ఆంధ్రదేశము విదేశయాత్రికులు/మార్కో పోలో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మార్కో పోలో

యుఆన్‌చ్వాంగునకు వెనుక నాంధ్రదేశమును సందర్శించి చనిన విదేశీయులలో పదమూడవ శతాబ్దాంతమున ఏతెంచియుండిన మార్కోపోలో ఆంధ్రులకృతజ్ఞతకు బాత్రుడు. ఆతని జీవితమును ఆతని గ్రంథమును కడు మనోజ్ఞములు. ఆతడు తెలిపిన విశేషములన్నియు వింతకథల వలె దోచుచుండును. పాశ్చత్యప్రపంచమున టోలమీ తరువాతను కొలంబసునకు బూర్వము, నీతని బోలిన భూగోళ శాస్త్రజ్ఞుడుగాని, భూప్రదక్షణముచేసి వచ్చినవాడుగాని మరియొకడు గానరాడు. కొందఱు పండితులీతని కొలంబసు కంటె ఘనుడని వాదించుచున్నారు. మార్కోపోలో జన్మింప కుండిన కొలంబసు ఆమెరికాను చూడగలుగుట జరిగియుండక పోవునని వారి తాత్పర్యము. హిందూస్థానముయొక్క నాగరతావిశేషము, హిందూదేశీయులయొక్క బుద్ధి, ప్రతిభ, తేజము, ఐశ్వర్యము ఖండఖండాంతరములకు వ్యాపించుటకు మధ్యయుగము నందు మార్కోపోలో కారకుడు. ఆతడు రచించిన గ్రంథము సాహసిక జీవులకు నూతనోత్సాహము బోసి యావేశము కలిగించెను. దానిఫలితమే, కొలంబసు అమెరికాను గనుగొనుటయు, పోర్చుగీసువారు అట్లాంటిక్ మహాసముద్రము నంతయు దాటి, ఆఫ్రికా ఖండమును జూట్టివచ్చి, హిందూ దేశమును, సముద్రము మీదుగా జేరుకొనుటయు నని చెప్పవచ్చును.

మార్కోపోలో జీవిత మొక చిత్రమైన కధవలె నుం డును. ఇటలీదేశమున వెనీషియానగరమున పండ్రెండవ శతాబ్దమున 'పోలో' యని యింటిపేరుగల, ప్రసిద్ధవర్తకుల కుటుంబము మొకటి యుండెను. ఆకుటుంబమునందు క్రీ.శ. 1254 వ సంవత్సరమున మన కధానాయకుడగు మార్కోపోలో జన్మించెను. మార్కో, పితామహునిపేరు ఆండ్రియాపోలో. ఆతనికి ముగ్గురు కుమారులుండిరి. వారిలో జ్యేష్టుడు మాఫియో. రెండవవాడు నికోలో ఇతడే, మనమార్కోకు జనకుడు. మూడవవానిపేరు మార్కో. మాషియోపోలో, నికోలోపోలోయును గలిసి, తుర్కీ రాజధానియైన కానిస్టాంటినోపిలు (స్టాంబూలూ అని తుర్కీవారు పిలుతురు) నగరమున, సమిష్టిగా వ్యాపార మారంభించిరి. మార్కోమాత్రము సోదరులతో కలియక, సొంతముగా నాయూరనే వర్తకము చేసుకొనుచుండెను.

ఇట్లుండ, క్రీ.శ. 1260 వ సంవత్సరమున వ్యాపారార్థమై నికోలో, మాఫియో పోలోలు, నల్లసముద్రమును దాటి ఉత్తరాభిముఖులై క్రిమియాద్వీపమునకు జనిరి. ఆ ద్వీపమునకు ప్రధానరేవు పట్టణమును, రాజధానియు, సోల్డియా నగరమున, మనపోలో సోదరులు వర్తకమువలన విశేష లాభమును గడింపగలిగిరి. అంతట వచ్చిన లాభముతో, నమూల్యములయిన వస్తువులను, రత్నములను అపూర్వము లయిన యితరములను గొని యింకను విశేషలాభాపేక్షతో, నుత్తరదిశగా, తార్తారరాజధానికి జనిరి. తార్తారదేశాధీశుడీ వెనీషియను వణిక్కుల నుచితరీతి సంభావించి, విశేషలాభమిచ్చి, వారిసరకు లన్నింటిని దీసుకొనెను. ఆరాజన్యుడు చేసిన గౌరవమును, ఆదరణయు నానందించుచు, వా రచ్చట రెండుసంవత్సరములుండి పోయిరి. ఇంతలో దక్షిణ తార్తార దేశీయులకును, ఉత్తర తార్తారదేశీయులకు పెద్దపోరు సంభవించెను.

అదివఱకే యింటికి పయనము గాదలచుకొనియున్న మనవర్తకులు రాజునొద్ద సెలవు గైకొని పయనమైరి. కాని యుద్ధముల ఒత్తిడి వలన, స్వదేశమునకు బోవు, బాటలన్నియు నపాయకరమైన స్థితియం దుండెను. అందువలన, వారు స్వదేశాభిగమన మప్పటికి చాలించుకొని వాణిజ్యార్థమై పూర్వాభిముఖులై, పారశీకదేశమునందున "బొకారా" నగరమును గూర్చి పయనమైరి. ఈప్రయాణము దీర్ఘమగు నెడారిగుండ సాగింపవలసి వచ్చుటచే నెంతో ప్రయాసకరమయ్యెను. మన వర్తకులు బొకారానగరమున అప్రయత్నముగ నెట్టులో మూ డేండ్లుండిపోయిరి. వా రచ్చట నున్నదినములలో కాక తాలీయముగ, చీనాచక్రవర్తి కుబ్లయిఖానుని రాయబారు లెచ్చటనుండియో స్వదేశాభిముఖులయి వచ్చుచు, కొంతకాలము బొకారానగరమున నాగుట తటస్థించెను. వారీ ఐరోపియను వర్తకులనుగాంచి, యంతదూరము దేశమున వారిని గాంచుటకు నాశ్చర్యమంది, వారిని దమ యేలిక కడకు రావలసిన దనియు, నాతడు తప్పక వారిని సముచితరీతిని సంభా వించుననియు ప్రార్థించిరి. వ్యాపారలాభమే చూచుకొన్న వారగుటచే నావర్తకులు ఇంటిమాటమఱచి, చీనా దేశమునకు ప్రయాణమైరి. కుబ్లయిఖాను వారిని చూచి యచ్చెరువంది, వారి ననేక విధముల గౌరవించి ఆదరించెను. వినోదగోష్ఠి యందు, వారల రావించి, యైరోపాఖండము, అందలి రాజ్యములు, రాజులు, ధర్మపరిపాలన, రాజనీతి, మతము మున్నగు ననేకవృత్తాంతమ ల నడిగి విసుగు విరామములు లేక వినుచుండెను. అట్లు కొంత కాలమగు నప్పటికి ఆతనికి క్రైస్తవ మతము మీద నభిమానము జనించెను. అంతట తనప్రజలకు మోక్షసాధనము నుపదేశింప కొందఱి మతప్రవక్తలను క్రైస్తవమతాధిపతి పోపు పంపునా యని విచారించెను. పిమ్మట నాతడు ఆవర్తకులను తిరిగి యైరోపాఖండమునకు బోవలసినదనియు, తన రాయబారులుగా పోపు కడ కేగి, యెట్లయిన నూర్గురుమంది ప్రచారకులను మంచి పండితులయిన వారిని వాదోపవాదము సేయగల తార్కికులను, ధర్మవేత్తలను బంపవలసినదని ప్రార్థింపబంచెను.

మనవర్తకులు చీనాదేశమును వదలి యింటికి జేరునప్పటికి మూడువర్షములు పట్టెను. వారు, మధ్యధరా సముద్రపు టొడ్డుననున్న "ఆకర్" రేవును సమీపించునాటికి పోపు మరణించినవార్త తెలిసెను. నూతనముగా పీఠాధిపతి యెన్నుకొనబడునంతవఱకు వెనీషియానగరమందే కాలము గడపనెంచి వారు క్రీ.శ. 1264 వ సంవత్సరమున ఓడనెక్కి పయన మైరి. ఇలుసేరునప్పటికి నికోలోపోలో భార్యమరణించిన దు:ఖ వార్త తెలిసెను. నికోలో కామెవలన, మన కథానాయకుడగు మార్కో యొక్కడే జనించెను. ఆతని కప్పటికి పదియేనేండ్ల వయసుండెను. మార్కో తల్లిగతించినదాదిగా మేన మామలయిండ్లకడ బెరుగుచుండెను.

నికోలో, మాఫియోపోలోలు, పో పొకడు యెన్నుకొనబడి ప్రతిష్టింపబడునని రెండు సంవత్సరములు వఱకు వెనీషియాయందు వేచియుండిరి. కాని పోపు నెన్నుకొనుట మాత్రము జరిగి యుండదయ్యెను. అప్పటి విపరీత మత, రాజకీయ పరిస్థితులనుబట్టి పోపు యెన్నుకొనబడడేమో యని సంశయ మంది, తమ ప్రయత్నములను, రాయభారమును విఫలము లయ్యెనని విన్నవించుటకు మరల నాసోదరులు చీనాకు ప్రయాణమైరి. ఈసారి మార్కోనుకూడ వారు వెంటబెట్టుకొని జని యుండిరి. అది క్రీ.శ. 1271 వ సంవత్సరము. అప్పటికి మన మార్కోపోలోకు పదునేడుసంవత్సరములు వయసుండెను.

వారి ప్రయాణము బహుదూరము సాగకముందే, ఆకరునందున్న, మఠాధికారి, పోపుగా ప్రతిష్టింపబడినవార్త వారికి దెలియవచ్చెను. క్రొత్తపోపు కుబ్లయిఖానుని, సందేశమాలకించి, నూరుమంది ప్రవక్తలకు బదులు మువ్వురను మాత్రమంపుట కంగీకరించెను. వారును, మన యాత్రికులతో, కొలదిదూరము మాత్ర మరిగి భయపడి వెనుకకు దిరిగిపోయిరి. కాని పోలోసోదరులును మార్కోయును, చీనా దేశప్రయాణమును విడువక సాగించిరి కుబ్లయిఖాను, వారిరాకకు చాల ముదమంది యెప్పటికంటె నధికముగ సత్కరించి యాతిథ్యము నెఱపెను. చక్రవర్తిదృష్టిని, యువకు డగు మార్కోపోలో విశేషముగ నాకర్షించెను. నాడు మొదలుకొని యాతడు చక్రవర్తి ప్రత్యేకమన్ననలకు బాత్రుడై, విశ్వాసముతో నాతని గొలిచెను. మార్కోపోలో అనతి కాలములో చీనా భాషను, తార్తారభాషను, వ్రాయను, మాటలాడను గూడ నేర్వగలిగెను. చక్రవర్తి యాతని ప్రజ్ఞాబుద్ధివిశేషముల కచ్చెరువంది దూరస్థములయిన రాజ్యము లెట్లు బరిపాలింపబడుచున్నవో, జూచి తనకు నివేదించు కొఱకు విశ్వాసపాత్రమైన నియోగిగా వొనర్చి పంపుచువచ్చెను. అత డట్లు దూరస్థములయిన రాజ్యములను సందర్శించుటకు బోయినపు డొక సమయమున, హిందూ దేశమును కూడ జూడవచ్చెను. అట్లే తెంచినపుడీ, మార్కోపోలో, కాకతీయ రాజ్యమునందు గల ప్రసిద్ధ రేవుపట్టణమున మోటుపల్లికడ నోడదిగి, కాకతీయరాజ్యములోని కేగియుండెను.

అట్లు చీనా చక్రవర్తికడ, క్రీ.శ. 1273, మొదలుకొని క్రీ.శ. 1290 వఱకును పదునేడు సంవత్సరము లూడిగము సలిపినపిమ్మట, నీవెనిషియనులు, తాము స్వదేశమునకు బోవ కుతూహలముతో, నాతురతతో నున్నామనియు, సెలవీయవలసినదని ఖానుని ప్రార్థించిరి. ఇట్లు చక్రవర్తిని యెన్నిసారులో వారు ప్రార్థించుటయు, నందులకాతడు, వారిమీదగల ప్రేమాతిశయము చేతను, వారివంటి విశ్వాసపాత్రులయిన మిత్రులును, సచివులు, భృత్యులు నికలభింపరను సందేహము చొప్పునను వారిప్రార్థన నంగీకరింపడయ్యెను. ఇపుడును చక్రవర్తి యంగీకరించియుండడు గాని, దైవయోగమున నొకయవకాశము గల్గెను. పారశీక ప్రభువున కప్పుడు భార్యా వియోగము కలిగెను. మరణశయ్యమీద నున్న నాతని సతి, తనపుట్టింట బుట్టిన యాడపడుచును గాని యితరుల వివాహమాడ వలదని, భర్తను శాసించెను. అనురాగ బద్ధుడైన సుల్తాను ఆమె కడసారి ముద్దు చెల్లింప సంకల్పించుకొనెను. అతడు వరింపవలసిన బాలిక చీనాచక్రవర్తియగు కుబ్లయిఖానుని వశమందుండెను. ఆమెతలితండ్రు లాతనిసామంతులు. అందువలన పారశీకసుల్తానా బాలిక కొఱకు కుబ్లయిఖానునకు సందేశహరులనంపెను. ఆయువతికప్పటికి పదునేడు సంవత్సరముల వయసుండెను. లేతయవ్వనమున నున్న యాసౌందర్యవతి నిచ్చి, రాయబారులను ఖాను ప్రయాణ సన్నాహము గావించెను. కాని అంతలో, తార్తారులలో తార్తారులకు అంత:కలహములు సంభవించి భయంకరరూపమును దాల్చెను. ఎంతపరివార మిచ్చినను ఆరాయబారులను బాలికను, నాటుదారిని, యుద్ధభూముల గుండ పారశీక దేశమున కంపుటకు ఖానుడంగీకరింపక, పెద్దనౌకాదళమును సమకూర్చి, సముద్రమార్గమున ప్రయాణము సన్నాహపఱచెను. సముద్రయానము, పారశీకులకు నూతనమగుటచేత, తెలిసిన వెనీషియను లను దమకుదోడుగా నంపవలసినదని, రాయబారులు ఖానుని ప్రార్థించిరి. అంతరంగమున, నిష్టములేక పోయినను, మాట తీసివేయజాలక, చక్రవర్తివారి ప్రార్థన మంగీకరించెను. ప్రయాణమునకు గావలసిన దానికంటె యెన్నియో రెట్లధికముగ వారి కన్నియు నిచ్చి యంపెను.

చీనా దేశమునుండి, మన యాత్రికులు 1293 వ సంవత్సరమున బయలుదేరిరి. వారికి పారశీక దేశమును జేరునప్పటికి రెండు సంవత్సరములు పట్టెను. ప్రయాణములో, పరివారము లోనివారు ఆరు వందలమంది మరణించిరి. ఇట్లుండ, పెండ్లివారు పారశీక దేశమును ప్రవేశించు నప్పటికి, సుల్తాను, కాలధర్మము నొందినట్లు దెలిసెను. కాని యింతవ్రయప్రయాసల కోర్చి, తీసుకొని రాబడిన వధువునకు ప్రియుడు దొరకకపోలేదు. సుల్తాను గతించినందున సింహాసనమెక్కిన యాతని సుతు డాసుందరిని పెండ్లియాడెను. క్రొత్తసుల్తాను, మనయాత్రికులకు కుబ్లయిఖానువలెనే విశేషముగ నాతిధ్యసత్కారములు నెఱపి, స్వదేశమును సుఖముగా జేరుటకు వలయు సదుపాయముల ననేకముల గల్పించెను. వారికి, అశ్వదళమును కొంత అంగరక్షగా నిచ్చి సాగనంపెను. స్వదేశోన్ముఖులై, పయనమయి, చాలదూరము సాగకపూర్వమే వారలకు, తమయేలికయు, పోషకుడునగు కుబ్లయిఖాను చక్రవర్తి పరలోకగతుడయ్యె నన్న వార్త దెలియవచ్చెను. ఆవార్తవిని వారు మిక్కిలి సంతాపమును బొందిరి. పారశీకమునుండి వెనీషియా నగరమును సుఖముగా జేరునప్పటికి వారికొక సంవత్సరము బట్టెను.

క్రీ.శ. 1295 సంవత్సరమున వెనీషీయానగరమున, మనయాత్రికులరాక, యొకవింతగా నెల్లరకు దోచెను. ఎన్నడో మృతులయిరని, దాయాదులెల్లరును, పోలో కుటుంబముయొక్క, సొత్తునంతయు నాక్రమించుకొనిరి. ఇంటినికూడ తమ వశముచేసికొని యందు నివసించుచుండిరి. తార్తారులవలె నసహ్యకరములయిన యుడుపులను ధరించివచ్చిన వారి నెవ్వరును తమవారినిగా నిరూపింపలేక పోయిరి. కాని, వారు తమ భాగ్యమును బ్రకటించి, విందులిచ్చి, బంధువుల నెల్లరను రావించి గౌరవించినపుడును, చీకిచినిగిపోవుచు నసహ్యకరములయిన వారి యుడుపులను ముక్కముక్కలుగా, కత్తిరించి, అందుగల మడతలలోనుండి యమూల్యములయిన రత్నములను, మణులను ముత్యములను కుప్పలుగా ద్రిమ్మరించినపుడును, ఎల్లరును వారివృత్తాంతమును విశ్వసించియుండిరి. పదునేడు సంవత్సరములు దేశాంతర్గతులయి యుండుటచేత వారిభాషయుకూడ పోల్చశక్యము గాకుండెను.

పెద్దవాడగు మాఫియో పెండ్లి యాడకయే ముదుసలి యయ్యెను. పెండ్లియాడిన నికోలో, భార్య మరణించెను. జీవితకాల మంతయు ప్రవాసమున గడిపిన, మార్కో మహదైశ్వర్యమున కంతకు నపుడు యజమానియయ్యెను. ఇకనాతడు పరిణయమాడి సుఖింపదలచెను. అప్పటి కాతనికి నలువది రెండు సంవత్సరములు వయసుండెను. అతని సంకల్పమెట్లున్నను దైవమను కూలుడుకాలేదు. ఆతడింకను సుఖముగా జీవయాత్ర గడుపుటకు నోచుకొనియుండలేదు. క్రీ.శ. 1296 వ సంవత్సరమున వెనీషియాకును, జినోవాపట్టణమునకు యుద్ధము సంభవించెను. ఆయుద్ధముననె మార్కోపోలో సొంతద్రవ్యము వెచ్చించి యోడనుకట్టించి బయలుదేరెను. కాని యుద్ధమునందు వెనీషియనులు, పరాజితులయిరి. మార్కో, పట్టువడి తుదకు ఖైదిగా, జెనీవాకు గొంపోవబడెను. ఆనగరమున, నాతని బ్రఖ్యాతి విన్న వారందఱును ఆతనిసందర్శించి, సంభాషింప నేతెంచుచుండిరి. ఆతనిగూర్చి యత్యాశ్చర్యకరములయిన వృత్తాంతములు నల్దిశల వ్యాపించెను. కాని చెఱవిముక్తికాదయ్యెను. కోటీశ్వరుడగు తండ్రి యితని నెట్లయిన లంచమిచ్చి విముక్తుని చేయ విశ్వప్రయత్నములు గావించెను, గాని నిష్ఫలములయ్యెను. చెఱసాలలో నున్నప్పుడెందరో, యాతడుకని, విన్నవృత్తాంతములను చెప్పగోరుచు, వేధించుచుండిరి. దానికాతడు సహింపజాలక, తోడిఖైది, "రుస్టీకియానో" యనునాతనికి, తనకువచ్చియురాని లాటిన్ బాషలో గ్రంథమును చెప్పి వ్రాయించెను. ఆప్రతినిచూచి, యిటలీలో ననేకప్రాంతములవారు ప్రతులను వ్రాసికొనిపోయి, ఆతురతో, వినోదార్థము చదువుకొనుచుండెడివారు. ఇంతలోనాతని పాండిత్యమును, కులీనతయు మర్యాదయు, కీర్తియుదశదిశల వ్యాపించుటచేత జినోవాప్రభుత్వము వారాతనిని గౌరవముగా చెఱసాలనుండి విముక్తుని జేసిరి. ఇంటికివచ్చిన తరువాత మార్కొపోలో నలువదియేడవయేట పెండ్లియాడెను. మార్కో చెఱసాలలో నున్నపుడు, మరల నాతడు చెఱవిముక్తుడై యింటికి రాజాలడనియు తనభాగ్యమంతయు, పరుల పాలగునని భయపడి నికోలో ముదిమిని మరల పెండ్లియాడెను. ఆపెండ్లివలన నికోలోకు మువ్వురు కుమారు లుదయించిరి. కాని వీరిమువ్వురును వెనీషియను ధర్మశాస్త్రానుసారము ఔరసపుత్రులుగా బరిగణింపబడజాలరు. మార్కొపోలో చెఱనుండివిముక్తుడై వచ్చినతరువాత, కౌమారమున డొనటా అనునామెను పెండ్లియాడెను. ఆమెవలన నతనికి మువ్వురు స్త్రీసంతానమేగాని పురుషసంతతి కలుగలేదు. తాను వృద్ధు డగుచున్నాడని దెలుసుకొనిన పిమ్మట నాతడు క్రీ.శ. 1324 సంవత్సరమున జనవరినెల 9 వ తేదిని ఒక మరణశాసనము వ్రాయించి, తన తదనంతరము, తనయాస్తికి కూతుళ్ళను, కర్తలుచేసి, భార్యను యజమానిగా నియమించెను. ఈమరణ శాసనమును వ్రాయించిన తరువాత నీతడెంతకాలమో జీవింపలేదు. వెనీషియానగరమున మార్కొపోలో వ్రాసిన మరణశాసనము మూల ప్రతి మ్యూజియమునం దుంచబడియున్నది! ఆతడు నివాసముండిన సౌధముకూడ నేడు యాత్రికులకు మహద్వస్తువు క్రింద జూపబడుచున్నది. ఈ కాలమున వినీషియనులే కాదు యిటాలియా వాస్తవ్యులందఱును మార్కొపోలోను, గర్వముతో నంస్మరించుచున్నారు. మార్కొపొలో రచించిన గ్రంథము నాలుగు ఖండములుగ విభజింపబడియున్నది. మార్కో చెప్పుచుండగా వ్రాసిన లేఖరి రుస్టీకియునో యా గ్రంథమున కొక పీఠికను వ్రాసియున్నాడు. అందాతడు, మార్కొపోలో జనకులు ఇల్లు వెడలిన దాదిగా, చీనా దేశమునుండి తిరిగివచ్చి, మన కథానాయకుని వెంటబెట్టుకొని మరల ప్రయాణ మగువఱకు జరిగిన వృత్తాంతమును, పోలో కుటుంబ చారిత్రమును సంగ్రహముగా జెప్పినాడు. మార్కొపోలో తన గ్రంథమునందు ప్రధమ ఖండమున, దూర్పు ఆర్మినియాదేశము మొదలుకొని కుబ్లయిఖానుని రాజధానిని జేరువఱకు చూచినదానినంతయు వర్ణించినాడు. మరియు నందే ఖానునిరాజ్యము, పరిపాలనము, ప్రజలు, రాజధాని మున్నగువాటిని గూర్చి వివరించి, శేషించిన దానిని ద్వితీయ ఖండమున బ్రథమ భాగమున వర్ణించినాడు. ద్వితీయ భాగమున నీతడు చీనాదేశమందు సలిపిన యాత్రలు, ఆయా దేశములందు తాను చూచిన విశేషములను సంగ్రహముగా వ్రాసినాడు. తృతీయ భాగమున కుబ్లయిఖానుని సామ్రాజ్యములో బూర్వదిశయందున్న రాజ్యములను గూర్చి తెలిపినాడు. తృతీయ ఖండమున జపానుదీవులు, హిందూమహా సముద్రము, అందలి ద్వీపములు, సింహళము, దక్షిణ హిందూస్థానము, పారసీక దేశమువఱకు గల రేవులను మున్నగువాటిని వర్ణించినాడు. చతుర్థఖండమున పారసీకదేశము తార్తార రాజ్యము మొదలగు యుత్తర దేశములనుగూర్చి చెప్పియున్నాడు. మొత్తముమీద నాతని గ్రంథమంతయు మనోజ్ఞముగ నుండును. భూగోళవిషయములు, శాస్త్రవిషయముల, నౌకాయానములు, మొదలగు శాస్త్రసంబంధమైన వృత్తాంతములతో నిండియున్నను, పదమూడవ శతాబ్దమునాటి వృత్తాంతములు, మార్కో జూచినవింతలు, చాలవఱకు అవిశ్వసనీయములుగ గన్పట్టుచు, చిత్రవిత్రములయిన కధలతో నిండియుండినకతని, చదువునపుడు మిక్కిలి మనోహరమై ఎప్పటికప్పుడు ముందునకుబోవ కుతూహలము కలిగించుచుండును. వేయేల! ఆతని గ్రంథమునం దొక విషయముండి, మరియొకటిలేదని చెప్పవలనుపడదు.

మార్కోపోలో గ్రంథమును సంపాదించి, సంస్కరించి తొలుత ప్రకటించినవాడు ఇటాలియా వాస్తవ్యుడైన రిమూషియో. ఇతడు పదియేనవ శతాబ్దమందు జీవించియుండెను. ఆతడు ప్రచురించిన ప్రతిని బురస్కరించుకొని పగా సుదేశీయ డగు మూసాపాధియగు పగా సుభాషలోనికి భాషాంతరముచేసెను. ఈరెండిటిని ఉపయోగించుకొని మార్సెడను 1818 వ సంవత్సరమున నాంగ్లాను వాదమును బ్రచురించెను. మార్సెడనుగారి గ్రంథము చాలప్రశస్తమైనది. దాని తరువాత, మార్కోపోలో తిరిగిన దేశము లన్నింటినిగూర్చి విశేషముగ శ్రమకోర్చి యెన్నియో నూతనాంశములను సంపాదించి, గ్రంథమునంతయు, మరల నింకొకమారు సంస్కరించి, ప్రాచీన మూలప్రతినిబట్టి ఆంగ్లభాషలోనికి భాషాంతరీ కరణము గావించి సవ్యాఖ్యానముగ సర్ హెన్రీయూలు ప్రకటించినాడు. యూలుగారి ప్రచురణము వ్యాపించినతరువాత మార్సెడనుగారి గ్రంథమునకు వ్యాప్తము తగ్గిపోయెను. ఇపుడీవృత్తాంతమును, యూలుగారి గ్రంథమును ప్రధానముగా మందిడుకొని రచించితిమి.

కుబ్లయి ఖానుని కొలువులోనున్నపుడు, దూరస్థితి రాజ్యములను బాలించు మహామండలేశ్వరుల రాజరిక మెట్లుండెనో యారసివచ్చుటకును, లోపము లున్నయెడల సవరించివచ్చుటకును మన మార్కో నియమింపబడినట్లు ఈవఱకే తెలిపియుంటిమి. ఈ నియోగమందున్న కాలమున నాతనికి తఱచుగా దూరదేశ ప్రయాణములు తటస్థించుచుండెను. ఆ కాలమున నొకసారి, దక్షిణ చీనారాజ్యములను సందర్శించుటకేతెంచినపుడు, వినోదార్థమై, దక్షిణహిందూమహాసముద్రము నంతయు ప్రయాణముచేసి దీవుల నన్నింటిని చూచివచ్చెను. ఆ కాలమునందే సింహళద్వీపమును, మాబారు దేశమని మహమ్మదీయ చరిత్రకారులచే బిలువబడుచుండిన పాండ్య, చోళ దేశములను ఆంధ్రభూమినికూడ చూడవచ్చెను.

ఈతడు దక్షిణహిందూస్థానమున కరుదెంచిన సంవత్సరమును సరిగా నిరూపింపజాలముగాని, యించుమించుగా 1290 వ సంవత్సరమని యూహింపవచ్చును. అప్పటికి చోళులప్రతిభ సన్నగిలిపోయెను. వారి రాజ్యము, స్వాతంత్ర్యము గూడ, నంతరించెను. దక్షిణమున పాండ్యులు, పశ్చిమ మున, హొయసల రాజులు, ఉత్తరమున కాకతీయులు, తెలుగుచోడ వంశజులు ప్రక్కలో బల్లములై యుండుటచేతను, అంత:కలహముల చేతను, రాజు లప్రయోజకత్వము వలనను చోళరాజ్యము విచ్ఛిన్నమై పోయెను, పదమూడవ శతాబ్దారంభము నుండియు, విజృంభింప నారంభించిన, మధురానగర పాండ్య రాజులప్రాభవము, ఆశతాబ్దాంతము నాటికి మహోచ్చదశకువచ్చెను. క్రీ.శ. 1251-మొదలుకొని యించుమించుగా 1275 వఱకును బరిపాలించిన, జటావర్మ మొదటి, సుందరపాండ్యదేవుడు, పాండ్య రాజ్యమును, పినాకినీ నదీపర్యంతము వ్యాపింపజేసి, హొయసల రాజులకడ నుండియు, తెలుగుచోడనంజుల కడనుండియు గప్పములు గైకొని దిగ్విజయము చేసి తిరిగి వచ్చుచు శ్రీరంగమున పట్టాభిషేకము చేసుకొనెను. తన రాజధానియందు సువర్ణ తులాభారమును తూగెను. ఈతనితో నితని సోదరులు మువ్వురో నల్గురో, సోదరునికూడ కలిసి నేకకాలమున పరిపాలనము చేసియుండిరి. జ్యేష్టుడు రాజ్యాభిషిక్తుడుగను, మిగిలిన సోదరులు, మహా మండవేశ్వరులుగను పరిపాలించుచు, నందఱు నొక్కరీతిగానే రాజ్యచిహ్నముల నుపయోగించు కొనుచుండుట పాండ్యరాజవంశ సంప్రదాయముగా గానుపించుచున్నది. జటావర్మకువెనుక, రాజ్యాభి షిక్తుడైనవాడు మారవర్మ కులశేఖర సుందరపాండ్య దేవుడు. ఈతడించుమించుగా క్రీ.శ. 1268 మొదలుకొని 1311 వఱకును బరిపాలించియుండెను. మార్కొ పోలో, పాండ్యదేశమును జూడ నేతెంచినపుడు పరిపాలించు చుండిన సుందర పాండ్యుడితడే! అప్పటి కితడు పాండ్యభూపతులలో జేష్టుడు, ఇతనిరాజధాని, మథురానగరముగాక, కాయల్ పట్టణమో, కావేరిపట్టణమో అయియుండినట్లు తోచుచున్నది. ఇతనికాలముకడు శాంతిప్రదమై, సుఖదాయకమై యుండినట్లును, ఈతనికీర్తి దిగంత విశ్రాంతియై యుండినట్లును, చరిత్ర వాకొనుచున్నది. చీనాదేశమునుండి వచ్చిన రాయబారులితని కొలువున దర్శనమునకై మొగసాలలవేచియుండువారట! సింహళ ద్వీపమునేలు, విక్రమ బాహు, పరాక్రమ బాహులు ఇతనిధాటికినిల్వజాలక సామంతులయి కప్పముగట్టుచుండిరి. ఇతనిరాయబారులు, మంగోలియా దేశాధీశుడగు జమాలుద్దీను కొలువునకుగూడ బంపబడునట్లు మార్కొపోలో వచించుచున్నాడు.

ఇట్టి రాజుపరిపాలించుమన పాండ్యరాజ్యమును, ఆరాజ్యమున్న మాబారును మార్కొపోలో విపులముగ వర్ణించినాడు. కులశేఖరుని, న్యాయపరిపాలన ప్రజలనాగరికత, కాయల్ పట్టణ సముద్రవ్యాపారము, ముత్యపుచిప్పల వేల, మున్నగు వాటిని మార్కొ చక్కగా వర్ణించినాడు. పాండ్యరాజ్యముననున్న సమయమున క్రైస్తవసిద్ధుగు ధామసునుగూర్చి మనమార్కొపోలో వినియుండెను. థామస్‌సిద్దుని సమాధి యిపుడు చెన్నపట్టణము నకుసమీపముగానున్న (సెయింటు ధామస్ మవుంటు) థామస్ సిద్ధునికొండను సందర్శింప బయి లుదేరెను. ఆసిద్ధుని కొండకు తీర్థయాత్ర సేవించుకొని మరల కలమునెక్కి, ఆంధ్రదేశములోని ప్రసిద్ధరేవుపట్టణమగు మోటుపల్లిని గూర్చివిశేషముగ వినియుండినందున నచ్చటికి ప్రయాణమయ్యెను. మార్కోపోలో ఆంధ్రదేశములోని మోటుపల్లినిగూర్చి యిట్లువ్రాయు చున్నాడు.

"మాబారు, దేశమునుండి యుత్తరముగా దాదాపువేయిమైళ్ళు చనిన నీవు ముటఫిలి రాజ్యమును బ్రవేశింతువు. పూర్వమీదేశ మొకరాజు పాలనమందుండెను. ఆతడు చనిపోయినప్పటి నుండియు, నాతనిరాణి నలువది సంవత్సరముల నుండి పరిపాలించు చున్నది. ఆమె చాలాప్రజ్ఞావంతురాలు. భర్తమీదగల ప్రేమవలన, తిరిగి వివాహమాడ లేదు, గడచిన నలుబది సంవత్సరములనుండియు, ఆమెరాజ్యమునేలినట్లు ఆమెభర్తకూడ నేలియుండలేదు. ఆమెన్యాయము ధర్మమును మూర్తిగొన్నట్లు పరిపాలించును. శాంతి సౌఖ్యములు, ఆమె పరిపాలనమున పెట్టినపేరులయ్యెను. ఇంతవఱకు నేరాజును, ఏరాణియు, నీరాజ్యమునింత ప్రజారంజకముగ పాలించియుండలేదు. అందువలన జనులామెను భక్తి, విశ్వాసగౌరవములతో ప్రేమింతురు. ఇచ్చటిజనులు విగ్రహారాధకులు. స్వతంత్రులు. పారతంత్రము నెఱుగరు. వాఱికి మాంసము, పాలు, బియ్యము, మొదలగునవి యాహారములు,

"ఈరాజ్యమునందే వజ్రములుదొరకును. వజ్రములభించుతెఱగిది; వినుము, ఈప్రాంతమున నేటవాలుగనున్న ఎత్తైన పర్వతపంక్తులు చాలగలవు. వర్షపాత మిచ్చట విశేషముగా నుండును. వర్షములు కురిసినప్పుడు కొండలమీదనుండి, నీరు వాకలవలె వడిగా క్రిందికి బ్రవహించును. వర్షములు వెలిసిన తరువాత, నావాకలెండిపోవును. అంతట జనులు, యా యేటి గర్భములందిసుకలో వజ్రములకై వెదకుదురు. అప్పుడు వారికి రత్నములు విరివిగా లభించుచుండును. వేసవికాలమందు వజ్రములు లభించుచుండును. కాని గ్రీష్మతాపమునకు వెఱచి జనులు కొండలలోనికి బోరు. అచ్చట త్రాగుటకొక్క గ్రుక్కెడు నీరయినను లభించదు. అదియునుగాక నక్కడ భయంకరమయిన కౄరసర్పములు ఆసంఖ్యాకములుగ నుండును. సర్పములేగాదు, విషజంతువు లనేకములుగూడ నున్నవి. వీటికి కారణము భరింపరాని యుష్ణము. వజ్రములపై నాసగొని జనియా కౄరసర్పముల కాటులకు మరణించిన వారెందరోగలరు.

"ఈకొండలనడుమ పెద్దపెద్ద లోయలున్నవి. ఏటవాలుగ నుండుటచేతను, నాలుగుప్రక్కలను ఎత్తైనకొండలుండుటచేతను ఈలోయలలోనికి మార్గములులేవు. వజ్రాలకై, జనులు వెడలినపుడు సన్నగాకోసినమాంసపుముక్కలను తీసుకొనిపోయి యాకొండ లోయలందు పారవేయు చుందురు. ఇచ్చట నివసించు పాములను భక్షించుటకై, గరుడపక్షులీప్రాంతములందు విశేషముగా నున్నవి. అవి సర్పములకొఱకై యెగురుచున్నపుడు మాంసపు ముక్కలు విసరుటగాంచి, వాటికై లోయలయడుగు భాగమునకు సయితము దిగుచుండును. ఱాళ్ళనడుమను చిక్కుకున్న మాంసపు ముక్కలను గ్రుచ్చుకున్న ఱాళ్ళతోసయితమాగ్రద్దలు తన్నుకొనిపోవుచు, నేకొండకొననో, నేచెట్టుమీదనో గూటిలోపిల్లల యాహారమునకై పెట్టుచుండును. గ్రద్దలు వ్రాలుటచూచి, జనులు, ఱాళ్ళుగ్రుచ్చుకొనిన మాంసపుముక్కలకై ఆపక్షులను తరిమివేసి యామాంసపుముక్కలను దెచ్చుకొందురు. అందు తఱచుగా నితర ఱాళ్ళతో పాటు వజ్రములుగూడ నుండును. ఈకొండలోయల యడుగున, వజ్రములిట్లు కుప్పతిప్పలుగా బడియుండుట నిజముగా నాశ్చర్యకరమైన విషయము. కాని కొండలోనికి వజ్రములకై ప్రాణములపై నాశవీడి యెవడును చనజాలడు. ఇచ్చటి సర్పములు మనుష్యులను సయితము మ్రింగివేయగలవు. వజ్రములకై జనులు, గ్రద్దల గూండ్లకడ కేగి వాటిరెట్టలను వెదకి యందు రత్నములను గాంచుటయు గూడగలదు. మాంసపు ముక్కలను, అందు చిక్కుకొనిన ఱాళ్ళతోపాటు, పక్షులు తిని ఱాళ్ళను జీర్ణము చేసుకొనలేక రెట్టలో కలిపి విడుచును. ఒకప్పుడు పక్షులను పట్టుకొని జనులు రత్నములకై పొట్టలజీల్చి చంపుదురు. వాటిలోగూడ వజ్రములు లభించుటయుగలదు.

"పెద్దపెద్దవజ్రములు (ముటఫిలి) మోటుపల్లిసీమయందు తప్ప నింకెక్కడను లభింపవు. మన పాశ్చాత్య దేశములకు గొనిరాబడునవి ఇచ్చటివారు మంచి వాటిని యేరుకొన మిగిలిన రెండ వరకపు సరకులనినమ్మును. ఇచ్చటిరాజులు, శ్రీమంతులు తులు మేలయినవాటిని తామే ఉపయోగించు కొందురు.

"ఈదేశమున నూలుబట్టలు, అత్యుద్భుతము లయినవి నేయుదురు. అవి సాలె పట్టువలె బహుసున్నితముగా నుండును. ఎంత వెలయిచ్చిన నంతకు సరిపోవునట్టి రకపు సెల్లాలిచ్చట లభించును. వాటిని చూచినపు డేదేశము నందైనను ఏరాజును ఏరాణియు వాటినిధరింప నిచ్చగొనకుండ జాలరు? ఇచ్చట జనులకు గొఱియలమందలు లెక్కకు మీఱియున్నవి. మరియు, వారికి గావలసిన వన్నియు, గావలసిన వానికంటె నత్యధికములుగ లభించుచున్నవి.*

మార్కోపోలో ఆంధ్రదేశములోని తానుజూచిన మండలమును ముటఫిలి రాజ్యమని పేర్కొనియున్నాడు. ముటఫిలి అనురేవుపట్టణ మీకాలమున మనకు దేశపటములందు ప్రసిద్ధ పట్టణముగా గాన్పించుటలేదు. రేవుపట్టణముగా కూడగాన్పింపదు. ముటఫలిరేవును, మార్కొపోలోమోసల్ అనిగూడ బిలిచియున్నాడు. మోసల రేవు మచిలీపట్టణమని, చరిత్రకారులు నిర్ణయించిరికాని యానిరూపణము యదార్థమైనదికాదు. ముటఫిలియనుపేరు యాప్రాంతముననున్న మోటుపల్లికి సరిపోవుచుండుట చేతను, అచ్చట వీరభద్రేశ్వరుని యాలయమున బ్రతిష్టింపబడిన గణపతిదేవుని శాసనమునం దాయూరు గొప్పరేవు పట్టణమై యుండినట్లు వక్కాణింపబడియుండుట చేతను, మార్కొపోలో సందర్శించినది మోటుపల్లి రేవనియే నిశ్చయింప వలయును. మరియు, మోటుపల్లి, కాకతీయులకు నంటుకొని, నైజాముగారి పరిపాలనలో నున్నది. పరిటాలకడ నున్న కొండలకు పూర్వమునుండి వజ్రపుగనులని ప్రసిద్ధిగలదు. ప్రఖ్యాతి జెందిన గోల్కొండవజ్రాలని బేరు, పరిటాల గనులవలన గలిగియుండెను. ఇప్పటికిని పరిటాలకడ కొండలు మార్కోపోలో వ్రాతలకు సరిపోవునట్లుగా నువ్వెత్తుగలేచుచు నేటవాలుగ నుండును. ఆకొండ లన్నియు భీతావహములయి యొకప్పుడు త్రవ్వబడినట్లును చిహ్నములను నేటికి జూపుచున్నవి. పరిటాల గాక, కర్నూలు మండలములో వజ్రకరూరని మరియొక యూరుగలదు. అచ్చటగూడ వజ్రపు గనులుండెననియు బ్రసిద్ధి గలదు. మొత్తముమీద మోటుపల్లి రాజ్యమున కిరుకెలంకుల నున్న మండలములు వజ్రాలకు బ్రసిద్ధి కెక్కియుండుట వలన మార్కోపోలో తానాకాలమున విన్న కథలను విశ్వసించి మనోహరముగా వర్ణించినాడు.

మార్కో వర్ణించిన రెండవ విషయము, ఇచ్చట నేయబడుచుండిన మంచు తెరలవంటి రవసెల్లాలు. ప్రాచీనకాలము నుండియు, నాంధ్రదేశములోని బూర్వభాగము బట్టల నేతకు పేరువడిన ట్లనేకమంది ప్రాచీన గ్రంథకారులు వచించియున్నారు. ఈ సెల్లాల నేతపరిశ్రమయు, రంగు లద్దకములును మొన మొన్నటి వఱకును, ఆంగ్లేయులు సుస్థిరముగ వారి రాజ్యమును బాదుకొలుపు వఱకు వర్థిల్లుచుండెను. ఈ దేశమున విశేషముగా, గొఱియలు, మేకలు, నున్నవని మార్కో వ్రాయుచున్నాడు. ప్రాచీనకాలమునాటి యేదేవా లయపు గోడను పరీక్షించినను, అచ్చట వెలసియున్న దేవునికి, నిత్యదీపారాధనమునకై వలయు నేయికి, భక్తు లెందరో నూర్లకొలది గొఱియలను, మేకలను దానములు చేసి యున్నట్లు వ్రాయించ బడియున్న శాసనములు గాననగును. ప్రతిదేవ కిలారము నందును గొల్లబోయల వశమునం దుంచబడిన పశులమందలే, లెక్కపెట్ట నలవిగాకున్నపుడు, ఇక జనుల యుపయోగర్థ మెన్నియుండెనో యూహించుకొన వలసినదేగదా!

అన్నిటికంటె మార్కోపోలో ఈదేశము నేలుచుండిన మహారాజ్ఞిని, విశేషముగా గొనియాడినాడు. ఆమెనుగూర్చి యీత డెంతగొప్పగా వినియుండెనోగాని, యాత డామెను గూర్చి వ్రాసిన నాల్గు పంక్తులును, సువర్ణాక్షరములవలె బ్రకాశించుచు, ప్రతి ఆంధ్రుని హృదయము నందును సంతోషమును బుట్టించుచు పులకాంకితులను జేయుచున్నవి. మార్కో ఆమె ధర్మ పరిపాలనమును గూర్చి చెప్పి యామె పవిత్ర నామాక్షరములను మాత్రమును దెలుపలేక పోయినాడు. అయిన నాతని కాలము మనకు దెలియును గావున, నాతడు బేరు దెలుపకున్నను ఆకాలమున నాంధ్రదేశము నేలిన పడుచుపేరు మనము గ్రహింపవచ్చును. మార్కోపోలో బేర్కోనిన మహారాజ్ఞి నామము రుద్రమదేవి యని ఆంధ్ర చరిత్రకారులగు శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు సుప్రసిద్ధ పరిశోధకులగు డాక్టరు హుల్‌ట్జ్ గారు మొదలుగాగలవా రెందరో నిరూపించియున్నారు. కాని వారి యూహ ప్రమాదజనితమైన దేమోయని సందియ మగుచున్నది. మార్కోపోలో యదార్థమునే వచించినట్లును, ఆతడు వ్రాసిన దానిని, చారిత్రకులు మన దేశచరిత్ర బాగుగా బయలు పడనందున మరియొక రీతిగా నన్వయించుకొని మార్కోపోలో యుదహరించిన నారీరత్నము, రుద్రాంబిక యని భ్రమపడి, యామె గణపతిదేవుని భార్య కాదని విశదీకరించుట కెంతయో ప్రయాస పడిరి. మన కిపుడు, మార్కోపోలో ప్రశంసజేసిన రాణి రుద్రాంబిక కాదనియు, నాపె సోదరి యైన గణపాంబనియు పరిశోధనలవలన దేలుచున్నది. రుద్రాంబికయు గణపాంబామహాదేవియు నేక కాలమున పరిపాలించుటజేసియు, గణపాంబ కేవల మొక మహా మండలేశ్వరుని దేవియై యుండ, రుద్రాంబిక, మహారాజ్ఞియై, చక్రవర్తినియై, త్రైలింగ సామ్రాజ్యము నంతయు నేకచ్ఛత్రముగ బరిపాలించుటయు, నీ యపోహ జనించుటకు గారణము లయ్యెను. ఇందులకు గణపాంబదేవి చారిత్రము దెలియకపోవుట యేకారణ మయ్యెను. చరిత్ర దెలిసిన యాంధ్రులకు సైతమీ గణపాంబ చిరపరిచితురాలు గాదు. కావున నామె చరిత్ర మిచ్చట వివరించుట యుక్తము. గణపాంబ, కాకతి గణపతి దేవునకు రెండవ కూతుఱు. షట్సహస్రవిషయమును ఆంధ్రదేశభాగము నేలిన, కోటకేతరాజు మనుమడైన బేతరాజీమె భర్త. షట్సహస్రవిషయము, తెనుగున ఆఱువేలనాడని వ్యవహరింపబడుచున్నది. కృష్ణానదికి దక్షిణమునగల భాగము, అనగా నిప్పటి సత్తెనపల్లి, గుంటూరు తాలూకాలును, బాపట్లతాలూకాలోని కొంత సీమయు గలిసి, క్రీ.శ. 10, 11, 12 శతాబ్దముల నుండియు నాఱువేలనాడని బరుగుచుండెను. కావున, మోటుపల్లియు నాఱువేలనాటిలోనిది గావలయును. మార్కోపోలో యోడ దిగిన రేవును, ఆతడు కథలుగావిన్న వజ్రపుగను లుండిన పరిటాల గ్రామమును, ఆఱువేలనాటి లోనివిగా నున్నవి. ఈ యాఱువేలనాటి రాజ్యమునకు రాజధాని, కృష్ణానదిమీద నున్న ధాన్యవాటీపురమని బిలువబడు చుండు అమరావతీ నగరము. ఇయ్యది క్రీస్తుశకారంభ కాలమునకు బూర్వము, వెనుకను, నన్నూఱేండ్లుబాలించిన ఆంధ్రరాజులగు శాతవాహనులకు రాజధానియై యుండెను. మరియు పూర్వమొకప్పుడు సుప్రసిద్ధబౌద్ధక్షేత్రమై యుండెను. ఇచ్చట నొకప్పుడు మిక్కిలి సుందరతరమైన స్తూపమును ఎత్తైన చైత్యము నుండినట్లు చిహ్నములు గాన్పించుచున్నవి.

మనకథానాయకుని కాలమునాటికి ఆఱువేల నాటిని కోటవంశపు చతుర్థకులజులు పరిపాలించుచుండిరి. కాంచీపుర చోళరాజులకు నామ మాత్రముగ సామంతులయి, కాంచీపురము మొదలుకొని సింహాచలము పర్యంతము గల యాంధ్రదేశభాగమును బరిపాలించు చుండిన వెలనాటి వంశజులకు, కోటరాజులు తొలుత నుండియు నా జన్మశత్రువులయి యుండి నట్లు గాన్పించుచున్నది. చోళులకును, పల్లవులకును జాతివైరము, శతాబ్దముల నుండి వర్ధిల్లుచుండుటచే, కోటరాజులును, తద్వైర సూచకముగ తాము శ్రీమత్రినయన పల్లవప్రసాదిత కృష్ణవేణీనదీ దక్షిణ షట్సహస్రావనీవల్లభులనియు, చోళ చాళుక్యసామంత మదానేక మృగేంద్రులనియు బిరుదులను ధరించుచుండిరి. మొదటి కోటరాజులలో ప్రోలనాయకుడు వెలనాటి మొదటి గొంకరాజునకు సామంతుడుగా నుండినను తరువాత కాలమున వెలనాటి మహామండలేశ్వరులకును, కోట వంశీయులకును వైరము వృద్ధియైనపుడు, వారివినాశమునకై కాకతీయులకు కోటరాజులు దోడ్పడియుండిరని దోచుచున్నది. ఆశత్రుత్వము తొలుత ప్రకటించినవాడు మహారాజ బిరుదాంకితుడైన రెండవ కేతరాజు. కోటరాజులలో ప్రఖ్యాతులయిన వారిలో కేతరాజు అగ్రగణ్యుడు. ఇతడు పరాక్రమశాలియు రాజనీతి తంత్రజ్ఞుడునై యున్నాడు. ఈతడు వెలనాటి రెండవ గొంకరాజునకు మేనల్లుడు. ఈతని తల్లిపేరు సబ్బాంబిక తండ్రిపేరు భీముడు. ఈకేతరాజునకు పెక్కుమంది రాణులుండిరి. వారిలో కాకతీయ గణపతిదేవుని మేనకోడలును, నతవాడి మహా మండలేశ్వరుడైన రుద్రదేవరాజునకును మైలమ్మా (మేళాంబిక) దేవికిని జనించిన కూతుఱునగు బయ్యలదేవి పట్టమహిషి గానుండెను.

మహామండలేశ్వరుడైన కోట (రెండవ) కేతరాజు యించుమించుగా శా.శ 1100 మొదలుకొని 1131 వఱకు (క్రీ. శ. 1178-1209) వఱకును బరిపాలించెను. ఈతనికి బయ్యల మహాదేవివలన రుద్రరాజు జనించెను. ఈకోట రుద్రరాజు కాలముననే గణపతిదేవ చక్రవర్తి వెలనాటి భూపతులను జయించి పూర్వాంధ్ర దేశమును సింహాచలపర్యంతము స్వాధీనముచేసుకొనెను. ఓడింపబడిన వెలనాటి వంశాకురములవలనగాని పాకనీటి ప్రభువులవలనగాని, కాంచీపుర చోళులవలనగాని తెలుగు చోళభూపతులవలనగాని మున్ముందే యుపద్రవమును సంభవించుకుండ తనరాజ్యమును బదిలపడుటకై గణపతిదేవుడు దనరెండవ కూతురైన గణపాంబాదేవిని కోట రుద్రదేవరాజు సుతుడైన బేతరాజునకిచ్చి వివాహము గావించెను. రుద్రదేవరా జెంతకాలము పరిపాలించెనో తెలియదుగాని యించుమించుగా నితడు క్రీ. శ. 1210 మొదలుకొని 1216 సంవత్సరములనడుమ మరణించి యుండవలయునని దోచుచున్నది. దేవగిరి రాజ్యాధీశుడైన జైత్రపాలుడు రుద్రదేవుడను యాంధ్రరాజు నొకని రణరంగమున బట్టుకొని నరమేథయాగమును చేసినట్లు చెప్పకొనుచున్నాడు.[1] జైత్రపాలుని ప్రశస్తి ఆలంకార భూయిష్ఠములయిన ఆడంబరవాక్యములతో నిండియున్నను గణపతిదేవునికి నాతనికి సంభవించిన పోరులో కోటరుద్రరాజు గణపతిదేవునిపక్షమున పోరాడి యోడి, పట్టువడి యంతట దుర్మరణమువాత బడియుండెనని విశ్వసింపవచ్చును. తనమేనల్లునకింతటి విపత్తు సంభవించుట చేతను బందుత్వము చెడిపోవకుండుట గణపతి దేవుడు రుద్రదేవరాజు కుమారుడైన బేతరాజునకు తనకూతురు గణపాంబనిచ్చి వివాహముజేసియుండెను. రుద్రదేవునకు మేనమామ కుమార్తె యైన గణపాంబ బేతరాజునకు పెండ్లియాడ వరుసయెట్లయ్యెనో యెఱుకపడదు. అయిన నాకాలపు సాంఘికాచారములు గాని రాజనీతిగాని, మనకు దెలియ నంతవఱకు, నిట్టి వివాహములు రాజ్యసంరక్షణమునకై రాజనీతి ననుసరించి గావింపబడుచుండిన ట్లూహింపవలయును.

బేతరాజు రాజ్యపరిపాల నారంభ సంవత్సర మెపుడో తెలియరాదు గాని, యాతడు మరణించినది మాత్రము శా.శ. 1173 (క్రీ. శ. 1251) సంవత్సరమని తెలియవచ్చుచున్నది. [2]బేతరాజు శాసన మొకటి యాతడు శా.శ. 1173 సంవత్సరమునాటికింకను జీవించియున్నట్లు సూచించుచున్నది. ఆశాసనము శకవర్షము 1173 (క్రీ. శ. 1251) వైశాఖశుద్ధ విదియా సోమవారమునాడు వ్రాయించబడినది. అందు కోటబేతరాజు, (మహిషాసురమర్దనగిరి) యనుమదలనుండి రాజ్యమేలు చుండినట్లును, ఆతడా పట్టణమున గోపీనాధుడనుపేర కృష్ణుని కొక దేవాలయము కట్టించగా, ఆదేవుని అంగరంగవైభవములకు, నిత్యపళ్ళకు, దీపారాధనముల కొఱకు నాతని రాణి గణపాంబ గారగపాడు గ్రామములోని కొంతభూమిని, నూనె తీయుటకొక గానుగను, ఒకపువ్వుల తోటను దానము చేసెనని చెప్పబడియున్నది. ఇది యిట్టులుండ నాయూరనే వేణుగోపాలస్వామివారి యాలయముననున్న యొక శాసనమున, గణపాంబ, శా. శ. 1172 నాటికే (క్రీ. శ. 1250) భర్త చనిపోయినందున షట్సహస్ర విషయమును తానే స్వయముగా పాలించుచుండినట్లు చెప్పుకొన్నది.[3] ఈ రెండుశాసనములును పరీక్షించిచూచిన కోటబేతరాజు 1250 వ సంవత్సరమునందుగాని, 1251 సంవత్సరమునందుగాని మరణించియున్నట్లు తోచకమానదు.

పైశాసనాథారములబట్టి, బేతరాజు, గణపతిదేవుడిక పదిసంవత్సరములకు మరణించుననగా, కాలధర్మమునొందినట్లు నిర్ణయింపవచ్చును. బేతరాజు మృతుడైనది మొదలుకొని గణపాంబ భర్తృ రాజ్యమును తానే పరిపాలించినట్లు, యామె వేయించిన యనమదల శాసనములవలనను, అమరావతి శాసనములబట్టియు తెలియుచున్నది. బేతరాజు చిన్నతనమునందే, గణపతిదేవునికి సహాయముగ యుద్ధములందు పోరాడుచు క్రీ. శ. 1251 సంవత్సరమున మరణించియుండవచ్చును. ఇతనివెనుక గణపాంబామహాదేవి చాలాకాలము ఆఱువేలనాటిని పరిపాలించియుండెను. బేతరాజు చనిపోయినవెనుక, నతని సోదరుడైన, కోటమన్మకేత రాజపుత్రులయిన, గణపతి దేవరా జులు, భీమరాజును ఆమెకు సామంతులుగా శా. శ. 1187 (క్రీ. శ. 1265) వఱకును బరిపాలించి యుండినట్లు దెలుపు వారి శాసనములు గానవచ్చుచున్నవి. వారి గణపాంబయే రాజ్యపాలనము చేసియుండిన ట్లూహింపవలయును. మార్కోపోలో మోటుపల్లిరేవును జూడవచ్చిన దించుమించుగా క్రీ. శ. 1290 వ సంవత్సరమని యీవఱకే తెలిపియుంటిమి కావున నీతడు మోటుపల్లియందు, గణపాంబా మహాదేవియొక్క నలువదియ పరిపాలన సంవత్సరమున నుండినట్లు స్పష్టమగుచున్నది. ఇందుల కాతడు "ఈమె తనభర్త చనిపోయినదిగా నలువదిసంవత్సరములనుండి, యాయన రాజ్యమును, ధర్మబుద్ధితో న్యాయపరిశీలనతో విశేషమగు ప్రజ్ఞతో పరిపాలన చేయుచున్నదని వ్రాసినపంక్తులు యదార్థములగు చున్నవి. మార్కోపోలో ప్రశంసజేసినరాణి, గణపాంబామహాదేవియనుట కింకొక ప్రమాణము కూడగలదు. ఆమెయేలిన రాజ్యమామెభర్తదిగాని, తండ్రిదిగాదు. గణపతిదేవచక్రవర్తి, పుత్రికాసంతానమేగాని పుత్రసంతానము లేనివాడై, కుమార్తెయగు రుద్రాంబికను కుమారునిగా భావించి, విద్యాబుద్ధులు చెప్పించి, రాజనీతి యుపదేశించి, తాను జీవించియుండగనే కాల మాసన్నమైనదని గ్రహించి, మంత్రిపురోహిత సేనాపతులను సామంతులను రావించి, యామెను పట్టాభిషిక్తురాలింజేసెను. ఆమె యప్పటికే వైధవ్యము ననుభవించుచుండెను. ఆమె గణపాంబిక వలెగాక చిన్ననాటనే భర్త వియోగముకలిగి నాటనుండియు, తండ్రిచే కుమారునికైవడి బెంపబడుచుండెనని దోచుచున్నది. కావున రుద్రాంబిక, పరిపాలించిన రాజ్యమామె పితృకరాజ్యము. గణపాంబిక పాలించినది భర్తయొక్క రాజ్యము. మార్కోపోలో యీ నారీమణి భర్తరాజ్యమునే పాలించుచుండినట్లు చెప్పినాడుగావున, నాతడు ప్రశంసించినది గణపాంబిక గాని రుద్రాంబిక గాజాలదని నిశ్చయింపవచ్చును. మరియు నొంకొక విశేషముగలదు. గణపాంబిక రుద్రమదేవికి సామంత రాజ్ఞియై యుండి కప్పము గట్టుచుండ వచ్చునుగాని యామె చిన్న రాజ్యమున నామె సర్వస్వతంత్రులుగా నుండెను. అట్టియెడ, నీమె రాజ్యమున రుద్రాంబికపేరు వినబడినదనుటకంటె గణపాంబికదేవికీర్తియే గానము చేయబడు చుండెననుట సమంజసముగా నుండును.

ఇంచుమించుగా, రుద్రమదేవియు, గణపాంబయునొకే కాలమున పరిపాలనము సాగించియుండిరిగాని, రుద్రమదేవి కంటె గణపాంబయే అటుపదిసంవత్సరములు నిటుపదిసంవత్సరములును వెరసి యరువది సంవత్సరముల వరకు తిండ్రిగణపతి దేవునివలె పరిపాలించి యుండినట్లు గానవచ్చుచున్నది. గణపాంబ ఎటుచూచినను రుద్రమ దేవి పరిపాలనము మూడుదశల కంటెమించలేదు. గణపాంబ భర్త మరణాంతరము యనేకధర్మ కార్యముల నాచరించెను. ధాన్యకటకము లోని యమరేశ్వరాలయము యొక్క గోపురమునకీమె బంగారు కలశమును నిర్మించెను. తనభర్తపేరిట బేతేశ్వరాలయమని యొక శివాలయమును బ్రతిష్ట జేసెను. బేతేశ్వరాలయ గోపురములకు గూడ సువర్ణ కలశములెత్తించెను. ఈశివాలయ సంరక్షణముకొఱకు ధాన్యసమృద్ధమైన బెనదేవియను గ్రామమున దేవమాన్యముగ ధారవోసి, శాసనము వ్రాయించెను. బ్రాహ్మణులకనేక అగ్రహారములు దానము చేసెను. మరియు దనతండ్రి గణపతి దేవచక్రవర్తి పేరిట గణణేశ్వరాలయమును శివాలయమును బ్రతిష్టించి దానికై చింతపాడను గ్రామమును దానముచేసెను. ఈమె, మహేశ్వరధ్యానతత్పరురాలై, యవసానకాలమును గడపెను.

అబ్దుర్ రజాక్

  1. హేమాద్రిపండితుని వ్రతఖండపీఠిక 51 వ శ్లోకము Bombay gazettear Vol. 1 part pp 95-96
  2. Ep and Vol. III pp 95-96 Ep coll for 1833 Ep no 120 to 123
  3. Ep coll 142 of 1913