ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/వినుకొండ వల్లభరాయడు
వినుకొండ వల్లభరాయఁడు
ఈ కవి నియోగిబ్రాహ్మణుఁడు; విశ్వామిత్రగోత్రుఁడు; తిప్పనార్య పుత్రుఁడు. ఇతడు క్రీడాభిరామ మనుపేర దశరూపకములలో నొకటి యయిన వీధినాటకమును దెనుఁగున రచించెను. తెలుఁగున దృశ్యకావ్యమును రచించుటలో నీతఁడే మొదటివాఁడుగాఁ గనఁబడుచున్నాఁడు. తానీ క్రీడాభిరామమును సంస్కృతమున రావిపాటి తిప్పన్నచే రచియింపఁబడిన ప్రేమాభి రామము ననుసరించి చేసినట్టు కవియే ప్రస్తావనలోఁ జెప్పుకొని యున్నాడు. ఇతc డెంతవఱకు మూలగ్రంథము ననుసరించెనో యెంతవఱకు స్వకపోల కల్పితముగా విరచించెనో తెలియరాదు. క్రీడాభిరామమునందలి వర్ణనము లనేకములు. కవి స్వకపోలకల్పితముగాఁ జేసిన వనియే తోచుచున్నది. ఈ రూపకముయొక్క— ముఖ్యరంగ మోరుఁగల్లు. ఇది కాకతీయ చక్రవర్తులకు రాజధానిగా నుండెను. ఈ రాజ్యమును పాలించిన కాకతీయ చక్రవర్తులలోఁ గడపటివాఁడు 1296- వ సంవత్సరము మొదలుకొని 1323 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనముచేసి మహమ్మదీయులచేఁ పట్టుబడి ప్రభుత్వమును గోలుపోయిన ద్వితీయ ప్రతాపరుద్రుఁడు. ఈ క్రీడాభిరామము 1420 వ సంవత్సర ప్రాuతమునందు రచియింపఁబడెను. ఈ కాలమునందు శ్రీనాధుఁడు కర్ణాటక దేశమునకుఁ బోయి వల్లభామాత్యుని సందర్శించి వల్లభాభ్యుదయమును [1] రచియించి యుండుటచేతను, క్రీడాభిరామములోని "కందుకకేళి సల్పెడు ప్రకారమునన్' అను పద్యమును "కుసుమం బద్దిన చీరకొంగు వొలయిన్' అను పద్యమును శ్రీనాథుని వీధినాటకములోనివని యప్పకవి యుదాహరించి యుండుటచేతను, క్రీడాభిరామములోని "గార్గ్య సిద్ధాంతమతముషఃకాలకలన" "శకున మూనుట యది బృహస్పతిమతంబు" "వ్యాసమతము మనఃప్రసాదాతిశయము" "విప్రజనవాక్య మరయంగ విష్ణు మతము' అను 60 వ పద్యమునందలి ప్రథపు ద్వితీయ చతుర్దపాదములు శ్రీనాథుఁ డిటీవల రచియించిన భీమేశ్వరపురాణ తృతీయాశ్వాసములో "గార్గ్యసిద్దాంతమత ముష8కాలకలన, శకున మూనుటయది బృహస్పతి మతంబు, విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము, సర్వసిద్ధాంత మతమభిజిత్తు సమ్మత మగు" అను 41 వ పద్యమునఁ బ్రధమ ద్వితీయ తృతీయపాదములుగా నుండుటచేతను, కొందఱు శ్రీనాథుఁడే క్రీడాభిరామమును రచించి దాని కర్తృత్వమును వల్లభరాయని కారోపించె నని చెప్పుదురు, కాని యిది సిద్ధాంతము చేయుటకుఁ దగిన నాధారము లేవియుఁ గానరాపు. అప్పకవికిఁ బూర్వమునం దున్నవారును వల్లభరాయనికిఁ జేరువకాలమునం దున్నవా రగుటచేత నాతనింగూర్చి యెక్కువగా దెలియఁదగినవారును నైన చిత్రకవి పెద్దన్న, ముద్దరాజు రామన్న, శ్రీధరుఁడు మొదలైన లక్షణగ్రంధకర్త లందఱును బూర్వోక్త పద్యద్వయముసు వల్లభరాయని వనియే తమతమ లక్షణగ్రంధములయం దుదాహరించి యుండఁగా వల్లభరాయని కిన్నూఱు సంవత్సరముల వెనుక నుండిన యప్పకవి యవి శ్రీనాధుని వనుట యజ్ఞానమూలము గాని తెలిసి చెప్పుటవలనుగాదు. వల్లభరాయని దర్శింపబోయినప్పు డతఁడు క్రీడాభిరామము రచించుచుండఁగాఁ జూచి యుండుట చేతనో, తత్పద్యరచనము నందాతనికి దోడుపడి యుండుటచేతనో శ్రీనాధుఁడు తాను తరువాత రచించిన భీమఖండమునందు సంస్కృతశ్లోకమును దెనిగించుచు 'గార్గ్యసిద్దాంతమత" మన్న పద్యములోc గొంతభాగమట్లే వేసి యుండవచ్చును. అంతమాత్రముచేత బుస్తక మంతయు శ్రీనాథ విరచిత మనుట యతిసాహసము. [క్రిడాభిరామము వినుకొండ వల్లభరాయ కృతమని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు, శ్రీ వేమూరి విశ్వనాథశర్మ గారు, శ్రీ బండారు తమ్మయ్యగారు, శ్రీ టేకుమళ్ల అచ్యుతరావుగారు మున్నగువా రభిప్రాయపడినారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, శ్రీ కిళాంబి రాఘవాచార్యులుగారు, శ్రీ చాగంటి శేషయ్యగారు మున్నగువారిది శ్రీనాథకృతమే యని విశ్వసించుచున్నారు.
ఇయ్యది శ్రీనాధకృతమే యని వివరించుచు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామము (శృంగార గ్రంధమాల) పీఠికలో వ్రాసిన కొన్ని వాక్యములు ఇచట నీయఁబడుచున్నవి.
"సులక్షణసారము, అప్పకవీయము, లక్షణదీపిక, సర్వలక్షణ సారసంగ్ర హము మొదలగు లక్షణ గ్రంథములందు శ్రీనాధుని వీధినాటకము లోనివిగా నుదాహృతములయిన పద్యములీ క్రీడాభిరామమునఁ గలవు. శ్రీనాధుఁడే యిూ గ్రంధమును రచించి వల్లభరాయని పేరుపెట్టఁగా గ్రంధమున వేఱు పేరున్నను, రంగనాధ రామాయణాదులవలె నీగ్రంథము కూడఁ గర్తయగు శ్రీనాథుని "పేరనే లోకమునఁ బ్రచారముగాంచి యుండుటచే నప్పకవ్యాదులట్లు చెప్పి యుండవలెను. అప్పకవ్యాదు లుదాహరించిన పద్యములు క్రీడాభి రామమున నానుపూర్వితో నున్నవి, ప్రక్షిప్తము లనఁగుదురదు. వల్లభ రాయcడును, శ్రీనాథుఁడును సమకాలమువారు గాకపోవుదురేని, శ్రీనాధుఁ డాతని పేర గ్రంధము రచించుట యసంభవమగును. అట్టి చిక్కులేదు. శీనాథుఁడును. వల్లభరాయఁడును సమకాలమువారు. వల్లభరాయని పెద్ద తండ్రి యగు లింగనమంత్రి, విద్యానగరపు హరిహరరాయల మంత్రి, రెండవ మూఁడవ హరిహరరాయండ్రు క్రీ. శ. 1402, 1412 వఱకు నుండిరి. లింగ మంత్రి వారిలో నెవరియొద్ద మంత్రియయిన యుండినను వల్లభరాయఁడు మన శ్రీనాధుని సమకాలమువాఁడే యగును...... మఱియు నీ గ్రంధమున వల్లభరాయని వాగ్వైభవ దాతృత్వాది వర్ణనము మితిమీఱి యున్నది. గ్రంధకర్తయే తానగుచో వల్లభరాయఁ డట్లా కందపద్యాష్టకమును రచించుకొని యుండఁడు. ఆ పద్యములు భీమఖండాదులలోని కృత్యవతరణికా పద్యముల పోలిక గలిగియున్నవి ...... మఱియుఁ గృత్యవసాన పద్య మునఁ "గాలభైరవుఁడు కవీంద్రకాంక్షిత త్రిదశ మహీరుహమగు వల్లభరాయనికి సమగ్ర వై భవాభ్యుదయములు కృపసేయు" నని యాశీర్వచనమున్నది. సూత్రధారోక్తిగాను, భరతోక్తిగాను నయినను గంథకర్తయగు వాఁ డిట్లు చెప్పుకొనుట సరసముగాదు. ఇది తానే తుమ్ముకొని, తానే శతాయుస్సని యనుకొనునట్లున్నది కవీంద్ర కాంక్షిత త్రిదశ మహీరుహము గావున వల్లభరాయడు విశేష ధనమొసగి కవి యశఃకాంక్షియై యేతత్కృతి కర్తృత్వమును దనపై వేయించు కొన్నాఁడని తలఁచుట ప్రమాణదూరము కాదు. అట్టి సంప్రదాయముగూడ నాకాలమున హెచ్చుగాఁగలదు శ్రీనాధ కవి యనేక స్థలముల నిందుదన తక్కిన గ్రంథముల రచనములను జేర్చెను. ఆపోలిక లీగ్రంథము శీనాథ కృత మేయని చెప్పక చెప్పచున్నవి? [క్రీడాభిరామము. ఉపోద్ఘాతము-పుటలు 9-12]
క్రీడాభిరామ మనెడి యీ వీధిరూపకము పురబాహ్యాంతరప్రదేశములయందు విహరించుచు నోరుగంటినివాసులైన గోవిందమంచనశర్మ యను బ్రాహ్మణ శిఖామణియు నాతని చెలికాఁడై న టిట్టిభసెట్టి యను వైశ్యవిటగ్రామణియు నొcడారులతోఁ దాము చూచుచు వచ్చిన వివిధ వినోదములనుగూర్చి చేసిన సంభాషణ రూపమున నున్నది. కవి యేతద్రూపకప్రస్తావనలోఁ దన తాత తాత యైన చంద్రామాత్యుఁడు బుక్కరాజుమంత్రిగా నుండినట్లీ క్రింది పద్యమునఁ జెప్పెను
శా. "కర్ణాటక్షితినాథుఁ డైన పెదబుక్కక్ష్మాపదేవేంద్రున
భ్యర్ణామాత్యుని దానఖేచరునిఁ జoద్రాధీశు బంధుప్రియున్
వర్ణించుం గవికోటి శంకరజటావాటీ తటాంతర్నదీ
స్వర్ణద్యంబు తరంగరిcఖణలసత్పాహిత్యసౌహిత్యయై".
మ. "కనకాది ప్రతిమానధైర్యనిధి లింగక్ష్మావమంత్రీంద్రుతో
ననతారాతినృపాలమంత్రిజనతాహంకారతారాహిమా
ర్కునితో రూపరతీంద్రుతో హరిహరక్షోణీంద్రసామ్రాజ్యవ
ర్ధనుతో సాటి సమాన మీడు గలరా రాజన్యసైన్యాధిపుల్.
పినతాత మాత్రమే కాక కవి తండి యైన తిప్పన్న యనఁబడెడు త్రిపురాంతకుఁడు కూడ హరిహరరాయల కొలువులోనే యుండి యాతనిరత్నభాండారాధికారి యైనట్లు ప్రస్తావనలో యూ పద్యమునఁ జెప్పఁబడెను.
సీ. సత్యవ్రతాచారసత్స్కీర్తిగరిమలఁ
జంద్రుతోడను హరిశ్చంద్రుతోడ
నభిమాన విస్పూర్తి నైశ్వర్యమహిమను
రారాజుతోడ రేరాజు తోడ
సౌభాగ్యవై భవజ్ఞానసంపదలను
మారుతోడ సనత్కుమారుతోడ
లాలిత్యనిరుపమశ్లాఘావిభూతుల
భద్రుతోడను రామభద్రుతోడ
సాటి యనదగు ధారుణీ పాలసభల
వీర హరిహరరాయపృథ్వీకళత్ర
రత్న భండారసాధికార ప్రగల్భు
మల్లికార్జునత్రిపురారి మంత్రివరుని
హరిహరరాయ రత్నభాండారాధ్యక్షుఁడును వినుకొండదుర్గపాలకుఁడు నైన గ్రంథకర్త వల్లభరాయఁడు ములికినాట మూడు గ్రామగ్రాసములతో మోపూరు పాలించుట మొదలైన విషయము లీ పద్యములలో నభివర్ణింపఁ బడినవి.
ఉ. గంధవతీప్రతీరపురఘస్మరపాదబిసప్రసూనపు
ష్పంధయచక్రవర్తి శ్రుతపర్వతదుర్గమహాప్రధానరా
డ్గంధగజంబు తిప్పన యఖండసుధీనిధి గాంచెఁ బుత్త్రులన్
బాంధవకల్పవృక్షముల బైచనవల్లభమల్లమంత్రులన్.
సీ. మూఁడు గ్రామ గాసములతోడఁ గూడంగ
మోపూరు పాలించె ముల్కినాట
నాశ్వలాయనశాఖయందు ఋగ్వేదంబు
కరతలామలకంబుగాఁ బఠించెఁ
బ్రత్యక్ష మొనరించి భైరవస్వామిచేఁ
సిద్ధసారస్వతశ్రీ వరించెఁ
గామకాయనసవిశ్వామిత్ర గోత్రంబు
వంశ గోత్రంబుగా వార్తకెక్కె
నెవ్వఁ డా త్రిపురాంతకాధీశ్వరునకు
రాయనవరత్న భండారరక్షకునకుఁ
బ్రియతనూజుండు చంద్రమాంబికకు సుతుఁడు
మనుజ మాత్రుండె వల్లభామాత్యవరుఁడు.
క. అహరవధిసమయనృత్య
త్తుహినాంశుధరప్రచారధూతాభ్రధునీ
లహరీ భ్రమఘుుమఘుమములు
వహిఁ దిప్పయవల్లభన్న వాగ్వైభవముల్.
శా. సారాచారమునన్ వివేకసరణిన్ సౌభాగ్యభాగ్యంబులన్
ధౌరంధర్యమునన్ బ్రతాపగరిమన్ దానంబునన్ సజ్జనా
ధారుం దిప్పనమంత్రి వల్లభు నమాత్యగ్రామణిం బోల్పఁగా
వేరీ మంత్రులు సింధువేష్టితమహోర్వీచక్రవాళంబునన్ ?
వల్లభరాయఁడు 1404 వ సంవత్సరమువఱకును కర్ణాటక రాజ్యపరిపాలనము చేసిన హరిహరరాయల రత్నభాండారాధ్యక్షుఁ డయిన తిప్పన పుత్రుఁడగుటచేత నా సంవత్సరమున కనంతరమున నుండె ననుటకు సందేహము లేదు. అందుచేత నీ క్రీడాభిరామము 1420 వ సంవత్సర ప్రాంతము నందు రచియింపబడెనని నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును. ఈ వల్లభరాయనికవిత్వము మృదుమధురపదగుంభనము కలదయి ప్రౌఢముగా నున్నది. కాని కొన్ని చోట్లఁ గ్రీడాభిరామములోని వర్ణనము లసభ్యము లయియశ్లీలములయి నీతిబాహ్యము లయి యుండుటచేత స్త్రీలును, సామాన్య జనులును జదువఁదగినది కాదు. జారత్వము దూష్యముగా బరిగణింపcబడక శ్లాఘ్యముగా నెంచcబడెడు కాలమునందుఁ జేయఁబడిన గ్రం థము విషయమయి మనము కాలమును నిందింపవలసినదే కొని కవివి గర్హింపవలసిన పనిలేదు. ఈ కవియే ప్రస్తావనయందుఁ దన తాతను నాతని తమ్ములను వర్షించుచు వారవధూజనపుష్పభల్లులని వారికి బ్రతిష్టావహమైన విశేషణము నీ క్రింది పద్యమునఁ గూర్చెను.
ఉ. మల్లనమంత్రికిం ద్రిపురమాతరళాక్షికిఁ గాంతి రోహిణీ
వల్లభు లాత్మసంభవులు వల్లభలింగనతిప్పనక్షమా
వల్లభమంత్రి శేఖరులు వారవధూజనపుష్పభల్లులు
త్ఫుల్లయశోవిభాసితులు పుణ్యులు సింగనభైరవేంద్రులున్.
ఇఁక నీ విషయము నింతటితోఁ జాలించి వినువారి వీనుల కింపుగా నుండు పద్యములను గొన్నిటిని గ్రీడాభిరామములోనివాని నుదాహరించుచు నీ చరితమును ముగించుచున్నాను.
గీ. జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స;
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె ?
మ. ద్రుతతాళంబున వీరగుంభితకధుంధుంధుం కిటాత్కారసం
గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా
యతిగూడం ద్విపద ప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కత [2]ప్రత్యేకముగాఁ గుమారకులు ఫీట్కారంబునం దూలఁగన్.
మ. ఉడువీధిన్ శిఖరావలంబి యగు నాంధ్రోర్వీశు మోసాలపై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటాఘణత్కారముల్
సడలెన్ భానుఁడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటిన్
గుడువం బోదమె లెక్క యిచ్చి ? కడు నాఁకొన్నార మిప్పట్టునన్
ఉ. కప్పురభోగివంటకము కమ్మని గోధుమపిండివంటయున్
గుప్పెడు పంచదారయును గ్రొత్తగఁ యావునే పెస
ర్పప్పును గొమ్మునల్లనఁటిపండ్లును నాలుగునైదు నంజులున్
లప్పలతోడఁ గ్రొంబెరుగు లక్ష్మణవజ్ఝలయింట రూకకున్
శా. ద్వీపాంతంబుననుండి వచ్చితివె భూదేవ! ప్రశాంతం మహా
పాపం సర్వజగత్ప్రసిద్దసుమనోబాణాసనామ్నాయవి
ద్యోపాధ్యాయి పతాపరుద్రధరణీశోపాత్త గోష్ఠీప్రతి
ష్ఠాపారీణ నెఱుంగ వయ్యెదవె మాచల్దేవి వారాంగనన్ ?
చ. ఉభయము భావవీధి జయ మొందిన భంగి భయం బొకింత లే
కభిముఖ మయ్యె వెన్వెనుకవై యట గొన్ని పదంబు లేగుచున్
రభసముతో దువాళిగొని భ్రగ్గునఁ దాకెఁడు చూడు నెట్టి టి
ట్టిభ దిధిధీయనంగను గడింది యుదభ్రము లీయురభ్రమల్
చ. వెనుకకు మొగ్గవ్రాలి కడువిన్నను వొప్పఁగఁ దొట్టినీళ్ళలో
మునిఁగి తదంతరస్థ మగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే
చెను రసనా ప్రవాళమున శీఘ్రమ గ్రుచ్చెను నల్లపూసపే
రనుపమలీల నిప్పడుచుపాయము లిట్టివి యెట్లు నెర్చెనో !
ఉ. పక్కలు వంచు వంచి మునిపండ్లును బండ్లును రాచు రాచి ఱొ
మ్మక్కిలఁ జేయుఁ జేపి తన యల్లనఁ గాళులసందుసందిలో
చక్కికి నొక్కు నొక్కి యిడుచంబడ గుమ్మడిమూట గట్టి వీఁ
పెక్కి దువాళిచేసించలి యిక్కడ నక్కడఁ బెట్టు వేకువన్.
సీ. హా కుమారస్వామియౌపవాహ్యములార !
హా మంత్రదేవతాస్వాములార!
హా కాలవిజ్ఞానపాకకోవిదులార!
హా భూతభుక్తికుంభార్హులార !
హా యహల్యాజారయతనహేతువులార !
హా బలాత్కారకామాంధులార !
హా నిరంకుశమహాహంకారనిధులార!
హా కామవిజయకాహళములార!
హా ఖగేంద్రంబులార కయ్యమున నీల్గి
పోవుచున్నారె ? దేవతాభువనమునకు
మీరు రంభాతిలోత్తమా మేనకాది
భోగకార్యార్థమై కోడిపుంజులార!
- ↑ [శ్రీనాథుడు 'వల్లభాభ్యుదయము' అను గ్రంథమును రచించెనని కొందఱందురు. కాని యాగ్రంథము లభింపసందున దాని కర్తృత్వమును గూర్చి గాని, యందలి విషయమును గూర్చి గాని యేమియు నిశ్చయింవ సాధ్యము కాదు. ఇందు వినుకొండ వల్లభరాయని చరిత్ర వున్నదని చెప్పటకుఁ దగిన యాధారములు లేవు. శ్రీకాకుళమునందలి వల్లభ దేవుని మహాత్మ్యమును తెలుపు వల్లభాభ్యుదయమొకటి భట్లపెనుమర్తి కోదండకవి కృతము కలదు.]
- ↑ [ప్రత్యక్షరమున్-అని సరియైన పాఠము.]