Jump to content

ఆంధ్రుల సాంఘిక చరిత్ర/1 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి

1 వ ప్రకరణము

తూర్పు చాళుక్య యుగము

న వాఙ్మయ చరిత్ర నన్నయభట్టుతో ప్రారంభమగుచున్నది. అతడు తూర్పు చాళుక్యరా జగు రాజరాజనరేంద్రుని కులబ్రాహ్మణుడు. అ రాజు రాజమహేంద్రవరము రాజధానిగా వేంగిదేశమును క్రీ.శ. 1022 నుండి 1063 వరకు రాజ్యము చేసెను. మనకు తూర్పు చాళుక్యుల కాలపు చరిత్ర సరిగా తెలియదు. ఇచ్చట నన్నయ కాలమునుండి కాకతీయుల ప్రాబల్యము వరకు అనగా ఇంచుమించు క్రీ.శ. 1000 నుండి 1200 వరకు తెనుగుదేశమం దుండిన ఆచార వ్యవహారములు తెలియవచ్చినంతవరకు చర్చింపబడును.

రాజరాజ నరేంద్రునికి 400 ఏండ్లకు పూర్వమే తెనుగు దేశమున విరివిగా వ్యాపించిన బౌద్ధమతము మాయమైపోయెను. చాళుక్య రాజులు శైవులు. అందుచేత వారి రాజ్య మందు శైవమత వ్యాప్తియు, బ్రాహ్మణాధిక్యతయును ఎక్కువయ్యెను. నన్నయకు ముందు జనులు పాటలు, పద్యాలు వ్రాసుకొని ఆనందించిరి. కాని కొన్ని శాసనములందు తప్ప మరెచ్చటను మనకు నన్నయకు పూర్వపు పద్యాలు లభింప లేదు. చాళుక్యరాజు "పార్వతీపతి పదాబ్జద్యానపూజా మహోత్సవమందు" ప్రీతి కలవాడని నన్నయ తెలిపినాడు. చాళుక్యులు క్షత్రియులు కానట్లున్నది. అయినను రాజవంశము లన్నియు సూర్య చంద్రులకు లంకె పెట్టుకొని క్షత్రియత్వమును పొందినట్లుగా చాళుక్య వంశము కూడ క్షత్రియ వంశమయ్యెను. పైగా "హిమకరు తొట్టిపూరు భరతేశకురు ప్రభు పొందు భూపతుల్ క్రమమున వంశకర్త లనగా మహినొప్పిన యస్మదీయ వంశము" అని నన్నయచే చెప్పించు కొన్నాడు. కాని అతని పూర్వీకులు తాము బ్రహ్మ ప్రార్థనాంజలిలో పుట్టిన ఒకమూల చాళుక్యపురుషుని సంతతివారమనిరి. మరియొకశాఖ మరొక విధముగా వ్రాయించుకొనెను. ఆ కాలములో రాజులందరును ఏదో యొక విధముగా సూర్యచంద్ర వంశీయ క్షత్రియులుగా వ్రాయించుకొన్నవారు. ఆ కాలమున శైవాలయములు సత్రములు రాజులు కట్టించిరి. బ్రాహ్మణులకు అగ్రహారములను మాన్యములను సంక్రాతి లేక గ్రహణకాలములందు దానములుచేసిరి.

నన్నయ కాలము తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగిశాఖ లేర్పడెను. ఆ విభేదము నన్నయ కాలమందు కాని, అంతకు పూర్వమందుకాని లేకుండెను. నన్నయకు 100 ఏండ్లకు ముందు అమ్మరాజ విష్ణువర్ధనుడు రాజ్యము చేసెను. అప్పటివరకు తూర్పు చాళుక్యుల రాజధాని వేగీపురమై యుండెను. అమ్మరాజే రాజమహేంద్రవరమును రాజధానిగా చేసెను. కావున మన కీకాలమందు తూర్పుతీరమందలి (ఇప్పటి సర్కారులు) జిల్లాలలోని స్థితిగతులు కొంతవరకు తెలియవచ్చును.

క్షత్రియులమని అబద్ధం వా సుబద్ధంవా అని వ్రాయించుకొననొల్లని రాజులను నోటినిండుగా శూద్రులని కవులును, పౌరాణికులును అనజాలకున్నను "చతుర్థకులజులు, గంగతోబుట్టువులు" అనిరి. ఇదేకాలమందు తెనుగుదేశమందలి ప్రజలులను "సచ్చూద్రులు" అనిరి. సత్యాది గుణంబులు శూద్రునందు కలిగెనేని వాడు సచ్చూద్రుండగు గాక" (అరణ్య. 4-1-29) అని తెనుగు భారతమందు వ్యాసభారతమందులేని కులమును సృష్టించుటచే ఇది ప్రత్యేకముగా తెనుగుదేశాని కేర్పడెనో యేమో?

బ్రాహ్మణజాతి మహత్త్వమునుగురించి సంస్కృత భారతమందుకూడా విశేషముగా పలుమారు సందర్భరహితముగా కలదు. తెనుగు భారతమందును నన్నయ కొన్ని తన పద్యాలు ఎక్కువగా చేర్చి కొన్ని మూలములోనివి వదిలెను. అనగా తనకు నచ్చిన విశేషములనే తన భారతమందు చేర్చెను. (చూ. అది 1-138 ఆది. 2-61 మరియు 63. ఇవి మూలములో లేనివి)

నన్నెచోడుని కాలమునాటికే (క్రీ.శ. 1150 ప్రాంతమున) శైవముతోపాటు కౌళమార్గాది వామాచారములు దేశ మందు ప్రవేశించెను. దాని విధానమును కొంతవరకు నన్నెచోడుడు కుమారసంభవమం దిటుల తెలిపినాడు. "కొందరు మధుపాన గోష్ఠికింజొచ్చి మండలార్చన దీర్చి (శ్రీ చక్రపూజచేసి) మూలజ వృక్షజ గుడుమధుపిష్ట కుసుమవికారంబులగు సుగంధాసవంబులు కనకమణి మయానేక కరక చషకాదులన్నించి హర్షించి" గౌరిని, శివుని, భైరవుని, యోగినులను, నవనాథులను, ఆదిసిద్దులను కొలిచి ఆసవమును త్రాగుచు దాని నిట్లు వర్ణించిరి :

      "అమరులు ద్రావుచో నమృతమందురు దీని అహి వ్రజంబజ
       స్రముగొని యానుచో నిది రసాయనమందురు, భూసురౌఘమా
       గమవిధి సోమపానమని గైకొని యానుదురెందు, చక్రయా
       గమునెడ 'వస్తువం' దురిది కౌశికులీసురపేర్మి వింతయే!"

"చని యనేకవిధ మాంసోపదంశకంబు లాస్వాదించుచు మనోహృద్యంబులగు మద్యంబులు" సేవించిరి. (9-127 నుండి 132 వరకు) సంస్కృత భారతమందు దక్షిణదేశమును గూర్చిన చర్చ లంతగా కానరావు. నన్నయభట్టు మూలములో లేకున్నను అర్జునుని తీర్థయాత్రలో వేగి దేశమును, గోదావరిని కలిపి ఇట్లు వర్ణించెను.

      దక్షిణగంగ నాదద్దయు నొప్పిన
      గోదావరియుజగదాదియైన
      భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీ
      పర్వతంబును జూచి యుర్విలోన
      ఆనఘమై శిష్టాగ్రహార భూయిష్ఠమై
      ధరణీసురోత్త మాధ్వరవిధాన
      పుణ్యసమృద్ధమై పొలుచు వేగీదేశ
      విభవంబు చూచుచు విభుడు......
      .... ..... .... కృతార్థుడగుచు॥
  
                                   --- ఆది. 8-139

నన్నయకాలములో తెనుగుసీమలో భీమేశ్వరము, శ్రీపర్వతము, ప్రసిద్ధ తీర్థస్థలములై యుండెను. వేగీదేశమందు అగ్రహారము లెక్కువగానుండెను.

నన్నయకాలమందలి తెనుగుభాషా స్థితినిగూర్చి అనేక చర్చలు జరిగినవి. అవి యిచ్చట అప్రస్తుతమగుటచే సూచనమాత్రము చేయనైనది. నన్నెచోడుడు జాను తెనుంగును గురించి తెలిపినాడు. "సరళముగాగ భావములు జాను తెనుంగున" (కుమా. 1-35) దీనినే అతడు "వస్తుకవిత" అనెను. కన్నడములో "జాణ్‌నుడి"అని యంతకుముందే వాడిరి. దానినే ఇతడు ప్రచారము చేసినట్లున్నది. (చూడుడు. శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి పీఠిక కుమారసంభవము, మద్రాసు యూనివర్సిటీ ప్రచురణము) ఈ జాను తెనుగునే పలుమారు పాల్కురికి సోముడు తన కృతులందు వర్ణించి తన వృషాదిప శతకములో అదెట్టిదో ఒక పద్యముతో నిరూపించెను. అందే మణిప్రవాళము అను ఒక విధమగు సంస్కృతాంధ్ర సమ్మిశిత రచనను నిరూపించి రెండు పద్యాలు వ్రాసెను. అతని తర్వాత మణిప్రవాళము తెనుగులో లేకపోయెను. అది తమిళములో కలదని శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు తమ భారతవ్యాసములందు తెలిపినారు.

కవితలో దేశికవిత, మార్గకవిత యను భేదముండెనని నన్నెచోడుడు మొదట తెలిపెను. కవితయందేకాక నృత్యమందును, సంగీతమందును ఇదే భేదముండెనని శ్రీనాథుని కాలమువరకు సూచనలు కలవు. మార్గవిధానము అనునది సంస్కృతమర్యాద. వాల్మీకి రామాయణమందే తర్వాతివారేమో కుశలవులు రామకథను "అగాయతాం మార్గవిధాన సంపదా" అని వ్రాసినారు. దేశీమార్గభేదములు దక్షిణదేశమందు సంస్కృతమునుండి భిన్నించిన భాషాసంగీత నాట్యవిధానములకు క్రీస్తుశకము 9 వ శతాబ్దమునుండి నిర్ణయించిన స్వరూపు మనవచ్చును.

చాళుక్యరాజులే దేశికవితను ఆంధ్రదేశమందు నిలిపిరని నన్నెచోడుడనెను. (కుమా. 1-23) తన కాలమందు దేశిసత్కవు లుండిరనెను. (కుమా. 1-24) కుమారసంభవమే మన మొదటి ప్రబంధ మనవచ్చును. అష్టాదశవర్ణనలు, నవరసములు, 76 అలంకారములు ఉత్తమ కావ్యలక్షణాలనెను. (కుమా 1-45) జనులలో ఊయెలపాటలు (4-89) గౌడు గీతములు (6-45) ప్రచారములో నుండెను. జనుల విద్యాభ్యాసము "ఓం నమ:శివాయ"తో ప్రారంభమగు చుండెను. (కు. 3-34). ఆ కాలములో వేదపఠనము, శాస్త్రపఠనము విశేషముగా నుండెను. నన్నయ సహాధ్యాయియు, భారతరచనలో నీతనికి తోడ్పడిన వాడును వానసవంశీయుడగు నారాయణభట్టు సంస్కృత కర్ణాట ప్రాకృతపైశాచికాంధ్ర భాషలలో కవిశేఖరుడు. అష్టాదశావధాన చక్రవర్తి వాఙ్మయదురంధరుడు. రాజరాజ నరేంద్రుని యాస్థానమందు "అపారశబ్ద శాస్త్రపారగులైన వైయాకరణులును, భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులును, మృదుమధుర రసభావభాసురసనార్థవచన రచనా విశారదులైన మహాకవులును, వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్రసాగర గరీయ: ప్రతిభులైన తార్కికులును నాదిగా గలుగు విద్వజ్జనంబులుండిరి."

..... ఆది. 1-8

వేదము, తర్కము, న్యాయము, మీమాంస మున్నగు శాస్త్రాలు నేర్పుటకు విద్యాకేంద్రము లుండెను. వాటికి రాజులేకాక ధనికులు, ఉద్యోగులు, విశేషముగా భూదానములు చేసిరి. హైద్రాబాదు రాజ్యములోని వాదీస్టేషన్‌కు సమీపమందు పూర్వము నాగ వాపి అను స్థలముండెను. దానినిప్పుడు 'నాగాయి' అందురు. అచ్చటి శాసనములు కొన్నింటిని అర్షశాఖవారు ప్రకటించినారు. వాటినిబట్టి క్రీ.శ. 1100 ప్రాంతములందచ్చట ఒక గొప్ప కళాశాల యుండెననియు, అందు శైవాగమములు, తర్కన్యాయములు, వేదములు, శాస్త్రములు' మున్నగునవి బోధించుచుండిరనియు, విద్యార్థులకు, ఆచార్యులకు అందే వసతులు నిర్మించిరనియు, అధ్యాపకుల జీవనార్థమై కొంత భూమిని ప్రత్యేకించి విద్యార్థులభుక్తికై మరికొంత భూమిని ప్రత్యేకించిరనియు, అందు గ్రంథాలయముకూడ నుండెననియు, ఇట్టి యపూర్వవిశేషములు దానినుండి విశదమగును. అతి ప్రచారమువలన తక్షశిల, నాలందా విద్యాపీఠములను గురించి విద్యావంతులు తెలుసుకొన్నారు. కాని "నాగాయి" పేరెత్తినవారు లేరు. ఉత్తర హిందూస్థానములో ముసల్మానుల దాడు లంతవరకే ప్రారంభమై ప్రసిద్ధ విద్యాపీఠములును, గ్రంథాలయములును ధ్వంసింపబడెను. దక్షిణ హిందూస్థానమునకు 1723 వరకీ బాధలు లేకుండెను.

వైదికాచారములకు భిన్నముగా దక్షిణ హిందూస్థానమందు ప్రాచీనము నుండియు అనేక ద్రావిడాచారములు కనులందు నిలిచిపోయెను. ఈ విభిన్నాచారములను బట్టి ఆర్యద్రావిడ విభాగమును అంగీకరింపవలసి వచ్చును. అటులే ద్రావిడ భాషలపై సంస్కృత ప్రభావము అత్యంతముగా కలిగినను అవి భిన్న భాషలే యనవలెను. తెలుగువారిలో పెండ్లిండ్లు నాలుగు దినముల వరకు జరుగుచుండెను. ఉత్తర పెండ్లి అయిన తర్వాత "దినచతుష్టయానంతరమున" బంధువులు వెడలిపోవుచుండిరి. (ఉద్యోగ.1-2 ఈ విషయము సంస్కృతమూలమున లేదు.) మేనమరదలి పెండ్లాడు ఆచారము తెనుగువారిదే. అర్జునుడు సుభద్రను "తన మేనమరదలి ధవళాక్షి దోడ్కొని చనియె" (ఆది. 8-208) సంస్కృత భారతములో లేనివియు, తెనుగులో హెచ్చుగానుండు విషయములే భారతోదాహరణములం దంతటను గ్రహింపబడుతున్నవని యెరుగవలెను.) స్త్రీలు మట్టెలు ధరించుట తెనుగువారి యాచారమే వైదిక పద్ధతిలో లేదు. "లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకై వడి నలనల్లవచ్చి" (విరాట 2-64) అనుట యిందుకు ప్రమాణము. నన్నయ తిక్కన్నల కాలములో పురుషులుకూడ మట్టియలను కాలివ్రేళ్ళకు పెట్టుకొనుచుండిరి. నేటికిని అందందు సకృత్తుగా కొందరు పురుషులు మట్టెలను పెట్టుకొనుట కాననగును. కీచకుడు నర్తనాగారమునకు పోయినప్పుడు "మట్టియ లౌండౌంటి బిట్టు దాకగనేల నందంద మునిగాళ్ళ నప్పశించుచు" పోయెను (విరాట 2-250). వధువును పెద్దలు చూచుట, బాంధవ్యము నిశ్చయించుట, అట్టి 'నిశ్చితార్థములో' కన్యకకు "ముద్రారోహణము" చేయుట అనగా తలపై పేలాలుంచుట ఆ కాలమందలి తెలుగువారి యాచారమై యుండును.

(కుమా.7-139) పెండ్లియైన తర్వాత బంధువులు రంగులతో వసంతమాడుట నేటికిని విరివిగా జరుగు ఆచారమే. నన్నెచోడుని కాలమందును అట్టి వసంతము లాడుచుండిరి. "తనరారు క్రోళ్ళను (క్రోవిచిమ్ముడుగొట్టము) నొత్తు కుంకుమారుణాకీర్ణజలధార లమరె", "వరచందన పంకమున దిరముగ ముద్రాటలాడిరి." "ఆవనీరు" చల్లుకొనిరి. (కుమా. 9-59 మరియు, 60 మరియు 67) భటవృత్తిలోనుండు కులాలలోను అంతతక్కువ కులాలలోను విడాకులిచ్చు ఆచారముండెను. "నేడాలము చేసి నన్ను పెడయాకులబెట్టె మన:ప్రియుండు" (కుమా. 11-55) అని ఒక యుద్ధభటుని భార్య వాపోయెను.

వివాహములకు సంబంధించిన అవైదిక దాక్షిణాత్యాచారములను సోమేశ్వరదేవు డను పశ్చిమ చాళుక్యరాజు క్రీ.శ. 1130 లో తన అభిలషితార్థ చింతామణిలో సంస్కృతమందు చక్కగా వివరించెను. ఆ రాజు కర్ణాటకుడైనను అతడు తెలిపిన యాచారములు తెలుగువారిలోను ఉండినందున ఆ గ్రంథము మనచర్చకు చాల యుపయోగకారి. అతడిట్లు తెలిపినాడు: "వివాహమంటపమును తోరణములతో, పుష్పములతో నలంకరింప వలెను. వివాహవేదికపై బియ్యము "పోలు" పోయవలెను. దానిపై వధూవరుల కూర్చునబెట్టవలెను. ఇద్దరి చేతులలో జీలకర్రతో కూడిన బియ్యము నుంచవలెను. వివాహవిధానము ముగియగానే వధూవరులు పరస్పర మా జీరికాయుక్త తండులముల చల్లుకోవలెను. వివాహోత్సవములను నాలుగుదినాలు చేయవలెను. నాల్గవదినము రాత్రి వధూవరులను రథాలపై (లేక ఏనుగులపై) నుంచి ఊరేగింపు చేయవలెను. (దానిని ఇప్పుడు మెరవణి యందురు). తక్కినవన్నియు వైదికాచారములై యుండెను. (అభిలషి. ప్రకరణము 7 అధ్యాయం 13 శ్లోకము 1483 నుండి 1512 వరకు), నేటికిని తెనుగుదేశ మందలి వివాహపద్ధతులలో ఒక్కొక్క కులములో ఒక విధమగు వేదభిన్నాచారములు కానవచ్చును. ఇవన్నియు ద్రావిడాచారములే! తాళి (తాడి) బొట్టు - తాటికమ్మలు (తాటంకములు - తాటాకులు) ద్రావిడాచారములే!

వ్యాపారము బండ్లపైనను, ఎద్దుల పైనను, దున్నలపైనను చేయుచుండిరి. పశువులపై వేయు ధాన్యపు సంచులను పెరికలనిరి. వాటిని పశువుపై అడ్డముగావేసి తీసికొని పోయెడివారు (కుమా. 2-73) ఎక్కువ పశువులుండినవారు గుర్తునకై వాటిపై ముద్రలు కాల్చి గుర్తు వేయుచుండిరి. (కుమా. 4-11). జనులలో కొందరికైనా అభిచారము పై (చేతబడి) పై విశ్వాసముండెను (కుమా. 4-91). ఇంద్రజాలము (గారడి) బాగా వ్యాపించియుండెను (కుమా. 6-73). ధనాంజనము మున్నగు అంజనములను బోకిపెంచులపై మంత్రించిన కాటుకనుపూసి పలువుర చేతికిచ్చి చూపించగా అందొకరిద్దరికి కోరిన విషయములు కనబడెడివి. "కర్పరఖండంబున మంత్ర కాటుకతగన్ పాలాక్షు గూర్పింప వగ్గిరిరాజాత్మజపట్టె" (కుమా.6_96). నేటికిని మన దేశమందు కన్నుగల బోకిపెంచును తెప్పించి దానికి సిద్ధము చేసిన ఒక విధమగు కాటుకను పూసి స్థలశుద్ధిచేసి దీపధూపారాధన చేసి టెంకాయకొట్టి కొన్నిమంత్రాలు చదివి అంజనము పట్టింతురు. ఇనుమను బంగారుచేయు రసవాదము నేటిదా? బహుప్రాచీనముది. బహుశా నాగార్జును డీప్రయత్నములో ప్రాచీన ప్రసిద్ధవ్యక్తియై యుండును. నన్నెచోడుని కాలమం దీవిద్యను పలువురు సాధింపబూనిరి. (కుమా. 6-146), ఆపత్కాలములందు నమ్మినదేవునికి ముడుపులు కట్టుచుండిరి (కుమా. 8-64), భరత శాస్త్రముతో భిన్నించిన నాట్యపద్ధతి మనలోనుండెను. "దండలాసక విధమును కుండలియు బ్రెక్కణంబు

తెరంగును బేరణంబు" ఉత్తర నేర్చెనని తిక్కన మూలమందులేని వివరములు తెలిపినాడు. మరులు, మందులు నాటికిని నేటికిని కొందరుస్త్రీ లందందు పెట్టినట్లు వినుచుందుము. వీటివలన లాభము లేకపోగా నష్టము, ప్రాణహాని కలుగునని ద్రౌపది సత్యభామతో చెప్పెను (ఆర.5-296 మొ॥), నన్నెచోడుని కాలములో తప్పుచేసిన వారిని చిత్రవిచిత్రముగా హింసించుచుండిరేమో.

"వీడె ఖలుండు............వీడు సర్వవ
ధ్యుం డెడ సేయకుండు శివదూషకు నాలుకగోసి యుప్పు నింపుండు
ద్రపుద్రవంబొడల బూయుడు లోహముగాచి నోర బోయుండు
దురాత్ము చర్మపట మొల్వుడు గన్నుల మీటు డుక్కరన్"

(కుమా.2-84) 'ఉరుముపై జీడినిర్రి యచ్చొత్తివిడిచె' (కుమా.4-16)

బాలికలు చిల్క బొమ్మలును, దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరులును, మ్రానిచొప్పికలు...బొమ్మరిండ్ల జేయనగు కూళ్ళును వండుచు బొమ్మ పెండ్లి" చేసిరి (కుమా.3-36). తోలుబొమ్మలాట భారతమందు కూడ సూచితము (విరాట.3-36).

ఆనాటి జనుల వినోదాలలో పెక్కు నేటికిని ఆచారమందున్నవి. "అంకమల్ల వినోదము" కోళ్ళపందెము లావకపిట్టల కొట్లాట, మేష మహిష (తందానవంటివి), ప్రహేళిక, చతురంగము, పాములాటలు, గౌడీ, మాధ్వీ, పైష్టీసురలసేవ ఇట్టి వినోదములు ననేకములు అభిలషితార్థ చింతామణిలో వర్ణించినారు.

శిల్పములు విశేషముగా దక్షిణదేశమందే వృద్ధియయ్యె ననవచ్చును. మాయాదులు, ఆర్యేతరులు మయుని పేరుతో ప్రసిద్ధమైన వాస్తుశాస్త్రములు కలవు. రాజప్రాసాదములను గురించి అభిలషితార్థ చింతామణిలో కొంత వివరణ కలదు. ఇండ్లకు స్తంభములుండుట దక్షిణదేశ గృహనిర్మాణ విశిష్టత

కాబోలు. అంతేకాక చతుశ్శాల, త్రిశాల, ద్విశాల, ఏకశాల అను భేధాలతో నిండ్లు కట్టుచుండిరి. చతుశ్శాలతో చతుర్ద్వారములతో గూడిన యింటిని సర్వతోభద్రమనిరి. అటులే నంద్యావర్తం, వర్ధమానం, స్వస్తికం, రుచికం మున్నగు పేరులు గల యిండ్లుండెను. ఇండ్లు కట్టుటలో చేయ వలసిన విధులు ఇండ్లు పూర్తియైన తర్వాత చేయవలసిన వాస్తుపూజాదికములు విపులముగా వర్ణింపబడినవి. శ్రీరామచంద్రుడు పర్ణకుటిని నిర్మించు కొన్నప్పుడు ఒక జింకను గృహాధిదేవతకు బలియిచ్చెను. ఇప్పు డా యాచారము బ్రహ్మణేతరుల లోనే కానవచ్చును.

(అభి. ప్ర. 1. అధ్యా 3)

నేరములను, వివాదములను, విచారించుటకై పంచాయతీ సభ లేర్పాటై యుండెను. ఇది అతిప్రాచీన భారతీయ సంప్రదాయము. ఇదే నిజమైన ప్రజా ప్రభుత్వము. ప్రపంచ రాజనీతిలో పంచాయతితో సమాన మైనది మరొకటి సృష్టికాలేదు, ఇంగ్లీషు కోర్టులు వచ్చిన తర్వాతనే లా పేచీలు, ఖానూను చిక్కులు, బారీకులు, తర్కకుతర్కాలు, కూటసాక్ష్యాలు అప్రమాణాలు, అబద్ధాలు, పారమందెను. ఆ విషయాన్నే 1858 విప్లవములో బందీయైన తుది డిల్లీపాదుషాయగు బహదూరుషా ఇట్లు కవనము చెప్పెను.

    రహ్తేథె ఇన్‌ముల్క్‌మే పీరోవలీషాంషో ఖమర్
    జబ్ ఘుసీఫౌజేన సారా హర్‌వలీ జాతారహా॥

"ఈ దేశమందు మునులు, ఋసులు సూర్యచంద్రులు ప్రకాశమానులై యుండిరి. కాని ఇంగ్లీషువారి సేన లీ దేశమందు జొరబడగానే సత్పురుషు లందరును మాయమైపోయిరి.

ముందు ప్రకరణాలలో పంచాయతులను గూర్చి వివరింతును. ఇందు పశ్చిమ చాళుక్యరాజు తన రాజ్యమందలి పంచాయతీసభల దృష్టిలో నుంచుకొని తన యభిలషితార్థ చింతామణిలో వ్రాసినవి సంగ్రహముగా తెలుపుదును.

"పంచాయతీ సభలోని సభ్యులుగా నుండదగినవారు వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞులుగాను, సత్యసంధులుగాను, ధార్మికులుగాను, మిత్రామిత్రులందు సమదృష్టికలవారుగాను, ధీరులుగాను, అలోలుపులుగాను, పలుకుబడి కలవారుగాను, లౌకిక వ్యవహార కోవిదులుగాను, విప్రులుగాను నుండవలెను. అట్టివారిని రాజు నియమింపవలెను. వారు కాని, లేక వారి సహాయముతో రాజు కాని వివాదముల పరిష్కరించుచు, పంచాయతీ సభలో అట్టివారు అయిదుగురు కాని, ఏడుగురు కాని యుండవలెను. కులీనులుగా, శీలవంతులుగా, ధనికులుగా, వయోధికులుగా, ఆమత్సరులుగానుండు వైశ్యులును సభ్యులుగా నుండవచ్చును. సభాపతిగా అర్థశాస్త్ర విశారదుడు, లౌకికజ్ఞాని, ప్రాడ్వివాకుడు, ఇంగితజ్ఞుడు, ఊహాపోహ విజ్ఞాని, అయిన బ్రాహ్మణుడు నియుక్తుడు కావలెను. ఆతడే ప్రాడ్వివాకుడు (జడ్జి) అనబడును. రాజు లేని కాలమం దతడే విచారణ కర్త. విప్రుని ఆభావములో కులీనుడగు నితరు నేర్పాటుచేయవచ్చును. ఎవరినైనను సభాపతిగా చేయవచ్చును కాని ఎన్నటికిని శూద్రుని చేయరాదు!

అభియోగములు (కేసులు) రెండు విధాలు కలవి. ఋణదానము (అప్పులు), నిక్షేపములు, అస్వామిక విక్రయములు, ఉంకువలు, వాటి అపహరణములు, జీతమియ్యకపోవుట, క్రయవిక్రయ వివాదములు, స్వామిభృత్య వివాదములు, సీమావివాదములు, వాక్పారుష్యం (అవమానకరమగు తిట్లు), దండపారుష్యం, దొంగతనము, స్త్రీ సంగ్రహణము, దాయభాగము, జూదము ఇట్టి వన్నియు పంచాయతీలో విచారింపబడుచు వాది సభ్యుల యెదుట నిలబడగా - నీకేమి బాధ, నిర్బయముగా చెప్పుము - అని వారడుగుదురు. వాని అభియోగము విని ప్రత్యర్థిని (ప్రతివాదిని) పిలిపింతురు. వాడు రోగియై లేక యితరములగు ఇబ్బందులలో నుండిన సభకు రాకుండుట దూష్యముకాదు. కులీనులను, పరభార్యలను, యువతులను, ప్రసూతికలను, రజస్వలలను సభకు పిలిపించరాదు. అర్థిప్రత్యర్థి వాదములను విని సభవారు వాటిని వ్రాయింతురు. వాటికేమి సాక్ష్యములు కలవని విచారింతురు. ఈ విచారణ స్మృతిశాస్త్రాను సారముగా నుండవలెను. ఒక వేళ సాక్షులు లేకుండిన అవసరమగుచో "దివ్యము" ఇయ్యవలెను. అనగా అగ్నిపరీక్షల వంటివి చేయింతురు. హత్యచేసిన వారికి వదాదండ మిత్తురు. అంతకు తక్కువగు నేరములకు చేదదండము నిత్తురు, అనగా చెవులు, ముక్కు. వ్రేళ్ళు, కాళ్ళు, నాలుక మున్నగునవి నరికించుట, చిన్న నేరములకు క్లేశదండ మిత్తురు. అనగా బెత్తముతో కొట్టుట, కఠినముగా మందలించుట వంటివి. అర్థహరణమునకు 200 నుండి 1000 పణముల వరకు ద్రవ్యదండము నిత్తురు. ఈ విధముగా న్యాయ విచారణ జరుగును.

(అభి. 1. ప్ర. 2 అధ్యా)

కర్ణాట దేశములకు సంబంధించినదైనను పశ్చిమ చాళుక్యులను తర్వాతి కాకతీయు లనుకరించిన వారగుటచే సోమేశ్వరుడు తెలిపిన పన్నుల విధానమును బట్టి తెనుగు దేశమందును కొంత సాదృశ్యముండెనని ఊహించుకొన వచ్చును.

"పశుహిరణ్యములపై 50 వ భాగమున్నూ; ధాన్యములో 6, 8 లేక 12 వ భాగమైనను; వక్కలు, నేయి, రసగంధౌషదములు, పుష్పఫలములు, గడ్డిపాత్రలు, చర్మములు, మట్టిపాత్రలు, వీటిలో ఆరవభాగమున్నూ తీసుకొనవలెను. శ్రోత్రియ, బ్రాహ్మణులనుండి పన్ను తీసుకొనరాదు. పశువుల మేపుటకై కొంత భూమిని (గాయిరాన్) వదలవలెను."

(అభి. ప్ర. 1.ఆధ్యా 2)

దక్షిణ దేశ మందు ఆంధ్ర కర్ణాటకులలో లలితకళలకు ప్రాధాన్య ముండెను. నాట్యభంగిమములు, వాద్యవిశేషములు కొన్ని దక్షిణమందు భిన్నముగా నుందెను. "నృత్తగీతాదికములు ద్విజన్ముల ధర్మముకాదు" అని తాప్తముద్ర నిషేధ విచారమందు చెప్పిరి (అభి-పీఠిక). ప్రతిమాశిల్పములు, చిత్తరువులు శూద్రుల కళలై యుండెను. (అభి-పీఠిక). కాకతీయ కాలమందును సాధారణ జనులు కూడ ఇంటిగోడలపై చిత్తరువులు వ్రాయించుకొనిరి. అందుచేత అభిలషితార్థములో తెలుపబడిన చిత్రలేఖన విద్యావిషయమునకు చాల ప్రాముఖ్యము కలదు. అలేఖ్యకర్మ అను పేరుతో 100 పుటలవర కిందు వివరించినారు. చిత్తరువులను గురించి మన ప్రాచీన వాఙ్మయము లంతగా కానరావు. విష్ణు ధర్మోత్తర మను పురాణమందు (అది బహుశా క్రీ.శ. 800-1000 ప్రాంతములో రచింపబడెనేమో) కొంత విపులచర్చ కలదు. దానినే స్టెల్లా క్రమ్రిష్ అను రష్యాకన్యక ఇంగ్లీషులోని కనువర్తించెను. కాని దానికన్న ఎన్నియో రెట్లు ఉత్తమముగానుండు చిత్రకళాశాస్త్రము, ఈ సోమేశ్వరునిదే యనవలెను. బహుశా ఇంతకన్న మేలైన చిత్రలేఖన శాస్త్రము మనలో లేదనవచ్చును. ఈ భాగము నంతయు తెనుగులోనికి పరివర్తింపజేయుట బాగని తోచును. ఇందు చేతిచిత్రముల కవసరమగు రంగులను సిద్ధము చేసుకొనుటను మొదలు తెలిపినారు. గోడపై మంచి గట్టిగచ్చుతో చదును చేయవలెను. దున్నపోతు తోలు కత్తిరించి ముక్కలుచేసి నీళ్ళలో అవి మెత్తనగువరకు కొన్ని దినాలు నానబెట్టి దాని మడ్డిని తీసుకొని వెన్నవలె మెత్తబరచి దానిని లేపనముగా వాడుకొన వలెను. నీలగిరిలో లభించు శంఖచూర్ణమును దానిలో కలుపవలెను. సన్నని వెదురు కొనకు రాగిపొన్నువేసి దానిని వర్తికగా (బ్రష్‌గా) వాడుకొనవలెను. వివిధమగు రంగులలో శ్వేతము, రక్తము, లోహితము, గైరికం, పీతము, హరితాళము, నీలము, మున్నగునవి కలవు. వాటి నెట్లు సిద్ధము చేసుకొనవలెనో వివరముగా తెలిపినారు. వివిధ దేవతలు, మానవులు, జంతువులు, ఏయే ప్రమాణాలలో నెట్లుండవలెనో చాలా వివరముగా తెలిపినారు.

(చూడుడు. అభి. ప్ర. 3 అధ్యా 1)

నన్నెచోడుని కాలములో ఇంకేమైన లక్షణ గ్రంథాలు, చిత్తరువులకై యుండెనేమో. "చిత్తసాధనంబులుగొని పలకఘట్టించి మెరుంగిడి త్రివటించి తిట్టంబుకొలదికిం దెచ్చి ఋజ్వాగతంబున రేఖనూల్కొలిపి పత్రిక బిందు నిమ్నోన్నతాపాంగ మానోన్మానంబు లలవరచి సలక్షణంబుగా చిత్రించెదనని" అందు వర్ణించినారు (కుమా. 5-118). ఇండ్ల ఇడుపులపై చిత్రములు వ్రాయుచుండిరి (కుమా. 8-175). శ్రీనాథుడు శృంగార నైషదమున (ఆశ్వాసం 7) ఇడుపులపై ఎట్టి చిత్తరువులు వ్రాయుచుండిరో తెలిపినాడు. పాల్కురికి, గౌరనాదులున్నూ తమతమ రచనలలో ఈ విషయమును తెలిపినారు.

యుద్ధ తంత్రము

తర్వాతి కాకతీయాదుల కాలమం దుండిన యుద్ధతంత్రమే యీ కాలమందున నుండెను. సీమాంతములందుండు దుర్గములను రక్షించుటకై పాలెగాండ్లుండిరి. నిర్ణయమయిన సైన్య ముంచుకొని అవసరమైనప్పుడు రాజు సేవలో తమ సైన్యముతో సేవ చేయుటకై వారికి "జీతపు టూళ్ల" నిచ్చుచుండిరి. సంస్కృతములయందు లేని జీతపుటూళ్ళను తిక్కన పేర్కొనెను (విరాట 3-119).

నన్నెచోడుడు దేవదానవుల యుద్ధాన్ని వర్ణింప నెంచి తుదకు తనకాలపు యుద్ధ విధానమునే విపులముగా వర్ణించెను. ఏకాదశద్వాదశాశ్వాసములు రెండును దీనిచేతనే నిండిపోయినవి. ఆ యుద్ధములో నీ క్రింది విషయములు వెల్లడియగును.

కుమారస్వామిని దేవతా సైన్యమునకు అధిపతినిగా జేసి పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఆతడు ప్రస్థానభేరి వేయించెను. సైన్యమంతయు యుద్ధసన్నద్ధమయ్యెను. ఎలగోలు సైన్యమును (Advance army) ముందు పంపిరి. ధన భండారమును సైనిక వ్యయమునకు వెంటదీసుకొనిరి. గుఱ్ఱము దళముల సైన్యాగ్ర భాగమందు నడిపిరి. ధారలు (బాకాలు), చిందములు (శంఖములు) మ్రోయించిరి. ఏనుగులదళమును సైన్యమువెంట నడిపిరి. సేనానులయొక్కయు, రాజు యొక్కయు, మంత్రుల యొక్కయు, ముఖ్యుల యొక్కయు, అంత:పురములు సైన్యమువెంట కదలెను. అంత:పుర స్త్రీలను కాచుటకై కొంత సేనను ప్రత్యేకించిరి (కుమా. 11-5). (హిందూరాజుల యొక్కయు, ముస్లిం నవాబుల యొక్కయు యుద్ధయాత్రలలో అంత:పుర స్త్రీ లుండుట హిందూస్థాన చరిత్రలో సర్వసాధారణమై యుండెను.) ధ్వజంబు లెత్తిరి). దుందుభులు, వీరమద్దెలలు, తప్పెటలు, కొమ్ములు, డక్కలు మ్రోయించిరి. పెద్దల ఆశీర్వాదము లందిరి. సైన్యమునకు ముందు దిక్కునను, ప్రక్కలను, వెనుక భాగమునను సేనానులు నడిచిరి. సైనికులు కుంతములు, ఈటెలు, చురియలు, బల్లెములు, కత్తులు, అంబులు, గదలు ధరించియుండిరి. కొందరు "వీరసన్యాసులయిరి"; కొందరు ఇక మరల బ్రతికివత్తుమో లేదో అని ముందుగానే తమ ఆస్తిని దానము చేసి "సర్వస్వదానులయిరి". ఈ విధముగా సిద్ధమై అశ్వదళము, గజదళము, కాల్బలము, రథబలము అను చతురంగములతో శత్రువులపైబడి యుద్ధము చేసిరి. చీకటి పడగానే యుభయ సైన్యములు యుద్ధము చాలించెడివారు. (ఇది హిందువుల యుద్ధధర్మము. ముసల్మానులు దీనిని బాటింపక పలుమారు రాత్రివేళ హిందూసైన్యములపైబడి ఘోరవధలు చేసి యుద్ధముల గెలిచిరి.) రాత్రి విరామమందు యుద్ధభూమిలో చచ్చిన తమవారిని వెదకు వారును. గాయములకు కట్లు కట్టించుకొని మందులు తీసుకొనువారునునై యుండిరి. మరల తెల్లవారగనే యుద్ధము ప్రారంభమయ్యెను. ఉభయ బలంబులు పోరాడెను. శత్రుసంహార మయ్యెను. జయజయ ధ్వానములతో సైన్యము మరలెను.

ఇవి కుమారసంభవ మందలి యుద్ధ వర్ణనలలోని సంగ్రహ విషయములు. అభిలషితార్థ చింతామణిలో రాజుల యుద్ధ యాత్రా పద్ధ యాత్రా పద్ధతిని గురించి విపులముగా కలదు. (ప్రకరణము 1, అధ్యాయము 2. పుటలు 117 నుండి 172 వరకు) యుద్ధమునకు శరత్కాలముకాని వసంతముకాని ఉత్తమము. యుద్ధయాత్రకు ముందు నిమిత్తములను, శకునములను చూడవలెను. పంచాంగశుద్ధిని చూచి ముహూర్తమును పెట్టించవలెను. చతుర్విధోపాయములను ప్రయోగింప వలెను. సైనికులను యుద్ధమందు ప్రోత్సాహించి శత్రువులను నాశనము చేయవలెను. అని చాల విపులముగా పై గ్రంథమందు వ్రాయబడినది. చాళుక్యుల యుద్ధ పద్ధతినుండి కాకతీయాది ప్రభువుల యుద్ధ విధానమును కొంత తెలుసు కొనవచ్చును.

పశ్చిమ చాళుక్యులు యుద్ధములో గుఱ్ఱముల ప్రాముఖ్యమును గమనించి యుండిరి. సోమేశ్వరు డిట్లు వ్రాసెను. "యవనదేశ మందును కాంభోజదేశ మందును (ఆఫ్‌ఘనిస్తానము) పుట్టిన గుఱ్ఱములను యుద్ధమం దెట్లుపయోగింపవలెనో ఆ శిక్షణము పొందిన సైనికులు సాధించి యుండిన ఆ గుఱ్ఱపు బలము ఉత్తమమైనదగును. శత్రవులు సుదూరమం దుండినను ఆ దళమువారిని జయించి రాగలదు. గుఱ్ఱాలచే కీర్తి లభించును. ఎవనికి ఆశ్వికబల ముండునో వానిరాజ్యము స్థిరముగా నుండును (యస్యాశ్వా:తస్యభూస్థ్సిరా)

(అభిలషి. ప్ర 1. అ 2. పుట 99)

అ కాలమున రాజులు సంపన్నులు. ఏ విధముగా భోగము లనుభవించిరో అభిలషితార్థమునుండి గ్రహింపవచ్చును. అందలి విషయాలు నతి సంగ్రహముగా సూచింతును.

స్నానగృహము మెరిసే స్తంభాలతో, స్పటిక వేదికతోను, కాచకుట్టిమములతోను, చిత్రములతోను శోభించునదై యుండెడిది. దినము మార్చి దినము అభ్యంగ స్నానము చేయవలెను. ద్వితియా, దశమీ, ఏకాదశీ దినాలు వర్జ్యములు. గేదంగి, జాజికాయ, పున్నాగము, చంపకము, యంత్రసంపీడితమగు తిలతైలమందు కాచి శిరస్స్నానమునకు వాడవలెను. నలుగులో కోష్ఠము, తక్కోలము,ముస్తలు, మాచిపత్రి, తగరం. మాంసీ, వాయింట, మెట్టతామర దుంప వీటి గడ్డలను తీసుకొని నీడలో ఎండించి నిమ్మ, తులసి, అర్జకము, వీటి ఆకులు వాటితో కలిపి ఏలక, జాజి, సర్షపము, తిలలు, కొత్తిమిరి, తగిరిస, లవంగము, లోధ్ర, శ్రీగందము, అగరు మొదలయినవి కూడా కలిపి సిద్ధము చేయవలెను.

వారి తాంబూలము అసాదారణ మైనది. వక్కలను కర్పూరమునీటితో తడిపి శ్రీఖండమును కస్తూరిని కలిపి ఎండించి ఇంకా ఇతర ద్రవ్యాలతో శుద్ధి చేయవలెను. పిడికలతో పుటముపెట్టిన ముత్యముల భస్మమును సున్నముగా వాడవలెను. పచ్చకర్పూరమును, కస్తూరీ చూర్ణమును, ఘనసార చూర్ణమును, ఆకులలో నుంచవలెను. తక్కోలము, జాజి మున్నగునవి నూరి గోలీలుగా చేసి వాడుకొనవలెను.

ఆ కాలమందు రాజులవద్ద వస్త్రభాండారము లుండెను. వాటిపై ఒక అధికారి నియుక్తుడై యుండెను. నానా ప్రాంతములందు సిద్ధమయిన వస్త్రములను తెప్పించెడివారు. పోహలపురము, చీరపల్లి, అవంతి, నాగపట్టణము, పాండ్యదేశము, అల్లికాకరము, సింహళము, గోపాకము, సురాపురము (ఉత్తర సర్కారులలోని సురపురము అనునది.) గుంజణము, మూలస్థానము (ముల్టాన్?) తోండిదేశము (తుండీరము - మద్రాసుకు దక్షిణ ప్రాంతము), పంచపట్టణము, మహాచీనము (చైనా), కళింగము, వంగము ఈ ప్రాంతాలనుండి వస్త్రములు తెప్పించెడివారు. నానావిధమగు రంగులబట్ట లుండెడివి. మంజిష్ఠ, లక్క, కౌసుంభ (రంగుపూలు), సిందూర, హరిద్ర, నీలి మున్నగు రంగు లందు ముఖ్యమైనవి), చీరలు, ఘట్టకములు, సెల్లాలు, దుప్పట్లు, అంగీలు (అంగికా:), ఉష్ణీషములు, టోపీలు (టోపికా:, వివిధ వస్త్రములు వాడుకలో నుండెను. అంగీలు, బొందెలు అంగీలయియుండును. ఈ పదము ఆనాటికే వాడుకలోకి వచ్చెను. టోపీ అన్న పదమును ఇక్కడ మొదటిసారి వింటున్నాము. వసంత కాలమందు నూలుబట్టలు, నిదాఘమందు సన్నవి. తెల్లనిబట్టలు; వర్షాకాలమందు ఉన్నివి ధరించవలెను. రాజులు ఎల్లకాలములందు అంగీని, టోపీని ధరించి యుండవలెను.

అన్నభోగము, ఆసనభోగము, ఆస్థానభోగము మున్నగునవి అతి విపులముగా నీ గ్రంథమందు తెలిపినారు. వానినిబట్టి ఆకాలపు రాజుల వైభవాలు గ్రహించుకొనవచ్చును.

ఈ ప్రకరణమునకు ముఖ్యాధారములు

  • కుమారసంభవము - నన్నెచోడుడు.
  • తెనుగుభారతము - విరాటపర్వాంతము వరకు
  • అభిలషితార్థ చింతామణి - చాళుక్య సోమేశ్వరుడు

(మైసూరు విద్యాపీఠ ప్రచురణము మొదటి సంపుటము.)