ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పండ్రెండవ ప్రకరణము
పండ్రెండవ ప్రకరణము.
శివస్కంద వర్మ.
ఇతడు కాంచీపురమునుండి ప్రకటించిన తామ్రశాసనములు రెండుగలవు. అందొకటి బళ్లారిమండలములోని హిరావాడగల్లి(హర్పనహల్లి) గ్రామంబున దొరకినది [1] మఱియొకటి యిప్పటి గుంటూరు మండలములోని నరసరావుపేటకు దూర్పున 16 మైళ్లదూరమునవున్న మైదవోలను నొక చిన్నగ్రామమున దొరకినది. [2] శివస్కందవర్మయువమహారాజుగనుండినపుడు మైదవోలు శాసనమును మహారాజుగనుండినపుడు హర్పనహల్లిశాసనమును బ్రకటింపబడినవి.
మైదవోలుశాసనము.
ఈ శాసనము ప్రాచీన ప్రాకృతభాషలో వ్రాయబడి కాంచీపురమనుండి ప్రకటింపబడినది. ఇందుశివస్కందవర్మ యువ మహారాజుగ బేర్కొనబడియుండెను. తాను భారద్వాజగోత్రుడననియు, పల్లవులవంశములోనివాడననియు జెప్పుకొనియుండెను. ఈ శాసనము వ్రాయబడినతేది శివస్కందవర్మకు బూర్వము రాజ్యముచేయుచుండిన రాజుయొక్క పదయవ పరిపాలన సంవత్సరమున గ్రీష్మఋతువు నాఱవపక్షములోని పంచమి తిథిగానున్నది. ఆంధ్ర పథము[3] లోని విరిపరయను గ్రామమును పూర్వకుటార్యుడు గోనందార్యుడు నను నామములను వహించినవారలును, అగ్నివేశ్యగోత్రులును నగునిరువురు బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ ధాన్యకటకములో నుండిన తనవ్యాపృతునకు నాజ్ఞ చేయబడినది.
హిరాహడగల్లిశాసనము.
ఇదియును ప్రాచీన ప్రాకృతభాషలోనే వ్రాయబడినదిగాని శాసనము చివరనుండిన యాశీర్వాద వచనమును రాజముద్రికలోని శివస్కందవర్మ పేరును మాత్రము సంస్కృతభాషలో వ్రాయబడినది. ఇందు శివస్కందవర్మ మహారాజాధిరాజనియు, పల్లవులవంశములోని వాడనియు, భారద్వాజ గోత్రుడనియు దెలుపబడినది. ఈ శాసనమును బ్రకటించిన శివస్కందవర్మయు, మైదవోలు శాసనమును బ్రకటించిన శివస్కందవర్మయు నొక్కడేకాని వేఱ్వేఱురాజులుకారు. ఇందధిక విశేషమొకటికలదు. ఇతడు అగ్నిస్తోమము, వాజపేయము, అశ్వమేధము మొదలగు క్రతువులనుజేసినట్లుగ జెప్పబడినది. శివస్కందవర్మకు బూర్వముండిన బప్పా యనుమహారాజు చిల్లరేక కోడంకయను గ్రామములోని తోటనొకదాని బ్రాహ్మణులకు దానము చేసియుండగా దానినే మరలబేర్కొనుచు నొక నూర్పుడు కళ్లమును, నివేశనములను గూడ నీతడే దానముచేసినట్లుగ నీశాసనమున వ్రాయించబడినది. ఇందు బేర్కొనబడిన బప్పాకోటిసువర్ణములను దుక్కిటెడ్లతోడిలక్షయరకలను బ్రాహ్మణులకు దానముచేసి యుండెనని పేర్కొనబడియుండెను. ఈశాసనములో దానముచేసినట్లుగ నుదాహరింపబడిన తోటయొక్కఫలము ముప్పదినాలుగు భాగములుగ విభాగించి యిరువదినాలుగు బ్రాహ్మణుకుటుంబములకు నొక్కొక్కొనికి నొకభాగము మొదలుకొని నాలుగుభాగముల వఱకు దానముచేయబడియుండెను. ఈ శాసనము కోలివోలా గ్రహారీకుడును మంత్రాలోచన సభ్యుడును నగుభట్టిశర్మ యొక్క స్వహస్త విలేఖనముతో గూడినదిగ నున్నది. దీనిని రాజు స్వయముగా బరిశోధించి చేవ్రాలు చేసియుండెనట. శాసనము తుదను గోబ్రాహ్మణులకును, విలేఖకునకును, పాఠకులకును, వినువారికి శుభవాక్యము పలుకబడియెను. తనవంశముయొక్కయు, తనజాతియెక్కయు, పరంపరాభివృద్ధికిని యశోభివృద్ధికిని ఈ దానము చేయబడినట్లుగ జెప్పబడినది.
కాలనిర్ణయము.
శాసనములోని భాషను బట్టియు, అందుదాహరింపబడిన కాలమునుబట్టియు శివస్కందవర్మ క్రీస్తుశకము రెండవశతాబ్దములోనివాడని రివరెండు టి. ఫపుల్క్సు గారు యుక్తియుక్తముగ సిద్ధాంతీకరించినారు. [4] ఇంత సహేతుకమైనవాదము మఱియొకటిగానరాదు. వీరు శివస్కందవర్మ రెండవశతాబ్దములోని యాంధ్రభృత్యులతో సమకాలికుడని రెండు హేతువులను జూపిరి. ఆంధ్రభృత్యుల శాసనములలోని భాషయె యీశాసనమునందును గానవచ్చుట మొదటిది. దానము చేసినతిథి తెలుపబడినవిధాన మాంధ్రభృత్యులశాసనములలోని విధానమును బోలియుండుట రెండవది. ఈ రెండు హేతువులచేత నాంధ్రభృత్యులకు దూరముననుండువాడు కాడనియును, సమకాలికుడనియును సిద్ధాంతము చేసినారు.
శివస్కందవర్మ శాసనములలో శాలివాహన శకసంవత్సరములకు మాఱుగా వానిపరిపాలన సంవత్సరములయొక్క సంఖ్యలు పేర్కొనబడినవి. మాసము నకు బదులుగా ఋతువు పేర్కొనబడినది. చాంద్రమాన పక్షముగాక సౌరమానపక్షముయొక్క సంఖ్య పేర్కొనబడినది. ఇట్టిపద్ధతి యేకాలమునం దేవంశపు రాజుల శాసనములలో నవలంబింపబడియెనో తెలిసికొన్న పక్షమున శివస్కందవర్మ కాలము తెలియగలదని నిశ్చయించి నవీనపల్లవులయొక్కయు, క్షాత్రపులయొక్కయు, గుప్తులయొక్కయు, చాళుక్యులయొక్కయు, శాసనములనుబరిశోధించి చూడగా సమస్తవిషయములయందు నాంధ్రభృత్యుల శాసనములలోని పద్ధతిని బోలి యుండుటచేత శివస్కందవర్మ యాకాలమునందె యుండవలయునని సిద్ధాంతీకరింపబడినది. క్షాత్రపరాజులయొక్కయు, గుప్తరాజులయొక్కయు, చాళుక్యరాజులయొక్కయు, నవీనపల్లవరాజులయొక్కయు శాసనములన్నియు సంస్కృతభాషలో వ్రాయబడినవి. క్షాత్రపుల శాసనములలో శకనృపకాల సంవత్సరములును, గుప్తరాజులశాసనములలో గుప్తశకసంవత్సరములను, చాళుక్యరాజుల శాసనములలో శాలివాహన శకసంవత్సరములును పేర్కొనబడినవి. సర్వవిధములచేతను స్వల్పవిషయములందుకూడ నాశాసనములను భేదించి యుండుటయే గాక యాంధ్రభృత్య వంశపురాజులగు గోతమిపుత్రశాతకర్ణి, పులమాయి, యజ్ఞశ్రీశాతకర్ణి మాధారిపుత్రశకసేనుడు మొదలగు వారి శాసనములనుబోలి యించుకయై న భేదములేక యుండుటచేత నీశాసనముగూడ నా కాలమునాటిదే గనుక శివస్కందవర్మ రెండవశతాబ్ద మధ్యముననో శతాబ్దాంతముననోయుండయుండవలయునని రివరెండు ఫౌల్క్సుగారు నుడువుచున్నారు. ఆంధ్రభృత్యులనియెడిశాతవాహనవంశజులు క్రీస్తుశకము 236 వ సంవత్సరమువఱకు నాంధ్రదేశమును బాలించుచుండిరని శాసనాదులనుబట్టియు పురాణాది పూర్వగ్రంథములనుబట్టియు దెలిసికొనగలిగితిమి. క్రీస్తుశకము 340 దవ సంవత్సర ప్రాంతమున గుప్తచక్రవర్తియగు సముద్రగుప్తుడు దక్షిణదేశముపై దండెత్తివచ్చినప్పుడు విష్ణుగోపవర్మయనురాజు కాంచీపురమునుబాలించుచుండినట్లు ప్రయాగలోని సముద్రగుప్తుని శాసనమువలన దెలియవచ్చుచున్నది. శివస్కందుడు విష్ణుగోపవర్మకు బూర్వుడు కాని తరువాతివాడు కాడని శివస్కందవర్మ శాసనములనుబట్టి స్పష్టముగా జెప్పవచ్చును. ఆంధ్రరాజులు ధాన్యకటకము రాజధానిగా నాంధ్రరాజ్యమును గొంచెమించుమించుగా క్రీస్తుశకము 240 దవ సంవత్సరమువఱకు బాలించినట్లు గన్పట్టుచున్నది గావున నాంధ్రభృత్యశాఖకంటె భిన్నుడేయై ఆకాలమునకు బూర్వమెయున్న దాను యువమహారాజుగనుండినపు డాంధ్రపథములోని పరిసరగ్రామమును బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ ధాన్యకటకములోని తన వ్యాపృతునకు దెలియజేయుట యెట్లు సంభవించును? కనుక 240 దవసంవత్సరమునకు దరువాతివాడని చెప్పవలసియుండును. అదియె నిజమైనయెడల మూడవశతాబ్దాంతమునం దనగా 240 సంవత్సరమునకు దరువాతను 301 వసంవత్సరమునకు బూర్వమునుండవలయును. ఇతని శాసనములను బట్టిచూడగా నితడుకృష్ణానది మొదలుకొని దక్షిణమున గాంచీపురమువఱకును పడమట బల్లారివఱకునుగల గొప్పదేశమున కంతకును బ్రభువుగనుండి యేలినట్లుగానిపించుచున్నది. అట్లయిన యెడల నీతడింత రాజ్యము నెట్లుసంపాదింపగలిగెనని శంక పుట్టకమానదు. ఈతడు తనశాసనములందెచ్చటను తానుగాని తనపూర్వులుగాని యాంధ్రభృత్యులను జయించి సంపాదించినట్లుగ జెప్పుకొని యుండలేదు. అటువంటి శాసనములను గరువముతో బ్రకటించుకొన్నవాడు అంతటి బ్రాహ్మణభక్తిగలవాడు, శాసనములయందు దనయొక్క విజయములను గూర్చి లేశమాత్రమున ముచ్చటింపకుండుటకు గారణమేమి? దేశము నెమ్మదిగ లేకుండిన కాలమునందు క్రతువులు చేయుటకుగాని బ్రాహ్మణులకు గోవుల నగ్రహారముల దానముచేసి యరణ్యదేశముల నివసింప బ్రాహ్మణులను బంపుటకు సాధ్యమగునా? సాధ్యముకాదని స్పష్టముగ జెప్పవచ్చును. తనకు బూర్వము బప్పాయనురాజుధర్మకార్యము లనేకములు చేసెనని శివస్కందవర్మ పేర్కొనియుండెను. వీరలిరువురును బహుకాలము దేశపరిపాలనముచేసి ప్రఖ్యాతిగాంచి యుండవలయునుగదా, ఆంధ్రజాతికంటె భిన్నులై యెక్కడినుండియోవచ్చినవారేయైనయెడల బహుశతాబ్దములనుండి రాజ్యముచేయుచుండిన వంశమును నిర్మూలముచేసి బహుస్వల్పకాలములో దేశమును స్వస్థపఱచి పరిపాలించుటకు సాధ్యమగునా? ఒక వేళ సాధ్యముగునేని ఘోరసంగ్రామమమున నాం ధ్రులనునోడించి దేశమును స్వాధీనము చేసికొనవలయునుగాని యూరక స్వాధీనమగుననుట విశ్వసింపదగినది కాదు.
అట్టిఘోరసంగ్రామ మేదియును జరగినట్లుగా గానరాదు. శాసనములందును జెప్పబడియుండలేదు. కాబట్టి శివస్కందవర్మగాని వానిపూర్వులు గాని క్రొత్తగా నాకాశమునుండి దిగివచ్చినవారుగాక దేశములోని వారేయైయుండవలయును. పల్లవుడనని చెప్పుకొనుచుండిన యీశివస్కందవర్మ యాంధ్రభృత్యులలో నుదహరింపబడిన శివస్కందవర్మయెగాని యన్యుడుగాగన్పట్టడు. మత్స్యపురాణమునుందు "అంధ్రాణాం సంస్థితా (తే) రాజ్యేతే షాంభృత్యాన్వయెపృపాసపైవాంధ్రాభవిష్యంతి" అని యాంధ్రభృత్యులకు వెనుక సప్తాంధ్రులు రాజ్యపాలనము సేయుదురని చెప్పంబడియెను. శకయవనపహ్లావాదు లాంధ్రులలో గలిసిపోయి యాంధ్రరాజుల కడనూడిగము సేయుచుండిరని యిదివఱకె తెలుపబడియుండెను. అట్లాంధ్రులయియున్నతస్థితికి వచ్చినకుటుంబములతో నాంధ్రరాజుల సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరని గూడ వ్రాసియుంటిమి. ఇట్లు సంబంధబాంధవ్యములు జరుపుచుండుటచేత రాజకుటుంబములలో బలుశాఖలేర్పడినవి. ఇందుకు దృష్టాంతముగ గొందఱిని జూపవచ్చును. హారితపుత్రశాతకర్ణుడు విష్ణుదత్తులవంశములోని వాడని బనవాసిలోని యొక శాసనమున జెప్పబడినది. వాసిష్టీపుత్ర శాతకర్ణుడు కర్దమకరాజులవంశములోనివాడని యొకశాసనమున జెప్పబడినది. మాధరపురుషదత్తుడు ఇక్ష్వాకులవంశములోనివాడని బేతవోలు(జగ్గయ్యపేట) శాసనమున జెప్పబడినది. శివస్కందవర్మ పల్లవులలోని వాడని మైదవోలు హర్పనహల్లి శాసనములు చెప్పుచున్వి, యవనశకపహ్లవాదులాంధ్రులలో గలిసిన తరువాత వేఱ్వేఱు తెగలుగ నుండవచ్చునయినను లిక్ష్వాకులు కావచ్చును. శకనులు విష్ణుదత్తులు కావచ్చును. పహ్లవులు పల్లవులు కావచ్చును. ఈయిక్ష్వాకులును, ఈ విష్ణు దత్తులును, ఈ కర్దమకులును ఈ పల్లవులును కేవలము విదేశస్థులు గారు. ఆంధ్రులయొక్కయు, యవనశకపహ్లావాదులయొక్కయు రక్తసమ్మేళనమువలన జనించిన మిశ్రజాతులవారే కాని మరియొకరుకారు. వీరల నెల్లరను ఆంధ్రులని చెప్పుటకే యొప్పును. కాబట్టి శివస్కంధవర్మ యాంధ్రపల్లవ శాఖలోని వాడని చెప్పవచ్చును. ఎనిమిదవ ప్రకరణమున శివస్కందవర్మను గూర్చి వ్రాయుచు నీ యభిప్రాయమునే దెలిపియుంటిమి. అతడే యితడైన యెడల నందుదుదహరింపబడిన కాలము సరియైనదిగా దలంపరాదు. ఇతడు మూడవశతాబ్ద మధ్యమముననో మూడవ శతాబ్దముననోయుండునని నిశ్చయముగా జెప్పవచ్చును.
శివస్కందవర్మ పరిపాలనము.
జయవర్మ.
శివస్కందవర్మ గాక మఱికొందఱు ప్రాచీనపల్లవరాజులపేరులు శాసనములందు గానవచ్చుచున్నవిగాని వారి కాలము మాత్రముసరిగా దెలియరాదు. మఱియొక విశేషముకలదు. ఈ ప్రాచీన పల్లవుల శాసనములన్నియును ఆంధ్రదేశమునందే గానవచ్చుచున్నవి. కూడూహార విషయాధిపతియగు జయవర్మయొక్క తామ్రశాసనమొకటి తెనాలి తాలూకాలోని కొండమదిగ్రామమునందలి మంటిదిబ్బలో దొరకినది.[5] ఈ శాసనములోని లిపి శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనములోని లిపిని బోలియున్నది. మహేశ్వర బృహత్పలాయన శబ్దములు రెండును దక్కతక్కినదంతయు బ్రాకృతభాషలోనున్నది. ఈశాసనములోని రాజముద్రికలో జయవర్మమహారాజుపేరు గానంబడుచున్నది. ఇతడు బృహత్పలాయన గోత్రుడు. మహేశ్వర పాదభక్తుండు. ఇతడు కూడూహారమండలములోని పంతూరనుగ్రామమును 7 గురు బ్రాహ్మణులకు దానముచేసి యున్నానని కూడూరులోని తన వ్యాసృతులకు దెలియంజేసియున్నాడు. కూడూరు రాజధానీనగరముగా నుండెను. ఈ జయవర్మగాని వీనిగోత్రముకాని మఱియేశాసనమునందును గానరావు. ఇతడు శివస్కందవర్మ కాలమునాటి వాడని చెప్పవచ్చునుగాని యాతనికి సామంతుడో లేక స్వతంత్రుడో దెలియరాదు. ఈ శాసనములోని భాషయు లిపియు గోతమిపుత్రశాతకర్ణియొక్కయు, వాసిష్ఠీపుత్ర పులమాయి యొక్కయు నాసిక శాసనములను బోలియుండుటచేత నారాజులకు మిక్కిలి దూరమున నున్నవాడని చెప్పరాదు. రాజముద్రికలోని ప్రాచీన సంస్కృతలిపికూడ దీనినే బలపఱచుచున్నది. ఇది వేంగిదేశమున కనగా నిప్పటి కృష్ణామండలమునకు బ్రాచీననామము. దీనికి రాజధానికూడూరు. ఈ కూడూరు గుడివాడయొక్కయో గూడుర యొక్కయో ప్రాచీననామము. ఈ శాసనము మహాత్యాగివంశములో యోగ్యుడును జయవర్మమహారాజుయొక్క మహాదండనాయకుడును నగు. దైవహన వర్మ చేత వ్రాయబడినది. పంతూరను గ్రామమెద్దియో దెలియరాకున్నది. ఈ గ్రామము జయవర్మచే బ్రాహ్మదేయము క్రింద నీయబడినది. ఇరువది నాలుగు భాగములుగ విభజింపబడి యెనమండ్రు బ్రాహ్మణులకు దానము చేయబడినది. అందు గౌతమీగోత్రుడగు సర్వగుప్తార్యునకు 8 భాగములును, తానవ్యగోత్రుడనగు సవిజ్ఞార్యునకు 3భాగములును, గోగణార్యునకు 3 భాగములను, కౌండిన్యగోత్రుడయిన భావనార్యునకు 2 భాగములను, భారద్వాజ గోత్రుడయిన రుద్రవిష్ణ్వార్యునకు 1 టిన్నర భాగమును, కర్షణాయన గోత్రుడయిన యీశ్వర దత్తార్యునకు 1 టిన్నర భాగమును, ఔపమాన్యవగోత్రుడయి రుద్రఘోషార్యునకు 1 భాగమును, కౌశికగోత్రుడయిన స్కందద్రార్యునకు నరభాగమును నొసంగబడినవి. జయవర్మ మహేశ్వరభక్తుడని చెప్పబడియుండుటచేత నితడు శైవమతాభిమాని యని సూచింపుచున్నది. ఇతడు తనశాసనమునందు దాను పల్లవుడని చెప్పుకొని యుండకపోయినను వీరిని పల్లవుడనియె విశ్వసింపవచ్చును. ఇంతకంటెవీని చారిత్రము మనకేమియు దెలియరాదు.
విజయదేవవర్మ.
ఇతడు వేంగీ దేశమును బరిపాలించిన వారిలో మిక్కిలి ప్రాచీనుడు. వీని శాసనమొకటి నూతనముగా గనిపెట్టబడినది.[6] ఈ శాసనము ప్రాకృతభాషలో వ్రాయబడి వేంగీపురమునుండి ప్రకటింపబడినదగుట చేత నిది పురాతనమైనదనుటకు సందియములేదు. విజయదేవవర్మ జయవర్మకు దరువాతి వారును విజయనంది వర్మకు బూర్వుడును నని చెప్పుటకు సంశయింపంబనిలేదు. జయవర్మకు కూడూరు రాజధానిగ నుండెనని చెప్పబడినది. కూడూహరా విషయమునకు (వేంగి రాష్ట్రము) మొదట కూడూరును తరువాత వేంగీపురమున రాజధాని గనుండుట చేతను, విజయదేవ వర్మ వేంగీపురమునుండి యీశాసనమును బ్రకటించుటచేతను, జయవర్మ తరువాత వాడని తేటపడుచున్నది. విజయనందివర్మశాసనమువలేగాక యియ్యది ప్రాకృతములో నుంటచేత నతనికంటె విజయదేవవర్మ పూర్వుడని చెప్పవలసియున్నది. ఇతడు సాలంకాయన గోత్రుడు. విజయనందివర్మవలెనె చిత్రరథస్వామిపాదసేవా తత్పరుడు చిత్రరథస్వామిదేవాలయము వేంగీపురమునందున్నది.
వేంగీపురము లేక వ్యాఘ్రపురము.
వేంగీదేశమునకు ముఖ్యపట్టణముగానుండిన వేంగీపురము కృష్ణామండలములోని యేలూరునకు నుత్తరమున 8 మైళ్లదూరమున నుండెడిది. ఆస్థానమునందిపుడు పెదవేగి, చినవేగి అనుపల్లెలు మాత్రము గలవు. వీనికి దక్షిణముగా 5 మైళ్లదూరమున దెందులూరను గ్రామముగలదు. ఈ గ్రామమునకు గంగనగూడము సేనగూడెము మొదలుగు సివారుపాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిపి యొక మహాపట్టణముగానుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలములయిపోయిన శివాలయములు పెక్కులు గలవు. మఱియును విజ్ఞానేశ్వరునియొక్క విగ్రహములు నాలుగు దెందులూరునకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండియున్నవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామమునకు దూర్పుప్రక్కను భీమలింగము దిబ్బయనుపేరుగల యెత్తైన యొకపాటిమట్టిదిబ్బగలదు. దానికుత్తరముగా మాకమ్మ చెఱువును దానినడుమనొక మట్టిదిబ్బయు, దానిపైన రెండుఱాతినందులను గలవు. ఈ గ్రామమునకు బడమరగానొకచెఱువు గలదు. దానిని నారికేళనారిచెఱువని చెప్పుదురు. వానిగట్లపైనిరెండుశిలాశాసనములు నిలువుగానుండియ, మఱిరెండు సాగిలంబడియు నుండినవి, పెదవేగికిని చినవేగికిని నడుమ మఱియొక మంటిదిబ్బగలదు. వీనినన్నిటిని బరిశోధించిచూడగా వేంగీపురము మిక్కిలి యున్నత స్థితియందుండిన పూర్వకాలమున నొక యందమైన మహానగరముగానుండెననుటకు సందియములేదు. ఇచ్చటి దేవాలయములయొక్క ఱాళ్లను తురకలు గొనిపోయి యేలూరులోని కోటనుగట్టిరని తెలియుచున్నది. వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడనుండెనాయని కొందఱు సంశయించుచుండిరిగాని విజయదేవవర్మయొక్కయు, విజయనందివర్మయొక్కయు శాసనములాసంశయమును నివారించినవి. మఱియును దండియను మహాకవి కొల్లేరును వర్ణింపుచుదానికి ననతిదూరముగాను డిన యీ వేంగీపురము నే యాంధ్రనగరియని పిలిచియున్నాడు.[7] విజయదేవవర్మ విజయనందివర్మ శాసనములలో నుదాహరింపబడిన చిత్రరథస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యా పేరుతోనే పిలువంబడుచున్నది.[8]
అఱవనాడు-వేంగిదేశము.
ఆంధ్రదేశమునకు వేంగిదేశమను పేరెట్లుకలగినదియు గొంతవఱకు మూడవప్రకరణాంతమున దెలుపబడినది గాని యదిచదువరులకంతగా దృప్తి కలిగింపజాలదు. ఎందుకన మొదటివేంగి దేశమని యేభాగము పిలువంబడియెనో దెలిసికొనుట కష్టసాధ్యముగ నుండెను. మొదటి వేంగిదేశము కన్నడదేశప్రాంతమని చెప్పెడివారిమాట యెంతమాత్రమును విశ్వసింపదగినదికాదు. కాంచీపురప్రాంతదేశమునకు మొదటివేగివాడనుపేరు కలదని యూహింపబడినది కాని వాస్తవిమిదికాదు. ఇకమొదటి వేగిదేశమేభాగమునకువర్తించునో సహేతుకముగా నిర్ధారణముచేసిన గాని చదువరులకు దృప్తికలిగింపజాలదు. ఈ దేశము పూర్వము నాగులచే బరిపాలింపబడుచుండెనని యైదవ ప్రకరణమున విశేషముగా జర్చింపబడినది. దక్షిణదేశమునందలి నాగులలో మరవార్ అయినార్,ఒలియార్, ఒవియార్, అఱవలార్, పరదవార్ , మొదలగు పేరులుగల తెగలవారు నివసించుచుండిరి. వారిలో "అఱవలార్" అనగా అఱవలు కాంచీపురప్రాంతదేశమున నివసించుచుండిరి. ఆ కారణముచే నాభాగమునకు "అఱవనాడు" "అఱవనదలై" అనునామములుగలిగెను. కాంచీపురమునకు దక్షిణదేశ మఱవనాడుగను, గాంచీపురముండిన ప్రదేశమఱవవడదలై యనియు బిలువంబడుచుండెను. టాలెమీ మొదలగు విదేశియచరిత్రకారులు మసాలియా దేశమునుకు దిగువభాగమును అశార్ నోరి (అర్ వార్ నాయ్) అనగా అఱవవాడని పేర్కొనియుండుటగూడ నీ యంశము ధ్రువపడుచున్నది. కాబట్టి అఱవలను పేరు నాగులలో నొకతెగవారిదిగాని ద్రావిడులదిగాదు. అఱవనాడునుండి మొదట ద్రావిడులీదేశమునుకు వచ్చుటచేత వారిని మనవారఱవలని పిలువనారంభించిరికాని నిజముగా వారలఱవులుగారు. శివస్కందవర్మ కాంచీపురమునుండి తనశాసనములను బ్రకటించిన కాలమున నాదేశము వాసుకిసంతతివారలయిన యఱవనాగులచే నివసింపబడు వఱవనాడుగానుండెనుగాని మఱియొకపేరుతో లేదు. కాబట్టి మొట్టమొదటి వేంగిదేశము కృష్ణాగోదావరినదీ ముఖద్వారములకు నడుమనుండు దేశమనగా నిప్పటికృష్ణామండలమునకు వర్తింపగలదు. దీనియుత్పత్తికి గారణమీవిధముగా జెప్పుకొనవచ్చును. మొట్టమొదటనీదేశమునకు గూడూహరవిషయమను పేరుగలదు. అప్పుడు కూడూరా(గుడివాడ లేక గూడూరు) అనుపట్టణము రాజధానిగనుండెను. ఏకారణముచేతనో రాజధాని మార్చుకొనవలసివచ్చినది. సాలంకాయనగోత్రులయిన పల్లవరాజులలోనొకరు నూతనముగా ననుకూలమగు నగరమొకదాని నిర్మించివేగియనగా పులియని యర్థముండుటచేతను, శత్రువులకు బెబ్బులివలె సమీపించసాధ్యముకానిదని సూచించుచుండుటచేతను వేంగీపురమని పేరు పెట్టియుండును. వేంగీపురమును బాలించినరాజులను వేంగీరాజులనుట సామాన్యమగా వ్యవహారమునకు వచ్చియుండును. వేంగిరాజులు జయించిన దేశమునకు గాని పాలించినదేశమునకుగాని వేంగిరాష్ట్రమనికాని వేంగీదేశమనికాని పేరుపెట్టబడినదన్న వింతయేమున్నది? కాబట్టి మొట్టమొదట వేంగీపురమేర్పడి దానింబట్టి వేంగిదేశమువాడుకలోనికి వచ్చినది. వేంగియనునఱవశబ్దము తెలుగులో వేగియని పిలువంబడుచున్నది. ఈ వేంగి దేశము పల్లవులకాలమునను చాళుక్యులకాలమునను దక్షిణమున గాంచీపురమువఱకును నుత్తరమున మహానదివఱకును వ్యాపించినది. నన్నయభట్టుకాలమున రాజమహేంద్రవరము మొదలుకొని కాంచీపురముకునుగలదేశము వేగి దేశముగానే పరిగణింపబడుచువచ్చెను. వేగిదేశమునకి దగ్థరాష్ట్రమని పేరుచెప్పుట కేవలము పొరబాటని చెప్పవలయును. అట్లయిన యెడల వేంగిపురమును దగ్ధపురమని చెప్పవలసివచ్చి యపహాస్యము పాలగుట తటస్థింపవలసివచ్చును. వేంగిరాజులయిన మొదటిపల్లవులకాలమున నఱవనాడు నుండి బ్రాహ్మణులను రప్పించినగాని వచ్చినవారిని నాదరించిగాని యగ్రహారములు మొదలగువాని నిచ్చి దేశమున నిలుపుటచేత వీరలే మొదట వేంగినాటి శాఖాబ్రాహ్మణులుగా నే పరిగణింపబడుచుండిరి. క్రీస్తుశకము నాలుగవశతాబ్దము 340దవ సంవత్సర ప్రాంతమునందు నలహాబాదునగరమున నశోకుని స్తంభముమీద సముద్రగుప్తునిచే వ్రాయించబడిన శాసనమునందు వేంగిపుర ముదాహరింపబడినది గనుక నంతకు బూర్వమునుండియు ననగా క్రీస్తుశకము రెండవశతాబ్దమునుండియో మూడవశతాబ్దమునుండియో వ్యవహారములోనికి వచ్చియుండును.
సముద్రగుప్తుని దండయాత్ర.
స్వామిదత్తుడు, మహేంద్రవర్మ, హస్తివర్మ, విష్ణుగోపవర్మ.
నాలుగవశతాబ్ద ప్రారంభమున నుత్తరహిందూస్థానమును గుప్తరాజులాక్రమించుకొని పరిపాలించుచుందనుభుజబలపరాక్రమముచేత వెంటనే నానా ముఖముల దమరాజ్యమును విస్తరింపజేయసాగిరి. వారిలో సముద్రగుప్తుడు నెపొలియన్ చక్రవర్తి వంటివాడగుటచేత దిగ్విజయయాత్ర మొదలుపెట్టి దక్షిణహిందూదేశముపై గూడదండెత్తివచ్చెను. ఈతని దక్షిణ దిగ్విజయమువలన నాకాలమున మహానది మొదలుకొని కాంచీపురమువఱకును గలదేశమును బాలించురాజుల పేరును వారుండు ముఖ్యపట్టణములును దెలియుచున్నవి. సముద్రగుప్తుడు దక్షిణకోశలమును బాలించుమహేంద్రుని జయించి మహాకాంతారమునకు వచ్చి యచ్చటి వ్యాఘ్రరాజునోడించి పిమ్మట కళింగదేశమునకు వచ్చెను. పర్వతముమీదనున్న కొత్తూరుదుర్గమును ముట్టడించి యాదుర్గాధిపతియగు స్వామిదత్తునినోడించి యీరందపళ్లను బాలించు దమనుని జయించి తరువాత దేవరాష్ట్రమును బాలించుకుబేరుని,పిమ్మట అవముక్తాధీశ్వరుండయిన నీలరాజును, అటుపిమ్మట పిష్ఠపురమును బాలించుమహేంద్రవర్మను, అనంతరము వేంగిని బాలించుహస్తివర్మను, పాలక్కడను బాలించునుగ్రసేనుని, కుష్ఠబపురిని బాలిం చుధనంజయుని, అటుతరువాత కాంచీపురాధీశ్వరుండయిన విష్ణుగోపుని జయించి దైవపుత్రుల (ద్రమిళులు) పైకిబోయెను. ఇందుచెప్పబడిన దేశములును రాజులును పట్టణములు నిప్పటి యాంధ్రదేశములోనివేగాని యన్యములుగావు. కొత్తూరు గంజాము మండలములోని మహేంద్రగిరికి 12 మైళ్లదూరముననున్నది. ఈరందపళ్లయు, దేవరాష్ట్రమును, అనముక్తయు గంజాము విశాఖపట్టణమండలములలోనివిగాని యన్యములుగావు. చీపురుపల్లి ప్రాంతదేశము దేవారాష్ట్రమని చాళుక్యలశాసనములందును, గాంగపల్లవులశాసనములందును బేర్కొనబడినది. పిష్టపురము ప్రాచీనకళింగమునకు రాజధానిగ నుండెను. ఇది యిప్పటి గోదావరిమండలములోని పిఠాపురమెగాని యన్యముగాదు. వేంగి వేంగీపురమేగాని యన్యము కాదు. కుష్ఠలపురము పాలక్కడ నెల్లూరు మండలములోనివిగా గన్పట్టుచున్నవి. కాంచీపురము ప్రసిద్ధమైనది. వీరలచరిత్రము మనకేమియు దెలియరాకున్న యది. వీరిపేరులు సముద్రగుప్తునిశాసనముల దుదాహరింపబడుటచేత దెలిసినవిగాని లేకపోయిన వీని నైనందెలిసికొనుట కాధారమేలేకపోయియుండును. సముద్రగుప్తుని శాసనమునందు దైవపుత్రులని చెప్పబడినవారు జాతులవారయి యుందురు. కాంచీపురమును బాలించువిష్ణుగోపవర్మయు, వేంగిని బాలించుహస్తివర్మయు పిష్ఠపురమును బాలించుమహేంద్రవర్మయు పల్లవులయియుందురు. మహేంద్రవర్మయు, హస్తివర్మయు విష్ణుగోపవర్మకు లోబడి పాలనముచేయ సామంతరాజులని కొందఱుతలంచుచుండిరి కాని యెచ్చటను జెప్పబడియుండలేదు ప్రస్తుతనిరాధారస్థితియందు వారుమువ్వురు వేఱ్వేఱు స్వతంత్రరాజులనియె మనమూహింపవలయును.
విజయస్కందవర్మ, విజయబుద్ధవర్మ.
విజయస్కందవర్మ పరిపాలనము సేయుచుండిన కాలమున వానికుమారుడును యువమహారాజునగు విజయబుద్ధవర్మయొక్క భార్యయు రాణియునకు చారుదేవియొక్క దానశాసనమొకటి గాన్పించినది. ఇదియును బ్రాచీన ప్రాకృతభాషలోనే యుండ మోటుగానుండు నక్షరములతో గూడియుండుటచేత మిక్కిలి ప్రాచీనమైనదిగ భావింపబడుచున్నది. [9] ఇందు విజయస్కందవర్మ కుమారుడగు విజయబుద్ధవర్మ యొక్క రాణియగు చారుదేవి దాలుర గ్రామములోని కులిమహాతారక దేవాలయములోని దేవుడగు నారాయణునకు, మంచినీళ్లబావికీ నుత్తరపు దిక్కునను రాజు చెఱువునకు దిగువను నాలుగు నివర్తనములభూమిని, దానము చేసెనని కటకములోని వ్యాపృతునకు దెలియజేయబడి నటుల నీ శాసనమునందు జెప్పబడినది. ఈ చారుదేవి బుద్ధయాంకురవర్మ యొక్క తల్లియనిగూడ పేర్కొనబడినది గాని వీరెచ్చటివారో పేర్కొనబడియుండలేదు. కటకమనగా ధాన్యకటకమేమోయని సందియము కలుగుచున్నది. దాబారయనునది కృష్ణామండలములోని యిప్పటి దావులూరు గ్రామమునకు వర్తించునేమో యింకను విచారింపవలసి యున్నది. ఈ విజయస్కందవర్మ రెండవశతాబ్దాంతమునగాని మూడవశతాబ్దాదిని గాని యుండి యుండవలయునని యూహింపవచ్చును. ఇతడు భారద్వాజ గోత్రుడగుటచేత సాలంకాయనులగు వేంగీరాజులకు సంబంధించిన వాడుగాడు. ఆంధ్రభృత్యవంశములో నుదాహారింపబడిన విజయశ్రీయనువాడేమో భావిపరిశోధనములవలనంగాని దెలియంబడదు.
విజయనందివర్మ.
ఇతడు వేంగిపురము రాజధానిగా వేంగిరాష్ట్రమును బాలించినవారిలో నొకడు. వీనిశాసనము సంస్కృతభాషలోనుండుటచేత నితడు విజయదేవవర్మకును, హస్తివర్మకును దరువాతి వాడని యూహింపబడుచున్నాడు. ఇతడు సాలంకాయనుడు. విజయదేవవర్మవలెనె చిత్రరథస్వామి పాదసేవాతత్పరుడు. వీనిశాసనము కొల్లేరునకు సమీపమున దొరకినది. [10] ఇతడు తనశాసనమునందు బప్పా భట్టారక పాదభక్తుడనని చెప్పుకొనియెను. ఇట్లు చెప్పుకొన్న వారి శాసనములు మఱికొన్ని కలవు. బప్పాయనునది ప్రాకృతము. తండ్రియనియర్థము. శివస్కందవర్మ శాసమున బప్పాయనురాజు పేర్కొనబడియెను. అదిరాజు పేరుగా నుదాహరింపబడినది గాని నిజముచేత దానిభావమది కాదని తోచుచున్నది. శివస్కందవర్మ బప్పాయని తనతండ్రిని ప్రశంసించియుండెనోమో? ఈశాసనమును భాషాంతరీకరించిన డాక్టరు బర్నెలుగారు విజయనందివర్మ వాదవర్మ మహారాజుయొక్క జ్యేష్ఠపుత్రుడని పేర్కొనుచున్నారు. విజయనందివర్మ తల్లికులాంకదేవి, అభ్యుదయ పరంపరాభివృద్ధికై చిన్నపాకూరు వాకాగ్రహారములో నివసించుచుండిన వేదాధ్యయన సంపన్నులును, నానాగోత్ర సంభవులులైన 157 గురు బ్రాహ్మణోత్తములకు కూడూహార విషయము(వేంగిదేశము) లోని వడానూరుపల్లియను గ్రామమును ధారాదత్తముచేసెను. ఇంతకన్నను వీనిని గుఱించి మనకేమియును దెలియరాదు. ఇతడు నాలుగవశతాబ్దములోని వాడని తెలుపుటకు సంశయింపబనిలేదు.
కందవర్మ -అత్తివర్మ.
ఆనంద ఋషిగోత్రసంభవుడయిన కందరవర్మయను మహారాజుయొక్క పుత్రిక పేరుగల ప్రాచీనశాసనమొకటి కృష్ణామండలములోని చెజ్జరాలయను గ్రామమునందు దొరకినది. [11] ధరణికోటయొక్క ప్రాచీననామమగు ధాన్యకటకమును త్రికూటపర్వతమును కందరుని గూర్చి ప్రశంసించు సందర్భమునదాహరింపబడినవి. మఱియు గుంటూరుమండలములోని గోరంట్ల గ్రామములోఅత్తివర్మయొక్క శాసనమొకటిగన్పెట్టబడినది.[12] ఆనందగోత్ర సంభవుడయిన కందరుని యొక్క పుత్రుడగు అత్తివర్మయను రాజు ఆతుక్కూరు(ఆతుకూరు) గ్రామమును, కృష్ణవేణినదియొక్క దక్షిణతటముననుండు తాతికుంట గ్రామములో అష్టాశతపట్టి పరిమాణముగల పొలమును కొట్టిశర్మయనుబ్రా హ్మణునకు దానముచేసి నట్లగ నీశాసనమునందు జెప్పబడినది. హిరణ్యగర్భుని (బ్రహ్మ) వంశమునం దుద్భవించినవాడని చెప్పబడినందున నీ యత్తివర్మ పల్లవుడని యూహింపబడుచున్నాడు. అత్తివర్మయొక్క తండ్రికందరు డానందగోత్రుడని చెప్పబడియుండుటచేత చెజ్జరాల శాసనములో నుదాహరింపబడిన కందరపడును, ఈ కందరుడు నొక్కడేయై యుండవలయును. అత్తివర్మశాసనము సంస్కృత భాషలో నున్నది. వీని రాజధాని యెచ్చటనుండెనో దెలియరాదుకాని యితడు గుంటూరు మండలమును బాలించినవాడని దెలియుచున్నది. వీరు నాలుగవ శతాబ్దములోని వారని చెప్పవచ్చును. ప్రస్తుత మింతకన్న వీరినిగూర్చి మనకు దెలియవచ్చినదేమియును లేదు. వేంగిపురమును బాలించినహస్తివర్మయె అత్తివర్మయని స్మిత్తుగా రభిప్రాయపడిరి గాని ఋజువుచేసియుండలేదు.
చండవర్మ.
చండవర్మ మహారాజు కళింగదేశమును బరిపాలించినవాడు.వీని శాసనమొకటి గంజాము మండలములోని నరసన్నపేటకు రెండుమైళ్లదూరమునుందున్న గోమర్తియను గ్రామమున దొరకినది.[13] ఈ శాసనములోని లిపి వేంగిపురమును బాలించిన విజయనందవర్మ శాసనములోని లిపిని బోలియుండుటచేత నితడు నాలుగవశతాబ్దములోనివాడని శాసనపరిశోధకులు చెప్పుచున్నారు. ఈశాసనములోనిభాష దాదాపు పురసంస్కృతమైయున్నది. శాసనమతిక్రమించి వర్తించెడివారని శపించున్నట్టి శ్లోకములు మూడుమాత్రము తక్కతక్కినభాగమంత వచనముగ వ్రాయబడినది. కళింగాధిపతియైన చండవర్మ మహారాజు తనయాఱవ పరిపాలన వత్సరమున జైత్రశుద్ధ పంచమినాడు భారద్వాజ గోత్రుడును వాజననేయ శాఖాబ్రాహ్మణుడును నగు దేవశర్మకు కొహితూర(కొత్తూరు) గ్రామమును దానము చేసినట్లుగ జెప్పబడినది. ఈ శాసనము సింహపురమునుండి ప్రకటింపబడినది. విజయనందివర్మ శాసనములో వలెనె బప్పాభట్టా రక పాదభక్తుడని కూడ బేర్కొనబడినది. [14] చండవర్మ శాసనమునకును విజయనందివర్మ శాసనమునకు దగ్గిఱపోలిక విశేషముగ గన్పట్టుచుండుటచేత బరిశోధకులు కొందఱు విజయనందివర్మ తండ్రియగు చండవర్మయు నితడు నొక్కడేయని యూహించుచున్నారు. వీరిరువురొక్కరయినను గాకపోయినను సమకాలికులని చెప్పవచ్చును. శ్రీకాకుళమునకును నరసన్నపేటకును నడుమనుండు సింగపుర మె సింహపురమై యుండవచ్చునని యూహింపబడుచున్నది. చండవర్మ శాసనములోని రాజముద్రికపైన "పితృభక్తః" యని వ్రాయబడినది.
నందప్రభంజనవర్మ.
ఈ నందప్రభంజనవర్మయు గలింగదేశమును బాలించిన పూర్వరాజులలో నొకడుగా నున్నాడు. కళింగాధిపతియైన యీ నందప్రభంజనవర్మ మహారాజుయొక్క దానశాసనమొకటి శ్రీకాకుళమునగాన్పించినది. [15] నందప్రభంజనవర్మ సారపల్లినగరమునుండి యీశాసనమును బ్రకటించినవాడు. ఇతడు దేవరాత గోత్రులయిన చారణులకును హంశ్చంద్ర స్వామియని బ్రాహ్మణునికొఱకును దేయపటమను గ్రామమును దానముచేసెనని చెప్పబడియున్నది. ఈశాసనములోని లిపి చండవర్మశాసనములోని లిపిని బోలియుండుటచేతను, కళింగాధిపతియని యుభయశాసనములయందును బేర్కొనబడి యుండుటచేతను, వీనిశాసనములోని ముద్రికపైన దండవర్మ ముద్రికలో వ్రాయబడిన "పితృభక్తః" అను నక్షరములే వ్రాయబడియుండుటచేతను వీరలిరువురు నొక్కకుటుంబములోని వారేయై యుందురని శాసనపరిశోధకులభిప్రాయపడుచున్నారు. ఈశాసన పరిశోధకులూహించిన యూహలే సరియైనదయైన యెడల వీరినిగూడ సాలంకాయనులయిన పల్లవులనియె భావింపవచ్చును. కళింగాధిపులమని చెప్పుకొనిన యీనందప్రభంజనవర్మ చండవర్మలను గూర్చిన చరిత్రము దెలియరాకున్నది.
స్కందవర్మవంశము.
స్కందవర్మ కొడుకు వీరవర్మ; వీరవర్మకొడుకు రెండవ స్కందవర్మ; రెండవస్కందవర్మ కొడుకు యువమహారాజు విష్ణుగోపవర్మ; విష్ణుగోపవర్మ కొడుకు సింహవర్మ; వీరిలో విష్ణుగోపవర్మ యొక్కయు సింహవర్మయొక్కయు శాసనములు నెల్లూరు మండలమున గాన్పించినవి, ఇవియన్నియును సంస్కృతభాషలో వ్రాయబడినవి. ఈ వంశములో గడపటి వాడయిన సింహవర్మమాత్రమే రాజ్యపరిపాలనము చేసినట్లు గన్పట్టుచున్నది గాని తక్కినవారి సంగతి తెలియుచుండలేదు. వీరిశాసనములు దశవపురము పాలక్కడ మెన్మతూర పట్టణములనుండి ప్రకటింపబడినవి. ఈ పట్టణములు నెల్లూరు గుంటూరు మండలములలోనివేగాని యన్యములుగావు. రాజకేసరవర్మయను చోడరాజుయొక్క తిరుక్కాలుక్కుండ్రముశాసనములో నొక స్కందశిష్యునిపే రుదాహారింపబడినది. [16]ఈ స్కందశిష్యుడు సింహవిష్ణు వంశములోని మొదటి నరసింవర్మకు బూర్వుడుగా నుండెనని యూహింపబడుచున్నాడు. సంస్కృతశాసనములలో నుదాహారింపబడిని యిరువురి స్కందవర్మలలో నొకడు స్కందశిష్యుడు కావచ్చునని శాసనపరిశోధకులు చెప్పుచున్నారు గాని యింకను విచారింపవలసి యున్నది. విష్ణుగోపవర్మ యువమహారాజుగా నుండినపుడు ముండరాష్ట్రములోని ఉఱవపల్లి గ్రామమును కందుకూరగ్రామములోని దేవాలయమునకు దానముచేసెనని పాలక్కడనుండి ప్రకటించిన యుఱవపల్లి శాసనమనం జెప్పబడినది. [17]ఇందు చెప్పబడిన ముండరాష్ట్రమె చోడరాజగు మూడవకులోత్తుంగుని నెల్లూరి శాసనమున ముండైనాడుగ బేర్కొనబడినది.[18] కందుకూరయనునదియె కందుకూరు. ఇవియన్నియును నెల్లూరు మండలములోనివే. తనయైదవపరిపాలన సంవత్సరమున సింహవర్మ ముండరాష్ట్రములోని పీకిరెయను గ్రామమును విలాసశర్మయను బ్రాహ్మణునకు దానము చేసినట్లుగ జెప్పబడినది. ఈ సింహవర్మయను మంగదురు(మంగలూరు) శాసనమును బ్రకటించిన సింహవర్మయు నొక్కడేయని డాక్టరు ఫ్లీటుగారు వ్రాసియున్నారు.[19] పీకిరె శాసనములోని ముద్రికయు కొంచెమించుమించుగా మఱనపల్లి శాసనములోని ముద్రికను బోలియున్నది. సింహవర్మ మంగదూరు శాసనము దశవపురమునుండి ప్రకటింపబడినది. [20]మంగదూరు శాసనములో రెండవసింహవర్మతండ్రివిష్ణుగోపుడని వర్మ తీసివేయబడి పేర్కొనబడినది. ఈశాసనమునందును విష్ణుగోపుడు యువమహారాజుగనే చెప్పబడియెను. దీనింబట్టి యితడెన్నడును రాజ్యాధికపత్యము వహించియుండలేదని యూహింప వలసి వచ్చుచున్నది. వీరకోచవర్మ (వీరవర్మ) యొక్క మునిమనుమని శిథిలమయిపోయిన శాసనమొకటి దర్శిగ్రామమున గాన్పించినది. ఈ శాసనములో నుదాహారింపబడిన రాజుయొక్క పేరు చెడిపోయినది[21]. దర్శనపురము దశనపురమైనది. దశనపుర మే నేడు దర్శియని పిలువబడుచున్నది. మెనుమూరనునది గుంటూరు మండలములోని మనుమూరు కావలయును. పాలక్కడయనునది యెద్దియోదెలియరాదు. ఈవంశపు రాజులు కాంచీపురమునుండి పరిపాలనము చేసినట్లు గానరాదు. వీరలు భారద్వాజ గోత్రులయిన పల్లవులు. వీరు కాంచీపురమునుండి తఱిమివేయ బడియుండవచ్చునని కొందఱు తలంచుచున్నారు గాని యట్లుతలంచుటకు సరియైన హేతువుగానరాదు.
స్కందవర్మకుమార విష్ణువంశము,
స్కందవర్మ కుమారవిష్ణువు; కుమార విష్ణువుకుమారుడు బుద్ధవర్మ, బుద్ధవర్మకుమారుడు కుమారవిష్ణువు. ఈ రెండవకుమారవిష్ణునిదానశాసన మొకటి నెల్లూరుమండలములోని చెందలూరుగ్రామమునఁ గాంపించినది. ఈ కుమారవిష్ణునిశాసనము కాంచీపురమునుండి ప్రకటింపఁబడినది. [22] ఈ శాసనములోని లిపిని పరిశోధించిన డాక్టరు హాల్ ట్జుగారీనలుగురు పల్లవులును రెండవనరసింహవర్మకును సింహవిష్ణువునకును నడుమనుండి యుందురని యూహించుచున్నారు. పల్లవమహారాజగు కుమార విష్ణువు కర్మకరాష్ట్రములోని భాగమగు కవచకారభాగములోని చెందలూరు గ్రామములో నెనమన్నూరు పట్టికలపొలమును అభిరూపనివాసియును. కౌండిన్యగోత్రుడును నగు భావస్కందత్రాతయను బ్రాహ్మణునకు దానముచేసినట్లుగ నీశాసనమున బేర్కొనబడినది. ఈ వంశజులు విష్ణుభక్తులయిన భాగవతులుగా బేర్కొనబడిరి. వీరును భారద్వాజగోత్రులుగను పల్లవులుగనుండిరి. ఈ రాజులును పైజెప్పినరాజులును కేవలము తమభుజబలపరాక్రమముచేతననేకరాజులనిజయించి యశ్వమేధాదియాగముల బెక్కించి నాచరించినట్లుగ గన్పట్టుచున్నది. విష్ణుగోపయని, కుమారవిష్ణువని పేరులు వహించియుండుటజూడ వైష్ణవమతము తలయెత్తి ప్రబలుచుండినకాలమైయుండుననితోచుచున్నది. వైష్ణవాళ్వారులు కొందఱయిన నా కాలమునందుండియుండవలయును. అశ్వమేధయాగముల నాచరించితిమని గరువముతో జెప్పుకొనినది వాస్తవముగాక శివస్కందవర్మశాసనము ననుసరించినదిగానున్నది. వీరవర్మవంశజులకును వీరికిని గలసంబంధము దెలియురాకున్నది.
కమ్మరాష్ట్రము.
ఈ యిరువంశములవారును 5,6 శతాబ్దములలోనివారని చెప్పవచ్చును. కుమార విష్ణుశాసనమునందు బేర్కొనబడినకర్మంక లేక కమ్మంక రాష్ట్రము పూర్వచాళుక్యరాజగు మంగియువరాజు చెందలూరు శాసనమన కమ్మరాష్ట్రమని పేర్కొనబడినది. జగ్గయ్యపేటశాసనములో నుదాహరింపబడిన కమ్మకరాఠవిషయము మేమిదివఱ కూహించిన కమ్మమెట్టుగాక యీకమ్మరాష్ట్రమెయని పైశాసనములబట్టి తేటబడుచున్నది. ఈ కమ్మరాష్ట్రమెయని పైశాసనములబట్టి తేటబడుచున్నది. ఈకమ్మరాష్ట్రమె తరువాత కమ్మనాడుగ బేర్కొనబడినందుకు దృష్టాంతములనేకములుగలవు. నన్నయ భట్టుకాలమునందుండి గణిత శాస్త్రమునురచించిన పావులూరి మల్లనకవి "ఇలగమ్మ నాటిలోపల విలసిల్లిన పావులూరివిభుండ" నని చెప్పుకొనియున్నాడు అయినను పావులూరి గ్రామము గోదావరిమండలములోనిదని రావుబహదరు వీరేశలింగము పంతులవారు తమయాంధ్రకవులచరిత్రములో వ్రాసియుండుట కాధారమేమో దెలియరాదు. పంతులవారు పొరబడియుండవలయును లేదా గోదావరిమండలములో గూడ మఱియొక కమ్మనాడుండవలయును. గుంటూరిమండలములోని కమ్మనాడే ప్రాచీనమైనదని చెప్పటకు లేశమాత్రమును సందియము లేదు. ఇప్పటియాంధ్రులలో నొక తెగవారగు కమ్మవారు కమ్మకరాఠవిషయమునకు సంబంధించినవారుగ గన్పట్టుచుండుటచేత నీ తెగవారు క్రీస్తుశకారంభమునుండి యున్నవారని చెప్పవచ్చును.
నైయోగికులు లేక నియోగులు.
కుమారవిష్ణువుయొక్క చెందలూరు శాసనమున రాజకీయోద్యోగీయులకు (Officials)నైయోగికులన్నపదము వాడబడినది. చాళుక్యరాజగు మంగియువరాజుయొక్క చెందలూరు శాసనమునందు నైయోగికులన్నపదము వాడబడినది. కాబట్టి యుద్యోగపదవులందుండిన బ్రాహ్మణులను నైయోగికులు లేక నియోగులని పిలువంబడుచుండుట క్రీస్తుశకమయిదాఱవ శతాబ్దములనుండి వచ్చుచున్నదని పల్లవచాళుక్యరాజుల చెందలూరుశాసనములు చాటుచున్నవి.
త్రిలోచనపల్లవుడు.
వీనినామము పదవశతాబ్దమునాటి పూర్వచాళుక్యుల శాసనములలోని గాథలలో వినంబడుచున్నది గాని మఱియెచ్చటను వీని శాసనము గానరాదు. ఈ త్రిలోచనవర్మపల్లవయోధాగ్రేసరుడని చెప్పంబడుచుండెను. పల్లవులకు గర్భశత్రువులగు చాళుక్యుల మొట్టమొదట నెదిరించినవాడు త్రిలోచన పల్లవుడే. వీని కాలమున నుత్తరకోసలాధీశ్వరుండగు విజయాదిత్యుడయోధ్యనుండి దక్షిణాపథముపై దండెత్తి వచ్చినప్పుడు త్రిలోచనపల్లవుడు వాని నెదుర్కొని ఘోరసంగ్రామమమును సలిపి యోడిపోయెను. చాళుక్యులకు విజయము కలిగెను. గాని విజయాదిత్యుడు యుద్ధములో జంపబడియెను. ఈయుద్ధము కడపమండలములో నెచ్చటనో జరిగియుండును. విజయాదిత్యుని భార్యగర్భవతిగానుండి ముదివేమగ్రహారమున విష్ణుభట్టసోమయాజి నింటదాగి యుండెను. ఈ ముదివేము కడపమండలములోని పెద్దమడియ మనుగ్రామమేయని జయంతి రామయ్యపంతులుగారు నిర్థారణచేసియున్నారు. త్రిలోచనపల్లవుని వంశకర్తనుగా జెప్పుకొనిన రాజవంశములు పెక్కులుగలవు. కరికాలుడను చోడరాజు త్రిలోచనపల్లవుడు తనకు సామంతరాజుగ నుండెనని చెప్పుకొని యున్నాడు. మఱియు నాతడు కాంచీపురమును సువర్ణముతో బ్రకాశింప జేసెనని చెప్పబడియుండెను. నిజముగా ద్రిలోచనపల్లవుడను నొకరాజుండిన యెడల నాతడు కాంచీపురము రాజధానిగ నాంధ్రదేశములోని కొంతభాగమును బరిపాలించియుండి యుండును.
నవీనకదంబులు_మయూరశర్మ.
ప్రాచీనపల్లవులు పాలించినదేశ మాంధ్రదేశముగా నుండినది. ఇప్పటి గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కడప, కందవోలు(కర్నూలు), అనంతపురము, బల్లారి మండలము లాకాలమున బల్లవరాష్ట్రములలోనివిగ నున్నవి. మొట్టమొదట బ్రాహ్మణులుగానుండిన వనవాసి(Banavasi) కదంబులు పల్లవుల యధికారమును ధిక్కరింప బ్రయత్నించిరి. మయూరశర్మయను బ్రాహ్మణుడే నవీనకదంబ వంశమునకు మూలపురుషుడుగ నుండెను. ఈ మయూరశర్మ విద్యాభ్యాసము నిమిత్తము పల్లవరాజధానికి బోయియుండెను. ఒకనాడొక పల్లవాశ్వికునితో మయూరశర్మకు ఘోరమైన పోరాటము సంభవించెను. ఆ జగడమునకు గారణమేమో, అదియెట్లు పర్వవసించెనో చెప్పబడి యుండలేదు. ఒకనాడు మయూరశర్మ "అయ్యో!ఈ కలియుగములో [23] బ్రాహ్మణులు క్షత్రియులకంటె బలహీనులుగానుండవలసివచ్చెనుగదా! క్రమముగా గురుకులమును సేవించి యేకాగ్రచిత్తముతో స్వశాఖావేదము నభ్యసించినవాడు పుణ్యసిద్ధికై రాజానుగ్రమహమునుకు బాత్రుడు గావలయునేని ఇంతకన్న దుఖకరమైన విషయము మఱియేమి కలదు?" అని తనలో దాను వితర్కించుకొనియెను. ఇట్టి వితర్కముతో మయూరశర్మ నిలిచియుండలేదు. అతడు తన తలంపుల నాచరణమునకు దేబూనెను. మున్ను దర్భలను, సమిథలను, పెద్దగరిటెను, కరగిన వెన్నగల యాహుతిపాత్రను జమత్కారముగ బట్టుకొన గలిగిన హస్తముతో భూమిని జయింపగోరి మండుచున్న కత్తిని వరలోనుండి పైకిదీసెను.
పిమ్మట మయూరశర్మ పల్లవరాష్ట్రముయొక్క సరిహద్దులనుండు రక్షకసైన్యముల నతిక్రమించి శ్రీశైలద్వారములవఱకు వ్యాపించి చొఱసాధ్యముకాని మహారణ్యమునంత నాక్రమించి మహాబాణుడు నాయకుడుగా నేర్పడిన రాజమండలినుండి సుంకములను జేపట్టనారంభించెను. ఇట్లనుపమానపరాక్రమవిజృంభణముచే నొప్పుచుండిన బ్రాహ్మణశత్రువును ద్వేషముతో నెదుర్కొనుట ప్రమాదకరమని యూహించి రాజ్యతంత్రజ్ఞుడయిన పల్లవరాజు వానిధైర్యసాహసములను గొనియూడుచు బలిమిచేగాక యుపాయముచే వశపఱచుకొని పశ్చిమ సముద్రతీరమునందు కొంతదేశము నొసంగి పరిపాలనము సేయంబనెను. అయిన నాబ్రాహ్మణయోధవరుని పరిపాల నానంతరము తత్సంతతివారు మాత్రము పల్లవులతోడి మైత్రిపాటింపక గర్భశత్రుత్వమునే వహించి పల్లవాధికారము నెదుర్కొనుచువచ్చిరి. కదంబులలో మృగేశవర్మయను వాడొకడు పల్లవుల కగ్నిహోత్రుడనని చాటుకొనియెను . రవివర్మయను మఱియొక కదంబరాజు కృష్ణవర్మమొదలగు రాజులను జయించుటయెగాక కాంచీపురాధీశ్వరుండును పల్లవరాజునగు చండదండుడను వానిని సింహాసనమునుండి తొలగంజేసెను. నానక్కన పల్లవరాజొకడు కదంబుడగు కృష్ణవర్మ జయించెనని చెప్పబడియెను. ఈ కదంబుల కాలమునుగూర్చి డాక్టరు ఫ్లీటుగారు చర్చించుచు నాఱవ శతాబ్దములోని వారుగ నిర్ణయించి యున్నారు. ఈకదంబులకు వీరికి బూర్వము నదు వనవాసి నగరమున మూడవశతాబ్దమును నాలుగవశతాబ్దమునను బరిపాలించి కదంబులకు నెంతమాత్రమును సంబంధములేదు. మొదటికదంబులు జైనమతావలంబకులు. ఈ కదంబులు బ్రాహ్మణులుకాని మయూరశర్మసంతతివారలు బ్రాహ్మణులు పట్టపుపేరగుశర్మ శబ్దమును విడిచి క్షత్రియుల పట్టపుపేరగు వర్మఅనుదానిని తమనామములతో జేర్చుకొనుటచేత క్షత్రియులుగానే పరిగణింపబడుచుండిరి.
మఱియొక పల్లవవంశము.
గుంటూరు మండలములోని యమరావతీ పట్టణము నొక శిలాశాసనముకలదు.[24] ఆ శిలా స్తంభము చెన్నపురిలోని మ్యూజియములో నుంచబడినది. ఈశాసన మాఱాతిమీదను క్రిందినుండి పైకి వ్రాయబడియుండుట వింతగా కన్పట్టకమానదు. అనగా శాసనమును క్రిందినుండి చదువుట ప్రారంభించవలయును. ఈ శాసనమున నేడుగురు రాజులు పేర్కొనబడిరి. భరద్వాజ ద్రోణాశ్వత్థామలు పల్లవుని పూర్వీకులుగా జెప్పబడిరి. ఈ పల్లవవంశములో చెప్పబడిన రాజులు కొందఱు నందివర్మ పల్లవమల్లుని పూర్వీకులలో బేర్కొననబడియున్నారు. ఈ శాసనములోని పల్లవ రాజులలో గడపటి వాడయిన రెండవ సింహవర్మ జయస్తంభమును నాటుటకై మేరు పర్వతమునకు బోయినట్లుగ జెప్పబడి యుండెను. ఇతడు భాగీరథిని, గోదావరిని, కృష్ణవర్ణనుదాటి ధాన్యకటకమునకు వచ్చి బౌద్ధాలయమును సందర్శించి బుద్ధధర్మమును వినెనని చెప్పబడినది. తక్కిన భాగము శిథిలమయి పోయినది. ఈపల్లవరాజు లెప్పటివారో యెక్కడ పరిపాలనము చేసిరో నిజము తెలియరాదు. ఈ శాసనములో బేర్కొనబడిన వంశము తక్కిన శాసనములలో నుదాహరింపబడిన యేవంశమునకు సంబంధింపక యున్నది. ఆయినను ఈశాసనమలో ఉగ్రవర్మయని యొకరాజు పేర్కొనబడియున్నాడు. సముద్రగుప్తుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చినప్పుడు పాలక్కడను బాలించు నుగ్రసేనుని జయిం చినట్లు చెప్పబడి యుండెను. ఈ వంశములో నాల్గవ పురుషుడుగా జెప్పబడిన యుగ్రవర్మయే యుగ్రసేనుడయిన యెడల నైదవశతాబ్దములోను కాకయుండిన నాఱవశతాబ్దములోను వీరలుండియుందురు.
చాళుక్యులదండయాత్ర.
సంహవిష్ణువంశము.
పశ్చిమచాళుక్యులు 743 వ సంవత్సరమున రాష్ట్రకూటులచే బదభ్రష్టులగువఱకు చాళుక్యులును పల్లవులును సామాన్యముగా ఘోరయుద్ధములు సలుపుచునే యుండిరి. ఈకాలమునందు సింహవిష్ణువంశములోని రాజులు తొమ్మండ్రుగురు కాంచీపురమును బాలించుచుండిరి. వీరిలో మొదటివాడు సింహవిష్ణువు. ఇతడు 575 వ సంవత్సరమున బరిపాలనము చేయుచుండినట్లు దెలిసికొనబడినది. సింహవిష్ణువు సింహళరాజును పాండ్యచోళకేరళరాజులను జయించెను.
మహేంద్రవర్మ.
సింహవిష్ణువు కొడుకును వానితరువాత రాజ్యభారమును బూనినవాడునైన యీ మొదటి మహేంద్రవర్మ తిరుచనాపల్లి చెంగలుపట్టు, ఉత్తరార్కాడు జిల్లాలలోని కొండలను జెక్కించి దేవాలయముల నిర్మించి మహాబలిపురమనియెడి మామళ్లపురములోని ప్రసిద్ధికెక్కిన సప్తగోపురములలో నొకకొన్నింటిని నిర్మించి తనపేరును శాశ్వతముగా నిలుపుకొనియెను. ఆర్కాడునకును ఆర్కోణమునకును, నడుమ మహేంద్రవాడియను పట్టణము మహేంద్రుని కొలను నిర్మించెను. నేడు శిథిలములై పోయిన వాని చిహ్నములు మాత్రము గాన్పించుచున్నవి. ఈ చెఱువుగట్టుమీద విష్ణుని కంకితము చేయబడిన గుహాలయమొకటియుండెను. ఆనాటి రాజవర్గములో బేరెన్నిక గాంచినవాడును బహుసమర్థుడును చాళుక్యుడునునగు రెండవపులకేశివల్లభుడు దండెత్తివచ్చి యీ మహేంద్రవర్మ మొదలగు పల్లవులనుజయించి వేంగిరాష్ట్రము [25]
నాక్ర మించుకొనియెను. మహేంద్రవర్మయు చాళుక్యులను గొన్ని యుద్ధములలో జయించెను.
నరసింహవర్మ.
మహేంద్రవర్మ తరువాత రాజ్యభారమువహించిన నరసింహవర్మ కాలమున బల్లవులయధికారము మిక్కిలి విజృంభించి యున్నత స్థితికి వచ్చినది. వీనికి మొదటి నరసింహవర్మయందురు. ఇతడు పల్లవుల గర్భశత్రువై భయంకురుడు గానుండిన పశ్చిమచాళుక్యుండగు రెండవపులకేశివల్లభుని రాజధానియగు వాతాపినగరమును ముట్టడించి గైకొనియెను. ఆ ముట్టడికాలమున పులకేశివల్లభుడు మృతుడయ్యెననియెదరు. ఆ దెబ్బతో జాళుక్యులు 13 సంవత్సరములు వఱకు నణగియుండిరి. పల్లవరాజగు నరసింహవర్మయధికారము దక్కనుకు మైసూరునకును వ్యాపించి నిరంకుశమైయుండెను. ఈ నరసింహవర్మ చాళుక్యులనుజయించి వాతాపినగరము గైకొన్న విషయము వాతాపికి నిప్పటి పేరగు బాదామిలోని నరసింహవర్మశాసనమే వేనోళ్లజాటుచున్నది. నరసింహవర్మకు మహామల్లుడని బిరుదుగలదు. ఇతడిటీవల వాతాపికొండనరసింగపోతరాయలని పిలువంబడుచుండెను. ఈ యుద్ధము క్రీస్తుశకము 947 వ సంవత్సరమున జరిగియుండెనని నిశ్చయింపబడినది. ఈ యుద్ధము సింహళదేశచరిత్రమగుమాహవంశమునందు బేర్కొనబడుటయేగాక తమిళపెరియ పురాణమునందుగూడ సూచింపబడినది.
రెండవమహేంద్రవర్మ.
పరమేశ్వరవర్మ.
ఇతడు రెండవమహేంద్రవర్మ కొడుకు పరమేశ్వరవర్మ యనుపేరు వహించిన వారిలో నితడు మొదటివాడు. ఈపరమేశ్వరవర్మ రాజ్యభారమును వహించి పరిపాలనము సేయుచుండిన కాలమున పశ్చిమచాళుక్యరాజును రెండవపులకేశివల్లభుని కుమారుడును నగు మొదటి విక్రమాదిత్యుడు 655 వ సంవత్సరమున నదివఱకు బల్లవులచే నాక్రమింపబడిన తనదేశమును స్వాధీనపఱచుకొనుటకై కాంచీపురముపై దండెత్తివచ్చి పరమేశ్వరవర్మను నోడించి కాంచీపురమును గైకొనియెనని విక్రమాదిత్యుని శాసనము వలన దెలియుచున్నది. అయినను తరువాత పరమేశ్వరవర్మ పెరువల నల్లూరను ప్రదేశమున విక్రమాదిత్యునితో ఘోరసంగ్రామమును సలిపి చాళుక్యుల నోడించినట్లుగ కురముగ్రామములోని పరమేశ్వరవర్మశాసనము దెలుపుచున్నది. ఎట్లయినను అదివఱకు పల్లవుల స్వాధీనములో నుండిన కందవోలు మండలమంతయు గాని కొంతవఱకు గాని చూళుక్యుల స్వాధీనమై యుండెననుట వాస్తవము. చాళుక్య విక్రమాదిత్యుని తామ్రశాసనములు రెండును, విక్రమాదిత్యుని కొడుకు వినయాదిత్యుని శాసనములు రెండును మొత్తము నాలుగు శాసనములు చాళుక్యులని యా మండలమున గానంబడుచున్నవి.
రాజసింహుడు లేక రెండవనరసింహవర్మ.
ఇతడు పరమేశ్వరవర్మ కొడుకు కాంచీపుర కైలాసనాథుని దేవాలయములో నడుమనుండిన రాజమహేశ్వరుని గుడిని కట్టించినవాడితడే.
మూడవమహేంద్రవర్మ.
రెండవపరమేశ్వరవర్మ.
ఇతడు మూడవమహేంద్రవర్మ సోదరుడు. రాజసింహునికొడుకు. సోదరునికి బిమ్మట రాజ్యభారమును వహించెను. ఇతడు కాంచీపురములోని వైకుంఠ పెరుమాళ్ల దేవాలయమును నిర్మించినవాడు. ఇయ్యది యొకశాసనములో పరమేశ్వర విష్ణుఘృతమని పిలువంబడియెను. తిరమంగయాళ్వారు స్తోత్రములలో పరమెచ్చర విన్నగరమని పేర్కొనంబడియెను. ఈ పరమేశ్వరవర్మ మరణానంతరము రాజవంశమునందు గృహకల్లోలము జనించి రాజ్యక్రాంతి సంభవించినట్లు గన్పట్టుచున్నది.
నందివర్మ పల్లవమల్లుడు.
పరమేశ్వరవర్మకు బిమ్మట సింహసనారోహణమునుగూర్చి వివాదము సంభవించి నటుల కానకుడి తామ్రసింహాసమునుందు సూచింపబడినది. పరమేశ్వరవర్మజ్ఞాతియగు నందివర్మ రాజ్యాధిపత్యము వహింపవలయునని ప్రజలెన్నికొనుటచేత నందివర్మ పల్లవమల్లుడు సింహాసనమెక్కెను. నందివర్మ పల్లవమల్లుని ఉదయేంద్రము శాసనములో నందివర్మ సేనాధిపతియగు నుదయచంద్రుడు స్వహస్తముతో జిత్పమయుండను పల్లవరాజును బంపినట్లుగ జెప్పబడియుండుటచేత గృహకల్లోలవిషయము స్పష్టమగుచున్నది. పల్లవరాష్ట్రమునందు జనించిన కలవరమును మార్పును దూరమునుండి వీక్షించుచుండిన పశ్చిమచాళుక్యరాజగు వినయాదిత్యుని మనుమడగు రెండవ విక్రమాదిత్యుడు తమకు బ్రబల శత్రువులుగనుండిన పల్లవుల రూ?పడంచుటకదియే యదనని యూహించి యమేయబలములం గూర్చికొని గుం?డక విషయమై దండెత్తివచ్చితన్నెదుర్కొనిన నందిపోతవర్మను ఘోరసంగ్రామమున జయించి తఱిమిగొట్టెను. ఈ రెండవ విక్రమాదిత్యుడు తరువాత కాంచీపురమును బ్రవేశించి పూర్వధర్మము ననుసరించి పట్టణమును నాశము చేయకుండుటయె గాక బ్రాహ్మణులకు బీదవారలకు దానధర్మములు సేయుటయె గాక కాంచీపురములోని కైలాసనాథునకు బురాతననామమగు రాజసింహేశ్వరునకు పెక్కువేల సువర్ణమును దానము చేసెను. కైలాసనాథుని దేవాలయపు స్తంభముమీద విక్రమాదిత్యుని శాసనము లిఖియింపబడినది. ఈ విక్రమాదిత్యుని దండయాత్ర పల్లవ రాజ్యాధికార విజృంభణమునకు చేసినట్లుగ గన్పట్టుచున్నది.
అపరాజితవర్మ.
నందిపోతవర్మకు దరువాత అపరాజితవర్మ రాజ్యభారమును వహించి శ్రీపెరుంబీయముకడ పాండ్యరాజగు రెండవ వరగుణుని జయించెను గాని విధివశంబున నెనిమిదవ శతాబ్దాంతమున ఆదిత్యచోడునిచే జయింపబడియెను. ఈ యుద్ధముతో పల్లవరాజ్యాధికారము చోడుల వశమయ్యెను, పల్లవరాజులు చోడరాజులకు సామంతులయిరి. పల్లవులు చోడులచే జయింపబడినట్లుగ నే పశ్ఛిమ చాళుక్యులు గూడ రాష్ట్రకూటులచే జయింపబడిరి. ఇట్లు పల్లవులయొక్కయు, పశ్చిమచాళుక్యులయెక్కయు ప్రభయంతయు నెనిమిదవ శతాబ్దముతో తగ్గిపోయి రాష్ట్రకూటులయొక్కయు, చోడులయొక్కయు, వేంగిరాజులయిన పూర్వచాళుక్యులయొక్కయు ప్రభ వికసింపసాగెను. ఇట్లు తొమ్మిదవశతాబ్దమునాటికి కాంచీపుర పల్లవరాష్ట్ర మంతరించిన మాత్రమున నింకపల్లవరాష్ట్రములు లేనని భావింపరాదు. ఆంధ్ర ద్రావిడ కర్ణాటకదేశములయందు పల్లవులు వేఱ్వేఱు శాఖలవారు ప్రత్యేకరాష్ట్రములను గలిగియుండి పదుమూడవ శతాబ్దాంతమువఱకు పరిపాలనము సేయుచుండిరి. కాని వారల యధికారములు వారిభూములను దాటిపోయి యుండలేదు.
హౌనుత్సాంగు.
క్రీస్తుశకము 640 దవ సంవత్సర ప్రాంతమన జయసింహుడను పూర్వచాళుక్యరాజు వేంగిదేశమును, మొదటి నరసింహవర్మయను పల్లవరాజు కాంచీపురమునందును బరిపాలనము చేయుచుండ దక్షిణాపథదేశములను జూచుటకై చీనాదేశపు యాత్రికుడగు హౌనుత్సాంగు బయలువెడలి మొదట వేంగిపురమునకు వచ్చెను. వేంగీపురమును పింకిలో ((Phing-ki-lo) అని పిలిచినాడు. ఈ వేంగిదేశమునకు దక్షిణమున మహాంధ్రములేక ధాన్యకటకదేశము కల దని చెప్పియున్నాడు. భూమి సారంవంతమైనదనియు, పలుపంటలు పండుచున్న వనియును, దేశమున నడవులు పెక్కులున్నవనియు, పట్టణములలో జనసంఖ్య తక్కువగ నున్నదనియు మనుష్యులు పచ్చన నలుపు గలిసిన చామనచాయవర్ణముగలిగియున్నారనియు, ధైర్యసాహసములుగలిగి భయంకరులుగా గన్పట్టినను విద్యాసక్తి కలవారుగా నుండిరని చెప్పియున్నాడు. బౌద్ధుల పురాతన సంఘారామములు శిథిలములై యున్నవనియును నూఱుదేవాలయములనేక శిష్యులను గలిగియుండగా బౌద్ధారామములు తొంబది మాత్రమే జనులచే నలంకరింపబడి యున్నవని చెప్పియున్నాడు. మఱియును ధాన్యకటకములోని బుద్ధుని గౌరవార్థముగా గట్టబడిన రెండుసంఘారామములను పూర్వశైల సంఘారామమని, అపర్ణశైలసంఘారామమని పేరు పెట్టియున్నాడు. మహాంధ్రదేశమునకు నైరుతీమూలనుండిన చోడదేశమునకు (కడపమండలము) బోయెను. దేశము కొల్ల పెట్టబడి యుండుటచేత మిక్కిలి తక్కువయిన జనసంఖ్యగలిగి యడవులచే నావరింపబడి క్రూరచిత్తులను దుష్ప్రవర్తకులయిన జనులతో గూడియున్నదని నుడివియున్నాడు. ఈదేశమును చుళియ(Chuliya) అనగా చోడదేశమని పిలిచియున్నాడు.
హౌనుత్సాంగు ఆంధ్రచోడదేశమునుండి కాంచీపురమునకు బోయెను. కాంచీపురము రాజధానిగానుండిన దేశమును తాలోపిన (Tha-lo-pi-cha) అనగా ద్రావిడదేశమని పేర్కొని యున్నాడు. భూమిసారవంతమై చక్కగ వ్యవసాయము చేయబడుచున్నదనియు, ధాన్యములు మొదలగుపంటలు సమృద్ధములుగా ఫలించుచున్నవనియును చెప్పియున్నాడు. రాజధానియగు కాంచీపురము 5,6 మైళ్ల విస్తీర్ణముగల పట్టణమనియును, దేశములో నూఱుబౌద్ధ సంఘారామములును పదివేలమంది బౌద్ధమతాచార్యులును గలరనియును, సింహళద్వీపవాసులవలెనె వీరిలోననేకులు స్థావీరవిద్యాలయమునుకు జేరిన మహాయనాశాఖాసంబంధులనియును, హిందూదేవాలయములు 90 మాత్రమె కలవనియును, దక్షిణహిందూదేశముయొక్క దక్షిణభాగములలో వలెనె దిగంబర జైనసన్న్యాసులుకూడ వేనవేలుండిరనియును, హౌనుత్సాంగు పేర్కొని యున్నాడు. ఇచ్చటిమనుజులు ధైర్యవంతులుగను సత్యసంధులుగను, విద్యాసక్తులుగ ఋజువర్తనులుగనుండిరని నుడివియున్నాడు. ఆ కాలమునాటి బౌద్ధసంఘారామములో గొప్పదగు నాలందసంఘారామమున కధిపతిగా నుండి హౌనుత్సాంగునకు గురువుగానుండిన శిలాభద్రునకు బూర్వికుడయి మహాతత్త్వ విచారకుడని ప్రఖ్యాతిగన్న ధర్మపాలునకు జన్మస్థానమగుటచేత కాంచీపురము బౌద్ధులకు బుణ్యక్షేత్రముగ నుండెను. [26] ఆ కారణముచేత నిచ్చట బౌద్ధమతాచార్యులనేకులీపట్టణమును జూడవచ్చుచుందురు. మఱికొంద ఱిచ్చటనే నివసించుచుందురు. ఈ తూర్పుతీరము నందంతటను మధ్యహిందూదేశములోని భాషనే మాటలాడుచున్నారని కూడ వక్కాణించియున్నాడు.
కాంచీపురము, బ్రాహ్మణ క్షేత్రము.
ఆ కాలమునందు కాంచీపురము బౌద్ధులకు మాత్రమేగాక బ్రాహ్మణులకును ముఖ్యస్థానముగ నుండెను. వేద వేదాంగవిదులయిన బ్రాహ్మణోత్తములనేకులు కాంచీపురమును జేరి పల్లవరాజుల పోషకత్వమున బరిషత్తులును వేదవిద్యాలయములను నెలకొల్పి స్వమతవ్యాప్తికై కృషి చేయుచు కృతార్థులగుచుండిరి. ఈ విషయము హోనుత్సాంగు వాక్యములవలన గూడ స్పష్టపడుచున్నది. ఇక్కడనుండి బ్రాహ్మణులనేకులు పల్లవరాజులచే నగ్రహారములను సర్వమాన్యభూములను బడసి బ్రాహ్మణులులేని దేశభాగములకు బంపబడుచుండిరి. దేశములో బ్రాహ్మణేతర మతముల నవలంబించిన ప్రజలే విశేషముగానున్నను బ్రాహ్మణులు తమ విద్యాప్రభావముచే రాజులనాకర్షించి కేవలము వైదికవృత్తులందు మాత్రమేగాక లౌకికవృత్తులయందును బ్రవేశించి మంత్రిత్వాధికారములను సహితముబొంది బ్రాహ్మణులను బ్రాహ్మణవృత్తులను గాపాడుచు సాధ్యమగునంతవఱకు మతాంతురలయిన ప్రజలతో వైరము బెట్టుకొనక జైన బౌద్ధమతాచార్యులపట్ల వైషమ్యమును బురికొల్పక సహనముగలిగి యొప్పియుండి జాగరూకులై మెలకువతో వర్తించుచుండుటచేత బ్రాహ్మణమతాంకురము క్రమక్రమముగా బలపడి జనసామాన్యములో సహితమునాటుకొని వేళ్లుపొఱి మహావృక్షమై శాఖోపశాఖలతో విస్తరిల్లి వర్ధిల్లుటకు హేతువయ్యెను. అప్పటికి నద్వైతమత స్థాపనాచార్యుడగు శంకరుడవతరించి యుండలేదు. అప్పటికి దక్షిణా పథమునందలి బ్రాహ్మణోత్తము లెల్లరును వేదవేదాంగ విద్యలను మాత్రమేగాక సమస్తశాస్త్రమముల బరిశ్రమచేసి యభ్యసించినవారుగ నుండిరి. ఇట్లార్య క్షత్రియులనిపించుకొనగోరిని పల్లవరాజపుత్త్రుల ప్రాపకమువలన గ్రీస్తుశకము మూడవశతాబ్దమునుండి ప్రబలిన హిందూమతము పదునాల్గవ శాతాబ్దము నాటికి దక్షిణాపథమున ముఖ్యముగా నాంధ్రదేశమున బౌద్ధజైన మతములను సంపూర్ణముగా మ్రింగివేసినది.
జైనమతము.
ఆంధ్రదేశమున బహుశతాబ్దములకాలము జైనమతము వ్యాపించి యుండుటవలన నిచ్చట జైనమతచరిత్రమునుగూర్చి కొంచెము చదువరులకు వినిపించుట యావశ్యకముగాకపోదు. జైనమత స్థాపకుడయిన మహావీరుడు గౌతమబుద్ధునకు సమకాలీనుడనియును బంధువుడనియును జెప్పెదరు. ఇతడు మగధదేశములోని పాటలీపుత్రనగరమునకు నిరువదియేడు మైళ్లదూరముననున్న వైశాలియను పట్టణమున జనించెను. అప్పుడు రాజ్యముచేయువాడు రాజుగాక క్షత్రియకుటుంబములోని నాయకులనేకులు గలిసి రాజ్యపరిపాలనము సేయుచుండిరి. నాయకసత్తాకరాజ్యము (Oligarchical Republic) అని పిలిచెదరు. ఈ మహావీరుడట్టిక్షత్రియనాయకులలో "నతివంశ"జుడగు నొకనాయకునియొక్క కనిష్ఠపుత్రుడుగానుండెను. ఇతడు ముప్పదేండ్లప్రాయముననే పారసనాథులను సన్న్యాసులలో గలిసి రెండు సంవత్సరములు సంచారము జేసిన తరువాత స్వతంత్రమతమును స్థాపించి నలువదేండ్లవఱకు ధర్మబోధన సేయుచు నుత్తరదక్షిణమాగధములయందు మఠములగొన్నిటి నేర్పాటు చేసి క్రీస్తువునకు బూర్వము 490 దవ సంవత్సరములో బరమపదము గాంచెను. ఈ మతావలంబకులను మొదట నిర్గ్రంధులని పేర్కొనిరి. అనగా వీర లేగ్రంథముల నీశ్వరదత్తములని విశ్వసించువారుకారని యర్థము. ఈ మతము వారు తమమతస్థాపకులను మహావీరులనిగూడ"జిను" లని చెప్పినందున నీ మతమున ఇటీవల జైనమతమని పేరువచ్చినది. కొంతకాలము గడచిన తరువాత దిగంబరులనియు శ్వేతాంబరులనియు వీరలు రెండుతెగలుగ నేర్పడిరి. ఈ మతము క్రమక్రమముగా దక్షిణమునకు వ్యాపించెను. అకలంకుడను జైనాచార్యుడొకడు కాంచీపురములో బౌద్ధులనోడించి వెడలగొట్టెనట. జైనులు ద్రావిడకర్ణాటభాషలలో చక్కని యుద్గ్రంథములను వ్రాసిరి. ప్రస్తుతము హిందూదేశమున 15 లక్షల జైనులు మాత్రమున్నారు.
జైనమత సిద్ధాంతములు.
1 వేదములు పౌరుషేయములు; 2 అరూగముడను సర్వేశ్వరుడొకడు మాత్రము గలడుగాని సర్వశక్తిమంతుడయ్యును తటస్థునివలె మారకుండును. 3 మనసదాచరణ దురాచరణలే మనలరక్షించుటకు శిక్షించుటకుగారణములుగాని యీశ్వరుడు మనలనిష్టమువచ్చినట్లు రక్షించుటకు శిక్షించుటకు గార ణుడుగాడు. 4 సృష్టియు సృష్టిలోని జీవులనాదులుగానవినాశనమును చెందునవి కావు 5 ఈ భూమికి దిగువన నేడునరకలోకములును, పైన బదునారు దేవలోకములును, గలవు;అన్నిటికిని బైన బదునేడవది ఆగమీంద్రలోకముగలదు.;అచ్చటనే సర్వేశ్వరుడు నివసించుచుండును; పుణ్యాత్ములగువారచ్చటికి బోయెదరు. పాపాత్ములు నరకలోకమునకు బోయెదరు. ఇదివరకు వెడలిపోయిన తీర్ధంకరులను గురువులను పూజింపవలయును; 7అహింసా ధర్మమును నాచరణములోనికి దీసికొని రావలెను. అహింసయే వీరివ్రతములలో ప్రధానమైనవ్రతముగానున్నది. జీవహింస కలుగునను భయముచేత వీరలు రాత్రి భోజనమునుమాని సాయంకాలముననే భుజింతురు. వడియగట్టని నీరును ద్రాగరు. మొదట వీరికి జాతిభేదము లేక పోయినను ఇప్పటి వారు జాతి భేధమును బాటించుచున్నారు.
ఆంధ్రదేశమున జైనమతవ్యాపనము.
ఆంధ్రదేశమున నొకప్పుడు జైనమతము వ్యాపించియున్నదని చెప్పుటకు దృష్టాంతము లిప్పటికీ ననేకములు గలవు. ఆంధ్రదేశమున నెచ్చటజూచినను జైనవిగ్రహములే గానంబడుచున్నవి. గోదావరి మండలములోని కాకినాడ తాలూకాలోనున్న ఆర్యనట్టమనుగ్రామము జైనవిగ్రహములనుగలిగి యుండి కొన్ని సమయములందు జైనపాడని పిలువబడుచున్నది. ఆవిగ్రహములే గొన్నిసన్యాసదేవులను పేరుతో పిఠాపురము వీధులలో హిందువులచే బూజింపబడుచున్నవి. అనావృష్టి కాలమున నీవిగ్రహములకు ఉత్సవము చేయంబడును. అమలాపురము తాలూకా నేదునూరు గ్రామములో ని విగ్రహములు మండలములోని యన్నింటికంటెను బెద్దవిగానున్నట్లు చెప్పబడుచున్నవి. ఇట్టి జైన విగ్రహములు కొన్ని రామచంద్రాపురము తాలూకాలోని కాజలూరు, ఎండమూరు, సీల మొదలగు గ్రామములలోనూ, పిఠాపురము తాలూకాలోని జల్లూరులోనూ, అమలాపురము తాలూకాలోని ఆత్రేయపురములోను, నగరము తాలూకాలోని దాక్షారామములోను గానుపించుచున్నవి. అమలాపురము నగరము తాలూకాలలోని పురాతనము లయినబావులు కొన్ని జైనబావులని పిలువంబడుచున్నవి. ఇట్లు గోదావరిమండలమున మాత్రమేగాక విశాఖపట్టణమండలమందును జైనస్థానము లనేకములుగలవు. జైనమతములలో బుట్టి పెఱిగిన కృష్ణా గుంటూరు మండలములసంగతి చెప్పనక్కఱలేదు. ప్రతాపరుద్రుని కాలమువఱకు ధాన్యకటకము జైనుల స్వాధీనమందే యుండెను. బౌద్ధమతమెంత క్షీణించిపోయినను ధాన్యకటకములో (ధరణికోట) బుద్ధదేవుడు పూజింపబడుచునే యుండెను.
కుమారిలభట్టు.
ఆంధ్రబ్రాహ్మణులు మొదటినుండియు వేదవిద్యాసంపన్నులై మహావిద్వాంసులై పేరెన్నిక గాంచినవారుగా నుండిరి. ఇప్పటికి నాంధ్రబ్రాహ్మణులు వేదపఠనమునందసమాన ప్రజ్ఞగలవారని డాక్టరు భాండర్‌కర్ మొదలగు విద్వాంసు లభిప్రాయము లిచ్చి యున్నారు. వేదవేత్తలయి ప్రఖ్యాతిగాంచిన యాంధ్ర బ్రాహ్మణులలో కుమారిలభట్టు మిక్కిలి ప్రముఖుడుగానున్నాడు. ఇతడేడవ శతాబ్దములోని విద్వాంసులలో మహా విద్వాంసుడుగా నుండెను. ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను. ఈ జైమిని సూత్రములలోని మతమునకే పూర్వ మీమాంసమతమని పేరు. ఇయ్యది కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపఱచుకొని హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని నిరసించెడు జైనబౌద్ధమతముల ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక ధర్మమునుప్రబలజేసెను ఈకుమారిలభట్టునకు భట్టపాదుడను మఱియొకపేరుగలదు. ఈతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందఱు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు జెప్పబడియుండుటచేత నాంధ్రుడని విశ్వసింపవచ్చును. జినవిజయమను జైనగ్రంథమునం దీక్రిందిశ్లోకము గానంబడుచున్నది.
శ్లో. ఆంధ్రోత్కలానాం సంయోగే పవిత్రే జయమంగలే
గ్రామే తస్మిన్ మహానద్యాం భట్టాచార్యః కుమారకః
ఆంధ్రజ్యోతి స్తిత్తిరిరో మాతా చంద్రగుణాసతీ యజ్ఞేశ్వర పితాయస్య.
మహానాదిర్మహాన్ ఘోర శ్రుతీనాం చాభిమానవాన్
జినానామంతక సాక్షాత్ గురుద్వేష్టాతి పాపవాన్.
ఇతడాంధ్రజాతివాడనియును, తైత్తరీయశాఖవాడనియును, ఈతనితండ్రి పేరు యజ్ఞేశ్వర భట్టనియనియును, ఈతని తల్లిపేరు చంద్రగుణాయనియును, ఈతడాంధ్రోత్కల సంయోగ ప్రదేశమనగా నిప్పటి గంజాము జిల్లాలో జయమంగలమను గ్రామమునందు జనించెననియును పైశ్లోకముయొక్క భావమైయున్నది. జైనులు తమ మతగ్రంథముల నితరులకు జూపనందున బూర్వాచార పరాయణుడైన యీమహావిద్వాసుడు జైనవేషము వేసికొని జినాచార్యులవద్ద నాజైన ధర్మతత్వములను నేర్చుకొని తరువాత జైనమత ఖండనము జేసినందున జైను లీతనని గురుద్రోహియనియు, పాపుడనియును నిందించెదరు. ఇతడు మహావాదియని వీని ప్రతిపక్షులయిన జైనులే యొప్పుకొనిరి. మఱియు నీతడు మేదినీపురరాజయిన సుధన్వుని శిష్యునిగ జేసికొని వానిచే బౌద్ధజైనుల ననేకుల జంపించెనని చెప్పెదరు కాని అదివాస్తవమైనను గాకపోయినను జైన బౌద్ధమతములడుగంటుటకు నితడు కొంతవఱకుగారకుడని చెప్పవచ్చును. జైమిని కృత మీమాంసపై నితడు వ్రాసిన భాష్యములో వర్ణింపబడిని సాంప్రదాయమునకు భట్టమతమని పేరుకలదు. వేదములో వర్ణింపబడిన యజ్ఞ యాగాదికర్మలు చేయుటవలన ముక్తికలుగునని కుమారిలభట్టు యొక్క సిద్ధాంతమై యున్నది గనుక నితడు కర్మమార్గవాదియని యుత్తరమీమాంసకు లనియెదరు. కుమారిలభట్టు రెండుశతాబ్దములకు బూర్వమే బౌద్ధజైనులపై దండెత్తి వాగ్యుద్ధములను సలుపుటవలన శంకరాచార్యునికి మార్గము సులభమయ్యెను.
బ్రాహ్మణులు-సముద్రయానము.
(క్రీ.శ. 405-411)
అయిదవ శతాబ్దారంభమున చీనాదేశస్థుడగు ఫాహియాన్ అను యాత్రీకుడొకడు బౌద్ధక్షేత్రములను సందర్శించుటకును బౌద్ధధర్మగ్రంథము నభ్యసించు నిమిత్తమును హిందూదేశమునకు వచ్చియుండి యాఱుసంవత్సరములు దేశసంచారము చేసి హిందూదేశము యొక్క యాకాలపుస్థితిని గొంతవ్రాసిపెట్టినాడు. ఇతడు హిందూదేశమంతయు దిరిగిచూచిన తరువాత తామ్రలిప్తినగరమున నోడయెక్కి బహుదినములు ప్రయాణము చేసి సింహళద్వీపమునకు బోయి యచ్చట కొంతకాలము నివసించియుండి పిమ్మట వర్తకులదైన యొకయోడనెక్కి తొంబది దినములకు జావాద్వీపమును బ్రవేశించెను. ఇన్ని దినములు ప్రయాణము చేయుటకు గారణమును దెలిపియున్నాడు. ఇతడెక్కిన యోడలో రెండువందల బాటసారులు గలరు. మార్గమధ్యమునందొక గొప్పతుపానుపట్టుట సంభవించెను. ఓడకొక చిన్న రంధ్రముగూడ పడెను.ఓడలోనిసరకులను సముద్రములో బాఱవేయవలసి వచ్చెను. తానుసంపాదించిన మతగ్రంథములను విగ్రహములను పటములను వర్తకులు సముద్రములో బాఱవేయుదురేమో యని ఫాహియాన్ భయపడెను. అట్టిదేమియును తటస్థింపలేదు. కాని మూఢవిశ్వాసముగలిగిన బ్రాహ్మణులు కొందఱు తన్నుగూర్చి తమలో దామిట్లని వితర్కించుకొనిరట. ఈ శ్రామణుడు మనతోగూడ నోడపైనుండుటచేత మనమదృష్టవిహీనులమై యీవిపత్తు పాలబడితిమి;ఒక్కని కొఱకు మనమందఱము చావరాదు ; ఏద్వీపము మనకుగానంబడినను ఈ భిక్షువును భూమిమీద విడిచిపెట్టి మనము పోవుదము అయినను ఫాహియానుకు రక్షకుడుగానుండిన యాతడు వాని నొంటరిగ నేకాంతద్వీపమున జనిపోవునట్లుగ దిగవిడిచిపోవుటకై సమ్మతింపక ధృఢముగా వానిపక్షమున నిలిచియుండినట! ఈ యాత్రీకుడు జావాద్వీపములో పాషండులును బ్రాహ్మణులును వర్థిల్లించుండి రని నుడివియున్నాడు. హిందువులు వర్తకము చేయుటకై యాంధ్రరాజులకాలముననే యచ్చటికి బోవుచుండిరని యిదివఱకై వ్రాసియున్నారము. తరువాతను సహితము హిందువులు వర్తకము చేయుటకై యచ్చటికి బోవుచుండిరి. ఫాహియాన్ బ్రాహ్మణులాద్వీపమున నుండిరని వ్రాసిన విషయ మబద్ధముకాదు. నాల్గవశతాబ్దమునందు వేంగిరాజు లయిన పల్లవులు జావాసుమత్రాద్వీపములను జయించినట్లు గానంబడుచున్నది. జావాసుమత్రాదీవులలో గొన్ని శాసనములు గానవచ్చుచున్నవి. కళింగదేశముననుండు నాగరికత జావాసుమత్రాదీవులకు వ్యాపించెనని గాథలలో జెప్పుకొనుట మాత్రముండెను. గాని చాలాకాలమువఱకు బ్రత్యక్ష నిదర్శనమేమియుగానరాకుండెను. ఇటీవల కాలధర్మమునొందిన కోహెన్ స్టువార్టుగారి వలన గనుగొనబడిన రెండుశాసనములవలన కాయి, జావా లిపుల యుత్పత్తియొక్క నిజతత్వము బోధపడినది. ఈ రెండును సంస్కృత భాషలో వ్రాయబడినవి. వీనిలోని లిపి వేంగిరాజుల ప్రాచీన శాసనములలోనిలిపిని బోలియున్నది. బెయిటన్ జార్గునకు ననతిదూరమున నున్న జాంపియా(Tjampea) జాంబో(Djambo) అను ప్రదేశములలోని కొండలపై సంస్కృత శ్లోకములు మనోహరముగా జెక్కబడియున్నవి. హిందూరాజుయొక్క పాదములను నీకొండలపై నీద్వీపములను జయించి నందుకు గుర్తుగా జెక్కబడినవి యూహింపబడుచున్నది. ఈమహాకార్యమును నిర్వహించినది పూర్ణవర్మయని పేరు దెలుపబడినది. ఈ శాసనములను బోలిన మఱియుకొ శాసనము జెబాన్కోపి(Xebon Kopi) అను ప్రదేశమున గానవచ్చుచున్నది. ఈ మూడు శాసనములు సుండాదీవులలో మిక్కిలి పురాతనములయినవిగ గన్పట్టుచున్నవి.
కాబట్టి శాసనపరిశోధకుల యభిప్రాయము ప్రకారము పూర్ణవర్మ కళింగమును, వేంగిని, కాంచీపురమును బాలించిన పల్లవులలోనివాడై యుండవలయునని బోధపడుచున్నది. ప్రాచీన వేంగిపల్లవశాసనములలిపిని బోలియుండుటచేత నైదవ శతాబ్దమున కీవలివాడుగాడని చెప్పవలసియుండును. ఆ కాలము నందలి పల్లవులందఱు నొక్క కూటములోని వారేగాని యన్యులుగారని డాక్టరు బర్నలుగారు సహితము నుడువుచునేయున్నారు. కాంచీపురమును బాలించిన ప్రాచీనపల్లవుల దేశములో విశేషభాగ మాంధ్రదేశముగానే యుండుట చేత బూర్ణవర్మ యాంధ్రదేశములోనివాడేయనియు, వానితో జావాద్వీపమునకు బోయున బ్రాహ్మణు లాంధ్రద్రావిడబ్రాహ్మణులై యుందురనియు జెప్పవచ్చును. సుమత్రా జావాద్వీపములలోని క్లింగులను వారు కళింగదేశమునుండి వచ్చిన తెలుగువాండ్రని పెక్కండ్రు చరిత్రకారులు తలంచుచుండగా డాక్టరు బర్నెలు గారుత్తరద్రవిడదేశ తీరమునుండి వచ్చిన ద్రమిళులని యభిప్రాయపడుచున్నారు. ఇప్పటి ద్రమిళులు సుమత్రాద్వీపమునందు విశేషముగానున్నను ప్రాచీనక్లింగులు కళింగదేశమునుండి వచ్చినవారని యూహించుటకు క్లింగుశబ్దము కళింగ శబ్దమునుండి పుట్టినదని సూచించుటయె ప్రబలాధారముగానున్నది. ఏదియెట్లున్నను పల్లవులకాలమున తూర్పుతీరమునకు సమత్రా జావా ద్వీపములకును వర్తకవ్యాపారము విశేషముగా జరుగుచుండెననియు, ఈ రెండు దేశములనడుమ నోడలు నడుపబడుచుండెననియు, ఆంధ్రద్రావిడ బ్రాహ్మణులు సహితము బరదేశగమనమును నౌకావిహారమును జేయుచుండిరనియును స్పష్టముగా జెప్పవచ్చును. పూర్వమెనుబది తొంబదిదినములవఱకు సముద్రయానము చేయుచుండిన బ్రాహ్మణోత్తములసంతతివారు సముద్రయానము కూడదని నేడు వాదించుట వింతగా గన్పట్టకమానదు. అప్పటి బ్రాహ్మణులయున్న స్థితికిని ఇప్పటి వారి యున్నత స్థితికిని గలకారణము తప్పక గోచరము గాకమానుదు. సముద్రయానము కూడదనివాదించు బ్రాహ్మణులు తమ పూర్వులు వృత్తాంతమును జదువుకొని జ్ఞానవంతులయి దురాగ్రహమును విడిచిపెట్టి దేశాభివృద్ధి కడ్డుపడకహిందూమాతయొక్క అభ్యుదయపరంపరాభివృద్ధికై పరదేశములకుబోయి వచ్చినవారిని భాధింపక యాదరింతురుగాక.
వైష్ణవ మతము.
పల్లవులు నందిని తురాయిగను ఖట్వాంగమును టెక్కెముగ నవలంబించి సర్వసాధారణముగ శైవులుగనున్నను సంస్కృత శాసములం బ్రకటించిన వారిలో గొందఱు వైష్ణవభక్తి పరాయణులుగనున్నట్లు గన్పట్టుచున్నది. కుమార విష్ణువు విష్ణుగోపవర్మ సింహవిష్ణువు మొదలగు పేరులు వైష్ణవమతమును దెలుపునవియైయున్నవి. కుమార విష్ణువు మొదలగు రాజులు విష్ణువాచభక్తిరతులమయిన భాగవతులమని చెప్పుకొనుటయె వారు వైష్ణవమతావలంబుకులని ధ్రువపడుచున్నది. ఈ కాలమునందే వైష్ణవమత యున్నత స్థితికి వచ్చుచున్నదని యూహింపదగియున్నది. ప్రాచీన వైష్ణవాళ్వారు లీకాలమునందే తలయెత్తిరని యూహింపదగియున్నది. ఈ యళ్వారులలో తిరుమలీశైయాళ్వారును పల్లవరాజొకడు మొదట పరిభవించి తురువాత పశ్చాత్తప్తుడయ్యెనని యొకవైష్ణవగాథగలదు. ఆఱవ శతాబ్దములోని పల్లవులు కొందఱు వైష్ణవమత మవలంబించినను మఱికొన్ని శతాబ్దములవఱకు విజృంభింపకయుండెను. ఇంతకంటె బల్లవరాజులకాలమున వైష్ణవమతమును గూర్చి చెప్పవలసిన విశేషచరిత్రాంశమేదియును గానరాదు.
గాంగపల్లవులు.
పల్లవుల మహారాజ్యాధిపత్యమెప్పుడస్తమించినదో సరియైనకాలము దెలియరాదు గాని నందివర్మ పల్లవమల్లుడే కడపటివాడని విశ్వసింపబడుచుండుటచేత నెనిమిదవ శతాబ్దాంతముతో బల్లవ సామ్రాజ్యమస్తమించినదని చెప్పదగియున్నది. ఇట్లెనిమిదవ శతాబ్దముతో బల్లవ సామ్రాజ్యమంతరించినను ఆంధ్ర ద్రావిడ కర్ణాటకదేశములయుందు బల్లవరాజు లధికార పరిమితిగల చిన్న చిన్న రాజ్యముల కధిపతులై మఱికొన్ని శతాబ్దముల కాలమువఱకు దక్షిణ హిందూదేశమునందు దమతమ పాత్రములను బ్రదర్శించుచునే యుండిరి. కడపటి పల్లవుల చారిత్రము సంగ్రహముగా నొకింత యిట వివరింతుము. ఈ పల్లవకుటుంబములో నొకశాఖవారు కర్ణాటగాంగులతో సంబంధముగలవారమని దెలుపుకొనుచు దొమ్మిదవశతాబ్దాంతమువఱకు తొండైనాడులో విశేషభాగమును బరిపాలించుచువచ్చిరి. వీరలును భారద్వాజగోత్రులమనియును మహాభారతవీరుడైన యశ్వత్థామసంతతి వారమనియు జెప్పుకొనుచుండిరి. ఈ గాంగపల్లవరాజులలో విజయదంతివిక్రమవర్మ, విజయనందివిక్రమవర్మ, విజయనృపతుంగువిక్రమవర్మ, విజయపరాజితవిక్రమవర్ణ యునురాజులు ప్రముఖులుగా గన్పట్టుచున్నారు. తక్కిన విజయనరసింహ విక్రమవర్మ విజయస్కందశిష్యవిక్రమవర్మ, విజయేశ్వరవర్మ అనుమువ్వురు రాజులను పేరులనుబట్టిచూడగా బైవారికి సంబంధించిన వారుగనే గన్పట్టుచున్నారు. ఈ పై నుదాహరించిన గాంగపల్లవులలో నృపతుంగవిక్రమవర్మ శాసనములు బహుభూములయందు బెక్కులు వ్యాపించియుండుటచేత మిక్కిలి పరాక్రమ వంతుడని యూహింపబడుచున్నాడు అపరాజిత విక్రమవర్మ కడపటివాడుగా బరిగణింప బడుచున్నాడు. కుంబకోణమునకు సమీపము నందుండిన శ్రీపెరుంబీయమను ప్రదేశమున నితడు వరగుణుడను పాండ్యరాజు నోడించెను. తొమ్మిదవ శతాబ్దాంతమునందు ఆదిత్యుడను చోళరాజు చేత జయింపబడియెను. అంతటితో వీరి రాజ్యము చోడుల వశమయ్యెను. మైసూరుదేశములోని గాంగవాడి రాజులయిన పశ్చిమగాంగులును బాణులును గాంగపల్లవులకు లోబడినవారని చెప్పెదరు. బాణరాజులనుగూర్చి ప్రత్యేకముగ వేఱొక ప్రకరణమున వివరింతుము.
మఱియొక పల్లవవంశము.
గాంగపల్లవులతో గూడ మఱియొకపల్లవవంశము తొండైనాడులోని మఱియొక భాగమును బరిపాలించుచుండెను. వీరు నందివర్ణ పల్లవమల్లుని వంశములోని వారమని చెప్పుకొనుచుండిరి. తిరువళిక్కేణిశాసనమునందు దంతవర్మ మహారాజు పేరుగానంబడుచున్నది. నాలాయిర ప్రబంధములోని వైరమేముడు తొండై యారునకు రాజని చెప్పబడియెను. తెల్లరేరిండ నందిపోతరాయనిశాసనములు కాంచీపురములోను తంజావూరుమండలములోని కొన్ని గ్రామములలోను గానంబడుచున్నవి. పల్లవరతిలక వంశమునకు సంబంధించిన నందిపోతరాయరను మఱియొక పల్లవరాజుగలడు. ఈ రాజులకును గాంగపల్లవులకునుగల సంబంధము భావిపరిశోధనలవలన గాని గానరాదు. రాష్ట్రకూటరాజయిన మూడవ గోవిందరాజుచే జయింపబడిన దంతిగయను కాంచీపురాధీశ్వరుడు గాంగపల్లవ వంశములోని వాడోయైయుండవచ్చును.
నలంబవాడిపల్లవవంశము.
ద్రావిడపల్లవులు.
తొమ్మిదవ శతాబ్దమున గాంగపల్లవు లాదిత్యచోడుని చేజయింపబడిన తరువాత ద్రావిడదేశములోని పల్లవులు చోడరాజులకడ నుద్యోగపదవులనువహించి వారలను గొలుచుచుండిరి. కళింగట్టుపారణియను ద్రవిడభాషా కావ్యములో జెప్పిన ప్రకారము మొదటికులోత్తుంగ చోడుని కాలములో (క్రీ.శ.1080 మొదలుకొని 1117వఱకు) కళింగదేశముమీదికి దండయాత్రవెడలిన కరుణాకర తొండైమానను రాజుపల్లవుడును చెంగలుపట్టు మండలములోని వందలూరు సంస్థానాధిపతియునై యుండెను. విక్రమచోడుని క్రిందిరాజులలో తొండైమానురాజు మొదటివాడుగానుండెను. పండ్రెండవ శతాబ్దములో పాండ్యరాజ్యాధిపత్యమును గుఱించి జరిగిన యుద్ధములో తొండైమానురాజు కులశేఖరుని పక్షమున జేరెను. కారట్టట్టాంగు గ్రామములో నొకభాగమును బ్రాహ్మణులకు దానముచేసిన సామంతనారాయణుడను సంస్థానాధిపతి తంజావూరు శాసనములలో నొకదానిలో తొండైమానని పిలువంబడెయను. తొండైమానను పేరు క్రమక్రమముగా బల్లవదేశమునుండి చోడదేశమునకు బ్రాకినది. పల్లవరాజని బిరుదువహించి పుదుకోటను బాలించుతొండైమాను రాజుపల్లవులవంశమున జనించెనని తలచుటకు గారణముకలదు.
త్రినయనపల్లవవంశము.
తాము త్రినయనపల్లవులవంశములోని వారమని చెప్పుకొనుచుండిన కొందఱు స్థానికరాజులయొక్క శాసనములనేకము లాంధ్రదేశములో గానంబడుచున్నవి. ఈ త్రినయనపల్లవుడే ముక్కంటికాడుదిట్టియని పిలువంబడుచున్నాడు. ఈ రాజులను తాము భారద్వాజగోత్రులమని చెప్పుకొనియుండిరి. వీరును కాంచీపురమున కధిపతులుగనుండిరి. కాంచీపురము కామాక్షీదేవాలయములోని కానుకోట్యాంహికకు భక్తులుగనుండిరి. వీరిశాసనములు కడప కందవోలు [27] నెల్లూరు మండలములలో13 వశతాబ్దమువఱకును గానిపించుచున్నవి. వీరిచారిత్రముల నికమీదట రాబోవు ప్రకరణముల వివరింతుము. ఆంధ్రదేశమును బాలించిన రెడ్లుకొందఱు పల్లవాదిత్యులమనియు పల్లవత్రినేత్రులమనియు, బిరుదుపేరులు వహించుటచూడ వీరలకును బల్లవులకు సంబంధము కలదని చరిత్రకారులూహించుచున్నారు. వీనింగూర్చి వారలచరిత్రమును దెలుపుసందర్భమున వివరించి వ్రాయుదుము. కాంచీపురమునుబాలించిన నందివర్మపల్లవమల్లునివంశములో జేరిన కలివర్మకు చాళుక్యుడగు రెండవతాళరాజు వెలనాటి సీమలో నొక గ్రామమును దానముచేసెనని తాళరాజు శాసనమువలన ధ్రువపడుచున్నది. ఇయ్యది నందివర్మ పల్లవమల్లుని వంశములోని యొక కుటుంబమువా రాంధ్రదేశమున స్థిరముగా నిలిచిపోయిరని చెప్పుటకు ప్రత్యక్ష ప్రమాణముగా నున్నది.
ఆంధ్ర ద్రావిడ దేశములలోని పల్లె తెగవారును మఱికొన్ని తెగలవారును తాము వహ్నికుల క్షత్రియుల మనియును, పల్లవరాజుల సంతతివారమనియును జెప్పుకొనుచున్నారు.[28]
- ↑ Ep.Ind. Vol I page. 2;
- ↑ Ibid Vol Vl.p.85. ఇది మైదవోలులో మైదవోలు జయరామయ్యగారి పొలములో దొరకినది మ జయంతి రామయ్యపంతులు బి.ఎబి.ఎల్ గారివలన బంపబడినది.
- ↑ శివస్కందవర్మకు బూర్వముండిన శాసనములలో నాంధ్రశబ్దముపయోగింపబడియుండలేదు. ఆంధ్రమనుమాట ఉపయోగింపబడిన శాసనమిదియె మొదటిదని తోచుచున్నది. ఆంధ్రపఖమె ఆంధ్రమండలమని కొన్ని శాసనములలో బేర్కొనబడినది. అఱవలశాసనములలోనియ్యది వడుగావళియ్ని పేర్కొనబడినది.
- ↑ The Journal of the Royal Asiatic Society,Vol XXI. (New series),IV. pp 1111 to 1124,
- ↑ Epigraphla India Vol vii, p. 315.
- ↑ District Manual of Godavary
- ↑ రెండవ ప్రకరణమున 9 దవపేజీ చూడుడు
- ↑ Madras Journal of Literature and Science Vol XJX p.327
- ↑ Ep. Ind. Vol Viii. pp.145-116. ఇది గుంటూరు మండలములోని కొండకూరులో మాధవరావువలన కనగొనబడినది.
- ↑ Indian Antiquary. Vol V.p. 175
- ↑ Ins No 155 of Annual Report on Epigrapliy of 1899
- ↑ Indian Antiuary Vol IX, pp.101,103
- ↑ EP-Ind- Vol IV,pp. 142,143
- ↑ Compare Ind Ant, Vol XV p. 274; and South Indian Inscriptions, Vol II, 358 note 2
- ↑ Indian Antiquary Vol, XIII p. 48.ఈ శ్రీకాకుళశాసనమును, కోమర్తిశాసనమును జి.విరామమూర్తిపంతులుగారి వలన బంపబడినవి.
- ↑ Ep. Ind Vol. III. p. 279;
- ↑ Ind. Ant, Vol V.
- ↑ Reports on Epigrappy In Madras. G- O. Public No195 of 1894.
- ↑ The Bombay Gazetteer Vol ff.1 part II, p, 321
- ↑ Ind. Ant, vol V, pp.154 ff.
- ↑ Ep. Ind. Ant, Vol I, p 397 f.
- ↑ Eph.Ind.Vol.viii pp.233 236
- ↑ Animal Report on Epigraphy for 1905-1906 part II para 15.
- ↑ Madras Journal of Literature and Science1886-87 p.56.
- ↑ Prof. Kielhorn (op.cit, p. 20)
- ↑ Beat, Records, ii, 228. 30,- Life, pp 138.W; Walters, ii,226 8 It-sing, Records of the Buddhist Religion trans Takakusu; pp. XIX,Iviii,179,181
- ↑ Journal of the Royal Asiatic Society 1909; see notes on Archeological Exploration in India 1908-09 by Mr,F. H.Marshall, p.1084
- ↑ Journal of the Royal Asiatic Society, 1909; see Notes on Archeological Exploration in India 1908-09 by Mr. F.H. Marshall p. 1084.