ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మనుమంచి భట్టు

వికీసోర్స్ నుండి

మనుమంచి భట్టు


ఈ కవి హయలక్షణసారమను నైదాశ్వాసముల గ్రంథమును రచించి కుమార కంపభూపాలున కంకితము చేసెను. ఇతఁడా శ్వాసముల కధికారము లని పేరు పెట్టెను. ఈ గ్రంథమునందు గుఱ్ఱముల మంచి చెడుగులును, వాని రోగలక్షణములును, రోగచికిత్సలును ఆవర్తవిశేషములును, గతిస్వరవివరణములును చెప్పఁబడినవి. ఇవి యన్నియు శాలిహోత్రునిసంస్కృతహయలక్షణానుసారముగాఁ జెప్పఁబడినట్టు కవి యీ క్రింది పద్యమునఁ దెలిపి యున్నాఁడు.

       చ. అనఘుఁడు శాలిహోత్రుఁడు హయంబులకు న్మును చెప్పినట్టి యా
           యనుపమలక్షణంబులు పయఃపరిమాణము రోమజంబులున్
           దెనుఁగున తెల్లవారలకుఁ దేటపడన్ రచియింతు సత్కవుల్
           విని కొనియాడ దానగుణవిశ్రుత ! కంపయమేదినీశ్వరా !

ఈ గ్రంధము మూఁడధికారములును నాల్గవయధికారములోనిరువదియైదు పద్యములును గల తప్పులతడిక యొకటి ముద్రింపఁబడియున్నది. గ్రంధాది నుండి పంచామాశ్వాసమున 103 పద్యములవఱకును గల ప్రతి యొకటి చెన్నపురిలో దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునందున్నది. ఈ రెండు ప్రతులలోను గూడ గ్రంథావతారికలేదు. అందుచేతఁ గృతిపతి కాలమునుగాని కృతికర్తకాలమునుగాని నిర్ణయించుటకుగలఁ యాధారములు గ్రంధములో నంతగాఁ గానరావు,

       క. క్రీడావర్తతురంగము
          వేడుక నెక్కంగఁ గోరువెఱ్ఱికి నూఱున్
          మూడుట నిక్కమ యని ము
          న్నాడిరి హయశాస్త్రవేదు లౌబళకంపా !

ఇత్యాది పద్యములలోఁ గృతిపతి యౌబళునిపుత్రుఁ డయినట్టు చెప్పబడెను . కృతిపతియైన కంపనరపాలుఁడు సాళువవంశజుఁడే యయినను గొన్నిస్థలము

లలో 'చాళుక్యచూడామణీ!' అని చళుక్యవంశజుఁడయినట్టు సంబోధింపఁబడెను ఇతఁడు చళుక్య రాజుల కడ దండనాధుఁడయందున ఈకంపమహీపాలునకు సాళువవంశమువారికిఁ గల బిరుదము లన్నియు నున్నందునను చళుక్య వంశజులబిరుదము లంతగా లేనందునను కంపనృపాలుఁడు సాళువ వంశజుఁడే యని నిశ్చయింపవలసియున్నది [1] జైమినిభారతమునందు


    గీ. ఔర ! మీసరగండకటారిసాళ్వ !
       పంచఘంటానినాదాదిభయదబిరుద !
       కాహళారావసంపాతకంపితారి
      దీప్తిబలసిరి ! సాళువతిప్పశౌరి !

అని సాళవ తిప్పరాజును
 
   క. ధరణివరాహునరు బర్పరబాహునకు .....

   క. ...భీకరచౌహత్తిమల్ల బిరుదాంకునకున్.....

   క. మీసరగండనికి గటా ! రిసాళువముకు.....

అని సాళువ గుండ నరసింహారాజునకును, మీసరగండ కటారిసాళ్వ. ధరణీవరాహ బర్పరబాహ, చౌహ త్తిమల్ల మొదలైన బిరుదము లుపయోగింపబడినవి. ఈ క్రింది పద్యములలో నించుమించుగా నీ బిరుదములే కృతిపతి యైన కంపభూపతికిని ప్రయోగింపఁబడినవి.

   గీ. ఇట్లు చెప్పినపాటిని నెల్లసుళ్ళు
      నిలిచెనేనియుఁ దమతిముఫలము నిచ్చు
      నట్లు గాకుండు నం దల్ప మధికమైనఁ
      జండభుజబల ! మీసరగండ ! కంప ! ఆ.2

      క. ఘోటంబుల సుళ్ళుండిన
         ఘోటంబులు పతుల మీఱి కులము నడంచున్
         పాటించుచుఁడి నడచుచు
         పాటించిరి శాస్త్రవిదులు బర్బరబాహా !

      గీ. అశ్వరత్నంబుమును పళ్ళు హయమునడిమి
         పళ్ళు తురగముకడపటి పళ్ళకడను
         క్రమముతో నవమాదివర్షములమూట
         హరిణ విలసిల్లు రాయచౌహత్త మల్ల

      క. నిరుపమ తేజోవిభవా
         కరమునఁ గడు నొప్పుమీఱు గంధర్వము దాఁ
         బరికింప నింద్రసత్త్వము
         ధరణీరమణీయబాహ! ధరణివరాహా !

ప్రభువుల బిరుదములను దండనాధులైన పాలకులును వహించుట యాచారమయినందుకు సాళువ గుండరాజాదుల బిరుదములను వారిదండనాథులైన తుళువనరసింహరాజాదులు వహించినట్టుగా వర్ణింపఁబడిన వరాహపురాణము లోని యీ క్రింది వాక్యములే సాక్ష్యమిచ్చుచున్నవి.

     వ. చాళుక్యనారాయణుండును ... ... ... బర్బరబాహుండును నగు నరస
        వసుధాధీశ్వరుండు

     గీ. రాయచౌహాత్తిమల్ల ధరావరాహా!
        మోహనమురారి! బర్బరబాహు సాళ్వ!
        నారసింహ ప్రతాపసన్నహనుఁ డగుచు
        విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు

ఈ కడపటి వాక్యములోని బిరుదములు సాళ్వనరసింహరాజువే యన్నననవచ్చును. ఇందలి మోహనమురారిబిరుదము మూడవ యధికారమునందు కంపభూపాలుని విషయమునను వాడఁబడినది.

    
       కాన నండదోషంబులు గానవచ్చు
       హరుల నేలంగవలదు మోహనమురారి.

ఈ కంపనృపతి దండనాయకుఁడైనట్లీక్రింది పద్యమువలన దెలిసికోవచ్చును.

    క. కకుదంబున నలికంబునఁ
       ద్రికమున సంధులను సుళ్ళు తిరమై యున్నన్
       బ్రకటితదోషం బగు నిది
       నకులాదులమతము దండనాయకతిలకా !

ఈ కంపభూపాలుడు దక్షిణమధురాపుర విజయయాత్రకయి 1369 వ సంవత్సర ప్రాంతమునఁ బంపఁబడినట్లు మధురవిజయములోఁ జెప్పఁబడిన కంపభూపాలుడు కాఁడు. ఆ కంపభూపాలుని తండ్రి వీరబుక్కరాయలు; ఈ కంపభూపాలని తండ్రి యౌబళరాయఁడు ఆ కాలమునందు సాళువ వంశమున నౌబళభూపాలుఁ డొకఁ డుండెను. సాళ్వ మంగ నృపాలున కగ్రభ్రాతయు, గుండభూపాలునకు ద్వితీయపుత్రుఁడును వీరయౌబళుఁ డయినట్లు జైమినిభారతములోని యీ క్రింది పద్యము తెలుపుచున్నది.

    మ. జననం బందిరి గుండభూవిభునకున్ సుధాకబంధారిగౌ
        తనయున్ శ్రీనిధి వీరయౌబళుఁడు నుద్యత్కీర్తి మాదయ్యయున్
        ఘన తేజోనిధి గుండబమ్మఁడును సంగ్రామస్థలీపార్థస
        జ్జనమందారులు సాళ్వమంగనృపుఁడున్ సావిత్రిమంగాంకుఁడున్

కృతిపతియైన కంపపృధ్వీపతి యీ యౌబళుని కొడుకయినను, కావచ్చును; లేదా, మనుమనికొడు కయినను కావచ్చును. కొడుకేయైన పక్షమునఁ గృతిపతియుఁ గవియు, పదునాల్గవ శతాబ్దాంతమున నుందురు; కాకున్నయెడల పదునైదవ శతాబ్దాంతమున నుందురు. ఇది యూహమే కాని నిశ్చయమని వలనుపడదు. మనుమంచిభట్టారకు నందఱును పూర్వకవులలోనివాఁ డను,

చున్నారు. [2]ఈకవి బ్రాహ్మణుఁడు; భైరవాచార్యుని పుత్రుఁడు. ఈతని యాశ్వాసాంతగద్య మిట్లున్నది
     
              “ఇది సకలసుకవిజనసంస్తూయమానకవితాచాతురీధురీణ నిఖిలభాషా ప్రవీణ
               భైరవాచార్యపుత్ర పరమపవిత్ర మనుమంచిభట్ట ప్రణీతంబైన హయలక్షణ
               విలాసంబునందు"

ఈతని కవిత్వము చక్కఁగానే యున్నది. కాని యేహేతువు చేతనో లక్షణ విరుద్ధములయిన ప్రయోగము లనేకములు కానఁబడుచున్నవి. కవిత్వరీతిని దెలుపుటకయి హయలక్షణవిలాసములోని పద్యములఁ గొన్నింటి నిం దుదాహరించుచున్నాను.

     ఉ. దూరము పోవునప్పుడును దుర్గమశత్రునృపాల సైన్యముం
         బోరుల గెల్చునప్పుడును బొంకముగా మృగయావినోదవి
         ద్యారతిఁ దేలునప్పుడు నరాధిపకోటికి వాజులట్ల పెం
         పార జయాదికారణము లారసి చూడఁగఁ గల్గ నేర్చునే ? ఆ. 1

     చ. అరయఁగ సర్వలక్షణసమంచితమైన తురంగరత్న మే
         నరునిగృహాంబునం దొక దినంబుననుం దగురీతి నుండు నా
         పరమపవిత్ర గేహమునఁ బాయక నిల్చుర మా వధూటి శ్రీ
         ధరునియురస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్న చిత్తయై. ఆ.1.

     చ. తిరముగ రోచమానమును దేవమణిం దగఁ గూడి యున్నయ
         త్తురగము పూర్వభాగకృతదోషము లన్నియుఁ ద్రెంచు, నెంచఁగాఁ
         బరఁగినయట్టి మేఖలిక పశ్చిమభాగము దోషరాసులన్
         బొరిఁబొరిఁ ద్రుంచుమాడ్కి మఱి భూవరగర్వముఁ దక్క నన్నిటిన్

     ఉ. తిన్నని కుక్షిమూలములఁ దేరిన రంధ్రయుగంబు క్రిందటన్
         ప్రన్నని దీప్తితోడ నుపరంధ్రము లుండు తురంగజాతికిన్
         బన్నుగ గండపార్శ్వములఁ బైకొని వన్నెలు నిల్చుఁ జూడఁగా
         సన్నుత చాళుకీతిలక ! సాళువకంపనృపాలమన్మధా! - ఆ.4

     మ. హరిరత్నంబున కుత్తమాంగభుజమధ్యస్థానసంప్రాప్తమై
         కర మొప్పారును గ్రీవ గ్రీవకము పై గంరంబు పై-?
         సరికేశాళిశిరంబుసంధి వెనుకం జె న్నొందుఁ గేశాంతముల్
         సరసోదారకుమారకంపనృపతీ! చాళుక్యచూడామణీ! - ఆ.3.

     చ. కవ లగుచున్ హయంబులు తగన్ జనియించినవానియిల్లు దా
         నవనీతలంబుమీఁదఁ జటులానలరోచులఁ జూచి చూచి వా
         చవి గొనుఁ గానఁ దక్కిన విచారము చేయక దేవతామహీ
         దివిజుల కిచ్చు టొప్పునని ధీరులు చెప్పిరి శాస్త్రపద్దతిన్. ఆ.4

     శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేదండనాగోల్లస
         ద్వీణావారిదమంజునాదములకు న్వియ్యంబులై యొప్పు ని
         క్వాణంబు ల్గల వాజి యిచ్చు బతికిం గళ్యాణముల్ కంపన
         క్షోణీపాలక ! సుప్రతాప ! శుభముల్ స్తోతైక పాత్రంబుగన్ ఆ.4

     చ. తులసియు వావిలాకు కరుధూపము శుంఠియుఁ దెల్లనైనయా
         వలు వస యుప్పు మాగడియు వారకయొక్కటియున్ సమంబుగాఁ
         దుల నిడి యావుపంచితముతో మృదు వారఁగ వత్తిఁ జేసి వా
         జులగుదమూత్రరంధ్రములఁ జొన్పిన శూలలు మాను భూవరా!

  1. [సాళ్వ వంశీయులు చాళుక్యులనుట సరిపడకున్నది. ఈ విషయమై పరిశోధన జరుగవలెను.]
  2. [కర్నూలుజిల్లా పెద్దచింతకుంట శాసనమును బట్టియు, తిరుపతియందున్న కంపభూపతి శాసనమును బట్టియు మనుమంచిభట్టు కాలము క్రీ. శ. 1442-1459 ప్రాంతమని నిశ్చితమగుచున్నదని శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు తెల్పుచున్నారు (చూ. భారతి - విరోధి - ఆషాఢము]