ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/బమ్మెర పోతరాజు
బమ్మెర పోతరాజు
ఈ కవి శాలివాహనశకము (1300వ సంవత్సరమునం దనఁగా హూణ శకము 1308 వ సంవత్సరమునందు జనన మొందినట్టు తెలుఁగు భాగవతమును ముద్రించినవారు పీఠికయందు వ్రాసియున్నారు. కానీ యది సరియైన సంవత్సరమని తోచదు. పోతన మఱి యిరువది సంవత్సరముల తరువాత నఁనగా హూణశకము 1400 వ సంవత్సర ప్రాంతమున జనన మొంది యుండును. ఈతని నివాసస్థలము నైజాము రాజ్యములోని ఓరుగల్లు. ఇదియే భాగవతమునం దేకశిలానగర మని చెప్పఁబడి యున్నది. ప్రథమమున భాగవతమును ముద్రింపించినవారు బమ్మెర పోతనార్యుని వాస స్థలము కడపమండలములోని యొంటిమెట్ట యనియు, అదియే భాగవతము నందుఁ బేర్కొనఁబడిన యేకశిలానగర మనియు, ఆతని చరిత్రమును దెలుపు పురాతన గ్రంథ మేదియో తమకు లభించినదనియు, పీఠికలో వ్రాసి యుండుటచేత గతానుగతికు లయి జనులా కథనే మొన్న మొన్నటివఱకు నమ్ముచు వచ్చిరి. ఇటీవల విమర్శకులు కొందఱు సత్యమును శోధించి పోతనామాత్యుని వాసస్థాన మోరుగల్లు గాని యొంటిమెట్టి కాదని సహేతుకముగా లోకమునకు వెల్లడించుటచేత మహాజను లిప్పుడు కన్నులు తెఱచి తమ తొంటి ప్రమాదమును దెలిసికొని పూర్వాభిప్రాయమును మార్చుకొనుచున్నారు. అయినను స్థలాభిమానముచేతఁ గొంద ఱిప్పటికిని పోతన జనన భూమి కడపమండలమే యని వాదించువారందందుఁ గనఁబడు చున్నారు. అందుచేత నట్టివారి భ్రాంతినివారణార్థముగా బమ్మెర పోతననివాస మోరుగల్లని స్థాపించుటకుఁ దగిన హేతువులను గొన్నిఁటి నిందుఁ జూపుచున్నాను. ఇంటి పేరునుబట్టి పోతనపితృపితామహాదుల వాసస్థానము బమ్మెర యను గ్రామమయినట్టు సులభముగా తెలిసికోవచ్చును. ఆతఁ డా గ్రామములోనే పుట్టినవాడయినను, ఓరుగల్లు రాజనివాస మయిన మహాపట్టణ మయి యుండుటచేత భాగవతరచన కాలమున కక్కడఁ జేరి యుండును. ఈ బమ్మెర గ్రామ మోరుగంటిని రమారమి మూఁడామడల దూరములో నల్లగొండమండలమునందున్నది. బమ్మెర యను పేరుగల యూ రేదియు నొంటిమెట్టచేరువను గానీ తుదకుఁ గడపమండలములో నెక్కడనై నను గాని లేదు. అందుచేత భాగవతమునందుఁ జెప్పఁబడిన యేకశిలానగరము నైజాము రాజ్యములోని యోరుగల్లే కాని కడపమండలములోని యొంటిమెట్ట కాదని యూహింపవచ్చును. భాగవతముద్రితపుస్తకములలో షష్ణస్కంధ మేర్చూరి సింగనయు, నేకాదక ద్వాదశస్కంధములు వెలిగందలనారయయుఁ దెలిఁ గించినట్లున్నది. సింగనగృహనామ మయిన యేర్చూరు గోలకొండ దేశము లోని నల్లగొండమండలములోను, నారయగృహనామ మయిన వెలిగందల కరీంనగరమండలములోను, రెండును బమ్మెరకు సమీపమున నిప్పటి నిజామురాజ్యములోనే యున్నవి. భాగవతము నాంధ్రీకరించిన పోతనా నాత్యునియొక్కయు, శిధిల మయిన షష్టస్కంధమును పూరించిన సింగన యొక్కయు, ఏకాదశ, ద్వాదశ స్కంధములను దెనిఁగించిన పోతన శిష్యుఁడైన నారయ యొక్కయు ఊళ్ళు మూఁడును పూర్వ మోరుగల్లు రాజధానిగా కర్ణాటరాజ్యములోనివే యగుట చేత పోతన చెప్పిన యేకశిలానగర మోరుగల్లే యని యించుమించుగా నిశ్చయింపవచ్చును. ఓరుగల్లప్పటి కర్ణాటరాజ్యములోనిది. కర్ణాట భాషలో "ఓరు” అనగా “ఒక్క" “కల్లు” ఆఁగా “రాయి" అని యర్థము ఒక రాయని యర్ద మిచ్చెడి ఓరుగల్లుకు సమానార్థక మయిన సంస్కృతపద మేకశిల. అందుచేత నేకశిలానగరమనఁగా నోరుగల్లుపుర మనుట స్పష్టము. ఒంటిమెట్ట యెప్పుడును నేకశిలా నగరము గాఁజాలదు. మెట్ట యనుదానికి శైల మర్థమగును గాన శిల యర్ధము కాదు. ఒంటిమెట్టయన్నచో నేక శైలగ్రామము కావచ్చును గాని యేకశిలానగరము గాదు. అది గాక యొంటిమెట్ట యొక చిన్న (గామమే గాని యేప్పుడును నోరుగంటివలె నగరమయినది కాదు. ఒంటిమెట్టకుఁ బూర్వకాలమునందుఁ గాని మఱి యేకాలమునందు గాని వ్యవహారమునందును గ్రంధములయందును గూడ నేకశిలానగరమన్న పేరు లేదు. ఇఁక నోరుగంటి కన్ననో భాగవతరచనముకుఁ బూర్వమునందు సహితము “రాజన్నేకశిలానగరాధీశ అని విద్యానాధుఁడు ప్రతాపరుద్రీయము నందు చెప్పినట్లుగా నేకశిలానగర వ్యవహార ముండినది. దీనిని బట్టి యేక శిలా నగరము సుప్రసిద్ధమయిన యోరుగల్లే గాని యప్రసిద్ధనుయిన యొంటిమెట్ట గాదని నిస్సందేహముగా సిద్దాంత మగుచున్నది. శబ్దార్ధము నటుండనిచ్చి యిఁక వాస్తవార్ధమునకు వత్తము.
బమ్మెర పోతనార్యుఁడు తాను భాగవతంబు రచింపఁపూనుటకుఁ గారణము. నా గ్రంథములోనే యీ క్రింది వాక్యములలోఁ దెలిపియున్నాఁడు.
"మదీయపూర్వజన్మసహస్రసంచితతపఃఫలంబున శ్రీమన్నారాయణకథా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాక గనుంగొని సజ్జనాను మతంబున నభ్రంకష శుభ్రసముత్తుంగ భంగ యగుగంగకుంజని క్రుంకులిడి వెడలి మహనీయ మంజులపులినప్రదేశంబున మహేశ్వరధ్యానంబు నేయుచుఁ గించిదున్మీలితలోచనుడనయి యున్నయెడ ........ మెఱుఁగు చెంగట నున్న మేఘంబుకై వడి ... ... విపులభద్రమూర్తియైన రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా కన్నుఁగవకు నేదురఁ గానఁబడియె. ఏను నారాజశేఖరుం దేఱిచూచి భాషింపయత్నంబు సేయు మెడ నతండు నే రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెలుగుచేయుము. నీకు భవబంధములు తెగునని యానతిచ్చి తిరోహితుండయిన సమున్మీలితనయనుండనయి వెఱఁగుపడి చిత్తంబున...... ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణపారిజాతపాదపసమాశ్ర యంబున హరికరుణా విశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్నిదినంబుల కేకశిలా నగరంబునకుం జనుదెంచి యందు గురు వృద్దుబుధబంధునానుజ్ఞాతుండనై.. ” ఇతడు మొదటినుండియు శైవుఁ డయి యుండియు నొక చంద్ర గ్రహణసమయమునందు గంగాస్నానమునకుఁ బోయినప్పు డక్కడ నాకస్మికముగా స్వప్నమున రామభద్రుండు ప్రత్యక్ష మయి తన్నామాంకితముగా శ్రీ మహాభాగవతమును దెలుఁగుచేయు మన యానతిచ్చుటచేత భాగవతరచనము నకుఁ బూనెను. ఇతఁడు చంద్ర గ్రహణ స్నానమునకుఁ బోయినగంగ యీతని నివాసగ్రామమునకు సమీపముగా నుండి యుండవలెను. సాధారణముగా భాగీరథిని గంగ యందురు; గౌతమిని సహితము గంగయనుట గలదు. ఇట్లు రెండు గంగలకును భేదము తెలియుటకయి యు తరమున నున్న గంగను (భాగీరథిని) ఉత్తరగంగ యనియు, దక్షిణమున నున్న గంగను (గోదావరి యనఁబడెడు గౌతమిని) దక్షిణగంగ యనియు వ్యవహరింతురు. పోతన్న స్నానార్ధము పోయినది యిదే గంగ యయి యుండును? కొన్ని దినముల ప్రయాణములో నుండక బహదూరమున నా కాలమునఁ గొన్ని మాసముల ప్రయాణములో నుండినదగుటచేత నుత్తరగంగ యయి యుండదు. అది తప్పక కొన్ని దినముల ప్రయాణములో నున్న దక్షిణగంగ యనఁబడెడు గోదావరి యగుటకు సందేహము లేదు. ఒంటిమెట్టకు సమీపమున గోదావరీనదీ లేకుండుటయు గోదావరినది యోరుగంటికి సమీపముననే యుండుటయు విచారింపఁగా, బమ్మెరపోతనామాత్యుని వాసస్థానమైన యేకశిలానగర మోరుగల్లే కాని యొంటిమెట్టకా దని నిశ్చయ మగుచున్నది. గోదావరికి గంగ యన్న పేరు లోకవ్యవహారమునందు మాత్రమేకాక పూర్వకాలమునుండియు గ్రంధముల యందుసహిత ముండిన క్రింది నిదర్శనములవలన దెలిసికొనవచ్చును.
1. "దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన అని భారతాదిపర్వమున నన్నయ భట్టారకుఁ డర్జునుని తీర్థయాత్రాసంబంధమున గోదావరిని దక్షిణగంగ యని చెప్పెను.
2. సీ. ఉండు నే వీట మార్కండేయ ముని నాథ
సజ్జలింగ మనంగ శాసనుండు
ప్రవహించు నే వీటి పశ్చిమ ప్రాకార
మొరసి గంగమ్మ సాగరముకొమ్మ
యావిర్భవించినాఁ డే వీటికోటలో
బలభేది మదనగోపాలమూ ర్తి
పాలించు నే వీటి ప్రాగుదక్కోణంబు
నుమప్రోది శ్రీమల్ల గూరిశక్తి
ప్రబలధారాసురత్రాణభద్రజాతి
కరిఘటా సైన్యదుస్సాధకనకలోహ
గోపురద్వాఃకవాట ప్రదీపిత మతి
సాంద్రవిభవంబు రాజమహేంద్రపురము.
అని శ్రీనాధుఁడు పోతనామాత్యుని కాలమునందే కాశీ ఖండములో రాజ మహేంద్రపురమును వర్ణించుచుఁ బయి పద్యములో గోదావరిని గంగ యని చెప్పియున్నాఁడు
3, సీ. గంభీరపరిఖనాగస్త్రీల కశ్రాంత
కేళీవిహారదీర్ఘిక యనంగ
నుత్తాలసాలమన్యుల కుబ్బి దివిఁబ్రాఁకఁ
జేసిన దీర్ఘనిశ్రేణి యనఁగ
చతురచాతుర్వర్ణ్యసంఘ మర్థులపాలి.
రాజితకల్పకారామ మనఁగఁ
భ్రాంతసుస్థిత యైన భవజూటవాహిని
ముక్తిభక్తిప్రదస్ఫూర్తి యనఁగ
నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించే నే రాజు తనదు పేర
నట్టి రాజమహేంద్రుని యనుఁగుమనుమఁ
డెసఁగుఁ జాళుక్యవిశ్వనరేశ్వరుండు.
అని నన్నయకుఁ దరువాతను శ్రీనాధునికిఁ బూర్వమునందును నుండిన విన్నకోట పెద్దన్న కావ్యాలంకారచూడమణిలో రాజమహేంద్రవరవర్ణనమున గోదావరిని “భవజూటవాహిని (గంగ)" యని చెప్పి యున్నాఁడు.
ఆ ప్రాంతములయందు గంగ యని వ్యవహరించబడెడు గోదావరి యేక శిలానగరమునకు నాలుగయిదు దినముల ప్రయాణములో పదియామడల దూరమున నున్నది. ఆ పుణ్యనదీ ప్రవాహాము నందు స్నానముచేయువా
పోతనామాత్యుఁడు తన కవిత్వారంభదశలో గోలకొండ సీమలోని రాచకొండ దుర్గాధీశ్వరుడైన (రేచర్ల) రావు సింగభూపాలునీ ప్రేరణముచేత రచియించిన భోగినీదండకము కూడ నీ మహాకవి యోరుగల్లు ప్రాంతములవాఁడని దృఢీకరించుచున్నది. ఇతఁడీ దండకమును 1430-వ సంవత్సరప్రాంతమున నిరువదియైదేండ్లలోపలి వయస్సులోఁ జేసియున్నట్టు కనఁబడుచున్నది. పోతన 1405-వ సంవత్సర ప్రాంతమున జనన మొంది 1460-1470 సంవత్సరముల వఱకును జీవించి యుండును. ఈతని కాలమును నిర్ణయిం చుటకు వేంకటగిరిసంస్థానమునకు మూలపురుషుఁడైన భేతాళనాయనికి బదవతరమువాఁడయి 1423 మొదలుకొని 1443 వ సంవత్సరము వఱకును కర్ణాటరాజ్యపరిపాలనము చేసిన ప్రౌఢదేవరాయల కాలములో నుండిన సింగభూపాలునికథ మాత్రమే కాక పోతనామాత్యుని మునిమనుమలగు కేసనమల్లనకవులచేత రచియింపఁబడిన “దాక్షాయణీవివాహము' కూడ కొంత తోడుపడుచున్నది. ఈ "దాక్షాయణీవివాహము" గురుజాల మల్లన సోమయాజి కంకితము చేయఁబడినది. కవులు కృతిపతియైన మల్లనసోమయాజి తమ్ముఁ బిలిపించినట్లీ క్రింది పద్యమునఁ జెప్పుకొని యున్నారు.
సీ. శ్రీరామలింగాంఘ్రి సేవావరప్రౌఢిఁ
గవితాచమత్కృతుల్గాంచువారి
నప్పలమ్మయును వీరంబయుఁ ను బ్రౌఢస
రస్వతిని గన్నప్రజ్ఞపారి
కౌండిన్యగోత్ర విఖ్యాతి బమ్మెరభవ్య
వంశాఢ్యులై సిరి వఱలువారి
నివటూరి ముక్తి నాగేశసద్గురుభక్తి
నాదిమశైవులైనట్టివారి
కేసకవిమల్లకవినామకీర్తి పరుల
మమ్ముఁ బిలిపించి మన్నించి మదిఁ దలంచి
ఘనత నుచితాసనంబుల నునిచి వేడ్క
వినయనయవాక్యములచేత నెనయఁ బలికె
ఈ పద్యమును బట్టి పోతనయు నాతనిసంతతివారును పరమశైవులని స్పష్ట మగుచున్నది.గోలకొండదేశములో వాడుకలో నున్న యీ క్రింది పాట యీ యంశమును మఱంత స్థిరపఱచుచున్నది.
"పాలకుర్తినిలయా సోమలింగా పాదములకు శరణు ||"
వురవుగ బమ్మెరపోతరాజుకు మీరు కోరిస వరములు
కృపచేసినా రఁట “పాలకుర్తినిలయా" & .
దాక్షాయణీపరిణయకృతిక ర్తలు తమ గ్రంథములోఁ గవిస్తుతి నిట్లు చేసి యున్నారు.
చ. నెరి గుఱిగల్గు నన్నయమనీషినిఁ దిక్కన శంభుదాసునిన్
బరువడి మత్పితామహుని బమ్మెరపోతన భాస్కరాహ్వయున్
వరకవిసార్వభౌముని నవారితభక్తి నుతింతు మెప్పుడున్
గురుకరుణాఢ్యు లంధ్రకవికుంజరులం దగ భూతి శోభిలన్
పయి పద్యములోఁ గవులు బమ్మెర పోతనామాత్యునిఁ దమ పితామహుడని చెప్పుకొన్నను నాశ్వాసాంతగద్యములనుబట్టి యతఁడు ప్రపితామహుఁడయినట్టు తెలియవచ్చుచున్నది.
"ఇది శ్రీమద్భవానీశంకరపర్వతాలగురుప్రసాదాసాదితసారస్వత బమ్మెరకుల పవిత్ర కౌండిన్యమునిగోత్ర పోతయామాత్యపౌత్ర మల్లయామాత్య పుత్ర సంస్కృతాంధ్ర భాషాచమత్కారకవితాధురీణతాబుధవిధేయ ప్రౌఢసరస్వతీకవినామధేయువరతనూభవ కేసనక విమల్లనకవి ప్రణీతంబై న దాక్షాయణీ వివాహం బను మహా ప్రబంధంబునందు "
పయి గద్యమునుబట్టి బమ్మెర పోతనామాత్యుని కుమారుఁడు మల్లయ; మల్లయామాత్యుని కుమారుఁడు ప్రౌఢసరస్వతి; ప్రౌఢసరస్వతికుమారులు కేసనమల్లనలు ఇంత మాత్రము తెలియుటచేత పోతనకాలమును నిర్ణయించుట కాధారము కానరాలేదు, దాక్షాయణీ వివాహకృతిపతియైన మల్లనసోమ
సీ. ధాతాశ్వయుజకృష్ణదశమీందువారంబు
వఱకు దాక్షాయణీపరిణయంబు
తత్కృతినాథుఁడై తనరిన గురుజాల
చినమల్లసోమయాజికిఁ దనూజుఁ
డగు లింగఘనసుతుఁడు డైనట్టి యజ్ఞస
త్ప్రభునకుఁ దనయుఁడౌ పార్వతీశ్వ
రునకుఁ దిమ్మమకుఁ బుత్రు డయి షోడశమహా
దానముల్సప్తసంతానములును
జేసి వంశవర్ధనుఁ డయి సిరుల వెలయు
పేరమంత్రిశ్వరునకుఁ బోడూరి పెద్ద
రాముఁ డెనుబది సంవత్సరములనాఁటి
ప్రతి విమర్శించి వ్రాసిచ్చెఁ బక్షమునకు.
పోడూరి పెదరామహస్త లిఖితమైన యీ పురాతనతాళపత్రపుస్తకమును సంపాదించి యీ నడుమను నాకు బాలాంత్రపు వేంకటరావుగా రిచ్చిరి. దీనినిబట్టి చూడఁగా దాక్షాయణీవివాహకృతిపతియైన మల్లనసోమయాజి కుమారుఁడు లింగన్న; లింగన్న కుమారుఁడు యజ్ఞన్న; యజ్ఞన్న కుమారుడు పార్వతీశ్వరుఁడు, పార్వతీశ్వరునికుమారుఁడు పేరమంత్రి. ఈ పేరమంత్రి 1756 వ సంవత్సరమునందుండెను. పోతనమునిమనుమనిలములో నుండిన మల్లనసోమయాజికిని, పేరమంత్రికిని నడుమ నాలుగు పురుషాంతరములును, మల్లనసోమయాజికిని పోతనకును నడుమ మూఁడు పురుషాంతరములును మొత్తము గత 1756 -వ సంవత్సరమునం దుండిన గురజాల పేర మంత్రికిని బమ్మెరపోతనామాత్యునికీని నడుమ నేడు పురుషాంతరములు గడిచినందున నొక్కొక్క తరమునకు నలుబదేసి సంవత్సరముల చొప్పునఁ జూచినచో నేడు నలుబదు లిన్నూటయేనుబది సంవత్సరములు 1759 నుండి తీసివేయఁగా 1476 సంవత్సరపాంతమువకును బమ్మెర పోతనార్యుఁడు జీవించి యుండవలెను. ఇందులోనుండి పది పదునేను సంవత్సరములు త్రోసివేసినను పోతన 1460 -వ సంవత్సరము వఱకైనను జీవించి యుండవలెను. ఆతఁడఱుదిసంవత్సరములు జీవించె ననుకొన్నచోఁ బోతనజన్మ దినము 1400 సంవత్సర ప్రాంతమునందయి యుండును. ప్రౌఢసరస్వతి యను బిరుదందిన కేసనకవి. (పోతనమనుమడు) యొక్క దౌహిత్రుడు అజ్జరపు పేరయలింగము తెలుఁగున నొడయనంబివిలాస మను కావ్యమును జేసెను. ఈతనితండ్రి కేసన; తల్లి లక్కమ్మ; కొడుకు మల్లన. ఇతఁడు కౌండిన్యగోత్రుఁడు; నియోగి బ్రాహ్మణుఁడు, ఇతనికి శ్రీనాధకవి బావమరిది యనిచెప్పుదురు. పోతన శ్రీ నాధునిమఱఁది యైనను, కాకపోయినను వీరిరువురును గొంతవఱకేకకాలమువారయి యుండిరనుటకు సందేహము లేదు.[1] పోతన శ్రీనాధునికంటె నిరువది ముప్పదియేండ్లు చిన్నవాఁడు. వేంకటగిరి ప్రభువులకుఁ బూర్వుఁడయి యా కాలమునందు రాచకొండదుర్గాధీశ్వరుఁడయి యుండిన సర్వజ్ఞసింగమనాయఁడు భాగవతమును దన కంకితము చేయమని కోరగా బమ్మెర పోతరాజు నిరాకరించె నన్న కధకూడఁ బయి కాలమును స్థాపించుచున్నది. కాబట్టి పోతరాజు హూణశకము 1435-వ సంవత్సరము వఱకును జీవించి యుండును. అంతకాలము జీవించియున్న పక్షమున మరణకాలమునం దతనికి డెబ్బదియైదు సంవత్సరముల ప్రాయమయి యుండును. ఏ హేతువు చేతనో బమ్మెర పోతరాజవిరచిత మైన యాంధ్రభా గవతము విశేషభాగము నశింపఁగా వెలిగందల నారయ, గంగన మొదలైన వారాయా భాగములను పూరించినారు. కాని గ్రంధమట్లు నశించుటకు కారణ మిదియే యని నిశ్చయించుటకుఁ దగిన ప్రబలాధారములేవియుఁ గాన రావు. బమ్మెర పోతరాజు వ్యాసవిరచితభాగవతపురాణము నాంధ్రీకరించె నన్న వార్తను సర్వజ్ఞసింగమనాయఁడు విని యా కవిని తన యాస్థానమునకు రప్పించి గ్రంథమును కృతి యిమ్మని యడిగెననియు, అతఁడు తన గ్రంథమును నరాంకితము చేయనని రాజు ప్రార్థన నంగీకరింపకపోఁగా రాజు రోషముతో నాతని గ్రంధమును భూమిలో గోయి తీయించి పాతిపెట్టించె ననియు, శ్రీరామమూర్తి యా రాజుభార్యయొక్క స్వప్నములో వచ్చి భర్తను వేఁడుకొని భాగవతపురాణము లోకములో వ్యాపింపజేఁయ నియ్యకొల్పుమని యామెతోఁ జెప్పి పోయెననియు, ఆమె తన స్వప్న వృత్తాంత మును భర్తకు విన్నవించి పాతి పెట్టిన పుస్తకమును పయికి తీయింపఁగా నందలి తాళపత్రములు పురుగులు తిని బహుుభాగములు శిథిలమయి పోయి యుండెననియు, పిమ్మట గంగనాదికవులు చెడిపోయిన భాగములనెల్లఁబూరించి రనియు, కొందఱు చెప్పుచున్నారు. లక్ష్మణసారసంగ్రహమునందుఁ గూచిమంచి తిమ్మకవి చెప్పిన యీ క్రిందీ పద్య మీ కధ కుపబలముగా నున్నది.
సీ. ఘనుఁడు పోతనమంత్రి మును భాగవతము ర
చించి చిక్రికి సమర్పించునేడల
సర్వజ్ఞసింగయక్ష్మాపరుం డది తన
కిమ్మనీ వేఁడఁగా నీయకున్న
నలిగి యా పుస్తకం బవనిఁ బాతించినఁ
జీవికి యం దొకకొంత శిథిల మయ్యెఁ
గ్రమ్మర నది వెలిగందల నారప
రాజును మఱి బొప్పరాజు గంగ
రాజు మొదలగు కవివరుల్ తేజ మెసఁగఁ
జెప్పి రా గ్రంధములయందే తప్పు లొదవేఁ
గాని పోతన కవీంద్రుని కవీతయందు
లక్షణం బెందుఁ దప్పునా ? దక్షహరణ!
వేంకటగిరిరాజు అయిన వెలుగోటివారికి మూలపురుషుఁడైన బేతాళరెడ్డి కేడవతరమువాఁడై న సింగమనాయనికే కాని పదవతరముఁవాడైన యీ సింగమనాయనికి సర్వజ్ఞబిరుదము లే దని కొంద ఱనుచున్నారు. పోతరాజు భాగవతమును రచించి దానినెవ్వరికిని జూషక పదిలముగా దేవతార్చన పెట్టెలోఁ బెట్టిఁ పూజించుచుండినట్లును, అవసానకాలమునం దఁతడు తన కుమారునిఁ బిలిచీ తా నార్జించిన యా ధనమును కాపాడుమని చెప్పి కాల ధర్మము నొందినట్లును, తదనంతరమున కుమారుఁడు దానీనీ విప్పి శోధింపఁగా బాణ మను పురుగుచే గ్రంధపత్రములు తినబఁడి యున్నందున వెలి గందల సారయాదుల సాహాయ్యమున గ్రంథమును పూరింపించినట్లును, మఱికొందఱు చెప్పుచున్నారు. ఈ కడపటి వృత్తాంతమే కొంత మార్పుతో భాగవత పీఠికయందును వ్రాయఁబడి యున్నది. అందుఁ బోతనామాత్యుని పుత్రుండు కూడ నీపై తృకధనమును ముట్టక కపొడి తనయవసాన కాలము నందు వెలిగందల నారయకు జెప్పఁగా నతఁ డనంతర మా గ్రంథమును విప్పి చదివి భ్రష్టములైన భాగములను పూరించెనని చెప్పఁబడి యున్నది. ప్రౌఢకవి మల్లనయే పోతనామాత్యునిపుత్రుఁ డయిన పక్షమున మహాకవి యైన యతఁడు తండ్రి రచియించిన పుస్తకమును విప్పియైనఁ జూడకుండె ననుట యంత విశ్వాసార్హముగా నుండదు. పోతరాజునకు మల్లన యను కుమారుఁడు గలఁడు ఆ మల్లనయే ప్రౌఢకవి మల్లన యనుటనుగూర్చి యింకను విచారింపవలసి యున్నది. ఏది యెట్లయినను పోతరాజకృతభాగవతము కొంతవఱకు ప్రభ్రష్టమగుటయు దాని నీ గంగనాదులు పూరించుటయు మాత్రము వాస్తవము.
పోతన సంస్కృతాంధ్రములను తాను గురుముఖమునఁ జదువక స్వయంకృషి వలననే యనర్గళమై యుభయభాషాపాండిత్యమును సంపాదించిన వాఁడు, ఈ యొక్క యంశమే యీ కవియొక్క ప్రతిభావిశేషమును వేయినోళ్ళఁ జాటుచున్నది. గురుముఖమున విద్య యభ్యసింపకపోవుట చేతనే యితఁడు గద్యమునందు * సహజపాండిత్య ” యని వేసికొన్నాడు. సహజ పాండిత్యుఁ డగుటచేత నీతని కవిత్వమునందక్కడక్కడఁ గొన్ని వ్యాకరణాదిదోషములు కానవచ్చుచున్నవి. కాని కవిత్వముమాత్రము నిరుపమానమయినదయి సర్వజన శ్లాఘపాత్రముగా నున్నది. పోతన చిన్నతనములో గోవులను మేపుకోనుటకై గ్రామ సమీపమున నున్న యడవికిఁ బోయి నప్పుడు చిదానందుఁడను యోగి యాతనికి రామమంత్రము నుపదేశించి నట్లును, దానినిబట్టియే సమ స్తవిద్యలును నిరవద్యకవిత్వమును వచ్చినట్లును కొందఱు చెప్పుచున్నారు. అయినను " శ్రీపరమేశ్వరకరుణా కలిత కవితా విచిత్ర ” యను భాగవతగద్యమునుబట్టియు వీరభద్రవిజయమునుబట్టియు విచారించి చూడఁగా శివప్రసాదమువలన నీతనికిఁ కవిత్వ మలవడుట కవి యభిప్రాయ మయినట్టు స్పష్టమగుచున్నది. శ్రీరామమూర్తి భాగవతమును తెనిఁగింపవలసినదని చెప్పినట్టు స్వప్నము రాఁగా నితఁడు శ్రీరామాంకితముగా భాగవతపురాణమును తెనిఁగించెను.
ఈ కవి ధనికుఁడుగాక రాజుల నాశ్రయింపక కృషికర్మచేఁ గాలము గడుపుచుండెను. ఇతనిఁ మహత్త్వాదులనుగుఱించి ఇటీవలివారనేక కథలను గల్పించినారు. వానిలోఁ గొన్నిటిని నిందుఁ జెప్పుచున్నాను. పోతనామాత్యుని బావయైన శ్రీనాధుఁడు భాగవతము తనయేలికయైన కర్ణాట ప్రభున కంకితము చేయింపవలెనని పల్ల కిమీఁద నోరుగంటికి వచ్చి. ఊరిబయలి పొలములో పోతన యరక కట్టించి కుమారునిచేత దున్నించుచుండఁగాఁ దన మహత్త్వమును వారికి జూపనెెంచి పల్లకి మోచుచున్న బోయీల నొక ప్రక్కబొంగు వదలివేయుఁ డని యాజ్ఞాపించెనట ! మోచువారు లేకయే పల్లకి నడుచుచుండుట చూచి పోతన పుత్రుఁడయిన మల్లన తండ్రితోఁ జెప్పఁగా నతఁడు నాగలికాాడికిఁ గట్టిక యొక దున్నపోతును విప్పుమని యాజ్ఞాపించెనఁట ! ఒకప్రక్క దున్నపోతు లేకయే యరక సాగుచుండుట చూచి శ్రీనాధుఁడు రెండవదండిని కూడ విడువుఁడని బోయీల కాజ్ఞాపించి పల్లకిని నడిపింపుచుండఁగా పోతన రెండవ ప్రక్కనున్న దున్నపోతునుకూడ విప్పించి నాగలి సాగునట్లు చేసెనఁట ! అటుపిమ్మట శ్రీనాథుఁడు పోతనను సమీపించి ' హాలికులు సుఖముగా నున్నారా? యని పరిహాసపూర్వకముగా కుశల ప్రశ్నము చేయఁగా నతఁడు
ఉ. బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి ? గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై ?
అని ప్రత్యుత్తరము చెప్పెనఁట ! అందుకు శ్రీ నాధుఁడు మనసులో లజ్జ పడియు పైకి తోఁపనీయక ముఖమున లేని వికాసము తెచ్చుకొని బావ మఱఁదుల మేలమున కాడిన మాటకుఁ గోపగింపఁ జెల్లునా ? యని సమాధానపఱిచెనఁట : తరువాత మల్లన ముందుగా నింటికిఁ బోయి భోజన పదార్దముల నిమిత్తమై ప్రయత్నము చేసి లభ్యములు కాక విచారముతో నూరి వెంటఁ దిరుగుచుండఁగా విష్ణుమూర్తి పోతనరూపమున వచ్చి పంచభక్ష్య పరమాన్నములతో విందు చేయుటకు తగిన సమస్త పదార్ధముల నిచ్చి పోయెనఁట ! భోజనము లయిన పిమ్మట శ్రీనాథుఁడు పోతనయొక్క దారిద్య్ర విషయమును ప్రస్తావించి భాగవతము [2]నొక రోజునకో ధనికునకో యంకితము చేయున ట్లొడబఱచుటకయి ప్రయత్నించు చున్నప్పుడు సరస్వతి యెదుట నిలిచి కన్నీరు పెట్టుకొనుచున్నట్లాతనికిఁ బొడకట్టఁగా పోతన
ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చె దో
కైటభదైత్యమర్దనునిగాదిలికోడల ! యో మదంబ యో
హాటకగర్భురాణి ! నిను నాఁకటికిం గొనిపోయి యల్లక
ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్దిగ నమ్ము భారతీ !
అని సరస్వతి నూఱార్చెనఁట. ఈ పద్యములోఁ గర్ణాటకిరాటకీచకులని చెవ్పుట శ్రీనాధుఁడు తన గ్రంధములను రాజులకును, కోమటులకును, దుష్టులకును, ధనమున కాశించి యమ్ముకొనె నని యాతని నాక్షేపించుట యని కొందఱభిప్రాయపడుచున్నారు. ఆ కాలమునం దాంధ్రరాజులను కర్ణాటరాజు లని చెప్పుచు వచ్చిరి. అందుచేతనే శ్రీనాథుఁడు భీమఖండమునందు
గీ. ప్రౌఢ పరికింప సంస్కృతభాష యండ్రు
పలుకు నుడికారమున నాంధ్రభాష యందు
రెవ్వ రేమన్న నంద్రు నా కేలకొఱఁత ?
నాకవిత్వంబుటు నిజము కర్ణాటభాష.
ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధి తంబుగన్.
పోతరాజు తృతీయస్కంధమును తెనిఁగించునప్పుడు విష్ణుమూర్తి శ్వేత వరాహరూపమున నాతనివాకిటఁ బరుండుచు వచ్చెననియు, భాగవతము తన కంకితము చేయనన్నాఁడన్న కోపముచేత కవిని బాధించి కట్టి తెచ్చుటకై పంపిన కర్జటాధీశ్వరుని భటులను పారద్రోలె ననియు, మఱియొక కధ చెప్పుదురు. పోతరా జష్టమ స్కంధములోని గజేంద్రమోక్షకధను వ్రాయుచు "అలవైకుంఠపురంబులో నగరిలో నామూల" యనువఱ కొక పద్యమును వ్రాసి పై భాగము తోఁచక చింతిల్లుచు వెలుపలికిఁ బోయినప్పుడు విష్ణువు వచ్చి " సౌధంబు దాపల • యని వ్రాసి పోయె ననియు, ఇంకొక కధ చెప్పుదురు. భాగవతమును రచియించునప్పుడు కవి చెప్పిన సంగతి యెల్లను ప్రత్యక్షముగా జరుగుచు వచ్చెననియు, రుక్మిణీకల్యాణమును రచిం చుచు “దేవకీసుతుకోర్కి తీగలు వీడంగ" నను పద్యములో ‘బాలకమరె' యను భాగమును జెప్పునప్పు డాతని కుమార్తె కుంపటిలోఁబడి కమరిపోయె ననియు, “పద్మనయనువలనఁ బ్రమదంబు నిండారె" నను భాగమును జెప్పఁగానే మరల లేచి యధాప్రకారముగా నా చిన్నది సుఖముగా నుండె ననియు వేఱొకకథ చెప్పుదురు. చెప్పఁబూనినచో నిటువంటి కధల కంత ముండదు. అయినను మఱియొక చిన్న కథను మాత్రము వ్రాసి వీని నింతటితో పరిసమాప్తి నొందించెదను. పోతన గజేంద్రునికధఁ జెప్పుచు గజేంద్రుఁడు ప్రాణసంశయదశలో నున్నప్పుడు శ్రీమహావిష్ణువు
మ. సిరికిం జెప్పఁడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం .
తరధమ్మిల్లు చక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
క. న ణ లను రెండక్షరముల
కును వడిఁ బ్రాసంబుఁ బెట్టుకొనవచ్చుఁ గృతిన్,
విను ర ఱ ల కట్ల పెట్టం
జను ల ళ ల కభేద మరయ సర్వజ్ఞనిధీ !
గీ. చఛజఝలకును మొదలియూష్మములు మూడు
సరసవడి నిల్పఁగా నేకజాతియైన
బండిఱాకు రేఫము వడి కుండరాదె?
ప్రాసవర్ణంబులకుఁ గూర్పరాదు గాని.
అని శారదాదర్పణమునందుఁ జెప్పఁబడి యున్నది. కాని యిటీవలివారందఱును రేఫఱకారమైత్రి నన్నయభట్టమతము కాదని భ్రమించి రేఫఱకార మైత్రిని దూషించి యా మత మవలంబించి నవారిని కుకవులని దూషించి యున్నారు. అట్లు దూషించినవారిలో నొకఁ డయిన కాకుసూర్యప్పకవి రేఫఱకారముల ప్రాముఖ్యమును స్థాపింప నెంచి భాగవతమును బూర్వలాక్షణీకులు లాక్షణిక గ్రంధమునుగా నంగీకరింపకపోయినందుకు రేఫఱకారములు ప్రాసలయందు మైత్రి చెందుట యొక్కటియే కారణ మని యీ క్రింది పద్యముచేతఁ జెప్పియున్నాఁడు
ఉ. బమ్మెరపోతరాజకృత భాగవతంబు సలక్షణంబు కా
కిమ్మహి నేమిటం గొదవ ? యెంతయు నారసిచూడఁగాను రే
ఫమ్ములు ఱాలునుం గలిసి ప్రాసము లైన కతంబునం గదా
యిమ్ముల నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్.
క. కేరుచు నొయ్యన డగ్గఱ
జేరుచు నురుముష్టిహతికిఁ జిక్కక వేగం
దాఱు చహంకృతం గ్రమ్మఱ
దూఱు చధోక్షజుఁడు మల్లుఁ ద్రుంచె ననంగన్.
మ. పురిటింటం బసిబిడ్డచందమున వాపోవంగ నాఁ డాత్మలో
మురువొప్ప న్విషదుగ్ధయుక్తకుచయై ముద్దాడు రాకాసి గు
ర్తెఱి గిష్టంబుగఁ బాలు ద్రావు మిషచే నిర్వైన కాలంబునం
ధరణిం గూల్చిన నందపుత్రువలనం దార్కాణ ధర్మస్థితుల్.
ఇట్లొక్కయప్పకవి మాత్రమే గాక రేఫఱకారములకు యతిప్రాసమైత్రి కూర్చిన యితర మహాకవుల పద్యములను గూడ సర్వలక్షణసారసంగ్రహమునందుఁ గూచిమంచి తిమ్మకవి చూపినవానిలోఁ గొన్నిటి నిందుదాహరించుచున్నాను.
1. అల్లసాని పెద్దన మనుచరిత్రమునందు—
శా. శ్రేణుల్గట్టి నభోంతరాళమునఁ బాఱెం బక్షు లుష్ణాంశుపా
షాణ వ్రాతము కోష్ణమయ్యె మృగతృష్ణావార్డు లిం కెం జపా
శోణం బయ్యెఁ బతంగబింబము దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్.
2. కృష్ణరాయలు, ఆముక్తమాల్యదయందు -
మ. ఇలకు న్వ్రేఁగగుఁ బండు తీరవనపుండ్రేక్షుచ్చటల్ తీపు ల
గ్గలమై వ్రాల నురుస్వనంబు లెసఁగంగాఁ ద్రిప్పు రాట్నంపుగుం
డ్రలునాఁ దేనెకొలంకులం బొరలి పాఱన్విచ్చుపంకేరుహం
బుల నాడెం దొలుసంజఁ దేటివలయంబు ల్తారఝంకారముల్.
3. పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నమునందు-
క. గ్రక్కునఁ జని వాలుదునో
ఱెక్కలుఁ గట్టుకొని దివిజరిపుమేడలపై
నక్కొమ్మఁ జూచు టెపు డెపు
డొక్కో ? యనునంత తమక మున్నది మదిలోన్.
4. అయ్యలరాజు రామభద్రుఁడు రామాభ్యుదయమునందు-
ఉ. నైరిభవారిభద్విరదశాస ఖడ్గఖరాధిరూఢులై
తారలు బూరగొమ్ములను దప్పెటలుం బటహంబులుం బదు
ల్నూఱులు వేలు మ్రోయఁ గవను ల్వడి హత్తి యుత్తర
ద్వారకవంకఁ దాఱ కిరువంకలఁ బౌఁజులు దీర్చి రయ్యెడన్.
5. పిల్లలమఱ్ఱి పినవీరన్న- జైమినిభారతమునందు -
ఉ. తూరుపు తెల్లవాఱుటయుఁ దోడనె మంగళపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కొని కాల్యసమంచితక్రియల్
దీఱిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.
6. సంకుసాల నృసింహకవి కవికర్ణరసాయనమందు -
గీ. వనధి సర్వంకషంబయ్యు వలయుపనికి
ఱేపులనెకాని దొరసాని రీతిదనరి
విశ్వరూపకుఁడయ్యు శ్రీ విభుఁడు కూర్మ
రూపమున సేవ్యుఁడగు నారురుక్షులకును.
గీ. అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు
ప్రాసముల విశ్రమముల రేఫములతోడఁ
గలసి యుండును సుకవిపుంగవుల కృతుల
జగదవనసూత్ర ! గీరితనూజాకళత్ర ! [4]
అని తిమ్మకవి సార్వభౌముఁడు లక్షణము వ్రాసి యీ క్రింది పద్యములను లక్ష్యములనుగాఁ జూపియున్నాడు.
ఉ. నూఱ్వురు నొక్కచందము మనోగతి సైరణ చేసి నన్ను నా
సర్వకులంబు నుత్తమయశంబున నుంచితి రమ్మలార మీ
కుర్విని సాటీయే యబల లొండులు దేవతలం బటుక్షమా
నిర్వహణం బొనర్చుటకు నేరరు మర్త్యులఁ జెప్పనేటికిన్
- ఎఱ్ఱాప్రెగడ రామాయణము
క. కాఱ్చిచ్చు గవిసి మృగముల
నేర్చుకరణి నేఁడు భీష్ముఁ డేచినకడిమిం
బేర్చి మనభీముఁ బొదవె శ
రార్చుల నవ్వీరుఁ గన్ను లారఁగఁ గంటే - భీష్మ పర్వము
క. చెలగి పటుసింహనాదం
బులు ఱంకెలుగాఁగ వారు పొలిచిరి వృషభం
బుల క్రియ నొండొరులకు మా
ఱ్మలయుచుఁ దాకుచు నుదాత్తరభసోజ్జ్వలులై - ద్రోణపర్వము.
మనవారు కొంద ఱిప్పుడు సంయోగమునందు ఱకారము రేఫముగా మాఱునని చెప్పుచున్నారు మఱికొందరు భారతమునందుగూడ,
క. తెంపును బెంపును గదుర ని
లింపులు వెఱఁ గంది చూడ రిపు సైన్యములుం
గంపింపఁ దమబలంబులు
ఱంపిలి బిట్టార్వ సింధురాజుం దాఁకెన్.
ఇత్యాది స్థలములలో గురులఘురేఫముల మైత్రి యంగీకరింపఁబడినదని చెప్పుచున్నారు. ఒకవేళ నిప్పటివా రెవ్వరయిన ఱంపిలుశబ్దమునకు ద్విరూపములు గలవని చెప్ప వత్తు రేమో ! ఈ ద్వైరూప్యమువలని ప్రయోజన మేమో నాకుఁ దెలియరాకున్నది. కవిత్రయమువా రొక్కపదములోని యొక అక్షరమునే యొకప్పుడు రేఫముగాను, మఱియొకప్పుడు శకటరేఫము గాను ప్రయోగించుటచేతనే వారి కా భేదమంత సమ్మతము కాదని స్పష్ట పడుచుండ లేదా ? అప్పకవి లోనైనవా ద్విరూపములను నడుమఁ దెచ్చి పెట్టినారు. మఱియొక హల్లుతోఁ జేరి యున్నప్పుడు బండిఱా రేఫముతో యతి ప్రాసలయందు మైత్రి చెందుచుండఁగా, రేఫము సవర్ణములు గాని ఋకారముతోను, లకారముతోను మహాకవి ప్రయోగములందు యతిప్రాసల మైత్రిని బొందుచుండఁగా సవర్ణ మయిన బండిఱాతో నేల మైత్రిచెందరాదో తెలియరాదు. అనావశ్యకము లయిన నిర్బంధములను దీసివేసి భాషను సుసాధ్యముచేయుట పరమప్రయోజనకర మగుటచేతను, రేఫ ఱకార భేదము వలన భాషకొక ప్రయోజనము కలుగకుండుటచేతను, పూర్వకవు లనేకులు వాని మైత్రి కంగీకరించి యుండుటచేతను, మన పండితులు దుర్గ్రాహ్యమయిన యీ భేదమును పాటింపక భాషచిక్కు కొంత వదల్ప సమ్మతింతురని నమ్ముచున్నాను. పదములు రేఫభేదమును గలిగియున్నచో నర్థభేదము కూడఁ గలిగియుండు నందురేమో, మన లక్షణవేత్తలు చేసిన నిర్ణయమును బట్టియే యెన్ని పదములు సమానార్థములు గలవె యుభయరేఫములుగా నుండలేదు ? అర్థభేదమును నిర్ణయించుటకు ప్రకరణసాహచర్యాదులు సాధనములు గాని వ్రాయబడిన రూపము కాదు.
రేఫ ఱకారముల ప్రాసమైత్రిని బట్టి పూర్వలాక్షణికులు భాగవతమును నిరాకరింపలేదనియు, వారు దాని నుదహరింపకపోవుట క్రితరదోషములే
కడపటితెగవారిలో కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమునందు
సీ. అఖిల వేదాంతవిద్యారహస్యవిదుండు
సహజపాండిత్యవిశారదుండు
మత్తక్షితీశాధమస్తోత్రవిముఖుండు
శంభుపదాబ్జపూజారతుండు
పటుతరకవితావిభాసిత ప్రముఖుండు
సకలాంధ్రలక్షణచక్రవర్తి
రఘుకులేశనిదేశరచితమహాభాగ
వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు
బుధజనహితుండు బమ్మెర పోతసుకవి
యెన్న రేఫఱకారంబు లెఱుఁగఁ డనుచు
నజ్ఞు లొకకొంద ఱాడుదు, రామహాత్ము
కవిత కెందును లోపంబు గలుగ దభవ !
అని వ్రాసి, “పోతరాజు చెప్పినవి ప్రధమస్కంధమును, ద్వితీయస్కంధము కొంతయు షష్ఠస్కంధము సప్తమాష్టమ నవమస్కంధములును, దశమ పూర్వభాగంబు కొంతయు నున్న" దని చెప్పి యీ భాగములలో రేఫఱ కారముల మైత్రీ లేనందున కుదాహరణము లిచ్చి యున్నాఁడు. అంతేకాక వెలిగందల నారయాదుల కవిత్వమునందు రేఫ ఱకారమైత్రి యున్నందుకు ద్వితీయస్కంధము నుండియు, తృతీయస్కంధమునుండియు చతుర్థ స్కంధమునుండియు, పంచమస్కంధమునుండియు, దశమోత్తరభాగమునుండియు పద్యముల నుదహరించి యున్నాడు. ముద్రింపఁబడిన భాగవతమునందలి షష్ణస్కంధకృత్యాదినిబట్టియు, నాశ్వాసాంత గద్యములను బట్టియుఁ జూడఁగా షష్ఠ స్కంథము సింగయకవిచేఁ చెప్పఁబడినట్టు స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది. ద్వితీయతృతీయచతుర్ధస్కంథములు పోతనార్యవిరచితము లయినట్లే కనఁబడుచున్నవి. అయినను మన మే భాగము పోతనకవి విరచితమో యే భాగము తచ్చిష్యవిరచితమో యేయే పద్యములు శిష్యజన పూరితములో యేవి యెవరి దోషములో దృఢముగా నిర్ధారణము చేయఁజాలము. పూర్వలాక్షణికు లందఱు నంగీకరింపని పోతనకవిత్వమునందుఁ బొత్తిగా దోషములే లేవని సాధింపఁ జూచుటకంటె భాగవతమునకు తరువాత రచించిన[5] వీరభద్రవిజయమునందుఁ గూడఁ గొన్ని దోషములు కనుపట్టుచుండుటచేత పోతనకృతభాగవతమునందును గొన్ని దోషములున్నవని యొప్పుకొనుటయే న్యాయము. షోడశ కళాపరిపూర్ణ మయిన చంద్రబింబమునందుఁ గొంచెము కళంకమున్నట్టుగా సర్వజనసమాదరణీయమయిన యీతని కవితాసుధా సముద్రమునందుఁ గొన్ని నెఱసు లున్న ను, దాని కొక కొఱత గలుగఁ బోదు.
పోతనకవిత్వము భక్తిరస ప్రధాన ప్రధానమయినది; పదలాలిత్యము గలదయి యమకాది శబ్దాలంకార భూయిష్టమయి శ్రావ్యముగా నుండును. ఇతఁడు భారతమును రచించిన కవులవలెఁ గాక తన భాగవతమును మూల గ్రంధమునకంటెఁ బెంచి వ్రాసెను. మూలమైన సంస్కృతభాగవత గ్రంథసంఖ్య యిరువది వేలుగా నున్నను, ఇతఁడు రచించిన తెలుఁగుభాగవతము ముప్పదివేల గ్రంథము కలదిగా నున్నది.
భగవద్గుణవర్ణనాదులు వచ్చినప్పుడు తన భక్తి తేటపడునట్లుగా స్వకపోలకల్పితవర్ణనలు గూర్చియు, భాగవతములో లేని విష్ణువురాణాదులలోని కథలను చేర్చియు, కొన్ని స్థలములలో గ్రంధమును బెంచినసు తక్కిన భాగమంతయు విషయభేదము లేక వ్యాసవిరచిత మూలగ్రంధమునకు టీకవలె నుండును, భాగవతములో లేని సత్యభామయుద్ధాదులు విష్ణుపురాణమునుండి గ్రహింపఁబడినవి. తెలుఁగు పురాణములలో భాగవతము మిక్కిలి జనసమ్మతమైప పుస్తకము. అందలి రుక్మిణీకల్యాణము, గజేంద్రమోక్షము మొదలైన కధలను సమస్త జనులును జదువుదురు. ఈ కవి భాగవతము రచించిన తరువాత వీరభద్ర విజయమను మఱియొక గ్రంథమును రచించెను. భాగవత చతుర్థస్కంధము నందలి దక్షయజ్ఞకధలో “అనయంబు లుప్త క్రియాకలాపుఁడు మానహీనుఁడు మర్యాదలేనివాఁడు మత్తప్రచారుఁడున్మ త్త ప్రియుఁడు' అనియు, “వసుధ నెవ్వారు ధూర్జటి వ్రతులువారు వారికనుకూలు రగుదు రెవ్వారు వార లట్టి సచ్చాస్త్రపరిపంధులైనవారు నవనిఁ బాషండులయ్యెద" రనియు శివదూషణము విశేషముగాఁ జేయఁబడి యుండుటచే దత్పాపపరిహారార్థమయి వీరభద్రవిజయమును జేసినట్లా పుస్తకములోని యీ క్రింది పద్య మునందుఁ జెప్పఁబడి యున్నది.
ఉ. “భాగవతప్రబంధ మతిభాసురత న్రచియించి దక్షకృ
ద్యాగకథాప్రసంగమున నల్పవచస్కుఁడనైతిఁ దన్నిమి
త్తాగమవక్త్రదోషపరిహారత కై యజనైకశైవశా
స్త్రాగమవీరభద్రవిజయంబు రచించెద వేడ్కతోడుతన్.”
['భాగవత ప్రబంధ' మను నీ పద్యము కొన్ని తాళ ప్రతులలో మాత్రమే కలదు; విలేఖకు లెవరో యీ పద్యమును రచించి యందుఁ జేర్చియుందురు కావున నీ పద్యమును విడిచివేసి, పోతనామాత్యుండే వీరభద్రవిజయకర్తయనియు, భాగవతమునకు ముందు దీనిని రచించెననియు నిశ్చయింపవలసి యున్నది' (ఆంధ్రకవి తరంగిణి ఆఱవ సంపుటము. పుటలు 192 193 ) ]
వీరభద్రవిజయముంగూర్చి యందే యిట్లు చెప్పబడియున్నది.
“ఇప్పుడు ముద్రితమైయున్న వీరభద్ర విజయమందలి నాల్గవ యాశ్వాసము పోతనామాత్య విరచితము కాదనియు, నెవరో రచించిన భాగము నిందెవ్వరో చేర్చిరనియు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు భారతి పత్రికలో (పుష్పాంజలి - రక్తాక్షి - ఆషాఢము) నీ క్రింది విధముగా వ్రాసి యున్నారు “నాల్గవ యాశ్వాసములోని పద్యములు కొంచెము నీరసములుగా నున్నవి. ఇది యేమని యాలోచించుచుండ వీరభద్రవిజయము తాటియాకుల ప్రతి యొకటి లభించె. దానిఁ బరికించి చూడ నాల్గవ యాశ్వాసము ముద్రితపాఠముకంటె సర్వదాభిన్నమయి శివపార్వతీకైలాసవిహారవర్ణనమును కుమార జననమును, దారకాసురసంహారమును దెలుపు కథాభాగము విస్తరించునదిగా నున్నది. నూతనముగా లభించిన యీభాగమునను పూర్వాశ్వాసములలో వలెనే మహర్షులకు వాయుదేవుఁడీ కధ చెప్పినట్లున్నది. ఆశ్వాసాం తమునఁ గొన్ని పత్రములు లేనందున నీ భాగము పోతనకృతమగునా ? కాదా ? యనువంశము స్పష్టముగాఁ జెప్పుటకు వీలులేకపోయినను. గవిత్వ ధోరణి ననుసరించియుఁ గధానుస్యూతత్వమును జూచియు నిదిపై మూఁడా శ్వాసములకు సంబంధించి యేకకవికృతమని తోచుచున్నది. ముద్రితమగుభాగము పరకవిపూరితమగుటచేఁ గాఁబోలు నుత్పలమాలతోఁ బ్రారంభింప బడియె.... ... ... "
శ్రీకవిగారి యొద్దనున్న తాళపత్ర ప్రతిని నేను జూచుట తటస్థింపలేదు ముద్రిత ప్రతిలోని నాల్గవ యాశ్వాసమునకు బదులుగా నీ తాళపత్ర ప్రతియందున్న గ్రంధము నాల్గవ యాశ్వాసముగా నుండఁదగుననియు, ముద్రిత ప్రతియందలి నాల్గవ యాశ్వాస మైదవయాశ్వాసము గాఁదగుననియు నిశ్చ యింపవలసి యున్నది. అట్లు కాదేని గ్రంథమునకు వీరభద్రవిజయమను పేరు సార్ధకముగాకపోఁగాఁ గుమారసంభవమని పేరు పెట్టవలసియుండును. ముద్రిత ప్రతియందలి నాల్గవ యాశ్వాసమును దీసివై చినచోఁ దక్కిన గ్రంధములో వీరభద్ర ప్రశంసయే యుండదు ముద్రితప్రతి నాల్గవ యాశ్వాసములోని పద్యములు నీరసముగా నున్నవని శ్రీకవిగారనుచున్నారు. కానీ నా కట్లు తోఁచుటలేదు. భాగవతములోని కవిత్వమునుబట్టి చూచినప్పు డిది కొంత నీరసముగాఁ గనుపట్టినను, వీరభద్రవిజయమందలి తక్కిన భాగములతో పోల్చి చూచినప్పుడిది నీరసముగాఁ గాన్పింపదు.”]
[కవితరంగిణి సం. 6, పుటలు. 193, 194]
1. బమ్మెరపోతరాజు - భాగవతము.
ఉ. త్రిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గపారముల్
దప్పకుమన్న నేఁడు మన దైత్యవరేణ్యునిమ్రోల మేము మున్
జెప్పినరీతిఁగాని మఱిచెప్పకుమన్న విరోధి శాస్త్రముల్
విప్పకుమన్న దుష్టమగు విష్ణుచరిత్ర కథార్థజాలముల్ - సప్తమ స్కంధము.
ఉ. పుణ్యుఁడు రామచంద్రుఁ డటుపోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమశరణ్యము నుద్ధతబర్హిబర్హ లా
వణ్యము గౌతమీవిమలవాః కణపర్యటన ప్రభూతసా
ద్గుణ్యము నుల్లసత్తరునికుంజవరేణ్యము నగ్రగణ్యమున్.
నవమస్కంధము.
వీరభద్ర విజయము
శా. ఏరా దక్ష ! యదక్షమానస ! వృధా యీ దూషణం బేలరా ?
యోరీ ! పాపము లెల్లఁ బో విడువురా యుగ్రాక్షుఁ జేపట్టురా
వైరం గొప్పదురా శివుం దలఁపురా వర్ణింపురా రాజితోం
కారాత్ముం డగు నీలకంరుఁ దెగడంగా రాదురా దుర్మతీ ! ఆ. 1
శా. వీరంభోనిధి నేఁడు మీ యలుకకు న్వీరెంతవారయ్య స
త్కారుణ్యంబునఁ గాతుగాక యని యా కష్టాత్ములం బోరిలోఁ
గారింపం గబళింప నీ ప్రమథుఁ డొక్కండైనఁ జాలండె దు
శ్చారు ల్దివ్యులు వీరి నెన్నక మదిన్ సైరించి రక్షింపవే. ఆ. 4.
2. గంగన - పంచమస్కంధము.
మ. పటుతాటంకరథాంగ యుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్
నటనం బందెడు కన్ను మీనములలో నాసన్నలీలామహో
తటభృంగావళితో ద్విజావళిలసత్కాంతి న్విడంబించు మా
రటకాసారముఁబోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్.
మ. ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకోరంబులన్
ఘనతం జేయకయుండెనేని యమలోకంబందు సూచీముఖం
బను నా దుర్గతిఁబట్టి త్రోచి యిది కాపై యున్న భూతం బటం
చును బాశంబులఁ బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. ఆ.2
3. ఏర్చూరిసింగన, షష్ఠస్కంధము.
మ. కనియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీకన్ రోషనిస్ట్యూతలం
ఘనపీనోష్ఠవికాసవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్
జనసంత్రాసకరోద్యతాయతసుపాశ శ్రేణికాహేతులన్
హననవ్యాప్తివిభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్.
ఉ. నెట్టనఁబాపకర్మమున నేరమి చేసితి రేమి చెప్ప మీ
పుట్టిననాఁటనుండియును బుద్దులు చెప్పి జగంబు లేలఁగాఁ
బట్టము కట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళావిధిజ్ఞు జే
పట్టక గుట్టు జాఱి సిరిపట్టుగఁ దొట్టిన పోట్ట క్రొవ్వునన్.
4. వెలిగందలనారయ, ఏకాదశ ద్వాదశ స్కంధములు
ఉ. మూకలు గూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచున్
బోకలఁ బోవుచున్ మునిసమూహము కొయ్యన సాగి మ్రొక్కుచున్
బ్రాకట మైన యీ సుదతిభారపుగర్భమునందుఁ బుత్రుడో
యేకతమందు బాలకియొ యేర్పడఁ జెప్పు డటన్న నుగ్రులై .
ఏకాదశస్కంధము
చ. మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్
సతతము సంభవించు; సహజం బిది చోరహుతాశసర్పసం
హతులను దప్పి నాఁకటను బంచత నొందెడునట్టి జీవుఁడున్
వెతలను బూర్వకర్మభవ వేదన బొందుచుఁ గుందు నెప్పుఁడున్.
ద్వాదశ స్కంధము.
బమ్మెరపోతరాజు నైజామురాజ్యములోని రాచకొండసంస్థానమునకు ప్రభువగు సర్వజ్ఞసింగమనాయని యాస్థానమునకుఁ బోయి యాతని యిష్టానుసారముగాఁ గవిత్వము చెప్పినందునకుఁ బోతరాజ ప్రణీతమయిన భోగినీ దండకము సాక్ష్యమిచ్చుచున్నది. ఈ దండకము సర్వజ్ఞ సింగమనాయఁడుంచుకొన్న వేశ్యవిషయమయి చెప్పఁబడినది. దాని కవిత్వ మించు మించుగా భాగవతమును బోలి యుండును. ఈ సర్వజ్ఞ సింగమనాయఁడు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరమువఱకును విజయనగరాధీశ్వరుఁడుగా నున్న ప్రౌఢ దేవరాయనితో సమకాలికుఁడు. భోగినీదండకములోని కొంతభాగము నిందు వ్రాయుచున్నాను--
కామానలజ్వాలల న్వేఁగి చింతాభరభ్రాంతయై యున్న యింతిం
బరీక్షించి తన్మాత మాయాపరాభూతజామాత మిథ్యానయోపేత
విజ్ఞాతనానావశీకారమంత్రౌషధవ్రాత లోకైకవిఖ్యాత వారాం
గనాధర్మశిక్షాధిసంఖ్యాత సమ్మోహితానేక రాజన్యసంఘాత
వాచాలతాబద్ధనానామహాభూత యేతెంచి కూతుఁన్ బరీక్షించి నీతి
న్విచారించి బుద్దిన్వివేకించి బాలన్ మిళత్కుంతలవ్రాతఫాలన్
గరాంభోజరాజత్కపోలన్ సమందోష్ణనిశ్వాసతాలన్ విపర్యస్త
సన్యాసచేలన్ మహాందోళన ప్రేంఖితస్వర్ణ డోలన్ మృగేంద్రావ
లగ్నన్ దయావృష్టిమగ్నన్ మనోజాగ్నిభగ్నన్ .. .. ... ...
విలోకించి లోనం బరాయత్తమై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై
విన్నయై ఖిన్నయై భిన్నమై యున్న భావంబుభావించి నెయ్యంబు గావించి
బాలాజితత్వంబు మేలా విచారింపవేలా వినోదింపవేలా వయోధర్మ
మున్ రిత్తగాఁ బుచ్చ నీవృత్తికి న్మెత్తురే వత్తురే కాముకుల్
డాయఁ గాయంబు విద్యున్నికాయోపమేయంబు ప్రాయంబు
ధారాధరచ్ఛాయ మెన్నే నుపాయంబులన్ విత్త మాయత్తముం
జేయుమా రిక్థవారంబు వేరంబు గా దీ విచారంబు వంశానుచారంబు
సంసారసారంబు లాభాధికారంబు........
దండకము తుద నీ క్రింది పద్యము చేర్పఁబడి యున్నది
ఉ. పండితకీర్తనీయుఁడగు బమ్మెర పోతన యాసుధాంశుమా
ర్తాండకులాచలాంబునిధితారకమై విలసిల్ల భోగినీ
దండకము న్రచించె బహదానవిహర్తకు రావు సింగభూ
మండలభర్తకు న్విమతమానవనాథమదాపహర్తకున్.
సీ. తనకుల బ్రాహ్మణు ............. నిత్యసత్యవచను,మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యుఁ జూచి"
అని భారతాదిపర్వములో నన్నయభట్టారకుఁడు తన్నుఁగూర్చి 'నన్నపార్యు'నవి ప్రథమపురుషములోఁ జెప్పుకొనలేదా ?
“ఎఱ్ఱనార్యుండు ........ ఆరణ్యపర్వశేషము పూరించెఁ గవీంద్ర కర్ణపుట పేయముగాన్” అని భారతారణ్యపర్వాంతమున నెఱ్ఱాప్రెగడ తన్ను గూర్చి “యెఱ్ఱనార్యుఁడు పూరించె" నని ప్రధమపురుషములోఁ జెప్పుకోలేదా ? ఎవ్వరెవ్వరినో చెప్పనేటికి ? బమ్మెరపోతన్ననే చూతము.
ఉ.ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి (శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జోకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్"
అని భాగవతప్రథమస్కంధములో బమ్మెర పోతనామాత్యుఁడే తన్నుఁ గూర్చి “బమ్మెరపోతరా' జని ప్రథమపురుషములోఁ జెప్పుకోనలేదా ? బమ్మెరపోతరా జని ప్రథమపురుషములోఁ నుడువుటచేత భాగవతము పోతన రచించినది గాక మఱియొకరు చెప్పినదని చెప్పి కంఠోక్తి గాఁ జెప్పఁబడిన దాని నంతను వీరభద్రరావుగారు కొట్టివేయుదురా ?
ఇఁకఁ బండితకీర్తనీయుఁ డన్నదానిలోఁ గలదన్న యాత్మశ్లాఘయు నిటువంటి దుర్బలమైన హేతువే. భోగినీదండకములోని రచన భాగవత రచనమువలెనే పండిత శ్లాఘాపాత్రముగా నుండలేదా ? ఉన్న దానిని జెప్పుకొనుట సత్యమే యగును గానీ యాత్మస్తుతి కానేరదు. ఒక వేళ నిందుఁ గొంచెము స్తుతి యున్నదనుకొన్నను పయి పద్యములో “నిత్యసత్యవచను మత్యమరాథిపాచార్యు" నని నన్నయభట్టు చేసికొన్న దానిలో నిది యెన్నవ పాలు ? "కవీంద్రకర్ణ పుట పేయముగా" నని యెఱ్ఱా ప్రెగడ చెప్పుకొన్న దానీలో నింతమాత్రపు స్తుతి లేదా ? పోతరాజు చెప్పిన పద్యములోనే
"శ్రీహరి కిచ్చి చెప్పె నీబమ్మెర పోత రా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్" ననుచోట నించుక యాత్మ స్తుతియు, “ఇమ్మనుజేశ్వరాథముల కిచ్చి" యనుచోట నించుక పరనిందయు, కనఁబడుచుండ లేదా ?
బమ్మెర పోతరాజువంటి భక్తాగ్రేసరుఁడొకరాజుంచుకొన్న వేశ్యనుగూర్చి దండకము చెప్పునా ? యన్నది మూడవ హేతువు ! ఈ దండకము చెప్పు నాటికి పోతన్న భక్తాగ్రేసరుఁడు కాఁడు. చంద్రోపరాగపర్వదినమున గంగా స్నానమునకుఁ బోయినప్పుడు రామభద్రుఁడు స్వప్నములో సాక్షాత్కరించి శ్రీమద్భాగవతమును దెనిఁగింప నియోగించినతరుపోత నీతనివిష్ణుభక్తి, యారంభ మైనది. తోడనే యితఁడు భాగవతరచన కుపక్రమించేను.
పోతన బాల్యమునుండియు విశేషవిత్తవంతుఁడు కాకపోవుటచేతను, సహజ పాండిత్యము గలవాఁ డగుటచేతను, నిరుపమానకవిత్వ నైపుణి గలవాఁడగుటచేతను, రాజాశ్రయమును సంపాదించి తన పాండిత్యమును ప్రకటించి విత్త మార్జించి పేరుపొందవలె నన్నయ పేక్షతో మహావిద్వాంసుఁడని పేరొంది సమీప రాజ్యపదస్థుఁడై యున్న సింగమ నాయని దర్శించుటకయి యౌవనారంభదశలోఁ బోయి యుండును. ఆ ప్రభువు తన ప్రియురాలి పైని దండకమును జెప్పి నీ కవన నైపుణిని జూపు మని నియమించినప్పుడు యువజనస్వాభావికదౌర్బల్యముచేతనో, దాక్షిణ్యముచేతనో పాండిత్య ప్రకట నాభిలాషచేతనో రాజు కోరిక చెల్లించి యుండును.
భోగినీ దండకము పోతనవిరచితము కాదని చెప్పుటయే మనస్సులో నా కిష్ట మయినను భాగవతకవిత్వముతో భోగినీదండకకవిత్వమును బోల్చి చూచినప్పుడు నా మనస్సట్లు వ్రాయుట కొప్పినది కాదు. మొట్టమొదటి భోగినీ దండకమును ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములోఁ జూచినప్పుడు నా కత్యాశ్చర్యము కలిగినది. ఆవఱకెవ్వరై నను పోతన్న భోగినీదండకమును జేసెనని చెప్పుచు వచ్చినప్పుడు నేను వారిని నమ్మక యబద్దమని నిరాకరించుచు వచ్చితిని. దండకమును బ్రత్యక్షముగా జూచినతరువాతను దాని కవిత్వము పోతనదే యని దృఢముగా తోఁచినతరువాతను పరు లాతని
పేరు పెట్టి కల్పించి యుందురని నమ్ముటకుఁ దగిన హేతువులు కనఁబడక పోవుటచేతను నేను సత్యమని నమ్మినదానిని నా కవులచరిత్రములోఁ బ్రకటింపవలసినవాఁడనైతిని. నా పుస్తకము ప్రకటింపఁబడఁగానే యప్పుడు ప్రభుత్వము చేయుచుండి యిప్పుడు కీర్తి శేషులైన వేంకటగిరిరాజుగారు సర్వజ్ఞ సింగమనాయఁడు వేశ్యాగమనదోషదూషితుఁడు గాని యకళంక చరిత్రుఁడయిన విద్వాంసుఁడనియు, నట్టి మహనీయునిపయిని వేశ్యా సంపర్కదోషమారోపించుట తమ కవమానకరమనియు యా విషయమునఁ దృప్తి పొందవలసినదని నేను బదులు వ్రాసితిని. అందుపైని వారు తమ పురాతన గ్రంథమును వెదకీంపఁగాఁ వానిలోఁ దమ యాస్థానమునందే యా గ్రంథము దొరకినదని కొ౦త కాలమునకు మరల వ్రాసిరి. ఎటువంటి మహానుభావులకును నవస్థా భేదము లుండును. ప్రధమావస్థలోని దోషములు తదనంతరావసస్థలయందు నివారణము లగును ప్రథమదశలోని యనుభవమునుబట్టి కడచిన ప్రమాదమునకు పశ్చాత్తప్తుడయి పోతనార్యుఁడు ముందు రాజాస్థానములకుఁ బోఁగూడదనియు, రాజులకుఁ గృతులీయ్యగూడదనియు నియమము చేసికొని యుండును. కర్ణాట రాజులచేత నెప్పుడయిన నవమానితుఁడయి పోతన్న రాజులను ద్వేషించువాఁ డయియు నుండవచ్చును. భ్రమప్రమాదములు మనుష్యస్వభావము అగుట చేత నెటువంటి విద్వాంసులకును నొకానొకప్పుడు ప్రమాదము సంభవింప వచ్చును. అటువంటిది పూర్ణ చంద్రునిలోని కళంకమువలె మహానీయుల కీర్తి చంద్రికకు మాలిన్యము తీసికొని రాఁజాలదు.
శేషాద్రిరమణకవులు కృష్ణాపత్రికలో నెల్లుట్ల నారాయణకవిని గూర్చి వ్రాయునప్పుడును, తత్పూర్వమున, నెల్లుట్ల నృసింహరావుగారిని గూర్చి వ్రాసినప్పుడును వారు బమ్మెర పోతరాజువంశమువారని వ్రాసి యున్నారు. ఈ కధ యెంతమాత్రమును విశ్వాసార్హమయినది కాదు. బమ్మెర పోతనా మాత్యుని సంతతివా రాఱు వేలనియోగిశాఖవారు, నెల్లుట్ల వారు గోలకొండ
ఉ. బమ్మెరవంశమందునను బ్రౌఢసరస్వతిపద్దు గాంచి తా
నెమ్మె దలిర్పఁ గేసనకవీశ్వరుఁ డప్పమనామసాధ్వియం
దిమ్మఁహి గూర్మిఁ గన్న సుత యెల్లమయందును దేరయాఖ్యుఁడన్
సమ్మతిఁ గంటి వీరనరసమ్మను గంగనమంత్రియుగ్మమున్.
బమ్మెరపోతనామాత్యుఁడు భాగవతరచనాప్రారంభకాలమునకే బమ్మెరను విడిచి యేకశిలానగరమును జేరెను. బమ్మెరవారికిని నెల్లుట్లవారికిని కౌండిన్యగోత్రసామ్య మొక్కటి దక్క వేఱు సంబంధ మేదియు లేదు. పదునాఱవ శతాబ్దాంతమునందు బమ్మెరప్రౌఢసరస్వతిపుత్రుఁడు కేసన్న రచియించిన హైమవతీవివాహావతారికవలన సహిత మీ యంశములు దేటతెల్ల మగును.
- ↑ [బమ్మెర పోతన శ్రీనాధుని సమకాలీనుఁ డని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మున్నగువారు తెల్పియున్నారు. 'ఆంధ్రకవి తరంగిణి' కారులు పోతన శ్రీనాధుని సమకాలీకుఁడు కాఁడనుచున్నారు. పోతనామాత్యుడు శ్రీనాధుని బావమఱదికాఁడనియు, 'బాలరసాల సాల నవపల్లవ' ఇత్యాది పద్యము పోతన చెప్పినది కాదని వారి యాశయము. పోతనకును, పేరమంత్రికిని నడుమ నాఱుతరములున్నవనియు, శ్రీ వీరేశలింగం పంతులు గారేడు తరములున్న వనుట సరికాదనియు, తరమునకు 30 లేక ౩౩ సంవత్సరముల లెక్కింపవలసి యుండగా పంతులుగారు నలువది సంవత్సరములు లెక్కించుట సరికాదనియు నందుఁ దెలుపఁబడినది. ( చూ. ఆంధ్రకవి తరంగిణి-ఆఱవసంపుటము, పుట 178 ) మఱియు పోతన రసార్ణవసుధాకర్త యగు సింగభూపాలుని కాలములోని వాఁడు కాడనియు సర్వజ్ఞ బిరుదాంచితుడయి, పదవ తరము వాఁడగు సింగభూపాలుని కాలమున నుండిన వాడనియు శ్రీ ప్రభాకర శాస్త్రులుగారు మున్నగు వారి అభిప్రాయము. పోతన గ్రంధమును సింగభూపాలుఁడు పాతిపెట్టించెనను వదంతి నమ్మరాదనియు విద్వాంసుఁడు, ఉదారుఁడునగు నాప్రభువట్టి పనిచేసి యుండఁడనియు, కూచిమంచి తిమ్మకవి లోకమునందలి వాడుక ననుసరించి యట్లువ్రాసి యుండవచ్చుననియు, వెలిగందల నారయ మున్నగు వారి రచనలు కేవల శిథిల భాగ పూరకములు కాక భాగవత శేష పూరకములే యని విద్వజ్జనుల యాశయము]
- ↑ [శ్రీనాధుడు భాగవతమును సర్వజ్ఞ సింగ భూపాలున కంకితమీయ వలెనని పోతనను గోరినట్లు కొందరు చెప్పుదురు.]
- ↑ (ఇది పన్నుగడయో, భాషాతత్త్వ పరిశీలన దృష్టితోఁ జేయబడినదో విమర్శకులు నిర్ణయింపఁ దగుదురు.)
- ↑ (వేఱొక హల్లుతోఁ గూడినపుడు శకటరేఫముఖము లఘురేఫమే యగునని యాధునిక లాక్షణికుల యాశయము.)
- ↑ [భాగవత రచనకు ముందే వీరభద్రవిజయము రచింపఁబడి యుండునని విమర్శకుల యాశయము.]