ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/అవతారిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అవతారిక.

దేశచరిత్రము వలని ప్రయోజనము

దేశముయొక్క పురోభివృద్ధికిఁ బ్రబలశత్రువై, జనసామాన్యము నావహించియుండిన దురభిమాన పిశాచమునుబోఁ ద్రోలి ప్రజలను నీతివర్ధిష్ణువులనుగాను విజ్నానవంతులనుగాను జేసి భావికాల పరంపార్భివృద్ధిభవనమునకు మూలబంధమైయొప్పునది దేశచరిత్రమైనను దేశచరిత్రముయొక్క ప్రయోజన మెఱుంగని వారగుటచేత, మనపూర్వులు మనకొఱకు దేశచరిత్రమును వ్రాసి పెట్టియుండలేదు. దేశచరిత్రము లేక పోవుట మననాగరికతను మన భాషకును నొకగొప్పకొఱంతగా నున్నది. ఆంగ్లేయభాషావిశారదులై బహుదేశచరిత్రములను బఠించియు, దేశచరిత్రములయొక్క ప్రయోజనమెఱింగియు, మనయాంధ్ర దేశచరిత్రమునుగూడ వ్రాసి తమయాంధ్రసోదరుల కొసంగవలయునన్న తలంపింతవఱకు మనవారికి బుట్టియుండలేదు. సర్వకలాశాలా పరీక్షలం గృతార్థులయిన మనయాంధ్ర విద్యార్థులకు గ్రీసు, రోము, ఇంగ్లాండు, అమెరికా మొదలగు దేశముల చరిత్రము దెలిసినట్లుగా మన హిందూదేశచరిత్రము తెలియదు. అందును నాంధ్రదేశ చరిత్రము బొత్తిగ నెఱుంగరు. ఇది మనభావిపురోభివృద్ధికి గొప్పయాటంకము. సామాన్యజనులకు చరిత్రమున జ్ఞానమెలేదు. వారి గురువులు వారికేమి చెప్పిన నదియె వారికి చరిత్రమగుచున్నది. అందువలన ననేకా నర్థములు మూడుచున్నవి. దేశచరిత్రజ్ఞానము లేక పోవుటచేత విమర్శజ్ఞానము నశించిపోయి స్వప్రయోజనపరులై యెవ్వరే యసత్యమును బోధించినను గుణదోష పరిశీలనము చేయుశక్తిలేక తమ చెవిసోకిన దానినెల్ల నంధప్రాయముగా విశ్వసించి మూఢవిశ్వాసములలో మునింగి స్వతంత్రజ్నానములే యెవ్వరెట్లీడ్చిన నట్లు పోవుచుండిరి. దేశచరిత్రములున్న విమర్శ జ్ఞానము లభించును. దేశచరిత్రము సమగ్రముగా బఠింపని యేజాతియు నభివృద్ధిఁ బొందనేరదు. ఆంగ్లేయభాషా వాజ్మయమున స్వదేశచరిత్రములు మాత్రమేగాక యన్యదేశచరిత్రములను గూడ స్వభాషలో వ్రాసిపెట్టికొని యుండుటచే ఇంగ్లీషువారు నేఁటికాలమున బ్రపంచములో నాగరికాగ్రగణ్యులై యిప్పటియున్నతస్థితికి వచ్చియున్నవారు కావున దేశయుయొక్క పురోభివృద్ధికి దేశచరిత్ర మత్యావశ్యకమై యున్నది.

భరతఖండములోని యేదేశ చరిత్రమయినను వ్రాయుట సులభసాధ్యమగునుగాని యాంధ్రదేశముయొక్క పూర్వ చరిత్రమును వ్రాయుట బహుకష్టసాధ్యము. బహుకష్టసాధ్యంబగుటంజేసియె నట్టి పరీక్షాసిద్ధులయిన యాంగ్లేయ భాషాపండితులెవ్వరును దీని పొంతకు వచ్చినవారుకారు.

ఈ దేశచరిత్రము వ్రాయుటకుంగల సాధనము లత్యల్పములు; అనియు బహుగ్రంథపరిశోధనముఁ జేసినంగాని సులభసాధ్యములుగావు; వ్యయ ప్రయాసంబు లధికంబులు; మేధస్సునకుం గలిగెడుబాధ మెండు. ఇయ్యది కష్టముల కభ్యాసపడినవాఁడును, నిరంతర పరిశ్రమకోర్చువాడును జేయగలిగినపనికాని యెంతటిపండితుఁడయిన నన్యునకు సాధ్యము గాదు. దీని నంతయు నెఱింగినవాడనైనను, ఏ యేమంచి పనులం జేసి మనపూర్వులు లాభమును సౌఖ్యమును బ్రఖ్యాతిని గాంచ గలిగిరో, ఏయేకాని పనులం జేసి నష్టమును గష్టమును నపఖ్యాతి ననుభవించిరో యుద్ధములోని నిజస్వరూపమునుబోలె దెలిసికొనునట్లుగజేసి పురోభివృద్ధికై సంస్కరణమార్గములను జూసి సంరక్షించునని దేశచరిత్రంబు లని మనంబున దృఢవిశ్వాసమునుబూని యున్నవాడగుటచేత నాశక్తిసామర్ధ్యముల నాలోచింపకయె నేనీగ్రంథరచనకుం బూనుకొంటిని.

యథార్ధచరిత్రమునకు బ్రతిబంధకములు.

ఇట్లు చరిత్రరచనకుం బూనుకొని ముందుగ మనప్రాచీనగ్రంథపరిశోధనకుం గడంగిన యథార్ధచరిత్రమునకు ప్రతిబంధకము లనేకములు గన్పట్టినవి. ప్రాచీనమైనదానియందు జనసామాన్యమునకు గౌరవబుద్ధి యత్యధికముగా నుండుటచేత తమతమ మతములును తమతమ కులములును మిక్కిలి ప్రాచీనములయినవగుటచే ఘనమైనవనియు లోకమునకు వ్యక్తీకరింపనెంచి మతాభిమానులును, కులాభిమానులును, తమకుం గల గాఢాభిమానముచే దమదేశమును తమభాషలును మిక్కిలి పురాతనమైన వగుటచే ఘనమైనవనియు లోకమునకు వ్యక్తీకరింపనెంచి దేశాభిమానులును, దేశముయొక్క యథార్ధచరిత్రమును దెలిసికొనుటకు నైతిగాకుండ బ్రాచీనగ్రంధములలో గ్రొత్తగ నవీన విషయములను జేర్చియు నూత్నగ్రంధములను, నూత్నకథల్ను గల్పించియు జిక్కులను బెక్కింటినుత్పాదించిరి. క్షేత్రమహాత్మ్యములను, నదీమహాత్మ్యములను, స్థలపురాణములను బుట్టించిరి. కల్పితకథల నెన్నో యల్లిరి. వేయునేల? క్రొత్తయుపనిషత్తులనే వినిర్మించిరి. యథార్థములగు చరిత్రములు లేకపోవుటచేత సత్యమునుండి యసత్యమును విడదీయుటలో గష్టమెక్కుడగుచున్నది. ప్రక్షిప్తభాగమును గ్రంథములందుంజేర్చి యుండుటచేతనే గ్రంథమునందే పరస్పరవిరోధము లుండుటయు దటస్థమగుచున్నది. కాలనిర్ణయమునకు మన గ్రంథాదులు కలిగించు చిక్కులిన్నియన్నియని చెప్పనలవికాదు. విమర్శజ్ఞానము నశించుటచేత గాలవిషయమున మనవారు చర్చింపనే చర్చింపరు. కలియుగారంభమున భారతమును నన్నయభట్టు చెప్పినాడనిన మనవారు విశ్వసించిరి.

దేశచరిత్రమంతయు నిట్లవిద్యాతమంచబుచే జుట్తుకొనబడి యుండుటంజేసి చరిత్రరచనముం జేయవలయునని సంకల్పముద యించినను బహుసంవత్సరములకు గాని నా సంకల్పము నెరవేరునట్టి భాగ్యము పట్టినది కాదు.

బ్రిటీష్పరిపాలనమునకు గృతజ్ఞత.

దేశచరిత్రము యొక్క సత్యమును గూర్చి మన గ్రంథము లెంతయయోమయంబులుగా నున్నను యథార్థ చరిత్రమును దెలిసికొనుటకు వలయు సాధనములను మనపూర్వపు రాజులు మనకొరకు విడిచిపెట్టిపోక యుండలేదు. తమ కాలమును, తమ ధర్మకార్యములను, తమ మతాభిమానములను, తమ ప్రతాపములను తమ దిగ్విజయములను దెలుపునట్టి శానములను వ్రాయించి రాళ్లపైన లోహములపైన నెక్కించి పెట్టియుండిరిగాని, కాలవశంబున నవియన్నియు శిధిలములైపోయియు, మంటిదిబ్బలలో బూడ్చుకొనిపోయియు, చూచువారు లేక పడియుండంగా, దైవానుగ్రహమువలన నిటీవల బ్రిటీష్పరిపాలనము మనకు లభించి మనదేశము యొక్క పురాతనచరిత్రమును దెలిసికొనుటకై మనయుపయోగార్థము దొరతనమువారు వానినన్నిటిని వ్యయప్రయాసములకోర్చి పెల్లగించిపెట్టినను మనవారు వానియుపయోగమును దెలిసికొని సత్యాన్వేషణము చేయజాలక పోయినను చరిత్రరచనయందు నిపుణులగు పాశ్చాత్యపండితులు మాత్రము వానిని బరిశోధించి మనగ్రంథము లెంత తికమకలుగా నున్నను నోపికతో విమర్శించి సులభముగా బ్రసవింపలేక ప్రసవవేదన ననుభవించు చుండిన గర్భవతి గర్భమునుండి బిడ్డను బైకిదీయునట్లుగా దమబుద్ధివిశేషముచే నొక్కొక్క సత్యమునే బయలునకు దీసి ప్రకటించుచు జ్ఞానతేజస్సును బఱపు చుండుటచేత దేశచరిత్రము నావరించుకొనియుండిన యవిద్యాతనుంబంతయు గ్రమక్రమముగా దొలగి పోవుచున్నది. కావున దొరతనమువారికిని, సత్యాన్వేషణపరులయిన పాశ్చాత్య పండితులకును ఆంధ్రులమైన మనము ముఖ్యముగా గృతజ్ఞత దెలుపవలసి యున్నది. మన ప్రాచీనాంధ్రుల యొక్క యౌన్నత్యము బయలుపడుటకు ముఖ్యముగా వీరు చేసిన నిరంతరకృషియే కారణము. ఈ పాశ్చాత్యపండితులు చరిత్రములు వ్రాయుటలో మన గ్రంథములలోని లోపములను గనిపెట్టి గ్రమక్రమముగా వానిని ("lying gabble") అబద్ధపుకూతలని నిరసించివైచి (1) శాసనములను (2) పురాతనపు గట్టడములను (3) మనదేశమును గూర్చి యన్యదేశస్థులు వాసియుంచినవ్రాతలను (4) ప్రసంగాంతరముగల మన గ్రంథవిషయములను (5) దీనికి సంబంధించి యున్నంతవరకు లోకులచే జెప్పుకొనబడు కథలను నా ధారముగా గొని యొకవిధముగా దేశచరిత్రమున కనుకూలములగు విషయములను వ్రాసిరి. వీనినన్నిటిని దొరతనము వారును పాశ్చాత్యపండిత సంఘముల వారును బ్రకటించి యుండిరి. ఈ గ్రంథములన్నిటిని సేకరించి దొరతనమువారు తమచే స్థాపింపబడిన పుస్తక భాండాగారములయందు బెట్టియున్నారు. అట్టివి రెండు పుస్తక భాండాగారములు చెన్నపురియందు బ్రజల యుపయోగార్థము స్థాపింపబడి యున్నవి. అందొకటి క్యాన్నిమరా లైబ్రరీ యనుపేరను (Cannemera Library) మరియొకటి ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమను పేరను (Oriental Manuscript Library) బరగుచు జెన్నపురి వివిధవస్తు ప్రదర్శనశాలా భవనమున (Museum) నెలకొల్పబడియున్నవి. పురాతన చరిత్రములను మరియే గ్రంథములనైన వ్రాయబడిన పుస్తకభాండాగారములు మిక్కిలి యుపయోగకరములుగా యుండకమానవు. పాశ్చాత్యపండితు లవలంబించిన మార్గము సరియైనదైనను, సత్యాన్వేషణపరులై మిక్కిలి నైపుణ్యముతోడను గూడ బనిచేసియున్నను వారు విదేశస్థులగుటవలన గొన్ని విషయములు మనకు దెలిసినంత చక్కగా వారికి తెలియరావు. గావున వారును గొన్ని తావుల బ్రమాదముల పాలగుచు వచ్చిరి. కాబట్టి వారును వ్రాసినదంతయును సత్యమైన చారిత్రము కాజాలదు. కాని వారుచూపినత్రోవనే మనంమునుబోయి వారు దూషించినంత "అబద్ధపుకూత" లనుగా మనగ్రంథములను ద్రోసివేయక యెంతవరకు దేశచరిత్రములకు దోడ్పడగలవో యంతవరకే గ్రహించి మనము విశేష పరిశ్రమజేసి దేశచరిత్రములను వ్రాయుటకు మొదలుపెట్టినచో గొంతవరకు జరి త్రముంగూర్చి సద్గ్రంథములు పుట్టగలవని నాదృఢమైన విశ్వాసము.

విజ్ఞానచంద్రికా మండలికి గృతజ్ఞత.

అట్టి ధృఢమైనవిశ్వాసముతో నేనీ గ్రంథరచనకుం బూనుకొని పాటుపడుచుంటినిగాని యిది బహువ్యయ ప్రయాసములతో గూడిన దగుటంజేసి యితరుల సాహయ్యమపేక్షించినగాని యిది నెరవేరదని కొందరి మిత్రులతో బ్రస్తావించగా నొక మిత్రుడు దీని హక్కును దనకిచ్చి వేసినయెడల దనకుందోచిన ప్రతిఫలమిచ్చెద ననియెను. దేశభాషాభివృద్ధికై యేర్పడిన యొక సంఘములోని యొక మిత్రుడు గ్రంథము వ్రాసి తెచ్చిన యెడల దరువాత మాట్లాడవచ్చునని చెప్పెను. ఇంకొక మిత్రుడు గ్రంథము వ్రాసియిచ్చిన యెడల దాముప్రకటించి గ్రంథ విక్రయమువలన వచ్చిన సొమ్మలో దమకయిన ముద్రాభృతి మొదలగు వ్యయమును మొదటదీసివేసి యేమైన మిగిలినయెడల జెరిసగము పాలుగొందమని చెప్పిరి. ఈ గ్రంథరచనయందలి కష్టము వారెరింగి యుండకపోవుటచేతను, మనభాషా గ్రంథములయందు మనవారికుండు నలక్ష్యస్వభావము చేతను నా మిత్రు లట్లు చెప్పిరిగాని వారికి నాయెడంగల దుర్భావము చేత గాదని నేనెరుంగుదును. అయినను దమకుదామ తోడ్పడు వారికి దైవమును దోడ్పడునని స్మైల్స్ అను గ్రంథకర్తచెప్పిన వాక్యమును స్మరణకు దెచ్చుకొని నిరుత్సాహుడును గాక యొరులవలన సాహాయ్యమపేక్షింపరాదని దృఢమనస్కుడనై యొక్కొక్క రాజవంశమును గైకొని చిన్న చిన్న భాగములుగా జరిత్రమంతయు బ్రకటింప నిశ్చయించుకొని యన్ని పనులను మానుకొని చెన్నపురికి వచ్చి యేకదీక్షతో బనిచేయ నారంభించితిని. ఇదివరకే చరిత్ర గ్రంథములను ప్రకృతి శాస్త్రగ్రంథముల నాంధ్రభాషలో బ్రకటించి యాంధ్రదేశమునం దంతట విజ్ఞానమును బ్రసరింపజేసి దేశమునకును భాషకును మహోపకారమును జేసి ఖ్యాతిగాంచుచుండిన విజ్ఞానచంద్రికా మండలి వారు ఈ కాలముననే తమ కార్యాలయమును చెన్నపట్టణమునకు మార్చుట సంభవించెను. అందలి సభాసదులు కొందరు నా యుద్యమమును నా దీక్షను గాంచి సంతసించి తా మీ గ్రంథస్వాతంత్ర్యము నపేక్షిపంకయె తమ గ్రంథమాలలో నొకపుష్పముగా నంగీకరింతు మని చెప్పి ప్రోత్సాహము కలుగ జేసిరి. అందువలన గ్రంథమచ్చు పడినతోడనే 2000 ప్రతులమ్ముడు పోవునన్న ధైర్యము గలిగెను గాని యంతమాత్రముచేత నాకష్టములన్నియు నివారింపబడునవి కావు. గ్రంథమువలన వచ్చెడు నాదాయము ముద్రాభృతికిని చెన్నపురిలోనాకగు వ్యయమునకును సరిపోవునుగాని యంతకన్న విశేషలాభమేమియు గానుపింపక పోవుటటుండ ముందు వహింపవలసిన ధనభార మధికమయ్యెను. లాభముండినను లేక పోయినను మొదలుపెట్టినపని విడనాడుట కిష్టము లేక పని చేయుచుంటిని. విజ్ఞానచంద్రికామండలివారు నాకీగ్రంథము నుచితముగా ముద్రింపించి యిచ్చుటకు నౌదార్యము గలవారైనను వారిగ్రంథములపై వచ్చు నాదాయమంతయు వారిగ్రంథముల ముద్రాభృతికే సరిపోవుచున్నందున నంతకన్న నెక్కువ సాహాయ్యమును జేయజాల కుండిరి. కానిమండలివారే యొకా నొక విద్యాప్రియుడగు శ్రీమంతునకు జెప్పి ముద్రాభృతియు నాకు నిప్పించిరి. చరిత్రాసక్తియు నౌదార్యమును గల యీ శ్రీమంతుడు నా ప్రయాసమును స్వయముగా వీక్షించు చుండిన మండలిసభాసదుడగు లక్షణరావు పంతులుగారిచే నా చేయుచున్న పనినంతయు విని దయార్ద్రహృదయుడై నాగ్రంథము యొక్క యీ ప్రథమ భాగమున కగు ముద్రాభృతి నంతయు దాము వహింతుమని తెలియజేయుటయె గాక వాగ్దత్తము ప్రకారము నెరవేర్చి నాకష్టముల నన్నిటిని తుదముట్టించి నాకు మహోపకారము చేసిరి. నిష్కామకర్మమును గుప్తదానమును చేయుటయే శ్రేష్ఠమని తలచి తమనామమును సయితము నుదహరింపవలదని యీ యుదారపురుషుడు కోరినందున, ఈ గ్రంథము తన్నామాంకితము చేసి నాకృతజ్ఞతను జూపలేకపోతిని గదా యని చింతించుచున్నాడను. రాజభక్తియు, దేశభక్తియు గలిగి వరలుచుండిన యీ శ్రీమంతుని చేతిలో నాంధ్రభాషామతల్లి యింకను వర్ధిల్లవలెనని కోరుచు వారికి నాయురారోగ్యైశ్యర్వములనిచ్చి చిరకాలము బ్రోచుగాతమని భగవంతుడని బ్రార్థించుచు వట్టిమాటలచేతనే నా కృతజ్ఞతని దెలుపుచున్నాను.

ఇట్లు విజ్ఞానచంద్రికామండలి వారి సాహాయ్యముచేతను, ప్రోత్సాహముచేతను సఫలీకృతమనోరథుండనైతిని గావున నేనెప్పుడును వారికి గృతజ్ఞడునై యుండవలసివాడనగుచున్నాడను.

కృతజ్ఞతావందనములు

నానదుద్యమును నా కష్టముల నొకనొకా మిత్రునిచే విని శ్రీ పిఠాపుర సంస్థానాధీశ్వరులయిన మ.రా.రా.శ్రీ శ్రీరాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహదరు జమిందారుగారు నా గ్రంథముయొక్క ముద్రాభృతికై నూరురూపా యలు పారితోషికముగ నొసంగి తమకుంగల భాషాభిమానముంజూపినందుకు వారికెంతయు నా కృతజ్ఞతానందనముల నిందుమూలమున దెలుపుకొనుచున్నాను. మరియును శ్రీరాజాగారి ప్రయివేటు సెక్రటరీగారగు బ్రహ్మశ్రీ మొక్కపాటి సుబ్బరాయుడు పంతులు బి.ఏ. గారు చూపిన యభిమానమునకుగూడ నా కృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాడను.

మరియును దేశభాషాభిమానులయిన మిత్రులనేకులు తోడ్పడి నాకు విశేషధనసహాయమును జేసిరి. అందుముఖ్యముగా తెలుగు జనానాపత్రికాధిపతులు గుంటూరు కాలేజీలో ప్రథమసహాయోపోధ్యాయులునునైన నా చిరకాలమిత్రులగు బ్రహ్మశ్రీ రాయసము వేంకటశివుడు పంతులు బి.ఏ.ఎల్.టి. గారు నాకష్టసుఖముల మొదటినుండియు నెరింగినవారుగావున సర్వవిధములచేతను నాకు ప్రోత్సాహమును కలిగించుచువచ్చుటయేగాక నే నెన్నడును మరువంగూడని సాహాయ్యమును జేసిరని చెప్పిన జాలును. వీరును గుంటూరువాసులును హైకోర్టువకీలు నగు బ్రహ్మశ్రీ కొండా వేంకటప్పయ్యపంతులు బి.ఏ.బి.ఎల్ గారును. ప్లీడరు బ్రహ్మశ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారును గలిసి చెన్నపురిలో నా కగువ్యయమునకుగా నూటయేబది రూపాయలొసంగి సాహాయ్యము చేసినందుకు నా కృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాను.

అందరికంటెను ముఖ్యముగా గంటికి రెప్పవలెదగ్గిర నుండి నిరుత్సాహపడుచుండినప్పుడు ధైర్యమునుచెప్పుచు సర్వవిధములదోడ్పడి మరువంగూడని సాహాయ్యమొనర్చి నాచే నీకార్యము నిర్వహింపజేసిన బ్రహ్మశ్రీ కొమర్రాజు వేంకట లక్ష్మణరావు పంతులు. ఎమ్.ఏ గారికిని, మరియు నీ కార్యమునందు బ్రోత్సాహమును గలిగించుటయెగాక నేను నా కుటుంబముతో జెన్నపట్టణమున నున్న కాలమున నవసరమువచ్చినప్పుడెల్లను మాగృహమునకు వచ్చి మందులు మ్రాకులు ఇచ్చి యాదరముతో జూచిన విజ్ఞానచంద్రికామండలి మేనేజరు మ.రా.రా.శ్రీ ఆచంట లక్ష్మీపతి.బి.ఏ.ఎమ్.బి.సి.ఎమ్ గారికిని, మరియును విజ్ఞానచంద్రికామండలికి గార్యదర్శిగానుండి సుహృద్భావముతో నాయుద్యమము నామోదించి ప్రోత్సాహము కలుగజేసిన బ్రహ్మశ్రీ రావిచెట్టు రంగరావుపంతులుగారికిని, నాకృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాను. దేశభాషాభిమానులయిన యిట్టిమిత్రవర్గముయొక్క తోడ్పాటుతో నొక సంవత్సరకాలమహోరాత్రములు కృషిచేసి యేదో యొక్క విధముగా నాంధ్రదేశచరిత్రముయొక్క యీ ప్రథమభాగమును రచించి ప్రకటింప గలిగితిని.

గ్రంథనామము

ఆంధ్రదేశ కథాసంగ్రహమని మొట్టమొదట నామకరణము జేసితిని, గాని యందువలన నాంధ్రదేశమునకు వెలుపల నుండిన యాంధ్రలుయొక్క చరిత్రము విడిచిపెట్టవలసివచ్చినందున నదియుక్తముగాదోపక గ్రంథములోపలి పత్రములలో ఆంధ్రదేశ కథాసంగ్రహమని ముద్రింపబడినను ఆంధ్రులచరిత్రమనుటయె సముచితముగా నుండునని తరువాత దలంచుటచేత నట్లనే గ్రంథము మొదట బేర్కొనబడియెను గావున జదువరు లీ ద్వినామకరణమునకు నాక్షేపింపకుందు రనినమ్ముచున్నాడను.

చరిత్ర విభాగములు.

ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము, చాళుక్యచోడవంశము, కళింగగాంగవంశము, ఆంధ్రచోడవంశము, బాణవంశము, వైదుంబవంశము, హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము, కళింగగాంగవంశము, విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి.

మధ్యయుగమునందు కాకతీయగణపతివంశము, ఆంధ్రకలికాలచోడవంశము (మనుమసిద్ధిరాజువంశము), కోటవంశము, రెడ్లవంశములు, యాదవవంశము, సాళువవంశము, మొదలగురాజవంశములచరిత్రములు చేర్పబడును. ఇందలి కాకతీయగణపతులచరిత్రను, మనుమసిద్ధి రాజవంశమును పూర్వయుగమునందు బ్రారంభింపబడవలసినవైనను మధ్యయుగమునందుగూడ వారి వంశములుండుటచేతను, వారలచరిత్రమువిపులముగ వ్రాయవలసియుండుటచేతను వానిని మధ్యయుగమునందు జేర్చితిని. మూడవయుగమయిన నవీనయుగమునందు నరపతులయొక్కయు, నశ్వపతులయొక్కయు, ద్రావిడదేశమును బాలించిన తెలుగునాయకులయొక్కయు, ఇప్పటి జమీందారులపూర్వులయొక్కయు జరిత్రములు మొదలగునవి యుండును. ఈ కడపటి రెండు యుగముల చరిత్రములును వీలుననుసరించి యేర్పాటుచేసికొనబడును గావున నివియె స్థిరములయిన విభాగములుగా జదువరులు తలంపరాదు.

చరిత్ర సాధనములు

ఈ యాంధ్రదేశ చరిత్రమును వ్రాయుటలో నాకు సాధనభూతంబులగు గ్రంథములయొక్కయు, తద్గ్రంథకర్తలయొక్కయు నామములను ముఖ్యావశ్యకములయిన స్థానములం దెల్లను బేర్కొనియుంటిని. ఆ గ్రంథములనన్నిటిని ఆ గ్రంథకర్తల నందరిని మరల బేర్కొనుట యనావశ్యకమయినను నాకెక్కువ సహాయమును గలుగజేసిన వారినామములను వారి గ్రంథములను మాత్రము నిటబేర్కొనుచున్నాడను. హల్‌ట్‌జ్(Hultzsch), ఫర్యూసన్(Fergusson), బర్గెస్(Burgess) జనరల్ కన్నిహ్యామ్(General Cunningham), సి.కన్నిహ్యామ్(C.Cunningham), బూలర్(Bahler) విన్సెంట్ స్మిథ్(Vincent Smith), సర్ వాల్టర్ ఎలియాట్(Sir Walter Elliot), స్యూయల్(Sewell), బర్నెల్(Burnell), కర్నల్ మెకంజి(Colonal Mackengie), విల్‌ఫర్డు(Wilford), క్యాంబెల్(Campbell), సి.పి.బ్రౌన్ (C.P.Brown) కాల్డ్వెల్(Caldwell),విల్సన్(Wilson), టేలర్(Taylor),రాప్సాన్(Rapson) ఫ్లీట్(Fleet), ఫౌల్‌క్స్(Foulkes), థామస్(Thomas), ఓల్డెనబర్గు (Oldenbeig), మార్షల్ (Marshall), మార్సడన్(Marsden),బీల్(Beal), కీల్ హారన్(Kielhorn), ప్రిన్సెస్(Prinsep), రైస్ (Rice),రీ(Rea),మెక్ క్రండిల్(Mc. Crindle), గ్రీర్‌సన్(Grierson) మొదలుగు పాశ్చాత్య పండితులును భాండార్‌కర్ (Bhandarkar),భావుదాజీ(Bhau Daji) , భగవాన్‌లాల్ ఇంద్రాజీ(Bhagavanlal), రావు బహదుర్ వెంకయ్య (Rao Bahadur Venkayya, Government Epigraphist), కృష్ణశాస్త్రి (Assistant Epigraphist),జయంతి రామయ్య పంతులు (Deputy Collector of Russulkonda) మొదలగు స్వదేశీ పండితులును వ్రాసిన గ్రంథములును వ్యాసములును వారుచేసిన చర్చలను నాకీ గ్రంథరచనయందు విశేషముగా దోడ్పడినవి. ఇంగ్లీషుగ్రంథములలో ముఖ్యముగా డాక్టరు ఫర్యూసన్ గారిచే రచింపబడిన ట్రీఅండ్ సర్పెంటు వర్షిప్(Tree and Serpent Worship) అను గ్రంథమును, డాక్టరు బర్గెస్ గారిచే రచింపంబడిన బుద్ధిష్టిక్ స్తూపాస్ ఆఫ్ అమరావతి అండ్ జగ్గయ్యపేట ( Buddhistic Stupas of Amaravathi and Jaggayyapeta) అను గ్రంథమును, ఈ యుభయులచే తను రచింపబడిన కేవు టెంపుల్స్ ఆఫ్ ఇండియా(Cave Temples of India)అను గ్రంథమును, డాక్టరు బర్నల్ గారిచే రచింపబడిన సౌత్ ఇండియన్ పాలియోగ్రఫీ(South Indian Paleography)అను గ్రంథమును, సర్ వాల్టర్ ఎలియాట్ గారిచే రచింపబడిన(Numismita Orientalia) గ్రంథమును, జనరల్ కన్నిహ్యామ్ గారిచే రచింపబడిన ఏన్సెంటు జాగ్రఫీ ఆఫ్ ఇండియా(Ancient Geography o f India), అను గ్రంథమును విన్సెంటు స్మిథ్ గారి అర్లి హిష్టరీ ఆఫ్ ఇండియా (Early History of India), అను గ్రంథమును, డాక్టరు భాండార్ కర్ గారి అర్లి హిష్టరీ ఆఫ్ డక్కన్ (Early History of Deccan), అను గ్రంథమును, కనకసభాపిళ్ళెగారి టమిల్సు ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్సు ఎగో (Tamils : Eighteen Hundred years Ago), అను గ్రంథమును నాకుఁజాల సహాయమును జేసినవి.

ఇవిగాక చెన్నపురిలోని క్యాన్నిమరా లైబ్రరీలో నున్న "ఇండియన్ ఆంటిక్వేరీ (Indian Antiquary)లోను, "ఎపిగ్రాఫియా (Epigraphia) ఇండికా" (Indica), లోను ఎపిగ్రాఫియా కర్నాటికా (Epigraphia Karnatica), లోను డాక్టర్ హల్ టెజ్ గారిచేఁ బ్రకటింపఁబడిన సంస్కృత ద్రావిడ శాసనముల సంపుటముల (South Indian Inscriptions) బ్రకటింపఁబడిన పురాతన శాసనములును చరిత్ర శోధనములో నింతింత యనరాని తోడ్పాటూ జూపినవి. "డిస్ట్రిక్టు గెజిటీర్స్" (District Gazetteers), "డిస్ట్రిక్టు మ్యాన్యుయల్సు" (District Manuals), అను గ్రంథములును గొంతవఱకుఁ దోడ్పడినవి.

ఇంతియగాక ఏషియాటిక్ రీసర్చెస్ (Asiatic Researches) అను పత్రికా సంపుటములును, మెడ్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండు సైంస్ (Madras Journal of Literature and Science), అను పత్రికా సంపుటములును, రాయల్ ఏషియాటిక్ సొసైటీ వారిచేఁ బ్రకటింపఁబడు పత్రికా సంపుటములలోఁ బ్రకటింపఁబడిన కొందఱి లేఖలును చర్చలును నాకు విశేషసహాయ మొనర్చినవి.

మఱియును ఆర్కియోలాజికల్ సర్వే డిపార్టుమెంటు వారిచేఁ బ్రకటింపఁబడుచుండిన యెపిగ్రాఫిని గూర్చిన రిపోర్టులును (Annual Reports on Epigraphy) గూడ నెక్కువగాఁ దోడ్పడినవి.

ఈ పైఁ జెప్పినవిగాక బ్రహ్మశ్రీ పాడివేంకటనారాయణ పాఠీగారిచే విరచింపఁబడిన యాంధ్రాక్షరతత్త్వమును, బ్రహ్మశ్రీ రావు బహదరు వీరేశలింగము పంతులుగారిచే రచియింపబడిన యాంధ్రకవుల చరిత్రమును, బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారిచే విరచించబడిన కథాసరిత్సాగమును, బ్రహ్మశ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుపంతులుగారిచే రచింపఁబడిన హిందూదేశ కథాసంగ్రహమును గూడ నాకుఁ గొంచెము తోడ్పడినవి గావున వారికిని నావందనము లర్పించుచున్నాఁడను.

చెన్నపట్టణము
15-3-10
చిలుకూరి వీరభద్రరావు