ఆంధ్రుల సాంఘిక చరిత్ర/అనుబంధము 2

వికీసోర్స్ నుండి

అనుబంధము 2

1135, కృష్ణమూర్తిపురం

మైసూరు 30-10-49

మహారాజశ్రీ మాన్యులు సురవరం ప్రతాపరెడ్డిగారి సన్నిధికి, మిత్రుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ చేయు మనవి:-

తాము దయతో పంపిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' కృతజ్ఞతతో అందుకొన్నాను. విడిచే బుద్ధి పుట్టక పూర్తిగా చదివితిని. ఇట్లు ఏకదారగా నన్ను చదివించిన గ్రంథము ఈ మధ్యలో ఇదొక్కటే.

చాలా గొప్పపని చేసితిరి. ఇందు సేకరించి మీరు జతపఱచిన విషయాలు చాలా అమూల్యములు. ఎన్నోవత్సరాలుగా ఏకాగ్రతతో చదివి సంగ్రహింపనిది ఈ పని నిర్వహింపగల్గుట కాదు. స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఆంధ్రసాహిత్యంలో వెలువడిన అనర్ఘగ్రంథాలు కొన్నింటిలో ఈ గ్రంథము అగ్రగణ్యమని నమ్ముతాను.

చదివినప్పుడు నాకు స్పురించిన కొన్ని భావాలను తమ పునారాలోచన కోసము ఇందు సంగ్రహముగా మనవి చేయుదును. ఇది సూచన మాత్రమే; విమర్శ కాదని గ్రహింప వేడితిని.

(1) 'పులి జూదములు, దొమ్మరి ఆటలు తెలుగు వారివే (పీఠిక 7) కాని, కన్నడ దేశమందును ఇవి అంతే వ్యాప్తి గల్గియున్నవి. మొదటిది 'హులికల్లు' అను పేరుతో నున్నది. మరి 'దొమ్మరి' వారిని, డొంబ, దొంబ - అని కన్నడు లంటారు. 'రి' అనునది. ద్రావిడ బహువచన ప్రత్యయము. తెనుగు ప్రకృతికి చేరిన దేమో అమర వ్యాఖ్యాత క్షీరస్వామి (11వ శతకం) న్వపచ జాతులలో 'దోంబ' జాతిని చేర్చినాడు. డోంబర్ అనేదే దొంబర - దొమ్మర - దొమ్మరి - అయి యుండును. (2) 'వైష్ణవము కన్న శైవమే అరవదేశమందు ప్రాచీన తరము' అన్నారు. ఈ సిద్ధాంతము ఇంకా విమర్శనీయము. పరమ ప్రాచీన ద్రావిడ వాఙ్మయములో శివకేశవు లిరువురును గలరు. మరి ఆళ్వార్ల కాల మింకను నిస్సంశయముగా నిశ్చితం కాలేదు. పరస్పర స్పర్ధతోను, సమరసంగానూ ఈ రెండు మతాలూ ప్రవహించినట్లే ఆదినుండి కాన వచ్చుచున్నవి. పు. 20.

అట్లే శ్రీ రామానుజుల కాలమునకు చాలా ముందే వేంకటేశ్వరులను విష్ణుమూర్తిగా ఆరాధించి పాడిన ఆళ్వార్ల సాక్ష్యం సులభముగా త్రీసి వేయరానిది. శ్రీపతి పండితుల భాష్యం పలు సందేహాల కాస్పదమయినది. మరియు చాలా ఆధునికము. రామానుజాచార్యులు చేసినదెల్ల అన్యాక్రాంతమైన మూర్తిని పునస్పాధించడమేనని వారి చరిత్ర. వేంకటేశమూర్తిలో శైవ, వీరభద్ర, స్కంధ, శక్తి చిహ్నాలు కొన్ని కలవనుట సత్యము. దాని నిశ్చిత స్వరూప మిదియని ప్రకృతం నిర్ణయించడం కొంత తొందరపనేమో.

(3) మాహురమ్మకు నగ్నత్వం జైన సంప్రదాయమునుండి వచ్చిందేమో అని శంకించినారు. జైనులలో నగ్న పురుషులున్నారు కాని స్త్రీ దేవతలు అట్టివారొక్కరూ లేరు. ఇదిగాక మనదేశమందలి నగ్నపూజ తాంత్రికము దక్షిణాచారము కన్న ప్రాచీనమైన ఈ వామాచార తంత్ర పంథ బౌద్ధుల మూలాన పరదేశములనుండి మనలో వచ్చి చేరుకున్నదని శోధకులు భావిస్తారు. పు 26.

(4) 'కర్ణాట కిరాట కీచకులు' అని నా పాఠము. కిరాటులు కోమట్లు, లోభులన్నమాట. బోయజాతికి - అందును పల్లకీ మోసేవారికి - ప్రపక్తి లేదనుకొందును. పు. 30.

(5) 'పాలెము' పు. 33. దాక్షిణాత్య పదమను తమ మాటకు ఉత్తరదేశ మందు వ్యవహారంలో లేనిదని అర్థమనుకొంటాను. ఇది ద్రావిడపదం కాదు. పాల్య=పాలింపదగిన-శబ్దము. 'కావలి' అనేఅర్థం తామేవ్రాసినారు. పు. 33.

(6) 'యథార్థముగా బ్రాహ్మణులయందే అన్ని విద్యలు కేంద్రీకృతములై యుండెను'. ఇది తమవంటివారు చెప్పవలసిన అతిశయోక్తి కాదని మనవి; ఇట్టి వాక్యములను అక్షరశ:గ్రహించే అల్పబుద్ధు లెందరో యుందురు కాన, సంస్కృతి, తత్వము-వీరికి సంబంధించిన విద్యలు తప్ప తక్కిన వ్యావహారిక విద్యలన్నీ అందరికీ అందుబాటులో నుండినవే. కనుక రాజులు అపవాదభూతులు కావలసిన డెప్పుడూ లేదని తలంతును. పుట 92.

(7) 'అంతరాళిక యతి గ్రామాబిరామంబుగా' అన్నచోట యతుల సముదాయమనే అర్థము చెప్పుట మేలు. గురులఘుద్రుతాది తాళాంగములను ఒక అందమైన రీతిలో కూర్చుట యతి. ఇది తాళదళ ప్రాణములలో నొకటి. పలువిధములు గలది. అంతేకాని 'జతిగ్రామ విధాన' మను విశిష్టపద్దతి నా దృష్టికి రాలేదు. పుట 122.

(8) పేరంటాలు శబ్దమునకు మీ వ్యాఖ్యయే న్యాయము. సోమశేఖర శర్మగారి అర్థం 'సతి' శబ్దమునకు వలె తాత్పర్యం కావచ్చును. పర్యంత శబ్దం ప్రాకృతంలో 'పేరంతం' అయి తెలుగులో పేరంటము-పేరటముగా మారింది. పేరంటాలు అనగా ఇరుగు పొరుగు స్త్రీ. క్రమంగా శుబాహ్వానానికి తగిన ముత్తైదువ అని చాయార్థం కలిగింది. చేసే శుభానికి 'పేరంటము' పేరైనది. పుట 133.

(9) యక్షకిన్నరాదులు అనార్యులన్నారు. జక్కులు అనునది యక్ష శబ్దభవమని ప్రాకృతవాఙ్మయయం తెలుపుతుంది. కన్నడంలోగూడా 'జక్క' అనే రూపం. అమరసింహుడు - 4వ శతాబ్దంలో యక్షులు దేవయోనులన్నాడు. పరమ ప్రాచీన జైన బౌద్ధవాఙ్మయంనిండా యక్షయక్షిణుల ప్రచారం ఎక్కువగా ఉన్నది. కనుక జక్కులు తెలుగు దేశంవారే అనుట విచారక్షమం కాదేమో. మరియు ఆర్యానార్య శబ్దాలు మన యిప్పటి విజ్ఞానంలో చాలా జాగ్రత్తగా వాడవలసిన వనుకుంటాను. టిబెటులో 'జాక్‌' అనబడు అడవిజాతుల వారున్నారందును, యక్షులదీ ఉత్తర దిగ్బాగమే. ఏమో! పుట 157.

(10) కృష్ణదేవరాయలు హేళనము చేసిన 'రెడ్లు' సామాన్యపు పల్లెకాపులనుకొంటాను. రెడ్డిజాతిని ఆయన పరిహసించెనని తలపనక్కరలేదు. సోమశర్మవంటి కొందరు బ్రాహ్మణబ్రువులను గూడ నితడు పరిహసించెను. కాని అతని బ్రాహ్మణ భక్తి ప్రసిద్ధము. పుట 210. (11) 'పడవాళ్లు' సరియైనరూపము. 'పడతాలు' అచ్చుతప్పని తలంతును. భటుడు అనియే యర్థము. పుట 215.

(12) సాత్తిన-సాత్తిని అనునవి అర్చకుల శాఖలుగావు. వైష్ణవులలో ద్విజ-ద్విజేతర భేద సూచకములు. శాత్తిన-శాత్తాద అను అరువ పలుకుబడి కిది తెలిగింపు ధరించిన-ధరింపని-అని యర్థము. జందెమని శేష మూహ్యము. కనుక సాత్తిన వారు బ్రాహ్మణులు, సాత్తని వారు ఇతరులు. కాబట్టే విష్ణుచిత్తునివెంట సరకులను మోసికొనివచ్చిన అ వైష్ణవులు 'విధినిషేదంబు లెరింగితే' నన్నాడు రాయలు. సాత్తని వారే ఇప్పటి సాతానులు. ఈ యిద్దరికిని తామిచ్చిన లక్షణ మెక్కడిదో యెఱుగను. పుట 221.

(13) శంఖపలకము అరవములో 'చంగప్పలహై' అను దాని పరివర్తనము. మధురలోని ప్రాచీన ద్రావిడ 'సంఘ' అంప్రదాయములకు చేరినది. అరవవ్రాత 'చంక' అనే యుండునుగదా. తెలుగులో అది సంస్కృత వాసనతో 'శంఖ'గా మారిందేమో. ఈ మార్పు ధూర్జటి కాలానికే వచ్చిందేమో. ధూర్జటే స్వతంత్రంగా చేసిన ప్రయోగాలో. అచ్చువేసిన వారు అవివేచనగా చేసిన రూపాలో కాళహస్తి మాహాత్మ్యంలో ఎన్నో యున్నవికదా. పుట 224.

(14) ఇడుమ కట్టు=చేతులు కాళ్లు ఆడించ వీలులేకుండా కట్టిన బందన మనవచ్చును. 'ఇంటి ముందట' అను నర్థము సుగ్రహం కాదు. పుట 231.

(15) 'గర్బమంటపీ'త్యాది పద్యము ఇంకొకమారు తాము చూడ వేడినాను. మాలదాసరికి అభిషేక తీర్థర్హత లేదు; అతని కిచ్చు తీర్థము నేల కడిగిన నీళ్ళే. దానిని గూడ ఇచ్చువాడు 'త్రివర్ణేతర జాతి' వాడే. 'గుడి వెడలి వచ్చు' ఆ మురికి నీటినిగూడా తాకుటకు అతని కర్హతలేదు. ఇంతేకాని ఆ ఘట్టములో మీరు సూచించిన వైష్ణవసంస్కార ప్రియత్వమునకును శూద్రార్చకత్వమునకును అవకాశము కానరాదు. పుట 234.

(16) "కూచి మారమనోజ...కామ సిద్ధాంతములు" 'నాట్యము' లా? పు. 247.

(17) 'రఘునాథమేళ' అనునది వీణ. రాగముగాదు. పుట. 250. (18) 'హుసివోవగా' అంటే అసత్యముకాగా-వ్యర్థముకాగా-అని యర్థము. కన్నడంలో ఇదే అర్థం 'పుసి^' అని ప్రాచీనరూపం తెలుగులో 'ముసి' అని మారింది. శ-ర-చూడుడు. 'అధికముకాగా' అనే అర్థము స్వంతమగును. పుట. 277.

(19) 'త్రొక్కుడు బొమ్మ' ఏదో నాకూ తెలియదు. కాని చరణాభ=కాళ్ళ కాంతి, దానిమీద, బచ్చెన=వన్నె-ఘటింప వడికిరని అర్థము సరసంగా లభిస్తుంది. చరణాభ బచ్చెన-రాట్నపు సామానులు కావు. పుట 282.

(20) 'పొప్పళి' అన్న పదము మా ప్రక్క 'చౌకపు ఇండ్లు' అనే అర్థంలో వాడుదురు. పొప్పళి చీరలు నేటికిని ఈ దేశం కోమటి స్త్రీలకు చాలా ప్రియం. పొప్పాయికాయతో దీనికి సంబంధం మృగ్యం. ఈ పదం కన్నడంలోను కలదు. కదరీపతి కన్నడదేశానికి సమీపంలోనివాడు. పుట. 328.

(21) 'జక్కణి' సరియైన రూపమే దక్షిణ నాట్యపద్ధతులలో నొకడు గాబోలు. పుట. 310.

(22) వేణుగోపాల శతకం పదాల సారంగపాణీ వ్రాసినదని విన్నాను. అతడు తిరుపతికి దగ్గరివాడు. పుట 345.

తమ గ్రంథం నిజంగా నా కెన్నో నూతన విషయాలను తెలిపినది. మరల ఎన్నోమారులు పఠింపవలసి యున్నాను. ఆ గౌరవమే పై భిన్నాభిప్రాయములను మీ పునర్విమర్శకొఱకు నన్ను ఇట్లు వ్రాయ బ్రేరించినది. మీ రన్యధా భావింపరని నే నెఱుగుదును.

మీ గ్రంథం చేతికందిననాడే మా అన్నగారు గోపాల కృష్ణమాచార్యులు ఇక్కడనుండి కొంత పఠించి నావలెనే చాలా సంతోషించిరి. అ నాడే వారు వెళ్ళవలసియుండి పూర్తిగా చూడలేరైరి. ఇంతలోనే వారు హైద్రాబాదుకు వత్తురు. తమ దర్శనము చేయదలచినారు. జ్యౌతిషమందు వారెక్కువ పరిశ్రమించినవారని తాము వినియుందురని నమ్మెదను. మరియు విజయనగర చరిత్ర వారి కభిమానపాత్రము. సాహిత్యమందు చక్కని పాండిత్యము.

చిత్తగింపుడు, మీవాడు

రా. అనంత కృష్ణశర్మ

పై వాటిలో కొన్నింటికి కొంత సమాధాన మవసరమైనది. సంఖ్య (4) తెలంగాణములో బోయీలు అను జాతివారు నేటికిని కలరు. వారిప్పటికి పల్లకీలు మోయుదురు. రాయలసీమలో రాయచూరు గుల్బర్గా జిల్లాలో (బేండర్) బోయజాతి కలదు. అది విజయనగర సైన్యాలలో ముఖ్యమైనదిగా నుండెను. క్రీ.శ. 1600 ప్రాంతములందు కాక మానమూర్తి తన రాజవాహన విజయమందు యుద్ధసైనికులలో బేండర్ బోయలను వర్ణించినాడు.

కర్ణాట కిరాటకీచకులు అను శబ్దములను వాడినందున ఈ అపోహకు తావు కలిగినందున ఈ తడవ కర్ణాటకిరాతులు అని వివరించినాను. భోయి, బోయ అను భిన్నజాతులను నేను వివరించినాను: అంతే.

సంఖ్య (6)-బ్రాహ్మణులలో అన్ని విద్యలు కేంద్రీకరించి యుండెను. అనుటలో విద్యలనగా వేదవేదాంగములను నర్థములలో వాడితిని. మెలకువ తక్కువగుటచే అతివ్యాప్తదోషము చుట్టుకొని ప్రేమస్వరూపులగు మిత్రుల సుకుమారపు మందలింపునకు గురి అయినాను.

సంఖ్య (9) జక్కులు-యక్షులు తెలుగు దేశమువారు కారేమో అని నాకును స్పురించియుండెను. క్రీస్తుశకారంభములో అంతకు పూర్వమందు మంగోలియా ప్రాంతమందు యఛీ (Yuchi) అను జాతి ప్రబలమై యుండెను. వారే యక్షులేమో అని తలచినాను. టిబెటులో "జాక్" అనునది జడలబర్రెకు పేరు. కాన అది కాదనుకొందును. యక్షులు ఆక్సన్ లేక జక్సార్టీసు నదీ ప్రాంతీయులైనను అయి యుందురు.

సంఖ్య (10) కృష్ణరాయలు రెడ్లను హేళనము చేసెననుట తప్పు పట్టుటకు కాదు. అయినను ఆ మాటను గ్రంథమునుండి తొలగించినాను.

సంఖ్య (13) శంఖ శబ్దార్థము ఉత్తమసూచన.

సంఖ్య (16) నాట్యమనుట నా స్థాలిత్యమే. సవరించుకొన్నాను.

సంఖ్య (17) రఘునాథమేళ అనునది రాగమని పిలుతురు. వ్రాసినదే వ్రాసితిని. ఇప్పుడు శ్రీ శర్మగారినే ప్రమాణముగా తీసుకొన్నాను.

సంఖ్య (20) పొప్పడికాయ మనదేశానిది కాదు. దక్షిణ అమెరికానుండి క్రీ.శ. 17 శతాబ్దాంతమందు మనదేశానికి వచ్చెను. కాన కదిరీపతి కాలాని కది లేదని తెలిసియు ఏదో సమాధానము వ్రాసితిని. ఇప్పుడు శ్రీ శర్మగారి సూచన సరిఫొయినది.

సంఖ్య (21) "జక్కిణి" దేవర్లకొలుపులు అని రాయలసీమలో బహు ప్రాంతములందు చేయుదురు. ఎవరైన ఒకయింటిలో హఠాన్మరణ మొందిన ఆ యింట కలుగు విపత్తులకా మృతినొందినదయ్యమే కారణమని ఆమెను "జక్కిణి" దేవరగా నిలుపుకొని ఆ యింట వివాహములకు ముందు ఆ దేవరను గొలుతురు. ఒక చిన్నముంత దానికి మూతగా బొంగరమువంటి ఒక చిన్న మట్టిపిడత - ఇట్టివి మూడు జతలు పెట్టి జక్కిణి చిందులతో, వాద్యముతో, పాటలతో కొలుపులు కొలుచువారిని పిలిపించి దేవర్లను కొలుతురు. ఆ కొలుపులోని ఆటకే జక్కిణి అన్నానేమో అని యిప్పుడు నాకు స్ఫురిస్తున్నది.

ఈ కొద్దిపాటి సమాధానము ఆత్మసమర్థనమునకుగాక ఇప్పుడు తోచిన భావాలను వెల్లడించుకొనుటకే యని మనవి.



సమాప్తము.