Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/సంపాదకీయభూమిక

వికీసోర్స్ నుండి

సంపాదకీయభూమిక.

భరతఖండము యొక్క విశ్వాసార్హమైనట్టియు, సవిస్తరమైనట్టియు, చరిత్ర ప్రకటింపవలయునని విజ్ఞానచంద్రికామండలి వారు దీక్షవహించియున్నారను సంగతి యందరికిని తెలిసిన విషయమే, కాని భరతఖండ చరిత్రము సంగ్రహముగ హిందూదేశ కథాసంగ్రహ మను గ్రంథమూలమునఁ బ్రకటించినంతమాత్రమున సంతుష్ఠిఁజెందక, ఈ భరతఖండమందలి యొక్కొక్కదేశ చరిత్రమును విపులముగా వ్రాయించి ప్రకటింపవలయునని మండలి వారు యత్నించుచున్నవారు. ఆంధ్రదేశ చరిత్రము, కళింగదేశ చరిత్రము, బంగాళాదేశ చరిత్రము, గుజరాతుదేశ చరిత్రము మహారాష్ట్రదేశ చరిత్రము మొదలైన ఈ ఖండాతర్గతములైన యన్నిదేశముల చరిత్రము తెలుగువారికిఁ దెలియుట యావశ్యకము. అందు ఆంధ్రులకు ఆంధ్రదేశచరిత్ర మత్యంతావశ్యకము గదా.

* * *

ఈ యాంధ్రదేశచరిత్రమాహాత్మ్యమును గుఱించి గ్రంథకర్తగారే పీఠికయందు వివరముగ వ్రాసియున్నారు. కావున నేనధికము వ్రాయ నవసరములేదు. కాని యొక్క విషయమును గుఱించి యిచ్చటఁ గొంచెము వ్రాయవలసియున్నది. ఆంధ్రులు మిక్కిలి పురాతన కాలమున వైభవము లనుభవించిరి. అయినఁ జరిత్రజ్ఞానములేనివారు కొందఱు మొదటనుండియు నాంధ్రులు వైభవ శూన్యులేయని భ్రమపడి, మహారాష్ట్రులతోఁ దమకు సంబంధము గలుపుకొనినయెడల తమ గౌరవము హెచ్చఁగలదని తలచి, మహారాష్ట్రులలోనుండి యాంధ్రులు పుట్టిరని యొక సిద్ధాంతముగల్పింపఁ జొచ్చిరి! కాని యితరులపేరు చెప్పుకొని బ్రతుకునంత హీనస్థితి మన కక్కరలేదనియు, మహారాష్ట్రుల నుండి యాంధ్రులు పుట్టుటకు మాఱుగా, ఆంధ్రులనుండియే మహారాష్ట్రులు పుట్టినఁ బుట్టియుండవచ్చుననియు, పూర్వమొకప్పుడు రాజ్యవిస్తారమునందును, ఉన్నతనాగరికతయందును, బుద్ధివైభవమందును, ఆంధ్రులు హిందూదేశమందలి యన్య రాష్ట్రములవారికిఁ దీసిపోయినవారు కారనియు, ఈ చరిత్రవలన స్పష్టపడఁగలదు. చంద్రగుప్తుని కాలమందు హిందూ దేశమునందెచ్చట, మగధ రాజ్యముదప్ప ఆంధ్ర రాజ్యమును మించిన ప్రభుత్వము మఱియొకటిలేదు. తరువాత నాంధ్రులుత్తరమున మగధ రాజ్యము, పశ్చిమమున మహారాష్ట్రము వఱకును, దిగ్విజయము చేసిరి. ఈ రాజులే పురాణములలోను, శిలాశాసనములలోను ఆంధ్రులనియు, శాతవాహను లనియు, శాలివాహను లనియు విఖ్యాతిఁ జెందియున్నవారు. శాలివాహన రాజులు ఆంధ్రదేశము నుండి మహారాష్ట్ర దేశమునకు వెళ్లినవారేకాని, మహారాష్ట్రదేశమునుండి యాంధ్రదేశమునకు వచ్చినవారు కారు. ఇది మహారాష్ట్రులును, విద్వద్వర్యులను అగు డాక్టరు భాందార్‌కర్ గారు ఒప్పుకొన్న విషయమే.


ఇఁకముందు మాచేఁ బ్రకటింపబడు గ్రంథమలులో గ్రంథకర్తయొక్క పటముండవలయునని మండలి వారు తీర్మానించియున్నారు. పూర్వపు గ్రంథకర్తల పటములుగాని చరిత్రలు గాని దొరకనందున నిప్పటి చరిత్రకారులకుఁ గలుగు మనస్తాపమును మనము చూచుచునే యున్నాము. ఇప్పటివారి పటములనైనను మనము సంగ్రహించియుంచక పోవుట భవిష్యత్కాలపువారి విషయమై మనము చేయు నన్యాయముకదా అని తలఁచి యిప్పటినుండియు గ్రంథకర్తల పటములు ప్రకటింప నిశ్చయించినారము.

సంపాదకుఁడు.