ఆంధ్రుల సాంఘిక చరిత్ర/ద్వితీయ ముద్రణ పీఠిక
ద్వితీయ ముద్రణ పీఠిక
నే నేమాత్రమును ఊహించనిరీతిగా ఈ గ్రంథము పత్రికాధిపతుల యొక్కయు, విద్వాంసుల యొక్కయు ప్రశంసకు పాత్రమైనందులకు ధన్యుడనని అనుకొన్నాను. ముఖ్యముగా ఆంధ్రప్రభా సంపాదకులగు శ్రీ నార్ల వేంకటేశ్వరరావుగారికి నేను ఋణపడినాను. ఈ గ్రంథముతో వారి పరిచయము నాకు రెండవమా రన్నమాట! వారి కీ గ్రంథము మెచ్చువచ్చినది. ఒక సంపాదకీయమును వ్రాసిరి. "మన తాత మత్తాతలు" అన్న శీర్షికను నేను చూడగానే నా గ్రంథము జ్ఞాపకమువచ్చి ఇది నా గ్రంథ విమర్శియై యుండునా అనితటాలున అనుమానించితిని. అనుమానము నిశ్చయమే అయినది! వారిచ్చిన యా ప్రకటన మూలమున గ్రంథప్రచార మెక్కువయ్యెను. తర్వాత వారొక సూచననుచేసిరి. ఇంగ్లీషులో సాంఘిక చరిత్ర పద్ధతిగా ఒక్కొక్క విషయమును ఆమూలాగ్రముగా ముగించుచు వ్రాసిన బాగుండుననిరి. కాని యీగ్రంథమందలి మొదటి మూడు ప్రకరణాలు ఉస్మానియా విద్యాపీఠమందలి ఎఫ్.ఏ. విద్యార్థుల కొక పాఠ్యభాగముగను, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారును ఆదే భాగమును తమ ప్రవేశ పరీక్షా విద్యార్థులకును నిర్ణయించిన వారగుటచే ప్రకృతము మార్పుచేయుటకు వీలు లేక పోయినది.
ఇతర పత్రికలలో గ్రంథ విమర్శ వచ్చినదని వింటిని కాని నే నేదియు చూడలేదు. ఆంధ్రప్రభా సంపాదకులకు నాపై (అనగా నా గ్రంథముపై) కలిగిన అవ్యాజప్రేమకు నేను కృతజ్ఞతాగుణబద్ధుడ నైనాను. శ్రీ నార్లవారి అభిప్రాయమును గ్రంథాంతమందు 1 వ అనుబంధముగా ముద్రించినాను.
మిత్రులును, సంగీత సాహిత్య విద్యాపారంగతులగు, తెనుగు వచన రచనలో అగ్రశ్రేణిలోని రచయితలును నగు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, ప్రేమపూర్వకముగా (22) విషయములను చర్చించి, ఒక విపులమగు లేఖను వ్రాసినారు. అందు ఇంచుమించు అన్నింటిని సవరణలుగా ఒప్పుకొని వారికి నాకృతజ్ఞతలను తెలుపుకొని వారి లేఖను 2 వ అనుబంధముగా ముద్రించుచున్నాను.
- [1] శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గొప్ప విద్వాంసులు, పరిశోధకులు, విమర్శకులు. వారు నా కిట్లొక కార్డు వ్రాసిరి.
"మీ గ్రంథము - ఆంధ్రుల సాంఘిక చరిత్ర - చాల ముచ్చట గొల్పినది. మీరీ గ్రంథము రచించుటకు ఎల్లతెఱగులను సమర్థులు. ఆదినుండి తుదిదాకా ఒకతూరి స్థూలదృష్టితో చదివి యిది వ్రాస్తున్నాను.......చదివినంతలో మీరు ప్రామాణికులైన నత్యరతులైన పవిత్రహృదయులని గుర్తించినాను. నేను, మీరీ గ్రంథమును ఇంతకింకను నాల్గయిదు రెట్లు విషయవిశేషములతో ప్రపంచించి పునర్ముద్రణము చేయుటకు, తోడ్పడ కుతూహలపడుచున్నాను - వేటూరి ప్రభాకరశాస్త్రి, (తిరుపతి, 28-11-49)"
శ్రీ శాస్త్రిగారికి నేను వెంటనే జాబు వ్రాస్తిని కాని అది వారి కందినట్లు లేదు. వారినుండి ప్రత్యుత్తరము రాక పోవుటయే నిదర్శనము. వారి ఆశీస్సునకు నా నమోవాకములు. ఈ మూడు విమర్శలు తప్ప తక్కినవి నే నెరుగను.
ఈ తడవ ముద్రించినదానిలో కొన్ని మార్పులు చేసినాను. "తూర్పు చాళుక్య యుగము" అను నొక క్రొత్త ప్రకరణమును చేర్చినాను. మొదటి గ్రంథము వ్రాసినప్పుడు పాచికల ఆటను గురించి శ్రద్దచేయలేదు. ఈ తడవ దానిని సమగ్రముగా గ్రహించి వ్రాసినాను. మొదటి ప్రచురణ కాలమందు నాకు కొన్ని పదాలు సరిగా తెలియరాక సరిగ వ్రాయకయో, సూచించి తప్పించుకొనుటయో లేక వదలివేయుటయో జరిగెను. ఇప్పుడు వాటిని సరిగా గ్రహించి ఇందెక్కించినాను. అట్టివాటిలో బొమ్మకట్టుట, కనుమూరి, గిల్లదండ (వీటి ఖేలనము), రణముకుడుపు, పరువుల క్రోవి, ముడాసు, తలముళ్ళు మొదలయినవి చూడదగినవి. ముఖ్యపదముల అకారాదిసూచి గ్రంథాంతమం దియ్యనైనది. దానినిబట్టి పై పదములను విద్వాంసులు పరికింతురని ప్రార్థన.
మొదటి ప్రచురణ కాలములో నేను శబ్దరత్నాకరము, ఆంధ్ర వాచస్పత్యంబును చూచి అందులేని పదాలకు నాకు తోచిన లేక తెలిసిన యర్థాలను వ్రాస్తిని. ఈ తడవ సూర్యరాయాంధ్ర నిఘంటువును చూడగలిగితిని. అందు నకారాంతమువరకు పదాల కర్థాలు కలవు. తక్కినభాగ మింకను ముద్రితము కాలేదు. (బహుశ మరొక తరములో పూర్తికావచ్చును). దొరకినంతవరకు నేను నిర్ణయంచిన యర్థాలే బహుపదాల కందు లభించినవి. ఇంచుమించు పది పదాల కెక్కుడుగా అర్థము లభించినది. కొన్ని పదాలకు పక్షివిశేషము, క్రీడావిశేషమనియే వ్రాసినారు. పకారమునుండి హకారమువర కుండు పదాల యర్ద నిర్ణయము పూర్తిగా నేనే చేసినాను. ఈ తడవ రాజవాహన విజయము, గౌరన కృతులు, వేంకటనాథుని పంచతంమ్రు, కుమార సంభవము, వెలుగోటి వంశావళి మున్నగు గ్రంథాలను చూడగలిగితిని. అందుచేత మరికొన్ని విశేషములను గ్రంథమందు జేర్చగలిగినాను.
ఈ కాలములో 70 - 80 ఏండ్ల వృద్ధులకు వారి చిన్నతనమునాటి ఆచారములు తెలిసినట్టివి మనకు తెలియవు. మనకు తెలిసినంతకూడా మన సంతతికి తెలియదు. 200-300 సంవత్సరాల క్రిందటి మన పెద్దల ఆచార వ్యవహారాలు మన మెరుగక అర్థము చేసికొనజాలకున్నాము. ఈ పుస్తకములో కొన్ని విషయములు తెలియరానివని వ్రాయవలసి వచ్చెను. మన పరిషత్తుల సంచాలకులు, గ్రంథ ప్రదర్శనము, కళా ప్రదర్శనము, పురాణ వస్తుప్రదర్శనమును గావించుతున్నారు. కాని మనవారిలో పూర్వమందు ఆచార వ్యవహారములందుండిన వస్తువులను సేకరించి ప్రదర్శించుట చాల యవసరము. పుస్తకము లుంచి చదువుకొను కట్టెతోచేసిన వ్యాసపీట, తాటాకుల పుస్తకాలు, గంటములు, బొండకొయ్య, కోడెము, పొగడదండ, పూర్వపు చిత్తరువులు, నిటివంటివాటిని నిరూపించు పటాలు, పూర్వమువారి రూపాలను, దుస్తులను, వేషాలను తెలుపు పటాలు, ప్రాచీన నాణెములు, గడియారపు కుడుక, పూర్వకాలపు చెండ్లు, కవిలె కడితము, పాచికలు, కోళ్ళ చరణాయుధాలు, ముక్కరవంటి మాయమగుచున్న స్త్రీల యాభరణములు, బొందెల అంగీలు, చల్లాడములు, కుల్లాయి, కబ్బాయి, ఆయుధాలు. కవచములు, మసిబుర్రలు, గలుగుకలాలు, పూర్వ ప్రముఖుల చేతివ్రాతలు, దొంగల పరికరాలు, రంగులు, బాలబాలికల క్రీడలు, రొక్కపు జాలెలు, నడుము దట్టీలు, అసిమిసంచి, తోలుబొమ్మలయొక్కయు, యక్షగానాల యొక్కయు దృశ్యములు, గాజుకుప్పెలు, వివిధప్రాంతాలలో పూర్వము సిద్ధమగుచుండిన సుందరవస్తువులు, సంగీత పరికరములు మున్నగునవి సేకరించి ప్రదర్శించవలెను. వాటిని ఒక మ్యూజియములో నుంచవలెను. పైవాటిలో సగాని కెక్కువగా ఈ కాలమువారు చూచి యెరుగరు. పై వాటిలో అనేక విషయాలు విశేషముగా తెనుగుదేశములో పూర్వము ప్రచారమం దుండినట్టివి. పరిశోధన చేసి వాటిని సమకూర్పకుండిన ముందుకాలమువారికి మన సాంఘిక చరిత్ర లర్థము కానేరవు.
ఈగ్రంథ ముద్రణాదులను, ప్రూపులను సరిచూచి విచారించుకొన్న మిత్రులగు శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి.ఏ., ఎల్‌ఎల్.బి. గారికిని, శ్రీ పులికాల హనుమంతరావుగారికిని మరల నా మన:పూర్వక కృతజ్ఞతలను సమర్పించుకొంటున్నాను.
ఇందు సిడి పటమును ముద్రించినాము. దానిని సంపాదించి యిచ్చిన శ్రీ కే. శేషగిరిరావు (ప్రసిద్ద చిత్రకారులకు) గారికి నా కృతజ్ఞతలు.
ఇకముందు ఈ సాంఘిక చరిత్ర పూర్వాభాగమును శాలివాహనుల కాలమునుండి రాజరాజ నరేంద్రుని కాలమువరకు వ్రాయుటకు పూనుకొందును.
అక్టోబరు, 1950 | సు. ప్రతాపరెడ్డి |
- ↑ * శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగా రిటీవలనే పరమపదించిరి. వారి యీ లేఖ నాకు మొదటిదియు, తుదిదియు.