ఆంధ్రదేశము విదేశయాత్రికులు/యుఁఆన్ చ్వాంగ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యుఁఆన్ చ్వాంగ్ వర్ణించిన ఆంధ్రదేశము

భరతఖండమును సందర్శించిపోయిన విదేశీయులలో యాత్రికులలో జీనాదేశీయుఁడగు యుఁఆన్‌-చ్వాంగ్‌ సుప్రసిద్ధుడు. భారతీయ ఇతిహాసికుల కితడు జిరస్మరణీయుడు.కీర్తినీయుడు. అతడు జన్మించుటజేసి చీనాదేశము ధన్యత నొందెను ఆ మహానీయుడు భరత వర్షమున కేతెంచి చిరకాలము దేశమందు సంచారము గావించి బౌద్ధ విద్య నభ్యసించుచు తానేగిన దేశములందు చూచినదానిని, వినిన దానిని, తెలుసుకొనిన దానిని తన చక్రవర్తి కుల్లాసము కొఱకు గ్రంథస్ధము చేసి యుండెను. అందువలన నాతని కాలము నాటి మన దేశపు వ్యవస్థల గూర్చియు, పరిస్థితుల గూర్చియు దెలిసికొనుటకు అవకాశము గలుగుచున్నది. చీనాదేశమున నితడు కన్‌ప్యూషీయన్‌నకు తరువాత నింతటీ ధర్మవేత్త లేడని పేరొందెను. బుద్ధుని తరువాత రాబోవు కల్పమునందు సుగతులగు బోధిసత్త్వులలో నొకడయ్యెనని ప్రసిద్ధికెక్కెను.

ఈతని కొందఱు హ్యూ౯ త్స్యాంగనియు కొందఱు హౌనుత్స్యాంగనియు మరికొందఱు యుఁవాన్‌ త్స్యాంగ్‌ అని యు, యుఁఆౝ చ్వాంగనియు వివిధములుగ బిలుచు
1 చున్నారు. ఈతని నామాక్షరముల వర్ణక్రమము, నుచ్చారణము ఏడవ శతాబ్దము నందుండినట్లుక కాలాను గతముగ అక్షరముల పోలికవలెనే మారిపోయి వివిధములుగ వ్రాయబడుటయు నుచ్చరింపబడుతయు నందు లకు గారణములు. జపానీయులీతని నామాక్షరములను వ్రాతలో హ్యువా౯ట్స్యాంగనియు నుచ్ఛారణయందు "గెంజో" యనియు వాడుచున్నారు. ఈపేరు చీనాభాషకో యుఁఆ౯త్స్యాంగునకు సరిపోవును. ప్రాచీన లిపిని పరిశోధించి యాతనినామమును స్ఫుటముచేసిన ఈకాలమున చీనాపండితు లీయాత్రికుని నామము "యుఁఆన్‌ చ్వాంగ్‌"అని యుచ్చరింపవలయునని నిర్ణయించిరి. ఆయుచ్చారణ మంగీకరించుచు మేమిా వృత్తాంతమున వాడి యున్నాము.

యుఁఆన్‌ చ్వాంగ్‌ యొక్క పవిత్రజీవిత చరిత్రము మనకు ప్రస్తుత మనవసరముగాదు. కావున అతని జన్మకాలా దులను గూర్చి మాత్రము సంగ్రహముగ దెల్పి యావల యాతని గ్రంథమును జదివిచూతము. పురాతన కాలము నుండియు గౌరవ ప్రతిష్టలు గలిగి ఋజువర్తలనియు, ధార్మికులనియు బేరుగాంచి, చక్రవర్తికడ నూడిగమును వంశపారంపర్యముగ జేయుచు ప్రసిద్ధి వడసిన 'చేన్‌' వంశమునందు యుఁఆన్‌ చ్వాంగ్‌ జనించెను. అతడు, పూత జన్ములయిన ఆతని తలిదండ్రులకు బుట్టిన నలుగురి కొడుకులలో గడగొట్టువాడు. సోదరులతో పాటు తండ్రికడ, కులవిద్య నభసించుచు, నితర గురువులను గూడ నాశ్రయించి క్రొత్త విద్యల సంపాదించెను. చిన్ననాటనుండియు నితడు, సూక్ష్మగ్రాహియనియు, ఈడుకు మించిన మేధావంతుడనియు బొగడ్త నొందెను. ఇతర బాలురవలె నాటపాటలయందును, వేడుకలందును మన కథానాయకు డభిరుచి గలిగియుండక, నెల్ల వేళల జ్ఞానదాయకములయిన విషయములను గ్రహించుటకు తన కాలము నంతయు వినియోగించి కృషి సలుపుచుండెడివాడు. చిన్ననాటను కన్‌ప్యూషియను మతసంప్రదాయము నవలంబించి "మాతృ పితృభక్తి" ని గురించి, యామహాత్ముడు రచించిన మహాగ్రంథమును సూక్ష్మబుద్ధితో బఠించెను. తల్లితండ్రులీతని కిడిన పేరు "చే౯ ఐ" అయి యుండినను ఏమి కారణముననో చీనా సారస్వతమునందా పేరుతో ఈతఁడు బిలువ బడుచుండుటలేదు. ఈతఁడు పితృ, పితామహులవలె మిక్కిలి పొడవైనవాడు. మంచికాంతి గల దేహచ్ఛాయ గలవాడు. సుందరమైన రూపము గలవాడు. సోగలయి విశాలములయిన నేత్రములవాడు. చరిత్రకారులు యుఁఆన్ చ్వాంగ్‌యొక్క వంశము, పురాణ ప్రసిద్ధమైన హూఅంగ్‌-టీ గోత్రోద్భవమనియు, మహాచక్రవర్తి షూ-న్‌ యొక్క అన్వయమునుండి జనించినదనియు బల్కుదురు. మరియు నీతని పూర్వులు, వంశకర్తలు, క్రీస్తునకు బూర్వము ఆరవశతాబ్దమునాటికే ప్రఖ్యాతి వడసినట్లు చెప్పుదురు. క్రీ. శ. ౬౦౦ సంవత్సరమున చీనాదేశమున ఉత్తర ప్రాంతమున హోనను జిల్లాలోని కౌషి నగరమున కనతి దూరముననున్న "చేౝ పావు కో" యను కుగ్రామమున నీమహానీయుడు జననమొందెను. చిన్ననాటి నుండియు బుద్ధుని యుపదేశములచే నాకర్షింపబడి యామతమును స్వీకరించి మతాభినివేశము కలిగియుండెను. ఇంతలో నీతని చిన్నన్నగారు బౌద్ధమఠమునందుజేరి భిక్షుకుడై, ధర్మము నభ్యసింప నారంభించెను. అతని మార్గము మన చిన్న బాలునికూడ నాకర్షించి, యిరువది సంవత్సరములయిన నిండుటకు పూర్వమే సన్యాసమును స్వీకరింప జేసెను. అంతట నీతఁడు మౌజయు గాషాయవస్త్రములను ధరించి కమండలమును గైకొని మండనము గావించుకొని భైక్షుకవృత్తిని గ్రహించెను. అది మొదలుగా జ్ఞానతృష్ణాతంత్రడై యెనిమిది సంవత్సరము లనేకమంది గురువుల నాశ్రయించుచు మఠములందు ధర్మము నభ్యసించుచు చీనాదేశమునంతయు గ్రుమ్మరెను. కాని అంతటితో నీతిని మనస్సు సంతృప్తి బొంది యుండలేదు. అతనికి పేరులు మాత్రము విన్న గ్రంథములను సంపాదించి స్వయముగ నభ్యసింప కోర్కెపుట్టెను. అంత బుద్ధుఁడవతరించిన పవిత్రభూమిని, తథాగతుడు జీవయాత్రని గడపిన పుణ్యక్షేత్రములను సందర్శించి పరమపురుషార్థమును గ్రహింపవలెనని సంకల్పించుకొనెను. అట్లు సంకల్పించి యెవ్వరికీ దెలియకుండ రహస్యముగ సన్నద్ధుడై క్రీ. శ. ౬౨౮ వ సంవత్సరమున భాద్రపద మాసమున నొకనాటి రాత్రివేళ బయలుదేరెను. అప్పటికాతనికి ౨౮ సంవత్సరములు వయసుండెను. నాటగోలె పదునారు సంవత్సరము లాతడు విదేశములందు సంచారముచేసి క్రీ. శ. ౬౪౪ వ సంవత్సర చైత్రమాసమున స్వదేశము జేరెను. ఈతని కీర్తిని పాండిత్యమును మహిమను కర్ణాకర్ణిగ నప్పటికే వినియుండుట వలన చక్రవర్తి, యాతడు తన సెలవుగైకొనకుండ యరుగుటవలన జేసిన దప్పిదమును మన్నించి గౌరవించి సంభావించెను. చక్రవర్తి సకల సామంత నియోగప్రభృతులకును అతని యాగమన సమయమున మహోత్సవమును జరిపింపవలసినదని యాజ్ఞాపించెను. అతని పురప్రవేశ సమయమున వీధులందు పచ్చని యాకుతోరణములు పుష్పగుచ్ఛములు వేలాడగట్టెను. ఎచ్చటఁజూచినను రంగురంగుల పతాకముల ఎగురకట్టబడెను. పట్టణమంతయు శోభనదేవతాకాశ్రయమువలె పెండ్లిపందిరి యట్లలంకరింపబడెను. వీధులందు, రధ్యలందు, పల్లీ పట్టణ, గ్రామముల నుండి యా మహనీయుని యొకసారి సందర్శించి, జన్మపావనము గావించుకొనదలచి విచ్చేసిన జనులు గుంపులు గుంపులుగ క్రిక్కిరిసియుండిరి. యుఁఆన్‌చాంగ్‌ పునరాగమనము ఒక తిరునాళ్ళయుత్సవము వలె గడచిపోయెను. చీనాదేశచారిత్రమునం దెవడును, మరియొక బౌద్ధబిక్షువునకు ఇంతటి మహదానందముతో, ఇంతటి మహోత్సవముతో వీడ్కోలీయబడుట, వినియుండలేదు. నాడు ప్రకృతికూడ, మనోహరమై నగరవాసుల యుత్సా హమున కుత్తేజనమిచ్చునట్లు, మంద హాసము చేయుచున్నట్లు, మనోజ్ఞమై యుండెను.పదునారేండ్ల క్రిందట, స్వదేశమును విచారముతో విడిచి చనువేళ సెలవు గైకొనిన టేకువృక్షముగూడ నిపుడు ముసలిదయ్యును, ప్రియస్నేహితుని యాగమమున కెదురుచూచుచున్నట్లు పశ్చిమదిశకు కొమ్మలన్నియు వాల్చెనట! ఆవృక్షమట్లు తలవాల్చుయే యుఁఆన్‌ చ్వాంగ్‌ స్వదేశాభిముఖుడైవచ్చుచున్నట్లు సూచనయని యాతని వారనుకొనిరి. నిజముగా నాతని రాక చాలదినముల వరకు జనుల కత్యాశ్చకరముగ నుండెను.

అతఁడు చెప్పిన వింతవింత విషయములను గూర్చివిసుగు విరామము లేక చక్రవర్తి యడుగుచు శ్రద్ధాభక్తుడై యాలకించెను. తుదకా విషయలపై మోహము బట్టజాలక యాతని దన యాత్రలనుగూర్చి యొకగ్రంథము వ్రాసి తనకు సమర్పింపుమని ప్రార్థించెను. చక్రవర్తి యాజ్ఙ నౌదలవహించి యుఁఆన్‌ చ్వాంగ్‌ "సి-యూ-కి" అను గ్రంథమును రచించెను.

అతడు స్వదేశమునకు తిరిగి వచ్చునప్పుడు ఆరువందల ఏబదియేడు బౌద్ధధర్మ, మంత్రశాస్త్ర, సూత్ర , వ్యాఖ్యాన గ్రంథములను, ఉష్ట్రములమిాదను, ఇరువది అశ్వములమిాదను వేసి తీసుకొని వచ్చెను. సువర్ణము, వెండి, మంచిగంధము మొదలగువానితో చేయబడిన బుద్ధుని ప్రతిమలను, బోధిస్వత్తులు, దేవతలు మొదలగు వారియొక్క మనోహరమయిన విగ్రహము లనేకములను తీసుకొని వచ్చెను. ఆనేక చిత్తరవులను తీసుకొని వచ్చెను. వీని యన్నింటికంటెను, బుద్ధునియొక్క అస్థికలను నూటయేబదింటిని భద్రముగ గొనివచ్చెను.

వీని నన్నిటిని జూచి చక్రవర్తి, యాతడు నివసింపదలచిన సంఘారామమునకు విశేషముగ ధన కనక వస్తు వాహనము జొసంగి హిందూదేశమునుండి గొనరాబడిన సంస్కృత గ్రంథములను, చీనా భాషలోనికి భాషాంతీ కరించుటకు పండితులను జీతములిచ్చి నియోగించెను. యుఁఆన్‌చ్వాంగ్‌ను, శేషించిన తన జీవితకాలమును బౌద్ధ ధర్మ గ్రంధములను భాషాంతరము చేయుచు మహాయన బౌద్ధధర్మమును శిష్యుల కుపదేశించుచుఁ గాలము బుచ్చెను. అతఁడు క్రీ. శ. ౬౬౪ వ సంవత్సరమున ద్వితీయమాసమున, షష్టమ దివసమున, యీ భౌతిక కాయమును విడచెను. తనకు రానున్న యా పరిణామము నాతడు ఎరిగియుండి, తాను సంకల్పించిన పనిని పూర్తిగా నెరవేర్చెను. ఇప్పుడాతఁడు తుషిత స్వర్గమున నుండి మైత్రేయ బోధిసత్వుడు సుగరుఁడై వచ్చునం దాక పరలోకమున వేచియున్నాడని చీనావారి విశ్వాసము. మరల తాను మైత్రేయునితో నీలోకమున నవతరిం పగలనని యుఁఆన్‌ చ్వాంగును విశ్వసించి యుండెను.

యుఁఆన్‌ చ్వాంగ్ మతావేశముచే బౌద్ధుడైనను, స్వదేశాభిమానమును, స్వజాతీయ సంప్రదాయములను, త్రోసి పుచ్చలేదు. కన్‌ప్యూషియన్‌ యొక్క మతసంప్రదాయము లాతనిని ఎంత సన్నాసియైనను వదలవయ్యెను. పూర్వాశ్రమన బంధులయిన సోదరులయందును, తలిదండ్రులయందును ఆతడు ప్రేమానురాగమును త్రెంపుకొనజాలడయ్యెను. అంతమాత్రమున నీతని మతావేశమునకు ఏలోపమును జూపింపజాలము. భరతవర్షము, అందలి మహాత్మ్యములు, పవిత్రక్షేత్రములు, భారతీయుల ప్రతిభ, అన్నియు నతనికి ఆశ్చర్యము, భక్తి, గౌరవమును కలిగించినను, స్వదేశముమిాదను పైత్రానుగతమైన సంప్రదాయముల మిాదను అభిమానమును అణిగిపోనీయలేదు. అరువదియేండ్లు గడచిన ముదుసలియయ్యు, తన తలిదండ్రుల ను ఖననము చేసిన తావులందు గట్టబడిన సమాధులు, శిధిలములయినవని తెలినపుడాతడు, చక్రవర్తి సెలవు గైకొని, తన పితృదేవతలకు, మంచిచోట శాశ్వతముగ నుండగల సమాధులను నిర్మించెను.

బౌద్ధసన్నాసియు, సంఘమున కధిపతియై, మతము ననుసరించునప్పుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ ఆచార వ్యవహార ములందు పట్టుదల, మూఢవిశ్వాసమును ఎక్కువ జూపియుండెను. తన పాలనమందున్న సన్యాసులు ఆచార నియమములు యధావిధిగ జరుపునట్లు శాసించుచుండెను. అయిను అతని మతములో విశాలహృదయము లేకపోలేదు. పరమత సహనము లేకపోలేదు. అతఁడు తానుతలచినది యెట్టి యాటంకములు వాటిల్లినను నెరవేర వలయునని దృఢనిశ్చయముగలవాడు. ఆకరణమున నాతఁడొకటి రెండుసార్లు తగచుఁదెచ్చుకొనెను. అతడు సాహసుడు. ధైర్యశాలి, స్వాతంత్రప్రియుడు. ఈప్రపంచమున నాతఁ డెవ్వ రికిని దాసుడనని యంగీకరింపలేదు. కాని మత విషయమున మాత్రము, విచక్షణ లేకుండ, నేది యెవ్వరు చెప్పినను, మూఢవిశ్వాసముతో విశ్వసించుచుండెను. అందువలననే యాతని గ్రంథమునందు చారిత్రక జ్ఙానము గాని, వివేచనగాని, పరిశీలనగాని గాన్పించదు.

యుఁఆన్‌ చ్వాంగ్‌ రచించిన సీ-యూ-కీ గ్రంథమిపుడు మనవ్యాసరచనకు ముఖ్యాధారము. ఆపదమునకు "పశ్చిమ దేశమునందలి బుద్ధునికి సంబంధిన వృత్తాంతము" లని యర్థము. ఈ గ్రంథమును యుఁఆన్‌ చ్వాంగ్‌ చెప్పుచుండ, ఫీ౯షీ యను పండితుడు వ్రాసియుండెనని కొందఱి యభిప్రాయము. మరి కొందఱు, అతడు మన యాత్రికుడు వ్రాసిన దానిని నచ్చటచట సంస్కరించి వ్యాఖ్యానము చేయుచు వచ్చెనని చెప్పుదురు. ఇందేది వాస్తమయినను, యుఁఆ౯ చ్వాంగ్‌ వ్రాసినట్లు చెప్పెడి గ్రంధమునందనేక పాఠాంతరములున్నవి. అనేకములు తప్పులున్నవి. ఈకాలమున చీనా సారస్వతమునందు సి-యూ-కీ అమూల్యమైనదిగా పరిగణింప బడుచు, పాశ్చాత్య ఖండపు భాషలన్నిటిలోనికి భాషాంతరము చేయబడియున్నది. ఈగ్రంథమును బీలు పండితుఁ డాంగ్ల భాష లోనికిఁదెచ్చెను. అతని భాషాంతరీకరణమును, జూలియను పరాంసు భాషాంతరీకరణమును, సంప్రదించి, వాటర్సు పండితుడు గ్రంథము నంతయు తిరిగి వాఖ్యతో వ్రాసెను. యుఁఆన్‌ చ్వాంగ్‌ భరతవర్షమును, క్రీ. శ. ౬౨౯ సంవత్సరమున వర్షఋతువు గడచిన వెనుక ప్రవేశించి, యుత్తర హిందూస్థానము నంతట నేడెనిమిది సంవత్సరములు సంచారము చేసి, క్రీ. శ. ౬౩౭ వ సంవత్సరమును నాలందా సంఘారామమును జేరుకొని యించుమించుగా రెండు సంవత్సరముల కాలమచ్చట గడపి, మహాతత్వవేత్త యగు శీల భద్రునికడ అనేక శాస్త్రములను అభ్యసించెను. పిమ్మట బౌద్ధధర్మ గ్రంథములను, శాస్త్రములను అనేకములను సమకూర్చుకుని తామ్రలిప్తీ నగరమున నోడనెక్కి, సింహళ ద్వీపముమిాదుగా, చీనా దేశ మునకు మరలిపోవ నిశ్చయించుకొనెను. ఈతఁడు తామ్రలిప్తీ నగరమును జేరునప్పటికి, నాశ్వీయుజమాస మగుటవలన, ఆమాసమున సముద్రయానము వర్జింపవలయునని వారింపబడి, దక్షిణాభిముఖుడై, ఆంధ్ర, మహాంధ్ర దేశములందలి పుణ్యక్షేత్రముల గూర్చియు అమరావతీ ధాన్యకటక స్థూపములను గూర్చియు కంచి నగరమును గూర్చియు వినియుండినందున వానిని కూడ సందర్శించి పోవవలెనని సంకల్పించి, నాటుదారిని ప్రయాణము సాగించెను.

ఏమి కారణముననో యుఁఆన్‌ చ్వాంగ్‌ దక్షిణదేశములగూర్చి ఉత్తరదేసములవలె, విపులముగను, సవిస్తరముగను వర్ణింపక, సంగ్రహముగా జెప్పుచు బోయినాడు. మరియు, ప్రమాదములయినవి పెక్కు విషయములను జొప్పించి యున్నాడు. ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు గల దూరమును కొంచెము హెచ్చుగనో, కొలదిగ తక్కువగనో, చెప్పుచు నాయాదేశముల నాతడు ఒకప్పుడు చూడకయె వర్ణించెనాయను సందియము వొడమునట్లుగా వర్ణించినాడు. యుఁఆన్‌ చ్వాంగ్‌ తామ్రలిప్తి నగరమునుండి, కర్ణ సువర్ణ దేశమునకు జనియెను. ఇది దక్షిణ వంగదేశములో నొక ప్రాంతము: నేడు సింగభూమ్‌ అనియు, వీరభూమ్‌ అనియు పిలవబడుచున్న మందలము. ఆదేశమునుండి మనయాత్రికు డోఢ్రదేశమునకు జనియెను.

యుఁఆన్‌ చ్వాంగ్‌ ఓఢ్రదేశమునుండి బయలుదేరి దక్షిణాభిముఖుడై ౧౨౦౦లీలు ప్రమాణము చేసి కుంగ్-యూటో అని బిలువబడు దేశమును ప్రవేశించెను. ఈకుంగ్‌-యూ-టో యనుపేరు చీనీభాషా పండితులు సంస్కృతము నందు "కోన్యోఢ" యని భాషాంతరీకరణము చేసిరి. మనయాత్రికుని వర్ణనలబట్టి యీదేశము చిల్కసముద్ర ప్రాంతమునకును గంజాము మండలమునకును సరిపోవుచున్నదని కన్నింగ్‌ హామ్‌ పెర్కసన్‌ పండితులు నిర్ణయించిరి.[1]. ప్లీటుపండితుడీ దేశమును బృహత్‌ సంహితయందు పేర్కొనబడిన "కుండ్య" లేక "హేమకుండ్యము"నకు సరిపోవుచున్నదని యభిప్రాయ పడుచున్నాడు.[2] "ఈ కొన్యోఢము వేయిలీలు చుట్టుకొలత కలిగియున్నది. రాజధాని చుట్టుకొలత యిరువది లీలుండును. దేశమంతయు కొండలతో నిండియున్నది. సముద్రమిచ్చట చేరువగా నుండి వలయాకారముగ లోనికి జొచ్చుకొనిపోయి నొక అఖాతము క్రింద నేర్పడియున్నది. ఈ ప్రాంత ముష్ణముగా నున్నను పంటలు చక్కగా ఫలించుచున్నవి. ఇచ్చట జనులు, పొడవైనవారు, ధైర్యశాలురు, కొంచెము చామాన ఛాయగల మేనివారు. స్వగౌరవమును, వివేచనయు నెఱగి ప్రవర్తింతురు. మోసము చేయుటంతగా నెఱుగరు. వారి భాషాలిపి, యుత్తర హిందూస్థానమునం దుపయోగింప బడుదానివలె నున్నది. కాని భాషామాత్రము వేరొకటిగా గనుపించును. ఇచ్చటి జనులలో బౌద్ధులు గానరారు. దేవాలయములు నూరువఱకును, తీర్థకుల (జైనులు) ఆలయములు పదివేల వఱకు నిచ్చట గలవు. సముద్రతీరమునంటి యిాదేశమున పదిపట్టణములు మాత్రమే గలవు. అవియన్నియు, ఏటవాలుగనున్న కొండలపై నిర్మింపబడియున్నవి. ఇచ్చట జనులు నాణెములకు బదులు ముత్యములను, గవ్వలను వాడుదురు. దుర్గమమైన దేశమగుటచేతను, సైన్యములు విశేషముగ నుండుట చేతను కొన్యోఢము శత్రుభయంకరముగా నున్నది".

ఏడవ శతాబ్ధమునందీ ప్రాంతము కళింగమునకు నాంధ్రదేశమునకు మడుమ సరిహాద్ధుగా నుండినట్లు గానబడు చున్నది. ఇక్కడనుండి, యుఁఆన్‌ చ్వాంగ్, కళింగమును గూర్చి పయనమయ్యెను. ఈకాలమున కళింగము యొక్క నిజరూపమును నిరూపించుట దుస్తరము. క్రీస్తుశకారంభ కాలమున కళింగదేశమాంధ్ర సామ్రాజ్యములో జేరిపోయినది మొదలు కాళింగులు నాంధ్రలో కలిసిపోయి, నామమాత్రమున కొక తెగవారు గానునట్లుంపించెడిని.[3] కాళింగుల వేషభాషలు, నాగరికత మున్నగునవి యాంధ్రములో సమ్మేళనమైపోయెను. మరియు నేడవశబ్ధాదిని, కళింగమును బరిపాలించుచుండిన రాజవంశములు గూడ వేంగీ దేశమునుండి, వలసబోయిన వారలుగా గన్పపట్టుచున్నారు. మన యాత్రికుడీకళింగమును ప్రవేశించినది మొదలు, వ్రాసిన దానిని బరీక్షించి యందలి వృత్తాంతములు ఎంతవరకు జరిత్రసిద్ధములో వరయుదము. ఈ కళింగముగూర్చి యుఁఆన్‌ చ్వాంగ్ యిట్లు వ్రాయుచున్నాడు.

"కుంగ్-యూ-టో (కొన్యోఢ) దేశమునుండి నైఋతి దిక్కుగా జనిన చామలులేని యొక విశాలమైన యెడారివంటి భూమిని ప్రవేశింతుము. దానినిదాటిన వెనుక, సూర్యకిరణములను సయితము గప్పివేయునంతటి యున్నతములయి తల విరియబోసి కొన్నట్లుండు వృక్షములతో నిండి గాఢాంధకారమయిన మహారణ్యములను వనములను దాటి సుమారు ౧౪౦౦ లేక ౧౫౦౦ లీలు ప్రయాణము చేయునప్పటికి, (క-లెంగ్క) కళింగదేశమును బ్రవేశించితిమి.

"ఈ కళింగదేశ మయిదువేల లీలు వైశాల్యముగలది. రాజధాని, పదిలీలు కైవారము గలది. భూమి సారవంతమై సస్యములతో నిండియున్నది. ఇచ్చట పుష్పములు ఫలములు విశేషముగ లభించును. వందలకొలది లీల వరకు వ్యాపించియున్న కారడవు లీదేశమునిండ గలవు. ఆయరణ్యములందు కారుమబ్బులబోలి, ఉన్నతములయి కొండలవలె నుండు మదపుటేనుగులు ద్రిమ్మరుచు నుండును. వాటిని బట్టుకొని కాళింగులు ఇతర రాష్ట్రములకు గొపోయి, విశేషధనమునకు విక్రయించుచుందురు. ఈదేశ ముష్ణప్రదేశము, ప్రజలు కొంచెము కోపస్వభావులు, ఆవేశపూరితులు. మోటువారుగను, అనాగరికులుగను గంపట్టినను, కాళింగులు, విశ్వాసపాత్రులు, ఋజుమార్గ వర్తులును మాటదప్పనివారుగా నున్నారు. వారు వడిగా మాట్లాడుదురు. వారిమాటలు తేలికగా వచ్చుచున్న ట్టుండును. కాని యుచ్ఛారణ చాలస్పష్టముగను నిర్దుష్టముగను నుండును. ఆచార వ్యవహారములందును, వేషభాషలందును, కాళింగులకును, మధ్యదేశము వారికిని భేదముకలదు. ఈదేశమున జాలమంది బౌద్ధులును, బ్రాహ్మణులును గలరు. ఇచ్చట పది సంఘారామము (బౌద్ధమఠములు) లున్నవి. వాటియందు స్థవీర సంప్రదాయమునకు జెందినట్టి, మహాయానశాఖా సంబంధులగు ఏనూఱుమంది భిక్షువు లు నివసించు చున్నారు. ఈ దేశ మున నూరు దేవాలయముల వఱకును గలవు. ఈ దేవాలయములందు బ్రాహ్మణులుగాక ఇతర మతస్థులను బూజ లర్పించుచుందురు. ఇచట బ్రాహ్మణులును బౌద్ధులును గాక నిగ్రంథులనిబరగు దిగంబర జైనులుగూడ బెక్కుమంది గలరు.

"కళింగము పూర్వకాలమున మిక్కిలి జనసమర్దమై యుండెను. అపుడొకరి భుజములతో నొకరి భుజములు వీధు లందు ఒరసికొనుచుండెను. రాజబాటలందు రథచక్రముల యిరుసు లొండొంటితో సందులేమి డీకొనుచుండెను. జనులందరు తమ యుత్తరీయములను బైకెత్తి పట్టుకొనినచో, సూర్యుని వెలుతురును గప్పివేయుటకు గుడారమగు చుండెను. జన సంకీర్ణమయియుండిన ఇట్టి దేశము ఒకానొకప్పు డొకతాపసి శాపముచే నంతయు నిర్జనభూమి గావింపబడియెను. ఆకథను జనులిట్లు చెప్పుకొందురు. ఒకప్పుడీ దేశమునందొక కొండ చివర నొక ఋషి తపము చేసుకొనుచుండగా, మూఢాత్ముడైన కాళింగుడొకడు ఆమహత్ముని కపచారము గావించెను. ఆమహత్ము డంతట కోపించి, కళింగమును నిర్జనమగునట్లు కోపించి యెటకో జనియెను. ఆశాపమహిమచే నతి శీఘ్రకాలమున జను లెల్లరు దుర్మరణము వాతబడిరి. పిమ్మట కొంతకాలమయిన తరువాత, నితర ప్రాంతముల నుండి జనులు కళింగమునకు వలసవచ్చి నివసింపసాగిరి. అది మొదలుగా దేశమిట్లు స్వల్పజన సంవాసిత మైన యున్నది.

"రాజధానికి సమిాపమున దక్షిణముగా నూరడుగుల యాకాలమున కళింగరాజధాని యగు కళింగ నగరమని బిలువబడుచుండెను. కళింగదేశ నామము పూర్వ యుగములందు గంగానదీతీరముననున్న మిథిలా దేశము మొదలుకొని గోదావరి వఱకుగల దేశమున కెట్లుపయోగింప బడుచు వచ్చెనో, యట్లే యాదేశపు రాజధానియు పాలించిన రాజవంశముల బట్టి యనేక తావులందు నిరూపింప బడుచున్నది. బుద్ధునికి బూర్వము దంతిపురము రాజధానిగా నుండెనట. ఈదంతిపురమే రాజమహేంద్రవరమని కన్నింగ్‌హ్యామ్‌గారి యభిప్రాయము[4]; కాని యిది తృప్తికరముగ లేదు. గోదావరిమిాదనున్న రాజమహేంద్రవర మాదిగా నగరములెన్నియో కళింగ రాజధానులుగ ప్రాచీన కాలమునుండి ప్రసిద్ధి కెక్కెను. కాని మనయాత్రికుని కాలమున గంజాము మండలములోని శ్రీకాకుళము తాలూకాలోని కళింగ పట్టణము, సింహపురము, కళింగనగరములలో నేదోయొకటి రాజధానియై యుండ వలయును. ఈ నగరములన్నియు వరుసగా వంశధారనది మిాద మొదట ముఖలింగనగరము తరువాత సింహపురము చివర కళింగపట్టణము నున్నవి. రాజధాని కళింగనగరము. రేవు వంశధార ముఖద్వారమునున్న కళింగపట్టణము. కడపటిదే దంతిపురము కావచ్చును. ఈ నగరములన్నిటి యందును పురాతన బౌద్ధచిహ్నములు, మఠములు మొదలగునవి గాంపించుచున్నవి. ఏడవశతాబ్దమునకు బూర్వము కళింగము కొంతకాలము పల్లవరాజుల పరిపాలనము క్రింద నుండెను[5]. ఆకాలమున పిష్ఠపురమో యలమంచిలియా, నరసన్నపేట సమిాపముననున్న సింహపురమో, రాజధానియై యుండవలయును. ఈపల్లవ రాజులలో సింహపురశాసనమందు నంద ప్రభంజనవర్మ, చండవర్మ, ఉమవర్మ యను మువ్వు ర రాజులపేరు లుదాహరింపబడి గానవచ్చుచున్నవి[6]. వీరిలో నెవ్వరుముందో యెవ్వరు తరువాతనో తెలియరాదు. కాని వీరందఱకును సింహపురము రాజధానిగా నుండిన మాట నిశ్చయము. క్రీ. శ. ౫, ౬ శతాబ్దములందు కళింగరాజులకును వేంగిరాజులయిన విష్ణుకుండినులకును బద్ధవైరముగా నుండెను. దక్షిణకోసలము నేలు వాకాటకరాజులు, విష్ణుకుండినులకు దగ్గర బంధువులగుటచేత నుభయులును కళింగరాజ్యమునకు చాలభాధాకరులుగా నుండి ఇరుప్రక్కలనుండి తొందరలు గలుగ జేయుచుండిరి. ఈ కారణమున సర్వదా యుద్ధములలో మునిగి తేలుచుండుటవలన యుఁఆన్‌ చ్వాంగ్‌నకు దేశము జనసమ్మర్దముగా గన్పట్టియుండక పోవుటలో నాశ్చర్యమేమి? ఏడవశతాబ్దమందు కళింగరాజ్యమున గాంగపల్లవ వంశమొకటి తలయెత్తి విజృంభించి కళింగనగరమును (ముఖలింగము) రాజధాని గాజేసికొని కళింగరాజ్యము నంతయు తనపాలనము క్రిందకు దెచ్చియుండెను. ఇయ్యది యుఁఆన్‌ చ్వాంగ్ రాకకు కొంచెము ముందుగనో వెనుకగనో జరిగి యుండెను. అందువలన యుఁఆన్‌ చ్వాంగ్‌ చూచిన రాజధానిని నిర్ణయింప సాధ్యముగాదు. ఈ కారణమును బట్టియు కూడ నాతడు వర్ణించిన స్తూపమునుగూడ గనిపెట్ట జాలము. కాని మన యాత్రికుడు సందర్శించిన కళింగ రాజధాని సింహపురమని గాని కళింగనగరమని గాని నిర్ణయించినచో అచ్చట కనతిదూరమున గల సాలెహుండామునందలి స్తూపమే పూర్వము నలుగురు బుద్ధులు నివసించినచోటని నిర్ణయింపవచ్చును. కాదేని, కళింగనగరములోని భాగమగుచు, మధుకేశ్వరుడను నామాంతరము గల ముఖలింగేశ్వరుని దేవాలయమున్న వాడలో, బౌద్ధస్తూపముండినట్లు చిహ్నములు నేటికిని గానవచ్చుచున్నవి; కావున ముఖలింగనగరమె స్తూపముండిన స్థలము గావచ్చును. ఇక కళింగమున కుత్తర ప్రాంతమున ప్రసిద్ధికెక్కిన పర్వత శిఖరము మహేంధ్రగిరి. పరశురాముడిచ్చట తపమును, యజ్ఞమును చేసెనని పురాణాదులు వాకొనుచున్నవి. మరియు బౌద్ధధర్మ గ్రంథములందుగూడ మహేంద్రగిరి చాల ప్రఖ్యాతి గాంచియుండెను. గావున మన యాత్రికుడు పేర్కొన్నదీ నగరమేయని యుహింప వచ్చును.

కళింగరాజ్యము నుండి యుఁఆన్‌ చ్వాంగ్‌ వాయువ్యదిశాభిముఖుడై అడవులగుండను పర్వతకనుమల గుండను ఇంచుమించుగా ౧౮౦౦లీలు (౩౬౦ మైళ్ళు) ప్రయాసముతో పయనము సలిపి దక్షిణకోసలమును బ్రవేశించెను. కోసలదేశమందు తాను జూచినదానిని వినిన దానిని యతడిట్లు వర్ణించియున్నాడు.

"కోసలమారువేల లీలు (౧౨౦౦ మైళ్ళు) వైశాల్యము గలది. దేశముచుట్టు ఎడతెగని పర్వతపంక్తుకు మహారణ్యములు దట్టముగా నలుముకొని వ్యాపించి యున్నవి. కోసల రాజధాని నలుబదిలీలు (౮ మైళ్ళు) వైశాల్యము గలది. ఇచ్చటి భూమి చాలా సారవంతమై యుండుట వలన పంటలు విశేషముగా బండుచున్నవి. దేశము నిండ పట్టణములు పల్లెలు విశేషముగా నొకదానికొకటి సమిాపముగా గలవు. దేశము మిక్కిలి జనసమర్దమై యున్నది. ఇచ్చటి ప్రజలు మిక్కిలి బలిష్టులు, దీర్ఘకాయులు, చామనచాయ గలవారు. మోటుగా గాన్పించెదరు. మఱియు కాళింగులవలేనే కొంచెము కోప స్వభావము గలవారు. కాని మంచి ధైర్యవంతులును, సాహాసముగల వారుగా నున్నారు. ప్రజలు చాల తెలివిగలిగి విద్యాగోష్టియందును తత్వ విచారణయందును మంచి యభిరుచియు ప్రజ్ఞయు జూపుచున్నారు. ఈ దేశపురాజు క్షత్రియ వంశజుడు. అతనికి బుద్ధదేవుని యుపదేములందభిమానము, గౌరవమును మెండు. అతని దయయు ధార్మికత్వము నితరదేశములందు సయితము కీర్తింపబడు చున్నవి. కోసల దేశమున సుమా రొక నూరు సంఘారామము లున్నవి.అందు దాదాపుగా పది వేలమంది భిక్షువులున్నారు. వీరందఱు మహాయానశాఖా సంబంధులే. మరియు నీదేశమున డెబ్బది బ్రాహ్మాణ దేవాలయములు గూడ నున్నవి. బౌద్ధులుగాక నిక్కడి జనులలో చాలమంది బ్రాగ్మాణులును జైనులు గూడ నున్నారు.

"కోసల రాజధానికి దక్షిణపుదిక్కున అనతి దూరమున అశోకవనమును అందొక స్తూపమును కలవు. పూర్వ కాలమున నిచ్చట తథాగతుడు ధర్మసభను సమకూర్చి తన ప్రజ్ఞాతి శయములచే చాలమంది బ్రాహ్మాణులను బౌద్ధులను జేసియుండెను. తరువాతి కాలమున బోధిసత్వుడగు నాగార్జునుడీ సంఘారామమున జాలకాలము నివసించెను. అపుడీదేశము నేలుచుండిన రాజుపేరు సాద్వహుడు. అతడు నాగార్జునుని విశేషముగ నాదరించి గౌరవించెను.

"సింహళద్వీపము నుండి యొకప్పుడొక బోధిసత్త్వుడు దేవుడనువాడు, నాగార్జునుని ప్రజ్ఞావిశేషములను విని, యాతనితో వాదింప నిచ్చగొని బయలుదేరి వచ్చి నాగార్జున బోధిసత్త్వునికి తనరాక నెఱిగింపుమని కావలి వానిని కోరెను. ద్వారపాలకుడంతట లోనికరిగి దేవుని రాకదెల్పెను. నాగార్జునుడంతకు బూర్వము దేవబోధి సత్త్వుని పాండిత్యమును, మహిమాతిశయమును వినియుండిన వాఁడగుటచే, తక్షణమె శిష్యునొకని బిలచి యొకపాత్ర యందు నీరు నింపి దానిని దేవుని కడ కట్లె గొంపోవ వలసొనదని యాజ్ఞాపించెను. దేవబోధిసత్త్వుడా జలపూరిత పాత్ర నవలోకించి మాటాడక మెల్లగా సూదినొకదానిని అందు జారవిడచి యూరకుందెను. అదిచూచి, శిష్యుడేమియు దోచక నిశ్చేష్ఠుడైయుండి, పిమ్మట నే సమాధానమును గానలేక, నాగార్జునకడ కాపాత్రను తిరిగి పట్తుకొని వచ్చి, జరిగిన దంతయు విన్నవించెను. నాగార్జునుడపుడు "ఆహా! ఏమాతని ప్రజ్ఞావిశేషము! ఇట్టి మహనీయుని నేనెపుడును గాంచి యుండ లేదు. మానవుల హృదయమును దెలిసికొనగల సమర్ధుడు ఒక్కడీశ్వరుడేగదా. అయినను మానవ హృదయాంతరాళము నుండి యుద్భవించు సూక్ష్మవిషయములను సయితము గ్రహింపగల సమర్ధుడీతడు తప్పక మాహానుభావుడ తడును, జ్ఞానియు గావలయును. కావున సత్వరమాతనిని లోనికి బ్రవేశ పెట్టుము" యని యానతి నిచ్చెను. శిష్యుడామాటలను విని "ఆచార్యా! ఏమిచోద్యమిది! మూగివానివలె మాటలాడ కూరకుండువాడు సర్వజ్ఞుడగునా!" అని ఆశ్చర్యముతో నడిగెను. అంత సర్వజ్ఞు డపుడు"వత్యా! యిటు వినుము. జలపూరితమయిన యీ పాత్రయందు సంపూర్ణమయిన నాజ్ఞానమును సూచించు చున్నది. యీపాత్రయందు ప్రతిసందు సందులో ఈ జలమెట్లు వ్యాపింపగలిగి యున్నదో, అట్లే నాజ్ఞానముగూడ, విశ్వమం తయు వ్యాపించి యున్నది. ఈ జలమెట్లు పరిశుభ్రమైనదిగా వచ్చునో అట్లు నాజ్ఞానమును పరిశుద్ధమైనది గావచ్చును. కాని యిాజలమందు దేవుడు సూదిని జారవిడుచుటచేసి, నా బ్రహ్మజ్ఞానమును అతడు ఛేదించినాడని యర్థము. కావున వేగ మాతనికడకేగి, లోన ప్రవేశ పెట్టుము" అని పల్కెను.

"నాగార్జునుని, రూపము, దృష్టియు, మనసును మిక్కిలి గంభీరమైనవి. చూపరులకాతడు భయము నాశ్చర్యము గొలుపుచుండును. అతని ప్రజ్ఞయు, పాండిత్యముకూడ నట్టివే. అతనితో వాదింపదలచి వచ్చినవారతని వాగ్ధాదాటికి నిల్వజాలక తమ యజ్ఞానమును వెల్లడించి శిష్యత్వము నంగీకరింతురు. దేవ బోధిసత్త్వుడీ మహనీయుని ప్రజ్ఞా విశేషములను వినియుండిన వాడగుటవలన నాతనితో వాదించి, తన సందియములను బాపుకొనదలచి వచ్చి యుండెను. ఇపు డాతడు నాగార్జునుని సమిాపింపబోవువేళ మిక్కిలి భీతచిత్తుడై తొట్రుపాటుతో నడువ నారంభించెను. అట్లు సోపానముల నెక్కి మొగసాలలు కడచి ప్రాంగణము దాటి సభామంటపమును భయ, వినయ, గౌరవ, సంభ్రమములు వెంటనంటి రాఁ బ్రవేశించెను. నాగార్జునితో వాద మారంభించునప్పుడు కొంత భయకంపితు డయ్యెను. కాని సాయంకాల మగుసరికి, గంభీరముగ తన వాదము నుపన్యసింప సాగెను. అంతట నాగార్జును డాతని వాదములను విని సంతుష్టాంతరంగుడై, "దేవా! నీ జ్ఞానమును, పాండిత్యము నపారమైనవి. నీ యనుభవము ప్రపంచాతీతము. ఈ భువిని నిను బోలినవారు కడచినవారిలో గాని, యిపుడున్న వారిలోగాని, నాకెక్కడను గాన్పించుటలేదు. నేనిపుడు ముదుసలినై దేహబలము తగ్గినవాడ నగుచున్నాను. ఇపుడిక నీవంటి విద్వాంసుని గాంచగలుగుటచే, నాజ్ఞాన జలమును, నిలువ జేసికొనుటకు నీయందు తగిన పాత్రను లభించిన వాడ నగుచున్నాను. నా జ్ఞాన జ్యోతిని చల్లార్చిపోకుండ నాయనంతరముకూడ సంపూర్ణ తేజముతో వెలిగింప గల మహనీయుని గాంచగల్గితిని. నిజముగా నీవే నావెనుక, నీ ధర్మాధ్యక్ష పీఠము నధిష్ఠించి, పరిశుద్ధమైనదియు, నుత్క్రుష్టమైనదియు నగు ' ధర్మమును ' ప్రతిపాదించి వ్యాపింప జేయగల సమర్ధుడవు. కావున నాతోడ గూడ కొన్ని ధర్మ రహస్యములను గ్రహింతువుగాక, రమ్ము!" అని బల్కెను.

"దేవుడీ మాటలు విని సంతుష్టాంతరంగుడై అహంకారముతో తానే సర్వజ్ఞుడని గర్వించెను. అంతటనుంచి తన తార్కికత్వమును, పాండిత్యమును దేటపడ అలంకారములతో, శబ్దాడంబర వాక్యములతో సంభాషింప నారంభించెను. బోధిసత్త్వుడు తన వాగ్దోరణిని మెచ్చుకొనుచుండెనేమోయని సంతోషించుచు, నొకసారి నాగార్జునివంక చూచెను. కాని యాతని ముఖమున యొక అసంతృప్తియు నాగ్రహమును వ్యక్తమగుచుండుట గాంచి, భయకంపితు డయ్యెను. వికలచిత్తు డగుటచే మాటలు తడబడ నారంభించెను. మరి కొంతసేపటికి నోరారిపోయి మాటలాడలేకపోయెను. పిమ్మట ఆసనమునుండి లేచి వినమ్రుడై, చేతులు జోడించి, తన యజ్ఞానమును క్షమించి శిష్యునిగా పరిగ్రహింపవలసినదని ప్రార్థించెను. దేవుని సంభ్రమమును గాంచి నాగార్జునుడపుడు "దేవా! ఆసీనుడవుగమ్ము! భయవర్జితుడవు గమ్ము. ఇపుడే నీకు నేను బుద్ధుని ధర్మములందలి రహస్యముల నుపదేశింతును." అని శాతంతో బల్కెను. దేవుడంతట నాగార్జునుని మ్రోల సాష్టాంగముగ బ్రణమిల్లి హృదయ పూర్వకముగ" నేటి మొదలు యిా యజ్ఞానుని శిష్యునిగా బరిగ్రహించి యనుగ్రహింప వేడెదను." అని ప్రార్థించెను. నాగార్జునుడతని యెడ జాలిగొని శిష్యునిగా బరిగ్రహించెను.

"మూలికలచే నౌషధులను తయారు చేయుట యందు నాగార్జును డద్వీతీయుడు. మూలికల రహస్యము నాత డెఱింగినట్లు యితఱు లెరుగరు. అతడొక ఔషధమును సేవించి బుద్ధి బలమును దేహదార్ఢ్యమును చెడకుండ, రూపు మారిపోకుండ చిరకాలము జీవింపగల్గెను. అతని జీవితకాలము కొన్నిశతాబ్దములని జెప్పుదురు. రాజు సాద్వహుడు నీయౌషధమును సేవించి నాగార్జునివలె చిరకాలము జీవింపగల్గెను. నాగార్జును డంత ప్రజ్ఞావంతుడయ్యు ను, తనంతట తానె, ప్రాణ త్యాగము గావించుకొనెను. నాగార్జునుని జీవితముతో సాద్వహుని ఆయువును అంతమొందు. విధి బలమై యుండినను నిరువురు నొక్క కాలమున మరణించిరి. సాద్వహుని చావును, నాగార్జునుని చావును, ఇట్లు తటస్థించెనని చెప్పుదురు.

సాద్వహునకు, కడగొట్టు వాడొకడు చిన్నకుమారుడుండెను. అతడు తా నెప్పుడు సింహాసన మధిష్ఠించి రాజ్యమును బాలింతునా యని సర్వాదా చింతా నిమగ్నుడై యుండెను. ఆత డొకసారి తల్లిని జేరబోయి "అమ్మా! నేనెపుడు సింహాసనమెక్కి రాజ్యము చేయుదును?" అని యడిగెను. అందుల కారాణి విచారముతో! "కుమారా! ఈ జన్మమున నీవు సింహాసనమున గూర్చుండి రాజ్యాభిషిక్తు డవయ్యెదవని నాకు తోచదు. నీ జనకుడిప్పటికి కొన్నివందల సంవత్సరములు జీవించియున్నాడు. అతనిముంగిట నెందరో పుత్రులు, పౌత్రులు, పెద్ద కాలము జీవించి, మరణించిరి. ఇది యంతయు నాగార్జునుని శక్తి ప్రభావము. ఏక్షణమున నాబోధిసత్త్వుడు మడియునో. యా యుత్తర క్షణమున నీతండ్రియు దేహయాత్ర జాలింపగలడు. ఈనాగార్జునుని ప్రజ్ఞాబుద్ధులును, జ్ఞానమును అపారములు. అతని ప్రేమయు దయయు నగాధములు. ప్రపంచమందలి జీవులకై యాతడు, తన దేహమును, ప్రాణమును సమర్పింప వ్రతము బూనియున్నాడు. కావున నీవరిగి యాతని సందర్శింపుము. అతడు నీకేమి కావలయునని యడిగిన నీశరీరమిమ్మని కోరుము. నీవిది యొనర్చిన నీయభీష్టము సిద్ధించును." అని హితోపదేశమొనర్చెను.

"జనని యుపదేశ వాక్యముల నాలకించి యారాజ సుతుడు సత్వరము నాగార్జునుడు నివసించు చుండిన మఠమునకు వచ్చెను. అతనిరాక గాంచి, ద్వారపాలకుడు భయపడి పలాయనుడయ్యెను. రాజ కుమారుడును లోనికి బరుగెత్తెను. నాగార్జును డాసమయమున పడసాలలో పచారు చేయుచు, మంత్రములను పునశ్చరణ గావించుచుండెను. ఏదియుగాని సమయమున రాజకుమారు డట్లు భిక్షవాటిక జొచ్చుటగాంచి, ఆశ్చర్యము నొంది యాతడు "కుమారా! ఈ సాయంతనపువేళ నింత తొందరగా, బిక్షువులు నివసించు మఠమునం జొచ్చుటకు గతం బేమి? నీకేమైన విపత్తు వాటిల్లెనా? కాక నేడేదయిన కారంతరమున శరణార్థివై వచ్చితివా?" యని యాతురతతో నడిగెను.

ఆప్రశ్నకు, రాజకుమారుడు మెల్లగా "మహానుభావా! వినుడు. ఇంతకు బూర్వము నాజననితో శాస్త్రార్థములు చింతన చేయుచు, ప్రపంచముతో సంబంధము వీడిన సన్యాసుల గూర్చి నేనిట్లంటిని. "అమ్మా! ప్రపంచమందలి జీవరాసులకు ప్రాణముపై నాస మెండుకదా! అట్టియెడ త్యాగము నుద్ఘోషించు ధర్మశాస్త్రములు, ఇతర జీవులు వాంఛింపునపుడు, ప్రాణత్యాగము సేయుట త్యాగమని యా సన్యాసుల కెందులకు విధించి యుండలేదు?" అపుడు నామాటలకు, నాజనని కుమారా! అట్లు గాదు. దశ భూమికలయందలి సుగతులను, మూడుకల్పము లందలి తధాగతులును పరమపురుషార్థమును బడయగోరి జీవయాత్రను ఈ లోకమున గడపుచు, నిర్వాణమును బొందిరి. వా రెల్లరు బుద్ధుని మార్గమును శ్రద్ధతో ననుసరించిరి. ఆతని ధర్మోపదేశములను గ్రహించి శాంతచిత్తముతో నాచరింపుచు వచ్చిరి. వారుధర్మరక్షణార్థము, తమ దేహములను వన్య మృగముల యాహారము కొరకు నర్పించిరి. పావురమును బ్రతికించుటకై ఒకడు తన దేహములను కోసి యిచ్చెను. పూర్వముచంద్రప్రభుడను రాజొక బ్రాహ్మణునికొరకు తన శిరమును కోసి యిచ్చెను. చేది రాజగు మైత్రిబాలు డొక యక్షుని యాకలిబాధ తీర్చుటకు తన రక్తముల ద్రావ నిచ్చెను. ఇంకను యిట్టివా రెందరో ప్రతి యుగమందున గలరు. వారందరును మహనీయులు. మన నాగార్జునుడు నట్టివాడే. ఆత డుత్కృష్ట ధర్మముల నవలంబించుచున్నాడు. అని చెప్పెను. కావున నో బోధిసత్త్వుడా! 'నాకై' తనప్రాణము నర్పింపగల మహనీయునికై యింత కాలము నుండి నేను అన్వేషించుచున్నాను; కాని యొక్కనిగూడ గాంచలేనైతిని. బలాత్కారముగ నెవ్వనినైన వధించినచో నా హత్యవలన సంభవించు మహాపాపము నన్ను చుట్ట కొనును. ఆ దుష్కార్యమువలన గలుగుదు:ఖ మపారము భరింప నలవికానిది. ఆజ్ఞానుడగు బాలుని వధించుటకున నా మనసు వప్పుకొనదు. అది నా కీర్తిని పాడుచేయును. ఇక నీవు బోధిసత్త్వుడవు, ప్రతి దినమును బుద్ధు డుపదేశించిన ధర్మమార్గము నవలంబించుచు నిర్వాణమును బొందదలచి యున్నాడవు. బోధిసత్త్వునికి సమస్త జీవరాసుల యందును ప్రేమ యొక్కరీతిగా వ్యాపించియున్నది. అతని దయకు మేరలేదు. అతనికి ప్రాణము బుద్బుదప్రాయము, కాయముదారుకవలె క్షణికము, కావున బోధిసత్త్వుడవైన నీవేల నాయభీష్టమును నెఱవేర్పకుందువు? అట్లు చేయక నీవేల నీజీవితమందలి పరమపురుషార్థమును చెడగొట్టుకొందువు? అని యుపన్యసించెను.

"నాగార్జును డట్లా రాజకుమారుని మాటల నాలకించి "రాజకుమారా! నీవు బల్కినదంతయు సత్యము. నీవన్నయట్టు, నేను బుద్ధుడనగుటకు బ్రయత్నించుచున్నాను. బుద్ధుడగువాడు సర్వము త్యజింప సమర్థుడని నే నెఱుంగుదును. ఆతడు తన దేహము ప్రతిధ్వనివలె క్షణికమైన దనియు, ఆండజ జరాయుజ స్వేదజ, ఉద్భిజరూపమున, జీవుడు నరక, మృగ, ప్రేత, అసుర, నర, దేవతాకృతిని జన్మించుచు చచ్చుచుండుననియు నాత డెఱుంగును. జీవుల యొక్క కోర్కెల నడ్డగింపకుండుటయే నాప్రతిజ్ఞ, కాని రాజకుమారా! నీకోర్కె చెల్లించుట యందొక, ప్రమాదము కలదు. నే నెప్పుడు ప్రాణము విడుతునో, అప్పుడే నీతండ్రి, రాజును మరణించును. కావున బాగుగా యోచించుకొనుము. నాయనంతరము నీతండ్రిని బ్రతికింపగలవా రెవ్వరు నుండరు." అని బల్కెను. రాకుమారు డామాటలను విననట్లు, మౌనము దాల్చియుండెను. అంత నాగార్జునుడు నిర్మలచిత్తముతో ప్రాణత్యాగముచేయనుద్దేశించి, యొక యాయుధము కొఱకు అటు నిటు దిరిగి చూచి యేమియు గానక, తుదకొక శుష్కించినయొక తృణమును దీసికొని సునాయాసముగ శిరచ్ఛేదము గావించుకొని యుసురులు విడచెను.

"రాజ కుమారు డాఘోర కృత్యమును జూచి యతి సత్వరముగ నంత:పురమువైపు బరుగెత్తెను. ఇంతలో నాగార్జునుని విహారమున జరిగిన వృత్తాంతము నంతయు, నవలోకించిన ద్వారపాలకుడు సవిస్తరముగా రాజున కెరిగించెను. అత్తరి రాజును దు:ఖము నాపుకొనలేక వ్యాకులచిత్తుడై యుత్తర క్షణమందు ప్రాణములు విడచెను.

"కోసల దేశమునుండి నైరృతి దిక్కుగా 300 లీల (60 మైళ్ళు) దూరముననున్న (పోలోమోలో కీలీ) భ్రమరగిరి శిఖరమును జేరబోయితిమి. ఏకాంతప్రదేశమున నున్న యాపర్వతము, తక్కిన వానికంటె యున్నతముగ నుండి, నడుమ నడుమ కనుమలు లేక నొక్కటే ఱాయితో గూడుకొని మిక్కిలి యేటవాలుగనుండు గట్లు గలిగియున్నది. నాగార్జున బోధిసత్త్వుని కొఱకు సాద్వహ మహారాజు నీపర్వతమునందు, నడుమువరకు సొరంగమును త్రవ్వించి మార్గమును జేసెను. ఆసొరంగము చివర ననగా, కొండనడుమనొక, సంఘారామమును (బౌద్ధుల మఠము) నిర్మించెను. ఆ సొరంగము 10 లీలు (6 మైళ్ళు) నిడివి గలిగియున్నది. ఆ కొండక్రింది నుండి మేము సొరంగమును బ్రవేశించు మార్గము గానక, పైకి చూచునప్పుడు నేటవాలుగ నుండిన యా యెత్తైన పర్వతముచుట్టును, పొడవునను, సొరంగములవలె నుండు గుహలను జూచితిమి. ఆ సొరంగమందు, నడచుట కనుకూలములుగ నుండి యిరుప్రక్కల స్థంభములు గలిగి, పొడవుగా నున్న విహారములును, ఎత్తైన గోపురముల క్రింద వసారాలుగల ఐదంతస్తుల కట్టడము నొకదానిని జూచితిని. ఆ యంతస్తులలో నొక్కొక్క దానియందు నాలుగేసి విహారములు గలవు. విహారములకు నడుమ వానిని చుట్టుకొను పడసాలలు (లేక వసారాలు) గలవు. ఆ విహారములందొక్క దానియందు సువర్ణమయములయిన బుద్ధుని జీవప్రతిమలు గలవు. అవి నవరత్న ఖచితములయి, చిత్ర విచిత్రాలంకారములతో శోభిల్లుచున్నవి. ఈ పర్వతాగ్రము నుండి, సెలయేటిధారల కాల్వలు ప్రతి యంతస్తునందును, మంటపముల గుండను, వసారాలచెంతను, విహారముల చుట్టును బ్రవహించుచు, కొండక్రిందకు బ్రవహించుచుండును. అచ్చటచ్చట గుహలపై గానవచ్చు సొరంగములు, పైనుండి లోపలిగుహలోనికి విహారములలోనికి, గాలిని వెలుతురును బోనిచ్చుచు, వాటిని కడు రమణీయములుగను, నివాస యోగ్యములుగను జేయుచున్నవి.

సాద్వహరాజీ పర్వతమును దొలిపించి సంఘారామ మును నిర్మించునపుడు అనేక వేలమందిజనులు హతులైరి. కోశము అర్థసూన్య మయ్యెను. అప్పటి కింకను తలపెట్టిన కార్యము సగమైన పూర్తి కాలేదు. అందుల కాతడు వ్యాకులచిత్తుడై దు:ఖింప నారంభించెను. రాజు ఖిన్నుడై మనోవ్యధనొందుచుండుట నాగార్జునుడు గాంచి యొకనాడు రాజా! నీ వేల ఖిన్నుడవై యున్నావని యడిగెను. సాద్విహు డందులకు విచారముతో "బోథిసత్త్వుడా! నేనీ మహత్కార్యమును పేరాసతో బుణ్యముకొరకై సంకల్పించితిని. ఇయ్యది మైత్రేయ బోధిసత్త్వుడు సుగతుడై యవతరించుదాక నిలచి యుండవలయునని నా యుద్దేశము కాని ఇది ఇంకను సగమైన పూర్తి కాలేదు. నా అర్థకోశము క్షీణించి నాజనులు అలసి, చనిపోవుచున్నారు. నా కేమియు దోచుటలేదు. అని విన్నవించెను. నాగార్జును డంతట "రాజా దుఖింపకుము; సయ్రపత్నము ఫలమును బడయక ఫొరాదు ధర్మమందు నీకుగల అభి నివేశమువలన నీ యభీష్టము తప్పక సిద్ధించును. భీతిల్లకుము, నిశ్చింతతో నీరేయి అంతపురమున కరిగి సుఖముగా నిద్రింపుము. రేపటి యుదయమ వ్యాహ్యాళికిబోయి, యీ చుట్టుప్రక్కల ప్రాంతమునంతయు బరీక్షించి, వచ్చిన పిదప నీతో నీ ప్రయత్నములగూర్చి ముచ్చటింతును" అని హెచ్చరించి యోదార్చెను. రాజా వాక్యములను విని, యానందభరితుడై నాగార్జునునికి బ్రణమిల్లి యధేచ్చం జనియెను. "పిమ్మట నాగార్జునుడు, తనరసశాస్త్రజ్ఞానమహిమచే చుట్టుప్రక్కలగల పెద్దబండఱాళ్ళ నన్నిటిని కరిగించి దానిలోనొక కషాయమునుబోసి బంగారపు ముద్దలుగా మార్చివేసెను. మరునా డుదయము రాజు ఎక్కడ జూచినను ఱాళ్ళవంటి బంగారపుముద్దలను గాంచి యాశ్చర్యము నొందుచు, తన సంతోషమును బట్టజాలక, నాగార్జునునికడ కేతెంచి ప్రణమిల్లి తాను అడవియందు ద్రిమ్మరుచు నచ్చటచ్చట సువర్ణమును ఱాతిబండలువలె, కుప్పలుగా బడియుండుట గాంచితి ననియు నది దేవతల మహిమచే జరిగెను గాబోలుననియు విన్నవించెను. నాగార్జును డపుడు 'రాజా! అట్లు దేవతాప్రభావముచేత జరుగలేదు; నీ మనశ్శుద్ధివలనను నీ కార్యదీక్షాపరత్వమువలనను గలిగిన ఫలమిది. ఇపుడు నీకు గావలసినంత ధనము సమకూరినదిగావున నీవు తలపెట్టిన పుణ్యకార్యమునకై దీని నంతయు వినియోగింపుము. నీ యభీష్టము ఫలించుగాక" యని ప్రత్యుత్తర మిచ్చి ఆశీర్వదించెను. రా జాబోధిసత్త్వుని యానతిచొప్పున నా ధనమును వినియోగించెను. సంఘారామము నిర్మింపగా మిగిలినదానితో, సువర్ణమణిమయాంచితములయిన బుద్ధదేవుని ప్రతిమలను జేయించి విహారములందుంచెను. ఇంకను మిగిలిన ధనము రాజ్యాభివృద్ధికై వినియోగించెను.

తాను నిర్మించిన యాసంఘారామములందు నివసించుచు బుద్ధదేవునికి బూజానమస్కారములు చేయుచుండుటకై సాద్వహుడు వేయిమంది భిక్షువుల ప్రార్థించి రావించెను! భిక్షువుల యుపయోగార్ధము నాగార్జునుడు బౌద్ధధర్మశాస్త్ర గ్రంథములను బోధిసత్త్వుల వ్యాఖ్యానములను, మున్నగు ననేక గ్రంథములను సంపాదించి యాసంఘారామమున నొక పెద్ద భాందాగారమును సమకూర్చెను. ఆతడు సంఘారామముయొక్క కడపటి యంతస్తునందు బుద్ధుని సువర్ణవిగ్రహమును, సూత్ర, శాస్త్ర గ్రంథముల, నుంచెను. మొదటి యంతస్తునందు, పరిశుద్ధలయిన బ్రాహ్మణులకు నివాస మిప్పించెను. నడుమ మిగిలిన మూడంతస్తులందును భిక్షువులనుండ నేర్పఱిచెను. ఈ సంఘారామము బూర్తి యగునప్పటికి సాద్వహరాజునకు తొమ్మిది కోట్ల సువర్ణములు ఖర్చుపడియెనని ప్రాచీన గ్రంథములు వాకొనుచున్నవి.

ఇట్లు కొంతకాలము గతించునప్పటికి బ్రాహ్మణులకును, బౌద్ధులకును కలహములు జనించెను. ఆకలహములను దీర్చుమని బౌద్ధులు, రాజునొద్ద మొఱబెట్టుకొన బోయిరి. ఇంతలో బ్రాహ్మణులు "మనతో వాగ్వాదమున గలహించి యీ బౌద్ధులు, రాజుతో నేరము చెప్పుట కేగినారు. కానిండ"ని, రోషించి దుర్మార్గులయి, అచ్చటి కావలివాండ్రు మొదలుగాగల పరిచారకులతో గలసి దుస్తంత్రములబన్ని, సమయముకొఱకు నిరీక్షించియుండి, సంఘారామమును పాడుచేసి, సింహద్వారమును సొరంగమును గప్పివేసి బౌద్ధసన్యాసులు లోనికి రాకుండ నిరోధించిరి. ఇట్లా బ్రాహ్మణులు సంఘారామమునుండి బౌద్ధులను వెడలగొట్టించి, తమ స్వాధీనము చేసికొనిరి. అప్పటినుండియు బౌద్ధబిక్షువులచ్చటగా పురముండినట్లు కానరాదు. దూరమున నిలువబడి యున్నతమైన యా పర్వతశిఖరమువంక జూచునపుడందలి సొరంగములును, గుహలును గానుపించెనుగాని, యా సంఘారామమును బ్రవేశించు సొరంగమును గాంచలైనైతిని. ఈ కాలమున నచ్చట నివసించెడి బ్రాహ్మణులు, తమలో రోగులయినవారికి వైద్య చికిత్సకొరకు బౌద్ధుల రావించవలసిన, వారి ముఖములకు ముసుగులు వేసియో, కండ్లకు గంతలుకట్టియో లోనికి గొంపోయి పని పూర్తియయిన తరువాత మరల నట్లే యీవలకు గొనివచ్చి కండ్లుతెరచెదరు. ఇందువలన బౌద్ధుల కెవ్వరికిని లోని కరుగుమార్గము తెలియరాదు"

యుఆన్ చ్వాంగ్, కోసలదేశమునుగూర్చి, వింతకథలను వర్ణించినాడు. ఇందీతడు, తాను ప్రత్యక్షముగ జూచినదానిని వినినదానిని గూడ నొక్కరీతిగ వర్ణించినాడు. అందువలన నీతడు వర్ణించిన యద్భుత విషయములు ఆవిశ్వసనీయములని మనకు దోచును. కావున వాటిపరీక్ష యావశ్యకము. కోసలమని మన యాత్రికుడు చెప్పియున్నాడు గాని యిది యుత్తరకోసలము గాక, దక్షిణ కోసలమనియు, నీకాలపు మధ్యమాగాణములలోని నాగపురముజిల్లాకు ఆగ్నేయముగా నున్న బస్తరురాజ్య భాగము విశాఖపట్టణ మండలములోని వాయువ్య భాగమును కలిసి దక్షిణకోసల మగు చున్నదనియు మనము నిశ్చయింపవచ్చును. పీనిషీ పండితుడు రచించిన మన యాత్రికుని జీవతమందుగూడ నీ దేశము దక్షిణకోసలమనియే ఉదహహరింప బడినది. దక్షిణ కోసలము పురాతనకాలపు విదర్భయని కన్నింగ్‌హాముగారి [7] యభిప్రాయము. ఫెర్గసనుదొర దక్షిణకోసలమును చిటిస్‌ఘడ్‌ ప్రాంతమునకు సరిబుచ్చుచు, వైర్ ఘడ్ లేక భాండక్ నగరములు కోసల రాజధానులుగావచ్చునని నిశ్చయించినాడు. ‡ కోసల మాధ్రదేశమున భాగముగా నుండె ననుటకు కొన్ని ప్రబల కారణములు గలవు. ఆంధ్రులు కోసలదేశమును, కోసలనాడని వ్యవహరించుటయు, నచ్చటినుండి వలస వచ్చిన బ్రాహ్మణులను కోసల (కాసల) నాటివారని బిలచుటయు, నెల్లరకు దెలిసిన విషయమే. అదియును గాక, శాతవాహనుల క్రింద నాంధ్రమహాసామ్రాజ్యము విస్తరించి నపుడు దక్షిణకోసలము నాంధ్రదేశాంతర్గత భాగమైపోయెను. దక్షిణకోసలదేశమును మనయాత్రికునికాలమున మహాకోసల దేశాధీశులగు సోమ వంశీయులో, ప్రవరపురాధీశ్వరులగు వాకాటక రాజులో, త్రిపురాధీపతులు కలచుర్యులో పాలించుచుండవలయును. ప్రస్తుత మాదేశచారిత్రమింతకంటె విపులముగ దెలియవచ్చుటలేదు.

కోసలరాజధానిని వర్ణించిన వెనుక, మన యాత్రికుడు నాగార్జున, దేవ బోధిసత్త్వుల గూర్చిన వృత్తాంతములను వర్ణించినాడు. నాగార్జు నాచార్యునిగూర్చి, యీదేశమునందును, చీనా తిబేతు దేశములందు చెప్పుకొనబడుచున్న గాధ లన్నియు నించుమించుగా నొక దాని కొకటి సరిపోవుచున్నవి. నాగార్జునుడు తాను సర్వజ్ఞడనని, జలపూరితమైన పాత్రను దేవుని కడకు బంపెననియు, నందు దేవుడు సూదిని, జాఱవిడచి, యాతని సర్వజ్ఞత్వమును ఛేదింప గల్గితినని సూచించి గర్వభంగము చేసెననియు, కొందఱు వాదిందుతురు. కాని చివరకు దేవుడు, తన యాజ్ఞానమును, అహంకారమును, తెలిసికొని పశ్చాత్తప్తుడై శిష్యునిగా ననుగ్రహించి యుపదేశింపుమని నాగార్జునుని వేడుకొనుటచే, నాగార్జునుని సర్వజ్ఞత్వము స్థిరపడుచున్నది. శాతవాహనుడను రాజు తన రాణియొక్క దుస్తంత్రమునకు లోనై యామె కడగొట్టు కుమారుడు సుశక్తి యను వానికి రాజ్యము కట్టబెట్టుటకై నాగార్జునుని జంపించి, యాతడు మరణించిన కాలముననే తానును మరణించెనని చీనా యాత్రికుడు ఈ చింగ్ కూడ చెప్పియున్నాడు. నాగార్జునుని ప్రాణముతో, తన ప్రాణము కూడ పోవునని యెఱింగనవాడగుటవలన, రాజు ఆతని మఠముచుట్టు, రక్షణార్థము కావలివారినుంచెను. నాగార్జునుడు చిరకాల జీవియనుటకు తిబేతు దేశ గ్రంథములుగూడ సాక్ష్యముగనున్నవి. తారానాధు డొకచోట[8] నాగార్జునుడు 529 సంవత్సరములు జీవించెనని చెప్పియున్నాడు. చీనా గ్రంథములం దతడు నాసికాపుటములగుండ నీరు త్రాగుట మొదలయిన యోగరహస్యముల సహాయమున, కొన్ని వందల సంవత్సరములు జీవించియుండెనని చెప్పబడి యున్నది. ఈతడు చిరకాల జీవియనుటలో సందియము గానరాదు గాని, పాశ్చాత్యులు కొందఱు దీనిని విశ్వసింపక, నాతని జీవితకాలము మహాయన సంప్రదాయ మభివృద్ధిలో నుండిన యైదాఱు శతాబ్దముల కాలమే బౌద్ధులచే మహాయన మార్గమును బోధించిన నాగార్జునునకు జీవిత కాలమని అతిశయోక్తిగా చెప్పియున్నారని వ్రాయుచున్నారు. ఈతడు రసవాదశాస్త్రజ్ఞడనియు, ఱాళ్ళను కరగించి బంగారముచేసెనన్న గాధయు చీనా తిబెతు గ్రంథములందు గానవచ్చుచున్నది.

నాగార్జునుడు చరిత్ర ప్రసిద్ధుడయ్యును, మనకు మిథ్యాపురుషుడును కల్పిత మహావ్యక్తియువలె గన్పట్టును. బౌద్ధమతముయొక్క యుచ్చదశయం దీతడు అద్భుతమైనట్టియు, దుర్గ్రాహ్యమైనట్టియు వ్యక్తివలె ప్రకాశించుచున్నాడు. పాలీసంస్కృత వాఙ్మయములం దీతడు మహామేథావియు సర్వజ్ఞునివలె గన్పట్టును. ఇత డన్యమతములపట్ల నిరుపమానమైన సహనము జూపిన మహనీయుడు. బోధిసత్త్వుడై మతప్రచారము గావించిన మహావీరుడు.


Watter Yuanchwang, Vol, II p, 204 మహాతత్వవేత్త, కవీశ్వరుడు, వాఖ్యాత, రసవాది, శాస్త్రజ్ఞుడు, దయాసముద్రుడు, బోథిసత్త్వులు బుద్ధులగుటకు బొందవలసిన దశ భూమికలలో, దుర్ఘటమైనట్టి ప్రథమ భూమికను బొందిన వాడగుటవలన నీతడు "ఏకోభూమీశ్వరు"డని బేర్కొనబడుచుండెను. ఈతని కీర్తి దిగంతవిశ్రాంతమై యుండినను, ఈతని జన్మస్థాన మెద్దియో, నెప్పుడు జన్మించెనో, యెపుడు నిర్యాణము చెందెనో, యాతని జీవిత మెట్లు, ఎచ్చ టెచ్చట గడసెనో దెలిసికొనుట కాధారములు గాన్పింపవు. కొంద ఱీతని జన్మస్థానము పశ్చిమదేశమని యూహింతురు గాని, యించుమించుగా దక్షిణ కోసలదేశ మీయన జన్మభూమి యని దోచుచున్నది. తిబెతు గ్రంథములం దీతడు చిరకాలము నాలందా సంఘారామమున బౌద్దవిద్యల నభ్యసించెనని దెలుపబడియున్నది. ఈతడు జన్మించిన ప్రాంతమాంధ్రభూమి నియు నితడాంధ్రుడనియు చాలామంది యభిప్రాయ పడుచున్నారు. ఈతడు బుద్ధుని నిర్యాణానంతరము, 200 సంవత్సరముల కని కొందఱును 500 సంవత్సరములకని కొందఱును, 400 సంవత్సరములకని కొందఱును, జీవించియుండెనని నిర్ణయించుచున్నారు. బౌద్ధుల ప్రథానగురుపరంపరలో నీతడు 13 వ లేక 14 వ ఆచార్యుడుగ బేర్కొనబడుచు క్రీ. పూ 212 వ సంవత్సరమున మరణించెనని చెప్పబడి యున్నాడు.[9] ఈత డించు మించుగ క్రీ. పూ. 492 వ సంవత్సరమున జననమొంది, శకరాజగు కనిష్కునికి సమకాలీనుడై యుండినట్లు రాజ తరంగిణి దెల్పుచున్నది; కుమార జీవునిచే రచింపబడిన లంకావతార సూత్రమందు అంత్యభాగమున, నీతని జీవితము భావికాలమున జరుగునట్లు స్పష్టముగ వర్ణింపబడినది.- కుమార జీవుడు నిశ్చయముగా, క్రీ. శ. 4వ శతాబ్దారంభకాలమున జీవించియున్నట్లు దెలియుచున్నది. గావున, నాగార్జును డంతకు బూర్వము మూడవశతాబ్దమునందు జీవించియుండవలయునని కొందఱి యబిప్రాయము. ఈతని గ్రంథములందు కనిష్కుడు, కినికుడు మొదలుగా గల రాజుల నామములు, వసుమిత్రుడు, అశ్వఘోషుడు, కాత్యాయనీపుత్రుడు, ధర్మగుప్తుడు, రాహులభద్రుడు, మున్నగు బౌద్ధమతాచార్యుల నామములు గానవచ్చుట జేసి, నాగార్జునుడు క్రీ.శ. మూడవ శతాబ్దమువాడని వాటర్సు పండితుని యభిప్రాయము[10] ; కాని యిదియును నిశ్చయము కాదు.

నాగార్జు నాచార్యునిచే రచింపబడిన గ్రంథములలో నిపుడు ఇరువది మాత్రమే మిగిలియున్నవి. అవియు గూడ చీనాభాషలో భాషాంతరీకరణములై యున్నవి. నిరీశ్వర వాదమును, ప్రతిపాదించుట జేసి బౌద్ధుల గ్రంథములన్నియు, నసత్యములనియు నప్రమాణములనియు మన దేశమున బ్రాహ్మణులచే దగ్ధముగావింపబడెను. ఈతనిగ్రంథములలో సుహృల్లేఖ యను పద్యకావ్యము కడు సుప్రసిద్ధమైనది. ఈకావ్యము తన పోషకుడగు శాతవాహనుడగు నాగార్జునునిచే ఉదయనునకు వ్రాయబడినదని తారానాధుడు దెల్పుచున్నాడు. ప్రపంచమునం దంతటను, సుహృల్లేఖకు వచ్చిన ప్రసిద్ధి, పూర్వకాలముననైన నేమి, మధ్యకాలమున నైననేమి మరియొక గ్రంథములకు రాలేదట. ఈగ్రంథ మొక పర్యాయము తిబేతు భాషలోనికిని, మూడుమార్లు చీనా భాషలోనికిని భాషాంతరీకరింప బడెనట! చీనా యాత్రికుడగు ఈ చింగ్ భరతవర్షమును సందర్శించి పోయిన కాలమున సుహృల్లేఖ జనులచే ముందుగా నీకాలమున కాళిదాసత్రయమువలె పఠింపబడు చుండెనని వ్రాసియున్నాడు †[11]. సుహృల్లేఖ తరువాత మిగుల ప్రఖ్యాతి గాంచినది "పజ్ఞాపారమిత శాస్త్రము." దీని చీనావారు చంగ్‌లూన్ అని బిలతురు. దీని ననుసరించి నాగార్జునుడు ప్రజ్ఞాప్రదీపశాస్త్రమును రచించెను. ఇది మహాయన శాఖకు జెందిన మాధ్యమిక సంప్రదాయము వారికి ప్రమాణ గ్రంథము. మాధ్యమిక సంప్రదాయము వారనగా, సర్వము శూన్యమని వాదించు బౌద్ధులు. నాగార్జునుడు "దశభూమి విభాగశాస్త్రమను" ఇంకొక గ్రంథమును రచించెను. బోధిసత్త్వుని జీవితమునందు గల దశభూమికలను వివరించి, యందుత్తమమైనదియు భిక్షుక వృత్తిని స్వీకరించి నపుడుగలుగునదియునగు ఆనందావస్థయను ప్రమోదిత భూమికను గూర్చియు, బిక్షుకు డైనపిదప పాపమునుండి విముక్తుడైనప్పడు ప్రవేశించు విమల భూమికను గురించియు ప్రశ్నోత్తర రూపకమైన గ్రంథమిది. ఇందు బోధిసత్త్వుడు, బుద్ధుడగుటకు బూర్వము, దు:ఖమున మరల బడిపోకుండ ననుభవించు అమితాయు స్వర్గముయొక్క సౌఖ్యమును గూర్చి మనోహరమైన స్తోత్రకదంబము గలదు. హీనాయన సంప్రదాయము ప్రకారము మనుష్యుడు జీవమును, మృత్యువును దాటి, అతీతుడై నాశ మొందుటయే నిర్వాణపదవని నాగార్జునుడు నమ్మియుండెను. సకల జీవకోటియొక్క నిర్వాణసిద్ధికై, (దు:ఖనివారణమునకై) యీ గ్రంథమునం దొకచోట నాగార్జునుడు ప్రార్థన శ్లోకములను రచించెను. అవి మిక్కిలి మనోహరములై యున్నవి. ఇక నాగార్జునాచార్యుని గ్రంథము లన్నిటిలో "ప్రజ్ఞాపారమిత సూత్ర వ్యాఖ్యశాస్త్రము" మిక్కిలి యత్కృష్టమైనది. కుమారజీవుడీ గ్రంథమును చీనాభాషలోనికి క్రీ.శ. 485 వ సంవత్సరమున భాషాంతరీకరించెను. ఈ గ్రంథము మహా ప్రజ్ఞాపారమితసూత్రము పైన ద్వితీయము, నుద్వేలమగు వ్యాఖ్యయని పేరొందెను.

నాగార్జునుడు మహాయన బౌద్ధమతమునకు ప్రముఖుడును ప్రవర్తకుడనిమాత్రమేగాక, విదేశములందు స్వదేశమునందునుచిరకాలజీవియని దిగంతమైన యశమును సంపాదించి యుండెను. ఈతడు బ్రాహ్మణ విద్యలయందుగూడ నుత్తీర్ణుడై వైదికమతమునందలిరహస్యముల నభ్యసించెను. మూలికల యొక్క గుణప్రభావముల గ్రహించి ఆయుర్వేదశాస్త్రము నభివృద్ధి పఱచెను. జ్యోతిష, సిద్ధాంతముహూర్త శాస్త్రములందు పూర్ణమయిన ప్రజ్ఞను సంపాదించెను. రసవాదము నభ్యసించి ప్రజ్ఞావంతు డయ్యెను. మంత్ర తంత్రశాస్త్రము లభ్యసించెను. ఆతడు ఘనవైద్యుడనియు నేత్రచికిత్సయందాతనితో సరిపోల్పదగినవారు ప్రపంచమునందు సయితము లేరను ప్రఖ్యాతి చీనాదేశమువఱకును వ్యాపించెను. నేత్రరోగ చికిత్సలను గూర్చియు, మూలికాదుల ప్రభావముల గూర్చియు, నీతడు రచించిన శాస్త్రములు చీనాభాషలో నున్నవి. బాణుని హర్షచరితమునం దొకచోట పాతాళము నేలు నాగేంద్రుడు "మందాకిని" యను ముత్యాలహారమును మన నాగార్జునుని కొసంగెననియు, నది సర్వవిషసంహారిణి యనియు, దాని స్పర్శచే సర్వజంతుకోటికి సమస్తమగు బాధలు నివారణమగుననియు జెప్పబడెను. బుద్ధుని యుపదేశములందలి హీనాయన మహాయన మార్గములందు, సమానసిద్ధాంతములను నేర్చి యీతడు నూతనధర్మమును ప్రచారము గావించెను. ఈతడు పరమ పురుషార్ధమును బడయుటకు, బౌద్ధులచే విధింపబడిన, చతుర్విధమైన సర్వ శూన్యత్వము, బాహ్యశూన్యత్వము, బాహ్యార్థానుమేయత్వము, బాహ్యార్థప్రత్యక్షత్వము, అను వాదములను బోధించెను. స్వయముగ నీతడు దశభూమికలో ప్రథమ భూమికీశ్వరుడై, యేకో భూమీశ్వరుడని ప్రసిద్ధి వడసెను. ఈతని గురువులపేరు రాహులభద్రుడు. అతడుబౌద్ధమతము స్వీకరించిన బ్రాహ్మణుడు.

కోసలదేశమునేలు రాజుపేరు, (సో టో-పోహా, అనగా) సాద్వహుడని, యుఆన్‌చ్వాంగ్ చెప్పుచున్నాడు. ప్రాచీన చీనాలిపిలో సో-టో-పో-హా యని వ్రాయబడిన సంస్కృత పదము శాలివాహన లేక సాతవాహన, గావచ్చునని పండితుల యభిప్రాయము. ఈచింగ్ అను చీనాయాత్రికుడు కూడ, నాగార్జునుని పోషకుడు (దానపతి షా-టో-పో-హ-నా-అనగా) శాతవాహన వంశజుడని చెప్పియున్నాడు, ఆతని పేరు షి-యేన్-టేక-యని కూడ బేర్కొనియున్నాడు. చరిత్ర దెలుపునంతవఱకు ఆంధ్రసామ్రాజ్యమును శాతవాహన వంశము ఇంచుమించుగా నాలుగు శతాబ్దములకాల మేలి యుండెను. ఇంతమంది శాతవాహునులలో నాగార్జునుడే శాతవాహనునిచే బోషింపబడియెనో దెలిసికొనుటకు యుఆన్‌చ్వాంగ్ దోడ్పడుటలేదు. ఇక ఈచింగ్ చెప్పిన షి-యేన్-టీ-క యను పేరు సంస్కృతమున జేతక లేక జీవాతక యను పదమునకు సరిపోవుచున్నది[12]. కాని యీపేరుగల రాజెవ్వరును చరిత్రయందు గాన్పించుటలేదు. తిబేతుదేశ గ్రంథములందు నాగార్జునుని మిత్రుడును, దానపతియగు వాని పేరు శాతవాహనుడు, లేక అంతివాహనుడు అని వివిధములుగా బేర్కొన బడియున్నది. ఆ వంశముననాతడు శంకరుడు, ఉదయనుడు, లేక ఉత్రాయనుడు, అను పేరులకు సరిపోవు తిబేతుపదముల బిలువబడియున్నాడు. మరియు జేతకుడు లేక జీవాతకుడనియు కూడ నొకచోట బేర్కొనబడి యున్నాడు. తిబేతు దేశచరిత్రకారుడును మిక్కిలి ప్రాచీనుడునగు తారానాధుడు[13], నాగార్జునుని పోషకుడైన రాజు యౌవనమున జేతకుడని బిలువబడుచుండిన ఉదయన మహారాజని చెప్పియున్నాడు. శాతవాహన వంశము దక్షిణాపథమున క్రీ. పూ 220 మొదలుకొని క్రీ. శ.230 వఱకును పరిపాలిచియుండెను. ఈ నడుమ కాలమున నాగార్జును డెపుడుజీవించియుండెనో ఉదయన నామాం కితుడగు రాజును గుర్తింపలేకపోవుటవలన నిర్ణయింప వీలుగాకున్నది. నాగార్జునుని పోషించిన చక్రవర్తి, యజ్ఞశ్రీ శాతకర్ణి యని శ్రీయుత చిలుకూరి వీరభద్రరావుగారు నిర్ణయించిరి, గాని వారుజూపిన యాధారములు తృప్తికరములుగ లేవు. ఎట్లయినను ఆతడు చిరంజీవియై కొన్ని శతాబ్దములు బ్రతికి యుండినట్లు విశ్వసింపకపోయినను క్రీ. శ. మొదటి శతాబ్దమున నిర్వాణము బొందెననిమాత్రము నిర్ణయింపవచ్చును. ప్రస్తుత మాతని కాలనిర్ణయము ఇంతకంటె నిస్సంశయముగ నిర్ణయింప సాధ్యము గాదు.

ఇక నీబోధి సత్త్వుడు, కోసలదేశమునకు నరువదిమైళ్ళ దూరమునున పో-లో-మో-లో-కీ-లీ యను పర్వతము మీద నున్న సంఘారామమున జీవయాత్ర గడపెనని, యుఆన్‌చ్వాంగ్ వ్రాయుచున్నాడు. పో-లో-మో-లో-కీ-లీ యనునది భ్రమరగిరి యని సంస్కృతమున సరిపోవుచున్నది. మన యాత్రికు డిచ్చిన కొలతనుబట్టి దక్షిణకోసలరాజథాని భాండక్ నగరమని నిశ్చయించి యచ్చటనుండి కొలచిచూచిన యెడల నీపర్వతమఠము చాందాకు నాగ్నేయ మూలగా మాణిక్యదుర్గమునకును, నరదా నదికిని సమీపమున నుండ వలయును, గాని యచ్చట నీయత్రికుని వర్ణనలకు సరవచ్చు పర్వతశిఖరముగాని సంఘారామముగాని గానరాదు. ఇక ఫెర్గసనుగారు, భాండక్ నగరసమీపమునగల విద్యాసాని పర్వతమే యుఆన్ చ్వాంగ్ వర్ణించిన భ్రమరగిరిసంఘారామమని నిరూపింప బ్రయత్నించిరిగాని, మనయాత్రికుని వర్ణనల కచ్చటి ప్రాచీనగుహలు సరిపోవుట లేదు. యుఆన్‌చ్వాంగీ భ్రమరగిరినల్లని శిఖరముగల పర్వతమనిగూడ వర్ణించియున్నాడు. భ్రమరగిరి, పార్వతి, దుర్గలవంటి శక్తిస్వరూపిణులగు దేవతయొక్కగిరియనిగాని నల్లతుమ్మెదవంటిశిఖరమనిగాని అర్థము చేయవచ్చును. యుఆన్ చ్వాంగ్, భ్రమరగిరిని వర్ణించుటలో కొలతలను తప్పుగా నిచ్చి పొరబడినాడు. అట్లు కాదేని యాతని సి-యూ-కీ చీనాపాఠమును పండితులు తప్పుగాచదివి యపార్థము చేసుకొని వ్రాసి యుండురు. మన యుఆన్ చ్వాంన్ వలెనే యంతకు బూర్వము వచ్చియుండిన పాహియాను గూడ తాను కాశీనగరమున నుండి నపుడీ భ్రమరగిరికి సరిపోవు పర్వత సంఘారామమును గూర్చి వినినదానిని స్వయముగ జూచినవానివలె వర్ణించి వ్రాసినాడు. కాని యాత డీపర్వత శిఖరమును జూడనేలేదు. ఆతడు వ్రాసిన వృత్తాంతముగూడ మిక్కిలివింతగా నున్నది. ఆత డీశిఖరము పో-లో-యు అనగా పారావతమను అర్థము వచ్చు బేరున బిలచినాడు. ఆకొండలో పావురపు గూండ్లవలె గుహలుండుటచే, పారావతమను పేరుగలిగి యుండవచ్చు ననుకొనుట యొక యూహ! కాని యాతడు పారావతమని బిలచుట కింకొక కారణము కూడనుండును. తిబెతు దేశ బౌద్ధగ్రంథములందు నాగార్జునుడు శ్రీపర్వత సంఘారామమునకు భిక్షువుల రావించి, నివాసము లేర్పఱిచెననియు, వార యుపయోగార్థము ఒక గొప్పపుస్తక భాండారమును సమకూర్చెననియు వ్రాయబడియున్నది. శ్రీపర్వతమునకు పారావతమను పేరు. అట్లు చీనాయాత్రికుని వ్రాతలందు పొరబాటుగా బడియుండవచ్చును. మఱియు నాగార్జునుడు ది-పా-ల-గిరి అని తిబెతువారిచే బిలువబడుచుండిన శ్రీపర్వతముపై చిరకాలము నివసించి నిర్వాణము బొందెనని తిబెతు గ్రంథములు వాకొడుచున్నవి. బౌద్ధమందు సార్వత శ్రీపర్వతనునియు సంస్కృత వాఙ్మయమున శ్రీశైలమనియు, యుఆన్ చ్వాంగ్‌చే భ్రమరగిరి యనియు నదాహరింపబడిన పర్వతరాజము కర్నూలు (కందనోలు) మంటలములో కృష్ణానది నానుకొని, పైని వ్రేలాడుచున్న శిఖరముపై భ్రమరాంబా మల్లిఖార్జునుడు దేవులకు దేవాలయమును గలిగి సుప్రసిద్ధబ్రాహ్మణ శైవపుణ్యక్షేత్రములలో నొక్కటియై చుట్టుప్రక్కల నన్నిశిఖరములకంటె ఎత్తైన శ్రీశైలమే మన యాత్రికునిచే బేర్కొనబడిన భ్రమరగిరియని నిశ్చయింపవచ్చును. ఈ శ్రీశైలము ద్వాదశ శివలింగ క్షేత్రములలో నొకటియై చుట్టుప్రక్కల నచ్చట యుఆన్ చ్వాంగ్ వర్ణనలకు సరిపోవుచు అంతస్తులవలె నుండు గుహలను, విహారములను సొరంగములను గలిగి నిర్జనారణ్యభూమియందు చొర నశక్యముగానున్నది కావున నీశ్రీశైలమఠమే పూర్వకాలమున నాగార్జునాచార్యుని నివాసస్థానమని నిర్ణయింపవచ్చును. ఇయ్యది యాంధ్రసామ్రాజ్య రాజధానియగు థాన్య కటకమునకు (ధరణికోట) పశ్చిమముగా 102 మైళ్ళ దూరమునను కర్నూలుకు 82 మైళ్ళదూరమునను మధ్య పరగణాల లోని మాణిక్య దుర్గమునకు దక్షిణముగా 250 మైళ్ళదూరమునను అనగా మన యాత్రికుని కోసల రాజధానికి బహుదూరముగను ఉన్నది. కావున నిక మన పురాతత్వ పరిశోధకులు శ్రీశైలమును తత్ప్రాంతపు గుహలను బరిశీలించి యేమైన శాసనాదులను వెతికి దీయగలిగినచో నాగార్జును డేకాలపు వాడో యాతని దానపతియగు శాతవాహనవంశజుడగు ఉదయన నామాంకితు డేకాలపువాడో నిస్సంసయముగ నిర్ణయింప గలుగుదుము. అట్టిది ప్రకృతమందు దుర్లభము.

కోసలదేశమునుండి మనయాత్రికుడు దక్షిణాభిముఖుడై మహారణ్యములగుండ 900 లీలు (180 మైళ్ళు) ప్రయాణముచేసి, ఆంధ్రదేశమును సమీపించెను. ఆంధ్రదేశమును గూర్చి మన యాత్రికు డిట్లువ్రాసియున్నాడు.

"ఈదేశము మూడువేల లీలు (610 మైళ్ళు) వైశాల్యము గలిగి యున్నది. రాజధానియు నిరువది లీలు వైశాల్యముగలది. ఈనగరమును జనులు (పిన్-గీ-కి-లో) వేంగీపురమని బిలచెదరు. ఈప్రాంతము మిక్కిలి సారవంతమై యెల్లప్పుడు సేవ్యము చేయబడుచు సర్వసస్య సమృద్ధమై యున్నది. ఈదేశముష్ణ ప్రదేశము. జనులు సాహసము గలవారు. కాని తొందరపాటు గలవారుగా నున్నారు. వీరి భాషయు వాక్యముల కూర్సుయు, మధ్యదేశము వారి భాషకంటె భిన్నముగా నుండును. కాని వీరుపయోగించు అక్షరముల స్వరూపము మధ్యదేశములవారి యక్షర స్వరూపమును ఇంచుమించుగా బోలియుండును. ఇక్కడ నరువది సంఘారామములును అందు మూడువేల భిక్షువులు నున్నారు. ముప్పది దేవాలయములు గూడ గలవు. ప్రజలలో బ్రాహ్మణులును, జైనులును గూడ గలరు."

"వేంగిపురమున కనతి దూరమున నొక సంఘారామముగలదు. అందు అంతస్తులుగల హర్మ్యములును, మనోహరములయి విచిత్రములయిన అలంకారములచే శోభిల్లెడి గోపురములును స్థంభములును గల యితర గృహములును చాల గలవు. ఇచ్చటనొక బుద్ధుని విగ్రహము కలదు. దానిని సత్స్వరూపమును శిల్పి తన నేర్పరితనమునంతయు జూపి చెక్కెనో యన్నంతగా కళలూరుచు మనోహరముగా నున్నది. ఈసంఘారామమున కెదురుగా వందలకొలది యడుగుల ఎత్తుగల స్తూపమొకటి గలదు. ఈస్తూపమును, సంఘారామమును అచలుడను అర్హతుడు[14] నిర్మించెను.

"ఈసంఘారామమునకు (మఠము) నైరృతిదిక్కుగా కొంచెముదూరమున నింకొక స్తూపమును అశోకవనమును గలవు. పూర్వకాలమున తథాగతుడిచట నివాసము చేయుచు తనప్రజ్ఞచే చాలమందిని బౌద్ధులనుగా జేయజాలెనట.

"ఇక్కడనుండి నైరృతిదిక్కుగా నిరువది లీలుదూరమున నొంటరిగానున్న కొండపై నొక శిలాస్తూపముగలదు. ఇక్కడ జినబోధిసత్త్వుడు న్యాయద్వార తారకశాస్త్రమను "హేతువిద్యాశాస్త్రమును" రచించెను. బుద్ధుని యనంతర మీ బోధిసత్త్వుడు బౌద్ధమతము నవలబించి శ్రమణకుడై, కాషాయ వస్త్రముల ధరించెను. పిదప జితేంద్రియుడై, నిష్కాముడై, చిరకాల మభ్యసించి బ్రహ్మజ్ఞానమును సంపాదించెను. అతని జ్ఞానశక్తియు, తపశ్శక్తియు నపారములు. అతడు మహాశక్తి సంపన్నుడైనతరువాత నిరాధారముగ నున్నలోకముపై జాలిచెంది బౌద్ధధర్మములను జనులకు బోధింప సమకట్టెను. హేతువిద్యాశాస్త్రయగాధమై, దురవగాహమై, బహుశ్రమచేత గాని సుబోధము గాకుండుటచే నది ముక్తిమార్గ మన్వేషించు వారికి నిరుపయోగముగా నుండుట గాంచి యాతడు పర్వత గుహలందు జొచ్చి ధ్యానపరుడై యోగసమాధిలో నుండియాశాస్త్రమును సులభముగా సాధించుటకు దగిన గ్రంథమును రచింప యోచించెను. ఇట్లుండ నాతని తపోనిష్ఠకు పర్వతములు కనుమలు కంపించెను. ఆకసమంతయు ధూమముచేతను కాఱుమబ్బుల చేత నావరింపబడియెను. అంతట నాపర్వతము నాశ్రయించి యుండు అధిదేవత యాబోధిసత్త్వుని ఆకసముమీదకు గొంపోయి యిట్లు పలికెను. "పూర్వకాలమున తథాగతుడు ప్రపంచమును నిర్వాణమార్గము వైపు త్రిప్పబ్రయత్నించెను. లోకముపై జాలికొని యాతడు హేతువిద్యా శాస్త్రమును వెల్లడించెను. కాని తథాగతుడు నిర్వాణము బొందిన తరువాత నాశాస్త్రము లోకమునకు దుర్గ్రాహ్యమయ్యెను. కావున నోజిన బోధిసత్త్వుడా! నీజ్ఞాన తపములు అపారములు; సర్వజ్ఞుడ వైన నీవు యాశాస్త్రమును పూర్ణముగా నెఱంగి దాని మహిమను లోకమునకు బోధింపుము."

"పిమ్మట బోధిసత్త్వుడు, ప్రపంచము నంతటను జ్యోతిర్మయము చేయగల వజ్రసమాధియందు బ్రవేశించి ధ్యానతత్పరుడై యుండెను. ఆ సమయమున నాదేశము నేలు రాజు జినబోధి సత్త్వుని సమీపించి జన్మరాహాత్యమును బడయుమని ప్రార్థించెను."

జినబోధి సత్త్వుడపుడు "రాజా నేనుదురవగాహమైన హేతువిద్యా శాస్త్రసూత్రములను స్పష్టముచేయుటకై సమాధియందు ప్రవేశి చితిని. నాహృదయమిపుడు జన్మరాహిత్యమును గోరుటలేదు. సమ్యక్ సంబోధికై యెదురు చూచుచున్నది" అని ప్రత్యుత్తర మిచ్చెను."

"రాజ తట జన్మరాహిత్యఫలమే మహర్షుల యాశయము. మూడువిద్యలనెఱిగి భూర్భువస్సు నల్లోకములనుండి విముక్తుడగుటకన్న ఫలమేమి గలదు. తప్పక మీరు జన్మరాహిత్య ఫల మనుభవి తురుగాక" యని విన్నవించెను.

"జినబోధిసత్త్వుడు రాజు చెప్పిన మాటలకు సంతుష్టాంత ర గుడై ధ్యాన సమాధియందు ప్రవేశించి జన్మరాహిత్యఫలమును బడయనెంచెను. కాని యాతడొక్కడే యా విజ్ఞానమును సంపాదించి ముక్తి నొందుటవలన లోకమున కేమియుపకారమునుగలుగదనియు బోధిసత్త్వునియొక్క స్వార్ధపరత్వమునకు చింతిల్లి యాతనిపై జాలిగలిగి మంజుశ్రీ బోధిసత్త్వుడాతని ముంగిట సాక్షాత్కరించి యిట్లని యాజ్ఞాపించెను. "అయ్యా! నీవేల మొదట సంకల్పించిన పుణ్యకార్యమును విరమించితివి. నీవొక్కడవే నిర్వాణమును బొంద నితరులందఱు అజ్ఞానాంధకారమునుండి సంసార బంధముల దగుల్కొని తిరుగాడ వలసినదేనా? నీవు నీనిర్మల జ్ఞానమును లోకమునకు బోధింపుము. నివు నేర్చిన న్యాయశాస్త్రమును మాత్రమునేగాక మైత్రేయ బోధిసత్త్వుని యోగాచార్య భూమి శాస్త్రమున బోధింపుము." జినబోధిసత్త్వుడపుడు మంజుశ్రీ బోధిసత్త్వుని యాజ్ఞ శిరసావహించెదననిచెప్పి నమస్కరింప, నా దివ్యపురుషు డంతర్థానమొందెను. పిమ్మట జనుడు చాలకాలము హేతువిద్యాశాస్త్రమును, యోగాచార్యభూమి శాస్త్రమును కడు శ్రద్ధతో నభ్యసించి, తన శిష్యకోటిలో పెక్కుమందికి ఉపదేశించెను. ఆతని శిష్యవర్గములో జాలమంది తమసమకాలీనులలో నంతటివారు యోగశాస్త్రము నభ్యసించిన వారు లేరని ప్రఖ్యాతి గడించిరి.

"ఇచ్చటినుండి చిట్టడవులతో నిండియున్న ప్రదేశము గుండ దక్షిణముగా జనిన ధాన్యకటక (టో-న-స-కి-చీ-కియా.) మును బ్రవేశింతుము"

దక్షిణ కోసలమునుండి మన యాత్రికుడు చాళుక్య రాజ్యమగు వేంగీ దేశమును గూర్చి బోయెను. కృష్ణాగోదావరీ నదుల మధ్యనుండు ప్రదేశము వేంగీదేశమని వ్యవహరింపబడుచుండుట చరిత్రప్రసిద్ధము. ఈ వేంగీనామము రాజధానియగు వేంగీపురమును బట్టి గల్గెను. వేంగీపురము ఏలూరునకు దూర్పుగా నెనిమిదిమైళ్ళ దూరమునకు కొల్లేరునకు వాయువ్యముగా నాలుగుక్రోసుల దూరమున నున్నది. వేంగీపురము క్రీ.శ. పూర్వమనేక శతాబ్దముల క్రితమునుండి ప్రసిద్ధమగు నగరమై యొప్పుచుండెను. ఆంధ్రరాజధానియగు ధాన్యకటకమునకు వెనుక నింతటి విశాలమైన నగరము నింతటి మనోహరమైన పట్టణము దక్షిణాపధమున నింకొకటి పూర్వము లేకుండెను. ఇపుడీ నగరము భూకంపాదులచే నశించిపోయి శిధిలా వశిష్టమయి పాడయి రూపు మాసియున్నది. ఇచ్చటి పురాతన చిహ్నములు ప్రాచీనపు టౌన్నత్యమును దలపునకు దెచ్చుచున్నవి.

వేంగీపురము పల్లవుల కాలమున రాజధానిగా నుండెను. వారికి వెనుక సాలంకాయన పల్లవులకును, పిమ్మట విష్ణుకుండినులకును రాజధానిగ బరగెను. చాళుక్యులీదేశమును జయించిన తరువాత కొంతకాలము పిష్ఠపురము రాజధానిగా మార్చబడినను చాళుక్యరాజులలో రెండవ వాడగు జయసింహుని కాలమున వేంగీపురమునకు తిరిగి రాజధాని మార్చబడెను. యువాన్ చ్యాంగ్ వేంగీపురమున కేతెంచినపుడు వేంగీదేశమును కళింగములో చీపురుపల్లి ప్రాంతము వరకును తూర్పు చాళుక్య పరిపాలనము క్రింద నుండెను. అపుడు తూర్పు చాళుక్యరాజ్యమును బాలించుచుండిన వాడు సర్వసిద్ధి బిరుదాంకితుడగు జయసింహవల్లభుడు.

వేంగీపుర ప్రాంతమున నుండినట్లు చెప్పబడిన సంఘారామము ఇపుడు గానరాదు. ఇదియును కాల మహిమచే శిధిలమయి జీర్ణమై పోయియుండును. వేంగీపుర ప్రాంతము నిపుడు పెదవేగి చిన్నవేగి దెందులూరు సేనగూడెము మున్నగు గ్రామముల చెంత గానవచ్చు శిధిలమయిన దేవాలయములు కట్టడములు, మున్నగువాటిలో నేది మన యాత్రికుడు వచించిన శిలాస్తూపమో నిర్ణయింప జాలము. ఈప్రాంతమున అసంఖ్యాకములుగ దేవాలయములు కట్టడములును గలవు. ప్రాచీన వేంగీపురమునకు నాలుగైదు మైళ్ళు దూరమున ఏకాంతమయిన శిఖరముపై నొక సంఘారామము గలదనియు, నచ్చట పెక్కు గుహలున్నవనియు, నందు పూర్వము జిన్న బోధిసత్త్వుడు నివాసముగానుండి హేతువిద్యాశాస్త్రమను తర్కశాస్త్రమును రచించెననియు మనయాత్రికుడు చెప్పియున్నాడు. ఈకాలమున ఏలూరున కుత్తరముగా 20 మైళ్ళుదూరమున కామవరపుకోట చింతగుంటుపల్లియను గ్రామము గలదు. ఇచ్చట సమీపముగా జీలకర్ర గూడెమను పల్లె గలదు. ఈసమీపమున భూగర్భమున పూడ్చుకొని పోయినవి పది పండ్రెండు స్తూపములు గాన్పించు చున్నవి. ఇంకను సమీపమునగల కొండలో నక్క డక్కడ నైదారు గుహలు వరుసగాగలవు. ఇవి పూర్వము బౌద్ధ సన్యాసులు నివసించు గదులని యూహింప వలయును. ఆ సమీపమున శిధిలమయి గన్పట్టు నొకవిశాల సభామంటపమునందు స్థంభము లిప్పటికి గాన్పించుచున్నవి. అదియే పూర్వము విహారమును, చైత్యమంటపము నై యుండెనని యూహింపవచ్చును. ఇక్కడకు సుమారు నూరు గజముల దూరమున నొకకొండ ముఖమున వలయాకారముగ నొకగుహ దొలువబడి గాననగు చున్నది. ఆగుహకు నడుమ నెత్తిమీద గోపురము గలదు. ఆ గుహయొక్క నడిమికొలత పదునెనిమి దడుగులుండును. కుడ్యములు సుమారు పదునైదడుగులెత్తుండును. గోపురము యొక్క గర్భము నాలుగడుగు లెత్తును అడుగున అడ్డకొలత పండ్రెండడుగులు నిడివియు నుండును. ఈగోపుర శిఖరము నుండి క్రిందకు గుహయొక్క ఎడమభాగమునకు ఒక శిలాస్థంభమొకటి పూర్వము లేచియుండెను. ఇప్పు డాశిలాస్థంభము అచ్చటగానరాదు గాని దాని చిహ్నములు గాన్పించును. ఆస్థంభముయొక్క అడుగుభాగము బ్రాహ్మణులచే శివలింగాకృతిని చెక్కబడి శివాలయము క్రింద మార్చబడి యున్నది. పూర్వపు పైస్థంభము యొక్క పైభాగము ఇప్పటికిని శివలింగమునకు సూటిగా నెత్తిపైగోపురమునందు నడుమ కణువువలె వ్రేలాడుచున్నది. గుహాలయ సింహద్వారముపై గుఱ్ఱపు డెక్కవలె నుండు కవాటము గాన్పించును. ఇచ్చటి స్తూపములును గుహలును విహార నిర్మాణయుగములకు బూర్వము అనగా క్రీ.శ. రెండవశతాబ్దాంతమున నిర్మింపబడి యుండవలయును.

మన యాత్రికునిచే వర్ణింపబడిన వేంగీపుర సమీపమున నుండి గుహలు, చైత్యము స్తూపములును, గుంటుపల్లి జీలకర్రగూడెముల సమీపమున నుండి నట్లూహింప వలయును. ఇచ్చట జీవయాత్రను గడపిన జినబోధిసత్త్వుడు దిజ్ఞ్నా గాచార్యుడని తిబెతు గ్రంథమూలమున దెలియుచున్నది. చీనాభాషయందు పూర్వము యువాన్ చ్యాంగ్ వ్రాసినది యీకాలపు వర్ణక్రమమునుబట్టి దిజ్ఞ్నాగ బోధిసత్త్వుడని చదు వదగినను యీకాలపు ఫ్రెంచిపండితులు కొందఱు జినయనియు చిన్నయని వివిధములుగా పొరబాటు పడిరి. దిజ్ఞ్నాగాచార్యుడు వేంగీపురపీఠమున కధ్యక్షుడనియు మహాతత్త్వవేత్త యనియు తార్కికుడనియు, యోగ శాస్త్రజ్ఞుడనియు చాల బేరెన్నిక గనినవాడు. ఈతని జీవితము డుర్మార్గులగు అసహన పూరితులునగు బ్రాహ్మణమతస్థులచే నాతని గ్రంథములతో దగ్ధము గావింపబడి విస్మరింపబడినది. ఈత డాంధ్రుడట. ఈతని జీవితమును గూర్చి దెలిసిన కొంచెమునుగూడ తిబేతు దేశ గ్రంథములమూలమున దెలియుచున్నది. దక్షిణమున కాంచీపుర సమీపమున సింహవక్త్రమను గ్రామమున నొక బ్రాహ్మణకుటుంబమున నీతడు జనన మొందెను. సింహవక్త్రపుర మాకాలమున నచ్చట నేగ్రామమునకు సరిపోవునో తెలియరాదు. మొదట నీతడు బ్రాహ్మణవిద్య నభ్యసించెను. కొంతకాల మయిన తరువాత వత్సిపుత్ర సంఘమునకు జెందిన హీనాయన సాంప్రాదాయబౌద్ధమతము నీతడు స్వీకరించెను. కాని ఏకారణముననో గురువుయొక్క యాగ్రహమునకు బాత్రుడై సంఘారామమునుండి వెడల గొట్టబడెను. పిదప నీతడు వసుబంధుని సంఘమును జేరెను. ఒడి వీనసమను నగరమున భోరశైలమందు చాల కాలముండి ఒకప్పుడు నాలందా సంపూరామమునకు వాగ్వాదము కొఱకు పయనమయ్యెను. అచ్చట చాలమంది అన్య సంప్రదాయకులతోడను ఇతర సాంఘికులతోడను బ్రాహ్మణులతోడను వాదించి గెలుపొందుచు వచ్చెను. ఇతడు ఒడివీసనగరమునకు దిరిగి వచ్చిన తరువాత హేతువిద్యా తర్కశాస్త్రమునుగూర్చి యొకశాస్త్రము రచింప దలపెట్టెను. ఆసంకల్పమంకురించి నపుడు భూకంపమును గొప్పవెలుగును బ్రహ్మాండము బ్రద్దలగునంత మహాధ్వనియు నయ్యెనట. అదిచూచిదిజ్ఞ్నాగుడు భయపడుచుండ, మంజుశ్రీ బోధిసత్త్వుడు ప్రత్యక్షమై భయమువాపి, యాతనికి నూతన విషయములను బోధించి ప్రోత్సహించెనట! అంతట నాతనిని యాదేశపు రాజు మిక్కిలిగౌరవించి పోషించెను. దిజ్ఞ్నాగుడు మొదట నివసించుచుండిన భోరశైలమును, ఒడివీస నగరమును బంగాళా దేశమందున్నవి. దిజ్ఞ్నాగుడు చాలకాలము వేంగీదేశమున నివసించిన వాడగుటవలన, యీతని పోషించిన రాజులు విష్ణు కుండినులనిగాని, నాలంకాయనులనికాని యూహింహవచ్చును.

దిజ్ఞ్నాగాచార్యుడు అర్హతుడైన అచలునిచే నిర్మింపబడిన వేంగీపుర ప్రాంతపు గుంటుపల్లి చైత్యము, స్తూపములందే, చాలకాలము నివసించి యుండెను. కాని యపుడపుడు కొంతకాల మజాంతాగుహలందును, ఓరుగంటి సమీపమున గల సంఘారామము నందును కాలము గడుపుచు వచ్చెను. మల్లినాథసూరి తనమేఘసందేశ వ్యాఖ్యయందు దిజ్ఞ్నాగుని గూర్చి చేసిన ప్రశంసను విశ్వసించినయెడల మనమాతడు, మహాకవి కాళిదాసునికి సమకాలీనుడైయుండి యాతని గ్రంథములను కడు కాఠిన్యముతో విమర్శించి యుండెనని యూ హింపవలయును. ఆలంకారికుడును, కాశ్మీరవాసియునగు భామహుడీతనికి సమకాలీనుడని కొంద ఱందురు. కాని యిది విశ్వసనీయముగా గన్పట్టుట లేదు. ఇప్పటి చరిత్ర కారులు దిజ్ఞ్నాగా చార్యుని క్రీ.శ. 5, 6 శతాబ్దముల నడుమ, జీవించి యుండినట్లు నిర్ణయించు చున్నారు. ఈతని గ్రంథములు మొదటి పర్యాయము క్రీ.శ. 560 సంవత్సరమున చీనాభాషలోనికి భాషాంతరీ కరణము గావింపబడెను. తర్కవిద్య నభ్యసించు విద్యార్థుల కుపయుర్తములయిన, ఎనిమిది గ్రంథముల నీతడు తర్కశాస్త్రమునందు రచించెనని వాని బేర్లను ఈచింగ్ యాత్రికుడు పేర్కొని యున్నాడు. దిజ్ఞ్నాగుడు ఒక శాస్త్రమును గూర్చి వ్రాసి మరియొక శాస్త్రమునుగూర్చి వ్రాయలేదని చెప్ప నక్కరలేదు. ఆతడన్ని శాస్త్రములను, పరిశీలించిన వా డగుటచే నాతని గ్రంథములు నూటికి మించియున్నవి. 'న్యాయ' సిద్ధాంతము నీతడభ్యసించెను. కాని బ్రాహ్మణ నైయ్యాయికులీతని భాష్యము నంగీకరింపరు. ఈతడు ప్రజ్ఞా పారమితా శాస్త్రమును బూర్ణముగ నలవడ జేసికొనెను యోగాభ్యాస రహస్యములును గ్రహించి, మానవుని జన్మ రాహిత్యమునకు మార్గములను అన్వేషింప సమకట్టెను. దిజ్ఞ్నాగుని, ప్రజ్ఞా పారమితా శాస్త్రముపై వ్యాఖ్య ఆర్య ప్రజ్ఞా పారమితా సంగ్రహ కారికా వివరణ' యని బిలువబడుచు, తిబెతు భాషయందు 'త్రిరత్నదాస' యని భాషాంతరీకరింపబడి యున్నది. ఈతడు హేతు విద్యాశాస్త్ర మునకు వ్యాఖ్య రచింపబూని ధ్యానపరుడై సమాధియందు ప్రవేశించి నపుడును, తనయొక్క జన్మ రాహిత్యము కొఱకు బ్రయత్నించి నపుడును, మంజు శ్రీ బోధిసత్త్వు డీతనికి బ్రత్యక్షమై యుపదేశము గావించి, యాతని నాస్వార్థ పరత్వమునుండి, బోధిసత్త్వుని మార్గమునకు ద్రిప్పెనని చెప్పబడి యున్నది. ఈకధ లోనివిషయము, దిజ్ఞ్నాగాచార్యుడు హీనాయన సంప్రదాయమును వదలి మహాయన సంప్రదాయము నవలంబించు సమయముగా అర్థము చేసికొనవలయును. దిజ్ఞ్నాగునివలె, పూర్వము వసుమిత్రు డనువాడు గూడ దేవతలచే అర్హతుడు గాకుండ, బోధిసత్త్వుని మార్గమునకు మరల్ప బడెనట. ఏలనన అర్హతుడైనవాడు హీనాయన సంప్రదాయము ననుసరించి, జన్మ రాహిత్య ఫలమును బొందునుగాని బోధిసత్త్వుడై లోకము నుద్ధరింపడు. లోకమునకై తనప్రాణ మర్పించలేడు. బోధిసత్త్వుడైనవా డుత్తరభూమి యందు బుద్ధుడగునని మహాయన సంప్రదాయము.

యుఆన్‌ చ్వాంగ్ ఆంధ్రదేశమును సందర్శించునాటికి మనదేశమున దొరికిన శాసనముల బట్టి, యా కాలమున వేంగీమండలమును పూర్వచాళుక్యాన్వయుడు మొదటి జయసింహవల్లభ మహారాజు పరిపాలించుచుండినట్లు తెలియుచున్నది. క్రీస్తుశక మేడవ శతాబ్దాదివఱకు నాంధ్రదేశములో వేంగీవిషయము విష్ణుకుండినవంశపు రాజులును, కృష్ణకు దక్షిణ భాగమును, చిల్లరపల్లవ రాజకుటుంబములును, కళింగదేశ మనబడు నిప్పటి విశాఖపట్టణము గంజాం మండలములును బస్తరు సంస్థానమున్న ప్రాంతమును, పూర్వ గాంగవంశరాజులును బరిపాలించుచుండిరి. పశ్చిమ చాళుక్యరాజగు రెండవ పులికేశి సత్రాశ్రయవల్లభమహారాజు, పూర్వాంధ్రదేశమును జయించి, క్రీ.శ. 607 సంవత్సరప్రాంతము తన ప్రియానుజుడగు కుబ్జవిష్ణువర్థనుని తనకు ప్రతినిధిగా పాలింప నియమించి, దిగ్విజయార్థమై దక్షిణాభిముఖుడై, పల్లవరాజధానియగు కాంచీపురము మీదికి జనెను. కుబ్జవిష్ణువర్థనుడు, పిష్ఠపురము రాజధానిగా జేసుకొని క్రమక్రమముగా వేంగీమండలము నంతను, కళింగదేశములోని దక్షిణభాగమును, కృష్ణానదికి దక్షిణమునగల విషయములను జయించి స్వాధీనము జేసుకొని రాజ్యమును విస్తరింపజేసి క్రీ.శ. 615 వ సంవత్సరమునాటికి సర్వస్వతంత్రమైన చిన్న రాజ్యమును నిర్మించి, మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పరమభట్టారకాది బిరుదమును ధరించి, పశ్చిమచాళుక్యరాజగు సోదరునికి, కప్పము గట్టుట మాని స్వాతంత్ర్యమును బ్రకటించెను.

ఇత డాంధ్రుల చరిత్రయందు పూర్వచాళ్యుకాన్వయ వంశకర్తగా బరిగణింపబడుచున్నాడు. ఈతని వంశీయు లాంధ్రదేశము నైదు శతాబ్దములకాల మవిచ్ఛిన్నముగా బరిపాలించియుండిరి. ఇతని వంశములోనివాడు, ఆంధ్రులకు చిరపరచితుడును పూజ్యుడును, ఆంధ్రమహాభారత కృతిపతియునగు రాజరాజనరేంద్రుడు. కుజ్జవిష్ణువర్థనుని కుమారుడు, మొదటి జయసింహవల్లభుడు. క్రీ.శ. 633 వ సంవత్సరమున సింహాసన మధిష్ఠించి 666 వఱకును బాలించెను. ఈతడు సింహాసన మెక్కిన రెండుమూడు సంవత్సరములనాటికే యుఆన్ చ్వాంగ్, ఆంధ్రదేశమును జూడ నేతెంచియుండెను. అప్పటికి దేశమున, జనసంఖ్య చాల తక్కువగా నున్నదని, చీనా యాత్రికుడు వ్రాయుచున్నాడు. అందుల కారణము రెండు మూడు తరములనుండి యాంధ్రదేశ మప్పటికి యుద్ధములలో మునుగుచు దేలుచున్నట్లు చరిత్ర వాకొనుచున్నది. పూర్వ చాళుక్యులు, దేశమును జయింపకపూర్వము వేంగీరాజ్యమున శాంతిలేకుండెను. కళింగరాజులయిన పూర్వగాంగేయవంశజులు వేంగీపాలకులయిన విష్ణుకుండినులతో, సర్వదా యుద్ధములు సలుపుచుండిరి. కళింగులకును విష్ణుకుండినుల కాత్మబంధువులయిన వాకాటక, కాలచుర్యులకును ప్రబలవైరమగుటచే, విష్ణుకుండినులతో, కళింగరాజులకు వైర మావశ్యక మయ్యెను. ఈ యుభయ లాకారణమున, నొకరి రాజ్యము లొకరు ఆక్రమించుకొని పగ దీర్చుకొనుటకు సర్వదా ప్రయత్నించుచుండిరి. మరియు సత్యాశ్రయుడు, వేంగీరాజ్య సింహాసనముపై సోదరుని నిలిపినతరువాత, చాళుక్యరాజ్యమును సుస్థిరము చేయుటకై, కుబ్జవిష్ణువర్ధనుడు, చిన్నచిన్న రాజకుటుంబములు తోడను, సామంతాధివుల తోడను బహుకాలము యుద్ధములు చేసియుండ వచ్చును. ఆతని తరువాత జయసింహమహరాజును, రాజ్యాభివృద్ధికై, వరుసగా కృష్ణకు దక్షిణమునగల దేశమును జయింపనారంభించెను. ఇట్లు సుమారొక యర్థశతాబ్దమువఱకు నెడతెగని పోరాటములలో మునిగియున్న దేశమున జనసంఖ్య స్వల్పముగా నుండక బహుళముగా నెట్లుండును? ఇన్ని కారణములకుతోడు చాళుక్యరాజులకు ప్రక్కలో బల్లెములక్రింద, పశ్చిమమున రాష్ట్ర కూటులును, దక్షిణమున పల్లవులును తలయెత్తి మెదలుచు నూపిరి సలుపకుండ నొత్తిడి కలుగజేయుచుండ, జనసంఖ్య నభివృద్ధిలో లేకుండుటయం దాశ్చర్య మేమిగలదు?

యు ఆన్ చ్వాంగ్, వేంగీదేశమునకు వేంగీనగరము రాజధానియని దెలుపుచున్నాడు. కుబ్జవిష్ణువర్థనుడు పిష్ఠపురమును రాజధానిగా జేసుకొని యుండగా నాతని కుమారుడు, నగరును వేంగీపురమున కేల మార్చెనో ఎఱుకపడకున్నది. అయినను కారణ మిట్లూహింపవచ్చును. అప్పటివఱకు దేశమును బాలించిన విష్ణుకుండినవంశమున నంకురము లేకుండ నూడబెఱికి వేయుటకును, కృష్ణానదికి దక్షిణమున నున్న ప్రాంతమును వశపఱచు కొనుటకును ఈశాన్యదిశనుండి, కళింగ గాంగరాజుల వలన కలుగు యొత్తిడికి దూరముగ నుండుటకును అనుకూలమైనదని వేంగీపురమునకు రాజధాని మార్చి యుండును.

యు ఆన్ చ్వాంగ్, కళింగనగరమునుండి బయిలుదేరినది మొదలుగా దాను జూచినవాటిని విన్నవాటిని సవి స్తరముగా వర్ణింపని కతమున, నాకాలమున బ్రసిద్ధము లయిన జైనబ్రాహ్మణ క్షేత్రములు, నగరములు, మత, రాజకీయ పరిస్థితులు వివరముగా దెలియకున్నవి. ఎందుచేతనో కాని, శ్రీకాకుళమున కనతిదూరమున నున్న సాలెహుండాము సంఘారామముగాని, అనకాపల్లికి సమీపముననున్న సంఘారామముగాని, రామతీర్థాలుగాని,పిష్ఠపురముగాని తక్కుంగల బ్రాహ్మణ, జైనక్షేత్రములుగాని యాతని వ్రాతలందు గానబడకున్నవి. వీని కంతకు నొకటిరెండు కారణములు పొడసూపు చున్నవి. దేశము జనశూన్యమై యుండుటచేత నెక్కడ నేది గలదో చూపించు వారు లేకపోవుచుండుట మొదటిది గావచ్చును. మనయాత్రికునికి బౌద్ధమతము గాక అన్యమతములందు గల అసహనము రెండవది గావచ్చును. ఉత్తర హిందూస్థానమున నప్పటి కింకను బౌద్ధమతము మంచి యాదరణ బొందుచు, నుచ్చదశయం దుండెను. అచ్చట నాత డెక్కడెక్కడకు బోయినను, రాజులు, మహారాజులు, బౌద్ధధర్మావలంబకులయి, బిక్షువులను రావించుచు 'ధర్మ' వ్తాప్తికి సదుపాయములను గల్పించుచు, సంఘారామములను మంచిస్థితియం దుంచుచు బోషించుచుండుట జూచుచుండెను. ఇక దక్షిణాపథమం దట్లు గాకుండెను. రాజు లెక్కడకు బోయినను బ్రాహ్మణమతావలంబకులుగా నుండిరి. శైవ, వైష్ణవ, జైనమతములను జనులు విశేషముగా నాదరించుచుండిరి. వారికి బౌద్ధముపై నాదరము సన్నగిల్లుచుండెను. అంతేగాక, మంత్రశాస్త్రమునందును, శాక్తేయమునందును, ఐంద్రజాలికవిద్యలందును, జనుల కెక్కువగా ప్రమాణబుద్ధి ప్రబలియుండెను. ఆకాలమునాడు వేంగీదేశమున మంత్ర వేత్తలు, ఐంద్రజాలికులు, పెక్కుమంది వర్థిల్లుచుండినట్లు, తారానాధుడను తిబెతుదేశీయుడు తన బౌద్ధధర్మ చరిత్రయందు దెలిపియున్నాడు. కావున తన కభిమానమైన బౌద్ధమతముపై నాదరములేని, పాపిష్టి దేశమని యు ఆన్ చ్వాంగ్, ఆంధ్రదేశమును సవిస్తరముగా వర్ణింపడని యూహించు కొనవచ్చును.

వేంగీదేశమునుండి మన యాత్రికుడు దక్షిణాభిముఖుడై చని మహాంధ్రమని బ్రశంసింపబడు ధాన్య కటక (ధరణికోట) దేశమునకు బోయెను. అతడీ దేశము నిట్లు వర్ణించెను.

"ధనకటకదేశ మారువేలలీలు వైశాల్యమును రాజధాని నలువదిలీలు వైశాల్యమును గలిగియున్నవి. భూమి సారవంతమై చక్కగా ఫలించుచు, సర్వసస్య సమృద్ధమై యున్నది. దేశము చాల భాగము చెట్లు చేమలు లేని యెడారివలె నున్నది. పట్టణములందును జనులు విశేషముగాలేరు. దేశముష్ణ ప్రదేశము. ఇచ్చటి ప్రజలు పసుపు పచ్చగానుండి చామన చాయగలవారు. భయంకర స్వరూపులును, తొందరపాటు గలవారుగా నున్నారు. కాని విద్యా గోష్ఠియన్న, వీరలకు చాలయిష్టము. ఈప్రాంతమున ననేక సంఘారామ ములుగలవు. కాని, యవియన్నియు చాలభాగము భిక్షుక శూన్యము లయి, శిధిలములయియున్నవి. ఇపుడు, మంచి స్థితి యందున్న విరువది మాత్ర ముండును, వానియందు దాదాపు వేయిమంది సన్యాసులున్నారు. వీరందరు "మహాసాంఘిక" శాఖకు జెంది, అభిధర్మపిటకము నభ్యసించువారుగా నున్నారు. బ్రాహ్మణ దేవాలయములు నీదేశమున నూఱు వఱకు గలవు. అన్యమతస్థులగువారు గూడ నీదేవాలయములందు బూజలొనర్తురు.

ఈ దేశపు రాజధానికి తూర్పువైపున నొకకొండపై 'పూర్వశైల సంఘారామ మను యొక మఠముగలదు. నగరమునకు పడమట దిశనంటి యున్న మరియొకకొండపై 'అపరశైలసంఘారామ' మను నింకొక మఠము గలదు. బుద్ధునిప్రీతి కొఱకు పూర్వపు రాజొకడు ఈమఠములను కొండలదొలిపించి కట్టించెను. ముందుగా నాతడు కొండను లోయగాదొలిపించి మార్గము నేర్పఱచెను. పిదప నామార్గమున కిరుప్రక్కలను గుహల దొలిపించి విశాలమయిన మందిరములను చావళ్ళను నిర్మింప చేసెను. ఈపర్వతము నావహించియుండు దేవతలీ సంఘారామములను భద్రముగా జూచుచుండెను. పూర్వము మహర్షులనేకు లిచ్చటికేతెంచి కొంతకాలము నివసించి తిరిగి పోవుచుండిరి. బుద్ధుడు నిర్వాణము నొందినతరువాత వేయి సంవత్సరములవఱకు బౌద్ధులు (శ్రామణులు) ఇచ్చట కేతెంచి వర్షకాలమిందు గడపి అర్హతులై ఆకాశమున ఎగిరి స్వదేశ ముల కేగుచుండువారు. అట్లు ఒక వేయిసంవత్సరములు వఱకు బౌద్ధులు బౌద్ధసన్యాసులు కలిసి యిచ్చట నివసించుచుండిరి. కడచిన నూఱు సంవత్సరములునుండి మాత్రము పూర్వమువలె బిక్షువులు వచ్చుటలేదు. ఆకారణమున పర్వతదేవతలు క్రూర మృగముల యాకృతిగొని యొకప్పుడు కోతివలెను మరి యొకప్పుడు తోడేలువలెను బౌద్ధులకు గానుపించి ఈసంఘారామములకు బాధాకరు లగుచుండుటచే సన్యాసులు వచ్చుట మానివేసిరి. ఇపుడీ దేశము చాలవఱకు నిర్జనమై భయంకరముగా నున్నది.

"ఈ నగరమునకు దక్షిణమున నొక కొండకు పెద్ద సొరంగము గలదు. అందొక అసురుని హర్మ్యముగలదు. ఆహర్మ్యమునందు, శాస్త్రజ్ఞుడగు భావ వివేకస్వామి మైత్రేయబోధిసత్త్వుడు, సుగతుడై యవతరించు నందాక ధ్యాన సమాధి యందుండి వేచియున్నాడు. మహాతపశ్శాలి యనియు, జ్ఞానియనియు, సర్వశాస్త్ర పారంగతుడనియు భావవివేకుడు చాల ప్రఖ్యాతి నొందెను. బాహ్య వేషముచేత నీతడు కపిలుని సాంఖ్యశాస్త్రవాదివలె గన్పట్టినను, హృదయమందు మాత్రము నాగార్జునుని మహాయన సంప్రదాయము నవలంబించి యుండెను."

"పూర్వము భావవివేకుడు మగధదేశమున నివసించుచు తన మహిమచే వేలకొలది జనులకు బౌద్ధ మతావలంబకులుగా జేయుచున్న ధర్మపాలుని పాండిత్యమును గూర్చి విని, యాతనితో వాగ్వాదము చేసి గెలుపొందవలయునని సంకల్పించుకొని శిష్యసమేతుడై మగధదేశమును గూర్చి పయన మయ్యెను. పాటలీపుత్రమును జేరునప్పటికి ధర్మపాలుడు,బోధివృక్షము (రావిచెట్టు) క్రింద కూర్చుండి ధ్యానతత్పరుడై సమాధియందున్నాడని వినెను. అంతట భావవివేకుడు తన శిష్యులనుజూచి "ధర్మపాలుడు బోధివృక్షముక్రింద కూర్చుండి సమాధియం దున్నవాడట. మీ రాతని కడకుబోయి నా మాటలుగా నిట్లు బల్కుడు. "ధర్మపాల బోధిసత్త్వుడు, బుద్ధుని ధర్మమును ప్రపంచమున కుపదేశించు చున్నాడు. అజ్ఞానులను జ్ఞాన మార్గమునకు ద్రిప్పుచున్నాడు. శిష్యుల చేతను, బౌద్ధులచేతను ధర్మపాలుడెంత పూజింప బడుచున్నను ఆతని తపస్సును ధ్యానమును దీక్షయు వృధయై నిష్పలములయ్యెను. కావున ధర్మపాలుడు బోధివృక్షము క్రింద కూర్చుండి నంతమాత్రమున బుద్ధుడు కాజాలడు. కావున నీ విపుడు సమాధియందు బ్రవేశించి జ్ఞానివిగమ్ము. పిమ్మట దేవతలకు మానవులకు గూడ నీవు మార్గదర్శకుడ వగుదువు" అని చెప్పి పంపెను.

"ధర్మసాల బోధిసత్త్వుడా మాటల నాలకించి "మానవజీవితము అనిత్యమైనది. దేహము బుద్బుదప్రాయము. అహోరాత్రములు నేను మోక్షసాధనమును చింతన చేయుచు ధ్యానించు చున్నాను. నీతో వాదము చేయుటకు నాకు సావకాశము లేదు. కావున నీవు నచ్చినచోటుకే తిరిగి పొమ్ము" అని బదులు చెప్పెను. తుద కెంతమంది రాయబారులు సందేశము గొనివచ్చినను ఉభయులకు సమావేశము గాలేదు.

పిమ్మట భావవివేకుడు స్వదేశమునకు దిరిగి వచ్చి నిష్కళంకమైన జీవితమును గడపుచు ధ్యాన సమాధియందు బ్రవేశించి "మైత్రేయుడు సుగతుడై వచ్చునందాక నాసందేహములను బాపు వారెవ్వరు? యని చింతింపసాగెను. ఇట్లు చింతానిమగ్నుడై యుండిన కాలమున, భావవివేకుడు ఆహారమును నీటిని పరిత్యజించి నిష్ఠాపరుడై మూడు సంవత్సరములహోరాత్రములు, అవలోకితేశ్వర బోధిసత్త్వుని మ్రోల నిలచి హృదయ ధారణిమంత్రమును పఠించి ధ్యానించెను. అట్లు మూడు సంవత్సరములు గతించునప్పటికి అవలోకితేశ్వరుడు మోహనమూర్తితో ప్రత్యక్షమై "శాస్త్రపారంగతుడా, నీ వేమి కోరినన్ను ధ్యానించితివి" అని ప్రశ్నించెను. భావవివేకు డపుడు "నా దేహమును, మైత్రేయుడు సుగతుడై వచ్చునందాక నిలచియుండున ట్లనుగ్రహింపుము." అని ప్రార్థించెను. అవలోకితేశ్వరు డంతట "ఓయీ! మానవుని జీవితము క్షణక్షణమును విపత్తులకు లోనై యున్నది. ప్రపంచ మంతయు శూన్యమైనది. కావున నీవు జీవితముయొక్క పరమార్థమును, 'తుషిత' స్వర్గమును బొంది మైత్రేయుని బోధనల నాలకింపుటగా గ్రహించి యాతడు బుద్ధుడై యవతరించిన వెనుక అతనివలన నిర్వాణ మార్గమున గ్రహించెదవు గాక యని హెచ్చరించెను. భావవివేకు డామందలింపులను విని "దేవా! నామనస్సు నిశ్చలమైనది. నేను నీనిశ్చితార్థమును వీడను" అని బదులు చెప్పెను. అవలోకితేశ్వర బోధిసత్త్వుడపుడు "అటులయినచో, నీవు ధాన్యకటకదేశముకరుగుము. ఆదేశపురాజధానికి దక్షిణమున నొక కొండలో సొరంగ మొకటికలదు. అందు వజ్రపాణియను పర్వతదేవుడు గలడు. ఆశక్తినుద్దేశించి వజ్రపాణిధారణి స్తోత్రమును జపింపుము. ఆతడే నీయభీష్టము నెరవేర్పగలవాడు" అని బోధించెను.

భావవివేకుడీ మహాంధ్రదేశమునకు వచ్చి వజ్రపాణి దేవునుద్దేశించి ధారణిని మూడు సంవత్సరము లేకచిత్తముతో జపించి వజ్రపాణిని ప్రత్యక్షము చేసికొనెను. వజ్రపాణి భావవివేకుని జూచి "శాస్త్రజ్ఞుడా! నీవేమి కోరి నాగూర్చి ఘోరమగు తపస్సు చేయుచున్నాడవు?" అని యడిగెను. అంతట నాతార్కికుడు "మైత్రేయ బోధిసత్త్వుడు వచ్చునందాక నేనీదేహముతో నుండవలెనని కోరుచున్నాను. అవలోకితేశ్వర బోధిసత్త్వునిచే ప్రేరితుడనె నిన్ను ప్రార్థింప వచ్చితిని. దేవా నీ వీయుపకారమును చేయనోపుదు వేని యనుగ్రహింపుము." అని ప్రార్థించెను.

"వజ్రపాణి దేవుడు సంతుష్టాంతరంగుడై భావవివేకుని కొక మంత్రము నుపదేశించి యిట్లనెను. ఈ పర్వతమునం దసురుల ప్రాసాదమున్నది. నీ వీమంత్రమును విధ్యుక్తముగా జరిపించినచో నాహర్మ్యముయొక్క శిలాద్వారములు వాని యంతట నవె తెఱచికొనును. అంతట నీవు లోనికి బ్రవేశించి మైత్రేయుని యాగమమునకై నిరీక్షించుచుండుము. "భావవివేకుడపు డయ్యా నేనీ అంధకారమున నివసించుచుండ సుగతుని యాగమనమెట్లు తెలిసికొనగలను." అని ప్రశ్నించెను. అంతట వజ్రపాణి, "నేను సుగతుని రాక నెరిగించి, లోకమునకు చాటుదును. నీ వంతట, వెలికి రావచ్చును." అని బల్కెను.

"ఇట్లు భావవివేకుడు, వజ్రపాణిచే బోధితుడై తదేకధ్యాన నిష్ఠతో నామంత్రమును మూడు వర్షములు జపించెను. మంత్రోచ్ఛారణచే పవిత్రీకృతములయిన ఆవగింజలను కొండపై జల్లెను. వెంటనే, యానగము నందు బ్రహ్మాండమయిన సొరంగమొకటి గాన్పించెను. ఆసొరంగము జూచుటకై అనేకమంది జనులు వచ్చిరి. కాని వా రెవ్వరును నాసొరంగమును విడచి పోజాల నట్లు ఆతనికిపొడగట్టెను. వారి స్థితిని జూచి భావవివేకుడు, స్థిరచిత్తుడై, యాగుహసింహద్వారముయొక్క గడపనుదాటి లోనికి బ్రవేశించి, తన్నవలోకించుచున్న జనసమూహమువైపు ముఖము ద్రిప్పి చిరకాలమునుండి మైత్రేయుని సందర్శనము కొరకై ధ్యానించితిని, పూజలు చేసితిని, ఇప్పటికి దేవతల కరుణా ప్రభావము వలన, నాశపధము నెర వేరినది. నేను మైత్రేయుని జూడబోవు చున్నాను. బుద్ధునియొక్క యుపదేశమును బొంద గోరువారు, నాతోగూడ నీ గుహాంతరాళమును బ్రవేశించుడు, రండు." యని బిగ్గరగా నాహ్వానించి పల్కెను. "అచ్చట మూగినజనులు అతని వాక్యములను విని యాశ్చర్య భయముల నొక్కమారుగా బొందిరి. పిమ్మట "ఇది పాతాళము, యిక్కడ పాములుండును. మమ్ముల నవి చంపివేయును. మేము నీతోడ రాజాలమ"ని చెప్పిరి. భావవివేకుడు వారినట్లు ముమ్మాఱు పిలచెను: ముమ్మాఱును, వారాతని అనుగమించుటకు సంశయించిరి. కాని యార్వురు మాత్రము అతనివెంట రా సన్నద్ధులయిరి. జనసమూహమంతయు దనవంకయు, దనయార్వుర శిష్యులవంకయు, భీతచిత్తులయి నివ్వెరపాటుతో దిలలించుచుండ భావవివేకుడు సొరంగములోనికి నడిచిపోయెను. వెంటనే పర్వతసొరంగముచుట్టును శిలాద్వారములు మూసికొనిపోయెను. వెనుక మిగిలినవారు తమ తెలివిమాలినతనమునకు సిగ్గిలుచు, భావవివేకస్వామి పలుకులు నాలకింప మైతిమిగదా యని పశ్చాత్తాపముతో నిండ్లకు మరలిపోయిరి."

ఇక్కడనుండి దక్షిణముగా వేయిలీలు రెండవందల మైళ్ళు ప్రయాణముచేసి మేము చోడమండలము (చు-ళి-య) బ్రవేశించితిమి."

మన యాత్రికుడు ధనకటక దేశమును "తే-న-క-చే-క" అని పేర్కొనియున్నాడు. తే-న-క-చే-క పదము సంస్కృతమున ధనకచకము. లేక ధనకటక మగుచున్నదని పండితు లంగీకరించిరి. ఈధనకటకము తిబెతు దేశ గ్రంథములలో ధాన్యరాసులుండు పట్టణమని పిలువబడుచున్నది. ధాన్యకటకము ధనకటకము, ధాన్యనాటీపురము, ధాన్యవతీపురము అను పేరులు అమరావతీ నగరమునకు సంబంధించిన పేర్లుగా క్రీ.శ. 10, 11, 12, 13 శతాబ్దముల కాలమునాటి విచ్చట లభించిన శిలాశాసనములందు గానవచ్చుచున్నవి. ఒకప్పుడీ పేరులన్నియు నీ కాలమున ధరణికోటయని బరగుచున్న నగరమునకే వర్తిలుచుండెను. భరతఖండమునందలి పురాతన పట్టణములలో పాటలీపుత్రము తరువాత విశేష ప్రఖ్యాతిగాంచిన దీధాన్యకటక నగరము. ఇది అయిదు శతాబ్దములకాల మాంధ్ర మహాసామ్రాజ్యమునకు రాజధానియై, మహోన్నత వైభవమును గాంచెను. ఆపూర్వపు వైభవము నేడు అమరావతి ధరణికోట మంటిదిబ్బలయందు, పాడయి శిధిలావశిష్టములయిన కట్టడములందును గానవచ్చుచు నచ్చెరువు గలిగించుచునే యున్నది.

ధాన్యకటక ప్రాంతమును యు ఆన్ చ్వాంగ్ వ్రాతను బట్టి, కన్నింగ్‌హాముదొర దొనకొట్టదేశమనియు, ధరణికోట ధారణికోటగాని ధరణికోటగాదనియు, భావవివేకస్వామి, వజ్రపాణి ధారణిని జంపించుటచే ధారణికోట యయ్యెననియు విపరీతముగ సిద్ధాంతముచేసినాడు[15]. ధనకటక నగరముండు దేశమగుటచే యు ఆన్ చ్వాంగ్ ధనకటక నగరనామము నా దేశమునకు ముడిపెట్టెను. కాని రాజధానిపేరు నిశ్చయింపలేదు. ఇదిగాక మరియొకచోట మనయాత్రికుడు ధనకటక దేశమును మహాంధ్రదేశమని బిలచెదరని చెప్పియున్నాడు. ఒకప్పుడు మహాంధ్రదేశమునకు ధాన్యకటకము రాజధానియై యుండెను, గాని యు ఆన్ చ్వాంగ్ వ్రాతలబట్టి జూడ నేడవ శతాబ్దాదిని విజయవాడ రాజధానిగ నుండినట్లు దోచెడివి[16]. అదియునుగాక ధాన్యకటక దేశము చాళుక్య రాజ్యములో జేరియుండక వేరు రాజ్యముగ నుండెనేమో తెలియరాదు. అట్లున్నట్లు, ఇంతవఱకు శాసన ప్రమాణము గానవచ్చుటలేదు. యువాన్‌చ్వాంగ్ వ్రాసిన దానిని బట్టి యాతడు ధరణికోటను గాని అమరావతీస్తూపమందుగాని గాంచి యుండలేదనియు, నాతడు వర్ణించిన రాజధాని విజయవాడ యనియు నిర్ణయింపవచ్చును. ఆతడు చెప్పిన వర్ణనలన్నియు చక్కగా విజయవాడకు సరిపోవుచున్న వనియు, ధరణికోటకు సరిపోవుటలేదనియు, నీప్రాంతమునంతయు సూక్ష్మముగా బరిశీలించిన రాబర్టు నూయలు, జేమ్సుబర్గెన్, బాన్వెలుదొరల యభిప్రాయము యదార్థముగ గన్పట్టుచున్నది[17]. మరియు యు ఆన్ చ్వాంగ్ ఆరుమాసము లిక్కడనుండి ప్రతియంశమును, గుహను, దేవాలయమును సొరంగమును ప్రత్యక్షముగ చూచిన వాడగుటచే, నాతడు వ్రాసినదానిలో నేమియు తప్పుగాని, పొరబాటునుగాని గన్పట్టుటలేదు. ఈకారణమువలన, యు ఆన్ చ్వాంగ్ వర్ణించిన ధనకటక దేశపు రాజధాని విజయ వాటిక యనియే నిశ్చయింపవలయును. బౌద్ధోపాసకులు విజయవాడ, సీతానగరము, ఉండవల్లి, గుహలందు నివాసము చేయుచుండిన కాలమున అక్కడి సంఘారామములన్నియు రాత్రివేళబారులు దీర్చిన దీపములతో కనులపండువ సేయుచు మనోహరముగ నుండెనుగాబోలు!

యు ఆన్ చ్వాంగ్ ధాన్యకటక దేశమునందలి బౌద్ధసన్యాసులు మహాసాంఘిక శాఖకు జెందినవారని చెప్పుచున్నాడు. మరియు నీతడిచ్చటి భిక్షవులకడ అభిధర్మ పీఠికను అభ్యసించి తిరిగి వారికి మహాయన మార్గమును బోధించెననిగూడ దెలియుచున్నది.

యుఆన్‌ చ్వాంగ్ వర్ణించిన పూర్వశైల సంఘారామము అపరశైల సంఘారామమును బెజవాడనగరమున కిరుప్రక్కలగల కొండలపై యుండునట్లు గాన్పించెడిని. శిథిలములయిన కట్టడములు, గుహలు, మొదలగునవి యీ యూహనుబలపఱచుచున్నవి. భావవివేకస్వామి అపరశైలమున, హృదయధారణిని జపించి, అవలోకితేశ్వరుని బ్రత్యక్షముచేసుకొని యుండెనట. ఆయవలోకితేశ్వడీకాలమునాటి మల్లేశ్వరుడగునేమో? మన యాత్రికుని వర్ణనలపరీక్షించి విజయవాడ యందలి అపరశైల, పూర్వశైల సంఘారామములు రెండును ఒక్కటే మఠమని నిరూపించుచున్నట్లు తోచును. అపరశైలము కనకదుర్గ దేవాలయమున్న కొండ. దానిపై నేటికి ననేకగుహలు, కట్టడములు ప్రాచీనకట్టడముల చిహ్నములు గానవచ్చుచున్నవి. అట్టిగుహలు, కట్టడములు కొన్ని పూర్వశైలమునగూడ నీకాలమున గానవచ్చుచున్నవి. ఈ గుహలను పాడుచేసి, కృష్ణానదికి ఆనకట్టకట్టిన కాలమున, మంచిమంచి ఱాళ్ళు, శాసనములున్న వాటిని, దీసుకొనిపోయి పునాదులక్రింద నదిలో బారవైచిరి. అందులచేత చరిత్రాంశములు చాలవఱకు మనకు లుప్తమైపోయెను. ఈ పూర్వశైల, అపరశైల సంఘారామములను బౌద్ధసన్యాసు లిచ్చట వర్ష కాలములో నివసించుటకై యొక రాజు గట్టించెనట. ఆరాజెవరైయుండునో? యుఆన్‌చ్వాంగ్ గ్రంథముయొక్క మరియొక పాఠమునందు "రాజు కొండను రెండుగా బ్రద్దలగొట్టించి నదిగుండ నొకబాటను వేసెను. ఆకొండను దొలిపించి చక్కని చావళ్ళు మందిరములు వసారాలు విహారములు నిర్మించెను." అని యున్నది. ఈసందర్భమున యాత్రికుడు వ్రాసిన వ్రాతలు సందిగ్ధముగ నుండుటచే నేమియు నర్థముగాకున్నది. కృష్ణానది బెజవాడ కడ సీతానగరము కొండకును, ఇంద్రకీలపర్వతమునకు నడుమగా కనుములోనుండి ప్రవహించుచున్నది. మరియు, నీనది ప్రవహించుటకు కొండ రెండుగా జీల్పబడినట్లుగానబడుచున్నది. పూర్వకాలమున నది, ఉండవల్లి కొండవంటి సీతానగరపు కొండకు దక్షిణవైపున, నా రెండు కొండలకు నడుమగా ప్రవహించినట్లు చిహ్నములు గాన్పించు చున్నవి. ఈకాలమున నది ప్రవహించుతావున పూర్వకాలపు విజయవాడ యుండెనేమో యని సందియముగలుగుచున్నది. ఈ యూహయే నిజమైనచో, యుఆన్ చ్వాంగ్ చెప్పినది నిజమయి యుండవచ్చును. మరియు పూర్వము ఇంద్రకీలపర్వతముమీద, దక్షిణవైపునగూడ నదినంటి యేమయిన గుహలుండెనేమో; యిపుడవియన్నియు నది నొఱసి ప్రవహించుటచే జీర్ణమయి యుండవచ్చును. ఈగుహలు మఠమును నగరమునకు సమీపముగా నుండినట్లు యాత్రికుని వర్ణనలవలన దెలియుచున్నది.

ఊరికి దక్షిణమున నొకకొండ గలదనియు, నచ్చట భావవివేకస్వామి తపస్సు చేసికొన్నట్టియు అసురుల హర్మ్యమున్నట్టియు పర్వతము గలదని యుఆన్ చ్వాంగ్ చెప్పుచున్నాడు. సీతానగరము ఉండవిల్లి కొండలమీదనున్న ఏకశిలానిర్మితమయిన దేవాలయమును కొండయు యుఆన్ చ్వాంగ్ వర్ణించినట్టి స్థలమని "సూయలు" నిరూపించుచున్నాడు. ఉండవిల్లి కొండపైనున్న, దేవాలయము ప్రాచీనతను జాటదని ఫెర్గసను వాదించినప్పటికిని యితరబౌద్ధగుహలు ఆలయములు ఎట్లుబ్రాహ్మణ శైవ మతవిజృంభణకాలమును మార్పుచేయబడినవో యీగుహాలయమును తరువాత కాలమున చిత్రవిచిత్రాలంకారములతో శిల్పముతో తరువాత కాలమున అభివృద్ధి చేయబడి యుండునని సమాధానము చెప్పవచ్చును.

భావవివేకు డాంధ్రుడైనను, మహా తార్కికుడైనను శాస్త్రజ్ఞుడైనను బౌద్ధుడగుటచే నీర్ష్యాపరులగు బ్రాహ్మణ మతస్థు లాతని బుద్ధిపూర్వకముగ విస్మరించిరి. ఇతరబౌద్ధగ్రం థములతో పాటు అతని గ్రంథములగూడ దగ్ధముగావించిరి. ఈతని పాండిత్య మహిమయు, కీర్తియు, జీవితమును చీనా, తిబెతు గ్రంథములవలన దెలియవచ్చుచున్నది. ఈతనివలె బౌద్ధులయిన సుప్రసిద్ధాంధ్రు లనేకులు, స్వదేశమును విస్మరింపు టెంతయు శోచనీయము. ఇది బ్రాహ్మణమత ప్రభావముకాని వేఱుకాదు. మలయగిరిప్రాంత మీభావవివేకుని జన్మభూమియని దెలియుచున్నది. మలయగిరి యనగా నిప్పటి విశాఖపట్టణ మండలములోని పశ్చిమభాగమని గాని, వింధ్యపర్వతపంక్తియొక్క తూర్పు కొనయనిగాని భావింపవచ్చును. ఈతడేకాలపువాడో తెలిసికొనుట కాధారములులేవు, గాని యీతనిశిష్యులు నాగార్జునునికిని, దిజ్ఞాగునికిని నడుమ కాలమున జీవించి యుండినట్లు యీచింగ్ చెప్పియున్నాడు. యుఆన్‌చ్వాంగ్ వ్రాసిన దానిబట్టి, భావవివేకుడు శిలభద్రునికి గురువగు ధర్మపాలుని కించుక సమకాలీనుడని తెలియుచున్నది. ఈతడు రచించిన మహాయన ముఖ్యహస్తశాస్త్రమను గ్రంథము చీనాభాషలోనికి భాషాంతరీకరింపబడియున్నది. దానిని యు ఆన్ చ్వాంగ్ చీనా దేశమునకు తిరిగి వెళ్ళినతరువాత క్రీ.శ. 648 వ సంవత్సరమున భాషాంతరీకరించెను. ఈ గ్రంథము భావవివేకుని యఖండతార్కికశక్తితో విరాజిల్లు చున్నది. ఇందాతడు బౌద్ధమతములో నన్ని సంప్రదాయముల వారియొక్కయు, శాఖలయొక్కయు సిద్ధాంతముల విమర్శించుచు వ్రాసెను. సాంఖ్యసిద్థాంతమునుగూడ నాతడు తనగ్రంథమునందు విమర్శించి యుండెను. నాగార్జునుని ప్రజ్ఞాపారమితసూత్రమునకు వ్యాఖ్యానముగా నీతడు "ప్రజ్ఞాలంపశాస్త్రప్రదీపిక" యను గ్రంథమును రచించెను. ఇదియు చీనాభాషలో గలదు. ఈగ్రంథమునందు నాగార్జునుని మహాయన సంప్రదాయములను సిద్ధాంతముచేసి సమర్ధించుటకై భావవివేకుడు సాంఖ్యమునే విశేషముగ నుపయోగించెను. ఈ "ప్రజ్ఞాలంప శాస్త్రప్రదీపిక" తిబెతు భాషయందు, ప్రజ్ఞాప్రదీ-మూలా-మధ్యమిక వృత్తి" యని బరగుచున్నది[18] ఈతనిచే రచింపబడిన మరియొకగ్రంథము తిబెతుభాషలోనే యున్నది. దానిపేరు "తారకజ్వాలా" యట. ఇది యించుమించుగ "ప్రజ్ఞాప్రదీపశాస్త్ర" మువలె నుండును.[19]

భావవివేకస్వామి ఉపాసించిన వజ్రపాణి మంత్ర శాస్త్రమున కధిదేవతయని బౌద్ధగ్రంథములు జాటుచున్నవి. మరికొన్ని యాతడు బోధిసత్తుడని వాకొనుచున్నవి మరికొన్ని యాతని యక్షులకు నాయకుడని బేర్కొనుచున్నవి ధారణిసూత్రముల నుపాసనావిధిప్రకారము, ఆవగింజలు మంత్రమున కుపయోగింతురని యుఆన్ చ్వాంగ్ చెప్పుచున్నాడు. విథ్యుక్తముగా జపించిన నావగింజలతో, వర్షము కురిపింపవచ్చునట! పర్వతములను ఛేదింపవచ్చునట! భూమిని రెండుగా జీల్చి వేయవచ్చునని ధారణిసూత్రములు ప్రతిపా దించుచున్నవి. భావవివేకుడు జపించిన హృదయ ధారణి సూత్రము, యుఆన్ చ్వాంగ్ తనదేశమునకు గొంపోయెను. అద్దానిని చీనాదేశములోనికి చిటూంగ్ అనువాడు భాషాంతరీకరించెను. ఈసూత్రమిపుడు ఇంగ్లీషు భాషలోనికి భాషాంతరీకరింపబడి, 1875 వ సంవత్సరపు రాయల్ ఏషియాటిక్ సొసైటీవారి పత్రికయందు 27 వ పేజీయందు ప్రకటింపబడియున్నది.

విజయవాడ లేక ధాన్యకటక దేశము నుండి దక్షణాభిముఖుడై యుఆన్ చ్వాంగ్ చోళ మండలమునుగూర్చి బోయెను. దేశమును గూర్చి యాతడిట్లు వ్రాసెను.

"చోళదేశము 2400, 2500 లీలు (600 మైళ్ళు) వైశాల్యము గలిగియున్నది రాజధాని పదిలీలు వైశాల్యము గలిగి యున్నది. దేశము భయంకరముగానుండి, నిర్జనమై యున్నది. ఎటుజూచినను చిట్టడవులును, తేమలూరు భూములును గాన్పించును. బందిపోటు దొంగలు నిర్భయులయి గ్రామములగుండ పోవుచు, దోచుకొను చుండుటచే, జనులు కాపురము చేయుటకు భయపడుచుందురు. దేశము ఇతరాంధ్ర దేశమువలె, యుష్ణముగా నుండును. జనులు చంచల స్వభావులును, కౄరులుగా నున్నారు. వీరిలో జాలమంది బ్రాహ్మణులు. సంఘారామములును బిక్షుక శూన్యములై అసహ్యములుగా నుండుచు శిధిలమయి పోవుచున్నవి. ఉన్న సన్యాసులుకూడ నశుభ్రముగా నున్నారు. బ్రాహ్మణ దేవాల యము లనేకములు గలవు. ఇక్కడ దిగంబర జైనులును పెక్కుమంది గలరు.

"రాజథానికి నైరృతిగా నొక యశోకవనమును, స్తూపమును గలవు. పూర్వమిచ్చట తథాగతుడు చాలకాలము నివసించియుండి, 'చాలమంది దిగంబరజైనులను బ్రాహ్మణులను, దేవతలను, బౌద్ధులనుగా జేసియుండెను."

"నగరమునకు పశ్చిమముగా అనతిదూరమున నొక పురాతనమైన సంఘారామము గలదు. ఇచ్చట అర్హతుడొకనితో, దేవబోధిసత్త్వుడు వాదించెను. ఆవృత్తాంత మిట్టిది. దేవబోధిసత్త్వు డొకప్పడీ సంఘారామమునందు ఉత్తరుడను అర్హతుడు నివసించు చుండుననియు, నాతడు షడభిజ్ఞుడనియు అష్టవిమోక్షకుడనియు విని యాతనిచూచి యాతని జీవితపద్ధతి నవలంబింపగోరి యేతెంచియుండెను. ఆసంఘారామమునకు వచ్చి తన కారాత్రి నిదురించుటకు తావొసంగ వలసినదని అర్హతుని బ్రార్థించెను. అర్హతు డుత్తరుడు నివసించు చోట నొక మంచము మాత్రమే యుండెను. అయినను దేవబోధిసత్త్వుడు, అర్హతుని యాధిక్యమును గ్రహించి, యాతని గదిని బ్రవేశించెను. అర్హతుని కొక చాపయులేనందున కొన్ని రెల్లుదుబ్బులను దెచ్చి చాపగాచేసి, దేవుని కూర్చుండ ప్రార్థించెను. దేవబోధిసత్త్వు డాసీనుడైన పిదప అర్హతుడు ధ్యానసమాధియందు బ్రవేశించి, అర్థరాత్రము గతించినవెనుక లేచివచ్చెను. దేవుడపుడు తనకు సంశయము లున్నవనియు, వానిని దీర్పవలసినదనియు నాతని ప్రార్థించెను. దేవుడు ప్రశ్నించుచుండ, అర్హతుడొక దాని వెనుక నింకొక దానికి సదుత్తరము నొసంగెను. ఆతడాడిన ప్రతిపదమును పరిశీలించుచు దేవుడు సూక్ష్మములును దురవగాహములునగు ప్రశ్నలనువేయ నారంభించెను. అర్హతుడట్లే ఏడవ పర్యాయము వాదమారంభించు వఱకు ప్రత్యుత్తరమిచ్చెను, గాని పిదప సమాధానము చెప్పజాలక మౌనము వహించి తన దివ్యప్రభావముచే పరకాయ ప్రవేశముచేసి తుషిత స్వర్గమును జొచ్చి మైత్రేయుని దేవుడడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తర మీయవలసినదని ప్రార్థించెను. మైత్రేయుడాతనికి గావలసిన సమాధాన మిచ్చి "అర్హతుడా! ఈ ప్రశ్నవేసిన వాడెవడో నీవెరుగుదువా? ఆతడు బోధిసత్త్వుడగు దేవుడు, మహాప్రజ్ఞావంతుడు. అనేక కల్పములనుండి జీవించుచు ధర్మము (బౌద్ధమతము) నవలంబించుచున్నాడు. భద్రకల్పముయొక్క నడుమ కాలమున ఈతడు బుద్ధుడై యవతరించును. నీవిది యెఱుగవు. కావున వెంటనే యరిగి యాతని విశేషముగ సత్కరించి పూజింపుము" అని చెప్పి పంపివైచెను.

ఆయుత్తర క్షణమున అర్హతుడు నిజశరీరమున బ్రవేశించి బోధిసత్త్వుడడిగిన ప్రశ్నలకు చక్కగా ప్రత్యుత్తరముల నిచ్చి సందేహములను బాపెను. దేవుడంతట "అయ్యా! ఇపుడు నీవు చెప్పిన విషయములు నీవు జ్ఞానివై స్వతంత్రముగ దెలిసికొనినవిగావు. మైత్రేయబోధిసత్త్వుడుతక్క నితరుల కీ రహస్యము లెఱుంగరానివి. కావున తమకీ రహస్యము లింత సులభముగ నెట్లు తెలియవచ్చెనో ఆశ్చర్యముగ నున్నది." అని బల్కెను. అర్హతు డపుడు "దేవుడా! నీవు బల్కినది సత్యము. ఇది యంతయు తథాగతుని ప్రజ్ఞయే" అని యనుచు ఆసనము నుండిలేచి బోధిసత్త్వునకు సాష్టాంగముగ బ్రణమిల్లి స్తుతించి పూజించెను."

చరిత్రకారులు చాలమంది యుఆన్ చ్వాంగ్ ధాన్యకటక దేశమునుండి దక్షిణమున కావేరి తీరమున గల చోళదేశమునకెట్లు ముందు పోగలిగెనా యని సందేహించి యాతడు వ్రాసినదానిని ఖండింప నారంభించిరి. కాని వారి ఖండనములు ఆశ్చర్యముగను ఆధార రహితములుగను గన్పట్టుచున్నవి. యుఆన్‌చ్వాంగ్ వర్ణనల ప్రకారము ఆతడు బేర్కొని యుండిన దేశము ఇప్పటి కర్నూలు మండల మగుచున్నది.[20] ఈప్రాంతమును మనయాత్రికుని కాలమున తెలుగుచోడ వంశములు బరిపాలించు చుండినట్లును ఇయ్యది చోళమండలమని బిలువబడు చుండినట్లును శాసనములవలన దెలియుచున్నది.[21] శ్రీయుత చిలుకూరు వీరభద్రరావు పంతులుగారు చోళమండలము కడపజిల్లాయని నిర్ణయించుచున్నారు. గాని యది కేవలము ప్రమాణముగాదు. కడపమండలముగాక కర్నూలుమండలముగూడ చోళదేశమున జేరియుం డును. ఈదేశమును వర్ణించిన మనయాత్రికు డీరాజ్యమెవరి పాలనము నందున్నదో యాకాలపు కాంచీపుర పల్లవరాజగు నరసింహవర్మకు సామంతుడో లేక స్వతంత్రుడో దెల్పి యుండలేదు. అయినను చోళమండల మితర శాసనముల బట్టి పల్లవ రాజ్యములో జేరినట్లు దెలియుచున్నది; గావున సామంత రాజ్యమనియే యెంచవలయును.

చోళమండలమునకు నెల్లూరు (విక్రమసింహపురము) రాజధాని గావచ్చునని వాటర్సు ఫెర్గసను మున్నగు పండితులు నిర్ణయించిరి, గాని వారివాదము తృప్తికరముగ లేదు. కాని చోళరాజధాని ఎచ్చటనున్నదో అర్హతుడుత్తరు డెక్కడ నివసించినో దెలియరాదు. చోళ దేశమునుండి మనయాత్రికుడు తనగురువగు శీలభద్రుని జన్మస్థానమగు కాంచీపురమును ద్రావిడ దేశమును జూడబోయెను.

యుఆన్ చ్వాంగ్‌తో నాంధ్రదేశమును, మహేంద్రగిరి మొదలుకొని ద్రావిడదేశము వఱకును ప్రయాణముసల్పి యాతడు వర్ణించిన వర్ణలనుబట్టి యాకాలపు స్థితిగతులను వ్యవస్థలను కొంతవఱకు గ్రహింపగలిగితిమి. ఇంచుమించుగా క్రీ.శ. 637 వ సంవత్సరమున, వర్షకాలము గడచిన వెనుక కళింగదేశమును బ్రవేశించి యక్కడ కొద్ది దినములుండి కోసలమున కరిగి యచ్చటనుండి, ఆంధ్ర వేంగీరాజ్యమును జొచ్చి పిదప విజయవాటికేగి యచ్చట క్రీ.శ. 639-640 వ సంవత్సరముల నడుమభాగమున నివసించి పిమ్మట చోళదేశముమీదు గా కాంచీపురమునకు బోయెను. మొత్తముమీద నాంధ్ర దేశమున నీతడు పదునెనిమిది మాసములు లేక రెండుసంవత్సరముల కాలము గడపెను. ఈతడిచ్చిన కొలతలు ఒకప్పుడు ఎక్కువగ నుండుచు వచ్చినను అవిపొరబాటులని గ్రహింపవలసినదే గాని మరియొండుగాదు. కాక ఆకాలమున దేశమునందు ప్రయాణమున కనుకూలములయిన బాట లిప్పటివలె నుండక కొన్ని సమయము లందు కొండలడ్డము చేతను, అడవులడ్డము చేతను చుట్టుతిరిగి యుండవచ్చును. మనదేశమును జూచి మనచే విస్మరింపబడియున్న వృత్తాంతములను స్థలములను మరలనొకసారి జ్ఞప్తికిదెచ్చి మహోపకారము చేసిన యుఆన్ చ్వాంగ్ మనకు చిరస్మరణీయుడే కాదు, మనకృతజ్ఞతకు బాత్రుడైనవాడు.

 1. Ancient Geography of India, p. 513
 2. Dr.Fleet in Indian Antiquary vol. xxii pp 171, 179.
 3. కళింగము, వేంగిరాజ్యము, ఆంధ్రము దక్షిణకోసల మున్నగునవి మహాంధ్ర దేశములోని, వివిధ ప్రాంతములకు వచ్చియుండిన యాపాత నామములుగా గ్రహింప వలయును
 4. Ancient Geography of India p.515,
 5. Ancient History the Dekhan by G.J.Dubreuil p93-94
 6. పూర్వోక్త ప్రమాణము
 7. Ancient Geography of India p. 5-9.
 8. Tarranatha's History of Buddhism p. 73
 9. Asiatic Researches Vol. II p. 409.
 10. Walter's Yuan chwang Vol, II p. 204
 11. † Itsing by Takakasu p. 158
 12. Takakasu "Itsing" p 159.
 13. Taranatha's History of Buddhism ps 71, 73 & 303,
 14. అర్హత పదము సంస్కృతమున ఆచార్యుడగుచున్నది. బౌద్ధధర్మ సిద్ధాంతముల ననుసరించి పునర్జన్మ లేకుండచేసికొనగలుగువాడు ఆచార్యుడు (అర్హతుడు) అగుచున్నాడు.
 15. Ancient Geography of India 530 ff. J.R.A.S. 1873. p 263.
 16. Archaeological Survey of South India. P. 9. Fi.
 17. J.R.S. 1173.q 263 J.R.A.S. Vol. XIIp 98 ff.
 18. Taranatha's History of Buddhism p. 277
 19. Wassaf's Buddhism p. 287
 20. Dunningham's Ancient Geography of India p. 545
 21. Report on Epigraphy southern Circle for p. 1905