ఆంధ్రుల సాంఘిక చరిత్ర/3 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3 వ ప్రకరణము

రెడ్డిరాజుల కాలము

ఒక సామ్రాజ్యము పడిపోయిన వెంటనే చిన్న సామంత రాజ్యాలు తలెత్తుట భారతీయ చరిత్ర పరిపాటి కాకతీయ సామ్రాజ్యము పడిపోయెను. దాని నాశ్రయించుకొని యుండిన సామంతరాజులు, సేనానులు స్వతంత్ర రాజ్యముల స్థాపించిరి. అందు రెడ్డి, వెలమ రాజుల రాజ్యాలు ముఖ్యమైనవి. అదే సమయమందే విజయనగర రాజ్యము కూడా అంకురించెను. ఈ మూడింటిలో రెడ్డి రాజ్యమే దాని పతనకాలము వరకు ప్రాధాన్యము వహించినందునను, వెలమ రాజ్య పరిస్థితులను తెలుసుకొను ఆధారము లించుమించు లేనివగుట చేతను ఈ కాలమునకు రెడ్డిరాజుల కాలమనియే పేరిచ్చుట యవసరమైనది.

రెడ్డి రాజులు, అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు ప్రాంతాలలో క్రీ. శ. 1324 నుండి ఇంచుమించు 1434 వరకు రాజ్యము చేసిరి. వారి రాజ్యవిస్తీర్ణము కర్నూలు జిల్లానుండి విశాఖపట్టణము జిల్లావరకుండెను. దక్షిణమున నెల్లూరి జిల్లాను ఆక్రమించుకొని ఉండెను.

కాకతీయ సామ్రాజ్య పతనముతో తురకలు తెనుగుదేశ మంతటను వ్యాపించుకొని భయభ్రాంతులైన జనులపై అత్యాచారాలు చేసిరి. దేవళముల పడగొట్టి మసీదులుగా మార్చిరి. బలవంతముగా కత్తిచేతబట్టి జనులను తురకలుగా జేయ మొదలిడిరి. దోపిడీలు, హింసలు మొదలుపెట్టిరి. ప్రజలకు ప్రీతిపాత్రులగు నాయకులను మంత్రులను వారి కండ్లయెదుటనే కాల్చి చంపిరి. శాంత చిత్తులైనవారు రెచ్చిపోయిరి.

ముసల్మానులు ఓరుగల్లును ధ్వంసించిన తర్వాత దేశమందు భీభత్సము చేసిరి. దానిచే చిల్లర రాజులు, వారి సైన్యము, జనులు, అందరును దద్దరిల్లి పోయిరి. తురకను చూస్తే జనులు భయగ్రస్తులై పారిపోవునంతటి భీతాహమును జనులలో వ్యాపింపజేసిరి. తురకలు మహాబలాడ్యులు. ఎదిరింప శక్యము కానివారు అని యనిపించుకొనిరి. ఈ భీతి ఇంగ్లీషువారు భారతీయ రంగముపై కెక్కువరకు ప్రజలలో కానవచ్చెను. ఎందుకన క్రీ.శ. 1650-1700 ప్రాంతమువాడగు వేంకటాధ్వరి తన విశ్వగుణాదర్శములో ఈ విషయాలను స్పష్టముగా వర్ణించినాడు.

రెడ్డి రాజ్య కాలమందలి ముసల్మానుల బీభత్సమును అప్పటి రాజులే శాసనములందుకూడ వ్రాయించినారు. ముసల్మానులు 1324 నుండి 1330 వరకు ఆరేడేండ్లపాటు క్రూరకార్యములు తెనుగువారిపై సాధించిరి. అంతలో ప్రోలయ నాయకుడు, కాపయనాయకుడు వారిని తెనుగు దేశమునుండి పూర్తిగా తరిమివేసిరి. ప్రోలయనాయకుని విలసతామ్ర శాసనమందు అప్పటి పరిస్థితుల నిట్లు పేర్కొనిరి.

"పాపులైన యవనులు బలాత్కారముగా వ్యవసాయము చేసినందువలన పంట పర్యాయములు లాగుకొనుటచేత దరిద్రులు, ధనికులు అను భేదము లేక రైతుల కుటుంబములెల్ల నాశనములై పోయినవి. ఆ మహా విపత్కాలమున ధనము భార్య మొదలగు దేనియందును ప్రజలకు స్వాయత్తతాభావము పోయినది. కల్లు త్రాగవలెను. స్వచ్ఛంద విహారము చేయవలెను. బ్రాహ్మణులను చంపవలెను. ఇది యవనాధముల వృత్తి. ఇక భూమిమీద ప్రాణిలోకము బ్రదుకుటెట్లు. ఈ విధముగా రాక్షసులవంటి తురుష్కులవలన పీడింపబడిన త్రైలింగదేశము రక్షించు వారెవరును మనస్సునకు గూడ తట్టక కార్చిచ్చు చుట్టుకొన్న అడవివలె సంతపించి పోయినది."

(రెడ్డి సంచిక, పుట. 11)

"మహమ్మదీయులు వచ్చినారను వార్త వినగానే దుర్గాధిపతులు అశ్వ భటాకులమైన దుర్గములు వదలి భయాకులులై అడవుల పాలగుచుండిరి" అనియు ఆకాలపు శాసనములందు వ్రాసిరి.

(రెడ్డి సంచిక, పుట 13).

అట్టి కల్లోలములో వారికి ప్రోలయ నాయకుడు అను రెడ్డివీరుడు నాయకుడుగా లేచివచ్చెను. అతడు చెదరిన సైన్యాలను కూర్చుకొని సామంతరాజుల తోడుచేసుకొని, తురకలసైన్యాలనోడించి వారిని తరిమివేసి మరల ఓరుగంటిలో తన కుమారుడును, ఆంధ్రసురత్రాణ బిరుదాంకితుడును నగు కాపయనాయకు నితో రాజ్యము చేసెను. కాని, తురకల భయము పోగానే మరల తెనుగురాజులు పరస్పర కలహములతో వినోదించికొనిరి. వెలమరాజులు రాచకొండ, దేవరకొండ కోటలలో తెలంగాణాను పాలించిరి. రెడ్లు తూర్పుతీరమునను, గుంటూరు, కర్నూలు నెల్లూరు జిల్లాలలోను విశేషముగా రాజ్యముచేసిరి. రెడ్డి, వెలమ, రాచవారు అను మూడు తెగలకును నిరంతర వైర ముండెను. పైగా కర్ణాట రాజ్యమనబరగిన హంపీరాజ్యము రెడ్డిరాజ్యమునకు ప్రక్కబల్లె మయ్యెను. గుల్బర్గాలో బహమనీ సుల్తానుల రాజ్య మేర్పడెను. ఆ సుల్తానులలో ఒకరిద్దరు తప్ప తక్కినవా రందరు హిందూద్వేషులై అతి క్రూరముగా వర్తించిరి. ఉత్తరాన ఓడ్రరాజులు సదా దేశద్రోహము చేయుచు ఆంధ్రరాజ్యమును ఆక్రమించి పరిపాలింప జూచుచుండిరి.

ఇట్లు నల్దిక్కుల అలముకొనిన దట్టపు చిక్కులలో రెడ్డిరాజ్యము చిక్కి యుండెను. అట్టిచో నూరేండ్లవర కయినను మొక్కవోక దినదినాభివృద్ధిగా చతుర్దిశల నొత్తుచుండిన శత్రువులను, తురకలను ఓడించుచు రెడ్లు రాజ్యము చేసిరన్న వారిని కీర్తింపవలసినదే. వారు ఒడ్డెల, వెలమల, కన్నడుల, రాచల, తురకల నెదిరించి యుద్ధాలు చేసినదేకాక, అటు బెంగాలువరకును, ఇటు మధ్య పరగణాలలోని బస్తరు వరకును తమ విజయధాటిని సాగించిరి. వారి మంత్రి లింగన గెలిచిన గెలుపు లెట్టి వనగా:-

       "ఝాడేశ వన సప్తమాడె బారహదొంతి
        జంత్రనాడు క్షితీశ్వరుల గెలిచి
        యొడ్డాది మత్స్యవంశోదయార్జునుచేత
        పల్లవాధిపుచేత పలచ మంది
        దండకారణ్యమధ్య పులిందరాజ రం
        భాహివంశజులకు నభయమొసగి
        భానుమత్కుల వీరభద్రాన్ని దేవేంద్ర
        గర్వసంరంభంబు గట్టిపెట్టి
        యవన కర్ణాట కటక భూధవులతో
        చెలిమివాటించి యేలించె తెలుగుభూమి
        తన నిజస్వామి నల్లాడ ధరణినాథు
        భళిరె: అరియేటి లింగన ప్రభువరుండు."

(భీమఖండము, అ 1)

"వంతు నాది" అను పాఠమునకు "జంత్రనాడు" అను పాఠము శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారిది. ఝాడదేశ మిప్పుడు జయపూరు, బొబ్బిలి సంస్థానాల భాగమనియు, సప్తమాడె గంజాము మన్నెదొరల సంస్థానాలనియు, బారహదొంతి ఒరిస్సాలోని భాగ మనియు, జంత్రనాడు ఒడ్డాది విశాఖపట్నంలోని వనియు, రంభ అంటే రంప అనియు శ్రీ మ. సో. శర్మగారే తెలిపినారు.[1]

రెడ్డిరాజులు పండువా సుల్తాను నోడించిరి.[2] పండువా బెంగాలులో, ఇప్పటి మాల్డాజిల్లా.[3] ఇట్టి సాహసముల ప్రకటించిన రాజ్యములో మహావీరులు, దండనాయకులు, యుద్ధ కౌశలమం దారితేరిన సేనాధ్యక్షులు పలువు రుండి రనుటయు, వారు అఖిలాంధ్రుల ప్రశంసలకు స్థానము లైరనియు చెప్పుటలో అతిశయోక్తికాని, ప్రత్యేకాభిమానముకాని లేదు. ప్రోలయనాయకుడు, అనవేముడు, పెదకోమటి, కాటయవేముడు, అనపోతరెడ్డి, లింగనమంత్రి, బెండపూడి అన్నయమంత్రి ముఖ్యవీరులన జెల్లిరి. ఇట్టి రాజ్యకాల మందలి సాంఘిక పరిస్థితులెట్టివో తెలిసికొందము.

మతము

రాజు లే మత మవలంభించుచుండిరో జనులలో బహుళ సంఖ్యాకులు కూడా అదే మత మవలంబించుచుండిరి. "రాజానుమతం ధర్మం" అని జనులు విశ్వసించిరి. ఆంధ్రదేశములో కాకతీయుల కాలమందు విజృంభించిన వీరశైవ మింకను ప్రబలముగానే యుండెను. రెడ్డిరాజులు అత్యంత వీరశైవాభినివిష్టులై యుండిరి. శివక్షేత్రముల నుద్ధరించిరి. శ్రీశైలమునకు మెట్లు కట్టించిరి. ప్రతి దినము ఆరుమారులు శివపూజలు చేయుచుండిరి. అనేక యజ్ఞయాగములు చేసిరి. ప్రభువుల ననుసరించి వారి మంత్రులు, సేనానులు శైవమతమునకు వ్యాప్తినిచ్చిరి.

రెడ్లు శైవులయినను పరమతస్థుల నే మాత్రమైనను బాధించినట్లు కానరాదు కాకతీయులు చేసిన పొరపాటును వీరు చేయలేదనవచ్చును. రెడ్డిరాజ్యము తుదికాలములో, వైష్ణవమతము దక్షిణ తమిళమునుండి తెనుగుదేశములోని కెగుమతి కాజొచ్చెను. అయ్యంగార్లు ప్రవేశమై తిరుదీక్ష నియ్య మొదలుపెట్టిరి. ముమ్మడి నాయకుడను రెడ్డిరాజు 1340 నుండి 1370 వరకు కోరుకొండలో రాజ్యము చేసెను. "అతని కాలమున శ్రీరంగమునుండి పరాశరభట్టను వైష్ణవ బ్రాహ్మణ గురువు కోరుకొండకు విచ్చేసి ముమ్మడ నాయకుని శిష్యునిగా జేసికొని వైష్ణవ మతమును గోదావరి మండలమున వ్యాపింపజేసెను."[4] తుది రెడ్డి రాజు లగు కుమార గిర్యాదులు వైష్ణవు లయిరి. ఈ విధముగా మతము మార్చుకొన్నను ఈ రాజులు ఇతర మతముల కొత్తిడి కలుగజేసినవారు కారు.
శైవశక్తి పేరుతో ప్రజ లనేకదేవతలను కొలిచిరి. "కోమలార్ధేందు ధరుకొమ్మ గోగులమ్మ"; "మహిత గుణములతల్లి శ్రీమండతల్లి"; 'నూకాంబ'; 'ఘట్టాంబిక'; 'మానికాదేవి'[5] అను శక్తులు ద్రాక్షారామములో వెలసియుండెను. "కలౌ మైలారు భైరవా"[6] అని మైలారుదేవుడు గీర్వాణసూక్తి కెక్కి యెక్కువగా వ్యాప్తుడయ్యెను. ఏకవీరాదేవిని గూడా జనులు మఱువలేదు. శూద్రజాతులవారు పలు దేవతాశక్తులను గొలిచిరి.

"కామాక్షికిని, మహాకాళికి, చండికి,
నక్కజియ్యకు, కాళి, కంబికకును,
వింధ్యవాసిని, కేకవీరకు, మున్నుగా
నెల్ల వేల్పులకు బిందించి మ్రొక్కి
త్రావుచు నెడనెడ తాల్పుగా వండిన
నంజుటి పొరకలు నంజుకొనుచు
  .... .... ....

         బ్రహ్మ గొనియాడి యిదె సాక పట్టుమనుచు
         పరిణమించిరి యొండొండ తరుణులెల్ల"[7]

పై పద్యములో బిందించి అనునది నిఘంటువులలో లేదు కల్లుబిందెను అమ్మవారి కెక్కించుట (అనగా నైవేద్య మిచ్చుట) అని దీని యర్థ మని అనుకొందును. సాకపట్టుట అనునదికూడ నిఘంటువులలో లేదు. "సాకపోయుట" అని తెలంగాణములో నిప్పటికినీ అందురు. దేవత ముందట నిండుకుండ నీరుపోసి నైవేద్య మర్పించుటకు సాకపోయుట అని యందురు. కవి తెలంగాణమువాడనుట కిట్టి పదములు మరికొన్ని యీ కొరవి గోపరాజ కవి వాడినాడు. కాకతి యొక మూలశక్తి యని యీ కవియే యిట్లు తెలిపినాడు.

       "ఆకడ నీతిశాస్త్రవిదు
        డై గురువీడ్కొని యేగె వేడ్కతో
        కాకతి మూలశక్తి గని
        గా నొనరించిన పైడిచట్టునా
        నేకశిలాభిధానమున
        నెన్నిక కెక్కి ధరిత్రిలోన నే
        పోకల బోనియట్టి సిరి
        పుట్టిన యింటికి నోరుగంటికిన్[8]

ఇందు కాకిత అని కవి వాడినాడు. ఏకశిల ఓరుగంటి పేరే యని తెలిపినాడు. ఒంటిమిట్ట కాదని స్పష్టమైనది. శైవసాంప్రదాయక కథలు పెరిగేకొలది స్కాందపురాణము పెరుగుతూ వచ్చెను. స్థలపురాణాలను నిన్న మొన్నటివరకు గీర్వాణములో వ్రాసి అది స్కాందపురాణములోని అముక ఖండములోని దని వ్రాసినవారు కలరు. శ్రీనాథుని కాలములో స్కాందపురాణ విస్తీర్ణ మిట్లుండెను.

      క. బంధురసపాదలక్ష
         గ్రంథంబై, యైదుపదులు ఖండంబులతో

         సంధిల్లుచు స్కాందం బన,
         సింధువునకు కాల్వ లమరిచిన చందమునన్.[9]

ఆ సపాదలక్షగ్రంథ మీనా డెన్ని లక్షలవరకు పెరిగినదో పరిశోధకుల గురుతుకై తెలుపనైనది. మూలగూరమ్మ అనునొక దేవత కొండవీటి రెడ్లకుల దేవత. "ఈమె దేవాలయము గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాదు గ్రామమందున్నది" (రెడ్డిసంచిక-పుట 69).

ఈనాటి మన పండుగలకు ఆనాటివాటికి భేదములేదు. కాని వాటి సూచనలలో కొద్దిపాటి విశిష్టతను చూపుటకై యుదహరింతును.

       "చలి ప్రవేశించు నాగులచవితినాడు
       మెఱయు వేసవి రథసప్తమీ దినమున
       అచ్చసీతు ప్రవేశించు పెచ్చు పెరిగి
       మార్గశిర పౌషమాసాల మధ్యవేళ
       ఇండ్ల మొదలను నీరెండ నీడికలను
       అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు
       అత్తయును కోడలును గుమ్ములాడు కుమ్ము
       గాచు చోటికి మకరసంక్రాంతివేళ."[10]

తెలంగాణములో గరుడపంచమిని నాగపంచమి అని చేయుదురు. కృష్ణాది జిల్లాలలో పైన తెలిపినట్లుగా కార్తీక శుద్ధచవితినాడు సేయుదురు. వైష్ణవులు ఏకాదశిని పుణ్యదినముగా చేసుకొని, శైవులు శివరాత్రిని నిర్ణయించినట్లు కన బడును. తెనుగువారిలో దానిని ప్రచారము చేయుటకై శ్రీనాథునిచేత శివరాత్రి మహాత్మ్యమును వ్రాయించిరి. కాని, ఆ శివరాత్రినాడు ఇప్పటివలెనే జూదమాడుచుండిరని శివరాత్రి మహాత్మ్యములోనే వర్ణించినాడు.

దీపావళిని "దివ్వెలపండుగ" యనిరి.[11] నేటికిని తెలంగాణములో దీనిని "దివిలిపండుగ" అని యందురు. ఇప్పుడు మనలో ప్రతి పున్నమ కొక పేరు, ప్రతి ఆమాసకొక పేరు కలదు. ఇవి కాకతీయకాలమున నుండియే యేర్పడుతూ వచ్చెను. "దవనపున్నమ" (ఏరువాక), "నూలిపున్నమ" (శ్రావణపూర్ణిమ-నూలు=దారము) అను వాటిని పాల్కురికి సోమన తన పండితారాధ్యచరిత్రలో పేర్కొనెను. వ్రతములను స్త్రీలు విశేషముగా చేయుచుండిరి. అవి యెక్కువగా సంతానమును, ఐశ్వర్యమును కోరి చేసినట్టి కామ్యకవ్రతములు.

భైరవాది శివభక్తులను, కాళ్యాది శక్తిరూపిణులను పశుబలిచే తృప్తి పరిచెడివారు. అట్టి సూచనలు వాఙ్మయములో పలుదావుల కలవు. కాని శైవమతములో శాక్తేయము, భైరవతంత్రము మున్నగు వామాచారములను పురికొలుపు తంత్రవాఙ్మయము బహుళ మయ్యెను. జనులు వీరశైవవులై ఆవేశ పూరితులై అందందు ఆత్మబలిదానము కావించుకొన్న కథలను పాల్కురికి సోమనాథుడు తెలిపియేయున్నాడు. శివపూజలలో ఆత్మబలిదానము చేసుకొన్న వారిని, లింగాయత మతమునకై తలపండు నిచ్చినవారిని, వీరులుగా పరిగణించిరి. వారిస్మరణార్థము "వీరకల్లు"లను అందందు స్థాపించిరి. అనేక గ్రామ బహి:ప్రదేశములలో ఛురికతో కడుపుల ఛేదించుకొన్నట్లు, తలల కోసికొన్నట్లు తీర్చిన శిలావిగ్రహములు నేటికిని కానవచ్చును. వీరులపూజకై "వీరగుడ్డముల"ను అభిమానులు కట్టించిరి.

శక్తిరూపములతోనుండు గ్రామదేవతలు శివరుద్ర రూపాలతోనుండు దేవర్లును, ద్రావిడ దేవతలే! చనిపోయినవారిలో కొందరు దయ్యాలై, శక్తి రూపిణులై, శివశక్తులై తమను, బాధించునని జనుల విశ్వాస మాదికాలము నుండి నేటివరకు అవిచ్ఛన్నముగా వృద్ధికి వచ్చినట్టిది. మనప్రాచీనుల కాలమందిట్టి విశ్వాసాలుండి నటుల కవుల చాటువులందు రచనలందు పలుమారు వెల్లడియైనది. శ్రీనాథుడు తన చాటువులందును పీఠికలందును ప్రజల యాచారవిశ్వాసములను తెలిపిన భాగములు చాలా విలువగలవి. పలనాటిలోని దేవర్లనుగూర్చి యతడు కొన్నిచాటువులు చెప్పెనందురు. అందొకటి యిట్టిది.

        "వీరులు దివ్యలింగములు, విష్ణుడు, చెన్నుడు, కల్లుపోతరా
        జారయ కాలభైరవుడు, నంకమశక్తియు నన్నపూర్ణ."

అని డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యగారు (Origin of the South Indian Templeలో) ఉదహరించినారు. తక్కినభాగాన్ని ఉదహరింపలేదు. అక్కిరాజు ఉమాకాంతముగారు, పల్నాటి వీరచరిత్ర పీఠికలో దాని నిట్లుదహరించినారు.

        "వీరులు దివ్యలింగములు, విష్ణువునాయుడు, కల్లిఫొతరా
        జారయ భైరవుండు, తుహినాద్రి జయంకమ, నిర్మలాంబునై
        కేరెడు గంగధార మడుగేమణి కన్యక, యన్నిభంగులన్
        గారెమపూడి పట్టణము కాశిసుమీ కనుగొన్నవారికిన్"

చనిపోయిన వీరులు లింగములై పూజలందిరి. చెన్నడు బ్రహ్మనాయుడే ! క్రీడాభిరామములో మాచెర్ల చెన్నడు, కల్లు పోతరాజు అనేవాడు చచ్చి, కాలభైరవస్థాన మాక్రమించెను. అంకమ్మ అనే స్త్రీ అన్నపూర్ణ అయ్యెను. గంగాధరమడుగు మణికర్ణిక యంతటి పవిత్రస్థాన మయ్యెను.

బెజవాడ కనకదుర్గమ్మను గురించి నేలటూరి వేంకటరమణయ్యగారిట్లు (S-I-Temple లో) వ్రాసెను. "ఒకగ్రామమం దేడ్గురు విప్రసోదరులుండిరి. వారికి కనకమ్మయను చెల్లె లుండెను. ఆమె శీలమును వారు సందేహింపగా నామె బావిలోపడి చనిపోయి జనుల బాధించు శక్తికాగా, జనులామెకు గుడికట్టి పూజింప దొడగిరి". నెల్లూరిలోని దర్శి తాలూకాలోని లింగమ్మ అను బీదరాలొక ధనికునింటి సేవకురాలుగా నుండెననియు, ధనికుల సొత్తు లపహృత మగుడు ఆమెపై నిందవోపగా నామె బావిలో పడి చచ్చి దేవరయ్యెననియు, నెల్లూరు జిల్లాలోని పొదిలమ్మయు, సందేహింపబడి చంపబడిన యొక స్త్రీశక్తిగా మారినట్టి దనియు, నూరేండ్ల క్రిందటగూడ కోటయ్య అను లింగబలిజి ఒక గొల్ల మగనాలినిగూడి ఆమె భర్తచే వధింపబడి కోటప్పకొండ దేవరగా ప్రసిద్ధు డయ్యె ననియు శ్రీ నేలటూరివారు వ్రాసినారు. ఈవిధముగా నేటికిని దేవర్లు పుట్టుచూ చచ్చుచూ తెనుగు దేశపు జనసామాన్యుల మూర్ఖతను లోకానికి చాటినవైనవి.

అరుదుగా నరబలులుకూడా ఇయ్యబడుచుండెను. అట్టి నరబలులు నిర్జన ప్రదేశములో నుండు శక్త్యాలయములలో జరుగుచుండెను. ఒక భైరవాలయములో రెండుతలలను రెండు మొండెముల నొక సెట్టి చూచి

         "చంపుడుగుడి యిది యని యా
          దంపతుల కళేబరములు తలలుం గని తత్

        సంపాదిత భయ రౌద్రా
        కంపితుడై సెట్టి బెగడి కన్నులు మూసెన్.[12]

చంపుడుగుళ్ళు అని నరబలు లిచ్చు దేవాలయములకు పేరుండె నేమో ? అటవికులగు గోండు, కోయ మున్నగువారిలో నీ యాచారమెక్కువగా నుండినట్లు కానవచ్చును. వారునరబలి నెట్లు యిచ్చిరో కవియిట్లు వర్ణించినాడు.

"ఆనగరంబు దిసనుండి దిమ్ము రేగినయట్లు తూగొమ్ములు, పువ్వనంగ్రోవులునున్, తప్పెతలును, డక్కులును పెక్కువిధంబులదిక్కులును చెవుడు పరుపుచుమ్రోయ, నవ్వాద్యరసంబునకు బాసటయై తమ యార్పులున్ పెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృహితంబులుగా గంధపుష్పార్చితుండగు నొక్కదీనుని నడుమ నిడుకొని కురుచ కాసగొరకలు మెరయించుచు బరికెతలల కరకుకౌండరులు ననుదెంచిరి."[13]

పైవచనములో తూగొమ్ములన తూ అను ధ్వనినిచ్చు కొమ్ములు, పువ్వునగ్రోవు లన పిల్లనగ్రోవివంటి వాద్యములు అని అర్థముండు ననుకొందును. ఈ రెండును శబ్దరత్నాకరాదులందు లేవు, అధేవిధముగా 'కౌండరి' శబ్దములేదు. కొండరియన కొండలందుండు అటవికుడని యర్థము. (సూనరి, జూదరివంటి దీ పదము). కిరాతుడు, బోయ అని సూ.రా. అం. నిఘంటువు.

వీరశైవ మతవ్యాప్తితో కొన్ని ఘోరాచారములుకూడ తెనుగుదేశములో వ్యాపించెను. శివార్పణముగా అంగములను ఛేదించుకొనుట, తుదకు తమ తలలను తామే నరకుకొనుట, ఆత్మహింసలను చేసుకొనుట మేరలేని భక్తిలక్షణమనియు అట్టివా రందరును తప్పకుండా కైలాసాన్ని చేరుకొందురనియు, శివసాయుజ్య మందు సచ్చిదానంద మందుందురనియు బోధించిరి. భక్తులు నమ్మ ఆచరించిరి.

రెడ్డిరాజులలోని "అన్నయరెడ్డి ఏ యుద్ధమందో వీరమరణ మందినట్లు తోచుచున్నది. ఈతని పుణ్యమునకుగాను శ్రీశైలమందు మల్లికార్జునస్వామి దేవాలయములోని నందిమండపమునకు సమీపమున వీరశిరోమండపమనునది క్రీ.శ. 1777 లో అన్నవేమునిచే నిర్మింపబడినది. ఈ వీరమంటపమందు వీరు లనేకులు మహాసాహసకృత్యముల నొనరించు చుండెడివారు. తలలు, నాలుకలు, గండ కత్తెరచే ఛేదించుకొనుచు భక్తుని సాహసమును చూపినారని శాసనమందు వర్ణింపబడినది." (రెడ్డిసంచిక. పుట 30, 31) ఇట్టివాటినే చంపుడుగుడులు అని యందురు.

శ్రీశైలములో భక్తులు సులభముగా చచ్చుటకు మరొక మార్గముండెను. అది "కనుమారి".

కనుమారి

కనుమారి పదము శబ్దరత్నాకరములోను, ఆంధ్రవాచస్పత్యములోనులేదు. ఈపదమును ప్రయోగించిన కవులిద్దరేయని నాకు తెలిసినంతవరకు చెప్పగలను. పాల్కురికి సోమనాథుడును నాచన సోమనయు నీపదమును వాడిరి. ఇటీవలనే ఈపదచర్చను శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారు "తెలుగు మెరుగులు" అను పుస్తకములో చేసినది చూచినాను. దానినిబట్టి తిక్కన సోమయాజియు ఈపదమును వాడినట్లు తెలిసికొంటిని.

         "కల్లు ద్రావిన పాతకంబది యగ్ని వ
          ర్ణముగాగ గాచి పానంబు సేయ
          గనుమారి యురుకంగ ననలంబు జొర మహా
          ప్రస్థాన మాచరింపగ బాయు" (శాంతి. 1 307)

"కనుమారి యనిన భృగుపతనమని యర్థము. శాంతిపర్వ మూలమున "మరువ్రపాతం ప్రపతన్" అని కలదు అనగా 'నిర్జల ప్రదేశ పర్వతాగ్రాత్ వతనం" అని వ్యాఖ్య.

నాచన సోమన ప్రయోగ మిట్లున్నది.

         "పాయదగు మిమ్ము, కనుమారిబడ బొసంగు
          విషముద్రావుట యోగ్యంబు, వెల్గిలోన
          మునుగుటుచితము, మీరెల్ల కనుగొనంగ
          ఆత్మవిడుచుట చను, నాకు ననుచునడలి" (4 - 56)

దీనిపై శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిట్లు అనుబంధించినారు, "శ్రీశైలముపై కర్మారీశ్వరము అని యొక పుణ్యస్థలమున్నది. అది కొండకొమ్ము, అక్కడనుండి భక్తులు పుణ్యలోక ప్రాప్త్యర్దమై నేలకురికి ప్రాణత్యాగము చేయుదురు. క్రిందబడుచున్నవాడు, అంతరాళమున నున్నవాడు, ఉరుక నున్నవాడు, అన్న క్రమమున ఎడతెగకుండ శివరాత్రినా డక్కడ భక్తులు ఉరుకుచునే యుండెడివారు.

         "కరమర్థిజేసి యా కర్మారి నురుకు
          ననఘుల భవపరిత్యక్త మానసుల
          అరిమురి నవలి కర్మారీశ్వరమున
          నురుకు పుణ్యుల జూచి ......
          పడియెడు దేహంబు పడిన దేహంబు
          నడిమి దేహంబు లెన్నంగ బెక్కాడు"

అని పండితారాధ్య చరిత్రమం దున్నటుల శ్రీ వే. ప్ర. శాస్త్రిగారు వ్రాసినారు.

పండితారాధ్యచరిత్ర తుదిభాగమందు కర్మహరి మహిమ అను భాగము కలదు. (పుట 472. ఆంధ్రపత్రికా ప్రచురణము) అందిట్లున్నది.

"ఇదె చూడు కర్మహరేశ్వరం బనగ"

అచ్చట పూర్వము బల్లహుడను రాజు తన భార్యతోకూడ మల్లికార్జునుని ధ్యానించుతూ కొండకొననుండి పడి శివైక్య మొందెనని పండితారాధ్యమందు వ్రాసినారు. "కర్మారిపదమే తెనుగున కనుమారి యయినది" అని శ్రీ వే. ప్ర. శాస్త్రిగారువ్రాసిరి, తిక్కన, నాచనసోమన, ఉభయులును కనుమారి యనియే వాడిరి. తెనుగుపదాలను సంస్కృతము చేయుటకూడా పరిపాటిగా నుండెను. కనుమారినే కర్మారి, కర్మహరి, కర్మహరేశ్వరము, అని మార్చిరో యేమో, కనుచుండగానే మారికి (చావునకు) బలియగుటను బట్టి కనుమారి పద మేర్పడి యుండును. వీరశైవము ముదిరిననాడు,

        గళముల జిహ్వల కర్ణరంధ్రముల
        కడుపుల, మెడల, వక్షముల, పుక్కిళ్ళ,

        తొడల, రెప్పల, తొడితొడి దీపవితతు
        లలరంగ బెనుదివియలు, నారసములు.

గలయంగ నిరుమెయిగాడ సంధించి (పం. చ. పుట 409) భక్తిని ప్రకటించినవారును, నాలుక లుకోసి, చేతులు నరికి, చన్నులుకోసి, తలలుకోసి, తనువుల నర్పించువారును (పం. చ. పుట 407) బహుళముగానుండిరి. కావున శ్రీశైలములో ఒక అనువయిన శిఖరమును దాని క్రింద లోతైన లోయయు చూచుకొని అచ్చట భృగుపాతము చేసి ప్రాణాలిచ్చెడి వారనిన చిత్రము కాదు. అది తిక్కన, సోమనల కాలానికే సుప్రసిద్ధమైన కనుమారి యయ్యెను.

జనులలో శకునాలపై విశ్వాసము మెండుగా నుండెను. ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళగా అతని కెదురయిన అపశకున పరంపర యెట్టిదనగా:-

       సీ. పిల్లులు పోరాడె, బల్లి యూకర త్రెళ్ళె,
                తమ్మళి పొడసూపె, తుమ్మి రెదుర,
          తొరగుపోయిన లేగ కొరలుచు నొక కుర్రి
                పరతెంచె, క్రంపపై నరచె కాకి,
          ఉలుమ డొక్కడు నూనె తలతోడ నేతెంచె,
                మైల చీరలచాకి మ్రోల నెదిరె
          కాకియును, గోరువంకయు, రెక్కలపోతు,
                నేటిరింతయు దాటె నెడమదిశకు

          బైటవెరపు దప్ప పాలగుమ్మయు పారె
          ఒంటిపాట పైడికంటి వీచె
          ఎలుగుచేసె పెద్దపులుగు, పామటు తోచె
          దబ్బి బొబ్బలిడియె నుబ్బు లడర.[14]

(కుర్రి=పాడియావు, పాలగుమ్మ=పాలపిట్ట, పెద్దపులుగు=పెద్దపిట్ట, గుడ్లగూబ, ఱెక్కలపోతు, దబ్బి అనునవి నిఘంటువులలో లేవు. ఉలుమడు అనగా కుష్ఠురోగియని సూ.రా.నిఘంటువులలో కలదు. (ఱెక్కలపోతు అన బట్టమేక అను పెద్దపక్షి యనియు, దబ్బియన ఒక పక్షియనియు ఊహింతును.) శకునాలనుగూర్చి క్రీడాభిరామమం దిట్లు తడవినారు.

         "చుక్కయొకింతనిక్కి బలసూదము దిక్కున రాయుచుండుటన్
          జక్కగ వేగదిప్పుడు నిశాసమయంబిది ప్రస్ఫుటంబుగా
          ఘుక్కని మాటిమాటికిని గోటడు పల్కెడు వామదిక్కునన్
          జొక్కటమై ఫలించు మన శోభనకార్యములెల్ల టిట్టిభా.

          మాగిలి మాగిలి వృక్షము
          పూగొమ్ము ననుండి షడ్జము ప్రకాశింపన్
          లేగొదమ నెమలిపల్కెడు
          గేగోయని వైశ్యమనకు గెలుపగు జుమ్మా
          కొనకొనం గోడియేట్రింత కొంకనక్క
          నమలి యీనాలుగిటి దర్శనంబు లెస్స
          వీని వలతీరు బలుకు నుర్వీజనులకు
          కొంగుబంగారమండ్రు శాకునికవరులు.

"గోధూళి లగ్నంబు నంబురంబు ప్రవేశింపవలయు. విశేషించి యుష:కాలంబు సర్వప్రయోజనారంభములకు బ్రశస్తంబు"

         "గార్గ్య సిద్ధాంతమత ముష:కాలకలన
          శకున మూమట యది బృహస్పతిమతంబు
          విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము
          సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు."

ఇట్టి పద్యమే క్రీడాభిరామమందును గలదు.

"వ్యాసమతము మన: ప్రసాదాతిశయము"

అనుటకు మారుగా శ్రీనాథుడు తన భీమఖండమం దిట్లు వేరుగా వ్రాసెను.

"సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు"[15]
(తక్కిన మూడు పఙ్త్కులు సమానమే)

శకునములు పాటించుట, ఒక ప్రయాణమునకేకాక శిరస్స్నానమునకు ఆయుష్కర్మ అను ముద్దుపేరుగల క్షౌరమునకు, నూతన గృహప్రవేశములకు, విత్తనమునకు, కోతలకు నిత్యజీవనములోని అసంఖ్యాకాల్పవిషయాలకు దినశుద్ధి చూచుకొనుటను మనుస్మృత్యాదులందును పురాణాలలోను వ్రాయుటయు, మనము వాటిని పెంచి పట్టుగా పాటించుటయు, అనాదిసిద్ధమై మాయని పరిపాటియై పోయినది.

ప్రయాణాదులకు దినశుద్ధి యిప్పటికిని చూచుకొనువారే బహుళము ఆకాలమందు.

ఇక, రెడ్డిరాజులకాలమందలి కులములను గూర్చి విచారింతము. రెడ్లు "చతుర్థజాతి" వారై యుండిరి. కాకతీయులు "అత్యర్కేందుకులప్రసూతులు." వీరిని స్పష్టంగా శుద్రులని చెప్పజాలకపోయిరి. అయినను క్షత్రియోచితకర్మలను యజ్ఞయాగాదులను, సోమపానమును వీరు చేసిరి. పైగా క్షత్రియులము అని చెప్పుకొనువారితో నెల్లను బాందవ్యము చేసిరి. చోళులతో, విజయనగర చక్రవర్తులతో, పల్లవులతో, హైహయులతో, ఇతర రాజకులీనులతో బాంధవ్యములు చేసిరి. కాని వెలమలతో కాని, కమ్మలతో కాని బాంధవ్యము చేసినట్లు కానరాదు.

రాచవారు, చోడులు తాము క్షత్రియులమని చెప్పుకొనిరి. క్షత్రియులందరు సూర్యునికో చంద్రునికో పుట్టినవారట! సూర్యచంద్ర మండలాలకు పిల్లలుపుట్టరని మన కీనాడు బాగుగ తెలియును కాన సూర్యచంద్ర వంశాలనునవి కల్ల, బలిష్టులై దేశము నాక్రమించుకొని పాలించిన విజేతలపై పౌరాణికులకు అనుగ్రహము కలిగినపుడెల్లను వారిని చంద్రునికో సూర్యునికో అంటగట్టి క్షత్రియులనుగా జేసిరి. అనార్యులగు హూణహవివ్కకనిష్కాదులు, శకరాజులు, ఇట్టివారెందరో క్షత్రియులైరి.

"చోడులు క్షత్రియులుగదా! వారితో రెడ్లను కలుపుట యెట్లని కొందరకుసంశయము కలుగవచ్చును. కాని, క్షత్రియులమని చెప్పుకొన్న చోడులు ప్రాచీనకాలమునుండి క్షాత్రవృత్తి వహించిన వారగుటచేత నుత్కృష్టమైన రాజపదవులను వహించినప్పుడు ఆ కాలమునాటి బ్రాహ్మణోత్తములు వారిని క్షత్రియులనుగా పరిగణించి యుందురు. కాని యిటీవలి రెడ్డిరాజులు పూర్వపు వర్ణాశ్రమసాంప్రదాయ ధర్మములు చెడిపో యిన తర్వాతికాలమున రాజ్యపదవులను వహించినవారు గావున నవీన బ్రాహ్మణోత్తములు వీరిని క్షత్రియులనుగా పరిగణింపక చతుర్థ వర్ణములో నుత్తములనుగా వర్ణించియుండిరి.[16]

పదునేనవశతాభ్ది ప్రారంభమునందు గూడ కొండవీడు, రాజమహేంద్రవరము పాలించిన రెడ్లకును, రాచవారికిని సంబంధ బాంధవ్యములు కలవని (శివలీలావిలాసము, కొరిమిల్లిశాసనము) పైదృష్టాంతములు వేనోళ్ళ జాటు చున్నవి.[17]

"చతుర్థకులము" క్షత్రియకుల సమమని శ్రీనాథుడు డొంకతిరుగుడుగా భీమేశ్వరపురాణాదిలో వర్ణించుతూ "అందు పద్మనాయకు లన, వెలమలన, కమ్మలన, సరిసర్లన, వంటర్లన, బహు ప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన మార్గంబులన్"[18] వెలసిరనెను.

అందు పంటదేసటి అను రెడ్డివంశ మొకటి అని తెలిపినాడు. పై శ్రీనాథ వచనములో నరిసర్లు అన నేజాతియో తెలియదు. వంటర్లు అని ముద్రితపాఠమందు కలదు. వంటరి అన వంటలవాడు. ఇది సరియని తోచదు. బహుశా అది ఒంటరి (ఏకవీరుడు) అయి యుండును. పద్మనాయకులు వేరు, వెలమలు వేరు అని పై వచనాభిప్రాయముగా కానవస్తున్నది. మున్నూరుకులమును గూర్చి కొరవి గోపరాజు తన సింహాసనద్వాత్రింశతి ప్రబంధాదియందు తెలిపినాడు. కాని అది తప్పు; చారిత్రికవిరుద్ధము.

రెడ్డి పదోత్పత్తినిగూర్చి పలువురు విమర్శకులు చర్చలుచేసి తేల్చిన సారాంశమేమనగా క్రీస్తుశకము ఆరేడునూర్లసంవత్సరములనుండి యీశబ్దోత్పత్తి కానవస్తున్నది. పూర్వము వీరు చిన్న భూభాగముల కధికారులై యుండినప్పుడు రట్టగుడ్లు అనబడిరి. రట్ట అన రాజ్యము; గుడి అన గుత్త, అనగా వ్యవసాయనిమిత్తము, గ్రామాలరక్షణ నిమిత్తము భూములను పొందినవారిని యర్థము. రట్టగుడియే క్రమముగా రట్టఉడి, రట్టాడి, రట్టడిగా మారెను. రట్టడిపదములను పండితారాధ్యుడు తన శివతత్త్వసారములో వాడెను. తర్వాతి కవులు గ్రామాధి కారియను నర్థములో, దర్పదౌర్జన్యయుతుడను నర్థములోను వాడిరి. రట్టడిపదమే క్రమముగా రెడ్డియయ్యెను. క్రీ.శ. 1400 ప్రాంతమునుండి రెడ్డిపదము స్థిరపడి పోయెను. (రెడ్డిసంచిక, పుటలు 96-118; 388-392) ఇతర జాతులలో అంతశ్శాఖలు ప్రబలినట్లుగా రెడ్లలోను కొన్నిశాఖ లేర్పడెను. అవి విశేషముగా సీమలనుబట్టి యేర్పడెను.

గుంటూరు జిల్లాలో నరసారావుపేట తాలూకా కొణిదెస గ్రామములోని శాసనమం దిట్లున్నది. "ఫొత్తపిచోడ మహారాజులు యేలెడి భూమియైన కమ్మ నాంటి రాచకొడ్కులు, మందడ్లు, నూక నాయకులు, మొట్టవాడ గుంటికర్త రాచకొడుకులు, దేనట్లు, నూకనాయకులునై కూడి శకవర్షంబులు 1069 సంక్రాంతినాడు శ్రీకొట్యదొన కేశవదేవరకు నిచ్చినకాన్కి-యూరరూకయు, ఉల్వరిపాదికయు నిచ్చితిమి" (ఊర రూక, ఉల్వరిపాది అనునవి గ్రామములో వసూలుచేయు కొన్ని పన్నులు, గ్రామముఖ్యులు, గ్రామదేవాలయముల నిర్వహణకు పన్నుల వేయు అధికారము కలిగియుండిరన్నమాట) "రెడ్లలో అనేక భేదములు కలవు. పాకనాటి, పంట వెలనాటి, రేనాటి, మొరస, పల్లె-ఇవి నాడీ భేదముల బట్టి ఏర్పడినవి. గోటేటి, ఓరుగంటి, పెడకంటి, కుంచేటి, మోటాటి, దేసూరిరెడ్లు నివాస గ్రామములబట్టి యేర్పడిన భేదములు (రెడ్డి సంచిక-పుటలు 128; 139)

వైశ్యకులములో కోమటివారు చేరిరి. వారిలో కొన్ని విభేదాలుండెను. దీనిని గురించి మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇంగ్లీషులో వ్రాసినదాని నిందను వదింతురు.

"ప్రౌడదేవరాయకాలంలో వైశ్యులు వైజాతీయులు కులవివాద పరిష్కారమును కోరగా అరాజు కోలాచల మల్లినాథుని మరికొందరి పండితులను ధర్మాసన పరిష్కర్తలనుగా నేర్పాటుచేసెను. అంతకు పూర్వ మొకప్పు డిట్టి వివాదము కలిగియుండ కంచిలో (కాంచీపురములో) అది పరిష్కృతమై శాసనబద్దమై యుండెను. ఆ శాసనమును ధర్మాసనానికి కంచినుండి అదేపనిగా తెప్పించిరి. అందిట్లుండెను. నాగరులు, ఊరుజులు, తృతీయజాయులును వైశ్యులు. వైశ్యునికి శూద్రస్త్రీకిని పుట్టినవారు వై జాతీయులు, వైశ్యులకు స్వాధ్యాయయజనదానాధికారాలు కలవు. వారు వ్యాపారము, సేద్యము, పశువుల పోషణము చేయగల వారు, వైజాతీయులలో వణిజ, కోమటి, వాణివ్యాపారి, వాణిజ్యవైశ్యులు, ఉత్తరాది వైశ్యులు చేరినట్టివారు. వైశ్యులకే అన్నివస్తువుల వ్యాపారముపై అధికారము కలదు. "కోమటిస్తు ధాన్య విక్రయమాత్రే అధికారోస్తియుక్తం" కోమట్లకు వడ్లవ్యాపారమే పరిమితిగా చేయబడినది. ఇవి కాంచీపురశిలాశాసనస్థ విషయములు. పదవాక్య ప్రమాణస్థానులైన మల్లినాథసూరిగారు సకల శ్రుతిస్మృతిశాస్త్రేతిహాస పురాణ కావ్యకోశాదుల నవలోడించి వైశ్య, ఊరుజ, నాగర, వణిజ, కోమటి,వాణివ్యాపారి, వాణిజ్య, వైశ్యశబ్దాలన్నియు వైశ్యశబ్దవాచకములే! యనియు , కావున వైశ్య వైజాతీయ విభేదాలకు స్వస్తిచెప్పవలసినదే అనియు జయపత్ర మిచ్చిరి."[19] మల్లినాథసూరి ఆ కాలపు వైశ్యసంఘ సంస్కర్తగా నుండెనేమో!

ఇక బ్రాహ్మణులను గూర్చి కొంత తెలిసికొందము. ఒకదిక్కు వీర శైవులు బ్రాహ్మాణాధిక్యమును పడగొట్టుటకై చాలా కృషి చేసిరి. అదేసమయములో బ్రాహ్మణాది సకల హిందూజాతులను అసహ్యించుకొను తురకలు దేశములో జొరబడి కల్లోలము చేసిరి. మరొకదిక్కు వీరశైవుల ప్రతిఘటన పటుత్వమునకై రామానుజీయులును పంచసంస్కారవిధానముచేతను ప్రపన్నత్వ సిద్ధాంతము చేతను కులకట్టుబాట్లను సడలిస్తూయుండిరి. ఇన్ని శక్తు లెదురొడ్డినను బ్రాహ్మణత్వమునకు భంగము కలుగలేదు సరికదా అది మరింత లోతుగా పాతుకొనెను. కులనిర్మూలన సంస్కరణము లన్నియు బ్రాహ్మాణాధిక్యతకు కట్టుబాటులగుటచే వారు ఆత్మరక్షణము చేసుకొన కూరకుండిరని తలపరాదు అగ్నిమిత్ర పుష్యమిత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు మున్నగువారి బ్రాహ్మణ రాజ్యములు క్రీస్తుశకాదినుండి అరవ శతాబ్ద్యంతము వరకు పలుతావుల విలసిల్లెను. అప్పుడే వృద్ధస్మృతులు, ఉపపురాణాలు సృష్టియై యుండును.

ఇతర పురాణాలు అపారముగా అప్పుడే పెరిగియుండెను. స్మృతులలో హస్తక్షేపము లప్పుడే పడియుండును. అదే విధముగా రెడ్డిరాజుల కాలమందును, కాకతీయుల కాలమందును స్కాందపురాణాలు పెరిగినట్లు పలువురు చరిత్ర పరిశోధకు లభిప్రాయ మిచ్చినారు. ఆనాటి తెనుగు వాఙ్మయ మందును బ్రాహ్మణాధిక్యత విశేషముగా కానవస్తున్నది. ఈ రెడ్డియుగముననే వెలువడిన బోజ రాజీయములో అడుగడుగునకు బ్రాహ్మణప్రభావగర్బిత కథలే బగుళముగా అల్లబడినవి.

ఈ విధమగు ప్రచార మట్లుండ యథార్థముగా బ్రాహ్మణులందే వేదశాస్త్ర విద్యలు కేంద్రీకృతమై యుండెను. షోడశకర్మలకు, వ్రతాలకు, శుభాశుభములకు అన్నింటికిని బ్రాహ్మణుడే యాధార భూతుడు. నిన్న మొన్నటి వరకు కూడా బ్రహ్మణేతరులకు వేదవేదాంగములు చెప్పుటకు సహింపని బ్రాహ్మణు లుండినప్పుడు ఆ కాలమున లేకుండిరా ? అట్టివారుండిన సర్వజ్ఞ సింగడు, సర్వజ్ఞ చక్రవర్తి, కోమటి వేమడు ఎట్లు బిరుదాంచితులైరి ? రాజులు పైనియమాని కపవాదపాత్రులై యుండిరేమో ? ఎటులైన నేమి శ్రుతిస్మృతి పురాణ శాస్త్రాదుల కంతకును విశేషముగా బ్రాహ్మణులే నిధులై యుండిరి. తెనుగులోనికి పురాణములు పూర్తిగా రానందున ప్రజలకు పురాణశ్రవణము చేయువారు బ్రాహ్మణులే. కావున పురాణముల ద్వారా ప్రచార మత్యంత ముఖ్యమని వారెరిగినవారే ! పలనాటి బాలచంద్రుని తల్లి విప్రుల బిలిపించి భారత రామాయణ పురాణములను వినుమని కుమారునికి బోధించియుండెను.

         ".........వీనుల కెల్ల తేనియల్
          చినుక పురాణ వాక్యములు
          చెప్పెడు విప్రుని జూచి, యిమ్మహా
          జనసభ జేరి"[20]

అనుటచే బ్రాహ్మణులు పురాణములు చెప్పగా జనులు తండోపతండములుగా (మహాజనసభగా) కూడుచుండిరని ద్యోతకమగును.

ఇట్టి విశిష్టతలచేత విప్రులు అప్పటి రాజులకు మంత్రులై, సేనానులై, విద్యాధికారులై, దీక్షాగురువులై, బోధకులై, పురోహితులై తమ యగ్రస్థానమును స్థిరీకరించుకొనిరి. రెడ్ల చరిత్రలో బ్రాహ్మణ భక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టము. అది 'నభూతో నభవిష్యతి అని యనిపించు కొన్నది.

రెడ్లు రాజ్యానికి రాకపూర్వముండిన బ్రాహ్మణుల స్థితి వారి కాలమందెట్లు మారెనో శ్రీనాథు డిట్లన్నాడు.

        సీ. ధరియింప నేర్చిరి దర్బపెట్టెడు వ్రేళ్ళ
                   లీల మాణిక్యాంగుళీయకములు
           కల్పింప నేర్చిరి గంగమట్టియ మీద
                   కస్తూరికాపుండ్రకముల నొసల
           సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల
                   తారహారములు ముత్యాల సరులు
           చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
                   కమ్మని క్రొత్త చెంగల్వ విరులు
           ధామముల వెండియును బైడి తడబడంగ
           బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన
           వేమ భూపాలు డనుజన్ము వీరభద్రు
           ధాత్రి యేలింప గౌతమీతటమునందు.[21]

వారు విప్రులకు,

"అగ్రహారావళి అఖిల మాన్యంబు లొసగి"[22]

గౌరవించిరి. "అది స్వభావోక్తి" అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు శృంగార శ్రీనాథములో అంగీకరించినారు.

రెడ్డిరాజుల కుండిన బ్రాహ్మణభక్తి భారతదేశ చరిత్రలో వేరుచోట కాన వచ్చునో లేదో అత్యంత సంశయమే. ఓరుగంటి చక్రవర్తు లిచ్చిన దానాలు తురకవిజేతల చేతులలోనికి పోయెను. రెడ్డిరాజులు తాము గెలిచిన ప్రాంతములందంతటను పూర్వరాజులు దానము లన్నింటిని స్థిరపరిచిరి. పైగా తామున్నూ అసంఖ్యాకముగా భూములను, అగ్రహారములను బ్రాహ్మణులకు దానము చేసిరి. వీరి దానములచే ఆకర్షితులై తూర్పుతీర మందలి కృష్ణా గోదావరీ మండలములలో బ్రాహ్మణులు కొల్లలుగా నిండుకొనిరని పలువురు చరిత్రకారు లభిప్రాయ పడినారు. ప్రామాణికుడును, పూజ్యుడును, ముఖస్తుతుల నెరుగనివాడును, ప్రబంధపరమేశ్వరుడును నగు ఎర్రాప్రగడ తన యుత్తర హరివంశములో నిట్లు వ్రాసెను.

        "అగ్రహారములు విద్యా తపోవృద్ధ వి
         ప్రుల కిచ్చి యజ్ఞక ర్తలుగ నునిచె
         కొమరార చెరువులు గుళ్ళు ప్రతిష్ఠించి
         లోకసంభావ్యంబులుగ నొనర్చె
         నిధులు నల్గి డ్లును నిలిపె, తోటలు సత్ర
         ములు చిలివిందరల్ వెలయ బెట్టె
         హేమాద్రిపరికీర్తి తావితదాన
         నివహంబు లన్నియు నిర్వహించె
         చేసె, చేయుచునున్నాడు సేయనున్న
         వాడు, పునరుక్త కృతి శుభావలులనెల్గ
         ననగ శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి
         వశమె వర్ణింప తద్బాగ్య వైభవంబు."

వెన్నెలకంటి సూరకవి యిట్లనెను.

        "తన బ్రతుకు భూమిసురులకు
         తన బిరుదులు పంటవంశ ధరణీశులకున్
         తన నయము భూమి ప్రజలకు
         అన వేమన యిచ్చె కీర్తి విభవుం డగుచున్.

ఒక పౌరోహితుని జీవనమును జుగుప్సాకరముగా గౌరన తన హరిశ్చంద్రలో వర్ణించెను. "రోగులవలన కొంత లాగి, బ్రేతవాహకుడై కొంత గడించి, గండశాంతులందు, సప్తకము లందును (ఏడుగురిను పిలిచి పెట్టు శ్రాద్దము లందును) తృప్తాప్తగా భుజించి, గ్రహణ కాలములో ఒక మాడయైన దక్షిణగా పొంది, ఇంటింట పంచాంగ పఠనము చేసి, అయవారము లెత్తి, దానము పట్టిన ధాన్యాలను తన వస్త్ర మందు మూల మూలలందు మూటలుగా కట్టి, ఏమిలేనినాడు కరతిత్తిపట్టి, ముష్టియెత్తి, కూడబెట్టిన పైకాన్ని అప్పుల కిచ్చి పత్రాలు వ్రాయించుకొని వృద్ధి, చక్రవృద్ధి, మాసవృద్ధి అని వడ్డీలు గడించి, ఒక పౌరోహితుడు జీవించెనని వర్ణించెను." (పుట 145, 146. రెండవ భాగం - వేదం ప్రచురణము.)

అప్పులు తీసుకొనువారిపాట్లను, అప్పుల ముంచే పద్ధతులను గౌరన చాలా చక్కగా వర్ణించినాడు. "ధనికుల యిండ్ల కేగి, ప్రియములు పలికి, సేవచేసి, నమ్మికపుట్టించి, మనసులు కరిగించి, మాయసొమ్ములు, లక్కపొదుపులు, మాయబంగారు, బంగారునీ రెక్కించిన ఇత్తడి, ఇనుప సొమ్ములు మాయమణులు, గుప్తముగా రాతి తీసుకొనిపోయి, ఇవి దాచుడని లక్కముద్రలు వేయించి, లండుబోతుల పూటగా బెట్టి, అప్పులు గొని, యెగబెట్టి, పట్టుబడి, రచ్చకీడ్వబడి, వారిచ్చు శిక్ష లనుభవించి, రాళ్ళుమోసి, దెబ్బలు తినియైనను మందిని ముంచవలెనట !" (హరిశ్చంద్ర ఉత్తరభాగము, పుట 151-152)

రెడ్డిరాజులు ఆంధ్రదేశమందు అనేక శివాలయములను కట్టించి తమకన్న పూర్వమం దుండిన ప్రసిద్ధాలయములకు దానము లిచ్చుటయేకాక ద్రావిడదేశమందును ఉత్తర హిందూస్థాన మందును కల ప్రసిద్ధ శివక్షేత్రములకు దానధర్మములు చేసిరి.

రెడ్డిరాజుల కించుమించు మూడునూర్ల యేండ్లకుముందు హేమాద్రియను నతడు ఆచార వ్యవహారాదులను గురించి యొక విపుల మగు శాస్త్రమును వ్రాసి పెట్టెను. దానికి చెలామణియగుచూ వచ్చెను. రెడ్డిరాజులు హేమాద్రి ప్రోక్తవిధానములతో షోడశ దానాలు చేసిరని సమకాలీన ప్రామాణిక కవులు వర్ణించిరి. అ దానాలు సామాన్యమైన తిరిపెమలు కావు. అవి కొంపలు తీసే త్యాగాలు. అగ్రహారా లను పేర అనేక గ్రామాలను, భూదానములను, గోహిరణ్య రత్నాదులను, నానా విధములగు ఇతర దానములను చేసి యుండిరి. అనగా తమ ఆదాయములను కోరుపంచి యిచ్చిరన్నమాట. హేమాద్రి ప్రభావ మట్టిది.

తెనుగువారికి ధర్మశాస్త్రాలన్నిటిపైకి, యాజ్ఞవల్క్య స్మృతిపై రెడ్డిరాజులకు ఇన్నూరేండ్లకు పూర్వము వ్రాసిన విజ్ఞానేశ్వరీ వ్యాఖ్యయే ప్రధానమైనదయ్యెను. ఆకారణముచేత రెడ్డిరాజుల కాలమువాడగు కేతన విజ్ఞానేశ్వరీయమును తెనుగు పద్యములలో వ్రాసెను.

వ్యవసాయము - ప్రజలస్థితి

రెడ్డిరాజుల కాలములో దేశమును సీమలనుగా లేక నాడులనుగా విభజించినట్లు కానవచ్చును. ఈ విభజన వారు క్రొత్తగా చేసినట్లు కానరాదు. వారికంటే పూర్వమునుండియే అవి యుండెను. రాజమహేంద్రవరమునకు 11 మైళ్ళ దూరమునున్న కోరుకొండలో రాజ్యముచేసిన ముమ్మడినాయకుని రాజ్యములో కోనసీమ, అంగరసీమ, కొఠామసీమ, కురవాటసీమ చాంగలునాటిసీమ మొదలగు సీమలు చేరియుండెను. ఇవన్నియు గౌతమీనది కిరుప్రక్కల వ్యాపించి యుండెను. ఈ రాజ్యము అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడి మొదలగు తోటలలో రమ్యమై ఆంధ్రభూమిని ప్రసిద్ధిగా నున్నదని యార్యవట శాసనమున వర్ణింపబడినది.[23] "శ్రీశైల పూర్వనికటమునుండి పూర్వ సముద్రముదాక ప్రవహించుకుండి తరంగిణి యను గుండ్లకమ్మనది కిరుపక్కలనుండు సీమకే పూంగినాడను నామము కలదని తెలియుచున్నది.[24]

ఇట్టి సీమలు దేశ మంతటను అనంతముగా నుండెను. కాని, రెడ్డిరాజులు తమ పరిపాలన సౌకర్యమునకై తమ రాజ్యమును కొండవీడు, వినుకొండ, బెల్లముకొండ, అద్దంకి, ఉదయగిరి, కోట, నెల్లూరు, మారెళ్ళ, కందుకూరు, పొదిలి, అమ్మనబ్రోలు, చుండి, దూపాడు, నాగార్జునకొండ అని విభాగములు చేసిరి.[25]

పల్లవులు, కాకతీయులు దేశమందలి అడవులను కొట్టించి, గ్రామాలను ప్రతిష్ఠించి, వ్యవసాయకులకు భూము లిచ్చియుండిరి. దీనినిబట్టి క్రీస్తుశకము 1000 కి పూర్వము కర్నూలు, బళ్ళారి మున్నగు మండలాలు అరణ్యప్రాంతాలుగా నుండెనని తెలియును. ప్రతాపరుద్రుడు స్వయముగా కర్నూలు సీమకు వెళ్ళి అడవుల గొట్టించి ఇప్పటికి కర్నూలు పట్టణమునకు 10, 15 మైళ్ళ ఆవరణములోని పల్లెల పెక్కింటిని నిర్మాణము చేసినట్లు ఆకాలపు శాసనాదుల వలన తెలియవచ్చెడివి. తెలంగాణములో నూరేండ్ల క్రిందటకూడ అడవులనుకొట్టి రైతుల ప్రతిష్ఠించుతూ వచ్చిరనిన ఆకాలపుమాట చెప్పనవసరము లేదు.

ఇప్పటివలె భూములను పట్టాకిచ్చు పద్దతి ఆనాడు లేకుండెను. భూమి యంతయు రాజుదే అను సిద్ధాంతము అంగీకరింపబడి యుండెను. భూమిని ఏటేటకో లేక నియమిత కాలమునకో గ్రామ జనుల కిచ్చెడువారు. రైతులు తమకుండు పశువుల లెక్క ప్రకారము కాండ్ల లెక్కతో కలిసి కృషిచేసి సమష్టిలోనే సేద్యపు వ్యయమును తీసివేసి అనగా పన్నిద్దరాయగాండ్లకు ధాన్యరూపముగా వారి కియ్యవలసిన దిచ్చివేసి ప్రభుత్వమునకు ఇయ్యవలసిన షడ్బాగపు పన్నును తీసి యుంచి మిగతాది కాడీలప్రకారము పంచుకొనుచుండిరి. ఈవిధమగు సమష్టి సేద్యములో రాజులు బ్రాహ్మణుల కిచ్చిన ఇనాములు అగ్రహారములు చేరియుండ లేదు. సమిష్టి సేద్యపు భూమినుండి మొదలు (అగ్ర) బ్రాహ్మణుల ఇనాముల తొలగించి (హారము) భూమిని సాగుకు తీసుకొనుచుండిరి.

ఆ కాలములో భూములను కొలుచుటకు "గడి" యనునొక నిర్ణయమగు పొడవు కట్టెను వినియోగిస్తుండిరి. దానిని కేసరిపాగడ యనిరి. భూములను కొలుచుటకుగాను శాస్త్రగ్రంథాలు వ్రాసిరి. నన్నయభట్టు సమకాలికుడగు మల్లన అనునతడు గణితశాస్త్రమును వ్రాసెను. అదింతవరకు ముద్రితము కాలేదు. దానిలో ఆకాలపు వ్యవసాయ స్థితిగతులు కొలతలు మున్నగునవి కలవందురు. సంస్కృత గణితశాస్త్రములను తెనుగులోనికి పలువురు అనువదించిరి. క్షేత్ర గణితము అను పేరుతో పొలముల నక్షాలతోసహా తాటాకులపై పెద్దపెద్ద గ్రంథాలు వ్రాసియుంచిరి. కాకతీయులకాలమందలి క్షేత్రగణితమునుండి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు విపులముగా నుదాహరించినారు. దాని ప్రకారము,

         అంగుష్ఠపు వలయార్థం
         బంగుళమగు, మూడుపొడవు యవ లెన్నంగా
         నంగుళమగు, మరియును, మ
         ధ్యాంగుళ మధ్యప్రదేశ మంగుళ మయ్యెన్.
     
                 అట్టి 12 అంగుళములు = ఒక జేన
                 32 జేనలు = ఒకగడ (కొలతకట్టె).

ఆకాలమందు తూమెడుపొలము అంటూ వుండిరి. నిన్న మొన్నటివరకును రాయలసీమలో ఇవే మాటలంటూ వుండిరి. అనగా తూమెడు విత్తనములు పట్టెడు భూమియని యర్థము.

        సీ. ప్రకటింతు కేసరిపాటి క్షేత్రంబుల
           నలరిన బీజసంఖ్యాత మదియు
           నూటపండ్రెండరపాటిగా నొకతూము
           ఏబదారుంబాతి కిరస యయ్యె
           ఇరువదెన్మిది పర కేర్పడ గుంచెడు
           పదునాల్గువీసముల్ పరగు నడ్డ
           ఏడొక యరవీస మేపార మానిక
           మూటిపై నరకాని మున్ను తవ్వ
           ఒకటి పాతికయు జూడ నొక్కసోల
           ఏడుపరకల దా నొనగూడెనేని
           పరగ నరసోల యెరుగుడీ వరుసతోడ
           గణితపండిత విను మిది గణితమతము.[26]

భూమికొలతలలో నివర్తనములనియు లేక మరుత్తులనియు వ్యవహరించిరి. పదిచేతులు (మూరలు) = ఒకదండము, పదిదండములు = ఒకనివర్తనము; పదినివర్తనములు = ఒకగోచర్మము.[27] రెడ్డిరాజులకాలములోని భూమికొలతలు అప్పటి యాధారములనుబట్టి యీ విధముగాకూడా యుండెను.

4 మూరలు = ఒక బార
4 బారలు = ఒక గడ
400 గడలు = ఒక కుంట
100 కుంటలు = ఒక కుచ్చెల లేక ఖండిక లే తూప

సువర్ణాదుల తూకములను మాడలతో కావిస్తుండిరి. మాడ అనగా అర వరహా అని శబ్దరత్నాకరకారుడు వ్రాసినాడు. అదొక చిన్న బంగారునాణెము. కొండవీటి రాజులకాలపు కవియగు కొరవి గోపరా జిట్లు తెలిపినాడు.

         "ఎన్న నాల్గుమాడలె త్తొజకర్షంబు
          నాల్గుకర్షలైన నగు పలంబు

          పలము లొక్కనూరు తులయగు, తులలొక్క
          యిరువది మితి భారమిది మతంబు[28]

ఆ కాలమందలి నాణెములముచ్చటలు కావ్యాలలో కానవచ్చును. రూక[29], పసిడిటంకము[30], నిష్కము[31], గద్దె[32], (గద్యాణతద్బవము) = వరహాతో సమానము. పాతిక పరక[33] మున్నగునవి ఉదాహృతములు. ఒకరాజు ఒక సేవకునికి బాటవెచ్చమునకుగాను ఏడుదినాల కేడు మాడలిచ్చెను.[34] అనగా బంటువృత్తివారికి దినాని కొకమాడ యిచ్చుచుండిరని తెలియవచ్చెడి.

తెలంగాణములో తరీ (మాగాణి) సేద్యము నేటికిని ప్రధానమైనట్టి వ్యవసాయము. అందుచే ప్రాచీనము నుండియు రాజులు, మంత్రులు, సేనానులు, ధనికులు, ప్రజలు - కుంటలు, కాలువలు, చెరువులు విశేషముగా నిర్మించుతూ వచ్చిరి. తరీసేద్యమునకు మోట, ఏతముద్వారా, చెరువు కుంటలద్వారా నీరిస్తూ వుండిరి.

         "ఈయెడ కర్మభూమి యగు
                డెవ్వరికైనను బుద్ధినేర్పునం
          జేయగలేదు కాల మెడ
                సేసిన నేతములెత్తి, కాల్వలున్
          పాయలు, కోళ్ళు, నూతులును,
                బావులు రాట్నములున్ జలార్థమై
          చేయగ నాయెగాక మరి
               చేయనినా డవి తామె పుట్టునే.[35]

ఇది తెలంగాణా తరీసేద్యమును బాగుగా నిరూపిస్తున్నది. పలనాటి సీమ నల్లగొండజిల్లాకు దగ్గరిభాగము. మిరియాలగూడా తాలూకాకు ప్రక్కనిది. పలనాటిలో నాపరాళ్ళు విశేషముగా నుండెను. అదేమితో అచట చెన్ననిమహిమనో యేమో ఆకాశాన మేఘము ఆవరిస్తే చాలు నాపరాలలో విత్తిన యావనాళములు ఫలిస్తూవుండెనని క్రీడాభిరామకర్త యీ విధముగా ఆశ్చర్యపడెను.

         "చిత్తముగూర్చి మాచెరల
          చెన్నడు, శ్రీగిరిలింగమున్ కృపా
          యత్తతతోడ ముల్కీవిష
          యంబునకా, మహిమంబు చెల్లె, గా
          కుత్తరలోన మింట జల
          ముట్టినమాత్రన, నాపరాలలో
          విత్తిన యావనాళ మభి
          వృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా!"

ముల్కివిషయ మన ములికినాడు. మహబూబునగరు, కర్నూలు, గుంటూరు ప్రాంతాలందలివే. అయినను పలనాటిలో రేగడిభూమియు విశేషముగా నుండెను. అందుచేతనే అక్కడ జనులందరు జొన్నలనే పండించి తినుచుండిరి.

         "జొన్నకలి జొన్నయంబలి
          జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్
          సన్నన్నము సున్నసుమీ
          పన్నుగ పల్నాటనున్న ప్రజలందరకున్."
          చిన్నచిన్న రాళ్ళు చిల్లరదేవళ్ళు
          నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
          సజ్జ జొన్నకూళ్ళు సర్పంబులును తేళ్ళు
          పల్లెనాటిసీమ పల్లెటూళ్ళు.
          రసికుడు పోవడు పల్నా
          డెసగంగా రంభయైన నేకులె వడుకున్
          వసుధేశుడైన దున్నును
          కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.[36]

ఈ పరిస్థితులు రాయలసీమకును వర్తించును. ఇక తూర్పుతీరమందుండు కృష్ణా గోదావరి జిల్లాలలోను, నెల్లూరు జిల్లాలోను, విశాఖ పట్టణము జిల్లాలోను వ్యవసాయపరిస్త్జితు లెట్లుండెనో తెలిసికొందము. శ్రీనాథుడు కృష్ణాజిల్లాలో నెక్కువగాఉండి సన్న బియ్యపుటన్నమును బహు విధ రుచ్యాహారములను ఆరగించినవాడగుటచే, పలనాటికిపోయి జొన్నకూడు తినలేక అవస్థపడి లోతులో దొరకు నీటికై భంగపడి పలనాటిని తిట్టి వెళ్లెను. తూర్పుతీరమందలి డెల్టా (లంక) భూములలో ఏటిమడలలో నానావిధములగు వరిధాన్యములు పండుతూవుండెను. వడ్లలో అనంతమగు జాతులు కలవు. శ్రీనాథుడు కొన్నిటిని తెలిపినాడు.

"నదీమాతృకాయమాన విశ్వంభరాభరిత కలమశాలిసిరా ముఖషాష్టిక పతంగ హాయనప్రముఖ బహువిధవ్రీహీభేదములు"[37]

గోదావరిలంకలలో బహువిధఫలములు సమృద్ధిగానుండెను. తూర్పుతీరము ధాన్యసస్యసంపత్సమృద్ధముగా నుండెనని ఆకాలమున దేశమును చూచిన జోర్డానస్ (1327 - 30) అను పాశ్చాత్యు డిట్లు వ్రాసి పెట్టెను.

"తెలుగు దేశపురాజు బహుప్రతాపవంతుడు. అతని రాజ్యములో పుష్కలముగా జొన్నధాన్యము, వరి, చెఱకు, తేనె, పప్పుదాన్యాలు, గ్రుడ్లు, గొర్లు, దున్నలు, పాడి, వివిధములగు నూనెలు, శ్రేష్ఠములగు ఫలములు మరెందును లభ్యముకానట్టివి సమృద్ధిగా లభిస్తున్నవి"[38]

దీన్నిబట్టి ఆ కాలమందలి దేశము చాలా సుఖస్థితిలో నుండెననుటలో సందేహములేదు. కృష్ణాజిల్లాలోనిది కాబోలు కళసాపురము, అరటితోటలకును, ద్రాక్షఫలములకును ప్రసిద్ధికలదై యుండెను.[39]

రాయలసీమలోని ఎక్కువభాగము కర్ణాటరాజ్యములో చేరియుండెను. అందు పల్నాటిలోవలె ధనిక దరిద్ర భేదములేక అందరును దున్నుట, నూలు వడకుట, అందరునూ జొన్న రొట్టెలు, జొన్నసంకటి లేక యంబలి లేక

అన్నము తినుట యాచారముగా నుండెను. "చల్లా యంబలి ద్రావితిన్ రుచుల దోసంబంచు నోనాడితిన్ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా! నేను శ్రీనాథుడన్" అనియు, "ఓ ఫుల్లసరోజనేత్ర ఉడుకు బచ్చలిశాకము జొన్నముద్దయున్ మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్" అని నిరసించిన దీ సీమనుగూర్చియే.
రెడ్డిరాజుల రాజ్యకాలములో జనులు ప్రభుత్వమునెడ చాలా సంప్రీతులై యుండినట్లున్నది. లేకున్న ఓఢ్ర కర్ణాట ముసల్మాన పద్మనాయకోజ్జృంభణ దండయాత్రలలో నెన్నడో తిరుగుబాటు చేసియుందురు. ఇందలి ప్రబల శత్రువులను అవలీలగా నోడిస్తూ వచ్చిరనిన రెడ్డిరాజులకు ప్రజావలంబన ముండిన దనుట స్పష్టము. ప్రజలపై అక్రమమగు పన్నులు వేసినవారు కారు. తుది కొండవీటిరాజగు రాచవేమన ప్రజాబాధాకరములగు క్రొత్తపన్నులు వేయుటచే ప్రజలు తిరుగుబాటు చేసినట్లు కొండవీటి దండకవిలె తెలుపుచున్నది. అతడు పురిటిపన్ను ఒకటి మోపగా ఎల్లప్పయను బలిజనాయకుడు దాని నిచ్చుకొనలేక వేముని చంపివేసెను.
రెడ్డరాజుల రాజ్యపతనము క్రీ.శ.౧౪౩౪ ప్రాంతములోనయ్యెను. చిరకాలమునుండి ప్రబల ప్రయత్నాలు చేయుచూ వచ్చిన ఓఢ్ర (ఒడ్డె) రాజులు తూర్పుతీరపు దేశమును, గుంటూరు సీమను ఆక్రమించుకొని పాలించిరి. వారికి ప్రజలపై ప్రీతిలేకుండెను. దేశమునుండి అన్నివిధముల ద్రవ్యమును లాగుకొనిపోవుటయే వారి ప్రధానాశయమైనట్లుండెను. కవుల ఆదరణము, కళాపోషణము వారిలో లవలేశమైన కానరాలేదు. అఖిలాంధ్ర పూజ్యుడును, కవి సార్వభౌముడును, సార్వభౌమ సమ్మాన్యుడును నగు శ్రీనాథునే వారు కష్టపెట్టిరి. రెడ్డిరాజులలోని పలువురిపాలన లందుండి ద్రవ్య మార్జించి దానిని దొరవలెనే దానముచేసి వారి యనంతరము సహస్రమాస జీవియైన శ్రీనాథుడు జీవనార్థమై కొంతభూమిని, ౭౦౦ బంగారు టంకాలకు గుత్తకు తీసికొని పంటలు పండక పన్నియ్యలేక అవమానము లంది యిట్లు విలపించెను.

సీ.కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా
     పురవీధి నెదురెండ పొగడదండ

         ఆంధ్రనైష ధకర్త యంఘ్రి యుగ్మంబున
              తగిలియుండెనుకదా నిగళయుగము
         వీరభద్రా రెడ్డి విద్వాంసు ముంజేత
              వియ్యమందెనుకదా వెదురుగోడిగ
         సార్వభౌముని భుజా స్తంభ మెక్కెనుగదా
              నగర వాకిట నుండు నల్లగుండు

         కృష్ణవేణమ్మ కొనిపోయె నింత ఫలము
         బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
         బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
         నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు;

ఆనాడు పన్ను లియ్యనివారి నెన్నివిధముల కష్టపెట్టుచుండిరో యీ పద్యము బాగా విశదపరచినది. చిత్రమేమనగా క్రీ.శ. 1900 వరకు హైద్రాబాదు సీమలోని పల్లెలలో పటేలు, పట్వారీ లివే పద్ధతులను అవలంబిస్తూవుండిరి. ఊరిముందర చావడియుండెడిది. అందులకు చేతులకు కట్టెబేడీలువేయు "కోడాలు" ఉండెడివి. రెండుచేతులను మణికట్టువరకు రెండుకట్టెల రంధ్రములందుంచి ఒక వెదురు చీలను (గొడిగను) వాటికి బిగించువారు. మరియు ఎండలో నిలబెట్టి, బండలెత్తుట లేక ఊరి ముందర నుండు గుండును భుజముపై మోయించుట లేక ఒక పెద్ద మొద్దుకు గొలుసునుకట్టి దానిని కాళ్ళకు తగిలించుట. ఇట్టివన్నియు చేయిస్తూ వుండిరి. అనగా ఒడ్డెరాజుల సృష్టి దేశమంతటను వ్యాపించెనన్నమాట. అయితే తటాలున ఒడ్డెరాజులే యీ శిక్ష లన్నింటిని ప్రవేశపెట్టిరనుట కాదు. అంతకుముందు ఇట్టివి యాచారమం దుండెనేమో! కాని వాఙ్మయములో వాటి సూచనలరుదు. ఒడ్డెరాజుల యవయశస్సుమాత్ర మీ శ్రీనాథుని ఛాటుధార యున్నంతకాలము తెలుగునాట నుండకమానదు.

       క. ఓరీ కోమటి ముక్కున
          నీరెత్తుడు, మేము కినియనేరక యున్నన్
          నోరికి వచ్చిన యట్టులు
          వారణ యొక్కింత లేక వదరు లరచెడిన్.[40]

ఇట్టి సూచనలనుబట్టి పన్ను లియ్యని వారిని కష్టపెడుతూ వుండిరి. కాని కవులను పండితులను శిష్టులను కష్ట పెట్టి యుండరు.

అనపోతరెడ్డి కంచి, పేరి, పొన్ని అను ముగ్గురు భోగపుసానులకు కొన్ని గ్రామాలను ధానము చేసెను. ఆ వేశ్యలు తమకిచ్చిన గ్రామాలలో చెరువులు కట్టించిరి. ఈ విషయమును గమనించిన అ కాలమందు ధనికులును సామాన్య జనులును కూడ జలాధార నిర్మాణములందుత్సాహులై యుండి రనవచ్చును.

తెలంగాణములో వెలమరాజులు అనేక నూతన తటాకములను తమతమ పేర కట్టించినవి నేటికిని చెడిపోక తరీసేద్యమునకు ముఖ్యాధారములై యున్నవి. మాధవనాయుడు సింగమనాయుడు మున్నగు వెలమరాజులు తమతమ పేర అనేక గ్రామాలనుకూడ నిర్మించిరి. అవి నేటికిని వారి పేర్లతోనే వర్ధిల్లుతూ వున్నవి.

ఈవిధముగా మొత్తముపై ఆంధ్రదేశమంతటను క్రీ.శ. 1300 నుండి 1410 వరకు ప్రజలు సుఖముగా జీవించిరని చెప్పవచ్చును.

వ్యాపార పరిశ్రమలు

ప్రాచీనము నుండియు తెనుగువారు సముద్రవ్యాపారమును చేసినవారు. కృష్ణా, గోదావరి, విశాఖపట్టణము జిల్లాలవారికి సముద్రతీరముండుటచేత వారికి సముద్రవ్యాపారమునకే యెక్కువ అవకాశములుండెను. వారు బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా, సింహళద్వీపాలతో విశేషముగా వ్యాపారము చేసిరి. పై దేశములనుండియు పర్షియా, అరేబియా దేశాలనుండియు నానావిధములగు సరుకులు తెనుగు తూర్పు తీరమందలి రేవులలో దిగుతుండెను. నేలబేరానికి దొంగలు తగిలినట్లుగా సముద్రవ్యాపారానికి దొంగలుండిరి. అందుచేత రాజులు వారి నణుచుటకై ప్రయత్నాలు చేస్తూవుండిరి. కాకతీయ గణపతి చక్రవర్తి కాలానికి ముందును, కాకతీయ రాజ్యపతనానంతరము దేశము తురకల వశమైనప్పుడును సముద్ర వ్యాపారము స్తంబించియుండెను. వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి పేరుపొందిన శూరసేనాని.

        "బాహాదర్పమునన్ ప్రతీపధరణీ
         పాలావళిం దోలి, యు
         త్సాహోదగ్రుడు మోటుపల్లి గొని స
         ప్తద్వీప సద్వస్తు నం
         దోహంబున్ తనకిచ్చు నెచ్చెలి సము
         ద్రుం బ్రీతి కావించుచున్
         మాహాత్మ్యంబు వహించె మల్లరథినీ
         నాథుండు గాఢోదతిన్,"

మోటుపల్లి సుప్రసిద్ధ మగు ఓడరేవు. దానికి ముకుళపుర మను నామాంతర ముండెను.

ఆంధ్రులు సముద్ర వ్యాపారము విశేషముగా చేసినప్పుడు తత్సంబంధమగు సాంకేతికపదములు వాఙ్మయములో నుండవలసియుండెను. కాని యట్టివి విశేషముగా గ్రంథస్థము కాలేదు. అయినట్టివి కొన్ని కూడా జనుల కర్థము కానివై పోయెను. శ్రీనాథుడు కొన్ని నౌకాజాత్తులను పేరులను వ్రాసెను. అందుచే నాపద్యము చాలా ముఖ్యమైనది. అతడిట్లు వ్రాసెను.

         "తరుణాసీరి తవాయి గోవ రమణా
          స్థానంబులం జందనా
          గరు కర్పూర హిమంబు కుకుమ రజ:
          కస్తూరికా ద్రవ్యముల్
          శరధిన్ కప్పలి, జోంగు, వల్లి వలికా
          సమ్మన్ల, దెప్పించు నే
          ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తి
          ప్పం డల్పుడే యిమ్మహిన్."[41]

పై పద్యములోని కప్పలి అరవములోని కప్పల్ పదమనియు, జోంగు అనునది తూర్పు సముద్రములోని ఓడ అనియు అపదమే ఇంగ్లీషులో (Junk) అయ్యెననియు, అవి పెద్ద ఓడలనియు, వల్లి వలికాపదాల కర్థము తెలియదనియు, సమ్మను పదము మలయా ద్వీపకల్పములో ఓడకు పదమనియు, రెడ్డి రాజ్య చరిత్రమందు తెలిపినారు.[42] సముద్ర వ్యాపారమువల్ల రెడ్డి రాజులకు చాలా గొప్ప లాభముండెను. అంతకు ముందటి అరాచక స్థితుల వలన మోటుపల్లి వర్తక మాగియుండెను. రెడ్డి రాజులు శాంతిని నెలకొలిపి, సుంకరివారు వర్తకులదోపిడి చేయకుండ సరకులపై సుంకములు నిర్ణయించి, కొన్నింటిపై తగ్గించి, కొన్నింటిపై తీసివేసి, అందరికినీ తెలియుటకై మోటుపల్లి తీరములో శాసనము వ్రాయించి యుంచిరి. అప్పటి భాష, అప్పటి వ్యాపారము తెలియజేయి నాశాసనము నిందుదాహరింతురు.

"స్వస్తిశ్రీ శకవర్షంబులు 1280 అగు నేటి విళంబన సంవత్సర శ్రావణ శు 8 మంగళవారం స్వస్తిశ్రీమతు అనపోతయరెడ్డిగారు మోటుపల్లికాపు వచ్చిన వ్యవహారాలకున్న వ్యవహారం వచ్చి కరపట్టాల దీపాంతరాల వ్యవహారాలకున్ను యిచ్చిన ధర్మశాసనం."

ఈ మోటుపల్లికి యెవరు కాపతనానికి వచ్చినను వారిని మన్నించి పెద్ద కానికె పెట్టువారము. వారికి భూమితోటి కాణాచియిచ్చువారము. వారు యెప్పుడు మరివొక తావుకు పొయ్యేమన్నాను. కాపని పట్టక అనిపిచ్చువారము. యేవూరి సరకు తెచ్చినాను తమ విచ్చలవిడి నమ్మవలసినట్లు సరుకుకొనువారికాని పోగా పునకు పల్‌సనిసర్కు ఆడపట్టేము. చీరాను, గండము, పవడము, పట్టి వ్యవహారాలకున్ను అపుత్రికమున్ను సుంకాదాయము మానితిమి. బంగారు సుంకము మానితిమి. గంధముయొక్క బది సుంకము పూర్వమర్యాదలలోను మూటను ఒకటి మానితిమి. ఈ సరకులకున్ను మెట్టసుంకాలు పూర్వమర్యాదలు క్రమాననే కొనువారము. ఈ క్రమానకు సర్వమైనవారున్ను విశ్వసించెదరు. దేవర వారికి అభస్యహస్త మిస్తిమి."

"మోటుపల్లికే వర్తకులు వచ్చి నివసింపగోరినను వారిని గౌరవించి వారలకు భూములు నివేశస్థలము లిప్పింతుమనియు వారిని నిర్బంధపెట్టి నిలుపక స్వేచ్చగా విడుతుమనియు ఏయూరి సరకు తెచ్చినను వారిని స్వేచ్చగా నమ్ముకొన నిత్తుమనియు, పన్నులకై వారి సరకులను గ్రహింపమనియు నాశాసనమున వ్రాయించి ప్రకటించిరి."[43] కుమార గిరిరెడ్డి సుగంధభాండాగారియు, ఉదారుడును, భక్తుడును, సరసుదులు, కోటీశ్వరుడును నగు అవచి తిప్పయ చరిత్ర శ్రీనాథుని హరవిలాసము వల్ల తెలియవస్తున్నది. అట్టి మహాధనికు లింకెందరుండిరో తెలియదు. తిప్పయ సెట్టియొక్క ఘనతను శ్రీనాథు డనేక విధముల ప్రకటించినాడు. అ సెట్టి యే యే దేశాలనుండి యే యే సరకులను తెప్పించెడివాడో యిట్లు తెలిపినాడు.

        "పంజార కర్పూర పాదపంబులు తెచ్చె
         జలనోంగి బంగారు మొలకతెచ్చె
         సింహళంబున గంధసింధురంబులు దెచ్చె
         హురుముంజి బలుతేజి హరులు తెచ్చె
         గోవసంశుద్ధ సంకుమద ద్రవము దెచ్చె
         యాంపకట్టాణి ముత్యాలు తెచ్చె
         భోట కస్తూరికాపుట కోసములు దెచ్చె
         చీన్ చీనాంబర శ్రేణి తెచ్చె
         జగద గోపాలరాయ వేశ్యాభుజంగ
         వల్లవాదిత్య భూదాన పరశురామ
         కొమరగిరి రాజదేవేంద్రు కూర్మిహితుడు
         జాణ జగజెట్టి దేవయ చామిసెట్టి."[44]

పై పద్యములో గోవా, చీని, సింహళము, హురుముంజి (పర్షియాలోని హుర్ముజ్‌రేవు) అనునవి మాత్రము మనకు తెలియును. తక్కిన వాటిని గురించి రెడ్డి రాజ్యముల చరిత్రలో ఇట్లు తెలిపినారు.

"పంజార - సుమత్రా దీవిలోని పన్‌సార్ అను పట్నము

జలనోంగి - మలయాలోనిదై యుండును.

యాంప - సింహళాని కుత్తరమున నున్న జాప్నా అనునది. దీనినే యాల్పన, యాప అనిరి.

భోట - ఇండియాలోని భూటాన్"[45] అవచి తిప్పయ "తరుణాసీరితవాయి గోపరమణాస్థానము" ల నుండి సుగంధద్రవ్యములను తెప్పించెను. ఆ ప్రదేశము లేవియో ఆ చిక్కును గూడ శ్రీమల్లంపల్లివారే విడదీసినారు.

"తరుణాసీరి - మలయాద్వీపకల్పములోనిది. దాని నిప్పుడు టెనస్సరిం (Tenassarim) అని యందురు.

తవాయి - (Tavoy) ఇదియు మలయాలోనిది.

రమణ - పెగూలోని రమన్న దేశము.[46]

వ్యాపారము చేయువారిలో బలిజలు, కోమట్లు ముఖ్యులు. బలిజశబ్దము వణిజశబ్దమై యుండును. పూర్వము బలిజలకే సెట్టి అను బిరుదముండెను. తర్వాత కోమటులును వారివలనే ప్రధానముగా వర్తకులైనందున వారు సెట్టిబిరుదమును స్వీకరించి యుందురు.

పెద్దపెద్ద గ్రామాలలో వారమున కొకమారు సంతలు సాగుచుండెను. కొన్ని సంతలలో ప్రత్యేక వస్తువులు మాత్రమే యమ్ముచుండిరి.

          "... మూటెడు ప్రాలకు నూనె సంతలో
           గొన జనుదెంచి బియ్యమున
           కున్ సరితైలము పోయుమన్న నా
           తనిపలు కెవ్వరున్ వినక ..."[47]

అను మాటలనుబట్టి ఆ కాలమున నూనె సంతలవంటి ప్రత్యేకపుసంత లుండెనని తెలియును. మరియు ధాన్యమిచ్చి కావలసిన సరకులు కొనిరనియు బియ్యమునకు సరి తైలము లభింపకుండెననియు "ప్రాలేడుమానికెలకుం దైలము మానెడు పురమ్ముధారణ"[48] అనియు తెలియవస్తున్నది. ఏడు మానికెల బియ్యానికి ఒక మానికె నూనె, అప్పటి బజారుధర. అధారణను (హిందీలో నిప్పటికిని ధారణ్ అందురు) పురములోని వర్తకశ్రేణి నిర్ణయించియుండెను. తెనుగుదేశము సన్నని నూలుబట్టలకు ప్రసిద్ధి. రుద్రమదేవి కాలములోని సన్నని నూలుబట్టలు మహారాజులకే తగినట్టివని పాశ్చాత్యయాంత్రికు లానాడే వ్రాసిరి. తెనుగు దేశమందంతటను నూలుబట్టల వ్యాపారమే అగ్రస్థానము వహించెను. ఇంటింట రాటమాడుచుండెను. కదురాడిన, కవ్వమాడిన యింటికి దరిద్ర మెన్నడనూ ఉండదని పెద్దలనెడివారు. శూద్రులలో ప్రతి స్త్రీయు రాటముపై వడకుటను నేర్చియుండె ననవచ్చును. బీదలు తమ యవసరాలకు సరిపోగా మిగిలిన దారపుకండెలను అమ్ముకొంటూ వుండిరి. అవి వస్త్రాలుగా సిద్ధమై తూర్పు పడమటి దేశ దేశాంతరాల కెగుమతి యవుతుండెను. పల్నాటిలో,

"రంభయైన యేకులె వడకున్"

అనుటచే ఆ సీమలో స్త్రీ లందరును వడికిరన్నమాట. అయితే తూర్పు తీరములో ఉత్తమజాతులవారు వడుకకుండిరేమో ?

నూలుబట్టలేకాక, పట్టుబట్టలును బాగా వ్యాప్తిలో నుండినట్లు కానవస్తున్నది. పట్టులో అనేక భేదములుండెను. "చందనకాపులును, పట్టెడుకాపులును, చెంగావులను, కదంబకాపులును, కరకంచులును, బొమ్మంచులును, ముడుగుబొమ్మంచులును, ముయ్యంచులును, చిలుక చాళ్ళును, వేటచాళ్లును, నిండువన్నెలును, ఉఱుతచారల వన్నెలును, గంటకి వన్నెలును, పుప్పొడివన్నెలును, రుద్రాక్షవన్నెలును, నాగాబంధములును, పూజాబంధములును, జలపంజరంబులును, కామవరంబులును, సూరవరంబులును, తారామండలంబులును, హంసావళులును, హరిణావళులును, తురగావళులును, గజావళులును, సింహావళులును, ద్రౌపదీ స్వయంవరంబులును, లక్ష్మీవిలాసంబులును, మదన విలాసంబులును, వసంత విలాసంబులును, రత్నకీలితంబులును, రాయశృంగారంబులును, కనకదండెలును, గచ్చిలంబులును, కరూర గంధులును, పారువంపు గంధులును, శ్రీతోపులును, శ్రీరామ తోపులును, శ్రీకృష్ణ విలాసంబులును, జీబులును, సుగుపట్టంబులును, సన్న వలిపంబులును, వెలిపట్టులును, హొంబట్టును, పులిగోతుపట్టును, ఉదయరాగపట్టును, నేత్రపట్టును, వజ్రపట్టును అను పేళ్ళుగల పుట్టంబులు[49] ఆ కాలమందుండెను. "అరుదైన పసిడి హంసావళివన్నె; జిగిజిగి ధగధగయను చీనాంబరంబు" అని గౌరన వర్ణించెను. (నవనాథచరిత్ర పుట 4.) పైన పేర్కొనబడినవాటిలో ప్రత్తినూలుబట్టలును, పట్టుబట్టలును కలవు. నూలుబట్టలలోని అంచుల భేదము లందు తెలుపబడినవి. ద్రౌపదీ స్వయంవరము శ్రీరామ శ్రీకృష్ణ అను పేరులు కలవి అంచులు కావేమొ! కొంగులపై కట్టెపలకలపై చెక్కిన బొమ్మలను రంగులపై అచ్చువేయు చుండిరేమో! కామవరము, సూరవరము అను పేరులు చెప్పుటచే, ఆ రెండుస్థలాలు బట్టలకు ప్రసిద్ధి చెందెననవలెను.

ఇన్ని పేర్లుకల అంచులనుగురించి చెప్పునప్పుడు రంగుల పరిశ్రమ విశేషముగా నుండెననుట స్పష్టమే. చెంగావి అనునది లేతవన్నెయై యుండును. కరకంచు అనుటచే కరక్కాయచెక్కతో వన్నె వేయుచుండిరేమో! (ఆ తర్వాత సూ.రా.నిఘంటువును జూడగా అందు "కరక్కాయ నీటితో వ్రాసిన అంచు" అని యుండుట గాంచితిని.) బొమ్మంచు అనిన తెల్లచీరల యెర్రఅంచు. చిలుక చాళ్ళు అనుటచే చిలుక పచ్చనివన్నె వాడి రనవచ్చును. ఉఱత యన ఉడుత, దాని చారలవంటి వన్నెలుండెను. రుద్రాక్షవన్నె యిప్పటికినీ వాడుకలో కలదు. నీలిమందు చేయుట చాలా ప్రాచీన పరిశ్రమ. ఆ రంగు అన్ని రంగులకన్న మిన్నయైయుండెను. నీలిరంగు హిందువులే కనిపెట్టిరని దానికి ఇండిగో అని పాశ్చాత్యులు పేరు పెట్టిరి. మంజిష్ఠ, లక్క, పసుపు మున్నగునవి రంగులు చేయుటకు వాడుతూ వుండిరి. పట్టులో నీలిపట్టు అనుటచే దానికి నీలిరం గిచ్చి రన్నమాట. హొంబట్టు అనుటచే జరీఅంచులుకల పట్టు అని యర్థమగును. రంగులచేయు వృత్తివారు ఒక కులముగాకూడా తర్వాత యేర్పడినట్లు కానవస్తున్నది.

"బంగారువ్రాత నిండుమాదావళి దట్టిగట్టి"[50] యని వర్ణించిన దాన్నిబట్టి జలతారుఅంచు కల కపిలవర్ణపుకాసెదట్టి అనగా జేనెడు వెడల్పు కలది. జెట్టీలు నడుములో బిగించుచుండిరని తెలియవచ్చెడి. ఇపుడు దట్టియన స్త్రీలు కట్టుకొను చీరయని యర్థము. కాన ఆకాలమందు నడుము పట్టికి దట్టి యనిరి.

విదేశములనుండి మన తెనుగు దేశములోనికి దిగుమతియగు వస్తువులను ఇదివరకే యుదహరించినాము. అవేవో తెలుసుకొందుము. కుమార గిరిరెడ్డికి వసంతరాయడను బిరుదముండెను. అతనికన్న పూర్వుడగు రాజుకును అదే బిరుదమున్నను ఇతనికే అది ప్రధానమయ్యెను. ఇతడు ఏటేట వసంతోత్సవములను చేస్తూవుండెను. అందు కర్పూరమును విశేషముగా ఎగజల్లినవాడగుటచేత కర్పూర వసంతరాయడను బిరుదము కలిగెను. ఈ యుత్సవాలకు కావలసిన సుగంధద్రవ్యములను జావా, సుమిత్రాది తూర్పు దీవులనుండి తెప్పించుటకును వాటిని పెద్దభవనములలో నింపి సుగంధభాండాగారాధ్యక్షపదవిని నిర్వహించుటకును అవచి సెట్లు నియుక్తులై యుండిరి. "అమ్మహారాజునకు ప్రతిసంవత్సరంబును వసంతోత్సవంబుల కస్తూరీ కుంకుమ సంకుమద (జవ్వాజి) కర్పూర హిమంబు (పన్నీరు) కాలాగరు గంధసార (చందనము) ప్రధానంబులగు సుగంధ ద్రవ్యంబు లొడగూర్చియు చీని సింహళ తవాయ హురుమంజి జోణంగి ప్రభృతి నానాద్వీపనగరాకరంబుల దెప్పించు" చుండెను. సుగంధ ద్రవ్యములన్నియు ఇండోనీషియా దీవులనుండియే నేటికిని వస్తూవున్నవి. ఆ కాలములో, పైవికాక సింహళమునుండి ఏనుగులు, హురుమంజి (పర్షియా అఖాతతీరము) నుండి గుర్రములు వచ్చెను. పూర్వము గుర్రాలకు పర్షియాదేశమే ప్రసిద్ధి. తురక సుల్తానుల సేనలో గుర్రాలెక్కువగా నుండెను. రెడ్డిరాజులు, విజయనగర రాజులు గుర్రాలను కొనుటలో చాలావ్యయము చేస్తూవుండిరి. ముత్యాలు సింహళమునుండియే దిగుమతి యయ్యెను. చీనానుండి పట్టుబట్టలు వచ్చెను.

రెడ్డిరాజులకు నిరంతరము ప్రక్కరాజ్యాల రాజులతో యుద్ధాలుండినందున వా రాయుధములను విస్తారముగా చేస్తూవుండిరి. కమ్మరివారే ఆయుధాలు చేయువారు. కుంపటిలో చిన్న చిన్న లోహములను కాచి ఆయుధాలు చేయుచుండిరి. ఆయుధాలలో కత్తి, చురిక, బల్లెము, ఈటె, బాణము ముఖ్యమైనవి. పంచలోహములతో జయస్తంబములను, ఆయుధములను చేసిరి. రాజుల కొలువు చవికెల"ను కూడ పంచలోహములతో చేసిరి.2 ఆంధ్ర

_______________________________________

1. హరవిలాసము. కృత్యాదులు.

2. "పంచలోహ కల్పితం బగు నతని కొలువు చవికె" (భోజరాజీయము, అ 2. ప 113.) దేశమందనేక స్థలాలలో ముడిలోహమును భూమినుండి తవ్వి, వాటిని కరగించి ఇనుమును సిద్ధము చేసిరి. దానినుండియు యుక్కునుకూడ సిద్ధము చేసిరి.

         "వయ్యంది గాచి కమ్మరి
          చయ్యన బదనిచ్చు నుక్కు చక్రము మాడ్కిన్.[51]

(వయ్యంది అనగా కుంపటి.) తెలంగాణాలో నిర్మల కత్తులు జగద్విఖ్యాతి కాంచియుండెను. అచ్చటి కత్తులు అచ్చటి యుక్కు డెమాస్కస్ నగరాని కెగుమతి యగుచుండెను. మెరుగు టద్దాలుకూడా సిద్ధమవుతూ వుండెను. వాటిని శుభ్రము చేయుటకేమో మెరుగురాతి పొడిని వాడినట్లు కానవస్తున్నది.

"మెరుగు టద్దంబుల నంటిన మెరుగురాతిపొడియును వోలెన్"[52] అనుటచే నిది ఊహ్య మవుతున్నది.

ఓరుగంటిలోని వెలివాడలోని మేదరి పడచులు కూడ "అలతి యద్దపు బిళ్ళయనవోక వీక్షించు" చుండిరి. (క్రీడాభి) దీనినిబట్టి అద్దాలు చిన్నవి పెద్దవి బీదవారి యందుబాటులో నుండునంతటి చౌక వస్తువులు, అద్దముల నెట్లు సిద్ధము చేయుచుండిరో అ పరిశ్రమ యెచ్చ టెచ్చట నుండెనో యదిమాత్రము తెలియ రాలేదు.

వ్రాత విశేషముగా తాటాకులపయిననే జరుగుతూ వుండెను. తాటాకులపై వ్రాయు లేఖినిని గంటము అనిరి. దానిని నానా విధములుగా సిద్ధము చేస్తుండిరి. వ్రాయని రెండవ కొనను ఆకుల చెక్కుటకు కత్తిగానో లేక అందమైన రేఖలతోనో సిద్ధము చేసెడివారు. మంత్రులు, సంపన్నులు బంగారు గంటములతో వ్రాసిరి.

         "కలము పసిండి గంటమున
          కాటయవేము సమక్షమందు, స
          త్ఫలముగ రాయసప్రభుని
          బాచడు వ్రాసిన వ్రాలమోతలన్

          గలు గలు గల్లు గల్లు రన
          కంటక మంత్రుల గుండె లన్నియున్
          జలు జలు జల్లు జల్లు రనె
          సత్కవివర్యులు మేలు మే లనన్."[53]

వడిగా వ్రాయుట, ముత్యములవలె ముద్దుగా వ్రాయుట తాటాకుల గ్రంథాలకు చాలా యవసరమై యుండినందున ఆ కాలమువారి వ్రాతలు చాలా సుందరములై యుండెను. అట్టివారిలోకూడా కాటయవేముని వ్రాయసకాడు (రాయసం) అగు బాచమంత్రి అక్షర రమ్యత మరీగొప్పగా పొగడ్త కెక్కెను.

తాటాకులనే ప్రధానముగా వాడినను జనులకు కాగితము అలవాటు తెలియదని కాదు.

        "దస్త్రాలుం మసిబుర్రలున్ కలములుం
         దార్కొన్న చింతంబళుల్
    మున్నగునవి శ్రీనాథుడు చూచియే యుండెనుకదా!

        "కన్నుల పండువై యమరు
         కాకితమందలి వర్ణ పద్దతుల్"[54]

అనుటచే రాజులు, మంత్రులు కాగితముల వాడుచుండిరి. కాగితశబ్దము కాగజ్ అను పార్సీ శబ్దమునుండి వచ్చినది. అనగా ఈ పరిశ్రమను తురకలు తెచ్చిరన్నమాట. ఆదిలో కాగితములను కనిపెట్టినవారు చీనావారు. కాన వారి నుండియే తురకలు ఆ విద్యను నేర్చిరి. నేటికిని చేతికాగిత పరిశ్రమ విశేషముగా తురకలలోనే కలదు.

తాత్కాలికముగా పనియిచ్చునట్టి వ్యవహారములందు పలువురు తాటాకులపై మసిలో అద్దిన, గలుగు కలములతో వ్రాసెడివారు.

        "వెసవ సుదాస్థలంబున కవీంద్రులు కొందరు శేముషీ మషీ
         రసము మన: కటాహ కుహరంబుల నించి కలంచి జిహ్వకా

          కిసలయ తూలికం గొని లిఖింతురు కబ్బము లెన్నగా మహా
          వ్యసనముతో నిజాసన వియత్తల తాళపలాశ రేఖలన్"
    అని శ్రీనాథుడు వర్ణంచెను.

పూర్వము లెక్కలు వ్రాయువారు కరణాలై యుండిరి. వారు మొదట పన్ను వసూళ్ళ లెక్కల కధికారులు కారు. ఆదిలో పన్నువసూలు చేయువారు విశ్వబ్రాహ్మణులను కమసాలులు. నేటికిని అందందు వారు గ్రామ కరణాలుగా కనబడుతున్నారు. రాయని భాస్కరమంత్రి వారిని తొలగించి బ్రాహ్మణ నియోగులను ఏర్పాటు చేసెనని కొన్ని కథలు చెప్పుదురు.

లెక్కలు వ్రాయు కరణాలు అసాధ్యులనియు, దుర్మార్గులనియు అనిపించుకొనిరి. వారు లెక్కలను "వహి" అను పుస్తకాలలో వ్రాయుచుండిరి. (నేటికిని హిందీలో లెక్కపుస్తకాలను బహి అందురు.) వారు లెక్కలెట్లుంచిరో (Book Keeping) కొంత మనకు తెలియవస్తున్నది. "వ్రాతకానిని నమ్మరాదు"[55] అన్న అపఖ్యాతి వారి కుండెను.

        క. ఒకదెస దెచ్చిన యాయం
           బొకదిక్కున చెల్లు వ్రాసి యొకదెస వ్యయ మ
           ట్లొక దిక్కున జన వ్రాసిన
           బ్రకటంబుగ వాడు మిగుల పాపాత్ముడగున్.

        క. వహి వారణాసి యనగా
           మహి బరగిన దిందు కపటమార్గంబుగ నా
           గ్రమున వ్రాసిన వానికి
           నిహపరములు లేవు నరక మెదురై యుండున్.

        గీ. రానిపైడి చెల్లుట వ్రాయుట యాయంబు
           తక్కువై వ్యయంబ దెక్కుడౌట
           లెక్క తుడుపువడుట లిపి సందియంబౌట
           చెల్లు మరచుటయును కల్లపనులు.

         క. కరణము తన యేలిక కుప
            కరణము, నిర్ణయ గుణాధికరణము, ప్రజకున్
            శరణము, పగవారలకును
            మరణము నా జెల్లు నీతిమంతుండైనన్.[56]

కళలు

ఓరుగంటి రాజుల కాలములోవలెనే ఈ కాలమందును కళాపోషణము బాగా జరిగెను. అంతేకాదు, ఈ కాలములో కళాపోషణము ఉచ్చస్థాయి నందెను. తుది రెడ్డిరాజులు వసంతరాజ బిరుదాంచితులగుట ఈ కళాపోషణమున కొక ప్రబలతర నిదర్శనము. కవిసార్వభౌముడును, ఆసేతువింధ్యాది పర్యంతము తన కీడుజోడు లే డనిపించుకొన్నవాడును, బహుశాస్త్ర పురాణ పారంగతుడును, కవితలో నూతన యుగస్థాపకుడునునగు శ్రీనాథుడు విద్యాధికారియట! అఖిలాంధ్ర వాఙ్మయమునకు ప్రామాణికాచార్యత్రయములోనివాడగు ప్రబంధ పరమేశ్వరుడు ముఖ్యాస్థానకవి యట ! శివలీలా విలాసకర్తయగు నిశ్శంక కొమ్మన రెడ్డి రాజుల కీర్తనల చేసినవాడట ! సహస్ర విధాననవాభినయ కళాశ్రీశోభితలకుమాదేవి రాజసన్నిధిలో నిత్యనూత్నముగా నటంచినదట ! బాలసరస్వత్యాది మహాపండితు లాస్థాన దివ్యజ్యోతులట ! స్వయముగా రెడ్డి, వెలమప్రభులు కవులై, వ్యాఖ్యాతలై, సాహిత్యాచార్యులై సర్వజ్ఞులై సర్వజ్ఞ చక్రవర్తులైన దిగంత విశ్రాంత యశోవిశాలురట ! కర్పూర వసంతోత్సవములకు సుగంధ భాండాగారాధ్యక్షు లుండిరట ! ఇక కళాభివృద్ధికి కొదువయుండునా ?

ప్రోలయవేముని ఆస్థానమున లొల్ల మహాదేవికవి యనునత డుండెనని మాత్రమే మనకు తెలియును. (రెడ్డిసంచిక, పుట. 518)

ఆయుర్వేదమందు భూలోకధన్వంతరియని పేరుపొందిన భాస్కరార్యునికి పేదకోమటివేముడు అగ్రహారములు దానము చేసెను. (రెడ్డిసంచిక ! పుట 89.)

నాలుగు "వే"లు కలముతో నిచ్చినకవికి ఎనిమిదివేల నాణెములిచ్చిన అనవేములు రాజులుగా నుండ కొంతవిద్య నేర్చిన వారందరును కవులేయైరి. కొండవీటిలో నే సందులలో జూచినను విభూతిభస్మాంచితులును, నిరాకృతులును నగు చిల్లరకవులుండుటను గమనించి శ్రీనాథుడు ఆకవులవలె తిరుగు గాడిదలను ఇట్లు ప్రశ్నించెను.

         "బూడిదబుంగవై యొడలు
          పోడిమి తక్కి మొగంబు వెల్లనై
          వాడల వాడలం దిరిగి
          వాడును వీడును చొ చ్చొ చో యనన్,
          గోడల గొందులం దొదిగి
          కూయుచునుందువు కొండవీటిలో
          గాడిద ! నీవునుం గవివి
          కాదుకదా ! యనుమాన మయ్యెడిన్ !!

రెడ్డిరాజుల కాలములో సంస్కృతాంధ్ర పండితు లనేకు లుండిరి. అందు కొందరికృతులే మనకు లభ్యమైనవి. మన దురదృష్టమేమో 500 ఏండ్లలోనే శ్రీనాథుని బహుకృతులు, శంభుదాసుని రామాయణము, కుమారగిరి వసంతరాజీయము, ఇట్టి ముఖ్యమైనవి జాడలేకుండా పోయెను. బాలసరస్వతి అనునతడు అనపోతరెడ్డి యాస్థానకవియనియు, త్రిలోచనాచార్యుడనునతడు అనవేముని ఆస్థానకవియనియు మాత్రమే మనకు తెలియవచ్చినది. పలువురి కవితలు శాసనాలలో మాత్రమే మిగిలిపోయినవి. ప్రకాశ భారతయోగి అనునతడు చక్కని శాసనశ్లోకాలు వ్రాసెనని మాత్రమే మనమెరుగుదుము. వెన్నెలకంటి సూర కవితో పాటు మహాదేవకవి యుండెనన్నంతవరకే యెరిగితిమి. అనపర్తి శాసనమందే అన్నయకవి పద్యాలు చక్కని కవితాపాకముగలవి మనమెరుంగుదుము. కాటయవేముని శాసనము కవితలో వ్రాసిన శ్రీవల్లభుడను నతని చరిత్ర మన మెరుగము. ఇంకెందరి విజ్ఞానసంపదను మనము కోలుపోయినామో యేమో ? రెడ్ల యాశ్రయములో ఎర్రాప్రెగడ, శ్రీనాథుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన అను ప్రసిద్ధకవులుండిరి. వామనుభట్ట బాణుడను సంస్కృతకవి వేమభూపాల చరిత్రమును సంస్కృతములో వ్రాసెను. రెడ్డిరాజులు స్వయముగా గీర్వాణములో వ్యాఖ్యలు, కవితలువ్రాసిరి. కుమారగిరిరెడ్డి వసంతరాజీయమను నాట్యశాస్త్రమును వ్రాసెను. పెద కోమటియు నొక నాట్యశాస్త్రమును రచించెనందురు. కాటయ వేమన కాళిదాస నాటకములకు వ్యాఖ్యలు వ్రాసెను. పెదకోమటి సాహిత్య చింతామణిని వ్రాసెను. ఈ రాజు విశ్వేశ్వరకవి యనునతని కగ్రహారము దానముచేసెను. అతడేమివ్రాసినో మనకు లభ్యము కాలేదు. కొండవీటి రాజమహేంద్రవర రాజుల వలెనే రాచకొండ వెలమరాజులును కవులై, పండితులై, రచయితలై, కవి పండిత గాయక పోషకులై ప్రఖ్యాతిలైరి, అయితే రెడ్డి వెలమ ప్రభువులలో కొందరు స్వయముగా రచనలు చేయలేదని ఒకరిద్దరు విమర్శకు లన్నారు. అది కొంతవరకు నిజమైనను ఆరాజుల విజ్ఞతకు, కొట్టు కలుగనేరదు. రాచకొండ రాజుల వద్ద మల్లినాథుసూరి ముఖ్య పండితుడై యుండెను.

రెడ్ల యాస్థానాని కాంధ్రపండితులేకాక, ఇతర భారతీయ ప్రాంతాలనుండి అనేక పండితులు, కవులు, కళావేత్తలు కొల్లలుగా వెళ్ళుతూవుండిరి. అట్టివారిని పరీక్షించి వారి యర్హతలను ప్రభువులను మనవి చేయుటకు శ్రీనాథ కవిసార్వభౌముడు నియుక్తుడై యుండెను. రెడ్లశాసనములలో కొన్నింటిని ఆతడే వ్రాసి ఫిరంగిపుర శాసనములలో "విద్యాధికారీ శ్రీనాధో అకరోత్" అని వ్రాసుకొనెను. మరియు తనను గురించి యిట్లు వ్రాసికొనెను.

         "భాషించినాడవు బహుదేశ బుధులతో
          విద్యాపరీక్షణ వేళలందు"[57]

రాజుల యాస్థానాలలో పరిక్షాదికారులనుగా ఉద్దండ పండితకవులను నియమిస్తూ వుండిరని,

         "అదిపు కొలువున నే బరీక్షాధికారి
          నగుటజేసియు నొక విప్రు దెగడిపుచ్చి"[58]
                   యనుదానినిబట్టి తెలియును.
రాజులేకాక మంత్రులును బహుభాషావేత్తలై యుండిరి.

         "అరభీభాష తురుస్కభాష గజ కర్ణా
               టాంధ్ర గాంధార ఘూ
          ర్జర భాషల్ మళయాళిభాష శకభా
               షా సింధు సౌవీర బ

         థ్బర భాషల్ కరహాటభాష మరియున్
              భాషావిశేషంబు ల
         చ్చెరువై వచ్చు నరేటి యన్ననికి గో
              ష్ఠీ సంప్రయోగంబులన్.
 
         అన్నయ మంత్రిశేఖరు డ
             హమ్మదుసేను వదాన్య భూమి భృ
         త్సన్నిథికిన్ మదిన్ సముచి
             తంబుగ వేమ మహీసురేంద్ర రా
         జ్యోన్నతి సంతతాభ్యుదయ
             మొందగ పారసీభాష ఱ్రాసినన్
         కన్నుల పండువై యమరు
             కాకితమందలి వర్ణపద్ధతుల్.[59]

ఆ కాలానికే ఫార్సీప్రభావము తెనుగువారిపై ప్రారంభమయ్యెను. శక సింధు సౌవీర బర్బర కరహాట భాషలు వచ్చెననుట అతిశయోక్తియైయుండును. బర్బర అనునది బార్బరీ అను ఆఫ్రికాఖండోత్తర భాగము. తురుష్కభాష అన ఫార్సీ యని యర్థమేమో ! ఆంధ్రుల చరిత్రలో పైపద్యమందు "అహమ్మశాసన దానభూమి భృత్" అని వ్రాసినారు. ముద్రిత భీమేశ్వర పురాణపాఠమే సరిగా నున్నది. అహమ్మదుహుసేను లేక అహమ్మదుషా అనునతడు గుల్బర్గా బహమనీ సుల్తాను.

కవులకు గొప్ప ఆదరణ సన్మానముండుటచే శ్రీనాథుడు.

         "అక్షయ్యంబగు సాంపరాయని తెలుం
              గాధీశ ! కస్తూరికా
          భిక్షాదానము జేయురా ! సుకవీరా
              డ్బృందారక శ్రేణికిన్
          దాక్షారామ చళుక్యభీమ వరం
              దర్వాప్సరో భామినీ
          వక్షోజద్వయ కుంభి కుంభములపై
              వాసించు నవ్యాసనల్."

అని కోరెను. ఈపద్యము శ్రీనాథునిదే! సందేహములేదు.

         దాక్షారామవధూటీ
         వక్షోరుహ మృగమదాది వాంఛిత విలస
         దక్ష: కవాట బాంధవ
         రక్షావిధి వజ్రపంజర కృపాజలధీ ![60]

        "దక్షావాటీ .......గంధర్వపురోభామినీ"[61]

        "దాక్షారామ చళుక్యబీమ వరగంధ
         ర్వాప్సరో భామినీ, వక్షోజద్వయ గంధసార"[62]

అనుభాగాలను వ్రాసిన శ్రీనాథుడు పై చాటువున చెప్పలే దనగలమా ? ఆకాలములో పండితులు చదువుకొనిన విద్యలు పెక్కులుండెను. భారత రామాయణములు చదువని పండితులు లేకుండిరి. శ్రీనాథుని కభిమానులగు గీర్వాణవాణికవులలో కాళిదాసు, భట్టభాణుడు, ప్రవరసేనుడు, హర్షుడు, భాసశివభద్ర సౌమిల్ల భల్లులు, మాఘ భారవి బిల్హణులు, భట్టి చిత్తన కవిదండి పండితులును ముఖ్యులు[63] మురారిని పేర్కొనలేదు కాని అతని సమాసాలు చాలా వాడెను. తెనుగులో నన్నయ తిక్కన కవులును, వేములవాడ భీమకవి, ఎర్రాప్రెగడ అతనికి ముఖ్యులు. అతడు, "వినిపించినాడవు వేమభూపాలున కఖిలపురాణ విద్యాగమములు"[64] అని కీర్తనీయుడయ్యెను.

మరియు "అభ్యర్హిత బ్రహ్మండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిదానము"[65] అనియు పేరొందెను. డిండిమ కవిసార్వభౌము నోడించిన వాడెన్ని శాస్త్రాలు చదివి యుండవలెనో యూహించుడు. ఇతర పండితులును ఇన్ని శాస్త్రాలు చదివినవారై యుందురు. ఆకాలములోని కొన్ని శాస్త్రాల ముచ్చట యిట్లుండెను.

         సీ. అష్టభాషల మధురాశు విస్తర చిత్ర
                   కవితలు చెప్పు సత్కవులు మెచ్చ
            అమ్నాయములు నాల్గు అంగంబు లారును
                   అఖిల శాస్త్రంబులు నవగతములు
            నూతన రీతుల ధాతు విభ్రమముల
                   రసములు మెరయు నర్ణకమువాడు
            ఏ పురాణంబుల నేకథ యడిగినం
                   దడబాటు లేక యేర్పడగ జెప్పు
            ఓలినవధానములు వేనవేలు సూపు
            శబ్ద విజ్ఞానినైనను సరకు గొనదు
            గౌతమునినైన దొడరి తర్కమున గెలుచు
            అవధరింపు మీకీరంబు నవనినాథ !

"________ఋగ్యజుస్సామాధర్వణంబులందును, శిక్షాకల్ప జ్యోతిర్నిరుక్త వ్యాకరణ చ్చందంబులందును, మీమాంసాదులగు తత్త్వావబోధనంబులందును, బ్రాహ్మంబు, శైవంబు, పాద్మంబు, వైష్ణవంబు, భాగవతంబు, భవిష్యత్తు నారదీయంబు, మార్కండేయంబు, ఆగ్నేయంబు, బ్రహ్మకైవర్తవంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, గౌతమంబు, గారుడంబు, మాత్స్యంబు, వాయవ్యంబు అను మహాపురాణములయందును, , నారసింహంబు, నారదంబు, శివధర్మంబు, మహేశ్వరంబు, గాలవంబు, మానవంబు, బ్రహ్మాండంబు, వారుణ కాళికంబును, సాంబంబు, సౌరంబు, మారీచంబు, కూర్మంబు, బ్రహ్మ భార్గవ సౌర వైష్ణవంబులు నను నవపురాణములందును - తనకు నత్యంత పరిచయంబు"[66]

పైపురాణాలలో ఎన్ని మూలబడెనో ఎన్ని కొత్తవి సృష్టియయ్యెనో తెలుసుకొనుటకుకూడా వీలుకలుగుతున్నది. పలువురు రాజులు "లక్ష్మీయుత్సవములు" చేస్తూవుండిరి. ఆ సమయాలలో వారు కళావేత్తల కుదారముగా దానాలు చేసిరి.

         "అవని నవంతిభూమి వరు
          డాదిగ పార్థివులెల్ల లక్ష్మియు
          త్సవములు మున్నుగా కడు ప్ర
          శస్తములౌ సమయంబులందు స
          త్కవులను, పాఠకోత్తముల,
          గాయకులన్, నటులన్, వితీర్ణవై
          భవముల దన్పజొచ్చిరి ప్ర
          భావసమృద్ధుల నింపు పుట్టగన్."[67]

కవు లనుభవించిన వైభవముల కొన్ని శ్రీనాథుడు తెలిపినాడు. వారికి రత్నాంబరములు, కస్తూరి, హేమపాత్రాన్నము, దినవెచ్చము, మున్నగునవి లభించెను. పైన తెలిపినవి విశేషముగా బ్రాహ్మణుల విద్యలై యుండెను.

"బ్రాహ్మణు లెట్టి విద్య నభ్యసించుచుండిరో శ్రీనాథుని యీక్రింది వాక్యము తెలుపును."

"మథుర యను పట్టణంబున శివశర్మ యను విప్రోత్తముండు గలడు. అతడు వేదంబులు సదివి, తదర్థంబు లెరింగి, ధర్మశాస్త్రంబులు పఠించి, పురాణంబు లధిగమించి, యంగంబు లభ్యసించి, తర్కంబు లాలోడించి, మీమాంసా ద్వయం బాలోచించి, ధనుర్వేదం బవగాహించి, నాట్యవేదంబు గ్రహించి, యర్థశాస్త్రంబు ప్రాపించి, మంత్రశాస్త్రంబులు తెలిసి, భాషలు గఱచి, లిపులు నేర్చి, యర్థం బుపార్జించె" (కాశీఖండము, 3-29)

రాజులు కావ్యనాటకాలను, సాహిత్యశాస్త్రమును, సంగీతనాట్యశాస్త్రములను ఎక్కువగా నభ్యసించి రనుటకు రెడ్డిరాజులు వ్రాసిన శాస్త్రాలు, చేసిన వ్యాఖ్యలే ప్రథమసాక్ష్యములు. అవికాక వారికి అశ్వశిక్షణము, అశ్వశాస్త్రము, గజ శాస్త్రము, రాజనీతి, యుద్ధతంత్రము ముఖ్యములైన విద్యలు, రాజనీతిని గూర్చిన శాస్త్రములు సంస్కృతములో నెక్కువగా నుండెను. తెనుగులో మడికి సింగన సకలనీతిసమ్మతము వ్రాసెను. అందతడు పలువురి తెనుగు నీతికవుల నుదహరించెను. ఆ కవులలో పెక్కుకవుల గ్రంథాలు మనకు లభించుటలేదు. సంగీత నాట్యశాస్త్రములలో కొన్నిరచనలు రాజులే చేసిరి. కుమారగిరి వసంతరాజీయ రచనల కుదాహరణముగా అతని యుంపుడు కత్తెయగు లకుమాదేవి నాట్యము చేస్తూవుండెడిది.

          జయతి మహిమా లోకాతీత: కుమారగిరి ప్రభో:
          సదసి లకుమాదేవీతాస్య ప్రియాసదృశీప్రియా
          నవ మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రదా
          నితరతి బహు నర్థానర్థి ప్రజాయ సహస్రశ:

ఎందరు లకుమాదేవులు కాలగర్బమున నణగిపోయిరో యేమో! "తురకల పారసీకనృత్యము దేశమందు ప్రచారమై జనుల నాకర్షించుట చేత పెదకోమటి వేముడు తన నాట్యశాస్త్రములో ఒకక్రొత్తనృత్యమునకు అనగా పారసీక నర్తనమునకు 'మత్తల్లినర్తనము' అను పేరు పెట్టివర్ణించెను."[68] జనసామాన్యములో అనేక విధములగు నృత్యము లుండెను. వాటిని ముందు తెలుపుదును.

సంగీతములో జనసామాన్యానికి "జతిగ్రామ" విధానముపై ప్రీతియుండెనట.

         "దుత్ర తాళంబున వీరగు బీతక ధుం
          ధుం ధుం కిటాత్కార సం
          గతి వాయింపుచు నాంతరాళిక యతి
          గ్రామాభిరామంబుగా"

అని క్రీడాభిరామములో వర్ణించిరి. యతి అనునదే జతి. యతితద్బవమే జతి. యతి అనునదియు, గ్రామ అనునదియు వివిధమగు స్వరభేదములు.

రెడ్డిరాజులును, వెలమ రాజులును గొప్ప కోటలు, దేవాలయాలు నిర్మించి, అపూర్వ భవనములుకూడా కట్టించిరి. కొండవీటి దుర్గము మహాదుర్గములలో నొకటి యని ప్రఖ్యాతి కాంచినట్టిది. అందు చాలా మేడలుండెను. వాటిలో "గృహ రాజు" మేడ ఒంటిస్తంభము మేడ అను ప్రసిద్ధికలదై యుండెను. నేటికిని "గుర్రాజుమేడ" అను దిబ్బను జనులు చూపుచుందురు. అంతేకాదు, వారు క్రీడా సరస్సులను, లీలాగృహాలను కట్టించిరని అనపర్తి శాసనము తెలుపుతూ ఉన్నది. సరస్సులనుండి చెరువులలో చెరువులలో చిన్నపడవల వేసుకొని లీలావిహారముచేసి నవాబులవలె రెడ్డిరాజులు కొందరయినా (అందు కుమారగిరి తప్పకుండ) ఆనందించిరి. కొండవీటిలో కొల్లలుగా మల్లెలు పూచి, తమ సౌరభముల వెరజల్లుతూ వుండెను. ఆ పువ్వుల పన్నీటిని వీధులలో చల్లిస్తూవుండిరని జనులనుకొందురు. అనుకొనుటయేల, వారి యనుభవముపై ప్రజలే తమకు తోచినట్టుగా పదముల కట్టి పాడుకొనిరి.

నాకు లభించిన యొక జానపద గీతికాళకల మిట్లున్నది.

          "రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా !
           వీరభద్రారెడ్డి విచ్చేసెనమ్మా !
           ప్రొద్దున్నే మారెడ్డి పొర కూడిపించు
           నిలువెల్ల నడివీధి నీరు జల్లించు
           సందుగొందులలోన సాన్పు పోయించి
           చేకట్ల పసుపు కుంకుమా పూయించు
           రంగవల్లుల నూరు రాణింపజేయు
           తోరణా పంక్తులా తులకింపజేయు
           దివ్వెలను వెలిగించు దివ్యమార్గాలా
           మా పెల్లి పాలించు మంచి మార్గాలా
           ఎండలకు పందిళ్ళు వేయించుతాడూ
           పొందుగా మారేళ్ళు కోయించుతాడూ
           ఊరి బావులలోన ఉప్పుసున్నాలా
           వెదజల్లు నేటేట నిండుపున్నానా
                             రెడ్డొచ్చె.........

జనుల పరిపాలన యెంత ప్రీతిపాత్రమై, జనోపయుక్తమై, సకలానురంజకమై యుండెనో పై పాట అనేక విధాలా స్పష్టీకరిస్తుంది. ఇట్టిపాటలెన్ని అనాదృతములై మాయమైపోయెనో యేమో ! రెడ్డిరాజులకాలపుకళ నవాబు దర్జాతో కూడినదని చెప్పవలెను.

ప్రజా జీవనము

ఆ కాలపు ప్రజల వేషాదికము లెట్టివో, ఆచార లెట్టివో, జీవితవిధానము లెటువంటివో, విశ్వాసము లెటువంటివో కనుగొందము.

సాధారణముగా జనులు ధోవతి కట్టువారు. శూద్రజాతిలో రాయలసీమ తెలంగాణములందు చల్లాడములు తొడుగుతూ వుండిరి. దుప్పటియు గుండు రుమాలయు సాధారణవేషాలు. కొందరు చుంగుల లపేటా రుమాలల కట్టిరి. పలువురు నడుములో బెత్తెడు వెడల్పున ఏడెనిమిది మూరల పొడవునుకల కాసె (దట్టిని) బిగిస్తూవుండిరి. వారికి అంగీలు లేవనికాదు. వాటివాడుక తక్కువ. అంగీలు నిడుపై బొందెలు కలవై యుండెను. కవుల వర్ణనలలో కొందరి వేషాలెట్టివో తెలియవచ్చెడివి. గారడిపనిచేయుబంటును నిట్లు వర్ణించిరి.

          "అయ్యెడ నొక క్రొత్తయైన మహావీరు
           డిందియ డాకాల లమర బూని
           బాగుగా పులిగోరు పట్టు, దిండుగగట్టి
           నునుపార మేన చందన మలంది
           తిలకంబు కస్తూరి తిలకించి, చొళ్ళెంబు
           చెంగులపాగతో చెన్నుమీర
           హనుమంతు వ్రాసిన యరిగబిళ్ళయు, వాలు
           గరముల జయలక్ష్మి గడలు కొనగ
           నొకడువచ్చె వెనుక నొక్క బింబాధరి
           అందు దుప్పటి ముసు గమరబెట్టి
           మేనికాంతి కప్పులోన గ్రిక్కిరియంగ
           హంసయాన యగుచు నరుగుదేర."[69]

పై పద్యములో పులిగోరుపట్టు అనగా పులిగోరు వన్నెవంటి పట్టు అని యర్థము. పట్టులలో కొన్నిభేదము లుండెననియు, అం దిదొక్కటియనియు తెలుపనయినది. దిండుగట్టుట యన సెల్లగా చంకక్రిందనుండి మెడపై వైచు కొనుటకర్థమై యుండును. పై పద్యము దిగువనే "ద్రిండుతోడగూడ మొండెము దిగదొర్లె" అని వర్ణించినాడు. చొళ్ళెము అనగా జడచుట్టవలె చుట్టిన తలపాగ. జెట్టీలు నేటికిని మెడలో హనుమంతుని విగ్రహముకల బిళ్ళలు కట్టుకొందురు. అరిగెబిళ్ళ యన బిరుదుగా కట్టుకొన్న బిళ్ళ యని యర్థము.

శ్రీనాథుడు మొరస దేశమును వర్ణించెను. మొరసయన మైసూరు ప్రాంతమని శ్రీ మల్లంపల్లివారు, రెడ్డిరాజుల చరిత్రలో ఒకచోట అన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మొరసరాళ్ళెక్కువగానున్న కర్నూలు మండలమనిరి.

మొరస రాజ్య మన మైసూరు సీమ. శ్రీనాథు డాప్రాంతమునకు వెళ్ళి యుండినట్లు ఈక్రింది వర్ణన తెలుపుచున్నది.

         "వంకర పాగలున్ నడుము
          వంగిన కత్తులు మైలకోకలున్
          సంకటి ముద్దలున్ జనుప
          శాకములున్ బలు పచ్చడంబులున్
          తెంకగు నోరి చూపులును
          తేకువ దప్పిన యేసబాసలున్
          రంకుల బ్రహ్మ యీ మొరస
          రాజ్యము నెట్లు సృజించె నక్కటా!

విజయనగరరాజుల దర్బారీవేషాలు విచిత్రముగా నుండెను. పొడవయిన అంగీధరించి పొడవైన టోపీని కుల్లాయిని పెట్టుకొని పెద్దసెల్లా మెడలో వేసుకొని పోవలసియుండెను. కార్యార్థియైన శ్రీనాథుడును ఆ వేషమును వేసుకొనక తప్పదయ్యెను.

          "కుల్లా యుంచితి, కోక చుట్టితి, మహా
           కూర్పాసమున్ దొడిగితిన్"

అని తెలుపుకొనెను. కుల్లాయి మనదేశ వేషమా లేక తురకలనుండి అనుకరించిన వేషమాయని సందేహము కలుగును. కుల్లాయి అనున దించుమించు మూరెడుపొడవుదై తలక్రిందుగానుంచిన కాగితముపొట్లమువలె నుండునట్టిది. ఆ కాలపు ఆళియ రామరాజాదుల చిత్తరువులనుచూచిన తెలియరాగలదు. కుల్లాయిశబ్దము ఫార్సీ కులహ్ శబ్దమునుండి వచ్చినట్లున్నది. ఫార్సీలో కులహ్ అనగా టోపి. మన వాఙ్మయములో టోపి యనునది భట్టుమూర్తి కాలమునుండి అనగా విజయనగర పతనానంతరము వచ్చినట్లు కానవచ్చును. టొప్పికాయను పదమును మొదట వాడినవాడు చాళుక్య సోమేశ్వరుడు. రాజులకు టోపీని ధరించుట ముఖ్యమని అతడు అభిలషితార్థ చింతామణిలో వ్రాసెను.

వెలమరాజుల యాస్థానమునకు పోవుటకుకూడా దర్బారీ వేషము వేసుకొనుట యవసరమై యుండెను. ఒకమారు (బహుశా మొదటితడవ) కోలాచలం మల్లినాథసూరి సర్వజ్ఞ సింగభూపాలుని దర్శనార్థమై వెళ్ళెను. రాజుగారి కొలువు కూటమునకు (దర్బారు) వేషములేక వచ్చెనని కంచుకి లోనికి పోనీయలేదు. అప్పుడు మల్లినాథు డిట్లనెనట.

         "కిం దారుణా వంకరటింకరేణ
          కిం వాసనా చీకిరిబాకిరేణ
          సర్వజ్ఞ భూపాల విలోకనార్థం
          వైదుష్య మేకం విదుషాం సహాయ:"

ఆ మాటను అదే కోలాచల (కొలమచెలమ) వంశమువాడగు పెద్దిభట్టు అన్నాడని శృంగార శ్రీనాథములో వ్రాసినారు. గోలకొండ వ్యాపారులను నియోగిశాఖవారు గోలకొండ రాజ్యములో (తెలంగాణములో) ఏర్పడిరి. వారి వేషభాషలను గూర్చి శ్రీనాథు డిట్లనెను.

         "దస్త్రాలున్ మసిబుర్రలున్ కలములున్
          దార్కొన్న చింతంబళుల్
          పుస్తుల్ గారెడి దుస్తులున్ చెమట కం
          పుం గొట్టు నీర్కావులున్
          అస్తవ్యస్తపు కన్నడంబును భయం
          బై తోచు గడ్డంబులున్
          వస్తూ చూస్తిమి రోస్తిమిన్ పడమటన్
          వ్యాపారులన్ క్రూరులన్."

దస్త్రము అనునది ఫార్సీ దప్తర్ అనుపదము. నిన్న మొన్నటి వరకు తెలంగాణములో మూరెడు బొంగు లొట్టలో గలుగు దంటుకలాలు పెట్టి అ బొంగు మూతికి మూడు రంధ్రాలు వేసి దారాలుకట్టి వాటిని కొండ్లుకల ఇత్తడి మసిబుడ్డికి కట్టేవారు. మసిని ప్రతి గ్రామములో జనులే సిద్ధము చేసుకొంటూ వుండిరి. కలము అను పదము ఫార్సీ, ఖలం అనుదానినుండి వచ్చిన దనుకొందురు. కాని సంస్కృతములోనే కలమశబ్దము లేఖిన్యర్థములో వాడుతూ వుండిరి. తెలంగాణాలో గోలకొండ వ్యాపారులు కన్నడము మాట్లాడినవారు కారు. బళ్ళారి, రాయచూరు ప్రాంతాలలోనే కరణాలు కన్నడము మాట్లాడేవారు. వారిని గూర్చియే యీపద్యము చెప్పెనేమో! కాని భయంబై తోచు గడ్డాలు వారెందుకు పెంచిరి. అది తురకల పరిపాలన ప్రాబల్యముండు ప్రాంతాలలో అనుకరించిన వేషమో యేమో ?

"దిచ్చు" అనగా జూదరియని సూ. రా. నిఘంటువులో వ్రాసినారు. దిచ్చుల వేష మిట్లుండెను.

        సీ. చెంగావి వలిపెంబు చెలువుగా ధరియించి
           దళముగా మేన గంధంబు పూసి
           తిలకంబు కస్తూరి తీర్చి జాదుల కలి
           గొట్టుల పొడవుగా కొప్పు వెట్టి
           కందుదుప్పటి గప్పి యందియ డాకాల
           గీలించి పువ్వులకోల వట్టి
           నిద్దమౌ కుచ్చుల యుద్దాలు కిర్రని
           మ్రోయగా నుల్లాసమున జెలంగి
           నలుగు రేవురు సంగడీ లెలమితోడ
           పోకలాకులు నొడిలోన బోసికొనుచు
           జాణతనమున నట్టహాసములు వొలయ
           పెచ్చు రగుచు కొలువగా వచ్చె నొకడు,
           వచ్చి గుడిసొచ్చి యందరు
           దిచ్చులు తన తిండికొరకు తీపులు వెట్టన్
           మెచ్చుచు వేడుక యాటల
           నచ్చోటం బ్రొద్దుపుచ్చి యల్లిన మగిడెన్.[70]

గొల్లల లక్షణా లిట్లుండెను. "పీలపాగ, మొలలో పెట్టుకొన్న పిల్లనగ్రోలు, మూపున గొడ్డలి, ముసుగు వేసుకొన్న గొంగడి, చేత గుదియ, మెడలో గురిజపూసల పేరు, బొంగులకోల, కాసెదట్టి, బెబ్బులుల వాకట్టు బదనికలు, జింకకొమ్ము, జల్లి చిక్కము, కాపు కుక్కలు" ఇవి ఒక గొల్ల పరికరములు. (నవనాథ - పుట 27)

గొల్లలు గొర్ల మందలనేకాక ఆవులనుకూడ కాచెడివారు "తొలికోడి కూయగానే లేచి తన తోడిగొల్లలతో జేరి ఆవుల పేర్లు పెట్టి పిలిచి పాలు పిదికి నగరికి పంపి తర్వాత మేపుటకై పొలాలకు వాటిని తీసికొనిపోయి, దొంగల నుండి మెకములనుండి రక్షించి మాపటి వరకు మరల ఇల్లుచేరెడివారు. దూడ చచ్చిన ఆవులను సేపునట్లు చేయుట, కడుపులోపలనే దూడ చచ్చిన ఆవులకు మందులిచ్చుటయు వారెరిగియుండిరి. ఆవులకు వచ్చు రోగా లెట్టివనగా,

        "నరుదు కన్నును నీరు నాలిక చేర్లు
         గురుదెవులును గంటి కురును కట్టూర్పు
         కప్పనావురు గాలి గజ్జి పల్ తిక్క
         పుప్పి పంపర యూడు బొడ్డు బొల్గూత
         మొలవిడెసెల తెవులు ముకుబంతికవటు
         తలయేరు తొడకు వాతము కల్ల వాపు
         నలదొబ్బ దెవులును నాదిగా నెన్న
         గల పసరాల రోగములకు నెల్ల
         మందుల బెట్టరు, మంత్రింప తెవులు
         కందువుగని చూడగా నేర్తు నొప్ప."
                                    నవనాథ. పుటలు 29, 30

ఆ కాలములో పింజారులుండిరి. వారు ఇస్లాం మతములో అప్పటికి చేరియుండిరో లేదో! టిప్సూ సుల్తాను కాలములోనో ఔరంగజేబు కాలములోనో వారు బలవంతముగా మతము పుచ్చుకొన్నవారని కొందరందురు. వారు రెడ్డిరాజుల కాలములో మతము మార్చియుండరనుకొందును. కాని వారివృత్తి ఆనాటినుండి ఏకుటయే. దూదేకుట చేతనే వారికి దూదేకు వారనియు పేరువచ్చెను.

         "ఉర్వి మెరయించు కార్పాస పర్వతంబు
          చేరి మర్దించె నొక్క పింజారి తరుణి."

అని శ్రీనాథుడు వర్ణించెను. బొందిలీలు ఒక వీరభట కులముగా తెనుగుదేశములో అప్పటికే వచ్చి నిలిచిపోయిరి. బుందేల్ ఖండము (Bundel Khand) అను ఉత్తర హిందూస్థాన ప్రాంతమువారు సైన్యములో యుద్ధభటులుగా చేరి జీవించుటకై ఆంధ్ర కర్ణాట రాజుల సేనలో విరివిగా చేరిరి. వారి స్త్రీలలో జనానాపద్ధతి యుండెను. అందుచేత శ్రీనాథు డొక బొందిలీ మందయాన నిట్లు వర్ణించెను.

        "వన్నెలగాగరా, చెలగు వట్రువ కుచ్చికులందు పాదమల్
         పన్నపువారి భంగముల సంబున నీగెడు బాలకూర్మముల్
         గన్న తెరంగుదోప కరకంజములన్ ముసుకుం బిగించి ప్ర
         చ్చన్న ముఖాబ్జయై నడచె చంగున బొందిలిభామ గోయినన్.

గాగరాయన లంగా, బొందిలీలకు "జనానా" ఆనాడే అలవడియుండెను. ఆనాటి స్త్రీల వేషభూషణాలలో ఎక్కువ భేదము కానరాదు. ముక్కునత్తు, వడ్డాణము, దానికి గజ్జెలు గొలుసు లుండుట, అందెలు (నూపురములు) త్రిసరములు (మూడుదండలు), కంకణము, తాటంకములు (కమ్మలు), ముక్కర (ముత్యాలవి, రత్నాలు పొదిగించినవి), ఇవి సాధారణ భూషణములు.

         "వీసపు ముక్కునత్తు, నర వీసపు మంగళసూత్ర మమ్మినన్
          కాసునురాని కమ్మ లరకాసును కానివి పచ్చ పూసలున్
          మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా
          కాసలనాటివారి కనకాంగిని చూచితి నీళ్ళ రేవునన్."

         "ముక్కున హురుమంజి ముత్యాల ముంగర
          కమ్మవాతెరమీద గంతు లిడగ"

అను చాటువులు పెక్కు కలవు. స్త్రీలు కాటుక సర్వ సాధారణముగా పెట్టుకొనుచుండిరి. నేటికిని బిడ్డల మొదటిసారి భర్తలిండ్ల కంపితే వడి నింపినప్పుడు కాటుకడబ్బి యిత్తురు. "బంగారు (నెర) చీరలు", "కుసుమం బద్దిన చీరకొంగులు", "చందుర కావి రవికెలు", "యమునారైకలు" మున్నగునవి వారి వస్త్రములు, గాగరా (లంగా)లను బొందిలీలే కట్టిరి. వారు తెనుగువారు కారు.

బోగమువారు దాక్షారామములో, భీమవరములో, విశేషప్రసిద్ధితోనుండిరి. దాక్షారామములో పెదమున్నూరుగుంపు, చినమున్నూరుగుంపు అని బోగమువారి తెగలు రెండుండెను.

         "సురపతి.......భూతలమిచ్చె......
          ........దక్షవాటికావరునకు
          భీమనాథునకు వారవధూ త్రిదశద్వయంబుతో"[71]

జనుల యిండ్లనుగురించి ఆ కాలపు వాఙ్మయము కొంత తెలుపుతున్నది.

         "దోసెడుకొంపలో పనుల త్రొక్కిడి, దుమ్మును, దూడరేణమున్
          పాసిన వంటకంబు, పసి బాలుర శౌచము, విస్తరాకులున్,
          మాసిన గుడ్డలున్, తలకు మాసిన ముండలు, వంటకుండలున్,
          రాసెడు కట్టెలున్ దలపరాదు పురీహితు నింటికృత్యమున్"

ఇది పల్నాటిసీమలోని ముచ్చట. తూర్పుతీరపు జిల్లాలలో నిట్టిది లేకుండి యుండును. పురోహితుని యిల్లే యింత యింపుగా ఉంటే శూద్రుల యిండ్లింకెంత కంపుగా నుండెనో ఏమో ? పల్నాటిసీమలోను, దానికి సరిబోలు కర్నూలు, కడప, అనంతపురపు జిల్లాలలోను, రాయచూరు బళ్ళారివంటి కన్నడ జిల్లాలలోను, వాటి కంటిన బహుప్రదేశాలలోను నేటికిని ఒక దురాచార మున్నది. అదేమనగా, వ్యవసాయకులు పశువులను ఇండ్లలోనే కట్టివేయుదురు. మరియు దొంగలభయముచే ఇండ్లకు కిటికీలు పెట్టరు. ప్రాచీన మందును కిటికీలే రాజభవనాల కుండెనో యేమో, కాని జనుల యిండ్లకు "గవాక్షములు" అను మిద్దెలేని బొర్రలే గాలి వెలుతుర్ల కాధారమయినట్టివి.[72]

ఇండ్ల నమునాలుకూడా పెట్టె బిగించునట్లు ఒకే మోటు నమూనాపై కట్టుతూ వుండిరి. సంపన్నులు మాత్రము పశువులను వేరే యింటకట్టి తాముండు యిండ్ల లోపలిభాగములో చతుశ్శాలాభవంతిని కట్టుతూ వుండిరి. పడసాల (వరండా), మొగసాల (Entarance Hall) యింటిముందరుగులు, దొడ్డివాకిలి, పెరడు ఇవి సాధారణమయినవి. ఇండ్లకు కొన్ని వాస్తుశాస్త్రములు బయలుదేరెను. వాటి లెక్క ప్రకారము దూలము శూలలేకుండా వాకిండ్ల సంఖ్య బేసిగా ఉండకుండా, యెన్నెన్నో నిబంధనలుచేసిరి. సాదారణముగా వంటశాలను తూర్పుగానే పెట్టుతూ ఉండిరి. ఇండ్లు కట్టితే, అందలి స్తంభాలకు పెండ్లి చేసే బ్రాహ్మణుని పిలిచి స్వస్తిచెప్పించి పుణ్యాహవాచనము చేయించి శాంతికై బంధువులకు, బీదలకు, రుచ్యాన్నముల విందునిస్తూ వుండిరి. ఇండ్లకు పశుబలుల నిస్తూ వుండిరి. ఇండ్లలో నొక గదిలో చిల్లర వస్తువులుంచుటకు కట్టెపలకలలో నొక పెద్దాడ్డగూడు (అల్మారీ వంటిది) నిర్మిస్తూవుండిరి. దానిని అట్టుక (అట్టుగ, అట్టిక, అట్టువ) అనిరి.

         "పగలెల్లన్ వెలినిచ్చి రాతి రరుదౌ
          భంగిన్ స్వగేహంబు, ఆ
          ట్టుగమీదన్ వసియించి"[73]

అను నిదర్శనములు ప్రబంధాలలో చాల కలవు. బట్టలు ఆరవేయుటకు పొడవగు బొంగులను మిద్దెకు వ్రేలాడ గట్టెడివారు. వాటిని దండెలనిరి.

         "దండియపై నిడ్డ తపనీయమాలిక
          భుజము సోకిన దాని బుచ్చికొనుచు"[74]

అని యొక కవి వర్ణించెను. ఇచట మాలిక అన దండ. బంగారుదండను దండెమకొనకు తగిలించి యుండిరని అర్థము. వాస్తు శాస్త్రములలో సర్వతో భద్ర, స్వస్తిక, పుష్పకాది నామములు, గృహనిర్మాణ విభేదములను తెలుపునవై యుండెను. రాజులు తమ ప్రాసాదములకు, కొలువు కూటములకు శుభనామములిస్తూవుండిరి. శ్రీకృష్ణదేవరాయల సభా భవనము పేరు, "భువన విజయమై" యుండెను. వీరభద్రారెడ్డి సౌధంబు పేరు "త్రైలోక్య విజయము."

        "త్రైలోక్య విజయాభిదంబైన పౌధంబు
         చంద్రశాలా ప్రదేశంబు"[75]

అని శ్రీనాథుడు తెలిపియున్నాడు.

కాలమును గడియలతో లెక్కిస్తూ వుండిరి. పగలు 30, రాత్రి 30 ఘడియలుగా ఒకటినుండి 30 వరకు ఘడియలను రాజుల భవనాల మోసాలపై కొట్టుతూ వుండిరి. వాటిని విని జనులు కాలమును తెలుసుకొంటూ వుండిరి. వివాహాదులందు నగరాలలో దొరల నగళ్ళలోని గంటలను విని జనులు శుభకార్యాలు జరుపుకొనిరి. అవి లేని పల్లెలలో పురోహితులు "గడియకుడుక" లను (గిన్నెలను) నీటిపైనుంచి అవి నిండి మునుగుక్షణములో వివాహాది కార్యాలను జరుపు చుండిరి.

        "తదుత్సవానందరసనిమగ్నంబగు....శుభలగ్నోదయ సమయ
         సూచకం బగుచు జలంబులందు మునుగు తామ్ర ఘటికాపాత్ర
         నిరీక్షించి మంగళాశీర్వాద పురస్సరంబుగా సుముహూర్తంబ
         నుచు మౌహూర్తికుండు జయమంటపై నక్షతలు చల్లిన"

        "కంగున గంటపై కొడుపుగ్రక్కున వైచుడు తూర్యనాదముల్
         నింగియు దిక్తటంబులును నిండగ విప్రుల వేదనాద ము
         ప్పొంగి చెలంగుచుండె"[76]

        "గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో
         వ్రాల చుక్కలు దలబ్రాలు గాగ
         కెంపు హోమవహ్ని క్రియ నొప్పగా ద్విజ
         రాజు పెండ్లియాడె రాత్రి సతిని"[77]

అని పలువురు సమకాలికవులు విశదముగా వర్ణించి తెలిపినారు.

సహగమనము మధ్య వచ్చిన ఉత్తరహిందూస్థానాచారము. మహమ్మదీయుల అత్యాచారాలు ఏమూలనుండిన అచట యా యాచారానికి అతివ్యాప్తి కలిగెను. ముఖ్యముగా ఇది కాశ్మీర, రాజపుత్రస్థాన, పంజాబుదేశాలలో ప్రబలమయ్యెను. తర్వాత బెంగాలులో ప్రబల మయ్యెను. దక్షిణ దేశములో కాకతీయుల కాలములో, రెడ్డిరాజుల కాలములో ప్రారంభమై అరుదుగా నందందు జరుగుటకు మొదలయ్యెనని తలంతును. సింహాసనద్వాత్రింశికలో ఒకబంటు తనభార్యను రాజువద్ద రక్షణార్థముంచి యుద్ధాని కేగుదునని చెప్పి గాతిలో మాయమయ్యెను. వెంటనే పైనుండి వానిఅంగాంగములు భిన్నములై రాజుముందట పడెను. అప్పుడు వాని భార్యసహగమనము చేతుననియు సెల విమ్మనియు రాజును కోరెను. రాజు వలదని పలువిధముల వారించెను. ఆమె వినక ముష్కరించెను. తుదకు విధిలేక రాజు సెలవిచ్చెను, అని విపులముగా వర్ణించినారు. సహగమనమే సాధారణాచారమై యుండిన ధర్మమును పాలించు ప్రభువే వలదని వారింపబోవునా ? ఆ స్త్రీ సహగమనావసరమునుగూర్చి అంతపెద్దగా నుపన్యసించునా ? దాని ప్రచారమునకై పెంచిన వర్ణన యని తోచక మానదు. ఆమె యిట్లనెను.

         "అకులపాటుతోడ అశు
          భాకృతియై యొకవేళనైన, పో
          కాకును లేక, సొమ్ములకు
          నర్రులు సాపక, పేరటంబులన్
          పోక తొరంగి, పూతలును
          పువ్వులు దూరముగాగ ముండయై
          యేకడ జేరినన్ విధవ
          కెగ్గులె కాక తరింపవచ్చునే ?
          చచ్చియు చావక తనలో
          వెచ్చుచు నియమముల నింక విధవాత్వమునన్
          నిచ్చట మాడుటకంటెను
          చిచ్చురుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్."[78]

నతియను ఘోరాచారము తెనుగు గడ్డపై పాదుకొన్నది కాదనియే తలంతును. పై పద్యములో విధవకుండు కష్టాలు చాలా చక్కగా కవి తెలిపినాడు. అందు "పేరటాలు" అనగా సహగమనము చేసిన 'సతి' కి అర్థమని శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు తమ రెడ్డి రాజుల చరిత్రలో వ్రాసినారు. పేరటాలు అన ముత్తైదువయే. ముత్తైదువయే సతియగుట చేత దూరాన్వయముగా ఆట్లు చెప్పినారేమో కాని పై పద్యములో "పేరటంబులను పోక తొరంగి" అనుటలో వితంతువును శుభకార్యాలలో పేరంటము పిలువరనియు, సహగమనము చేయువారు అరుదై వైధవ్య బహువిధవ్యధలకు గురియైన వితంతువులే బహుళమై యుండిరనియు స్పష్టమవుతున్నది. అధునాతన సనాతన వాఙ్మయమందును ఆచారమందును పేరంటముగా పిలువబడిన ముత్తైదువకే పేరటాలు అను నిదర్శనాలే కానవస్తున్నవి. "రెండవ దేవరాయలకు 12000 భార్యలుండి రనియు అతడు చచ్చిన అందు 3000 మంది భార్యలైనను సహగమనము చేయవలసి యుండు ననియు నికోలా కౌంటు అను యూరోపు యాత్రీకుడు వ్రాసెను. ఆతడింకను ఇట్లు వ్రాసెను. "సతి లేక సహమరణము ఈ విజయనగర సామ్రాజ్యములో వ్యాపించినది. సతిని భర్త చితిపై కాల్తురు. కొందరు భర్త శవముతోపాటు భార్యను సజీవముగా పూడ్చివేయుదురు." సహగమనము విరివిగా లేకుండెననియు, కొన్ని పెద్ద కులాలలో అది వ్యాప్తికి ప్రారంభమయి యుండెననియు, తలంపవచ్చును.

మద్యములు అనేక విధములైన ప్రజలు సిద్ధము చేసుకొనుచుండిరి. గౌడీ, పైష్టీ మాధ్వీ మొదలైనవి ప్రాచీనులు వర్ణించినారు. అవికాక మరికొన్ని విధములైనవి రెడ్డిరాజుల కాలమందుండెను.

"ఒక్కెడం గొందరు సుందరులు పానగోష్ఠికిం గడంగి, కాదంబంబును, మాధవంబును, ఐక్షవంబును, క్షీరంబు, అసవంబు, వార్షంబు, రతిఫలంబు లనపాక భేదంబుల మూలస్కంధ కుసుమ ఫలసంభవంబుల బహువిధంబుల మధురంబులైన మధువిశేషంబులెల్లం బరిమళ ద్రవ్యమిళితంబుగా గూర్చి పాత్రంబుల నించిరి."[79]

పై మద్యభేదములో మాధవము యన ఇప్పసారాయి, ఐక్షవ మన చెఱకు (బెల్లము) రసముతో చేసినగౌడీరసము, ఆసవముయన సాధారణముగా వైద్యులు చేయు మద్యద్రవ్యము, కాదంబము, క్షీరము, వార్షము, రతిఫల మన నేమియో తెలియదు. నిఘంటువులందును ఈ పదాలు లేవు. ఈమద్యములను చెట్ల వేర్లతో కాని, పువ్వులతో కాని, ఫలములతో కాని చేస్తూ వుండిరని కవియే తెలిపినాడు. మద్యములలోని కొన్నింటిని ప్రౌడకమల్లన ఇట్లు తెలిపెను.

       శార్కరంబు, సూనజము, గుగ్లుసుమఘృతజంబు, నారికేళజంబు, మాద్వి
       కంబు, ఫలమయంబు, గౌడ తాళమయంబు, నాదిగా తనర్చు నాపవములు.
                                              (రుక్మాంగద. 3 - 227)

అల్లరి పాడియావులు పాలియ్యక పొడిచి తన్నిన వాటికి తలకోలకట్టి అనగా త్రాడుతో కొమ్ములకు బిగించి, దానినొకకోలను కట్టి, దానితోవడద్రిప్పి పట్టి పాలు పితికెడువారు.[80]

జనులలో పరుసవేదిపై - లోహాల నన్నింటిని బంగారు చేయురహస్య రసాయన క్రియపై - విశ్వాసము మెండుగా నుండెను. భోజుడు సర్పటి యను సిద్ధుని మోసగించి ధూమవేధి యను స్పర్శవేది క్రియను నేర్చుకొనెనని భోజరాజీయములో అనంతామాత్యుడు వర్ణించినాడు. ఒక కోమటిని మోసగించి వేమారెడ్డి ఆ విద్యను నేర్చి కొండవీటి రాజ్యమును స్థాపించెనను కథలను అనేక విధములుగా జనులు చెప్పుకొనిరి. అదెంత సత్యమున్నదో చెప్పజాలము. ప్రోలయవేమునికి పరుసవేదీయో, తత్సమాన నిధియో యేదో దొరికినట్లే నమ్మవలెను. ప్రోలయవేముని మంచాళ్ళ శాసనములో (శా. శ. 1262 = క్రీ.శ. 1340లో) ఇట్లు వ్రాసిరి.

       "యదృచ్చయా స్వర్ణకర ప్రసిద్ధిం
        లబ్ద్వాన్నమాంబా పతి రాబభూవ"[81]

ఈ స్వర్ణకర ప్రసిద్ధి యెట్టిదో తెలుపలేదు. కొండవీటి దండకవిలెలోను దీన్నిగురించిన ఒక కథకూడ వ్రాసినారు.

హిందువులలో క్రీస్తు శకాదినుండియో లేక బౌద్దశకాది నుండియో స్పర్శవేదిని కనిపెట్టుటకై పాదరసముతో కొన్ని ఓషధుల రసము, పసరుచేర్చి అందు ఇనుము, రాగి వంటి లోహాలు వేసి పుటాలు పెట్టి కరగించి వెండి, బంగారు చేతుటకై చాలాపరిశోధనలు చేసిరి. సిద్ధనాగార్జునుడు వెండి, బంగారు చేయుట

(ఆలరి మొదవులకును తలకోల యిడక చేరి పిదుకుకొన తరమగునే) కనిపెట్టెనో లేదో కాని తన కాలమందు ప్రపంచ మందంతటను రసాయనశాస్త్రవేత్త లందగ్రగణ్యుడని పేరు పొందెను. చీనాలో అతడు మహామహిమోపేతుడని ప్రశస్తి నిండుకొనిపోయెను. క్రీ.శ. 1400 ప్రాంతములోని రసవాద విద్యను గౌరన యొకచో నిట్లు వర్ణించెను.

      "ప్రచుర హేమక్రియా పారీణులయిన వారల నెందు నెవ్వారిగాన నేను
       బరగు రసగ్రంధ పటలంబులందు దాతువాదము మీద తహ తహ పుట్టి
       చేతి విత్తము మున్ను చెనటియైపోయె మంత్రవాదులకును మందుమాకులకు
       యంత్రవాదులకు సహాయకారులకు పలుతెరంగుల వెచ్చవడి యౌషధముల
       కలిపి రసంబుల కల్వంబులందు కసబిసగా నూరి కదడుగా బోసి
       వెల పుటంబుల వెట్టి విసవిసనూద పెట పెట మని పడి పెటల పెల్లెగసి
       మటుమాయమై పోవ మది తలపోసి యలసి ఈశ్వర బీజ మది కట్టువడనె
       యిల రసవాదంబు లేల సిద్ధించ,"

వాదభ్రష్టో వైద్యశ్రేష్ఠ:, రసవాదులమూలాన వైద్యశాస్త్రమైనా ఇంతో అంతో లాభం పొందినది.

జనులలో అనేక విశ్వాసాలుండెను. పిల్లలు లేనివారు ఎన్నెన్నో పాట్లుపడిరి. బాలచంద్రుని తల్లి పిల్లలు పడినపాట్లను చాలా విరివిగా పల్నాటి వీరచరిత్రములో వర్ణించిరి. అదే విధముగా ఇతర స్త్రీలు పలుపాట్లు పడుతూ వుండిరి. ఒక స్త్రీ సంతానార్థమై పడిన పాట్లివి:-

      సీ. భక్తితో మాతృ కాభవనంబులకు నేగు, కావించు నతిథిసత్కారములను,
         వాయసంబులకు నిర్వర్తించు దధిబలి, కొలుచు జ్యేష్ఠాదేవి నలఘు మహిమ
         చదివించుకొను పుణ్యసంహితావ్రాతంబు, మూలికామాణిక్యములుధరించు
         తన్వంగి గంధాక్షతలు చిరంటుల కిడు, విప్రశ్నికల గారవించు దరచు,
         కుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు బాలురకుతియ్యపండులు పంచియుచ్చు
         చెలులు తానునువ్రతములు సలుపుచుండుతామరసనేత్రపుత్రసంతానకాంక్ష.[82]

స్త్రీలు గర్బవతు లైనప్పుడు:

      "మూడునెలల ముద్దవెట్టిరి యలరు కుడుము లైదు నెలల బెట్టి
       రేడునెలల మొక్కి రెర్రపోలమ్మకు సతికి చూలువెళ్ళ జరుపుకొనుచు,
      "ఇంతిమది దలకుచు నెడమప్రక్క నిదిగొ మెదలెననుచు జెప్ప సుదతులంత
       చంటి జిగురుగోర సంధించి చిరజీవి యైన సుతుడుపుట్టె ననగ పొంగు"

కుమారుడు పుట్టినప్పుడు:

      "నిసువుబొడ్డుమీద పసిడిటంకం బిడి యొయ్య నాభినాళ ముత్తరించి
       ముత్తియముల జేటముంచి యందిడు కనుదమ్ములందు సమ్మదము నిగుడ."
      "కలి దోచి నూనె వ్రే లిడి తలపుర్రియయందు నేతి తైలంబును, జొ
       త్తిలరించి మెత్తగా బొదు గలరించి కుమారునునిచి రా దాదు లటన్.

      "క్రమమున దాదు లక్కడను ముప్పటిలిన జలకంబుదేర్చి యాచెలువసుతుని
       కొనరగ కాటుకయును చుక్క బొట్టును పాటించి యా గడపకు వెలుపట
       పొదికిళ్ళ తవుడు నిప్పులు ప్రత్తిగింజలు నిడి యడ్డముగ చిట్టు పడిసివైచి
       వేపరెమ్మలు నీళ్ళపెసలలోపల నించి కాపులు పురిటింట గట్టిచేసి
       వాయనముల కెల్ల వనితల రప్పించి వారుదెచ్చినయవి వరుసనంది
       పచ్చకప్పురంపు బలుకులు వెట్టి విడియము లిచ్చి రింపు నయముగలుగ."[83]

పెండ్లి సమయములో జరిపెడి యాచారములు శ్రీనాథుడు యిట్లువర్ణించెను.

      "వేడ్క నృత్యంబు లాడిరి వీధులందు పాడి రెత్తిలి పిక కుహూ పంచమమున
       పంజళంబున ధవళ ప్రబంధ గీతకమల నవ్వేళ కర్ణాట కమలముఖులు."

ఈ పద్యములో ఎత్తిలి అన గట్టిగా అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. ఎత్తిలి అనునది ఒక విధమగు దేశీగాన మని తోస్తున్నది పంజళము అనగా పాంచాలీ గీతికా విశేషము. ధవళము అనగా పెండ్లిండ్లలో పాడు పాటలు ధవళాలకు సువ్వాలకు అప్పకవి కూడా లక్షణాలు వ్రాసినాడు. నేటికిని కొన్ని యిండ్లలో ధవళాలు పాడుతారు. ఇంకా ఏమి చేసిరనగా:

      "పూజకుండలు నిల్పె పువ్వుబోడి యొకర్తు శుభ వితర్దిక చతుష్కోణములను
       జాజాల పాలెల సర్వౌషధులు నించి ప్రోక్షించె నొక్క పద్మాక్షి జలము
       కాంత యొక్కతె సన్నెకలు పొత్తరంబునుదోరించె వటశాఖతోడ గూడ
       పీఠికంబులు పెట్టి బింబోష్ఠి యొక్కతె మడుగు పుట్టము కప్పెవడుగుమునగ"
       .... ..... ..... ...... ..... ..... .....
      "తగవు లిచ్చిరి పుట్టింట తల్లిప్రజలు వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు
       కట్నమిచ్చె నృపాలుండు కన్నుదనియ పరమహీపాలు లిచ్చిరి పావడములు"[84]

       పురిటి సమయముళొ చేయు నుపచారములను శ్రీనాథుడిట్లు వర్ణించెను.

      "తలయంపి ధవళ నిద్రాకుంభ మిడువారు రక్షాభసిత రేఖ వ్రాయువారు
       గౌర నర్షపరాజి కలయ జల్లెడివారు బలివిధానంబుల బరగువారు
       లవణంబు నింబవల్లవము ద్రిప్పెడు వారు ప్రేము మంచంబుతో పెనుచువారు
       గవల ధూపంబు సంఘటియించువారును మంచిమి ట్టెడద యోజించువారు
       కదసి దీవించువారును గండతైల మందుకొనువారు గాయంబు లందువారు
       పాడువారును పరిహాస మాడువారునైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున"

     "కర్పూర సమ్మిశ్ర గంధసారంబున చరచె చప్పట భిత్తి చామ యొకతె
      వెల్లకిలబెట్టె మత్పలగంధి యొక్కర్తు గర్బ గృహోపకంఠభూమి
      జ్యేష్ఠాధిదేవత సేవించె నొకయింతి పసుపు పుట్టము గట్టి భక్తిగరిమ
      పటముపై లిఖియించె పాటలాధరి యోర్తు క్రొత్తలత్తుక శశాంకుని ఖరాంశు
      జరఠ మేషంబు కంఠదేశమున జుట్టె పుష్ప డుండుభముల నొక్క పువ్వుబోడి
      ఆంబుజానన యొకతె నెయ్యభిఘరించె భుజగ నిర్మోకమొకతె నిప్పులగమర్చె"[85]

సింహాసనద్వాత్రింశతిలోని యాచారాలు తెలంగాణమువై యుండును. ఇందలివి కృష్ణా గోదావరీ మండలాలవై యుండును.

జనులు తమ బిడ్డలకు భర్తలయిండ్లకు పోయిన తరువాత ఆవులను అరణమిస్తూ వుండిరి.[86] పూడ్చిపెట్టిన ధనమును (బంగారు, వెండి నాణెములు) భూమినుండి త్రవ్వి తీసుకొనుటకు ముందు దాని నావరించి భూతములు (ధనపిశాచాలు) ఉండుననియు, వాటి శాంతికై బలి నీయవలెననియు జనులు నమ్మిరి. అది నేటికిని కలదు.

      గీ. ........ఎట్టివారి సొమ్మో యిది పెద్ద కాలమయ్యె పృథివి నణగి
         దీని వెడలదివియ బూనిన యప్పుడు భూతతృప్తి వలయు భూతలేంద్రా

      క. అనవుడు విభుడది చేయుద మని గొరియల చెరువు వెట్టియనువగు భో
         జనముల నసురులు సురలును దనియంగా భూతతృప్తి తగ నొనరించెన్"[87]

ఇది భూస్థాపితమగు విక్రమార్కుని సింహాసనమును తీయుటకై భోజుడిచ్చిన బలి (చెరువు=బలి)

ఆకాలపు దనికులు సుఖభోజనము చేస్తూవుండిరి. అందులో జన ప్రియత్వము బ్రాహ్మణులలో నెక్కువగా నుండెను. రెడ్లు శైవులై యున్నందున వారు మాంసాహారులు కారేమో ? నేటికిని శైవులగు రెడ్లు మాంసము తినరు. సాధారణముగా నెరవాటి కాపులు, నానుగొండ కాపులు అను రెడ్డి శాఖవారు మాంసము తినని శైవులు. మరియు మోటాటిరెడ్లలోను కొందరు శైవులై మాంసభక్షులు కానివారై యున్నారు. వైష్ణవ మత మవలంబించిన రెడ్లు మాంసభక్షులయిరి. వైష్ణవాచార్యు లిది నిషేధించినట్లు కానరాదు. ఆముక్తమాల్యదలో రెడ్లభుక్తి విధానమును తెలుసుకొను ఆధారములు కలవు. కవుల వర్ణనలు, విశేషముగా బ్రాహ్మణుల భోజనముగానే కానవస్తున్నది. కొండవీటి రాజ్యమంత్రియగు లింగనమంత్రి పంక్తిలో శ్రీనాథుడు పలుమారు కంఠదఘ్నముగా, తుష్ఠిపూర్తిగా భుజించి ఆమంత్రి అన్నదాతృత్వమును (బ్రాహ్మణుల మేరకు) యిట్లు వర్ణించి ఋణవిముక్తుడయ్యెను.

     సీ. ఖండశర్కరజున్నుకండ చక్కెరలు-దోసెలు, వడల్, సేవెపాసెములతోడ
        కమ్మగా కాచిన కరియాల నేతితో, కమనీయ పంచభక్ష్యములతోడ,
        సంబారములతోడి శాకపాకముతోడ పక్వమైన పెసరపప్పుతోడ,
        తేనియధారతో, పానకంబులతోడ, శిఖర షాడబ రసశ్రేణితోడ,

        అచ్చలవణాదికములతోడ అమృతఖండ
        పాండురంభైన దధితోడ, బ్రాహ్మణులకు
        భోజనము పెట్టు ద్వాదశీ పుణ్యవేళ
        లింగమంత్రి నవీనరుక్మాంగదుండు.[88]

(శిఖరషాడబరసము=పండుదానిమ్మ తియ్యనిరసము) ద్విజాతివర్గము వారు ఏకాదశీవ్రతనిష్ఠు లన్నమాట. తన్మాహాత్మ్య ప్రతిపాదితమగు రుక్మాంగద కథ అప్పటికే ప్రచార మందియుండెను.

ఇంకా యెట్టి రుచిర పదార్థముల నారగించి రనగా:-

       "ద్రాక్షాపానక ఖండశర్కరలతో, రంభాఫల శ్రేణితో,
        గోక్షీరంబులతోడ, మండెగలతో, క్రొన్నేతితో, పప్పుతో,
        నక్షయ్యంబగు నేరుబ్రాల కలమాహారంబు నిశ్శంకతన్
        కుక్షుల్ నిండగ నారగించితిమి యక్షుద్రక్షుధా శాంతికిన్[89]

అంతేకాదు. భక్ష్యభోజ్య చోప్య లేహ్య పానీయముల వైవిద్యములను కాశీఖండమం దిట్లు వర్ణించినారు.

"కనక రంభాపలాశ పాత్రంబులయందు విచిత్రంబుగాగల వంటకంబులు, అపూసంబులు, లడ్డువంబులు, ఇడ్డెనలు, కుడుములు, అప్పడంబులు, ఇప్పట్లు, గొల్లెడలు, జిల్లేడుకాయలు, దోసియలు, సేవియులు, అంగరపోలియలు, సారసత్తులు, బొంతర కుడుములు, చక్కిలంబులు, మడుగుబూవులు, మోరుండలు, పుండ్రేక్షుఖండములు, పిండ ఖర్జూర ద్రాక్షా నారికేళ కదళీ పనస జంబూ చూత లికుచ దాడిమీ కపిత్థ కర్కాంధూ ఫలంబులు, గసహసలు, పెసరుం బులుగములు చెఱకు గుడములు, అరిసెలు, బిసకిపలయముల వరుగులు, చిరుగడములు, బడిదెములు బులుపలు, బులివదకలు, పప్పురొట్ట్యలు, చాపట్లు, పాయసంబులు, కర్కరీ కారవేల్ల కూశ్మాండ నిష్పావపటోలికా కోశాలాబూ సిగ్రూ దుంబర వార్తాక బింబికా కరవింద శలాటువులును, కందయుం బొందయు, చారులు, దియ్యగూరలు, పచ్చడులు, బజ్జులు, గిజ్జణులు, వడియంబులు, కడీ యంబులు, గాయంబులు, గంధతోయంబులు, ఉండ్రాలు నానుబాలురును, అనుములు, మినుములు, బుడుకులు, నడుకులు, నిలిమిడియును, చలిమిడియును, ద్రబ్బెడయు, వడయును, నుక్కెరలు, చక్కెరలు, నేతులు, దోనెతొలలు, బిట్టును, గట్టును, దాలతిన్మునంబులను, దోపలు, పూపలు, మోదకంబులును, గుడోదకంబులు ........... వడ్డించిరి.[90]

ఈ భోజ్యపదార్థములలో సగము అర్థము కానివిగా ఉన్నవి. ఇందుకొన్ని వంటలు నేడు పలు పలు ప్రాంతలలో లేవనవచ్చును. ఇవి ఆకాలమందలి ప్రజా జీవిత విశేషములందు ముఖ్యమైనవి. సూక్ష్మముగా తరచి పరిశోధించు కొలది ఇంకనూ పెక్కు విశేషములు తెలియ రాగలవు.

వినోదములు

అటలు పాటలు మున్నగు వినోదములు కాకతీయుల కాలము లోనివే యీకాలమందును కానవస్తున్నవి. అవికాక మరికొన్ని యాకాలములోనివిగా తెలియ వస్తున్నవి.

రాజకుటుంబపు రాచవారు పలువురు దుర్మార్గులై ప్రజల బాధించుట సర్వసాధారణము. ఆ కాలమందును నిట్టివారు కొందరుండి యుందురు. వారిని దృష్టిలో నుంచుకొని మంచన యిట్లు వ్రాసెను.

      సీ. ఎలుక వేటల పేర నేగి పట్టణములో ప్రజల యిండులు కూలద్రవ్య బంపు
         చెలగి డేగలకును తొండల నేయబోయి ద్రాక్షామంటపంబులు గాసి సేయు
         కోడిపోరుల పేర వాడల దిరుగుచు పొడగన్న కడపల బొలియవైచు
         వేటకుక్కల దెచ్చి విడిచి మందులలోని మేకల కుసికొల్పి మెచ్చియార్చు"[91]

జనులాడు జూదములు బహు విధములుగా నుండెను.

      క. సరిలేని యంజి సొగటా లరుదగు జూదంబు నెత్త మచ్చనగండ్లున్
         దిరమగు నోమనగుంటలు సరసతమెయి నాడుచున్న సతులం గనియెన్.[92]

ఈ యాటలు ఆడువా రెక్కువగా ఆడుచుండిరి. అంజి యను నాటయెట్టిదో శబ్దరత్నాకరకారునికే తెలియదు. సొగటాలు అనునది పాచికల ఆట, దానికి పగడసాల, పగడసారె ఆట యనియు అన్నారు పలువురు కవు లీయాటను ప్రబంధాలలో వర్ణించినారు. ధనికులైనవా రీయాట పలకల సిద్దము చేయించి యుంచుకొనెడివారు. అచ్చనగండ్లు యిప్పటికినీ బాలికలు, యువతులు ఆడుచుందురు. దానికి అచ్చనగాయలు అనియు పేరుకలదు. క్రచ్చకాయలతోకాని, చిన్నవి గుండ్రని గులకరాలతో కాని ఆడుదురు. ఓమనగుంటలు ఒక కట్టె దిమ్మలో 14 గుంతలు చెక్కించి వాటిలో చింత బిచ్చలు పోసి యాడు ఆటకు పేరు.

యువకు లాడుకొన్న యాట లెట్టివనగా, కందురకేళి - ఇది చెండుఆట.

బహుశా బట్టలతో గట్టిగా గోళాకారముగా చేసి దానిపైన గట్టి లావుదారముల జాలె నల్లుచుండిరేమో, అట్టివి 50 ఏండ్ల క్రిందట యుండెను.

పిల్లదీవాటలు:- ఇది "విమల చంద్రోదయారంభ వేళలందు" ఆడుచుండిన యాటయని శ్రీనాథుడు వర్ణించెను. ఇదెట్టి యాటయో తెలియదు. "బాలక్రీడా విశేషము" అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. నాలుగైదునూర్ల యేండ్ల క్రిందటి చాలా యాటలు మనకు తెలియకపోవుట విచారకరము.

భాండిక జనుల పరిహాసములు:- "ఒక కొంత ప్రొద్దు భాండికజనంబు లొనర్చు పరిహాస గోష్ఠికి పల్లవించు" అన్నారు. కాని భాండికశబ్దము శబ్దరత్నాకరములో లేదు. సంస్కృత బృహన్నిఘంటువగు శబ్ద కల్పద్రుమమందును ఈపదములేదు కాని "భండ:=అశ్లీలభాషీ" అని కలదు. తత్సంబంధి భాండికుడు అని వ్యాకరించుకొనిన నీసందర్భమునకు సరిపోవును. బూతులతో హాస్య ముత్పత్తిచేయు 'వికటకవి' వంటివాడని యర్థము కలుగును.

బిందుమతీవిద్య:- ఇది గారడి (ఇంద్రజాలం) విద్య. శబ్దరత్నాకరములో ఈ శబ్దమే లేదు. సంస్కృత నిఘంటువగు శబ్దకల్పద్రుమ మందును ఈ పదము లేదు. బిందుమతి యనునది "విప్రవినోద" అను ఇంద్రజాల విద్యవంటిది. విప్రవినోదమను విద్యను ఒక విదమగు బ్రాహ్మణ జాతి వారే, వారును తెనుగు దేశమందే, ఒక గారడి విద్యగా ప్రదర్శించెడి వారు.

ప్రహేళిక:- దీనికి పర్యాయపదము ప్రవల్హికా అనియు, దాని కర్థము 'గూడముగా నుంచబడిన యర్థముల కావ్యవిశేషము' అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. ఇది స్పష్టముగా అర్థముకాని రీతి తెలిపినారు. తెనుగులో తట్టు - తట్ట వేయుట అనుట యిదియే. 'కొందురు, తిందురు', 'ముందర పెట్టుకొని యేడ్తురు' అంటే యేమి ? అనగా ఉల్లిగడ్డ అని చెప్పుట తట్టు అని యందురు. తిరుమలేశ పద్యాలు ప్రహేళికలే. తిరుమలేశు డెవ్వడో యెవ్వరును అతనిని స్మరింపరు.

శబ్దకల్ప దుమములో ఇట్లు వ్రాసినారు:- ప్రహేలికా=ప్రహిలతి అభిప్రాయం సూచయతీతి కూటార్థభాషితాకథా॥

దీనికుదాహరణములు 'తిరుమలేశ పద్యాలు'. అవి తెనుగులో ప్రసిద్ధమైనవి.[93]

వేట, రాజులలోనే విశేషముగానుండినట్లు కవులు వర్ణించినారు. వేటలలో పక్షివేటకు విశిష్టతకలదు. సంపన్నులు డేగలతో పక్షులవేటాడుచుండిరి. ఆ డేగలు "కౌజు కక్కెరలను" మున్నగు పక్షులను చంపుచుండెను.

     సీ. కేరిజంబుల గోరి కేరుట దీరించి పూరేండ్ల బుడకల బూడ్దెకలిపి
        పాలగుమ్మల నేలపాలుగా నొనరించి వెలిచెల మెలకువ వెలితిచేసి
        బెగ్గురు కదుపుల బెగ్గిల మ్రగ్గించి కొంగల పొగరెల్ల ద్రుంగద్రొక్కి
        కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర పిండు గుండియలెల్ల బెండుపరచి
        కారుకోళ్ళ నెండ గారించి గొరువంక బింక మింక వాని పొంక మణచి
        చెమరు బోతుగముల జమరి కౌజుల జించి సాళువంబు జయపాలు జేరె.[94]

ఈ పద్యములో పాలగుమ్మలు (పాలపిట్టలు), వెలిచెలు, బెగ్గురు (సారసము) కొంగలు, కొక్కెర, కారుకోళ్ళు, గొరవంక, కౌజు (కముజు) అనుపిట్టల పేర్లు పల్లెజనులు (పట్టణవాసులు కారు) ఎరుగుదురు కాని, తక్కిన పక్షుల పేర్లు పల్లెజనులుగూడా ఎరుగరు. కేరిజము అను పదము శబ్దరత్నాకరకారుడు కేరజము అని వ్రాసి 'ఒకానొక పక్షి' అని దానికర్థము వ్రాసినాడు. పూరేడు అన పక్షి విశేషము అనియు తెలిపెను. కొక్కెరఅనగా కొంగయేగాని, కొంగలనుకూడ కవి వర్ణించినందున అందలి భేదములని యెరుగవలెను. కక్కెర అన పక్షి విశేషము అనియే నిఘంటువులో తెలిపినారు. కారుకోడి అన అడవికోడి. గొరవంకలను తెనుగులో బట్టిడిగాడు అనియు, సంస్కృతములో శారిక అనియు నందురు. చెమరబోతు అను దాని కర్థము శ.ర. నిఘంటువులో లేదు కాని చెమరు అనుదానికి చెమరుకాకి యని వ్రాసినారు. ఈపక్షి నీలము వన్నె కలదై కాకికన్న చిన్నదై, తోకపొడవుగా కలదై, ద్వనికూడా కాకితో భిన్నించినదై పెద్దరాళ్ళను గోడలు కట్టువారు మలిచినప్పుడగు కంగ్, కంగ్ అను ధ్వనినిబోలి కూయునదై యుండెను. కౌజు పిట్టలను కొందరు సాకి పంజరాలలో పెట్టి పొలాలకు తీసుకొనిపోయి ఉరులొడ్డి యుంతురు. వాటి ధ్వనికి సజాతీయములగు కౌజుపిట్టలు కలహించుటకై వచ్చి ఉరులలో చిక్కి దొరకిపోవును. స్వజాతితో కలహించు పిట్టలలో కోళ్ళు, కౌజులు, పికిలి పిట్టలు (బుల్ బుల్) ముఖ్యమైనట్టివి.

మన భాషలో పక్షి చరిత్రలు లేనేలేవు. సంస్కృతమందును శ్యేనశాస్త్ర మొకటి కలదు. అదున్నదని యెరిగిన సంస్కృత పండితులే యరుదు. నిఘంటువులలో ఆయా పక్షుల చిత్రములను ముద్రించి వానిజీవిత విశిష్టతలను కొద్దిగా తెలుపవలెను. కాని పక్షి విశేషము, జంతు విశేషము, క్రీడా విశేషము, అని వ్రాసివేస్తే ఏమిలాభం ? ఇంగ్లీషులో ఈనాడు కాదు 150 ఏండ్లక్రిందట, ఇంకేమైనా అంటే అంతకు పూర్వమే, పక్షులను గురించిన గ్రంథములు ఒకటి రెండు కాదు, నూర్లకొలదిగా సచిత్రముగా, సమగ్రముగా వ్రాసి ముద్రించిరి. మన దేశములో ఒక్కరయినా పక్షి జీవితములను గమనించినారా ? ఒక్కానువాద గ్రంథమైనను (పక్షులనుగూర్చి పిల్లల వాచకాలుతప్ప) ముద్రించిరా ? అందుచేత ప్రాచీన కవు లిట్టి పద్యాలను వ్రాస్తే వాటి కర్థమువ్రాయు నిఘంటుకారులు పక్షి విశేషమని తప్పించుకొనిపోవుటయు, మన కర్థము కాకపోవుటయు సంభవిస్తున్నది.

ఇతర ప్రబంధాలలో నాచన సోముని మొదలుకొని పలువురు కవులు వేటను వర్ణిస్తూ వచ్చినారు కాని పక్షుల వేటలను వర్ణించిన కవు లరుదు. అందు చేత పైన నుదహరించిన పద్యము విలువకలదే ! "బురుక పిట్ట యింతగానిలేదు" అని యీ కవియే (సిం.ద్వా. భా. 2 పు 20) వర్ణించెను. భటులను-సిపాయీలను-ఆకాలములో జట్టీలంటూ ఉండిరి. తర్వాతి కాలములో ఇంగ్లీషు ఫ్రెంచివారు ప్రవేశపెట్టిన మిలిటరీ యూనిఫారంవలె పూర్వము యుద్ధభటులకు వేషాలు సరిగాలేకుండెను. కాని వారికిని కొంత ప్రత్యేక వేషమందుండెను. తలకు చుంగుల రుమాలయు, ముందు చుంగులు వెనుక బిగించిన ధోవతి లేక చల్లాడము (చల్లడము, చిల్లడము) అను 'నిక్కర్‌' వంటి మోకాళ్ళపై లాగును, నడుములో రంగుకాసె దట్టీయు (పట్టి), ఆదట్టీలో కత్తులు కఠారులును, చిన్నవి, చిక్కని అంగీయు, వీపున డాలును, ఇవి సాధారణముగా వారి వేషాలు.

"జెట్టి అలంకరించుకొనేవరకు కోటలోగుండు (శత్రువుల ఫిరంగిగుండు) పడె" అని మన తెనుగుసామెతకూడా, యుద్ధవేళలందు జెట్టీలు యుద్ధావసరాలం కరణములను గావించుకొంటూ వుండిరని తెలియవస్తున్నది ఈ జెట్టీలను 'రాచలెంకలు', 'బంటువారు' అంటూ వుండిరి. 'బంటువానికిం గటారి చేత నున్నంజాలదె'[95] యనుటచే బంటులకు కటారి ముఖ్యాయుద మని తెలియవచ్చును.

('కరకంచు వలిపెంబు గట్టిగా గాసించి' అను పద్యములో బంటుల వేషము ఇదే ప్రకరణములో తెలిపినాను.)

ఒకనా డొకచోట వసంతోత్సవమ లు చేసుకొనుచుండ ఒక రాచలెంక గుంపునుండి వెడలివస్తూ 'తన మీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచుండ, నెదురైన ఏకాంగ వీరుడను లెంక దురభిమానంబున గనలి,

       "ఎరా ! ముందరగానక నేరమిపై దెచ్చుకొనుచు, నీ మీసలు, నా
        చేరువ వడిపెట్టెద విది యోరీ ! యేకాంగవీరు డుంట యెరుగవే?"

అనగానే అవతలి లెంకకునూ అభిమానము నిండుకొనెను. ఉభయులు ద్వంద్వయుద్ధానికి సన్నద్ధులైరి. మధ్యవర్తులు, తుదకు రాజునూ ఎంత చెప్పినను వినలేదు. కడపట, రాజసమక్షములో ప్రజలందరు చూస్తూవుండగా వారికి కత్తితో ద్వంద్వయుద్ధము చేయుట కనుజ్ఞ యయ్యెను. అ యుద్ధములో ఓడిపోవు లక్షణాలను నిరూపిస్తూ ఒక లెంక కొన్నినిబంధనలు (షర్తులు) నిర్ణయించెను. ఆ పోటీ యుద్ధఘట్టమును కొరవి గోపరాజు యిట్లు వర్ణించెను. ఏమో ఉత్తుత్త రోషానికి వచ్చి తీరా ఎదుటివాడు తీసుకొని ఎదురునిలచి నప్పుడు తోకముడిచే వ్యవహారము కాగూడదుసుమా అని ఒకలెంక యిట్లనెను. "గుడికొలువుబంటు మల్లని కొలది పంతమయ్యె నిచ్చట నది తెట్టులంటిరేని"

"ఒకడు దేవర భాండాగారంబు నింటికడన్ పాలెమువడం గొలిచి పళ్ళెరంబుల ప్రసాదంబు తినుచు పోతుక్రియ నుండ నొక్కనాడు, దేవరను దర్శింప వచ్చి వారి సందడిలో నొక్క యీడిగ తనకాలు ద్రొక్కినన్ కోపించి ఏమిరా, బంటుమల్లు నన్నెరుంగవా తన్నితివి, అనిన, నతండు నే నెరుంగన, ఈ సందడిలో కాలుదాకె, ననిన, నెరయం దన్ని యెరుంగ ననినం పోనిచ్చెదనా ? యనుచు నందందు దట్టించిన అయ్యీడిగడా కేలి కటారి వలకేల నందుకొని, తన్నినాడ, యేమనియెదవురా ? అనిన అతని బిరుసు చూచి బంటు మల్లండు స్రుక్కి, ఏమియు నేమనియెద, దేవర కూడిగంపు బంటుంగాన దోసమనియెద ననియెం గావున,

        "మీకు పిన్నవాడ ఏకాంగవీరుండ రంకెవైచిన, నడబింకమైన,
         నగిన, కేరడించినన్, మీస లంటిన, పట్టితివియ నాకు పాడిగాదె"

అట్టి ద్వంద్వయుద్ధాని కేమేమి 'పంతముల కొలదుల' (షర్తులు) విచారించగా అందొక భటు డిట్లనెను.

        "పుల్లతి వెట్టిన, భూమికి కొసరిన, ఎదిరి పోటునకు చే యొదుగుచున్న,
         దండకై దప్పిన, తప్పు క్రేళ్ళురికిన, పంతంబుగొన్న, చౌఒళము గొన్న,
         దాణికి జొచ్చిన, దాచిన, మానిన, అరువ నొడ్డిన బయలాన పడిన,
         చాగ బొడువకున్న, లాగంబునకుకొన్న, మడమ గెంటిన, వ్రేళ్ళు మగుడబడిన,
         తారుమారైన, తలవంచి పొడిచిన, పారుగా తలంచు పంత మిదియె."

            ఇందలి కొన్ని పదాలు కత్తిసాములోని సాంకేతికములు.

పైవాని ప్రతిస్పర్ధి పెట్టిన ఎదురుపంతము కొలదులు (ఎదురుషర్తులు) ఎట్టి వనగా;_

        "మతిగాక దృష్టి నేమరక రక్షించుచు సూకర దృష్టిమై డాక గొలిపి
         గర్జనసేయక మార్జాలదృష్టిమై తరలక వరుజించి తాకబూని"

ఇంకను భల్లూక దృష్టి, గృధ్రదృష్టి, ఫణిదృష్టి, కపిదృష్టి, చోరదృష్టి, శార్దూలదృష్టి కూడ వర్ణించి "సురియకాండ్ర పంత మిదియ" అని తేల్చెను..

అయితే యీ రెండును సాధారణముగా కత్తియుద్ధాలలో పెట్టు పంతములు కావు.

"అనుడు వింతపంతంబుల కచ్చెరువంది పొందుగా జూచి విడువుండన భట్టియు, అంగాదీశ్వరుండును నిలువంబడి, విస్తారంబుగలుగ వైహాళి దీర్చి, యెల్లజనులం గూర్చుండ విడి, గలబ పుట్టకుండ, ఎడ వెడన్ తలవరుల విలిపి, పట్టెదు వారల మాటమాటలలోను పట్టుండని నియమించి, నలువురుబంట్ల నడుమనిడి, కఠారంబులు ఒక్క కొలందిగా కొలిచి, నిమ్మపంద్ల దొడిసి, ఎడగలుగ బంటుచేతికిచ్చినన్ పమ్ముకొని యవ్వీరులు, ధీర ధీరంబుగ జొచ్చిరి."[96]

పంతంబుల పద్యములోచౌబళము, దాణి, అరువ అను పదాలకు నిఘంటువులలో అర్థాలు లేవు.

గారడీ అను విద్యను ఇంద్రజాల మనిరి. ఇంగ్లండులోని ఇంగ్లీషు పత్రికలలో ఇంచుమించు 40 ఏండ్లనుండి యొక చర్చ కొన్నిమారులు చేసినారు. ఇంచుమించు 150 ఏండ్ల క్రిందట ఒక ఇంగ్లీషు వాడొక ఇంద్రజాల ప్రదర్శనమును హిందూస్థానములో చూచి దాన్ని చాలా మెచ్చుకొని అనాడే పత్రికలో వ్రాసెను. ఆ ఇంద్రజాలమ లో ఒకడు త్రాటి నొకదానిని పైకి నిలువుగా విసరి గాలిలోనిలబెట్టి దానిపై కెగబ్రాకి మాయము కాగా, వాని యంగములు ఖండ ఖండములుగా క్రిందబడె ననియు, మరి కొంతసేపటికి వాడు త్రాటినుండి గబ గబ దిగివచ్చెననియు వ్రాసెను. అది యబద్ద మనియు, అట్టి విద్యను ప్రదర్శించు వానికి ఇంగ్లండుకు రానుపోను వ్యయమును భరించి వేలకొలదిగా బహుమానము లిత్తుమనియు కొందరు ప్రకటించిరి. కాని కొరవి గోపరాజు ఒక కథలో ఇదేవిధమగు ఇంద్రజాలమును వర్ణించినాడు.

ఒకడు తనభార్య అనుదానిని వెంటబెట్టుకొని రాజసన్నిధిలో ఆమెను రక్షణార్థమై విడిచి, తాను దేవసహాయార్థమై యుద్ధముచేయ వెళ్ళుతున్నాని చెప్పి ఒక త్రాటిని పైకి నిలువుగా విసరి, దాన్ని నిలబెట్టి, దానిపై కెగబ్రాకి మాయమయైను. కొంతవడికి వాని కాలుసేతులు, తల, మొండెము తుంటలై క్రిందబడెను. వాడుంకువగా నుంచిపోయిన వానిభార్య రాజును వేడి సెలవు పొంది సహగమనము చేసెను.

వెంటనే త్రాడు పైకి ప్రాకిపోయిన భటుడు పైనుండి దిగివచ్చి తనభార్యను పంపుమనెను. రాజు విచారగ్రస్తుడై ఆమె సహగమనము చేసెనని చెప్పెను.

        "ఆవీరుం డప్పుడే నిజ భావము ప్రకటముగ నాత్మభామినితోడన్
         దా వై తాళికు డగుచున్ గైవారము చేసె జనులు కడు వెరగందన్.
         నరనాథ! నిన్ను నపుడవసర మడిగినవాడ, నైంద్రజాలికురీతిన్
         నరుల నణకించి నీచే సిరి వొందం జోద్య మిట్లు చేసితి ననియెన్"[97]

ఇది అ నాటి ఇంద్రజాలవిద్య, అదేసందర్బములో చతుష్షష్టికళల పరిగణనమును కూడ తెలిపినారు. అందీ క్రిందివి చేరినవి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వాస్తు, అతుర్వేదము, ధనుర్వేదము, మాంత్రికత్వము, సంగీతము, జలస్తంభనాదులు, (మహేంద్రజాలము), జూదములు, అష్టావధానము, వాద్యనృత్య కౌశలము, బహురూపనటనత్వము (అనగా పగటివేషములు), పరిహాసము మున్నగునవి.[98]

కాకతీయరాజుల కాలమందు శ్రీకాకుళము తిరునాళ్ళ ప్రసిద్ధిగా నుండినట్లు క్రీడాభిరామమందు వర్ణింపబడినది. అంతకు పూర్వకాలమందే అది ప్రసిద్ధియై యుండినట్లు మంచన కేయూరబాహుచరిత్రలో వ్రాసెను.

         "నలువుగ కాకుళేశు తిరునాళులలోపల గుండమంత్రి ని
          ర్మలమతి బిట్టు వేగముగ మాడలు రత్నచయంబు చల్లె"......[99]

అని వర్ణించుటచే పూర్వకాలమందు రాజులు మంత్రులు ఉత్సవకాలాలలో రూకలుచల్లి బీదలకు దానము చేయుచుండిరని విశదమైనది. జూదములు అనేకవిధములైనవి ఆడుతూవుండిరి. అందుకొన్ని కాకతీయ కాలమందలివి తెలిపియుంటిమి. అవన్నియు ఈ కాలములోనూ వుండెను. ఒక మేటిజూదరి తన ద్యూతచాతుర్యమును నిట్లు తెలుపుకొనెను.

       "దృష్టి యేమరక నందయు, జోగరంబును దిగయును, గాళ నా తేటపడిన
        అచ్చులలోపలనే యచ్చన గైకొని మాటలాడినయట్ల వేటు గలుగ
        తలపుగతి వచ్చు కోరిన దాయ మనగ...ఎల్లపిడికిళ్ళు విడిపించుకొని యేనకొందు."[100]

ఈ యాటను పల్లెజనులు లక్కిముష్టి, నక్కముష్టి, అని యందురు. బహుశ అది నక్కముష్టియై యుండునేమో! ఒకడు గవ్వలుకాని, చింతబిచ్చలు కాని పట్టుకొని వచ్చును. నాలుగు బిచ్చలు ఒక ఉడ్డ యగును. పిడికిలి పట్టినవాని కొకదిక్కు వదలి తక్కిన మూడుదిక్కులలో ఎందరైనను సరే, తమ కిష్టమువచ్చినన్ని రూకాలుకాని, పైసలుకాని యుంతురు. పిడికిలి వట్టినవారు ఉడ్డలప్రకార మెంచగా, నాలుగు మిగిలితే దానిని మష్టయందురు. మూడుమిగిలితే దానిని తిగ యందురు. రెండు మిగిలితే దుగ యందురు. ఒకటి మిగిలితే దానిని నక్క యందురు. నక్కనుండి మష్టవరకు నాఠాగు సంకేతము లున్నందున దానిని నక్కమష్ట అనిరనియు, అదియే నక్కముష్టిగా లేక లక్కముష్టిగా మారెననియు ఊహింపవచ్చును. ముష్టిపట్టినవాని యింట సంఖ్యయే మిగిలిన, వాడు తక్కిన మూడిండ్లవారి పైకమంతయు తీసుకొనును. లేక తనకేయి ట సంఖ్యవచ్చునో ఆ సంఖ్యలో నెంత పైకముండునో అంత యిచ్చి, తక్కిన సంఖ్యలవారి మొత్తములను వదిలివేయవలెను.

పైన వర్ణించిన కవియు నాలు సంకేతములను తెలిపినాడు. కాళయన నాలుగైయుండును. తిగ యన మూడు, నంది యన ఒకటి. జోగర యన రెండై యుండును, వర్ణించిన వరుస కూడ పైయర్థముల సూచించును. అచ్చులన పట్టుకొనివచ్చు గవ్వలో, క్రచ్చకాయలో లేక అంతటి చిన్న గులకరాళ్ళో యని యర్థము.

చదరంగపు పందెములు గూడా వుండెను.

        "చతురంగంబున నే నతి చతురుడ కరి తురగ మంత్రి శకట భట ప్ర
         స్థితి పరహస్తము సేయుదు క్షితిమెచ్చగ రాజు బంటుచే గట్టింతున్"[101]

చతురంగమును మొదట కనిపెట్టినవారు హిందువులు. దానిని అరబ్బులు నేర్చుకొనిరి. అరబ్బుల సైన్యములలో రథములు లేవు కావునను వారికి ఒంటెలె సమృద్ధికావునను, రథములకు మారుగా ఒంటెలను పెట్టి యాడిరి. ఆయాటను యూరోపువాసులు నేర్చుకొనిరి. వారికి ఏనుగులు లేవుకావున వాటికి మారుగా కోటలు (castles) ఏర్పాటు చేసుకొనిరి. తర్వాత నెత్తము (పాచికలాట) ను గురించి తెలిపినారు. అటుపై పులి జూదముల గూర్చి యిట్లు తెలిపినారు

        "తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో
         మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ పొగటాల నే నతి ప్రౌడుండన్.[102]

పులిజూదములు మూడువిధములైనవని కవి తెలిపినాడు. మన దేశములో ఇండ్లముందటి అరుగుబండలపైన, దేవలయాల బండలపైన పులి జూదపు ఇండ్లను మలిపిస్తూ వుండిరి. ఈ యాటను చతుర లతిచాకచక్యముగా ఆడెడివారు. ఇప్పటికిని ఈ ఇస్పేటు (పేక Pack) జూదపు కాలములో కూడా గ్రామలలో పలువురు వృద్ధు లీయాటలం దారితేరిన గంటుపోకలై మిగిలి యున్నారు. ఈయాటలను విరివిగా వర్ణించి సవరించి పటములు వ్రాసి, ఒక ప్రత్యేక గ్రంథముగా మన కాలములో ముద్రించకపోతే మనకు నాలుగైదు నూర్ల యేండ్లక్రిందటి మనపూర్వులు ఆటలేమియు మనకు తెలియరానట్టుగా, మనకాల మందు పూర్వావశిష్టముగా మిగిలి పాశ్చాత్యులచే దిగుమతి యైన పేక జూదపు వెల్లువలో కొట్టుకొనిపోయి నష్టమగును. పాచికల ఆట 20 ఏండ్లక్రిందటి వరకు విరివిగా నుండెను. 20 ఏండ్ల క్రిందట పాలమూరు జిల్లాలలో, రాయలసీమలో, నక్కముష్టి చాలా ఆడుతుండిరి. పులిజూదాలు కూడా విశేషముగా నాడుతుండిరి. కాని యిప్పు డివన్నియు అరుదైపోయినవి నిఘంటుకారులు బాలక్రీడా విశేషము, ఒకవిధమగు జూదము అని వ్రాయటయో లేక అంతమాత్రముకూడా వ్రాయక ఆపదాలనే యెత్తుకొనక పోవుటయో చేయుచున్నారు. ఇది సరియగు పద్ధతికాదు. ఈ విషయమున పరిశోధనలు చేయదలచినవారి కీసూచనలు చేయనైనది. ఇక మూడువిదములగు పులిజూదము లని కవి తెలిపినాడు. రెండు పులి జూదాలు కలవు. కాని, మూడవది తెలియరాలేదు. తెలియ వచ్చినంత తెలుపు కొందము.

ఒక పులిని మూడుమేకలతో కట్టివేయవలెను. పులికి పెద్ద గులకరాతి ముక్కయు, మేకలకు చిన్నగులకరాతి ముక్కయు నుంచి ఆడుదురు.పులిని మొదట పై శిఖర కోణమం దుంతురు. మేకను దానిసమీపమందలి యింట పెట్టి దానిపై దాని మేకలేకుండిన అవతలి యింటిపై పులి వ్రాలును. కాన మేకలను పెట్టువాడు పులికి మూడవ యింట బెట్టి తర్వాత పులియంచున నుండు నింట పెట్టెదరు. పులి జరుగకుండా కట్టివేసిన ఆట ముగియును. లేదా మూడు మేకలను పులి చంపిననూ ఆట ముగియును. ఇది యొక పులిజూదము.

రెండవ దెట్టిదనగా:-

నాలుగు పులులతో 16 మేకలతో ఈ యాట నాడుదురు. నాల్గు పులులను నిలుపు త్రికోణమందలి మధ్యరేఖపై వరుసగా నుంతురు. మేకల ప్రతికక్షి పులులకు ప్రక్కయింటిలో పెట్టక ఒక యిల్లు ఎడమగా ఒక మేక నుంచును. పులుల కక్షి ఒక పులిని ఒక యిల్లు జరుపును. మేకలవాడు రెండవ మేక నుంచును. పులి ప్రక్కన అదే పంక్తిలో మేక ప్రక్కని యిల్లు ఖాలిగానుండిన పులివాడు మేకపై పులిని దాటించి చంపును. ఈవిధముగా 16 మేకలను పెట్టిన తర్వాత మధ్య పులులు చంపగా మిగిలిన మేకలతో పులులను కట్టివేయు ఎత్తులతో మేకలను జరుపుదురు. మేకలు విరివిగా చచ్చి, ఇక పులుల కట్టలేనని అనుకొని ఓటమి యొప్పుకొన్న ఆట ముగియును. అటులే పులులు కదలకుండ వాటి ప్రక్కని యిండ్ల నాక్రమించుకొనిన ఆట ముగియును ఇది రెండవ విధమగు పులి జూదము. ఈ రెంటిలో ఆటాడువా రిద్దరే యుందురు.

ఇక మూడవదేదో తెలియదు. కాని ఉత్త మేకల చదరంగము అని మూడాట లాడుదురు. అందేదయిన నుండునేమో అని యీ క్రింద తెలుపనైనది.

ఈ యాటను ఒక్కడే ఆడుకొనును. తొమ్మిది కాయలను పెట్టుకొని వాటిని జరుపుతూ చంపుతూ పోవును. ప్రొద్దుపోని మనిషి ఈ యాటకు పూనుకొనును.


ఇదియు మేకల ఆటయే. ప్రక్కపుటలోని నమూనాలో 3 వ పంక్తితప్ప తక్కిన పంక్తులలోను తోకగానుండు త్రికోణపు టిండ్లలోను ఇద్దరాటకాండ్రు పదారేసి మేకల నుంతురు. 1, 2 రేఖలు దాని త్రికోణ మొకనికి, 4, 5 రేఖలు దాని త్రికోణము ప్రతిపక్షుని కుండును. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కమారొక మేకను మొదట ఖాలిగానున్న" 3 వ రేఖలోనికి జరుపుదురు. ఒకని మేక ప్రక్క కింకొకని మేక వచ్చి కూర్చున్నను, ఆ మేక ప్రక్కయిల్లు ఖాళీగా యున్నను అవతలివాని మేక వచ్చిన మేకను చంపును. మొదలు చూపిన పులిజూదముల రెండింటిలో పులి ఒక్కొక్క మారొక్క మేకనే

కొట్టును కాని యీ యాటలో ఎన్ని సందులు దొరికితే అన్ని మేకలను ఆటకాడు కొట్టవచ్చును. ఎదుటివాని మేకలను చంపి దుర్బలునిగా చేసి పూర్తిగా మేకలను చంపవచ్చును, లేదా కట్టివేయ వచ్చును.

మరొక విధమగు ఆట కలదు. దీనిని ఇద్దరు ఎదుటమదుట కూర్చొని యాడుదురు. ప్రతివాడు 9 మేకలను (కాయలను) తీసుకొనియాడును. ఒకడొక

కాయ నొక యింటిలో నుంచిన రెండవవాడును తన దిక్కేకాక తన యిష్టము వచ్చినచోట తన కాయ నుంచును. ఈ విధముగా కాయలు కాయలు పెట్టుటలో ఒకడు తన కాయల మూడింటిని ఒకే వరుసలో పెట్టనియ్యక తన కాయను ఆవరుసలో పెట్టవలెను! ఆ యాటంకములను తప్పించుకొని ఒక డొకే వరుసలో తనమూడు కాయలు పెట్టిన యెదుటివాని కాయనేదైన నొక దానిని తీసివేయును. ఈ యాటను చర పర్ అని యందురు. తన కాయలను మూటి నొక వరుస పెట్టి చర్ అని యెదుటవాని కాయను తీసివేయును. మరల తన కాయను వెనుకకు జరిపి స్వస్థానానికి తెచ్చి మూటి నొక వరుసచేసి పర్ అని ఎదుటివాని కాయను మరొక దానిని తీసివేయును. అందుచే నీ యాటను చర్ పర్ ఆట యనియు నందురు.

కావున ఈ యాటలో నేదైనా మూడవ పులి జూదములో చేరిన దేమో తెలియదు. ఈ యాటలన్నియు తెనుగు మండలా లన్నింటిలో నున్నవో లేవో గట్టిగా చెప్పజాలము కొరవి గోపరాజు పుణ్యమా అన్నట్లు అతని వర్ణననుబట్టి మన పూర్వుల యీ వినోదాలు కొన్నియైనా తెలియ వచ్చినవి.

మారేడుపల్లి సికింద్రాబాదు నుండి శ్రీయుత తాడేపల్లి కృష్ణమూర్తిగా రనువారు నాకిట్లు వ్రాసియుండిరి. "మూడు విధములగు జూదములలో రెండు తెలిపి మూడవది తెలియదన్నారు. మూడవ విధమగు పులిజూద మిట్లాడుదురు.

ఈ యాటకు 3 పులులు 15 మేకలుండును. కొందరు 3 పులులు 14 మేకలతో ఆడుదురు. ఆట యారంబమందు మొదట 1 వ స్థానమం దొక పులిని పెట్టుదురు. తర్వాత క్రమముగా 2, 3, 4 ఇండ్లలో తక్కిన మూడింటి నుంచుదురు. ఆట తక్కిన ఆటలవలెను పుల కట్టుటయో లేక మేకలను పులులు చంపుటయో ఆటకు ముగింపు. ఈ యాట ఉత్తర సర్కారులలో ఆడుదురు. చర్ పర్ అని వర్ణించిన ఆటనే ఉత్తర సర్కారులలో "దాడి" ఆట యందురు. చర్ పర్ అనుటకు మారుగా "దాడి" అని యెదుటివానికాయ నెత్తి వేయుదురు. (ఈ సూచనకు పైవారికి కృతజ్ఞత).

చర్ పర్ ఆట అత్యంత ప్రాచీనమై ఏషియా, యూరోపు ఖండాలలో అన్ని దేశాలలో నుండెనట. మోర్ హెడ్ అను ఆటల నిపుణుడు 'Pocket Book of Games' అను గ్రంథములో మిల్ (Mill) అను నొక ఆటను వర్ణించినాడు. అది పూర్తిగా చర్ పర్ ఆటయే.దాన్ని గురించి అతడిట్లు వ్రాసినాడు. "The Mill is Known to every European school boy. It is unknown in America. It is one of the most, ancient of games. It is seen on the steps of acropolis in Athens, on a Roman tile' on the deck of a Viking vessl." "మిల్ ఆట ప్రతి యూరోపియన్ బడిపిల్లకాయకు తెలిసిన ఆటయే. ఇది అమెరికాలో లేదు. ఇది అత్యంత ప్రాచీన ఖేలనము. ఏతెన్సులోని దేవాలయమందు దాని రేఖలు తీర్చియుండిరి. రోము ఇటికలపై కూడ ఇది యుండెను. నార్వే ప్రభువుల ఓడలపైకూడ దీని రేఖల చెక్కియుండిరి.

ఇదే సందర్బములో జూదమువలన కలుగు నష్టముల నుపన్యసించి, ద్యూతకారుల దృష్టిలో అది మంచి వినోదమే యని వాదింపజేసిన హేతువాదములు విపులముగా విషయభరితముగా నున్నవి. అం దీపద్య మొకటి కలదు.

        "ధనలాభమును పురాణము వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం
         బున సంగీతముంకావ్యంబులు నాటకములు జూదమున కెనయగునె."[103]

ఆకాలమందు జనులకు పురాణశ్రవణములో చాలా ఆసక్తి యుండెనని తెలిపియుంటిమి. ఇది మరొక నిదర్శనము. యోగవిద్యలో, లోహములను బంగారుచేయు విద్య చేరియుండును. నేటికిని అట్టివిద్యను కొందరు యోగం అని యందురు. ఈ పద్యము వద్దనే,

      "జూదమున ధాతువాదము వాదంబున దొడర చే టవశ్యము కలుగున్"

అని యన్నందున యోగవిద్య నిచ్చట ధాతువాదానికి వాడి యుందురు. వసంతోత్సవములు రాజులకు ప్రీతిపాత్రము లగుటచే అవి జనులలోను వ్యాపించిపోయెను. దక్షవాటికలో భోగమువారి గుంపులు రెండుండెను. వారు వసంతోత్సవ కాలములందు భీమేశ్వరునివద్ద నాట్యమాడి గానము చేస్తూ వుండిరి.

వసంతోత్సవాలలో 'కుసుమరజము', 'గంధంబు పసుపు', 'గంధపుటుం డలు ఒకరి పైనొకరు వేసుకొనుచుండిరి. పన్నీరు, రంగులు పిచికారీలతో 'చిమ్ము'కొనుచుండిరి మరియు,

         "నేతులనూనెలం బసుపు నీరును కుంకుమ చెందిరంబులన్
          నూతన గంధసారములను న్నొనరించిరి కేలితంత్రముల్"[104]

'చిరుబంతి పసుపు'ను 'గాజు కుప్పెల గస్తూరిజలము'ను సంపన్నులు చల్లుకొంటూ వుండిరి. "కర్పూరాది సుగంధద్రవ్యంబులు వసంత చాలనంబొనర్చెడివారిలో నుండి కలహకంటకుండను రాచలెంక వెడలివచ్చుచు తన మీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచు" వెళ్ళెను.[105] అను వాక్యమును బట్టి జనులలో వసంతోత్సవము వ్యాప్తిలో నుండెననుట స్పష్టము.

జనులకు నాటకములందు చాలాప్రీతి. నాటకముల ముచ్చటలు పలుమారు సారస్వతములో కానవచ్చినవి. కాని అవి సంస్కృత నాటకములు కానీ, వాటి రీతుల అనుకరణములు కానీ కావు అదేమి కారణమో ఈ 20 వ శతాబ్దదివరకు సంస్కృత మర్యాదలతో కూడిన నాటకాలు తెనుగున వ్రాయలేదు. పెద్దపెద్ద కవులుకూడా "యక్షగానాలు" వ్రాసిరి. యక్షగానము అని యేల పేరువచ్చెనో తెలియదు. ఈ యక్షగానాలు సంస్కృత నాటకాలకు భిన్నమైనవై దక్షిణదేశమునం దంతటను జనుల కాదరపాత్రములై ప్రీతికరములై వ్యాప్తిలో నుండినట్టివి కాన ఇవి నన్నయ కంటే పూర్వమునుండి వచ్చిన "దేశికవితాయుక్తమగు పాటల నాటకాలై యుండెను. "అక్కలేజోగు" అని కామేశ్వర్యాది శక్తిదేవతల గొలుచు జక్కులవారను జాతివారు తెనుగుదేశములో కలరు. ప్రాచీనమునుండియు కవులు "జక్కులపురంధ్రీ" వర్గమును వర్ణించుతూ వచ్చినారు. ఈ జక్కుల వారే యక్షులు జక్కు అను దేశి (ద్రావిడ)శబ్దమును సంస్కృతములోనికి తీసికొని యక్షశబ్దముగా సంస్కృతీకరించిరో యేమో? అనార్య జాతులలో యక్షులు చేరినారు. యక్ష కిన్నర గంధర్వ పన్నగ పిశాచ రాక్షసాదివర్గాలన్నియు అనార్య జాతులే.

కిన్నెర లను జాతిని ప్రాచీన గ్రీకులు కినారై (Kinaries)అనిరి. గంధర్వు లనగా కాశ్మీరు ప్రాంతమందలి గాంధార దేశమువారు. పన్నగ జాతి మద్య ఏషియా లోనివారు, పిశాచులు టిబెటు, మంగోలియా ప్రాంతాలవారు. రాక్షసులు అరక్షన్(Araxes) అను నదీప్రాంతమువారై యుందురు. అటులే యక్షులు అక్షస్ (Oxus)లేక జక్షార్తస్ (Jaxartes) ప్రాంతవారైనను కావచ్చును. లేదా క్రీస్తుశకారంభమున మన దేశములో పశ్చిమోత్తర భాగాలను గెలిచి పాలించిన యఛీ (Yuchi) అను జాతియైనను కావచ్చును. అయితే వారు మన తెనుగుదేశ లోని జక్కులతో నే సంబంధము కలవారో తెలియదు. యక్షుల వేషాలువేసి గానములో ప్రసిద్ధియైన యక్షుల పేరుతో వెలసిన యక్షగానములను ప్రయోగించి నాటకాలాడినందున జక్కులవారను మన నటకులకు పేరు వచ్చెనేమో ఆలోచనీయముగా నున్నది.

మనకు విజయనగరరాజుల కాలమునుండి కొన్ని యక్షగాన నాటకముల పేరులు తెలియవచ్చినవి. కొన్ని లభించినవి. అంతకుపూర్వము యక్షగానాల నాటకాలను విరివిగా ఆడినట్లు నిదర్శనములు కలవు.

"కీర్తింతు రెవ్వానికీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి" అని భీమేస్వర పురాణమున వర్ణితము.

జక్కులవారే మొదట నాటకా లాడియుండినవారు శివసంబంధమగు కథలను ప్రదర్శించి యుందురు. శైవకథలను ఆడి ప్రదర్శిస్తూ వుండిరని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తెలిపినాడు.

         "అచట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రల నాడించువారు"

అని పర్వత ప్రకరణమం దన్నాడు. తర్వాత భాగవత కథలను, వైష్ణవ గురువుల చేతను, రాజులచేతను ప్రోత్సహింపబడి ఆటలాడి జనులలో వైష్ణవము వ్యాపింపచేసి శైవమును నణగద్రొక్కుటకు దీనిని గూడా సాధనముగా గైకొని యుందురు. భాగవత కథలను ఆటలుగా నాడువారిని భాగవతులు అనిరి. వారే 'భాగోతులైరి. శ్రీనాథునితో లేక సమకాలకవిదో యైన ఒక చాటువు. "భాగోతుల బుచ్చిగాడు"వసిద్ధముగా అచ్చపు స్త్రీలవలెనే స్త్రీ వేషమువేసి అకర్షణీయముగా ఆడుచుండెననియు, పాడుచుండెననియు, "పెండెల నాగి" అను స్త్రీయు అట్టిదే యనియు, స్త్రీలు (తక్కువజాతి 'నాగి', 'గంగి' వంటివారు) కూడా స్త్రీపాత్రల నభినయిస్తూ వుండిరని తెల్పుటకు సహాయపడినది. క్రీడాభిరామమునకు వీధి నాటకము అని పేరు. దానిని ప్రదర్శించిరని అందిట్లు తెలిపినారు.

        "నటులది దోరసముద్రము, విటులది యోర్గల్లు, కవిది వినుకొండ మహా
         పుటభేదన మీ త్రితయము, నిటు గూర్చెను బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్"

అయితే క్రీడాభిరామము ప్రదర్శన యోగ్యముగా లేదు. ప్రదర్శించిన ప్రజల కర్థమై యుండదు. అర్థము కానిదాన్ని జనులు చూడరు. వీధి నాటకము అనుటలోనె దాని చరిత్ర యిమిడియున్నది. అవి యిప్పటివలె టికటు నాటకాలు కావు. వీధులలో కొద్దిపాటి పరికరాలతోనే ఉచితముగా జనుల యెదుట నాటకాలాడుతూ వుండిరి. గ్రామ ముఖ్యులు, ధనికులు నాటకమువారిని పోషిస్తూ వుండిరి.

జనులు అనేక విధములగు పాటలు పాడుకొనుచుండిరని కాకతీయ కాలమందు తెలిపినాము. పల్నాటి వీవీరుల చరిత్రమును పిచ్చుకుంట్లవారును, కాటమరాజు కథను గొల్లవారును, ఎల్లమ్మ కథను బవనివారును చెప్పువారైరి. ఈవిధముగా ద్విపద భేదాలతో కథలుపాడి వినిపించి జీవించు కులాలు కొన్ని యేర్పడెను. ఎల్లమ్మ కథయే రేణుకాకథ. దీనిని చాలా విపులముగా పురాణకథకు భిన్నముగా రెండుదినాలవరకు ఐవనీండ్లు జవనిక వాయిస్తూ చెప్పుదురు. వీరే పెద్దదేవరకథను రాయలసీమలో చెప్పుదురు. ఇది పురాణాలలో నెందును లేనట్టిది. బ్రాహ్మణయిండ్లలో కామేశ్వరికథ బ్రసిద్ధమైనది. దానిని ప్రొద్దున మొదలుపెట్టి సాయంత్రమువరకు చెప్పుదురు. "అక్కలు లేచేవరకు నక్కలు కూసె" అన్న సామెత దీనినిబట్టియే వచ్చినది. ఈ కథ గుంటూరు కృష్ణాగోదావరి జిల్లాలలో విశేషప్రచారమందున్నట్లు కానవచ్చును. ఈకథను జక్కులవారు చెప్పెడివారని క్రీడాభిరామమందు వర్ణించినారు.

క్రీడాభిరామములోని 'కామవల్లీ' కథాసూచన యిదియే. బీదలు, పని పాటలు చేయువారు, మోటకొట్టువారు, కలుపుదీయువారు, దంచువారు, విసురువారు, పాటలుపాడుచు పనిచేయుచు ఆయాసమును మరుస్తూ వుందురు.

        "పనిచేసి గంజియైనను అంబలైనను నెద చల్లగా ద్రాగి యెచటనైన
         పడియుండి వెన్నెల గుడిపాటపాడగా పేదల కాత్మసంప్రీతి కలుగు."[106]

వెన్నెలగుడిపాట యన నెట్టిదో తెలియదు. వెన్నెలలో పాడునట్టి పాటయని మాత్ర మూహింప వచ్చును. పాల్కురికి తెలిపిన వెన్నెల పాట యిదియై యుండును.

గుర్రములకు నడక నేర్పుట యొక అనుభవవిధానమై యుండెను. మంచి గుర్రపురౌతులు ప్రత్యేకముగా గుర్రములను సాధించువారై యుండిరి. గుర్రపు నడకలు పలువిధములవై యుండెను. మన సమీక్షాకాలములో "జోడనయు, జంగనడకయు, తురికినడకయు, రవగాలునడక యుంగల వారువంబులు" ఉండెను.[107] జోడన అనధౌరితకము అనియు, జంగన అనగా కాలు చాచిపెట్టి నడచునడక అనియు, రవగాలునడకయన అస్కందితము అనియు శబ్దరత్నాకరములో వ్రాసినారు. కాని తురికియన గుర్రమని యర్థము వ్రాసినది ఈ సందర్భమునుబట్టి కుదురదు. నాలుగుకాళ్ళను ఎట్టి సవారిపోయిన ఈనాడు దానిని చాతురికినడక అందురు. బహుశా అది చౌతురికియై యుండునో యేమో ?

దొంగతనము అందులో కాన్నపుదొంగతనము, బందిపోటు దొంగతనము జనులకు బాధాకరమైనదైనను కవులవర్ణనలలో అదొక కళగా పరిణమించినది. సంస్కృతవాఙ్మయమందు దండి దశకుమారచరిత్రములోను, శూద్రకుడు మృచ్చకటికా నాటకములోను దొంగతనమును వర్ణించుటను చదివినవారి కదొక ప్రీతిదాయకమగు కళగా కానవచ్చును. అమర్యాద ననుసరించి కొరవి గోపరాజు చౌర్యవిద్యను వర్ణించువిధాన మిట్లున్నది.

దొంగలు కాళికాది శక్తిదేవాలయముల కేగి తమదొంగతనము విజయవంతముగా కొనసాగిన అమ్మవారికి ముడుపు లిచ్చుకొందుమని మ్రొక్కుకొందురు. ఊళ్ళలో చీకటిపడగానే అరెకులు (తలారులు) కావలిగా తిరుగజొచ్చిరి. దొంగలు సిద్దమైన విధ మెట్టిదనగా,

        "గాలిచీరయు నొల్కిబూడిద గ్రద్దగోరును గొంకియున్
         కోలయున్ వెలుగార్చు పుర్వుల క్రోవి ముండులబంతియున్

         మైలమందుల కొయ్య కత్తెర, మారుగన్నపు కత్తియున్
         నీలిదిండులు, నల్లపూతయు నేర్పుతోడుగ మ్రుచ్చులున్"
        'పాలెమున్న వారిపై నొల్కి బూడిద మందుచల్లి పెద్ద మగులు కొంత
         కూలద్రవ్వి రాచకూతురుండు మేడ కత్తిరించినట్లు గంటువెట్టి'
  
        "తొడితొడి క్రోవుల పువ్వుల విడిచి దివియు లార్చి...రి"[108]

పైవర్ణనలోని చౌర్యపరికరములలో ఒల్కిబూడిదయొక్కయు, వెలుగును ఆర్పి వేయునట్టి పుర్వులక్రొవియొక్కయు ఉపయోగమును తెలిపినారు శ్మశానములో పీనుగుల గాల్చిన బూడిదను నిద్రించువారిపై చల్లిన అది మచ్చుమందుగా పనిచేయునని దొంగల విశ్వాసము. అందును "పాలెమున్న వారిపై" చల్లుచుండిరి. (పాలెము అన మొదటి యర్థము కావలి. సీమాంతమందు దుర్గాధి పతులుగా నుండి తగినంత సైన్యములు కొని ప్రతిఫలముగా జాగీర్లను పొందిన వారి కర్థమయ్యెను. వారిదండును కూడా పాలెమనిరి.) గాలిచీర అన గాలి జొర కుండుటకై అడ్డముగా పెట్టెడు వస్త్రము. గ్రద్దగోరు అన 'చోరసాధన విశేషము' అని శబ్దరత్నాకరకారుడు వ్రాసెను. అంతమాత్రము మనకును తెలియును. దొంగలు గ్రద్దగోరుతో కన్నము పెట్టుచోట గీయుదురు. అ గీత మెత్తదనమును బట్టి అట కన్నము పెట్టుదురు. అటు కానిచో మరొక తావున గీయుదురు. దొంగల కట్టి విశ్వాసముండెను. అది గ్రద్దగోరుయొక్క ప్రయోజనము! తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో ఈ విశ్వాసము నేటికిని కలదు. కొంకియన కొండివంటి వంపు చీల. దానికి త్రాడుగట్టి గదులలోనికి దిగి సామానులను అ చీలకు తగిలించి త్రాడులాగి సైగ చేసిన పై నున్నవారు గవాక్షము ద్వారా చేదుకొని తీసుకొనుచుండిరి. కట్టకడపట దిగినవాన్ని కూడా అత్రాటితో చేదుకొనుచుండిరి. పుర్వులక్రోవి యనియు, క్రోవుల పువ్వులు అనియు కవి రెండురూపాలు వాడినాడు. రెంటిలో పుర్వులు అనునదే సరియగు రూపము. క్రోవి అన గొట్టము. అందు పుర్వులను అనగా పురుగుల నుంచి వాటిని దీపములపై విడిచిన అవి వాటిని ఆర్పుచుండెను. దీపము లార్పు పుర్వు లేవియో ముందు కనుగొందుము. ముడ్ల బంతి యెట్టిదో? ముండ్లబంతిని త్రాడునకు గట్టి గవాక్షము ద్వారా వదిలితే కొండ్లకు సామానులు తగిలిన వాటిని చేదు కొనుచుండిరేమో! అదే ముండ్ల (కొండ్ల) బంతి (Circle) అయి యుండును. మైలమందులు అనునది నిఘంటువులో లేదు. అవి మైకపు మత్తుమందులే అయి యుండును నల్లపూత అంటే చీకటిలో కనబడకుండుటకై ఒంటికి పూసుకొనుపూత. ఈకళ యీవిధముగా నశించిన దన్నమాట! అనేక విషయాలు మనకు తెలియనివైనవి.

తిమ్మభూపరుడు అనుకవి పరమయోగి విలాసము అను పద్య కావ్యమును వ్రాసెను. దానినుండి శబ్దరత్నాకరమందు గ్రద్దగోరు అను పదమువద్ద యిట్లుదాహరించినారు.

        బలపము, కన్నపుగత్తియు తలముళ్ళును, చొక్కు, నీలిదట్టి యిసుము, చీ
        మలక్రోలు, గ్రద్దగోరును, ములుబంతియు, కత్తెరయును మొదలగువానిన్.

ఈపద్యమందు "చోరసాధన విశేషములను" వర్ణించినారు. తలముళ్ళన తలముడి బహువచనము. తల వెంట్రుకలను మడిచి కట్టెడు ముడిబట్టయై యుండును. నీలిదిండు, నీలిదట్టి అనగా నీలిరంగు వేసిన బట్టలను వారు తొడిగిన చీకటిలో కానరాకుందురు. ఇసుము (ఇసుక) ఎదుటి వారికంట చల్లుట కేమో? 'చీమల క్రోలు' నకును, 'పుర్వుల క్రోవుల' కును సంబంధము కానవచ్చెడి. క్రోవు బహువచనమే క్రోలు. అ క్రోవులలో (గొట్టములలో) చీమలునింపి తీసి కొనిపోతూ వుండిరన్నమాట. చీమలు వెలుతురును ఆర్పునా? రెక్కల చలిచీమలీ పనిని చేయునా? అదియు తెలియదు. దీపము చూచిన పుట్టలుగా వచ్చి దానిపై బడు పురువులు కొన్ని కలవు. అవి యీ చీమల వంటి వేమో! దీపము లార్పునవి చీమలు అని పైన వ్రాసినను తర్వాతి కాలపు ఇద్దరు కవులు అ పురుగులు భ్రమరములు అని తెలిపినారు. "భ్రమరాల బట్టిన క్రోవి" అని గౌరన తెలిపినాడు. (హరిశ్చంద్ర, ఉత్తర భాగము, పుట 226.)

"భవనదీపాహిత భ్రమరపేటిక" అని వేంకటనాథ కవి (క్రీ.శ. 1550 ప్రాంతము వాడు) పంచతంత్రములో వ్రాసెను. (3-199) భ్రమరమువలన తుమ్మెదలు కదా! తుమ్మెదలు దీపముల నార్పునేమో! ఎవరైనా పరీక్షించిన కాని తెలియదు. దొంగల పరికరాలను, వారి చౌర్యకళను చాలాచక్కగా వేంకటనాథు డిట్లు వర్ణించినాడు.

      భవన దీపాహిత భ్రమర, వాలుకాభస్త్రీ, తలముళ్ళు, గ్రద్దగోళ్ళు
      ములుదోరణముబట్ట, మొలత్రాటికురువాడి కైదువు, దెసకట్టు కావుబొట్టు
      జిలుగు కన్నపుకత్తి, బలపంబు, మొగమాయ మందు, తాలపుటాకు, మైలగ్తోచి
      మడుపుటాకులు, పోకపొడికాయ, మోరచ్చు చెప్పులు, భుజగ వృశ్చిక చికిత్స
      సుస్తివృద్ధిక రౌషధక్షోద, మసిత వసన భంగంబు పెడతలవంక సికయు,
      కారు నునుమేను, నెర్రని కన్నులమర దూరితత్రాసు డపుడొక్క దొంగబంటు
      "వచ్చి త్రిమ్మరు తలవరులు కన్గొనకుండ బవరి చుట్టును బలపమున వ్రాసి
      ముంచి కన్నపు గత్తిమొన కెత్తి పెట్టించి యొయ్యనొయ్యన శిలలూడదివిచి
      ..................................................
      గాలికుండ వెలుతురు కాకయుండ కరకు గరబట్ట కన్నపు గండిగప్పి"
                                            (7 - 199, 200)

        బలపము యొక్క యుపయోగ మిచ్చట ఈ కవి తెలిపినాడు.

ఇంతకు పూర్వమే క్రీ.శ. 1250 ప్రాంతమందుండిన పాల్కురికి చౌర్యకళ నిట్ల వర్ణించి యుండెను.
    
     "కత్తియు, బలపంబు, కావిచీరయును, కత్తెర, యిసుము, నక్షతలును, ముండ్ల
      బంతియు, నీలికప్పడమును, ద్రిండు, మంతర కాటుక, మరి చండవేది,
      సెలగోల, యొంటట్ట చెప్పులు ఏకె మొలుకుల బూడిదయును, వాటుఱాలు,
      కుక్కిలవాకట్టు కొంకినారసము, గ్రక్కున కంకటిరజ్జుపు, నమర"
      గడియ కన్నంబును, కడప కన్నంబును, గోడకన్నంబును, గురినేల కన్నము
      ఓడక త్రవ్వించి, యిల్లొయ్యన జొచ్చి పరికించి...............[109]

పై పద్యమందు ద్రిండు అనగా నడుమున కట్టు పట్టీ లేక దట్టి లేక వీపుపై మట్టెడు వస్త్రపు చుట్ట. మంతరకాటుక అన మంత్రించిన కాటుక అంజనముగా పనియిచ్చునట్టిది. చండవేది పదము నిఘంటువులలో లేదు. ఈ చౌర్య కళను గురించి ముందు ప్రకరణమున నెక్కువగా చర్చింపబడును.

తెనుగు భారతము అనుశాసనిక పర్వములో నీ క్రింది పద్యము కలదు.

        "గ్రువ్వ, గ్రద్ద, దివ్యారుపు బ్రువ్వు, గూబ,
         యిల్లు సొచ్చిన శాంతి సేయింపవలయు" (4-119)

     ఇందుకు సంస్కృత మూల మిట్లున్నది.

        "గృహే ష్వేతేన పాపాయ తథావై తైలపాయికా:
         ఉద్దీపకాశ్చ గృద్రాశ్చ కపోతా భ్రమరాస్తఠా
         నివిశేయు ర్యదా తత్ర శాంతి మేవ తదాచరేత్
         అమంగళ్యాని చైతాని తథోత్ర్కోశా మహాత్మనాం"
                                 అను. 114 అధ్యాయము.

తైలపాయికములు అనగా గబ్బిలములు. కపోతములన గువ్వలు, ఉద్దీపకము లన నేమో? ప్రకాశమిచ్చునవి అని శబ్దకల్పద్రుమము. కొండచీమ అని (ఆంధ్ర) శబ్దరత్నాకరము. అవెట్టివో యేమో? రాత్రులందు గూబల కన్నులు ప్రకాశించునుకాన అవే ఉద్దీపకము లగునా? తిక్కన గూబ అని వాడినాడు. దానికి సంస్కృత మూల మేది మరి? రాత్రులందు ప్రకాశించునవి మిణుగురు పుర్వులు కదా! అవే ఉద్దీపకములగునా ? అచ్చర మనకు ప్రధానము కాదు. "తిక్కన దివ్యారుపు బ్రువ్వు" అని వాడెను. దివ్య అనగా దివ్వె. దివ్య ప్రయోగ మిదొక్కటే తెనుగులో కానవచ్చినట్లున్నది. దివ్వటీ వలె దివ్య అని పద ముండెనేమో. ఏది యెట్లున్నను దివ్యారుపు బ్రువ్వు అనగా దీపము నార్పు పురుగు అని యర్థము. ఆ పురుగేది? సంస్కృత మూలములో భ్రమరాపి అని కలదు. ఈ చర్చలో భ్రమరములు దీపము లార్పునని ఒక కవి ప్రయోగించినది చూపినాను కదా! భ్రమరమునకు తిక్కన దీపమార్పు పురుగు అను నర్థము చేసి వ్రాసెను. కావున దొంగలు క్రోవులలో గొట్టములలో దీపముల నార్పుటకై తీసుకొని పోయినవి భ్రమరములేయని స్పష్టమై పోయినవి.

మైలారు దేవుని అనగా మైలారు అను ఊరిలో ప్రసిద్ధముగా నెలకొన్న వీరభద్రుని కొలిచే భక్తులను మైలారు భటులనిరి. వారు ప్రాణాంతకమగు ఆత్మహింసా కార్యములను భక్తిపారవశ్యము చేతను, మ్రొక్కుబడి చెల్లించుట కొరకును చేయుచూ ఉండిరి.

         "రవరవ మండు నెర్రనిచండ్ర మల్లెల చోద్యంపు గుండాలు చొచ్చువారు
          కరవాడి యలుగులు గనపపాతర్లలో నుట్టిచేరులు గోసి యురుకువారు

         గాలంపుగొంకి గంకాళచర్మము గ్రుచ్చు యుడువీధి నుయ్యెల లూగువారు
         కటికి హోన్నాళంబు గండకత్తెర వట్టి మిసిమింతులునుగాక మ్రింగువారు
         వందులను నారసంబులు సలుపువారు యెడమ కుడిచేత, నారతులిచ్చువారు
         సాహసమ మూర్తిగై కొన్న సరణివారు ధీరహృదయులమైలారు వీరభటులు[110]

పెద్దపెద్ద పొడవైన గుంతలలో ఎర్రని బొగ్గునిప్పులు పోసి వారందు నడచిపొతూ వుండిరి. నేలపై శూలాలు పాతి పెద్ద గడపై నుండి ఉట్టి ఊగి వాటిని త్రెంపుకొని అ శూలాలపై పడుతూ వుండిరి. బహుశా ఆత్మ బలిదాన మవుతూ వుండిరి.

ఒక గడపై తిరుగు ఇనుప కడెమునకు కట్టిత్రాడు కొననున్న ఇనుప కొండిని వీపు చర్మానికి క్రుచ్చుకొని దానిపై వ్రేలాడబడి గడె చుట్టును రంకు రాట్నమువలె తిరుగుతూ వుండిరి. బంగారు నాళపు (హొన్ను+నాళము) పిడిగల గండకత్తెర (తల నరకు సాధనము)తో తల పండు విచ్చుకొను చుండిరి. బాణాలను (దబ్బనములను=శస్త్రములను) ఒంటి సంధులందు గ్రుచ్చుకొంటూ వుండిరి. నేటికిని కార్తీకనంది సేవలలో శైవులు ఆవేశమ తో దబ్బనముల (శస్త్రాల-సతాలతో) దవడలకు క్రుచ్చుకొందురు. అరచేతులలో కర్పూరమును వెలిగించి దేవరకు హారతు లిచ్చిరి. ఇవి అబద్ధమయిన ముచ్చట్లు కావు.

విజయనగర చక్రవర్తుల కాలములో వీపున కొంకిని గ్రుచ్చుకొని జనులు ఉయ్యెల లూగిరనియు, ఇతర సాహస హింసాయుత కార్యాలను ప్రదర్శించిరనియు కాంటి యను యూరోపుఖండవాసి వర్ణించి యుండెను. పైగా నేటికిని నిప్పులలో నడుచుట, దబ్బనాలు క్రుచ్చుకొనుట, అరచేతులలో కర్పూర హారతులిచ్చుట శైవులలో కాననగును.

భరతముని ప్రతిపాదితమగు నాట్యభంగిమములు శాస్త్రోక్తముగా కూచిపూడివారు బహుశా అభినయిస్తూ వుండిరేమో! కూచిపూడివారి నృత్య మీ కాలమందే వ్యాప్తిలోనికి వచ్చియుండును. సామాన్య జనులు మాత్రము తమకువచ్చినట్టి దేశీనృత్యములందాసక్తి కలిగియుండిరి.

కవితలో సంగీతములో నృత్యములో దేశివిధానము, మార్గ విధానము అని ప్రాచీనమునుండి రెండువిభిన్నరీతు లేర్పడియుండెను. నన్నెచోడుడు మార్గకవిత (సంస్కృత పద్ధతి) నుండి భిన్నించిన దేశికవితను గూర్చి తెలిపెను. సంగీత శాస్త్రములలో మార్గవిధానము. దేశివిధాన మున్నవని వివరించినాౠ. రామాయణమును కుశలవులు "అగాయితాం మార్గవిధాన సంపదా"అని రామాయణములో వ్రాసినారు. "దేశిమార్గ లాస్య తాండవంబులు" అని కాశీఖండములో చెప్పినారు.

దేశినృత్యవిధానాలే జనులకు ప్రీతి నిచ్చినవై యుండెను. ఆ నృత్యాలలో పురుషు లాడునవి కొన్ని, స్త్రీలాడునవి కొన్ని యుండెను. కోలాటముపై అందెలు వేయుచు కోలంట్లువేయుచు పాడుచు మగవా రాడెడివారు. స్త్రీలు వలయాకారముగా చప్పట్లు చరుచుచూ ఆడేవారు ఇప్పటికి తెలంగాణాలో బతకమ్మపాట అనునది, రాయలసీమలో బొడ్డెమ్మ అనునది యీ విధానపు గీతికాయుక్త నృత్యమే!

స్త్రీలు గొండ్లియాటను ఆడిరి:-

        "వీరు మైలారదేవర వీరభటులు గొండ్లియాడించుచున్నారు గొరగపడుచు
         నాడుచున్న చూడు మూర్ధాభినయము తాను నెట్టిక సీలంతగాని లేదు."

గొండ్లి (గొండిలి) అనునది కుండల అనుదాని తద్బవమేమో! కుండలాకార నృత్యమే గొండ్లి. గొండ్లి విధానమే బతకమ్మ, బొడ్డెమ్మ ఆటలు. గొరగపడుచు అనిన మైలారుదేవుని గొలుచు స్త్రీ. ఆ స్త్రీ నీటి పాత్రలోని వస్తువును మొగ్గవాలి నాలుకతో నందుకొనె ననియు అందే వర్ణించినాడు.

నాట్యములలో దేశి మార్గ నృత్యములను గురించి శ్రీనాథుడు కాశీఖండములో రెండు మూడు తావులలో నుదాహరించినాడు.

జక్కిణి యనియు, చిందు అనియు రెండుదేశీనృత్యము లుండెను. జక్కిణిని గురించి దశావతార చరిత్రలో నిట్లు వర్ణించినారు.

         "దురుపదంబులు సొక్కుమై సిరులువొసగ
          సరిగ నిరుగెల కుంఛియల్ సవదరించి
          పెక్కువగ జక్కిణీకో పు ద్రొక్కె నొక్క
          చక్కనిమిటారి నరపతుల్ సొక్కి చూడ"[111]

ఇట్టివి ఆనాటి తెనుగు సారస్వతములో విరివిగా గానవస్తున్నవి.

ఈ విధముగ రెడ్లరాజ్యకాలమందు జనులు జీవించిరని తెలుసు కొన గలిగినాము. కొండవీడు మహావైభవోపేతమయినదై యుండుటచే శ్రీనాథుడు తదభిమానముచేత పరరాజుల దర్శించినప్పుడు తన కొండవీటి నిట్లు వర్ణించెను.

       సీ. పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనకొని విడనాడు కొండవీడు
          పరిపంధి రాజన్యబలముల బంధించు గురుతైన యురిత్రాడు కొండవీడు
          ముగురు రాజులకును మోహంబు పుట్టించు కొమరుమించిన వీడు కొండవీడు
          చటులవిక్రమ కళా సాహసం బొనరించు కుటిలారులకు జోడు కొండవీడు
          జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గంధ
          సింధురార్భటీ మోహన శ్రీల దనరు కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

ఈ ప్రకరణానికి ముఖ్యాధారములు

1. కొరవి గోపరాజు:- సింహాసన ద్వాత్రింశిక 2 భాగము లు. కాకతీయ కాలానికి క్రీడాభిరామ మెటులో, ఈ కాలాన కిది అట్టిది. ఇది సాంఘిక చరిత్రకు చాలా యుపయుక్తమైనది.

2. HISTORY OF THE REDDY KINGDOMS. రెడ్డిరాజ్యాల చరిత్ర, (ఇంగ్లీషు) కర్త:- శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మగారు.

ఈ గ్రంథము ఏప్రెల్ 1949 లో వెలువడినది. ఇది సాంఘిక చరిత్రకు చాలా విలువనిచ్చునట్టి సమగ్ర గ్రంథము. నేను స్వయముగా నోటు చేసుకొని చదివిన విషయాలు కాక నాకు తెలియనివి దీనినుండి యుదాహరించి దీన్ని పేర్కొన్నాను. దీనిని ఆంధ్రా యూనివర్సిటి వారు ప్రకటించినారు తెనుగులోను ముద్రించుట భాగని సూచింతును.

3. శృంగార శ్రీనాథము:- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, ఇదియు చాలా విలువకలది. 4. శ్రీనాథుని కృతులన్నియు - చాటువులును.

5. ఆంధ్రుల చరిత్రము,(3వ భాగము) - శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు.

6. భోజరాజీయము:- అనంతామాత్యుడు.

7. కేయూర బాహూ చరిత్ర:- మంచెన.

8. ఎర్రాప్రెగడ:- నృసింహ పురాణ, ఉత్తర హరివంశ, కృత్యాది పద్యాలు.

9. రెడ్డి సంచిక (రాజమహేంద్రవరము ఆంధ్రేతిహాస పరిశోధక మండలి)

10. గౌరన:- హరిశ్చంద్ర, నవనాథ చరిత్ర.

 1. History of the Reddy Kingdoms, P. 137-143, Part, V.
 2. "పండువా సురతాణి పావడం బిచ్చిన" భీమేశ్వర పురాణం. అ 1.
 3. History of Reddy Kingdoms, P. 143, Part, I. (ఇకముందీ గ్రంథమునకు Hist. R.K అను సంకేతమునిత్తును.)
 4. చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రము, 7 భా. పు 124.
 5. భీమేశ్వర పురాణము, ఆ 1, పు 99-102.
 6. సింహాసనద్వాత్రింసిక, 1 భా, పు 85.
 7. సింహాసనద్వాత్రింశిక, పు 117.
 8. సింహాసనద్వాత్రింశిక, 2 భా. పు 50.
 9. భీమేశ్వరపురాణము, ఆ 1. ప 25.
 10. శివరాత్రి మహాత్మ్యము, అ. 4 ప. 25, 27.
 11. సింహాసనద్వాత్రింశిక, భా. 2. పు. 39.
 12. సింహాసన ద్వాత్రింశిక, 1 భా, పు 78.
 13. సింహాసన ద్వాత్రింశిక, భా 2, పు 97.
 14. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 25.
 15. భీమేశ్వరపురాణము, అ 3, ప 41.
 16. ఆంధ్రుల చరిత్ర, సంపుటము 3. పుట 132.
 17. ఆంధ్రుల చరిత్ర, సంపుటము 3. పుట 264.
 18. భీమేశ్వరపురాణము, అ 1. ప 32.
 19. Hist R. K. Page 273.
 20. సింహాసనద్వాత్రింశిక, 2 భా. పు 2
 21. భీమేశ్వర పురాణము. అ 1. ప 41. 42.
 22. భీమేశ్వర పురాణము. అ 1. ప 41. 42.
 23. ఆంధ్రుల చరిత్రము, 3భా. పు, 122.
 24. ఆంధ్రుల చరిత్రము, 3భా. పు, 138.
 25. Hist. R. K. Page 218.
 26. Hist. R. K. Page 365.
 27. Hist. R. K. Page 367.
 28. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 31.
 29. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 86.
 30. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 99.
 31. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 99.
 32. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 28.
 33. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 102.
 34. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 64.
 35. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 7.
 36. శ్రీనాథుని చాటుధారలు.
 37. హరవిలాసము, ఆ 1. ప. 10.
 38. Hist. R. K. Page 373.
 39. "కళసాపుర ప్రాంతకదళీ వనాంతర ద్రాక్షాలతాఫల స్తబకములకు" శ్రీనాథుని చాటుధార.
 40. కేయూరబాహు చరిత్రము, అ. 3. ప. 201.
 41. హరవిలాసము కృత్యాదులు.
 42. Hist. R. K. Page 405-6.
 43. ఆంధ్రుల చరిత్ర, భా 3. పు 169, 170.
 44. హరవిలాసము. కృత్యాది పద్యాలు.
 45. Hist. R. K. Page 409 - 412.
 46. Hist. R. K. Page 412-413.
 47. కేయూర బాహుచరిత్ర, అ 2 ప 9.
 48. కేయూర బాహుచరిత్ర, అ 2 ప 10.
 49. సింహాసన ద్వాత్రింశిక, భా 1 పు 74.
 50. చరిగొండ ధర్మన్న చిత్రభారతము, అ 2. ప 66.
 51. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 78.
 52. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 72.
 53. ఒక చాటువు.
 54. భీమేశ్వర పురాణము, అ 1. ప 74.
 55. సిం. ద్వాత్రింశిక, భా 2. పు. 104
 56. సింహాసనద్వాత్రింశతి, భా 2. పు. 108, 109.
 57. సింహాసనద్వాత్రింశతి, భా 2. పు 5.
 58. సింహాసనద్వాత్రింశతి
 59. భీమేశ్వరపురాణము. అ 1. ప 73, 24
 60. భీమేశ్వర పురాణము. అ 3. ప 221.
 61. భీమేశ్వర పురాణము. అ 1. ప 91.
 62. కాశీఖండము. అ 1.
 63. భీమేశ్వర పురాణము. అ-ప. 3.
 64. భీమేశ్వర పురాణము. ప 23.
 65. శృంగార నైషధము. కృత్యాది.
 66. షోడశకుమార చరిత్రము, అ 6. ప. 13, 16.
 67. సింహాసనద్వాత్రింశిక, భా 2. పు 27.
 68. Hist. R. K. Page 282
 69. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 108.
 70. సింహాసనద్వాత్రింశిక, భా 2. పు 84.
 71. భీమేశ్వర పురాణము, అ 5. ప 84.
 72. "భోజనాగార గవాక్ష మార్గంబుల వెడలి" కాశీఖండము.
 73. కేయూర బాహుచరిత్ర అ 3; ప 239.
 74. సిం.ద్వాత్రింశిక, భా 2. పు. 88.
 75. కాశీఖండము - కృత్యాది.
 76. భోజరాజీయము, అ 4. ప 92, 93.
 77. సింహాసన ద్వాత్రింశిక, 1 భా. పు. 102.
 78. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 110.
 79. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 103.
 80. సింహాసన ద్వాత్రింశిక. భా 1. పు 103.
 81. సింహాసన ద్వాత్రింశిక. భా 1. పు 51.
 82. శివరాత్రి మహాత్మ్యము. అ 6. ప 40.
 83. సింహాసనద్వాత్రింశిక. భా 1. పు 59, 60.
 84. శివరాత్రి మహాత్మ్యము. అ 2. ప 54, 56, 62.
 85. శివరాత్రి మహాత్మ్యము. అ 2. ప 70, 71 తర్వాతవికూడ చూడతగినవే.
 86. 'తనదు గాదిలి పుత్రికి నీదలంచెనో' - భోజరాజీయము. ఆ 6.ప 39.
 87. సింహాసనద్వాత్రింశిక, భా 1. పు 21.
 88. భీమేశ్వర పురాణము, అ 1. ప 61.
 89. భీమేశ్వర పురాణము, అ 2. ప 142.
 90. కాశీఖండము - ఈ ఘట్టముతో ఇంకనూ చాలా చాలా తెలిపినారు. అభిలాషులు మూలము చూడగలరు.
 91. కేయూర బాహు చరిత్రము. అ 3. ప 295.
 92. భోజరాజీయము. అ 5. ప 76.
 93. శివరాత్రి మహాత్మ్యము, అ 2. ప 87 (పైనాల్గాటల చర్చ అందు కలదు)
 94. సింహాసన ద్వాత్రింశిక, 1 భా. పు 26.
 95. సింహాసన ద్వాత్రింశిక, భా 2, పు 22.
 96. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 21, 24.
 97. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 111
 98. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 102
 99. కేయూర బాహుచరిత్ర, ఆ 1. ప 45.
 100. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.
 101. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.
 102. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.
 103. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 86.
 104. భీమేశ్వర పురాణము, అ 5. ప 116.
 105. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 20.
 106. సిం. ద్వాత్రింశిక భా 2. పు 59.
 107. సిం. ద్వాత్రింశిక భా 2 . పు 41
 108. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 88.
 109. బసవ పురాణము. పుటలు 154, 155
 110. క్రీడాభిరామము.
 111. Hist. R. K. Page 432