ఆంధ్రుల సాంఘిక చరిత్ర/7 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

7వ ప్రకరణము

క్రీ.శ. 1757 నుండి 1857 వరకు

ఔరంగజేబు 1707లో చచ్చెను. సిరా జుద్దౌలా 1757లో చచ్చెను. ఈ 50 ఏండ్లలో మొగల్ సామ్రాజ్యము క్రమక్రమముగా క్షీణిస్తూ వచ్చెను. ఈ కాలములో మహారాష్ట్రులదే భారత దేశమందు ప్రప్రథమ శక్తిగా నుండెను. 1199 లో బెంగాలును తురకలు 18 మంది సవార్లతోనే జయించిరి: ప్రపంచ చరిత్రలో ఇంతకన్న చిత్రమగు ఘట్ట మింకొకటి కానరాదు !! 550 ఏండ్ల తర్వాత ఆ తురక సుల్తానుల సంతతివారే ప్లాసీ యుద్ధములో గొప్పపరాజయము పొందిరి. ఇంగ్లీషువారి విజయం కూడా 1199 నాటి తురకల విజయ మంతటి కారుచౌక విజయమే: (The British Victory at Plassey Was gained nearly as that of Md. Khilji. V. Smith) హిందువులపై అంత సులభముగా విజయాలుపొందిన ముసల్మానుల కేల యా దుర్గతి పట్టెను. హిందువులు నాలుగైదు నూర్లయేండ్ల అనుభవముతొకాని బుద్ధితెచ్చుకోలేదు. మహారాష్ట్రులు సహ్యాద్రి పర్వతాలలో గుర్రపు సవారీలలో, కరకుతనములో, కూలు యుద్ధములో, చాకచక్యములో, సాధన పొంది ముసల్మానులకు మంచి జవాబిచ్చిరి. కాని రాజపుత్ర సైన్యమే డిల్లీసుల్తానులకు భారతదేశాన్ని గెలిచి యిచ్చెను. అనగా వారికి మతాభిమానము దేశాభిమాన మింకను కలుగ లేదన్నమాట. తురకలు బలహీనులైరి. విషయలోలురైరి. అంతలో ఇంగ్లీషువారు భారతరంగముమీద ప్రత్యక్షమైరి. తురకలు దౌర్జన్యము, మేలైన యుద్ధతంత్రము, మతావేశము, క్రౌర్యము, మోసము, బీభత్సము తమతోపాటు తెచ్చుకొని యుండిరి. ఆ గుణాలు ప్లాసీ యుద్ధము వరకు వారిలో స్థిరముగానే యుండెను. కాని వారికి గురుస్థానమం దుండదగిన ఇంగ్లీషువారున్నూ కొన్ని గుణాలతొ దేశమందు దిగుమతి అయిరి. వారు మనదేశములో వరహాల చెట్ల నూపి రాలిన ద్రవ్యాన్ని మూట కట్టుకొని పోవుటకు ప్రధానముగా వచ్చియుండిరి. యూరోపు దేశములో మేలైన తుపాకులు, ఫిరంగులు కనిపెట్టి యుండిరి. అని వారి వెంట వచ్చెను. హిందూ ముసల్మానులు ఫిరంగులను క్రీ.శ. 1401 నుండి వాడుతూ వచ్చినను అవి కొద్దిపాటివి. ఎక్కువ పని చేసినట్టివి కావు. తుపాకులు కూడ కొద్దికొద్దిగా వాడుకలోకి వచ్చి యుండెను. కాని వాటి ప్రసక్తి వాఙ్మయములో శుకసప్తతికారుని నుండియే కానవస్తున్నది. కదిరీపతి మన్మథుడు ప్రాతకాలపు బాణాలను పారవేసి 'తమ్మిరుమ్మీ ఫిరంగీలను' చేబట్టెను. (తుమ్మిరుమ్మి ఫిరంగి దొరతురంగీ విలాసముతో అనగా చిలుక వలె) ఒక రెడ్డికోటలు నడిచెనట! శుకసప్తతి 15 వ కథ. రూం అను యూరోపు పట్టణములో ఫిరంగీలు ప్రసిద్ధముగా నుండెనేమో ? భారతీయ సైన్యమునకు క్రమవిధానమగు సాముదాయిక యుద్ధ శిక్షణము లేకుండెను. ఇంగ్లీషువారు యూనిఫారమును సిపాయీల కిచ్చి ఉత్తమ యుద్ధశిక్షణ మిచ్చిరి. వారు సంఖ్యాబలముపై ఆధారపడలేదు. శిక్షణములేని సైన్యము లక్షలున్నను దానిని క్రమశిక్షణము, మేలైన మారణ యంత్రాలు, నిపుణతకల సేనానులు కల సైన్యము వేలసంఖ్యలో నున్నను తప్పక జయించినఘట్టాలు చరిత్రలో అడుగడుగునకు కానవస్తున్నవి. ఇంగ్లీషువారు మరొకతంత్రమును వెంటదెచ్చిరి. మోసమువారి ముఖ్యాయుధము. వారు మనదేశ ద్రోహులను సృష్టించినట్టుగా తురకలుకూడ సృష్టింపజాలిన వారు కారు. భారతదేశ మందు బహు రాజుల యునికి, హిందూ ముసల్మూనుల సహజవైరము, మొగలాయి రాజ్యపతనము, అన్నియు ఇంగ్లీషువారి కనుకూలమయ్యెను. ఒకరాజు ని కొకనిపై ఉసికొల్పి సహాయపడి రాజ్యాలు సంపాదించిరి. బెంగాలును మిర్జాఫరు ద్రోహము చేతను, తమ మోసముచేతను, జయించిరి. ఈ విశిష్టతలు గుర్తుంచుకొనిన మన దేశ చరిత్రలోని మార్పులు అవగాహనమగును. ముసల్మానులు బాహాటముగా అతి క్రూరముగా కత్తితో తమ మత ప్రచారము చేసిరి. ఇంగ్లీషువారు ఉపాయముతో క్రైస్తవ మతప్రచారము చేసిరి. దక్షిణమున మలబారులో క్రీ.శ. 52లో సంత్ తామన్ అను క్రైస్తవ ఫాద్రీ మత ప్రచారము చేసెను. ఆనాటి 'సిరియన్ క్రిస్చియనులు' నేడును అచ్చట నున్నారు. ఈ విధముగా క్రీస్తుశకారంభము నుండియే మనకు క్రైస్తవ వాసన తగిలినది కాని అది అత్యల్పము. క్రీస్తుమత వ్యాప్తిని పోర్చుగీసువారు తురకలవలెనే మలబారులోను, తమిళములోను, పశ్చిమ తీరములోను చేసియుండిరి. ఫ్రెంచివారు అదే పనిచేసిరి. అబేడుబాయి (Abbe Dubois) అను ఫ్రెంచి ఫాద్రి హిందువులవలె రుమాల దోవతి అంగీ ధరించి తమిళములోని 'పరయా'లలో తిరిగి పలువురిని క్రైస్తవులనుగా చేసెను. అత డానాటి హిందూ మతమును పూర్తిగా దూషిస్తూ ఒక పెద్ద గ్రంథమే వ్రాసెను. ఘోర కులాచార భేదాలుకల తమిళ దేశపు హిందూమతము ఆ దూషణమున కర్హత సంపా దించుకొనియుండె ననవలెను. నేటికిని అచ్చట ఎక్కువగా (ఇతరత్ర తక్కువగా) కులభేదాలు, అంటు ముట్టు బాధ, అంటరానితనము కలదు. ఫ్రెంచి బోర్బను రాజులను గూర్చి వారు కొత్తది నేర్వలేదు; పాతది మరువలేదు; అన్న సామెత హిందూ మతమునకు కొంతవరకయినా వర్తించె ననవచ్చును. క్రైస్తవ మతబోధకులు పట్టుదలతో 500 మైళ్ళ దూరమునుండి సప్త సముద్రాలు సప్తఖండాలు దాటి ఆరు నెలలు ఓడలలో ప్రయాణము చేసి తల్లి పిల్లల వదలి మన దేశమందు నిలిచి మనభాషలూ అటవికుల భాషలూ నేర్చి ప్రచారము చేసి బళ్ళను వైద్యాలయాలను స్థాపించి నానాసేవలు చేసి తమ మతప్రచారము చేసినది నేటికిని భారతీయులు చూస్తూ వారి సేవలో దశాంశమయినను చేయనొల్లనివారై యున్నారు. మొత్తానికి ప్లాసీ యుద్ధానంతరము నుండి క్రైస్తవ మత వ్యాప్తికి విజృంభణము కలిగెను.

ఆర్థికస్థితి

ఈ సమీక్షాకాలములోని ఆంధ్రుల ఆర్థికపరిస్థితి యెట్టిదో కనుగొందుము. ప్లాసీ యుద్ధముతర్వాత దేశము యింగ్లీషువారి చేతుల లోనికి అతి వేగముగా పోయెను. తురకలు 1150 నుండి 1707 వరకు అనగా 600 ఏండ్లలో ఎంతబీభత్సము చేసినను పూర్తిగా దేశమును గెలువలేక పోయిరి. కాని 100 ఏండ్లలో యావద్బారతమును పూర్తిగా ఇంగ్లీషువారు గెలుచుకొనిరి. మన సమీక్షాకాలములో ఇంగ్లీషువిజేతలకు ప్రజల సౌకర్యాల సమాలోచనము కించిత్తు కూడా లేకుండెను. వారిది ప్రత్యక్ష పరీక్షాపహరణమే తమ దేశపు సరకులను ఇచ్చట అమ్ముటకై మన పరిశ్రమల నాశనము చేసిరి. మేరలేకుండా జనులు చావకుండానైన చూచుకొనక పన్నులు లాగిరి. వారి పరిపాలనములో క్షామా లెక్కు వయ్యెనని వారి సజాతీయుడగు డిగ్బీ 60 ఏండ్లనాడే వ్రాసెను. ముసల్మానులు హిందువులను దోచినదంతయు దేశమందే యుండెను. మరల క్రమముగా అదంతయు జనులకు చెందెను. కాని ఇంగ్లీషువారు వ్యాపారముద్వారా, పన్నులద్వారా, దోపీడీలద్వారా, ఉద్యోగులద్వారా గ్రహించిన దంతయు ఏడు సముద్రాలు దాటి తిరిగిరాకుండా ఇంగ్లండు చేరెను. ఇది మన ఆర్థిక నాశనమునకు కారణ మయ్యెను. 'ఉత్తర సర్కారులను రాయలసీమ అను కర్నూలు, కడప, బళ్ళారి, అనంతపురము జిల్లాలను (Ceded districts) గుంటూరు జిల్లాయు, క్రీ.శ. 1800 లోపలనే ఇంగ్లీషువారికి వచ్చెను. తర్వాత 1857 వరకు భారత దేశ మంతయు వారి వశమగుటచే తెనుగు దేశ మంతయు వారి వశ మయ్యెనని వేరుగా చెప్పనవసరములేదు. తెనుగుదేశములో ఉత్తర సర్కారులకు విశిష్టత యుండెను. అందలి నాలుగు జిల్లాలలో (విశాఖపట్టణము, ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలలో) భూమి అంతయు జమీందారుల పాలెగారు తెగకు అప్పజెప్పబడి యుండెను. ఈ జమీందార్లు మొగల్ సుల్తానులకు కప్పము కట్టి ఇంచుమించు రాజులై వర్తించిరి. పెద్దాపురము జమీందారు మొగలాయి రాజ్యానికి 37000 పౌనులు (3 లక్షల 70 వేల రూపాయలు) కప్పము కట్టుచుండెను. ఈస్టిండియా కంపెనీవారు అతనివద్ద 5 లక్షల 60 వేల రూపాయీల కప్పములాగిరి. అదేవిధముగా ఇతర జమీందారుల పన్నులను హెచ్చించిరి. ఉత్తర సర్కారులలో 31 జమీందారీ లుండెను. అప్పటి కాలములో సర్కారు జిల్లాలను చికాకోలు, (శ్రికాకుళం) రాజమండ్రి, ఎల్లూరు, కొండపల్లి అని పేర్కొనిరి. అవి మొగల్ సుల్తానులనుండి 1765 లో ఇంగ్లీషువారు తీసుకొనిరి. కంపెనీవారు ఉత్తర సర్కారుల స్థితిగతుల నొక కమిటిచే విచారింప జేసిరి. వారు 1788 లో తమ నివేదికను సమర్పించుకొనిరి. దానినిబట్టి కొన్ని వివరాలు తెలియవచ్చెను. కొందరు జమీందారులు ఓడ్రరాజుల సంతతివారని తెలియ వచ్చెను. ఉత్తర సర్కారుల జమీందారులకు హవేలీలు అను సొంత భూములుండెను. ఈజమీందారీలలో సాముదాయిక వ్యవసాయ పద్దతి (Village Communities) ఉండెను. ప్రతి గ్రామానికి పన్నిద్ద రాయగాండ్లుండిరి. రెడ్డి, కరణము, తలారి, తోటి, నేరడి, పురోహితుడు, బడిపంతులు జోసి, వడ్ల, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వైద్యుడు, బోగముది అందు చేరి యుండిరి. ఈ ప్రాచీన గ్రామ జీవనవిధానమును కంపెనీవారు నాశనము చేసిరి. ఉత్తర సర్కారులలో బెంగాలులో వలె 1802 లోను 1805 లోను శాశ్వత భూమి పన్ను విధానమును (పర్మనెంటు సెటల్మెంటు) ఏర్పాటుచేసిరి. ప్రజల పంటలో మూడింట రెండుపాళ్లు పన్నుగా నిర్ణయించిరి. హవేలీ భూములను జమీందారులకే వేలం వేసి యిచ్చివేసిరి.' (India under early British rule by Romesh Dutt, chapters VI&VII) మద్రాసు సూబాలో ఉత్తర సర్కారులు కాక యితర జిల్లాలలో రయితువారీ పద్ధతిని ప్రవేశపెట్టిరి. దీనికి ముఖ్యకారకులు సర్ తామస్ మన్రోగారు ఆ కాలపు ఇంగ్లీషువారిలో అత డుత్తమోత్తము డనిపించుకొన్నాడు. అతడు మద్రాసు సూబాలో 24 ఏండ్లుండినాడు. తుది సంవత్సరాలలో రాయలసీమకై చాలా పాటుపడినారు. అతడు కలరా తగిలి కర్నూలు జిల్లాలోని పత్తికొండలో 1827 లో చనిపోయెను. అతన్ని రాయలసీమ ప్రజలు చాలా ప్రేమించిరి. పలువురు మన్రో అయ్య అని తమ పిల్లలకు పేరు పెట్టుకొనిరి. మన్రో సూచించిన పద్ధతియే యిప్పటి పట్టాదారు పద్ధతి. పూర్వము భూముల గుత్తేదారులుండిరి. ప్రభుత్వానికి రైతులతో సంబంధము లేకుండెను. ప్రభుత్వానికి నేరుగా రైతుల సంబంధ ముండునట్లు రైతులకు తమ భూములపై సంపూర్ణ క్రయ విక్రయాది స్వత్వము లుండునట్లును మన్రో రయిత్వారీ పద్ధతి నిర్ణయించెను. మన్రోకు ముందు కంపెనీవారు రైతుల పంటలో సగముకన్న హెచ్చుగా పన్నులుగా గ్రహించుచుండిరి. మన్రో దానిని తగ్గించెను.

తెనుగు జల్లాలలో రయిత్వారీ పద్దతి మనకంతగా తెలియదు. రొమేశదత్తు ఇట్లు ఒకటి రెండు తెనుగుజిల్లాల ముచ్చట తెలిపినాడు.

"నెల్లూరుజిల్లా కలెక్టర్ కోవూరును రయిత్వారీ విధాన పరీక్షకై నిర్ణయించెను. 1818లో అచట భూముల కొలిపించి బందోబస్తు చేయించెను. తరీ (మాగాణీ) భూములలో వరిఖండికి 20 రూపాయల ధర నిర్ణయించిరి. దాని ప్రకారము బందోబస్తు అయిన భూమి పంట విలువ 34374 రూపాయలు. దాని నుండి ఎప్పటివలెనే 'క లవసం నూటికి ఆరుంబావు ప్రకారము తీసివేసిరి. అనగా 2234 రూపాయలు తొలగించిరి. మిగిలిన 32139 రూపాయలు సర్కారున్నూ, రైతులున్నూ పంచుకొనవలసి యుండెను. రైతులకు 20 పాళ్ళలో 9 పాళ్ళు అనగా నూటికి 45 పాళ్ళు ఇచ్చిరి. ఆ లెక్కచొప్పున రైతులకు 14462 రూ. సర్కారుకు 17667 రూ. వచ్చెను. మెట్ట పొలాలలో (ఖుష్కీ)లో ఖండి 28 రూ.లు బజారుదర ప్రకారం లెక్కగట్టి పై విధముగా విభజింపగా సర్కారుకు 768 రూ. వచ్చెను. మొత్తముపై కోవూరు గ్రామము భూములనుండి ప్రభుత్వానికి 15600 రూ. పన్ను వచ్చునని తేల్చిరి. అనగా పంటలలో సగము ప్రభుత్వము తీసుకొనెను. Chapter IX P. 154. పూర్వము గ్రామాలలో పన్నిద్ద రాయగాండ్ల కెంత భాగమిస్తుండిరో తెనుగు సీమలోని వివరాలు తెలియవు. కాని బుకాసన్ అనునతడు క్రీ.శ. 1800 లో బెంగుళూరులోని ఒక గ్రామములోని వివరాల నిచ్చినాడు. దాన్నిబట్టి మన తెనుగు దేశములోని విధానము నూహించుకొన వచ్చునని యుదాహరిస్తున్నాను.

గ్రామం మొత్తము సేద్యమువల్ల 2400 సేర్ల ధాన్యముకుప్ప అయ్యెను. దానినుండి ఈ క్రింది ఆయాలిచ్చిరి.

పురోహితుడు 5 సేర్లు
దర్మాలు 5 సేర్లు
జోసి 1 సేర్లు
బ్రాహ్మణుడు 1 సేర్లు
మంగలి 2 సేర్లు
కుమ్మరి 2 సేర్లు
కమ్మరి 2 సేర్లు
చాకలి 2 సేర్లు
సరాపు (ధాన్యం కొలుచువాదు) 4 సేర్లు
Beadle 7 సేర్లు
రెడ్డి 8 సేర్లు
కరణం 10 సేర్లు
తలారి 10 సేర్లు
దేశముఖు 45 సేర్లు
దేశాయి 45 సేర్లు
నేరడి 20 సేర్లు
మొత్తము 169 సేర్లు.

అనగా నూటికి అయిదుంబావు భాగముతో గ్రామస్థులకు చాకలి, కుమ్మరి, కమ్మరి, తలారి, మంగలి, వడ్ల మున్నగువారి సేవలు లభించుచుండెను. మిగత ధాన్యములో గుత్తేదారు నూటికి 10 పాళ్ళు తీసుకొనెడివాడు. మిగిలిన దానిలో ప్రభుత్వమునకు సగమిచ్చి తక్కిన సగము రైతులు పంచుకొనెడివారు. (Chapter XII. Romesh Dutt.) తెనుగు దేశమును గురించిన వివరాలు ఈ గ్రంథమునుండి తెలియ రాలేదు. (మైసూరు, తమిళము, మలబారు జిల్లాల గూర్చివిరివిగా ఇందు వ్రాసినారు).

1813 లో పార్లమెంటులో ఇండియానుగూర్చి విచారణ చేస్తూ మన్రోను ఈ దేశ పరిస్థితులను విచారించగా అతడిట్లు చెప్పెను. 'సగటున ఇండియాలో వ్యవసాయపు కూలీలకు నెలకు 2 రూపాయీలనుండి 3 రూపాయీల కూలీ దొరకును. ఒక్కొక్క కూలీకి సంవత్సరానికి జీవన భృతికి 9 నుండి 13-8-0 రూపాయీల వరకు వ్యయమగును. జనులు గట్టి మోటు కంబళ్ళను నేసి వాడుకొందురు. అవి చాలా చౌక కాన ఇంగ్లీషు ఉన్ని కంబళ్ళు వారు కొనజాలరు. భారతీయులు ఉత్తమ పరిశ్రమ కలవారు. తెలివితేటలు కలవారు. మేలైన ఇంగ్లీషు పరిశ్రమల అనుకరింప గలవారు..' ఆ దేశములో స్త్రీలు బానిసలవంటి వారు కారా?' అన్న ప్రశ్నమునకు మన్రో యిట్లనెను. 'మన స్త్రీల కెంత పెద్దరికము కుటుంబములో కలదో వారికినీ అంతే కలదు.' 'మన వ్యాపారము వల్ల హిందువుల నాగరికతను వృద్ధిచేయవచ్చుకదా' అన్న ప్రశ్నమునకు మన్రో ప్రసిద్ధమగు ప్రత్యుత్తర మిట్లిచ్చెను. 'హిందూ నాగరికత అంటే యేమిటి? సైన్సలో, రాజ్యతంత్రములో, విద్యలో మనకంటే వారు తక్కువే, కాని ఉత్తమ వ్యవసాయ పద్ధతి, సాటిలేని వస్తు నిర్మాణ నిపుణత, జీవిత సౌఖ్యమునకు కావలసిన వాటిని సమకూర్చుట. ప్రతి గ్రామములో పాఠశాలను స్థాపించుట, దానము ఆతిథ్యము ఇచ్చుటలోని వితరణ, స్త్రీలను గౌరవించి సంభాషించుట, అనునవి నాగరికతా లక్షణాలైతే హిందువులు యూరోపు జాతుల కెవ్వరికినీ తీసిపోరు. ఇంగ్లండు ఇండియాలకు నాగరికతయే వ్యాపార వస్తువైన మన దేశమే దాని దిగుమతి వల్ల లాభము పొందగలదు.' మన్రో ఒక శాలువను ఇండియాలో కొని ఏడేండ్లు వాడుకొన్నను అది కొత్తదాని వలెనే యుండెను. కాన 'నాకు ఇంగ్లండు శాలువలు బహుమతిగా నిచ్చినను వాటిని తీసికొనను.' అని తన దేశ పరిశ్రమల హైన్యమును ప్రకటించెను.

స్ట్రాసీ (Stracey) అనునత డదే విచారణ సమితి యెదుట యిట్లు చెప్పెను. 'మనము హిందూస్తానీ పరిశ్రమల నాశనం చేసినాము. ఇప్పుడు భరతదేశము కేవలము భూమిపైననే ఆధారపడినది. నేటికిని (1813లో) ఇండియా పట్టునూలు బట్టలు ఇంగ్లండులో మన సరకులకంటే నూటికి 60 పాళ్ళు తక్కువధరల కమ్మును. అందుచేత మన ప్రభుత్వము వాటిపై నూటికి 70 లేక 80 పాళ్ల సుంకము వేసియో లేక అమ్మకుండా నిషేదించియో వారిని నష్టపెట్టుచున్నది. ఇట్లు చేయకుండిన మన మిల్లులు మూతబడి యుండెడివి.'

మన్రో యిట్లనెను. 'మద్రాసు సూబాలో కంపెనీవారు సాలెవాండ్లను పిలిచి బలవంతముగా కారుచౌకగా తమకు బట్టలు నేసి యిచ్చునట్లు బాధించి ఒప్పందములు చేసిరి. వారు బట్టలు నేయుటలో ఆలస్యము చేసిన కంపెనీ నౌకర్లు వారిపై కావలియెక్కి దినము ఒకఅణా జుర్మానాను తీసుకొని పైగా బెత్తాలతో సాలెవారిని కొట్టి బాధించెడి వారు. (Chapter 14.)

ఇంగ్లీషువారు ప్లౌసీ యుద్ధముతో బెంగాలును 1760 లో వండి వాష్ యుద్ధముతో మద్రాసు సూబాను ఆక్రమించుకొన్న తర్వాత కూడ హిందూస్థానమునుండి భారతీయులు తమ సరకులను ఇంగ్లండుకు అమ్ముటకై తమ ఓడలలో తీసుకొని పోయిరి. అప్పుడు తేమ్సు నదిలో మన ఓడలను ఇంగ్లీషువారు చూచి తేమ్సుకు నిప్పంటుకొనెనా అన్నట్లు రిచ్చవడి మన యోడలను చూచిరట : భారతీయులే - మన బానిసలే - మన దేశములోనే తమ యోడలలోనే మనకు పోటీగా వ్యాపారం చేస్తారా ? అన్న యాగ్రహము కలుగగా కొన్ని యేండ్లలో మన ఓడలు మన పరిశ్రమలు మన సంపద అన్నియు మాయమై పోయెను. జనులకు భూములే మిగిలెను.. కాని వాటి ఫలితములో సగము అంతకంటే యెక్కువ పన్నుల పేరుతో కంపెనీవారు లాగుకొనిపోయిరి.

'1764 నుండి 66 వరకు ఇంగ్లీషు సరకుల వ్యాపారము ఏటేట ఇంచుమించు 22 లక్షల 30 వేల రూపాయలదై యుండెను. 1780 లో 35 లక్షల 50 వేల దయ్యెను. 1785 లో ఇంగ్లండులో ఆవిరి యంత్రములు ప్రారంభమయ్యెను. ఆ సంవత్సరం మన దేశానికి 85 లక్షల 50 రూపాయీల సరకు పంపిరి. 1790 వర కది 1 కోటి 20 లక్షలవరకు పెరిగెను. 1800 వరకు అంత నాల్గంతలయ్యెను. 1809లో 10 కోట్ల 84 లక్షల రూపాయీల సరకు మనదేశానికి దిగుమతి యయ్యెను. 1793 లో పార్లమెంటు నివేదికలో ఇట్లు వ్రాసిరి. 'హిందూస్థానమందలి ప్రతి దుకాణములో ఇంగ్లీషు మల్లు బట్టలనే అమ్ముచున్నారు. అవి దేశి బట్టల దరలో నాల్గవ వంతుకే అమ్ముచున్నారు. (History of India-Rush Brook Willims. III. P. 132-3.) యంత్రయుగ మేర్పడుట, ఇంగ్లీషు వారు మన దేశమును వశపరచుకొనుట, మన పరిశ్ర మలు నాశనమగుట, అన్నియు ఈ కాలమందే జరిగెను. ఈ దెబ్బనుండి మనము నిన్న మొన్నటి వరకు కోలుకొన్నవారము కాము. మనలను ఇంగ్లీషువారు కోలుకోనిచ్చినవారు కారు. ఈ సమీక్షా కాలములో మొగలాయి రాజ్యముకన్న కంపెనీ రాజ్యమే ఘోరమైనదయ్యెను.

ఆచారములు

క్రీ.శ. 1757 నుండి యింగ్లీషు ప్రభుత్వము స్థిరపడుతూ వచ్చెను. దేశములో తీవ్రమగు మార్పులు ప్రారంభమయ్యెను. ముసల్మానుల ప్రభావము తగ్గినకొలది ఇంగ్లీషువారి ప్రభావము దేశముపై దేశజనుల ఆచారాలపై ఎక్కువగుతూ వచ్చెను.

కూచిమంచి తిమ్మకవి క్రీ.శ. 1750 తర్వాతవాడు. అతడు తన కుక్కుటేశ్వరశతకములో ఇట్లు విచార పడెను.

       'వేదశాస్త్ర పురాణ విద్యలక్కరగావు పరిహాస విద్యలు పనికివచ్చు
        గద్యపద్య విచిత్రకవితలు కొరగావు గొల్లసుద్దులకతల్ పెల్లుమీరు
        దేశీయ భాషలతీరు లేమియుగావు పారసీకోత్తులు ప్రణుతి కెక్కు
        శైవవైష్ణవ మతాచారంబు లొప్పవు పాషండమతములు పాళినలరు.'

గువ్వల చెన్న శతకము "గువ్వల చెన్నడను గొల్లవాడు రచించెనని కొందరు చెప్పుదురు. కవి పదునేడవ శతాబ్దాంతమున ఉండవోపు" అని వావిళ్ళ పీఠికలో కలదు. అనగా కవి క్రీ.శ. 1600 నుండి 1700 లోపల నుండెనని వారి అభిప్రాయము.

        గొల్లింట గోమటింటను తల్లియు దండ్రియు వసింప దాను వకీలై
        కీళ్ళ మదమెక్కి నతనికి గుళ్లయినం గానరావు గువ్వలచెన్నా!

అని కవి గొల్లవాడైన వ్రాసియుండడు.

కవి బ్రాహ్మణుడు కాడనియు రాయలసీమవాడు కాడనియు ఈ క్రింది పద్యము తెలుపుచున్నది.

         వెల్లుల్లి బెట్టి పొగచిన పుల్లని గోంగూర రుచిన బొగడగ వశమా
         మొల్లముగ నూని వేసుక కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా!

రాయలసీమవారు గోంగూర అనరు; పుంటికూర అందురు. ఉల్లిగడ్డ తినిన బ్రాహ్మణులు దానిని బయట పెట్టుకొనరు!

                       "కలిసి షికారునెపంబున"

అని షికారు పదమును వాడుటచే ఇతడు స్పష్టముగా ఉత్తరసర్కారు వాడని తేలిపోయినది.

        "ప్లీడరులమని వకీళ్ళీ వాడుక చెడ స్వేచ్చ దిరిగి పాడు మొగములన్
         గూడనివారిం గూడుచు గూడెముల జరింత్రుముందు గువ్వలచెన్నా!'

        'ధనమైనంతట భూముల తనఖాలను విక్రయములు తరువాత సతీ
         మణిభూషణాంబరమ్ములు గొనుట యవి లక్షణములు గువ్వలచెన్నా!'

అను పద్యములోని ప్లీడరు పదముచేతను భూమి తనఖాలు (మార్టుగేజ్) అను పదముచేతను కవి క్రీ.శ. 1800 - 1850 ప్రాంతము వాడని స్పష్టము. కావున ఈ కాలములోని ఆంధ్రుల స్థితిని ఈ శతకము కొంతవరకు మనకు తెలుపుచున్నది.

         అంగీలు పచ్చడంబులు సంగతిగను శాలు జోడు సరిగంచుల మేల్
         రంగగు దుప్పటులన్నియు గొంగడి సరిపోలవన్న గువ్వలచెన్నా!

అంగీలు బాగా వ్యాప్తిలోనికి వచ్చెను. కాని గొంగడిని మరచిపోవద్దని చెన్నడు బోధిస్తున్నాడు.

        అల్పునకు నెన్ని తెల్పిన బొల్పుగ నిల్వవని పేడబొమ్మకు నెన్నో
        శిల్పపుబను లొనరించిన గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!

పేడబొమ్మల పరిశ్రమ మన వారికి ప్రాతదే. ఇంకా ఇంగ్లీషు బొమ్మలు దిగుమతి కాలేదన్నమాట.

జనులలో మొగలాయి వేషాలు పోయినవని కవి విచారపడినాడు.

       పాగా లంగరకాలును మీగాళ్ళనలారం బంచె మేలిమికట్టుల్
       సాగించు కండువాల్పయి కోగా యిక గానమెన్న గువ్వలచెన్నా!

క్రీ.శ. 1600 - 1750 లో క్రమక్రమాభివృద్ధిగా దేశమందు వ్యాపించి పోయిన పొగాకు ఈ సమీక్షా కాలములో మరింత వృద్ధికి వచ్చెను. కవులు దాని యశోగానము చేసిరి. అనేక చాటువులు బయలుదేరెను.

           "దంతలూటీ ఘోరదంతి హర్యక్షంబు
            కుష్ట రోగాచల కిలిశధార.......

మొదలగు పద్యాలను చూచిన విశదమగును.

(చూడుడు చాటుపద్యమణిమంజరి. పుటలు 190 - 192) భాషీయ దండకమును రచించిన కవి గండ్లూరి నరసింహ శాస్త్రి క్రీ.శ. 1800 ప్రాంతములో కర్నూలు మండలములో ఉండినట్టివాడు. అప్పటి జనుల ఆచార వ్యవహారములను చక్కగా ఈ దండకము విశదీకరించును. నంబి యెదురువస్తే పనిచెడుతుంది అని జనుల విశ్వాసము నాటికి నేటికి కలదు. అదే మాటను ఇతడిట్లు చెప్పినాడు.

       'తొల్త పెండ్లిండ్లకున్ తర్లి పొయ్యేటి వారందరున్
        ముందుగా మమ్ము ప్రార్థించు చున్నారు మమ్మెందు
        సేవించి కార్యార్థులై పోయినా వారి కాపొద్దు
        వైకుంఠ యాత్రాసమంబైన సౌఖ్యంబు సిద్ధించు'

పొగాకును చుట్టగా త్రాగుటయేకాక పొగాకుకాడ పుల్లలను పొగాకు మొద్దుల చూర్ణాన్ని కర్నూలు కడపలోని పనిపాటలవారు నోట్లో వేసుకొను ఆచార మిప్పటికినీ కలదు. ఈ కవి యిట్లు వర్ణించినాడు.

       ఇంగ గొల్లేశ మొస్తుంది నోట్లోకికొంచెం పొగాక్పుల్ల గిల్పెట్టి........పోరా
       పొగాక్పుల్ల కేయాడ కొట్టించుకొంటావురా బాలకిన్నేశగాడా యటంచున్ వినోదంబుగా

       గూడెపున్ దాసరుల్ గుంపుగూడాడగా'

రాయలసీమలో పిల్లలపద్యాలు కొన్ని ప్రసిద్ధిగా నుండి యుండును. వాటి మొదటి పాదము మాత్రము కవి యిట్లు సూచించినాడు:

           "చెప్పాలవో చెప్పితే లడ్డులప్పాల్ గొని
            త్తావుగా" - 'శేతిలో యన్నముద్దొత్తు,'
            "శంగల్వ పూదండ" సెప్పేమరి

ఆ పిల్లవాడిట్లన్నాడు "చేతిలో వెన్నముద్ద" అను పద్యము నాకు వచ్చును. "చెంగల్వపూదండ" అనేది నీవు చెప్పుము. "చేతిలో వెన్నముద్ద-చెంగల్వపూదండ" అన్న పద్యమును వృద్ధు లీ విధముగా తెలిపినారు.

       'చేతిలో వెన్నముద్ద చెంగల్వపూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి
        సందిటి తాయెతుల్ సరిమువ్వ గజ్జెలు చిన్న కృష్ణమ్మ నిన్ను నే జేరికొలుతు'

పై పద్యములో మొదటి మూడు పంక్తులు సీన పద్య పంక్తులు. తుదిగీటు తేటగిత, ఇద్దరు భిన్న ప్రాంత వ్యక్తులు నా కీ పద్య మంతేయని చెప్పిరి. తప్పో ఒప్పో ఈ పద్యమే తెనుగు దేశమందు బహుప్రాంతములలో ప్రచారమం దుండెనన్నమాట.

పల్లెటూళ్ళలో "లేహాలు, బస్పాలు, సూర్నాలు, తైలాలు" దొంగ వైద్యులు అమ్ముకొని జనులను మోసగించేవారు. ఇప్పటికినీ ఈ పని జరుగుతూనే ఉన్నది. నాటు వైద్యుల మోసాలను ఈ కవి చక్కగా వర్ణించినాడు.

హంసవింశతిని రచించిన అయ్యలరాజు నారాయణా మాత్యుడు క్రీ.శ. 1800-1850 ప్రాంతమువాడు. అతని గ్రంథ మా కాలములోని జనుల ఆచార వ్యవహారములను తెలుపునట్టి ఒక గని. అతడు కర్నూలు మండలము వాడందురు. గ్రంథాంతములో అతడు కందనూలు, గద్వాల, పాలవేకరి, రామళ్ళకోట, నెల్లూరు, కంభము, మార్కాపురము, వినుకొండ మొదలయిన తెనుగు సీమలోని స్థలాలను పేర్కొన్నాడు. ఆ ప్రాంతాలలోని జనుల ఆచారాలను కవి యెక్కువగా గమనించిన ట్లూహింపవచ్చును. హంస వింశతి నుండి మనకు తెలియవచ్చు కొన్ని విషయములను ఇందుదాహరింతును. తెనుగు దేశములో చాలా నాడులు ఏర్పడెను. అందు కొన్నింటిని ఈ కవి యిట్లు తెలిపినాడు.

        క. వెలనాడు వేంగినాడును పులుగులనా డ్పాకనాడు పొత్తపినాడున్
           కలమురికినాడు రేనా డలయక కనుగొంటి నచటియబలల గంటిన్.

చెన్నపట్టణము, బందరు మంచి వ్యాపార స్థలాలని కవి తెలిపినాడు. గుల్బార్గాలో జంఖాణాలు, బందరులో చీటిబట్టలు, అస్తరులు సిద్ధమగు చుండెనని కవి తెలిపినాడు.

నారాయణకవినాటి కాలములో కొన్ని కులాల ఆచారాలు వ్యక్తమగు చున్నవి.

         "కాపు గుబ్బెత లెసటికై కుండలరయ" (1-137)

కాపువారిలో వంటలకు కుండలే యెక్కువగా వాడు ఆచారము. ఆనాడు గోల్కొండ వ్యాపారులలో కరణీకము చేయువారి వేషాలను కవి యిట్లు వర్ణించెను.

      మెలిబెట్టి చుట్టిన తెలిపైఠిణీపాగ చెవిసందిపాగలో జెక్కుకలము
      తొడరిన నెరిచల్వనడరు నంగీజోడు జీరాడు నడికట్టు చెరగుకొనలు
      పదతలంబుల నెర్రపారు పాపోసులు చెక్కుగా జంక చీటీఖిలీతి
      నడికట్టులో మొల విడిన ఖలందాను హస్తాగ్రమున వ్రేలు దస్తరంబు

          మించు బాహువుమీద కాశ్మీరశాలు
          చెవుల ముత్యాలపోగులు చెలువుదనర
          అలతి నీర్కావి దోవతి యమర నటకు
          పారుపత్యంబు సేయు వ్యాపారి వచ్చె (2-30)

      కాపువారిలోని కొన్ని శాఖలను కవి యిట్లు తెలిపినాడు.

          పంట, మోటాటి, పెడగంటి, పాకనాటి,
          అరవెలమలాది కొండారె, మొరుసుగోన,
          కొణిదెకాపులు, మొదలైన క్షోణిదనరు
          కాపులకునెల్ల మిన్న యక్కాపుకొకుకు, (4-136)

సెట్టి బలిజిల వేష మెట్టిదనగా :

     సరిపెణతోడిసజ్జ బలుసందిటి తాయెతు లింగవస్త్రముల్
     నరిగె చెరంగుపాగ విలసన్మణి ముద్రిక లంచుకమ్ములున్
     మెరుగులు గుల్కు దోవతియు, మిన్నగు నీలపు పోగుజోడు బి
     త్తరపు విభూతి రేఖలరుతన్ రుదురాచ్చలు గల్గి భాసిలున్. (5-99)

     సెట్టి బలిజెలు ఎద్దులపై ఎక్కి పోవుచుండెడివారు. (5-100)

తెల్లవారగానే గొల్లవారు మజ్జిగ చిల్కుచుండిరనియు, 'కాపు కూతులు తెలియావ నాళములు ద్రొక్కగ జేయుచుండి' రనియు కవి తెలిపినాడు. (1-195)

గొల్లసుద్దులు చెప్పు గొల్లజాతివారు కొంద రుండిరి. వారు కృష్ణలీలలను, కాటమరాజుకథను ప్రధానముగ చెప్పుచుండెడివారు. (2-88) నారాయణ కవి కాలములోని కొన్ని కులాలవారును కొన్ని వృత్తుల వారును ఇప్పుడు మనకు కానరారు. వారిలో కొందరిని గురించి కవి యిట్లు తెలిపినాడు.

'కోమటి, కమ్మ, వెలమ, వెంకరి, పట్ర, గొల్ల, బలిజ, కుమ్మర వారును; పలగండలు, బెస్తలు, చిప్పెవారును; కమ్మరి, వడ్రంగి, కాసె, కంచర, అగసాలవారును; అణికారి, వడసాలె, సాలె, సాతు, సాతీన, సాతాని, కటిక వారును; ఘటియకార, చిత్రకార, నిమిత్తకారులును; భట్లు, జెట్లు, జాండ్ర, తొగట, గాండ్ల వారును; వందిమాగధ, వైతాళిక, జైన, ఘూర్జర, కర్ణేజి, ఖాయతిలహడి, గౌడమిశ్రులును; బేహరి, భణియ, ఛటిక సృగాలక, ఖత్రిజాతులును; బోయలు, యెరుకలు, చెంచులు, యేనాదులు, జిలగిరి, వానె, వన్నెగట్టు, తంబళి, యీడిగె, మేదర వారును; వీరముష్టులు, మాష్టీలు, ఒడ్డె యుప్పరులును, అసిదార కరబ్బాటు మైలారి, మన్నెరి, తలారులును; తురక, పింజారి, విప్రవినోదులును; జాతికర్త, దొమ్మరి, డొమిణి, బొమ్మలాటవారును; దాసళ్లు, తెరనాటకపు జంగాలు, బిద్దెమువాండ్రు.......ఇంకా ఎన్నెన్నో వృత్తుల వారిని తెలిపియున్నాడు. (3-28)

నారాయణకవి కాలమునాటికి పాతవేషాచారములు కొన్ని పోయి కొత్తవి పొడసూపినవి. టోపీలు మెల్ల మెల్లగా మనవారి నెత్తికెక్కెను. శ్రీనాథుని కాలములోని కుల్లాయియే టోపీ అయ్యెనా? లేక ఈనాడు కొందరు ధరించు (Felt Cap) ఫెల్టు టోపీలా ? అని తెలియరాదు. టోపీ అను పదమును, ఈ కవి విరివిగా వాడినాడు. 'ముఖఘర్మముల టోపీ మునుగ జుట్టిన వల్లెకోనలు మరు లౌల్యమున హరింప' (1-172)

అని ఒక బ్రాహ్మణుని వేషమును వర్ణించినాడు.

డుబుడక్కివాని వేషము ఆనాటినుండి యీనాటివరకు ఏమిన్ని మారినట్లు కానరాదు.

           నొసలుపై చుక్కల మిసిమినామపు రేఖ
           లనువొంద భుజముపై నసిమిసంచి
           వాలు వీనుల గాజు నీలాల పోగులు
           పైనొప్పు పొప్పుళి పచ్చడంబు

           మెలిగొన జుట్టిన తలపాగ చెరగుంచి
           పై లపేటా చుట్టు పట్టుశాలు
           కడిమి మీరగ చంకనిడిన బొట్టియకోల
           డాక మ్రోసెడు డుబుడుబుక్క కేల. (2-28)

తాటాకులపై గంటములతో వ్రాయుట 100 యేండ్ల క్రిందటి వరకు మనదేశమందు విరివిగా ప్రచారమందుండినను శ్రీనాథుని కాలము వరకే కాగితాలపై మసితో వ్రాయు ఆచారము ప్రారంభమై యుండెను.

         'దస్త్రాలున్ మసి బుర్రలున్ కలములున్
          దార్కొన్న చింతంబళుల్‌'

అన్న శ్రీనాధుని చాటువునుండి పై విషయము విశదమయినది. హంసవింశతి కాలములో 'దవతి', 'శాయి' మరింత వ్యాప్తిలోనికి వచ్చెను.

          రసికుడైనట్టి కాలంపు రక్తవాను
          తనర బ్రహ్మాండమును పెద్ద దవతిలోన
          శాయినిండార బోసిన చందమునను
          కారుతిమిరంపు గుంపు నిండారబర్వె.

(దవతి యనునది దవాత్ అను ఫార్సీ పదము; మసిబుర్ర అని యర్థము శాయి అనునది సియామ్ అను ఫార్సీ పదము. నల్లనిరంగు అని యర్థము. ఈ రెండు పదాలను తెలంగాణా వారు విశేషముగా వాడుచున్నారు.)

హంసవింశతిగ్రంథాదిలోనే నానావిధములగు ఉపాహారములను భక్ష్యములను పిండివంటలను, చిరుతిండ్లను బేర్కొన్నాడు. అదొక పెద్ద పట్టిక యగుటచే ఉదాహరించుటకు వీలులేదు. (1-105)

ఇంకా గంటలుచూపు పాశ్చాత్య గడియారములు వచ్చి యుండలేదు. హంసవింశతికారుని కాలములో విజ్ఞులు ఎండలో పాదచ్ఛాయను కొలిచి కాలమును గుర్తించుచుండిరి. పెద్దపెద్ద పట్టణములలో గడియలను కొట్టు ఏర్పాటుండెను.

           'అస్తమయము కాదటంచు పాదచ్ఛాయ
            లొనరించి వ్రేళ్లెంచికొనుచు

           యూర గడియార మిడలేదోయని
           వీధి వీధి వెంబడి వెదకిచూచు' (3-156)

పైన గడియార మనునది గడియను తెల్పునట్టిదే. గంటలు తెలుపు పాశ్చాత్య గడియారా లింకా దిగుమతియై యుండులేదు.

నారాయణకవినాటి జనుల వినోదములు కొన్ని యిట్లుండెను. రంగులు వేసి చిత్రపటములు వ్రాయు వా రుండిరి. సంపన్నుల యిండ్ల గోడలమీదను, దేవాలయపు గోడలమీదను చిత్తరువులు వ్రాయుచుండిరి.

           హరిత హారిద్ర కృష్ణరక్తావదాత
           శబల పాటల ధూమల శ్యామకపిల
           వర్జములగూర్చి చిప్పల వాగెలునిచి
           చిత్తరువు వ్రాయు గుళ్ళలో చిత్రమనుడు. (3-8)

150 ఏండ్ల క్రిందట మన తెనుగువారి ఆటలనుగూర్చి కవి విపులముగా ఒక పెద్ద సీసమాలికలో ఆట లన్నింటిని ఒకపట్టికగా చేర్చి తెలిపినాడు. అందు సగముకంటె ఎక్కువ ఆట లెట్టివో మన కిప్పుడు తెలియరాదు. ఎవరైనా శ్రమచేసి పరిశోధనలు చేసి ఈ ఆట వివరములను అన్నింటిని వర్ణించి వివరించి ఒక చిన్న గ్రంథముగా వ్రాసిన బాగుండును. కవి తెలిపినవి కొన్ని యెట్టివనగా

          'దూచియు జాబిల్లి బూచికన్నులకచ్చి
           గుడిగుడి కుంచంబు కుందెనగిరి
           చీకటి మొటికాయ బింతాకు చుణుదులు
           పులియాటలును చిట్ల పొట్లకాయ
           తూరనతుంకాలు తూనిగ తానిగ
           చిడుగుడు మొకమాట చిల్లకట్టె
           దాగిలిమూతలు తమబిల్ల యాలంకి
           గుప్పట గురిగింజ కొండకోతి
           చిక్కణబిల్లయు జెల్లెను గొడుగును
           బిల్లదీవులు లక్కిబిక్కిదండ
           గడ్డెరబోడి యొక్కసి కొక్కుబరిగాయ
           పోటు గీరనగింజ బొంగరములు.' (3-147)

ఇట్టివి చాలా వ్రాసినాడు. అదంతయు ఉదాహరించుటకు వీలులేదు అభిలాషులు ఈ సీసమాలికలు పూర్తిగా చదువుకొనగలరు.

చాలామంది యిండ్లముంగిటి భాగాలలో పులి జూదపు ఆటగీతలను పలకరాళ్ళపై మలిపించి యుంచుచుండిరి.

           "ముంగిట పులిజూదములు గీచియుండిన
            రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ" (4-123)

నేటికిని తెలుగుదేశమం దంతటను పల్లెలలో ఈ ఆచారము మిగిలి యున్నది.

కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించినారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించినాడు:

           "కాచిప్రాతలు దారాలు కట్టుముళ్ళు
            ముష్టులును నీళ్ళముంతలు మూలికలును
            కత్తులపొదుళ్ళు మంత్రముల్ కట్టుపసరు
            లెనయవచ్చిరి పందెగాళ్ళేపురేగి
            వేగ నెమిలి పింగళి కోడి డేగ కాకి
            వన్నెలైదింటి కిరులందు వెన్నెలందు
            రాజ్యభోజనగమన నిద్రామరణ
            ములను విచారించి యుపజాతులను వచించి"

ఈ పందెమును గూర్చి ఇంకా నాలుగు పద్యాలిచ్చటనే కవి విపులముగా వ్రాసెను. (3-213)

శైవభక్తులలో వీరభద్ర పళ్ళెరము లిడుట ఆచారముగా నుండెను. (3-188)

జనులలో తాయెతులపై విశ్వాసము మెండుగా ఉండెను. ఈ తాయతు శబ్దము అప్పకవి నాటికే రూడియై పోయెను. తాయెతు శబ్దవిచార మిదివరకే చేసినాను. నారాయణకవి ఒకచో తాయెతు నిట్లు పేర్కొన్నాడు.

          "సరిపెణతో సజ్ఞబలు సందిటి తాయెతు
           లంగవస్త్రము.............." (5-99)

బాలికలు ఆడుకొను ఆటలు ప్రత్యేకముగా ఉండెను.

నాచన సోమన మొదలుగా నారాయణకవి వరకు వాటిని పేర్కొనుచు వచ్చినారు. హంసవింశతిలో ఇట్లు తెలిపినారు.

          "బొమ్మల పెండ్లిండ్లు బువ్వంపు బంతులు
           పుణికిళ్ళు నిట్టిక్కి బొమ్మరిండ్లు......" (5-147)

(అభిలాషులు పూర్తి పద్యమును చూచుకొనగలరు. ఈ మాలికలో అతి విపులముగా ఆటలన్నింటిని కూర్చినాడు. కావున నిది చాలా ముఖ్యమైన పద్యము.)

రాటముపై వడకుట ఇంకా విరివిగానే ఉండెను. దాని ముచ్చట పలు తావులలో హంసవింశతిలో కలదు.

ధనాడ్యులైనవారు చలివేంద్రలు పెట్టి వేసవిలోని బాటసారులకు సేద దీర్చి పుణ్యము కట్టుకొనిరి. ఆ చలిపందిటిలో ఉత్త మజ్జిగ మాత్రమే ఇయ్య కుండిరి.

          'లవణశుంఠీజం ఫలరసాను యుక్తముల్
           నీరు మజ్జిగకుండ బారులమర
           లఘులయైలాసూన లలిత సౌరభమిశ్ర
           శీతలజలకుంభ జాతమమర
           జీరకకైడర్య చారుగంధములొల్క
           పలుచనియంబళ్ళ పంట్లుదనర
           రవయుప్పు నీరుల్లి రసమునించిన కొళ్ళు
           గంజికాగులగుంపు కడురహింప
           గంధబర్హిష్ఠలామజ్జ కప్రశస్త కా
           యమాన ముహుర్ముహుర్జాయమాన
           మందపవమాన ఘనసార బృంద వేది
           కాలయవితాన పానీయశాలయొప్పె (2-160)

అ కాలమందు బ్రాహ్మణులు సంస్కృతాభ్యాసము విరివిగా చేయుచుండిరి. వారి పాఠ్య ప్రణాలిక యేమనగా, మేఘ సందేశము, కువలయానందము, ప్రబోద చంద్రోదయము, మణిసారము, సిద్దాంతకౌముది, రసమంజరి, కావ్యప్రకాశిక మొదలగునవి.

మనవారు ఇంగ్లీషు విద్యాపద్దతులలో నిండుగా మునిగినది. ఈ 60 ఏండ్లలో, అంతకు పూర్వము మన దేశపు బళ్ళస్థితిని నారాయణకవి ఇట్లు చక్కగా వర్ణించినారు.

           నన్నయ్యవార లోనామాలు దిద్దుకొ
           మ్మనినచో కడుపునొప్పనుచు నేడ్చి
           దండంబునను గుణింతము పెట్టరమ్మన్న
           అంగుళీ వ్రణమాయెననుచు జుణిగి
           శిష్యులచే గాలుసేతులు బట్టించి తెచ్చి
           పద్యముజెప్ప దెమలకుండి
           పలక వ్రాయనటంచు బడికెత్తుకొనిపోవ
           బలపంబులేదని పలుకకుడి
           అలుకచేనుండ బుగ్గలుమలిచి తిట్టి
           తొడలు వడిపెట్టి కోదండమడరగట్టి
           రెట్టలెగబెట్టి బట్టించి రేపుమాపు
           కొట్టుబెట్టుగ సజ్జల కోలదెగను (3-141)

           గద్దించి తిట్టిట దిద్దుమంచును వ్రేలు
           బట్టించినచటనే బట్టకుందు
           పలుమారు లోయని పల్కుమంచునుగొట్టి
           చెప్పిన శిలవృత్తి దప్పకుందు
           ఒకటికి సెలవియ్యనురికి చీకటిదాక
           పసులగాపరుల వెంబడినపోదు
           జనని ఆడుక్కొని చదువుకోబొమ్మన్న
           వినక వేమరు వెక్కి వెక్కి యేడ్తు
           సారెపద్యపు బలుక పై చమురుపూతు
           ఎప్పుడును పెద్దపలక పొక్కెత్తజేతు

          బాలరామాయణము పుస్తకాలుదాతు
          వేయు సజ్జనకోలలు విరిచివైతు (3-143)

          చరికుండ పగులగొట్టుదు పరువడి
          సూత్రంబు త్రెంచి పారగవైతున్
          మరిమరి బలపములిచ్చిన పొరినమలుదు
          బగులగొట్టిపోయెనటందున్. (3-143)

          నన్ను బింగీలుపెట్టించునాడె యయ్యవారు
          నిద్రింపగా జూచి చేరి యచట
          చింతవ్రేల్ కొమ్మవంచుక సిగకుగట్టి
          విడిచి యురికితినయగారు మిడికికూయ (3-144)

పల్లె బళ్ళలో మధ్యాహ్నము అయ్యవారు బడిలో గురిపెట్టి నిద్రించుట వాడుక. ఎండకాలము చింతచెట్లక్రింద బడి సాగెడిది. పెద్ద పలక అన కట్టెపలక; బలప మన మెత్తని కోపు బలపము. పొగాకువాడుక దేశమందు విరివిగా వ్యాపించిపోయెను. బట్టసంచిలో పొగాకు పెట్టుకొని వెంట తీసికొని పోవుచుండిరి. దానిని పొగాకు తిత్తి యనిరి (2-76). గ్రామ కరణాలు కూడా పొగాకు చుట్టలు త్రాగుటకు బాగా అలవాటుపడిరి. వారి వేషముకూడా గమనింప దగినది.

       తెలితలపాగ, చొక్క, మొలతిత్తి, భుజంబున జల్వపచ్చడం,
       బలచిటివ్రేల ముద్రిక, యొయారముమీర పొగాకుచుట్ట సొం
       పలరెడు కావిదోవతి, పదాబ్జ యుగంబుగ ముచ్చెలొప్పగా
       నలనిభుడంత గ్రామకరణం బటకై చనుదెంచె నంతటన్. (3-92)

చొక్కా అనునది తెనుగుపదము కాదు. తెనుగు వేషముతో జొరబడిన అరబీ పదము. "చొగా" అని నిలువుటంగీకి అరబీలో పేరు కలదు. అదే చొక్కా అయినది. స్త్రీలు కూడా పొగాకును వక్క తమలపాకులతోపాటు నమలుటకు అలవాటు పడిరి. (4-158). శుక సప్తతి కవి కాలమునాటికి (క్రీ.శ. 1600) నారాయణకవి నాటికి స్త్రీల భూషణములలో భేదము రాలేదు. నారాయణకవి తెలిపిన కొన్ని భూషణము లేవనగా

          కుప్పె, రాగడిబిళ్ళ కుంకుమరేఖ
          పాపటబొట్టు కమ్మలు, బావిలీలు,
          లలిసూర్య చంద్రవంకలు, సూసకము,
          కెంపు రవలపల్లెరుబూవు, రావిరేక,
          బుగడలు, నాన్‌దీగె, సొగసైన మెడనూలు
          కుతికంటు, సరపణ, గుండ్లపేరు,
          సరిగె, ముక్కర, బన్నసరము, లుత్తం
          డాలు కంకణంబులు, తట్లు, కడియములును
          సందిదండలు, ఒడ్డాణ మందమైన
          ముద్రికలు, హంసకంబులు, మ్రోయుగజ్జె,
          లలరు బొబ్బిలకాయలు గిలుకు మెట్టె
          లాదియగు సొమ్ముదాల్చి యయ్యబల మెరయు (2-391)

మన పూర్వుల ఆటలవలెనే సొమ్ములున్నూ చాలావరకు మనకు తెలియరానివై పోతున్నవి. అభిమానులు వాటిని వర్ణించి చిత్రింపజేసి తెలుపుట మంచిది. ముఖ్యముగా నిఘంటుకారులు ఇట్టి పదాల కర్థము వ్రాయునప్పుడు భూషణవిశేషణము అని వ్రాయుచుండిరి. అంతమాత్రమందరికిని తెలియును. ఇక నిఘంటుకారు లొనర్చిన ఘనకార్యమేమి?

ఏనుగుల వీరాస్వామయ్య అనువారు మద్రాసులో పెద్దఉద్యోగమందుండినవారు. అతని కాలములో ఇంకా రైళ్లు ఏర్పడి యుండలేదు. అతడు మద్రాసు నుండి కాశీకి సకుటుంబ పరివారముగా ప్రయాణము చేసి పల్లకీలో క్రీ.శ. 1830-31లో ప్రయాణము చేసెను. అతడు కడప, కర్నూలు, జటప్రోలు వనపర్తి, పామూరు, హైద్రాబాదు, నిజామాబాదు మీదుగా కాశీచేరి తిరుగా ఉత్తర సర్కారుల తీరము మీదుగా మద్రాసు చేరుకొనెను. కాన ఇంచిమించు తెనుగుసీమలో ముఖ్య భాగాలన్నింటినీ అతడు చూచి, అందలి జనుల ఆచార వ్యవహారాలను ఉన్నవున్నట్లుగా తన డైరీలో వ్రాసుకొనెను. అందుచేత అతని 'కాశీయాత్ర చరిత్ర' మన సాంఘిక చరిత్రకు క్రీ.శ. 1800 - 1850 కాలము వరకు చాలా ఉపకరించును.

వీరాస్వామి కాలములో తెనుగుదేశము ఇంగ్లీషువారి పరిపాలన లోనికి వచ్చెను. హైద్రాబాదులోని తెలంగాణా నిజాం పరిపాలనములో ఉండెను. ఇంగ్లీషు వారు ఇంకా తమ రాజ్యాలను స్థిర పఱచుకునే యత్నములోనే యుండిరి. అందుచేత దేశమందు శాంతి భద్రతలు ఏర్పడలేదు. అయినను బ్రిటిషిండియాలోని భాగాలలో నిజాం రాజ్యములోని భాగాలకంటే శాంతి భద్రత లెక్కువగా ఉండినవని కాశీయాత్ర చరిత్ర నుండి బ్రిల్గామీ వ్రాసిన Hisiorical and descriptive sketches of Hyderabad State గ్రంథము నుండి మనకు తెలియవస్తున్నది.

తెనుగుదేశములోని యిండ్లు ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధముగా నుండెను. రాయలసీమలోని వ్యవసాయకుల యిండ్లలో పశువులున్నూ మనుష్యులున్నూ నివాసము చేయుదురు. ఇది నేటికిని మారకుండా వచ్చిన దురాచారము. కర్నూలు జిల్లాలోని బండాత్మకూరు చేరి వీరాస్వామి యిట్లు వ్రాసెను. పశువులకు తాము కాపుర ముండే యిండ్లకంటే చక్కగా కొట్టములు కట్టి, బాగా కాపాడుచున్నారు. ఆవులను పాలు పితుకుటలేదు. ఎనుపపాడి సహజముగా ఉన్నది. (పుట 11)

రాయలసీమలో ఎద్దుల వృద్ధి నాటికి నేటికి లేదు. "ఎద్దులు నెల్లూరిసీమ నుంచి వచ్చేవారి వద్ద హమేషా వారికి కొనవలసియున్నది. తడవకు 10-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. (పుట 14)

కర్నూలు జిల్లాలో బియ్యము చాలా తక్కువ. "పేదలు జొన్నలతోనున్ను, ఆరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు. (23)

కృష్ణాజిల్లాలోని ఎద్దులవంటి యెద్దులు దక్షిణ హిందూస్థానములో మరెందును కానరావు. (358)

మచిలీబందరువారిని గూర్చి యిట్లు వ్రాసినాడు.

మనుష్యులు నిండా ఆరోగ్య దృడగాత్రులుగా లేరు. స్త్రీలు అలంకార పురస్సరముగా శోభాయమానులై వున్నారు. చెవులకు నిడువు గొలుసులు వేసికొని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పురుషులు చాయవేసిన వస్త్రప్రియులై యున్నారు. (పుట 350)

'ఈ దేశస్థులు (బందరువారు) కచేరీ సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు.' ఇప్పుడును ఉత్తర సర్కారులో బోగపు సానుల పాట కచ్చేరీని మేజువానీ అంటాఆరు. ఇది ఉర్దూ 'మేజుబానీ' నుండి వచ్చిన పదము. అనగా విందు అని యర్థము. విందులో బోగమాట ముఖ్యము.

'కృష్ణానదికి వుత్తరము తూర్పు సముద్రపర్యంతము దేశస్థులు మాట్లాడే తెనుగు మాటలు రాగ సంయుక్తముగానున్న అక్షరలోపము గల హ్రస్వ శబ్దములుగా వుంటున్నవి. స్త్రీలు వోటిని ఆవరించే పాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు.' (పుట 353-354)

'నెల్లూరుసీమ పురుషులు స్త్రీలు దేహ పటుత్వము కలవారుగా నున్ను, యథోచితమైన కురుచు రూపము గలిగి సౌందర్యవతులుగా తోచుచున్నది. కాని దేహవర్ణము నలుపు కలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్యమని చెప్పవచ్చును. (పుట 393)

'రాజమహేంద్రవరము ధవళేశ్వరము ప్రాంతములో సప్తగోదావరీ భూమిని కోనసీమ అందురు. అక్కడ బ్రాహ్మణులకు భూవసతులు చాలా ఉన్నవి. (పుట-343) 'అచ్చటి బ్రాహ్మణులు చాలా అధ్యయన పరులు, యజ్ఞయాగాది కర్మములయెడల చాలా శ్రద్ధాభక్తి కలిగివున్నారు. ' (పు-344) 'కళింగాంధ్ర దేశములలో తెలగాలనే వెలమలు కలరు.' (పు-344) తెలగాలు వెలమ ఒకే జాతి వారని వీరాస్వామీ వ్రాసినాడు!

'చినగంజాం మొదలుగా సముద్రతీరమందు వుప్పు పయరుచేయడము విస్తారము కనుక వుప్పరజాతి స్త్రీలు దోటి ముక్కరలు ధరింతురు. ఇప్పట్లో దక్షిణ దేశము పడమటి దేశము పొడవుగా భూమి తొవ్వడానకు నెగడి వుండేవారు. ఈ దేశపు వుప్పరవాండ్లున్ను ఓడ్రదేశపు వొడ్డెవాండ్లుగా తోచినది.' (356)

అందుకు సందేహ మక్కరలేదు!

'జగన్నాథ క్షేత్రములో జోగీ జంగము మొదలయిన శైవులను తురకల వలెనే నిషిద్ధ పఱచి గుడిలోనికి రానియ్యరు. హిందువులలో చాకలిజాతిని చండాలురను గుడిలోపలికి రానియ్యరు.' (310)

ఈ రెండు వాక్యాలు తెనుగుదేశానికి సంబంధించకున్నా ఉత్తరసర్కారులకు సమీపముననుండు రాయలసీమలో ఆనాటి యాచారములు తెలియవచ్చును. అందు చాకలివారిని చండాలురవలె చూచినది గమనించదగినది. 'ద్రావిడ దేశములో శూద్రులనున్నూ ముఖ్యముగా చండాలురనున్ను అగౌరవపరుస్తూ శూద్రులదృష్టిని చండాలుర సమీప వర్తిత్వమున్నూ కూడదని నిండా అగౌరవ పరచడముచేత వేల పర్యంతము ప్రజలు క్రీస్తుమతస్థులుగా పెదపాళెము మైలాపూరు క్రీస్తు గుళ్ళ వుత్సవాదులలో చూడబడుచున్నారు. (165)

విశాఖ పట్టణం జిల్లా వారిని గూర్చి ఇట్లు వ్రాసినాడు.

'ఈ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్న అగుపడుతారు. జాఫరా విత్తుల వర్ణము వేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడం కలిగి వున్నది. (335)

బాలకొండ నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరుకు 6 కోసుల దూరములో ఉన్నది. 'హైదరాబాదు వదలినది మొదలుగా పాలు పెరుగు మాత్రము తంబళ జాతివారి గుండా ఊరూరిలో సమృద్ధిగా దొరకును..... ఈ దేశములో తంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగల జాతివారు మషాల్ వేయుచున్నారు.' (పు 46)

తెలంగాణా చాకలివారు దివిటీలు పట్టుదురు. వీరు మంగళ్ళ కా పని నిచ్చినారు. ఇవి ఆనాటి తెనుగుజనులను గూర్చిన ముచ్చట.

ఇక మన తెనుగు భాషాస్థితి ఒక్కొక్క ప్రాంతమం దెట్లుండెనో కనుగొందము. 'కడప వదలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడతగినవారు సకృత్తుగా ఉన్నారు. తెలుగు మాటలు సర్వసాధారణముగా రాగసరళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మిచ్చేటప్పుడు శబ్దముల సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీయూరు ఆయూరికి ఎంత దూరమంటే నాకు యేమి యెరుక అని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండు కొన్నాడు అనడానికి పండినాడని అనుచున్నారు. హిందూస్థానీ తురకమాటలు తరుచుగా తెనుగు భాషలో కలిపి మాట్లాడుచున్నారు.' (48-49)

ఇవి రాయలసీమను గూర్చి చెప్పినమాటలు. తెనుగు దేశానికి దక్షిణమున కడప జిల్లా ఒక హద్దని ఇతని అభిప్రాయము. ఆదిలాబాదుకు ఉత్తరమున 10 క్రోసుల దూరముపై మేకలగండి అను ఘాటు కలదు. తర్వాత వరదానది దాటవలెను. 'హైదరాబాదు సరిహద్దు దానితో తీరిపోయింది' అని వీరాస్వామి వ్రాసెను. వరదానది ఆవల నాగపూరు రాజ్యమని తెలిపినాడు. 'అక్కడ కాయరా అనే యూరు మొదలు తెనుగు సకృత్తుగా ఉన్నది.' (56)

విశాఖపట్టణము జిల్లాలోని తెనుగు భాషను గూర్చి యత డిట్లు వ్రాసెను.

సర్వసాధారణముగా ఈ దేశమందు తెనుగు భాష ప్రచురముగానున్నది. మాటలు దీర్ఘముగానున్ను, దేశీయమై రహస్యముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసు మోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావముగా దౌష్ట్యములు చేయతలచినా మంచి తియ్యని మాటలు మాత్రము వదలరు.' (335)

'గంజాము జిల్లా తెనుగు సీమకు మరొక హద్దు. గంజాం మొదలుగా కళింగదేశము ఆరంభ మవుటచేత ఇండ్లు, మనుష్యుల అలంకారాలు, దృష్టి దోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగి ఉన్నవి. చిన్న యిండ్లకు కూడా వాకిట పంచ తిన్నెలు పెట్టి కట్టినారు. ప్రతి స్త్రీ బులాకులు ముక్కర ధరించి వున్నారు. సమీపమున వుండే మాలుఝూ అన్న వూరిలో యెవరికిరాని తెనుగు భాష యక్కడ అందరికి వచ్చినది.' (319)

'నెల్లూరు దక్షిణములో తెనుగు సీమకు మరొక హద్దు. నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూవస్తారు. ఈ దేశములో పడమటినుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణమునుండి అరవమువచ్చి కలిసినది. ఉత్తరమునుంచి తెనుగు అదే రీతిగా వచ్చి కలిసినది. కనుక యీ మద్యదేశపు భాష (ఉత్తర దక్షిణ పినాకినీల మధ్య దేశభాష) యీ మూడు భాషలు మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆయా దేశములలోకి వెళ్ళి మాట్లాడపోతే ఆయా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

చెన్నపట్టణమును గూర్చి, అందలి భాషలను గూర్చి వీరాస్వామి గారిట్లు తెలిపినారు.

'200 ఏండ్ల క్రిందట (అనగా 1831 కి 200 ఏండ్ల పూర్వము) చంద్రగిరిలో బీజానగరపు (విజయనగరపు) సమస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా 'డే' అనే దొర యీ సముద్రతీరమందు ఒక రేవు బందరు కట్టించవలెనని యత్నముచేసి శ్రీరంగరాయుణ్ణి అడిగి వుత్తరువు తీసుకొని యీ ప్రాంతాలకు జమీందారుడైన దామర్ల వెంకటాద్రి నాయడిపేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృత పరిచయుడు కనుక శ్రీరంగరాయడు తన పేరు పెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవుబందరు కట్టి మాన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణమని పేరుపెట్టి కట్టడమేకాక తానే సన్నిధానాథిపతి గనుక అదే నామకరణము ఆరంభములో చేసినందున చెన్నపట్టణము పేరు కలిగినది. తత్పూర్వము ఈ రేవును ఇంగ్లీషువారు మదిరాసు అంటూవచ్చినారు." మద్రాసు రేవులో ఇంగ్లీషువారు గుట్టగా కట్టెలకుప్పను తమ కోట నిర్మాణానికి వేసియుండిరి. అప్పుడు ఆ ప్రాంతమందుండిన డచ్చివారు తమ భాషలో కట్టెకుప్పకు మదారై అందురు. కాన దానిని మదారైస్ అనిరి. అదే మద్రాసు అయ్యెను. (369)

"ఇక్కడివారు |చెన్నపట్టణమువారు) ప్రకృతులు ఉపాయ వేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్ర కర్ణాటదేశాల మధ్య యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములైన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనము చేసినవారి తురకభాష యిప్పుడు దొరతనము చేసే యింగ్లీషువారి భాషయున్నూ నోట నానడము చేతనున్ను, పదార్థములుగా కొన్ని సంస్కృత వాక్యాలు అభ్యసించుట చేతనున్నూ ఇక్కడివారి ఉచ్చారణ స్పుటముగా ఉంటూ వచ్చుచున్నది. ఇక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషులపట్ల నిండా చొరవ జేసుకోగల వారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్రాభరణ ప్రియులేకాని నైజగుణమైన సాహసము నిండా కలవారుగా తోచలేదు.

తెలంగాణా పరిస్థితి

హైద్రాబాదు రాష్త్రములో తెలంగాణాను గురించి వీరాస్వామి తాను వెళ్ళిన దారిలో తగిలిన ప్రదేశాలలోని విశేషములను తెలిపినందున దీనిని గూర్చి ప్రత్యేకముగా వ్రాయవలసి యున్నది.

"హైద్రాబాదులోని కొల్లాపుర వనపర్త సంస్థానాలవారు తరుచుగా తగవులాడి ఒకరి గ్రామాలను ఒకరు కొల్లపెట్టి రైతులను హింసించి గ్రామాదులు పాడుచేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరికొకరికి సమరస పెట్టకుండా చందూలాలు ప్రభృతులు ద్రవ్యకాంక్షచేత ఉభయులకున్ను కలహములు పెంచి వేడుక చూచుచున్నారు." (24-25) "జమీందారులు-వారి ఆధీనములో నుండే భూమిని పూర్ణమైన స్వాతంత్ర్యము కలిగి ఆయా భూములలోని కాపురస్తులను భర్త భార్యమీద చెల్లించే అధికారముకంటే ఎక్కుడయిన అధికారముతోనే యున్నారు." (32) ఈ వాక్యములు వ్రాసి 120 సంవత్సరాలు గడచిపోయినను ఇప్పటికిని హైద్రాబాదు జాగీర్లలో రైతులు సర్వ'రహితులు'గా నున్నారు. జాగీర్దారులు ఆ 'రహితుల'పై భర్తలు భార్యలపై చెల్లించుకొనే దర్పముకంటే మించిన దర్పాన్ని సాగించు కొంటున్నారు. జాగీర్దార్ల దౌర్జన్యాలను గూర్చి బిల్గ్రామీ ఇట్లు వ్రాసెను.

'ప్రతి గ్రామములో జాగీర్దార్లు వ్యాపారులను భాదించి సరకులపై సుంకాలు లాగుకొనేవారు. అందుచేత క్రీ.శ. 1800 నుండి 1855 వరకు రాష్ట్రములో వ్యాపారము నశించి పోయెను.'

"హైద్రాబాదులో మనుష్యులందరున్ను ఆయుధపాణులై, మెత్తనివారిని కొట్టి నరుకుచున్నారు' (కాశీయాత్ర 34). షహరులో (హైద్రాబాదు నగరంలో) చంపినా అడిగే దిక్కు లేదు. బీదలు ఏ చెట్టు వేసినా వాటిఫలమును క్షేమముగా ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమే యశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవింపనీయరు. సాత్వికప్రభుత్వము కల రాజ్యములో మెదిగిన వారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆ రాజ్య సంచారమున్ను భయప్రదములుగా ఉంచున్నవి. (కా.36) తుదిమారుగా రజాకరు లీ పైశాచిక ప్రదర్శనము చేసినది వీరాస్వామి నాటి యవస్థాపరిణామమే! "నాగపూరు నివాసస్థులు కృత్రిములు కాని హైదరాబాదు షహరువారి-లె మాటకు మునుపు ఆయుధములు వాడేవారు కారు." ఉత్తరసర్కారులలో నిజాంగారి జమీందారులు చాలా దౌర్జన్యాలు చేసిరి. (బిల్గ్రామి సంపుటం 2 పు 22) పిండారీలు మరాటీదండు దేశాన్ని కొల్లగొట్టుతూ ఉండెను. (20-2-30)

హైద్రాబాదు రాష్ట్రములో ప్రతిదినము బందిపోటు దొంగతనాలు జరుగుచుండెను. రోహిలా గుంపులు, దొంగ గుంపులు గ్రామాలను దోచుకొనుచుండెను. (బిల్గ్రామీ 2-127) బందిపోటు దొంగలలో ఎక్కువ రోహిలాలే యుండిరి. (బి. 2-169)

హైద్రాబాదు రాజ్య మిట్టి దుస్థితిలో నుండుటచేత రాష్ట్రమంతటా వ్యాపారము స్తంభించి వ్యవసాయము నాశనమై, పలుమారు కరువులు వచ్చి, జనులు ఈగలవలె రాలిపోతూవచ్చిరి. రాష్ట్రములోని కొన్ని కరువుల వృత్తాంతము చాలా ఘోరముగా ఉండెను.

క్రీ.శ. 1629-30 లోని కరువులో రొట్టెయిస్తే కన్నబిడ్డను దానికి మారుగా యిచ్చువారుండిరి. జానేబనానే 'ఒకరొట్టెకు ఒక మనిషి' అని ఫార్సీలో అనిరి. కుక్కల మాంసమును మేకమాంసమని అమ్మినవారుండిరి. చచ్చిన ప్రాణుల యెముకలను పిండిచేసి ధాన్యము పిండిలో కలిపి అమ్మిరి. కొందరు మనుష్యులు ఇతర మనుష్యులను తినిరి. మరల 1659లో, 1681 లోను క్షామాలు సంభవించెను. (బిల్ 2-16-17) 1702లో, 1713లో, 1749లో, 1787లో క్షామాలు వచ్చెను. 1769-93 లో తెలంగాణాలో ఘోరక్షామము కలిగెను. హైద్రాబాదు నగరములో 90,000 మంది చచ్చిరి. ఇండ్లలో చచ్చినవారి లెక్క లేనేలేదు. రాయచూరు జిల్లాలో 2000 సాలె వాండ్లలో 6 మంది మాత్రము క్షామానంతరము మిగిలినవారైరి. దేశమంతా చచ్చినవారి పుర్రెలతో నిండెను. అందుచే దాన్ని పుర్రెల కరువు అనిరి (బిల్. 2-25). క్రీ.శ. 1804 లో మరల క్షామము కలిగెను. రూపాయికి 60 సేర్లమ్మే రాగులు రెండున్నర సేరు ప్రకారమయ్యెను. కొందరు మనిషిమాంసమును తినిరి (బి. 2-29). మరల 1831లో క్షామము వచ్చెను. 'పిడికెడు గింజలకు పిల్లలను తండ్రు లమ్ముకొనిరి. జొన్నలు రూపాయికి 3 లేక 4 సేర్లమ్మెను. చెట్ల ఆకులను జనులు మేయదొడగిరి. (బి. 2-29-40). మరల 1854లో మరొక క్షామము వచ్చెను. వీధులలో పీనుగులు నిండియుండెను.

క్షామాల ఫలితముగా జనులు అప్పులపాలైరి. అప్పులిచ్చేవారిలో మార్వాడీలే ఘనులు. కాని వారికంటె ఘోరులున్నారు. కాని అదేలనో వారి నెవ్వరున్నూ స్మరించరు అరబ్బులు, రోహిలాలు హైద్రాబాదు రాజ్యములో 250 ఏండ్లనుండి జనులకు అప్పులిచ్చి ప్రపంచములో కని విని యెరుంగని వడ్డీని వసూలు చేస్తూ వచ్చినారు. ఈనాడు కూడా వారు నూటికి 400 రూపాయిల వడ్డీని వసూలు చేస్తున్నారు. అప్పుల పోతులు బాకీ యియ్యకుంటే జంబియాలతో పొడిచి వసూలు చేసేవారు.

'రైతుల దాన్యాన్ని మార్వాడీలే కొని కోఠాలలో పెట్టి, ధరలు పెంచి అమ్ముచుండిరి. ఆకాలములో మార్వాడీలను గూర్చి యిట్లనుచుండిరి. 'ఒక లోటాతో, దానికొక చిన్న త్రాడుతో, ఒకకట్టు ధోవతితో నర్మాదాను ఒక మార్వాడీ దాటి హైద్రాబాదు చేరుకొనిన కొన్నేండ్లలోపల వాడు విపరీతపు వడ్డీ వ్యాపారమువల్ల ధనికుడై బండెడు బంగారు భర్తీతో మార్వాడు చేరుచుండెను (బి. 2-56). 'అరబ్బులు రాజారాం బక్షు అను పూర్వ మంత్రికి బాకీ లిచ్చిరి. అతడు బాకీలు చెల్లించకపోతే అరబ్బులు అతన్ని చాలా ఘోరముగా కష్టపెట్టగా తట్టుకొనలేక అతడు నిజాం దేవిడీలోనే దాగుకొనెను (బి.2-59). అరబ్బులు దౌర్జన్యాలు విపరీతమై పోయెను. వారు అప్పులిచ్చి హింసించి వసూలు చేసుకొనుచుండిరి. అప్పుల పోతులను తమ జమాదార్ల యిండ్లలో మూసివేసి కూడు నీళ్ళియ్యక కష్టపెట్టి బాకీలు వసూలు చేసుకొను చుండిరి. పఠానులు, అరబ్బులు జాగీర్దారుల కప్పులిచ్చి 80 లక్షల ఆదాయం కల జాగీర్లను తమ వశములో ఉంచుకొనిరి (బి. 2-118). 'పూర్వుం కోర్టులు లేకుండెను. కోమట్లకు వ్యాపారులకు అప్పులు రాకుంటే వారు రోహిలాలను అరబ్బులను పంపేవారు. వారు జంబియాలతో వసూలు చేసియో లేక సామానులను లాగుకొనియో వచ్చుచుండిరి. రోహిలాలు అరబ్బులు తమ సొంత అప్పులను ఇయ్యనివారిపై బండలు మోపి వాతలు వేయుచుండిరి. బాకీ పడినవాడు పారిపొయ్యేటట్లు కనబడితే వానిపై తమవారి నిద్దరి ముగ్గురిని కాపలా పెట్టి ఆ కావలి కూలీ కూడా వసూలు చేయుచుండిరి. తామిచ్చిన దాని కంటే చాలా యెక్కువ వసూలు చేస్తూ ఉండిరి. (బి. 2-163)

జనులు తమ పిల్లలను అమ్ముకొనుచుండిరి. అట్టి వ్యాపారాన్ని క్రీ.శ. 1856 లో నిషేధించిరి (బి. 2-19). హైద్రాబాదు రాజ్యములో క్రీ.శ. 1848లో సహగమనమును ఆపివేయించిరి. (బి. 2-58)

తెలంగాణములోని భూములన్నీ గుత్త కిచ్చుచుండిరి. గుత్తేదారులు రైతులవద్ద ధాన్యభాగము తీసికొని సర్కారుకు రూపాయలు చెల్లించు చుండిరి. భూములకు నిర్ణయమగు పన్నులు లేకుండెను. దేశముఖులు, దేశ పాండ్యాలు పన్ను వసూలుచేయు అధికారులు. భూమిపన్నే కాక మగ్గం పన్ను, కడప పన్ను, కలాలి, ధన్గర్‌పట్టి, దేడ్‌పట్టీ, కులాలపన్ను, పెండ్లిపన్ను, తోళ్ళపన్ను, హట్బాజరీ (కూరగాయలు). పీనిగులపట్టీ తోకపన్ను ఆదంపట్టీ (హిందూ పారిశ్రామికులపై పన్ను) మున్నగు 27 విధాల చిల్లర పన్నులను ప్రజల నుండి లాగుచుండిరి. (బి. 2-53) తెలంగాణములో చాలా పరిశ్రమలుండెను. ఇంగ్లీషువారి వ్యాపారము మూలాన దేశమందలి అరాచకమువలన 1800-1850 ప్రాంతమున వాటి క్షీణదశ ప్రారంభమయ్యెను. వరంగల్ జంఖానాలు, తివాసీలు కాకతీయుల పతనమునాటి నుండి ప్రసిద్ధిగాంచినట్టివి. బిదరులో బిదరీ సామానులు బిదరుసుల్తానుల కాలమునుండి వృద్ధికివచ్చినవి. తెలంగాణము ప్రధానముగా నూలుబట్టలకు ప్రపంచ ప్రఖ్యాతి గన్నట్టిది. మార్కొపోలో రుద్రమదేవి కాలములోని సన్నని బట్టలను జూచి అవి సాలెపురుగుల దారలా అని భ్రమపడెను.

వరంగల్ తివాసీలను, జంఖాణాలను 1851లో ఇంగ్లండుకు ప్రదర్శనార్థ మంపిరి. ఇనుమును కరిగించి ఇనుపవస్తువులను చేయుచుండిరి. వరంగల్, కూన సముద్రము, దిందుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాదు మున్నగు స్థలములలో ఈ పనులు జరుగుచుండెను. నిర్మలవద్ద నుండు కూన సముద్రములో శ్రేష్ఠమైన ఉక్కును సిద్ధము చేస్తూవుండిరి. ఎల్గందల్ ఇబ్రహీం పట్టణము, కొనాపూరు, చింతలపేట మున్నగు స్థలాలలోను మంచి ఉక్కు సిద్ధమగుచుండెను. కూన సముద్రము ఉక్కువంటి దానిని పర్ష్యాలో చేయుటకు చాలా ప్రయత్నము చేసి విఫలులైరి. కత్తులను హైద్రాబాదు, గద్వాల, వనపర్తి, కొల్లాపురములలో 1890 వరకు కూడా విశేషముగా తయారు చేయుచుండిరి. 5 రూ. మొదలు 15 రూ. వరకు వాటి నమ్ముచుండిరి. బంగారు నీరు పోసిన కత్తులు ఖమ్మములోని జగదేవపూరులో తయారగుచుండెను. గద్వాలలో తుపాకీలు కూడా సిద్దము చేస్తుండిరి. రోహిలాలు పట్టే పెద్ద తుపాకీలను వనపర్తి, గద్వాల, నిర్మలలో చేసిరి. 20 రూ. నుండి 60 రూ. వర కమ్ముతూవుండిరి. నూలు, పట్టు కలిపి నేసిన మష్రూ అను బట్టలను హైద్రాబాదులో గద్వాలలో నేసిరి. టస్సర్ పట్టుబట్టలను వరంగల్, నారాయణపేట, మట్వాడా, హసన్‌పర్తి, కరీంనగరు జిల్లాలోని మాధాపురంలో నేయుచుండిరి. ఇందూరు (నిజామాబాదు), మెదకు, హైద్రాబాదులోను, మహబూబు నగరుకు 10 మైళ్ళ దూరములోనున్న కోయిల కొండలోను కాగితములు సిద్ధము చేయుచుండిరి. (బిల్గ్రామి సం. 1 పు. 395-425)

కడప జిల్లాలో దువ్వూరు అను గ్రామము కలదు. 'దువ్వూరు' మొదలుకొని ప్రతి గ్రామమందున్ను కొండకరమల వాండ్లు ఇనుప రాళ్ళతో ఇనుము చేయుచున్నారు. (కా. యా 6) గుంటూరు జిల్లాలో చేరిన వేటపాలె ములో '1000 నేతగాండ్లుండిరి. తోపు శెల్లాలు, రుమాలా తానులు, చీరలు వగైరాలు నేసి అనేక దేశాలకు వుపయొగ మయ్యేటట్టు చేసి జీవించుచున్నారు.' (కా 355) బాలకొండలో (వేములవాడ వద్ద) 'మేనాసవారలు గంజీఫాచీట్లు ఇవి మొదలైనవి చేసి హైద్రాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. ఈ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.' (కా. 46) 'నిర్మల పంచపాత్రలు ఈ ప్రాంతములో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. (కా. 50)

అప్పటి జనుల ఆచార వ్యవహారాలు కొన్ని వీరాస్వామి యిట్లు తెలిపినాడు. 'హైదరాబాదులో గొప్పవారందరున్నూ పండుటాకులు (తమలపాకులు) వేసుకొనుచున్నారు. బాలకొండలో పండుటాకులు దొరకును. కడప మొదలుగా గోదావరీ తీరమువరకు (నిజామాబాదుకు ఉత్తరములో) అమ్మే వక్కలు ముడివక్కలు. ఈ దేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు. వక్కలు మాత్రము నములుతారు. శూద్రులచేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.' (కా. 48) హైదరాబాదులో పండ్లు దొరకును. కాని 'చెన్న పట్టణము కంటే మూడింతల వెల యివ్వవలసిది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియమైనా మహా రుచికరముగా నున్నవి. (కా. 34) 'కూరగాయల రుచికి హైదరాబాదు సమముగా యీవరకు నేనుచూచిన భూమిలో యేదిన్నీ కూడ చెప్పలేదు. (కా. 274)

ఆ కాలమున హిందూదేవాలయముల యొక్కయు, హిందూమతము యొక్కయు స్థితి శోచనీయముగా ఉండినది. హిందువులలో కులాల తత్త్వము వెరి రూపాల దాల్చెను. మద్రాసులోని కులకక్షలను గూర్చి యిట్లు కాశీ యాత్రలో తెలిపినాడు. 'అప్పట్లో అనేక తెగలు దేశముల నుంచి యక్కడికి వచ్చి చేరినందున యెడమచెయ్యికక్షి అని, కుడి చెయ్యి కక్షి అని రెందు పక్కలుగా యక్కడివాడు చీలి యింగ్లీషువారికి చాలాశ్రమను కలుగ జేసిరి.' (370) దేవాలయాల ఆదాయాన్ని ఇంగ్లీషు వారున్నూ నవాబులున్నూ తాము పాలించే ప్రదేశాలలో తీసుకొంటూ ఉండిరి.' వేంకటేశ్వరునికి ప్రార్థనలు చెల్లించే లోకుల వలన కుంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయలు వచ్చుచున్నవి. కొండమీద యే ధర్మకార్యము చేసుకొనుటకున్ను సర్కారుకు రూకలియ్యవలెను.' (కా.4) 'అహోబిలములో ఉత్సవకాలమందు 400 వరహాలు హాశ్శీలు అగుచున్నవి. వాటినంతా కందనూరు నవాబు పుచ్చుకొని వెనగ గుళ్ళసంగతినే విచారింపడు. (కా.10) 'శ్రీశైలయాత్రకు తీసే హాశ్శీలు కందనూరు నవాబుకు చేరుచున్నది. (కా. 13) 'అగుడీ హాశ్శీలు మూలకముగా సంవత్సరము 1కి 18000 కందనూరు నవాబుకు వచ్చినా గుడి యేగతి పొందేదిన్ని విచారించడు. (కా. 20).

హైదరాబాదు 'షహరు చుట్టున్నూ చిన్న తిప్పలున్నవి. అనేక తిప్పల కొనలయందు మశీదులు కట్టబడియున్నవి. హిందూ దేవాలయములు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.' (కా. 35)

'ఇందలవాయి అను రామస్థలము చేరినాను. (కామారెడ్డి దాటిన తర్వాత ఇందల్వాయ వచ్చును.) ఈ తురకల రాజ్యమందు ఈ స్థలము కుంపటిలో తామర మొలచినట్లున్నది. తిరుపతి వదలిన వెనక రాజోపచారములతో ఆరాధన నడిచేగుడి యిది యొకటే చూచినాను. నా విచారణలో నున్ను వేరే లేవని తెలిసినది.' (కా. 43)

ఈ విధముగా ఇంగ్లీషువారి యొక్కయు, కర్నూలు నవాబుల యొక్కయు హైద్రాబాదు నవాబుల యొక్కయు పరిపాలనలో ఆంధ్ర దేశమందలి హిందూ మతమునకు క్షీణదశ సంప్రాప్తించి యుండెను. దాని కనుగుణ్యముగా హిందువులలో కులంతప్పులు, ఎచ్చు తచ్చులు, కొత్త కొత్త ఆచారాలు, అంక్షలు కొల్లలుగా పెరిగిపోయెను. జనులకు మత బోధ చేయు పీఠాధిపతు లేమూల నుండిరో యేమో ? ఆచార్యత్రయము తర్వాత వారి పీఠాలపై విభ్రాజమానులగుచూ వచ్చిన పీఠాధిపతుల స్మరణ యెచ్చటను కానరాదు. అట్టి అంధకారములో తత్త్వాలు బోధించే కొందరు భక్తులు మాత్రము తమకు చేతనైనంత సంస్కారము చేస్తూవచ్చిరి. మన సమీక్షా కాలములో బ్రహ్మానందయోగి, కంబగిరి, ఇంద్రపీఠి బ్రహ్మన్న, చిత్తూరు నరసింహదాసు, వరనారాయణదాసు, పరశురామ నరసింహదాసు, ఆదికేశవులు, వీరాస్వామి, శివయోగి, తోటగజేంద్రుడు, అంగప్ప మున్నగువారు పామరజనులలో మతప్రచారము చాలా చేసిరి.

కర్నూలు నవాబులు మతావేశపరులై చాలా దేవాలయాలను మసీదులుగా మార్చిరి. కర్నూలులోనే పెద్ద దేవాలయాలు పెద్ద మసీదులయ్యెను. కొందర హిందువులను తురకలనుగా జేసిరి. మహారాష్ట్ర దేశములో శివాజీకాలములో ముసల్మానులైన పలువురి హిందువులను శుద్ధిచేసి మరల హిందువులనుగా జేసిరి. క్రీ.శ. 1756 లో కర్నూలు జిల్లాలోని పత్తికొండను బసాలత్ జంగు అను నవాబు చిన్న తిమ్మన్న అనునతనికి జాగీరుగా నిచ్చెను. అతడు పైకము చెల్లించలేక తన భార్యను పిల్లలను జామీనులుగా బసాలత్ జంగువద్ద వదిలెను. బసాలత్ జంగు ఆ స్త్రీని పిల్లలను బలవంతముగా ముసల్మానులచేత వండించిన అన్నమును తినిపించెను. ఆ సంగతిని పీష్వాతో చెప్పుకొనగా వారిని విడిపించి శుద్ధి చేయించెను. కాని వాసప్ప అను పిల్లవాని మాత్రము బసాలత్ జంగు భార్య వదలక తురకనుచేసి రహ్మతలీఖా అను పేరు పెట్టి తనకొడుకుకు దివానుగా చేసెను (కర్నూలు మాన్యుయల్).

ఇస్లాం మతవ్యాప్తి తగ్గుతూవచ్చెను. క్రైస్తవ మతవ్యాప్తి హెచ్చుతూ వచ్చెను. క్రైస్తవులు ముసల్మానులవలె కత్తితోకాని తుదకు తుపాకీతో కాని మతప్రచారము చేయలేదు. కాని వారు బహువిధోపాయముల నవలంబించిరి. క్రైస్తవమిషనుల నేర్పాటుచేసి "ఫాదిరీలను (Fathers) నియమించి మతప్రచారము చేసిరి. అ ఫాదిరీలు భారతదేశమం దన్ని ప్రాంతాలలో వ్యాపించుకొని తాముండు ప్రాంతీయభాషను నేర్చుకొని తమ భైబిలును అన్ని దేశీ భాషలలోనికి అనువదించి ముద్రించి ఉచితముగా పంచి పెట్టిరి. వారు బిల్లు, సంతాల్, ముండా, గోండు, కోయ, సవర, తోడ, నాగ, చెంచు, మున్నగు అటవికులందును నివసించి వారి భాషలు నేర్చుకొని ప్రచారముచేసిరి. అటవికభాషలకు వ్యాకరణాలు, వాచకాలు వారు వ్రాసి ఆ భాషల నుద్ధరించిరి.

మిషనరీలు మొదటినుండియు హిందువులను వారి మతాన్ని, వారి ఆచారాలను దూషించి దుష్ప్రచారముచేసి అపకీర్తిపాలు చేస్తూవచ్చినారు. హిందువుల కులాలనుండి ముఖ్యముగా అంటరానితనమునుండి వారు చాలా లాభము పొందిరి. లక్షలకొలది అస్పృశ్యవర్గాలను తమమతములో కలుపుకొనిరి. అందేతప్పును కానరాదు. హిందువులు అంటరాని తనమును నెలకొల్పి తమకాళ్ళను తామే నరుకుకొన్నవారు. ఆ పాప ఫలితము నింకా అనుభవిస్తున్నారు. కాని క్రైస్తవ మత ప్రచారకులు హిందువులలో నాగరికతలేదని, వారు దయ్యాలను మంత్రాలను ఆశ్రయించిరని, వారి స్త్రీలు బానిసలని, శిశుహంతకులని, మూర్ఖ విశ్వాసాలతో నిండినారని, వారి మతమంతయు నిస్సారమైనదని వ్రాసి ప్రచారముచేసి అపచారము చేసిరి. మెకాలేవంటి మహా మేధావి హిందూ వేదాలు ఈసస్ కథలకు సరిరావనెను. ఇట్టి వాతావరణములో రాజా రామ మోహన రాయలు బయలుదేరి బ్రహ్మసమాజస్థాపనముచేసి హిందూ సాంప్రదాయములలో జొరబడిన దురాచారాలను సంస్కరింప బూనెను. అంతకుముందే రామదాసు, కబీరు, గురుగోవిందు, మున్నగు వారు సంస్కరణలు ప్రవేశపెట్టి యుండిరి. వేమన, వీరబ్రహ్మము, యాగంటయ్య, మున్నగు యోగులు తెనుగు దేశమందు దురాచారాలను కులాలను, విభేదాలను, తీవ్రముగా ఖండించిరి. కాని పీఠాధిపతులుమాత్ర మెన్నడును సంస్కరణవిధాన మవలంబించినట్లు క్రీ.శ. 1500 నుండి నేటివరకు ఈ 500 ఏండ్లలో మనకు చరిత్రలో నిదర్సనాలు కానవచ్చుటలేదు.

అరాచకము

మొగలాయి సామ్రాజ్యము తటాలున కూలిపోయెను. నామకార్థపు చక్రవర్తిని మాహాదజీ సింధియను ఆ కాలపు వీరాధివీరుడు ఇంచుమించు తన బందీగా నుంచుకొని హిందూ సామ్రాజ్యమును డిల్లీలో ప్రతిష్ఠాపించెను. అది కొలదికాలమువరకే ! కాని స్థాపించినాడు ! అంతలో ఇంగ్లీషువారి విజృంభణము శరవేగముగా పైకి వచ్చెను. బెంగాలు, బీహారు, మద్రాసు, ఒరిస్సాభాగాల నాక్రమించుకొని మరాటీలను కూడా ఓడించిరి. మహారాష్ట్రాగ్రనాయకుడగు మాహాదజీ సింధియా ఇంగ్లీషువారి యుద్ధతంత్రమును బాగుగా గుర్తించి పూర్వపు మొగలాయి విధానాన్ని తన సేననుండి తొలగించి పూర్తిగా తూరోపు విధానాన్నే డీబాయిన్ అను ఫ్రెంచి సేనాని శిక్షణములోనే స్థాపించి ప్రబలుడయ్యెను. కాని అంతలోనే 1794 లో సింధియా మరణించెను. మహారాష్ట్రులలో కక్షలు, కలహాలు, కలతలు హెచ్చెను. వారిది దోపిడిరాజ్యమే కాని సురాజ్య మెన్నడునూ కాదు. అందుచేత ప్రజావలంబనము లేకుండెను. వారు రాజపుత్రులతో సఖ్యముచేయుటకుమారు వారిని బాధించి ఓడించి తామును దుర్బలులయిరి. ఈ పొరపాట్లచే వారు రంగమునుండి 1813 తర్వాత మాయమైరి. మహారాష్ట్ర సేనలోని వారు పలువురు తమ పూర్వమర్యాదను మరువజాలక పిండారీలుగా మారి దేశమును దోచిరి. పిండారీలఘాటు తెలంగాణము పైనను, రాయలసీమ పైనను, ఉత్తర సర్కారుల పైనను సమానముగా పడెను. వారు 200 నుండి 5000 వరకు గుంపుగా బయలుదేరి, గ్రామాలు ధ్వంసము చేసి దోచుతూ పోయెడివారు. వారు గుర్రాలమీద సవారిచేసి అతివేగముగా గ్రామాలమీద పడేవరకు జనులకు వారిరాక తెలియకుండె డిది. వారికి ముల్లెమూటల చీదార ముండకుండెను. సులభముగా తీసుకొని పొగలిగిన విలువగల వస్తువుల నన్నింటిని లాగుకొనెడివారు. వానకాలపు కార్తులందలి వానలవలె వారు తప్పకుండా ఏటేట గ్రామాలకు దర్శనమిచ్చి పొయ్యేవారు. పంటలు కోతల కెప్పుడు సిద్దమయ్యేది రైతులకంటే ముందుగా పిండారీలకే గుర్తు. కాన వారు తీరా కోతసమయానికి ప్రత్యక్షమై ధాన్యము నున్నగా ఊడ్చుకొని పోయెడివారు.

ఇంగ్లీషువారు బెంగాలు బీహారులను దోచుకొనుటలో నిమగ్నులై యుండిరి. తమ భాగాలలోనికి పిండారీలు రానంతవరకు వారికి చీమకుట్టినట్లు కాలేదు. అందుచేత పిండారీలు ఇంచుమించు 50 ఏండ్లవరకు నిరాఘాటముగా తమ ఉద్యమమును సాగించిరి. అప్పుడు ప్రజలే తమకు తోచినట్లు ఆత్మరక్షణము చేసికొనిరి. తెనుగు దేశములోని చాలా గ్రామలలో గ్రామస్వరూపము మారి పోయెను. గ్రామాలకు నాలుగు దిక్కులా బురుజులను కట్టి వాటికి మధ్య పెద్ద గోడలను నిర్మించి ఊరవాకిలి పెద్దగవని తలుపులతో గడెమ్రానితో నిర్మించిరి. చీకటి పడీ పడకమునుపే తముకువేసి ఊరవాకిండ్లు బంధించేవారు. అచ్చట తలార్లు బేగారీలు సేత్సందీలు కావలి కాసేవారు. కాని పిండారీలు పగలే వచ్చేవారు. అందుచేత బురుజులపై మచ్చెలువేసి కావలికాసి దూరాన దుమ్మురేగుట కానరాగానే నగారా వాయించి పొలాలలోనుండు జనులను గ్రామాలలోనికి రప్పించి ఊరవాకిలి బంధించి జనులు బురుజులపై గోడలపై నెక్కి యుద్ధానికి సిద్ధపడేవారు.

"పిండారీల సైన్యము 1814లో 20000 గుర్రపుదళము, 15000 కాల్బలము, 18 తోపులు కలదయ్యెను. 1816లో వారు ఉత్తర సర్కారులలో సగము భాగములో పదకొండున్నర దినాలపాటు 339 గ్రామాలు దోచిరి. ఆ రేడు వేలమందిని చచ్చుదెబ్బలుకొట్టి, దాచిన ధనము జాడలు తెలుసుకొనిరి. వారిదెబ్బ ఎక్కువగా గుంటూరు జిల్లాపై బడెను. వారి ఘోరాలకు తాళలేక నూర్లకొలది జనులు తమ ఆలుపిల్లలతోసహా తమగుడిసెల నంటుబెట్టి అగ్నిలో పడి చచ్చిరి. అందు తప్పించుకొన్న కొందరి బాలురవల్ల ఈ వార్తలు ఇంగ్లీషు కంపెనీ సర్కారుకు తెలియవచ్చెను. నూర్లకొలది స్త్రీలను పిండారీలు చెరచగా వారు అవమానాన్ని భరింపలేక బావులలో పడి చచ్చిరి. యువతులను ముగ్గురి నల్గురి కలగట్టి మూటలవలె తమ గుర్రాలపై వేసి బానిసలుగా అమ్ముకొనుటకు తీసికొనిపొయిరి." (R. Williams P. 141-43.)

పిండారీలు స్త్రీలను వారి భర్తలయెదుటనే చెరిచెడివారు. తాము తీసుకొని పోజాలని వస్తువులనైన వదలక వాటిని ధ్వంసముచేసి పోయెడివారు. ధనము దాచిన తావులు చూపనివారిముఖానికి ఉడుకుడుకు బూడిదను సంచులలో నింపి కట్టి వీపున గ్రుద్ది ఆ బూడిద వారినోళ్ళలో ముక్కులలోపోసి ఊపిరి తిరుగకుండునట్లు చేసెడివారు. తర్వాత వారు చాలాకాలము బ్రదుక కుండిరి. జనులను వెలకిల పండబెట్టి ఎదలపై పెద్దపలకలబెట్టి వాటిపై జనులచే త్రొక్కించెడివారు. ఇట్టి అమానుషకృత్యా లెన్నో చేసిరి. పిండారీలలో మరాటీ లెక్కువైనను వారితో బాటు మొగల్ రాజ్య సేనాభ్రష్టులును, దోపీడీల రుచి గొన్నవారును నగు ముసల్మానులు పెక్కుండిరి. వారి స్త్రీలు వారివెంట నుండిరి. హిందూ స్త్రీలవలె వేషాలు వేసుకొని హిందూ దేవతలనే కొలిచెడివారు. (బహుశా వారు పూర్వము హిందువులై బలవంతముగా ఇస్లాం మతము పుచ్చుకొన్న వారి సంతతియై యుందురు). వారు సవారిచేసి బయళ్ళలో సంచరించి కర్కశకాయలై మగంగులై మగవారి నెత్తి దన్నినవారైన లంకిణీలు మగవారికంటే వారే రాకాసి పనులుచేసి కరుణ అన్న దే కోశమందును కాసంతయు లేనివారై ప్రజల హింసించు చుండినందున జనులు వారిని చూస్తే నిలువున నీరయ్యేవారు. ఈ ఘోరాలు ఎక్కవగా కంపెనీ ఇలాఖాలలో కావడము చేత తుదకు హేస్టింగ్సు గవర్నరు జనరల్ 1,200,000 సైన్యమును సమీకరించి వారిని ధ్వంసము చేసెను.

పిండారీపీడ దేశానికి తప్పెను కాని మరొక ఈతిబాద దేశానికి తగుల్కొనెను. అది ఠగ్గుల బాధ. తెనుగులో టక్కు, టక్కరి అన్నపదము కలదు. "పట్టుకొని చాగర గొన్న బలే యెరుంగు, టక్కరి, బలుమోపు మోచు నయగారితనం బది యుట్టి గట్టినన్" అని 1300 ప్రాంతమందుండిన నాచన సోమన వాడెను. ఠగ్, లేక మరాటీఠక్ అను పదాలకు మన టక్కుకు టక్కరికి యేమైన సంబంధముండునా! ఠగ్గు వృత్తిచర్చ క్రీస్తుశకము 13వ శతాబ్దములోని ఫీరోజు ఖిల్జీ డిల్లీ సుల్తానుల కాలమందు కలదు. అతడొకమారు 1000 మంది ఠగ్గుల శిక్షించెను. అనగా అంతకంటే పూర్వము నుండియే యీ విధానముండినది. అది మన సమీక్ష కాలపు అరాచక స్థితిలో విజృంబించెను. అందు తురకలునూ ఉండిరి. అందరును కాళీ పూజకులే. సంఘములో చేరు వారికి దీక్ష యిచ్చెడివారు. వారిలో సంకేతము లుండెను. వారు నానా వేషాలతో బాటసారులలో కలిసి వెళ్ళి వారిని చంపి దోచేవారు. వారి ఆయుధము రెండు మూరల దస్తీబట్టయే. దాని నొక మూల ముడివేసు మనిషి గొంతులో వేసి లాగి ఊపిరాడకుండా గుటుక్కు మనునట్లు చంపేవారు. ఆ క్రియ యంతయు రెండు క్షణాలలోనే ముగిసేది. వారిలో నిజాముద్దీన్ ఔలియా అనే ప్రసిద్ద భక్త ఫకీరు కూడా 1400 ప్రాంతములో చేరి యుండెను. వారికి ధనికులు జమీందారులు ఆశ్రయమిచ్చి వారు తెచ్చినదానిలో భాగము పొందిరి. అట్టి ఠగ్గులు ఉత్తర హిందూస్థానములో అధికముగా నుండినను వారి బాద రాయల సీమలో కొంతవరకు, హైద్రాబాదు రాజ్యములో చాలావర కుండెను. హైద్రాబాదు నగరములోని కారవాన్ నరే, చెన్నరాయని గుట్ట, షాలీబండా ప్రాంతాలలో వారు నివసించి ప్రయాణీకుల వెంటనంటి చంపేవారు. నిజామాబాదు, అదిలాబాదు ప్రాంతలలో వారు మరీ హెచ్చుగా నుండిరి. వారి చరిత్ర వివరాలను మెడోస్ టెయిలర్ (Canfessions of a Thug) వ్రాసెను. అమీరలీ అను వాడు 719 మందిని చంపి యుండెననియు వాడు ఠగ్గులలో అగ్రనాయకుడనీ అతడు వ్రాసెను. తుదకు 'ఠగ్గీ' స్లీమన్ అను బిరుదము పొందిన స్లీమన్ అను ఇంగ్లీషు అధికారి 1831 నుండి 1832 వరకు ప్రత్యేక ఠగ్గు విచారణ కర్తయై 3266 ఠగ్గులను పట్టి వారిలో చాలామందిని ఉరికంబ మెక్కించి దేశాన్ని వారి నుండి రక్షించెను.

బందిపోటు దొంగతనా లెక్కువగా పెరిగిపోయెను. తెలంగాణములో అరబ్బులు, రోహిలాలు నిరంతర మీ పనిలోనే యుండిరి. (ఆ వివరాలకై బిల్గ్రామీ గ్రంథము చూడదగినది.)

పంచాయతీల విధ్వంసము

రాజ్యాలు నాశనం కానీ, సామ్రాజ్యాలు మారనీ, రాజవంశాలు ద్వంసము కానీ, కొత్తవంశాలు రాజ్యానికి రానీ లేశమాత్రమైన వాటిముచ్చట గ్రామాలకు కాబట్టకుండెను. తమ పంచాయతీ రాజ్యము చల్లగానుంటే అదే మనపూర్వులకు పదివేలు. అదే వారికి శ్రీరామ రక్ష. అదే వారి రామరాజ్యం. పంచాయతీ తీర్పులలో కొన్ని మార్పుల న్యాయాలుండెను. అట్లు లేకుండిన పంచాయతీ రాజ్యమునకు వైకుంఠానికి భేదముండదు గదా! లోపములేని మానవసృష్టి యుండునా? కాని అవి ఇంగ్లీషు వారి కోర్టులకంటే అక్షరాలా వేయింతలు మేలైనవి. దక్షిణములో తమిళ రాజ్యములోను ఏటేట పంచాయతీ పెద్దల యెన్నికలు జరిగెను. ఆ పెద్దలు సివిల్ క్రిమినల్ (ధనోద్భవ, హింసోద్బవ) అభియోగాలను విచారించిరి, పన్నుల వసూలు, గ్రామపారిశుద్ద్యము, విద్య, ఆరోగ్యము, దేవతా నిలయములను స తాలను సాగించుట మున్నగునవన్నియు వారి అధీనమే. ఇంగ్లీషువారు మనదేశమును గెలిచి మనము అనాగరికులమని మనకు సభ్యతయే లేదని, మన మతము అటవిక మతమనీ, మన విద్యలు చెత్తలనీ భావించిరి. పైగా తమ ఆచారాలు, తమ విధానాలు, తమ విద్యలు, తమ అధిక్యత మనపై మోపుటకు నిశ్చయించిరి. అందుచేత మన పంచాయతీలను తొలగించి తమ అదాలతులను, సదరదాలతులను, దీవానీలను, తర్వాత కోర్టులను స్థాపించిరి. స్టాంపు, ఫీసు, ముడుపులు, సాక్షులభత్యాలు, కోర్టులకు ప్రయాణాలు, అప్రమాణాలు, వకీళ్ళ తర్కాలు, కుతర్కాలు, వితండవాదాలు, ఖానూనుల పేచీలు బారీకులు, అన్నియు ప్రబలెను. పంచాయతీలతోనే మన పూర్వధర్మాలుకూడా మాయమయ్యెను. పూర్వము హింసలు అపరాదములు చేసిన గ్రామమందే విచారణ జరిగెను. కాన అబద్దాలకు కూటసాక్ష్యాలకు వీలు తక్కువగా నుండెను. అప్రమాణము చేయుట వంశనాశన హేతువని జనులు భయపడెడివారు. పంచాయతీ పెద్దలును ధర్మాసనమందు కూర్చుని ధర్మముగా తీర్పులు చెప్పిరి. అవన్నియు కోర్టులద్వారా ధ్వంసమయ్యెను. ఇప్పుడు మరల పంచాయితీలను అడ్డాదిడ్డిగా ఉద్దరింప జూస్తున్నారు. కాని జాతిలోనే సంపూర్ణమగు మార్పు వచ్చినందున వాటికి జయము కలుగునన్న ఆశ తక్కువే.

అదే విధముగా జమీందారీ విధానమువల్ల, రైతువారీ విదానము వల్ల గ్రామసాముదాయిక వ్యవసాయ సంఘాలు (Village communities) నాశన మయ్యెను. ఈ వివరములను మెయిన్ అను ఇంగ్లీషు గ్రంథకర్త (Village Communities in Ancient Inadia) అను గ్రంథమందు చాలా విరివిగా వ్రాసెను.

తెలంగాణములోను మరాట్వాడాలోను ప్రభుత్వము గ్రామాలను పట్టీలుగా కూర్చి వాటి భూమి పన్నును గుత్తేదారులకు వేలం వేసిరి. అట్టి గుత్తాలలోనే వనపర్తివంటి సంస్థానా లేర్పడెను. తర్వాత సర్ సాలార్జంగు కాలములో (ఇంచుమించు 1840 ప్రాంతములో) జిల్లా బందీ యేర్పడెను. ఈ కాలములో ఆంధ్ర చిత్రకళ తన ప్రత్యేకతను గోల్పోయెను. మనకు ప్రాచీనుల చిత్రాలు లభించలేదు. లేపాక్షిలోని కుడ్యచిత్రాలు కొన్ని మాత్రము శిథిలావస్థలో ఇటీవల బయలుపడినవి. అవి చాలా సుందరమైనవి. వాటిలో విశిష్టతయు ప్రత్యేకతయు కలదు. విజయనగర కాకతీయ చిత్రాలు ముసల్మానుల విధ్వంసన క్రియవల్ల మనకు లభ్యము కాకపోయెను. వేమన కాలములో చిత్రకారులు "ఇంగిలీక మహిమ హేమింపనేరక" ఇంగిలికాన్ని రంగులకు వాడిరి. ప్రాచీన చిత్రకారుల పేర్లు కాని శిల్పాచార్యుల పేర్లుకాని మనకు తెలియవు. చిత్రకారుల వంశములు క్షీణిస్తూ ఈ సమీక్షాకాలములో మిగిలిన జమీందారుల నాశ్రయించెను. మొగల్ చిత్రకళా విధానమే భారతదేశ మంతటను వ్యాపించెను. తెనుగు చిత్రకారులును దానినే అనుసరించిరి. రెండవ నిజాం దర్బారును బంగారు నీరుతో నానావర్ణములతో అతిసుందరముగా "వేంకటయ్య" అను చిత్రకారు డీ కాలమందే చిత్రించెను. దాని మూలప్రతి నవాబ్ సాలార్జంగు బహద్దరుగారివద్ద కలదు. దానినే పిక్టోరియల్ హైదరాబాదు అను దానిలో ముద్రించిరి. ఆ పటము మీద వెంకటప్పయ్య రచన అని మాత్రమున్నది. పేరునుబట్టి అతడు స్పష్టముగా ఆంధ్రుడే. ఇదే సమీక్షాల మందు కర్నూలు నవాబుల నాశ్రయించిన కొందరాంధ్ర చిత్రకారుల వంశాలుండెను. వారి చిత్రాలను జూచి ఆ కళకు కర్నూలు కళ (Kurnool School of Painting) అని కొంద రాధునిక నిపుణులు పేరుపెట్టిరి. కర్నూలు నవాబుల పతనం 1835 తో పూర్తి అయ్యెను. దానితో ఆ చిత్రకారుల పతనమున్నూ జరిగెను. గద్వాలలో సోమనాద్రి అను మహావీరుడు 1760 ప్రాంతములో నుండెను. అతని చిత్తరువులు అతని తర్వాతివారి చిత్రములు 50 ఏండ్ల క్రిందటి వరకు గద్వాలలోని చిత్రకారుల వంశమువారు రచించిరి. వారు గద్దయీకల మూలములలో ఉడుతతోక వెంట్రుకలను కుచ్చుగా కట్టి, సన్నని చిత్రరేఖలను వాటితో తీర్చెడివారు. 200 ఏండ్ల క్రిందట గద్వాలలో కట్టిన కేశవాలయములోని ఒక గోడపై గచ్చుచేసి దానిపై పురాణ చిత్రములను వ్రాసినారు. కాని ఎర్రమన్ను సున్నమే తమ ముఖ్య వర్ణములుగాగల తర్వాతి దేవాలయాధికారులు వాటిలో కొంత భాగాన్ని సున్నముపూసి చెరచినారు. చాలా ప్రాంతాలలో పూర్వపు చిత్తరువులపై శిల్పములపై గచ్చుమెత్తి ఎర్రమన్ను సున్నము పట్టెలు పెట్టుట కానవస్తున్నది. గద్వాల సంస్థానము వారు 250 ఏండ్ల క్రిందట సంస్కృతలిపిలో భారతోద్యోగ పర్వాన్ని వ్రాయించి, ఆగ్రంథము నిండుగా చిత్తరువులు వ్రాయించినారు. (ఆ ప్రతి యిప్పుడు రెడ్డిహాస్టలులో కలదు) అవి సుందరముగానే యున్నవి. కాని భీష్ముడు ఔరంగజేబువలె, ధర్మరాజు అక్బరువలె, భీముడు మాహాదజీ సింధియావలె, ద్రౌపది ముమ్తాజ్ బేగంవలె, గాంధారి అహల్యాబాయివలె ఉన్నారు. అనగా అంతా మొగలాయిలే! పెద్దాపురము సంస్థానములోని కొన్ని చిత్తరువుల నిటీవల భారతిలో ప్రకటించినారు. వాటిని చూచినను అదే బావన కలుగును. బొబ్బిలి ప్రసిద్ధికల సంస్థానము కదా. అందు చిత్తరువు లుండినచో ప్రకటించుట చాలా యవసరము. తాండ్ర పాపారాయని చిత్తరు వుండినచో దాని కెంతైన విలువ యుండును. ఉత్తర సర్కారు జమీందారీలలోని చిత్తరువులు, గ్రంథాలయ విశేషాలు, ప్రాచీనాయుధాలు, ఉడుపులు, మున్నగున వెట్టివో తెలిపిన బాగుండును. హైద్రాబాదులోని రాజా శివరాజ బహద్దరు సంస్థానములో సాలార్జంగు ఎస్టేటులో, పలువురాంధ్రులు చాలా సుందరమగు చిత్తరువులను చిత్రించినట్లు ప్రతీతి. 300 ఏండ్లనుండి చిత్రించిన చిత్రాలు వేల కొలదిగా విదేశాలకు పోయెను. దేవిడీలనుండి దొంగిలించి చిత్రాలు హైద్రాబాదు జుమేరాత్ (దొంగ) బజారులో ప్రతివారం అల్పక్రయాలకే అమ్మేవారు. నేటికిని ద్రవ్యమున్నవారు హైద్రాబాదులో 200 ఏండ్లనాటి 100 ఏండ్లనాటి చిత్తరువులను విచిత్రశిల్ప వస్తువులను సేకరింపగలరు. వీటి సమృద్ధిని బట్టి హైద్రాబాదులో కళ లత్యంతముగా పోషితమై యుండెననుట న్యాయము. తంజావూరిలోని చిత్తరువులు కొన్ని ముద్రితమైనవి. అవి మనకు చాలా ఉపకరించినవి. వాటివల్లనే మనము త్యాగరాజును, వేమనను, తంజావూరి కొందరి రాజులను చూడగలిగినాము.

కలంకారీ అద్దకపు సూచన పూర్వ ప్రకరణాలలో చేయనైనది. ఈ యద్దకము తెలుగుదేశ మంతటనూ నుండెను. కాని ఉత్తర సర్కారులలో కృష్ణాజిల్లాలోను అందునూ బందరులోను వాటికి ప్రసిద్ది కలిగెను. కలంకారీ అద్దకానికి దేశీరంగులనే గట్టిరంగులనే వాడిరి. 'పెట్టె' రంగులు జర్మనీనుండి కారుచౌకగా దిగుమతియైన యీ 50 ఏండ్లలో మన దేశీ రంగులు తక్కిన పరిశ్రమలతోపాటు మాయమయ్యెను. 1920 ప్రాంతములో సర్ ప్రపుల్ల చంద్రరాయిగారు దేశీరంగ్ అను పుస్తకమును వ్రాసిరి. అదిప్పు డెందరివద్ద కలదు? మన అద్దకమువారు దాని నెరుగరు. అద్దకమువారిని ఉర్దూలో రంగ్రేజీ (రంగు వేయువాడు అని యర్థము. ఇది ఫార్సీ పదము) అనిరి. అదొక కులమై, అదే పేరుతో నిలిచినది. కర్నూలులో వారి దొక వీధియే కలదు. వారినే జీన్‌గర్ అనిరి. అదియు ఉర్దూ పదమే. కొన్ని ప్రాంతాలలో వారిని ఉనుపులవారు అనిరి. తెలంగాణములో రంగ్రేజీ వారు కొల్లలుగా కలరు. వారు పూర్వము నీలి, ఎరుపు, లత్తుక, మున్నగురంగుల వాడిరి. పైగా మైకావంటి తళుకులను వాడిరి. ఈ తళుకులను ముసల్మాను లెక్కువగా పసందు చేసేవారు. ధనికులు బంగారు వెండి రేకులను రంగులతోపాటు చీరల కద్దించువారు. ఉతికినను పోనట్టుగా నిపుణతతో వాటి నద్దువారు. ఆధునిక కాలములో పూర్వపు కట్టెదిమ్మెలతోపాటు రాగిసీసము, జింకు పోతదిమ్మెలనుకూడా అధికముగా వారు వాడుతున్నారు. వారి రంగులన్నియు నిప్పుడు విదేశీ రంగులే.

ఈ సమీక్షాకాలములో ఒక్క హంసవింశతి తప్ప మన సాంఘిక చరిత్రకు పనికివచ్చు ప్రబంధములేదు. ఉత్తమ కవిత సన్నగిల్లెను. తంజావూరుకు తెనుగుసీమ కవులు కళానిదులు వలసపోయిరి. కాని ఇంగ్లీషు వారు తంజావూరును గూడా దిగమ్రింగిరి. కవితలో ఉత్తమరచన లీకాలమందు లేకున్నను ఒక్క త్యాగరాజు మాత్రము ఈ కాలమందు సంగీతమున కఖండ జ్యోతిగా దక్షిణా పథమందు వెలిగెను. త్యాగరాజు క్రీ.శ. 1759 నుండి 1847 వరకు ఇంచుమించు 88 ఏండ్లు జీవించినవాడు. అతడు తంజావూరు జిల్లాలోనివాడు. చిన్నతనమందు సొంటి వెంకటరమణయ్య అను ప్రసిద్ధాంధ్రగాయకునివద్ద సంగీత మభ్యసించెను. త్యాగరాజు రామభక్తుడు. నిజమగు త్యాగి. మాధుకరముచే జీవించెనేగాని రాజుల ప్రార్థనల నంగీకరించి వారి నాశ్రయించినవాడు కాడు. అతన్ని తంజావూరి మరాటారాజగు శరభోజియు, తిరువాన్కూరు రాజున్నూ తమ ఆస్థానాలకు రమ్మనికోరిరి. కాని "పదవి సద్బక్తి" అనే పాట పాడి రాముని పాదాలే తన యాస్థానమని వారి ప్రార్థనల నిరాకరించెను.

ఈ సమీక్షాకాలమందే కృష్ణాజిల్లాలో నారాయణ తీర్థులను ఆశ్రమ స్వీకారము చేసిన ఆంధ్రుడుండెను. అతడు కృష్ణలీలాతరంగిణిని సంస్కృతములో రచించెను. ఆ తరంగాలు తెనుగుదేశ మందే కొంత వ్యాప్తిగన్నవి. అతని పుస్తకమును తెనుగు లిపిలోనే (వావిళ్ళలో దొరకును) ముద్రించిరి. నాగర లిపిలో లేనందున దేశాంతరఖ్యాతి రాకపోయెను. అది జయదేవుని గీతగోవిందమున కే మాత్రమున్నూ తీసిపోదు. దాని కెక్కువ ప్రచారము కావించుట ఆంధ్రుని విధి.

ఇదే కాలమందే క్షేత్రయ్య తన పదములను వ్రాసెను. అవి జావళీలు శృంగార భూయిష్ఠములు. దేశమందు వ్యాప్తిలో నుండినట్టివి. క్షేత్రయ్యపదాలు ముద్రితమేకాని శృంగారమంటే భయపడే అధికారుల భయానికేమో దానికి వ్యాప్తి కానరాదు.

సారంగపాణి పదాలు అనునవి కలవు. సారంగపాణి రచనలను రెండు మూడు తావులలో ప్రచురించినారు. అందుచేత పాఠ్యభేదాలు వచ్చినవి. (నావద్ద నున్న 50-60 ఏండ్లనాటి ప్రతి వేరుచో ముద్రితమగు ప్రతితో కొంత బిన్నిస్తున్నది) ఈ పదాలుకూడా చాలా చక్కనివి. దక్షిణమున తంజావూరులోను మధురలోను పాటల నెక్కువగా రచించిరి. అనంత ప్రశస్తమైనవి కాకున్నను సమకూర్పదగినవి. ముద్దుపళని అను నామె రాధికాసాంత్వన మను ప్రబంధము వ్రాసెను. అందు చాలా పచ్చి శృంగారమున్నదని శ్రీ వీరేశలింగముగారు నిరసించిరి. పచ్చిది గర్హింపదగినది. శ్రీనాథాదులలో లేని దిందు హెచ్చుగా లేదను కొందును. ఆమె అష్టపదులు అను పాటల రచించెను. అందు కొన్ని శృంగార గ్రంథమండలివారు రచించిరి. కాని అన్నియు సేకరించి ముద్రించుట అవసరము.

అచ్చు

అచ్చును మొదట కనిపెట్టినవారు చీనావారని యందురు. కాని చారిత్రకముగా క్రీ.శ. 16 వ శతాబ్దిలో ఇంగ్లండులో కాక్‌స్టన్ (Caxton) అనువాడు కనిపెట్టినదే ప్రసిద్ధము. అచ్చుతో నూతన సారస్వత యుగ మారంభ మాయెను. మనదేశములో ఉత్తరమున భూర్జ పత్రాలలోను, దక్షిణమున తాటాకులలోను వ్రాసిరి. గంటముతో తాటాకులపై అక్షరాలు పొంకముగా చెక్కుట ఒక కళ యయ్యెను. అందుచేత అదే వృత్తిగా వ్రాయసకాం డ్రేర్పడిరి. ఒక్క మహాభారతమును పూర్తిగా వ్రాయవలెనంటే ఆరుమాసాలయినా పట్టేది. అందులకుగాను 6 తూముల జొన్నలయినా ఖర్చయ్యేవి. ఒక్కొక్క గ్రంథాని కీ విధముగా వ్యయము చేయవలెనంటే ధనికులయినా కావలెను, లేక పండితులై యావజ్జీవము వ్రాసుకొనువారైనా కావలెను. వ్రాయువారి యవస్థను గురించిన యొక శ్లోకమును పూర్వము చాలా గ్రంథాలతుదిలో యిట్లు వ్రాసేవారు.

        భగ్నసృష్ఠ: కటిగ్రీవ: స్తబ్ధదృష్టి రథోముఖం
        కష్టేన లిఖితం గ్రంథం యత్నేన పరిపాలయేత్.

ఈ నష్టకష్టాల నన్నింటిని అచ్చువచ్చిపోగొట్టి జనులను రక్షించినది. మనదేశములోనికి అచ్చు వచ్చుట క్రీ.శ. 1537 లో. ఆ సంవత్సర మందు జెనూయిట్ క్రైస్తవులు మలబారులో తమ బైబిల్ గ్రంథమును మళయాళీ లిపిలో అచ్చువేసిరి. 1679లో కొచిన్‌లో తమిళ నిఘంటువు నచ్చువేసిరి. తెనుగుభాషలో మొదటి అచ్చుపుస్తకముకూడా బైబిలే అయియుండును కాని మనకు తెలియదు. క్రీ.శ. 1807 లో తెనుగు వ్యాకరణ మచ్చుపడెను. 1856 లో కాల్డ్వెల్ అను ఇంగ్లీషు పండితుడు తమిళమును అభ్యసించి "ద్రావిడ భాషల వ్యాకరణము" అను భాషా తత్త్వశాస్త్రమును వ్రాసెను. ఈనాడు దానిని తప్పులు పట్టువారు బహుళము. కాని ఒక విదేశిపండితుడు మన భాషల నేర్చుకొని వాటిని చక్కగా గ్రహించి పరిశోధించి ఒక భాషాశాస్త్రమును 90 ఏండ్ల క్రిందట వ్రాసెనని అతని ప్రజ్ఞ అతనియుపజ్ఞ శతథా ప్రశంసింపతగినవి. ఇదే కాలములో బ్రౌన్ అను ఇంగ్లీషువాడు మన తెనుగులో చాల గొప్ప పాండిత్యమును సంపాదించి ఆంధ్ర నిఘంటువును, వ్యావహారిక కోశమును వ్రాసెను. ప్రాచ్య లిఖిత పుస్తకాగారానికి అతడే జనక స్థానీయుడు, అతని పుణ్యమా అన్నట్లు ఎన్నో ఉత్తమ గ్రంథాలు సేకరింపబడి రక్షింపబడెను. అతడు మెచ్చుకొన్న గ్రంథము వేమన పద్యాలు. వాటిని ఇంగ్లీషులోనికి అనువదించి ప్రకటించెను. ఇదే కాలములో మెకంజీ అను ఇంగ్లీషువాడు లోకల్ రికార్డులను (స్థానిక కైఫీయత్తులను) ఆంధ్రప్రాంతాలనుండి సమకూర్చి తెప్పించి యుంచెను. అచ్చుయంత్రాలకు మద్రాసు ముఖ్యస్థానమయ్యెను. నేటికినీ తెను గచ్చునకు మద్రాసే ప్రసిద్ధికాంచినది. ఇదేకాలమందు గద్వాలలో, వనపర్తిలో తెను గచ్చు యంత్రాలు స్థాపితమై గ్రంథాలు ముద్రిత మయ్యెను. ఈ రెండు సంస్థానములలోని అచ్చు యంత్రాలు యించుమించు 80 ఏండ్ల క్రిందటివి. ఈ రెండు సంస్థానాలున్నూ తెనుగు భాషకు చాలా గొప్ప సేవజేసినవి.

ముద్రణ విధానము మన సారస్వతాని కొక నూతన యుగము. దానితో మన భాషాభివృద్ధి విరివిగా అవుతూ వచ్చినది. కాన మన తాతల తరమువారు అచ్చుయొక్క గొప్పతనాన్ని ఏలనో గుర్తించి స్తుతించినవారు కారు. నస్యముపై, పొగాకుపై, నల్లిపై పద్యాలు వ్రాసినవారు అచ్చుపై కొన్ని అల్లియుండరాదా? ఈ విషయాలను గురించి శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి 'తెనుగు తోబుట్టువులు' అను గ్రంథమును, కాల్ డ్వెల్ గారి Grammar of Dravidian languages అను గ్రంథమును చదువవలెను.

గొప్ప మార్పులు

ముసల్మానుల కాలములో హిందువులందు మార్పు ఎక్కువగా కానరాలేదు. ముసల్మాను ప్రభువులు ఇస్లాం వ్యాప్తికి, హిందూవినాశనానికి అందరున్నూ (అక్బరుతోసహా) పరిశ్రమించినవారే. పైగా హిందువుల అభివృద్ధికి కావలసినన్ని నిరోధాలు శాసించిరి. జహంగీరు, షాజహాన్, ఔరంగజేబు దేవాలయ నిర్మాణాలకు సెల వియ్యలేదు. ముసల్మానులయినవారు తిరిగి హిందువులయితే ఘోర శిక్షల నిచ్చుచు, నిరోధక శాసనాలు చేసిరి. ఔరంగజేబు బళ్ళను కూడా పెట్టుకొన నియ్యలేదు. హిందువులకు కొన్నితప్ప ఏ యుద్యోగాలున్నూ ఇయ్యలేదు. కావున హిందువులలో మార్పు కానరాలేదు.

ఇంగ్లీషువారు తా మధికులమని వచ్చిరి. ఈ సమీక్షాకాలములో దేశీయుల కుద్యోగా లియ్యకపోయిరి. తమ ఆచార వ్యవహారాలను మోపిరి. ఇంగ్లీషు విద్యనే చెప్పించవలెనని మెకాలే పెద్ద నివేదిక సమర్పించెను. బెంటిక్ గవర్నరు జనరల్ దాని నంగీకరించెను. ఈ సమీక్షాకాలములో విద్యకై ఇంగ్లీషువా రేమియు వ్యయము చేయలేదు. తుదకు 1855 లో మద్రాసు, కలకత్తా, బొంబాయి విద్యాపీఠాలను నెలకొల్పిరి. జనులు ఫార్సీకి వీడ్కోలు సలాము కొట్టి ఇంగ్లీషుకు (వెల్కం) స్వాగతం చేసిరి. కంపెనీ కాలములో మన విద్యల నెట్లు నాశనము చేసిరో ఆ వివరాలను చాలా విపులముగా మేజర్ బాసూగారు (Education under the E.I Co. అను పుస్తకములో) వ్రాసిరి. అభిలాషులు దానిని చూడగలరు.

ఇంగ్లండులో స్టీం యంత్రాలు విరివియయ్యెను. రైల్వేలు, స్టీం నావ వాడుకలోకి వచ్చెను. టప్పాతంతీ ఏర్పాట్లు జరిగెను. కాని వాటిని వారు వెంటనే హిందూస్థానములో ప్రవేశపెట్టలేదు. చాలాకాలము తర్వాత ప్రారంభించిరి. ప్రారంభించినను తమ మిలిటరీకి, తమ వ్యాపారాని కవసర మగునంత వరకు చూచుకొనిరి. "అనంశౌ క్లీబతితౌ" అని కుల మత భ్రష్టులకు హిందువుల తండ్రి ఆస్తిలో భాగము లేదనిరి. అది క్రైస్తవ మతవ్యాప్తి కాటంకమని 1856 లో ఆ యాటంకమును తొలగించి భాగ మిప్పించు శాసనము చేసిరి. కొన్ని రోడ్లు, కొన్ని కెనాలులు నిర్మించిరి. 1853 లో తంతీ (టెలిగ్రాం) స్థాపించిరి. అంతకు కొద్ది ముందుగా టప్పా ఏర్పాటు చేసిరి. రైల్వే నిర్మాణము కూడా డల్‌హౌసీ కాలములో ప్రారంభించిరి. 1856 వరకు 200 మైళ్ళ రైల్వే లైను వేయబడెను.

సతీ-సహగమనము అను భయంకర దురాచారము హిందువులలో ప్రబలి యుండెను. అది బెంగాలు, బీహారు, రాజపుత్ర స్థానములలో హెచ్చుకాని తెనుగుసీమలో అరుదై యుండెను. రాజా రామమోహనరాయల ప్రోద్బలముతో 1829లో దానిని నిషేధించిరి. దేశమును జిల్లాలుగా విభజించి లేక పూర్వము వాటినే జిల్లాలుగా పరిగణించి ఇంగ్లీషు కలెక్టర్ల నేర్పాటు చేసిరి. ఈ విధమగు చిల్లర మార్పులు మరికొన్ని జరిగెను. ఇట్లు తిన్నగా మనము ఆధునిక యుగములో పడినవార మయితిమి. 1856 లో వితంతూద్వాహ శాసనము చేసిరి.

డల్‌హౌసీ 1856 లో వెళ్ళిపోయెను. హిందూ మసల్మానులు-అందెక్కువగా ముసల్మానులే-తమ ఆధిక్యత పోయెననియు అందరును పరాధీనులయిరనియు, తమ మతాలకు, ఆచారాలకు అఘాతము కలుగజొచ్చెననియు గ్రహించిరి. దాని ఫలితమే 1857 నాటి సుప్రసిద్ద విప్లవము. అది జాతీయ వికాసమునకు మొదటి ప్రయత్నము. ఈ సమీక్షా కాలములో ఆంధ్రుల పతనము సంపూర్ణమయ్యెను. వాఙ్మయము, కళలు, పరిశ్రమలు అన్నియు ఇంచుమించు శూన్యస్థితికి వచ్చెను. 1857 భారత చరిత్రలో ముఖ్యాతి ముఖ్యఘట్టము. దానితో మనము ఆధునిక యుగములోనికి వచ్చినాము.

ఈ ప్రకరణానికి ముఖ్యాధారములు

1. అయ్యలరాజు నారాయణకవి:- హంసవింశతి, ఇతడు అడుగడుగున మొదటినుండి తుదివరకు శుకసప్తతి ననుకరించినాడు. అయినను కొన్ని కొత్తవిషయాలు తెలిపినాడు. ఇతడు 1800 ప్రాంతమువాడు. ఇతడు నెల్లూరివాడని వావిళ్ళవారు, కర్నూలు వాడని శృంగార గ్రంథమండలి రాజమండ్రివారు పీఠికలలో వ్రాసినారు. ఉభయులు ఆధారాలు చూపలేదు. శృంగార గ్రంథమండలివారి పీఠీక ఉత్తమమైనది. వావిళ్ళవారి పీఠిక మంచిదికాదు.

2. భాషీయ దండకము:- గండూరు నరసింహకవి. ఇతడు కర్నూలువాడు. 1800 ప్రాంతమువాడు. భాష కర్నూలు గ్రామ్యము. ఇందు కొంత హాస్యము, అపహాస్యము, బూతులు కలవు. దీనిని రామా అండుకోవారు ముద్రించినారు. నావద్ద 50 ఏండ్లక్రిందటి ముద్రిత ప్రతి కలదు. నా ప్రతిలో ఎక్కువభాగాలు, భిన్నపాఠాలు కలవు. రెంటిని కలిపి సమన్వయించి పీఠికతో కర్నూలు వ్యవహారికమున కర్థాలతో ముద్రించుట అవసరము.

3. India under Early British Rule R. C. Dutt

4. V. Smith-Oxford History of India

5. కూచిమంచి తిమ్మకవి:- కుక్కుటేశ్వర శతకము. ఇతడు బహు గ్రంథాలు వ్రాసినాడు. కాని అన్నియు పిచ్చిపిచ్చి పాతకాలపు అష్టాదశ వర్ణనలే, ఇదొక శతకమే మనకు కాస్త పనికివచ్చేది.

6. గువ్వల చెన్నశతకము:- ఇది చాలా పనికివచ్చునట్టిది.

7. ఏనుగుల వీరాస్వామి:- కాశీయాత్ర చరిత్ర. ఇతడు నవీన పాశ్చాత్య పద్ధతిని ఇంగ్లీషు మిత్రుల ప్రోత్సాహముతో ప్రవేశ పెట్టెను. ఇది అతని యాత్రకు సంబంధించిన డైరీ (దినచర్య). 100 ఏండ్లక్రిందటి మద్రాసు తెనుగున అతడు వ్రాసినాడు. ఇది మన చరిత్ర కత్యంతముగా ఉపకరించును.

8. Historical and Descriptive Sketch of the Nizam's Dominions Bilgrami 2 Vols. ఈ గ్రంథము చాల విలువకలది.