Jump to content

ఆంధ్రుల సాంఘిక చరిత్ర/8 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి

8వ ప్రకరణము

క్రీ.శ. 1857 నుండి 1907 వరకు

భారతీయుల కత్తి 1757 లో ప్లాసీయుద్ధములో లొగిపోయెను. 1857 విప్లవములో విరిగిపోయెను. మరల 1947 లో మనకత్తి మనచేతికి వచ్చెను. 1857 లో ఇంగ్లీషురాజ్యము దేశమంతటను స్థిరపడిపోయెను. ఇది మనదేశచరిత్రలో ముఖ్యమగు ఘట్టము. మన మానాటినుండి ఆధునిక యంత్ర యుగములోనికి ప్రవేశించినాము. ఈ 60 ఏండ్ల చరిత్ర విద్యావంతుల కందరికినీ బాగా పరిచితమైనదే. అందుచేత ఈ భాగమును 1907 వరకు ముగించుట బాగని తలపనయినది. అనగా విప్లవము తరువాత 50 ఏండ్ల సాంఘిక చరిత్ర సంగ్రహముగా నీ ప్రకరణమున వ్రాయబడును.

1857 కు పూర్వముండిన ముస్లిం మతవ్యాప్తి ఆనాటితో ఆగిపోయెను. ఇంగ్లీషువారు క్రైస్తవులు. కాన క్రైస్తవ మతవ్యాపక సంఘములు (మిషనులు) అనువయిన స్థలములందంతటను స్థాపితమయ్యెను. మిషనరీలు నానావిధములగు సేవలద్వారా జనులను తమ మతములోని కాకర్షించిరి. వారు విద్యాలయముల స్థాపించిరి. వైద్యాలయముల నెలకొల్పి ఉచితముగా మందు లిచ్చిరి. తమ బైబిల్ మత గ్రంథమును భారతీయ భాష లన్నింటిలోనికి పరివర్తనము చేసి ముద్రించి ఉచితముగా పంచిపెట్టిరి. వారి మతములోనికి విశేషముగా అంటరాని తెగలవారు చేరిపోయిరి. తెనుగు దేశమందు 200 ఏండ్లనుండి క్రైస్తవ మత ప్రచారము సాగుతూ వచ్చినది. క్రైస్తవ మతములో చేరిన పై జాతులవారు తమ కులాలను మరచిపోజాలరయిరి. గుంటూరుజిల్లాలో వేలకొలది రెడ్డి కుటుంబాలు క్రైస్తవమతం పుచ్చుకొనెను. కాని వారు అదే మత మవలంబించిన మాల మాదిగ మంగలి మున్నగు తక్కువ జాతులతో బాంధవ్యము నేటివరకు చేయుట లేదు. అందింకొక చిత్రమేమన హిందువులగు రెడ్లు తమకన్యల ఆ రెడ్డిక్రైస్తవులకిచ్చి పెండ్లిచేయుదురు. కాని క్రైస్తవ రెడ్లు మాత్రము తమ పిల్లల హిందూ రెడ్ల కీయరు. మిషనరీలు, ఫాద్రీలు, తమ మతము గొప్పదనియు ప్రచారము చేసుకొనుటలో తృప్తినొందక హిందువుల కులాచార లోపములను మూర్ఖ విశ్వాసములను సంఘములోని కుళ్ళును బయట పెట్టి దుష్ప్రచారము చేసి జనులలో హిందూమతముపై విశ్వాసమును భక్తిని ఆదరమును పోగొట్టుతూ వచ్చిరి. అందుచేత ఇంగ్లీషు విద్య నేర్చినవారిలో తమ మతముపై అభిమానము తగ్గిపోయి తమ కొంచెపుతనమునకు తాము లజ్జింప మొదలిడిరి. అట్టి సన్నివేశములో భారత రంగముపై ఒక మహావ్యక్తి ఆవిర్బవించెను. అతడే మహర్షి శ్రీమ ద్దయానంద సరస్వతీ భగవత్పాదులు. వారి కింగ్లీషేమియు రాకుండెను. సంస్కృతమందు పారమందినవారు. వేదశాస్త్రములను సంపూర్ణముగా స్వాధీన పరచుకొనిరి. అతడాధునిక కాలపు దృష్ట. అత డార్యసమాజమును స్థాపించి హిందువులలోని ఆచార లోపాలు మధ్య వచ్చినవే కాని వేదమూలకములు కావని నిరూపించి ఇస్లాంక్రైస్తవమతాలలో కల ఆధ్యాత్మికాధిభౌతిక లోపాలను నవితర్కముగా నిరూపించి హిందువులకు ధైర్యము, సంస్కారావకాశము, ఆత్మ గౌరవము కలిగించెను. తెనుగు దేశ మందు నిన్న మొన్నటి వరకు ఆర్యసమాజ ప్రచారము సాగినదికాదు.

ఆర్యసమాజానికి ముందే రాజా రామమోహనరాయల బ్రహ్మసమాజ శాఖలు కృష్ణా గోదావరి జిల్లాలలో కొన్ని స్థాపిత మయ్యెను. కాని, వానికి వ్యాప్తి లేక ఆగిపోయెను. అయినను ఆర్య బ్రహ్మ సమాజముల భావములు జనులలో బాగా వ్యాపించిపోయెను. బ్రహ్మ సమాజములో చేరినట్టి కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఒక అసాధారణ వ్యక్తి. మహానుభావుడు. 'వీరా: పండిత కవయ:' అన్న సూక్తికి లక్ష్యభూతుడు అతడు కులముల తారతమ్యములమీద మూడ విశ్వాసాలమీద, అవైదికమగు మూర్తిపూజలమీద దెబ్బతీసెను. స్త్రీలపై జరుగు హత్యాచారముల ముఖ్యముగా వితంతువులకు పునర్వివాహము చేయక నిరోధించుటను ప్రతిఘటించి వితంతూద్వాహములను చేయించి, వితంతు శరణాలయమును నెలకొల్పెను. ఆయన ప్రచారము వలన తెనుగుదేశ మందపూర్వ సంచలనము కలిగెను. పూర్వాచారపరులు ఆంక్షలుపెట్టి, అల్లరులుచేసి, దౌర్జన్యాలు చేసి, బీభత్సము చేసినను అతడు మరింత విజృంభించి తనదీక్షను సాగించెనే కాని విరమించుకొన్నవాడు కాడు.

హిందువులలో ఇంచుమించు 1000 ఏండ్లనుండి అనగా ముస్లిములు దేశమందు ప్రవేశించిన కాలమునుండి అనేక దురాచారాలు ప్రబలిపోయెను. బాల్యవివాహాలు, వితంతుద్వాహ నిషేధము, సహగమనము, బహువిధ మూర్తుల పూజ, అనేక శక్తుల పూజలు, దేవర్ల కొలువులు మంత్రతంత్ర విశ్వాసములు, సముద్రయాన నిషేధము, కుల బహిష్కార దౌర్జన్యాలు, గ్రహచార విశ్వాసము, గ్రహశాంతులు శుభాశుభ శకునాలు పాటింపులు, అంటరానితనము, దృష్టిలోపాలు తాంత్రిక వామాచారాలు, మున్నగు ననంత లోపాలు సంఘమందు స్థిరపడి యుండెను. ఈ లోపాలవల్ల మనలో ఐకమత్యము, నాగరికతాభివృద్ధి, నిర్మాణ కౌశలము నశించి, రాజకీయ పతనము సంభవించెనని విద్యావంతులు తలచిరి. అందుచేత పారతంత్ర్య విముక్తికి ముఖ్యసాధనము సంఘలోపముల సంస్కారమని తలచిరి. దానికై సంఘ సంస్కార మహాసభలు విరివిగా కావించిరి.

ఇది యిట్లుండ క్రీ.శ. 1885 లో అఖిలభారత జాతీయ మహాసభ (నేషనల్ కాంగ్రెసు) స్థాపితమయ్యెను. 1857 తర్వాత అతిముఖ్యమగు ఘట్ట మీ కాంగ్రెసు సంస్థాపన. భారత జాతీయత (Nationalism) ఆనాటి నుండి ప్రారంభమైనదన్నమాట. భారత దేశమును సృష్టికర్త తన పరిశీలన గృహము (లేబరేటరీ) గా బహుశా నిర్ణయించుకొన్నాడేమో. వివిద జాతులు, కులాలు, మతాలు, భాషలు - ఇచ్చటనే సమకూడినవి. వేదకాలమునుండి భారతీయులలో అఖండ జాతీయత యెన్నడును కలిగి యుండలేదు. కావున కాంగ్రెసు అవతరణ యీ జాతీయతకు పునాదివేసెను. యూరోపులోని జర్మనీలో ఫ్రెడరిక్ (The Great) తోను, ఇటలీగారి బాల్డీ, మాక్జినీలతోను, ఫ్రాన్సులో 1789 నాటి విప్లవముతోను సంయుక్తామెరికాలో 1776 తోను జాతీయత ఏర్పడెను. మన కాంగ్రెసు మొదట సంఘ సంస్కారమునకు పూనుకొనలేదు. దాని వార్షిక సభలతోపాటు వేరుగా సంఘ సంస్కార సభలు జరుగుచుండెను.

ఇంగ్లీషు పరిపాలనము ఆర్థికముగా దేశానికి గొప్పనష్టము కలిగించెను. మన దేశములోని పరిశ్రమలు నాశనమయ్యెను. కొత్త పరిశ్రమలను ఇంగ్లీషువారణగ ద్రొక్కిరి. అందుచేత జనులు అత్యధికముగా భూమిపై వ్యవసాయముపై ఆధారపడిరి. దేశమందు క్షామములు అభివృద్ధియై జననష్ట మపారమయ్యెను. విలియం డిగ్బీఅను ఆంగ్లేయుడు 1891లో పార్లమెంటు సభ్యుల పేర ఒక విజ్ఞప్తి ప్రకటించెను. అందిట్లు వ్రాసెను. '1802 నుండి 1854 వరకు 13 క్షామాలు సంభవించి 50 లక్షలమంది చచ్చిరి. 1860 నుండి 1879 వరకు 16 క్షామాలు సంభవించి 1 కోటి 20 లక్షల మంది చచ్చిరి. 1868 లో దాదాబాయి నౌరోజీ లెక్కించి పరిశోదించగా మద్రాసు రాజధానిలో మనిషికి సగటున సంవత్సరాదాయము 18 రూపాయలే అని తేల్చెను. ఉత్తరార్కాటు జిల్లా కలెక్టరు తన జిల్లాలో అపారమైన దారిద్ర్యము జనులలో నిండినదని వ్రాసెను. నెల్లూరు జిల్లాలో అపరాధులు జెయిళ్ళలో పడిన తర్వాత బాగా బలిసిరనియు జనులకు తిండికొరత విపరీతముగా నుండెననియు జిల్లాడాక్టరు అబిప్రాయ మిచ్చెను.'

థాన్యాల యొక్కయు తిండి పదార్థల యొక్కయు ధరలు చాలా తచ్చుగా నుండెను. కృష్ణాజిల్లావారగు పెద్దిబొట్ల వీరయ్య అను వకీలుగారు ఇంచుమించు 27 ఏండ్లక్రిందట ఆంధ్రపత్రికలో ఇట్లు ప్రకటించెను.

'ఇప్పటికి 60 సంవత్సరములకు పూర్వము (1860లో) మచిలీపట్టణములోనుండి ధరలు తెలియగల కాగితమొకటి నేను చూడ తటస్థించినది. ......... 1860 లో బందరులో జరిగిన ఒక వివాహమప్పు డుంచబడిన జాబితా సంగతు లిందు తెలియజేయుచున్నాను.

వస్తువు ధర రూ. అ. పై. పరిమాణము
బియ్యము 1-0-0 32 సేర్లు
కందులు 1-0-0 31 సేర్లు
పెసలు 1-0-0 22 సేర్లు
మినుములు 1-0-0 19 సేర్లు
మిరప 1-6-0 మణుగు
నెయ్యి 4-2-0 మణుగు
ఆముదం 1-0-0 4 వీసెలు
నూనె 1-0-0 4 వీసెలు
చింతపండు 0-13-6 మణుగు
బెల్లం 0-11-8 మణుగు
పసుపు 1-0-0 5 వీసెలు
మెంతులు 1-0-0 40 సేర్లు
జీలకర్ర 1-0-0 6 సేర్లు
కొబ్బరికాయలు 0-3-0 10 కాయలు
సొరకాయలు 0-2-0 3 కాయలు
కట్టెలు 0-3-0 150 మడకర్రలు
విస్తళ్ళు 0-1-4 100
తమలపాకులు 0-1-9 1000
దోసకాయలు 0-2-0 మణుగు
వంకాయలు 0-2-0 మణుగు
ఇంగువ 0-0-10 తులం
అటుకులు 1-0-0 16 సేర్లు
చేటలు 0-1-6 4
తాతి ఆకు బుట్టలు 0-0-3 6

పై యంశములు ఆనాటి ప్రజల యార్థికస్థితి తెనుగు దేశమం దెట్లుండెనో తెలుసుకొనుటకు సహాయపడును. 1876 లోను 1878 లోను బొంబాయి మద్రాసు రాష్ట్రాలలో అనగా దక్కనులో నంతటను మహాక్షామ మేర్పడెను. ఆ క్షామము దెబ్బ తెనుగుసీమపై విశేషముగా పడెను. నేటికిని 80 ఏండ్ల వృద్ధులా 'ధాత కరువు'ను గురించి ముచ్చటిస్తూ వుందురు. ఆ సంవత్సరమే "పగటి చుక్కలు రాలె"ను అని చెప్పుదురు. అనగా సంపూర్ణ గ్రహణము తెనుగు సీమలో అయ్యెనన్నమాట. అదే సంవత్సరము "ఎర్రగాలి" వీచెనందురు. ఆకాశమంతయు ఎర్రని ధూళితో నిండి దేశమంతటను నిండిపోయెనట. ధాత కరువులో జనులు లక్షల కొలదిగా తెనుగు సీమలో చనిపోయిరి. కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ అను గ్రామమందు బుడ్డా వెంగళరెడ్డి అను అపరకర్ణు డప్పుడు వెలసెను. అతడు తన సర్వస్వము కోల్పోయి అప్పులు చేసి చందాలెత్తి తన ధాన్యమునంతయు ఇచ్చివేసి వేనవేల క్షామబాధితులకు అన్నము పెట్టి రక్షించెను. నేటికిని కర్నూలు జిల్లావారా దాతను మరువలేదు.

బుడ్డా వెంగళరెడ్డి

ఉండేదే ఉయ్యాలవాడా

అని పాటలుకట్టి బిచ్చగాండ్లు పాడుతూ వుందురు. ఇట్టి దాత లింకెందరుండిరో ఆయా ప్రాంతాలవారు తెలిపితే బాగుండును. ధాత కరువులో దక్కనులో 50 లక్షలకన్న హెచ్చు మంది చచ్చిరని ఇంగ్లీషు చరిత్రకారులే వ్రాసినారు. ఈ సమీక్షా కాలములో జనుల ఆచార వ్యవహార విశ్వాసాలలో చాలా గొప్ప మార్పులు జరిగెను. ముసల్మానులు హింసామార్గములతో హిందువుల నాకర్షింప జాలినవారు కారు. హిందువులు ముసల్మానులను మరింత దూరముగా పరిహరించిన వారైరి. కాని ఇంగ్లీషువారు తమ నూతన భావాలతో హిందువులలోనే కాక ముసల్మానులలోను మార్పులను గావించిరి. కాని ముసల్మానులకన్న హెచ్చుగా హిందువులలో మార్పులు కలిగెను జుట్లు ఎగిరిపోతూ వచ్చెను. క్రాపులు బహుళమయ్యెను. బొందెల అంగీలు పోయెను. ఇంగ్లీషు అంగీతోపాటు కోట్లుకూడా వచ్చెను. టోపీలు విరివియయ్యెను. మొదట మొదట సముద్ర ప్రయాణము చేసిన వారిని బహిష్కరించిరి. తర్వాత ప్రాయశ్చిత్తముతో స్వీకరించిరి. తర్వాత ఏ యాటంకమున్నూ లేకపోయెను. వివిధ కులాల వారు కలిసి భుజించుటకు మొదలు పెట్టిరి. దీనికి హోటళ్లు దోహదమిచ్చెను. రైళ్ళు కూడా కులం కట్టుబాట్లను సడలించెను. అంతశ్శాఖా వివాహాలు, వితంతూద్వాహాలు ప్రబలెను. బాల్యవివాహాలు క్రమక్రమముగా తగ్గెను. ఇంగ్లీషు విద్యావంతులలో కొందరు ఇంగ్లీషు వేషములను సూటుబూటు కాలర్‌టై ధరించుట గౌరవ హేతువని భావించిరి.

ఇంగ్లీషు ప్రభుత్వము ప్రజల యొత్తిడియైనప్పుడే ప్రజాభీష్టము నెరవేర్చునట్టిది. సంఘ సంస్కారుల కోరికలను అప్పుడప్పుడు మన్నిస్తూ బాల్య వివాహములకు సరిహద్దులు మార్చుచూ వచ్చెను. మొదట 10 ఏండ్లలోపల బాలబాలికలకు వివాహము చేయరాదని శాసించిరి. 1890 ప్రాంతములో 12 ఏండ్ల లోపల బాల్యవివాహములు చేయరాదని శాసించిరి. 1850 ప్రాంతమందే పోస్టు (టప్పా) ఏర్పాటయ్యెను. 1853 లో తంతీలేర్పాటయ్యెను. క్రమక్రమముగా ఈ రెండు చాలా విరివిగా స్థాపింపబడెను. 1885లో రిప్పన్ గవర్నరు జనరల్ మునిసిపాలిటీలను స్థానిక స్వపరిపాలనమును ప్రారంభించెను.

టప్పా రైల్వేతంతీ సౌకర్యాలు వృద్ధియగుకొలది పత్రికలు కూడా వృద్ధియయ్యెను. కాని తెనుగు దేశములో పత్రికలవ్యాప్తి చాలా తక్కువగా నుండెను. 19 వ శతాబ్ది మధ్యకాలమందు బళ్ళారిలో 'శ్రీ యక్షిణి' అను వారపత్రిక ప్రారంభమయ్యెను. అదే తెనుగువారి మొట్టమొదటి పత్రిక. ఆంధ్ర పత్రిక వారపత్రికగా మహారాష్ట్రులుండు బొంబాయి నుండి వెలువడుట చాలా చిత్రము. కాని తర్వాత అది మద్రాసుకు మారెను. దిన పత్రికను కూడా కాశీ నాథుని నాగేశ్వరరావుగారు ప్రారంభించిరి. అది నిత్యాభివృద్ధిగా ఆంధ్రుల సేవ నేటికిని చేయుచున్నది. 1920లో కృష్ణా పత్రిక ప్రారంభమయ్యెను. అదియు అవిచ్చిన్నముగా సాగుచున్నది.

ఇంగ్లీషువారి ప్రభావము భాషపై చాలాపడెను. అదేమి చిత్రమో తెనుగులో యక్షగానాలు తప్పితే వేరు నాటకాలు లేకుండెను. 1900 తర్వాత తెనుగు కవిత కూడా నీరసమై అప్పకవీయ శాసనబద్ధమై, అష్టాదశ వర్ణనలను వెర్రిమొర్రి రోకటి పాటలతో కూడినదై, జుగుప్సాకరమైనదయ్యెను. అందు శబ్దాడంబరమే యుండెను. వచన గ్రంథాలు ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర, కైఫీయత్తులు స్థానాపతి విజయనగర కైఫీయత్తు, తంజాపురీ కవుల వచన భారతాదులు మున్నగునవి కొన్ని తప్ప మరేవియు లేకుండెను. ఇంగ్లీషు చదివిన విద్వాంసులగు కందుకూరు వీరేశలింగముగారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు, కట్టమంచి రామలింగారెడ్డిగారు, గిడుగు రామమూర్తిగారు ఆంధ్రవాఙ్మయ పంఠను త్రిప్పివేసిరి. కట్టమంచివారి కవిత్వ తత్త్వవిచారము సనాతనపు కోటలో గుండుపడినట్లయ్యెను. అది పెద్దసంచలనము కలిగించెను. వారు 1900లో ముసలమ్మ మరణము అను ఉత్తమ బలిదాన కథను కొత్తరీతుల వ్రాసిరి. నిజముగా భావకవితకు ఆతడే మార్గదర్శి యనవలెను. వీరేశలింగ ప్రతిభ సర్వతోముఖవ్యాప్తి యయ్యెను. ఆతడు నాటకాలను, ఉత్తమ వచన గ్రంథాలను, నవలలను, హాస్యములను, కవుల చరిత్రను, స్వీయచరిత్రను, ఆంగ్లగీర్వాణ భాషలందలి యుత్తమ విషయాల అనుకరణములను రచించి అపారమగు సేవను చేసెను. కొమర్రాజు లక్ష్మణరావుగారి వ్యక్తిత్వము అసాధారణమైనట్టిది. అతని పట్టుదల, నిర్వహణము, విధానము, విషయ విజ్ఞానము, దానిని పిల్లలకును అర్థమగునట్లు రచించు నేర్పు, ఇతరు లందు కానవచ్చుట అరుదు. వారును గాడిచర్లవారును, హైద్రాబాదు రావిచెట్టు రంగారావుగారును (అనగా ఉత్తర సర్కారు, రాయలసీమ, తెలంగాణా ప్రతినిధులు.) కలిసి 1907లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను హైద్రాబాదులో స్థాపించిరి. ఈ గ్రంథమాల మొట్టమొదటి ప్రచురణము గాడిచర్లవారి అబ్రహాం లింకన్ చరిత్ర, దానికి కొమర్రాజు వారు పీఠిక వ్రాసిరి. అది చరిత్రాత్మకమైనది. మనలో లేనివి కావలసినవి బంగాలీలు మరాటీలు ముందుకు చాలా దూరము సాగిపోయిన విధానము వారు చాలా చక్కగా నిరూపించిరి. వారిట్లింకను వ్రాసిరి. "భాషాభివృద్ధికి గద్య గ్రంథము లత్యంతావశ్యకంబులని మొట్టమొదట కనిపెట్టినది చిన్నయసూరి; అతడు గద్యనన్నయ. రెండవవారు కం. వీరేశలింగము; వారు గద్యతిక్కన, పూర్వ మొకప్పుడుండిన పురుషార్థ ప్రదాయిని, ఆంధ్ర భాషాసంజీవని, మందార మంజరి, చింతామణి, శ్రీ వైజయంతి, మొదలైన మాసపత్రికలును, ప్రస్తుతమున్న సరస్వతి, మంజువాణి, మనోరమ, సువర్ణలేఖ, సావిత్రి, హిందూ సుందరి, జనానా పత్రిక మొదలగు మాసపత్రికలు, ఆంధ్రప్రకాసిక, శశిలేఖ, కృష్ణా పత్రిక, ఆర్యమతబోదిని, సత్యవాది, మొదలగు వార్తాపత్రికలును తెనుగునం దొకవిధమైన యుపయోగకరమగు వాఙ్మయమును పుట్టించినవి. కాని తెలుగుబాస యొక నాగరికభాష యనిపించు కొనుటకు ఇపుడు జరిగిన ప్రయత్న మొక సహప్రాంశమెనను కాదు" మన భాషలో చరిత్రలు, కథలు, శాస్త్ర (సైన్సు) గ్రంథాలు ఏవియు లేవని వారు వాపోయిరి. ఆ యుత్తమ పీఠిక అత్యంతముగా విలువయైనట్టిది. వారెత్తిచూపిన లోపాలను తొలగించుటకై విజ్ఞాన చంద్రికా గ్రంథమాలా ద్వారా చాలా కృషిచేసి. సిద్ధ సంకల్పులైరి. మన దురదృష్టము చేత వారు 1922 లోనే మరణించిరి. వారి యనంతరము గ్రంథమాల నానాటికి తీసికట్టుగా సన్నగిలి మాయమైపోయెను.

1900 నుండి తెనుగులో ఇంగ్లీషు సంస్కృత పద్దతులపై నాటకాలు, నవలలు, వచన గ్రంథాలు, చరిత్రలు, విమర్శలు, ఖండకావ్యాలు, విరివిగా రచింపబడుతూవచ్చెను.

బెంగాలును కర్జన్ వైస్రాయి రెండు బాగాలుగా విభజించెను. హిందూ ముస్లిములను భిన్నించుటకై అత డట్లు చేసెను. అందుపై బెంగాలులో జాతీయోద్యమము తీవ్రరూపము దాల్చెను. వందేమాతరం జాతీయ గీతమయ్యెను. హింసాత్మక చర్యలతో బెంగాలీలు ప్రతిఘటించిరి. ఆ జాతీయోద్యమపు గాలి తూర్పుతీర మందలి ఉత్తర సర్కారులను తెనుగు జిల్లాలపై వీచెను. ఆ సందర్బములో "స్వదేశీ" విధానోద్యమము బయలుదేరెను. అదే సందర్బములో బందరులో జాతీయ కళాశాల స్థాపితమయ్యెను. అదొక ముఖ్యఘట్టము. మన పూర్వ సంస్కృతి యంతయు గర్వింపదగినది కాదనియు ఇంగ్లీషువారి దంతయు ఉత్తమమనియు భావించిన వారిలో కొంత పరివర్తనము కలిగెను. మన సంస్కృతిని కాపాడుకొనుచు కాలానుసరణమగు మార్పులు చేసుకొనుటయే సరి యని యీ జాతీయ కళాశాల నిరూపించెను. పూర్వకాలపు చిత్రలేఖన పద్ధతిమారెను. రంగులు మారెను. భావాలు మారెను. తెనుగుదేశమందు నూతన చిత్రలేఖన పద్ధతి కీ కళాశాలయే దోహద మిచ్చినట్టిది.

ముసల్మాను ప్రభువులలో గోలకొండ సుల్తానులలో ఒక్క ఇబ్రహీం ఖుతుబ్షాయు, అతని యుద్యోగియగు అమీను ఖానున్నూ తెనుగు భాషను పోషించిరి. ఆసఫ్‌జా వంశమువారు తెనుగు నాదరించకపోగా దానికి నిఘాతములే కల్పించిన వారయిరి. తెనుగుదేశాన్ని పాలించిన యీ ఖుతుబ్షా ఆసఫ్‌జా వంశాలవల్ల తెనుగుభాష కేమిన్ని సహాయము కలుగలేదు. ఇంగ్లీషు పరిపాలనలో ఇంగ్లీషు ప్రభుత్వము దేశములోని తాటాకు గ్రంథాలను సేకరించి మద్రాసులో ప్రాచ్యలిఖిత పుస్తకాలయమును స్థాపించి, అందు వాటినుంచి అంతరించిపోనున్న బహు గ్రంథాలను రక్షించిరి. పలువురు ఇంగ్లీషు వారు మన భాషను నేర్చుకొనిరి. అందు బ్రౌన్ ముఖ్యుడు. ఖుతుబ్షాలు, అసఫ్‌జాలు అందరినీ ఒక్క ప్రక్కపెట్తి బ్రౌనుదొర నొక్కదిక్కు పెట్టి తూచిన బ్రౌను దిక్కే త్రాసు ముల్లు సూపును. అతడు తాటాకు గ్రంథాలు సేకరించియుంచెను. వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెనుగు నిఘంటువులు రెండు రచించెను. అందొకటి వ్యావహారిక పదకోశము. నేటికిని ఇవి చాలా యుపయోగపడుచున్నవి. మెకంజీ అను నింకొకడు కైఫీయత్తులను వ్రాయించి తెప్పించియుంచెను. కాల్డ్వెల్ అను మరొకడు ద్రావిడ భాషాశాస్త్రమును వ్రాసెను. మొత్తముపై ఇంగ్లీషు భాషాప్రభావము తెనుగుభాషపై సంపూర్ణముగా పడెను. తెనుగులో బహుముఖ వికాసము కలిగెను. ఇంగ్లీషు వారు భాషతోపాటు ప్రాచీన శిల్పములను కాపాడిరి. తురకలు విధ్వంసము చేసిరి. ఇంగ్లీషువా రుద్ధరించిరి. హంపీ శిథిలాలను, అమరావతీ స్తూపాలను, ఇతర ప్రాచీన దేవాలయాలను కోటలను మరమ్మతుచేసి, దిబ్బలు త్రవ్వి, శిల్పశకలాలను బయటికితీసి, మిగిలినవాటిని విధ్వంసము కాకుండా రక్షించిరి. బ్రిటిషిండియాలోని యీవిదానమును హైదరాబాదులో అవలంబించక తప్పినదికాదు. అందుచేత తెనుగుసీమ హద్దు వరకు ఓరుగల్లు శిథిలాలు, రామప్ప గుళ్లు, పిల్లలమర్రి, పానుగల్లు (నల్లగొండ) మున్నగు తావులలోని తెనుగు శిల్పాలను రక్షింపవలసినవారయిరి.

1857 విప్లవానంతరము తెనుగుసీమలో ఉత్తర సర్కారులలోనే యెక్కువగా పురోభివృద్ధి కలిగినది. వారికంటే రాయలసీమవారు వెనుకబడిన వారు. ఆ రాయలసీమ కన్నను మరీ చాలా వెనుకబడినవారు తెలంగాణావారు. వారి పాలిట బడిన ప్రభుత్వమే వారి పురోభివృద్ధికి ముఖ్యకారణ మనవలెను.

ఆంధ్రుల 900 సవత్సరాల సాంఘిక చరిత్ర సంగ్రహముగానే తెలుపనయినది. వ్రాయదగిన విషయము లింకను కలవు. అందుకు తగిన పండితులు కృషిచేసి మన సాంఘిక చరిత్రలు వ్రాసిన మనలో సాంఘిక చరిత్రలులేని లోపము తొలగిపోవును.

         సీ. పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ
            గౌతమీ గంభీర గమనమునకు
            అలంపురీ నందనారామ విభ్రాజి
            మల్గోబఫలరాజమధురరుచికి
            ఆంధ్రీకుమారీ సమాయుక్త పరిపూత
            తుంగా వయస్సు మాధుర్యమునకు
            ఖండశర్కరజాతి, ఖర్జూర, గోక్షీర,
            ద్రాక్షాదియుత రాఘరసమునకును
            అమృత నిష్యంది వల్లకీ హ్లాదమునకు
            రాగిణీదివ్య సమ్మోహరాగమునకు
            తేనెతేటల నవకంపు సోనలకును
            సాటియగును మా తెనుగు భాషాతల్లి,
(మదీయము)

(అంధ్రీనది=తుంగభద్ర కుపనది, రామరసము=మహారాష్ట్రుల మదుర రసము. జాజికాయ, జాపత్రి, ఏలకులు, బాదాము, ద్రాక్ష, పాలు, దోస, సొర, కరెపుచ్చ మున్నగువాటి విత్తులు, సొంఠి, చక్కెర, కుంకుమ పువ్వు ఇంకా చాలావస్తువులు నూరి కలిపిన దాన్ని రామరస మందురు. అలంపూరు బనగానపల్లె రెండును ముల్లోబ, దిల్‌పసందు అను శ్రేష్ఠమగు మామిడి పండ్లకు సుప్రసిద్ధ స్థలాలు.)