Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కేతనమంత్రి

వికీసోర్స్ నుండి

కేతనమంత్రి


ఇతడు బాణభట్టకృతమైన కాదంబరి కావ్యమును తెనుఁగున రచియించెను. కేతనకృత మయిన కాదంబరిలోని దని రంగరాడ్చందమునందీ పద్యముదాహరింపఁబడి యున్నది

    ఆ.వే. జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెరఁగిన
          నా విభుండు వాని లేవనెత్తి
          కౌగిలించి వానిఁ గనుఁగొని కేయూర
          కాభిధాన మొసఁగెఁ గడుముదమున.

ఈకేతనకవి దశకుమార చరిత్రమును రచియించిన కేతనకవి కాఁ డనియు, భాస్కరుని కేతన యనియు, కొట్టరువు కేతన యనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారును శ్రీ మానేపల్లి రామకృష్ణ కవిగారును వ్రాయుచున్నారు. ఈ పుస్తకము నాకు లభింపలేదు. ఇదియే నిజమయిన పక్షమున కేతనకవి తిక్కన సోమయాజికిఁ బెదతండ్రి యయి యుండవలెను. అప్పు డతని కాలము 1240-50 ప్రాంతములగును. కేతన ప్రెగడ విరచితమైన కాదంబరిలోని దని యుదాహరణ గ్రంథములో నీ క్రిందిపద్య ముదాహరింపబడినది.[1]
 

      సీ. దీనిలోపలఁ గొన్నిదినము లుండిన నుష్ణ
                          కరుఁడై న నట శీతకరుఁడు గాఁడె
          దీని పెంపెఱిఁగినఁ దా నంబురాశిలోఁ
                          గాదని జలశాయి కావు రాఁడె
          దీని తియ్యని నీరు దివిజులు త్రాగి చూ
                          చినఁ దమయమృతంబు చేఁదు గాదె
          దీనితోయము తలపై నల్కినంతనె
                          పాపాత్ములును మోక్షపరులు గారె

              యనుచుఁ గొలని యిట్టి యతిశీతలత్వంబుఁ
              బరపుఁ బెంపుఁ దీపుఁ బావనతయుఁ
              గడుముదంబుఁ బెంపఁగా వాజి బడివాగె
              త్రాట దిగిచికొనుచుఁ దరియఁ జొచ్చె ?[2]

ఈ యుదాహృత గ్రంధములోనే కేతన ప్రెగడ కువలయాశ్వచరిత్రము లోని దని యీ పద్య ముదాహరిం పబడినది

          ఉ. కోటతనర్చుఁ జూడ్కుల కగోచర మయ్యెను దేరిమీఁద బ
              ల్మాటున నేగుచోటఁ దగులం బడమిన్ రవిమండలంబు నీ
              పాటిదయన్ తలంపునకుఁ బట్టగు చున్నది. గాక దీనికిం
              బాటి యనంగ గుజ్జనఁగఁ బట్టవె యయ్యుదయాస్తశైలముల్. [3]

  1. పెదపాటి జగ్గన కూర్చిన 'ప్రబంధరత్నాకరము'న నిది యుదాహృతము.
  2. [మూలఘటిక కేతన వ్రాసిన 'దశకుమార చరిత్రము' నుబట్టి, యీ కేతన తిక్కన తాతయగు మంత్రి భాస్కరుని పెద్దకుమారుఁడనియు, తిక్కనకుఁ బెదతండ్రి యనియుఁ దెలియుచున్నది. భాస్కరుని కేతన యే కొట్టరువు కేతన. ఇతని మనుమడు వేఱొక కేతన కలఁడు, అతఁడు కవిగా ప్రసిద్ధిలేదు]
  3. [కువలయాశ్వ చరిత్రమును రచించిన కేతన తిక్కన పెదతండ్రికంటెను, దశకుమార చరిత్ర కర్త కంటెను భిన్నుఁడు. ఇతఁడు నండురి కేతనయో, వేఱొకడో యయి యుండవచ్చునని 'ఆంధ్రకవి తరంగిణి' కర్త యభిప్రాయము. చూ.రెండవ సంపుటము పుట 134)]

    [కాదంబరీ కావ్యరచన క్రీ.శ. 1260 ప్రాంతమునకు ముందుగానే జరిగియుండునని 'తెనుఁగు కవుల చరిత్ర’ లో గలదు. (పుట 286)]