Jump to content

ఆంధ్రుల సాంఘిక చరిత్ర/2 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి

2 వ ప్రకరణము

కాకతీయుల యుగము

రుగంటి కాకతీయ చక్రవర్తులు ఇంచుమించు క్రీ.శ. 1050 నుండి 0750 వరకు రాజ్యము చేసిరి. మన యాది కవియగు నన్నయభట్టు క్రీ.శ. 1050 ప్రాంతములో నుండునట్టివాడు. అతడు తూర్పుచాళుక్యుల కవి. కావున చాళుక్యకాలము, కాకతీయకాలము రెండును కలిసినవి.

నన్నయకన్న పూర్వము తెనుగు దేశములోని మనకు తెలిసిన ఆ కొలదిపాటి విషయాలు తెలియనివాటితో సమానమే. నన్నయకాలమందలి పరిస్థితులు కూడా మనకు సరిగా తెలియవు. మనకు కొంతవరకు తెలిసినభాగము కాకతీయుల కాలమే.

కాకతీయ సామ్రాజ్యముం గూర్చిన సాధనములు - శాసనములు, రచనలు, శిల్పములు, విదేశచారిత్రకుల వ్రాతలు, నాణెములు, కథలు, సుద్దులు - మనకు లభించిన వరకు ఉపయుక్తములై యున్నవి. వీని యాధారముచే మన యాదిచారిత్రిక యుగమందలి ప్రజలయొక్క రాజకీయ నైతిక విద్యావిషయిక, సాంఘికజీవనము లెట్టివో మనకు కొంత కొంత విశద మగుచున్నవి. కాకతీయులు శాలివాహన శకారంభమునుండియే రాజ్యము చేయుచూవచ్చిరని ప్రతాపరుద్రచరిత్ర మను ప్రాచీన గ్రంథములో వ్రాసినారు. కాని అది అబద్ధము. చరిత్రకు గణనకెక్కినవాడు మొదటి కాకతిరాజు ప్రోలరాజు. కావున ఈ ప్రకరణమున క్రీ.శ. 1050 నుండి క్రీ.శ. 1323 వరకు అనగా ఓరుగంటి పతనము వరకు తెలియవచ్చిన ఆంధ్రుల సాంఘిక జీవనమును గూర్చి చర్చింతము.

మతము

మనకు మతము ప్రధాన జీవనవిధానము. కావున దాన్ని గురించియే మొదట విచారింతము. ఆ కాలములో తెనుగుదేశమందు బౌద్ధమత మించు మించు నామావశిష్ఠ మయ్యెను. కాని జైనమతము ప్రబలముగానే యుండెను. శ్రీమచ్ఛంకర భగవత్పాదులదెబ్బ తెనుగుసీమపై పడినట్లు కానరాదు. పైగా ఆతనికి సరిజోడైన కుమారిలభట్టుదే తెనుగు నాట పైచేయిగా నుండెను. కౌమారిలదర్శనమును ప్రచారమునకు తెచ్చిన ప్రభాకరుడు ఓడ్రదేశమువాడు. కుమారిలు డాంద్రుడు. గంజాముజిల్లాలో జయమంగళ గ్రామమువాడు. కౌమారిలులుకూడా జైనులకు ప్రబల శత్రువులు. అయినను జైను లను వారు రూపుమాపజాలినవారు కారు. ఆంధ్ర కర్ణాట దేశాలలో జైనులను నిజముగా ప్రధ్వంసము చేసినవారు వీరశైవులే. వారు శాస్త్రచర్చతో ఎక్కువగా పనితీసుకొన్నవారు కారు. జైనమతమందలి వర్ణరాహిత్యమును తమ ముఖ్య సిద్ధాంతముగా శైవులు స్వీకరించిరి. కాని శాస్త్రచర్చవల్లగాని ఆచార వ్యవహార స్వీకరణములవల్లగాని జైనులు లోబడనప్పు డా యహింసా వాదులపై వీరశైవులు హింసను ప్రయోగించుటకు వెనుకాడ లేదు. రాజులను వశపరచుకొని వారికి వీరశైవదీక్ష నిచ్చి, వారిగురువులై, మంత్రులై, దండనాయకులై, రాజ్యముల వశీకరించుకొని కథలతో, కత్తులతో, కల్పనలతో, బహువిధ విధానములతో, పరమత నిర్మూలనముతో వీరవిహారము చేసినవారు వీరశైవులే: జైన విగ్రహములను లాగివేసి వాటిస్థానములో లింగాలను బెట్టిరి. నగ్నజైన విగ్రహాలను కొన్నిటిని బహుశా వీరభద్రులగా చేసికొని యుండిన చిత్రము కాదు. నేటికిని కొన్ని తావులలో గుడిబయటి భాగమందు జైనవిగ్రాలుండుట అందందు చూచుచున్నాము. గద్వాలలోని పూడూరు గ్రామములో ఊరిబయటి గుడిముందుట నగ్నజైన విగ్రహాలను పెట్టి వాటిని "పూడూరి బయటిదేవర్లు" అని యందురు. అచ్చటనే ఊరిముందట "జైనశాసనము" అను శీర్షికతో చెక్కబడిన 800 ఏండ్లనాటి శాసనము కలదు. అదేవిధముగా వేములవాడలో జినాలయము శివాలయముగా మారి, పాపము అదిజైన విగ్రహాలు గుడి కావలిబంట్లవలె దేవళము బయట దరిదాపు లేనివైనవి. తెనుగు దేశములో అనేకస్థలములం దిట్టి దృశ్యము లుపలబ్ధమగును. జైననగ్న విగ్రహాలను హిందువులు చూచిన, వాటిపై మట్టిబెడ్డలు వేసి నగ్నతను కప్పుట కేమో బట్టపేలికనో, దారమునో వేసి పోవుదురు. జోగిపేట యనున దొక కాలములో పూర్తిగా జైన (జోగుల) బస్తీ. అచ్చట యిప్పటికి, జైనులున్నారు. కొలనుపాకలో సుప్రసిద్ధ జైనాలయము కలదు. హైద్రాబాదు నగరములోనే ప్రాచీన జైనాలయములు కలవు. వరంగల్‌లోను హనుమకొండలోను, హనుమకొండ గట్టుపైనను జైనవిగ్రహాలు చాల కలవు. ఈ లెక్క చొప్పున తెలంగాణములోనే జైనమత వ్యాప్తి యెక్కువగా నుండెను.

కాకతీయుల కాలములో జైన, శైవ, వైష్ణవ మతములు పరస్పర ప్రాబల్యవ్యాప్తులకై పోరాడుచుండెను. మూడింటిలోను కులభేద నిర్మూలనము ఒక సామాన్యధర్మముగా వ్యక్తమవుతున్నది. కవిత్రయమువారే ఒక విధముగా తెనుగుదేశమందలి వర్ణాశ్రమాచార స్థిరతను నిలబెట్టుటకు ప్రచారము చేసిన వారనవచ్చును. నన్నయభట్టు భారతము బ్రాహ్మాణాధిక్యతను ప్రచారముచేసెను. తిక్కన యజ్ఞదీక్షితుడై కుండలీంద్రుడయ్యెను. బుధజనవిరాజి సోమయాజి యయ్యెను. కాని, కాకతీయయుగములో మాత్రము వారిప్రచారము జైన, శైవ, వైష్ణవ ప్రవాహములో కొట్టుకొనిపోయెను. ఈ మూడు మతాలవారును సంఖ్యా బలమును సమకూర్చు కొనుటకు యథార్థముగా ఆర్యజాత్యైకత కవసరమగు కులతత్త్వ నిర్మూలనముచేసి, సర్వవర్ణముల వారిని ఏకవర్ణముగా మార్చ ప్రచారముచేసిరి.

మొదట జైనమతవ్యాప్తి హెచ్చుగా నుండెను. ఓరుగంటి ఆది రాజులు జైనులు. అప్పుడు బసవేశ్వర నాయకత్వమున బిజ్జులుని కల్యాణి రాజ్యమందు తలయెత్తిన వీరశైవ ఝూంఝూమారుతము తెనుగడ్డపైకి వీవదొడగెను.

     "ఒకనాడు శివభక్తు లోరగంటను స్వయం
             భూదేవు మంటపమున వసించి
      బసవపురాణంబు పాటించి వినువేళ
             హరుని గొల్వ ప్రతాపు డచటికేగి
      ఆ సంభ్రమం బేమి యనుడు భక్తులు బస
             వని పురాణం బర్థి వినెద రనిన
      విని యా పురాణంబు విధ మెట్లొకో యన్న
             ధూర్తవిప్రు డొకండు భర్తజేరి

      పాలకురికి సోమ పతితు డీనడుమను
      పెనచె మధ్యవళ్ళు పెట్టి ద్విపద
      యప్రమాణం బిది యనాద్యంబు పదమన్న
      నరిగె రాజు, భక్తు లది యెరింగి."

పాల్కురికి సోమనాథుని కెరింగించి రనియు అ 'ధూర్తవిప్రులు' కొందరికి శైవవేషములువేసి ఓరుగంటికి వెళ్ళుచున్న సశిష్యుడగు సోమనాథు నెదుటికంపగా ఆ కుహనాశైవులు నిజమగు శైవభక్తులైరనియు పిడుపర్తి సోమనాథుడు (క్రీ.శ. 1600 ప్రాంతమువాడు) వ్రాసెను. పైవర్ణనలలో అనేక విషయాలు వ్యక్తమవుతున్నవి. దేవాలయలలో మతపురాణాలను చదువుట, జనులు భక్తిశ్రద్ధలతో గుమిగూడి వాటిని వినుట, నూతన వీరశైవులను ప్రతిఘటించిన వారిలో 'విప్రులే' ప్రాముఖ్యము వహించుట, అందుచేత వీరశైవ సాంప్రాదాయ ప్రవర్తకులకు బ్రాహ్మణులతో పలుమారు సంఘర్షణములు కలుగుట, వీరశైవులను బ్రాహ్మణులు 'పతితులను'గా నిర్ణయించుట, బౌద్దమత ప్రచారానికి జనసామాన్య బాషయగు పాలీని సాధనముగా గొనినట్లు వీరశైవులు తమ పురాణాలను సంస్కృతములో వ్రాయక కర్ణాటాంధ్రభాషలలో ప్రచారముచేయుట, అందులోను నన్నయ నాటినుండి నిరాదరముపొంది తుదకు వేణుగోపాల శతకకారుని కాలమువరకు అనగా క్రీ.శ. 1600 వరకు "ద్విపద కావ్యంబు ముదిలంజ, దిడ్డికంత" అన్నియు నొకటే యనిపించుకొన్న ద్విపదలోనే, అందులోను ప్రాసయతితోను, ప్రాసరాహిత్యముతోను 'శివకవిత' నెగడించి ప్రచారముచేయుట, అందుచేత 'ఈ నడుమ, పెనిచె మధ్యవళ్ళుపెట్టి ద్విపద' అను తిట్టునకు గురియగుట, ఓరుగంటిరాజులు జైనమును వదలి, 'హరుని గొల్వ' శివాలయమునకు పోవుట, 'ఈ నడుమ' వెలువడిన శివపురాణాలను విందమను నాసక్తి కొంతవరకైన ప్రభువులలో కానవచ్చుట, ఈ పద్యము వల్ల మనకు స్పురించుచున్నవి. జైనులను నానాహింసలపాలు చేసినట్లు పాల్కురికి సోమనయే తెలిపినాడు. జైనులను రాళ్ళతో కొట్టి హింసించిరి. [1] "జిన సమయస్థులను తాటోబుపరిచి"నట్లు కొన్ని తావులలో పాల్కురికి సోమనాథుడు వర్ణించెను. ఈ విధముగా క్రీ.శ. 1600 వరకు జైనము క్షీణించి దాని స్థానములో వీరశైవము నెలకొనెను.

అదేసమయములో తెనుగుసీమలోనికి వైష్ణవము వీరావేశముతో వీర శైవమున కెదురొడ్డి వీరవైష్ణవముగా విజృంభింప నారంభించెను. వైష్ణవము సైవము కొత్తగా ఏర్పడినవికావు. అవి అరవదేశ మందు ప్రాచీనము నుండియే స్థిరపడియుండెను. వైష్ణవముకన్న శైవమే అరవదేశమందు ప్రాచీనతరమైనట్టిది. ఆ రెండు మతాలు తెనుగుదేశములోనికి వచ్చెను. ఉభయమత ప్రబోధకులును పరస్పరస్పర్ధతో శూద్రాది జనసామాన్యమునకు మూడభక్తిని ఒంటబట్టించి వారు మరల జారిపోకుండుటకై శివలింగాలు కట్టి లేక వైష్ణవముద్రలువేసి నామాలు పెట్టించిరి. గోన బుద్ధారెడ్డికూడ రామాయణమును ద్విపదలో వ్రాయుట, వైష్ణవ ప్రచారమునకై చేసిన శైవానుకరణమే. తర్వాతికాలములో 'చిన్నన్న ద్విపద కెరుగును' అను విఖ్యాతిగాంచిన తిరువేంగళనాథుడు కేవలము శివనిరసనముతో విష్ణుభక్తిని ప్రచారము చేయుటకై 'పరమయోగి విలాస' మను ద్విపద పురాణమును వ్రాసెను.

జైనులు రంగమునుండి దిగజారిపోయిన తర్వాత మతోన్మాద గదా యుద్ధమునకు వీరశైవ వీరవైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకొన్నతిట్లే ఒక చేటభారతమగును. వీరు గుళ్లలోని విగ్రహాలనుగూడ శక్తికలిగినప్పుడు మార్చిరి. సుప్రసిద్ధమగు తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహము మొదట వీరభద్ర విగ్రహమనియు, దానిని వైష్ణవ విగ్రహముగా చేసిరనియు కాకతీయుల కాలపు వాడగు శ్రీపతి పండితులు తమ శ్రీకరభాష్యములో తెలిపినారు. [2] ఈ బలవత్పరివర్తనము చేసినవారు శ్రీమద్రామానుజాచార్యులవారని శ్రీపతి పండితులు తెలిపినారు.

ప్రాణాంతకమైనను సరే, జైనాలయములోనికి పోరాదన్నట్లుగా శైవ వైష్ణవులు ఒకరినొకరిని చండాలురనుగా, అసభ్యముగా దూషించుకొనిరి. మా దేవు డెక్కువ, మా దేవుడే యెక్కువని, నిరూపించుటకు కథలను పురాణములను సృష్టించిరి. ఈ జైన, శైవ, వైష్ణవ ద్వేషాలే కాకతీయాంధ్రరాజ్యాల పతనమున కొక కారణమయ్యెను. శైవ, వైష్ణవ భేదము లెట్లున్నను వా రిరువురును కులనిర్మూలనమునకై కృషిచేసిరి. లింగము కట్టినవారందరి దొకే లింగవంత కుల మనిరి. సమాశ్రియణమను ముద్రలు వేయించుకొని ఊర్ధ్వపుండ్రదారు లైనవారందరును ఒకే కులమువా రనిరి.

పల్నాటి వీరచరిత్రములో బ్రహ్మనాయడు బ్రాహ్మణాది చండాల పర్యంతము నానాకుల స్త్రీలను పెండ్లాడెననియు, తనకు ముఖ్యుడైన కన్నమనీడు బ్రహ్మనాయుని తండ్రిగా చెప్పుకొనుటయు, యుద్ధరంగమున మాల, మాదిగ, వెలమ, కమ్మరి, వడ్ల, కుమ్మరి మున్నగు కులాల వారందరును వైష్ణవ సాంప్రదాయమువారై ఏకపంక్తిలో 'చాపకూడు' కుడుచుటయు ముఖ్యముగా గమనింపదగినది. వెలమలు సంఘసంస్కారు లగుట, రెడ్లు పూర్వాచార పరులగుట కానవస్తున్నది. ఈ చాపకూడు కూడా పల్నాటియుద్ధాని కొక ముఖ్యకారణ మయ్యెను.[3]

వెలమలచర్చ వచ్చినందున ఇచటనే వారినిగూర్చి సూత్రప్రాయముగనే నాలుగు మాటలలో తెలుపుదుము. వెలమ లెవ్వరన్నది నేటికిని తేలినది కాదు. రెడ్లకు వెలమలకు ఓరుగంటిపై రుద్రమదేవికాలములో తురకల దండయాత్రా కాలములో స్పర్థలు ప్రారంభమై నిత్యాభివృద్ధి కాంచి, ఉభయుల రాజ్యాల నాశనమునకు దారితీసెను. రుద్రమదేవి వెలమలకు ఒక విశిష్టతను రెడ్లకిచ్చిన విశిష్టతనేమో కల్పించెను. వెలమలు వీరవైష్ణవు లైనట్లును, రెడ్లు వీరశైవులుగా నుండినట్లును కానవస్తున్నది. కొండవీటి రెడ్డిరాజులను పరమ శైవాచార పరాయణులుగా శ్రీనాథుడు వర్ణించెను.

"ఇచ్చోట బోరిరి యిలపణంబుగ గొల్లసవతి తల్లుల బిడ్డ లవనిపతులు" అన్న క్రీడాభిరామ వాక్యమున కేమర్థము? వెలమలు వెలమలేకదా! అందులోనూ జ్ఞాతులేకదా పల్నాటియుద్ధమును చేసిరి! వారు "గొల్లసవతితల్లుల బిడ్డలు" అని కవి యేల వర్ణించెను? నాకు స్ఫురించున దేమన, వెలమలు తెనుగు దేశమువారు కారు. ఆ లెక్కకు రెడ్లును అంతే! ఒకరు దక్షిణమునుండి, రెండవవారు ఉత్తరమునుండి వచ్చినారని తలంతును. రాష్ట్రకూటులు రెడ్లయిరి. దక్షిణ తమిళ దేశమునుండి తెనుగుసీమకు క్రీ.శ.1100 ప్రాంతములో వచ్చి కాకతీయుల సేనలో చేరిన 'వెల్లాల' అను జాతివారే వెలమలై యుందురు. వెల్లాలవారే వెలమలని వెల్లాలజాతిని గూర్చి చర్చించుచు థర్‌స్టను వ్రాసెను.[4] క్రొత్తగా వచ్చినందున వారిని రెడ్లు తక్కువగా చూచి, వారితో ద్వేషము సంపాదించుకొనిరి. శ్రీనాథుని కాలములో వెలమలు రెడ్లతో సమానులుగా పరిగణింపబడిరి. పల్నాటి వీరచరిత్రలో హైహయదాయాదులు పోరాడిరి.. వారు గొల్లవారై యుందురు. అందుచేత కవి యట్లు వర్ణించియుండును.

వైష్ణవులు కులభేదాలను ధ్వంసించిన దానికన్న హెచ్చుగా వీరశైవులు ధ్వంసము చేసినవారు. పైగా వారికి బ్రాహ్మణులతో నీ విషయమందు కలహించు పరిస్థితు లేర్పడెను. అందుచేత 'కోపం శేషేణ పూరయేత్‌' అన్న నీతి నాదారముగా కొని, కొన్నిమారులు వాదమును వదలుకొని 'త్వం శుంఠ స్త్వం శుంఠ:' అని తిట్టిపోసిరి.

       "శూలిభక్తుల కెత్తు కేలది త్రాటి
        మాలల కెత్తుట మరి తప్పు గాదె" [5]

       "అసమాక్షు గొలువని యగ్రజుండైన
        వసుధ మల.........." [6]

       "నా మాలకుక్కల నర్చింప దగునె" [7]

(ఇచ్చట వైష్ణవుల నుద్దేశించి తిట్టియుండును.)

      "...వేదభరాక్రాంతు లనగ
       బడిన బ్రాహ్మణ గార్దభంబులతోడ" [8]

ఇంతటితో ఆగలేదు. కర్మచండాలురు, వ్రతభ్రష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపనకూళలు. అని నానావిధముల బ్రాహ్మణులను తిట్టినారు. హిందువులను కలకాలము వదల నొల్లని కులతత్త్వము ఈ శైవవైష్ణవులవలన కాకతీయరాజ్య పతనానంతరము స్థిరపడి, మరికొన్ని కొత్తకులముల కూనల లేవదీసెను. శైవులలో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్ళు మున్నగు కులా లేర్పడెను. వైష్ణవులలో నంబులు, సాత్తానులు, దాసర్లు మున్నగు వారేర్పడిరి. శైవులు మతము పేర బసివిరాండ్రను జన్న విడిచిరి. బసవనిపేర స్త్రీలను పెండ్లిచేయక వదలి వారిని వ్యభిచారిణులనుగా జేసిరి. వైష్ణవులు కూడా ముద్రలువేసి దేవదాసీలను సిద్ధము చేసిరి. కాకతీయానంతర కాలములో శైవులు చాలమంది వైష్ణవులైరి. అందు ముఖ్యులు రెడ్లు.

కాకతి ప్రోలరాజు వరకు కాకతీయులు జైనులయై యుండిరి. ప్రోలరాజు కుమారుడు శైవుడయ్యెను. కాకతి యే దేవతగా నుండెనో ఆకాలమునాడే సరిగా ఎరుగరు. "కాకత్యా: పరాశక్తే: కృపయా కూష్మాండవల్లికా కాచిత్ | పుత్ర మసూత తదే తత్కుల మనఘం కాకతి సంజ్ఞమభూత్॥ " అని కలువచేరు శాసనములో వ్రాసిరి. కాకతీయులు క్షత్రియులు కారని విద్యానాథుడే వ్రాసెను.[9]

కాకతీయులు శైవులైన తర్వాత జైనులను హింసించి యుండవచ్చును. "అనుమకొండ నివాసులయినట్టి బౌద్ధజైనుల రావించి వారిని తిక్కన మనీషితోడ వాదింపజేసెను." అని గణపతి దేవుని గూర్చి సోమదేవ రాజీయములో నున్నది. తిక్కన తన నెల్లూరి ప్రభువగు మనుమసిద్ధికి సహాయార్థమై ఓరుగంటికి వెళ్ళి గణపతిరాజు సాయము వేడెననియు ఆ సందర్భములో నతడు జైనబౌద్ధుల నోడించె ననియు పై గ్రంథము తెలుపుతున్నది. తిక్కన సోమయాజి పటువాక్య శక్తికి గణపతి మెచ్చుకొని "జీనసమయార్థుల శిరముల దునిమి విద్వేష బౌద్దుల విలుమాడి..."[10] నానాహింసలు చేసెనట. ఈ విషయములను బట్టి ఈ ప్రకరణాదిలో తెలిపినట్లుగా కవిత్రయమువారు కేవల భాషా శాసకులే కాక, పౌరాణికులే కాక, మధ్యకాలమం దేర్పడిన కులతత్త్వ ప్రచారకులుగా గూడ నుండినట్లు ఊహింప వీలగుచున్నది.

కాకతీయుల కాలములో జైన బౌద్ధ సమయముల (సాంప్రదాయముల) వారే కాక యింకను పలుసమయముల వారుండిరి. అద్వైతవాదులు, బ్రహ్మవాదులు, పాంచరాత్ర వ్రతులు, ఏకాత్మవాదులు, అభేదవాదులు, శూన్యవాదులు, కులవాదులు, కర్మవాదులు, నాస్తికులు, చార్వాకులు, ప్రకృతి వాదులు, శబ్ద బ్రహ్మపరులు, పురుషత్రయైవాదులు[11], లోకాయతులు[12], మున్నగు మతావలంబు లుండిరి.

కాకతీయ కాలమందు తెనుగు సీమలో వీరశైవులు తమ మతప్రచారార్థమై గోళకి మఠముల నేర్పాటుచేసిరి. ఈ మఠమువారిలో కొందరు మహాపండితులై, గురువులై, విద్యాభోధకులై వెలసిరి. గోళకీమఠములందు శైవసాంప్రదాయ బోధను శాస్త్రవిద్యను సంస్కృత భాషలో నేర్పించుచుండిరి. ఒక విధముగా నవి వీరశైవుల గురుకులముగా పరిణమించియుండెను.

గోళకీమఠాల పోషణకై రాజులు గ్రామాలను, ధనికులు భూములను దానముచేసి శాసనములు వ్రాయించిరి. తర్వాతి కాలములో జంగాల మఠాలుండెను.. కాని 'గోళకి' పేరుమాత్రము మృగ్యమయ్యెను. పాలమూరు జిల్లాలోని గంగాపురములో అతిశిథిలములై దిబ్బలై మిగిలిన రెండు గుళ్ళు కలవు. వాటిని స్థానికులు "గొల్గక్క గుళ్ళు" అందురు. శబ్దసామ్యముపై నొక వెర్రి కతను కల్పించిరి. ఒక గొల్లవన్నెలాడిని అచట శివుడు కామించి భోగించి, ప్రతిఫలముగా పట్టిన పిడికెడు అనుదినము బంగారమగునట్లు వరమిచ్చెనట: అంత నా 'గొలక్క' లేక గొల్లత్త ఆ గుళ్ళను కట్టించెనట | యథార్థ మేమన, అవి గోళకీమఠములై యుండును. లేదా వాటి సమీపమున నా కాలమునందు గోళకీమఠాలుండెనేమో : గోళకీమఠ గురువులు శివదీక్ష నొందిన బ్రాహ్మణులుగా కానవస్తున్నారు. "వీరి యుద్బోధచేతనే కాబోలును ప్రతాపరుద్రుని కాలమున నాంధ్రదేశ శివాలయములో బెక్కింట తమ్మళ్ళు తొలగింపబడి వెలనాటి వారు పూజారుగా నిలుపబడిరి."[13]

"దేవళములం దర్చకులుగా నుండు తంబళ్ళకు 'జియ్యలు' అని వ్యవహారము."[14] పూర్వము శివాలయము లన్నింటిలో తమ్మళ్ళు పూజారులుగా నుండిరి.

        "మును శివు డిచట బుట్టిననాట నుండి
         చెనసి తమ్మళి భజించిన చొప్పులేదు"

అని యొక భక్తుడు వాపోయెను. నేటికిని కొన్ని శివాలయములలో తంబళ్ళే పూజారులైనారు.

కాకతి గణపతిరాజు గోళకీమఠమునకు చెందిన విశ్వేశ్వర శివాచార్యులవద్ద శివదీక్ష పొంది గోళకీమఠమును కృష్ణాతీరమందలి 'మందడ' గ్రామమున నెలకొల్పెను. విశ్వేశ్వరుడు విద్యామంటపవర్తి" [15][16] [17]

"మందడు గ్రామభోక్త అయి దక్షిణరాడానుండి వచ్చిన కాలాముఖుల తోడ్పాటుతో వెలగపూడి మఠాదుల్లో విద్యాశాలలు సాగించి ఆంధ్రదేశములో విజ్ఞానాన్ని వ్యాపింపజేసిన విశ్వేశ్వర శైవాచార్యులవంటి విద్యాసంపన్నులు ఈ కాకతీయుల కాలములోనే వర్థిల్ల గలిగినారు. కాకతీయ గణపతిదేవుడు గణపేశ్వర దేవాలయము కట్టించి అక్కడ అనేకులను విద్వాంసులను స్థాపించాడని కుమారస్వామి తెలుపుతున్నాడు. వీరినే "రాజన్నేతే గణపేశ్వరసూరయ:" (ప్రతాపరుద్రీయం) అనేచోట గణపేశ్వర సూరులని విద్యానాథుడు పేర్కొన్నాడు".

కాకతీయుల కాలములోనే కొన్ని ప్రాంతలలో శైవ వైష్ణవ సమన్వయమునకై కాబోలును హరిహరమూర్తి పూజలు జరుగుచుండెను. నెల్లూరిలో అట్టి మూర్తి యుండె నందురు. తిక్కన సోమయాజి తన భారతములోని మొదటి పద్యములోని "శ్రీ యనగౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపముదాల్చి" అని వర్ణించెను. అతనివలెనే గుత్తి ప్రాంతము వాడగునాచన సోమన తన ఉత్తర హరివంశమును హరిహర నాథునికే అంకితమిచ్చెను.

నాచన సోముని కాలములో (క్రీ.శ.1300 ప్రాంతము) శైవవైష్ణవ ద్వేషా లుండినందుననే అతడిట్లు వ్రాసెను.

     మ॥
 పరివాదాస్పద వాదమోద మదిరా
                  పానంబుచే మత్తులై
          హరి మేలంచు హరుండు మేలనుచు నా
                  హ కొంద రీ పొం దెరుం
          గురు కైలాస నగంబునందు మును లే
                  కత్వంబు భావించి రా
          మురవైరం బురవైరి బాపుట మహా
                  మోహంబు ద్రోహం బగున్.[18]

విగ్రహారాధనము, వివిధ సాంప్రాదాయములు, హిందువులను భిన్నించి దుర్బలులుంగా జేసిన వనవచ్చును. సామాన్య జనులు శక్తిభేదములని అంటు జాడ్యాలకు దేవతలను ఏర్పాటుచేసిరి. భక్తులను దేవతలగా పూజించిరి. కాకతీయుల కాలములో ఈ క్రింది దేవతలను పూజిస్తూయుండిరి.

(1) ఏకవీర - ఈ దేవత శైవదేవతయై యుండును. 'కాకతమ్మకు సైదోడు ఏకవీర'[19] అని వర్ణించిన పద్యమునుబట్టి యీ దేవత రేణుక (పరశురాముని తల్లి) యని స్పష్టము. ఈమె మాహూరము అను గ్రామమున నెలకొన్నదగుటచే మాహురమ్మ యనియు పిలువబడెను. ఈదేవత నగ్నదేవత[20]. ఈమెనే యిప్పుడు తెలంగాణములో, రాయలసీమలో ఎల్లమ్మదేవర అని యందురు. ఈ ఏకవీర గుడి "నింబపల్లవనికురంబ సంధానిత వందనమాలికాలంకృతద్వారము" కలది.[21]

ఓరుగంటి యెల్లమ్మ అని ప్రసిద్ధ దేవత కలదు. ఓరుగంటి నగరములో ఎల్లమ్మ బజారు అనునది కలదు. అది ప్రాచీనపుదిగా తోస్తున్నది. అయితే ఓరుగంటిలో నగ్నదేవత యగు యెల్లమ్మ విగ్రహమెం దయిన కలదో లేదో తెలియదు. కాని అట్టి విగ్రహము ఆలంపూరులో కలదు. దక్షిణ కాశి అనియు, శ్రీశైల పశ్చిమద్వార మనియు దీనికి ఖ్యాతి గలదు. నవబ్రహ్మల ఆలయములు బహు ప్రాచీనపువి అందు కలవు. అష్టాదశ శక్తులలో నొకటి యగు జోగుళాంబ అందే కలదు. అయితే జోగుల అంబ అనుటచే ఆమె జైన దేవతగా నుండి శైవమతమును బలవంతముచే పుచ్చుకొన్నదేమో! అట్టి యాలంపూరులోని బ్రహ్మేశ్వరాలయములో తలలేని మొండెము, నగ్నత్వముతో నున్న ఒక స్థూలదేవతా శిల్పమును స్థానికులు ఎల్లమ్మ యనియు, రేణుక యనియు పిలుతురు. తండ్రియాజ్ఞలచే తల్లియగు రేణుక తలను పరశురాముడు నరుకగా తల యెగిరి మాలవాడలో బడెనట. మొండెము మాత్రమే అచట నిలిచెనట. ఆమె గొడ్రాండ్రకు పిల్లల నిచ్చు దేవత యని ఆలంపురీ మాహాత్మ్య మను స్థానిక లభ్యమాన లిఖిత పుస్తకమందు వర్ణితము.

ఈ ఎల్లమ్మ కథను రేణుక కథగా నేటికిని రాయలసీమ పల్లెలలోను, పాలమూరు జిల్లాలోను బవనీండ్లు (మాదిగజాతివారు) జవనిక (జమిడిక) వాయించుచు కథగా రెండుదినాలు చెప్పుదురు. కాకతీయుల కాలమునాడును బవనీలును మాదిగ స్త్రీలును ఎల్లమ్మ కథను వీరావేశముతో చెప్పుచుండిరి. వారు మ్రోయించు జవనిక "జుక జుం జుం జుక జుం జుం జుమ్మనుచు సాగుంగడున్ వాద్యముల్"[22]

"వాద్యవైఖరి కడు నెరవాది యనగ

          ఏకవీరా మహాదేవి యెదుట నిల్చి

          పరశురాముని కథ లెల్ల ప్రౌడి పాడె

          చారుతరకీర్తి బవనీల చక్రవర్తి"

[23]

(2) మైలారుదేవుడు - ఇతడు ఏకవీరవలెనే జైనదేవుడై తరువాత శైవుడయ్యెనేమో! "భైరవునితోడు జోడు మైలార దేవుడు" మైలారను గ్రామమున వెలసి మైలారుదేవు డయ్యెను.[24]

(3) ఇతర దేవతలు - భైరవుడు, చమడేశ్వరి, వీరభద్రుడు, మూసానమ్మ, కుమారస్వామి, పాండవులు, స్వయం భూదేవుడు (శివుడు) ముద్దరాలు ముసానమ్మ.[25]

(4) వీరగడ్డములు - నేటికిని చాలగ్రామములలో వీరగుడ్డమ్మలు కలవు. ఏదో వీరకృత్యము చేసియుండిన స్థానిక వీరుని పూజసేయుట ఆచారమై యుండెను. పల్నాటివీరుల యుద్ధము క్రీ.శ. 1132 ప్రాంతముదని ఉమాకాంతముగా రన్నారు. ఆ వీరుల పూజను నేటికిని పల్నాటిలో చేయుచున్నారు. ఆ యుద్ధము ముగిసిన నాటినుండియే వీరపూజ ప్రారంభమయ్యెను. ఓరుగంటిలోను,

"పలనాటి వీర పురుష పరమ దైవత శివలింగ భవన వాటి" యుండెను.[26]

       "కులము దైవతంబు గురిజాల గంగాంబ
        కలని పోతులయ్య చెలిమికాడు
        పిరికికండ లేని యరువది యేగురు
        పల్లెనాటి వీరబాంధవులకు"[27]

కలని పోతులయ్య, గురిజాల గంగమ్మ అను గ్రామ దేవతలును ఉండిరి.

(5) మాచెర్ల చెన్నడు - చెన్నకేశవుడు అను దేవత "మాచెరల చెన్నడు శ్రీగిరి లింగముం గృపాయత్తత జూడ" అన్నందున చెన్నకేశ పుడనవలెను.

పల్నాటి కథలో బాలచంద్రుని తల్లి సంతానమునకై నోచిన గజనిమ్మ నోములో చెన్నకేశవుని పూజ మాచర్లలో చేసినట్లు తెలిపినందున మాచర్ల చెన్నడు చెన్నకేశవుడే యని దృడపడినది. ఇంకను నిట్టిదేవతలకు కొదువ లేకుండెను. మతమునకు సంబంధించిన కులాలను గూర్చి యిచ్చటనే కొంత తెలుపుదును.

అష్టాదశసంఖ్య కేలనో ప్రాధాన్యము కలిగినది. హిందువులలో 18 కులముల వారు ముఖ్యులుగా నుండిరని నాగులపాటి శాసనములో నిట్లు వ్రాసినారు.

"ఆ యూరి పదునెన్మిది సమయాల సమస్త ప్రజాసురంగభోగానికై" దానము చేయబడెను. అందీ క్రిందిజాతులు పేర్కొనబడినవి - కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు, (అగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మరవారు. ఈ కులాల విషయము చర్చింప నవసరములేదు. కాని కోమట్ల విషయము మాత్రము కొద్దిగా చర్చింతును. కోమటిపద మెట్లేర్పడెనో సరిగా జెప్పజాలము. గోమఠమునుండి గోమఠేశ్వరుడను జైన తీర్థంకరునినుండి యేర్పడినదని కొందరూహచేసిరి. అంగస్వరూప శాస్త్రమును (Ethnology) బట్టి వారిలో ఆర్యలక్షణాలు కానరావని తచ్ఛాస్త్రవేత్త లభిప్రాయపడుటకు వీలున్నది. తెనుగు దేశములో మొదటిసారి కోమటిపదము క్రీ.శ. 1150 కి లోనుగా నుండినట్లు శ్రీ మానపల్లి రామకృష్ణకవిగారిచే నిర్ణయింపబడిన భద్రభూపాలుని నీతిశాస్త్ర ముక్తావళిలో కానవస్తున్నది.[28] తర్వాత నీశబ్దము పల్నాటి వీరచరిత్రలో కానవస్తున్నది. పల్నాటియుద్ధము క్రీ.శ. 1172 లో జరిగెనని శ్రీ అక్కిరాజుగారన్నారు.

తర్వాత పాల్కురికి సోమనాథాదుల కృతులలో బహుళమయ్యెను. కోమటికి పర్యాయపదము భేరి[29], బచ్చు, నాడెకాడు[30] అని పూర్వులు వ్రాసిరి. ఇంతకుమించి వ్రాయలేదు. కాని ఒక ముఖ్యమగు పర్యాయపదమును మాత్రము పూర్వులు వ్రాసినవారుకారు. కోమట్లను గౌరులని, చెట్లు (సెట్టి) అనియు నందురు. చెట్టి, సెట్టి అను పదములు చాళుక్య కాకతీయుల కాలములో వీర శైవులగు బలిజలకు కులబిరుదముగా నుండెను. నేటికిని బలిజసెట్టి అని వాడుకలో నున్నది. తర్వాత కోమట్లు అ బిరుదమును శైవముతోపాటు స్వీకరించి నట్లున్నది. గౌరశబ్దమును క్రీ.శ.1600 ప్రాంతమందుండిన శుకసప్తతికారుడగు పాలవేకరి కదిరీపతి ప్రయోగించెను.

కోమట్లు బెంగాలులోని గౌడదేశమునుండి క్రీ.శ. ఆరు ఏడు శతాబ్దములలో ఆనాటిరాజుల దుష్టపాలనకు తాళజాలక సముద్రముపై వచ్చి తెనుగుతీరములలో దిగి గౌరలై, తర్వాత జైనమతావలంబులై, గోమఠానుయాయులై, కోమటులై యుందురు. వారి కులదేవతయగు కన్యకాంబను విష్ణువర్ధనుడను రాజు బలాత్కరించెనన్న కథనుబట్టియు వారు క్రీ.శ. ఆరేడు శతాబ్దుల కాలమందు వచ్చిరని యనవచ్చును.

వీరుకాక మరికొన్ని జాతులవారు ఈ కాలపు వాఙ్మయములో పేర్కొనబడినవారు. బోయవారు అను జాతి కొంత సందిగ్ధమునకు తావిచ్చును. విజయనగరకాలములో బేండర్‌బోయ అను జాతి యుండెను. బోయలు వేటకాండ్లని, అటవికులని, క్రూరులని విజయనగర కాలమునుండి కవులు వర్ణిస్తూ వచ్చినారు. కరీంనగరు, నల్లగొండ జిల్లాలలో ప్రధానముగా నివసిస్తున్న బోయీలు అను జాతివారు కలరు. భోజశబ్దభవులు వీరే అని కొందరన్నారు. ఇంగ్లీషువారు మద్రాసులో దిగినకాలములో వారివద్ద ఈ బోయీలే నౌకరులైనందున వారు వీరిని బాయ్ (Boy) అని పిలిచినందున ముసలి నౌకర్లనుగూడ ఇంగ్లీషువారు బాయ్ అనియే యందురు.

పలనాటి వీరచరిత్రలో బాలచంద్రునితో దెబ్బలుతిని పారిపోయినవారిలో కొంద రిట్లు పలికి తమప్రాణాలు కాచుకొనిరి.

         "బోయవారము మేము పూర్వంబునందు
          బుజములు కాయలు పూని కన్గొనుడి"

భోయీలు నిన్న మొన్నటివరకు పల్లకీలను (మేనాలను) మోసినవారు. కావున క్రీ.శ. 1172 ప్రాంతములో వీరు అదేవృత్తిలో జీవించినవారు. పైగా నల్లగొండ సరిహద్దులోనే కార్యంపూడి ఆంధ్ర కురుక్షేత్రముండెను. అందుచేత వారందు గానవచ్చినాడు.

కర్ణాణ కిరాతులుగా బరిగణింపబడిన బోయలు కాకతీయ కాలములో లేరన్నమాట. వారు కర్ణాటదేశీయులు కాన విజయనగరకాలమందే వారు కనిపించినారు. రాయచూరు జిల్లాలోని సురపురము అను "బేండర్" (బోయ) సంస్థాన ముండెను. సీపాయివిప్లవ మను అభాసనామము కల క్రీ.శ. 1857 నాటి స్వాతంత్ర్య విప్లవముతో ఆ సంస్థానము మాయమయ్యెను. ఆసమయమున దాని విచారణకర్తగా నుండిన మెడోస్ టెయిలర్ అను ఆంగ్లికోత్తముడు తన స్వీయచరిత్రలో అ రాజరికపు బోయలకు బావులలో దేవాలయములలో ప్రవేశము లేకుండెననియు, వారిని అంటరానివారినిగా హిందూ హిందువులు పరిగణించిరనియు వ్రాసెను. నూరేండ్ల లోపలనే ఆ బోయజాతి అంటరానితనము మాయమయ్యెను.

రుంజలు అనువా రుండిరి. వారు నగారావంటి రుంజ వాద్యమును మ్రోయించువారై యుండిరి. వారిని పల్నాటి వీరచరిత్రలోను, పాల్కురికి రచనలలోను పేర్కొన్నాడు.

పిచ్చుకుంట్ల వా రను నొక తెగవారు కలరు. నేడు వారు రెడ్లగోత్రాలను తంబూరాపై పాటలుగా చెప్పుచుందురు. పాల్కురికి కాలములో వీరు వికలాంగులైన బిచ్చగాండ్లు!

      " .... .... .... మాకు
       వీవంగ చేతులు లేవయ్య, నడచి
       పోవంగ గాళ్ళును లేవయ్య, అంధ
       కులమయ్య, పిచ్చుకగుంటులమయ్య"

" దాన మొసంగరే ధర్మాత్ములార" అని వారు బిచ్చమడిగినారు[31] పంబల, బవని, మేదర, గాండ్ల మున్నగు కులాలు చాలా గలవు. కాని అవన్నియు వృత్తులనుబట్టి యేర్పడినందున వృత్తుల చర్చలో వారినిగూడ చర్చించవచ్చును. హిందువులు మతాంతరులను స్వీకరింపలేదని క్రీస్తుశకము అయిదవ శతాబ్దినుండి వచ్చిన కట్టుబాట్లనుండి కొంద రూహించినారు. కాని శుద్ధిచేయుట, మతాంతరుల స్వీకరించుట, మతప్రచారము చేయుట, హిందూబౌద్ధులనుండియే క్రైస్త వేస్లాములు నేర్చుకొనెను. క్రీ.పూ. 150 ఏండ్లనాడు హెలియోడోరన్ అను గ్రీకువాడు హిందువై ఖీల్సాస్టేషన్ సమీపమందలి బెస్నాగర్‌లో గరుడస్తంభ మెత్తించి శాసనము వ్రాయించి తాను భాగవతమతమును స్వీకరించినట్లు తెలుపుకొనెను. తురకలు సింధుదేశమును లాగుకొన్న తర్వాత బలవంతముగా తురకలైనవారిని శుద్దిచేసి హిందువులను చేయుటకై దేవలస్మృతి ఇంచుమించు క్రీ.శ. 11 వ శతాబ్దములో పుట్టెను. ఓరుగంటి రాజ్యమును ధ్వంసించిన కాలములో తెనుగుసీమవారును శుద్ధిసంస్కారమును తొలిసారి ప్రారంభించిరి. పిచ్చితొగ్లాకు వరంగల్‌ను జయించిన తర్వాత ఆంధ్రదేశములో చాలమందిని బలవంతముగా ముస్లిములను జేసిరి. ముఖ్యులైన ఆంధ్రులను తురకలుగా జేసి డిల్లీకి తీసుకొనిపోయిరి. అందొకడు కన్నయ నాయకుని బంధువు. ఆ నవముస్లిమును కంపిలిరాజుగా తొగ్టా కంపెను. వాడు కంపిలికివచ్చి "మహమ్మదీయ మతమును వదలిపెట్టి పితూరీ చేసెను." ఇది క్రీ.శ. 1745లో జరిగిన మాట!

సంఘ సంస్కారము

హిందూమతమును సంస్కరించు నుద్దేశముతో శైవ వైష్ణవ మతములు ప్రబలియుండెను. కాని అవి యెక్కువగా అపకారమే చేసినవి జైనులలో చాలా గొప్ప తార్కికులుండిరి. వారు వ్రాసిన సంస్కృత తార్కిక చర్చలలో కులతత్వమును చాల సుందరముగా దిట్టముగా ఖండించిరి. అట్టి జైనులవల్లనే సంఘ సంస్కారము తెనుగుదేశములో బౌద్ధులతోపాటు మొదలయ్యెను. కాకతీయ కాలములో అనులోమ ప్రతిలోమ వివాహములు చాలాజరిగెను. రుద్రమ్మరాణి బ్రాహ్మణ మంత్రియగు ఇందులూరి అన్నయ్య రుద్రమయొక్క రెండవ కూతురగు రుయ్యమ్మను వివాహమాడెను. రాజవంశమందే కులము కట్టుబాట్లులేనప్పుడు జనసామాన్యములో మాత్ర ముండునా? పల్నాటి యుద్ధములో చాపకూటిని గురించియు, బ్రహ్మనాయడు బహుకులములతో బాంధవ్యము చేయుటను గురించియు నిదివరకే చర్చింపబడినది. పాలెం అనుపదము దక్షిణమందే వాడుకలో నుండెను. పాలెమును (సీమను) రక్షించువారు పాలెగార్లు. వారిసేనలో మాలమాదుగలు విశేషముగా నుండిరి. నేటికిని మాలమాదుగుల ఇండ్లపేళ్ళలో పింజలవారు, తప్పెటవారు, కొమ్మువారు, కఠారివారు అను పేరులు వారి పూర్వపుజాడలను తెలుపుతున్నవి.

శైవమందు చాకలి, మంగలి, మాల, మాదిగ మున్నగు జాతుల వారందరును కలిసిరనుటకు పాల్కురికి సోమనాథ బసవపురాణమం దనేక నిదర్శనములు కలవు. ఇప్పటి కాలములో సత్రభోజనములు బ్రాహ్మణులకే ప్రత్యేకింపబడినవి. కాకతీయుల కాలమున కొన్ని తావులలో అన్ని వర్ణముల వారికిని భోజనములు పెట్టుచుండిరి. శైవ సాంప్రదాయానుపరణముగ చండాలురకుగూడ అన్న వస్త్రదానములను సత్రములం దేర్పాటు చేసియుండిరి.[32]

ప్రతాపరుద్రుని కాలమువాడగు ఏకామ్రనాథుడు తన వచన ప్రతాప చరిత్రములో నిట్లు వ్రాసెను.

"మరియు నొక్కనాడు సంతూరను గ్రామంబున కృష్ణమాచార్యుల తమ్ము డనంతాచార్యులు రజకస్త్రీతో
గూడెను. ఆ రజకు డిద్దరిని బొడిచెను. అంత వారు మరణించిరి. అ పురి విప్రులది. శూద్రపీనుగుతో
గూడియున్నది కనుక మేము మొయ్య మనిరి. అది విని కృష్ణమాచార్యులు తనమదిని విచారించి,
వాసుదేవ మూర్తిని కీర్తించెను. శవంబు దనంతట తాను కాష్ఠంబువరకు జరిగిపోయెను."

వీరశైవులును వైష్ణవులును కొంతవరకు సంఘసంస్కర్తలే కాని వారు అసహనమున, మతోన్మాదమును హిందూసంఘమందు ప్రవేశపెట్టినవారైరి. జనులలో మూడభక్తి యెక్కువయ్యెను. ఇది మతమును గూర్చిన చర్చ.

ఇక యితర విషయములనుగూర్చి తెలుసుకొందము.

యుద్ధ తంత్రము

హిందువులలో శౌర్యసాహసా లుండెను. కాని యుద్ధపరికరములను వారు కనిపెట్టినది తక్కువయే. క్రొత్త మేలైన మారణయంత్రాలను తురక లుపయోగించిరి. తర్వాత యూరోపువారు మనపై యుపయోగించి దేశమును గెలుచుకొనిరి. ఆంధ్రులకు బల్లెము, కత్తియే ప్రధానమగు ఆయుధములై యుండెను. ఆనా డిట్టి పరికరా లుండినందున కోటల యవసరముండెను. గణపతిదేవుడు మొదట ఓరుగంటి కోటను కట్టెను. దానిని రుద్రమదేవి పూర్తిచేసెను. లోపలి రాతి కోటను పెద్ద కోట యనియు, బయటి మట్టిప్రాకారమును భూమికోట యనియు పిలుచు చుండిరి. మట్టికోట సామాన్యమైనది కాదు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ క్రీ.శ. 1296 లో మలిక్ కాఫిర్ సేనానిని ఓరుగంటిపై దాడిచేయ నియోగించెను. ఈ మలిక్ కాఫిర్ ఎవరు? ఇతడు మొదట హిందువు, అన్పృశ్యుడు. తర్వాత ముసల్మానై, మహాసేనానియై వేలకొలది హిందువుల చంపి, హిందూరాజ్యముల నాశనముచేసి, తన కసితీర్చుకొనెను. వాని సైన్యము మట్టికోటపై బడి దానిని పడగొట్టజూచెను. "కాని ఉక్కు బల్లెములతో దానిని బొడిచినను, బేటు (పెడ్డ) కూడా రాలకుండెను. గుండ్లను దానిపై వేయించినను అవి పిల్లలాడుకొను గోలీలవలె వెనుకకెగిరి పడుచుండెను."[33] ఈ కోట గోడ వైశాల్యము 12,546 అడుగులట!

ఓరుగల్లుకోటనుండి ముట్టడివేసిన తురకలపై నిప్పుతో కరిగిన వేడి ద్రవమును పోయిచుండిరట. తురకలు 'మాంజనీకులు' ఉపయోగించిరి. ఓరుగంటివారు అరద్ద లుపయోగించిరి. ఈ రెండును రాళ్ళు రువ్వుటకై యేర్పాటుచేసిన వడిసెలవంటివై యుండెను. ఏలన, ఖుస్రూ వాటిని గురించి యిట్లు వ్రాసెను. "ముసల్మానులరాళ్ళు వేగముగా ఆకాశమం దెగురుచుండెను. హిందువులగుండ్లు బ్రాహ్మణుల జందెములనుండి విసరబడిన వానివలె బలహీనములై యుండెను."[34] ఈ మంజనీకులు పాశ్చాత్యదేశాలనుండి దిగుమతియై యుండెను. వాటిని ఉభయ సైన్యము లుపయోగించెను.

అగ్నితోడియుద్ధము మొదట వరంగల్లు పైననే ప్రయోగింపబడెను. ఇది తర్వాత ఫిరంగీలకు, తుపాకులకు నాందీ ప్రస్తావన యనవచ్చుమ. 'అతీష్‌మీరేఖ్తంద్, (ఉభయులును ఆగ్నిని చిమ్ముచుండిరి.) అని ఫార్సీ చరిత్రకారుడు వ్రాసెను. ఆంధ్రసైన్యములో స్తోత్రపాఠకులు తమనేర్పును జూపు చుండిరి. వారిని "బర్దులు" అనుచుండిరి. "కితాబాతె హిందూ కె గోయంద్‌బర్దష్" బర్ద్ అనేది తెనుగై యుండ వలెకదా! స్తోత్రపాఠకులను వంది, భట్టు అని యందుము. ఈ రెంటిలో నేదే నొకదాని యపభ్రంశముగా బర్ అనున దేర్పడియుండును.

ఆ కాలమం దాంధ్రు లెట్టి ఆయుధముల నుపయోగించిరో కొంతవరకు ప్రతాపరుద్ర యశోభూషణము వలన తెలియగలదు. కాని అవన్నియు నిజమైనవో లేక కవికపోలకల్పితములందు కొన్ని కలవేమో చెప్పజాలము. ప్రతాప రుద్రీయముపై రత్నాపణవ్యాఖ్య కలదు. అందిట్లున్నది.

తోమర: = దండవిశేష:

కౌక్షేయకా: = ఖడ్గా:

ముసుందయ: = దారుమ యాయుధ విశేష: కఱ్ఱతో చేసిన ఒక విధమగు ఆయుధము.)

కార్ముక: = ధమ:

గదా: = (గదలు)

కుంతా: = పరంపరయా క్షేపణీయా ఆయుధ విశేషా: (వెను వెంట విసరి వేసెడు ఒకవిధమగు ఆయుధాలట!)

పట్టప: = లోహదండ:, యస్తీక్ష్ణధారక్షరోపమ: (వాడిధార కల ఇనుప దండమట! బహుశా పట్టాకత్తియై యుండును.)[35]

కత్తులు మంచివిగా నుండుటకై నాలుగు లోహములతో చేయుచుండిరి.

"విను మినుమును, రాగి, యిత్తడి, కంచు

పెట్టి చేసినయట్టి బిరుదలు కలవు"[36]

(ఇచ్చట బిరుదులన ఆయుధములు) పల్నాటి యుద్ధములో,

"కుంతములును, గండ్రగొడ్డండ్లు, గదలు,

ముసల ముద్గరములు, మొనల కటార్లు చక్రతోమరములు, శార్జ్గసంఘంబు

చురికలు, బాణముల్. శూలచయమ్ము

మొదలైన శస్త్రాస్త్రములు ..."[37] వాడిరి.

శత్రువులు దండెత్తి వచ్చిన కోటలను భద్రము చేసుకొనుచుండిరి. ఆ విధానమును కొంతవర కీ క్రింద పద్యమునుండి గ్రహింపవచ్చును.

      "కోట సింగారించి కొత్తళంబుల నెల్ల
       నట్టళ్ళు పన్నించి యాళువరికి
       పందిళ్ళు పెట్టించి పైకొమ్మ లెగయించి
       గుండు దూలము వసికొయ్య గూర్చి
       యగడితలీత నీరలవడ ద్రవ్వించి
       వెలిజుట్టును వెదురు వెలుగు వెట్టి
       దంచనంబులు దద్దడంబులు నెత్తించి
       పలు గాడితలుపులు బలువు చేసి

గీ॥
   బాళెములు వెట్టి కొంకులు బ్రర్దపరులు
      కత్తిగొంతంబు లొడిసెళ్లు గత్తళములు
      నారసములును విండులు నగరిలోన
      బెట్టిపెట్టుడు నడు నెట్టి మట్టిలావు."[38]

యుద్ధయాత్రకు ఆంధ్ర సైనికు లెట్లు వెడలుచుండిరో, యుద్ధరంగమున నెట్లు శ్రమిస్తుండిరో, యుద్ధ ధర్మము లెట్టివై యుండెనో పల్నాటి వీరచరిత్రము తెలుపు చున్నది.

యుద్ధమునకు వెళ్ళువారు తమకోటకు తగురక్షణ లేర్పాటు చేసి భూసుర పురీహితులచే జయముహూర్తము పెట్టించి ప్రయాణ భేరి వేయించి వెడలుచుండిరి.[39] సేన వెంట గొల్లెవలు, పట కుటీరములు, బల్లాకి పెట్టెలు (?), మంచములు, తమ్మపడిగెలు, బొక్కసములు, బోనకావళ్ళు, పల్లకీలు మున్నగునవి తీసుకొనిపోవుచుండిరి.[40]

ఆ కాలమందు తప్పెట్లు, కాహళములు, కాలికొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖములు, సన్నాయీలు, డోళ్ళు, రుంజలు, చేగంటలు అన్నీ కలిసి గందరగోళముగా అపశ్రుతితో ధ్వనించుచుండిరి.[41] (రుంజలు అనునవి నగారావంటి వాద్యములట) గొల్లెనలు అన్న బట్టల డేరా లని యర్థము. కాని పటకుటీరములును డేరాలేకదా! ఈ రెంటిలో భేదముండెను. పటకుటీరములను డేరాలనియు వాడిరి. గొల్లెనలు మధ్య స్తంభము మీద మాత్రమే గోళాకారముగా నిలిపినట్టివి. నడిమి కంబము కూలితే డేరా యంతయు కూలి పడెడిది[42] యుద్ధకాలములో ఓడిన వారు సంధి చేసుకొందు మనియు, యుద్ధము నాపవలసిన దనియు తెలుపుటకై కొమ్ము పట్టించి ధ్వనించెడివారు. దానిని ధర్మధార యనిరి.[43] యుద్ధము జరుగుచుండగా ప్రతిపక్షవీరుల కత్తిపోటులనుండి తల గాచుకోదలచిన వారు ప్రాణదానము పలువిధముల వేడుచుండిరి. మేము పల్లకీ బోయీలమే కాని భటులము కాదనువారును, చచ్చినట్లుగా రణరంగముపై పడియుండు వారును, చచ్చిన శవాలను మీదవేసుకొని దాగువారును, "పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు"ను పలుతెరంగులై యుండిరి.[44]

అంతేకాదు,

"వల్మీకముల మీద వసియించువారు,
గడ్డిలో జొరబడి కదలనివారు.
వేళ్ళు చీకెడివారు, వెన్నిచ్చువారు.
వెండ్రుకల్ విప్పుక విదలించువారు."[45]

ఇట్టివా రందరు కత్తి పారవేసిన వారగుటచే ప్రతిపక్షులు వారిని చంప కుండిరి. గడ్డికరచుట, ఐదు పది సేయుట=(అనగా రెండు చేతులు జోడించి మ్రొక్కుట కాని ముందు కాలిని వెనుకకు పెట్టి రెండు కాళ్ళను జోడించుట అని యొకరన్నారు.) వెన్నిచ్చుట, వెనుకంజవేయుట అన్న పదాల యర్థము కూడ యిట్టిదే.

ఆనాటి యుద్ధాలలో ఏనుగులు, గుఱ్ఱములు, ఎద్దులు ఎక్కువగా వినియోగ మవుచుండెను. దొరలు పల్లకీలలో యుద్ధానికి వెళ్ళుచుండిరి. ఆంధ్రుల సైన్యములో క్రమశిక్షణము, యూనిపారం, మేలైన మారణ యంత్రాలు తక్కువగా నుండెను. సంఖ్యాబలము పైననే ఆధారపడినవారు పలుమా రోడినారు. పల్నాటి యుద్ధములో బాలచంద్రుని కోతలకు నిలువలేని వారిలో కొంద రిట్లునుచున్నారు.

      "పగవారు మిముగని పారిపోవుదురు
       మీ కేమి భయ మని మెలత నాగమ్మ
       బాగుగా నమ్మించి పంప వచ్చితిమి
       జీవముల్ దక్కిన చిన్నల గలిసి
       బలుసాకు తినియైన బ్రతుకంగ గలము."[46]

ఇట్టి వెట్టిమూకలేనా జయము పొందునది: అయితే క్రమశిక్షణ మిచ్చిన సైనికులు లేకుండి రని కాదు. వారు చాల తక్కువ. ఓరుగంటి నగరములో 'మోహరివాడ' (Military Cantonement వంటిది) యుండేను. బహుశా ఆ సైనికులకు మాత్రమే మిలిటరీ యూనిఫారం దుస్తులు కుట్టుటకు కుట్రపువారేర్పాటైయుండిరేమో, ఆనాటి సైనిక యూనిఫారంలో అంగీ, చెల్లాడము, నడుముపట్టీ చేరినట్లుండెను. కాకతీయ రాజులకు 9 లక్షల సైన్యముండెను. "నవలక్ష ధనుర్ధరాదినాథే, పృథివీం శంసతి వీర రుద్రదేవే" అని విద్యానాథుడు వర్ణించెను. ఈ సైన్యములో ఎక్కువ భాగము సరిహద్దుల కాపాడు పాలెగార్లు లేక సామంతరాజులవద్ద నుండెను. ఈ పాలెగారు పద్దతియే ఆంధ్రరాజ్యాల నాశనమునకు కారణమయ్యెను. పాలెగార్లు కేంద్రప్రభుత్వ బలహీనతకై చూపెట్టు కొని సమయము దొరకగానే తిరుగుబాటు చేయుచుండిరి. మొత్తముపై ఆంధ్రుల యుద్ధతంత్రము తురకల యుద్ధతంత్రముకన్న చాలా వెనుకబడి లోపభూయిష్ఠమై యుండెననుటలో సందేహములేదు.

కళలు

నిర్మాణ శిల్పము, విద్యలు, చిత్రలేఖనము, చేతిపనులు, కళలుగా బరిగణింపబడి యిందు వ్రాయనయినది. కాకతీయ కాలములో ఆంధ్రుల ఉత్తమోత్తమ శిల్పములు బయలుదేరెను. అంతకుముందు ప్రాక్పశ్చిమ చాళుక్య రాజులు అనేకశివాలయములను కట్టించి, ఉన్నవాటిని సవరించి వాటివి భూదానములు చేసి యుండిరి. ఓరుగంటి రాజులును వారి సామంతులును అనేక దేవాలయములను నిర్మించి శాసనములను వ్రాయించిరి. కాకతీయుల రాజధాని తెలంగాణ మందుండుటచే అచ్చటనే దేవాలయ శిల్పము లెక్కువగా లభిస్తున్నవి.

ఓరుగంటి నగరమును ఆంధ్రనగర మని పిలిచిరి. మరేనగరమునను ఇట్టిపేరు లేకుండుటను జూడ ఓరుగంటి రాజులకు ఆంధ్రాభిమానము చాలా ఉండెననవచ్చును. ఆ నగరమునకు ఏడుకోట లుండెనందురు. లోపలి రాతికోటలో చక్రవర్తి వసించుచుండెను. ఆ కోటకు బయటిభాగమున చిన్నకులములవారి మైలసంత వారమున కొకమారు జరుగుచుండెను. లోపలి భాగములో మడిసంత జరుగుచుండెను. రాజవీథులు కొన్ని, సందులు కొన్ని యుండెను. పరిఖ, ప్రాకారము, వంకనార, గవని, కల ఆ కోటలో రథ, ఘోట, శకట, కరటి యూధసంచార ముండెను.[47] రాజమార్గంబు వారణఘటా ఘోటక శకటికాభటకోటి సంకలంబు; క్రంత త్రోవల నొండు కలకలంబులు లేవు; వేశ్య వాటిక మధ్యవీధి, మధ్యభాగములో స్వయం భూదేవాలయ ముండెను. దానిని తురకలు ధ్వంసము చేసిరి. దానికి నాలుగుదిక్కుల హంస శిఖరములతో నుండిన పెద్ద శిల్ప శిలా స్తంభముల మహాద్వారము లుండెను. అందిప్పుడు రెండుమాత్రమే మిగిలినవి. నగరము చాలా సుందర నిర్మాణములతో నిండినట్లు కావలసినన్ని నిదర్శనములు లభిస్తున్నవి. క్రీ.శ. 1721 లో తురక సేనాని యగు అలూఫ్‌ ఖాన్ ఒకమిట్టపై నెక్కి ఓరుగంటిలోని భాగమును పరీక్షింపగా నాతనికిట్లు కనబడెనట! "ఏ దిక్కు చూచినను రెండు మైళ్ళ పొడవున నీటి నాళములును (Fountains), తోటలు నుండెను. వాటిలో మామిడి, అరటి, పనస లుండెను. పువ్వులన్నియు హిందూ పుష్పాలే. చంపకము, మొగలి, మల్లెపూ లుండెను, [48] నగరము పేటలుగా విభజింపబడి యుండెను. అక్కలవాడ, భోగంవీధి, వలిపాళెము, మేదరవాడ, మోహరివాడ, దేవాలయములు, రాజభవనాలు పూటకూటియిండ్లు మున్నగున వుండెను."

కాకతీయుల జైనులుగా నుండినప్పుడు జైన దేవాలయములు కట్టించిరి. హనుమకొండ గట్టురాళ్ళపైన కూడా పెద్ద జైనతీర్థంకరుల విగ్రహాలను చెక్కిరి. అదే గుట్టపై పద్మాక్షి దేవాలయము కలదు. దానిని తర్వాత శైవులు లాగుకొని తమ దేవతగా పూజలు చేయించుతూ వచ్చినారు. గుట్టవద్దగల చెరువులో అనేక జైన విగ్రహాలు మంచివి విరిగినవి, శకలములు నేటికిని కుప్పగా వేయబడినవి కానవచ్చును.

తర్వాత కాకతీయరాజులు శైవులయిరి. అప్పుడు వారు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయమును నిర్మించిరి. అదిగాక ఆంధ్రనగరములో అనేక సుందర శిల్పసమాయుక్త దేవతాయతనములు నిర్మాణమయ్యెను. కాని తురకలు వాటిని నాశనము చేయగా మనకీనాడు విచారము, దు:ఖము, శిల్పశకలములు, మాత్రమే మిగిలినవి. ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున "రామప్ప గుడులు" కలవు. వాటిని క్రీ.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నముగా తీర్చిదిద్ది ఆనందించినారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడినవి. ఆ కాలములో జాయసేనానియను నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును వ్రాసెను. అది తంజావూరి లిఖిత పుస్తకాలలో నున్నది. కాని, దానిని ముద్రించుట కెవ్వారును పూనుకొనరయిరి. జాయప గ్రంథమునకు ఉదాహరణము లాస్తంభాలపై నాట్యముచేస్తున్న సుందరీమణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రించిన ఎంత బాగుండునోకదా!

పాలమూరుకు సమీపములో బూదుపూరు అనునది కలదు. (బహుశా అది గోన బుద్ధారెడ్డిపేర కట్టిన బుద్ధాపురము:) అందు శిథిలములయిన ఆలయములు కలవు. వాటిపై తురకల సుత్తెపోట్లు పడినవి. ఒక దేవాలయాన్ని మసీదుగా చేసుకొనిరి. ఆ మసీదులో నేటికిని శాసనా లున్నవి. వాటిని గోన బుద్ధారెడ్డి కూతురును, మల్యాలగుండ దండనాయకుని భార్యయు నగు కుప్పమ్మ కట్టించెను. కుప్పమ్మయు, గుండయ్యయు పాలమూరుజిల్లా నాగరు కర్నూలు తాలూకాలోని వర్ధమానపురము ఇప్పటి వడ్డెమానులోను కొన్ని సుందర శివాలయములను కట్టించిరి. దానికి 15 మైళ్ళ దూరమున వనపర్తి సంస్థానములోనిదగు బుద్ధాపురం అను గ్రామము కలదు. అదియు బుద్ధారెడ్డి పేర కట్టించినదే.

నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను.

కాకతీయుల కాలపు శాసనాలు ఆలంపూరులో కానవచ్చును. కాని అందు పూర్వదేవాలయములకు దానాలు చేసినట్లు కానవచ్చును. నాగుల పాటిలోను కొన్ని నిర్మాణములు కలవు. కాకతీయ శాసనములు కర్నూలు జిల్లాలోని త్రిపురాంతకములో కలవు. అందు 'విమానములు' నిర్మించినటుల తెలిపినారు. విమానములు అనగా ఎత్తయిన గోపురములు. కొండపర్తి మున్నగు ప్రాంతాలలోను నిర్మాణములు కానవస్తున్నవి.

విద్యా వ్యాపకము

కాకతీయుల కాలములో అంతకు పూర్వమందుండినటుల అనేక ప్రాంతాలలో కళాశాలలుండెను. వాటియందు మతబోధ, వేదములు, గీర్వాణభాషలోని కావ్యములు, న్యాయమీమాంసాది శాస్రములు బోధించుతూ యుండిరి. విద్యార్థుల కుచిత భోజన వసతులుండెను. వాడీ స్టేషన్ సమీపమందలి నాగవాపి (ఇప్పుడు నాగాయ్) అనుచోట ఇట్టి విద్యాపీఠ ముండెను. గోళకీమఠములన్నియు విద్యాకేంద్రములే. ఈ విధముగా రాజులు, భక్తులు, ధనికులు విద్యాసంస్థలను పోషిస్తూవుండిరి.

నేటికిని తెనుగు అక్షరాలను "ఓనమాలు" అని దేశమంతటను అందురు. శైవుల ప్రాబల్యమే తెనుగుదేశాని కుండినదనుట కీ ఓనమాలే సాక్ష్యమిస్తున్నవి. "ఓం నమ: శివాయ" అను షడక్షరీ శివమంత్రముతో విద్య ప్రారంభమగుచూ వచ్చినది. ఉత్తర హిందూస్థానములోను, మళయాళములోను "శ్రీ గణేశాయ నమ:" అని అక్షరాభ్యాసము చేతురు. కాని మన తెనుగు దేశమందును, కర్ణాట మందును ఈం నమశ్శివాయయే కాక 'సిద్ధం నమ:' అనియు వ్రాయింతురు. మొదట జైనమత వ్యాప్తియై జైనులే విద్యాబోధకు లగుటచేత వారు "ఓం నమ: సిద్ధేభ్య:" అని అక్షరాభ్యాసము చేయిస్తూ వుండిరేమో ! క్షేమేంద్రుడు తన 'కవికంఠాభరణము' అను గ్రంథములో వర్ణమాలను చమత్కారముగా శ్లోక బద్ధముచేసెను. అందు మొదటి శ్లోక మిట్లున్నది.

       "ఓం స్వస్త్యంకం స్తుమ: సిద్ధమంతర్యాద్యమితీప్సితం
        ఉద్యదూర్జపదం దేవ్యా ఋ ౠ ఌ ౡ ని గూహనం"

తుదిలో ఇట్లనెను.

       "ఏతాం నిమ: సరస్వత్యైయ: క్రియామాతృకాం జపేత్"

పై శ్లోకములో "స్తుమ: సిద్ధం" అను పదాలు గమనింపదగినవి.క్షేమేంద్రుడు కాశ్మీరకవి, కాశ్మీర శైవము తమిళ శైవముతో భిన్నించినట్టిదని తదజ్ఞుల అభిప్రాయము. ప్రాచీనములో దేశమందంతటను "ఓం నమ: శివాయ" యనియు, "ఓం స్వస్త్యంకం స్తుమ: సిద్ధం" అనియో లేక "స్తుమ: సిద్ధం" అనియో విద్యాభ్యాసము చేయుచుండిరేమో,, స్తుమ: సిద్ధం అనునదే "నమ: సిద్ధం" అని తెనుగుదేశములో మారెనేమో అని పై విషయము కూడ సూచింపనైనది.

నేను మొదటి ముద్రణములో ప్రకటించిన పై విషయమును ఒకరు ఒక సభలో నాక్షేపించుచు "సిద్ధం నమ:" అనుట వ్యాకరణశాస్త్ర విరుద్ధమని యుపన్యసించిరి. వ్యాకరణ విరుద్ధమనియు 'నమ: సిద్ధేభ్య:' అని యుండు ననియు నేనే వ్రాసితికదా! "సిద్ధం నమ:" అనునది జైనులనుండి వచ్చియుండు ననియు వ్రాసితి. గాథా సప్తశతిలో 2 వ శతకములోని 91 వ శ్లోక మిట్లున్నది

      "వర్ణావశీమప్యజానంతో లోకాలోకై ర్గౌరవాభ్యధికా:
       సువర్ణ కారతులా ఇవ నిరక్షరా అపిస్కంధైరుద్యంతే."

దీనిపై సాహిత్యాచార్య భట్ట శ్రీ మధురానాథశాస్త్రిగారు (జయపూర్) ఇట్లు వ్యాఖ్యానించిరి. "జనై: ఓం నమ: సిద్ధం సిద్ధిరస్తు" ఇత్యారభ్యాం వర్ణమాలా మప్యజానంతో లోకా: గౌరవాభ్యధికా: పరమాదరణీయా ఇతి కృత్వా నిరక్షరా అపి నిర్విద్యా అపి సువర్ణకారతులా ఇవ స్కంధై రుద్యంతే సాదరం నీయంత ఇత్యర్థ: సాహిత్యాచార్యులు కూడ "ఓం నమ: సిద్ధం" అని జనులు విద్యాభ్యాసారంభమున చేయుదురన్నారు కదా: అట్లనుటకూడ తప్పందురా యేమి ఆక్షేపకులు!! సాహిత్యాచార్యులు ఉత్తర హిదూస్థానమువారు. వారు 'సిద్ధం నమ:' అను దేశాచారమును తెలుపుటచేత అది తెనుగువారిలోనే కాక ఇతర భారతీయ భాషలలో కొన్నింటియందుకూడా ఉండె ననుకొనవలెనో లేక గాథాసప్తశతి దక్షిణదేశ కవిత కాన దాక్షిణాద్యాచారమని వారు భావించి వ్యాఖ్యానించిరో తెలుపజాలము.

మొత్తానికి తప్పో ఒప్పో ఆపాణినీయమో, అపాతంజలీయమో దేశ మంతయు తప్పునే వాడిన అ వాడుకను పాణినీయాది సిద్ధాంతములు కొట్టివేయ జాలవు. భాష మారేకొలది వార్తికములు, భాష్యములు పుట్టవలసి వచ్చెను. అంతేకాని ఒకరి శాసనాలకు భాష కట్టుబడి యుండదు. ఈ లెక్క చొప్పున "సిద్ధం నమ:" అను దానిని సరియైనదిగా నంగీకరింప వలసి యుండును. ఇట్టి కృత్యాద్యవస్థ మన పిల్లల కీనాడును తప్పినదికాదు.

కాకతీయుల కాలమందే తిక్కన సోమయాజి, అతని శిష్యుడగు మారన. కేతన, మంచెన, గోన బుద్ధుడు, పాల్కురికి సోమనాథుడు, భద్ర భూపాలుడు, రావిపాటి తిప్పన్న, నాచన సోముడు, భాస్కరుడు, మల్లికార్జున పండితారాధ్యులు మున్నగు మహాకవు లుండిరి. అదే విధముగ సంస్కృతమందు అగ్రశ్రేణికి చెందిన పండితకవు లుండిరి. అందు విద్యానాథుడు ప్రఖ్యాతుడు (కవి పండితులను గూర్చి వివరించుట కవుల చరిత్రగా మారునని సూచించి వదలి వేయబడినది).

చిత్రలేఖనము

మన పూర్వులకున్న కళాదృష్టి మనలో కానరాదు. చిలుకనో పువ్వునో చెక్కని చెంబు బోడిచెంబే! అంచులేని యుడుపుల ధరించుట అమంగళమని తలంచిరి. ఇండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయిస్తూవుండిరి. ద్వారముల చౌకట్లపై చక్కని జంత్రపుపని యుండెడిది. బట్టలపై అద్దకముతో బొమ్మలను వేయుచుండిరి. ధనికులు పటములను వ్రాయించెడివారు. కాకతీయుల కాలములో చిత్తరువులు జనసామాన్యమందును ఆదరణీయముగా నుండినట్లు కానవచ్చును. ఇండ్లముంగిళ్ళలో మ్రుగ్గులతో చాల చక్కని చిత్రములను పడుచులు తీర్చు చుండెడివారు. ప్రతాపరుద్రుని యుంపుడుగత్తెయగు మాచల్దేవి యింటి నెట్లలంకరించినదో గమనించుడు.

       "చందనంబున కలయంపి చల్లినారు
        మ్రుగ్గు లిడినారు కాశ్మీరమున ముదమున
        వ్రాసినా రిందు రజమున రంగవల్లి
        కంజముల దోరణంబుల గట్టినారు"[49]

ఎందుకనగా, మాచల్దేవి "చిత్రశాలా ప్రవేశంబు చేయుచున్నయది. పుణ్యాహవాచన కాలంబు."= ఏవిధమగు చిత్తరువులు వ్రాయుచుండిరో అవియు తెలియవచ్చినవి. దారుకావనములోని శివుడు, గోపికాకృష్ణులు, అహల్యా సంక్రందనులు, తారా చంద్రులు, మేనకా విశ్వామిత్రులు మొదలైనవి వ్రాయిస్తూ వుండిరి. చిత్తరువులను 'మయ్యెర'తో వ్రాసిరి. (మయ్యెర అను వెంట్రుకలతో చేసిన బ్రష్షు అయి యుండును - మైర్ అన అరవములో వెంట్రుక అని యర్థము). ఓరుగల్లున 'చిత్తరువులు వ్రాసే యిండ్లు 1500' అని ఏకామ్రనాథుడు వ్రాసెను. భోగమువారు తమకు తగిన పటాలను వ్రాయించుకొనిన ఇతరులును వ్రాయించుకొన్న వారు కారు. ప్రజలు తమతమ అభిలాషల కొలది వ్రాయించుకొను చుండిరి. వీర పూజ కోరువారు వీరుల చిత్రాలు వ్రాయించిరి.

      "కోలదాపున ద్రిక్కటి గూడియున్న
       గచ్చుచేసిన చిత్రంపుగద్దె పలక
       వ్రాసినా రది చూడరా వైశ్యరాజ !
       శీల బ్రహ్మాది వీరనాసిర చరిత"[50]

"కర్దమద్రవము" మషీరసము, హరిదళము, ధాతురాగము, మున్నగు వర్ణముల (రంగుల)ను తూలిక (కుంచె)తో చిత్తరువులు వ్రాయుట కుపయోగించెడివారు (కాశీఖండము 1-1-23).

చేతి పనులు

తెనుగుసీమ ప్రాచీనమునుండి సన్నని నూలుబట్టలకు ప్రసిద్ధి. మసూల (మచిలీ బందరు)లో లభ్యమగు సన్నని బట్టనుండి ఇంగ్లీషులో మస్లిన్ పద మేర్పడెను. కాకతీయులకాలములో ఎన్నివిధములగు వస్త్రాలు సిద్ధమవుతుండెనో పాల్కురికి సోమనాథుని వివరణను చూచిన ఆశ్చర్యము కలుగును.

       "వెంజావళియు, జయరంజియు, మంచు
        పుంజంబు, మణిపట్టు, భూతిలకంబు,
        శ్రీవన్నియయు, మహాచీని, చీనియును
        భావజతిలకంబు, పచ్చని పట్టు,
        రాయశేఖరమును, రాయవల్లభము,
        వాయుమేఘము, గజవాళంబు, గండ
        పడము, గాపులు, సరిపట్టును, హంస
        పడియు, వీణావళి, సల్లడదట్టి,
        వారణాసియు, జీకువాయు, కెందొగరు,
        గౌరిగనయమును, క్షీరోదకంబు,
        పట్టును, రత్నంబుపట్టును, సంకు
        పట్టును, మరకతపట్టు, పొంబట్టు,

       నెరపట్టు, వెలిపట్టు, నేత్రంబుపట్టు,
       మరి తవరాజంబు, మాందోళరవియు,"[51]

ఇంకా 20 విధాల బట్టలపేర్లను తెలిపినాడు. దేవుని యెదుట త్రిపురాంతకములో పంచలోహస్తంభమును పాతియుండిరి. అది "ఇనుము, పిత్తళి, కంచు, హేమ, తామ్రముల, పంచలోహముల"తో సిద్ధము చేయబడినట్టిది. బ్రహ్మనాయడు దాని నర్చించెను. [52] లక్కబొమ్మలను చేయుట విరివియై యుండెను. 'పూచిన కింశుకం బనగ పుత్తడిలత్తుక బొమ్మవలె' అని నాచన సోముడు వర్ణించెను. [53] 'చేతి జంత్రంపు బొమ్మలనిన బొమ్మలాటయై యుండును.[54] ఓరుగంటి మైలసంతలో 'సుసరభేత్‌' అను 'సరభేదనము' చేయు మందును అమ్మిరి.[55] దానిని 'పెద్ద దంతంబు పెట్టె'లో పెట్టి యమ్మిరి. దంతపుపనులు చాలా హెచ్చుగా నుండుటచే; మాలమాదిగలుకూడ వాటిని వాడుకొనుచుండిరి. సైన్యమునకు కావలసిన వివిధాయుధములను, యుద్ధభేరీలను ఆటపాటల కవసరమగు వాద్య విశేషములు, స్త్రీల అలంకరణమునకు కావలసిన యాభరణములు, రంగులు మున్నగునవి చేయువారు, వాటిచే జీవించువారు చాలమంది యుండిరి. ధనికులు పల్లకీలలో పోవుచుండిరి. వాటిని చేయు వడ్రంగులు నానావిధములగు సుందర శిల్పములతో కట్టెలపై పనితనము చూపించెడివారు.

మట్టెవాడ అను పేరు అచ్చట మట్టెలుచేసి యమ్ముటచేత ఏర్పడిన దందురు. ఓరుగంటిలో మంచి మంచి యున్ని కంబళములు సిద్ధమగు చుండెను.[56] ఓరుగంటిని లాగుకొనిన తురకలు రత్నకంబళముల వృత్తినిగూడ లాగుకొనిరి. తర్వాత వారు "తివాసీల"ను చేయు కళను వృద్ధి చేసుకొనిరి. నేటికిని వాటిని ఓరుగల్లు కోటలోని తురకలే సిద్ధముచేస్తున్నారు. మహారాణి రుద్రమదేవి కాలములో ప్రపంచ సంచారియగు మార్కోపోలో అను జినీవావాడు వరంగల్ రాజ్యవిశేషములను గూర్చి యిట్లు వ్రాసెను. "కాకతీయుల రాజ్యములో శ్రేష్ఠమై సన్ననైనట్టి వస్త్రములు నేయుదురు. వాని క్రయము చాలా ప్రియము. నిజముగా ఆ బట్టలు సాలెపురుగు జాలవలె నుండును. వాటిని ధరింపనొల్లని రాజుకాని, రాణికాని ప్రపంచమందుండరు."

నిర్మల కత్తులు అని ప్రసిద్ధికల కత్తులుండెను. నిర్మలకు సమీపమందుండు కూన సముద్రములో వాటిని సిద్ధము చేయుచుండిరి. నిర్మల నుండి కత్తులను ఇనుమును డెమస్కస్ (దిమిష్కు) పట్టణాని కంపుచుండిరి.

ప్రజలకు సౌకర్యములు

ఓరుగంటి రాజులు తమ ప్రజలను చక్కగా విచారించుకొన్నవారు. వారు ప్రజలను పీడించిన ట్లెందును సూచనలు లేవు. వీరశైవ బోధకుల వలన ఇతర సాంప్రాదాయకుల కేమైన నష్టకష్టములు కలిగియుండును. ఓరుగంటి రాజుల ప్రజలకు ఆరోగ్యశాలలను, ప్రసూతి గృహములను, సంస్కృతమును వేదవేదాంగములను బోధించుటకై కళాశాలలను స్థాపించిరి. శా॥

శ॥
1183లో రుద్రమదేవి వెలగపూడి అను గ్రామమును ప్రజాహితమునకై దానము చేసెను. అందు ఒక మఠమును, ఒక సత్రమును కట్టించెను. సత్రమందు వంటకై ఆర్గురు బ్రాహ్మణపాచకులేర్పాటయిరి. జనుల ఆరోగ్య విచారణకు చికిత్సలకు ఒక కాయస్థ వైద్యు నేర్పాటుచేసిరి. గ్రామరక్షణకై 10 మంది 'వీర భద్రులు' (గ్రామ భద్రతకు బాధ్యులగు వీరభటులు) ఉండిరి. 21 మంది భటులు (తలార్లు) ఉండిరి. వీరిని వీరముష్టివారని పిలుచుచుండిరి. (ఈనాడు వీరముష్టి యను నొక హీనకులము వారు కేవలము కోమట్లను యాచించి జీవింతురు. కాని ఆనాడు శబ్దార్థమును బట్టి చూడ గ్రామసేవ చేయుచు గ్రామజనుల ముష్టిదానమునకు అర్హత కలిగినవారు వీరముష్టి వారని యూహింపవచ్చును.) గ్రామములో హింసోద్భవ దుష్కార్యములను (ఫౌజ్దారీ-క్రిమినల్) చేయు వారిని అధికారుల యాజ్ఞాప్రకారము కొరడాలతో కొట్టుట లేక నానావిధములగు హింసలు పెట్టుట లేక కాలో చెయో నరకుట లేక తలనే నరకుట, యను విధులను నెరవేర్చుచుండిరి.[57] ప్రభువులే గాక వారి యధికారు లును, వారి సామంతులును, ధనిక వ్యాపారులును అనేక తటాకములను నిర్మించి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిరి. గణపతి సేనాని యగు రుద్రుడు పాఖాల చెరువు కట్టించెను. కాటసముద్రను కాట చమూపతియు, చౌడ సముద్రమును చౌడచమూపతియును, సబ్బిసముద్రమును గౌర సముద్రమును కోమటి చెఱువు అను వాటిని నామిరెడ్డియు, ఎఱుక సముద్రమును ఎఱ్ఱక్క సానమ్మయు కట్టించిరి. ఇవికాక చింతల సముద్రము, నామా సముద్రము, విశ్వనాథ సముద్రమును కట్టించిరి. [58] ఈ చెరువుల క్రింద చెరకు తోటలు, ఆకు తోటలు పండించిరి.[59]

జగత్కేసరి సముద్ర మను మరొక తటాక మీ కాలమందే నిర్మింప బడెను. అంబదేవుడు అను కాయస్థుడు భూమినికొలిపించి పన్నుల నేర్పాటును చేయించెను. భూమిని కొలుచుటకు "పెనుంబాక మాన దండము" అనునది సుప్రసిద్ధమై యుండెను.[60]

కాకతి ప్రభువులు బంగారు వెండి నాణెములను ప్రచారము చేసిరి. ఆ నాణెముల విలువ యిప్పటి నాణెములతో ఎంతో సరిగా జెప్పజాలము. ఏకమ్రనాథుడు సువర్ణ నిష్కములను మాట పలుమారు వ్రాసెను. ప్రోలరాజు కాలములో తూకము లిట్లుండెను.

120 గురిగింజలు= 1 తులము;
120 తులములు= 1 వీసె;
120 వీసెలు= 1 బారువా,

వరహాలు కూడా అప్పుడే యేర్పడెను. వరాహలాంచనమును బట్టి వరహా యేర్పడెను. ఒక కర్ణాట వేశ్య తన రేటు 'శాటిహాటక నిష్కము' అని చెప్పెను.[61] (శాటి అనగా 'సాడీ'=చీర.) మరొక జారిణి రెండు సొన్నాటంకములు కోరెను. వరహాల సూచన నాగులపాటి శాసనమందు కలదు. భూములను కుదువబెట్టుటలో రూకలతో వ్యవహారము జరుగుచుండెను.

        "అహి పెట్టితి జొన్న గడ్దాగ్రహార వృత్తి
         ఏనూరు నూకల వృత్తమునకును."[62]

ఓరుగంటిలోని ఖాన్‌సాబ్ తోటలోని శాసనములో చిన్నముసు రెండు మూడు మారులు పేర్కొనినారు. అన్నిటికన్న చిన్న నాణెము బహుశా 'తార' మేమో. "తార మొసంగరే ధర్మాత్ములారా" అని యొక పిచ్చుకుంట బిచ్చగాడు ప్రార్థించెను.[63] మాడలు అనునవి సాధారణ వ్యవహారమున నుండు నాణెములు.

'మా కులంబున ఓలిమాడలు కలవు'

అని బాలచంద్రు డనెను. వెలమలతో ఆనాడు ఓలి యుండుట గమనింప దగినది.

తురకల పరిశ్రమ యగు 'మఖుమల్‌' బట్టలు దేశములో వ్యాప్తిలో నుండెను.[64]

ధాన్యం కొలతలలో ఇరుస, కుంచము, తూము అనునవి యుండెను.

(చూడు, బసవపురాణము, పుటలు 149, 152.)

వ్యాపారము

కాకతీయ కాలమందు వ్యాపారము చాలా అభివృద్ధి నొందెను. తూర్పు దీవులనుండి పశ్చిమ ప్రాంతాలనుండి సరకులు రాజ్యములోనికి వస్తుండెను. రేవులవద్ద సుంకములు తీసుకొనుచుండిరి. ఆ సుంకములు ప్రజలకు తెలియునట్లుగా శాసనములపై చెక్కించి యుంచిరి.

ఓరుగంటి కోటకు బయటిభాగమున మైలసంత సాగుచుండెను. అచ్చట సుంకములు నిర్ణయము చేసి శాసనముండెను. ఇప్పటికిని నందే కలదు. ఆ స్థలము నిప్పుడు ఖాన్‌సాహెబ్ తోట యందురు. ఆ శాసనమునుబట్టి యచ్చట ఆకులు, కూరగాయలు, టెంకాయలు, మాదీఫలములు, మామిడిపండ్లు, చింతపండు, నువ్వులు, గొధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు, నూనె, నెయ్యి, ఉప్పు, బెల్లము, ఆవాలు, మిరియాలు, తగరము, సీసము, రాగి, చందనము, కస్తూరి, మంజిష్ఠ, దంతము, పట్టు, పసుపు, ఉల్లి, అల్లము అమ్ముచుండిరి.

ఒకతె "ఓరుగంటి పురంబులో ఓరగ్రంత బెద్దయెలుంగున నమ్మె సంపెంగనూనె"[65] ఆ కాలములో మోటుపల్లియు, మచిలీపట్నమున్ను ప్రసిద్ధమగు ఓడరేవులు. అచ్చటికి పర్షియా, అరేబియా, చీనాదేశముల సరకులు వచ్చి దిగుచుండును. మోటుపల్లిరేవు తీరములోకూడా సుంకములు తెలుపు శాసనమును స్థాపించిరి. దానినిబట్టి ఆంధ్ర దేశములోనికి కర్పూర, చందనాది సుగంధవస్తువులును, దంతములు, ముత్తెములు, పట్టుబట్టలు విశేషముగా దిగుమతి యగుచుండెనని తెలియును. ఆ శాసనము గణపతి దేవునిచే వేయించబడెను.

గ్రామాలలోకూడా సుంకములను తీసుకొనుచుండిరి. పుల్లరి, అంగటి ముద్ర సుంకము మున్నగునవి తీసుకొనిరి.

ప్రజల వినోదము

నన్నయకు పూర్వమం దుండిన జనుల భాషలోను, కవితారీతులలోను, నన్నయ మార్పుచేసి తెనుగును విశేషముగా సంస్కృతమునకు లంకెపెట్టెను. ఆతనికి పూర్వము మధ్యాక్కరలు, ద్విపద, త్రిపద, షట్పద, రగడ వంటివి రచించి, జనులు గానము చేసినట్లున్నది. నన్నయ తర్వాత 200 ఏండ్లకే ద్విపదకు గౌరవము తగ్గినట్లయ్యెను. అందుచేత పాల్కురికి సోమనాథుడు ద్విపద ప్రాశస్త్యమును గూర్చి ప్రత్యేకముగా వాదించెను.

        ఉరుతర పద్య గద్యోక్తుల కంటె
        సరసమై పరగిన జానుదెనుంగు
        చర్చింపగా సర్వసామాన్య మగుట
        కూర్చెద ద్విపదలు కోర్కి దైవార.[66]

మరియు ఆతని కాలములోను అంతకు పూర్వ మందును తుమ్మెద పదములు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేశు పదాలు, వెన్నెల పదాలు మున్నగున వుండెను.[67] ఈ పదా లన్నియు క్రమమగా నశించుటచేత జనసామాన్యములో విద్యా ప్రచారమున కవకాశములు తక్కువయ్యెను. జనులలో పాటలకే ప్రాముఖ్య ముండెను. వారు బహువిధములగు పాటలు పాడు కొనుచుండిరి.

         "మేటియై చను భక్తకూటువలందు
          పాటలుగా గట్టి పాడెడువారు
          ప్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల
          విస్తారముగ జేసి వినుతించువారు
          అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ
          పటునాటకంబుల నటియించువారు
          మునుమాడి వీరు వారననేల కూడి
          కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు"[68]

భక్తకూటువలు (భజన మండలుల వంటివి) ఉండుట, అందు పాటలు కట్టి పాడుకొనుట, రోకటి పాటలు పాడుటయు, అవి నేటికిని పామరజనులలో నిలిచి యుండుటయు గమనింపదగినవి.

         "...రోకటిపాట లట్ల వేదములు
          వనుగొన మా శివభక్తుల యిండ్ల"[69]

అని కవి రోకటిపాటల ప్రాధాన్యము నొత్తి చూపినాడు.

నాచన సోముడు జాజరపాటను గూర్చి ఇటుల ప్రస్తావించెను.

         " వీణాగానము వెన్నెలతేట
           రాణ మీరగా రమణుల పాట
           ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట
           జాణలు మెత్తురు జాజఱపాట"

ఇది అతని వసంత విలాసములోని దని పూర్వు లుదహరించిరేకాని అ గ్రంథము మనకు లభింపలేదు. అందు పైన తెలిపిన జాజఱపాట అంటే యేమో? పూర్వులకు క్రీ.శ. 1650 వరకు వాటి స్వరూపము తెలిసియుండెనేమో! బహుశాశ్వ చరిత్రములో దామెర్ల వెంగళ భూపాలుడు జాజఱపాట పేరుమాత్రము వ్రాసెనుకాని దానివలన మన కేమియును తెలియరాదు. బ్రాహ్మణవీటనే జాజఱపాటను మెత్తు రన్నందున అది బ్రాహ్మణులలో ఎక్కువ వ్యాప్తిలో నుండెనో ఏమో?

ఈ సందర్బములోనే జాజఱను గురించిన రెండు విషయములు తెలుపుట బాగుండును. శ్రీనాథుడు జాజఱనే "జాదర" అని యతిస్థానమందుంచి వాడెను.

       "జాదర జాద రంచు మృదుచర్చరి గీతలు వారుణీ రసా
        స్వదమదాతిరేకముల చంద్రిక కాయగ దక్షవాటికా
        వేదుల మీదటన్ కనకవీణలు మీటుచు పాడి రచ్చరల్
        మోద మెలర్పగా భువన మోహన విగ్రహు భీమనాథునిన్."[70]

నాచన సోముడు బ్రాహ్మణవీట జాజఱపాట రాణించెననగా శ్రీనాథుడు భోగమువారు వీణెల మీటుచు జాదర జాదర అను పల్లవితో మృదువుగా పాడిరని వర్ణించెను. వెన్నెల రాత్రులలో ఇది మరీ ఆహ్లాదకరమై యుండెడిదేమో ?

జాజరీ, జాజరీ అను పల్లవితో తెలంగాణ మందు నేటికిని సేద్యము చేయునప్పుడు కూలీలు కొన్ని తావులందు పాడుచున్నట్లు తెలియ వచ్చినది. వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని దని ఒకరు నా కీపాటను తెలిపిరి.

        "జాజీరి జాజీరి జాజీరి పాపా
         జాజూలాడవె గాజూల పాపా
         తూర్పునుండి వచ్చెరా తుప్పతలనక్కా
         పడమటినుండి వచ్చెరా పర్వతాలనక్కా
         ఆనక్క యీనక్క తోడెరా బొక్కా
         ... ... ... ...

       జోగయ్య నాకు కొన్ని జొన్నగింజ లిచ్చె
       ఏటియొడ్డున సేద్యంబు చేస్తే
       ఈడ్చికొడితే ఇరవై పుట్లు
       అర్చికొడితే అరవై పుట్లు
       అన్నీ కొంచబోయె అప్పయ్యదొరా
       ఇసుకో ఉసుకో ఇద్దుమె వుంచే
       తాలో తౌడో తవ్వడె వుంచే
       మన్నో మైలో మానెడె వుంచే
       ఉప్పులేని గంజి తాగీతిమయ్యా
       చొప్పకట్టలోలె సోలీతిమయ్యా
       కుక్కిమంచములో కూలీతిమయ్యా
       జాజీరి జాజీరి జాజీరీ పాపా

ఎక్కడనుండో సాహుకార్లు వచ్చి అప్పు లిచ్చి రైతుల కొంపలు తీయుట, నాగులకు, అప్పులకు, వడ్డీలకు ఇచ్చి పంట పండినవెంటనే కల్లములోనే ధాన్యాన్ని దొరలు లాగుకొనిపోవుట, బీదరైతులు వారి కూలీలు, ఆకలితో కూలబడుట, ఇట్టి యవస్థలన్నియు తెలంగాణమందు నిత్యజీవనము లోనివి. వాటినే జాజిరి పల్లవిలో సరరహితులగు రైతులు పాడుకొని తృప్తిపడినారు.

"కలమాట లాడుచు, మొలపుండ్ల మల్లని, బాడుచు"[71]

అని కేతన వర్ణించుటనుబట్టిచూడగా ఆనా డది జనసామాన్యములో పాడుకొను పాట యేమో?

బొమ్మలాట మన యాదివాఙ్మయమందు కానవచ్చుటచేత అది ప్రాచీన మైనదేకాని ఆధునిక కాలములో ఆ యాట మరాటీవారి వశమైనది. "ప్రతిమల వాడగ బట్టినయట్లు" అని పల్నాటి వీరచరిత్రలో వర్ణించినారు.

         "యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు
          బొమ్మలగతి రథపూగములును"[72]

అని నాచన సోమన ఉపమించినాడు.

మన వాఙ్మయములో పాలకురికి సోమనాథుని కాలమునుండి తంజావూరి రఘునాథ రాయలవారకు బహుకవులు బొమ్మలాటను పేర్కొనిరి. బొమ్మలాట యనగా తోలుబొమ్మలాట. భారతీయులలో ఏ యే ప్రదేశాలలో నిది కలదో తెలియదుకాని తెనుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా ప్రాచీనమునుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక దబ్బతో అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడుదురందురు. బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకమును గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును. అట్లగుచో తోలుబొమ్మలను చూచి నాటకాలవారు సూత్రధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక నాటకాలను జూచి బొమ్మలాటగాండ్రు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంశమగును.

తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు. ఆనాడు జనులెక్కి గిర్రున తిరిగిన రంకురాట్నం నేటికిని ఆదరణీయమై యున్నది.

        "చటిల సంస్కృతి జీవఘట చక్రవర్మ
         పటు పరివర్తన భ్రమణంబు గూర్చి
         కీలువొందించి యాక్రియ రాటనముల
         వాలి యాడించు నా వడ్రంగి యతడు"[73]

శైవ సాంప్రదాయములో నందికోల ఆట యుండెను. అది నేడును కార్తీక మాసమందు జరుగును.

        "కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు
         గేళిక జోకయు లీల నటింప"[74]

అనుటచే కోలాటము, గొండ్లి (గర్భనృత్యము), పేరిణి కుంభముపై నృత్యము మున్నగునవి యుండెనని తెలియును. ఇవే విషయములను నాచన సోమనయు తెలిపినాడు. పేరణము, కోలాటము, గొండ్లి, ప్రేంబణము అను వానిని అతడు పేర్కొనినాడు.[75] గోండు అను అటవికుల కుండలాకార నృత్యమును చాళుక్య సోమేశ్వరుడు (అభిలషితార్థ చింతామణి కర్త) 1150 ప్రాంతమందు తన రాజ్యమందు ప్రచారము చేయగా అది జన సామాన్యమందు విరివిగా వ్యాపించెను. రెండు ఆటలు ప్రత్యేకముగా తెనుగు ఆటలై పోయెను. ఒకటి ఉప్పనపట్టెలాట, రెండవది గిల్లదండ ఆట. "ఉప్పన పట్టె లాడునెడ మప్పులు డెత్తురుగాక యాదవుల్"[76] నేటికిని ఈ యాట నాడుదురు. ఉప్పు సముద్ర తీరమునుండి లోభాగాల కందువరకు దొంగలనుండి, పరరాజ్యముల సుంకాలనుండి, దౌర్జన్యపరుల నుండి తప్పించుకొని వచ్చుటలో నుండు కష్టాలను ఆటగా చేసుకొని యాడిరేమో! గిల్లదండను బిల్లంగోని, దండుగులి, చిర్రాగోనే, చిల్లగొడె అని యెన్నెన్నో పేరులతో వ్యవహరింతురు. ఇది మన క్రికెటు ఆట అనవచ్చును. ఒక జేనెడుకట్టె చిల్లను మూరెడు పొడవుండుకట్టెతో కొట్టుదురు. ఆ యాటలో పెద్దకట్టెతో కొలుతురు. ఆ కొలతకు ఒకటి రెంచు అనక కన్ను, రెండార్చి, మూలముంజి, గెరగేర, అని ఏడువరకు చెప్పుదురు. ఏడువరకు మారుపదములను ఈ యాటలోనే యేల సృష్టించిరో! బుద్ధ ఘోషకవి ఇంచుమించు 1400 ఏండ్లనాడు అతడు తన కావ్యాలలో నొకచోట "ఘటికా ఖేలనం" అని వర్ణించినాడు. ఘటిక అనగా చిన్న కర్రపుల్లను పెద్దకర్రతో కొట్టుట అని యతడు వివరించినాడు. దీనినిబట్టి మరికొన్ని ప్రాంతాలలో నీయాట యుండినట్లున్నది. మహాభారతములో కౌరవ బాలురు చిన్నగిల్లను కట్టెతో కొట్టి యాడిరి. "చిరుతలు తీరైన గొడెలు" వీటితో బాలచంద్రు డాడెను. చిరుత అన చిల్లగొడె (గోడె) అన చిల్లను కొట్టుకట్టె. పాండవ కౌరవ బాలు రాడిన గిల్లదండ యాటను భారతమం దిట్లు వర్ణించినారు.

"ద్రోణుండు హస్తినాపురంబునకు వచ్చె నప్పు డప్పురబహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందరు కందుక క్రీడాపరులై వేడుకతో నాడుచున్నంత నక్కాంచన కందుకం బొక్క నూతంబడియె" అని తెనుగు భారతములో (ఆది. 5-206) కలదు. అందు కందుకము అనుట పొరపాటునకు తావిచ్చినది. సంస్కృత మూలమం దిట్లున్నది.

        "క్రీడలతో వ్గీటయా తత్ర వీరా: షర్యచరన్ ముదా
         పపాత కూపే సా వీటా తేషాం వై క్రీడతాంతదా"

ఇచ్చట వీటశబ్దముపై మూలమం దిట్లు వివరించినారు: "వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్ హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా: ప్రాక్షిపంతి" జేనెడు కట్టెగిల్లను మూరెడు కట్టెతో కొట్టి ఆడెడు ఆటకు వీటా ఖేలన మనిరి.

మహారాష్ట్ర సాహిత్యచరిత్రలో ఇట్లు వ్రాసినారు. పూర్వము మహారాష్ట్రులలో బిల్లగోడెఆట లేకుండెను. ఆ యాట నిప్పుడు మరాటిలో "విటి దండు" (విటి-వీట, దండు-దండ), అందురు. ఈ యాటలో ఏడువరకు దండముతో కొలుచుట కలదు. ఆ యేడు సంఖ్యలను మరాటీ బాలురు ఒకటి రెండు, మూడు అని (తెనుగుమాటలలో) కొలుతురు. క్రీ.శ. 1750 ప్రాంతమందు మహారాష్ట్రములో 12 ఏండ్ల కరువురాగా లక్షల జనులు తెనుగు, కన్నడ, తమిళ ప్రాంతాలకు వలసవెళ్ళి కరువు తీరినతర్వాత తమదేశానికి తిరిగి వెళ్ళిరి. అట్టి వలసలో తెనుగు దేశమునకు పోయినవారు తెనుగువారి ఆటలను, బాలబాలిక పాటలను నేర్చుకొని వెళ్ళిరి. నేటికిని చిల్లగోడె ఆటయు అందలి తెనుగు పదాలును, పిల్లల పాటలలో తెనుగు పాటలును ప్రచారమందున్నవి." (ఈ విషయమును నాగపూరు వారగు ప్రొఫెసర్ గర్దెగారు నాకు మరాటీ సాహిత్య చరిత్ర వినిపించి తెలిపిరి).

పాచికల ఆట

పాచికలఆటను మొట్టమొదట వర్ణించిన తెనుగుకవి నాచనసోమనాథుడు. అతడు తన ఉత్తరహరివంశములో రుక్మిణీకృష్ణు లిద్దరును ఆడినట్లు వర్ణించిన పద్యము లీక్రింద నుదాహృతములు. "చతురంతాసనంబుననుండి సకలలోక నాథుండు సత్యభామకు సాక్షిపదం బొసంగి (Umpire)

రుక్మిణి సమ్ముఖంబుగా సమాసీనుండైన నద్దేవియు,

     సీ. జోగిణి గొసరి బైసుక వెట్టి పలకపై
             సారెలు పోయించి సరము చూచి
        తనకు లాగయిన నెత్తంబుగైకొని పన్ని
             పాసికల్ దాళించి పాటెరింగి
        లోహటంబులుమాని లులిగన్న బడకున్న
             పరదాళమని పోవు పలకలిచ్చి
        తప్పార్తు జూరెండు రాయంబులును గని
             వారింపకము పోటువ్రాలు గలవు
        పంతమడిగిన నీవలె భాగమింత
             బోర పెద్ద దాయంబాడి పోరుపుచ్చి
        వైచునది ధనమునకు పోవచ్చు ననుచు
             బేరుకొని పాటు తరిసరిజేసి యడిగి

      క. అత్తీవంచ తిగదుగయు
         సత్తాదచ్చౌక వంచి చౌవంచీరై
         దిత్తిగ యిద్దుగ బద్రలు
         చిత్తంబున దలచినట్లు బేతికి దెచ్చున్.

(ఉత్తరహరివంశము. అ. 3 వ. 120-121, ఈ సందర్బములో 109 నుండి 129 వరకు ఈ పాచికల ఆటను వర్ణించినది చదువుట అవసరము. ఈ పద్యాలలో పెక్కుపదాలు అర్థముకాని వై పోయినవి.)

ఈ యాట మన తెనుగు వారిలో విశిష్టతతో నిలిచిన దనవచ్చును. నేటికిని ఈ యాటను రెండు పాచికలతో వైదిక బ్రాహ్మణ స్త్రీ పురుషులు పలువురాడుచున్నారు. తక్కిన వర్ణములవారు పాచికలకు మారుగా 6 కాని 7 కాని గవ్వలను లొడివేయుచు ఆడుదురు. ఆయాటను పచ్చీస్ అందురు. అనగా మన "నెత్తపు" ఆటను ముసల్మానులు స్వీకరించిరనియు, మరల వారి నుండి వారి మాటలతో మనవారు దానిని స్వీకరించి రనియు గ్రహింపవలెను. దస్, బారా, పచ్చీస్, తీస్ అను పదాలను తెనుగువారును వాడుచున్నారు. మొద లీ పద్యాలలోని వర్ణనమును తెలుసుకొందము. ఆట ప్రారంభించు వారు "జోగిణి" దేవతకు మ్రొక్కుకొందురు. ఒక కట్టెపలకపై కోపుబలముతో ఇండ్లను గీయుదురు. ఆటగాండ్లు "స్వరము" (సూర్యచంద్రనాడులను నాసికాశ్వాసముల శాస్త్రమును) చూచుకొని ప్రారంభమందే ఎంతెంత పందెము అని నిర్ణయించుకొందురు. ఈ విధముగా రుక్మిణీకృష్ణులు నెత్తము నారంభించిరట.

ఈ యాటకు గల సంకేతములు గమనింపదగినవి. దుగ, తుగ, సత్తా, బద్రలు మున్నగు పేరులు పెట్టుకొనిరి. బద్ర అను పదమువద్ద శబ్దరత్నాకరమం దీ వివరణ నిచ్చినారు. బద్ర అన పన్నెండు. 'సొగటాలాటయందు పాచికలు రెండు. ఆ పాచిక లొక్కక్కటికి నాలుగు ప్రక్కలు, ఒక్కొక్క ప్రక్కకు అరు నారును, నాల్గు నాల్గును, మూడు మూడును, ఒకటొకటి యనగా జతలు ఎనిమిదింటికి బొట్లు ఇరువది యెనిమిదియై యుండును. ఆ పాచికలు రెంటిని తూనించి వేయునప్పుడు వాని పొర్లిక భేదముచేత 12, 10, 9, 8, 7, 6, 5, 4, 2 గా పందెములు తొమ్మిది పడును. కాన ఆ పందెములు తొమ్మిదియు 'అత్తీవంచిత్తిగ' అను పద్యములో చెప్పబడియున్నవి. "అత్తీవంచ" పద్యములోని పదాల కర్థమిట్లు చెప్పవలెను. అత్తీవంచ-ఆతీవంచ, తీవంచ-నాలుగు, తిగ-మూడు, దుగ-రెండు, సత్తా-ఏడు, తచ్చౌక-ఎనిమిది, వంచి-ఒకటి (తచ్చౌకవంచి-ఎనిమిది న్నొకటి-తొమ్మిది అని యర్థమేమో) చౌవంచ-అయిదు, ఈరైదు-పది, ఇత్తిగ-ఆరు, ఇద్దుగ-నాలుగు, బద్రలు-పన్నెండు.

ఇక ఈ యాట నిప్పు డెట్లాడుచున్నారో తెలుసుకొందము.

ఆట యాడువా రిద్దరుకాని నలుగురుకాని యుండవచ్చును. పందెము వేయు పాచికలను సారెలు అందురు. అవి దంతమువి కాని, కట్టెవి కాని, లోహములవి కాని యైయుండును. నాలుగు మూలలు కల రెండు సమానమగు పాచికలుండును. ఒక్కొక్కసారెకు నాలుగు ముఖాలపై ఈ క్రింది విధముగా చుక్కలుండును.

పై పేజీలో కనబరచిన పరిణామములో పాచికలుండును. ఒక్కొక్క పాచికయొక్క నాలుగు భాగాలలో 1, 3, 6, 4, ఈ వరుసగా చుక్కలుండును. ఇట్టి రెండు పాచికలను అరచేతిమీదుగా లొడిపి నేలపై వేయుదురు. పైకి పడిన భాగాల చుక్కల లెక్కించి వాటి సంఖ్యను బట్టి కాయలను ఇండ్లలో నడుపుదురు. పచ్చీసు అయిదు గవ్వలు వెలికిలబడిన పచ్చీసనియు, 6 పడిన

తీస్ అనియు, అందురు, అనగా 25, 30 ఇండ్లు కాయలను జరుపుదురు. కాని పాచికల ఆటలో ఎన్ని చుక్కలుపడిన అన్ని యిండ్లే జరుపుదురు. కాయలను జంటగా నడుపవచ్చును. అప్పుడు ప్రతిపక్షి జంటకాయలే వచ్చి వాటిని చంపును. తక్కిన దంతయు ఇంచుమించు పచ్చీసువలె యుండును. పాచికల ఆట యిండ్లు ఇట్లుండును.

ప్రతివారును (8) కాయలు పెట్టుకొని యాడుదురు. తన యింటిని ముందునుండి చావకుండా చుట్టు తిరిగి తన యెదుట మధ్యయింటినుండి మధ్యకు కాయలను నడపుట పండు అగుట యందురు. ఒక్కొకరి కాయల కొకరంగు గుర్తు పట్టుటకై వేసియుందురు.

అయితే యొక్క విశేషమును గమనింపవలెను. నాచన సోమన పర్ణించిన ఆట తెనుగువారి యాటయై యుండును. కర్ణాటకు లది కూడా అదే యాటయై యుండును. ఇప్పటికిని మనవా రాడు ఈయాట ఇంచుమించు సోమన వర్ణించినట్టిదై యున్నది. తమిళులలో దీనిని పోలినయాట యొకటి గలదు. దానిని "కరలు" అందురు. అందు మూడు ఇత్తడి సారెలుండును. ఒకదానిపై కాకతీయుల యగము

ఒకచుక్క, ఒదానిపై రెండు, మూడవదానిపై మూడుచుక్కలుండును. ఇద్దరాడుదురు. తలా 6 కాయలుండును.

ఒకరు కుడినిండి ఇంకొకరు ఎడమనుండి కాయలు వడుపుదురు. మహాభారత యుద్ధకాలమునను. వేదకాలమునను ఆడిన పాచికలయాట దీనికి భిన్నించినట్టిది. వేదమందును, పురాణములుందును. ఈయాటను అక్షఖేలనమనిరి. పాచికలపై చుక్కలు కన్నులవలె నుండుటచే ఆక్షలని వాటికి పేరువచ్చెను. విభీతకము (తాండ్ర) చెట్టుయొక్క కట్టెతో పాచికలు చేసేడివారు. వేదములో కవష బలూష అను శూదర్షి తన కలమందలి జనులలో ఎక్కువగా వ్యాపించిన యీదుర్వ్యసనముము ఖండించినాడు. (చూడుడు ౠగ్వేదము, మం. 10 నూ 34 ). పూర్వకాలపు సారెలపై నాలుగు దిక్కులలో ఒక దిక్కు ఒక్క చుక్క, రెండవదిక్కు రెండు, మూడవదిక్కు మూడు, నాల్గవదిక్కు నాల్గు చుక్కలుండెడివి. ఒక్క చిక్కకలి, రెంటికి ద్వాపర, మూటికి త్రేత, నాల్గింటికి కృత అను యుగనామ సంకేతము లుంచిరి. ప్రాచీనము నిండి నేటివరకు జనుల వినోదఖేలనములలో సంఖ్యలకు మారు పేరులు పెట్టుట

గమనింపదగినది, పాచికలు వేయువాడు పాచికలు లొడిపి నేలపై వేసినప్పుడు కృత (నాలుగు చుక్కల భాగము) పైకిపడిన వాడు తక్కిన మూడిండ్లపై పెట్టిన పందెములను పూర్తిగా తీసుకొనెడివాడు. ఛాందోగ్యోపనిషత్తులో నిట్లు వ్రాసినారు.

       యథాకృతాయ విజితాధరే యా:
       సం యంత్యేవమేనం సర్వం తదభిసమేతి
       యత్కించ ప్రజా: సాధు కుర్వంతి
       యస్తద్వేదయత్ సవేద పమయై తదుక్త ఇతి.

---ఛాందో. 4, 1, 4.

పాచికలాడువానికి కృత అను దిక్కుపడిన తక్కినభాగముల పందె లన్నియు వాడే గెలిచినట్లుగా, ప్రజలు తాము సేయు సాధుకార్యములవల్ల మంచి ఫలము లన్నింటిని అనుభవింతురు అని పై మంత్రభావము. ఇట్టి యుదాహరణమునే అదే యుపనిషత్తున మరొకమారు (4, 3, 8, లో) చేసినారు.

మహాభారత కథయంతయు ఈ యక్షఖేలనముపై నడచినది. పాండవ కౌరవు లీ కలికృతాదినామములుకల అక్షములతోనే యాడిరని భారతమువలన తెలియగలదు. విరాటపర్వమున ఉత్తర గోగ్రహణమున అర్జును స్తుతించిన ద్రోణుని దూషింపగా అశ్వత్థామ ఇట్లనెను.

       కుటిల బుద్ధు లిచట గొనవునెట్టన ఘన
       పోర్బలంబు మెరసితొడర వలయు
       నతడు గాండీవమున నడ్డసాళులు వైవ
       డరుల సంపవాన గురియుగాని.

తెనుగులో స్పష్టముగా లేదుగాని సంస్కృత మూలమున నిట్లు వ్రాసినారు.

       "నాక్షాన్ క్షిపతి గాండీవం సకృతం ద్వాపరం నచ
        జ్వలతో నిశితాన్ బాణాం స్తీక్ష్ణాన్ క్షిపతి గాండివం"

అర్జునుడు గాండీవముతో కృతము. ద్వాపరము అని చుక్కల లెక్క పెట్టుచూ జూదమాడడు. ప్రాణాలుతీసే బాణాలు వేసినప్పుడు అత డెట్టివాడో మీకు తెలియరాగలదు. అని వర్ణించునప్పుడు కృత, ద్వాపరపదాలను ప్రయోగించుటచే ఈయాటనే పాండవు లాడిరనుట స్పష్టము. ఇప్పుడీయాటను తెనుగువారు నక్కమష్ట (నక్కముష్టి, లక్కిముష్టి) అను పేరుతో ఆడుతున్నారు. ఈ కలిద్వాపరాది భేలనవిధాన మొక్క భారతదేశమందేకాక ఏసియా, యూరోపు ఖండములలోని బహుదేశాలలో అతిప్రాచీనకాలమం దాడినట్లు మనకు నిదర్శనములు దొరకినవి. పూర్వము గ్రీసు, ఈజిప్టు దేశాలలో ఈయాట విరివిగా నుండెను. ప్రాచీనపు ఈజిప్టు జనులు శవాలతోపాటు పాచికలనుగూడ పూడ్చుతుండిరి (పరలోకములో ఆ జీవు లాడుకొందురని అట్లు చేసెడివారు). క్రీ.పూ. 1200 ప్రాంతమందు ట్రాయియుద్ధము 10 ఏండ్లు సాగినప్పుడు ముట్టడివేసిన గ్రీకుసైనికులు ప్రొద్దుపోకకై యీ పాచికల నాడిరి.

తెనుగు వాఙ్మయములో నాచనసోమన తర్వత యిద్దరు ముగ్గురు కవులు సోమన వర్ణించిన విధముగనే వర్ణించిన దీసందర్బమందే సూచించుట బాగుండును. పింగళి సూరన కళాపూర్ణోదయమందు (3-131) "తచ్చొక, చౌవంచ, యిత్తిగ, బారా, దుగ"యని పాచికలాడినట్లు వర్ణించెను.

సలకుసాల రుద్రకవి తన నిరంకుశోపాఖ్యానములో (2-22) "బారా, పది, దచ్చి, యిత్తుగ, దుగా"యని పాచికలాడినది వర్ణించెను. దాని మరి కొన్ని వివరా లిట్లు తెలిపెను. (3-20)

      "ధృతిపెంపొందగ సారెసారెపయి సారెంజూచుచున్ సారెవో
       వుతరింబోవుచు జోడుగట్టు తరి రివ్వుల్ మీర జోడించుచున్
       జత, బారా, పది, దచ్చి యిత్తుగ, దుగా, చౌపంచ, తీవంచ
       బొంకితినానర్తకి యంచు నాడెను భయాంగీకార మేపారగన్.

నాచన సోముని కాలమునుండి మనకాలమువర కీపాచికల ఆట ఈ విధముగా వచ్చియున్నది.[77] విష్ణుమాయానాటకము (మద్రాసు యూనివర్సిటీ ప్రచురణము)లో లక్ష్మీవిష్ణువులు నెత్తమాడినట్లు తత్కవి మూడు పద్యాలలో వర్ణించినాడు.

ఈనాడు పిచ్చుకుంట్లవారు పగటివేషాలు వేయుచుందురు. హిందూస్థానములో దీనిని "బహురూపులు" అందురు. ఈ వేషాల వినోదము కాకతీయుల కాలమందుండెను.[78]

పిల్లలాటలుకూడ విశేషముగా నుండెను. వయసు కోడెగాండ్రు పికిలి పిట్టల పోట్లాటలతో వినోదించిరి. బొటన వ్రేళ్ళపై పికిలి పిట్టలను తీసుకొని పోవుట వారికి పరిపాటి.[79]

పల్నాటివీరుడగు బాలచంద్రుడు పెక్కాటల నాడెను.

        "గుమ్మడికాయలు కొంతసేపాడి"
        "చెరుకులపందెంబు చెల్వొప్ప గెలిచి"
        "పోకలాటలచేత బుచ్చు ముప్రొద్దు"
        "ఆడుడి ముత్యంబు లమరు బంతులును"
        "గుంతమాపల నాడి కొని గెల్చికొనుము"
        "కుటిలజంతుల దెచ్చి గుడిలోన నుంచి"
        "విడిపించి పోరాడు విధమును జూడు"
        "రూకలకుప్పలు రూఢిగ నాడు."[80]

గుంతమాపలన ఒకపలకలో కొన్నిగుంతలుచేసి అందు చింతగింజలు పోసి ఆడు ఆటయై యుండును. ఈపదము నిఘంటులలో లేదు. బంతులు అన కాలిబంతి (పుట్ట చెండు) ఆటయై యుండును. జంతువుల పోట్లాట లన పొట్లేండ్ల పోరితము, కోళ్ళపందెము, పికిలిపిట్టల కలహము, దున్నల యుద్ధము అయి యుండును. తక్కినయాట లెట్టివో తెలియదు. కచ్చకాయలను తిత్తులలో నుంచుకొని వాటితో ఆడుచుండిరి.[81] బొంగరాల ఆట పిల్లల ఆటలలో చాల ముఖ్యమైనదిగా నుండెను. బాలచంద్రుని బొంగరాల ఆటను చాల విరివిగా వర్ణించినారు. పన్నార్లు అనునవి బాలిక లాడుకొను గురుగులు అని శబ్దరత్నాకరమందు వ్రాసినారు. అదెట్టి యాటనో తెలియదు. "పన్నార్లమాటున" అని పాల్కురికి వ్రాసెను.[82]

కోడిపందెము హిందువుల ఆటలలో ముఖ్యమైనది. అది చాల ప్రాచీనమైనది. పల్నాటియుద్ధమునకు "కోడిపోరు" ఒక ముఖ్యకారణ మన్నారుకదా! నాయకురాలికోళ్ళు, బ్రహ్మనాయనికోళ్ళను గెలుచుట, పందెములో నోడిన బ్రహ్మనాయుడు రాజ్యమువదలి ఏడేండ్లు పరదేశ మందుండుట, అటుపై పల్నాటి యుద్ధము జరుగుట సుప్రసిద్ధమగు చరిత్రయే.

        "కృకనాకు స్తామ్రచూడ:
         కుక్కుట శ్చరణాయుధ:"

అని అమరుడు వ్రాసెను. కాళ్ళతో తన్ను కొని యుద్ధము చేయునవికాన చరణాయుదులని వాటికి పేరు పెట్టెను. మనపూర్వికులు వాటి కుడికాళ్ళకు జేనెడు కత్తులను గట్టి యుద్ధము చేయిస్తూ యుండిరి. ఆ విధానము అవిచ్చిన్నముగా మన కాలమువరకును పట్టుకొని వచ్చినవి. కోడిపందెమునకై యొక్క శాస్త్రమే మనతెనుగువారు వ్రాసి పెట్టుకొన్నారు. చలికాలములోను, సంక్రాంతి పండుగ కాలములోను కోళ్ళపందెములకై కోళ్ళను చంకబెట్టుకొని కుక్కుట శాస్త్రమును గుండురుమాళ్ళలో దోపి తమ శాస్త్రప్రకారముగా కుక్కుటసజీవ ద్యూతనిపుణులు పందెము కట్టుతూ యుండెడివారు. ముప్పై యేండ్లనుండి కోడిపందెము నిషేధింపబడినందున అ శాస్త్రాలు మూలబడి మాయమవుతున్నవి.

దండికవి క్రీ.శ. 750 ప్రాంతమువాడు. అతడుతన దశకుమార చరిత్రములో కోడిపందెమును వర్ణించినాడు. అందు నారికేళజాతి ఒక జాతికోడిని గెలిచినని వ్రాసెను. అభినవదండియగు కేతన తెనుగులో దశకుమార చరిత్రమును వ్రాసినప్పుడు కోడిపందెమును చాలా విస్తరించి వ్రాయుటచేతను తెనుగు దేశమం దా పందె మెంత ప్రాముఖ్యము పొందియుండినో యూహింప వచ్చును.

       "ఎదిరికోడి మున్నెవసి యారెడు మెడ
        నెనగాడ నురువడి వ్రేసి వ్రేసి......."
       "గెలిచె నామాట దగ నారికేళజాతి"[83]

క్రీడాభిరామములో కోళ్ళయుద్ధమును చాలావిపులముగా, హాస్యజనకముగా, మనోరంజకముగా కవి వర్ణించినాడు. దాని నుదాహరించుట విపుల హేతువగునని సూచనమాత్రముతో తృప్తిపడనైనది.

జనుల వినోదాలలో గంగిరెద్దుల దొకటియై యుండెను.[84] ఇవి కాకతీయుల కాలమందలి మన పూర్వికుల కతిపయవినోద విశేషములు.

స్త్రీల అలంకరణములు

పూర్వము తెనుగు స్త్రీల కేమి సౌందర్య మనిపించెనో యేమో! ముంగర, ముక్కర, నెత్తిబిళ్ళలు, దండకడెములు, వంకీలు, మున్నగునవి యెక్కువగా దరిస్తూ వుండిరి. జోమాలదండను వేసుకొనుచుండిరి.[85] ఇప్పుడు స్త్రీలు (యువకులుకూడా) మైపూతలకై చాల వ్యయము చేస్తున్నారు. స్నో, పౌడర్, నూనెలు, గోరురంగులు, వాటి యంగాంగములగు అద్దము, దువ్వెన, బ్రష్షు, మొదలయినవి వాడుదురు. ఆ కాలపు స్త్రీలకు పసుపే ప్రధానము. అది మెరుగు నిచ్చి వెండ్రుకలను పోగొట్టి క్రిమి సంహారియై పని యిచ్చెడిది. ఆనాటి స్త్రీలు గోళ్ళకు గోరంట ఆకు దంచి కట్టి రంగు వేసుకొనుచుండిరి.

వారు పెదవులకు యావకరసాన్ని (లక్కరంగును) పూసుకొనుచుండిరి.

       "దరహాసరుచివరాధరకాంతి మాన్చునన్
        వడవున కెమ్మోని వన్ను పూన్చి"

(నన్నెచోడ-కుమారసంభవం)

కాళ్ళకును లక్కరంగు పూసుకొనుచుండిరి. కన్నులకు కాటుకను పెట్టుకొనుచుండిరి. కాళ్ళకు 'పారాణి' పూసుకొనుచుండిరి.

దండి సంస్కృతములో స్త్రీల సొమ్ములలో "మణినూపురమేఖలా కంకణ కటక తాటంకహార" అని మాత్రమే వర్ణించెను. కేతన వర్ణనలో హెచ్చుగా భూషణములను పేర్కొనుటచే నవి తెలుగుసీమలోని సీమంతినుల సొమ్ములని భావింపవచ్చును. అత డిట్లు వర్ణించెను.

          "మట్టియ లుజ్జ్వల మణినూపురంబులు
           మొలనూలు వస్త్రముల్ ముత్తియములు
           కన్నవడంబులు గట్టినూళ్ళును సుద్ద
           సరితీగె మినుకులు సందిదండ
           అంగుళీయములు హారకంకణములు
           చేకట్టుపాలెలు చెన్నుమెఱుగు
           టాకులు సరిపెణలాలక్తకము పూత
           కాటుల తిలకంబు కమ్మపువ్వు
           లాదిగాగల మేలి ద్రవ్యముల నొప్ప
           పసదనము చేసి యుచితరూపంబు దాల్చి
           బాలచంద్రిక బోటినై పజ్జ కరిగి
           దారువర్ముని లోగిలి దరియజొచ్చి"

ఈ పద్యములో స్త్రీల మైపూతను ఆభరణములు కొంతవరకు బోధకాగలవు. "నిలువుటద్దములు" పల్నాటి యుద్ధకాలమందేయుండెను.[86] ఓరుగంటి స్త్రీలు తాటంకములు, ముత్యాల కమ్మలు, కాంచీనూపుర కంకణములు, త్రిసరములు, మొదవంక కడియములు మున్నగునవి ధరించిరి.

(క్రీడాభిరామము)

వివిధములు

"తాయెతులు" రక్షగా కట్టుకొనుట ఆనాటికే యాచారమై పోయెను.

         "మేనికి రక్షకై మించు తాయెతులు
          దండ చేతుల రెంట ధారణచేసి"[87]

అనుటచే చేతులకుమాత్రమే కట్టుకొని రనరాదు. మొలత్రాటిలో, మెడలో కూడా కట్టుకొనుచుండిరి. అయితే క్రీ.శ. 1172 లో పల్నాటివీరుల యుద్ధకాలములో అవి యుండెనో లేక శ్రీనాథుడు ద్విపదగా నా కథను వ్రాసిన నాడుండెనో చెప్పజాలము. ఎటులయినను కాకతీయుల కాలమం దవి యుండె ననవచ్చును. తాయెతు అను శబ్దముపై అప్పకవి పెద్ద చర్చచేసి తాయి (తల్లి) శిశువునకు కట్టు 'ఎతు' రక్ష యన్నాడు, తల్లులు పిల్లలకు మాత్రమే కట్టిరా? తమకే అవసరమయిన తమ తల్లులచేతనో కృతకమాతలచేతనో కట్టించు కొనిరా? వృద్ధులు, యువకులు, తమంతకు తామే మాంత్రికులతో రక్ష లిప్పించుకొని తాయెతులను కట్టుకొనకుండిరా? ఎతు అంటే రక్షణ అనుదానికి ప్రయోగ మేదీ! తాయెతు అని వ్రాయక తాయతు అని ముద్దరాజు రామన యెట్లు వ్రాసె అది తప్పు అని యతనిపై గంతుకొనినాడు. ఈ పదము తెనుగు పదమే కాదని నా భావము.

ఇది తావీజ్ అను అరబ్బీపదమై యుండును. ఖురాన్ మంత్రాలను వ్రాసి రక్షగా తురకలు కట్టుకొందురు. దానినే మనవారు స్వీకరించినట్లున్నది.

వీరకార్యములను చేయుటకు యుద్ధమునకు బోవుటకు వీరులు 'వీరతాంబూలముల' తీసుకొనుచుండిరి.[88] దీనినే హిందీలో బీడా యెత్తుట యందురు. (బీడా=విడెము) వాపులకు మందు లెట్టివో కనుడు. వాయుతైలాలు, వావిల చివుళ్ళు, ఉమ్మెత్త, ఆముదపు చివుళ్ళు, జిల్లెడాకులు, వీటితో కాచుట మున్నగునవి చేయుచుండిరి.[89]

ఆ కాలమందు వెట్టి యుండెను. అది చాలా ప్రాచీన మయినది. సంస్కృతములోని వేష్ఠి పదమే వెట్టి, చాణక్యుని అర్థశాస్త్రమునందు వెట్టి చర్చ కలదు.

           "వెట్టి కేగెడుతట్ట బట్టి యెత్తుడు"

అని పాల్కురికి వర్ణించినాడు[90].

           "దేవతల వెట్టికి బట్టినవాడు"

అని నాచన సోమన యనెను[91].

శూద్రజనులు విశేషముగా చల్లడములు (చల్లాడము, చిల్లడము) కట్టు చుండిరి.[92] ఒడిసెలను పిట్టలుకాయుటకు, యుద్ధములో వాడుటకును ఉపయోగించిరి[93] గ్రాసగాండ్లకు జొన్నల జీతమిచ్చిరి. ఇప్పటికిని ఆ యాచారము కలదు. "జొన్నలు గొన్న ఋణంబు నీగుదున్" అని నన్నెచోడుడు వ్రాసెను.[94] జనులు అప్పుడప్పుడు పౌరాణికులవలన భాగవత భారతకథలను వినుచుండిరి.

          "విబుద విప్రుల బిల్వగ బంచి
           వినుము భాగవతంబు విజ్ఞాన మొదవ
           భారతరణకథ పాటించి వినుము."

అని బాలచంద్రునికి తల్లి చెప్పెను. ఆ కాలమున బ్రాహ్మణులే పౌరాణికులై యుండిరేమో! అయితే క్రీ.శ. 1132 వరకు భారతములో మొదటి మూడు పర్వాలే తెనుగై యుండెను. భాగవతము తెనుగు కాలేదు. కావున తేలిన దేమన, ప్రజలు సంస్కృత భారత భాగవత పురాణాలను విని అర్థముచెప్పించుకొంటూ వుండిరి.

వట్టము, వడ్డి అను అప్పులవ్యాపారము సాగుచుండెను. "వట్టము లంచ ముంకువయు, వైద్యము, వేశ్యయు, బూటకూలియున్, చేపట్టుననబ్బు"[95] పూటకూలి ముచ్చటయందే వచ్చినది, పూటకూలి 1000 ఏండ్లనుండి యున్నట్లే, మన ప్రాచీనులు అన్నము నమ్ముట నీచమనిరి. కావున ఇది ఆంధ్రములో ఈ 1000 ఏండ్లలోనే ప్రబలియుండును. నగరాలుండుచోట పూటకూళ్లు తప్పక ఏర్పడును. ఆంధ్రనగరమున బరగిన ఓరుగల్లు ఒక మహానగరమై యుండినందున పూటకూళ్ళుకూడా అందు నెలకొనెను. దానిని క్రీడాభిరామకర్త యిట్లు వర్ణించెను.

       "సంధివిగ్రహయానాది సంఘటనల
        ఖందకీజారులకు రాయబారి యగుచు
        పట్టణంబున నిత్యంబు పగలురేయి
        పూటకూటింట వర్తించు పుష్పశరుడు"

ఒక్కరూక యిచ్చిన యేమేమి లభిస్తుండెనో యిటు తెలిపినాడు.

       "కప్పురభోగి వంటకము
        కమ్మని గోధుమపిండి వంటయున్
        గుప్పెడు పంచదారయును
        క్రొత్తగ కాచిన యాలనే, పెసర్
        పప్పును, గొమ్మునల్లనటి
        పండ్లును, నాలుగునైదు నంజులున్
        లప్పలతోడ క్రొంబెరుగు
        లక్ష్మణవజ్ణలయింట రూకకున్."

ఇంకేమి కావలెను? ఇది ఉత్తమాహారము (Balanced diet), కప్పుర భోగి అనునవి సన్నబియ్యపుజాతి. ఈనాడు మహారాజు భోగాలు అన్నట్టివి.

ప్రతాపరుద్రుని యుంపుడుకత్తె చరితను "ఆడుదురు నాటకంబుగ నవనిలోన" అన్నాడు క్రీడాభిరామకర్త, పాల్కురికి కూడా 'పటు నాటకంబుల నటియించువారు' అనెను.

ఆ నాటకా లెట్టివి ?

గీర్వాణ నాటకపద్ధతి వేమో కావు, మరి అవి యక్షగానములై యుండును. ఈ సూచనలు వాటి ప్రాచీనతను తెలుపును.

సుంకము తీసుకొను అధికారులను సుంకరులు అనుచుండిరి. సుంకమును సంస్కృతమున శుల్కమందురు. వాటిని తీసుకొనుటకు ఘట్టములు (నాకాలు) ఏర్పాటు చేసియుండిరి. 'ఘట్టకుటీ ప్రఖాతన్యాయము' అని గీర్వాణ మందందురు. ఒకడు మునిమాపే బండిసరకుతో బయలుదేరి అడ్డబాటల బడి సుంకముఘాటును తప్పించుకొనదలచి చీకటిలో బాటతప్పి తిరిగితిరిగి భల్లున తెల్లవారువరకు నేరుగా సుంకమునాకా వద్దనే తేలెనట! సుంకరివారు చాలా దుర్మార్గులని భద్రభూపాలుడే అన్నాడు.

        "జూదముకంటె వాదమును
         సుంకరికంటెను పాపకర్మమున్"

లేదు. అని యన్నాడు.[96]

జనులు వల్లువములు (రూకలసంచులను) నడుమున కట్టుకొను చుండిరి. అవి కండ్లువడ అల్లినజాలె సంచులు, అట్టి జాలె సంచులను పల్లెలలో నేటికిని వాడుకొనుచున్నారు.

ఓరుగంటినగరమున నాగరికుల కవసరమగు మంచిచెడ్డ సాధనములన్నియు నుండెను. మేదరవాం డ్రుండిరి. కుట్రపువా రుండిరి. వారు మోహరివాడలో నుండుటచే ప్రత్యేకముగా సైనికులకే యేర్పాటై యుండిరేమో! అయినను భోగమువారు రవికలను కొలతలిచ్చి అప్పుడప్పుడు కుట్టించుకొను చుండిరి. జూదములాడుట సామాన్యదృశ్యము. ఒంటిపై దుప్పట్లుకూడ అమ్ముకొని జూదమాడుచుండిరి.

"పచ్చడం బమ్ముకొన్నారు పణములకును"

---క్రీడాభిరామము.

మేషయుద్ధాలను, కోళ్ల పందెములను ఆడుచుండిరి. పొట్లేండ్ల యుద్ధమును వెంకటనాథుడు తన పంచతంత్రమందు వర్ణించెను. (1-232). పాములాటను చూపించువారుండిరి. గానుగ వృత్తిచే జీవించు గాండ్లవారుండిరి. డక్కి, జవనిక మున్నగు వాద్యములతో సోదెలు, సుద్దులు, కతలు చెప్పెడువారుండిరి. చలికాలమందు ధనికులు "కాలాగుర్వను లేపనములతో, దట్టు, పున్గు, మృగనాభితో, కస్తూరితో" చలి బాపుకొనుచుండిరి. దుప్పట్లు రెండు మడతలతో కప్పుకొనుచుండిరి. బ్రహ్మణాదులు "క్రొత్త మలకవాళ్ళ" కిర్రు చెప్పుల దొడిగి ఉంకించి నడుస్తూ యుండిరి.

వేశ్యల నుంచుకొనుట, ఆ ఘనకార్యము ప్రకటించుకొనుట- ఆకాలపు రాజులు, సామంతులు, అధికారులు పసందుచేసిరి. నాగన్న మంత్రి "అంగనా హృదయ సరోజ షట్పదము" అట! రాయవేశ్యాభుజంగ వంటి బిరుదులను కొందరు వహించిరి. తుండీర (అరవ) దేశము నుండి పిళ్ళె యొకడు ఓరుగంటిలో భోగముదానితో వివాదపడగా దానిని జారధర్మాసనములో తీర్పుచేసిరి. ఓరుగంటి నగరమున "అగణ్య వస్తువాహన శోభితంబైన వేశ్యా గృహంబులు 12,700 ఉండెను" అని ఏకామ్రనాథుడు, ఇది అత్యంతమగు అతిశయోక్తి, బోగము కన్నెలకు 'కన్నెరికము' పెట్టునపుడు అద్దము చూపించి అలంకరించు వేడుక చేయుచుండిరి.

        "ముకుర వీక్షావిధానంబు మొదల లేక
         వెలపడంతికి గారాదు విటుని గవయ"

ఆంధ్రోర్వీశుమోసాలపై గడియారముండెను. 60 గడియల దినమును పగలు 30, రాత్రి 30 గడియలుగా విభజించి 1 మొదలు 30 వరకు గడియలను కొట్టుచుండిరి.

ఆ కాలమందు గడియకాలములో నీటిలో మునుగునట్లుగా నొక చిల్లిగల గిన్నెను నీటిపై నుంచి అది మునిగిన వెంటనే లెక్కప్రకారము గంట కొట్టుతూ ఉండిరి.

బొమ్మంచు పదమును క్రీడాభిరామములో వాడినారు. "లేత బొమ్మంచుం జిగురాకుమోవిణిసిభాత్వర్థం బనుష్ఠింతునో," పూర్వము యెఱ్ఱని అంచుగల తెల్లని చీరెలు వాడుకలో నుండెను. ఎఱ్ఱని అంచునే బొమ్మంచు అనిరి. లేతయైన బొమ్మంచువంటి ఎఱ్ఱని పెదవులు అని రసిక కవి వాడినాడు. శ్రీకాకుళము తిరునాళ్ళలోని వెలనాటి యువకుల, వితంతువుల దుర్వర్తనలు కవి యెక్కువగా వర్ణించినాడు.

ఇట్టి వింకను చర్చించుకొలది పెరుగుచునే యుండును. కాకతీయుల కాలపు సాంఘిక చరిత్ర కాధారములగు ముఖ్య గ్రంథములలో ముఖ్యమైనది. క్రీడాభిరామము. దీనిని వల్లభరాయలు రచించెనని యున్నను శ్రీనాథుడే రచించినట్లు అడుగడుగునకు శైలి నిరూపిస్తున్నది.

కాకతీయకాలపు సాంఘిక చరిత్రకు ముఖ్యాధారములగు గ్రంథములు

1. క్రీడాభిరామము - వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రచురణము.

2. కాకతీయసంచిక - ఆంధ్రేతిహాస పరిశోధకమండలి, రాజమహేంద్రవరము.

3.పండితారాధ్యచరిత్ర, బసవపురాణము - పాల్కురికి సోమనాథుడు.

4. పల్నాటి వీరచరిత్ర - అక్కిరాజు ఉమాకాంతంగారి ముద్రణము.

5. తెలంగాణా శాసనములు - లక్ష్మణరాయ పరిశోధకమండలి, హైద్రాబాదు.

6. ఉత్తర హరివంశము - నాచన సోమన

7. ప్రతాప చరిత్రము - ఏకామ్రనాథుడు.

8. దశకుమారచరిత్ర - కేతన.

9. నీతిశాస్రముక్తావళి - భద్రభూపాలుడు.


____________
  1. "జైన" బౌద్ద దార్వక దుష్పథ సమయములు, మూడును నిర్మూలనముగ జేయుదనుక, మూడురాలసు వైతు ముప్పొద్దు నిన్ను. (బసవపురాణం - పాల్కురికి పు. 180) వసుధలో జిమలనువారి నందరను, నేలపాలుగజేసి, (పాల్కురికి జన పు. 192)
  2. "నను వేంకటేశ్వర విఠ్జలేశ్వరస్థానే విష్ణోరీశ్వర ఆబ్దశ్రవణాత్ ...... వేంకటేశ్వరస్యాభాస విష్ణుత్వం, తదంగే నాగభూషణాది ధర్మణాం ద్యోతనాత్, మూల విగ్రహే శంఖచక్రాది లాంఛనానా మదర్శనాత్ ... కించ తత్పాణ్యధో దేశే శివలింగ దర్శనాదీశ్వరశబ్దో వ్యవహ్రియతే."
  3. "ఆరువల్లి నాయురాలి దుర్మంత్రంబు
    కోడిపోరు, చాపకూటి కుడుపు,
    ప్రథమకారణములు, పల్నాటి యేకాంగ
    వీరపురుష సంహారమునకు" --- క్రీడాభిరామము</poem>
  4. THURSTON - Castes and Tribes of South India.
  5. పాల్కురికి బసవపురాణము పు 19
  6. పాల్కురికి బసవపురాణము పు 217
  7. పాల్కురికి బసవపురాణము పు 237
  8. పాల్కురికి బసవపురాణము పు 225
  9. 'అత్యర్కేందు కులప్రశస్తి మనృజత్‌'... ప్రతాపరుద్రీయము.
  10. పండితారాధ్య చరిత్ర, మొదటి భాగం పుటలు 506, 507.
  11. సిద్ధేశ్వర చరిత్ర.
  12. పండితారాధ్య చరిత్ర, మొదటి భాగం పు॥ 511
  13. వే. ప్రభాకరశాస్త్రి బసవపురాణ పీఠిక, పు 76.
  14. పుట 114
  15. బసవపురాణము (పాల్కురికి) పు 73.
  16. వే. ప్ర. శాస్త్రిగారి పీఠిక. పు 75
  17. పల్నాటి వీరచరిత్ర; ద్వితీయ భూమిక, అక్కిరాజు ఉమాకాంతం గారి పీఠిక.
  18. ఉత్తర హరివంశము, ఆ 2, ప 68.
  19. క్రీడాభిరామము.
  20. "ఏకవీరమ్మకు మహురమ్మకు అధోహ్రీంకార మధ్యాత్మకున్" క్రీడాభిరామము.
    "వ్రీడాశూన్య కటీరమండలము దేవీశంభళీ వ్రాతమున్" క్రీడాభిరామము.
  21. క్రీడాభిరామము.
  22. క్రీడాభిరామము.
  23. క్రీడాభిరామము.
  24. క్రీడాభిరామము.
  25. క్రీడాభిరామము.
  26. క్రీడాభిరామము.
  27. క్రీడాభిరామము.
  28. "బద్దెనీతియు కోమటి పడుచునోళ్ళ, కతన దబ్బర పాఠంబు గదియ గవులు, తప్పు లెడలింప నెంతయు నొప్పు భువిని." - నీతిశాస్త్రము 1 వ పద్యము.
  29. ఆంధ్రనామ సంగ్రహము, మానవవర్గు.
  30. సాంబనిఘంటువు, మానవవర్గు.
  31. పండితారాధ్య చరిత్ర, 2 - వ భాగము, పుట 348
  32. మల్కాపురశాసనము (తెలంగాణా శాసన గ్రంథము.)
  33. ఖజానుల్ పుతూహె అమీర్ ఖుస్రూ.
  34. తారీఖె ఫీరోజ్‌షాహి - బర్నీ.
  35. పల్నాటి వీరచరిత్ర పుట 78.
  36. ప్రతాపరుద్రీయము, నాయక ప్రకరణము, 11 - వ శ్లోకం.
  37. పల్నాటి వీరచరిత్ర, పుట 105.
  38. నాచన సోముని ఉత్తర హరివంశము, అ 2, ప 92.
  39. పల్నాటి వీరచరిత్ర, పుటలు 3, 4,
  40. పల్నాటి వీరచరిత్ర, పుటలు 3, 4.
  41. పల్నాటి వీరచరిత్ర, పు 4, మరియు 108.
  42. బాణము ఘనమైన గొల్లెనకంబంబు దాకె, అదియంత తునకలై యవనిపై బడెను. పల్నాటి పు 37.
  43. "పోరించి ... ధర్మదార పట్టించుచు నున్నవాడు. క్రీడాభిరామము.
  44. పల్నాటి వీరచరిత్ర పు 110.
  45. పల్నాటి వీ. చ. పు 110.
  46. పల్నాటి వీ. చ. పు. 110.
  47. క్రీడాభిరామము.
  48. నూహెసిసెహర్ అమీర్ ఖుస్రూ.
  49. క్రీడాభిరామము.
  50. క్రీడాభిరామము. (పల్నాటి వీరచరిత్రలో "శ్రీరామకథలును, శ్రీకృష్ణ కథలును పన్నుగా వ్రాసిన పటములను దెచ్చి" అని వ్రాయుటచే చిత్రలేఖన చరిత్ర మరింత ప్రాచీనము దగుచున్నది. [చూ. పల్నాటి, పు. 16]
  51. బసవపురాణము పు 56.
  52. పల్నాటి వీరచరిత్ర, పు 6.
  53. ఉత్తర హరివంశము, పు 180
  54. నాచన సోముని ఉత్తర హరివంశము, ఆ 5, ప 212.
  55. క్రీడాభిరామము.
  56. "హాహా నృపాల సింహాసనాధిష్ఠాన రత్నకంబళ కాభిరామరోమ" క్రీడాభి.
  57. మల్కాపుర శాసనము, I. A. H. R. S. సం 4, పు 147-162.
  58. నాగులపాటి శాసనము.
  59. నాగులపాటి శాసనము.
  60. మల్కాపుర శాసనము (తెలంగాణా శాసన గ్రంథము)
  61. పండితారాధ్య చరిత్ర. 2 వ భాగము. పుట 303.
  62. క్రీడాభిరామము.
  63. పండితారాధ్య చరిత్ర, 2 వ భాగము, పుట 307.
  64. "మఖుమల్లుగుడ్డలు" పల్నాటి పు 10.
  65. క్రీడాభిరామము 7.
  66. బసవ పురాణము పు 5.
  67. పండితారాధ్య చరిత్ర 2-వ భాగము.
  68. బసవ పురాణము, పు 124.
  69. బసవ పురాణము, పు 216.
  70. భీమేశ్వరఖండము. 5-103.
  71. దశకుమార చరిత్ర.
  72. ఉ. హరివంశము, పు 281.
  73. పాల్కురికి బసవపురాణము. పు 102.
  74. పాల్కురికి బసవపురాణము. పుట 22.
  75. నాచన సోముని ఉత్తర హరివంశము పు 172.
  76. నాచన సోముని ఉ. హరివంశము పు 158.
  77. పాచికల యాట ఇప్పటికిని వైదిక బ్రాహ్మణులలో కలదని విని కర్నూలులో నొకనాడు నాలుగుగంటలవరకు కొన్ని యిండ్లలో విచారించితిని. అందరు నాయాట నాడుదుమనిరి. కాని చూపరైరి. తుదకు అలంపూరులో బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణశర్మచే ఆడించి కనుగొంటిని. నేను శ్రమచేసి వారియాట చూచినందుకు ప్రతిఫలము వారి పాచికలను తెచ్చుకొనుటయే!
  78. "దైవంబనగ లేదు తా బహురూపు" బసవపురాణము పు. 20.
  79. "కరములపైని పికిలిపిట్టలు నుండ" పల్నాటివీరచరిత్ర పు 28.
  80. పల్నాటి. పు 38.
  81. పల్నాటి వీరచరిత్ర పు. 45.
  82. పండితారాధ్యచరిత్ర, మొదటిభాగము. పుట 130.
  83. దశకుమారచరిత్ర.
  84. "గంగిరెద్దులవాడు కావర మణచి ముకుదాడు పొడిచిన పోతెద్దులట్లు" పల్నాటి, పు. 20.
  85. పండితారాధ్య, భాగం 139. "గోరుంట యెర్రలయిన వాలారు నఘంకురములు" అని క్రీడాభిరామ మందును వర్ణింతము.
  86. "నిలువు టద్దంబులు నిలిపిరి" దిశల - పల్నాటి పు. 16.
  87. పల్నాటి. పు. 17.
  88. బసవ పురాణము పు 241.
  89. బసవ పురాణము పు. 77.
  90. బసవ పురాణము 83. పండితారాద్య 1 భాగం, పు 521.
  91. 2 ఉత్తర హరివంశము. ఆ 5 ప 89.
  92. పండితారాద్య చరిత్ర. పుట 97.
  93. నాచన సోముని ఉత్తర హరివంశము, అ3, ప 107, ఒడిసెల అనుట గమనించునది.
  94. కుమారసంభవము, అ 11.
  95. భద్రపాలుని నీతిశాస్త్రముక్తావళి ప 151. భద్రభూపాలుడు క్రీ.శ. 1050 కి పూర్వుడు-మానవల్లి.
  96. నీతిశాస్త్రముక్తావళి, పద్య1 151.