ఆంధ్రభాషార్ణవము/తృతీయకాండము

వికీసోర్స్ నుండి

తృతీయకాండము

విశేష్యనిఘ్నవర్గము

క.

శ్రీతరుణీశతజనకీ, భూతాక్ష తురంగితోక్ష మురభిత్ప్రముఖో
ద్గీతరణాఖ్యాతగుణా, భూతగణాధీశ మాతృభూతమహేశా!

1


గీ.

చను విశేష్యనిఘ్న సంకీర్ణ నానార్ధ, కావ్యయ క్రియాఖ్య లమరువర్గ
ములు తృతీయకాండమునను గ్రమంబుగా, మహితగుణసమేత మాతృభూత.

2


సీ.

మను మేలువాఁ డనఁగను శుభకరసంజ్ఞ మంచివాఁ డనఁగ శోభించు సుకృతి
వటరియం చనఁగ నేర్పరి యన రవరవ వంటనా జాణనాఁ దగు సమర్థుఁ
డలరు జూ టనఁగ జిత్తులవాఁ డనంగ వంచకుఁ డీవికాఁడునాఁ జనును దాత
తెలివికాఁ డనఁగను వెలయుచుం నభిజ్ఞుఁ డాఢ్యుఁడు విలసిల్లు నాస్తికాఁడు
నాఁగఁ గలవాఁడు నాఁగను నచ్చుకుప్ప యనఁగ విడిముడిఁ గలవాఁ డటన్నఁ దిండి
పోతనఁగ భక్షకాఖ్యయై పొలుపుఁ గాంచుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

3


గీ.

పరఁగు దాళీకుఁ డనఁగ దీర్పరి యనంగఁ, గార్యకర్తకుఁ బేరుగా ఖ్యాతసంజ్ఞ
యగును బేరైనవాఁడు వాసైనవాఁడు, మంతుకెక్కినవాఁడునా మాతృభూత.

4


గీ.

తనరు నడ్డములేనివాఁ డనఁగ నిచ్చ, నుండువాఁ డన నిరవగ్రహుండు చాలు
మాసి పనుపరి యనఁగను భాసిలుఁ బర, తంత్రనామంబు మాతృభూతాభిధాన.

5


సీ.

మదట తొండొరుతొండు నుదల మాలుగుఁబోతు చండి సోమరి నలి తిండికాఁడు
దుండుబలి యనంగఁ దోఁచు బ్రాల్మాలినవాని పేరై పనివాఁ డనంగఁ
గర్మకారుం డొప్పుఁ గరదక్షుఁడు వితమరి హర్వుకాఁ డనఁ బరఁగుచుండు
వఱలు జాల్ముఁడు చెఱపనచేట యనఁగను బలలాశి కౌఁచుమేపరి యనఁ దగు
ననద యనఁగ ననాథుండు దనరుఁ బొట్టపోసికొనువాఁ డనంగను బొట్టసారు
వాఁ డనఁగ వెలయు నుదరంభరిసమాఖ్య భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

6


సీ.

ఆఁకొన్నవాఁ డన నదనైనవాఁ డన శోభిలుచుందురు క్షుధితసంజ్ఞ
వెఱ్ఱి వెంబరవిత్తు వెంగలి నీఱిఁడి పెడఁగు వేఁదుఱు తిక్క వెకలి యనఁగ
నున్మాదిసంజ్ఞయై యొప్పుచుండును మస్తు వాఁ డన మత్తుఁడు పరఁగుచుండుఁ
జెడుగు గావరి నీచు చెరికి కేడ ములుచ బేరజ మన ధూర్తుపేరు వెలయుఁ
గరడి యడిగొట్టు పలువ యేతరి గరాసు చెనఁటి చెన్నట్టి కూళ్ళ కుచ్చితుఁడు మొండి
కట్టె నాఁగను గుజనాఖ్యగాఁ జెలంగు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

7


గీ.

మొరసు మోటు సిసాళినా మూఢుఁ డొప్పుఁ, దనరు శాలీనసంజ్ఞ మేదకుఁ డనంగ
నెసఁగుచుండును బ్రియవాది యిచ్చకాల, మారి యన వైశ్యకన్యకామాతృభూత.

8

సీ.

అలరుఁ దంటలమారి యన నవినీతుండు భయశీలుఁడౌ వెఱపరి యళుకరి
కోళె నాఁగను వెఱఁగుపడువాఁ డనఁగను విస్మయాన్వితసంజ్ఞ వెలయుచుండు
గాందిశీకుఁ డగు దిక్కామెకం బనఁగను బ్రౌఢుండు ప్రోడనాఁ బరఁగుచుండు
దీయువాఁ డనఁగను దెలియనౌ గ్రహయాళు పతయాళు వగుఁ బడువాఁ డనంగ
మ్రొక్కువాఁ డన వందారు పొలుచుచుండు ఘాతకుఁడు నొంచువాఁ డనఁగాఁ జెలంగు
నుబుకువాఁడన వర్ధిష్ణుఁ డొప్పుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

9


సీ.

ఉత్పతిష్ణువుసంజ్ఞ యొప్పును నెగయువాఁ డనఁ దాఁటువాఁ డనఁ దనరు లంఘి
విసువాసి యనఁగను వెలయు విశ్వాసి సిగ్గరి యన హ్రీమదాఖ్యయయి చెలఁగు
హౌసుకాఁ డనఁగను నగు భోగి గుమ్మఁడంచనఁగను జికిలికాఁ డనఁగ సొగసు
కాఁ డనంగను వన్నెకాఁ డనంగను నీటుకాఁ డనఁగా నలంకారి యొప్పు
నుండువాఁ డన వర్తిష్ణుఁ డొప్పుఁ ద్రోయువాఁడు విలసిల్లుచుండుఁ దోపరి యనంగ
మేదురసమాఖ్యయౌ మినమిననివాఁడు గరగరనివాఁడు నాఁగను గాలకంఠ.

10


సీ.

జట్టికాఁ డనఁగను జనుఁ గ్రేత తరుగరి యనఁగను దత్సహాయాఖ్య చెలగు
నగు బ్రధానాభిధ యంకెకాఁ డనఁగను గోపకాఁ డనఁగను గోపి దనరు
బలువిడి యనఁగను బల్లిదుం డనఁగను దండివాఁ డన బలాఢ్యుండు చెలఁగుఁ
బరఁగును క్షంత యోర్పరి యనఁ దాలిమకాఁ డర జాగరూకాభిధాన
మలరు మెలఁకువకాఁ డన నగును గూర్కువాఁ డనంగను నిద్రానువర్తి పేరు
వెలయు మాటల మారినాఁ బ్రేలువాఁడు నాఁగ వాచాటుఁడై యొప్పు నాగభూష.

11


సీ.

పొలుచు నసత్యుండు బొంకరి యన రజ్జులాఁ డనంగను జల్లికాఁ డనంగ
మ్రోసెడిది యనంగ ముఖరాఖ్య తగు నత్తివాఁ డన లోహలవాచకమగు
వ్యర్థభాషుఁడు వళావళికాఁ డనం దగు గెలివివాఁ డనఁగను జెలఁగు రవణుఁ
డజ్ఞుండు తగు దమ్ముఁ డంభస్తనంగను గఠినాత్ముఁ డొప్పును గడుసరి యన
వెలయు నగ్నుండు దిసమొల బిత్తలియనఁ దనరు వెలిఁబడ్డవాఁ డనఁగను బహిష్కృ
తుండు బరికాయ కొంటెనాఁ దోఁచు భ్రష్టుఁ డాతతదయారసోపేత మాతృభూత.

12


సీ.

కొండెకాఁ డనఁగను గొండెగీఁ డనఁగను గొండియుఁ డనఁ బిశునుండు వెలయుఁ
జిట్లుకట్టె యనంగఁ జెలఁగును శకుఁడు సంకరుఁడు రాజిలును బల్గాకి యనఁగ
కొద్దికాఁ డనఁగను క్షుద్రుండు తగు ఖలుం డొప్పు వాట్లఁ డనంగ నులిపికట్టె
యనఁగను బాట్లని యనఁ జెట్లకొఱవినాఁ దగు ననర్హాభిధ తగనివాఁడ
నం స్త్రీభాషి దోఁచు నాఁడంగి యనఁగ నాగడీఁ డనఁ బరిహాసకాఖ్య చెల్లు
నలరు నొప్పనివాఁడునా నప్రకాశ్యుఁ డొప్పు మిడిమేల మన దుస్సహుఁడు మహేశ.

13

సీ.

పశ్యక్రియావేది వఱలు మందులమారి యన వేడువాఁ డన యాచకుఁ డగు
నగచాట్లమారినాఁ దగును గష్టాత్ముండు వెలయు దరిద్రుండు పేద యన బీ
కారి యంచన బరెకట్టెనా నతిదరిద్రుఁడు నిరుపేదనా నడరుచుండు
రవణము చొక్కము రకము చొకాటము రాణ చొక్కాటము నాణెము చొక
గొనబు తియ్యంబు జాను తిన్ననిది బాగు చొక్కటంబన వెలయు మంజులసమాఖ్య
యలరు వలచినది యనఁ బ్రియంబు పేరు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

14


సీ.

మక్కు మాసినదినా మలినంబు విలసిల్లు సుద్దమం చనఁగను శుద్ధమొప్పు
నిచ్చలం బనఁగను నిర్మలంబై తోఁచు రుత్తలొటారంబు రిత్త బీడు
సొళ్ళునా రిక్తాఖ్య శోభిల్లుఁ గన్నాకు మేల్బంతి నికరము మేటి మేలు
తర మాణి యంచనఁ దనరు శ్రేష్ఠము సింగమనఁ జందమామ యంచనఁగ మిన్న
యనఁగ బెబ్బులి యన మదహత్తి యనఁగఁ బైకడను నిల్చి శ్రేష్ఠమై పరఁగుచుండు
హసదు నాఁగను దొడ్డవాఁ డనుట కొప్పు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

15


సీ.

బహుత నన్యులఁ దెల్పుపట్ల హేమాహేము లనుపల్కు పూజ్యార్థ మగుచునుండు
నుపసర్జనాఖ్యయై యొప్పును సందడికాండ్రునాఁ జిల్లరవాండ్రు నాఁగఁ
పెద్దయేచా టుబ్బు పెను పేరు బలు దొడ్డు దొడ్డ వలుదనాఁగఁ దోఁచుఁ బృథువు
సైకంబు కొంచెము సన్నంబు తోడెము చిరుకి ముడప దులె చిఱుత లేఁత
కొద్ది యన్నున యనఁగను గొఱలు నల్ప మలరు సాంద్రంబు నెగ్గడ మనఁగ దట్ట
మనఁగఁ దంపర యన వర్తుకాఖ్య చెల్లు బటువనఁగ వట్రు వనగను బార్వతీశ.

16


క.

పలపల యన వెలితి యనన్, బలచన యన విరళసంజ్ఞ భాసిల్లును ని
స్తులతరగుణోత్తరంగా, విలసత్కరుణాంతరంగ వృషభతురంగా.

17


క.

వెడఁద యన విశాలమగున్, నిడుద యనన్ వాసి యనఁగ నెగడును దీర్ఘం
బడరును సమున్నతాభిధ, పొడవం చని పల్క మాతృభూతమహేశా.


గీ.

ఒప్పును సదాటునాఁగ వక్రోన్నతంబు, వంక రన సొట్ట యనఁగను వక్ర మెసఁగుఁ
జనును ఋజునామధేయంబు చక్కనిదన, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

19


గీ.

ఒమ్ము గాత్రమ్ము గమకము హొమ్మునాఁగ, స్థూల మగుఁ బెక్కునాఁగను దోఁచు బహుళ
మగును గణనీయమౌ నెంచఁదగినది యన, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

20


గీ.

దండ చేరువ చెంగట యండ సరస, ప్రాపు చక్కి కురంగట సజ్జచెంత
కెలన దా పంజ దగ్గఱ క్రేవ పొంత, యంచ యొద్దనా నికటాఖ్య యగు మహేశ.

21


గీ.

ఏడుగడ నా నియంతసంజ్ఞెల్ల యనఁగఁ, దనరుచుండును సర్వాఖ్య దవ్వునాఁగ
దూరనామంబు గాఁగను దోఁచుచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

22

గీ.

గట్టి కటికి యనంగఁ గన్పట్టు దృఢము, క్రొత్తమిహిహొస యనఁగ మీఱును నవంబు
ప్రాత యనఁగఁ బురాణాఖ్య పరఁగుచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

23


సీ.

మరు మెత్తనిది గోము మన్వ మనంగను మృదుసంజ్ఞ ప్రథమ మౌ మొదటిది యనఁ
గడపటిది యనంగ నడరు జఘన్యంబు తెల్ల మనంగ రాజిల్లు స్ఫుటము
పరఁగు వీసరము లేబర మన వ్యర్థంబు నెచ్చు పెల్లదనము హెచ్చు మిగితి
మిక్కిలి యెక్కువ మెం డగ్గలము పెచ్చె దుగునాఁగ నధికంబు దోఁచుచుండు
దక్కువకొఱంత పొచ్చెముకగ్గు కుందు కొదువ లొచ్చు కొదుకయనఁ బొదలు న్యూన
మడరుఁ దక్కటి యెడ కడ కడమ తక్కు వేఱు పెఱ యన నితరాఖ్య మారవైరి.

24


సీ.

ఒంటియనంగను నొప్పు నేకాకియై సగటు నాఁగను సరాసరి యనంగ
సామాన్య మెసఁగు నుచ్చావచంబులు దోచుఁ బలువితంబు లనఁగఁ బలువగలన
బరిదెగినది విడివడినది యనఁగను వెలయుచుండును విశృంఖలసమాఖ్య
ప్రతికూలనామమై పరఁగు నడ్డ మనంగ నామంబు వెలయు దాపల యనంగ
వలవల యనంగ దక్షిణం బలరుచుండు నిరుగడలు సూరె లిరుపక్క లిరుమెయులన
నుభయపార్శ్వాభిధానంబు లొనరుచుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

25


సీ.

ఇరుకట మనఁగను బరఁగు సంకటసంజ్ఞ గహనయి జీఁబు నాఁగను జెలంగు
చిన్నరిపొన్నరి చిన్నారిపొన్నారి యనఁగను ముద్దుగుల్కునది తోఁచు
నకృతలక్ష్యాభిధ యలరును జీరికిఁగొననిది సడ్డ సేయనిది యనఁగ
జలపాది యనఁగను సంకల్పసాధియౌఁ బొలుచును మలతన మురిగొనునది
యగును బిరుదాఢ్యుఁ డన బిరుదాడి యనఁగ గక్కసం బగు బిరుదులు గలుగునాతఁ
డుల్లరపు బిరుదైన రాజిల్లుచుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

26


సీ.

అప్రయోజకసంజ్ఞ యలరుచుండును గొఱగానివాఁ డనఁగ గిగ్గాడి యనఁగ
బారెఁడు మూరెడు పట్టెఁడు జేనెఁడు దుత్తెఁడు పుడిసెఁడు బెత్తెఁ డనెడి
యివి మొదల్గాఁగల వెల్లను వ్యామాది పరిమితార్ధములుగాఁ బరఁగుచుండు
రూకంత కాసంత పోకంత యీఁగంత యిసుమంత దోమంత యేనుఁగంత
యనెడి శబ్దంబు లీరీతి నలరుపదము లన్నియుఁ బణాదిమాత్రంబు లగుచుకుండు
నవ్యయీభావ మని కొంద ఱండ్రు వీనిఁ బంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

27


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగును నిశేష్యనిఘ్నాఖ్యవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

28

ᛟᛟᛟᛟᛟᛟ

సంకీర్ణవర్గము

సీ.

కోపురం బనఁ జెట్లకొన కెక్కి వైరులఁ జూచుట కర్థమై తోఁచియుండు
నల్లారుముద్దునా నగు జనసమ్మతి యదువకా సనఁగను నద్దెకాఁపు

నల్లిబిల్లి యనంగ నలుఁ బెనంకువ నిలకడ దనరును నిట్టల మనఁ
గన్గిలు పనఁగను గన్గీటు విలసిల్లు సెసకమం చనఁగ నుల్లసిల్లుఁ జలము
అలరు దొంతరవళులపే రంటె లనఁగ నీరతార లనంగను దాఱుమాఱు
లలకుచుండును గాజురా యన హలాకు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

29


సీ.

అదనునాఁ దఱినాఁగ నలరును సమయంబు గద్దింపు వెలయును గద్దన యన
నొనవెట్టు నాఁగను దనరును పొంచడం బడరును జూఱ యంచనఁగఁ గొల్ల
చెచ్చెర యనఁగను జెలఁగును సులభంబు పస యన స్ఫురణంబు పరఁగుచుండు
నైద మనంగను జనును గోదుమపిండి క్రమ మొప్పుచుండు సరవి యనంగఁ
జిటికిరింత యనంగను జిటీక యనఁగ వ్రేల్మిడి యనంగఁ దృటిపేరు వెలయుచుండు
సవసవ యనంగఁ గొద్దిగాను వినుట తగు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

30


గీ.

భుజయుగంబున జందెముల్ పోల్కి మెలిని, బెట్టి యున్నట్టిదుప్పటి గట్టిగాఁగఁ
గట్టు కట్లొప్పెసఁగు నరిక ట్టనంగ, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

31


సీ.

బద్ధపరికి యనఁ బలుచనిబిళ్లయౌ నెదరు నా సందుక ట్టెసఁగుచుండుఁ
బంపునా నభిచారవాచకం బౌను దూర్పార యంచనఁగను బవన మొప్పు
నఱజాతి యనఁగను నలరును జెడుజాతి బన్నిక యనఁగను బన్నుట దగుఁ
జెల్లుబడికిఁ బేరు చెలఁగును రప మనఁ గందువ యనఁ జమత్కార మెసఁగు
నెద్దులను కాళ్లు గట్టి క్రిం దేయు టొప్పుఁ గోలగగ్గెర యనఁగ దిగ్గో లనంగ
వెలయుఁ దినరోజు మునుమునా నలరుకోయు పయిరుకును ముందు పైరుగాఁ బార్వతీశ.

32


గీ.

పరఁగు నాకస్మికంబు డబ్బా టనంగఁ దనరుఁ బెడకంత యనఁగను దప్పుత్రోవ
ప్రబలు ముఱుత్రోవనాఁగ దుర్గంధపదవి, వ్యగ్రతయుఁ దోఁచుచుండుఁ జూపరమ నభవ.

33


గీ.

నెమలియీఁకలఁ బేనుదారములపాగ, పెట్టమని పల్కఁగాఁ దగుఁ దెట్టు కొఱకు
ముండ్ల నల్లినతడకయై పొలిచియుండు, తడుకుఁబెండె మనంగఁ జంద్రార్ధచూడ.

34


గీ.

గాదె పోలిక నుండెడి కాఁగు పేరు, రంజణి యనంగ వెలయు నార్జనసమాఖ్య
యడరు రజన యనంగను గడన యనఁగ, లంప యన దొంగమేపు చెలంగు నభవ.

35


గీ.

ఘటవిశేషంబు లైరేని కడవ లనఁగ, బూజుగు లనంగ బుడ్లనఁ బొలుచుచుండు
గాజులను గూర్చు చేరులుగాఁ జెలంగు, చుండు మల్లార మనఁగను సోమభూష.

36


గీ.

చెంపలను మూసికట్టుట చెలఁగు గౌద, కట్లనంగను గడుపులోఁ గలుగుజాలి
యలరుచుండును జుమ్మచు ట్లనఁగ భక్త, పోషకాపాంగ శ్రీమాతృభూతలింగ.

37


గీ.

పల్లముల నిరువంకలఁ బరగుఁ పట్టు, త్రాళ్లు వెలయుచునుండు లాలసరు లనఁగ
వెనుక మోఁచేతులను గట్టిపెట్టు టొప్పు, లాఁకకట్టు లనంగఁ కైలాసవాసి.

38

గీ.

కీలుకీలుకు విఱుచుట గేరును విట, తాట మనఁగాను మెక మెకపా టనంగ
నాఁకలికి నోర్వఁజాలనియార్తి చెల్లు, భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

39


గీ.

బెస్తలు భుజంబులందును బెట్టుకొనెడి, యార్ద్రపటములు మాలుగు లనఁగ వెలయు
వ్రేఁగు లనఁ బరువులపేరు వెలయుచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

40


గీ.

సోయగంబు సొబగుఁ జోక మురువు కొమరు, చెలువు తీరు సౌరు పొలుపు చెన్ను
చక్కఁదన మనంగ సౌందర్య మొప్పును, మహితగుణసమేత మాతృభూత.

41


గీ.

వన్నె హెచ్చినయట్టిక్రొంబసిఁడికడ్డి, కత్తిరించిన తావునఁ గానిపించు
నిగ్గునకుఁ బేరు నక్కునా నెగడుచుండుఁ, దను కనఁగ వజ్రకాంతియై తనరు నభవ.

42


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగు నిచ్చలు సంకీర్ణవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

43

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

నానార్థవర్గము

సీ.

గౌరన నేనుఁగు కాహళి విలసిల్లు డంబు నాఁగను గాంతి డంబము నగుఁ
జెలి యనఁ జెలికాఁడు చెలికత్తెయును దోఁచుఁ జెట్టనాఁ జెనఁటియుఁ జేయి వెలయు
స్తనకవాటాంగము ల్దనరు గుబ్బ లనంగ నావు నెద్దును దొడు కనఁగ వెలయుఁ
జిన్ననేజయ నమ్ము చెలఁగును గొరకనాఁ జెలఁగుఁ జోఱ యనంగ శిశుఝషములు
బాలకేళీనతుల్ చెంగనా లనఁ దగుఁ గచ్చ తెల్లును మగఁటిమి గండనఁబడు
నల్పకుసుమంబు వినతియు నడరు చిన్ని పూ వనుకొనంగ శ్రీమాతృభూతలింగ.

44


సీ.

పక్షశౌర్యంబులు పరఁగుఁ డాక యనంగఁ దెమ్మనాఁ బెల్లయుఁ దేమ వెలయు
వత్సకృత్రిమమణు ల్వఱలును దఱుపునా నలితిండి యొప్పును నలి యనఁ దగు
నవలక్షణభగాఖ్య లలరు దూబ యనంగ నాచునా దొంగయుఁ బ్రాచి దనరు
ఘర్షణవికటముల్ గనుపట్టు టోకునా నోలినా వరుసయుఁ నుంకువ తగు
నిచ్చము చిలుకుటయుఁ దోఁచు ద్రచ్చన యన వెల్లినా ఛత్రమును రేపు నుల్లసిల్లు
నట్టునాఁ గేహ తద్దేశనామ మెసఁగుఁ బ్రభుగుహాఖ్యలు సామినాఁ బరఁగు నభవ.

45


సీ.

రోషజుగుప్సాఖ్య లొప్పు సేవ యనంగఁ గొఱఁత నాఁ దక్కువ కొఱ్ఱు వెలయు
స్థైర్యయత్నంబులు చనుఁ గడంక యనంగఁ గొఱ యన నొప్పు తక్కువ చెలంగు
బీడునేలయు రైక వెలయుఁ గంచెలయనఁ గ్రోలునాఁ బానంబు క్రోవి దోఁచు
నికటఖళూరిక లెగడును గరిడినా నావు పొట్టియ గిడ్డి యనఁ జెలంగుఁ
గుట్టు తే ళ్ళనఁ గంటక క్షుద్రు లగుదు రలరుఁ జుట్టము కూర్మి గాదిలి యనంగ
నేతుల యనంగఁ దగుపాటియింతి చేఁట లల్లువనితయుఁ దోఁచుఁ బశ్యల్లలాట.

45

సీ.

సాస్నయుఁ బెద్దడో లను గంగడో లనఁ బడగనా టెక్కము ఫణము దనరు
నస్థిమయూరాఖ్య లలరు నెమ్ము లనంగఁ బసి యన ధేనువు పవన మెసఁగు
మందు రోష్ణీషము ల్మనును బాగా యన గుఱుతు పక్కియుఁ దగుఁ బులుగు నాఁగ
సస్యభేదాంబుధు ల్చనుఁ బాలవెల్లినా బాటనా దిక్కుత్రోవయుఁ జెలంగుఁ
గుసుమితామ్రంబులును మచ్చగుఱ్ఱములును మనుచునుండును బూచిననూపు లనఁగఁ
గ్రొత్తముట్టన నూలు బోఁగను సమర్త పొలుచును వినంగ శ్రీమాతృభూతలింగ.

47


సీ.

మొసలియు డేగయుఁ బొల్చు బైరి యనంగ రాజరాత్రులు రేలు నాఁగఁ దనరుఁ
బ్రణతియుఁ గౌముది బరఁగు వెన్నెల యనఁ బూవునా సొగసును బుష్ప మొప్పు
వేగంబు పాళెము వెలయు వేళ మనంగ వైరవేగము లగు వేర మనఁగ
లూటినా దవుడపుండును దండు వయి దోఁచు నాటనాఁ గ్రీడ నాట్యము చెలఁగు
వ్యాసటిక డేగయుఁ జెలంగు వేసడ మనఁ జెల్లుఁ బైమేడ యొప్పు మేలి ల్లనంగ
మెఱుఁగురిక్క లనంగను బరఁగు మిన్న నైనచుక్కలు పగడంబు నచలవాసి.

48


సీ.

సమమిత్త్రసంజ్ఞలై చను బోటిగాఁ డన ముకుళంబు నిగ్గు పూమొగ్గనఁ దగుఁ
బునరర్థరజతము ల్పొల్బు వెండి యనంగఁ బరఁగు జీనియు గుంట పల్ల మనఁగ
హ్రదధౌతవస్త్రంబు లమరును మడుఁగునా నదరపాదాభిధ లడు గనఁ దగుఁ
బొలమరి యనఁగఁ గాఁపును వితమరి దోఁచు భగినియుఁ దల్లి యప్ప యన వెలయుఁ
దాని కట్టిన యట్టిచందనపుచెక్క పొడియుఁ గమ్మయుఁ జాబనఁ బొల్చియుండు
జురుకు లనఁ జెట్లచీమలు నురులు దోఁచు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

49


సీ.

ఓడ భిక్షాభేద మొప్పును జోగునా నలుఁగునాఁ బరివాహ మాయుధ మగు
షట్సంఖ్య నూఁగారుఁ జనుచుండు నారునా నాలునా ధేను భార్యాఖ్య లమరు
విటతాట మనఁ గీళ్ళు విఱిచి పెట్టుటయు దయ్యము పట్టియుండుట యమరియుండు
సత యనఁ బల్లము సప్తసంఖ్య చెలంగు నాశయు వృత్తమౌ నక్కఱ యన
నుదక సంభూతిబల మగు నూట యనఁగ నుపహతియుఁ దావు నెట్టన నొప్పుచుండుఁ
జంద్ర నవనీతఘుటికలు చనును వెన్నముద్ద యని పల్క శ్రీమాతృభూతలింగ.

50


సీ.

కలుషదేశమ్ములు చెలఁగుఁ గలంకన నెద యన భయమును హృదయ మెసఁగు
బండికుంపటి చిల్కు పరఁగు గొళ్లె మనంగ నొరయిక కోశంబు నొర యనఁ దగు
నారోహణ శ్రేష్ఠ మలరు నెక్కుడు నాఁగఁ గలుపునాఁ బెరుగును గాద మొప్పు
ధనురగ్రగుణములు దగు గొనయం బన నొప్పుఁ గచాటను ల్కొప్పు నాఁగఁ
బంట యొబ్బిడి సేయించుపని వసంతమును విభాసిల్లుచుండు నామని యనంగ
నానవా లనఁగాను జిహ్నంబుఁ గాఁచుపాలు నయి యొప్పుచుండును నీలకంఠ.

51

సీ.

కొమ్మునా వాద్యభేదమును శృంగమౌఁ గందునా శిశుకళంకములు దోఁచుఁ
జిలుమువా లనఁగను జిలుము పట్టినకత్తి యులిపికట్టె యనఁ జెన్నలరుచుండు
ధౌతవస్త్రంబు కేదారమౌ మడి యనఁ గుండు నాఁగను హయగోళము లగు
వ్యంజనశ్వాసము ల్వఱలు నూరు పనంగ వనిత శాఖయుఁ గొమ్మ యనఁ జెలంగుఁ
గైవడి యనంగఁ దగు రీతి కరజపంబు రాయి సారాయి కల్లునా రహి వహించుఁ
గమ్మ యనఁగను జాబును గర్ణభూష పొల్చుచుండును శ్రీ మాతృభూతలింగ.

52


సీ.

ఖట్వాంగరేఖలు కనుపట్టుఁ గోడునా ఘటికార్గళంబులు గడియ యనఁగ
బవనపిశాచము ల్సరఁగు గాలి యనంగ గట్టునాఁ దీరనగంబు లలరు
వృత్తాంతదంభము ల్వెలయును గబు రన బంతినాఁ గందుకపంక్తు లెసఁగు
నరసంఘనికటముల్ పరఁగు జేరువ యన నండతారకలు గ్రు డ్డనఁగ మీఱు
ఘూకకర్ణైకదేశము ల్గూబనఁ దగు గంట యనఁ బైరుదుంపయు ఘంట యొప్పు
నుపలరాశియు నణుకువాఁ డొప్పుచుండు గుంట యని పల్కంగ సుగంధికుంతలేశ.

53


సీ.

శ్రవణైకదేశ మాచ్ఛాదనగేహంబు మీఱుచునుండు గుడార మనఁగ
యవనాశ్వభేదంబు లలరుఁ బటాణినాఁ దొలినాఁగఁ బూర్వంబు బిలము దోఁచు
బంధువు ల్వలయము ల్పరఁగుఁ జుట్ట లనంగఁ దెఱవరా బయలును స్త్రీ దనర్చు
దంతక్షతంబు రత్నం బగుఁ గెంపునా దండనానికటంబు ధామ మొనరు
బొందళము యుగి జోడనఁ బొల్పు గాంచుఁ జెలఁగు విరళంబు సాంద్రంబు జీబురాఁగ
గందపట్టె యనంగను జందనానులేపన కవాటపట్టిక ల్మీఱు నభవ.

54


సీ.

కంఠభూషాలతికలు దోఁచుఁ దీఁగనా స్థూలము గుణ మొప్పుఁ దోర మనఁగ
మార్గకుష్టంబులు మనుచుండుఁ చెన్నునా బాలునా క్షీరంబు భాగ మెసఁగుఁ
గాంతిధ్వజంబులు కనుపట్టు డాలునాఁ జంద్రమాసంబులు చను నెల యన
శిశువు కనీనిక చెలఁగుఁ బాప యనంగఁ బలుకునా శకలభాషలు దనర్చు
దోఁపు నాఁగను దగు నల్లతుమ్మచెట్టు బట్టపేరును శృంగారవనముపేరు
బాళియును గోటవెలిమంటపంబు దోఁచుఁ దనుక మనఁగను మాతృభూతాభిధాన.

55


సీ.

జాతనూతకమును సమ మగుఁ బురుడునాఁ బెంపునా నాశంబు వృద్ధిదోఁచు
నెమ్మినా బర్హిసఖ్యమ్ములు దనరారు నాడునా దేశ దినమ్ము లెసఁగు
శయ్య విస్తారంబు చనుచుండు బరుపునాఁ బగలునా ద్వేషదివాఖ్య లెసఁగుఁ
దామనామంబులు దనరును బేరునా బాసనా శపథంబు భాష వెలయుఁ
బోఁగునాఁ దంతువును గర్ణభూష మీఱు వెలయు శిశువత్సములు పసిబిడ్డ యనఁగ
సింహపూర్ణోపమానము ల్సెలఁగును నెఱ సరి యటం చని పలుకాఁడఁ జంద్రచూడ.

56

సీ.

కంఠభూషణమును గనకాక్షినామంబు పైడికంటి యనంగఁ బరఁగుచుండు
స్వర్ణోపకారము ల్చనును మేలిమి యన మూలనాఁ గచకోణములు దనర్చు
నౌదుంబరంబు హలాగ్రమౌ మేడినా బడుగునా శవము దుర్బలుఁడు దోఁచు
సౌందర్యకరవిభూషలు చను మురువునా మెఱుపును గాంతియు మెఱుఁ గనఁదగుఁ
గర్ణభూషణమును దటాకజలనిర్గమస్థలంబును బొగడనా మనుచునుండు
నన్యమును క్షౌద్రపటలంబు నలరుచుండుఁ బెఱ యనంగఁ బరాంతకవిభువిభంగ.

57


సీ.

పుష్పచాపంబును బుష్పగేహంబును బూవిల్లు నాఁగను బొదలుచుండుఁ
బేఁటయం చనఁగను విపణిప్రదేశాఖ్య యేకసూత్రాఖ్యయై యెసఁగుచుండు
మణుఁ గనఁగాను బ్రమాణభేదంబును ధౌతవస్త్రంబును దనరియుండుఁ
గలవాలనిహతియు సరసీరుహాక్షియు వాల్గంటి యనఁగను బరగుచుండుఁ
గోపరీతులు మోడినాఁ గొఱలుచుండు వేఁట యన మేషమృగయలు వెలయుచుండుఁ
దోఁచు జఠరామయంబునఁ దూమునందు బల్లయను నట్టినూట పశ్యల్లలాట.

58


సీ.

కంటకావృతియును గాంతియౌ వెలుఁ గనఁ బవనశైత్యంబులు వలి యనఁ దగుఁ
బరిమళవీథులు వాడయం చన మీఱు వెలియటం చన బహిశ్శ్వేతము లగు
ఖడ్గదీర్ఘంబులు గనుపట్టు వాలునా యతివేగములు వడి యనఁ చనర్చుం
బ్రత్యుపకారంబు గ్రామమౌ వీడునా సరి యనఁగా దామ సమము లొప్పు
సాక మనఁగను వ్యాజ ముత్సవము దోంచు నల్పరవమును రతి సంచునాఁ దనర్చు
నల్పమార్గంబు మల్లవిద్యావిశేష మొప్పు సందన శ్రీమాతృభూతలింగ.

59


సీ.

ముఖపతితాహారమును దంతవసనంబు వాతెఱయం చన ఖ్యాతిగాంచుఁ
బులిసినవంటకంబును పులిహారంబు పులికూడు నాఁగఁ బెం పొందియుండు
స్త్రీమత్స్యభేదముల్ దీర్ఘలోచనములు వాలుగన్ను లనంగ వఱలుచుండు
యమనిష్ఠ ధాటియు నాయుధభేదంబు జముదాడి యంచన నమరియుండు
నభ్రగంగ శిరస్తోద మలరును దల యే రనంగ నఖక్షతశారికాభి
ధానములు గోరువంక నాఁ దనరియుండుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

60


సీ.

కబళపరీమళక్షత్యర్థములయందుఁ గనుపట్టుచుండును గడి యనంగఁ
జంద్రకమ్ములును లోచనములు రంధ్రము ల్చెన్నొందుచుండును గన్ను లనఁగఁ
గబరియు శిఖయును గార్ముకాగ్రంబును గొప్పని పల్కఁగా నొప్పుచుండు
శ్యామలవర్ణంబు సాక్షియు మర్యాద పరఁగుచునుండును గరి యనంగ
నిగ్గు చిరుగడ్డ కుటిలంబు నెఱియనఁ దగ్గు వ్యథగొలుసు గొప్ప వెలయును బారియనఁగ
బిందునక్షత్రతిలకము ల్వెలయుచుండుఁ జుక్క యనఁగఁ బరాంతకచోళవైరి.

61

సీ.

ధనురగ్రమద్యవృత్తావయవమ్ములు గొఱలుచునుండును గోపునాఁగఁ
బడిగలు మడిలోనఁ బడిన యెన్నులు నేటి కడనేల లొప్పును బడిగ లనఁగఁ
దామర ల్కొండమీఁదఁ గల నేలలును జూదమ్ములు వెలయు నెత్తమ్ము లనఁగఁ
జంద్రమః క్షత్రియ సర్వంసహాపతుల్ రాజిల్లుచుందురు రాజనంగఁ
బ్రసవ ఖర్జూర సలిలసంస్థాపనములు వెలయు నీత్ర యనంగను గలికి యనఁగఁ
గొంగ దలయీఁక దంటయుఁ గోమలి యనఁ బొలుచును వినంగ శ్రీమాతృభూతలింగ.

62


సీ.

కచబంధమును శిఖ గంధమూషికమును శోభిల్లుచుండును జుంచునాఁగ
నల్ప తరక్షు బాలాభిధానంబు చిఱుత యంచనఁగను జెలఁగుచుండు
రాజిల్లు సంవత్సరాంతంబు లాంగలపద్ధతి చాలునాఁ బరఁగుచుండుఁ
వాజినీగర్భంబు వాచవు ల్ముత్తెంపుతూనిక చవులునాఁ దోఁచుచుండుఁ
దిలకభూషావిశేషబిందులు చెలంగు బొట్టనంగను జంపునాఁ బొల్చియుండుఁ
సముదయాలస్య ఝల్లరీసంజ్ఞ లగుచు ధార్మికవిధాన మాతృభూతాభిధాన.

63


సీ.

ఆహార మాఁకలి యవనిపన్నగములు పరఁగుచునుండును నెర యనంగ
స్వశ్రేయయసోర్థప్రశంసార్థములయందు మీఱుచునుండును మే లనంగ
వేఁటసాధనమును వీచియు యవనిక దేజరిల్లుచునుండుఁ దెర యనంగ
గాదెబొట్టయును దుగాసారమును ముద్దుగుమ్మయు వెలయును గుమ్మ యనఁగ
గజవిశేషంబు ముందు వెన్కలను జూడ నట్టివాఁడును గెంపులయందుఁ బాట
మునఁ దళుక్కను జిగి దగు మొక్కళియిన భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

64


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు నిచ్చలు నానార్థవర్గ మిట్లు
గైనుము దీని భ క్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

65

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

అవ్యయవర్గము

సీ.

అగ్గెడ యక్కడ యచట యచ్చట యాడ యందలి పొనపొన యయ్యెడ యట
యందునాఁ దత్రార్థమై విరాజిలుచుండు నెగ్గెడ యెక్కడ యెయ్య డెచ్చ
టెచ టెందు నాఁగఁ బెంపెసఁగు యత్రార్థమై యిక్కడ యిచ్చట యిచట యీడ
యియ్యె డిం దనఁగఁ బెంపెక్కు నత్రార్థమై యద్దిర యయ్యారె యౌర మేల్ సె
బాసు మజ్ఝా బలారె సేబాసు నాఁగ నలరుచుండుఁ బ్రశంసార్థములుగ మీఁద
పై పయిని నాఁగ నూర్ధ్వాఖ్య పరఁగుచుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

66


సీ.

దిగువ క్రింద యనంగఁ దగు నధస్సంజ్ఞయై యొగి లెస్స యనఁగ సాధూక్తిఁ దనరు
కట్టా యనంగను గటకటా యనఁగఁ గటా యనంగ బతార్థమై యెసంగుఁ
దద్దయు నాఁగను దనకు భృశార్థమై పరఁగు నప్యర్థంబు మరి యనంగ
నినులు చార్థంబుగా దనరును సవి సావి యని యన నిత్యర్థమై తనర్చుఁ

బరిపరి యనంగఁ జిందఱవందఱ యన నలరుచుండును గణశోర్థ మగుచుఁ బాట
పాట యనఁ గొద్దికొద్ది యన్మాట చెలఁగు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

67


సీ.

సుడి సుమీ నుండి సూ సుమ్మి యనంగను నిశ్చయార్థకముగా నెగడుచుండు
వారక యనఁగను మీఱు నిరంతరార్థము కదయనఁ గిలార్థమ్ము చెల్లు
నంతయం చనఁ దావదర్థమౌ నెంతనా యావదర్థంబుగా నతిశయిల్లు
నేతాపదర్థమౌ నింతయం చనఁగను బలంనాఁగ నానార్థవాచక మగుఁ
దనరు నొండొండు నాఁగ మిథఃపదార్థ మొప్పు నొకపరి యొకతేప యొక్కసారి
యొక్కమా టన సకృదర్థ మొనరు నంత నట యన నథార్థమగును సూర్యావతంస.

68


గీ.

మగుడ క్రమ్మఱ క్రమ్మటి మరల సారె, వెండి మాటికి తిరుగనా వెలయును బున
రర్థముగఁ ద్రిక్క యనఁ దక్క యన వినార్థ, ముగను రాజిల్లు శ్రీ మాతృభూతలింగ.

69


సీ.

చీటికిమాటికి మాటిమాటికిఁ బలుమరు వేమ రనఁగ సదార్థము లగు
నెట్టకేలకు నాఁగ నెసఁగుఁ జిరార్థంబు తగువృథార్థంబు వితా యనంగఁ
గూడ యనంగను దోడుత యనఁగను రాజిల్లునౌ సహార్థంబుగాను
ఓయన నేమినా నొప్పు గిమర్థంబు నైతె యనంగను ధ్వర్థ మలరుఁ
గనుక కనుకను కాఁబట్టి కాన కాఁగఁ గావున యనంగ నన్ని యేకార్థము లగు
నడరును గదాచిదర్థ మొక్కెడ యొకప్పు డనఁగను సుగంధికుంతలాప్రాణనాథ.

70


గీ.

వేయనఁగ సయ్యన యనంగ వెస ననంగఁ, గ్రచ్చ రన గ్రక్కున యనంగఁ గ్రన్ననయన
నప్పళ మన బిరాననా నొప్పుచుండు, ఝడితిపదతుల్యములుగాను జంద్రచూడ.

71


సీ.

తగు ననిచ్ఛిన్నార్థ ముగను హోరాహోరి యనఁ గాక యనఁగ నుతార్థ మెసఁగు
నోరనా సాచ్యర్థ మొప్పును సహసార్థముగ విరాజిల్లు గొబ్బున యనంగ
సంబోధనార్థమై చను నో యనంగ నోరీ యోరి యనఁగను రేసమంబు
నోమె యోపె యనంగ నొప్పు స్త్రీ సంబోధనార్థమై యొసి యోసి యనఁగఁ జేటి
కాదిసంబోధనార్థమై యలరుచుండు వలె యన నివార్థకంబుగా వెలయు వంటి
బోని యనఁగ పదర్థంబుగాను దనరు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

72


సీ.

మున్ మున్ను మును ముందు మొగి ముంగల యనంగ దగును బురఃపురార్థములుగాను
దొలుత తొల్లి మునుపు తొలయనఁగను బురార్థము మ్రోల యెదుట నాఁదగు బురోర్థ
మైదనా వెంబడి యన బడి యనఁగను వెంటయం చనఁగ వెన్వెంట యనఁగ
వెనుకయం చనఁగను బృష్ఠార్థకం బొప్పుఁ బదపడి పిదప తర్వాత పిమ్మ
టనఁగఁ బశ్చాత్సమార్థ మై యలరు చుండు ముందువెనుకలునా నఱిముఱి యనంగ
నడరుచుండును రెండు నేకార్థములుగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

73

సీ.

ఇంచుకంత యొకింత యించుక యిసుమంత యన నీషదర్థమౌ నటుల నట్లు
నాఁ దథార్థం బెట్లునా నెటులం చన నలరుచునుండు యథార్థముగను
నిటులునా నిట్లునా నేవమర్థం బొప్పుఁ దోడుతో ననఁగఁ దోడ్తో ననంగ
సద్యస్సమంబుగాఁ జను లేదులే దనఁ గను గాదుకాదు నాఁగను సఙర్థ
మొప్పుచుండును మిన్నక యూరక యన నెసఁగుఁ దూష్టీంసమంబుగా నెల్ల వెంట
కనిన నంతటి కనిన నేకార్థములుగఁ బొలిచియుండును శ్రీమాతృభూకలింగ.

74


గీ.

మంచిదే యనంగ వల్లె యనంగను, రెండు సమము లగుచు నుండు నౌను
హైసరే సరే యటం చనంగ యథార్థ, ముగను బొల్చు మాతృభూతలింగ.

75


గీ.

తనరు నంతట యన సమంతాత్సమముగ, నలరు నెల్లప్పు డనఁగ సదార్థ మగుచు
న యన నే యన నేవకారార్థ మెసఁగు, భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

76


గీ.

అలరు మెల్లఁగ నన శనైరర్థ మగుచు, నంతరర్థము లోలోన యనఁగఁ దనరు
వెలపట బయట వెలినాఁగ వెలయును బహి, రర్థముగ మాతృభూత దయాసమేత.

77


గీ.

దండ మనఁగ నమోర్థమై తనరుచుండుఁ, బొరు గిరు గనంగ నికషార్థముగఁ జెలంగు
నెప్పు డనఁగ యదార్థమై యొప్పుచుండు, నప్పు డనఁగఁ దదార్థమౌ నబ్జచూడ.

78


గీ.

పరఁగు నిప్పు డనంగ సంప్రతి సమముగ, నొప్పు నేకత్ర తుల్యమై యొక్కట యన
నెనయు సర్వపదార్థమై యేడుగడయు, నాఁగ దేహవిభూషితానాదినాఁగ.

79


క.

ఒక్కోలన నొకపెట్టన, నొక్కుమ్మడి యనఁగ నొక్కయూక యనంగా
నొక్కంతగా నను బెం, పెక్కును యుగపతృదార్థ మిందువతంసా.

80


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతన, బరఁగు నిచ్చలు నవ్యయవర్గమిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

81

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

క్రియావర్గము

గీ.

ముందుగాఁగ నకర్మకములను దెలిపి, వెనుకను సకర్మకములను వివరపఱిచి
ప్రకృతులను బ్రత్యయముల నేర్పఱుతు నిందు, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

82


సీ.

వెలసెఁ దనరెఁ దగెఁ జెలఁగెఁ జెలంగెను బరఁగెను బొనరెను మెఱసె సమరె
ఠవణిల్లెఁ గొఱలె నడరెను బరిఢవిల్లె గ్రాలెను వఱలెఁ దురంగలించె
నొనరె నెసఁగె నారెఁ జనె నలరె ననంగ నొప్పె నన్మాటగాఁ జెప్పఁబడును
నసియాడె జవ్వాడె నాడె నూఁగెఁ గదలె వణఁకెనా విలసిల్లు వడఁకె ననుట
పండెఁ బన్నుండెను బరుండెఁ బవ్వళించె నత్తమిల్లెఁ బడుండెను నమణె ననఁగ
నలరి యుండును శయనించె ననుట కాఖ్య భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

83

గీ.

అఱచె వాపోయె నేడ్చెను మొఱలిడె ననఁ, దనరు రోదనమును జేసె ననుట కాఖ్య
లగ్గమయ్యెను లోనయ్యె ననఁగ స్వవశ, మయ్యె ననుట దనర్చు వేదాంతవేద్య.

84


గీ.

ఎడసెఁ బురివిచ్చె నెడమయ్యెఁ గెడసెఁ జెంగెఁ, బాసెఁ గేడించెనాఁగను బరఁగుచుండు
వీడె ననుటకుఁ దొలఁగెనా వెలయుచుండు, నొదిగె ననుట శశాంకకళోత్తమాంగ.

85


గీ.

పఱచె వెళ్లెను బరువెత్తె జరిగె నుఱికెఁ, గదలె ననఁ బాఱె ననుమాటగాఁ జెలంగుఁ
జనె నరిగె నేఁగె వెడలెను సాగెఁ బోయెఁ, దరలె నన నడచె ననుటకుఁ దనరు నభవ.

86


సీ.

వచ్చెనం చనుటకు విచ్చేసి వేంచేసె నరుదెంచెఁ జనుదెంచె నరుగుదెంచె
ననఁ జెలంగుచునుండుఁ జనె గంతుగొనెఁ గూలెఁ బెద్దనిద్దురవోయె బిద్దెఁ ద్రెళ్ళె
మడిసె బ్రుంగె సమసెఁ గెడసె ముగిసె నీల్గెఁ దెరలెను దోరెను దీఱె వెళ్లెఁ
గ్రుంకె నేఁగెను బోయె డింక వేసెను మ్రగ్గె ననఁ జచ్చె ననుమాట కాఖ్య లయ్యె
వెళ్లె వెలువడె ననఁ దగు వెడలె ననుట మసలె జాగిడెఁ దడసెనా మనుచునుండు
జాగుచేసె ననుటకును జాఱె వీడె ననఁగఁ జ్యుత మయ్యె ననుటగా నలరు నభవ.

87


గీ.

మ్రొగ్గె డొంకెఁ గుందెఁ దగ్గె డీలయ్యెను స్రగ్గె ముడిఁగె డొంకె సమసె స్రుక్కె
గ్రుంగె డస్సె డిందె గుదిసెఁ దూలె నణంగె, ననఁగఁ దగ్గె ననుట యలరు నభవ.

88


గీ.

మీఱె హెచ్చరిలెను మించె రెక్కొనె హెచ్చె, నెచ్చెఁ బెరిఁగె ననఁగ వృద్ధిఁజెందె
ననుట కాఖ్య లగుచు నలరారుచుండు సు, గంధికుంతలాంబికాసమేత.

89


గీ.

తనరు ఖ్యాత మయ్యె ననుటకుఁ బేరుఁగా, నెగడె ననఃగ వెలయు నిండె ననఁగఁ
బూర్ణ మయ్యె ననుట పొలుచు నెఱసెఁ బర్వె, ననఁగ నొలసె ననుట యద్రిగేహ.

90


గీ.

అగిలె విచ్చె విఱిగెఁ బగిలె ననంగను, విరిసె ననుట కాఖ్య వెలయుచుండుఁ
బిగిలెఁ బీలె ననఁగఁ బెంపొందుచుండును, జినిఁగె ననుట కాఖ్య సితసమాఖ్య.

91


గీ.

అంజె నళికె వెఱచె నదరెఁ దద్దిరె దద్ది, రిల్లె, జడిసె ననఁగఁ జెల్లు భయముఁ
జెందు ననుట కాఖ్యచేతఁ జలించెనం, చనుట బెదరె ననగ నలరు నభవ.

92


గీ.

తడిసె నానె ననఁగఁ దనరు నార్ద్రంబయ్యె, ననుట కాఖ్య తెగియె నరె ననంగ
ఛేద మయ్యె ననుట చెలఁగుచునుండు సు, గంధికుంతలాంబికాసమేత.

93


సీ.

అచ్చివచ్చె ననంగ నై వచ్చె ననఁగ మే లై వచ్చె ననుటయౌ నావటిల్లె
ననఁగను గలిగెనం చనఁ దోఁచుఁ గడతేరె ననఁ గృతార్థం బయ్యె ననుట కొప్పు
నీడుమీఱె ననంగ నీడేరె ననఁగను వయసు వచ్చె ననుట వఱలు నెందు
నంత్యంబు నెఱవేఱె ననుటయుఁ దోఁచును బొంగె నుప్పతిలె నుప్పొంగె ననఁగ
నుబ్బె ననుటకు నర్థమై యొప్పుచుండు నలరు ననువయ్యె ననుట జొబ్బిలె వనంగఁ
బరఁగుఁ జుఱ్ఱుకయ్యె ననుమాట యొరిమె ననఁగ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

94

గీ.

ఒడ్డగిలెనాఁగ నొకదిక్కు కొరిగెననుట, యెనఁగు బెండగిలెనునాఁగ నెత్తువడియె
ననుట తగు నొల్లఁబోయె నాఁగను దనర్చుఁ, జిన్నపోయె నటంచనఁ జిత్స్వరూప.

95


గీ.

ఓసరిలెఁ దగ్గె తఱిగెనా నొప్పుఁ దక్కు, వాయె ననుమాట కలచెనా నలరు వలచె
ననుట కసిదేరె నాఁగను ఖ్యాతిఁ జెంది, యుండుఁ గన్పట్టె ననుట సూర్యోత్తమాంగ.

96


సీ.

ఓహటించె ననంగ నోడె నంచును దోఁచుఁ గూఁకె నాఁ గనుపట్టుఁ గ్రుంకెననుట
కోలుపోయె ననంగ బేలుపోయె ననంగ మోసపోయె ననుట పొలుచుఁ దీఱె
ననఁగను నిలిచె నంచని పల్కఁగాఁ దగుఁ గెరగొట్టె ననఁగను గిలకిలఁబలి
కె ననెడిమాటయౌఁ గేకసల్కొట్టెనాఁ గేకలు వేయుచుఁ గేలుదట్టి
నవ్వుట చెలంగు గర్వాడె నాఁగ మేపు మేసె ననుట దనర్చును మెఱయుఁ గసిమ
సంగెఁ జెలరేఁగె నాఁగను సమము లగును భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

97


గీ.

డాఁగురించె మఱిఁగె డాఁగె ననంగను, దాఁగి యుండె ననుట గాఁగఁ దోఁచుఁ
జదుకుపడె ననంగఁ జదికిలఁబడె నను, మాటగాఁ దనర్చు మాతృభూత.

98


సీ.

చేకుఱెఁ జేకూఱెఁ జేకూడె నంచన నేకార్థములు గాఁగ నెసఁగుచుండు
వసమరె వేసారె విసివె నటంచన నేకార్థములు గాఁగ నెసఁగుచుండు
బొబ్బెట్టె వాపోయె బొబ్బరిల్లె ననంగ నేకార్థములు గాఁగ నెసఁగుచుండు
గుదురుపడెను నెలకొనెను డెక్కొనె నన నేకార్థములు గాఁగ నెసఁగుచుండు
వెచ్చె ననఁ గందె ననఁగను వేఁగె ననఁగఁ గమలె ననఁగను దనరు నేకార్థములుగ
వేగె నాఁగను దెలవాఱె నాఁగ వేఁగె ననఁగ నేకార్థములు గాఁగఁ దనరు నభవ.

99


గీ.

డిల్లపడె ననంగఁ జెల్లును ధృతివీడె, ననుట జాగుచేసె ననుట కొప్పు
డడసె ననఁగ మిడిసిపడె ననుటకుఁ దగు, మిడుకుమాలె ననఁగ మిహిరభూష.

100


సీ.

ఆశ్చర్యమును జెందె ననుమాట కర్థమై తటకాపడె ననంగఁ దనరుచుండు
ననిచె నాఁగఁ జిగిర్చె ననుటయు వికసించె ననుటయు నర్థమై యలరుచుండు
మోహరించె ననంగ మొనఁ జేసె నని తోఁచుఁ బల్కెక్కె ననఁ దగుఁ బండెననుట
నివ్వటిల్లె ననంగ నిండారె ననఁ బూరటిల్లెనా సమములై యుల్లసిల్లుఁ
దొప్పరిలఁబండె నాఁగను దోఁచుఁ జట్టు విఱుగఁబండె ననుటకును బిఱుదివిచె న
నంగ వెనుదీసె ననుట దనర్చియుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

101


గీ.

వగచె దురసిల్లె వందురెఁ బల్లటిల్లెఁ, బొక్కె నన నంగలార్చెనాఁ బొల్చియుండుఁ
బలకఁబాఱెననం దెల్లఁబాఱె ననుట, కలరియండును మాతృభూతాభిధాన.

102


గీ.

బీరువోయె ననంగను మీఱు వ్యర్థ, మాయె ననుటయు మెల్లనపోయె ననుట
గుంపుగూడె ననం బలు కొప్పుచుండు, మల్లడిగొనె ననంగను మాతృభూత.

103

గీ.

పణతపడె ననఁ దగును దవడనరాలు, పట్టుకొనె ననుటకు బడల్పడియె ననఁగఁ
జాఁపచుట్టగఁ బడె నని తోఁపఁబడును, భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

104


గీ.

చెలఁగుఁ బరిపోయె ననఁగను బెదరె ననఁగ, నయిదుపది చేసె నన ముందరడుగు వెనుకఁ
బెట్టె ననుటకుఁ బేరుగా వెలయంచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

105


గీ.

చేను కావించెఁ బైరిడెఁ జెట్లు గొట్టె, ననెడుమాటకుఁ బొదికొట్టె ననఁగఁ జెల్లు
మస్తరించె ననంగను మనును జేతు, లప్పళించె నటంచుఁ జంద్రార్ధచూడ.

106


క.

పురులోమె నాఁగ క్షాత్త్రము, మెఱియించె నటంచుఁ దోఁచు మీఱుచు నుండున్
సొరిగె నన సొగసె ననఁగను, సురిగె నన న్వాడె ననుట సోమవిభూషా.

107


గీ.

ఒరులు చెప్పిన వెనుకఁ దా నొకటి చేసె, ననెడిమాటకు మొండొడ్డె ననఁగఁ దోఁచు
మల్ల చఱచె ననంగను మను భుజంబు, లప్పళించె నటంచు సూర్యావతంస.

108


గీ.

అతిశయముఁ జేసె ననుమాట కాఖ్యగాను, బొలిచియుండును బొంపిరివోయె నాఁగఁ
గనులు చెదరంగఁ జీఁకట్లు గ్రమ్మె ననుట, కలరు మిఱుమిట్లు గొనె నన నద్రినిలయ.

109


క.

కనిపించె ననెడిమాటకు, వినిచె ననం జెల్లుచుండు వీఁగె ననంగా
దనరును గర్వించె నటం, చని త్రిశిరఃపురనివాస యాదృతదాసా.

110


గీ.

సోలె ననఁగను దగు వాడివ్రాలె ననుట, మనును సొమ్మలవోయె సొమ్మసిలె ననఁగ
మూర్ఛఁ జెందె నటం చని పొంచె ననఁగ, దాఁగుకొనియుండెననుమాట దగుమహేశ.

111


గీ.

అఱచె ఱంపిలె ననఁ గూసె ననుట వెలయు, సరిగె నెదిరించె ననుమాట చనును మాఱు
మసలె ననఁగను రొప్పెనా మనును వ్యాఘ్ర, మారవముఁ జేసె ననుట చంద్రార్ధచూడ.

112


గీ.

లంబనంబాయె ననుటకై వ్రాలెననఁగఁ, బొలుచుఁ దగుఁ బొడమె ననంగఁ బుట్టెననుట
కాయె నయ్యె ననంగఁ జెన్నలరుఁ గలిగె, ననెడిమాటకు మాతృభూతాభిధాన.

113


గీ.

మళ్లె మరలెఁ దిరిగె మగిడె ననంగను, గ్రమ్మఱిలె నటంచుఁ గానఁబడును
వినిచె ననఁగఁ దోఁచు వినఁబడె నంచని, మహితగుణసమేత మాతృభూత.

114


గీ.

చిక్కుపడియె దొరకెఁ జేపడె నగపడెఁ, దనిలెఁ బట్టుపడియెఁ దగులువడియె
నబ్బె ననఁ గృహీత మయ్యె ననం దగు, మహితగుణసమేత మాతృభూత.

115


గీ.

దోఁపువోయె ననుట దోఁచు నులిపడె న, నంగ దిమ్ముపడె ననంగ డిందు
వడియె ననుట దోఁచం విడఁబడె ననఁగను, దనరు విడువఁబడియె ననుట కభవ.

116


గీ.

పొదివెఁ గవిసెను గ్రమ్మెనాఁ బొలుచు నావ, రించె ననుమాటగాను మలంచెఁ జుట్టె
గిరికొనెను బ్రమ్మె బరికొనె గ్రిక్కొనె సన, వెలయు వేష్టించె ననుటకు వేదవేద్య.

117


గీ.

మెసవెఁ దినియెఁ గుడిచె మెక్కె బోసేసెను, నమలె నారగించెనా భుజించె
ననుట కాఖ్య లగుచు నలరారుచుండును, మాతృభూత భక్తమాతృభూత.

118

సీ.

పొందె హత్తెఁ గలిసెఁ జెందెఁ దార్కొనెఁ గూడె బెరసెఁ గ్రిక్కిరిసెను బెనఁగె దొరసె
నందెఁ గదిసెఁ జేరె నన నంటె నని తోఁచు వాక్రుచ్చె నుడివెను బలికె నాడె
ననె ననఁగ వచించె నంచును విలసిల్లు వినియెను జెవి దోరపెట్టె నాఁగ
నాలకించెను వినె నాలించె ననఁగను బూనెఁ దాల్చెఁ దొడిగె మోచె నాఁగఁ
దార్చెనా గొదగొనె ననఁ దనరు నావహించె ననుమాటగా వెడలించె రొప్పె
వీచెఁ దఱిమెను దోలెను వెళ్ళఁదన్నె ననఁగ నుచ్చాటనముఁ జేసె ననఁ దగు భవ.

119


అడ్డగించె దటాయించె నానె నాగె, నిలిపె నరికట్టె ననఁగను వెలయుచుండు
వారణముఁ జేసె ననుటకు మీఱుచుండుఁ, దన్నె ననఁ దాఁచె ననుటకై దాతృవంద్య.

120


గీ.

పురిగొలిపె నంచెఁ బుత్తెంచెఁ బుచ్చె నంపెఁ, బంచెఁ బంపెను బంపించెఁ బనిచె ననఁగ
నలరు నంపించె ననుమాట కర్థమగుచు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

121


సీ.

కనుఁగొనెఁ దిలకించెఁ గాంచెఁ జూచెను గనె ననఁగను గనియె నంచనఁ జెలంగు
నానె నంచనఁ గ్రోలె ననఁ గ్రావె ననఁగ నాస్వాదించె ననుటకై పఱలుచుండుఁ
బీల్చె జుఱ్ఱె ననంగ వెలయుఁ దద్భేదమై వెదకె నారసె రోసె వెలచె నెమకెఁ
బరికించెను దడవె నరసె నగంగ నన్వేషించె ననుటకు వెలయుచుండుఁ
దూకొనెను జొచ్చెఁ జొరఁబాఱె దూరె దూసె ననఁ దటాకించెననుమాట కర్థ మగును
గాఁడె గ్రుస్సెను దొలిచెను నాడె ననఁగ నాటె ననుమాట కర్థమౌ నాగభూష.

122


సీ.

నుగ్గాడెఁ బరిమార్చె నులిమెను దెగటార్చెఁ జదివెఁ జంపెను సదమద మొనర్చెఁ
జక్కాడె నురుమాడెఁ జాఁగఱలాడెను బిలుకుమార్చెను ద్రుంచెఁ బీఁచ మడఁచెఁ
బెంచె మన్నిగొనెను బెంపె వెంపరలాడె మారిమసంగెను మడిపెఁ దునిమె
గ్రగ్గులుకాడును గావించె ముగియించె నులిచెను బగదెంచె నురుముఁ జేసె
నడఁచెఁ జెండె ననంగఁ బొందగు వధించె ననుటకు సమాఖ్య లై సాకె మనిచెఁ బెంచెం
బెనిచె బ్రతికించె గాచె నేదె నన నొనరుఁ బ్రోచె ననుమాట శ్రీమాతృభూతలింగ.

123


సీ.

అదలించి, గద్దించె నడలించె ననఁగను గదిమె నంచనుమాటగాఁ జెలంగుఁ
గొనియాడెఁ బొగడెను గొండాడె నిగ్గించె ననఁగను వినుతించె ననుట దోఁచు
మొత్తెఁ గొట్టెను వ్రేసె మోఁదెను మరిపెనాఁ బ్రహరించె ననుటకుఁ బరఁగుచుండు
వెలయును చాలించె బెల్లించె నటించె ననఁగ నెక్కించెనం చనెడిమాట
యెంచెను లెక్కించె నెన్నె ననంగను నెగడుచునుండు గణించె ననుట
కడఁగెఁ గిట్టెను డాసెను గదిసెఁ చనిసె జేరె డగ్గఱె ననఁ దారసించె ననఁగ
వెలయుఁ గోపానఁ బెదవిని విఱిచె ననుట కవుడుగఱచె నటంచు నహార్యనిలయ.

124

గీ.

అరసెనాఁగ విచారించె ననుట కొప్పుఁ, బూసెఁ బట్టించెఁ జమరెనాఁ బొలుచు నలమె
ననుట కెదిరించె ననుటకు నఱమె ననఁగఁ, బొలుచుచుండును శ్రీమాతృభూతలింగ.

125


గీ.

ఎలిచెఁ దలఁచె ననం జను నెంచె ననుట, చీఱె నన నుత్తరించెనాఁ జించె ననఁగ
ఛేదనముఁ జేసె ననుటకుఁ జెలఁగుచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

126


గీ.

ప్రామెఁ దొలిచెను వెలనెను దోమె రుద్దె, ననఁగ నిర్మల మొనరించె ననుట యొప్పు
నెసగొలిపె రేఁచెనాగను నెసగుచుండుఁ, బ్రేరణముఁ జేసె ననుమాట యిందుజూట.

127


గీ.

తెలచె నెరఁగె నెఱంగెఁ జాగిలెను మ్రొక్కె, నన నమస్కారమును జేసె ననుట కొప్పు
మీఱె ననఁ గడచి ననఁగ మించె ననుట, పొలిచి యుండును శ్రీమాతృభూతలింగ.

128


గీ.

గనుపుగొట్టె ననంగను దనరు నూఁచ, ముట్టుగాఁ గొట్టు ననుమాట పట్టుకుపడె
ననెడిమాటకుఁ దగుఁ గచ్చుకొనె ననంగఁ, బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

129


గీ.

పెట్టెఁ గీలిండె నాఁగను వెలయుచుండు, నుంచె ననుపల్కునకు నేదె నుజ్జగించె
ననఁగ విడిచె ననెడిమాట కతిశయిల్లు, భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

130


క.

ఒప్పించె నొప్పగించెను, నొప్పరగించె నన మూఁడు నొకయర్థంబౌం
గప్పె నన మూసె ననుచుం, జెప్పంబడుఁ గవులచేతఁ జెవ్వందీశా.

131


సీ.

గొనెమారెఁ జదిపె నాఁగను గొట్టె నని తోఁచుఁ దఱిగె ననంగను నఱకె ననఁగ
గోరాడెఁ జిరిమెను గొండాడె నాఁగను దుమ్మురేఁచె నటంచుఁ దోఁచుచుండుఁ
జెనకె నంటెను సోఁకెఁ జెనసె ముట్టె ననంగఁ దాఁకె నటం చని తనరుచుండు
జెరివెఁ దాఁచెను దావెఁ జెక్కె దూర్చె ననంగఁ జొనిపె నటంచని తనరుచుండు
నెసఁగు నొడియించె ననఁగఁ దీయించెననుట చీరె ననఁ బిల్చెననుపల్కు చెల్లుచుండు
రాల్చె జాడించె ననఁగను రహికి నెక్కు విదలిచె నటన్న పల్కుగా వేదవేద్య.

132


సీ.

నిమిరెను దడవెనా నిమిరె నంచని యొప్పు నచ్చె ననం దగు నమ్మె ననుట
సోడుముట్టె ననంగ శోభిల్లు నంతట వ్యాపించె ననుట యియ్యకొనె నూల్కొ
నె ననఁగ సమ్మతించె ననుట రాజిలు వంచె ననందగు వండె ననుట
వంచె ననుటయును వానించె ననఁగను బైని దేలించుట పరఁగుచుండుఁ
బాఱఁజూచె ననంగఁ దప్పకయె చూచె ననుటకును దోఁచు నోనాడె ననఁగ నొవ్వ
నాడె ననుట చెలంగుఁ దనర్చు వీడె మానె నన విడిచెననుట మాతృభూత.

133


గీ.

ఓసరించె ననఁగ నోరఁజేసె ననుట, వెలయు విలిచె ననఁగఁ బిలిచె ననుట
యలరు విలిచె ననఁగ నమ్మె నంచనఁ దోఁచు, మహితగుణసమేత మాతృభూత.

134


గీ.

పోఁజె ననఁగ వెలయు ముంటఁ జీల్చె ననుట, చెప్పె ననుట ఫలముఁ జెందె ననుట
పరఁగుఁ బొరసె ననఁగ మఱువెట్టె ననఁదగు, మఱుఁగుఁ బెట్టె ననుట మాతృభూత.

135

సీ.

పంచించె ననుటకుఁ బండించె ననఁగను గికురించె ననఁగను గేరుచుండు
దీకొనె ననఁగను డీకొనె ననఁగ నెదుర్కొనె నంచును దోఁచుచుండు
బురపురఁ బొక్కె నాఁ దఱుచుగా వెతలను జెందె నంచనుమాట చెలఁగుచుండు
వార్చెనాఁ గడిగె నుపాసించెఁ గెడసె నుద్దేశించె నాఁగను దేజరిల్లు
వెలయు వెన్నాడె నాగను వెంబడించె ననుటకు వెలార్చె వెదచల్లె ననఁగఁ జల్లె
ననుటకుఁ జెలంగు వినఁడాయె ననెడిమాట కలరుఁ బెడచెవిఁ బెట్టెనం చని మహేశ.

136


గీ.

మించు రిక్కించె ననఁగ నిక్కించె ననుట, చనును పారువఁ జూచెనాఁ జక్కఁగాను
జూచె ననుటకు సలిపెనాఁ దోఁచుఁ జేసె, ననెడిమాటకు మాతృభూతాభిధాన.

137


క.

పటుతాళించె నవంగను, నటునిటు బెళుకంగఁ జూచె ననుటకుఁ దోఁచున్
జిటికె ననంగను విలసిలుఁ, జిటికలు వేసె ననుమాట చెవ్వందీశా.

138


గీ.

అడిగెఁ బతికె వండె నడ్డగించెను గోసె, ననఁగ నిట్లు కొన్ని యగు ద్వికర్మ
ధాతువులుగఁ దెలియఁ దగు వానినెల్లను, మహితగుణసమేత మాతృభూత.

139


సీ.

ప్రోచుచున్నాఁ డనఁ బ్రోచుచున్నా వనఁ బ్రోచుచున్నా ననఁ బొలఁచు లట్టు
ప్రోచె ననంగను బ్రోచితి వనఁగను బ్రోచితి ననఁగను బొలుచు లిట్టు
ప్రోచు ననంగను బ్రోతు వనంగను బ్రోతు ననంగఁ బెంపొందు లృట్టు
ప్రోచుఁ గాత యనంగఁ బ్రోతువు గాతనాఁ బ్రోతును గాతనా బొలుచు లిఙ్ఙు
లార్థముల పురుషక్రియలందు నేకవచనములఁ దెల్పితిని బహువచనములను
జూచి యన్నిటి కిట్టు లెంచుకొనవలయు నాశ్రితనిధాన మాతృభూతాభిధాన.

140


గీ.

ప్రోవఁబడె ననఁ గర్మార్థమునఁ జెలంగుఁ, జనును బ్రోపించె ననఁగ ణిఙర్థరీతి
నలరు భావార్థమునఁ బ్రోచుటాయె ననఁగఁ, దక్కు నీరీతిఁ గనుఁగొనఁ దగు మహేశ.

141


గీ.

భావమునఁ బ్రోవు ప్రోచుట బ్రోవడ మనఁ, బరఁగుఁ గర్మార్థమునఁ బ్రోవఁబడినది యన
వఱలుఁ గర్త్రర్థమునఁ బ్రోచువాఁ డనంగ, మను సుబంతంబు లీజాడ మాతృభూత.

142


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ క్రియావర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

143

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

గీ.

అశ్రుతగ్రామ్య విస్మృత వ్యర్థసులభ, శంకితాలస్య నిరుక్తశబ్దవితతిఁ
దక్క రచియించు నీకృతి దయను గొనుము, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

144

చ.

చరణసమజ్జనావనవిశారద
శారదచంద్రరుక్తిర
స్కరణచణాయమానముఖసారస సారసమంచితోక్తిని
ర్భరకవితారసైకసులభాయితరూపక రూపకంఠసుం
దరలతికాసమానదయితాభరణాంగ రణాంగణప్రియా.

145


మాలిని.

సకలభువననాథా సంతతస్వావబోధా
మకుటఘటితసోమా మంగళాధారనామా
సుకవిహృదయగేహా సుందరస్వచ్ఛదేహా
యకలుషనిజచర్యా యాశ్రితామోదకార్యా.

146


గద్య.

ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాదికతిపయగుణస్వ
సామ్య తదితరసకలగుణనిరౌపమ్యాసేతుహిమాచలఖ్యాత మహోద్దండకవి బిరుద
ప్రశస్తసీతారామార్యవర్యతనూజాత శౌర్యధైర్యస్థైర్యాదిసకలగుణచిరత్నరత్న
రత్నాకర శ్రితజనశ్రీకరకోటిసమాఖ్యవంశసుధాపయోధిరాకాశశాంక ఘంటికా
తురగ నీలాతపత్త్ర హనుమద్ధ్వజ మకరకేతన దివాదీప నవవిధభేరికాదినిఖిలబిరు
దాంక బృహదంబికాకటాక్షసంజాతసామ్రాజ్యధురంధర విమలయశోబంధుర కర్ణాట
చోళపాండ్యమహీపాలాధిసంస్తూయమాన శ్రీరాయరఘునాథమహీనాథ సభాం
కణ బిరుదాయమా నార్యనుతచర్య వేంకనార్య ప్రణీతం బైనయాంధ్రభాషార్ణ
వంబునందు సర్వంబును దృతీయకాండము.

సంపూర్ణము