ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీ ఠి క

నే నీకవుల చరిత్రమును వ్రాసి ప్రకటించి యిప్పటికి ముప్పది సంవత్సరములు దాఁటి పోయినది. "నేనప్పటికి దొరికిన సాధనకలాపముతో కవులకాలనిర్ణయాదులను జేయుచు నేదో యొక రీతిని గ్రంథము సాంతముచేసితిని. ఇప్పటివలె నప్పడు గ్రంధాలయములు లేవు; ఇప్పడు ముద్రింపఁబడి యెల్లవారికిని సుసాధ్యము లయి యున్నగ్రంథములలో నూఱులకొలఁది కాకపోయినను పదులకొలఁది యైనను తెలుcగుగ్రంథములప్పుడము ద్రితము లయి తాళపత్రైకశరణ్యములయి దుస్సాధ్యములయి యుండెను; ఇప్పడు ప్రకటింపcబడియున్న శిలాతామ్ర శాసనాదులలో ననేకము లప్పుడు ప్రకటింపఁబడకుండెను. ఇట్టిస్థితిలో కవుల చరిత్రమును వ్రాయుట యప్పుడెంతకష్ట కార్యముగా నుండునో చెప్పనక్కఱలేకయే బుద్ధిమంతులూహించుకోవచ్చును. అయినను నేను వ్యయప్రయాసములకు వెనుదీయక పుస్తక సంపాదనమునకయి చెన్నపురి తంజాపురి మొదలయిన దూరప్రదేశములకు సహిత మరిగి యిచ్చినవారియొద్దనుండి తాళపత్ర పుస్తకములను సంపాదించియుఁ గొన్నిటికి మాతృకలకు పుత్రికలు వ్రాయించియు నియ్యనివారికడ జీర్ణతాళపత్ర పుస్తకముల నెరవుగాఁ గొని చదివి వానినుండి కావలసిన చరిత్రాంశములను వ్రాసికొనియు నెలలకొలఁది చెన్నపట్టణములో సుండి యచ్చటి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున కనుదినమును బోయి యందలి పుస్తకముల నెల్లఁ బరిశోధించి వానిలోనుండి యావశ్యక భాగములను వ్రాసికొనియు శక్తి వంచన లేక పాటుపడి నా కప్పటికి లభించిన పరికరసాహాయ్యమున నాంధ్రకవులను గూర్చి యేదో తోఁచినదానిని వ్రాసి ప్రకటించి కవులచరిత్రమనిపించితిని. క్రొత్తగా పూనుకొని పనిచేయుట కష్టము; చేసినదానిలో తప్పులు పట్టుట సులభము. నేను వ్రాసిన దానిలో తప్పులు కుప్పలుగాఁ గలవని నే నెఱుఁగుదును; బహుస్థలముల యందు మార్పులు చేయుట యావశ్యకమనియు నే నెఱుఁగని వాఁడను గాను. అయినను నాకంతకంతకు వృద్ధత్వమునకు తోడు వ్యాధి బాధలును శరీర దౌర్బల్యములును గూడ హెచ్చగుచు వచ్చుటచేత నేమి చేయుటకును శక్తుఁడను గాక పోయితిని. అందుచేత నేను పుస్తక మును మరలముద్రింపవలసివచ్చినప్పడు మార్పులు చేయుట మాట యటుండఁగాప్రూఫులు దిద్దుటకు సహితము సమర్థుఁడను గాక సమస్తమునకును ముద్రాశాలవారినేనమ్మి పుస్తకము నున్న దాని నున్నట్టగానే పలుతడవలు ముద్రింపింపవలసినవాఁడ నయితిని. ఇఁక నేను పుస్తకమును సవరింపఁగలుగుదు నన్న యాశను చిరకాలము క్రిందటనే వదలుకొని నిరాశతో నాయెద్ద నప్పటి కుండిన వ్రాఁతపుస్తకములను సహితము వారు మంచియుపయోగమునకుఁ దెత్తురన్న యుద్దేశముతో నితరులకిచ్చి వేసితిని; కవులను గొందఱిని గూర్చి తరువాతివా రప్పడప్పడు పత్రికలలో వ్రాయుచు వచ్చినవానిని జాగ్రత్తచేసి యుంచక చదివినవాని నెప్పటికప్పుడే యొక మూలపాఱవైచి యశ్రద్ధచేసి వాని వలనిలాభమును బోఁగొట్టుకొంటిని. ఇట్లుండఁగా నీనడుమ నొక రిద్దఱు భాషాభిమానులొకానొక యాంధ్రకవిని గూర్చి పత్రికలలో వ్రాయుచు తత్కవులను గూర్చి నేను పడినప్రమాదములను నాపుస్తకము నందలిలోపములను సుహృద్భావముతో వ్యక్తీకరింపఁ బ్రయత్నింపక తాము వ్రాసినవ్యాసములలో నాయజ్ఞతను గూర్చి యించుక నిందాగర్భముగా వ్రాయc జొచ్చిరి.నేనట్టినిందకు సంవూర్ణార్హుఁడనే యయినను నాకు మహోపకారము లయిన వారిదూషణభాషణములు ప్రకృతిదౌర్బల్యదోషమునుబట్టి నాకుఁ గొంత రోషమును పుట్టించి యీసారి నా కవులచరిత్రమును చేతనైనంతవఱకు సంస్కరించి మఱి ప్రకటింపవలె నన్నబుద్ధిని నా హృదయములో నంకురింపఁ జేసినవి. ఈబుద్ధి పుట్టుట చేత నావఱకే కొంత కాలమునుండి పునర్ముద్రణము నపేక్షించి యున్నకవులచరిత్రము నీసారి దిద్ది మఱి ప్రకటింపవలెనని నిశ్చయము చేసికొంటిని. ఇట్లు నిశ్చయము చేసికొన్న దినముననే యీశ్వరమహిమ యేమోకాని కారణములేకయే యాకస్మికముగా నాయారోగ్యములో మంచి మార్పు కనబడెను. ఈయారోగ్యాభివృద్ధివలనఁ గొంతయుత్సాహవంతుఁడ నయి నే నీపనికిఁ బూనుట యీశ్వరేచ్ఛ యన్న విశ్వాసము బొందినవాఁడ నయి శక్యాశక్య విచారము చేయక "తలఁచుకొన్నప్పడే తాత పెండ్లి" యన్నట్లా దినముననే పని కుపక్రమించితిని. ఇట్లు జరగుట కడచిన ఫాల్గుణ మాసారoభమున. నా కప్పటి కఱువదితొమ్మిదేండ్లు నిండవచ్చుచుండినవి. ఈపని లో మిత్రులును భాషాభిమానులును నాకు తోడ్పడకమాన రన్నవిశ్వాసముతో నాంధ్రభాషా విషయమునఁ బని చేయుచున్న యైదాఱుగురు మిత్రులకు లేఖలను వ్రాసి మార్చి నెల నడుమను వార్తాపత్రికలలో నొక చిన్నవిన్నపమును బ్రకటించితిని. ఈవిజ్ఞాపనమునకు కొరాపుట్టినుండి భాస్కరరావుగా రొక్కరు మాత్రమే స్వాభిప్రాయము నిచ్చుచు బదులు వ్రాసిరి. నేను లేఖలను వ్రాసినమిత్రులలో నొక రీక్రొత్తకూర్పులో నాంధ్ర భాషావాజ్మయ చరిత్రమునుగూడఁ జేర్పవలసినదని వ్రాసిరి; ఇం కొకరు ప్రబంధములకంటె శతకములే జనసామాన్యములో నెక్కువగా వ్యాపించియుండుట చేత శతకములను జేసిన కవులను గూర్చికూడ నిందొక ప్రకరణమును జేర్చవలసినదని వ్రాసిరి. చేయుట చెప్పినంతసులభము గాక పోవుటచేత "నేనీ డెబ్బదవయేట నీ దేహదౌర్బల్యముతో మిత్రులుకోరినంత చేయఁగలనో లేనో కాని చేతనైనంతవఱకుఁ జేయఁ బ్రయత్నించెదను. వృద్ధత్వదోషముచేత నాయవయవపటుత్వములో విశేష భాగము తగ్గి పోయినను బుద్ధిబలమింకను పూర్ణముగా తగ్గిపోలేదని నేనీ ప్రయత్నమువలనఁ దెలిసికొనుచున్నాఁడను. వ్రాయునప్పడు నా చేతులు వడకు చున్నవి; కన్నులు మండుచున్నవి, ఆయినను కలము చేతఁ బుచ్చుకొన్నప్పడు మునుపటివలెనే చిత్తక్కఱలేకయే వ్రాయcగలుగుచున్నాను. ఈ ప్రధమభాగ మేదోవిధముగా నిప్పటికి ముగింపఁబడెనుగదా ! దీనియం దీవఱ కితరుఁ లెఱుఁగని నూతన విషయములును చరిత్రాంశములును విశేషముగా లేకపోయినను పుస్తక పరి మాణముమాత్ర మేలాగుననో మూడురెట్లకంటె నథికముగా పెరిగి యీ యొక్క భాగమే యొక్క ప్రత్యేక సంపుటముగాఁ జేయఁబడ వలసినదయ్యెను.


ఈ పనిలో నాకుఁ దోడ్పడినవారిలో నామిత్రులును విజ్ఞానచంద్రికాసంస్థాపకులను నయిన శ్రీకొమఱ్ఱాజు వేంకటలక్మణరావుగారగగ్రణ్యులని చెప్పవలసియున్నది. వారు గ్రంథ సంస్కారమును గూర్చి యనేక నూచనలు చేయుటయే కాక నేను కోరిన శాసనములను గ్రంథభాగములను వ్రాసిన వెంటనే పంపి నాకృతజ్ఞత కత్యంతపాత్రులయియున్నారు. ఆంధ్ర పరిషత్సంస్థాపకులును పరిషత్పత్రికా సంపాదకులు నయిన మన్మిత్రులని జయంతి రామయ్య పంతులుగారు యుద్ధమల్లుని శాసనములోని పద్యములను వ్రాసి పంపియు తాము (పకటించుచుండిన కవిజనాశ్రయ ఛందస్సు యొక్క పీఠికను ముద్రింపఁబడకముందే జేరునట్లు చేసియు నాకు సాయము చేసిరి.

ఆంధ్ర పరిషత్పత్రికా కార్యనిర్వాహకులైన కొత్తపల్లి సూర్యారావుగారును, చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగార కార్యస్థానమునందు పండితులుగానున్న వేటూరి ప్రభాకర శాస్త్రిగారును, పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రిగారును, తమగ్రంధాలయములో నున్న పుస్తక భాగములను పద్యములను నేను కోరినవానిని వ్రాసి పంపినాకెంతో తోడుపడిరి. పిఠాపురములోని యాంధ్ర పుస్తక పరిశోధకమండలివారి గ్రంథాలయ కార్యనిర్వాహకులైన వంగూరిసుబ్బారావుగారు తమగ్రంధాలయములోని పుస్తకములను నేనుకోరినవానిని దెచ్చి యిచ్చియు కవులను గూర్చి తాము వ్రాసిన సేకరించిన యంశములను దెలిపియు నాకు సాహాయ్యము చేసిరి. వారి కందఱికి నిందుమూలమున నాకృతజ్ఞతాపూర్వకములైన వందనములను సమర్పించుచున్నాను. వారు చేయవలసిన సాయ మింతటితో తీఱిపో లేదు. ఇప్పుడన్నిటిలో చిన్నదయిన ప్రథమ భాగమొక్కటిమాత్రమే ముగిసి యింకను పెద్ద భాగములు రెండును మిగిలియేయున్నందున వారు చేయవలసినసాయ మంతయు నించుమించుగా ముందే యున్నదని చెప్పవచ్చును. మధ్యకవులలోను, ఆధునిక కవులలోను, క్రొత్తగా చేరవలసినవారి పేరులను, చరిత్రములను దెలుపవలెను; ఉన్నవానిలో తాఱుమాఱుగాఁ బడియున్నవానిని జూపుటయేగాక యందలి లోపములను గనఁపఱుపవలెను, ఇంకను బహువిధముగఁ జేయవలసినమార్పులను సూచింపవలెను.పైని పేర్కొనcబడినవారు గాక గిడుగు రామమూర్తి పంతులుగారును బుజ్జా శేషగిరిరావు పంతులుగారును గూడcదమకు దోఁచినయభివృద్ధిమార్గములను నాకుపదేశించి నాకృతజ్ఞత కర్హులైరి. అందఱి కంటె నెక్కువగా నాకు చిరకాల మిత్రులును, ఆంధ్ర భాషా వాఙ్మయము నందు విశేషకృషి చేసినవారును, దేశాటనముచేసి యపూర్వపుస్తక సంపాదనము చేసిన వారును నైన శ్రీమానవల్లి రామకృష్ణకవి గారు నా కెంతోసాయపడుదురని కొండంతయాశ పెట్టు కొంటిని గాని, వారి సాయమును బొందు భాగ్యము నాకింకను లభింప నందునకుc జింతిల్లు చున్నాను.కడచిన మార్చి నెలలో మిత్రుల కైదాఱుగురికి వ్రాసినప్పడే వీరికిని వ్రాయగా జూన్ నెల వఱకును తాము సాయము చేయుటకు పనులతొందర చేత నవకాశముండ దని వారప్పుడుత్తర మిచ్చిరి. ఒక పనిని చేయవలెనని సంకల్పించుకొన్న తరువాత దాని నారcభించి ముగించువఱకును నాకు నిద్ర పట్టదు. కాల మమూల్యమైనది.నేఁడు వ్యర్ధముగా బోఁగొట్టబడినకాలము రేపు కలిసిరాదు. చేయcదలఁచుకొన్నపనిని రేపటి కని నిలిపి యుంచక నేఁ డన్న దినముననే చేయవలెనని తొందరపడు స్వభావముగల వారిలోఁ జేరినవాఁడను నేను. బ్రతు కస్థిరమగుట చేత ఱేపటిదినము మన దగునో కాదో యస్న సందేహము తో వారు పెట్టిన గడవువచ్చు వఱకు నేను వేచియుండక తోడనే కవిచరిత్రమును సవరింప నారంభించి సవరించిన భాగము నెప్పటికప్పడె ముద్రింపింపఁ దొడంగితిని. అందుచేత నేను పుస్తకము యొక్క సవరణము ముగించునప్పటికి పుస్తకము యొక్క ముద్రణముకు సహితమించు మించుగా ముగిసెను.

ఈలోపల నేను చెన్నపురిమీదుగా గడచిన ఏప్రిల్ నెలలో బెంగుళూరికిఁ బోవుచుఁ ద్రోవలో నీపనివిూcదనే చెన్నపట్టణములో రెండుదినములు నిలిచి ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమునకుఁ బోయినప్పడు వారిపనులనుకొన్న దానికంటే శీఘ్రముగానే తీఱి శ్రీరామకృష్ణ కవి గారు చెన్నపట్టణము చేరఁగలిగినందున వారినక్కడఁ దలవనితలంపు గాc జూడఁదటస్థించెను. ఆవఱకు లేఖామూలమునఁ జేసిన ప్రార్థనము నే నేనప్పడు వారికి స్వయముగాఁ గూడఁజేసితిని. నేను బెంగుళూరు చేరి పనిచేయుచు నేప్రిల్ నెలకడపట వారివాగ్దానమును జ్ఞప్తికిఁ దెచ్చుచు వారి కుత్తరములు వ్రాసితిని. నాయుత్తరములకుఁ బ్రత్యుత్తరముగా తాము జాన్ నెల తరువాతనే సాయము చేయఁగలుగుదు మని వాగ్దానము చేసితి మనియు, తమ కార్యస్థానపు పని సామాన్యముగా నుండుదానికంటే నత్యధికముగా నుండిన దనియు, తమ పుస్తకము లన్నియు వనపర్తిలో నే విడిచిపెట్టబడిన వనియు, అయినను దమశక్తిలో నున్నంతవఱకు నేను గోరిన సమాచారమును మఱుఁనాటి టపాలోఁ బంపెద మనియు, నేను వేగిరపాటుతో పని నడుపుచున్నందులకు చింతిల్లుచున్నా మనియు, మొదటిభాగములోఁ జేయబడిన ప్రాఁత నిర్దేశము లనేకములు మార్పబడవలసియున్నవనియు, నూఱుగురు నవకవులు మొదటి భాగములోఁ జేర్పఁ బడవలసి యున్నారనియు,తెలుపుచు "మెయి"నెల రెండవ తేదీని వారు నాపేరవ్రాసిరి, "నేను వారిని పంపుఁడని కోరినవానిలో విక్రమసేనము, విజయసేనము, అథర్వభారతము, అథర్వ ఛందస్సు మొదలయినవాని యవతారికలు చేరి యున్నవి. వారు మఱునాఁడే పంపెదమన్నసమాచారమేహేతువుచేతనో నా కీవఱకును జేరనే లేదు. అట్లు చేరకపోవుట ప్రోషణ కార్యస్థానభటులలోపమువలన నయియుండును.క్రొత్తగా "నేను భోజరాజీయమును వరాహపురాణమునుముద్రింపఁబూనినప్పడు వాని ప్రత్యంతరములను గద్వాల సంస్థానమున సంపాదించి తెచ్చి నాకిచ్చి 1904 వ సంవత్సరమునకుఁ బూర్వమునందే నా కృతజ్ఞతకుఁ బాత్రు లైన పరమమిత్రులు శ్రీమానవల్లి రామకృష్ణయ్య గారు "నేను కోరిన పుస్తకము అప్పడు తమయొద్ద లేకుండుటచేతనే పంపలేకపోయియుందురు గాని నామీఁదియనాదరముచేతఁ బంపక యుండియుండరు వారు నాకియ్యఁదలఁచుకొన్న కపులనుగూర్చిన సమాచారము నిప్పుడిచ్చినను నేను దానిని కృతజ్ఞతాపూర్వకముగా నంగీకరించి దీని కనుబంధముగాఁ బ్రచురించెదను. ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని యసమగ్రమైన యుదాహరణ పుస్తకమును నేను వ్రాయించి తెప్పించుట చేత నా కనేక పూర్వకవుల నామములను వారి గ్రంథనామములు ను దెలిసినవి. శ్రీరామకృష్ణకవిగారియొద్ద నున్న జగ్గనకృతమైన ప్రబంధరత్నాకరముకూడ లభించి యుండినయెడల నింకను "నెక్కువగాc బూర్వకవులపేరులును వారి గ్రంథముల-పేరులును నాకుఁ దెలిసియుండును. ఆ పుస్తకమునకుఁ బుత్రిక నైనను వ్రాయించి తెప్పించుకొనుట కయి నేను ప్రయత్నములు చేసియు సఫలమనో రథుఁడను గాలేక పోయితిని. దానిని ముద్రింపించు చుండినట్లు కొన్నిమాసముల క్రిందట శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కృష్ణాపత్రికలోఁ బ్రకటించిరి గాని గ్రంథముద్రణము పరిసమాప్త మయి కొనఁగోరువారికది లభ్యమయి నట్లింతవఱకునుగానఁబడదు. ఇటువంటి పుస్తకములను గలవారు తాము వానిని తమయొద్దనే యడచిఁ పెట్టుకొని యుంచక మాతృక నియ్యకపోయినను పుత్రికల నైనను వ్రాయించి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములవంటి ప్రసిద్ధ పుస్తకాలయములయం దుంచినచో వానిని జదువఁ గోరెడునావంటివారి కవి సుసంపాద్యములగును.

ఉదాహరణగ్రంథాదులవలన నాకిప్పుడు పూర్వకవులగ్రంథముల పేరులును వానిలోని పద్యములను పెక్కులు తెలిసినను, ఆకవులు నేను చేసికొన్న సంకేతమునుబట్టి పూర్వ కవులలోఁ జేర్పఁదగినవారో మధ్యకవులలోఁ జేర్పదగినవారో యిప్పడు స్పష్టముగా తెలియరానందున వాని నీప్రధమభాగమునందుఁ జేర్పక తెలిసినవా రాకవులకాలనిర్ణ యాదులు చేసి తెలుపుదు రన్నయపేక్షతో వారిలోఁ గొందఱి నీ పీఠికలోఁ దెలుపుc చున్నాను. 1.పెదపాటి సోమనాథుడు. ఈతని నే కవిలోక బ్రహ్మయందురు. ఇతcడరుణాచల పురాణము, శివజ్ఞానదీపిక, కేదారఖండము మొదలగు గ్రంథములను జేసెను.

అరుణాచల పురాణములో "వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థాన భీమువేములవాడ భీము" ఆని భీమకవిని స్తుతించియుండుటచేత నాతని తరువాత నుండిన వాఁడు

             ఉ. రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
                 రాజులు రూపు రేఖ రతి రాజులు మనగుణంబునందు రా
                 రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
                 రాజులనంగ నొప్పుదురు రాజితతేజులు తత్పురంబునన్.
                                            
                                         అరుణాచల పురాణము

           ఉ. కన్నియ రూపు గోరుఁ గనకంబును గోరునుదల్లి బుద్ధి సం
               పన్నతఁ గోరుఁ దండ్రి కులభవ్యత గోరు బంధుకోటి ప
               క్వాన్నఫలాదిభక్షణము లన్యులు గోరుదురిట్టు లిన్ని యుం
               బన్నుగనొక్కచో నొదవె భాగ్యము చేసితిఁ గన్య నిచ్చెదన్.
                                
                                                కేదారఖండము

2. సూరన్న -- ఇతఁడు వనమాలీవిలాసము, ఉదయనోదయము,
             అనుగ్రంథము లను రచించెను
           ఉ. ఆతడి రాజమంచనివహాంచలవీధుల కేగుదెంచున
               బ్జాతదళాక్షిఁబల్కె నటుచంద్రనిభానన దాదిపట్టి వి
               జ్ఞాత సమస్తభూరమణజాతగుణాన్వయ వేత్రదండమున్
               జేతఁ దెమల్చి మోపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్ -వన.           చ.సరభసలీలఁ గేళిసితసౌథము లొక్కట నిర్గమించి చ
              ల్లిరి నర సాధువిూఁదఁ బురిలేమలు లాజలు దోయిలించి చె
              చ్చెర శరదంబువాహములు చించి బయల్పడుచంచలాలతల్
              పరిమితదృష్టి బిందువులఁ బర్వతరాజముఁ గప్పునాకృతిన్
        
                                              ఉదయనోదయము

3. పొన్నాడ పెద్దన్న - ఇతడు ప్రద్యుమ్న చరిత్రమును రచించెను.

క. పురగోపురశిఖరంబుల
   గర మరుదై పద్మరాగకలశము లమరున్
   జరమాచరమాద్రులపై
   సరిపున్నమఁ దోచుసూర్యచంద్రులభంగిన్

4.పెదపాటియెఱ్ఱాప్రెగడ - ఇతఁడు కుమారనైషధము, మల్హణ చరిత్రము,
లక్ష్మీపరిణయము చేసెను.

సీ. అలరెడు ఱెప్ప లలార్చినయందాఁక
           యనిమిషకన్య కాదనఁగ వశమె ?
   యమృతంబు చిలుక మాటాడినయందాకc
           గనకంపుఁబ్రతిమ కా దనఁగ వశమె ?
                                                     కుమారనైషధము

సీ. కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుc
          బంకజీవనపరిప్లవము గాక
    ఘనసారపున్నాగకమనీయ మయ్యును
          గితవదుష్కలితసంయుతము గాక - మల్హణచరిత్రము

5. బైతరాజాముమ్మయ్య - ఇతఁడు విష్ణుకధానిధానము చేసెను.

చ. వలపెటువంటిదో ముసలివాఁ డనవచ్చునె? యద్దిరయ్య! ప
    ల్కులజవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
    దగ్గలమున నెల్లప్రొద్దును మొగంబునఁ గట్టినయట్ల యుండు నా
    నలువకు నంచుఁ గాముకులు నవ్వువిధాత శుభంబు నీవుతన్.
                                    
                                                   విష్ణుకధానిధానము.
6. కాకమానిగంగాధరుcడు__ఇతఁడు బాలభారతము చేసెను.

శా. ఆ లజ్జావతి ధౌమ్యుపంఫున శిఖివ్యాలోలకీలాలిపై
    నోలిన్ వేల్చినలాజరాజిపవనప్రోద్ధూతవారాశివీ
    చీలోలోద్ధతివిద్రుమాటని నధిక్షేపించుకట్టాణిము
    త్యాలో నాఁ కనుపట్టె నట్టియెడ నందద్రాజహంసంబుగాన్.
                                                    బాలభారతము
7. రాయసముగణపయ్య-ఇతఁడు సౌగంధికాపహరణము చేసెను.

       శా. అంతంతం కబళింపఁగాఁ గడఁగె బాలార్కున్ ఫలభ్రాంతి వే
           శంతోల్లంఘన కేళి దాటెను సరస్వంతున్ మహాదానవా
           క్రాంతారామమహీయహంబుల నుదగ్రక్రీడఁ ద్రుంచెన్ హనూ
           మంతుండుం గపి యన్యము ల్గపులె సామాన్యాటవీచారముల్.
                                                        సౌగంధికాపహరణము
       8. పోతరాజు వీరయ్య - ఇతడు త్రిపురవిజయము చేసెను.

       సీ. తమ్ముల బెదరించుతళుకు వెన్నెలసోగ
                            కన్నె గేదఁగి రేకు గారవింప
          పదినూఱుపడిగెలఁ బరపైనపదకంబు
                            సవడిముత్యపుఁబన్న సరముఁ బ్రోవ -త్రిపురవిజయము

       9. వాసిరాజు రామయ్య - ఇతడు బృహన్నారదీయమును చేసెను

       సీ. మల్లికానవసముత్ఫుల్ల పాటల పుష్ప
                             వల్లరీసౌరభ్యవాసితంబు
          కాసారనీరజవ్యాసక్త మధుకరీ
                             ఝంకారముఖరితాశాముఖంబు-బృహన్నార.

       10. గంగరాజు చౌడప్ప-ఇతcడు నందచరిత్రమును జేసెను.

       చ. ముదిమికి మందు వాగ్మితకు ముంగలిజిహ్వ తపఃఫలంబు స
           మ్మదమునివాస మింపుగని మారవికారముప్రోది కామినీ
           వదన విభూషణంబు జనవశ్యము హాస్యరసాబ్ది లాస్యసం
           పదయుదరస్థలంబు మధుపానసుఖంబు జగత్రయంబునన్ -

                                                            నందచరిత్రము

ఈ ప్రకారముగా సంకలితగ్రంథములలోను లక్షణ గ్రంథములలోను బేర్కొనఁబడిన వారు జినేంద్ర పురాణమును రచించిన పద్మకవి (ప్రభాచంద్రుఁడు), ముద్రామాత్యము రచించిన శివదేవయ్య, ప్రద్యుమ్నవిజయము రచించిన ఫణిధవుఁడు, జలపాలి మహత్వము రచించిన నడివాసిమల్లుభట్టు పద్మినీవల్లభము, శంకరవిజయము, మంగళగిరి విలాసము రచించిన బొడ్డపాటి పేరయ్య, వాసవదత్తోపాఖ్యానము, రేవతీపరిణయము రచించిన మద్దికాయల మల్లయ్య, ఆదిపురాణము రచించిన సర్వదేవయ్య, కుశలవోపాఖ్యానము, ఐరావతచరిత్రము రచించిన చిరుమూరిగంగాధఁరుడు, పద్మావతీకళ్యాణము

రచించిన ముత్తరాజు, పరమభాగవత చరిత్రము రచించినయప్పన్న, మొదలైనవారు పలువురున్నారు. ఇటువంటివారికాలము చరిత్రము తెలిసినవారు సకారణముగా నాయుద్యమమునకు దోడ్పడుదురు గాక !

వెనుకటి కూర్పులలో నెల్ల 1450 వ సంవత్సరమువఱకు నుండిన కవులను మాత్రమే పూర్వకవులలోఁ జేర్చినను, ఈ కూర్పునం దిప్పుడు కొంచెము మార్చి 1450 వ సంవత్సరము మొదలుకొని 1400 వ సంవత్సరమువఱకును నుండిన కవులను గూడ నీ ప్రధమభాగమునందుఁ జేర్చి పూర్వకవులనుగాc జెప్పియున్నాను. ఆందుచేత నింత వఱకును మధ్యకవులుగా పరిగణింపఁబడి ద్వితీయ భాగములోఁ జేర్పcబడి యుండిన వారు నలుగురైదుగు రిఫ్పుడు పూర్వకవులుగా నీ ప్రథమభాగములోనికిఁ దీసికొనఁబడిరి. ఇట్టి మార్పుచేయుటకుఁ గల కారణమును గూర్చి విశేషముగాఁ జెప్పవలసినపనిలేదు. 1500 వ సంవత్సరప్రాంతము వఱకునుగల కాలము పురాణయుగమనికాని, భాషాంతరీకరణ కాలమని కాని చెప్పఁబడఁదగినది గానున్నది. 1508 సంవత్సరమునందు రాజ్యమునకువచ్చి తెలుగు కవిత్వమునకు నూతన జీవమును గలిగించి యాంధ్రభోజుఁ డని పేరొందిన కృష్ణదేవరాయని కాలమునుండియు నాంధ్ర వాఙ్మయమున కొక నూతనశక మారంభమైనది. కేవల భాషాంతరీకరణములు గాక రాజాదరము వలన నూతన కల్పనలతో ప్రబంధ రాజములు పుట్టనారంభ మయిన యీ కాలమును ప్రబంధయుగమని చెప్పవచ్చును. ఈ నూతన ప్రబంధ నిర్మాణమునకు మార్గదర్ళి యయిన వాఁడు కృష్ణదేవరాయలయాస్థానకవి యయి మనుచరిత్రమును రచియించి యాంధ్రకవితాపితామహుఁడని బిరుదు బొందిన యల్లసాని పెద్దన్న. పెద్దనయే యననేల? విష్ణుచిత్తీయ మనునామాంతరము గల యాము క్తమాల్యద యనెడి మహాప్రబంధమును రచించి కృష్ణదేవరాయలే మార్గదర్శి యయ్యెనని చెప్పినను చెప్పవచ్చును. ఆంధ్రసారస్వతమునందలి యానూతనశకారంభమునకుఁ బూర్వమునందుండినవారిని పూర్వకవులనియు, ఆ కాలమునకు నిప్పటికాలమునకు మధ్యకాలము నందుండినవారిని మధ్యక ఫులనియు విభాగముచేయుట యుక్తిసహము కాక పోదు.

కవులచరిత్రమును సంస్కరింప వలె నన్నబుద్ధి పుట్టిన మార్చి నెలలోనె పనికి బూని మార్చుట కారం భించి యప్పుడు మార్చిన దాని నప్పుడే ముద్రణమున కిచ్చుచు వచ్చితినని యీవఱకే చెప్పి యుంటిని గదా! మార్చుట కారంభించినప్పుడు పుస్తకమునంతను మరల వ్రాయుదు నన్నధైర్యము లేని వాఁడ నయి ప్రాఁతబొంతకు క్రొత్త యతుకులు వేసిన ట్లక్కడక్కడ నచ్చుపు స్తకములో నే క్రిందను విూఁదను మ్రుక్కలను హంస పాదములతో క్రొత్త ముక్కల నతికించుచు గ్రంథమును సాగింప నారంభించితిని. ఆందుచేతఁ గొన్నిచోట్ల నీక్రొత్తముక్కలు పూర్వోత్తర సందర్భమున కనుకూలమగునట్టు చక్కగా నతుకక కొందఱి చరిత్రములు కొంతవఱకతుకుల బొంతలుగానే యుండుట తటస్థించెను. తరువాత చరిత్రములను మార్చుటకయి గ్రంథపరిశోధనము చేయుచు వచ్చినప్పడు కొన్నిచోట్ల వెనుకటివారి చరిత్ర ములలో వేసినయతుకులలో గొన్ని తీసివేసి క్రొత్తమాసికలు వేయవలసినయావశ్యకము కనబడుచు వచ్చెను గాని ముద్రిత మయినదానిని మొదలంటc దీసివేయక యట్టిపని సాధ్యము కానందున నొక్కొక్కచోట నెందేని పూర్వాపరవిరుద్దాంశములు సహిత మిందు పడి యున్నవి. అట్టి వేవేని కనబడినపక్షము మొదటc జెప్పఁబడినదానికంటెఁ దరువాతఁ జెప్పఁబడినది యధిక ప్రమాణ మని చదువరులు గ్రహింతురుగాక. ఈ ప్రకారముగా చిన్నవో పెద్దవో యతుకులు వేయుచు బెంగుళూరిలో గ్రంథమును శ్రీనాథునివఱకు నెట్లో యీడ్చుకొని వచ్చితిని గాని యక్కడకు వచ్చు నప్పటి కెంత పెద్దయతుకులు వేసినను కుదరక క్రొత్తయల్లిక విశేషముగా కావలసి వచ్చెను. ఆందుచేత శ్రీనాథుని చరిత్రములో ముప్పాతిక మువ్వీసము క్రొత్తగావ్రాయవలసినవాఁడ నైతిని. ఈ ప్రకారముగానే యీభాగము నందు మున్ను లేని వయి యిప్పుడు క్రొత్తగాఁ జేర్పఁబడిన నన్నె చోడుడు మొదలైనవారి చరిత్రము లన్నియు నూతనముగానే వ్రాయcబడినవి. ఇవి యన్నియు బెంగుళూరిలోనే వ్రాయcబడిన వగుటచేత నచ్చటఁ గర్ణాటకకవిచరిత్రాదులను జదివి వానివలన లాభము గొంతవఱకుఁ బొందుట తటస్థించెను. నన్నె చోడుని చరిత్రమునందును భీమకవి చరిత్రమునందు నథర్వణాచార్యుని చరిత్రమునందును నేనిచ్చట బొందిన యీ లాభము కొంతవఱకు తేటపడ వచ్చును. శ్రేయాంసి బహువిఘ్నాని యన్నట్లు బెంగళూరిలో సహితము నాపని నిర్విఘ్నముగా సాగినది కాదు అక్కడ నా వెంట వచ్చిన యొక చిన్నదానికి స్ఫోటకము వచ్చెను. ఈ యంటు రోగమునకు భయపడి మేమక్కడ కుదుర్చుకొన్న బాలసేవకుఁడును పనికత్తెయు గూడ నొక్కసారిగా మమ్మువిడిచి పోయిరి. వారిస్థానమున క్రొత్త సేవకులు దొరకరైరి, ఆందుచేత నసహాయుల మయి నేనును నావెంట నాసంరక్షణము నిమిత్తము వచ్చిన లోకానుభావము చాలని యువతీమణియు సదా రోగిని కనిపెట్టుకొనియుండి యుపచారములను జేయవలసిన వార మయితిమి. ఈశ్వరానుగ్రహమువలన రోగి స్వస్థ పడెను గాని మనోవ్యాకులత చేతను రాత్రులు నిద్రలేకపోవుటచేతను నేను జ్వరపడి యత్యంత దుర్బలుండ నయి రాజమహేంద్రవరమునకు వచ్చినతరువాత సహితము నెల దినములకంటె నెక్కువకాలము నేనేమియు పనిచేయ లేక పోతిని. అయిన నాయెడ నీశ్వరానుగ్రహము పూర్ణముగా నుండినందున నేను మరల స్వస్థపడి విఘ్నమృగముల బారికి తప్పి బైలపడి యీ ప్రధమభాగము నొకవిధముగా ముగింప శక్తుఁడ నయితిని. నాయెడలఁ జూపినయీయసాధారణానుగ్రహమునకై నేనీశ్వరునకు భక్తివూర్వకము లైనవందనసహస్రములను సమర్పించుచున్నాను. మిగిలిన రెండుభాగములను గూడ సంస్కరించి ప్రకటించు శక్తిని మానసోత్సాహమును భక్తాభీష్ట ప్రదాయకుఁడైన పరమేశ్వరుఁడు నాకు ప్రసాదించును గాక ! జరాభారము వలనను ప్రూఫులను తిన్నఁగా దిద్దలేకపోవుటవలన ననివార్యముగా పడినయచ్చుపొరపాటులను సరకుగొనక చదువరులు నన్ను మన్నింతురు గాక!

నేను బెంగళూరిని విడుచుటకు "రెండుమూcడుదినములు ముందు శ్రీనాథుని చరిత్ర సంబంధమున సర్వజ్ఞబిరుదాంచితుఁ డైన శ్రీరావు సింగభూపాలుని కాలనిర్ణయమును గూర్చి యాలోచించుచుండినప్పుడు నా కాకస్మికముగా తద్వంశజులును ప్రస్తుతపీఠికాపురాధీశ్వరులును సాధారణముగా సమస్తసత్కార్యాభివృద్ధుల కొఱకును విశేష ముగా నాంధ్ర భాషాభివృద్దికొఱకును సమాజనిరంతరాదరౌదార్యములను జూపుచున్న వారును నైన మహారాజశ్రీశ్రీరాజారావు వేంకటకుమారమహిపతినూర్యారావు బహుదురుగారు నాకు స్మరణకు వచ్చి యీ కవుల చరిత్రమును వారి కంకితము చేయవలెనన్న బుద్ధి పుట్టినది. అది యీశ్వరాదేశ మని భావించి యీ కవిచరిత్రమును వారికిఁ గృతి యిచ్చుట కప్పుడే నిశ్చయము చేసికొంటిని. వారిసుగుణసంపదను గూర్చి యిందుచెప్పుట స్తోత్ర పాఠముగాc గనcబడ వచ్చును. గాన నిందింత కంటె నధికముగా వ్రాయను. లోకరక్షకుc డైనయీశ్వరుఁడు లోకోపకారార్ధముగా వారికి దీర్ఘాయురారోగ్యైశ్వర్యములను బ్రసాదించును గాక!


నేనీ కవులచరిత్రమును శీఘ్రకాలములోఁ బ్రచురింపవలె నని కోరఁగా ప్రతిదినమును రెండేసిఫారముల చొప్పున నచ్చుగూర్చియిచ్చి పుస్తక మింత శీఘ్రముగా వెలువడుటకు హేతుభూతులైన శ్రీమనోరమా ముద్రాక్షరశాలాధికారులకు వందనములు జేయుచున్నాను.


రాజమహేంద్రవరము కందుకూరి వీరేశలింగము. 11వ ఆక్టోబరు 1917

రెండవకూర్పునకుఁ బీఠిక.

ఆధునికాంధ్రసారస్వత పితామహుఁడును శతాధిక గ్రంథకర్త యునాంధ్రవచన రచనాచక్రవర్తియునైన రావు బహదూర్ కందుకూరి వీరేశలింగముపంతులుగారు, చిరకాలము క్రిందట నాంధ్రకవులచరిత్రము మూడు భాగములుగా రచియించి , ఆ మూడు భాగముల నొక సంపుటముగానే మొదట ప్రకటించిరి. పిమ్మట మొదటి భాగములోని కవులనుగురించి నూతనాంశములం పెక్కులు లభించుటచే బ్రథమభాగమును విపులముగాఁజేసి దానినొక ప్రత్యేక సంపుటముగాఁ బ్రకటించిరి. ఆ సంపుటము పండితులయొక్కయు, భాషాభిమానులయొక్కయు, నాదరణముఁబడయుటచే నప్పుడు ప్రచురించిన గ్రంథములన్నియు విక్రయింపఁబడియెను. అందుచేత మూడు సంవత్సరముల క్రిందటనే యీ సంపుటము పునర్ముద్రణము కావలసియుండెను. ఈ గ్రంథమునుఁ బంపుమని యాంధ్ర దేశవునందలి నానాభాగములనుండి పలువురు వ్రాయు చున్నారు. ఆకారణమున నిప్పుడీ గ్రంథము రెండవసారి ముద్రింపబడి హితకారిణీసమాజము వారిచేతఁ బ్రకటింపఁబడినది.

జగమెఱుంగు బ్రాహ్మణునకు జందెమెందుకన్నట్లు శ్రీ వీరేశలింగంపంతులుగారి గ్రంథముయొక్క గుణములు వర్ణింపనక్కర లేదు. ఆవి పాఠక మహాశయులకే స్వయంవ్యక్తములుగదా ?

చిలకమర్తి లక్ష్మీనరసింహం, హితకారిణీసమాజోపాధ్యక్షుడు,

పెద్దాడ సుందరశివరావు, హితకారిణీసమాజగౌరవ కార్యదర్శి

రాజమహేంద్రవరము, 20-1- 1937

మొదటికూర్పు ఉపోద్ఘాతము

_______________

కవి చరిత్రములను వ్రాయఁబూను నావంటివారికి గ్రంథసామగ్రి తక్కువయగుటచేత కవులకాల నిర్ణయాదులను సరిగా వ్రాయుటకాని,అందఱి చరిత్రములను వ్రాయగలుగుట గాని, సాధ్యము కాదు. అయినను ముందు వారికి మార్గదర్శకముగా నుండు నన్నయపేక్షతో నాకు దొరకిన యల్పాధారములతోను పరిమిత గ్రంథ సాహయ్యము తోను నాశక్తి కొలఁది నేదో యొకరీతి చరిత్రము వ్రాయఁబూనినాను. ఇందు తప్పులు కుప్పలుగా నుండవచ్చును. విద్వాంసులగువారు నన్ను పరిహసింపక వాత్సల్యముతో నా లోపములను జూపి దిద్దించియు, నా యొద్దలేని గ్రంథములను నాకు బంపియు నాయుద్యమమును గొనసాగింతురని విశ్వసించుచున్నాను. "నేనిందు వ్రాసిన చరిత్ర సంగ్రహములో 1650 వ సంవత్సరమునకు బూర్వమునందుండిన కవులందరియొక్క చరిత్రమును జేర్చితినని చెప్పcజాలను గాని యిందుఁ బేర్కొనc బడిన కవులందఱును మాత్రమాకాలమునకుఁ బూర్వపువారేయని నిశ్చయముగాఁ జెప్పగలను. కృతికర్త యొక్కగాని, కృతిపతులయొక్కగాని కాలమును దెలిసికొనుట కాధారములు చిక్కకపోవుటచేతను, అప్పకవీయాది లక్షణ గ్రంథములలో నుదాహరింపబడి యుండకపోవుటచేతను, ఇప్పడు నాకు లభించియువ్న గ్రంథములలోనే కొన్ని యప్పకవి కాలమునకుఁ బూర్వమునందు రచింపఁబడినవియున్నను నేనని విడచిపెట్టియుండవచ్చును.

  • * * *

[1]

రాజమహేంద్రవరము

6వ నవంబరు 1894 వ సం.

కం. వీరేశలింగము


రెండవ కూర్పుఇందు మొదటి నూఱుపుటల గ్రంథమును ప్రథమ శాస్త్ర పరీక్షకు బఠనీయముగా నేర్పడియున్నందున, ఆ భాగమునందు మార్పులు చేయుటకు వలనుపడలేదు.

ఆ భాగములో జేర్చదలచుకొన్న యంశములలోఁ గొన్ని యీ పుస్తకాంతమున ననుబంధముగా జేర్పఁబడినవి, మొదటి కూర్పునందు విడువబడిన యనేక కవుల చరిత్రములిందుఁ గడపటిభాగమునఁ జేర్పcబడి యుండట,యీ కూర్పుయొక్క పుటల సంఖ్య వలననే తెలియవచ్చును. ఇందుగనcబడెడి లోపములను నాకు జూపుటకును, నాకు లభింపని గ్రంథములు తమయొద్దనున్నచో,బంపుటకును ఇందుండఁదగిన నూతనాంశములను దెలుపుటకును ఆంధ్ర భాషాభిమానులనెల్ల సవినయముగాఁ బ్రార్థించుచున్నాను,

రాజమహేంద్రవరము

5వ నవంబరు 1897 వ సం.

కం. వీరేశలింగము

  1. ఈ పీఠిక సమగ్రముగా మా కుపలబ్ధము కాలేదు