ఆంధ్రుల సాంఘిక చరిత్ర/ప్రథమ ముద్రణ పీఠిక

వికీసోర్స్ నుండి

ప్రథమ ముద్రణ పీఠిక

పూర్వకాలమందు హిందువులాధ్యాత్మ చింతాసాగరమున తల మున్కలు వేయుచు ఇహలోక విషయాలపై స్పృహ తప్పినవారై చరిత్రలు వ్రాసిపెట్టు నాచారము లేనివారై యుండిరని యూరోపుఖండ పండితులు వ్రాయుట పరిపాటియైపోయినది. తర్వాత వారి పరిశోధన మూలముననే అసంఖ్యాకములగు చరిత్రాత్మక గ్రంథాలు వెలువడెను. అనేక పుస్తకాల జాడ లీనాటివరకు పరిశోధకులకు కానరాలేదు. ముసల్మానువిజేత లనేక పుస్తకాలయములను, దేవాలయములను, విద్యాపీఠములను ధ్వంసము చేయునప్పు డందలి గ్రంథాలను కాల్చిరి. ఈ విధముగా మన చరిత్రకు అపారనష్టము కలిగెను.

పాశ్చాత్యులు నేటివరకు వ్రాసిన చరిత్రలు, రాజుల చరిత్రలు, ఎనిమిదవ హెన్రీకి ఏడ్గురు భార్యలనియు, ముప్పైయేండ్ల యుద్ధము ఆముక తిథులందు జరిగెననియు 1748, హిందూస్థాన చరిత్రలో ప్రసిద్ధి యనియు, క్యాతరీన్ రష్యా చక్రవర్తిని కింద రుపభర్తలుండిరనియు చరిత్రలో మరచిపోకుండా వ్రాయుదురు. వాటివల్ల మన కేమిలాభం? రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు, సంఘానికి నష్టము కలిగించినట్టివే. ఈ విషయము నిటీవల గుర్తించి పాశ్చాత్యులు సాంఘిక చరిత్ర కెక్కుడు ప్రాధాన్య మిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి.

రాజుల చరిత్రలు మన కంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో. మన అవ్వలు ఎట్టిసొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వు లే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనముకూడా చరిత్ర కెక్క దగినవారమే!! అలాఉద్దీన్‌ఖీల్జీ, ఔరంగజేబు ఆసఫజా చరిత్రలకంటే మన చరిత్రలు మాత్రము తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము కాన బహుశ మనమే మెరుగేమో!

సాంఘిక చరిత్ర మానవ చరిత్ర - ప్రజల చరిత్ర, అది మన సొంతకథ !! ఆది జనుల జీవనమును ప్రతి శతాబ్దమం దెట్లుండెవో తెలుపునట్టిది. అది మన తాతముత్తాతల చరిత్ర: వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాటులు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును.

ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను 200 ఏండ్లనాడే వ్రాసిరి. నాటినుండి నేటివర కెందరో ఎన్నియో పుస్తకా లీ విషయమై వ్రాసిరి. ఆ పుస్తకాలలో 500 ఏండ్లనుండి తమ పూర్వు లెట్టివారో, వారి పరిశ్రమ లెట్టివో తెలుపు పటాలు నిండుగా ముద్రించినారు. తమ దేశమును గురించియే కాక, ప్రపంచమం దితరుల చరిత్రలను గూడ వారు వ్రాసి ప్రకటించినారు. మన చెంచులను గురించి సహారా ప్రాంతపు నగ్నలను గురించి, ఆఫ్రికా కాఫిర్లను గురించి, అసాం నాగులను గురించి శాంతి మహాసాగర మందలి కొన్ని దీవులందలి మనుష్య భక్షకుల (రాక్షసుల) ను గురించి, ఉత్తరధ్రువ ప్రాంతాలలో ఆరు నెలలు చీకటి ఆరు నెలలు ఎండలో జీవించు ఎస్కిమోలను గురించి యిట్టిసహస్రాధిక విషయాలను గురించి తెలుసుకొనవలెనంటే మనకు ఇంగ్లీషు (శారద నీరదేందు) శారదయే ఉపాస్య యగును. అందలి సారస్వతమందు సర్వజ్ఞత కలదు. ఇంగ్లీషులో మానవజాతి కథ (Story Of All nations) అనేక బృహత్సంపుటములలో సచిత్రముగా ముద్రింపబడి బహుకాల మయ్యెను. దానినైనను మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా?

మన బళ్ళలో విద్యార్థులకు చదివించే చరిత్రలలో చాలా కల్మషము కలదు. పాలలో విషముష్టి పడినది : ఇంగ్లీషువారు తమ ఘనతను భారతీయుల కొంచెపుదనమును నిరూపించునట్టుగా చరిత్రలు వ్రాసిరి. ముస్లిములలో పూర్వము ఫిరష్తా అబద్ధాలతో తనచరిత్రను నింపెను. బాబరు హిందూద్వేషముతో వ్రాసెను. నేడును ఉస్మానియా విద్యాపీఠమందును చిన్న తరగతులనుండి బి.ఏ. వరకు హిందూ దూషణగల హాషిమీ అనువానిచే రచితమగు హిందూస్థాన చరిత్రను చదివిస్తున్నారు. హిందూ మతాభిమానులు ప్రపంచ మంతటను తమ పూర్వులే ఘనులని కొన్ని చరిత్రలను వ్రాసిరి. ఇవన్నియు పాక్షికము లగుటచే అనాదరణీయము లగును. ఇటీవల సరియగు భారతీయ చరిత్రను వ్రాయించుటకై జాతీయ నాయకులు సమాలోచనలుచేసి అందు గుప్తరాజుల చరిత్రను ప్రకటించిరి. ఆది యాదర్శమగు చరిత్ర గ్రంథము. 1949 సంవత్సరములో ప్రకటితమైన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి "రెడ్డిరాజ్యాల చరిత్ర" అను ఇంగ్లీషు గ్రంథము కూడ అట్టిదే.

మన దేశమందలి అటవికులగు చెంచు, ముండా, గోండు, సంతాల్, నాగులు మున్నగువారిని గూర్చి బహు గ్రంథాలు కలవు. మన దేశములోని కులములను గూర్చి థర్ స్టన్ (THURSTON"S Castes and Tribes of South India) ఏడు పెద్ద సంపుటాలు ప్రకటించెను. హైద్రాబాదు రాష్ట్ర మందలి కులాలను గూర్చి సిరాజుల్హసన్ అనునతడు పెద్ద గ్రంథాన్ని ప్రకటించెను. భారతీయ ప్రాచీన జాతుల (Tribes of Ancient India) ను గూర్చి ఒక బెంగాలీ వ్రాసెను. ఈ విధముగా కొన్ని గ్రంథాలు వెలువడెను కాని జనుల సాంఘిక చరిత్రలు ప్రత్యేకముగా ప్రకటిత మగుట అరుదు.

మన తెలుగులో సాంఘిక చరిత్రలు లేవు. వాటిని వ్రాయవలెనని పలువురు సంకల్పించినట్లున్నది. చిలుకూరు వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్రము రెండవ భాగములో వెలమ వీరుల చరిత్ర ప్రకరణాదిలో (పు 271) పుట అడుగున నిట్లు వ్రాసెను.

"ఆంధ్రుల సాంఘిక చరిత్రము ప్రత్యేకముగా విరచింపబడుచున్నది. కావున నీ విషయమై (వెలమాది జాతులవిషయమై) యిందు సవిస్తరముగా జర్చింపబడును."

ఆ చరిత్రను వ్రాయనేలేదేమో! వ్రాయ సంకల్పించియుందురు. అట్టి సిద్ధహస్తుని వ్రాత మనకు లభింపదయ్యెను. అదే విధముగా పలువురు వ్రాయ సంకల్పించినట్లున్నది. శ్రీ నేలటూరు వేంకటరమణయ్యగారి వ్యాస మింగ్లీషులో ఆంధ్ర చరిత్ర పరిశోధక సంఘ పత్రికలో క్రీ.శ. 1938 లో ముద్రితమైనది. నే నీ గ్రంథములోని నాల్గవ ప్రకరణము వ్రాయునప్పుడు దానిని చూడ దటస్థించినది. నేను నిర్ణయించుకొన్న మార్గములనే వారు సూటిగా వాటినే సూచించి నారు. అదే పద్ధతులపై శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారును తమ రెడ్డి రాజ్య చరిత్ర మందలి సాంఘిక చరిత్ర భాగమును రచించినారు. పెదపాటి ఎర్రనార్యుని మల్హణ చరిత్ర కావ్య పీఠికలో నిట్లు వ్రాసినారు.

"కృష్ణరాయ యుగమునకు పిమ్మట ఆంధ్రుల పరాక్రమ పౌరుషము లెట్లు క్షీణించినవో ఆదరాభిరుచులును అట్లే కుంటువడినవి. అందువలన ఆ యుగమున ప్రభవిల్లిన కావ్యసంతతి అత్యుత్తమమైనది కాకపోయినప్పటికిని ఆ యుగమందలి సాంఘిక జీవనమును, ప్రజాభిరుచిని ప్రతిబింబించునట్టివి. ఈ దృష్టితో మనము చూడగలిగినప్పుడు ఏకవి రచించిన కావ్యమైనను శిధిలము కాకుండ రక్షించుట మన బాధ్యత యని తేటపడును."

పలువురు మన పూర్వుల సాంఘిక జీవనమును గూర్చి ముఖ్యముగా క్రీడాభిరామాధారముపై కొన్ని వ్యాసాలు వ్రాసిరి. కాని సమగ్రమగు ఆంధ్రుల చరిత్ర ఇంతవరకు వెలువడలేదు. నేను మే నెల 1929 లో హైద్రాబాదు నుండి వెలువడుచుండిన "సుజాత" మాస పత్రికలో "తెనాలి రామకృష్ణుని కాలమందలి ఆంధ్రుల సాంఘిక జీవనము" అను వ్యాసమును కేవలము పాండురంగ మహాత్మ్యములోని వర్ణనల సమయ సందర్బములనుబట్టి విషయములను తేల్చి వ్రాసితిని. ఆ పద్ధతి నాకు సరిగా కనబడెను. ఆ జాడను బట్టుకొని అప్పుడప్పుడు కాకతీయుల కాలమందలి సాంఘిక చరిత్ర, కృష్ణరాయల కాలపు సాంఘిక చరిత్ర, కదిరీపతికాలపు సాంఘిక చరిత్ర, రెడ్డియుగపు సాంఘికచరిత్ర, ఆంధ్ర దశకుమార చరిత్రము తెలుపు తెనుగువారి సాంఘిక చరిత్ర మొదలగు వ్యాసాలను వ్రాస్తిని. తత్పర్యవసానమే యీ గ్రంథము.

ఆంధ్రులకు ప్రత్యేక చరిత్ర యేల? వారికి భారతీయ హిందువుల నుండి భిన్నించిన సంస్కృతి (Culture) కూడా కలదా? యని తెలంగాణములో ఆంధ్రసభలో 12 ఏండ్లనా డొకవాదము బయలుదేరెను. అప్పుడు (క్రీ.శ. 1937 ఈశ్వర పుష్యము) ఆంధ్ర సంస్కృతి యను వ్యాసమును ప్రకటించి యుంటిని. అందిట్లు వ్రాసితి.

"ఆంధ్రత్వ మాంధ్రభాషా చ! సాల్పస్య తపనః ఫలం॥"

అని తమిళుడగు అప్పయ్య(ర్) దీక్షితులు వ్రాసిరి. 300 ఏండ్ల క్రిందటనే తమిళ ప్రసిద్ధ పండితునికి ఆంధ్రత్వమందు భిన్నత్వము కానవచ్చెను...... సంస్కృతి యనగా నాగరికత, లలితకళలు, సారస్వతము, సభ్యత, దైనంది నాభివృద్ధి మున్నగు నుత్తమగుణము లన్నియు కలసిన విశిష్టగుణము...ఆంధ్రులకు ప్రత్యేక సంస్కృతి కలదు. ఆంధ్రుని, అరవను, బంగాళీని, పఠానును చూచిన వెంటనే వీరు వీరని వేరుపరుపవచ్చును. ఎందుకు? అది వారి వేష భాషలను బట్టియే! అందుచేత ఆ సకల భాషావాగనుశాసనులు, స్వస్థాన వేషభాషాభిమతాః స్సంతో రసప్రలుబ్ద ధియః అని సెలవిచ్చిరి. ఆంధ్రుల నుండి వారి భాష, భాషలోని నుడికారము, వారి భావములు, వారి శిల్పకళ, వారి పల్లె పాటలు (Folk Songs)s, కథలు (Folk Tales), విశ్వాసములు, వారి చరిత్ర, వారి సాంఘీకాచారములు, తీసివేసిన, రేపే వారు అడవిజాతులలో కలిసిపోగలరు. ఇతరులలోని ఉత్తమ కళలను స్వీకరించి తమవాటితో మేళవించి తమవిగా చేసుకొనుట నాగరిక లక్షణము. విజయనగర సామ్రాట్టులు, మధురా, తంజాపురీ నాయక రాజులును, హిందూ ముస్లిం శిల్పసమ్మేళనము గావించి ప్రత్యేకాంధ్ర శిల్పమును స్థాపించిరి. ఆంధ్రులు తమ భాషకు శ్రావ్యతను సమకూర్చి కర్ణాటక సంగీతమను పేరుతో ఖ్యాతిగాంచిన కళను దక్షిణాపథమున కంతటికిని ప్రసాదించిరి. మళయాళములో కథాకళి, గుజరాతులో గర్కనృత్యము, ఉత్తర హిందూస్థానములో రామలీల, కథక్ నృత్యము, అసాములో మణిపురీ నృత్యము మున్నగు విశిష్టవైవిధ్య నృత్యాలు భారతదేశ మందలి నానాప్రాంతలలో నే విధముగా వెలసెనో! ఆంధ్రు లందున కూచిపూడి భాగవతులచే పరరక్షితమైన నృత్యమునకు ప్రత్యేకత కలదు. రామప్ప గుడిలోని నృత్యశిల్పములు జాయసేనాని నృత్య రత్నాకరానికి ఉదాహరణములు.

హిందువు లందరికిని పండుగలు పబ్బములు ఒకటే యన వీలులేదు. ఔత్తరాహులకు హోలి, వసంత పంచమీలు ప్రత్యేకాభిమతములు. తమిళులకు పొంగల్ పండుగ ముఖ్యము. అటులే ఆంధ్రులకు ఉగాది, ఏరువాక పున్నమి ముఖ్యమైనవి.

భారతదేశమం దొక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమగు ఆటలు కలవు. తెనుగువారికి ఉప్పన బట్టెలాట, చిల్ల గొడె (బిల్లగోడు) ఆటలు ముఖ్యమైనవి. "ఉప్పనబట్టె లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్" అని నాచనసోముడు వ్రాసెను. పులిజూదములు, దొమ్మరి ఆటలు తెనుగువారివే. ఇవి ఆ నాడు తెలిపిన విషయాలలో కొన్ని. ఆనాటి భావములలో ఈ నా డేమియు మార్పు కలుగలేదు. పైగా ఆ భావాలు స్థిరపడినవి. హిమాలయమునుండి కన్యాకుమారి వరకుండు వివిధ భాషావర్గముల వారిని చూచుచు వెళ్ళిన, అపారమగు వైవిధ్యము అడుగడుగునకు వ్యక్తమగును. మళయాళి, అరవ, మరాటి, పంజాబీ, బంగాళీ మున్నగువారిని చూచిన ఒకరితో ఒకరు వేషభాషా విశేషములందు పోలినవారు కారు. ఆహార విహారములందును భేదము కలదు. మళయాళీలు బియ్యము, టెంకాయలు తప్ప వేరే యెరుగరు. తమిళులకు బియ్యము, పులుసు చాలా యిష్టము, మరాటీలకు రొట్టెలే కావలెను. బంగాళీలకు బియ్యము, చేపలు కావలెను. కాశ్మీరీలు మాంసములేనిది మాట వినరు. ఇట్టి బహుకారణాలచేత ఆంధ్రుల సాంఘిక చరిత్రయొక్క యావశ్యకత చాలా యవసరమని తోపక మానదు.

రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంత కష్టముకాదు. కాని, సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాఙ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు (Collections) - ఇవి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములు.

కావ్య ప్రబంధాలలో నూటికి 90 పాళ్ళు సాంఘిక చరిత్రకు పనికివచ్చునవి కావు. పురాణాలు, మధ్యకాలపు ప్రబంధాలు ఇందుకు పనికిరావు. ఎందరో మహాకవులు వసు మను చరిత్రల వంటివి వ్రాసినవారు మనకు సాయపడరు.

"కేళీ నట ద్గేహ కేకి కేకారవో! న్మేషంబు చెవుల దేనియలు చిలుక" [కవికర్ణ రసాయనము]

వంటి వర్ణనలు మనకు సహాయపడవు.

"గొంగడి ముసుగుతో గొల్లలు చట్రాతి - పైని బందారాకు బరిచికొనగ" [శుకసప్తతి]

అన్న వర్షర్తు వర్ణన మనకు చాలా పనికివచ్చును.

"తతనితంబాభోగ ధవశాంశుకములోని యంగదట్టపు కావిరంగువలన" [మనుచరిత్ర]

అంటే మనకు సరిగా అర్థమేకాదు. "చలువ దువ్వలువ కుచ్చెలయంచు ముత్తెముల్ పదనఖప్రభకు సలాము చేయ" [శుకసప్తతి]


అని యంటే అ స్త్రీ కన్నులయెదుట నిలిచి పూర్వకాలమందు మన యువతుల విలాస మిట్లుండెనని తెలుపును.

ఒక్కొక్కమారు కొన్నిపుస్తకాలు పూర్తిగా చదివిన మనకు పనికివచ్చు మాటలు రెండో, మూడో దొరుకును. అంతే?

సాంఘిక చరిత్ర దృష్టితో జూచిన బహుగ్రంథాలు వ్రాసిన కూచిమంచి తిమ్మకవి యేమియు సహాయకారి కాడు. మను వసు చరిత్రకన్న తాళ్ళపాక చిన్నన్న ద్విపద పరమయోగి విలాసము చాలా మేలుగా నుండును. ఇందొక్కలావుసమాసము కూడా కానరాదు. కవిత్వము జటిలము, ప్రౌఢము కాదు. కాని ఆతని వర్ణనలే మన చరిత్రకు చాల ముఖ్యమైనవి. జక్కన విక్రమార్క చరిత్రలో "చక్కని వైదుష్యము" ప్రదర్శించెను.

"కల్పాంత దుర్గాంత కలుషాంతక స్వాంత దుర్వారవహ్నికి నోర్వవచ్చు" అని 'ప్రళయకాలాఖీలము'గా వ్రాసెను. కాని అందు మన కేదియును పనికిరాదు. అవే కథలను కొరవి గోపరాజు 'ద్వాత్రింశత్సాలభంజికా కథలు' అను పేరుతో రచించెను. ఆ గ్రంథము మన కత్యంతముగా సహాయపడును. ఈ విధముగా ప్రబంధాలను పరిశోధన చేయవలసి యుండును. ద్వాత్రింశత్సాలభంజికలో, శుకసప్తతిలో, పండితారాధ్యములో, బసవపురాణములో, క్రీడాభిరామములో, వెంకటనాథుని పంచతంత్రములలో వాడిన చాలా పదాలు నిఘంటువులలో లేవు. అందుచేతను సాంఘిక చరిత్రను వ్రాయుటలో కష్టము కలుగును. ఈ పదాలు తెలియకుండిన నేమాయె ననుటకు వీలులేదు. కవులు సాంఘికాచారములను వర్ణించు తావులందే ప్రాంతీయ వ్యావహారిక పదాలను, అప్పటి యాచారములను తెలుపువాటిని వాడినారు. అందుచేత అవి ముఖ్యమైన వగును.

శాసనములలో పర్వాలు, దానాలు, తూకములు, భూమికొలతలు, పొలిమేరలు, ఆయములు మున్నగునవి మాత్రమే తెలియును. స్థానిక చరిత్రలో చాల భాగము కల్పితములతో, అతిశయోక్తులతో, పుక్కిటి పురాణాలతో నిండి యుండును. విదేశియాత్రికులు, వ్యాపారులు, రాయబారులు, కాకతీయ విజయ నగర కాలాలలోని ఆంధ్రులను గూర్చి కొన్ని వ్రాసిరి. అవి చాలా సహాయము చేయును. కాని అందు వ్రాసిన వ్రాత లన్నియు నిజ మని నమ్మరాదు. "విజయనగర రాజులు ఎలుకల, పిల్లుల, బల్లుల తినిరి" అని యొక్క యూరోపు యాత్రికు డానాడు వ్రాసెను. దీనిని నమ్మవచ్చునా? ఇది పూర్థిగా అబద్ధము. ఫ్రిరిస్తా వ్రాసిన చరిత్ర పలుతావులలో అబద్ధాలతో నిండినది. ;గంగా దాస ప్రతాప విలాసము' అను సంస్కృత నాటకమందు రెండవ దేవరాయలు చనిపోయిన వెంటనే అదే యదనని ఓడ్రగజపతియు, బహమనీ సుల్తానును కలిసి విజయనగరముపై బడిరనియు, అప్పుడు మల్లిఖార్జునుడు వారి నోడించి పారగొట్టెననియు వ్రాసినారు. దీని ముచ్చట ఫెరిస్తా వ్రాసిన చరిత్రలో లేనేలేదు. (Ancient India Vol. 2. by S.K. Iyengar, P.40). ఫెరిస్తాయే దేవరాయ లోడి తన బిడ్డను బహమనీ సుల్తాను కిచ్చి పెండ్లి చేసెనని వ్రాసెను. ఈ ముచ్చట దేశ విదేశి చరిత్రకారులు కాని, సమకాలికులు కాని, తర్వాతివారు కాని యెవ్వరును వ్రాయలేదు. ఏ కైఫీయత్తులో ఈ ముచ్చట కానరాదు. ఏ కవితలో కాని, చాటువులో కాని ఏ సూచనయు లేదు.

చిత్తరువులను చూచి వ్రాయుదమన్న అవి తురకలచే ధ్వంసమయ్యెను. విజయనగరమందు రాజు మొదలుగ రౌతు వరకు, రాణి మొదలుగ సాని వరకు తమ తమ యిండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయించిరని అనేక నిదర్శనాలు కలవు. చక్రవర్తుల రాణివాసము, వారికై దేశవిదేశి జనుల రూపాలు, నానావిధ జంతువులు, బహువిధములైనవి చిత్రింపబడెను. ఆ భవనము లేవి? అన్నియు విజేతలగు సుల్తానుల సైన్యాలు ఆరునెలల పోట్లతో మంట గలిపెను. శిలా శిల్పములు కూడా ముప్పాతికకు పైగా చూర్ణమయ్యెను. ఓరుగంటి బోగ మిండ్లలో కూడా చిత్రశాల లుండెను కదా? ఆ నగరము జాడలేకుండా ధ్వంసమయ్యెను.

పూర్వపు జానపద గీతములను సేకరించినవా రరుదు. తందాన కథల నాదరించినవారు లేరు. అందుచేత తాళ్ళపాకవారి కవిత్వం కొంత నాపైత్యం కొంత చేర్చి చదువు వచ్చీరానివారో లేక కథ చెప్పే జంగాలో కథ లల్లరి. నాణెములను సేకరించినవారు కానరారు. ప్రభుత్వము కొంత పనిచేసెను. కాని కొన్నిటినయినా మనము చూడగలిగినాము.

కొన్ని సంవత్సరముల క్రిందట కృష్ణరాయల కాలమునాటి సాంఘిక చరిత్ర అను వ్యాసమును సిద్ధముచేస్తిని. అదేపనిగా ఆముక్తమాల్యదను ఆయన కాలపు కవుల గ్రంథాలను పూర్తిగా చదివి అందు స్ఫురించిన యంశములను గుర్తుగా వ్రాసుకొని తర్వాత సలటోర్ అనునతడు వ్రాసిన విజయనగరరాజ్య సాంఘిక చరిత్ర అను ఇంగ్లీషు సంపుటముల రెంటిని చదివితిని. నేను గుర్తుంచుకొన్న పలువిషయములును వాటిలో నివియును సరిపోయెను. పైగా ఆ గ్రంథ కర్తకు తెనుగు రానందున నా సంగ్రహమందు కొన్ని యెక్కుగా కానవచ్చెను.

     "ఉరుసంధ్యాతప శోణ మృత్కలితమై యొప్పారు బ్రహ్మాండ మన్
      గరిడిన్ కాలపుహొంతకాడు చరమాగ స్కంధముం జేర్చు ని
      బ్బరవున్ సంగడమో యనన్ శశి డిగెం బ్రాగ్బూమి భృత్కైతవే
      తర బాహాగ్రపు సంగడం బనగ మార్తాండుండు దోచెన్ దివిన్"
                                         మనుచరిత్రము. 3-59.

అను ప్రాత:కాల వర్ణనమునుండి ఆ కాలమందు సాము గరిడీ లుండెననియు, అందు ఎర్రమట్టిని నింపిరనియు, అందు సంగోలా మున్నగు సంగడము లుండెననియు, జెట్టీ లీ విధముగా సిద్ధమగుచుండి రనియు వ్రాస్తిని. విజయనగర కాలమందు సాముకూటములు విరివిగా నుండెననియు కృష్ణదేవరాయలే ఒంటికి నూనె పట్టించి జెట్టీలతో కుస్తీ పట్టెడివాడనియు విదేశియాత్రికులు వ్రాసినదాని వలన ప్రాతఃకాల వర్ణనమునుండి తేల్చిన విషయము సరిపోయినది. ఈ విధముగా అడు గడుగునకు కవుల వర్ణనలనుండి మనకు కావలసిన విషయము తేల్చవలసి యుండును.

సాంఘిక చరిత్రకు పనికివచ్చు కావ్యాలలో ప్రాంతీయ పదములను ప్రయోగించినారు. కదిరీపతి శుకసప్తతిలోని ఇంచుమించు 100 పదాలు నిఘంటువులలోలేవు. (నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు జూడలేదు. కాన దాన్ని గురించి వ్రాయుటలేదు.) అందలి పదాలను కడప, అనంతపురము వారలను విచారించి తెలుసుకొనవలసి వచ్చెను. చంద్రశేఖర శతకములోని వ్యావహారిక పదాలు నెల్లూరువారి కర్థమగును. భాషీయదండక పదాలు కర్నూలువారి కర్థమగును. ద్వాత్రింశత్సాలభంజికా కథ లందలి పదాలు తెలంగాణమువారి కర్థమగును. క్రీడాభిరామ మందలి పదాలు కృష్ణాజిల్లావారి కర్థమగును. పాల్కురికి సోమనాథుని, నన్నెచోడుని పదాలు కొన్ని యెవరికిని అర్థము కావు. చెప్పబోయిన దేమన:- అర్ధముకాని ప్రాంతీయ ప్రాబంధిక పదాలను పట్టికగా ముద్రించి తెలిసినవారు అర్ధములను వ్రాసి పంపుటకై భారతి వంటి పత్రిక కృషిచేసిన, లేక (తెలంగాణా) ఆంధ్ర సారస్వత పరిషత్తువంటి సంస్థలు ప్రయత్నించిన కాలగర్బమందు సమాధిపొందిన యెన్నియో సుందర భావస్ఫోరకములగు పదాలకు సుధా సేచనము చేసినట్టగును. నిఘంటు నిర్మాతలు గ్రాంథిక పదాలనే సేకరించుటకై మడిగట్టుకొన్నవా రగుటచేత వారిశ్రమ పూర్ణఫలదాయి కాకపోయినది. సూర్యరాయాంధ్ర నిఘంటువు నించుమించు రెండు తరాలనుండి వ్రాస్తూవచ్చినను వారు వ్యావహారికమన్న చీదరించుకొందురని వినుటచే వారి శ్రమ తగినంత ఫలవంతము కాదనవలెను. ఏ నిఘంటువైనను సరే ఎంతవరకు వ్యావహారిక ప్రాంతీయ పదాలను సేకరించరో అంతవర కది కొరవడినదై యుండును.

మన సాంఘిక చరిత్రకు పనికివచ్చు

తెనుగు ప్రబంధాలలో ముఖ్యమైనవి

పాల్కురికి సోమనాథుని - బసవపురాణము, పండితారాధ్య చరిత్రము.

శ్రీనాథుని (వల్లభరాయని) - క్రీడాభిరామము.

శ్రీనాథుడో (కాడో!) - పల్నాటి వీరచరిత్రము.

కొరవి గోపరాజు - ద్వాత్రింశత్సాలభంజికలు.

కృష్ణదేవరాయల - ఆముక్తమాల్యద.

తాళ్ళపాక తిరువెంగనాథుని - ద్విపద పరమయోగి విలాసము.

సారంగు తమ్మయ్య - వైజయంతీ విలాసము.

గౌరన - హరిశ్చంద్ర ద్విపద.

కదిరీపతి - శుకసప్తతి.

వెంకటనాథకవి - పంచతంత్రము.

శతకములలో - వేమన, చంద్రశేఖర, కుక్కుటేశ్వర, రామలింగ, శరభాంక, వేణుగోపాల, వృషాధిప, సింహాద్రి నారసింహ, వెంకటేశ, గువ్వలచెన్న శతకాలు.

భాషీయ దండకము.

ఏనుగుల వీరాస్వామి - కాశీయాత్ర.

పాండురంగ విజయము, శ్రీ కాళహస్తి మహాత్మ్యము, శ్రీనాథుని చాటువులు, పీఠికలు కూడా కొంతవరకు సహాయపడును.

శబ్దరత్నాకర నిఘంటు నిర్మాతలగు బహుజనపల్లి శీతారామాచార్యులుం గారు కవుల తారతమ్యములను నిర్ణయించి వారిని ఆరు తరగతులుగా విభజించిరి. అందు పై కవులకు వారే స్థానమిచ్చిరనగా:-

ప్రబంధము. తరగతి.
పాల్కురికి పాండితారాధ్య చరిత్ర 5
పాల్కురికి బసవపురాణము 5
ద్వాత్రింశత్సాలభంజికలు 4
ఆముక్తమాల్యద 4
వైజయంతీ విలాసము 5
శుకసప్తతి 5

కొన్ని ప్రబంధాలు వారి కాలాన ముద్రితములు కాలేదు. అయియుండిన వాటికినీ కనిష్ఠము అయిదవ తరగతిలో సీట్ దొరకకపోయి యుండునా?

సాంఘిక చరిత్రకు పనికిరాని కవిజన రంజనము, కవికర్ణ రసాయనము, జైమినీ భారతము, రామాభ్యుదయము, విక్రమార్క చరిత్రము, విష్ణుపురాణము, మనుచరిత్రను, వసుచరిత్రను మూడవ తరగతిలో చేర్చినారు.

అమృతాంజనమును, అమృతధారను, బహునిఘంటువులను, వేదంవారిని చుట్టూ పెట్టుకొని చదువదగిన నైషధము, రాఘవ పాండవీయము, హరిశ్చంద్ర నలో పాఖ్యానములకు రెండవ మూడవస్థాన మిచ్చినారు.

నే నప్పుడప్పుడు 1929 నుండి వ్రాసిన సాంఘిక చరిత్ర వ్యాసములను జూచిన మిత్రులు ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపితమైనప్పుడు ఆంధ్రుల సాంఘిక చరిత్రను వ్రాయమని తొందర పెట్టిరి. అంతటి శ్రమకు అర్హత లేదనియు, చాలనివాడననియు అంగీకరింపక యుంటిని. కాని మా మిత్రులలో శ్రీ లోకనంది శంకరనారాయణరావు, శ్రీదేవులపల్లి రామానుజరావు, శ్రీ పులిజాల హనుమంతరావుగారలు చేసిన ప్రోద్బలము తట్టుకొనరానిదయ్యెను. తుది కొప్పుకోక తప్పదయ్యెను. అవసరమగు పరికరములు నాకు లభింపనందున నాకీ గ్రంథము తృప్తినొసగలేదు.

ఈ గ్రంథ ముద్రణమును, ప్రూపులను చూచుకొనుట మున్నగు శ్రమకులోనైన ప్రియమిత్రులగు శ్రీ దేవులపల్లి రామానుజరావు నా మనఃపూర్వకమగు కృతజ్ఞతలకు పాత్రులైనారు.