ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రస్తావన

సంఘ సంస్కర్తలు, నవకవితా వైతాళికులు శ్రీకందుకూరి వీరేశలింగంగారు రచించిన ఆంధ్రకవుల చరిత్ర ప్రతులకోసం తెలుగునాడు నాల్గు చెరగుల నుండి మాకుత్తరాలు పుంఖాను పుంఖాలుగా వచ్చినవి. వస్తున్నవి. అప్పటికే ఆంధ్రకవులచరిత్ర మూడు భాగముల ప్రతులన్నియు చెల్లుబడి యయిపోయినవి.

పుస్తకోపేక్షితులయిన ఆంధ్రపుత్రుల అభ్యర్థనల ననుసరించి, ఆనాటికి ఆంధ్ర కవులచరిత్ర మీది విమర్శనలను గమనించి దానిని సమగ్రంగా సంస్కరించి ప్రచురింప ఆనాటి హితకారిణి సమాజంవారు కృతనిశ్చయులైనారు.

ఆనాటి హితకారిణీ సమాజమునకు అధ్యక్షులు మధురకవి శ్రీ నాళము కృష్ణారావు కార్యదర్శి శ్రీ దంగేటి నారాయణస్వామి, శ్రీ నాళము కృష్ణారావు ఆధ్యక్షతను ౩౦-10-50 నాడు జరిగిన హితకారిణీ సమాజ కార్యనిర్వాహక వర్గ ప్రత్యేకసభలో ఈ క్రింది తీర్మాన మామోదింపబడినది.

"ఆంధ్ర కవులచరిత్ర సవరణలో అత్యవసరమని తోచిన సవరణలు, మార్పులు, చేర్పులు, ఈ వగైరా మార్పులు చేర్చుట లేక Foot Notes లో చేర్చుట, అనే మొదలగు సూచనలన్నియు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే వదలివేయుటకు తీర్మానింపబడినది. అతి ముఖ్యమని తోచిన చోట్ల మార్పులుచేస్తూ వీరేశలింగంగారి ప్రత్యేకతకు భంగం రానివ్వరని కమిటీవారు విశ్వసించుచున్నారు."

ఆ తీర్మానము ననుసరించి శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు ఆంధ్రకవుల చరిత్రను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించి హితకారిణీ సమాజం వారికి ఆందచేశారు.

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారిని ఆ బృహత్కార్యం నిర్వర్తించినందులకు - మా హితకారిణీ సమాజం 500 రూపాయలు పారితోషికమిచ్చి ఘనంగా సన్మానించింది. ఆ నాటినుండి ఆంధ్రకవులచరిత్రను ప్రచురించడంకోసం ప్రయత్నాలు చేస్తున్నాము, ప్రధానంగా ధనాభావమే మా ప్రయత్నానికి అవరోధమని మనవి చేయనవసరంలేదు. నేటికి మా ప్రయత్నం సఫలీకృతమయింది. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ ప్రభుత్య విద్యాశాఖామాత్యులు శ్రీ మండలి వేంకట కృష్ణారావుగారి సహృదయత వల్లనే ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నుండి ఆుధ్ర కవుల చరిత్ర ముద్రణకోసం రు 10,000 విరాళమందినది. వారికి మా మస8పూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఆంధ్రకవుల చరిత్ర ప్రధమ భాగాన్ని ముద్రించినాము. ఇటులనే ఆంధ్రకవుల చరిత్ర ద్వితీయ భాగాన్ని (మధ్యకాలపు కవులు) తృతీయ భాగాన్ని (ఆధునిక కవులు) ప్రచురించడానికి విరాళమందీయుమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించుచున్నాము.

పాఠకుల ఉపయోగార్థం పూర్వ ప్రచురణల పీఠికల్ని ఈ గ్రంధంలో పొందు పఱచినాము.

ఇందులో ఇంకను ఏమయిన మార్పులు చేయవలసి యున్నను, పొసగిన దొసగులను మలి ముద్రణలో సవరించగల వారము.

సాకల్యంగా ఆంధ్ర కవులచరిత్రమును పరిష్కరించి ఇచ్చిన చరిత్ర చతురాననులు కీ.శే. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి మా శ్రద్ధాంజలి, మమ్ము ప్రోత్సహించి, మాతో సహకరించి ఈ గ్రంథమును సర్వాంగ సుందరముగా తీర్చి దిద్ది పరిచయవాక్యాలు వ్రాసిన మా హితకారిణీ సమాజోపాధ్యక్షులు విద్వాన్ శ్రీ సహదేవ సూర్యప్రకాశరావుగారికి కృతజ్ఞతా పూర్వకంగా మా సుమాంజలి.

పుస్తక మచ్చువేసి యిచ్చిన శ్రీ సుజనరంజనీ ముద్రాశాల వారికి మా ఆభినందనలు.

మొండ్రేటి లక్ష్మీపతి

అధ్యక్షులు

దంగేటి లక్ష్మణరావు

కార్యదర్శి

హితకారిణీ సమాజము

రాజమహేంద్రవరం

12-2-1978