Jump to content

ఆంధ్రనాటక పద్యపఠనం/రాగం

వికీసోర్స్ నుండి

5. రాగం

ఇక, రాగం. నాదం ప్రాణాగ్నుల సంయోగం అంటారు. ప్రాణి వల్లనే కాని ఘర్షణజరగదు, ఘర్షణవల్లనేకాని నాదం జనించదు - అని ఆవాక్యభావం అయుంటుంది. వాయు రేణువుల ప్రవాహతరంగాలకి దారి సన్నగించినప్పుడు ఘర్షణజరిగి నాదం జనిస్తుంది. అటువంటి పనికి మాన వుడి కంఠంలో ఏర్పాట్లు ఉండడంవల్లనే, మానవుడు నాదం చెయ్య గలుగుతున్నాడు. అటువంటి పనివల్లనే, మురళికుడా మోగుతుంది. పైగా, ఒక లోహపుతీగెని మీటినప్పుడుగాని, బిగించిన చర్మాన్ని మోదినప్పుడుగాని, వాటికి కంపనం కలిగి, వాటి ప్రతికంపనం పరిసర ప్రాంతంలోని వాయురేణువులకి సంక్రమించగా నాదం పుడుతుంది. కొంతకాలంపాటు ప్రతి సెకనులోను ఏదో స్థిరసంఖ్యచొప్పున స్పంద నాలు పుట్టగలిగితే, నాదం శ్రావ్యంగా ఉంటుంది, అది గానంలో చేరుతుంది. లేకపోతే అది గోల అవుతుంది. స్పందనసంఖ్య సెకనుకి కొంత మొత్తానికి తక్కువగా ఉన్నా, మరోకొంత మొత్తంకంటె ఎక్కువగా ఉన్నా ఆ నాదాన్ని చెవి స్వీకరించజాలదు. ఒక శ్రావ్య నాదానికి సెకనుకి 240 స్పందనాలు అనుకుందాం. దీనికి రెట్టింపు నాదా నికి సెకనుకి 480 స్పందనాలు ఉంటాయి. అటువంటి రెండు నాదాల మధ్యరంగంలో ఒక ఇరవై మజిలీలు గుర్తింపగలిగి ఆంధ్రులు, అట్లా ఏర్పడ్డ 22 ప్రత్యేక నాదాలకీ నామకరణం చేశారు, వాటిని శ్రుతులు అన్నారు. కాని, ఈ 22 శ్రుతులూ యథాక్రమంగా గాత్రంతో అని చూపించడం ఇబ్బందే అన్నారు. ఎవరేనా ప్రజ్ఞావంతులు అటా చూపించగలిగినా, శ్రమకి తగ్గ ఫలితం ఉండదన్నారు. ఏమంటే, ఇవన్నీ దేని కది శ్రావ్యమే అయినా, ఒకటి తరవాత మరొకటి అనే టప్పుడు ఆ మరొకటి మొదటిదానిలో కలిసికట్టుగా ఉండవచ్చు, లేక కర్ణకఠోరంగా ఉండవచ్చు, అన్నారు. మొత్తం 17 స్వరాలయితే పని జరుగుతుందని అనుకుని, స, రి, గ, మ, ప, ద, ని సంజ్ఞలు ఏర్పాటు చేసుకుని, స,రి—లు3, గ-లు3, మ-లు2, ప-1, ద-లు3, ని-లు3, హెచ్చు స-వెరసి 17 అనుకున్నారు. ఈ పధకంకుడా పట్టివ్వలేదు. మూడో ‘రి’ మొదటి 'గ' కేసి జరిగి దానిలాగే తయారైంది. మూడో 'గ', మూడో 'ధ', మూడో 'ని' అల్లాగే అయినాయి. పర్యవసానం, స, 'రి'లు 2, 'గ'లు2, 'మ' లు 2, ప, 'ధ'లు 2, 'ని'లు 2, హెచ్చున - ఇవి ఖాయం అయినాయి. అనగా, మొదటి 'స' యొక్కస్పందనం విలువ 1, అనుకుంటే:


మొదటి - రి, 16/15 రెట్లు
రెండవ - రి, 9/8 రెట్లు
మొదటి - గ, 6/5 రెట్లు
రెండవ - గ, 5/4 రెట్లు
మొదటి - మ, 4/3 రెట్లు
రెండవ - మ, 45/32 రెట్లు
             ప, - 1 1/2 రెట్లు
మొదటి - ధ, - 8/5 రెట్లు
రెండవ - ధ, 27/16 రెట్లు
మొదటి - ని, 27/15 రెట్లు
రెండవ - ని, 15/8 రెట్లు
హెచ్చు - స 2 రెట్లు


నాదప్రియత్వం హెచ్చినకొద్దీ ఈ స్వరాల్లో పూర్తిగా విహరించే కుతూహలం ఎక్కువైంది. ఆధారం లేందే ఏమీ ఉండదుగదా! స్వరవిహారానికి ఆధారస్వరం ఉండి తీరాలి. 'స' తప్పదు. 'ప' - ఒకటే గనక తప్పదు.

స రి1రి21212 ప ధ12ని1ని2

1 2 1 1 2

మొత్తం 7 స్వరాలు ఉండాలంటే ఇక 5 స్వరాలు పుచ్చు గోవాలి. రి1 రి212 లలోంచి 2 స్వరాలు 6 విధాలుగా తియ్య వచ్చును, (ఆజోడీలలో రి1రి2, గ12 వచ్చినప్పుడు మొదటిది 'రి' రెండోది 'గ') మ12 ల లోంచి 1 స్వరం 2 విధాలుగా తియ్య వచ్చును. 'ధ12ని1ని2ల లోంచి 2 స్వరాలు 6 విధాలుగా తియ్య వచ్చును. కాబట్టి 7 స్వరాలు ఎన్నుకోడానికి మార్గాలు 6×2×6= 72. కేవల స్వరవిహారం, వృత్తాంతంతో నిమిత్తం లేకుండా, రంజింప జేస్తుంది గనక దానికి 'రాగం' అని పేరు పెట్టారు. ఏడు స్వరాల్లో విహరించడానికి వీలైన రాగాలు 72 గనక, వాటిని మేళకర్తలన్నారు. వాటికిపేర్లు పెట్టడంలో, పేరు చెప్పగానే అది 72 లోనూ ఎన్నోదో గ్రహించడానికి అక్షర సంకేతాలు ఏర్పరిచి తంటాలు పడ్డారు. ఇవి జనకరాగాలు, వీటిల్లోంచి ఇతరరాగాలు పుట్టగల వని చూపించి, వాటిని జన్యరాగా లన్నారు.. అధమం 5 స్వరాలుంటే, రాగం కావచ్చునన్నారు - కాని వాటిలో 'స' ఉండితీరాలి, 'ప' గాని 'మ' లలో ఒకటిగాని ఉండి తీరాలి. 4 స్వరాల రాగాలంటూ ఆంధ్ర గానంలో లేవు. అయితే స్వరవిహారంలో ఆరోహణ అవరోహణ లున్నాయిగనక, హెచ్చేటప్పుడు 7, లేక 6, లేక 5, ఉండవచ్చు. దిగేటప్పుడు 7, లేక 6, లేక 5, ఉండవచ్చు. కాబట్టి, సక్రమంగా స్వరాలు హెచ్చి దిగే రాగ విధాలు 9. ఈ రకాల మొత్తం:


ఎగువ 7, దిగువ 7 - 1 రాగం
ఎగువ 7, దిగువ 6 - 6 రాగములు
ఎగువ 7, దిగువ 5 - 15 రాగములు
ఎగువ 6, దిగువ 7 - 6 రాగములు
ఎగువ 6, దిగువ 6 - 36 రాగములు
ఎగువ 6, దిగువ 5 - 90 రాగములు
ఎగువ 5, దిగువ 7 - 15 రాగములు
ఎగువ 5, దిగువ 6 - 90 రాగములు
ఎగువ 5, దిగువ 5 - 225 రాగములు
                     ------------
మొత్తం. 484
                     -------------


మేళకర్తలలో ఒక్కొక్కదానికే ఈ అవస్థ పట్టవచ్చుగనక, సక్రమస్వరరాగాల సంఖ్య 72 X 484 = 34848 అన్నారు. ఇవిగాక, వక్రరాగాల సంఖ్య ఎంతగానేనా పెంచవచ్చన్నారు. అవిగాక రి, గ, మ మొదలైనవాటిని షడ్జమాలుగా మార్చుగుంటే, ఇంకా యితరరాగాలు సంక్రమిస్తాయన్నారు. సుమారు మూడువేల రాగ నామాలు సృష్టించారు. వ్యక్తిత్వం లేనప్పుడు పేరే ఉండదుగనక, అన్ని రాగాల్ని గుర్తించారన్నమాట. వంద రాగాలమీద కీర్తనలు రచించడానికి సంకల్పించిన త్యాగరాజు దగ్గరిగా 200 రాగాలు తీసు గున్నాడు. నారాయణదాసుకుడా మేళకర్తరాగాలన్నీ వాడుతూ సుమారు 200 రాగాలు ముచ్చటించాడు. పాటకచేరీలనబడే సమావే శాల్లో 150 రాగాలదాకా వినపడుతూంటాయి. కాని, ఏ రాగం పాడుతున్నాడో దానిపేరు గాయకుడు చెప్పడు, చాలామందికి తెలి యదు, ( రాగకృషి చేస్తూండేవాళ్ళకితప్ప ). తెలియనివాళ్ళు ( ఆంధ్రంలో నూటికి 99 మంది ఉండవచ్చు ) ఎన్నిసార్లు రాగశ్రవణం చేస్తూన్నా, రాగంపేరు తెలియకుండానే రాగాస్వాదన చెయ్యడానికి తమరికి “జన్మ ” హక్కుఉంది అంటూండడమూ అల్లా కూచుంటూండ డమేకాని, రాగాన్ని పోలిక పట్టడానికి యత్నమేనా చెయ్యరు - తమ రికి గంధర్వాంశ లేదంటూ క్షమాపణ కోరతారు. పాడి ఇతరుల్ని మెప్పించడానికయితే పోనీ గంధర్వాంశ ఉండాలనచ్చుగాని, రాగాభి లాష చూపించడానికి మానవాంశకంటె తక్కువగాఉన్నా సరి పోతుందే! అయినాసరే, ఏముటో !

కాని, సుమారు ఓ నలభై రాగాలు :-- అఠాణా, ఆనంద భైరవి, ఆరభి, ఆహిరి, కన్నడ, కమాను, కల్యాణి, కాంభోజి, కాఫీ, కేదార, కేదారగౌళ, ఖరహరప్రియ, చక్రవాకం, జంఝాటి, జంగ్లా, తోడి, దేవగాంధారి, ధన్యాసి, నాట, నాటకురంజి, నాదనామక్రియ, నీలాంబరి, పున్నాగవరాళి, బిలహరి, బేగడ, బేహాగ్, భూపాల, భైరవి, మధ్యమావతి, మలయమారుతం, ముఖారి, మోహన, వసంత, శంఖరాభరణం, శహాన, శ్రీ, సారంగ, సావేరి, సింహేంద్రమధ్యం, సురట, హంసధ్వని, హిందోళ - వంటివి మాత్రమేనా అధమపక్షం పోల్చుగుని ఆనందించడానికి యత్నించడం మానవాతీతం కాదేమో అని తోస్తుంది. ఆకాశవాణి వచ్చింతరువాత కొన్ని రాగాలపేర్లు జనానికి పరిచయం అయినాయికాని, ఏ రాగానికి ఏ పేరో మాత్రం కొందరికి తెలియదు.