుచు వచ్చిరి. రుద్రమ దేవియొక్క వృద్ధదశలో నామె రాజ్యమునకువచ్చి యామె దౌహిత్రుఁడైన ప్రతాపరుద్రుని పైవి, జెప్పఁబడిన ప్రతాపరుద్రీయనామకాలంకారశాస్త్రములో గణపతిదేవుడు తనకు పుత్రిక కలుగఁగా నామెను పుత్ర ప్రతినిధిగా భావించి రుద్రనామము పెట్టననియు, తదనంతరమునం దామె రాజ్యభారముము వహించి బహుకాలము మహీపాలనము నిర్వహించి కడపట నా భారము నామె దౌహిత్రుఁడైన ప్రతాపరుద్రునియందుఁ బెట్టెననియు, చెప్పబడినది. వీరరుద్రమదేవి గణపతిదేవుని దుహిత యనియు, ఆ రుద్రమదేవి రాజ్యమును సుచరితుఁడైన దౌహిత్రునకుఁ ప్రతాపరుద్రున కిచ్చెననియు, ఈ శాసనము ఘోషించుచున్నది. కాకతి యనుదేవతదయచేత వొక గుమ్మడి తీగ కొక కుమారుఁడు కలిగెనఁట! ఆ గుమ్మడితీగకొడుకుయొక్క వంశము కాకతీయవంశ మయ్యెనఁట! గణపతిదేవ మహారాజాదులు తద్వంశ సంభవులట!

ప్రతాపరుద్రుని యంత్యదశలో యవనాక్రాంతమయిన యాంధ్రరాజ్యమును పోలయనాయకుఁ డుద్దరించె ననియు, ఆతనియనంతరమున కాపయనాయకుఁడు కొంతకాలము రాజ్యముచేసి కాలధర్మము నొందఁగా నాతనిని గొలుచుచుండిన డెబ్బదియైదుగురు నాయకులు త్రిలింగదేశమును తమలో విభజించుకొని వేఱు వేఱుభాగముల నేలుచుండిరనియు, వారితో పంటకులోద్భవుఁడయి పాతాళగంగకు సోపానములు కట్టించిన వేమారెడ్డి ప్రముఖుఁడనియు, చెప్పుట శాసనములోని యింకొక విశేషము. పోలయ యవనాక్రాంతమైన యాంధ్రదేశమును తురుష్కులచేతులలో నుండి యుద్దరించినట్టును, ఆతనియనంతరమునఁ గాపయనాయకుఁ డాంధ్రదేశరాజ్యమును వహించి నట్టును, దీనికిఁ బూర్వమునందుండిన యే శాసనములోను జెప్పబడలేదు. త్రిలింగదేశము యవనాక్రాంతమయిన సన్నిహిత కాలములయందు వ్రాయఁ బడిన యన్ని శాసనములును, పుస్తకములును తురుష్కులనుండి యాంధ్ర రాష్ట్రము నుద్ధరించినవాఁడు ప్రోలయవేముఁడనియు, ఆతఁడే శ్రీశైలమున పాతాళగంగకు సోపానములు కట్టించినవాఁడనియు, ఏకముఖముగా ఘోషించుచున్నవి నూట యిరువది సంవ్సరములకుఁ దరువాత {ప్రాయ వీడిన యీ శాసన ములోఁ ఊప్పింపబడిన యీ నూతనకధ విశ్వాసార్హ మయినదిగా కనఁబడదు. యవనులు త్రిలింగరాజ్యము నాక్రమించుట ప్రతాపరుద్రుని రాజ్యావసానదశలో 1320-వ సంవత్సర ప్రాంతముల యందు-ఆ రాజ్యమును తురుష్కులనుండి యుద్దరించుట యటుతరువాత జరిగి యుండవలెను. పోలయవేముని శాసనము లించుమించుగా 1320-వ సంవత్సరమునుండియుఁ గానఁబడుచున్నందున, ఆ సంవత్సర ప్రాంతమునందే యాతని యాంధ్రదేశపరిపాలన కాలమారంభమయి యుండవలెను. పోలయనాయకుఁడు త్రిలింగ దేశమును ముష్కర తురుష్కహస్తములనుండి విడిపించి కొంతకాల మేలుటయు, తదనంతరమునందు కాపయ నాయకుఁ డా రాజ్యభారమును వహించి కొంతకాల మేలి స్వర్గసుఁడగుటయు, అతని తరువాత పోలయవేముఁడు ప్రభుత్వమునకు వచ్చుటయు, అంతయు నొక్క సంవత్సరములోప జరిగెననుట యసంభావ్యము గాన, నిది కల్పితకథ యయి యుండవలెను. ఇందుఁ బేర్కొనబడిన పోలయ నాయకుఁడు పోలయ వేముని తండ్రియే యయి, వేముఁడు ప్రోలయయనంతరముననో కాపయయనంతరముననో రాజ్యమునకు వచ్చుట నిజమయి యుండినయెడల ప్రోలయ వేమారెడ్డికే యంకితము చేయబడిన హరివంశమునం దెఱ్ఱా ప్రెగడ యీ యంశము నించుకయైన సూచించియైననుండఁడా ? శ్రీనాథవిరచితములయిన గ్రంధములలో నెల్ల కాశీఖండ మే కడపటి దయినట్టు కనబడుచున్నది. ఇది రచియించునప్పటి కీ కవికి డెబ్బది సంవత్సరము లుండి.ను, దీనియందు కవితాపటిమ యెంతమాత్రమును కొఱవడక బహు కావ్యరచనచేత నాఱితేఱినదానివలెనే చూపట్టుచున్నది. కాశీ ఖండరచనానంతరమున నల్పకాలములోనే రాజమహేంద్రవరపు రెడ్డిరాజ్యమునకు సహితము వినాశము సంభవించెను.

శ్రీనాధుఁడు లాక్షణికుఁడయిన గొప్పకవి. ఇతని కవిత్వము సంస్కృతపద భూయిష్ఠమయి రసవంతమయి యుండును. మొత్తము మీద నీతని శైలి సులభమైనది కాదు. ఇఁతడు రచించిన గ్రంధము లన్నిటిలోను నైషధము శృంగారరస ప్రధానమై ప్రౌఢముగా నుండును. దీని నాంధ్రకావ్యపంచకములోఁ బ్రధానమైనదానినిఁగాఁ జెప్పుదురు.

ఇతఁడు శివభక్తుఁడు యౌవనదశయందు శృంగారనాయకుఁ డయి స్త్రీలోలుఁడై తిరిగెనని చెప్పుదురు. అది యెంత నిజమో కాని వయసు ముదిరినతరువాత శివభక్తుడయి యుండెనని యీతఁడు రచియించిన గ్రంధములే సహస్రముఖముల ఘోషించుచున్నవి. ఆ కాలమునందు భ క్తికిని, నీతికిని నంతగా సంబంధ మున్నట్టు కనబడదు. ఒకఁడఖండ శివభక్తుఁడును గావచ్చును, జారశిరోమణి యయి యఖండ వేశ్యాభక్తుఁడును గావచ్చును.

ఇతఁడు మరుద్రాజుచరిత్రము, పండితారోధ్యచరిత్రము, శాలివాహనసప్తశతి, నైషధము, భీమపురాణము, కాశీఖండము. శివరాత్రిమాహాత్మ్యము, హర విలాసము, అను గ్రంధములను జేసెను, వీనిలో పండితారాధ్యచరిత్రమును వేమారెడ్డి సేనేనానాయకుఁడై న మామిడి ప్రెగ్గడయ్యకును, నైషధము నాతని తమ్ముఁడైన మంత్రి సింగనకును, భీమేశ్వరఖండమును వీరభద్రరెడ్డి మంత్రి యైన బెండపూడి యన్నయ్యకును, కాశీఖండమును వీరభద్రరెడ్డికినీ, అంకితము చేసెను.

శ్రీనాధుఁడు వీధినాటక మనబ డెడి యొక యపాత్రపు గ్రంథమును గూడఁ జేసెనని చెప్పుదురుగాని యిప్పుడు ప్రకటింపఁబడియున్న యా పేరిటి చిన్నపుస్తక మాతనిచే పుస్తకరూపమున రచియింపఁబడినది కాదు. అందు శ్రీనాథవిరచితములయిన పద్యములు కొన్ని యున్నవనుటకు సందేహము లేదు. కాశీఖండాది గ్రంథములలోని పద్యములను గొన్నింటిని శ్రీనాథుఁడు దేశసంచారము చేసినప్పు డక్కడక్కడఁ జెప్పిన పద్యములను గోన్ని టిని ఏర్చికూర్చి వానికిఁ దోడుగా నసము లయిన దుష్కవులు చెప్పిన బూతు పద్యములను జేర్చి వీధినాటకమను పేరు పెట్టి యేఁబది యఱువది పద్యములు గల చిన్న పుస్తకము నొకదానిని పలువురు ప్రకటించియున్నారు అందలీ పద్యములలో ననేకములు నీతిబాహ్యములుగాను, అసభ్యములు, నశ్లీలములు నగు నవాచ్యములుగాను ఉన్నవి. దుర్నీ తిపోషకములైన యీ యసుచిత పద్యరచనమును శ్రీనాధకవి కారోపించుట యాతని కపకీర్తి కలిగించుట.శ్రీనాధుడు తాను వీధినాటకమును జేసిన గ్రంధములోను జెప్పుకొనలేదు. శ్రీనాధుని భీమేశ్వరపురాణాదులవలన నతడఖండ శివపూజాధురంధరుఁడని తెలియవచ్చుచున్నది. అటువంటి శివభక్తాగ్రేసరుఁడు తన యిష్టదైవతము లయిన పార్వతీపరమేశ్వరులను గూర్చి యిటువంటి దూష్యపద్యములను జెప్పి యుండునా  ? కాళేశ్వరీ యనఁబరఁగిన పార్వతీదేవిని గూర్చిన పద్య మిది.

      చ. గొఱియల మేఁకపోతులను గొమ్ముపొటేళ్ళను గావుఁ గొందు వీ,
          వరయఁగ సందెకాడఁ దగ వత్తు నంచు భవచ్ఛిరంబుపైఁ
          గర మిడి పోయినట్టి తిలఘాతుకురాలితదీయ
          పెఱుకగలేవు నీవు నొకభీకరమూర్తి వె కాళికేశ్వరీ!

ఒకానొక తిలఘాతుకురాలు వ్యభిచారార్ధము సందెకడ వచ్చెద నని కాళికాదేవి నెత్తిమీఁద చేయి పెట్టి బాసచేసి పోయెనఁట ! అట్టి ఘోరప్రమాణము చేసియు నట్టి సత్కార్యమునిమిత్త మా తెలికది తానన్న వేళకు రాకుండె నఁట ! అందుమీఁద భక్తుఁ డలిగి నీవు గొఱ్ఱెలు మొదలయిన జంతువులను బలిగొనుటయే కాని నీ శిరస్సుపైని జేయి వేసి వచ్చెద నని బాసచేసి రాక పోయిన తిలఘాతుకురాలిరోమములు పీఁకఁగలిగితివా ? యని మృదువచన ములతో పార్వతీదేవి నడుగుచున్నాఁడు ! ఇట్టి యర్థమును శివభక్తాగ్రేసరుఁడైన శ్రీనాధునకే కాదు భక్తిహీనుఁడై న సామాన్య హీనమానవున కారోపించుట సహితమవమానకరమే. అనర్థదాయకమైన యర్థము నటుండనిచ్చి యిఁక నీ పద్యమునందలి పదసౌష్టవసౌభాగ్యమును విచారింతము. సందెకడ నని యుండవలసినదానికి సందెకాడనని యున్నది.తిలఘాతుకురాలి తదీయ శ ములనుచోట సమాసమధ్యమునందున్న తదీయ కర్థములేదు, శ...ము అన్న పదమునకు పామరజనవ్యవహారములోనే కాని సంస్కృతమునఁ గవి యుద్దేశించిన యర్ధము లేదు. ఈ పద్యమే శ్రీనాథుని దనెడు పక్షమున నాతనికి శబ్ద జ్ఞానము లేదు, వ్యర్థపద ప్రయోగశంకలేదు, అశ్లీల భయము లేదు. రేపశకటరేఫఙ్ఞానము లేదు అని చెప్పవలసి వచ్చును ఈ పద్యమునఁ ప్రాసస్థానములైన గొఱియలలోనిది శకటరేఫము; ఆరయఁగలోనిది రేఫము. ఈ పుస్తకములోని పార్వతీనాధుఁ డయి గరళకంఠుఁడనఁబరఁగెడు పరమేశ్వరునిఁ గూర్చిన పద్యమిది.

       గీ. కాలకంధర ! యీశాన ! గరళకంఠ !
           విసము మెసవినఁ గలుగునక్కసటు వోవఁ
           గొమ్మ మేడూరికమ్మచకోరనేత్ర
           పననతొనవంటితలము చుంబనము గొనుము.

ఇందు గరళము తిన్న చేదు పోవునట్లుగా మేడూరికమ్మపడుచుయుక్క తియ్యనిగోప్యాంగమును నాకుమనిభక్తాగ్రగణ్యుండు శివునికి హితబోధ చేయుచున్నాడు. మాంసము తినువాఁడయినను, ఎముకలను మెడను గట్టుకొని తిరుగఁడు కదా ! శ్రీనాథుఁడు జారుడే యైనను తన యిష్టదైవత ములనుగూర్చి యిటువంటి దూష్యములయిన బూతులఁ బ్రయోగింప సాహసించునా ! ఈ పుస్తకమునిండను గొంతుకూర్చొని ' భాగోతుల బుచ్చిగానికి' 'కుల్లాయెట్టితి' అని వ్యాకరణదుష్టములైన గ్రామ్యపద ప్రయోగములు కానఁబడుచున్నవి. కూరుచుండి, భాగవతులు, పెట్టితి, అనుటకు మాటుగా సకలక్షణవేత్తయైన శ్రీనాథుఁడు కూర్చొని, భాగోతులు, ఎట్టితి, అని యవలక్షణ ప్రయోగములు చేయునా ? ఇందలి కడపటి దైన ' యెట్టితి ' యనుచోట • 'పెట్టితి ' యని పెట్టి, ' కుళ్ళాయ ' కు ' కుళ్ళా ' యన్న రూపాంతర మున్నందున సాధు ప్రయోగముగాఁ జేయవచ్చును.

     లయగ్రాహి. బంగరపుచెక్కలఁ జెలంగు చవుకట్టులమె
                       ఱుంగు బలుచుక్కలపయిం గినిసి జంగల్
               చంగునఁ గోనన్ సరిగ రంగు గలకుట్టుపస.
                       కంగులఁ గడల్కొనిన యంగిపయి దోర
               త్నాంగదము కుంకుమతరంగముల గుప్ప జిగి
                       పొంగుబురుసాపని బెడంగు గల కుళ్ళా,
               నింగికిఁ దళత్తళ లొసంగ నతఁ డంత నృప
                       పుంగవుహజారమునకుంగదలి వచ్చెన్. అ. 2

అని రాజవాహనవిజయ ప్రయోగము.

శ్రీనాథుని వీథినాటక మని ప్రకటింపఁబడినదానికి వీధిరూపకలక్షణమేపట్టదు, వీధిలక్షణము ధనంజయవిరచితమైన దశరూపకము నందిట్లు చెప్పఁబడినది.

    శ్లో. వీధీ తు కైశికీ వృత్తా, సంధ్యంగాంకైస్తు భాణవత్,
        రస సూచ్య స్తు శృంగార స్పృశే దపి రసాంతరమ్
        యుక్తా ప్రస్తావనాఖ్యాతై రంగై రుద్ఘాత్యకాదిభిః,
        ఏవం విధి విధాతవ్యా ద్వ్యేకపాత్రప్రయోజితా.

దీనివలన వీధి కైశికీవృత్తియందు రచియింపఁబడి, భాణమునందువలె సంధ్యంగాంకములను గలదయి, అధికముగా శృంగారరసమును కొంచెముగా నితరరసములను గలిగి, ఉద్ఘా త్యకాద్యంగములతో ప్రస్తావనను గలిగి, పాత్రముల నొకటి రెంటిని గలదయి యుండవలెనని యేర్పడుచున్నది. విశ్వనాధవికృతమైన సాహిత్యదర్పణమునందు వీధిలక్షణ మీ క్రింది రీతిని వివరింపఁబడి యున్నది.

    శ్లో. వీథ్యా మేకో భవే దంకః కశ్చి దేకో౽త్ర కల్ప్యతే.
        ఆకాశ భాషితై రుక్తై శ్చిత్రాం ప్రత్యుక్తి మాశ్రితః
        సూచయే ద్భూరిశృంగారం కించి దన్యాన్ రసా నపి.
        ముఖనిర్వహణే సంధౌ అర్థప్రకృత యోఖిలాః
        అస్యా స్త్రయోదశాంగాని నిర్దిశంతి మనీషిణః,
        ఉద్ఘాత్యకావలగితే ప్రపంచ స్త్రిగతం ఛలమ్.
        వాక్కేళ్యధిబలే గండ మవస్యందిత నాళికే.
        అసత్ప్రలాప వ్యాహార మృదవాని చ తాని తు.

ఏకాంకసంయుత మయి, ఆకాశభాషితములచేత చిత్రప్రత్యుక్తులాడుపాత్రమును గల దయి; విస్తారముగా శృంగారమును కొంచెముగా నన్యరసములను ముఖనిర్వహణసంధులను గల దయి ఉద్ఘాత్యకము, అవలగీతము, ప్రపంచము, త్రిగతము, ఛలము, వాక్కేళి, అధిబలము, గండము, అవస్యందితము, నాళికము, అసత్ప్రలాపము, వ్యాహారము, మృదవము అనుత్రయోదశాంగసహిత మయి వీథి యుండవలె నని సాహిత్యదర్పణము విధించుచున్నది.

  " వీధ్యాం కల్పిత మితివృత్తం ధీరోద్ధతో నాయకః ”

అని ప్రతాపరుద్రీయము వీధియందితివృత్తము కల్పితముగాను ధీరోద్దతుఁడు నాయకుఁడు గాను ఉండవలెనని విధించుచున్నది. నాయిక పరకీయగా నుండవలెననుట లోనుగాగల యితర లక్షణముల నితరలక్షణ గ్రంధములు బోధించుచున్నవి. ఈ పేర్కొనబడిన లక్షణములేవియు నీ యల్పకావ్యము నందు లేవు. ఇందు నాయకుఁడు లేఁడు; నాయిక లేదు. ప్రస్తావన లేదు, పాత్రములు లేవు. సంధులు లేవు, ఇతివృత్తము లేదు: వీధి కుండవలసిన యంగము లేవియు లేవు. ఈ పుస్తకము వలన శ్రీనాధమహాకవి దశ రూపక జ్ఞానము లేని యపండితుఁడని యాతని కపయశము కలుగుచున్నది. ఇందులో నున్న శృంగారమంతయు నశ్లీలమయి జారత్వవిషయమైన బూతు ప్రసంగము. శృంగారనాయకుఁ డిందు శ్రీనాధమహాకవియే.

        గీ. చెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల
           హాళిగాఁ జేత విడియంబుఁ గీలుకొలిపి
           రంగపురరాజవీధిఁ గానంగ నయ్యె
           నాదుమదిఁ గోర్కు లూర వైష్ణవవధూటి.

ఈ యసభ్య గ్రంధముయొక్క కర్తృత్వము నూరక యారోపించి మనవారు కొందఱు శ్రీనాధుని ముంపదలఁచుకొన్న దుర్యశఃపంకమునుండి యతఁడిది శ్రీనాధకవికృతము కాదని సిద్దాంత మయినప్పుడే లేచి బైలఁబడి గట్టెక్కి కృతార్ధుఁడు కాఁగలుగును [27]

మాకు దొరకిన శ్రీనాధవిరచితములయిన గ్రంధములనుండి కొన్ని పద్యముల నుదాహరించి యీ కవిచరిత్రము నింతటితో ముగించుచున్నాము. 1. శృంగారనైషధము

       చ. అటు తగునే సురేశ్వరునియంతటివాఁ డఖిలాప్సరోం౽గనా
           విటుఁడొక మర్త్యభామినికి వేడుకచేయుచు నున్నవాఁడు, వి
           స్పుటబహురత్న, భూషణవిభూషితులయ్యెడు రాచవారికిన్
           గటకట ! యారకూటకటకంబు రుచించునొ కాక యొక్కెడన్.

       ఉ. నీ చరితంబు చూడ నతినిష్ఠుర మయ్యెడు లోకపాలదు
           ర్వాచికసూచికాంకురపరంపర దూర్చెదు మాటిమాటికిన్
           నా చెవులందు; నీకుఁ దగునా యిటు చేయఁగఁ దప్ప దన్న బా
           ధాచరణంబు నైజమేకదా తలపోయఁ గృతాంతదూతకున్

       చ. అడిగితి నొక్కనాఁడు కమలాసనుతేరికి వారువంబనై
           నడచుచు నుర్విలో నిషధనాథున కెవ్వతెయొక్కొ భార్య య
           య్యెడు నని చక్రఘోషమున నించుక యించుక కాని యంత యే
           ర్పడ విన నైతి నీ వనుచుఁ బల్కిన చందము తోఁచె మానినీ

       ఉ. నైషధుఁ డుతరంగమున నవ్వుచు నుండు విరోధు లాడు దు
           ర్భాషణముల్ వినిన్ విననిభంగిన యట్టిద విద్విషన్మృషా
           దోషగుణాధిరోపణ మదోషతఁ దెల్పుచు నుండుఁ గానఁ ద
           ద్దూషణ మెప్డు విన్న బరితోషము నొందు మనీషి యాత్మలోన్.

       శా. లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్మిక ల్కాంతలం
           చేలా రోఁతలు పుట్ట నాడుదురు యోగీంద్రుల్ ? వృధాలాపముల్
           లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్ములో ? తా రహా
           ప్రాలేయాంబుపటీరపంకఘనసారక్షోదదివ్యాంగులో ?

 2. భీమఖండము

       ఉ. జాదురజాదురంబు మృదుచర్చిత గీతులు వారుణిరసా
           స్వాదమదాతిరేకముఁ జంద్రిక గాయఁగ దక్షవాటికా
           వేదులమీఁదటం గనకవీణలు మీటుచు బాడి రచ్చరల్
           మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాధునిన్.

            శా. రక్షోనాయకులార ! నిర్జరవర వ్రాతంబుచేతన్ సుధా
               భిక్షాపాత్రము పోయె నంచు మదిలో బెగ్గిల్లఁగా నేటికిన్ ?
               రక్షార్థంబు భజింప రాదె యభవుం ద్రైలోక్య కుక్షింభరున్
               దాక్షారామపురాధినాధుని సుధాధామార్థచూడామణిన్ ?

            గీ. పువ్వు ముడిచిన పురవీథిభూమియందుఁ
               గట్టె మోవంగ వలసిన కారణమున
               వీరభద్రునిచే దైన్యవృత్తి నొందె
               దక్షుఁడట్టి మహాధ్వరస్థానమునను.

           మ. జగతీమౌళి వతంసభూషణము విశ్వఖ్యాతము గాశికా
               నగరంబుం బెడఁబాసి నీకును జగన్మాన్యేక చారిత్ర యీ
               చిగురుంబోడికి నాకునుం గటకటా ! చేడ్పాటు వాటిల్లెనే
               ముగురిం గూర్చిన ముండదైవమునకు న్మోమాట లేదే సుమీ !

           శా. కాశీస్థాన నివాసులన్ యతుల భిక్షావృత్తులం గాంచి పా
               రాశర్యుం డెటఁ బోయె నంచు నడుగన్ బ్రహ్మావిహీనాత్మకుం
               డా శౌర్యుం డెటఁ బోయెనో యెఱుఁగమయ్యా మీరు పోపోండు వి
               శ్వేశ ద్రోహి నెఱుంగ నేమిపని ? వాఁ డెచ్చోటికిం బోయెనో ?

3. కాశీ ఖండము

           చ. కొసరి వసంతకాలమునఁ గోయిల క్రోల్చినభంగి నేడ్చే న
               బ్బిసరుహనేత్ర కొండచఁఱి బెద్దయెలుంగున వెక్కి వెక్కి వె
               క్కసమగు మన్యువేగమునఁ గాటుకకన్నులనీరు సోనలై
               యుసిరికకాయలంతలు పయోధరముల్ దిగఁబాఱుచుండఁగన్.

           ఉ. ఎట్టు పురాణము ల్పదియు నెమ్మిదిఁ జెప్పితి వెట్టు వేదముల్
               గట్టితి వేర్పఱించి నుడికారముసొం పెసలార భారతం
               బెట్టు రచించి తీవు ? ఋషి వె ట్టయి ? తొక్కదినంబు మాత్రలోఁ
               బొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశిఁ గాశికన్

      చ. బిసరుహపత్రలోచన! కృపీటములందు మునిఁగి యాడవే
          మొసళులు మీల కర్కటకముల్ గమఠంబులు ? వాని కబ్బునే
          యసదృశమైన తీర్థఫల ? మట్టి విధంబు సుమీ తలంప మా
          నసమగు తీర్థ మాడనిజనంబులకుం బహుదాహ్యతీర్థముల్.

      చ. విడువక నీవు పట్టణమువీధుల వీధుల వెఱ్ఱివాఁడవై
          చెడుగులఁ గూడి ధౌర్త్య ములు చేయ మహీరమణుం డెఱింగెనే
          న్విడుచును; సోమయాజి మనువృత్తులు చేకొను నెల్ల వెంటలన్
          జెడుదుము గాదె నీకతనఁ జీరయుఁ గూడును లేక పుత్రకా!

      శా. ఆకఠంబుగ నీవు మాధుకరభిక్షాన్నంబు భక్షింపఁగా
         లేకున్నం గడు నంగలార్చెదవు: మేలే ? లెస్స : శాంతుఁడవే ?
         నీకంటె న్మతిహీనులే కటకటా ! నీవారముష్టింపచుల్
         శాకాహారులు కందభోజులు శిలోంఛప్రక్రముల్ తాపసుల్ ?

 4. శివరాత్రి మాహాత్మ్యము -

     శా. ఏలా వచ్చెదు ? డాయ నేవ్వఁడవు ? నీ వెచ్చోటికిం బోయె దీ
         వేలా మొక్కవు నాకు? గర్వ మిఁక నేంతో నోర్వకుందుం జుమీ !
         త్రైలోక్యాధిపతిన్ సురాసుర శిరోరత్నప్రభామండలీ
         వ్యాలీఢాంఘ్రిశిరోరుహుండ విడు గర్వారంభసంరంభమున్. ఆ.1

     మ. జవ మేపారి మురారిపద్మజభుజాచక్రీభవచ్ఛార్ఙ్గగాం
         డివకోదండవినిర్గతప్రబలసందీప్తాస్త్రసంఘాతముల్
         భువన క్రోడము నిండి భానుకిరణంబుల్ దూఱనీకుండఁగన్
         బవలుం బర్వె మహాంధకారములు పైపై సూచినిర్భేద్యముల్.

     శా. ఆ వింధ్యాచల మేలు మేటి శబరాధ్యక్షుండు హేమాంగదుం
         డా వార్థిద్వితయద్వయావధిగ, జక్రాధీశ్వరు ల్గొల్వ నా
         నావేదండఘటాకపోలతలమూర్ఛద్దానధారా జల
         ఫ్లావప్రక్రమసంవిశుద్ధబహుళ ప్రస్ఫూర్తిమత్కీర్తియై. ఆ.2

          ఉ. సంపదపేరి కట్టిఁడిపిశాచము సోఁకిన మానవుడు పూ
              జింపఁ డభీష్టదేవత భజింపఁడు సజ్జనులైనవారి మ
              న్నింపఁడు మిత్ర బంధుల గణింపఁడు ధర్మరహస్యము ల్విచా
              రింపఁడు (మేలు మాన్యుల) భజింపఁ డహంకరణంబు పెంపునన్.

          చ. అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం గనుపట్ట గిన్నెలోఁ
              బెరుగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁ బెట్టు ని
              ర్భరకరుణాధురీణ యగు ప్రాణముప్రాణము తల్లి యున్నదే?
              హరహార! యెవ్వరింకఁ గడుపారఁగఁ బెట్టెద రీప్సితాన్నముల్ ?

          మ. వసుధానిర్జరుఁడున్ మహాసరసిలో వార్వీచులం దేలెఁ ద్రా
              వె సుధాసన్నిభమైన వారితటపృధ్వీజావళిచ్చాయలన్
              వసియించెన్ లహరీ సమీరమున నధ్వ శ్రాంతిఁ బోకారిచెన్
              బిసకాండంబుల మేన గుంజె వలువల్నిర్మోకసంకాశముల్. ఆ.3

          చ. కలఁగఁగబాఱె నాతనియఘంబులు పంచహృషీకసంభవం
              బులు బహుకాలసంకలితముల్ దవవహ్ని చిటచ్చిటధ్వనిం
              గలఁగఁగఁబాఱు పక్షులప్రకారమునన్ దొలుజాముపూజకై
              కలపటహమ్ము ఢ మ్మనుచు గర్భనిగేహమునందు మోసినన్

          చ. కమలవనాళి కాకణిశకంటకకోటులచేతఁ జూడ్కి కిం
              పలవఱిచెన్ ధరిత్రి తుహినాగమవేళఁ దటాకసారణిన్
              సలిలము పాఱి పండిన యజాంగలసీమము లెన్ని యన్నిటన్
              దలముగ సీతుపేర్మి గరుదాల్చిన భావము ప్రస్పుటంబుగన్. ఆ.4

5. హరవిలాసము

          చ. వికవిక నవ్వి యక్కపటవిప్రకుమారుఁడు మేలులెస్స! వా
              నికినయి రాగబంధమును నిల్పె మదిం దరళాయతాక్షి మీ
              సకియ వివాహవేళఁ బురశాసనుపాణి పరిగ్రహించుచో
              మొకమున బుస్సుమంచు నహిమ్రెగ్గిన నెట్లు భయంబునొందునో

         ఉ. మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగఁబెట్టి పు
             త్తెంచిన మంచికజ్జెములు తేనియ నేతను దోఁచి తోఁచి భ
             క్షించుచుఁ దల్లిఁ దండ్రిఁ దన చిన్నికరాంగుళి వంచివంచి యూ
             రించుచు నాడె మిన్న గమిరేడుకుమారకుఁడింటిముంగటన్.

         ఉ. వెగ్గలమైన మోపు గడు వీఁకునఁ నెత్తగఁబోయి ముందటన్
             మ్రొగ్గతిలఁబడెం జెమట మోమునఁ గ్రమ్మఁగఁ దా ద్విజోత్తముం
             డగ్గణముఖ్యుతోడ నొకఁడై సరియాచకులన్ భరింపఁ దా
             దిగ్గన వచ్చె శంకరుఁడు దెప్పరమైన వడిం జెమర్చుచున్. ఆ.1

         శా. అయ్యూరూద్భవవంశసంభవుని నేకామ్రాదినాధాంబికా
             శయ్యామందిరనిర్మలాత్మకుని భిక్షావృత్తిజంగం బొకం
             డొయ్యం జేరఁగ వచ్చి మా శివుని నేఁ డోలార్చెదంగాని తే
             వయ్యా ! యిక్షురసంబు తూమెఁ డనుచుం బ్రార్థించి నేమించినన్

         చ. ముసురుదినంబులందు మన మోసలపంచయరుంగుమీఁదటన్
             భసితవిభూషణుల్ పరమపావనమూర్తులు శైవసంహితా
             భ్యసనపరాయణుల్ గిరిశభక్తు లనేకులు నిండి యుండ్రు నేఁ
             డసితసరోరుహాక్షి! యొకఁడై నను లేఁ డిది యేమిచోద్యమో ?

         ఉ. ఈ మాటలు వేయు నేమిటి ? మంగళలక్షణలక్ష్మి యైన యీ
             చోటికి భర్త గాఁగలఁడు సోమకిరీటుఁడు సర్వదేవతా
             కోటికిరీటకోటిపరికుంచితభవ్యమణీద్యుతి చ్చటా
             పాటలపాదపీఠుఁ డగు పట్టి కృతార్థుఁడ వై తి భూధరా ! ఆ 2

         ఉ. కమ్మని యూర్పుగాడుపులగంధము గ్రోలఁగ వచ్చి యోష్ఠబిం
             బమ్ముసమీపదేశమునఁ బాయక యాడెడి తేఁటిఁ దోలెఁ బ
             ద్మమ్మున మాటిమాటికి సమంచితసంభ్రమలోలదృష్టియై
             యమ్మదిరాక్షి చారుదరహాసవికస్వరగండపాళియై ఆ 3

         చ. అరుదగు నీ తపంబునకు నమ్ముడుపోయితి నేలుకొమ్ము నీ
             వరువుఁడ నంచు శూలి ప్రియవాక్యములం దగ గౌరవించినన్
             ధరణీధరేంద్రనందన యుదగ్రతపోమహనీయవేదనా
             భర మఖిలంబు వీడ్కొలిపి భావమునం బరితోష మొందుచున్

        మ. అని దేవర్షి బహుప్రకారమధురవ్యాహారసందర్భముం
             బనిగొంచుఁడఁగఁ దండ్రిపార్శ్వమున సద్భావంబు లజ్ఞాభరం
             బును మౌగ్ధ్యంబును దోఁప నస్రవదనాంభోజాతయై గౌరి య
             ల్లన లెక్కించుచునుండెఁ బాణి నవలీలాపద్మపత్రంబులన్. ఆ 4

         ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటివానికై న ర
             త్నాంచితరోచిరుద్గమనిర స్తరవీందుమరీచిజాలమున్
             గాంచనకందరాయవనికాయుతవారిధరాంతరాళని
             ర్వంచిత దేవతామిధునవాంచితమూలము శీతశైలమున్. ఆ 5

         శా. ఆయా వేళల మౌనిభార్యలు గృహవ్యాపారలీలాభవ
             త్కాయక్లేశము లుజ్జగింతురు లసత్కర్పూరరంభాతరు
             చ్ఛాయన్ శీతలచంద్రకాంతమణిపాషాణ ప్రదేశంబులన్
             వాయు ప్రేరణఁ బచ్చకప్పురము పై వర్షింప నక్కోనలోన్. ఆ 5

         మ. వికట భ్రూకుటిఫాలభాగుఁడును బ్రస్వేదాఁబుపూర్ణాఖిలాం
             గకుఁడుం బాటలగండమండలుఁడునై కల్పాంత సంహారరు
             ద్రకఠోరాకృత దుర్నిరీక్షు డగుచుం దట్టించి దుర్వాసుఁ డు
             గ్రకటాక్షంబున నింద్రుఁ జూచి పలికెన్ గాఢాగ్రహవ్యగ్రతన్ . ఆ 6

         చ. జలధరమంతయై కరటిచందము గైకొని సూకరాకృతిన్
             నిలిచి పికంబుతో దోరసి నేరేడుపండును బోలుపుట్టువై
             కలశపయోధిమంధసముఖంబునఁ బుట్టిన యమ్మహాహలా
             హలము క్రమంబున శివుని హ స్తసరోరుహ మెక్కె వింతయై.

         ఉ. చక్కనివాఁడ వెంతయును జల్లనివాఁడవు భాగ్యరేఖఁ బే .
             రెక్కినవాఁడ వీ విపిన మెక్కడ ? సుకుమారతాగుణం
             బెక్కడ ? ఘోరవీరతప మీ యెలప్రాయమునందుఁ జేయు నే
             యక్కట ! యెవ్వఁడైన సుకృతాత్ముఁడ వీ వొకరుండు తక్కఁగన్.

         చ. అతులిత ధైర్య శౌర్యమహిమాద్భుతసాహసులై మహోగ్రతా
            ప్రతతని శాతనిష్కృపకృపాణ విదారిత దేహులై రణ
            క్షితిఁ బడి వత్తురైదుపది చేయక నాకయి యిట్టి నన్ను
            నీ ఇతరులఁబోలెఁ గైకొనక యెంచెద విప్పుడు పాండునందనా. ఆ 3

పల్నాటి వీరచరిత్రము

      ద్వి. పేరె బాలుఁడు గాని బిరుదుమగండఁ
           బగవారిఁ గొట్టని బాలత్వ మేల ?
           తలిదండ్రులను బ్రోవ దనయుఁడె కర్త
           మానాభిమానముల్ మగఁటిమి మించఁ
           బ్రబలింవఁగలవారు బాలురే సుమ్ము !
           బాలురె పెద్దలు బల్లిదుల్వారె
           బాలురకే బుద్ధి పరికించి చూడఁ
           బెద్దలు మతి చెడి పిఱికిపాఱుదురు
           పాంచభౌతిక దేహపటిమ క్షీణించు
           ధైర్యంబు తగ్గు నుత్సాహాంబు లుడుగు
           వయసు మీఱిన వేళ వచ్చునా బలిమి ?
           కీర్తి కైనను నపకీర్తికి నైన
           బాలుర పై నుండు భార మంతయును.


* * * * * * * *



      ద్వి. కుటిలాత్మురాల ! నీ గుణములు తెలిసె
           మటుమాయచేఁ జిక్కి మానము ధనము
           నీపాలు చేసితి నేఁ గాన నైతిఁ
           గామాంధకారంబు కష్టపువిద్య
           నీతి మాలినచర్య నేటికిఁ దేలిసె
           నింటిలో భోజనం బిచ్చకు రాక
           పరులయెంగిలి కాసపడితిని నేను.


* * * * * * * *




           వారకాంతలరీతి వర్ణింపరాదు
           బిడ్డ కొసంగక ప్రియురాలి కీక
           చీమలు గూర్చినచెలువునఁ గూర్చి

             ధనవంతు లగువారి ధనమెల్ల దోఁచి
             ముంజికాండ్రను జేసి మురిప మడంప
             వ్యర్ధులై విటవృత్తి వసుమతిమీఁదఁ
             బోయిరి బ్రతికెడుపొందిక లేక,


* * * * * * * * *


  ద్విపద. నినుఁబాసి భువిమీదఁ నిల్వ నోపుదుమె
              వనజాక్షి ! నీవెంట వత్తు మటంచు
              నెరి బ్రాహ్మపుత్రుఁడు నీవిధి యనుచుఁ
              గరియాన లిరువంకఁ గదిసి చల్లఁగను
              భామ లందఱు గూడి పలుదెఱంగులను
              గోమలిచరణంబు కొంత గై సేయఁ
              జిలికికప్పిన మూర్చ తెలిసి శీఘ్రముగఁ
              దలవంచి తనకాలు తప్పక చూచి
              యిది యేరి బంగరం బింతచక్కనిది
              యిది యెవ్వరిదె యమ్మ యీవులవెండి &c.


* * * * * * * * *


              ఘనుఁడై న శ్రీనాథకవిరాజరాజు
              చెన్నునికృపచేతఁ జిత్త ముప్పొంగి
              బాలుని విక్రమ ప్రౌఢి యంతయును
              విరచించె జనులకు విశదంబు గాను.

శ్రీనాథుఁడు పల్నాటివీరచరిత్రమును రచియించిన తరువాతనో రచింపక ముందో యొకసారి పల్నాటిసీమకుఁ బోయినట్టు తెలియవచ్చుచున్నది. అప్పు డాతఁడు స్వానుభవమునుబట్టి చెప్పిన పద్యములఁ గొన్నిటి నుదాహరించుచున్నాను.

           క. రసికుఁడు పోవఁడు పల్నా
              డెసఁగంగా రంభ యైన నేకులు వడుకున్
              వసుధేశుఁ డైన దున్నును
              గుసుమాస్త్రుండై న జొన్నకూడే కుడుచున్.

    ఉ. అంగడి యూర లేదు వరియన్నము లేదు. శుచిత్వ మేమి లే
        దంగన లింపుగారు ప్రియమైన వనంబులు లేవు నీటికై
        భంగపడంగ [28] దోడ్పడు కృపాపరులెవ్వరు లేరు దాత లె
        న్నంగను సున్న; గానఁ బలనాటికీ మాటికిఁ బోవ నేటికిన్ ?

    ఉ. దోసెడుకొంపలోఁ బసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్
        చేసిన వంటకంబు పసిబాలురశౌచము విస్తరాకులన్
        మాసిన గుడ్డలున్ దలకు మాసినముండలు వంటకుండలున్
        రాసెఁడు కట్టెలుం దలపరాదుపురోహితునింటికృత్యముల్.

     గీ. చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్లు
        నాగులేటినీళ్లు నాఁపరాళ్లు
        సజ్జజొన్న గూళ్లు సర్పంబులును దేళ్లు
        పల్లెనాటిసీమపల్లెటూళ్లు .

     క. జొన్నకలి జొన్నయంబలి
        జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్
        సన్నన్నము సున్నసుమీ
        పన్నుగఁ బల్నాటిసీమ ప్రజలకు నెల్లన్.

     క. గరళము మింగితి నంచున్,
        బురహార ! గర్వింపఁబోకు పోపోపో నీ
        బిరు దింకఁ గాన వచ్చెడు
        మెరసెడి రేనాటిజొన్న మెతుకులు తినుమీ !

ఈ కవిచేతనే రచియింపఁబడిన నందనందనచరిత్రములోని దన్న పద్యము నొక లక్షణ గ్రంధమునందుఁ జదువుటయే కాని నాకు గ్రంధము లభించినది కాదు. పేరునుబట్టి చూడగా శ్రీనాథుఁ డట్టి గ్రంథమును రచించి యుండునని తోఁచదు. భీమఖండాదిశైవపురాణములలోనే విష్ణుకథ వచ్చి

నప్పుడు విడిచి పెట్టిన మహానుభావుడు కేవలకృష్ణకధ యైన నందనందన చరిత్రమును రచించి యుండునా ? [29] శ్రీనాథుఁడు తన కాశ్రయులైన వేమారెడ్డియు, వీరభద్రారెడ్డియు మరణము నొందినతరువాతఁగూడఁ గొంతకాలము బ్రతికి యుండెను. ఆ కాలమునం దతఁడు కృష్ణాతీరము నందు బొడ్డుపల్లె యను నొక గ్రామము గుత్తచేసి నదీ ప్రవాహము వలన సస్యము పోఁగా గుత్తధనము రాజునకుఁ గట్టలేక వారిచేత బహువిధములయిన బాధలను పొంది తుదకు మిక్కిలీ బీదతన మనుభవించెను. ఈ సంగతులను మెకన్జదొరవారు సేకరించిన స్థానికచరిత్రములలో నుదహరింపఁబడిన శ్రీనాథకృతములైన యీ క్రింది పద్యముల వలన నెఱుఁగవచ్చును.

         సీ. కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా
                         పురవీధి నెదురెండ పొగడదండ
             సార్వభౌముని భుజ స్తంభ మెక్కెనుగదా
                         నగరివాకిట నుండు నల్లగుండు
             ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మంబునఁ
                         దగిలియుండెనుగదా నిగళయుగము
             వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత
                         వియ్య మందెనునుగదా వెదురుగొడియ
   
             కృష్ణ వేణమ్మ కొనిపోయే నింత ఫలము
             బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలుఁ బెసలు
             బొడ్డుపల్లె ను గొడ్డేఱి మోసపోతి
             నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు.

       సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
                       రత్నాంబరంబు లేరాయఁడిచ్చు
             గైలాసగిరిఁ బండె మైలారవిభుఁ డేఁగి
                       దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు ?
             రంభఁ గూడె దెనుంగురాయరాహుత్తుండు
                       కస్తూరి కేరాజుఁ (బస్తుతింతు ?
             స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమ
                       పాత్రాన్న మెవ్వనిపంక్తి గలదు ?

             భాస్కరుఁడు మున్నె దేపునిపాలి కరిగిఁ
             గలియుగంబున నిఁక నుండఁ గష్ట మనుచు
             దివిజవివరుగుండియల్ దిగ్గు రనఁగ
             నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి.

అవసానదశయం దిట్టి కష్టముల కెల్లను గారణము యౌవనదశయందుఁ గామవశముచేత స్వేచ్ఛగా విహరించి దేహమును ధనమును జెడఁగొట్టుకొన్న పాపఫలము తక్క వేఱొక్కటి గాన రాదు. నే నీవాక్యమును వ్రాసినందునకుఁ గినుక వహించి చిలుకూరి వీరభద్రరావు గారు తమ యాంధ్రుల చరిత్ర మూఁడవ భాగములో “కామోద్రేకము కలిగించు విధమున మిక్కిలి పచ్చిగా స్త్రీవర్ణనముల గావించి రసికజనమనోరంజనము గావించేడు కవులు లోకములోని విటపురుషుల దుర్వర్తనముల హాస్యప్రబంధరూపమునను ప్రహసనరూపమును వెల్లడించెడు కవులను, కామపరవశు లనియు వ్యభిచారులైన మహాపాపులనియు ... చెప్పవలసి వచ్చునుగదా ! " అని ద్వేషబుద్ధితో దురభిమానపూరితములైన యుక్తిరహితదూషణభాషణములను వ్రాసియున్నారు. ఇట్టి వాక్యరత్నములుపేక్షణీయములు. రసికజనమనోరంజనము సర్వకళాశాలవారిచే ప్రధమశాస్త్రపరీక్ష (F. A.} కును, శాస్త్రో పాధ్యాయపరీక్ష(M A ) కును పఠనీయ గ్రంథముగా నిర్ణయింపబడె ననియు, అందలి శృంగారము శ్రీనాథుని దాక్షారామాప్సరోభామాదులదానివలె జార స్త్రీపురుషసంబంధమయినది గాక యనింద్యమైన భార్యాభర్తృసంబంధ మయినదనియు, ప్రహసనములలోని విటపురుషదుర్వర్తన ప్రకటనము వీథి నాటకములోనిదానివలే దుర్ణ యపోషణమునకుఁ గాక దుర్జయశోషణమునకును నీతిభంజనమునకుఁగాక దుర్నీతిభంజనమునకును ఉద్దేశింపఁబడెననియు, మా మిత్రు లెఱుంగుదురుగాక ! శ్రీనాధుని పై మోపఁబడిన దోషము స్త్రీవర్ణనములు చేసినందునకును, విటపురుషుల దుర్వర్తనముల వెల్ల డించినందునకును గాదు; స్త్రీలోలుఁడయి వయఃకాలమున విచ్చల విడిగాఁ దిరిగి కాయమును, ధననికాయమును జెడఁగొట్టుకొని కష్టపడవలసిన వృద్ధదశను దెచ్చుకొన్నందునకు, శ్రీనాధుఁడు వేశ్యాప్రియుఁడని యాతనిని గూర్చి వ్రాసినవారందఱును నైకకంఠ్యముతోఁ జెప్పుచున్నారు. వేశ్యలపొందు ధనేకలభ్యమని యెల్లవారును నెఱుఁగుదురు. శ్రీనాధుడు మహారాజుల యొద్ద నాస్థానకవి యయి యపరిమితధనము నార్జించుటయే కాక, వివిధ దేశాధీశుల సభల కరిగి కనకాభిషేకాదులను పొందిన మహానుభావుఁడు. కనకాభిషేకము సామాన్య మయినది కాదు, జలమువలె శిరస్సుపై నీ కనకకలశములతో సువర్ణ ముద్రలతో స్నానము చేయించిన ధనమే బహు సహస్రరూప్యముల గలదయి యుండును. కనకాభిషేకము చేసిన మహారాజు కవిశిరోమణిశిరస్సు పయిని గుమ్మరింపఁబడిన సువర్ణ సహస్రములను కవి కియ్యక తాను మరలఁ గైకొని యుండఁడు. రసిక శిఖామణి యయినకవి కియ్యఁబడిన యటువంటి ధనరాశి వేశ్యల వలలలోఁ దగులుకొన్నప్పు డల్పకాలములో నదృశ్యమగుట వింతకాదు. వేశ్యల యింటిబంటు లైన లక్షాధికారులు నిమిషములో భిక్షాధికారు లగుచుండుట మనము లోకములో నాలోకించు చుండలేదా ? పండితుడు చేసినను, పామరుఁడు చేసినను దోషము దోషమే ! పండితుఁడు చేసినది యొప్పిదమును, పామరుఁడు చేసినది తప్పిదమును గానేరదు. శ్రీనాధుని కవితాచమత్కారమును నాంధ్రసారస్వతమునకుఁ జేసిన మహోపకారమును మెచ్చి యానందించువారిలో నెవ్వరికి నేను దీసిపోవువాఁడను గాను. అయినను సత్యము నపేక్షిం చియు యువజనాభి వృద్దిని గాంక్షించియు, నిష్టములేకయే పెద్దలనుగూర్చిన యప్రియమైన సత్యమును బలుకవలసినవాఁడ నైతిని. విద్యావివేకసంపన్నులైనవారు నన్ను మన్నింతురుగాక! [30]

  1. [సంస్కృతమున 'చమత్కార చంద్రిక' యాను నలంకార శాస్త్ర గ్రంథమును రచించిన వాఁడు సింగ భూపాలుని యాస్థాన విద్వాంసుడగు విశ్వేశ్వర పండితుఁడు; కాని సింగ భూపాలుcడు కాcడు. దీనికి సింగభూపాలీయమును నామాంతరము లేదు. సింగభూపాలుఁడు రచించిన 'రసార్ణవసుధాకరము' అను నాట్యాలంకార గ్రంథమునకే ఆ నామాంతరము కలవు.]
  2. దీని రచనలో నితఁడు శ్రీనాథుని సాహాయ్యమును పొందియుండవచ్చునని కొందఱి యాశయము.
  3. [వసంతరాజీయము నాట్యశాస్త్రముకాని కావ్యము కాదు. 'నామ్నావసంత రాజీయం నాట్యశాస్త్రం యదద్భుతమ్' ఇది లభించలేదు]
  4. [పద్యములోని 'పాకనాఁటింటివాడవు'అను దానింబట్టి శ్రీనాథుcడు పాకనాఁటి సీమలోని వాఁడని చెప్పవలను పడదనియు, అతఁడు పాకనాఁటి శాఖకు జెందిన నియోగియ నుటలో నేయని ప్రమాణము కాఁగలదనియు, 'ఇంటివాcడవు' అనుటం బట్టియే యీ యంశము స్పష్టమగుచున్నదనియు గొందఱి యభిప్రాయము. చాల మంది పండిత విమర్శకులు దీనినే యామోదించుచున్నారు.]
  5. ['వారిధితటీ క్రాల్పట్టణాధీశ్వరున్' అనునెడ 'వారిధి తటీ కాల్పట్టణాధీశ్వరున్' అను పాఠాంతరము కలదు, దానినే పలువురంగీకరించిరి. ఈ కాల్పట్టణ మేమో యింతవఱకును సరిగా నిశ్చయింపఁ బడలేదు. క్రోత్త పట్టణము అనుటకు బదులుగా శ్రీనాథుఁడు 'క్రాల్పట్టణ మని చెప్పియుండడనియు, క్రొత్త కు "క్రాలు పర్యాయపదము కాదనియు జాలమంది యభిప్రాయపడుచున్నారు. కృష్ణా మండలమునందలి 'కాశీపట్టణ మే' "కాల్పట్టణమై యుండునని యభిప్రాయ పడిరి. ఈ కాల్పట్టణము కలపటమై యుండునని శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్మణ రావుగారి యభిప్రాయము. గుంటూరుజిల్లా, రేపల్లె తాలూకాలోనున్న నల్లూరే (నల్ల + ఊరు = "కాల పట్టణము. కాల్పట్టణము) శ్రీనాథుని నివాసమైనట్లాంధ్రకవి తరంగిణి కర్తల యాశయము. [చూ, ఐదవ సంపుటము ఫుట. 6.] నెల్లూరు శ్రీనాథుని నివాసము కానగునని శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారి యాశయము[ చూ. భారతి - ఆంగీరస - మాఘసంచిక]
  6. క్రీడాభిరామకర్తృత్వముఁగూర్చి వల్లభరాయని చరిత్రమున వివరింపఁబడినది.
  7. [ఇయ్యది శాలివాహనసప్తశతిలోనిదనియే పలువురి విశ్వాసము. పెదకోమటి వేమభూపాలుఁడీ గ్రంథమునుజూచి యుండవచ్చునని శ్రీప్రభాకరశాస్త్రులు గారి యభిప్రాయము.]
  8. [కుమారగిరి కాలమున శ్రీనాథుఁ డిర్వదియేండ్ల లోపు వయస్సువాఁడయి యుండుట వలననే యాస్థానమునఁ బ్రవేశము కలగలేదని కొందఱి యభిప్రాయము.]
  9. [పంజార-పాఠాంతరము, మఱియు 'తెచ్చి' అనుచోట్ల 'తెచ్చె' అను భూతకాలిక క్రియయే కొన్నిటఁ గలదు.]
  10. [సీరి అని పాఠాంతరము]
  11. [గప్పలి జోగుపల్లి వలికాసమ్మాన్లం దెప్పించు నేర్పరియై అని పాఠాంతరము]
  12. [తనకు బుత్రుఁడున్నాcడనియు, వాఁడెక్కడికొ పోయెననియు వంటకములు చల్లారకము న్నే భుజింపవలెననియు, చిఱుతొండనంబి కోరినట్లు హరవిలాసములోఁ గలదు.]
  13. విూఁదన్- పాఠాంతరము
  14. [ఈ గ్రంథమును రచించుటలో శ్రీనాధుఁడు సాయపడి యుండునని పలువురి యభిప్రాయము]
  15. [శివరాత్రిమహాత్మ్యము శ్రీనాథుని కడపటి రచసయైయుండునని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రులుగారు, 'ఆంధ్రతరంగిణి' కర్తయుఁ దలంచుచున్నారు. శ్రీనాథ మహాకవి పెద కోమ టి వేమారెడ్డి యాస్థానమున విద్యాధికారిగానున్న కాలములో గ్రంథరచనము సాగించి యుండక పోవచ్చుననియు, గ్రంథములను రచింపవలెనను నియమము లేదనియు శ్రీనాధుఁడు తన కావశ్యకమని తోఁచినపుడే గ్రంథరచనకుఁ గడంగుచుండెననియు, జీవనము నిర్విచారముగ సాగిపోవుచుండుటచే గ్రంథరచనం గూర్చిన యాలోచనయే యతనికి లేకుం డెనని యూహింప వచ్చుననియుఁ గొందఱి యాశయము. పెదకోమటి వేమారెడ్డికి సంస్కృతము పై నెక్కువ వ్యామోహముండుటయు నిందులకు హేతువైనఁ గావచ్చునని కొందఱి యూహ.]
  16. [శ్రీనాథుడు పాకనాఁటింటివాఁడు కాని, పాకనాటిసీమవాఁడు కాఁడని విమర్శకుల యభిప్రాయము.]
  17. [ఈ విషయ మిదివరకే చర్చింపఁబడినది]
  18. [వల్లభాభ్యుదయ మింతవఱకును లభింపలేదు. ఆది శ్రీనాథ కవికృత మని కొంద రందురు. అది శ్రీనాధుని వల్లభాభ్యుదయములోనిదిగా నొక పద్యము పెదపాటి జగన్నాథ కవి 'ప్రబంధ రత్నావళి' లో నుదాహరింపcబడినది. వల్లభాభ్యదయకర్త వేరై యుండవచ్చునట ! క్రీడాభిరామము కాక శ్రీనాథుని వీధి నాటకమని మఱియొక పుస్తకము ప్రచారములో నున్నది. అదియే వల్లభాభ్యుదయమని కొందరందురు - అది శ్రీనాథ కృతమనుటకుఁ దగిన యాధారములు లేవు]
  19. [కృష్ణదేవరాయల తండ్రి సరసరాయలు కాని వీరనరసింహ రాఁయలు కాఁడు; వీర నరసింహరాయలు కృష్ణరాయల యన్న.]
  20. [రసార్ణవసుధాకరము సింగభూపాల విరచితముకాదేమోయని శ్రీ ప్రభాకరశాస్త్రులు
    గారు సందేహించుచున్నారు. చమత్కారచంద్రికకు సింగభూపాలీయ మను పేరు అప్రసిద్ధము.]
  21. ఇది నామాంతరమైనట్లు తోఁచదు, చమత్కారచంద్రిక కిది విశేషణము.
  22. [బల్వెల పురిన్ ... అనునది సరియైన పాఠము.]
  23. నాకేమి - అని పాఠాంతరము
  24. [శ్రీ నాధుఁడు తన కవిత్వము సంస్కృతము, తెలుగు కాదు: కర్ణాటభాషయని యా క్షేపణరూపముగఁ జెప్పినను 'చెవికింపఁగు మధుర మైన భాష (కర్ణ+అట+భాష)' యని సూచించెననుట స్పష్టము. ఎవ్వరేమన్న నండ్రుగాకేమికొఱఁత? అనునదియు పయి యర్థమును సమర్థింపఁగలదు]
  25. [భీనుఖండమును రచించిన వెంటనే శ్రీనాథునకు వేమ, వీరభద్రా రెడ్ల యాశ్రయము లభింప లేదనియు, వారికిఁ గొండవీటి రెడ్ల యడఁ గల స్పర్థ కొంత తదాశ్రితుఁడగు శ్రీనాధునియెడఁగూడ నుండెననియు, పిదప శ్రీనాథుఁడు ప్రౌఢదేవరాయలు, సర్వజ్ఞ సింగభూపాలుఁడు మున్నగువారి యాస్థానములకరిగి, కనకాభిషేకాది సత్కారములను పొందినపిదప నతని యెడ వారికి విశేషగౌరవమేర్పడి శ్రీనాథునాస్థానకవీశ్వరుని గా గ్రహించిరనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి యభిప్రాయము. (చూ. శృంగారశ్రీనాథము - ఫుటలు 216, 217.]
  26. [ఇయ్యెడ ఆంధ్రకవితరంగిణీ' లో నిట్లున్నది. అనితల్లి భర్తయైన వీరభద్రా రెడ్డి తండ్రి యల్లాడభూపతి, స్వామిద్రోహపరాయణులను వైరి నృపతులనెడి జలరాశిలో మునిగిపోయిన భూమిని శ్రీహరివలె నుద్ధరించినాడనియు, దురిత రహిత చిత్తుఁ డైన యాతఁడు శత్రువశమునుండి తప్పించి యా రాజ్యాధికారమును గాపయ వేమభూపతి కుమార్తెయైన యనితల్లియందుంచి నాఁడనియుఁ, గలువచేఱు శాసనమునందలి 15-49 శ్లోకములలోఁ జెప్పియుండుటచే, ననితల్లి కీ రాజమహేంద్రవరరాజ్యము తల్లి మూలకముగా వచ్చియున్నదని భావింపవలయునని శ్రీనాథచారిత్రము నందు శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసియు, నందే యొక తావున దొడ్డాంబిక యనితల్లికి సవతితల్లి యనియు, సవతితల్లినుండి యా రాజ్యమామెకు సంక్రమించినదనియుఁ జెప్పియున్నారు. రాజమహేంద్రవరరాజ్యమనితల్లిదనుట నిశ్చయమే కాని, యది యెవరి మూలమున వచ్చిన దనుటలోనే వివాద మున్నది. ఆ రాజ్యమును కొమరగిరి రెడ్డి కాటయ వేమన కిచ్చెనని తో త్తరమూడి శాసనమనుచున్నది. అది సత్యమైనచో నా వేమారెడ్డి కనితల్లితప్ప యప్పటికి వేఱు సంతానము లేదు, కావునను, ఆ రాజ్యమున కుత్తరాధికారిణి అనితల్లి తప్ప మఱియొకరు లేనందునను, అల్లాడ రెడ్డి యా రాజ్యభారము ననితల్లియందుంచి, తన యు దారాశయమును గనుపఱచి యుండును, (సంపుటము.5, పుటలు, 71,72)]
  27. [శీనాథరచిత మైన 'వీథి నాటకము' కానరాదు కర్తృత్వము కల్పితము కావచ్చును. కాని యిందలి పద్యములు చాల వఱకును శ్రీనాథునివి చేరి యుండవచ్చునని కొందఱి యభిప్రాయము ]
  28. [బాల్పడు - పాఠాంతరము]
  29. * [శ్రీనాథుఁడు నందనందన చరిత్రమును రచియించి యుండ లేదని శ్రీ ప్రభాకర శాస్త్రి గారును, ఆంధ్రకవితరంగిణికారులును కూడ వ్రాసియున్నారు.] 'పురవీథి నెదురెండ పొగడదండ-' అను నెడల పొగడదండకు బదులుగా 'బొగడదండ' అని యుండవలయుననియు, ఇసుపబొగడలతోఁగూడిన దండయే శిక్షాసాధనమగును గానీ • 'పొగడదండ' శిక్షాసాధనము కాఁజాలదనియు నిర్ణయింపఁబడియున్నది. దీనిని సహృదయులందఱు నంగీకరించి యున్నారు. [చూ. భారతి - డిసెంబరు 1936]
  30. [శ్రీనాధమహాకవి తన యవసానదశలోఁ గష్టపడుటకు శ్రీ వీరేశలింగము పంతులు గారు చెప్పిన కారణము సరియైనది కాదనియు, ద్రవ్యమును నిలువచేయు తలంపతనికి లేకుండుటయే కారణమనియుఁ బలువురి యభిప్రాయము, శ్రీ ప్రభాకర శాస్త్రిగారును, శ్రీ చాగంటి శేషయ్య గారును, శ్రీ వీరేశలింగముపంతులు గారి యభిప్రాయము సరికాదని తెలిపియున్నారు.]