ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/క్షేమేంద్రుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సంస్కృతమున సుప్రసిద్ధుఁడగు క్షేమేంద్రుఁడు కాశ్మీరదేశవాసి.(క్రీ.శ.1060 ప్రాంతమున నుండెను. ఆ క్షేమేంద్రుని నామమనే బిరుదముగా ధరించిన 'లక్కాభ'ట్టను ఆంధ్రకవి యొకcడుండెను. (క్షేమేంద్రుఁడే లక్కాభట్టని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 'సకలనీతిసమ్మతము' యొక్క పీఠికలో తెలిపియున్నారు.) ఇతఁడు సంస్కృత క్షేమేంద్రునికిఁ దర్వాతివాఁడు. క్రీ. శ. 1250 ప్రాంతమున నుండిన తిక్కన రచించిన 'కవివాగ్బంధము'న నీతనింగూర్చియు, ఇతని గ్రంధమును గూర్చియు నుండుటవలన నీతఁడు క్రీ. శ. 1250 కి పూర్వుఁడని 'తెనుఁగు కవుల చరిత్ర' లోఁ గలదు. (పుట 381) కవి వాగ్పంధము తిక్కనకృతి కాదని 'ఆంధ్రకవితరంగిణి'కారులు నిరూపించియున్నారు. (రెండవ-సంపుటము పుట 185.)

ఈ క్షేమేంద్రుఁడు "శూద్రకరాజుచరిత్రము, శతపక్షి సంవాదము, ముద్రామాత్యము" నను కృతులను రచించెనని 'సకలనీతిసమ్మత' పీఠికలో శ్రీ రామకృష్ణకవిగారు తెల్పియున్నారు. శూద్రకరాజుచరిత్రము కవిభల్లట కృతిగా లక్షణ గ్రంధములనుబట్టి తెలియుచున్నది. పయి గ్రంధములలోని పద్యములు కవివాగ్బంధము, వెల్లంకి తాతంభట్టు రచించిన కవిచింతామణి, సకలనీతిసమ్మతము మున్నగు గ్రంథములలో నుదాహరింపఁబడి యున్నవి