ఆంధ్రుల సాంఘిక చరిత్ర/అనుబంధము 1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనుబంధము 1

ఆంధ్రపభ సంపాదకీయము

1945 నవంబర్ 22, మంగళవారం

మన తాత ముత్తాతలు

ఏరాజు ఎప్పుడు పాలించాడు? ఎక్కడ? ఏవిధంగా? అతడు ఎన్ని యుద్ధాలను చేశాడు? ఎవరెవరిని గెలిచాడు? లేదా, ఎవరిచేతిలో ఓడిపోయాడు? అత డెందరిని వివాహ మాడాడు? మరెందరిని ఉంపుడు కత్తెలను చేసుకున్నాడు? బహుభార్యాత్వపు సాధక బాధకాలను ఏవిధంగా ఎదుర్కొనాడు - ఇదే ఇప్పటి వరకు మన చరిత్ర.

"నా విష్ణు: పృథ్వీపతి:" అని విశ్వసించబడినంత వరకు రాజుల రాజాస్థానాల కథలే, రాణుల, రాణి వాసాల గాథలే చరిత్ర కావడం ఎవ్వరికీ ఎబ్బెట్టుగా తోచలేదు కూడా.

కాని, రాజు దైవాంశసంభూతుడన్న గుడ్డినమ్మకంరోజులు పోయాయి. చివరికి జపానులో కూడా (మొన్నటి యుద్ధము తర్వాత) హిరోహిటో సయితం సాక్షాత్తు అపరబ్రహ్మ స్వరూపుడన్న మూడ విశ్వాస ప్రాబల్యం సడలింది.

రాజుల రోజులు పోయినందున, ప్రజలే రాజులౌతున్నందున, ఇక చరిత్ర స్వరూపమే మారిపోవాలి. ఇక మీదట చరిత్రకారులు మనకు చెప్పవలసింది ముసలిమగడు రాజరాజ నరేంద్రుని పడుచు పెండ్లాం చిత్రాంగి సవతికుమారునిపై కన్ను వేసిందో, లేదో - ఈ సంగతి కాదు. ప్రతాప రుద్రుని ఉంపుడుకత్తె (ప్రతాపరుద్రుని ఉంపుడుకత్తె చరిత్రను "ఆడుదురు నాటకంబుగ నవనిలోన" అన్నాడు క్రీడాభిరామకర్త) విషయమై కాదు. కృష్ణదేవరాయల దేవేరుల విషయమై కాదు; ఆ దేవేరుల మధ్య వివాదాలను గురించి అంతకంటె కాదు. ఈ ప్రజాయుగంలో వెలవడవలసినవి ప్రజాచరిత్రలు. వీటికే మరొక పేరు-"సాంఘిక చరిత్రలు".

నామమాత్రానికి మన దేశంపై ప్రస్తుతం బ్రిటిష్ రాజుకు మిగిలివున్న పెద్దరికంకూడ తొలగిపోనున్న ఈ సమయంలో, కొన్ని శతాబ్దాల తర్వాత ఆంధ్రులకు తిరిగి ఒక ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడనున్న ఈ సమయంలో ఇట్టి ఒక చరిత్ర గ్రంథం వెలువడ్డం ఎంతైనా సమయోచితం.

దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు (క్రీస్తుశకం 1050 నుంచి 1907 వరకు) తెలుగుజాతి ఏ విధంగా బ్రతికిందో ఈ చరిత్ర కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నది. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో; మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో మన పూర్వు లే దేవరలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి యుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపీడీలు చేసినప్పుడు క్షామా దీతిబాదలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో; జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో"-ఇట్టి అనేక విషయాలు ఈ చరిత్రలో వర్ణితం.

తప్పెట్లు, కాహళములు, కాలి కొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖములు, సన్నాయీలు, డోళ్లు, రుంజలు, చేగంటలు-ఇవి చేరగా ఏర్పడినదే మన పూర్వీకుల మిలిటరీ బ్యాండ్.

తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకరపదాలు, నివాళిపదాలు, వాలేశుపదాలు, వెన్నెలపదాలు, రోకటి పాటలు, బొమ్మలాటలు, కోలాటం, గొండ్లి, చిందు,జక్కిణి, పేరణీ, ప్రేంఖణము, ఉప్పెన పట్టెలాట, బొంగరాలాట, కోళ్ళపందెము, పులిజూదం, పచ్చీసు, సిడి - ఇవి మన పూర్వీకుల గాననృత్య క్రీడావినోదాలు.

ముక్కర, నెత్తిబిళ్ళలు, దండెకడెములు వంకీలు, జోమాల దండలు, తాటంకములు, ముత్యాల కమ్మలు, కాంచీ నూపురకంకణములు, త్రిసరములు, మొరవంక కడియములు, వడ్డాణము, ముక్కు నత్తు - ఇవి మన అవ్వలు పెట్టుకొన్న నగలలో కొన్నిమాత్రం. వెంజావళి, జయరంజి, మంచు పుంజము, మణికట్టు, భూతిలకము, శ్రీవన్నిమ, చీని, మహాచీని, పట్టు పొంబట్టు, నెరపట్టు, వెలిపట్టు, పచ్చని పట్టు, నేత్రంపుపట్టు, సంకుపట్టు, భావజతిలకము, రాయశేఖరం రాయవల్లభం, వాయుమేఘం, గంజవాళం, గండవరం, వీణావళి - ఇట్టి వన్నీ ఒకనాడు మన తెలుగునాట వేయబడిన వస్త్రవిశేషాలు.

ఒకనాడు మన తెనుగుసీమలో ప్రతి బ్రాహ్మణ గృహంలో ఒక గ్రంథాలయం వుండేది. ధనికులు తివాసీలపై కూర్చునేవారు. "బురునీసు దుప్పటులు కప్పుకొనేవారు. అప్పులవారిని "పొంగడ దండల"తో శిక్షించేవారు. దొంగలనుపట్టి "బొండకొయ్యలో" వుంచేవారు; రెండవ భార్యను చేసుకొంటే, ఆమెకు "సవతి కడెము" తొడిగేవారు: యుద్ధంలో ఓడినవారు "ధర్మాచార" పట్టేవారు; తాంబూలం వేసుకోడానికి "పాన్ దానులు ఉపయోగించేవారు; రైతులు ఏరువాకను, "వింతటి పండుగను" చేసుకొనేవారు; కరణాలు "వహి" అనేపుస్తకాలలో లెక్కలను వ్రాస్తూండేవారు; పీనుగులను కాల్చిన బూడిద మచ్చుమందుగా పనిచేస్తుందని దొంగలు నమ్ముతుండేవారు-ఈ రీతిగా శ్రీ ప్రతాప రెడ్డిగారు వ్రాసిన "సాంఘిక చరిత్ర" మన పూర్వీకుల జీవిత విధానాన్ని గురించి చెప్పే విశేషాలకు అంతేలేదు.

ఈ చరిత్ర దాదాపు ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తాఫలం, సాంఘిక చరిత్రకు పనికివచ్చే గ్రంథాల సంఖ్య పరిమితమైనా, ఇందుకు శాసనాల ఉపయోగం నామమాత్రమైనా, ఆచార వ్యవహారాలకు, క్రీడా వినోదాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ పదాల విషయంలోను, పారిభాషిక పదాల విషయంలోను నిఘంటుకారులు "ఒక భక్ష్యవిశేషం" "ఒక క్రీడావిశేషం" అని అర్థం చెప్పి, నిరర్థకులవలె వ్యవహరించినా, ఇట్టి ప్రతిబంధకా లన్నింటిని అధిగమించి, ఆంధ్రజాతి చరిత్రను ప్రతిభా పూర్వకంగా చిత్రించిన శ్రీ రెడ్డిగారు. సంస్తవనీయులు.

ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనడానికి ఉపకరించడమే కాక, ఏయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి దోహదమిచ్చినవో సందర్బానుసారంగా వివరిస్తున్న ఈ మహాద్గ్రంథం ఆంధ్రులకు భావికర్తవ్య పథాన్ని నిర్దేశిస్తున్నది కూడా.

"నాకే యీ గ్రంథము తృప్తి నొసగలేదు" అనే విచారం శ్రీ రెడ్డిగారికి కూడదు. సకలాంధ్రావనికి వారి రచన అపారతృప్తి నివ్వగలదు.

_________