ఆంధ్రుల సాంఘిక చరిత్ర/4 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4 వ ప్రకరణము

విజయనగర సామ్రాజ్య కాలము

క్రీ.శ. 1339 నుండి 1530 వరకు

మతము

ఒక దిక్కు రెడ్డి రాజ్యము. వెలమ రాజ్యము స్థాపితములు కాగా మరొక దిక్కు విజయనగర సామ్రాజ్య మారంభ మయ్యెను. అందుచేత రెడ్డిరాజుల కాలముతో బాటుగ విజయనగర రాజ్యకాలచర్చయు చేయుట యవసరమైనది. సామ్రాజ్య స్థాపనకాలమునుండి శ్రీకృష్ణదేవరాయల నిర్యాణము వర కీ ప్రకరణమున చర్చించబడును.

పలువురు చరిత్రకారులు విజయనగర సామ్రాజ్య స్థాపనము క్రీ.శ. 1336 లో నయ్యెనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1570 లో చనిపోయెను. క్రీ.శ. 1565 లో తళ్ళికోట యుద్ధమందు రామరాజు వధ్యుడై విజయనగర విధ్వంసము దక్కన్ సుల్తానులచే అతి ఘోరముగా జరిగెను. పెనుగొండలో మరల తిరుమలరాయలు నిలద్రోక్కుకొని తురకల యాక్రమణను నిరోధించి రాజ్యము చేయకలిగెను. కాని, శ్రీరంగరాయలు చాలా దుర్బలు డగుటచే రాజధాని చంద్రగిరికి మారెను. అచ్చట కొంతకాలము నామమాత్రావశిష్టముగాసాగి తుదకు క్రీ.శ. 1620 ప్రాంతములో విజయనగర సామ్రాజ్యము రూపు మాసెను. క్రీ.శ. 1530 నుండి 1629 వరకు ముందు ప్రకరణములో చర్చింతుము.

ఓరుగంటిని మంట గలిపిన ముసల్మానులు తెనుగుదేశ మంతటను వ్యాపించుకొని తమ ఘోరకృత్యములను నిరాఘాటముగా సాగించిరి. అట్టిసమయములో ప్రోలయ కాపయనాయకులు వారిని తరుముటయు, రెడ్డి వెలరాజులును అదేపని చేయుటయు సంభవించినందున తెనుగు దేశము తురకల పైశాచికము లను నాలుగైదేండ్లకన్న నెక్కువగా సహించి యుండినది కాదు. కాని డిల్లీనుండి పొరకచుక్కకు (ధూమకేతువు) వలె విజయధాటీ సమారంభముతో చూచినదెల్ల వశ్యముగాను, పట్టినదెల్ల బంగారముగాను, సాగినమార్గ మంతయు జైత్రయాత్రగాను, కావించిన మలిక్ కాఫిర్ తమిళ పాండ్యదేశమందలి మధురలో ముస్లిం రాజ్యమును స్థాపించి పోయెను. అచ్చట సుల్తాను లేడుమంది ఇంచుమించు 50 ఏండ్లు రాజ్యము చేసిరి. ఆ రాజ్యకాలములో వారు తలచినట్లెల్ల ప్రజలను దుర్బర హింసలపాలుచేసిరి. ఆంధ్రదేశమున కది సంబంధించకున్నను వారిచర్యలంతటను నొకేవిధముగా సాగినవగుటచేతను తెనుగుదేశమునను జనులకు కలిగిన కష్టాలను తెలుసుకొనుట కుపకరించునని యిచ్చట వాటి మాసర తెలుపబడును.

వీరకంపరాయచరిత మను నామాంతరముకల మధురా విజయ మనుకావ్యమును కంపరాయల భార్య యగు గంగాదేవి వ్రాసెను. అది సత్యమయిన చారిత్రిక గ్రంథము. క్రీ.శ. 1371 లో కంపరాయలు మధుర నుండి తురకల నోడించి వెళ్ళగొట్టెను.

మధురా విజయములో ఒక స్త్రీ కంపరాయని కాంచీనగరమందు దర్శించుకొని, మధుర రాజ్యమందలి తురకల పాలనము నిట్లు వివరించెను.

        అధిరంగ మవాప్తయోగ నిద్రాం హరి ముద్వేజయతీతి జాతభీతి:
        పతితం ముహు రిష్టికానికాయం ఫణచక్రేణ నివారయ త్యహీంద్ర:

హరియొక్క యోగనిద్రకు భంగము కాకుండా, శ్రీరంగగోపురపు ఇటికలు పడిపోగా శేషుడే తన తలలతో ఆనబట్టుతున్నాడు. (పాములు పారాడిన వన్నమాట)

        ఘుణజగ్ధ కవాట సంపుటాని స్ఫుట దూర్వాంకుర సంధి మండపాని
        శ్లథ గర్భ గృహాణి వీక్ష్య దూయే భృశమన్యాన్యపి దేవతాకులాని.

దేవతాయతన ద్వారాలను చెదలు తిపివేసెను. మంటపాలు విచ్చు కొని పోయి వాటి సందులలో గడ్డి పెరిగినది. గర్బగృహాలు పడిపోయినవి. ఈ యవస్థ ఇతర దేవాలయములకును కలిగినది.

        ముఖరాణి పురా మృదంగ ఘోషై రబితో దేవకులాని యాన్యభూవన్
        తుమ్ములాని భవంతి ఫేరవాణాం నినదై స్తాని భయంకరై రిదానీం.

మృదంగ ధ్వను లుండినచోట ఇప్పుడు నక్కలకూతలు వినపిస్తున్నవి.

         సతతాధ్వర ధూమ సౌరభై: ప్రాజ్నిగమో ద్ఘోషణవద్బి రగ్రహారై:
         అధునాజనివిస్ర మాంసగందై రధికక్షీబ తురుష్క సింహనాడై:

అగ్రహారాలలోని యజ్ఞధూమాలు పోయి మాంసము కాల్చు సెగలపొగ లెగయుచున్నవి. సర్వయుక్త వేదఘోషలకు మారుగా కేవలము అనుదాత్త కర్కశ తురుష్ఖ నిర్ఘోషలే మిగిలినవి.

         మధురోపవనం నిరీక్ష్యదూయే బహుళ: ఖండిత నారికేళ షండం
         పరితో నృకరోటి కోటిహార ప్రచలచ్చూల పరంపరాపరీతం

మధుర తోటలలోని టెంకాయల చెట్లను కొట్టివేసినారు. వాటికి మారుగా శూలములపై మానవుల తలకాయలు వ్రేలాడుతున్నవి.

         రమణీయతరో బభూవ యస్మిన్ రమణీనాం మణినూపుర ప్రణాద:
         ద్విజ శృంఖలికా ఖలాల్ క్రియాభి: కురుతే రాజపధ: స్వకర్ణ శూలం

ఏ మధురా వీధులలో రమణుల నూపురరవములు వినబడుతుండెనో అందిప్పుడు బ్రాహ్మణులకు తగిలించిన సంకెళ్ళ గలగల ధ్వనులు విన వస్తున్నవి.

         స్తన చందన పాండు తామ్రపర్ణ్యా స్తరుణీనా మభవత్ పురాయదంభ:
         తదసృగ్భిరుపైతి శోణిమానం నిహతానా మభితో గవాం నృశంసై:

ఏ తామ్రపర్ణీ నదిలో యువతుల మైపూతల చాయ లుండెనో అందిప్పుడు వధింపబడిన గోవుల రక్తము కలిసియున్నది.

         శ్వసితానిల శోషితాధరాణి శ్లథ శీర్ణాయత చూర్ణకుంతలాని
         బహుబాష్ప పరుప్లుతేక్షణాని ద్రవిడానాం వదనాని వీక్ష్యదూయే.

ఎండిన నోళ్ళు, మాసిన తలలు, ఎడతెగని కన్నీరు కల ద్రవిడ పడుచులను చూచుటకు బాధ కలుగును.

          శ్రుతి రస్తమితా, నయ: ప్రలీనో, విరతా, ధర్మకథా, చ్యుతం చరిత్రం
          సుకృతం, గత, మాభిజాత్య మస్తం, కిమివాన్యత్, కలిరేక ఏవ ధన్య:

ఈ పరిస్థితి నంతయు ఒకే వాక్యములో చెప్పవలెనంటే:- వేదాలకు అస్తమయం, నీతికి ప్రలీనం, ధర్మానికి స్వస్తి, చరిత్రకు చ్యుతి సత్కార్యాలకు విరతి, కులీనతకు నాశనం, కలిగి కలియొక్కటే దన్యత నొందినది.[1]

గంగాదేవి వ్రాసిన పై విషయాలలో టెంకాయ చెట్లను మధురా సుల్తానులు కొట్టించి వాటి స్థానములో శూలాలు పాతించి, వాటిపై హిందువుల తలలు గట్టించిరన్న విషయమునకు అ కాలమందలి ఇబన్ బతూతా అను అరబ్బు యాత్రికుడు స్వయముగా చూచి ఇట్లు వ్రాసినదే తార్కాణము.

"గయాజుద్దీన్ మధురను రాజ్యము చేస్తుండగా హిందువులను చాలా బాధపెట్టెను. గయాజుద్దీన్ అడవినుండి మధురకు వెళ్ళుచుండగా నేను (ఇబన్ బతూతా) వెంట నుంటిని. అప్పు డాతనికి విగ్రహారాధకులు (హిందువులు) పలువురు తమ స్త్రీలతో, పిల్లలతో వెళ్ళుచు ఎదురుపడిరి.. వారు అడవిలోని చెట్లు కొట్టి బాటచేయుటకై నియుక్తులై యుండిరి. సుల్తాను వారిచే రెండు కొనలందు వాడి మొనలుగల శూలములను మోయించెను. తెల్లవారగానే వారిని నాలుగు గుంపులనుగా విభజించి నగరముయొక్క నాలుగుద్వారాలవద్ద కంపెను. శూలాలను భూమిలో పాతించి యా శనిమాలిన దరిద్రుల వాటిపై గ్రుచ్చి చంపించెను.

ముసల్మానుల విజృంభణమున కనేక కారణములు కలవు. అందొకటి హిందువులలో మతభేదము లేర్పడి పరస్పర వైషమ్యములు ముదిరిపోవుట. కాకతీయుల కాలములో శైవమత విజృంభణమును గమనించినాము. విజయనగరారంభ దశలో వైష్ణవ మతవ్యాప్తి కానవచ్చెను. ఈ కాలమువరకు ఆచార్య త్రయమువారి అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములు వ్యాప్తిలోనికి వచ్చెను. జైన బౌద్ధుల సమ్ఖ్య లెక్కలేనిదయ్యెను. ఇక మిగిలినవి శైవ వైష్ణవములు. శైవులు మొదట పరసాంప్రదాయములను నోటికి వచ్చినట్లు తిట్టుటకు మొదలుపెట్టిరి. శివుని దప్ప అన్య దైవతమును మెచ్చినవారి నెత్తిన కాలు పెట్టుదుమనిరి. శివుని వలననే విష్ణ్వాదులు వరములంది మాన్యాలుపొంది సామంత స్థితిలో నుండినట్లు కథలు కల్లలుగా వ్రాసుకొనిరి. శ్రీకృష్ణ దేవరాయలే తన ఆముక్త మాల్యదలో శైవ ప్రభువులు పరమతస్థుల కపచారము చేయుటను, పర దేవతాయతనములను పడగొట్టి శైవ మఠముల కట్టించుటను ఈవిధముగా వర్ణించెను. ఒక పాండ్యరాజును గూర్చి విష్ణుగుప్తునితో శ్రీరంగనాథు శిట్లనెనట.

         "వెర్రిశైవంబు ముదిరి మద్వినుతి వినడు సతి యొ
          నర్పడు మామక ప్రతిమలకును
          హరుడె పరతత్త్వమను, మదీయాలయముల
          నుత్సవంబుల కులుకు నెయ్యురును నట్లె.

          సీ. ఆశ్రాంత జంగమార్చనవక్తి వర్తిలు
                 వేదవద్ద్విజపూజవీటి గలిపి
             భౌమవారపు వీరభద్ర పళ్ళెర మిడు
                 గృహదైవతంబు లిర్రింకు లింక
             షణ్ణవతి శ్రాద్ధచయ మారబెట్టు సం
                 కర దాసమయ్య భక్తప్రతతికి
             అద్యంబులైన దేవాలయంబులు వ్రాల
                 నవవీ నిరాశమఠాళి నిలుపు

             జందెముత్తర శైవంబు జెంది త్ర్ంచు ప
             తితు లారాధ్యదేవళ్ళె ప్రాప్యులనుచు
             ఉపనిషత్తులు వారిచే నబ్బి వినుచు
             వెండి యేజంగ మెత్తిన వెరగుపడును.

       క. శివలింగము దాల్చిన జన నివహంబేమైన జేయు నిది పాపము దా
          నవుగా దన డాసమయమున నవునను విప్రులకె యగ్రహారము లిచ్చున్.[2]

ఆ పాండ్యరాజు శైవులు గంజాయి త్రాగినను చూచీ చూడనట్లుండి విప్రుతలతప్పు కొంచెమైనను పంచాయతిసభ కెక్కించి వారికి శాస్తి చేయించెననియు, ఆ రాజును నమ్మించుటకై యిష్టము లేకున్నను ఇతరులు రుద్రాక్ష పేరులు మెడనిండ ధరించి చంకలో వీరశైవ పుస్తకమగు సూతసంహితల నిరికించుకొని తిరిగిరనియు నిదే సందర్బములో తెలిపెను. రాజులును, మతా చార్యులును నీవిధముగ ప్రజల బాధించుటవల్ల హిందువులలో పరస్పర ద్వేషాలు, రాజద్రోహ, దేశ ద్రోహ బుద్ధి ప్రబలుటలో నాశ్చర్యము లేదు.

కాళహస్తీశ్వర శతకమును ధూర్జటి వ్రాసెనందురు. శైలిని బట్టి అదీ తనది కాదని చెప్పవచ్చును. దాని నెవరు రచించినను అది యీ సమీక్షా కాలపుదిగా కానవచ్చును.

అందు విష్ణుదూషణములు మెండుగా గలవు. "నీపాదపద్మంబుచేర్చె న్నారయణు డెట్లు మాననము దా శ్రీ కాళహస్తీశ్వరా!", "శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా శ్రీ కాళహస్తిశ్వరా!" "శ్రీరామార్చిత పాదపద్మ యుగళా శ్రీకాళహస్తీశ్వరా!" అని దూషించెను. ఇట్టి తిట్టులను విని శ్రీవైష్ణవు లూరకొందురా? వారును కొన్ని కథలను కల్పించి శివునిచేతను విష్ణుపాదముల బట్టించిరి. పరమయోగి విలాసమున తాళ్ళపాక తిరువేంగళనాథుడు కొన్నితావుల శివదూషణము చేసెను. ఈ ద్వేషము లెంతవరకు పోయెననగా, శైవవిష్ణువులు పరస్పరము చండాలు రనియు, పాషండు లనియు, పాపు లనియు తిట్టుకొని సచేల స్నానాలు చేసిరి.

తమ సాంప్రదాయములో చేరినవారు కులము చెడి, వ్యభిచారులై, దొంగలై, మద్యపాయులై, హంతకులైనను సరే, తమ వేల్పుపై భక్తి కలవారేని లేక భక్తి యున్నట్లు నటించినను సరే, వారికి ముక్తినిచ్చిరి. ముక్తి ధామములు కూడా వేరెవేరె యుండెను. శైవులు కైలాసానికి, వైష్ణవులు వైకుంఠానికి పోయిరి. ఇప్పటికిని పోతూనే వున్నారు. తమ సాంప్రదాయక దేవతలతో ఎన్నెన్నో నీచపుబనులను చేయించిరి.

మ. నిను నావాకిలి గావుమంటినొ, మరు న్నీ లాలకభ్రాంతి గుం
           టెన పొమ్మంటినొ, యెంగిలిచ్చి తిను తింటేగాని కాదంటినో,
           నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప జే
           సిన నావిన్నప మేల కైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా;

అనియు,

"నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూప మోకాలో; స్త్రీ
           చన్నో, కుంచమొ, మేక పెంటికయొ ..........?"

అని కాళహస్తీశ్వర శతకకారుడు వ్రాసెను. అదే విధముగా శ్రీవైష్ణవులు విప్రనారయణునికి వేశ్యాసాంగత్యమును కలిగించి శ్రీరంగనాథ స్వామిచే వేశ్యకు దొంగసొత్తు నిప్పించిరి. ఈ కథ బల్లినవారు సంఘములో మతవ్యాప్తికై అవినీతులను కూడా వ్యాప్తి చేసిన వారై రనుట వారికి తోచక పోయెనేమో? శైవులను వైష్ణవులుగా, వైష్ణవులను శైవులుగా మార్చుట పరిపాటి యయ్యెను. విజయనగర సామ్రాజ్య కాలములో శైవుల ప్రాబల్యము తగ్గెను. బసవ పండితారాధ్య సోమనాథులవంటి ప్రచారకులు లేకపోయిరి. వైష్ణవ ప్రాబల్య మెక్కువయ్యెను. శైవులు బిజ్జల రాజ్యమును వశపరచు కొన్నట్లుగా, వైష్ణవులు రెడ్డి వెలమలను విజయనగర చక్రవర్తులను వైష్ణవులనుగా మార్చివేసిరి. ఆనాటి మన మత పరిస్థితి యిట్టి హీనదశకు వచ్చియుండెను.

వివిధ సాంప్రదాయక వర్గాలవారు తమతమ ప్రాబల్యముగల తావులందితర వర్గములవారిని హింసించుటకు గూడ జంకలేదు. అనేక జైనాలయములను శైవు లాక్రమించుకొని వాటిని శివాలయములనుగా మార్చిరి. వేములవాడలో నేటికిని శివాలయము ముందట ప్రాచీనమందుండిన జైనవిగ్రహాలు తమ యవస్థను తెలుపుకొంటున్నవి. గద్వాల సంస్థానములోని పూడూరు అను గ్రామ మందు పశ్చిమ చాళుక్య శాసనాలున్నవి. అచ్చట ఊరిముందటనే ఒక పెద్ద జైన శాసన మున్నది. అ యూరికి కొంతదూరములో నొక శివాలయ మున్నది. దాని యావరణములో ప్రాచీన జైనవిగ్రహాలు లోపలినుండి తొలగించి బయట నుంచినారు. శైవులను జూచి వైష్ణవులును జైనుల హింసలను ప్రారంభించిరి. జైను లిప్పటి మైసూరురాజ్యములో అనాడింకను మిగిలి యుండిరి. వారిని శ్రీవైష్ణవులు హింసించి శ్రావణ బెల్గోలలోని వారి దేవాలయములను కూల్చిరి. అప్పుడు మొదటి బుక్కరాయలు వారికి సఖ్యత కూర్చి శ్రీవైష్ణవులచేత కూలిన జైన దేవాలయములను బాగు చేయించెను.[3]

విజయనగర రాజులుమాత్రము మతసాంప్రదాయిక ద్వేషాలకు తావిచ్చినవారు కారు. ఒకదిక్కు తురకలు తాము గెలిచిన ప్రాంతాలలో హిందువులను బాధించి, మతముమార్చి, గ్రంథాల నంటుబెట్టి, దేవాలయాలను గూల్చి భీభత్సము చేయుచుండ, హిందువులలో ఐక్యత కలిగించుటయే రాజనీతిగా నుండెను. ఆనాటి విదేశీ యాత్రికులు విజయనగర రాజ్యమందు సర్వమత సహన ముండుటను చూచి యాశ్చర్యముతో ప్రశంసించిరి. రాజులలో మతసామరస్య ముండినను జనులలోను, మతాచార్యులలోను అది మృగ్యమై యుండుట శోచనీయము.

మధుర రాజ్యములో ముసల్మానుల క్రూరచర్యలను తెలుప నైనది. అట్టి చర్యలే ఆంధ్ర కర్ణాట ప్రాంతాలలో ముసల్మానులు కాలు బెట్టిన తావులలో వ్యక్తమయ్యెనని యప్పటి వాఙ్మయములో విశేషముగా వర్ణింపబడెను. శ్రీకృష్ణ దేవరాయలే యిట్లు వర్ణించెను.

         సీ. సనకాది దివిజ మస్కరి ఫాలగోపిచందన
                పుండ్రవల్లిక ల్నాకి నాకి
            సెలసి హాహాహూహూవుల దండియలతంత్రి
                ద్రెవ్వసింగిణులుగా దివిచి తివిచి
            సప్తర్షి కృతవియజ్ఘర వాలూకాలింగ
                సమితి ముచ్చెలకాళ్ళ చమిరి చమిరి
            రంభాప్రధానాప్సర: పృథూరోజకుంభంబు
                లెచ్చట గన్న బట్టి పట్టి

            తిరుగు హరిపురి సురతరుసురల మరగి
            బహుళ హళి హళి భృతకలబరిగనగర
            సగర పురవర పరిబృడ జవన యవన
            పృతసభవదసి నని దెగి కృష్ణరాయ.[4]

"గోవధంబుసేయు తురకల దైవంబవు నీవు" అని చంద్రుని పెద్దన తిట్టెను.[5]

సైనిక వ్యవస్థ

ముసల్మాను విజృంభణమున కొక కారణము:- హిందువులలో మత కుల ద్వేషాలుండుటచే ఐకమత్యము లేకపోవుటయని తెలిపినాము. మరొక కారణము, హిందువుల యుద్ధ నిర్వహణ లోపమైయుండెను. ముసల్మానులలో ఐక్యత, మతావేశముండెను. మరియు మతవ్యాప్తి చేయుట వారియాదర్శమై యుండెను. పైగా వారి సైన్యములో ఆశ్విక దళము అపారముగా నుండెను. గుర్రములు దక్షిణ హిందూస్థానమందు తగినట్టివి లేకుండెను. అరేబియా, పర్షియా దేశాల నుండియే అవి దిగుమతి యవుతూ వుండెను. అరబ్బులు, పారసీకు లీ వ్యాపారమందు కోట్ల ద్రవ్యమును గడించిరి. వారు సహజముగా తమ మతస్థులగు హిందూస్థానీ ముసల్మానులకు మొదలు గుర్రములను సప్లయిచేసెడివారు. విజయనగర చక్రవర్తులు గుర్రములు లేని లోపమును గమనించి వాటిని కొనుటకై సదా కృషిచేసిరి. గుర్రము లోడలలో వచ్చునప్పు డవి చచ్చిన వాటి తోకల దెచ్చి చూపిన గుర్రము ధర యిస్తూవుండిరి. ఒక్కొక్కమారు ఒక్కొక్క గుర్రమునకు 20 పౌను లిచ్చిరి. పోర్చుగ్రీసువారు ఏటేట 1000 గుర్రములు సప్లయి చేసిన, తాను 20,000 పౌను లిత్తునని కృష్ణదేవరాయ లనెను.

హిందూ సైన్యములో మరొక లోప మేమనగా, వారికి తుపాకిమందు, ఫిరంగీలు తక్కువై యుండెను.[6] వాటి యుపయోగమును వారు తురకలనుండియే నేర్చుకొనవలసి వచ్చెను. తురకల యుద్ధతంత్రము మేలైనదిగా నుండెను. వారు యుద్ధధర్మములను పాటించినవారు కారు. హిందువు లింకను పురాణయుగము నుండి బయటపడినవారు కారు. మూడవ భల్లాలరాజు మధుర సుల్తానులపై దండెత్తి ముట్టడించగా తురక లోడిపోవుట నిజమని గుర్తించి సంధి చేసికొందుమనియు దాని కవకాశ మియ్యవలెననియు కోరిరి. భల్లాలు డొప్పుకొనెను. అతడును అనని సైన్యమున్ను ఇక యుద్ధము లేదని నిశ్చింతగా నిద్రించగా రాత్రి ముసల్మానులు వారిపై బడి పౌప్తిక ప్రళయము గావించి, భల్లాలును బట్టుకొని అపార ధనమిచ్చిన విడుతుమని, లాగవలసిన దంతయులాగి ఆతని తిత్తి యొలిపించి తోలులో గడ్డినింపి కోటకు వ్రేలాడ గట్టిరి.

ఇట్టి మోసాలు ఔరంగజేబు మరణమువరకు ముసల్మానులు చేసినను, పూర్వము కూడ గోరీ, అల్లావుద్దీన్ మున్నగు సుల్తానులు బహు మోసములు చేసినను హిందువులు గుణపాఠము నేర్చుకొనలేదు: నేర్చుకొన దలచలేదు!!

"దక్షిణదేశ హిందూ రాజుల వద్ద అపార ధనమున్నదనియు, వారిలో ఐక్యత లేదనియు, అన్నిటికన్న మకుటాయమానమగు లోపము హిందూసైన్య దుర్బలతలో నున్నదనియు, అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తించి దక్షిణాపథముపై బడెను.[7]

హిందువుల మరొక లోప మేమన, వారు శత్రువులపై గెలుపొంది నపుడు మరల శత్రువు తల యెత్తకుండా గట్టి చేసుకొన్నవారు కారు. రాయచూరు యుద్ధములో ముసల్మాను లోడిపోగా వారిని పూర్తిగా తుడిచివేయ వలెనని సేనాను లొత్తి చెప్పినను శ్రీకృష్ణదేవరాయలు వినక పారెడి వారిని సంహరించుట ధర్మము కాదని వాదించెనని విదేశీయుడగు నూనిజ్ చకితుడై వ్రాసి యుండెను.[8] అతడు ఉమ్మత్తూరును గెలిచి నప్పుడు ఓడిన రాజులనే మరల అందు నెలకొల్పెను. ముసల్మానుల యుద్ధతంత్ర మట్టిది కాదు. శత్రువు విరిగినప్పడు వానిని పూర్తిగా భస్మముచేసి, వానియొక్కయు, వాని ప్రజల యొక్కయు, ధనమును పూర్తిగా లాగుకొని, వారి నగరములను నాశనము చేసి తలచినన్ని ఘోరాలు చేయుట వారు నేర్చిన రాజనీతి.

దేవగిరి, ఓరుగల్లు, కంపిలి, విజయనగరము శిథిలాలే వారి చర్యలకు సాక్ష్య మిస్తున్నవి. మలిక్ కాఫిర్ దక్షిణాపథమును దోచి 312 ఏనుగుల పయిన ధనమును, 96,000 మణుగుల బంగారును అసంఖ్యాకమగు ముత్యాల రత్నాల పెట్టెలను, 12,000 గుర్రాలను తీసుకొని డిల్లీ చేరెను.

హిందూ సైనికులు ముసల్మానులవంటి సైనికభటులు కారు. ముసల్మాను సైన్యములో అరబ్బులు, ఖురాసానీ తురకలు, పారసీలు, అబిషీలు (అబిసీనియనులు), పఠానులు, బిల్లులు, మున్నగు అటవికులు ఉండిరి. తమ సైనికులు తురక భటులకు సరిరారని విజయనగర చక్రవర్తులు గుర్తించి, తురకలను తమ సైన్యములో భర్తీచేసి, వారికొక "తురకపేట"ను ప్రత్యేకించి వారికి మసీదులు కట్టించి సకల సదుపాయములు చేసిరి. అట్లు చేసినను వారికి హిందూ రాజులపై విశ్వాస ముండినటుల కానరాదు. వారు తమ ఏలికలకు సలాములు కూడ చేయుటకు ఇష్టపడనందున ఏదోవిధముగా తమ గౌరవము నిలుపుకొనుటకు తన గద్దెపై ఖురాను నుంచుకొని దానికిచేసిన తురక సలాములను తానును పంచుకొనెను. ఇట్టిలోపాలతో కూడిన సైన్యాలను విజయనగర చక్రవర్తులు వీలయినంతవరకు సవరించుకొంటూ వచ్చిరని నిరూపించినాము.

కాకమానిమూర్తి కవిచే రచితమయిన[9] రాజవాహన విజయము అను పద్యకావ్యమును చూడగలిగితిని. శ్రీ యన్. వేంకటరమణయ్యగారు వ్రాసిన యొక ఇంగ్లీషు వ్యాసమును జదివి తెనుగు మాలమును చూచితిని. రాజవాహన విజయములో తురకల తుపాకీ యుద్ధాలు వర్ణింపబడుట చేతను సదాశివరాయల టంకాలను పేర్కొనుటచేతను తత్కర్త క్రీ.శ. 1600-1650 ప్రాంతమందుండినవాడుగా కనబడుచున్నాడు. రాజవాహన విజయమందు యుద్ధయాత్రను గురించి విపులముగా వర్ణించినారు. విజయనగరరాజుల యుద్ధయాత్రలను సమకాలికులు కొందరు వర్ణించి దానికిని ఈ కవితలోని విషయములకును ఏమియు భేదము కానరానందున కటువైన యీ కవితనుండి మనకు పనికివచ్చువిషయముల నుదాహరింతును.

"రాజవాహన యువరాజు యుద్ధయాత్రను నగరమందు ప్రకటించెను. సైన్యమంతయు నగర బహి:ప్రదేశమందు కూడెను. యువరాజు జలతారు పనిగలిగి చక్కని కుట్టుపని కలిగిన అంగీతొడగి, సందిదండెపై రత్నాల కడెమును ధరించి ఎర్రని బురుసాని టోపిని ధరించియుండెను. పల్లకీమోయు బోయీలు మొసలి మొగముల రూపముతో నున్న కొనకొమ్మలు కలిగి పరదాలును, పట్టుకుచ్చులును కల పల్లకిని యువరాజుకై తెచ్చిరి. ఆ బెస్తబోయలు వ్రేలాడు రుమాల చెంగులు కట్టిరి. జేనెడు బాకుల నీలిదట్లలో నుంచిరి. బిళ్ళచెప్పులు తొడిగియుండిరి. మావటీడుపట్టపుదలతిని తెచ్చి నిలిపెను. ఒకడు అలంకరింపబడిన గుర్రాన్ని తెచ్చెను. దానికి హురుమంజిలో సిద్ధమైన జీను, కళ్ళెముండెను. ఫరంగి కేడెమును రాజుకు పట్టిరి. యువరాజు తుక్ఖారమును (తుఖారాదేశపు సమరాశ్వమును) ఎక్కెను. ఆతని యెదుట ఏనుగుల బలము, తర్వాత గుర్రపు బలము, దాని వెనుక రథముల బలము, అటుపై కాల్బలము నడిచెను. యుద్ధవీరమణములు అనగా శంఖ, కాహళ, డక్కా, హుడుక్కాది రవములు దిక్కులు పిక్కటిల్ల మ్రోసెను. ఏనుగుల దంతపు కొమ్ములకు పెద్ద ఖడ్గములను కట్టి యుండిరి. గుర్రపు సేనలో పఠాను లెక్కువగా నుండిరి. వారు జుంపాలకు నూనె పూసి దువ్వి మెరుగిచ్చి వాటిపై జరీపాగలు చుట్తిరి. అంగీలు దొడిగిరి. అంగీపై నడుములో దట్టీలు బిగించిరి. రూందే (తుర్కీ) దేశములో సిద్ధమైన రూమీ కత్తులు పట్టియుండిరి. వారికి రాగివన్నె మీసాలుండెను. కండ్లు ఎరుపై యుండెను. తాంబూలములు నమలినందున వారి నోళ్ళెర్రబారి యుండెను. వారు గుర్రాలపై బారులు తీరి యువరాజునకు సలామందించిరి. తర్వాత చెంగులు విడిచిన పాగాలతో నడుములో కటారులతో కురుచ బల్లెములతో, చేతిపై నిలిపిన డేగలతో "కయిజీతపు రాజులు" వెళ్ళిరి. ఆ రాజులవెంట వారి సామానులను మోయు తట్టువలు వెళ్ళెను. తర్వాత డాలు, కత్తులు పట్టిన బంత్లు పసుపువన్నె చల్లాడములతో, ఆ చల్లాడములకు కట్టిన చిరుగంటల మ్రోతతో, దృష్టి దోష పరిహారమునకై పెట్టించుకొనిన మసి బొట్లతో, నడుము దట్టీలతో, ఒరనుండి సగము బయటికి లాగిన కత్తులతో, ఆ బంట్లు వెళ్ళిరి. కర్ణాట దేశమందు బేండర్ (నిర్భయులు) అని పేరుగాంచిన బోయలు, నల్లని దట్టీల నడుములందు చుట్టి రంగు చెల్లాడముల దొడిగి వెండితో పొదిగించిన అంబులతోను, కటారులతోను, వీపున నుండు బాణాల పొదులు తలపాగల ముందుకు నూగుచుండ నల్లని పులులవలె నడిచిరి.

బంట్లు అంబులు, బాణాలు, తీసుకొని, మణికట్లపై ఇనుప కడెములు గలు గల్లు మనగా గోనె సంచులతో అవసరమగు యుద్ధ పరికరాలను మోసికొనుచు నడిచిరి. తర్వాత ఒంటరులు అను వీరభటులు దట్టీలతో వంక కత్తులను జొనిపి జుట్లను ఒంటిపొర గుడ్డలచే నెత్తికట్టి కొవెలకుంట్ల తిరుమణులతో, బాగా తోమిన తెల్లని దంతములపై అందానికిగాను చెక్కించిన బంగారు పువ్వులతో, రక్షగా తమ పెద్దలు కట్టిన తాయెతులతో నడిచిరి. భటులు తమ్ము సాగనంప వచ్చిన భార్యలను ఇంటికి పొమ్మని తొందర పెట్టిరి. కొందరు స్త్రీలు వెంట వత్తుమనిరి. తురక యోధుల భార్యలు తట్టువలపై నెక్కి, కాళ్ళ మెట్టెలతో, ముసుగులతో, సైన్యము వెంట వెళ్ళిరి. కన్నడ స్త్రీలు పలువురు వెండి సందెకడెములతో, నొసట విభూతితో, మంకెనలలో, పాలు, పెరుగు, నెయ్యి పెట్టి గిత్తలపై కట్టి తామును వాటిపై కూర్చుని సైన్యము వెంట పాలు, పెరుగు, నేయి అమ్ముటకు వెళ్లిరి. యువరాజుంచుకొనిన భోగిని ఒక పల్లకీలో పర్దాలు వేసుకొని బయలు దేరెను. ఆమెకు చెలికత్తెలు తాంబూలములు కట్టి యందింపగా పరదాలో నుండి బయటికి చేయిచాచి అందుకొను నప్పుడు ఆచేతి సౌకుమార్యమును, అంద మును చూచినవారు ఆమె రూపు రేఖలను పూర్తిగా చూచిన మరెంత అందముగా నుండునో అని అంచనాలు వేసుకొని ఆశ్చర్యపడసాగిరి. రాజు భార్యకూడ ఒక అందలములో బయలు దేరెను. ఆమె పల్లకి వెంట పట్టె నామములతో శ్రీవైష్ణవాచార్యు లిద్దరు రాఘవాష్టకమును చదువుచు వెళ్ళిరి. ఆ రాణిని సేవించు స్త్రీలు పలువురు కాళంజి, యడపము, తాళవృంతము, కండి, కుంచె, వింజామరలతో సేవలు చేయుచు వెళ్ళిరి. ఆరాణియొక్క భద్రతకై ఆమెపల్లకీలో ఆమె సోదరుడు కూర్చునెను. ద్విపదలను పాడి, కతల చెప్పు పట్టెనామాల శ్రీవైష్ణవులు వెంట వెళ్ళిరి. మరియు రాజాంత:పుర స్త్రీల రక్షణకై రాచవారు కొందరు వారి వెంట వెళ్ళిరి. పెసరకాయ, దోస, చెఱకు, సజ్జ మున్నగు పంటలను లాగి తినుచు సైన్యము వ్యవసాయకుల భూములను బీళ్ళుగా చేసి పోయిరి. గుర్రాలు వరిచేలను నుసిగా త్రొక్కి పోయెను. రథముల వలన, ఏనుగుల వలన పంటచేలు నాశనమయ్యెను. కాపులు అందుకై దు:ఖించిరి. ఈవిధముగా సైన్యము "కూచి" (March) చేసెను. శరత్కాలమందు సైన్యము బయలుదేరెను. వారు రాత్రులందు మంచుకు తాళలేక అడుగున బందారాకు పరచుకొన దుప్పట్లు నిండుగా కప్పుకొన్నను చలికి వడవడవడికిరి. సైన్యపువ్యయములను వ్రాయనట్టి కరణాలు సైన్యమువెంట వెళ్ళిరి. పలువురు బోగము స్త్రీలు సైన్యమువెంట వెళ్ళి సైనిక విటులవద్ద "రూకలు పది యైదు నిద్దురకు" లాగిరి. ఈ విధముగా యువరాజు యుద్ధయాత్ర వెడలెను. (చూడుడు 2వ ఆశ్వాసము)

ఇదే రాజవాహన విజయమందలి పంచమాశ్వాసములో యుద్ధవర్ణన చేసినారు. దాన్నిబట్టి కొన్ని వివరాలిట్లు తెలియవచ్చెడి. "దుర్గముల పాలెగాండ్లైన కమ్మవారును, వెలమవారును, 5000 వరహాల జీతము పొందు పఠాను సైన్యపు సేనానులు, కై జీతపు రాచవారు, "పగటి గానంబు తప్పక యుండ దినరోజు మాదిరి నొంటరి బోదుమూక" మొదలైన వారు యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు శత్రువులు "గడలపౌజు" కకావికలయ్యెను. తుపాకీలను కాల్చు మూక ఒక దిక్కు వాటిని శత్రులపై కాల్చిరి. గజసేనను కోట తలుపులు పగుల గొట్ట పురి కొల్పిరి. బాణములను కొందరు రువ్వుచుండిరి. కోట గోడలవద్ద గసులు త్రవ్వి మందునింపి కాల్చుచుండిరి. దానిని కోటలోనివారు భగ్న పరచుచుండిరి. కొందరు నిచ్చెనలతో కోటగోడ లెక్కుచుండిరి. కోటలోనివారు వారిని కూల ద్రోసిరి. శత్రువుల బిరుసుతనమును జూచి రాజవాహనుడు "రేపు అర్వలగ్ణ" యని ప్రకటించెను. శత్రువు లది విని సంధి చేసుకొనిరి.

కంపరాయలు దక్షిణదిగ్విజయ యాత్రా వస్థానము చేసినప్పుడును పైన వివరించిన విధానమే కానవచ్చినది. "వీరకంపరాయలు ప్రొద్దుననే లేచి పృతనాధ్యక్షులను (సేనానులను) సేనాసన్నాహమునకై ఆదేశించెను. వారును రణ దుందుభులను కోణాభిఘట్టనలచే నగరమందు మ్రోయించి ప్రకటించిరి. ఏనుగులు గుర్రాలు వచ్చి చేరెను. కవచ ధారులగు భటులు కృపాణ కర్పణ ప్రాస కుంత కోదండపాణులై వచ్చికూడిరి. ప్రస్థానోచిత వేషములతో సామంతులు సేనానులు వచ్చిరి. ఉత్తుంగ ధ్వజముల నెత్తిరి. పురోహితులు యాత్రా ముహూర్తమును నిర్ణయించిరి. అధర్వ వేదమంత్రాలు తెలిసిన బ్రాహ్మణులు మంత్ర పూతమగు హోమము చేసిరి. తర్వాత తనకై తెచ్చిన యుత్తమాశ్వము నెక్కెను. సేనానులు జయవాదములు చేసిరి. సామంతులు రాజుముందు నడిచిరి. నగరస్త్రీలు లాజలు చల్లిరి. తర్వాత ప్రయాణము సాగించి అయిదారు దినాలలో చంపరాజు రాజధానియగు ముల్వాయిని చేరిరి. యుద్ధమందు చంపరా జోడి పారి, రాజగంభీర అను కోటలో దాగెను. కంపరాయ లాకోటను ముట్టడించి బాణములతో కోటలోని సైన్యాన్ని నష్టపరచెను. కోటనుండి యంత్రములచే రువ్వబడిన పెద్ద పెద్ద గుండ్లు కంపరాయల సైన్యమును నష్టపరచెను. తుదకు నిచ్చెనలతో కోటనెక్కి పట్టుకొనిరి.[10]

విజయనగర రాజులు లక్షలకొలది సైన్యమును కలిగియుండిరి. తళ్ళికోట యుద్ధములో రామరాజు ఆరులక్షల సైన్యములతో పోరాడెనని అంచనా వేసి యుండిరి. విజయనగర చక్రవర్తులు సైన్యముపై గుర్రములపై యెక్కువగా వ్యయము చేసిరి. బహమనీ రాజ్యము అయిదు చీలికలై అహమద్ నగరు, గోలకొండ, బిదర్, బిజాపూర్, బీరారులలో నెలకొని సర్వకాలము లందును ప్రక్కబల్లెమై ప్రమాద హేతువై యుండెను. ఏమాత్ర మవకాశము దొరకినను వారు సామ్రాజ్యమును ధ్వంసము చేయువారు. అందుచేత విజయనగర చక్రవర్తులు సైన్యముపై అత్యంత శ్రద్ధ వహించిన వారైరి. మొదట ఈరానీ వారును తర్వాత పోర్చుగీసువారును ఈ రాజులకు గుర్రాల నమ్మిరి. మంచి పెద్ద గుర్రమును 300 నుండి 600 డకెట్ల వర కమ్మిరి. (దా డకెట్ = 5 రూపాయలు). చక్రవర్తి యెక్కు గుర్రము వెల 1000 డకెట్లు.[11]

విజయనగర సైన్యములో 40,000 గుర్రాలుండెను. కాల్బలము కత్తులు, బల్లెములు పట్టుచుండెను. మొత్తము 10 లక్షలసేన యుండెను.

విన్సెంటు స్మిత్ తన ఆక్సుఫర్డ్ హిందూదేశ చరిత్రలో ఇట్లు వ్రాసెను. "1520 లో కృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధమునకు ఏడులక్షల మూడువేల కాల్బలమును, 32,600 గుర్రపుసేనను, 551 ఏనుగులను తీసుకొని పోయెననియు, ఆ సైన్యము వెంట సైనులు, నౌకరులు, వ్యాపారులు మున్నగువారు కొల్లలు కొల్లలుగా పోయిరనియు వీన్ వ్రాసెను. రాయలకన్న చాలా కాలమునకు ముందే రథాలు సైన్యమునుండి తొలగిపోయి యుండెను. రాయల బలమునకు సంఖ్యాబలమే ప్రధానము కాని, సైనికులు ముసల్మానుయోధులకు భయ పడెడివారు. సైనికులు పలువురు వ్యక్తిగతముగా శూరులే, బలాడ్యులేకాని సైనిక వ్యూహములో వారు పనికిరాని వారైరి.

"ద్వంద్వయుద్ధము కేవలము విజయనగర రాజ్యమందే నెగడెను. ద్వంద్వయుద్ధము చేయువారు మంత్రి లేక రాజు సెలవు పొందవలసి యుండెను. గెలిచినవానికి ఓడినవాని ఆస్తి యిప్పించెడివారు." (సింహాసన ద్వాత్రింశికోదాహృత వర్ణన యంతయు సత్యమేయని పైవాక్యాలు నిరూపించినవి).

పీస్ అను విదేశి ఇట్లు వ్రాసెను: "సైనికులు నానావిధములగు రంగురంగుల బట్టలను తొడుగుతూ వుండిరి. అవి చాలా విలువగలవై యుండెను. వారు పట్టు డాళ్ళపై బంగారుపూలను, పులులను, సింహాలను చిత్రింప జేస్తుండిరి. ఆ డాలులు అద్దాలవలె మెరుస్తూ వుండెను. వారు పట్టు కత్తుల మీదకూడా బంగారు నీరుపని యుండెను. ధనుర్యుద్ధముచేయు దళముకూడా సైన్యమందుండెను. అమ్ముల మీదకూడా బంగారు పనితన ముండెను. భాణాలకు ఈకలు కట్టువారు, నడుములో కాసెదట్టీ; ఆ దట్టీలో బాకులు, గండ్రగొడ్డండ్లు చెరివియుండిరి. జానకి త్రాటి తుపాకీదళ మొకటి యుండెను.[12] అటవికులగు చెంచులు , కోయలుమున్నగు వారినికూడా సేనలో చేర్చుకొనిరి."[13]

కాల్బలమువారు ప్రాణాలను లెక్క పెట్టేవారు కారు. వారు చెడ్డీతప్ప మరేమియుకట్టుకొనక శరీరమంతయు నూనె పూసుకొని యుద్ధములో దిగెడివారు. శత్రువులతో పెనగినప్పుడు వారికి చిక్కక జారి పోవుటకై వారీతంత్రమును పన్నినవారు. గరుడ, గరుడా అని సైనికులు యుద్ధ కేరలు వేసెడివారు.

గుర్రాలను బాగా అలంకరిస్తుండిరి. వాటితలపై వెండి బంగారు పట్టీలను కట్టిరి. గుర్రపురౌతులు పట్టుబట్టలను దొడుగుతూవుండిరి. 10,000 ఏనుగుబ సైన్యముండెను. ఏనుగులకు రంగులువేసి అలంకరించిరి. ప్రతి ఏనుగుపై నలుగురు కూర్చొనుటకై అంబారి కట్టిరి. సైన్యావసరములగు వస్తువులను ఎద్దులు, కంచరగాడిదలు, గాడిదలు మోయుచుండెను.[14]

యుద్ధములో నుపయోగించు ఆయుధముల ముచ్చట ఆ కాలపు వాఙ్మయములో అందందు వర్ణింపబడినది. కుమార ధూర్జటి తన కృష్ణరాయ విజయములో కృష్ణరాయల జైత్రయాత్ర నిట్లు వర్ణించెను.

         సీ. రటిత దిక్తట నట త్పెట పెటార్బటులతో
                 ఘోరమైన తుపాకిగుండ్లచేత
            దవ్వుదవ్వున హెచ్చి రివ్వురివ్వున వచ్చి
                 పసరించు రాచూరి బాణములను
            పెల్లుగావేసి చిత్తజల్లుగా వెదజల్లు
                 పెంపరుల్ పెంపారు నంపగముల
            ధాటీగతి నటింప మాటికి సూటిగా
                 నాటుకొన్ బల్లెంపు టీటేగముల

          అరిమి తరిమిన భయమున విరిగి జరిగి
          నిజబలంబులడాకకు నిలువలేక
          శరణు జొచ్చినవారల కరుణ జూచి
          యచటి దుర్గస్థలంబుల నాక్రమించె[15]

తుపాకీలు యుద్ధములో ముఖ్యమైనవయ్యెను. రాయచూరులో బాణములు సిద్ధము చేసినట్లు కానవచ్చును. "రాచూరి బిరుదు తలాటము" అని నవనాథ చరిత్రలో (పుట. 36) వ్రాసిరి. దీన్నిబట్టి రాయచూరులో పూర్వము ఆయుధ పరిశ్రమ ప్రసిద్ధముగా నుండెననుట స్పష్టము. "కలనైన విరిగెరుంగని పోటు పరిక, రాచూరు కత్తులమాటు జొచ్చె కొన్ని" అని వేంకటనాథుడును పంచతంత్రములో వర్ణించెను. (4 - 249) కృష్ణరాయల సైన్యమును చూచి తురకలిట్లనుకొనిరట.

          ఏనుగులు వేయి, బొందిలీ లెంచిచూడ
               లక్ష, పెండారు లొకలక్ష, లక్ష తురక
          లిచటి బల మానృపాలున కెంచ భటులు
               నారులక్షలు, హరు లర్వదారువేలు,
          పరలు కరు లొక రెండువే లరసిచూడ
               రాజులును వెల్మలును కమ్మ ప్రజలు ఘనులు
          కలుగు రాయలతో పోరి గెలువ మనకు
               వశమెయైన ఖుదా యున్నవాడటంచు.[16]

యుద్ధములో నుపయోగించు ఆయుధాలను కొన్ని తెలిపినాము. అవికాక పెట్లగ్రోవులును, జబురుజంగులును, ఫిరంగులును, డమామీలును, బాణపుజివ్వలును, రాళ్ళును ప్రయోగించిరి.[17] దంచనములు అను ఆయుధములనుకూడా యుపయోగించిరి. అది ఫిరంగియని కొందరు, గొలుసుతోడి పాషాణయంత్రమని కొందరు వ్యాఖ్యానించిరి. ద్వంసనము అనుదాని తద్బవము దంచనమై యుండును.[18] సైన్యములకు ముందొక నాయకుడును, వెనుక నొక నాయకు డును ఉండెడివారు వెనుక భాగమందలి నాయకుని "దుముదారు దొర" అనిరి[19] ఇది ఉర్దూపదము, దుం అన తోక; దార్ అన రక్షించువాడు. అనగా వెనుకభాగమును రక్షించు సేనాని. విజయనగరమందు,

       "...తూర్ణోచ్ఛముల్ వాజులం దలరున్,బాహ్లిక, పారసీక శకధ
        ట్టారట్ట ఘోటాణముల్"[20]

బాహ్లికమన బలఖ్ దేశము. పారసీకము ఈరాన్. శక అన సితియన్, గ్రీకుల సాగ్డియా ఈరానుకు పశ్చిమముననుండు ప్రాంతము. ధట్ల ఎచ్చటనో తెలియదు. ధట్టనుండియే తట్టు, తట్టువ పదము లేర్పడెనని శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి వ్యాఖ్య. ఆరట్ట పంజాబు ప్రాంతభూమి, యుద్ధమునకు పనికివచ్చు గుర్రాలు దక్షిణ హిందూస్థానమందుత్పత్తి కాకుండెను. ఉత్తమాశ్వములకు ప్రసిద్ధిగన్న దేశమును మధ్యఆసియాలోని తార్తరీ, భోటాన్, ఖురాసాన్, ఈరాన్ అరేబియా దేశాలును కొంత వరకు ఆప్గనిస్థానమును, సింధు, పంజాబు దేశములునునై యుండెను. నామలింగానుశాసనములో అమరుడు గుర్రములకిచ్చిన పర్యాయపదము లన్నింటికి లింగాభట్టీయములో ఏదో యొక వ్యుత్పత్తిని సాగదీసి అర్థము చెప్పినారు. కాని అవి సరియని చెప్పుటకు వీలులేదు. అమరములోని ఆశ్వపర్యాయ శబ్దములలో పెక్కు శబ్దములు గుర్రములు బహుళముగా దొరకు దేశముల పేర్లని నేనూహించినాను. ఆప్ఘనులకు ప్రాచీననామము అశ్వకానులు. (అదే అహ్వాకాన్, అఫగాన్ అయ్యెను) అశ్వములు కలవారని ఆశ్వకాన్ శబ్దము తెలుపుతున్నది. మధ్య ఏషియాలో భోటాన్ గుర్రాలే ఘోటకములై యుండును. కృష్ణరాయలు ఘోట్టాణముల్ అని వాడినదియు గమనింపదగినది. తురికీ దేశపుదికాన తురికీయన గుర్రమను నర్థమయ్యెను. తెనుగులో సామ్రాణి గుర్రాలు అని కొందరు కవులు వాడిరి. అనగా ఈరాన్‌లోని సమరాన్ అను స్థలమునుండి వచ్చినవని యర్థము. ఖురాసాని అని మరికొందరు గుర్రమునకు పేరు పెట్టిరి. మధ్య యేషియాలోని ఖురాసాన్‌నుండి వచ్చినవన్నమాట. గుర్రమును గురించిన చర్చ చాలా కలదు. దానిని గురించి ప్రత్యేకముగా వ్రాయవలసి యుండును. తెనుగువారికి సమరాశ్వముల లోపము చాలా గొప్పలోపము. గుర్రముల ప్రాముఖ్యమును విజయనగర రాజులు, రెడ్డి వెలమరాజులు బాగా గుర్తించి వాటి కెంత వ్యయమైనను భరించి తమ సైన్యమందు చేర్చిరి. కాని కొందరు తప్ప తక్కినవారు గుర్రపు సవారిలోను, దానిపై యుద్ధము చేయు నిపుణతలోను తురకలకన్న తక్కువ యైనవారే. హిందూరాజులు ఆశ్విక దళములో నెక్కువగా ముసల్మానులనే చేర్చవలసిన వారైరి.

సైన్యములో భటులకు కుస్తీలు, ఆయుధ ప్రయోగమును, సవారి మున్నగునవి బాగా నేర్పెడివారు. శ్రీకృష్ణదేవరాయలు మంచి సాములో సవారీలో ఆరితేరిన జెట్టీలలో మేటిజట్టి. ప్రతిదినము కుసుమ నూనెను చిన్న గిన్నెడు త్రాగి అదే నూనెతో అంగమర్దనము చేయించుకొని సాముచేసి, సవారిచేసి, కుస్తీలు పట్టెడివాడని పీస్ అను విదేశీ వ్రాసెను.[21]

ఆ కాలమందు స్త్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్దమై కుస్తీలు జేసిరి. క్రీ.శ. 1446 నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో కుస్తీచేసి వారిని చంపి పగదీర్చుకొనెను.[22] జనులకు సాముచేయుటలో ఆసక్తి యుండెను. జానకి త్రాటి తుపాకి ప్రయోగములోనికి వచ్చినను కత్తి యుద్ధమున కింకను ప్రాధాన్యముండెను. అందుచేత జనులు కుస్తీలు, కత్తిసాము, కట్టెసాము, సవారి మున్నగునవి నేర్చుకొనిరి. వాడవాడలలో సాము గరిడీలు (తాలీంఖానాలు, అఖాడాలు) ఉండెను. సాము సాలెలతో భూమిని లోతుగాత్రవ్వి మన్నుతీసివేసి అందిసుక సగమువరకు నింపి పై భాగమును ఎర్రమట్టితో నింపెడివారు, అట్టిరంగమందు సాము నేర్చుటకు కావలసిన గదలు (ముద్గరములు-వీటినే వర్ణ వ్యత్యయముతో ఉర్దూలో ముగ్దర్ అందురు.) సంగడములు (వీటి నుర్దూలో సింగ్ తోలా అనిరి. అవి మధ్య ఇరుసు, ఇరుప్రక్కల చిన్న రాతి చక్రములు కలవి.) ఉండెడివి. సాములోను, కుస్తీలోను బాగా గడితేరిన వారిని జెట్టీలనియు హొంతకారులనియు పిలిచిరి.[23] నేటికిని సాము గరిడీలలో పై యాచారవిధానములే వర్తిస్తున్నవి. వీరుల స్మారకార్థమై వీరగల్లులను స్థాపించిరి. అట్టివి నేటికిని చాలాపల్లెలలో కాన వస్తున్నవి.[24]

ఏదైనా యుద్యమము సాగించినపుడు జనులు శకునము జూచెడి వారు. అదేవిధముగా రాజులు యుద్ధమునకు బయలు దేర సంకల్పించి నప్పుడు తెల్లవారు కాలమున వీధులలోనో, నగరోపాంతమందో శకునముల గమనించెడివారు. దానిని ఉపశ్రుతి అనిరి. శ్రీ కృష్ణదేవరాయలు కటకము (ఓడ్రదేశము) పై దండయాత్రకు వెళ్ళుటకు ముందు ఉపశ్రుతిని విచారించు కొనిరి. ఆనాడు తెల్లవారుటకు ముందే ఒక చాకలి మైలబట్టలను బండపై ఉతుకు లుతుకుచూ అదే తాళముగా ఈవిధముగా పాడుకొంటూవుండెను.

          కొండవీడు మనదేరా ! కొండపల్లి మనదేరా !
          కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా !

వెంటనే అతడు సైన్యాలతో బయలుదేరెనట ! చాకలివానికి కూడా పర దేశాలన్నీ "మనవేరా" అనునంత రాజ్యాభిమానము ప్రశంసకు పాత్రము.

బిదరు పట్టణములో బరీదు సుల్తానుల కాలమునాటి కోటలు, రంగీన్ మహల్, చీనీమహల్ మున్నగునవి కలవు. రంగీన్ మహలును అలీబరీద్ అను సుల్తాను (1540-79) కట్టించెను. అచ్చట కోటలో లభించిన ఇనుపముండ్లను కొన్నింటిని ఆర్షశాఖవారు కూర్చి యితర యుద్ధపరికరాలతోపాటు నుంచినారు. ఇనుపముండ్లను ఉర్దూలో గోఖ్రూ అందురు. కన్నడములో లగన్‌ముళ్లు అందురు.

అవి రెండంగుళముల పొడువుండును. నాలుగు కొనలుండును భూమిపై వాటిని యెటు వేసినను సరే మూడు పాదాలపై నిలిచి నాల్గవపాదము పైకి లేచి యుండును.

అవి దబ్బనమంత మందముగ నుండును. వాటిని లక్షలకొలదిగా సిద్ధముచేసి శత్రువులు దాడిచేయువేళ కోటచుట్టును చల్లి నడిచెడివారు. శత్రువుల గజ తురగములుకాని, కాల్బలముకాని వేగముగా రాకుండుటకై రాత్రి కాని లేక పగలు చూచుకొనక కాని నడిచిన ఆ సూదులవంటి ముళ్ళు శత్రు సైన్యమునకు నష్టము కలిగించెడివి. ఇది అపూర్వపద్ధతి. ఇట్టివి మరెక్కడను చూడలేదు. మన వాఙ్మయమందును వాటి జాడలు లేవు. బహమనీ సుల్తానుల యుద్ధతంత్రములో నీ లగన్‌ముళ్ళు కూడా చేరియుండెను.

విజయనగర రాజులకాలమందుండిన చింతలపూడి యెల్లనార్యుడు తారక బ్రహ్మ రాజీయములో అచ్యుత దేవరాయలను కీర్తించినాడు. అచ్యుతునివద్ద నంజ తిమ్మయ యనునతడు "గ్రంథాసార లేఖకుడై" మంత్రియై యుండెనన్నాడు.

           "ఆ రాయల కృప గ్రంథా
            సారము వ్రాయుచును కీర్తి సంపాదించున్
            ధీరగుణాడ్యుడు, కందా
            సారము నంజరుసు తిమ్మ సచివుడు సిరలున్"

కందాసారము లేక గ్రంథాసారము అన మిలిటరీ లెక్కలు అని పీఠీకా కారులగు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు వ్రాసినారు. ఇది స్కంధావారము నుండి ఏర్పడియుండునన్నారు. సైన్య సంబంధమగు లెక్కలు వ్రాయుట గొప్ప పదవిగా భావింపబడు చుండెను.

నాణెములు

విజయనగరరాజ్యములో చాళుక్య కాకతీయ నాణకపద్ధతి కొన్ని మార్పులతో ప్రచారమందుండెను. వెండి, బంగారు, రాగి నాణెములు వ్యాప్తిలో నుండెను. రాజులేకాక సామంతులును నాణెములను ముద్రించు సెలవును పొంది యుండిరి. కల్తీ వెండి బంగారు నాణెములను గుర్తించుటకు కమసాలులు నియుక్తులై యుండిరి. కవుల రచనలలో ఈక్రిందివి పేర్కొనబడినవి.

మినుకు, [25]కాసు, [26]మాడలు, [27]వీసము, [28]అప్పటి నాణెములలో వరహా అన్నింటికన్న పెద్దది. కాకతీయులకు వరాహము, , దాని ముందు ఖడ్గము రాజచిహ్నముగా నుండెను. దానినే విజయనగర చక్రవర్తులు స్వీకరించిరి. వరాహ చిహ్నములతో ముద్రించిన బంగారు నాణెములను వరహాలు అనిరి. వాటిని టంకసాలవాటు లనియు వ్యవహరించిరి.[29]

             చిన్నము, తారము అనునవి వెండినాణెములు.

        "శిబికొని పోడొక్క చిన్నమైన న్యాయార్జితము తారమైన లెస్స"[30]

దొంగనాణెములను పరీక్షించుటకై కమసాలులేకాక బచ్చులుకూడ ఏర్పాటై యుండిరి.[31] ప్రజలు కోమట్లవద్ద తమ ధనమును వడ్డీ కిచ్చి దాచుకొనిరి. అనగా కోమట్లే ఆకాలపు బెంకులు. పలుమారు వడ్డీలెక్కలవద్ద తగవు లేర్పడి అల్లరులుచేసి తుదకు రచ్చచావిడికి వెళ్ళి ఇచ్చి పుచ్చుకొన్న వారు తమ తగవుల పరిష్కరించుకొంటూ వుండిరి.

        "ఇట్లొనగూర్చి వైశ్యునకు నిచ్చి, చనన్ మరి పుచ్చి చౌకముల్
         వెట్టుచు, వడ్డీలెక్కలటు వెట్టుచు ధారణవాసికై కొదల్
         వెట్టుచు, వాడు రేగి మరి పెట్టుదు పెట్టుననంగ, మిట్ట గూ
         పెట్టుచూ నిట్టు పోర గనిపెట్టుచు నొక్కరు డుండి వెండియున్."[32]

(ధారణ అను పదమును హిందీలో దారణ్ అందురు. అనగా ధర. ధారణ వాసియన, ధరలో ఎచ్చుతచ్చులు లేక ధాన్యమునకు పైక ముదర. మరియు పైకానికి ధాన్యం ధర కట్టుట. మిట్ట అన రచ్చ కట్ట పంచాయతిని గురించి ముందు వ్రాయదుము.)

పరాశరమాధవీయములో హరహరరాయలు పన్నులను నాణెములలో చెల్లింపవలెనని యాజ్ఞ యిచ్చినట్లు తెలియవస్తున్నది. అనగా అంతకు ముందు జనులు పన్నును ధాన్యరూపముగా కూడా చెల్లించి రన్నమాట. నాణెము లన్నింటిపై వరాహ లాంఛనమే యుండెనని తలపరాదు. రాజులు తమ చిత్తము వచ్చినట్లుగా లాంఛనముల మార్చిరి. విజయనగర నాణెములపై హనుమంతుడు, గరుడుడు, ఎద్దు, ఏనుగు, ఉమామహేశ్వరుడు, వేంకటేశుడు, బాలకృష్ణుడు, దుర్గ, లక్ష్మీనారాయణులు, రాముడు, శంఖ చక్రాలు లాంఛనాలుగా ముద్రింపబడెను.

నాణెములను గుంజల లెక్కప్రకారము ముద్రించిరి.

ఈక్రింద నాణెములు ముఖ్యమై నట్టివి.

బంగారువి:- గద్యాణము (వరహాలు), ప్రతాపలు (వీటినే మాడలు అనిరి.). పణము, కాట, హాగ.

వెండివి:- తారము, చిన్నము.

రాగివి:- పణము, జీతల్, కాసు మున్నగునవి.

రెండవ దేవరాయల నాణెములను గురించి అబ్దుర్రజాఖ్ అను ఈరానీ రాయబారి క్రీ.శ. 1443 లో ఈ విధముగా వ్రాసెను.

            నాలుగు కాటీలు ఒక వరహా.
            వరహాలో సగము ప్రతాపము.
            ప్రతాపలో పదవభాగము పణము.
            పణములో ఆరవభాగము తారము.
            తారములో మూడవభాగము నాణెములు.

         "సాధారణముగా వరహా 52 గుంజల ఎత్తుండెను."

"కన్నడములో ప్రతాపము అన్న నాణెమును తెనుగు మాడ అన్నట్లున్నది. అది రెండు రూపాయల లోపలి విలువకలది. చిన్నమను నాణెము వరహాలో ఎనిమిదవ భాగము అనగా ఏడణాల విలువది."

"హాగ అను కన్నడ నాణెమునే కాకిణీ అనిరి. అది పణములోని నాల్గవభాగము.

"తిరుమలరాయలు రామటంకలు అను నాణెములను జారీచేసెను.[33] శ్రీనాథుడు దేవరాయల ఆస్థానమందేకదా దీనారటంకాల అభిషేకమును పొందినది! నాణెముల నిపుణు లెవ్వరును దీనారములనుగాని, టంక ములనుగాని పేర్కొనలేదు."

పై నాణెము లన్నింటిలో మాడలే తెనుగుదేశమం దెక్కువగా వ్యాప్తిలో నుండినని సారస్వతమందలి వర్ణనలనుబట్టి ఊహింపవచ్చును. జనులు మాడలను బిందెలలో నింపి ఇండ్లలో, దొడ్లలో, చేలలో గుర్తుగా దాచుకొంటూవుండిరి. తరాలుగా దాచిన జాడలు వృద్ధులు తమవారికి తెలుపకముందే చచ్చుటయు, దానికై వాని సంతతి వారు వెదకుటయు సంభవించెడిది. ధనాంజనము వేసి ధన మెక్కడున్నదో కనిపెట్టే మంత్ర తంత్రవేత్తలు బయలుదేరిరి. పలుమారు దాచిన ద్రవ్యము పరులకు హఠాత్తుగా దొరుకుతూ వుండెను. ద్రవ్యమును భూమిలో పూడ్చి దాచుకొను నాచారము నేటికికూడ మన పల్లెలలోని కొందరిలో కానవస్తున్నది. వరశుల్క కన్యాశుల్కములు మాళ్ళలోను, వరహాలలోను ఇస్తూ వుండిరి. వివాహాలలో బంధుమిత్రులు వరహాలను "చదివిస్తూ" వుండిరి. ఈనాడు జనులు రూపాయలు చదివించినను "అముకవ్యక్తి చదివించిన ఇన్ని వరహాలు" అని పురోహితుడు అందరు వినగా చదువుతూనే ఉంటాడు. విజయనగర టంకముద్ర అంతటి బలిష్ట మయినది.

నాణెములు మన ప్రాచీనుల చరిత్ర నిర్మాణమునకు చాలా సహాయపడును. పైగా ఆకాలపు లోహముల విలువను, టంకసాల పద్ధతులను, నాణెముల విలువలను ఆర్థిక వ్యవస్థను తెలుపునట్టివి. పాశ్చాత్యులు ప్రాచీన నాణెములకు విలువ నిత్తురు. వాటిని ప్రయత్న పూర్వకముగా సంపాదించి సేకరించి యుంతురు. కాని మనము పూర్వనాణెములు దొరకిన అవి చెల్లవని వాటిని కరగించి యుపయోగించుకొందుము. మన చారిత్రక పరిశోధకులందరు ప్రత్యేకముగా నాణెముల పరీక్షను బాగా చేసినవారరుదై యున్నారు. తెనుగుదేశములో చాళుక్య, కాకతీయ, రెడ్డిరాజ్య విజయనగర సామ్రాజ్య కాలములలోను, గోలకొండ రాజ్యములోను నుండిన నాణెములను సచిత్రముగా, సమగ్రముగా, ప్రత్యేకముగా బయలుదేరిరి. యవసరము.

వ్యాపారము

కాకతీయుల కాలములోకన్న రెడ్డిరాజుల కాలములో దేశీ విదేశీ వ్యాపారము వృద్ధిపొందియుండెను. విజయనగర రాజుల కాలములో వ్యాపారము మరింత వృద్ధి నొందెను. హిందూస్థానమందు పాడి కామ ధేనువులు, ధన కల్ప వృక్షములు (Pagoda Trees) కలవని యూరోపు ఖండములో మూలమూల లందు మార్ర్మోగి పోయెను. హిందూస్థానమునకు బోయి "పగోడా చెట్లను" ఉర్రూతలూపి రాలిన ధనరాసులను ఓడలలో నింపుకొని పోదమని అచ్చటి సాహసికులు నాహుకారులు, మేలయిన తుపాకుల మెడలపై వేసుకొని ఓడలలో బయలుదేరిరి. అయితే వారికి హిందూస్థానమున కెట్లుపోవలెనో సముద్రముపై దారి తెలియకుండెను. స్పెయిన్, పోర్చుగల్ దేశాలవారు ఒకరికంటే ఒకరు ముందుగా ప్రయాణము కట్టిరి. స్పెయిన్ వారు సముద్రముపై కొలంబస్ నాయకత్వములో పోయిపోయి తుదకు అమెరికా ఖండ తీరమందలి దీవులను చేరిరి. అదే హిందూస్థాన మనుకొనిరి. కాని తరువాత పొరపాటును గుర్తెరిగి ఆదీవుల జనులకు మొదటిపే రేముండెనోకాని వారుమాత్రము ఎర్ర ఇండియనులు అను నూతన నామ మిచ్చిరి. పోర్చుగల్ వారు వాస్కోడగామా అనువాని నాయకత్వములో ఆఫ్రికా ఖండమును చుట్టుకొని తుదకు హిందూస్థాన పశ్చిమతీరమందు చేరిరి. వారు శ్రీకృష్ణదేవరాయల కాలములోపలనే మన దేశమందు ప్రత్యక్షమై విజయనగర సామ్రాజ్యములో వ్యాపారము చేసిరి.

అరబ్బు దేశము ఎడారి భాగము. అందుచేత అరబ్బులు జీవించదలచిన వ్యాపారముచేతనే జీవించవలసి యుండెను. వారు బహు ప్రాచీనమునుండి హిందూస్థానముతో వ్యాపారము చేసిరి. అత్యంత సన్నిహితవందుండిన ఈరా (లేక పారసీక) దేశము హిందూస్థానముతోనే యెక్కువ వ్యాపారము చేసెనున్ హురుముజ్ జలసంధిలోని రేవుల నుండి ఓడలు వచ్చి పోయెను(Gulf of Hurmuz). అక్కడి ముత్యాలు చాలా శ్రేష్ఠమైనవై యుండెను. అందుచేత వాటిని హురు ముంజి ముత్యాలనిరి.

తూర్పున నుండి బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా దేశాలతో వ్యాపారము జరిగెను. విజయనగర సామ్రాజ్యము తూర్పున కటకము నుండి రామేశ్వరము వరకును, పడమట గోవానుండీ కన్యాకుమారి వరకును వ్యాపించి యుండెను. పడమట గోవాలో కాలికట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను.

"కాలికట్టువంటి మంచి రేవులు సామ్రాజ్యమందు 300 వర కుండెను" అని అబ్దుర్రజాఖ్ వ్రాసెను. "రత్నాలు, ముత్యాలు, ఆభరణాలు, గుర్రాలు, ఏనుగులు, పట్టు, నూలుబట్టలు, సుగంధ ద్రవ్యములు, ఓషధులు, ఇనుము, వెండి, విశేషముగా వ్యాపార వస్తువులై యుండెను. వ్యాపారములో సంపూర్ణ న్యాయము ప్రసాదింపబడుచుండెను. అందుచేత పోర్చుగీసువారును, అరబ్బులును ఎక్కువగా వచ్చిరి."[34] అని బార్బోసా వ్రాసెను,

వ్యాపారమును గూర్చి శ్రీకృష్ణదేవరాయలే తన ఆముక్తమాల్యదలో నిట్లు వ్రాసెను.

         "రేవుల్మావు మతంగజంబును మణి శ్రీఖండ ముక్తాదియున్
          రా, వాణిజ్యము పెంచి యేలగ నగున్ వర్షంపుటెవ్వన్ రుజన్
          హాళ్ళన్ దిగు నన్యభూప్రజల రా జాయాయి జాత్యౌచితిన్
          బ్రోవంగాదగు, తోటదొడ్డిగను లాపుల్ సూడ బంపందగున్"[35]

పరదేశములనుండి గుర్రములు, ఏనుగులు, రత్నాలు, చందనము, ముత్తెములు, రేవులద్వారా వచ్చెననియు, వాటిని తెచ్చు విదేశీ వ్యాపారులకు సౌకర్యములు కూర్చిరనియు, క్షామాద్యుపద్రవముల వలన పరదేశి జనులు వచ్చిన వారి నాదరించిరనియు పై పద్యము సూచించినది.

           సింధురమహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
           దీని వణిజులకూళ్ళు సద్గృహములు పురి
           గొలుపుదేజంబు వెల మేలుగలుగ ప్రాత
           వారిగా జేయు నరి నవి చేరకుండ.[36]

దూరదేశపు దీవులనుండి, దేశాలనుండి వర్తకులు ఏనుగులు, పెద్ద గుర్రాలు తెత్తెరు. వారికి మంచి యాదరణ గావించి, వారి విడిదికి మేలైన యిండ్లిచ్చి, గ్రామాలిచ్చి, రాజదర్శనమిచ్చి, మంచి మర్యాదలిచ్చి యాదరించవలెను. లేకున్న వారు ఏనుగులను గుర్రాలను శత్రురాజులకు ముట్టజెప్పుదురని పై పద్య భావము.

శ్రీకృష్ణదేవరాయ లక్షరాలా యీ నీతిని పాటించెను. ఈరానీ రాయబారి తనకు దర్బారులో ప్రత్యేక గౌరవమిచ్చి వీధులలో ఎదురైన తన యేనుగు నాసి కుశలాదులను విచారించి చాలా ప్రేమతో ఆదరించెనని వ్రాసుకొనెను.

పాండ్య దేశమందలి తామ్రపర్ణీ నదిలో పెద్దజాతి ముత్యములు పూర్వము లభించెను. ఆముక్తమాల్యదలో,

"తామ్రపర్ణి గలుగు అల ముట్టరాని ముక్తామణీకులంబు" అని వ్రాసినారు.[37]

"మౌక్తికవ్రాతములై వెలుంగు తామ్రపర్ణీ తటమట్లు" అని అల్లసాని కూడా వ్రాసెను.[38]

తూర్పున పెగూనుండి, మలకానుండి ఎర్రసముద్రానికి వెళ్ళు ఓడలు కాలికట్టురేవులో ఆగి, సరకులను కొనిపోయెడివి. ఆనాడు వర్తకమంతయు ముసల్మానులదే. అందెక్కువగా అరబ్బులే చేసిరి. వారు ఆఫ్రికాకు తూర్పుననుండు మడగాస్కరు దీవినుండి ఇండియాకు తూర్పున నుండు మలాకావరకు రేవులలో నిలిచి వ్యాపారాలు చేసిరి. సీజర్ ప్రెడరిక్ అనువాడిట్లు వ్రాసెను. "గోవా రేవుద్వారా విజయనగరానికి అరేబియా గుర్రాలు వెల్వెట్ బట్టలు, డెమాస్కస్ వస్త్రాలు, పోర్చుగల్ నుండి అర్మోసిన్ (Armosine) అనునది దిగుమతి యవుతుండెను. ఒక గుర్రానికి కావలసిన వస్తువు లేయేదేశములందు సిద్ధ మయ్యెడివో యీక్రింది పద్యము తెలుపుతున్నది.

          "పచ్చని హురుమంజి పనివాగె పక్కెర
               పారసి పల్లంబు పట్టమయము
           రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి
               తళుకుల కోరుల తరకసంబు
           మిహి పసిండి పరంజు మొహదా కెలం
               కులు ఠావు గుబ్బరిసేత కేవడంబు
           డాకెలంకున సిరాజీ కడి చురకత్తి
               కురగట క్రొవ్వాడి గొరకు పొరిది."
                                                  (మను. 4 - 28.)

పైఠాణము=పైఠన్ (ప్రతిష్ఠానము-ఔరంగాబాదు జిల్లాలోనిది). సిరాజీ=ఈరానులోని షీరజ్ పట్నము. పట్టుబట్టలు సూరతు రేవుద్వారా కూడా దిగుమతి యయ్యెను. కంచినుండి తెనుగు దేశానికి మంచి నేత నూలుబట్టలు వచ్చెను. శ్రీవైష్ణవులు "పదియారు మూర డంబరపుటంచు కమ్మడాల్ కంచి దోవతి చెల్వు మించు లెసగ" కట్టుకొనుచుండిరి. (కృష్ణరాయ విజయము, 2-2) ధనికులు "పసిండి వ్రాతల దంతపు< బెట్టెలలో" ఆభరణములుంచు కొనిరి. (రాదామాదవము, 4-172)

"విజయనగర సామ్రాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి యయ్యెను. తమిళ దేశపు రేవగు పులికాటునుండి మలాకా, పెగూ, సుమత్రా దేశాలకు రంగు అంచులు ముద్రలు కల (కలంకారి) వస్త్రముల నెగుమతి చేసిరి. బియ్యము బస్రూరు, బారకూరు, మంగళూరు నుండి మలబారుకు, మాల్డీవులకు, హుర్మజుకు, ఏడెన్‌కు ఎగుమతి యయ్యెను. భట్కల్ నుండి చక్కెర, ఇనుము ఎగుమతి యయ్యెను."

"గుర్రాలు, ఏనుగులు, ముత్యాలు, రాగి, ముత్తెపు చిప్పలు, పాదరసము, కుంకుమ, చీనాపట్టు, ముఖ్మల్ సామ్రాజ్యములోనికి దిగుమతి యయ్యెను. ఏను గులు సింహళమునుండి, ముఖ్మల్ మక్కానుండి దిగుమతి యయ్యెను."[39] (మక్కా నుండి వచ్చిన మల్లు అగుటచే కాబోలు మఖమల్లు అని పేరు వచ్చెనో యేమో?), మన వాఙ్మయములో పల్నాటి వీర చరిత్రలోను, ఇతర పద్యకావ్యాలలోను మఖమల్ ముచ్చట కలదు.

ముస్లిముల తర్వాత వ్యాపారము విరివిగా చేసినవారు కోమటి సెట్లు, మలబారీలు. అయితే వీరు విదేశాలతో వ్యాపారము చేసినది తక్కువే. సామ్రాజ్యమం దొక ప్రాంతమునుండి మరొక ప్రాంతానికి సరుకులు మార్చినవారే. కోమటిసెట్లలో అరవ నాటుకోటచెట్లే యెక్కువ వ్యాపారము చేసినారు.

దేశమందు బాటల నిర్మాణము చాలా తక్కువ. అందుచేత బండ్లపై వ్యాపారము చేయుట కనుకూలముగా లేకుండెను. వ్యాపారస్థులు ఎద్దులపై కూలీల కావళ్ళపై, గుర్రపు తట్టువులపై, గాడిదలపై కంచర గాడిదలపై సరుకులను తీసికొనిపోతుండిరి. ఈవిషయమును మన సారస్వతమందు పలుతావులలో తెలిపినదేకాక ఆగంతుక వైదేశికులగు పీస్, బార్బోసా పభృతులు తాము చూచినట్లు తెలిపినారు. బాటలు లేక అడవులెక్కువగా నుండినప్పుడు దొంగలు కూడా ఎక్కువగానే యుండిరి. పరకాలుడను వైష్ణవభక్తుడు వైష్ణవకైంకర్యమునకై బాటలు కాచి, వ్యాపారులదోచి, రేవులను కొల్లగొట్టి ధనములాగుటను ద్విపద పరమ యోగివిలాసమం దతివిపులముగా వర్ణించినారు. (చూడుడు. 6వ, 7వ ఆశ్వాసాలు) దొంగలభయానికి వ్యాపారులు గుంపులుగాపోయిరి. "విజయ నగరము నుండి భట్కల్‌కు అయిదారువేల యెద్దుల మోతల సరుకులు తీసికొని పోవుచుండిరి 20 లేక 30 పశువుల కొకమనిషి వంతున నుండెను" అని పీస్ వ్రాసెను.[40]

ఆ కాలపుదరల సమకాలికులు కొందరు వ్రాసియుంచినారు దానిని చూచిన ఆనాడన్నియు చాలా చౌకగా లభించెడివని తెలియరాగలదు. పీస్ ఇట్లు వ్రాసియుంచెను.

"విజయనగరమందు సకలవస్తువులు లభించినట్లు ప్రపంచములో మరెందును లభించవు. బియ్యము, గోధుమలు, పప్పుధాన్యాలు, జొన్నలు, చిక్కుళ్ళు, ఇతరధాన్యాలు సమృద్ధిగా నున్నవి. ఇవి చాలా చౌకగా లభించును. ఒకటిన్నర అణాకు మూడుకోళ్లు నగరములోను, నాలుగు పల్లెలలోను లభించును. ఒకటిన్నర అణాకు 12 లేక 14 పావురాలు దొరకును. ఒక పణము (8 అణాలు) ఇచ్చిన పచ్చి ద్రాక్ష మూడుగుత్తు లిత్తురు. ఒక పణమునకు పది దానిమ్మపండ్లు దొరకును. ఒక వరహాకు నగరములో 12 మేకలు, గ్రామములో 15 మేకలు దొరకును. ఒక భటుడు తన గుర్రమును ఒక దాసిని నెలకు నాలుగైదు వరహాలలో భరించగలడు." (అనగా 20 లేక 25 రూపాయలు.)

మిరియాలకు సుంకము తీసుకొనెడివారు. ఆ కాలములో మిరియాలకు చాలా (రవానా) గిరాకి (గ్రాహకము) ఉండెను. మిరపకాయ లింకను దక్షిణ అమెరికానుండి మన దేశములో ప్రవేశపెట్టి యుండలేదు. మిరపకాయ లను పదము మిరియము అను శబ్దమునుండి మిరియపు కాయ అని యేర్పడినది. అది క్రీ.శ. 1600 తర్వాతనే మనదేశమందు నెగడెను. అంతకు పూర్వము కారానికి మిరియాలే వాడిరి. మిరియాలు మళయాళ దేశమందు సమృద్ధిగా పండును. తూర్పు దీవులందును అవి సమృద్ధి. వ్యాపారులు వాటి నక్కడినుండి తెప్పించి తెనుగు దేశమందమ్మిరి. వాటివలన వచ్చు సుంకము వలన ప్రభుత్వానికి గొప్ప ఆదాయ ముండును.

"ఒకవైశ్యు డుత్తముడు మిర్యముల పెరికలు త్రోవగా పెక్కు గొంపోవ గని యవి యేటి వెక్కడి కేగుచున్న వనుచు చౌరంగి తన్నడిగిన వాడు సుంకరి యను భీతి స్రుక్కి నేర్పునను బొంకి తప్పించుక పోద మటంచు నవి జొన్నలనుటయు నట్లుగా నాత్మ దనిలి తలంప చిత్రముగా నా పెరిక లందలి మిరియంబు లవి జొన్నలయ్యె."

-నవనాథ. పుట 99.

ఆ కాలములో జొన్నలకు సుంకము లేకుండెనని పై పంక్తులను బట్టి యూహింప వచ్చును.

కోమట్లు వ్యాపారపు మరుగుమాటల నాడుదురు. మద్రాసులో బేరగాండ్లిరువురు చేతులుకలిపి పైన సెల్లా కప్పి ఒకరి అరచేతిలో ఒకరు ధర వ్రాసి తెలుపుకొందురు. పూర్వము కూడా "కోమటిబాస" యుండెను

         "తక్కటి సెట్లు నాతలి బిలిపింప
          జేరి కోమటి బాస జెప్పె" పట్టింపు
          భూరాము సల్లెడు భూరాము లొండె
          మరికెంబు బోడ దమ్మని నొండెనతని
          దరిమి గాలము త్రాటదమ్ముల నొండె
          మలుచంపు బుడుగుల మాసల్లె డొండె
          మలయక కాలము మాసల్లెడైన
          వెలకుల నొండేను వెస చెర్వులోన
          దిలకింత మనుచు చింతింపుచున్నాడు."
____నవనాథ, పు. 276,

        ఈ బాస కర్థము చేసుకొన ప్రయత్నించుట పనిలేనిపని.

క్రీ.శ. 1336 లో హరిహరరాయలు పన్ను చెల్లించువారు 1 రుపాయకు 34 సేర్ల ధాన్యమిచ్చునట్లు నిర్ణయించెను. దీన్ని బట్టి ధాన్య మెంత చౌకగా నుండెనో తెలియగలదు.

ధాన్యం తూకములు, సోల[41] తూము[42], ఇరుస, మానికె మొదలగు మానములలో జరుగుతూ వుండెను.

     ఓడ రేవులలోని బేరమును గూర్చి యిట్లు వ్రాసిరి.

         "అటకు మిక్కిలి చేరు దగు పయోరాశి
              తట సమీపమున నిత్యంబు నోడలును
          పచ్చ కప్పురమును పట్టుబట్టలును పచ్చి
              కస్తురి మేల్మి పసిడి యిట్టికెలు
          మణులు చంద్రాననామణులు పటీర
              కణములు మొదలుగాగల వస్తువులును
          నిరవొంద నెన్నిక కెక్కు బేహరులు
              హరుల రంతుల తోరహత్తుగా దెచ్చి

          అనించి బేహారమాడగ నటకు వానికై
             చను దెంచు వారల వాని
          బూని బేహార మాడి పోవువారలును"[43]

ఆ కాలమందు దిగుమతులగు వస్తువులను సమకాలికులు తెలిపిన వన్నియు ఇందు కలవు. పైగా చంద్రాననా మణుల (అందగత్తెల) వ్యాపారము కూడ జరిగెను. ఈబేరము రెడ్డిరాజ్యకాలములోను జరిగినటులు ఆ కాలపువారు తెలిపినారు. పరదేశముల సెట్లవేష మెట్టిదనగా:-

         "పరదేశముల సెట్లపగిది దిండుగను పెల్లుచుట్టిన పెద పెద ముడాసు
          లును డొల్లుబొంగులును నీటుగ పొందుపరచి పొదిగల్గు అసిమల భుజ
          ములం బూని వదలుగారింటెముల్ వలెవాటువైచి."[44]

ఇందు డొల్లుబొంగులు తప్పు. డొల్లుపోగులు అని యుండవలెను. అనగా ఊగునట్టి పోగులని యర్థము. (ముడాసు పదము నిఘంటువులలో లేదు) "ముడాసుపై లపేటాడబ్బు" అని శుకసప్తతిలో వర్ణించుటచే ముడాసు అన టోపి అని యర్థము. ముడాసు కన్నడ పదము. కోణాకారముగల చక్కని బట్ట, టోపిపైలపేటా-షమ్లా-రుమాల కట్టుట నేటికిని ముసల్మానులలో ఆచారమైనది. అసిమి, అసివి, అశ్విసంచులు మూరెడు వెడల్పు గజముపొడవు కలిగి నిలువు మధ్య దుందు జేనెడు పంమగలిగి కుట్టిన గోనెసంచి, ఆ సంచిలో రెండుమూలలో వస్తువులనుంచి వీపున ఒక మూల ఎదపై ఒక మూల పడునట్లుగా భుజముపై వేసుకొందురు. ఎద్దుపై లేక అశ్వముపై ఎక్కినప్పుడు దానిని గంతవలె వేసుకొని పోదురు. గుర్రాలపై నెత్తుధాన్యాదుల సంచులగుటచే అసిమి లేక అసివి సంచులని వాటికా పేరు వచ్చియుండును. ఇవి నేటికిని పల్లెలలో కోమట్లవద్ద అందందు కాన నగును అసిమిని మాత్రసంచి యనియు అనిరి. ప్రయాణములో అది తలగడగా పని యిచ్చెడిది.[45] రింటెములు అనునది సరికాదు. రెంటములు అనునది సరి. (రెండుపోరువల దుప్పటియని యర్థము.) వైదేశిక బేహారులు చేసిన దేశ దేశ వ్యాపార మెట్టిదనగా:-

        "కొంకక జీవి పైగో వరకంగు లంక యయోధ్య మలాక యీడాము
         మొదలైన దీవుల మునుకొని వచి"[46]

ఇందు మొదటిపంక్తి అంతయు తప్పుగా కనబడును. చీని, పెగూ, అరకాన్ అను దేశాల అ పేరులని తెలియక లేఖకులు అడ్డాదిడ్డముగా వ్రాసినట్లున్నది. లంక అనునది సింహళము. మలాక మలయాలోనిది. ఈడాము అనగా అరేబియా రేవు పట్టణమగు ఏడెన్ అయి యుండును.

విజయనగరములో కొందరు 5 లక్షల జనులుండిరనియు, అంతకంటే చాలా యెక్కువగా నుండిరని మరికొందరును తెలిపినారు. అట్టి నగరములో వ్యాపారము చాలా విరివిగా నుండెను. వ్యాపారులు కందులవలె రత్నాలరాసులు పోసి అమ్ము చుండిరని ఆకాలపువారు వ్రాసిరి. నగరవాసుల వైభవములు అనంతముగా నుండెను. అట్టివాటికై విలాస వస్తువులు సమృద్ధిగా అమ్ముతూ వుండిరి.

పరిశ్రమలు

ఇదే సందర్బములో జనుల యవసరాలకై యే యే వస్తువులు సిద్ధమయ్యెనొ తెలుసుకొందుము. సాధారణముగా శూద్రులలో బహుజనులు రాటములపై నూలు వడులుచుండిరి. దానిని నేయువారు సాలెవారు. వారిలో బహుశాఖలుండెను. సాలె, పద్మసాలె, అగసాలె పటుసాలె మున్నగు వారుండిరి. "అవ్వీటి మేటిసాలె, అగసాలె, పటుసాలె, వానె, వైజాతి, సాతులు, ఏతుల కొమరులు"[47] అనువారుండిరి. పటుసాలె లన పట్టువస్త్రములను నేయువారు, వానె అన ఒకజాతి కోమటు లని యర్థము వ్రాసినారు. వణిక్ అను దానినుండి యేర్పడినదేమో? వైజాతియన వైశ్యజాతి యని రెడ్డిరాజ్యకాల చర్చలో తెలిపినాము. సాతులన గోనెలు నేయు పెంకెవారు. ఏతుల అన చాప లల్లెడువారు. ఈపదము ఏతులు అనియో, ఏతుల యనియో సరిగా తెలియదు.

విజయనగరములో కొల్లలుగా గులాబీపూల నమ్ముచుండిరి. జనులకు సుగంధాలపై చాలా వేడుక. కస్తూరి, కుంకుమపూవు నలుగులో నూరి వాడిరి. "చెవుల సంకులు, కొంకిసిగలు, కావిదుప్పటులు నొప్ప, గంధకలనా కుసుమ వ్రక్ గ్రథనాదుల సాంధ్యంబు లేకలరు ఆంధ్రదేశీయులగు గంధకారులు"[48]

అనుటచే ఆంధ్రదేశమందే పూలదండలు కట్టి, సువాసన వస్తువుల సిద్ధముచేసి, బుక్కాపిండిని (పిష్టాతకము) చేసి అమ్మి జీఎంచువారుండి రనుట స్పష్టము. కొల్లలుగా బోగముసానుల యిండ్లు గల విజయనగరములో గంధ కారుల కొదువయుండునా? ఆ బుక్కావారు "పన్నీరునించిన తన్నీరు తిత్తులొత్తిరి." వారు తన్నీరు (తుపు+నీరు=చల్లని) పన్నీరును కూడా సిద్ధముచేసి తోలుతిత్తులలో పోసి యమ్మెడివారు.

తెనుగుసీమ ప్రాచీనమునుండి వజ్రాల గనులకు ప్రసిద్ధి నొందినట్టిది. గుత్తికి 20 మైళ్ళ దూరమునున్న వజ్రకరూరు ఇంగ్లీషువారు దేశాన్ని గెలిచిన కాలమందు కూడ వజ్రాలకు ప్రసిద్ధి గన్నట్టిది. గుత్తి దుర్గాధీశు డచ్చటి వజ్రాలను చక్రవర్తుల కంపుతూ వుండెను.[49] ఇట్టి గనులు మరిమూడు నాలుగుండెనని ఆ కాలపు యాత్రికులు వ్రాసినారు.

కంసలి, కమ్మరి, కంచరి, కాసె, వడ్లవారి వృత్తులు నిండుగా ఉండెను. వీరిని పంచాణమువారు (శిల్పులు) అని పేర్కొనిరి. నేటికిని పల్లెలలో పంచాణ పదమును "పాంచాలి" యని యుచ్చరించి వడ్ల, కమ్మరి, కంసలివారలను పాంచాలివారని యందురు. వడ్లవారిని, కంసాలివారిని పంచాణము వారనుటకు

        "సారెకు నచటి పంచాణంబువారి జేరి ..... ..... ..... ......
         గుడిసొచ్చి చోరులు కొంపోయిరకట యనుచు కంసాలివా రనిశంబు
         వినగ అనుచుండు"[50] అనుట ప్రమాణము.

సాధారణ కాలమందు 10 లక్షల సైన్యము కలిగి అవసరమైనప్పుడు 20 లక్షల సైనికుల వరకు కూర్చగలిగిన సామ్రాజ్యములో కమ్మరివారికి పని తక్కువగా నుండునా? వారు వివిధాయుధములను చేయుటలో నారితేరినవారు. మహారాజులు, సామంతులు దేవాలయములను, సత్రములను, భవనములను, కోటలను నిర్మించినందున కాసె వారికి పని తక్కువకాకుండా యుండెను.

వస్త్రములకు దేశిరంగులు వేయువారుండిరి. వారు ప్రధానముగా నీలిరంగును వాడిరి. మంజిష్ఠ, ఇంగిలీకము, కరక్కాయ, మున్నగునవి వాడిరి. "ఇంగిలీకంబునన్ తడిపి యెత్తు కసీసపు రెంటములు" జనులు వాడిరి. (చూ.అము. 4-10.)

ప్రజాజీవన విధానము

విజయనగర సామ్రాజ్యమం దాంధ్రులది పై చేయిగా నుండినది. ఆంధ్రదేశము మహావైభవముతోను. ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధ్రు లుత్సాహవంతులై కళాపోషకులై దేశాంతరములందును ప్రఖ్యాతి గాంచిరి. అది మంచి చెడ్డలతో నిండిన ప్రబంధ యుగము. సుందర నిర్మాణములు, చిత్రలేఖనములు, ఇతర శిల్పములు దేశమంతటను సువ్యక్తము లయ్యెను. ధనికుల భోగలాలసత ఇదే కాలమందు విజృంభించెను. విద్యానగరము హృద్యనగర మయ్యెను. అందులోనే బావిపతన సూచన లిమిడి యుండెను. జనుల యిండ్లు, వారి యుడుపులు, వారి వేషములు, అలంకరణములు ఆచారవ్యవహారములు మనకు బాగుగా తెలియ వచ్చినవి. మొదట రాజులయొక్కయు, రాచవారి యొక్కయు జీవన విధానములను గురించి తెలుసుకొందము. వారికి అలంకరణములందు అభిమానము మెండుగా నుండెను.

          "పన్నీటితో గదంబము సేసి పూసిన
              మృగనాభివస రాచనగరు దెలుప
           పాటలానిలము లార్పగ దపారపుజుంగు
              లలరు దానికి మూగు నళులజోస
           కర్ణడోలామౌక్తికచ్ఛాయ లెగబ్రాకు
              నురుహారరుచుల ద్రస్తరికి దన్న
           శశికాంతి చెంగావి దశ మలచిన కేల
              స్వర్ణత్సరుపు వాడివాలు మెరయ

          మెలతయడపముదే, జరన్మేరు వనగ
          తలవరులు గొంద రొలసి ముంగల జనంగ
          అర్థి రధ్యాంత:పురాంతరమున
          భోగినీసంగతికి రాజు పోవుచుండి."[51]

రాజులు పన్నీటితో కలిపిన కస్తూరిని పూసుకొనుచుండిరి. పొడవైన కుచ్చుటోపీలు పెట్టుకొనుచుండిరి. చెవులలో ముత్యాల పెద్ద పోగులును, కంఠ మందు ముత్యాల హారమును ధరించు ఎర్రని అంచుగల తెల్లనివస్త్రాలు ధరించిరి. బంగారు పిడిగల కత్తిని చేతబట్టిరి. పరిచారిక (ఆడపాప!) తాంబూలకరండమును (పాన్‌దాన్) పట్టుకొని వెంట నుండెడిది. ముందర తలారులు నడిచిరి. ఇవన్నియు బోగముదాని యింటికి వెళ్ళునప్పటి సంరంభము.

రాచనగళ్ళలో నెమళ్ళను పెంచుతుండిరి. సుఖముగా నిద్రించిన రాచవారు ప్రొద్దెక్కిన తర్వాతనే మేల్కొనెడివారు. తర్వాత గమగమ పరిమళించే పువ్వులతో చేయబడిన "గంధరాజము" అనెడి పరిమళ ద్రవ్యముతో అంగమర్దనము చేయించుకొని చాలాసేపు వేన్నీళ్ళ స్నానము చేసి తెల్లని ధౌతవస్త్రములను నానావిధ హారములను ధరిస్తూ వుండిరి. అటుపిమ్మట సన్నని వరియన్నమును, వేటాడి తెచ్చిన అడవిమృగ పక్షుల మాంసమువంటను, అపుడు కాచిన వెన్నతో కలిపి ఆరగించెడివారు. కస్తూరీ సమ్మిశ్రిత తాంబూలమును వేసుకొని రాత్రులందు మేడలపైకి వెళ్ళి అందు చిన్న చక్రములతో కూడిన లోహపు కుంట్లలో అగరు చెక్కల ధూపమును ఆఘ్రాణించుతూ అంత:పురసుందరులతో ఆనందించుతూ వుండిరి.[52] రాచవారి వేషాలు కూడ, సామాన్యుల వేషాలతో భిన్నించినవై యుండెను.

          "జడలు మడంచి,చొళ్లెముగ సన్నపుబాగడలంగ జుట్టి చ
           ల్లడములు పూని మీద బదిలంబుగ గట్టిన మట్టికాసెలం
           బిడియము లందదోపి పృథు భీషణ బాహుల సాళువంబులన్
           దడలి కెలర్చుచున్ జనిరి నాథుని మ్రోల నృపాల నందనుల్"[53]

రాజులు, ధనికులు, సంపన్నులు వేసుకొనుచుండిన తాంబూలాలు విలువయిన సుగంధ ద్రవ్యములతో కూటినట్టివి. అవి,

         "బండిత పూగీ నాగర ఖండంబుల ఘనశశాంక ఖండంబులచే
          హిండితమగు తాంబూలములు"[54]

వక్కలు, సొంటి, పచ్చకర్పూరము తాంబూలములతో చేరియుండెను. అంతేకాదు, అవి,

         "మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్రవీటి గంధ
          స్థగితేతర పరిమళమై" యొప్పెను[55]

అన్నివర్గములవారు తాంబూలము వేసి రనియు, అది యుత్తేజకరమయినదనియు, అందుచేతనే రాజు 200 మంది భార్యలపయిగా ఉంపుడు గత్తెలతో భోగింపగలిగెనేమో! అనియు అబ్దుర్రజాఖ్ ఆశ్చర్యముతో వ్రాసెను.

తాంబూల సంబారములుంచు కరండికల సుందరముగాను, వెండి బంగారుతో చేయబడినవిగాను, సన్నని తీగె పనులు కలవిగాను ఉండెడివి. అందుచే వాటిని "జాలవల్లికలు" అని వ్యవహరించిరి.[56] సంపన్నులు స్నానము చేయునప్పుడు వాడుకొనిన నలుగుపిండికూడ విలువైనట్టిది. "హరిద్రామలకాదిక స్నానీయ వస్తు వ్రజంబు[57] పసుపు, ఉసిరికపోడి మొదలయిన స్నాన వస్తువులు అనుటచే పిండిలో వాటిని కలిపిరని అర్థము. పెసలు, సెనగలు విసరిన పిండిలో అవి కలిపెడివారు. ఇది స్త్రీల స్నానపు పిండి, పురుషులు "గంధామలకంబు" గంధపు పొడి, ఉసిరిక కలసిన పిండిని రుద్దుకొనిరి.[58] స్నానానంతరము స్త్రీలు అగరు ధూపమును వెంట్రుకలకు వేసి జవ్వాజి పూయుచుండిరి. మరికొందరు "హరిచందన గోరోచనాగరు ప్రకల్పిత సురభి ధూపంబును" వెంట్రుకలకు వేసిరి.[59] స్త్రీలు కాలి వ్రేళ్లకు లత్తుక రంగును పూసుకొంటూ వుండిరి.[60]

ధనికుల యాహార మెట్టిదో తెలుసుకొందుము.

        "తారుణ్యాతిగ చూత నూత్న ఫలయుక్తైలాభిఘారస్వస
         ద్ధారాధూపిత శుష్యదంబు హృతమా త్స్యచ్ఛేద పాకోద్గతో
         ద్గారంపుం గనూర్చు భోగులకు సంధ్యావేళన్ గేళికాం
         తరాభ్యంతరవాలుకాస్థిత హిమాంత ర్నారికేళాంబుపుల్.[61]

భోగులును, మాంసభుక్తులును నగువారు ఎండకాలములో చేప తునకలలో మామిడికాయ ముక్కలు వేసి తాళింపుచేసి, మధ్యాహ్నమందు భుజించి, సాయంకాలమందు తడిపిన ఇసుకలో పూన్చిన టెంకాయలను తీసి ఎడనీరుత్రాగి, చేతల కనరును పోగొట్టుచుండిరి. ఇది శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా ననుభవించినదై యుండును. బ్రాహ్మణుల వైభవముల కేమియు కొదువ లేకుండెను. వేసవిలో అరటిపండ్లు, పనసతొనలు, నేతిముద్దలవంటి దోసబద్దలు, మంచి జాతుల మామిడిపండ్లు, ద్రాక్షపండ్లు, వడపప్పు, తియ్యదానిమ్మలు, రసదాడి అను అరటిపండ్లు, పానకము మున్నగునవి సాపడుతూ వుండిరి.[62] అలర్కమును ముండ్ల యుచ్చింత కూర యని వేదము వే. రా. శాస్త్రిగారు వ్రాసిరి. దానిపై యామునాచార్యులకు ప్రీతి మెండుగా నుండెను.[63] అది మేదోవృద్ధిని కలిగించెడి కూరయట! కాని యిదే యామునాచార్య కథను వ్రాసిన పరమయోగి విలాసములో ఈ కూరను 'ముండ్ల ములిచింతకూర' అని వ్రాసినారు.[64]

రాజులకు, రాజబంధువులకు వేటపై ఆసక్తి యుండెను. చిరుత పులులను పొంచి వాటిని వదలి జింకలను వేటాడెడివారు.[65] వర్షము బాగా కురిసిననాడు వేటకుక్కలలో బయలుదేరి జింకల జోపుతూ వాటికాళ్లు బురదలో దిగబడి యురకలేక అలసిపోయినప్పుడు వాటిని కుక్కల సహాయముతో పట్టుకొంటూ వుండిరి.[66] పెద్దన యీ వేట హిమాలయములలో చేసినట్లు వర్ణించెను. హిమాలయ పర్వతాలపయిన రేగడిపన్ను కలదా? రేగడి సీమయగు కర్నూలు, కడప, బళ్ళారి జిల్లాలలో నేటికిని జనులు వర్షాకాలములో జింకలవేట నాడుదురు. కర్నూలు, కడప మండలాలలో నుండు ఎర్రమల నల్లమలలలోని చెంచుల జీవనమును, వారి వేటను ధూర్జటికవి యిట్లు వర్ణించినాడు.

పొత్తపినాడు అనున దిప్పటి కడపజిల్లాలలోని రాజంపేట తాలూకా లోనిది. ఉడుమూరు అనున దిప్పటి ఉడుములపాడు. అచ్చట చెంచులుండిరి. వారు పారుటాకుల కటిసీమల కట్టిరి. అవే వారి యుడుపులు. నేటికిని కోయలు మున్నగువారు స్త్రీ పురుషులును ప్రతిదినము ఆడ్డాకులను పెద్ద ఆకులను ముందొకటి వెను కొకటి వేసి మొలకు కట్టుకొందురు. చెంచు స్త్రీలకు కురువిందదండ లిష్టము. పైరులకు దృష్టిదోషము పోవుటకై పసరముల తలలను, ఏనుగుల తలలను కొమ్ములతో చేలలో నెత్తెడివారు. వారు అడవిలోని పండ్లను, గడ్డలను, తేనెను, చారపప్పు మున్నగువానిని తినెడివారు. వారి స్త్రీలు ఎరుపుగల వెంట్రుకలతో నెమలి పింఛాలు పెట్టి, అలంకరించుకొనెడివారు. చెంచులకు విల్లంబులు ప్రధానమగు ఆయుధాలు, వారు బాణాలతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసమును తినెడి వారు, నేరేడు, నెలయూటి, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి, బరివంక, చిటిముటి, కలివె, తొడివెంద, తుమికి, జాన, గంగరేను, వెలగ, మోవి, బలుసు, బీర, కొమ్మి, గొంజి, మేడి మొదలగు పండ్లను తినెడివారు.[67]

అడవిలోని చెంచు, కోయ, భిల్లులు నామకార్థముగా తమచుట్టు రాజ్యాలకు లోబడినవారయినను వా రించుమించు స్వతంత్రులే. "అభీర భిల్లాది కంపకోలనూల నాజ్ఞ చెల్లు"[68], "వారెవ్వరికైన అభయ మిచ్చినచో వానిచేతికి ఒక యంపకట్టెను (బాణము) గాని, నూలిపోగునుగాని గుర్తుగానిత్తురు, దానిం గని వారి ప్రజలైన దొంగలు వానిని చెనకరు" (వేదంవారి వ్యాఖ్య). అటవికులను స్నేహితులనుగా చేసుకొనకుండిన వారు ప్రజలను బాధించెడివారు. "పార్వతీయ బలంబులోనం గూడకయు రాజునకు ప్రజాబాధ తరుగదు. ఎట్లేని బెదరు వాపి, వారలం జేకూర్చుకొనవలయును. అవిశ్వాసంబును, విశ్వాసంబును, అలుకయు నెలమియు, అతి వైరంబును అత్యనుకూలంబును, అల్పు లగుట నల్పంబునుయగు. ఎట్లంటేని" (ఆము. 4 - 222) "చెంచులులోనగు వారు పాలన్నము పెట్టిన మాత్రాననే అ పెట్టినవారియెడ సత్యము తప్పక ప్రవర్తింతురు. అయినను ఏ యించుక అతిక్రమము కనబడినను పగబట్టుదురు." (వేదం వ్యాఖ్య. ఆము. 4 - 223)

మన సారస్వతములో వేట ముచ్చట వచ్చినప్పు డాటవికులు రాజువద్దకు వచ్చి పునుగు పిల్లుల, దుప్పికొమ్ముల, ఏనుగు దంతముల, పులిగోర్ల, జింక చర్మాల, చారపప్పు, ముంతమామిడి, తేనె మున్నగు వాటిని తెచ్చి కానుక యిచ్చినట్లు వర్ణించిరి. అంతకంటె మించి వారేమియు తెలుపలేదు. మన ప్రక్కననే అనాదిగా జీవించి మన భాషనే నానాపభ్రంశ రూపాలతో మాట్లాడు గోండ్లు, కోయ, చెంచు, సవర మున్నగు నాటవికులను సంస్కరించుట, వారి జీవన విధానములను బాగా గమనించి, వారి చరిత్రలను వ్రాయుట అనునది మనలో నేటికిని లేదు. పాశ్చాత్యులు వారిని గురించి అనేక గ్రంథాలు వ్రాసిరి. ఇటీవలెనే హ్యుమన్‌డ్రాఫ్ అను జర్మనువాడు హైదరాబాదులో ఆటవికోద్యోగియై చెంచులను గూర్చి, బిసన్ కొండలోని (గోదావరీ తీరారణ్యము లందలి) రెడ్డి అను అటవికులను గూర్చి (Reddies of the Bison Hill) సమగ్రోద్గ్రంథములను వ్రాసెను. వాటిని చూచువారు కూడా మనలో లేరు. అయితే ఆ జర్మనుకు తెనుగు రానందున చెంచుల తెనుగును అర్థము చేసికొనలేక చాలా తావుల పొరపాట్లు చేసినాడు. చెంచులను గురించి తెనుగువారే వ్రాయుటకు ఉత్తమాదికారులు. మన చెంచుల ఆటలు, పాటలు, భాషలోని విశేషాలు, ఆచారాలు, విశ్వాసాలు, దేవరలు, వారిబట్టలు, రూపములు, పరిశ్రమలు వారి ఓషదీ విజ్ఞానము, వారి మంత్రతంత్రాలు, వారి ధనుర్విద్యా పాటవము, వారి గుడిసెలు, ఆహారము మున్నగు ననంత విషయాలను గూర్చి కొందరు యువకులు ప్రత్యేక కృషిచేయుట యుక్తము. దొరల యిండ్ల మంచాలు చిలుకలతోను, హంసలతోను, సన్నని పనితోను కూడినట్టి "నసకినెల పట్టెమంచములు", వాటికి దోమ తెర లుండెను. వారి యిండ్లవద్ద 'నకీబులు' వేత్ర హస్తులు ప్రహరి (పహిరా) యిచ్చెడివారు. (నకీబు ఫార్సీ నభీబ్ పదమే. దానికి సర్దార్ అని యర్థము. అనగా భటుల సర్దారులు) రాచవారు తమ గ్రామములకు వచ్చినప్పుడు వారిని పెండ్లి కొడుకులవలె పగటి దివిటీలతో, వాద్యములతో ఎదుర్కొని తీసుకొని పోయెడివారు.

విజయనగర చక్రవర్తులు సామ్రాజ్యవ్యయము లన్నియు, సొంత వ్యయము లన్నియు పోగా ఏటేట ఒక కోటి మాడలు మిగిలించుకొంటూ వుండిరి. వారి మంత్రులు, సామంత మండలాధీశులు జీతమునకు మారుగా పొందిన జాగీర్ల నుండి ఒక్కొక్కరు ఏటేట 15,000 నుండి 10 లక్షల మాడల (ఆర్ధవరహా) ఆదాయం పొందుతుండిరి. అందు వారు మూడవ భాగము చక్రవర్తి కిచ్చి తక్కిన భాగముతో నియమిత సైన్యము నుంచుకొని, ఆజ్ఞాపించినపుడు దానితో యుద్ధసహాయార్థము వెళ్లవలసి యుండెను. కాని వారు నియమిత సైన్యమును నిలువ యుంచక గ్రామాలలోని జనులను కొందరిని అవసరమగునప్పుడు వచ్చుటకు కట్టడి చేసుకొని ఆదాయమును పెంచుకొని, ఇచ్చవచ్చినట్లు వ్యయము చేసి ఆనందించెడివారు.[69]

విజయనగర రాజధాని యావరణము ఇంచుమించు 60 మైళ్లుండెను. చక్రవర్తి ప్రాసాదము మహాభవనముతో నిండినది. అందు పెద్ద పడసాలలు, మోసాల లుండెడివి. లోపల విశాలతగల బయళ్లుండెడివి. ఎక్కడ బట్టినా నీటికొలను లుండెడివి. నగరములోని మండాలాధీశ్వరులు, మంత్రులు కూడా అదే విధానముపై తమ భవనాలు కట్టుకొని యుండిరి. చక్రవర్తి ప్రాసాద సమీపముననే సామంత ప్రభుల భవనాలుండెడివి. అవి బారులు తీర్చిన వీధులుగా నేర్పాటై యుండెను. అవి చాలా యందమై అలంకృతమై శిల్పములతోను, చిత్తరువులతోను నిండినవై కన్నుల పండువై యుండెను. విరూపాక్ష స్వామ్యాలయము ముందు అతివిశాలమగు వీధియు చక్కని వరుసలో నుండిన మహా భవనములను చూచి యానందింప దగినవై యుండెను. నాగులాపురము (హోసపేట)లోని యిండ్లు ఒంటిమిద్దెలై, విశాలమైనవై యుండెను.[70] సామంతుల యొక్కయు, రాచవారి యొక్కయు ఉడుపులను బార్బోసా యిట్లు వర్ణించెను. "వారు నడులము దు కాసె కట్టెడు వారు చాలా నిడుపుకాని చిన్నవి సన్నని నూలు అంగీలు దొడిగిరి. లేదా పట్టు అంగీలు తొడిగిరి. ఆ యంగీలు ముందు భాగమున విడుచుటకు కట్టుటకు ననుకూలముగా నుండెను. దానిని తొడల సందున దూర్చి కూర్చొనుచుండిరి, నెత్తులపై చిన్న రుమాలలుండెను. కొందరు పట్టు జరీ టోపీల ధరించిరి. వారు చెప్పులుకాని ముచ్చెలుకాని తొడిగిరి. భుజాలపై పెద్ద పెద్ద దుప్పటంతటి సెల్లాలను వేసుకొనిరి. వారి స్త్రీలు చాలాసన్నని తెల్లని నూలు చీరలనుగాని, రంగురంగుల పట్టుచీరలనుగాని అయిదుగజాల పొడవుకలవి కట్టుతూ వుండిరి. (ఇప్పటివలెనే కట్టు చుంగులు కొంగు వేసుకొనిరి.) పట్టుతో జలతారుతో కప్పిన ముచ్చెలను తొడిగిరి"[71]

"విజయనగర చక్రవర్తులు ఊరపిచ్చుకలు ఎలుకలు, పిల్లులు, బల్లులు, కూడా తినిరి" అని నూనిజ్ అనే విదేశ యాత్రికుడు వ్రాసెను. నేటికిని పరమ నీచులును మన దేశ మందెందును పిల్లుల, బల్లుల తినుటలేదుకదా! ఇక ఆ చక్రవర్తులకు ఉత్తమమైన కోరినట్టి రుచ్యమైన మాంసము దొరకక యీ యసహ్య మాంసములను తిని రనవలెనా ? ఇది పచ్చి అబద్దము. పాశ్చాత్యులు తెలిసీ తెలియనిపిచ్చివ్రాతలను కూడా వ్రాసి పెట్టిపోయినారు. అవి విస్సన్న వేదమువలె గ్రాహ్యములు కానేరవు.

సామాన్య జను లెట్లు జీవించిరో కనుగొందము. సాధారణ జనులలో ముఖ్యులు రెడ్లు. కొండవీటి రెడ్డిరాజుకు విజయనగర చక్రవర్తి కన్యకనిచ్చి పెండ్లి చేసియుండియు నిరంతరము రెడ్డిరాజులకు విజయనగర చక్రవర్తులకు యుద్ధాలు జరిగెను. తుదకు రెడ్డిరాజ్యము పడిపోయెను. సామ్రాజ్యములోని రెడ్లు గ్రామాధికారులుగను, వ్యవసాయకులుగను, సైనికులుగను జీవనము గడిపిరి. శ్రీకృష్ణరాయలు వారిని తన ఆముక్తమాల్యదలో రెండు మూడు మారులు తడవెను. "విడువ ముడువ వేపరని వీసంబుగల రెడ్డి"ని పేర్కొనెను. దుప్పటి కొంగులో బీదవారు కాసువీసము ముడి వేసుకొని అత్యవసర మైనప్పుడు కూడా విడువలేక విడిచి వాడుకొందురు. పేదవారికి వీసమే ------ కోశము. రెడ్లు తమచేలవద్ద గుడిసెలు వేసికొని మంచెలు వేసికొని పిట్ట -----దొంగలనుండి చేలకు కావలి గాసెడివారు. వారి స్త్రీలు ముసురుపట్టిన వర్షాకాలములో అంబలి పాత్రను బుట్టలోపెట్టి నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముగూడ వేసుకొని కావలిగానున్న తమపురుషుల కిచ్చెడివారు. జొన్న సజ్జ గోధుమ పిసికిళ్ళు' కావలి కాయువారికి సమృద్ధిగా నుండెను. వర్షాకాలములో రెడ్ల బ్రదుకు' నిటు రాయలవారు వర్ణించినారు.

        "గురుగుం, జెంచలి, తుమ్మి, లేకగిరిసాకుం, తింత్రిణీపల్లవో
         త్కరమున్, గూడ పొరంటినూనియలతో కట్టావికుట్టారుగో
         గిరముల్ మెక్కి తమింబసుల్ పొలము వో గ్రేవుల్ మెయిన్నాక, మే
         కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్.[72]

శ్రావణమాసములో ఆకుగూరలు సమృద్ధి, అప్పుడు గురగు (గునుగు అని వ్యవహారం). చెంచలి, తుమ్మి, లేత తగిరిసాకు (తగిరెంత అని వ్యవహారం). ఈ నాలుగు కూరలను తరిగి చింతచిగురు కలిపి బాగా నూనెపోసి పొడికూరగా చేసి కావలసిన ఉప్పు కారము మున్నగునవి చేర్చి కలగూర చేసిరన్నమాట. వారికి పశువుల సమృద్ధియు, గొర్లమందలి సమృద్ధియు, వరిమళ్లును, మంచాలపై పడకలును కలవని ఈ పద్యమందు సూచితములు.

సామాన్య రెడ్ల భోజనమును కృష్ణరాయలు వర్ణింపగా ఆతనికి 100 ఏండ్ల తర్వాత నుండిన తంజావూరి రఘునాథ రాయలు రెడ్డి దొరల భోజనము నిట్లు వర్ణించెను.

        "కప్పుర భోగివంటకము, కమ్మగనే, వడియున్, భుజించి, మేల్
         దుప్పటు లట్లు మూరగల తోరపు బచ్చటముల్ చెలంగగా
         గొప్పక దానిపైడి జిగి గుత్తపు టుంగరముల్ కరంబులన్
         ద్రిప్పుచు రచ్చచేయుదురు రెడిదొరల్ తమి హెచ్చ నచ్చటన్."

-రఘునాథ రామాయణము.

రెడ్లు గ్రామాధికారులై యుండిరి. దొంగలను పట్టుట, శిక్షించుట, తగవులు తీర్పులు చెప్పుట, గ్రామరక్షణము సేయుట వారి విధులై యుండెను.[73] ఈ సందర్బమ లో రడ్టి అని రాయలు ప్రయోగించినారు. రాష్ట్రకూట, రట్టకుడి, రడ్డిఅని రూపాలు మారుతూ తుదకు క్రీ.శ. 1650 నుండి రెడ్డి పదమే స్థిరపడెను.

         "ఎడ్డెతనపు కై సేతల రడ్డులు పురస్సరద్బార్యముగా"

అని యతిస్థానములో తెనాలి రామకృష్ణుడును, "రాజౌనొ, రడ్టియౌనొ" అని చేమకూర వేంకటపతియు వాడిరి. రడ్డీ పదప్రయోగము చేమకూరదే తుదిది. అటుతర్వాత రెడ్డిరూపమే నిలిచినది.

రెడ్లు వ్యవసాయమును ప్రధాన కులవిద్యగా చేసుకొనిరి. "వారికి తెనుగు దేశములో మంచి పలుకుబడి యుండెను. పంట మైలారు రెడ్డి చాలా ప్రసిద్ధుడు, వారు దూర దూర ప్రాంతాలకు వలసపోయిరి. అందుచేతనే యిప్పటికిని వారు తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలం జిల్లాలలో నున్నారు."[74]

"రామయభాస్కరుడు అను బ్రాహ్మణుడు శ్రీ కృష్ణదేవ రాయల పక్షమున కొండవీటికి వెళ్ళి గోపీనాథస్వామి దేవాలయమును పునర్నిర్మాణము చేసి కొండవీటి రెడ్డిరాజ వంశమువారిని అచ్చటికి దేవుని దర్శింప నాహ్వానించి ఒక రొకరిని అంతరాళికము లోనికి తీసుకొనిపోయి తలలు గొట్టించెను. అటుతర్వాత రాయలు సులభముగా కొండవీటిని ఆక్రమించుకొనెను."[75] ఇదే విషయమును గూర్చిన ఇట్టి యైతిహ్యము కలదని కొంద రాంధ్రులుకూడ వ్రాసిరి.

         అయితే యిందెంత సత్యమున్నదో నమ్ముటకు వీలులేదు.

ఆనాటి వ్యవసాయమును గూర్చి బార్బోసా యిట్లు వ్రాసెను. "జనులు కనరా దేశములో వరి యలుకుదురు. జడిగెములుకట్టి గొఱ్ఱుతో విత్తుదురు. బయలు మెట్టుపొలాలలో విత్తనాలు చల్లి పాయుదురు." నూరేండ్ల క్రిందట నుండిన సర్ తామస్ రో అను ఇంగ్లీషువాడు రాయల సీమలో చెరువులనుగూర్చి యిట్లు వ్రాసెను. "ఈప్రాంతాలలో క్రొత్త చెరువులు కట్టుటకు ప్రయత్నించుట వ్యర్థప్రయత్నము. అనువైన ప్రతిస్థలములో కూడ పూర్వము చెరువులు కట్టి నారు. కడపలోని ఒక తాలూకాలో 3574 చదురపుమైళ్ళ వైశాల్యములో 4194 చెరువులున్నవి"[76]. విజయనగర చక్రవర్తులు సమృద్ధిగా చెరువులు కట్టించి రైతుల నాకర్షించి దేశమును సుబిక్షముగా చేసిరి. రాయల రాజనీతియు నట్టిదే.

         "దేశ సౌబాగ్య మర్ధసిద్ధికిని మూల
             మిల యొకింతైన కుంట కాల్వలు రచించి
          నయము పేదకు, అరి, కోరునను నొ
             సంగి ప్రబలజేసిన ఆర్థధర్మములు పెరుగు"[77]

చిన్న భూప్రదేశములందు సహితము చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించి రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి తక్కువ కోరువారినుండి తీసుకొనిన వారు వృద్ధికి వత్తురు. ప్రభుత్వకోశము నిండును. రాజు ధర్మపరుడను కీర్తియు వచ్చును అని రాయలు వ్రాసెను. నూనిజ్ అను సమకాలికు డిట్లు వ్రాసెను. "నాగులాపురము (హోసపేట)లో రాయలు చాలా గొప్ప చెరువును కట్టించెను. ఆ చెరువు నీటితో వరిమళ్ళు చేసి తోటలు సమృద్ధిగా పెంచిరి. రైతుల నాకర్షించుటకై రాయలు ఆ చెరువు క్రింది భూములపై మొదటి తొమ్మిదేండ్లు పన్నును తీసుకొనలేదు. అటుపై వచ్చిన 20 వేల మాడల పన్నుతో అతని మండలేశ్వరుడగు కొండమరాజు ఉదయగిరిలో అనంత సాగరమును కాలువాయి చెరువును కట్టించెను.[78]

రాయలవారు స్వయముగా వ్యవసాయకుల కనుకూలములు కల్పించినను పలువురు మండలాధికారులు పన్నులెక్కువగా లాగి, బాధించిరి. అందుచేత పలుమారులు పన్నులు తక్కువగానుండు ప్రాంతాలకు రైతులు వెళ్ళిపోయిరి. ఉత్తరఆర్కాటు జిల్లాలో 33 పన్నులలో 32 పన్నులను దేవస్థానమువారు తీసుకొనిరి. ఒక పన్నునే కేంద్ర ప్రభుత్వము తీసుకొనెను. దేవాదాయ బ్రహ్మదాయ భూములనుండి వసూలుచేయు పన్నులను రాయలు తీసివేసిరి. చిదంబరములో పన్నులెక్కువని ప్రజలు మొరపెట్టుకొనగా అక్కడి మండలాధికారి వాటిని తగ్గించెను. మరొక తావున ప్రజలు గుంపులుగా వెళ్ళి రాయలతో మొర వెట్టుకొన వారు పన్నులను తగ్గించిరి.[79]

          "గట్టిగా పెంప దక్షత లేమి నూరూర
           బందెల బడిపోయె పశుగణంబు"[80]

        అనుటచే బందెలదొడ్ల పద్ధతి దేశమంతటనూ నుండెను.

రెడ్డివేష మెట్టిదో యిట్లొక కవి వర్ణించెను.

          "బసపు చుంగుల తలపాగ నెట్టంబు
               కసిబిసి మెనగు బాగాల వీడియము
           మిన్నదేరెడు దొడ్డమెడ నూలు మిగుల
               సన్నియగల మాధవళి పచ్చడంబు
           దళసరియగు దేవదారు గంధంబు
               వల కేల గనుపట్టు వంకుటుంగరము
           డొల్లు బోగులును కాటుకపప్పు దేరు
               పిల్లిగడ్డము, పడిబెట్టు మీసలును
           నలవడ నాందోళికారూడు డగుచు
               అలనాటి పూర్వికుడగు పెద్దిరెడ్డి"[81]

(నెట్టముకాదు నెట్టెము=అనగా గుంపురుమాల. మాదళము, మాదావళము అన్న రూపాలు కలవు. అనగా కపిలవర్ణము కలది. వంకుటుంగరమన వంకి వంటి వంకర యుంగరమని యర్థమేమో! పెద్ది రెడి కాక పెద్దిరెడ్డియేమో!)

ఈకవి కాపువానిని వేరుగా వర్ణించినాడు. రెడ్లుకూడ కాపులే. కాని ఇతర జాతులవారు పలువురు కాపులని చెప్పుకొనిరి. ఇక్కడ వ్యవసాయకుడగు నొక శూద్రజాతి వారిని యభిప్రాయ ముండును.

          "అప్పు డామడిసేయు నాయూరికాపు
               ముప్పిరిగొను పగ్గముల చుట్టుతోడ
           గుచ్చిన మునికోల గొంగడిముసుగు
               మచ్చల మచ్చల మట్టికాశియును

          బలువైన కేలి యంబటికుండ తనకు
             నలవడ నలగొండ లన నొప్పుచున్న
          మీటైన యెద్దులు మెడ కాడిమీద కోటేరువైచి
             నెక్కొని రొప్పికొనుచు చనుదెంచె"[82]

(కాళి కాక కాసె అయియుండును.) వరిమళ్ళలోని వరిపంటలు సమృద్ధిగా నుండెను. కొన్ని వడ్లపేర్లను రాయలిట్టు తెలిపినారు. "తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడిగుత్తులు, కుసుమములు, సంపెగలు, పచ్చ గన్నెరలు, పాళలు, రాజనములు"[83] ఇంతవరకు రెడ్ల, కాపుల, వ్యవసాయమును గురించి వ్రాసినాము: ఇక ఇతర జాతులవారిని గురించి తెలుసుకొందమ.

కరణము వేషమెట్టిదనగా:-

       "వనముంచు తెలివలిపంపు పింజియులు పొసగ చుట్టినయట్టిబోడకుల్లాలు
        చింపికుప్పసములు చెవిదోరములను నంపుటంబులతోడ జంపాడు నొడలు
        బిగువగా చెంపదోపిన బలపముల తక నలవడ వత్తరి
        కరణికులు చనుదెంచిరి."[84]

(బోడకుల్లాలు=చిన్నటోపీలు. కుప్పసములు= కుబుసములు (అంగీలు) సంపుటము అన ఒకవిధమైన బట్టపలక. పూర్వము బట్టపై లేక కాగిదాలపై నల్లని గార (coating) పూసి యెండించెడివారు. ఆ యట్టలను రెండుమూడు కలిపి యుంచుకొని వాటిపై మెత్తని కోపు బలపముతో వ్రాసి తుడిచికొని మరల మరల వ్రాసెడివారు. బట్టకు రెండుప్రక్కల కాగిత మంటించి దానిపై ఆకు పసరు, బంక, బొగ్గు నుసి పట్టించి పలకవలె చేసికొని దానిపై కోపు బలపాలతో వ్రాయుచుండిరి. కరణాలు అట్టి సంపుటాలను పట్టుకొని కోపు బలపాలను చేవులపై నుంచుకొనిపోయిరి. "ఆ కాలమందు నల్లని బట్టపై బలపముతో వ్రాస్తుండిరి," అని బి. సూర్యనారాయణగారు వ్రాసినారు. కరణాలు వ్యవసాయపు పన్నుల లెక్కలు వ్రాయువారు. అ కాలములో భూములు శాశ్వత పట్టాపై యియ్యకుండిరి! కొందరు కలసి కోరుకో పన్నుకో చేతనైనంత భూమిని తీసుకున్నట్లున్నది. మండలాధికారులు భూములను పొంది అందు తమ సేవకైన వ్యయము తీసివేసి మిగిలినదానిలో కొంర కోరును ప్రభుత్వానికి చెల్లించువారు.

         "ఉమ్మడియును: ఠాణె, యుత్తరు వమర మిమ్మెడియింప మాకియ్యేటి
          వరకు చెల్లిన ధనమెంత"[85]

ఉమ్మడియన సేవ. రాజసేవకై యిచ్చిన ఇనాము. ఠాణెయన భటుల సిబ్బందియుంచుట. ఉత్తరువు అనునదియు ఒక విధమగు పాళెపు సేవ. అమరము అనునదియు అట్టిదే.

అమరమును గూర్చి కృష్ణరాయ విజయందిట్లు నిర్వచింపబడినది.

         "భటులు వేయిటికెన్న, ఇర్వదియు నాల్గు
              వేలుగా, లక్షయిర్వదివేల పజకు
          చెల్లు నల్వదిలక్షలు జీత మనఘ
              అమర మేలెడు దొరల కీక్రమమె సుమ్మి"

"ఉత్తరువు ఉమ్మళియు త్రోయంగ మరియు నందులకు నిందులకుపోయె పొమ్మని వాం బులిమిపుచ్చుటయు గనలి భూపతి బోడుకలు కొంగుబట్టిపెంచి రాదిగిచి యీడ్చుటయు"[86] గుంపించి అనుటచే రాజులకు రావలసిన భూభాగము రాకున్న రాజసేవకులు వారి నవమానించెడివారు. (బోడుకలు పదమునకు మారుగా బోడికలు అని శ. ర. లో కలదు.) పన్నులు చెల్లించనివారిని,

         "పడతాళ్ళ చేద దీర్పరుల మన్నీల తడయక పిలిపించి తద్వార్త చెప్పి"[87]

శిక్షానిర్ణయము చేసెడివారు. (పడతాలు శబ్దములు శ.ర. నిఘంటువులొ లేదు. సందర్బమునుబట్టి భటుడనియర్థము.) శ్రీ రాళ్ళపల్లి అనంతశర్మగారు పడవాలు అను పదమును తెలిపినారు. అపుడు భటుడనుట సరిపోయినది. మఠియు 'గురియగట్టి' వారిని ఈడ్చుకొని పోయెడివారు. బండలెత్తి, ఎండలో నిలబెట్టి చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేసి బాధ పెట్టెడివారు. వైద్యుల వేష మెట్టిదనగా:-

           "చంక మందులసంచి జగజంపు వలువ
               పొంకమై నిజకర్ణముల నొప్పు దూది
            కునివడ జుట్టిన కురుమాపు పాగ
               అనువంద పంచలోహంపుటుంగరము
            ఉరుతరంబైనట్టియూర్ధ్వపుండ్రంబు
               కరమొప్పు వలకేలి కరకకాయలును
            బెరయ పచ్చడముతో పెనుపడ సంది
               నర గనుపట్టు బాహాట పుస్తకము
            బనుపడలో గుణపాఠంబుచదివికొనుచు
               మూలికలుదిక్కులు చూచికొనుచు
            అన్నగరవ నుండు నత డేగుడెంచె"[88]

(జగజము-శ. ర. లో లేదు.) బాహాటము అన బయలు పడినది, వెంటనే, అరగనుపట్టు అనుటచే బాహాటమున కీయర్థము సరిపడదు, "బాహాటము" అను వైద్యగ్రంథము కలదు. దాని కెక్కువ ప్రామాణ్య మానాటి వైద్యులలో కలదేమో? బాహాటమని కవి యేల వాడెనో?

(విజయనగరమున ఆయుర్వేద కళాశాల లుండెను. అందు అరబ్బులు ఈరానీ విద్యార్థులుకూడా వైవిద్య నభ్యసించిరి. అరబ్బు యువకులు ఈ దేశమున ఆయుర్వేదము కొంతకాల మభ్యసించనిది తమ విద్య పూర్తి కాదని తలచిరని ప్లూజెల్ అను యూరోపువాడు వ్రాసెను. విజయనగరములో వైద్యకళాశాల లుండెననియు అందు అరబ్బు విద్యార్థులు చదువు తుండిరని సులేమాన్ అను అరబ్బు వ్యాపారి వ్రాసెను.

వైష్ణవ భాగవతుడు
-

        "వదలుపింజల నిడు వాలుదోవతియు పోలగా జుట్టిల పొత్తిపొగయును
         దూలగట్టిన వెడతోపు పచ్చడము అంకే డాకేలి పంచాంగంబు ముష్టి
         చంకవ్రేలెడు తాళి చలిదిమూటయును"[89]
         కలిగి ప్రయాణము సాగించెను.

మేదరివాని వేషమును కవి యిట్లు వర్ణించెను:-

         "మలయంగ నెడదుంటి మైనోరగాగ
             మొలత్రాటి జెక్కిన మోటకట్టియును
          కొనసిగతోగూడి కురులొక యింత
             గనుపట్ట జెరివిన గన్నెరాకమ్ము
          గొనల వెల్వడు పుట్టగోచియు నెరులు
             బెనగొన్న నునుదబ్బపీను డా కేల
          వెడవెడజివ్వాడు వెదురుసలాక
             యెడమచేబొటవ్రేలి యినుపయుంగరము
          .... .... .... ....అవ్వనభూమి కేతెంచె"[90]

(గన్నెరాకమ్ము=గన్నే రాకువంటి అలుగులుకల అమ్ము) జివ్వాడు తప్పు. జవ్వాడు అనవలెను. మేదరవారు తెనుగువారు కారు, వారు అరవలుగా గనుపింతురు. రాయలకాలమునాడే వారిభాష వేరుగా నుండెను. అడవిలో ఒక బాలుని ఆక్రందనమును మేదవారు విని,

      "ఆలించి మార్జాలమని సంశయించి పాక్క పాక్కని తమభాష జెప్పుచును"[91]

అనుటచే వారిభాష వేరనుట స్పష్టము. తెలుగుదేశమందలి మేదరవారు తెనుగు భాషనే మాట్లాడుదురు. కాని బొంగు, ఈతబరిగెలతో బుట్టలల్లు ఎరుకలవారు మాత్రము చెడిన అరవమును మాట్లాడుదురు. పాక్కఅన పిల్లి అను నర్థమిచ్చు కన్నడ పదముకాని, తమిళ పదముకాని లేదని తెలిసినది. మరే భాషలో నున్నదో యేమో? మేదర వారిని సంస్కృతములో వేణులావకులు, కటకారుల అనిరి. వారు వెదురుచాపలు, బుట్టలు, తడకలు, మంచములు, గుమ్ములు మున్నగునవి చేసి జీవింతురు. మనలో వీరు కాకతీయుల కాలానికి పూర్వమునుండియే జీవించినను వీరినిగురించి తెలుసుకొన్న వారు లేరు.

కానెవారు (ఇండ్లు కట్టువారు) ఎట్టివారనగా:-

      "కలయ నాచార్యుల కాసీల నపుడు పిలిపింప వారలు పెనిజనిన్నిదములు
       చంకల శిల్పశాస్త్రపుస్తకములు వంకవో జుట్టిన వలుదపాగలును[92]

కొలదిరేఖలు వడి కోసినయట్టి యెలమించి వలకేలి యినుపకమ్ములను చేరువ నిలిచిరి?[93]

వారిపను లెట్టివనగా:-

      చప్పటి కుముదంబు చదరపానంబు కప్పుచూరలు, కంబకాళ్లు పద్మకము
      ఒగి మహాజగతియు, ఉపజగతియును మొదలయిన తమ పని....."[94]

ఈ పదములో చదరపానము అన చదురమైన పానవట్టమనియు కప్పుచూరు లన ఇంటికప్పు ముంగలి భాగము లనియు, పద్మక మన దేవాలయ గోపురముల అడుగు భాగములో తీర్చెడి పద్మదళము లనియు అర్థము చేసి కొందురు. కప్పుచూరులు తప్ప తక్కిన పై పద్యములోని పదములన్నియు శ. ఋఅ. నిఘంటువులో లేవు. మహాజగతి, ఉపజగతి, పద్మక పదములు శబ్దకల్పద్రుమమందును లేవు. వాస్తు శాస్త్రములం దివి లభించు నేమో ?

మాలదాసరి వేష మెట్టిదనగా:-

చమురు తగిలిన తోలు కుప్పసము, టెక్కి అనగ టోపియును, ఇత్తడితో చేయబడిన ఒక శంఖపు ఒక చక్రపు ఆకారముగల కుండలములు, జింక కొమ్ముల అలుగులు, తోలుతిత్తి మొగిలియాకు గొడుగు, గుర్రపు వెంట్రుకతో నమర్చిన దండె (కిన్నెర) యు, చిటితాళములు, చంకబుట్ట, తులసిపేరులు నామాలు మున్నగు పరికరములు కలవాడై యుండెను.[95] అతడు వాయించు కిన్నెరను "చాండాలిక" అనిరి.

ఆ కాలమున వెట్టివా రుండిరి. "వెట్టివాని కేల విమలవిచారంబు?" "వెట్టివానికి కూలి వేడ దగదు" అని యొక కవి అనెను.[96] "ఇల దొమ్మరిది జాతిహీనత యెంచదు" "పూటకూళ్ళది పుణ్యమునకు జొరదు"[97] అని యున్నందున దొమ్మరివారిని హీనులనుగా చూచిరి. బోగమువారి వేషా లిట్లుండెను:-

వలిపె చెంగావి పావట, వెలి పట్టుచీర కట్టి, జవ్వాది పూసుకొని, చంద్రకాంతపు దువ్వెనతో నెత్తి దువ్వుకొని, జారుకొప్పు వెట్టి, అణిముత్యాలచేర్లు కంఠమున ధరించి, పచ్చవ బొట్టొనరించి, గుమ్మడిగింజ (వంటి) నామము దీర్చి, తాటంకములుదాల్చి, మొదపుతీగెకు (హార ముఖభాగము) చెంత ముత్తెపుబలుకు పెట్టి, పుంజాలదండను, నేవళము (మణులహారము) వేసుకొని, బన్న సరములు దాల్చి, చేతులలో మురువులు కంకణములుదాల్చి, ముత్యాల చేకట్లు కట్టుకొని, సందిదండలు, నెలవంక తాయెతులు, ఉంగరాలు, మణులు యొడ్డాణము, బిల్లల మొలనూలు బంగారు సరపణి (గొలుసు), మణినూపురములు బోగము స్త్రీలు ధరించెడివారు.[98]

బోగముసానుల వద్దనుండు దాసి వేష మిట్టిది:-

నల్లపూసలపేరు, బండి గురిగింజ, తావడములు (హారములు), పవదంబు చేకట్లు, పిత్తడి కడెములు, పికిలిపాదండలు, నల్లముదుక గాజులు, లక్క తాయెతులు, తెల్లని తగరంపు ముక్కర, సీసపు ముద్దుటుంగరము, కాకి బేగడ బొట్టు, కంచుమట్టియలు, శంఖు ఉంగరము, ఇవి దాని యాభరణములు.[99]

ఆ నాటి స్త్రీలు సాధారణముగా ఈ క్రింది భూషణముల ధరిస్తూ వుండిరి:-

         "తలుకు బిల్లాండ్లు బబ్బిలి కాయలును మ
             ట్టియలు వీర మద్దెలు సందియలును
          మొలనూళ్ళు, వొడ్డాణములు, నేవళంబు
             బుంజాలదండయు బన్నసరము మొగపు
          దీగయు నాణి ముత్తెపు బేర్లు సందిదండలు
             సూడిగములు గౌడసరములును
          కడియాలు పెక్కుజోకల యుంగరములు
             ముంగరయు గోలాటంపు గమ్మజోడు

         చెవుల పూవులు బవిరలు చేరుచుక్క
            కొప్పువలయును సవరించి రొప్పుమీర
         భూషణములకు తానొక భూషణమయి
            పడతి యపుడొప్పె కన్నులపండువగుచు"[100]

అప్పుడు ముక్కర సర్వసాధారణముగా నాభరణము.[101] నేటికిని రాయలసీమ, దాని పరిసర తెలంగాణా ప్రాంతములో శూద్ర స్త్రీలు ముక్కర పెట్టుకొంటున్నారు. వనితలు కొప్పులలో తురుగుడు బిళ్ళలు, కంఠములలో ముత్యాల హారాలు, నడుములందు డావులు, కాళ్ళలో పాంజీలు ధరించిరి.[102] బోగపుసానులు ఎర్రని పావడలను కట్టుకొనిరి.[103]

తంబలజాతి వారు దేవాలయ సత్రబోజనములకు గాను విస్తర్లను కుట్టుకొని తెచ్చియిచ్చువారై యుండిరి.[104] తంబలలు (తంబలి) వారు రాయల సీమలో శుభకార్యాలలో పూలు, తములపాకులు తెచ్చి యిచ్చువారు. మరియు పూర్వము శివాలయములందు పూజారులై యుండిరి. నేటికిని అట్టి యర్చకులు కొందరు మిగిలియున్నారు. మరికొన్ని తావులలో వారు దేవాలయములందును, శుభకార్యములందును డోలు వాయింతురు. వీటినిబట్టి వారికొక నియమిత వృత్తికలదని చెప్పజాలము. తాంబూలి శబ్దభవమే తంబలి (తంబల) అయియుండునో యేమో ?

అన్ని వర్ణముల పురుషులు నడుములలో ఎర్రని పట్టీని 6, 7 మూరల దానిని చుట్టుకొంటూ వుండిరి,[105] కాసె కట్టు, కాసెదట్టి, దట్టి అనిరి. అయితే ఎరుపే ప్రధానము కాదు. కొందరు నల్ల కాసెలు కట్టిరి.[106] ధనికులు, అధికారులు, కవులు, పండితులు, రెడ్లు మున్నగువారు పల్లకీలలో వెళ్ళుతూ వుండిరి. పల్లకీలను బోయీలు (బెస్తలు) మోసెడివారు. పల్నాటి యుద్ధములో పల్లకీ బోయీల ముచ్చట కలదు. అనగా క్రీ.శ. 1150 నుండి ఈనాటి మన కాలమువరకు గూడా బోయీలు తమ వృత్తిని వదులుకొన్న వారు కారు. కవి పండితసభలను రాజు కావించినప్పుడు వారు బయట వదలి వెళ్ళు పాదరక్షలను కాపాడుటకై సేవకులు నియుక్తులై యుండిరి.[107]

సాత్తని, సాత్తిన అని వైష్ణవార్చకులలో రెండు శాఖ లుండెను. సాత్తినవారు నెత్తి గుండుగా గొరగక జందెము వేసుకొన్నవారు. సాత్తనివారు నెత్తి బోడిగా గొరిగించి జందెములేక యుండువారు. (ఆముక్తమాల్యద, 2 - 97) సాత్తనివారి వేష మెట్టిదనగా:-

         "పొంకపు పట్టెనామములు పొల్పగు మేల్ తిరుచూర్ణ రేఖలున్
          చంకల తాళికాదళ విసారిత పేటికలన్ భుజంబులన్
          సంకును చక్రముల్ గలుగు సాత్తనివారు...."[108]

వెలివాడలో మాదిగవారు చెప్పులు కుట్టి వాటిని తంగడాకుతో మెత్తచేసి యిచ్చెడివారు.

విజయనగరములో బోగపుసానుల సంఖ్య అపారముగా నుండెను. వారిపై గణాచారి గుత్తాపన్ను వసూలుచేసిరి. నగరముననుండు 12000 రక్షకభటుల జీతాలు బోగమువారి పన్నులతో సరిపోయెడిది. రాచవారు, ధనికులు, ఉంపుడుగత్తెల నుంచుకొనుటయు, అ ముచ్చటను ప్రకటించు కొనుటయు మగతనపు లక్షణముగా భావించిరి. మంచిమంచి మంత్రులు, పాళెగాండ్రు, రాజులు కవులచేత అట్టి రసికతను వర్ణింప జేసుకొనిరి. సింగమనాయుడు తన బోగముదాని ముచ్చటను భోగినిదండకముగా రచింపచేసెను. సంపన్నులు తమ యుంపుడు కత్తెలను బోగం వారిని ఉత్సవాలలో వెంట తీసుకొనిపోయి జనులు చూచునట్లుగా వారితో సరసాలాడెడివారు.[109] దాసరులు "సందె గోపాలభిక్ష"చే జీవించిరి. సందె వేళలో గోపాల కీర్తనలతో యిండ్లవద్ద బిచ్చ మెత్తుకొనుటను సందె గోపాలమనిరి.[110]

బ్రాహ్మణులు విద్వత్తుచేతను, వైదిక వృత్తిచేతను జీవించెడివారు. దేవాలయములందు అర్చకులుగాను, పౌరోహితులుగాను, జ్యోతిర్వేత్తలుగాను జీవించిరి. వారికి దేవాలయ సత్రములం దుచితముగా భోజనము లభించెడిది. ఈయాచారము నేటికిని తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థాలాలలో కానవస్తున్నది. వారి కానాడు ప్రతి శనివారము శిరస్స్నానానికై నూనె పిండి కూడ యిచ్చెడివారు. వ్రతాలకు కొదువ లేకుండెను. నానావిధ దానాలను, అందు ముఖ్యముగా షోడశ దానాలను, వారికిచ్చు విషయములో హేమాద్రి యొక గొప్ప గ్రంథమునే వ్రాసి యుంచెను. అది ప్రమాణ గ్రంథ మయ్యెననియు, రెడ్డిరాజులు హేమాద్రి ప్రోక్తదానాల నన్నింటిని చేసిరనియు తెలిపినాము. గ్రహణ సంక్రమణ కాలాలలోను, రాజులకు గ్రహశాంతి యవసరమైనప్పుడు బ్రాహ్మణులకు దానాలు చేసిరి. "అబద్ధంబులాడి చిల్లర ప్రభువులన్ భ్రమియించుచుండి, దీక్షితులంజూచి యియక్షవొడిమి ద్రవ్యాభిక్షార్థినై మధురకుం బోయి యప్పురంబున"

         "బహివడ్డ ద్విజున కల్పపు పాచితం బిడి
             పసిడి కైతా వానిబంతి గుడిచి
          కలిబ వణిక్పురోధులతోడ బుణ్యాహముల
             బియ్యములకునై మొత్తులాడి
          శశి రవిగ్రహ జపస్నానాదికము లెల్ల
             దొరల వాకిండ్లకే దొద్దయిచ్చి
          పచ్చిర్రితో ల్బర్రెచుచ్చాల మెట్లంది
             కొనదాన యూరెల్ల గుత్తపట్టి
          దర్బపోటుల దిని లేనితరుల మైత్రివంటి
            పితృ శేషము భుజించి యదియు నెడల
          అక్కవాడల నరకూళ్ళు మెక్కిమీద
            వీరశేఖర మొకత లార్త్విజ్యము కొని"[111]

ఆనాటి పురోహితులు జీవించిరి. అయితే, యిట్లందరును చేసిరని కాదు. కొందరైనను చేసిరని యర్థము. విద్వాంసులు వివిధ విద్యలను నేర్చిరి. అందు ముఖ్యమైనవి షడంగములు. నాల్గువేదాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము అను 14 శాస్త్రాలు. తర్కశాస్త్రము ఖండకారికా పుస్తకములు అనగా స్మార్తకర్మ ప్రయోగాలు కల శాస్త్రాలు, యజ్ఞ యాగాదుల మంత్రాలు, విశేషముగా బ్రాహ్మణ విద్యలై యుండెను.[112] బ్రాహ్మణులు సేద్యము చేయకుండిరి. చేసినను చాలా అరుదు. వారు అప్పుల పాలైనప్పుడు తమ మాన్యాలను కుదువ యుంచుతూ వుండిరి.[113]

రాజుల కొలువులో కవి పండిత సభలు జరిగేవి. లేదా విద్యా పీఠముల వద్ద జరిగెడివి. మధుర దక్షిణదేశ మందు ప్రసిద్ధమగు విద్యాపీఠమై యుండెను. కంచి, కాశి, కాశ్మీరము, తక్షశిల, నలందా, నవద్వీపము, అమరావతి వంటి స్థలాలలో విద్యాపీఠములు మరీ పూర్వకాలమందుండెను. విద్యార్థులు చదువు పూర్తిచేసుకొని స్నాతకులై గురువువద్ద సెలవుపొంది ఒక విద్యాపీఠమునకు వెళ్ళి అచట పండిత పరీక్షలో నెగ్గి జయపత్రమును (డిగ్రీ) పొంది పోయెడి వారు. రాజసభలలో విద్యాధికారు లుండెడివారు. అచ్చట కవులుకాని, పండితులుకాని, వాదములు చేసెడివారు. అందు గెలిచినవారికి బహుమతు లిచ్చెడివారు. ఓడిపోయిన పక్షమువారు తబ్బిబ్బై బయటకు వచ్చి తమ పాదరక్షలు మరచిపోయి తిరిగివచ్చి తీసుకొని తమ యెదుటనే ఉండు అందలాలు కానక ముందుకు పోయి వెదుకులాడి భ్రమనొంది రాజుపై నిందపెట్టి నానావస్థలు పడెడివారు.[114] కవి పండితుల సభ రాజుయొక్క భవన "చతుశ్శాలిక"లో జరిగెడిది.[115] వాదములందు గెలిచిన వారిని, మహాకవులను రాజులు పూజించిరి. వారికి టంకాలిచ్చిరి.

          "వాద మొనరించి గెలిచి, తత్వంబు దెలుపు
           వాని కని బీరపువ్వులబోని టంక
           సాల వాటులు నించి యాస్థాని గట్ట
           కాలసర్పముగతి వ్రేలు జాలె జూచి"[116]

నాణెములలో ప్రత్యేక కృషి చేసినవారు విజయనగర కాలములో టంకాలుండినట్లు వ్రాయలేదు. అవి బంగారువి. కొత్తటంకాలైతే బీరపూలవలె మెరసెడివి. శ్రీనాథుని కిదే విజయనగర రాస్థానమందే టంకా స్నానము చేయించిరి. అట్టిచో నాణ్య నిపుణులు దానిని పేర్కొనకుండుట యేలనో తెలియరాదు.

       కవులు కూర్చొను స్థలమును శంఖపీఠి యనిరి. ఇది తమిళ దేశాచారము.

       "ఈ కవితాభిమానము వహించితి నేటికి శంఖ పీఠికపై
       నీ కవు లున్న యట్లు వసియింపక దేవునితోడ నేల చా
       ర్వాక మొనర్చితిన్.[117]

ఇచ్చట శంఖపీఠి యన నేమో? శ. ర. లోను, శబ్దకల్పద్రుమములోను లేదు. మధురాది తమిళ ప్రాంతాలలో పూర్వము సంగము (సంఘము) అను కవుల పీఠము లుండెను. దానినే మన కవి శంఖము చేసెను."______రాళ్ళపల్లి.

అగ్రకవియగు అల్లసాని పెద్దనకు రాయలు స్వయముగా గండపెండేరము తొడిగించుటయు, అతని పల్లకిని స్వయముగా మోయుటయు, ఆతడెదురైనచో మత్తకరీంద్రము నాపి ఏనుగుపై నెక్కించుకొనుటయు, ఐతిహ్య ప్రసిద్ధములు. రామరాజ భూషణుడు, భైరవికవితాత, రాజుల గద్దెలపై రాజుల ప్రక్కన కూర్చునిరనియు వ్రాసినారు. బ్రాహ్మణులలో పలువురు మంత్రులు, దండనాయకులు, మండలాధికారులై యుండిరి. ఈ విధముగా బ్రాహ్మణులకు సర్వత్ర అపూర్వ మర్యాదలు జరిగెను.

శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా ఎట్టి వస్త్రభూషణములు ధరించెనో సమకాలికు లిట్లు వర్ణించిరి.

"రాజు రెండుజేనల పొడవుగల జరీటోపీని దరించెడివాడు. యుద్ధానికి వెళ్ళినపుడు నూలురుమాలను కట్టి దానిపై నానారత్న భూషణములను పెట్టుకొంటూ వుండెను. జరీపనిగల తెల్లని వస్త్రముల కట్టెను. చాలా విలువగల రత్నాలహారములను కంఠసీమ ధరించెను. తలపై జరీపట్టుటోపీ ధరించెను. రాజభవనముల కావలిగాయు పరిచారికలు కూడా టోపీలు ధరించిరి."

న్యూనిజ్ ఇట్లు వ్రాసెను. "రాజు ఒక తడవ ధరించిన యుడుపుల మరల దరింపడు. చాలాసన్నని జరీ పట్టుబట్టలనే అతడు ధరించెను. వారి టోపీని కులాయి యందురు." రాయల విగ్రహమున్ను, ఆతని యిరువురు భార్యల విగ్రహాలున్న తిరుపతిలో కలవు. రాయల విగ్రహమునకు తలపై తుర్కీ కుచ్చుటోపీ కలదు. అళియరామరాజును, ఆతని సైనికులును యుద్ధమునకు వెళ్ళినప్పుడు వ్రాసిన చిత్తరువులలో మూరెడు పొడవుగల టోపీలు వారు ధరించినట్లు చింతించినారు. ఈ టోపీల యాచారము కర్ణాటకులలో నుండెనేమో? తురకలలో ఆనాడీవేషము లేకుండెను. వారి చిత్తరువులలో నిట్టివి కానరావు. తెనుగుసీమలోను నిట్టివి లేకుండెను. శ్రీనాథుడు ప్రౌడ దేవరాయల ఆస్థానానికి పోయినప్పుడు కర్ణాట దర్బారు వేషము వేసికోవలసి వచ్చెను. కుళ్ళాయి పెట్టుకొని మోకాళ్ళ క్రిందికి జారిన మహా కూర్పాసమును అంగీని తొడిగి పెద్దసెల్లా వేసుకొనెను. అయితే కులాహ్ అనుశబ్దము ఫార్సీలో టోపీ యను నర్థమగుటచే ముసల్మానుల నుండియే విజయనగర రాజులు వారి అనుయాయు లీ యాచారమును స్వీకరించిరేమో? ఆనాటి కర్ణాటాచారమును నేటికిని కొందరు వైష్ణవ భిక్షుక భక్తులు అక్షయ పాత్రతో బయలుదేరి పొడవు టోపీలను ధరించి రామదాసు కీర్తనలను పాడుచుందురు.

జనుల వేష భూషణములను గురించి అబ్దుర్రజా కిట్లు వ్రాసెను. 'ఈ దేశమందు ధనికులును - చెవులపోగులను, కంఠహారాలను, దండకడెములను, ఉంగరాలను ధరింతురు'[118] నికోలోడీ కాంటి అను యూరోపు వాసి యిట్లు వ్రాసెను. 'జనులు గడ్డాలు పెంచరు. కాని జుట్లుపెంచి కొప్పు ముడి వేయుదురు. యూరోపువాసులవలె జనులు ఎత్తై అయురారోగ్యాలు కలిగి యున్నారు. పట్టె జముఖాణాలపై జరీ అంచు ఛాదర్లను పరుచుకొని పండుకొందురు. కొందరు స్త్రీలు సన్నని అట్టలుకల మోజాలను జరీపనులతో అలంకరించి తొడిగి కొందురు.'

బార్బోసా అను మరొక పాశ్చాత్యు డిట్లు వ్రాసెను. 'పురుషులు చిన్ని రుమాళ్ళను కట్టుదురు. లేదా పట్టుటోపీలను పెట్టుకొందురు. కిర్రు చప్పులను తొడుగుకొందురు. శరీరమునకు రుద్దుకొనుటకై వాడుకొను నలుగు పిండిలో గంధముపొడి, కుంకుమపువ్వు, కర్పూరము, కస్తూరి, కలబంద కలిపి నూరి పన్నీటితో మర్దనచేసి రుద్దుకొందురు.[119] విజయనగర వాసులు తురకలవలె చల్లడములను తొడుగు కొందురు. చల్లడమును 'చండాతకము' అనిరి[120] జనుల టోపీలు రెండు విధములైనవి. ఒకటి రెండు జానల పొడవైనదని తెలిపినాము. రెండవది బొందెలు కల బట్ట కుల్లాయి. అది నెత్తికి నిండుగాను, చెవులు, చెంపలు మూయునదిగానుండి గొంతు క్రింద బొందెలతో కట్టబడుతూ వుండెను. అది 'గౌదకట్టుకసి చేరుల టెక్కి'[121] అనగా చెంపలు మూతబడునట్లుగా కొరడా కొనవలె నుండు బొందెలతో గడ్డముక్రింద ముడివేయు కుళ్ళాయి యనియర్థము.

దొరలు తమ అధికారుల పనుల మెచ్చుకొన్నప్పుడు వారికి కొత్త వస్త్రములు, అంగీలు, టోపీ పసదనముగా నిచ్చెడివారు; 'మేలు కుళ్ళాయి గబ్బాయి కొమ్మంచు నొసగి'[122] అని వర్ణించిరి. గబ్బాయి అనవలెనో, కబ్బాయి అనవలెనో తెలియదు. కొందరు కవులు అంగీ అను నర్థములో 'కబాయీ' అని వాడినందున ఇచ్చట కబ్బాయి యనవలెను. కుల్లాయివలె ఇదియు విదేశిపదమో యేమో ? ఈ పదమును అ కాలపు పింగళి సూరన వాడెను. అంతకు పూర్వకవితలలో ఇది కానరాదు.

జనుల వాహనములు చక్రపుబండ్లు, ఎద్దులు, గుర్రాలు, అంథలములు, పల్లకీలు అయియుండెను. "పల్లకీలు, నందలములు, వారువంబులును, దంతులు నాదిగ గల్గు వాహనంబులు"[123] అనుటలో పల్లకీలు, అందలములు అని రెండును కలిపి చెప్పినందున వాటిలో భేద మున్నదనుట స్పష్టము. అందులము లనగా ఇప్పుడు పీఠాధిపతులను ఉత్సవ విగ్రహాలను తీసికొనిపోవునట్టి దాపులేని వాహనములు. పల్లకి యనగా ప్రక్కలందును పైభాగమందును మూతల కప్పును గల 'మ్యానా'. ధనికులు ఉయ్యెలమంచాలు, దోమ తెరలమంచాలు, చక్కని శిల్పములతో కూడినవాటిని వాడిరి.

          'బంగారు గొలుసులు పవడంపు దరిమెన
               కోళ్ళును వింతబాగుల బొగడలు
           రత్నంపు చిలుకలు రాయంచ ప్రతిమలు
               పసిడి పువ్వుల వ్రాతపనుల సోబగు

          వివిదంబులగు చిత్రవిరచనలును దసి
             లీ మాలుపట్టె యల్లిక బెడందు
          పలు తెరంగుల పట్టుతలగడ బిల్లలు
             మవ్వంపు కుంకుమపువ్వు పరపు
          గలిగి మెరుగలు దిక్కుల గడలుకొనగ
             మించు టద్దపు టుయ్యెల మంచమునను
          బొలుపు మీరుచు దన యంతిపురము
             సతులయూడిగంబులు గైకొంచు నున్నశౌరి'[124]

కొందరు పావలు (సమ్మాళిగలు) తొడిగిరి. జనులకు నిలువుటద్దాలు, చేతి అద్దాలుండెను, ఆచారపరులవి మట్టివని కంచుటద్దాలను వాడిరి. కంచును బాగాతోమి దానిలో చూచుకొనిరి.[125] జనులు ధనము జాలెలను (వల్లువము, వల్లము) నడుమున కట్టుకొనిరి.[126]

బీదజనుల యిండ్లు పూరికప్పులవై యుండెను. మట్టిమిద్దెల యిండ్లును వారికుండినట్లు ఆముక్తమాల్యదలో సూచితిమి. "మట్టిమిద్దెల వారికి నిదురు చెడియె" (ఆము. 4 - 123). భోగమువారి యిండ్లే జనుల యిండ్లపైకి వైభవోపేతముగా నుండెనని విదేశి యాత్రికులు వ్రాసిరి. వారు చాలా ధనవంతులనియు, వారి యిండ్లు ఉత్తమముగా నుండెననియు పీస్ వ్రాసెను.

జనుల ఆచార వ్యవహారములు

మల్లయుద్ధాలు, కుస్తీలు జనులకు ప్రీతి. మల్లయుద్ధాదికల దృష్ట్వా[127] అని యొకడు వ్రాసెను. జనులు సాధారణముగా కంచు పాత్రలలో (కంచాలలో) తినిరి.[128]

మరులు తీగెను తొక్కితే బాట తప్పుదురని ప్రజలు విశ్వసించిరి.

        "మరులు దీగ మెట్టి యిరులన్న నోయనియెడు తమిస్రగాడు పడి పొలము
         లెల్లదిరిగి తూర్పు తెల్లనౌ తరినొక్క శూన్య గహనవాటిజొచ్చి చనుచు"[129]

మరులు తీగెను మర్లుమాతంగి యని యందురు. అదొక అలుము, సన్న ఆకు లుండును. దానిపండు గురిగింజంత ఎర్రగానుండును. దానిలో రెండుచిత్తులు దోసవిత్తులవలె నుండును. అ రెండు విత్తులు ఒకే దిక్కుననుండును. ఒకదాని కొకటి ఎదురుగా వేరు వేరు దిక్కుల మొగమైయుండును. ప్రియులను కూర్చుటకును తాంత్రికులు దీనిని వాడుదురు. దీన్ని గురించి ఆయుర్వేద వైద్యులెరుగుదురు. భర్తలు భార్యలపై ప్రేమ లేనివారైన వారిని వశీకరించుకొనుట యంత్ర మంత్ర తంత్రాలను సేవించి వశీకరణ మూలికలనుగొని భర్తలను భోజనమందు కలిపి తినిపించి పలుమారు వారిని తెలియక చంపుకొనెడి స్త్రీలు కొంద రానాటినుండి యీనాటివర కుండిరి. సంస్కృతాంధ్ర భారతములందు పాండవుల యరణ్యవాస కాలమందు ద్రౌపది భర్తల వశీకృతి కాశ్చర్యపడి సత్యభామ యామెను వశీకరణపు మణి మంత్రౌషధము లేవియో తెలుపుమని యడిగినట్లు వర్ణించినాడు. దీన్నిబట్టి స్త్రీల వశీకరణ ప్రయోగము లతి ప్రాచీన భారతీయ యోగములే యనవలెను. వాత్స్యాయనుని మొదలుకొని తర్వాతి కామశాస్త్ర ప్రవర్తకులందరును వశీకరణ యోగాలను గురించి వ్రాయనే వ్రాసిరి. కాని ఇవెందును పనిచేసినట్లు నిదర్శనములే లేవు. ఉన్న నిదర్శనాలవలన భర్తలు వశీకృతులగుటకు మారుగా భస్మీకృతులైరనియే తెలియవచ్చినది. రుక్మాంగదలో నిట్లున్నది:-

         'పతి నను నొల్ల డవ్విభుని బాయుట కోర్వగ జాల నక్కటా
          గతియిక నాకు నెద్గి గజగామిని యానతి యిమ్మటంచు రు
          ర్మతమున సిద్ధురాలికి క్రమంబున జెప్పిన చెట్టుయందు నీ
          పతికిది పాలతో నిడుము భర్తవశుండగు నంచు బల్కగన్‌'

'వలపు మందిట్లిడ మొక్కలమున పతి సమసె..........(3 - 239)

బ్రాహ్మణులు శిరస్స్నానము చేయునప్పుడు ఇప్పపిండిని రుద్దుకొనిరి.[130] రెడ్డిరాజ్యకాలములోని దొంగలలక్షణాలను చూచినాము. విజయనగర రాజ్యకాల కవులును ఇంచుమిం చవే లక్షణాలను వర్ణించి వారు, తాళ్ళపాక చిన్నన్న యిట్లువ్రాసెను.

         'చేయమ్ము, ఎకవారు చెప్పులు, రాగి చాయలు దేరు నచ్చపు నీలిదట్టి
          మొలవంకియను .... .... ఇనుము, కన్నపుగత్తి, యెడ దట్టిలోన
          పొసగిన దివ్వార్పు బ్రువ్వులకోవి తలముళ్ళు, చొక్కు, నిద్దపుదద్దగోరు
          బలపంబు, బదనికల్, బంతి కత్తెరయు,[131]

మున్నగు సాధనములతో దొంగలు దొంగతనాలు చేసిరి. పూర్వప్రకరణమున త్రాడు, వంకికొండియు దొంగల పరికరాలలో చేరినట్లును వంక ఇనుపకొండి త్రాట గట్టి గవాక్షములద్వారా వస్తువుల చేదుకొనుటకై యుండునని వ్రాసియుంటిని. అదే యుపయోగమును చిన్నన్న యిట్లు తెలిపినాడు. ఒకదొంగ యింటిలోనికి దిగి,

         'గురు హేమబింబంబు గొలుసునం గట్టి కదలింప నా సన్న గని మీది
          వారలది యందుకొని యంత నతని గ్రమ్మరను అల గొలుసున తొంటి
          యట్ల నెన్నడును బలసి చేరుకొనంగ....' [132]

దొంగల దోపిడివిధానమును (టెక్నిక్) రాయలు విపులముగ సమగ్రముగా వ్రాసినారు. ఒక బ్రాహ్మణుడు తనభార్య యూరికి శిష్యునితోను కొత్త కోకలు రూకలసంచితోను పయనమయ్యెను. ప్రయాణముచేయువా రొక్కరొక్కరుగా పోకుండిరి. కాన యితరబాటసార్ల పయనము చూచుకొని అతడు పయనమయ్యెను. ఒక దొంగ యతని వెంట తానును ఒక బాటసారివలె సిద్ధమయ్యెను. రాత్రి పథికులు ప్రయాణము చేయక మజిలీలలోని సత్రాలలో దిగెడివారు. తెల్లవారకముందు వారు లేచి ఉత్తరదిక్కు ప్రయాణమైరి. వారిలో పథికుడుగా చేరిన దొంగ ముందే తనవారి కీసంగతి తెలిపి వారిని దారికాచుటకు పంపెను. సాతు (బాటసారులగుంపు) ప్రయాణము చేయుచుండగా దొంగ తనకు బాగా తెలిసినట్లుగా బాట చూపువాడై వారి నొక యడవిలోనికి తప్పించి ఒక సెలయేరు రాగానే ఈల వేసెను. ఈల దొంగల సంకేతము. వాగులు, వంకలు, కనుమలు, దొంగలకు దోచుకొను అనుకూలస్థానాలు. ఈల వేయగానే దాపునుండి ఒక బాణము సంచకరముగా సాతుపై బడెను. వెను వెంటనే రివ్వురివ్వున రాళ్ళవాన గురిసెను. బాటసారులాగి హల్లకల్లోలము చెందిరి. తర్వాత దొంగలు కనబడి సాతును చుట్టివేసి కొట్టి గాయపరచి దోచుకొనిరి. బాటసారులలో కొందరు పారిరి. కొందరు మూటల చెట్లచాటున పారవేసిరి. కొందరు కొట్టవద్దు, మా స్త్రీల నంటవద్దు, కావలసిన దిదిగో అని యిచ్చిరి. కొంద రమ్ముల నెక్కు పెట్టిరి. అట్టివారి జోలికి పోలేదు. ఏమి లేనివారిని పరీక్షించి వదలిరి. ప్రొదలలో దాగినవారిని ఈటెలతో పొడిచి, వారి బట్టలను గూడా లాగికొని, పాత గుడ్డలను గోచులకై ప్రసాదించిరి. బాటసారుల చెప్పుల అట్టలను గన్నెరాకువంటి బాణాలతో చీల్చి అందేమైనా దాచిరేమో చూచిరి. ప్రయాణికులును దొంగలకు దొంగలు, చెప్పులలో, జుట్లలో, టోపీలలో, వస్తువులదాచి తీసుకొని పోవుచుండిరి. బ్రాహ్మణుడు తనశిష్యుని వానగతికి వదలి తన వరాలసంచి యొక్కయు, తన పొట్టయొక్కయు బరువుతో ఉరుకలేక ఉరికెను. బాటసారుల వెంట వచ్చిన దొంగబాటసారి వానిని వెన్నంటి కొంకులపై సురియతో నరికెను. మొలత్రాట గట్టిన వరాలసంచి దోవతిలాగి త్రెంచుకొనెను. గౌదకట్టుటోపీని విప్పి పరీక్షించెను. వాడు పొరుగూరు మాలదొంగకాన బ్రాహ్మణుడు గుర్తుపట్టి, తెలివి తక్కువతో, ఒరే యెటు తప్పించుకొందువో చూతాములే, అనిఅన్నాడు. గుర్తుపట్టినవాన్ని చంపవలసి వాడు చావగొట్టెను. అంతలో మరొకబిడారు (బాటసారులగుంపు) ఆ దారిరాగా వాడడ్డాదిడ్డి పోట్లుపొడిచి తనవారిని కలుసుకొని పారిపోయెను. ఆ బిడారులో బ్రాహ్మణుని బావ యుండెను. కాన తనను కావడిలో పట్టించుకొని పోయెను. కాని బాటలోనే బ్రాహ్మణుడు గుటుక్కు మనెను, [133]

దొంగల పట్టుటలో భటులు, వారి అధికారులు, గ్రామాధికారులు "ఘల్లు ఘల్లున గిలుకలతోడి గుదియలు" చేతబట్టిన తలారులు బాగా శ్రద్ధ వహించెడివారు. దొంగతనపు సొమ్ములను అమ్ముటను గమనించి దొంగల పట్టుచుండిరి. దొంగసొమ్ములు భోగమువారి యిండ్లకు, కమసాలులకు చేరునని మొదలు వారి నొకకంట చూచెడివారు. దొంగలు దొరకిన వారిని బాథలు పెట్టి పట్టుకారులతో హింసించి దాచినతావులను తెలుసుకొని దోచిన సొమ్ములు తెప్పించెడివారు. తర్వాత గ్రామపెద్దల రచ్చకట్ట పంచాయతిలో వారిని విచారించి పెద్దలిచ్చిన శిక్షను అపరాధులపై విధిస్తూవుండిరి. అపరాధులను నిర్బంధములోనుంచి వారిచే భవనాలకు, కోటల నిర్మాణాలకు సున్నము రాళ్ళు మోయించెడువారు. [134]

          దొంగలు తప్పు నొప్పుకొననిచో,

         'ఇడుమ కట్టున వేడి యెండలో మిగుల జడియ వీపులమీద చాపరాలెత్తి
          పొగడదండలువైచి పోనీక యెదుట బెగడ దిట్టుచు నడ్డపెట్టి....' [135]

బాధించెడివారు. ఇడుమకట్టున అన ఇంటిముందట యని యర్థమను కొందును. పొగడదండ అనుపదమునకు శ. ర. లో అర్థములేదు. తప్పు చేసినవారికి పొగడపూలదండ వేసి పూజించి ప్రార్ధించి తప్పు నొప్పించు కొనరుకదా! శ్రీనాథునికిని చేతికి కట్టెకోడెము వేసి వెదురు గూటముతో బిగించి గుండు నెత్తించి వీపున బండలు వెట్టిరి. అ శిక్షలలో పొగడదండను కూడా వేసి శిక్షించిరి.

         'కవిరాజుకంఠంబు కౌగిలించెను కదా పురవీధి నెదురెండపొగడదండ'

అని యతడు దు:ఖించెనుగదా! ఇచ్చటకూడ వేడియెండలో నిలబెట్టి బండలెత్తి పొగడదండలు వేసిరన్నారు ఒక్క పొగడదండకాదు, పొగడదండలు అవి అన్నారు. అవేటివి? అవి పొగడపూలవలె నుండు యినుపసంకెళ్ళో లేక త్రాళ్ళో అయియుండును. నేటికిని అప్పులు చెల్లించనివారిని మెడకు త్రాడో సెల్లానో చుట్టి లాగుకొనిపోవుదురు. మెడపట్టి లాగింతుమనుటయు కలదు. రుద్రకవికృత నిరంకుశోపాఖ్యానమందు నిరంకుశుడు గుడిలో శివవిగ్రహముతో తనదియు విగ్రహముదియగు జూదమాడి, తానే గెలిచి శివుని తన పందెము చెల్లించుమనెను. విగ్రహము పలుకలేదు. పలుకకుండిన విడతునా? అని అత డిట్లనెను.

         "తగునె పన్నిద మీక యీగతి దప్పు మౌనము దాల్పగా
          తగవు నీకును నాకు బెద్దల దండ బెట్టెద జడినై

          గగనకేశ! యటంచు జందురు కావి సేలు గళంబునన్
          పొగడదండ యొనర్చెనా విట భూసురాగ్రణి దిట్టయై"
నిరంకుశోపాఖ్యానము, అ.3 ప.26.

దీనినిబట్టి పొగడదండ క్షణము కొద్దిగా వెల్లడి యవుతున్నది. మెడలో త్రాడో, గొలుసో, దుప్పటో, సెల్లయో పెనవేసి ఇయ్యవలసిన పైక మిచ్చు వరకు కదలరాదుసుమా! అని ఆజ్ఞ పెట్టుటకు పొగడ దండ వేయుట అని చెప్పవచ్చును. సెల్లను నిరంకుశుడు శివమూర్తి కంఠమున వైచినప్పుడు "పొగడదండయుబోలె నప్పు, గడదండ, కాలకంథరుమెడ కలంకార మయ్యె" అనుటచేత పొగడపూల దండవలె సెల్లను మెడకువేసెనని యర్థమగును.

        "......పార్వతిదవుని కంఠమునన్ దగిలించినట్టి కాం
         చన మణి రుచ్యమాన నిజ ఠాటి చెరంగులు గూడ బట్టి నీ
         పని యన నెంత వేగిరమ పన్నిద మిమ్మని దీయ నయ్యెడన్"

ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓటమి యొప్పుకొని పందెపునప్పు నిచ్చుకొనెను. దీనినిబట్టి సెల్లాయంచులను కూర్చిపట్టి నీ 'పని' పట్టించెద చూడుము; లేకున్న అప్పును చెల్లించుము అని సెల్లాతో లాగెను. 'తీయ' అనగా తివియ=లాగగా అని యిచ్చట అర్థము చెప్పుకొనవలెను. ఈ కథాభాగము పొగడదండ లక్షణమును మనకు కొంత వెల్లడి చేసినది. రుద్రకవి క్రీ.శ. 1620 ప్రాంతమువాడు. ఈ 300 ఏండ్లలోనే మన పూర్వుల మాటలు, ఆచార వ్యవహారాలు కొన్ని మనకు తెలియరానివై పోయినవి. ఇంకనూ ఉపేక్షించిన మిగిలిన కొద్దిపాటి జాడలు కూడ పూడిపోగలవు.

"నేరములకు శిక్షలు చాలా ఘోరముగా నుండెను. చిన్న దొంగతనాలు చేసినవారికి ఒకకాలు ఒకచేయి నరికెడివారు. పెద్ద దొంగతనాలు చేసినవారిని గొంతుక్రింద కొండి క్రుచ్చి వ్రేలాడగట్టి చంపిరి. ఉత్తమ కులస్త్రీలనుగాని, కన్యలనుగాని చెరచినవారిని ఉరికొండిపై చంపిరి. రాజద్రోహము చేసిన పాలెగార్లను బంధించి శూలాలను పొట్టలలో పొడిచి శూలారోపణము చేసెడివారు. చిన్నకులాలవారు నేరములు చేసిన సాధారణముగా వారిని తలగొట్టుచుండిరి. అపరాధుల కొందరిని ఏనుగులచే త్రొక్కించిరి. కొన్ని అల్పపు నేరములకు అధికారులు జనుల వీపులపై బండ లెత్తించి దినమంతయు వంగబెట్టెడివారు". పరిపాలనకై దేశమును 200 మండలాలుగా విభజించి యుండిరి. ప్రతిమండల మొక పాలెగారు అధీనమం దుండెను. వారు నిర్ణయమగు పన్నును చెల్లించుటకును నియమిత సైన్యముతో సిద్ధముగా నుండి ఆజ్ఞయైనప్పు డంతయు ఆ సైన్యముతో రాజసేవలోకి వెళ్ళుటకు బాధ్యులై యుండిరి.

పూటకూళ్లు పెట్టి జీవించు నాచారము మనకు కాకతీయుల కాలమునుండియు కానవస్తున్నది. పూటకూళ్ళలో "ఆహారవిహారములు" దొరకుచుండెనని క్రీడాభిరామమందు వర్ణింపబడెను. విజయనగరమందు పూటకూళ్ళు సమృద్ధిగా నుండెను.[136] పూటకూలివారు ద్రవ్య మార్జించువారు కాన కల్తీ భోజనము పెట్టి, పాసిన వంటకాలు ఉడుకువాటిలో కలిపి వాసన నెయ్యిని తెచ్చి, మజ్జిగలో నీరెక్కువగా పోసి, ఇట్టి దుష్ట చర్యలను చేసెడివారు. "పూటకూళ్ళది పుణ్యమునకు జొరదు!" అనుటచే స్త్రీలే అందును బహుశా వితంతువులే. వారును బ్రాహ్మణులే యీవృత్తిపై జీవించువారు. "అక్కవాడల నరకూళ్ళు మెక్కి"[137] అనుటలో వీధులలోనికి పోయి అక్కా అమ్మా అని స్త్రీలను మంచివారి చేసుకొని సగము గడుపున కన్నము తిని-అని వేదమువారు వ్యాఖ్యానించినారు. కాని పూటకూళ్ళ అక్కలవద్ద హితవుకాని యన్నము లభించుటచేత సగము గడుపునకే తిని-అని యర్థమగును. క్రీడాభిరామమందు కూడ పూటకూటింటికి పోవునప్పుడు అక్కలవాడకు పోదమన్నారు. 'వంటలక్క' అని నేటికిని పూట కూళ్ళయామె నందురు.

నగరాలలో క్షౌరశాలలుండెను. అవి విజయనగరములో సమృద్ధిగా నుండెను.

          "కూర్చుంబు గొరిగించుకొని యుష్టతోయంపు
           టంగడీ తలగడుగు" [138]

క్షౌరశాలలేకాక తలంటి అంగమర్దనము చేసి ఉడుకునీళ్ళతో నలుగుతో స్నానము చేయించి పైకము తీసుకొను అంగళ్ళుకూడా నెగడి యుండెను. నగరాల దుర్లక్షణాలలో లంచాలు, కూటసాక్ష్యాలు ముఖ్యమైనవి. అవి విజయనగరమందు ప్రబలియుండెను. పైకము తీసుకొని కూటసాక్ష్యాలిచ్చువారు, లంచాలు తీసుకొని అన్యాయపుతీర్పు చెప్పు పెద్దలుండిరి. [139]

వైష్ణవభక్తులు "గర్బమంటపి గడిగిన కలకజలములోని రాతొట్టినిండి కాలువగ జాగి గుడివెడలి వచ్చునది శూద్రు డిడగ గ్రోలి" పోయెడివారు.[140] దీన్నిబట్టి శూద్రవైష్ణవులు కొందరు గుళ్ళలో అర్చకు లనియు, గుళ్ళలో రాతొట్లుండెననియు, మురికినీరే తీర్థమనియు, హరి పాదోదకమనుపేర అ మురికి నీటినే ఆ శూద్రుడు బ్రాహ్మణాదివర్ణముల వారికి తీర్థముగ నిచ్చెననియు తెలియ వచ్చెడి. తీర్థప్రసాదాలకు అంటు ముట్టు దోషములేకుండెను. ఆ యాచారమిప్పుడు పూర్తిగా మృగ్యము. అనాడు వీరశైవమున కెదురొడ్డిన శ్రీవైష్ణవములోను జనాకర్షణము సంస్కార ప్రియత్వముండెను. తర్వాత మరల వాటియవసరము కానరాలేదు.

జనులు భూమిలో పాతిన ధనపుజాడలను పెద్దలు చచ్చువరకు చెప్పక, చచ్చునాడు చెప్పక చచ్చుటచేత, వారి సంతతివారు ధనాంజనాది తంత్రజాలము నెరిగినవారి నాశ్రయించి ధనము నావరించిన భూతాలకు బలినిచ్చి ధనమును తీసుకొనెడివారు. భూతాలకు నెత్తుటి కూటిని తూరుపుతట్టు బలిగాపెట్టి ధనమును త్రవ్వి తీసుకొనెడివారు.[141]

పెండ్లిండ్లలో నేటికాలములో వలెనే బంధుమిత్రులు చీరలు, వస్త్రములు, భూషణములు మున్నగునవి చదివించెడువారు.[142] అల్లుం డకు మామలు విలువగు వస్త్రభూషణములను చదివించిరి.[143] ధనికులగు తల్లిదండ్రులు తమ కూతుండ్ర కరణముగా మంచములు, పరుపులు, పళ్లెములు, పీటలు, ఉయ్యెలమంచములు, తమ్మవడిగములు, బిందెలు, కొప్పెరలు, వక్కలాకుల పెట్టెలు, రత్నమౌక్తిక స్వర్ణభూషణములు, పట్టుబట్టలు, అగరు, కస్తూరి, జవ్వాజి, కుంకుమపువ్వు, గంధము, పచ్చకర్పూరము, పన్నీరు, పునుగు, అత్తరు మున్నగువాని నిస్తూ వుండిరి. కూతుండ్ర సేవలో నుండుటకు దాసీలను (ఆడపాపలను) కూడా ఇచ్చి పంపెడివారు.[144]

జనులు సాధారణజాడ్యాలకు చికిత్సలు కొంతవరకు తెలిసియుండిరి. నిన్న మొన్నటివరకు ప్రతి గ్రామములో కొందరు ముసలమ్మలు వాము, మిరియాలు, దుంపరాష్ట్రము, పిప్పళ్లు, సొంఠి మున్నగునవి మందుల మూటగా కట్టి యుంచుకొనెడివారు. తులసిచెట్లు చాలాయిండ్లలో నుండెడివి. వాటి రసము జ్వరాల కిచ్చెడువారు. ఇంకా కొంత తెలిసినవారు దుప్పికొమ్ము, గోరోజనము, కస్తూరి, కుంకుమ పువ్వు, వైష్ణవి, భైరవి మాత్రలు ఉంచుకొనెడివారు. గడ్డలకు గోధుమపిండి యుడికించి కట్టిరి. నెత్తి నొప్పులకు గులకరాళ్ళ ఆవిరి యిచ్చిరి. నొప్పులకు వేపాకు మున్నగునవి కాచి కాక వేసెడివారు. నేత్రరోగాలకు ఆకాలమందు చేసిన చికిత్స యిట్లుండెను.

         "కోక పొట్లం బావిగొన నూది యొత్తుచు
             కషణోష్ణకరభభాగమున గాచి
          నెత్తి తంగేడాకు మెత్తి రేచకినిమ్మ
             పంటిపుల్సున నూరి పట్టు వెట్టి
          తెల్ల దింటెనపువ్వు దెచ్చి తద్రస మిడి
             జలివెపువ్వులు గోసి నిలిచి విడిచి
          పేరననెయి వెట్టి పెరుగువత్తులువైచి
             చనుబాలతో రాచి సంకు చమిరి" [145]

నానావిధ చికిత్సలు చేసిరి. దెబ్బలు తగిలినప్పు డీ క్రింది చికిత్సలు చేసిరి:-

         "కొంగవాల్నరకు లంగుళుల బట్టుచు జబ్బ లంట గుట్టిడ వెజ్జునరయు
          వారు తలబడ్డ గుదియ ప్రప్పుల బ్రాతమసి యిది" [146]

చికిత్సలు చేసుకొనిరి. కొంగవలె వంకరగా నుండు మాదిగకత్తిచేత బుజములు చీలినప్పుడు వైద్యులచే కుట్టు వేయించుకొనిరి. తలపై దెబ్బలు పడి చీలగా పాతగుడ్డల కాల్చి దానిమసి నందు పూసి తాత్కాలిక చికిత్సలు చేసుకొనిరి. వైద్యుల వేషము, వారిశాస్త్రమునుగురించి యింతకుముందే తెలుపనైనది.

అప్పుడప్పుడు క్షామ మేర్పడినప్పుడు పూర్వకాలమందు జనులు చాలా కష్టపడెడివారు. పలువురు ఆకలిచే చచ్చిరి. పలువురు పిల్లల కూటికై అమ్ముకొనిరి. మన కాలమందే 1941 ప్రాంతములో బెంగాలు క్షామము వల్ల 20 లక్షల జనులు చావలేదా! రైళ్ళు, రోడ్లు, మోటారులు లేని ఆ కాలములో క్షామబాధ లెట్టివీగా నుండెనో యూహించు కోవచ్చును. ధాన్యము దొరకక జనులు ఊదర్లు ఈతగుజ్జు మొదలయినవి తినిరి.

           "గునుగు లూదర్లు బరపటల్ గోళ్ళగొండు
               లల్లిబియ్యంబు వెదురుబియ్యంబుగొట్టె
            చెట్లు నింజెట్లు తుంగముసైయలు నీత
               గుంజు మొదలుగ దిన దొరకొనియె జనము
            అరువడు గంపెతవిందయ లరువది
               దినములకు బండునని బ్రతుకాసన్
            తరచుగ నేతా లెత్తగ బరిపరియై
               యవియు మల్లెపడి చెడిపోయెన్."

పెద్దపెద్దగ్రామాలలో వారపుసంత లుండెను. వర్షాకాలములో అవి సరిగా సాగనేరకుండెను.([147]) సంతకు తిరుగు బేపారులు గుర్రాల నుంచుకొని వానిపై నెక్కి వెళ్లుతూ వుండిరి. "ఊరూరి సంతకుం దిరుగ పెద్ద లింటింట సంతరించు పిలుకువాటు గోడిగ జావడములు" వారి కుండెను([148].)

విజయనగర రాజ్యములో కృష్ణదేవరాయలును, తదితర చక్రవర్తులును సత్రాలు కట్టించి యుంచి బ్రాహ్మణులకు ఉచితముగా భోజనము పెట్టుతూవుండిరి. ([149])

జనుల వినోద విలాసము

పండుగలు జనులకు ఉత్సవకాలాలు. ఆనాటి పండుగలే యీనాడును కలవు. అదంతగా భేదము లేదు. ఏరువాక పున్నమ వ్యవసాయకులకు ముఖ్యమైనట్టిది, పలువురు ఏరువాక అనగా ఏరులు వచ్చేకాలమందు చేయు పండుగ అని పత్రికలలో పెద్దపెద్ద వ్య్సాలు వ్రాసివేస్తూ ఉన్నారు. ఏరు అనగా నాగలి. ఏరువాక సాగించుట అనగా దున్నుట కారంభించుట. జ్యేష్ఠపూర్ణిమనాడు ఎద్దులను కడిగి రంగులతో అలంకరించి నాగండ్లకు ఎర్రమన్ను సున్నం పట్టెలు వేసి నూనెరంగులు పూసి చీరలు కట్టించి సొమ్ములు పెట్టి సాయంత్రము మంగళ వాద్యముతో నాగళ్ళను గొర్రులను బుజాలపై తీసుకొని ఎద్దులతో ఊరేగి పొలాలకు పోయి దుక్కి ప్రారంభము చేసి వత్తురు. ఆనాడు భక్ష్యభోజ్యములతో గాటికి నై వేద్యమిత్తురు. ఇది ఏరువాక పున్నమ పండుగ. ఇది వైదికోత్సవమే! సందేహములేదు! "జ్యేష్ఠమాసస్య పౌర్ణిమాస్యాం బలీవర్దాన్ అభ్యర్బ: ధావంతి పోయం ఉద్పృష భయజ్ఞ:" అని జైమినీ న్యాయమాలలో నుదాహృతము.

          "కాలుని దున్ననంది నయి గంటలు దున్నక మంటినా, మహా
           కాలునినంది దున్ననయి కర్దమ మగ్నతలేక మంటినా,
           హాలికు లెన్నడున్ దెగని యౌరుల చేలును, ఔకుమళ్ళునన్
           గా, లలినేరు సాగిరిల గల్గు పసి గొని పేద మున్నుగన్." [150]

కాపులు దొరికిన దున్నలను, ఎద్దులను కట్టి గడ్డినట్లు, దుబ్బలు దున్నుట కానా డారంభించిరన్న మాట.

దసరా పండుగ రాయల యాస్థానములోను, సామంతుల యాస్థానము లందును మహావైభవముగా జరుగుతూ వుండెను. అది క్షత్రియుల పండుగ. సైన్యమునకు ప్రాధాన్యమిచ్చిన చక్రవర్తు లా పండుగను ఆకర్షణీయముగా చేయుట సమంజసమే. ఆంధ్రుల పండుగలలో విదేశీయులకు దసరా హోలీ చాలా ముఖ్యమైనవిగా గనబడెను. అబ్దుర్రజాఖ్ స్వయముగా దసరా పండుగను జూచి యిట్లు వ్రాసెను.

"చక్రవర్తి తమపాలెగాండ్రను, నాయకులను, అందరిని తన నగరానికి పిలిపించుకొనుచుండెను. మూడునాల్గునెలల ప్రయాణము చేయునంతటి దూర దేశపు సామంతులును వచ్చెడివారు. 1000 ఏనుగులకు రంగులు వేసి అలంకరించి పండుగదినాలలో మైదానములో నిలిపెడివారు. అందమైన ఒక పెద్దమైదానములో అయిదారంతస్థుల బంగ్లాలుండెడివి. అన్ని యంతస్థులలోను గోడలపై చిత్తరువులు వ్రాయబడి యుండెను. మనుష్యులు, జంతువులు, ఈగలు, నత్తలు కూడా చిత్రింపబడెను. అ చిత్తరువులు అతిసుందరమై కళాకాంతులతో శోభనిచ్చెను. అదే మైదానములో స్తంభాలతో కూడిన తొమ్మిది అంతస్తులమేడ యుండెను. అది సాటిలేని అందచందాలమేటిమాలె. చక్రవర్తి సంహాసనము తొమ్మిదవ యంతస్తుపై నుండెను. అది చాలా పెద్దసింహాసనమై, సువర్ణమయమై, రత్నాలతో నిండినదై యుండెను. దాని అందాన్ని అలంకరణాన్ని చూచి ప్రేక్షకులు ముగ్ధులవుతూ వుండిరి. ఆ సింహాసనముపై ఆసీనుడై చక్రవర్తి దసరావేడుకల నవలోకించెడివాడు. ఆ యుత్సవము మూడుదినాలు జరుగుతుండెను. వేషగాండ వినోదాలు, గారడివారి ప్రదర్శనాలు, భోగంవారి ఆట పాటలు చక్రవర్తియెదుట ప్రదర్శింపబడుతుండెను."

పీస్ అనువా డిదే యుత్సవమును విపులముగా వర్ణించినాడు. పై విషయములతో పాటు మరికొన్ని యిట్లు తెలిపినాడు.

"జెట్టీలు కుస్తీలను ప్రదర్శించిరి. రాత్రులందు బాణసంచాలను కాల్చుతుండిరి. అందు నానావిగ్రహాలు, వాటినుండి పటపటమను బాణాలు ఆకాశాని కెగిరి. పగులుచుండెను. కాళీశక్తికి నవరాత్రులలో ప్రతిదినము 24 దున్నపోతులు, 150 మేకలు బలి ఇచ్చుచుండిరి. తుది దినమునాడు 250 దున్నలను, 400 మేకలను బలియిచ్చిరి. ప్రతిదినము బ్రాహ్మణులు దేవీపూజలు చేసిరి. గుర్రాల నలంకరించి ఊరేగించిరి."

ఒకతడవ కృష్ణరాయలు స్వయముగా ఒక అడవిదున్నను వేటాడి పట్టుకొని వచ్చెను. దానిని దేవీనవరాత్రులలో దేవికి బలి యియ్య నేర్పాటు చేసెను. ఆచారప్రకారము ఒకే ఒక కత్తి వ్రేటుతో దున్నతల తెగిపడవలెను. తెచ్చిన యడవిదున్న ఏనుగంతటిది. దాని కొమ్ములుసాగి తోకను తాకుచుండెను. అంతటి జంతువును ఒకేవ్తేటుతో నరకుటకు వీరులందరును వెనుక ముందాడిరి. అప్పుడు విశ్వనాథనాయకుడు ఖడ్గము తీసుకొని సులభముగా ఒక్క కత్తిఊపుతో దాని తలను ఎగురమీటెను.[151] హోలీపండుగను రాయలకాలములో వసంతోత్సవమనిరి. నికలోకాంటి దాన్నిగురించి యిట్లు వ్రాసెను. "వీధులలో ఎరుపురంగు నీరుంచెడి వారు. వసంతోత్సవదినాలలో వీధులలో పోవువారి యందరి పైనను ఎవరు బట్టితే వారు రంగునీటిని చల్లుతుండిరి. తుదకు రాజుకాని, రాణి కాని ఆదారిని వెళ్ళితే వారికి ఈ సంప్రోక్షణ తప్పకుండెను [152]. వసంతోత్సవ కాలమందు నానాప్రాంత సమాగత కవులవర్ణనలు విని ఆనందించి వారికి బహుమానము లిస్తూవుండిరి.

"ప్రతివర్ష వసంతోత్స కుతుకాగత సుకవి నికరగుంబి స్మృతిరోమాంచవిశంకిత చతురాంత:పురవధూ ప్రసాధనరసికా!'[153] అని ముక్కు తిమ్మన రాయలను సంబోధించెను.

దీపావళినిగూర్చి కూడ మనకు విపులముగా తెలియవచ్చినది. విజయనగర చక్రవర్తుల కాలములో (క్రీ.శ. 1450-1550 ప్రాంతములో) రచితమైన "అకాళభైరవకల్పము" అను సంస్కృత గ్రంథములో దీపావళీవర్ణన మెక్కువగా కలదని భండార్కరుసంస్థ కధ్యక్షులగు పీ.కే. గోడేగారు వ్రాసిరి. (Annals of Bhandarkar institute, Vol. xxv1), "రాజు ఆశ్వయుజ కృష్ణ చతుతుర్దశినాడు తెల్లవారకమునుపే బ్రాహ్మీముహూర్తమందు లేచి శుచియై, బ్రాహ్మణాశీర్వాదము లందవలెను. తర్వాత బయట మంగళపంచవాద్యాలు మ్రోగవలెను. ముత్తైదువలు వారిని స్నానమునకు సిద్దము చేయవలెను. మల్లులు తలంటి గోర్వెచ్చనినీటితో స్నానము చేయించవలెను.

         "నదత్సు పంచవాద్యేషు బాహ్యకక్ష్యాంతరే తత:
          క్వణత్కంకణయా వధ్వా దరవల్గ ధురోజయా
          అభ్యక్త: స్నాపితో మల్లై: కైశ్చిత్ కోష్ణేణ వారిణా॥
"

"ఇదంతయు సూర్యోదయానికి మునుపే ముగించుకొని తర్వాత దర్బారు చేసి గాననృత్యవినోదముల నానందించి అందరికినీ బహుమతులిచ్చి మధ్యాహ్నము భుజింపవలెను. రాత్రివేళ పటాకాలను కాల్చవలెను" అని యాకల్పములో వ్రాసినారు. ఆ కాలములోని ఆంధ్రులవినోదాలలో కొన్ని ముఖ్యమైన విప్పు డంతరించి పోయినవి. అందు ముఖ్యమైనది సిడి అనునట్టిది. దానిని కేవలము వినోదమనుటకు వీలులేదు. అది భక్తిప్రధానముగా ఆత్మహింసాత్మకముగా చేయునట్టి ప్రదర్శనము. జనులు మ్రొక్కుబళ్లు చెల్లించుటకై సిడిపై వ్రేలాడుతుండిరి. ఒక పెద్దగడయొక్క కొనయందు ఒకయినుప కొండిని కట్టి అది గడచట్టు తిరుగుటకై ఒక యినుపకడెను గడెకొనయందమర్చి దానికా కొండిని తగిలించెడి వారు. ఆ కొండిని స్త్రీపురుషులు తమ వీపుచర్మములోనో నరాలలోనో క్రుచ్చుకిని దానిపై వ్రేలాడి స్తంభము చుట్టును గిరగిరత్రిప్పబడు చుండెడివారు. దీనిని బార్బోసా చూచి యిట్లు వ్రాసెను. "ఈ దేశములోని (విజయనగర రాజ్యమందలి) స్త్రీలు అతి సాహసిరాండ్రు. తమమ్రొక్కుల చెల్లించుకొనుటలో భయంకరములగు పనులను చేతురు. ఒక యువతి ఒక యువకుని ప్రేమించినచో, ఆమె తన మ్రొక్కు చెల్లినచో సిడిపై వ్రేలాడెడిది. నిర్ణయమైన ఒక దినమున అలంకరింపబడిన యెద్దులబండిపై ఒక మోకును దాని కొక యినుపకొండి యుంచి తీసుకొనిపోదురు. మంగళవాద్యములతో ఆమె బయలుదేరును. ఆమె నడుమునకు మాత్రము బట్ట కట్టుకొనును. సిడిస్తంభమువద్దకు వెళ్ళి యినుపకొండిని ఆమె వీపుచర్మములోనికి గ్రుచ్చి సిడిపై కెత్తెదురు. ఆమె యెడమ చేతిలో చిన్న బాకుండును. గిరకను స్తంభానికి తగిలించి ఆమెను దానిపైకి లాగుదురు. ఆమె గాలిలో కొండిపై వ్రేలాడును. రక్తము కాళ్ళపొడవునను కారినను ఏ మాత్రమున్నూ తాపమును ప్రకటింపదు. పైగా కూతలు పెట్టుచు కత్తి త్రిప్పుచు నిమ్మకాయలతో తనప్రియుని కొట్టుతుండును. కొంత సేపటికి ఆమెను దింపి గాయమునకు కట్టు కట్టుదురు. ఆమె దేవళమున కందరి లోపాటు నడిచి బ్రాహ్మణులకు దానాలు చేయును."

సిడిని సిడిమ్రాను అనియు నందురు. దాని నిట్లు వర్ణించినారు. ఒక స్తంభమును పాతి దానికొనను ఒక గుండ్రని రాతిలో రంధ్రముచేసి తగిలింతురు. దానిపై సన్నని దూలమును పెట్టుదురు. ఆ దూలమును గుండ్రముగా త్రిప్పుదురు. దానికే గిరకతోటి కొండిని తగిలింతురు. ఆ కొండిపై మనిషి వ్రేలాడును. [154] కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో నొకడని ప్రతీతియేకాని, తర్వాతి కాలమువాడగు తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యములో ఈ సిడినిగురించి వర్ణించెను. ఇది రెడ్లలోనే యెక్కువగా నుండినట్లు తెలిపినాడు.

          "అంభోధరముక్రింద నసియాడు, నైరావ
           తియుబోలె సిడివ్రేలె తెరవయోర్తు"

అన్నాడు. (ఈ కవి రాయలతర్వాతి వానినిగా పరిగణించినందు ముందు ప్రకరణములో చర్చింతును.) ఈ సిడియాట నేడు లేదు. 400 ఏండ్లలోనే యింత మార్పు!

కోలాటమందు జనుల కాసక్తి యెక్కువగానుండెను. రాయలసీమలో నేటికిని వెన్నెలరాత్రులందు జనుల కది ప్రాముఖ్యమైనది. కోడి పందెములు చాలా విరివిగా నుండెనని పీస్ వ్రాసెను. అదొక్కటే కాదు. దున్నపోతుల యుద్ధాలు, డేగవేటలు, పాచికలాటలు, జనులకు ప్రీతి పాత్రమని పీస్ వ్రాసెను. "కాసె కట్టుటయు కత్తిదాల్చుటయు, కృకవాకుల కలహంబులంద" అని రాయలు వర్ణించెను.([155])

చతురంగపు ఆట చక్రవర్తులనుండి సాధారణజనులవరకు ఆసక్తిని కలిగించినట్టిది. దీనిని మోసిన్ పుట్టకముందే హిందువులు కనిపెట్టిరని ప్రతీతి నౌషీర్వాన్ అను ప్రసిద్ధ పారసీకచక్రవర్తి యీ యాట గొప్పదనమును విని హిందూస్థానమునుండి అదేపనిగా చతురంగపు పలకలను, కాయలను తెప్పించుకొని ఆ విద్యను నేర్పు గురువును పిలిపించుకొనెను. బాణు డీ యాటను వర్ణిం రుద్రటుడు తనకావ్యాలంకారములో దీనిని పేర్కొనెను. బొడ్డుచర్ల తిమ్మన్న అనునతడు రాయలకాలములో నీ యాటయం దతినిపుణుడు. లోకల్ రికార్డులలో నీతిని గూర్చి యిట్లు వ్రాసినారు. "అతడు కవీశ్వరదిగ్దంతి అనిపించుకొని కృష్ణరాయలవారి యొద్దకు పోయి వారితో చదురంగం ఆడుతూవుండేవాడున్నూ, ఆట గెలిస్తే వెయ్యార్లుపందెంవేసి గెలుస్తూ వుండేవాడున్నూ: అప్పుడు కృష్ణదేవరాయలు చాలా సంతోషించి కొప్పోలుగ్రామం, సర్వాగ్రహారముగా దారపోసి యిచ్చెను." ఈ విషయాన్ని పురస్కరించుకొనియే ఒక చాటు విట్లు కలదు.

         "శతసంఖ్యులొక్కటైనను సతతము శ్రీ కృష్ణరాయ జగతీపతితో
          చతురంగమాడి గెలుచును ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భళిరే!"

ఆ కాలపు పిల్లలాటలను కవులు కొందరు వర్ణించినారు. కాని అందు మనకు తెలియనివే యెక్కువగా కలవు నిఘంటుకారులును మనకుండు సందేహాలతో 'బాలక్రీడావిశేషము' అని అర్థము వ్రాసి దాటుకొన్నారు. పింగళిసూరన యిట్లు వ్రాసెను.

         "దినముల్ గొన్ని చనంగ నంత కడు వర్థిన్ బొమ్మపెండ్లిండ్లు, గు
          జ్జెనగూళ్ళచ్చనగండ్లు, పింపిళులు కుచ్చీల్, గీరనగింజ, లో
          మనగుంటల్, కనుమూసిగంతనలు, కంబాలాట లోనైన ఖే
          లనముల్ మీరగ బోంట్లతో సలరె బాలారత్న మెల్లప్పుడున్" [156]

గుజ్జెనగూళ్ళు=(కూళ్ళు) పిల్లలు గురుగులలో వంటలు వండి వడ్డించినట్లు ఆడుకొను ఆట. పింపిళ్ళు అన పిల్లలు పెదవులతో ఘర్షణ ధ్వనులు చేస్తూ గొంతుకూర్చొని పాదాల నాడించి ఆడెడియాట. కుచ్చిళ్ళన గూడమణియని సూ. రా. నిఘంటువులో కలదు. అనగా మట్టిలో లేక ఇసుకలో బారెడు మూరెడు పొడవు కట్ట చేసి అందేదైన వస్తువును దాచిన దానిని రెండవవారు కనుగొనుట. గీరనగింజల కదేగతి పట్టినది. అచ్చనగండ్లలోవలె గులకరాళ్ళతో ఆడుయాటగా తారాశశాంక మందలి యీ పద్యభాగమునుబట్టి యూహింపవచ్చును.

          "........వైశ్యకన్యకల్ గీరనగింజ లాడుతరి
           క్రిందను జిందిన దివ్యరత్నముల్."

ధనికుల పిల్లలు, అందులో కవిత-అందుచేత వారు రత్నాలతో ఆడిరి. ఇవి ఆడుపిల్లలాటలు. మగపిల్లలాటలను గురించి ధూర్జటి యిట్లు తెలిపినాడు.

         "చిట్లపొట్లాకాయ సిరిసింగణాపత్తి గుడుగుడు గుంచాలు కుందెనగుడి
          డాగిలి మ్రుచ్చుటాటలు గ్రచ్చకాయలు వెన్నెలచిప్పలు తన్నుబిల్ల
          తూరనతుంకాలు గీరనగింజలు పిల్లదీపా లంకిబల్లిగోడు
          చిడుగుడు లవ్వలపోటి చెండుగట్టిన బోది యల్లి యుప్పనబట్టె లప్పళాలు
          చిక్కనాబిల్ల లోటిల్లు చిందరాది యైన శైశవక్రీడావిహారపరణి
          చెంచుకొమరులతోడ నుద్దించు కాడుతిన్న డభినవ బాల్యసంపన్ను డగును" [157]

విష్ణు పురాణములో మరికొన్ని తెలిపినారు:-

         "కోలక్రోతులు బిల్లగోళ్ళు దూరనగోల
          లందలంబులు మది కుందికాళ్ళు" (ఆశ్వాసం 7.)

పై యాటలలో మనకు తెలియని వన్నియు నై ఘంటుక "బాల్యక్రీడా విశేషాలే" అని యిప్పటికి తృప్తిపడవలెను.

సంపన్నుల యిండ్ల పెండ్లిండ్లలోని విందు లెట్టివనగా:-

         కలవంటకములు బూరెలు తేనెతొలలు
            చాపట్లు మండిగ బొబ్బట్లు వడలు
         కుడుములు సుకియలు గడియంపుటట్లు
            వెన్నప్పాలు వడియంబు లప్పడాలు
         బొంగరములు సొజ్జెబూరెతాగులు సేవ
            లుక్కెర లరిసెలు జక్కిలములు
         కర్జూర గోస్తనీ కదళికా సహకార
            ఫలములు కొబ్బరి పనసతొనలు

          తేనియలు జున్ను మీగడ లానవాలు
              పానకములు రసావళ్ళు పచ్చడులు న
          వాజ్య మొలుపు బప్పులు కూర లనుపమాన్న
              నపుడు ప్రజనెల్ల దనియించె నహరహంబు"[158]

తుదకు పాకములందును కొన్నిజాడ లెరుగలేకున్నాము ! పైవన్నియు బ్రాహ్మణుల విందులే ! ఇతరులలో ఇన్ని లేవు. వాటికి మారుగా మాంస మత్స్యాదిపాకములు చేరును. రాయలు బ్రాహ్మణుల మరికొన్నితిండ్లను గూర్చి తెలిపినారు. పొరివిళంగాయ (వేపుడుబియ్యపు బిండితో బెల్లపుపాకాన చేసిన యుండలు), పెరుగు వడియములు, పచ్చివరుగు ఇవి ప్రయాణభుక్తి సంబారములు.[159] వానకాలములో కలమాన్నము. ఒల్చినపప్పు, నాలుగైదుపొగసిన కూరలు, వరుగుల, పెరుగు, వడియములు, నెయ్యియు-వేసవికాలములో ఉలివెచ్చ అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసు, పలుచనియంబలి, చెరకుపాలు, ఎడనీళ్ళు రసావళులు (అతిరసములు), వడపిందెల యూరుగాయ, నీరు చల్లయును-చలికాలములో పునుగుబియ్యపు అన్నము (పునుగువాసనగల రాజనములు), మిరియపుపొళ్ళతో కూడిన ఉడుకుకూరలు, ముక్కు కెక్కు ఆవగాటు కల పచ్చళ్ళును, ఊరుగాయలును, పాయసాన్నములు, ఉడుకునేయి, ఇవురగాచిన పాలును బ్రాహ్మణులు కొందరు భుజించిరి.[160] జాతరులకు ఉత్సవాలకు పోవువారు పెరుగుసద్దిని తీసుకొని బాటలందలి కాలువలవద్ద తోటబావులవద్ద చద్దిమూటవిప్పి కలిసి భుజిస్తూవుండిరి. 4-75.

బర్రెయొక్క మీగడ పెరుగు అన్నముతో చిక్కగా కలిపి అందు నిమ్మరసము పిండి, అల్లము ముక్కలు కలిపి యుండెడివారు. ఇదొక విధమగు దధ్యన్నము.

కళలు

విజయనగర చక్రవర్తుల కాలములో కళాభివృద్ధి పరమావధి పొందెను. చక్రవర్తులు, సామంతులు, మంత్రులు, ధనికులు-భవనములను, దేవాలయము లను కట్టించుటచేత శిల్పవృద్ధి యెక్కువగా నయ్యెను. రాజులు, జనులు, చిత్రలేఖనమును, కవితను, అద్దకమును సంగీతమును పోషించిరి. అచ్యుతరాయ కృష్ణరాయల కాలమందేకాక విజయనగర పతానానంతరము వేంకటపతిరాయల కాలమందును చిత్రకారులుండిరి. దేవాలయములయొక్కయు, భవనముల యొక్కయు గోడలపై చిత్తరువులు వ్రాయించిరి. అనంతపురము జల్లాలోని లేపాక్షి దేవాలయములోని చిత్తరువులు తర్వాతివారి తెలివితక్కువవలన చెడగొట్టబడినను మిగిలినవైనను చాలా సుందరమైనవి. అందు అచ్యుతరాయని కాలపు శాసనాలున్నవి. కప్పుపై చిత్తరుపు లున్నవి. స్తంభాలపై చక్కని శిల్పము లున్నవి. కాని తర్వాతివారు వాటిపై ఎర్రమన్ను సున్నము పట్టెలు వేసి తమచిత్రమును ప్రదర్శించినారు. అందు ఈశ్వరునికి సంబంధించిన సుందర చిత్రములున్నవి. విజయనగరరాజులే తంజావూరిలోని బృహదీశ్వరాలయము చిత్తరువులు వ్రాయించిరి. పీస్ యిట్లు వ్రాసెను.

"క్ర్ష్ణదేవరాయల అంత:పురభవనమందు రాజుయొక్కయు, వారి తండ్రియొక్కయు చిత్తరువులను గోడలపై వ్రాసినారు. అవి యారాజులను చాలా చక్కగా పోలియున్నవి. అచ్చటనే గోడలపై నానావిధజనుల యాకారములను తీర్చినారు. తుద కందు పోర్చుగీసు రూపులను కూడా దించినారు. అ చిత్తరువులు అంత:పురకాంతలకు ప్రాపంచిక జ్ఞానము కలిగించెడివి." బోగపుసానులయిండ్లలో కూడా సింహాలు, పులులు, ఇతర జంతువులు, అవి అచ్చముగా బ్రదికినవా అన్నట్లు చిత్రించి యుండిరి. అని అబ్దుర్రజాఖ్ వ్రాసెను. "గోడల చెలువార కృష్ణ లీలలు లిఖించి" అని ప్రౌడకవి మల్లన (1-118) వ్రాసెను.

రాయలనాటి కవితలోను, అందు ముఖ్యముగా రాయలే వ్రాసిన ఆముక్తమాల్యదలో ఆనాటి సాంఘిక చరిత్ర యిమిడినది. పాశ్చాత్యులవర్ణనలు మనకు లేకుండిన ఆ కవితలు ఊహాగానములనుచుండిరో ఏమో! ఆనాడు స్త్రీలుకూడా "శాస్త్రసరణి"గా "తూలి"తో చిత్తరువులు వ్రాసిరి.([161]) చిత్రలేఖినిని తూలి, వాగర లేక కుంచె యనిరి. దానినే సంస్కృతములో ఏషికా, తూలికా యనిరి. గోడలపై మంచిగచ్చుచేసి వాటిపై రంగురంగు చిత్తరువులు వ్రాసిరి. 'పూబోణి నేర్పూది... ....శాస్త్రసరణిన్ తూలిన్ హరిన్ వ్రాసి[162] అని రాయలు తెలిపెను. పసిడి గచ్చమర సోపానముల్ మూట దుంగిత విశాలితయు చిత్రితయు నైనసభ [163] అనియు తెలిపెను. ఇచట గచ్చుముచ్చట కలదు. ఆ గచ్చు చాల గట్టిదిగా నుండుటకై సన్ననియిసుకలో బెల్లమునీరు, చమురు, సున్నము కలిపి గానుగబట్టి సిద్ధముచేయుచుండిరి.[164] ఇంత మాత్రము కవితలో ప్రతిబింబించినది. కాని ఆ గచ్చులో గోందు, కరక్కాయ, బెండకాయలు, అమృతవల్లి (పాచీతీగ) ఆకురసము, తుమ్మచెక్కకూడా కల్పుతుండిరి. అట్టి గచ్చు కలకాలముండెడిది. భవనాలలో నెట్టి చిత్తరువులు వ్రాయించిరో అనియు మనకు తెలియవచ్చినవి.

           "ఆదినారాయణు డమృతాబ్ధి మథియించి
              యబ్జవాసిని పెండ్లియైన కథలు
            చంద్రశేఖరుడు పుష్పశరాసను గెల్చి
              హిమాచలతనయ బెండ్లయిన కథలు
            శ్రీరామచంద్రుడు శివధనుర్భంజన
              మడరించి సీత బెండ్లయిన కథలు
            నలచక్రవర్తి వేల్పులు సిగ్గువడగ
              భీమాధీశకన్య బెండ్లయిన కథలు
            చిత్తభవ కేళి బంధ విచిత్రగతులు
              హంస కలరవ కీర రథాంగగతులు
            వ్రాసి రలవడ తత్స్వయంవర మహా
              స్థలాంతికి స్వర్ణసౌధ కుడ్యముల నెల్ల." [165]

బోగముసానులయిండ్ల చిత్రములు వారికి తగినట్టివే !

           "రతివధూమదనుల రంభాకుబేర
              పుత్రకు లూర్వశీపురూరవులు మేన
            కాకౌశికులు గోపికాముకుందులు
              ధాన్య మాలినీరావణుల్ మత్స్యలోచ

          సర్శ్యశృంగులు దాశనళినేక్షణా పరా
            శరులు తారానిశాకరులు గౌత
          మాంగనాదేవేందు లమర వేశ్యాజయం
            తులు ద్రౌపదీ పాండవులు పృథాబ్జ
          హితులు నడచినగతు లాత్మ సుతలనుంచు
            నింటిగోడల వ్రాయించునిందువదన.[166]

అంతేకాదు:-

         "వనిత చతుర్జాతి వయో వనజాక్షుల
            బంధవైభవము భద్రుని, ద
         త్తుని గూచిమారు, పాంచాలుని వ్రాయించెన్
            గృహంబు లోపలిగోడన్" [167]

"కూచిమార మనోజ ఘోణికా పుత్రాదికానీత కామ సిద్ధాంతములను." ఇంకను విట్టి వనేకములను బిడ్డలకు నేర్పించెను. [168]

విజయనగర చక్రవర్తులలో కృష్ణదేవరాయలే ఉత్తమ శిల్పములతో కూడిన దేవాలయములను నిర్మింపజేసెను. హజార రామాలయము విఠలాలయము చాలా సుందరములయినవని శిల్పవేత్తలు పొగడినారు. కృష్ణరాయల సభాభవనమును భువన విజయము అనిరి.

          "భువన విజయాఖ్య సంపన్నవరత్న విభాప్రభాత నలినాప్తరమా
           ధవ చరణకమల సేవా ప్రవణమతీ వీరరుద్ర పర్వతవజ్ర్"[169]

అతడు నివసించు సౌధమునకు మలయకూటము అని పేరుండెను. "మలయకూట ప్రాసాదనివేశ కృష్ణరాయమహీశా!"[170] భువనవిజయమం దతిసుందర శిల్పములు నిండుగా నుండెను. కోతులు, రాయబారులు, రాణీలు నృత్యము చూచుట, వేటలు, స్త్రీల ప్రసాధనక్రియలు నర్తకీలు, బందీలు మున్నగున వుండెను. అనగా ఆ కాలపు సాంఘిక చరిత్ర విజయనగర శిల్పములందు పూర్తిగా ప్రతిబింబిత మయ్యెను. ఆ నగర విధ్వంసమువలన మన చరిత్రకు చెప్పరాని అపార నష్టము కలిగినది. రాజసౌధముఖశాల (మోసాల)పై ఘటికాయంత్ర ముండెను. ఘడియ కొకసారి గంటలు లెక్కప్రకారము కొట్టుతూ వుండిరి.

"... ఘటికావర్యాప్తి ఘంటారవాం, తరనిర్ణీతములై వినంగ బడియన్ మధ్యాహ్న శంఖధ్వనుల్."

అని రాయలే తెలిపినాడు.

కృష్ణరాయలు సాహిత్యమందేగాక సంగీతమందును మంచి ప్రావీణ్యత కలవాడు. విజయనగర చక్రవర్తుల కాలమందేబహుశా తెనుగులో పాడినను, అరవములో పాడినను దాక్షిణాత్యసంగీతమునకు కర్ణాటసంగీతమను పేరుకలిగెను. "కృష్ణ" అను పేరుగల విద్వాంసుడు రాయలవారికి సంగీతము నేర్పెను. అతడు రాయలకు వీణావాద్యముకూడా నేర్పినందులకుశిష్యుడు గురువునకు గురుదక్షిణముగా నిలువైన ముత్యాల హారాలను, వజ్రాల హారాలను నిచ్చెనని కర్ణాటభాషలో నారాయణ కవిచే వ్రాయబడిన రాఘవేంద్రవిజయములో తెలిపినారు( [171]) సంగీతము శాస్త్రప్రకారము అత్యంతాభివృద్ధి నొందెను. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రాగమునకు ప్రాధాన్యముండెను. వసంతకాలమందు హిందోళరాగము పాడిరి.([172]) రాయలకు పోర్చుగీసు రాయభారి తమ దేశపు వాద్యములను కానుక యివ్వగా వారు చాల సంతోషించిరట! క్రీ.శ. 1514 లో బార్బోసా యిట్లు వ్రాసెను. "ప్రతి దినము స్త్రీలు రాయలవారికి కడవల కొలది నీళ్ళతో స్నానము చేయించి పాటలు పాడుదురు." చక్రవర్తి సభ చేసినప్పుడు గానము చేసెడివారు. ఆనాటి శిలాశిల్పములలో నృత్యములు, వాద్యములు, కోలాటము, కాహళలు మున్నగునవి బహువిధముల నిరూపింపబడినవి. బోగముసానులు సంగీతవిద్యలో ప్రత్యేక కృషిచేసిరి. అంతేకాక నృత్య విద్యను తమ పిల్లలకు 10 ఏండ్లకు ముందునుండియే నేర్పరి. తమ పిల్లలకు 10 ఏండ్లు పడువరకే "దేవదాసీలను"గా చేసెడివారు. వ్యభిచార వృత్తిలోని వారగుటచే వారికి గౌరవము తగ్గుటకు మారుగా హెచ్చినదనియు గొప్పగొప్ప అధికారులు వారి నుంపుడుగత్తెలుగా బాహాటముగా నుంచుకొనిరనియు పీస్ ఆశ్చర్యపడి వ్రాసెను. బోగము స్త్రీలకు రాజభవనాలలో నిరాఘాట ప్రవేశ ముండెను. హజార రామాలయములో నానాభూషణములలో ముస్తూ వున్న సానులను స్తంభాలపై తీర్చినారు. వాటిని జూడగా పలువురు బిర్రులాగులను దొడిగి వాటిపై లంగాలు కట్టినారు. దేవీ నవరాత్రులలో ప్రతిదినము ప్రొద్దున భువన విజయములోను, రథోత్సవము లన్నింటిని, దేవాలయములలో ప్రతి శనివారమున్నూ, వారు నృత్యము చేయవలసినవారై యుండిరి. నవరాత్రులందు మధ్యాహ్నము భోగపుసానుల కుస్తీకూడా జరిగెడిది. (కుస్తీ కిచ్చిన ప్రాముఖ్యమును కూడా ఇది నిరూపించును.) దేవాలయములలో నాట్యమంటప ముండెడిది. అందు సానులు నృత్యము నేర్పెడివారు. వారికి నృత్యము నేర్పించు గురువునకు కొన్ని యినాములు రాయలవా రిచ్చిరి. సంస్కృతములోను, కన్నడములోను సంగీత శాస్త్రములు వెలువడెను.

కూచిపూడివారి భరతాభినయముల ప్రఖ్యాతి యీ కాలములో నుండెను. మాచుపల్లి కైపియత్తులో ఇట్లు వ్రాసినారు. "సంబెట గురువరాజు ప్రభుత్వములో ప్రజలకు అతి దారుణశిక్ష చేస్తూ వుండేవాడు. ప్రజలు సొమ్ము త్వరగా ఇయ్యకపోతే స్త్రీలను తీసుకవచ్చి స్తనాలకు చిరుతలు పట్టించేవాడు. ఆలాంటి దినాలలో వినుకొండ, బెల్లంకొండ తట్టునుంచి వచ్చిన కూచిపూడివారు అదిచూచి అక్కడనుండి లేచిపోయి విద్యానగరము పోయి అక్కడ వీరనరసింహరాయలు రాజ్య పరిపాలనం చేస్తూవుండగా భాగవతులు దర్శనం అయి కేళి అడుగగా సెలవు ఇచ్చినారు. అక్కడ కీర్తన వినికి చేసే అప్పుడు ఒకడు సంబెట గురువరాజు వేషం వేసుకొని, ఇద్దరు బంట్రోతుల వేషం వేసుకొని, ఒకడు స్త్రీవేషం వేసుకొని, సంబెట గురువరాజువలెనే ఆస్త్రీయొక్క స్తనాలకు చిరుతలు పట్టించి సొమ్ము యివ్వుమని తహశ్శీలు చేసినట్లు వినికిచేసినారు. ........రాయలు సంగతులు కనుక్కొని మరునాడు సైన్యం సిద్దంచేసి రాయలకుమారుడు అనిపించుకొన్న ఇసుమాలుఖానుడనే తురకను సర్దారుగా మొకర్రారుచేసి పంపెను. అతడు సంబెట గురువరాజుపై లడాయిచేసి గురువరాజును పట్టుకొని తలకోసి తీసుకొని పోయినాడు. కోటలో స్త్రీలు బాలుర అందరు దేహత్యాగం చేసినారు." ఆనాటినుండి నిన్న మొన్నటివరకు కూచిపూడివారు భరతాభినయాన్ని కాపాడి దేశమందు ప్రచారము చేసినట్టివారు. "కడిపోని తెరనాటకపుటూరి జంగాలు" (వేంకటనాథపంచ 4-240) అనుటచే ఊరి జంగాలు కృష్ణా గోదావరి జిల్లాలలో నాటకాలాడెడి వారని తలపవచ్చును.

ఆంధ్రభాష సంగీతానికి అత్యంతానుకూల మైనట్టిది. దక్షిణాపథమందంతటను, కన్యాకుమారి నుండి కటకం వరకును ఇతర ద్రావిడ భాషలవారు తెనుగుపాటలనే యెక్కువగా పాడుదురు. విజయనగర రాజులు కన్నడ రాజ్యమున కధీశులగుటచేత సంగీతముకూడా కర్ణాట సంగీతమయ్యెను. నిజముగా ఆంధ్ర సంగీతమని దానికి పేరుండెను. ఆంధ్రరాజులు సంగీత విద్యయందు ప్రత్యేక కృషిచేసిరి. తంజావూరి రఘునాథరాయలు రఘునాథమేళ యను క్రొత్తవీణను సృష్టించెను. పూర్వము ఒక రాగమునకు ఆంధ్రీరాగము అను పేరుండెను. అనగా గాంధార దేశము గానమున కెట్లు ప్రసిద్ధివహించెనో ఆంధ్రదేశ మిట్లు మరొక విధమగు (కర్ణాట సంగీతము) గానమునకు ప్రసిద్ధి వహించెనన్నమాట.

         "విబావినీతు పౌరాళీ వేగవంతీతు పంచమా
          ఆంధ్రీ గాంధారికా చైవ సత్స్యుర్మాలవపంచమా".

తెనుగు సంగీత విద్వాంసులు హిందూస్థానములో పరరాజులను, ముసల్మానులను మెప్పించిరి. విఠలుడు అనునతడు సంగీత రత్నాకరభాష్యము వ్రాసెను. అతని తండ్రి 22 రాగశ్రుతులలో ప్రవీణు డగుటచే గుజరాతులోని మాండ్వీసుల్తాను అను గయాసుద్దీన్ మహమ్మద్ 1000 తులాల బంగారు నిచ్చి బహుకరించెను.[173] ఆ కాలపు తెలుగు వాఙ్మయములో గొండ్లి నృత్యమునుగూర్చి పలుమారు వ్రాసినారు. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగా రిట్లు వ్రాసినారు. "జాయ సేనాని తన నృత్త రత్నావళిలో-చాళుక్య భూలోక మల్లసోమేశ్వరుడు దానిని ప్రచారము చేసె"నని తెలిపి యీ క్రింది ప్రమాణము నిచ్చెను.

          "కల్యాణకటికే పూర్వం భూతమాతృ మహోత్సవే
           సోమేశ; కుతుకీ కాంచిత్ భిల్లవేష ముపేయుషిం
           నృత్యంతీ మథ గాయంతీం స్వయం ప్రేక్ష్య మనోహరం

          ప్రీతో నిర్మితవాన్ చిత్రం గోండలీవిధి మత్యయం
          యతో భిల్లీ మహారాష్ట్రే గోడిగీత్యభిధీయతే."[174]

దీనినిబట్టి గోండు లను అటవికుల నృత్యము దేశమందు వ్యాపించెననియు దానికి గోండినీ అని పేరై క్రమముగా గొండిలి, గొండ్లి యయ్యెనన వచ్చును.

దేవాలయములందు, రాజసభలయందు బోగమువారు నృత్యముచేసి రనుటకు "హరి కొల్వునన్ వివిధలాస్యస్పర్థి సుభ్రూభ్రుకుంసుల వాదుల్ సరిదేర్చి పుచ్చి" అని రాయలు వ్రాసినదే ప్రమాణము.[175] భ్రుకుంసులు అన స్త్రీ వేషములు వేయు పురుషులు. నాట్యపు పోటీలు కూడా జరిగెననియు నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్యములను నిర్ణయించి రనియు పై యుదాహరణము తెలుపుతున్నది. మృదంగాదివాద్యములలో కొన్నింటిని రాయ లిట్లు తెలిపినారు. "మృదంగం బుపాంగంబావజంబు దండెతాళం బురుమ కిన్నెర సన్నగాళె వీణె ముఖవీష వాసె గ్రోలుడోలు మౌని భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు డుక్కి డక్కి చక్కి చుయ్యంకి లోనగు నసంఖ్యాత వాదిత్రత్రితయపరంపరలు మొరసె" అని తేలును.[176]

విజయనగర కాల మందలి తెనుగు కవిత ప్రబంధయుగముగా పేర్కొనబడినది. మహాకవు లీ కాలమందు వెలసిరి. కవిసార్వభౌములు, ఆంధ్రకవితా పితామహులు, సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తులు, ఈ కాలమందే వెలసిరి. రాజులు కత్తి త్రిప్పిన వడితోనే గంటము త్రిప్పిరి. స్త్రీలుకూడా సంస్కృతాంధ్రములందు సుందరకవిత లల్లిరి. గంగాదేవి, తిరుమలాంబ రామభద్రాంబ మున్నగు స్త్రీలు ప్రసిద్ధ కవయిత్రులు. గోలకొండ మలకలచేతను జిలిబిలి తెలుగు పలుకులను పలికించిరి. ఇబ్రహీం ఇభరాముడయ్యెను. ఈవిధముగా కళ లానాడు సర్వతోముఖముగా వర్ధిల్లి దేశి విదేశీజనులను ముగ్ధు లగునట్లు చేసెను.

పంచాయతీ సభలు

ఆ కాలమందు కోర్టులు లేకుండెను. ప్రతిగ్రామమందు గ్రామపెద్దలు ప్రతిఫలాపేక్ష లేక తగవులు తీర్పుచేసిరి. విజ్ఞానేశ్వరీయమే ముఖ్యాధార భూతశాస్త్రము. బ్రాహ్మణులే సభాసదులు. వారి తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ(అపీలు) కావచ్చును. సాధారణముగా వారి తీర్పునకు తిరుగు లేకుండెను. ధనోద్బవ (సివిల్), హింసోద్బవ (క్రిమినల్) అభియోగములను (కేసులను) వారే విచారించిరి. ముఖ్యమైన నేరములను రాజు స్వయముగా విచారించెనను. 'సభ'వారిని పిలిచి వారి సహాయముతో తీర్పు చెప్పెడివారు.

"సభ"ను చావడిలోనో, దేవాలయమందో, ఊరిమధ్య నుండు "రచ్చ" కట్టపైననో చేసిరి. అందుచేత వివాదమునకు సభగా కూడుటకును "రచ్చ" యనిరి.[177] రాజు స్వయముగా విచారించినప్పుడు,

        "తీర్పరిం బిలిచి చేతికి నిచ్చి కనలి యీ చోరునకు నాజ్ఞయేది శాస్త్రంబు
         చూచి సేయింపు డచ్చుగ మీ రటంచు
         తెలియ విద్వాంసుల దిక్కు వీక్షించి" పలికె [178]

ఒకతడవ ఒక వైష్ణవునికి, జైనులకు ఇయ్యవలసిన పత్రము పైకముపై వివాద మయ్యెను. అప్పుడు,

        "ఘనుల గొందర సభగా గూడబెట్టి తనవారిపనులు చందము జెప్పి
         కొన్ని దినములు గడువిడి తేటతెల్లముగ సమ మాస తిథి వార సరణు
         లేర్పరచి అమర జైనుల కిచ్చినట్టి పత్రంబు క్రమ మెట్టిదనిన........"

సభ వారియెదుట ఉభయులును తమతమ వాదాలు వినిపించిరి. సభవారు సాక్షు లెవరని విచారించిరి.

         "....మా కిచ్చిన పత్ర మదె సాక్షులున్నార లౌ గాములకు"
         "అనిన వారాపత్ర మాసాక్షి వారు వినుచుండ వడి చదివింప" [179]

         సభవారు విని తీర్పు చెప్పిరి.

    రచ్చకట్టకు వాదిప్రతివాదులు కానుక లిచ్చెడివారు.

         "తగవువారలతోట తమకను ల్నొడివి
             కట్టకానుక లిడి కడపట నిలుప
          గట్టిగా నా కార్యగతి విచారించి
             అలయున్న సభవార లాయిరువురను
          ......బిలిచి యిట్లనిరి అరయంగ
             నీమాన్యమైన యందులకు
          పరగంగ సాక్షిసంబంధములు కలవె
             యనిన ఎక్కడిసాక్షు లలనాడె పోయి
          రనిన పత్రముకలదా యని యనిన
             అడర మాతోటి యేడవ పెద్దాతాత
          కిడిన పత్రము చెడ కిన్నాళ్ళదాక
             దనరుచునుండంగ తామ్రశాసనమె

    యనిన సత్యము సేయుమన...పలుమాట లేల తప్పదు శౌరిసాక్షి
    యని సత్య మొనరించి యలవాని గెలిచి...........జనుదెంచె" [180]

పై పంక్తు లానాటి పంచాయతీ న్యాయస్థాన విధానమును వెల్లడించును. సభవారు వాదములను విని సాక్ష్యములు తీసుకొని "సత్యము (ప్రమాణము) చేయించి" శాస్త్రములను చూచి తీర్పు చెప్పెడివారు. "సత్యము చేయుట" సామాన్య విషయము కాదు, ప్రజలు అప్రమాణము చేసిన నిర్వంశ మగుదనియు, సంపద తొలగిపోవుననియు భయపడిరి. పంచాయతీ సభ్యులును అన్యాయముగా తీర్పు చెప్పుటకు భయపడెడివారు. అయినను అందందు లంచాలు తీసుకొని తప్పుడు తీర్పులు చెప్పువా రుండి రని వేంకటేశశతకములోని సూచనలను తెలిపినాము. కాని అది యరుదు. అట్టివారికి సంఘమందు మర్యాద లేకుండెను. పంచాయతీ సభా విశిష్టతలు ఆనాటి తెనుగు సారస్వతములో పలుతావులలో వెల్లడించినారు. అది యుత్తమ పద్ధతిగా నుండెను. ఇంగ్లీషు కోర్టులు, వకీళ్ళు, శాసనములు, బారీకులు, అప్రమాణాల నిర్భయత ప్రబలిన యీ కాలములో ఇక, ఆనాటి అచ్చపు పంచాయతీ రాజ్యముయొక్క పునస్థాపన కానేరదు. ఇది విజయనగర సామ్రాజ్య ప్రథమకాల సాంఘిక చర్చాలేశము.

ఈ సమీక్షాకాల సాంఘికచరిత్ర కుపకరించు గ్రంథములు:-

1. ఆముక్తమాల్యద:- శ్రీకృష్ణదేవరాయ ప్రణీతము. శ్రీ వేదం వేంకటరాయ శాస్త్రిగారి వ్యాఖ్యాన సహితము. శ్రీ కళాప్రపూర్ణుల నొకమారు తమ మన:పూర్వకాభిప్రాయములను విచారింపగా "రాయలవారు చేసినారు; పెద్దనగారు చూచినారు" అని ఒకేమాటతో సెలవిచ్చిరి. అదే నాయభిప్రాయము. గట్టిగా రాయలవారే యీ గ్రంథాన్ని వ్రాసినారని నేను విశ్వసింతును. సంపూర్ణ లోకానుభవ మిందు కలదు. అడుగడుగునకు సాంఘిక చరిత్రకు పనికి వచ్చును. ఈ విషయమందది తెనుగుసారస్వతమున అగ్రస్థాన మలంకరించును. అపూర్వ స్వాభావిక వర్ణనలు, తేలికయగు హాస్యము ఇందు నిండుగా కలవు. సర్వతంత్ర స్వతంత్రులవ్యాఖ్య లేకుండిన సగము మన కర్థము కాకుండెడిది.

2. పరమయోగివిలాసము:- తాళ్ళపాక తిరువేంగళనాథుడు. ఇది ద్విపదకావ్యము. కవిని చిన్నన్న అనియు పిలిచిరి. "చిన్నన్న ద్విపద కెరుగును" అన్న సూక్తి యితనిగురించియే. వేణుగోపాలశతక కారుడు "అల తాళ్ళపాక చిన్నన్న..." అని తిట్టిన దితనినే! ఇతని కవిత్వములో ఒక పంక్తిపూర్తి సంస్కృతసమాస మొక్కటియు లేదు. తెలుగు నుడికారమే అంతటను కలదు. పాండిత్యములో పాల్కురికి సోమనాథునికన్న, గౌరనకన్న తక్కువదేయగును. కాని మనసాంఘిక చరిత్ర కదిచాలా పనికివచ్చును. ఈ దృష్టిలో వసు, మను చరిత్రాది బహుప్రబంధాలకన్న నిది చాలామేలైనది.

3. మధురావిజయము:- గంగాదేవీకృతమగు సంస్కృత చారిత్రిక గ్రంథము. దీనిని ప్రకటించిన చరిత్రాచార్యులు ఇందు సత్యమగు చరిత్ర కలదని నిరూపించినారు. చక్కని సుందరకవిత. తెనుగర్థముతో ముద్రింపదగినది.

4. కృష్ణరాయ విజయము:- కుమార ధూర్జటి. కవిత్వము అపాటిదే. పేరు చారిత్రాత్మకమైనను అందలివిషయాలు పనికివచ్చునవి కావు.

5. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము:- ధూర్జటి. మూడవ యాశ్వాసమే కొంతపనికి వచ్చునది. 6. రాధామాధవము:- ఎల్లనార్యకవి

7. కళాపూర్ణోదయము:- పింగళి సూరన - ఈ రెండును చాలా కొద్దిగా ఉపకరించును.

8. Vijaianagara Sexcentenary commemoration, Volume (1936):- ఇదిబాగా పనికివచ్చును. కాని ఇందు రాజులవంశాలు, వారి పరిపాలన కాలాలు లేవు. ఇది కర్ణాటక దృష్టితో వ్రాయింపబడినది.

9. Social Political Life in the Vijaianagara Empire salatore 2 Vols:- ఇది చాలా సహాయకారి. ఇదియు కేవల కర్ణాటక వాదిచే వ్రాయబడినందునను, గ్రంథకర్తకు తెనుగు రానందునను, మనకు ప్రధానముగా పనికివచ్చునది కాదు.

10. రాజవాహన విజయము - కాకమాని మూర్తి.


 1. మధురా విజయము, అష్టమ స్సర్గము, ఆదిభాగశ్లోకాలు.
 2. ఆముక్తమాల్యద 4-42 నుండి 44,
 3. Vijayanagara Sexcentenary Commemoration Volume P 42. (ఇక ముందు దీనిని V. S. C. అని యుదాహరింతును.)
 4. ఆముక్త మాల్యద. 1 - 41.
 5. మనుచరిత్ర 3 - 42.
 6. V. S. C. P. 222.
 7. "..........the utter want of unity among the Hindu States Of the South, and to crown all, the inhernet weakness of the Hindu armies convinced Alauddin..........of the advantage of invading the south" Heras; V. S. C. P. 29.
 8. V. S. C. P. 183.
 9. రాజవాహన విజయ మను ప్రబంధము నాకు లభ్యము కాకుండెను. నాకు ప్రియమిత్రుడగు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు సంపాదించి నాకంపిరి. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు.
 10. మధురా విజయం 4వ సర్గము.
 11. SALATORES _ Social and Political Life in Vijiayanagar Empire, Vol, II. ఇక ముందీ గ్రంథాన్ని Salatore అని యుదాహరింతును.
 12. Salatore, II.
 13. "పార్వతీయ బలంబులోనం గూడకయ రాజునకు ప్రజాబాధ తరుగదు" ఆముక్తమాల్యద. 4 - 222. అట్లే 223, 224, 225 కూడా చదువుకోవలెను.
 14. Salatore, II.
 15. కృ. రా. విజయము. 3 - 5.
 16. కృ. రా. విజయము. 3 - 26.
 17. కృ. రా. విజయము. 7 - 29.
 18. ఆముక్త మాల్యద 2 - 9.
 19. మనుచరిత్ర 3 - 54.
 20. ఆముక్త మాల్యద, 2 - 20.
 21. Salators, II.
 22. Salators, II.
 23. మనుచరిత్ర 5 - 59. ఇందు సూర్యాస్తమయ వర్ణన కలదు. దాని నుండి పై విషయాలు తేల్చనైనది. రాధామాధవము 3 - 89 నుండియు ఇది వెల్లడి యవుతున్నది.
 24. Salatore, II.
 25. పరమయోగివిలాసము - తిరువేంగళనాథుడు. పుట 98.
 26. "ఒక కాసు చెల్లింపకున్నాడు" చిన్న రాగినాణెము. పరమయోగి విలాసము. పు 457.
 27. పరమయోగి విలాసము. పు 480.
 28. ఆముక్తమాల్యద. 3 - 4.
 29. ఆముక్తమాల్యద 2 - 85.
 30. నీతి సీసపద్యములు - తాళ్ళపాక తిరుమలయ్య.
 31. ఆముక్తమాల్యద. 4 - 269.
 32. ఆముక్తమాల్యద. 6 - 6.
 33. పంచముఖ అనువారు వ్రాసిన వ్యాసము.
 34. V. S. C. P. 36.
 35. ఆముక్తమాల్యద 4 - 245
 36. ఆముక్త మాల్యద 4 - 258
 37. ఆముక్త మాల్యాద 4 - 45
 38. మనుచరిత్ర 3 - 80
 39. V. S. C. P. 221-2.
 40. V. S. C. P. 224.
 41. ద్విపద పరమయోగి విలాసము, పు 69.
 42. ద్విపద పరమయోగి విలాసము. పు 480.
 43. ద్విపద పరమయోగి విలాసము పు 486.
 44. ద్విపద పరమయోగి విలాసము. పు 487.
 45. ఆముక్త మాల్యద. 2-74.
 46. పరమయోగి విలాసము పు 488.
 47. ఆముక్త మాల్యద. 4-35.
 48. ఆముక్తమాల్యద 4-35.
 49. V. S. C. P. 218.
 50. పరమ యోగి విలాసము పు 5-23.
 51. ఆముక్త మాల్యద 2 - 75.
 52. ఆము. 4 - 135.
 53. మనుచరిత్ర. 4 - 30
 54. ఆముక్తమాల్యద 5 - 93.
 55. మనుచరిత్ర 2 - 24.
 56. పారిజాతాపహరణము 2 - 20.
 57. ఆముక్తమాల్యద 5 - 89.
 58. పారిజాతాపహరణము, 5 - 56.
 59. రాధామాధవము, 4 - 163.
 60. రాధామాధవము, 4 - 168.
 61. ఆముక్తమాల్యద, 2 - 68.
 62. ఆముక్తమాల్య్దద, 273.
 63. ఆముక్తమాల్యద 4 - 195.
 64. పరమయోగి విలాసము ద్విపద. పు 581.
 65. ఆముక్తమాల్యద 4 - 193.
 66. మను ... 4 - 20.
 67. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము 3వ ఆశ్వాసము. 1 నుండి 130 వర కుండు పద్యాలన్నియు చూడవలెను.
 68. ఆముక్తమాల్యద 4 - 206.
 69. V. S. C. P. 226.
 70. V. S. C. P. 226.
 71. V. S. C. P. 227.
 72. ఆముక్తమాల్యద. 4 - 134.
 73. ఆముక్తమాల్యద 7 - 19
 74. Salatore, II. 37.
 75. Salatore, II. 133 - 4
 76. V. S. C. P. 216.
 77. ఆముక్తమాల్యద. 4 - 236.
 78. V. S. C. P. 217, 228.
 79. V. S. C. P. 217, 228.
 80. మనుచరిత్ర 129
 81. ద్విపద పరమయోగి విలాసము, పు 478
 82. పరమయోగి విలాసము. పు 531.
 83. ఆము 1 - 66.
 84. పరమయోగి విలాసము ద్విపద. పు 458.
 85. పరమయోగివిలాసము ద్విపద పు 458
 86. పరమయోగి విలాసము పు 461.
 87. పరమయోగి విలాసము పు 457
 88. ప. యో. విలాసము. పు. 450.
 89. ప. యో. విలాసము. పు. 508.
 90. ప. యో. విలాసము, పు 508.
 91. ప. యో. విలాసము, పు 65.
 92. ప. యో. విలాసము, పు 66.
 93. ప. యో. విలాసము. పు 538.
 94. ప. యో. విలాసము. పు 540
 95. ఆముక్తమాల్యద 6 - 6.
 96. వెంకటేశ శతకము, తాళ్ళపాక పెదతిరుమలయ్య.
 97. వెంకటేశ శతకము, తాళ్ళపాక పెదతిరుమలయ్య.
 98. పరమయోగి విలాసము, ద్విపద. పు. 273-4.
 99. పరమయోగి విలాసము, ద్విపద. పు. 323.
 100. కళాపూర్ణోదయము 7 - 69.
 101. ఆముక్తమాల్యద. 4 - 161.
 102. మనుచరిత్ర 6 - 5.
 103. మనుచరిత్ర 6 - 81
 104. Salatore, II.
 105. ఆముక్తమాల్యద. 4 - 187, 1 - 17.
 106. ఆముక్తమాల్యద. 7 - 16.
 107. ఆముక్తమాల్యద. 4 - 7.
 108. కృష్ణరాయ చరిత్ర. 2 - 5.
 109. ఆముక్తమాల్యద. 4 - 35.
 110. ఆము. 4 - 35.
 111. ఆముక్తమాల్యద 3, 4, 5.
 112. ఆముక్త మాల్యద 7 - 3.
 113. మనుచరిత్ర 3 - 129
 114. ఆముక్త మాల్యద, 4 - 7.
 115. ఆముక్త మాల్యద 4 - 4.
 116. ఆముక్త మాల్యద. 2 - 58.
 117. శ్రీ కాళహస్తీశ్వర మహార్మ్యము. 3 - 174
 118. Salators, II.
 119. Salators, II.
 120. ఆముక్తమాల్యద, 4 - 35.
 121. ఆముక్తమాల్యద 7 - 17.
 122. ప. యో. విలాసము. పు 482.
 123. కళాపూర్ణోదయము 2 - 7.
 124. ..... ..... ..... 2 - 15.
 125. ఆముక్త మాల్యద. 4 - 180.
 126. ప. యో. విలాసము. పు 503, ధర జాలెతో దూడ దన మిచ్చినట్లె'
 127. ఆకాశ భైరవకల్పం
 128. ఆముక్త మాల్యద. 4 - 128.
 129. ..... ...... ...... 6 - 12.
 130. ఆముక్త మాల్యద, 1 - 83.
 131. ప. యో. విలాసము. పు 485
 132. ప. యో. విలాసము. పు 526
 133. ఆము. అ 2. పద్యములు 7 నుండి 21 వరకు.
 134. ఆము. 4 - 183.
 135. పరమయోగి విలాసము ద్విపద పు. 324
 136. ఆము. 7-7.
 137. ఆము. 7-5.
 138. ఆము. 7-7.
 139. నీతి సీసపద్యశతకము-తాళ్ళపాక.
 140. ఆము. 6-8.
 141. మను. 3-21.
 142. మను. 5-86-97.
 143. మనుచరిత్ర 5-97
 144. మనుచరిత్ర 5-101.
 145. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, 3-వ ఆశ్వాసము 110.
 146. ఆముక్తమాల్యద 7-20.
 147. సంతల కూటములకు విచ్చు మొగ్గలొదవె" ఆము. 4 - 123.
 148. ఆముక్తమాల్యద 4 - 35.
 149. రాధామాధవం. 3 - 85.
 150. ఆముక్తమాల్యద 4 - 124.
 151. Salatore II
 152. salatore.
 153. పారిజాతాపహరణము 1-139
 154. salatore. (1
 155. ఆము 4-187.
 156. కళాపూర్ణోదయము. 6-202
 157. కాళహస్తి మహాత్మ్యము. 3-33.
 158. కళాపూర్ణోదయము 7-81.
 159. కళాపూర్ణోదయము 1-80 నుండి 82.
 160. కళాపూర్ణోదయము 1-80 నుండి 82.
 161. Salatore, II
 162. అము. 5-149.
 163. అము. 4-58.
 164. మను. 5-38.
 165. రాధామాధవం, 1-188.
 166. శ్రీ కాళహస్తి మహాత్మ్యము, 4వ ఆశ్వాసము 14.
 167. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, 4-18.
 168. శ్రీ కాళహస్తీ మాహాత్మ్యము, 4-16.
 169. పారిజాతాపహరణము.
 170. పారిజాతాపహరణము. 5-108.
 171. Salatore, Vol. II
 172. ఆముక్తమాల్యద 5-118.
 173. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు.Journal of Andhra H; R. Vol. Xj. P. 174.
 174. శ్రీ మానవల్లి ..... 188.
 175. ఆముక్తమాల్యద, 4-36.
 176. అము. 4-35
 177. ఆము. 4-111.
 178. పరమయోగివిలాసము, పుట 340.
 179. పరమయోగివిలాసము, పుట 340.
 180. ప. యో. విలాసము. పు. 532-3.