Jump to content

ఆంధ్రదేశము విదేశయాత్రికులు/అబ్దుర్ రజాక్

వికీసోర్స్ నుండి

అబ్దుర్ రజాక్

యిమ్మడి దేవరాయలనాడు విజయనగరమున

పారశీక రాయబారి 1441 - 1444.

అబ్దుర్ రజాక్ జీవితము.

అబ్దుర్ రజాక్ యొక్క నిండుపేరు కమాలు-ద్‌దీన్ అబ్దుర్ రజాక్. అతని తండ్రిపేరు జలాలు-ద్‌దీన్ ఇషక్, అబ్దుర్ రజాక్ తండ్రి మధ్య ఆసియాఖండములో 'సమరఖండ' దేశవాస్తవ్యుడు. మన కథానాయకుడు మహమ్మదీయ హిజరాశకము 816 సంవత్సరము ష-అబాన్ మాసమున పన్నెండవదినమున (అనగా క్రీస్తుశకము 1413 వ సంవత్సరము నవంబరు 6 వ తేది.) హిరాట్ నగరమున జన్మించెను. పారశీక చక్రవర్తియగు సుల్తానుషా-రుఖ్‌కొలువున జలాలుద్దీన్ కొంతకాలము "కాజీ" యుద్యోగమునను, మరి కొంతకాలము "ఇమామ్" ఉద్యోగమున నుండుచు సుల్తానుచే నప్పుడప్పుడు ధర్మసందేహ నివర్తికై యాహ్వానింప బడుచు ధర్మగ్రంథములు చదివి వినుపించుచుండెను. అబ్దుర్ రజాక్ తండ్రివలెనే గొప్ప విద్వాంసుడును, అరబీభాషయందు వైయ్యాకరణియు నైయుండెను. తండ్రి చనిపోయిన తరువాత నతడు అరబీభాష లోని ప్రత్యయములు, సర్వనామములను గూర్చి 'అజ్దుద్‌దీన్ యాహ్య' అనునాతడు వ్రాసిన వ్యాకరణమునకు గొప్ప వ్యాఖ్యానమును రచించి, దానిని సుల్తాను షా-రుఖ్‌న కంకితము. చేసెను. కృతినొసంగు సమయమున సుల్తాను, అబ్దుర్ రజాక్ పాండిత్యమునకును రాజభక్తికిని కడుమెచ్చుకొని తనహస్తమును అత్యంతగౌరవ సూచకముగ ముద్దిడనిచ్చి సంభావించెను. ఆప్రభువు పరిపాలనా వసానకాలమున నితడు విజయనగర చక్రవర్తికడకు రాయబారిగా బంప బడియెను. విజయనగరమున నుండి స్వదేశమగు ఖురాసాన్ దేశమును సుఖముగా జేరునప్పటి, కనేకకష్టము లనుభవించి దుర్దశల పాలయ్యెను. విజయనగరము నుండి తిరిగివచ్చిన తరువాత క్రీ. శ. 1446 వ సంవత్సరమున "గిలాన్" దేశమునకు రాయబారిగా బంపబడియెను. కాని యాపని పూర్తిగాక మునుపే యీజిప్తు దేశమునకు బోవలసినదని సుల్తాను షారుఖ్ వర్తమానము పంపియుండెను. ఇంతలో నాతని నింతయాదరించి గౌరవించిన యాసుల్తాను మరణించుటచే ఈజిప్తు రాయబారము కొనసాగియుండ లేదు. సుల్తాన్ షారూఖ్ మరణించిన తరువాతను గూడ నితడు వరుసగా సింహాసన మదిష్ఠించిన మీర్జాఅబ్దుల్ లటీప్, మీర్జాఅబ్దు-ల్లా, మీర్జాఅబుల్ కాశిం సుల్తానుల కొలువుకూటముల గౌరవింప బడుచువచ్చెను.

క్రీ. శ. 1452 వ సంవత్సరమున సుల్తాన్ అబుల్ కాశిం బాబరుతో గలసి "టఫ్‌ట్ యజ్దు" అనునగరమున కరిగి యుండెను. ఆసంచారము నందు చరిత్రకారుడగు షయాఫ్-ఉద్దీన్ ఆలియజ్ది అనువానితో సుల్తాను ముచ్చటించినపుడు ఆసంభాషణ నాలకించుట కీతడు నాహ్వానింపబడియెను. ఇది జరిగిన రెండు సంవత్సరములకు సుల్తాను అబుసయిద్‌న కాప్తుడయి యాతనిచే విశేషముగ గౌరవింపబడియెను. ఈతనికాలమున అబ్దుర్‌రజాక్ "ఖాన్‌కహ" అను సుల్తాన్‌యొక్క భోజనశాల కధ్యక్షుడుగా నియమింప బడియెను. ఈయుద్యోగమునం దతడు చనిపోవువఱకు నుండి ప్రభువునకత్యంతప్రియుడైతన యుద్యోగము విశ్వాసముతో నిర్వర్తించియుండెను.

అబ్దుర్ రజాక్ క్రీ. శ. 1482 వ సంవత్సరమున అక్టోబరు నెలలో కాలధర్మము నొందెను. ఈతడు రచించిన గ్రంథములలో మిక్కిలి యుపయుక్తమైనది, మనకు ప్రస్తుత విషయమును గూర్చి దెల్పునది "మల్లూ-ఉస్-నఅదయిన్" అను చరిత్రగ్రంథము. ఇయ్యది యాతని కాలము నుండియు సర్వజనాదరణీయమై యుండెను. ఇందు మన విజయనగర సామ్రాజ్యవృత్తాంతము మాత్రమే గాక యాతడు గొల్చియుండిన ప్రభువుల పరిపాలనము నాటి విషయములు గూడ చాలగలవు. ఈగ్రంథము రెండు సంపుటములుగా నున్నది. ప్రథమ సంపుటమున విజగీషామనీష గల టైమూరు చక్రవర్తి యారంభదశ మొదలుకొని యాతని మరణాంతరము వఱకు గల చరిత్రయంతయు సవిస్తరముగ దెలుపబడెను. రెండవ భాగమున టైమూరు వంశస్థుల చరిత్ర మొదలుకొని రజాక్ గొల్చిన కడపటి పారశీకసుల్తాను హసన్‌మీర్జా మరణానంతము వఱకు జరిగియుండిన వృత్తాంతములను వివరించెను. ఈగ్రంథమును అబ్దుర్ రజాక్ చనిపోవుటకు రెండుసంవత్సరములకు, బూర్వము క్రీ. శ. 1470 లో రచించెను. కడు ముదిమి కాలమున రచించినదయ్యు నాతని చరిత్ర, విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించినంత వఱకు మనోహరములును సూక్ష్మములునయిన చారిత్రక విషయములతో నొప్పాఱుచున్నది. ఇట్టిగ్రంథమే లేకుండిన యిమ్మిడి దేవరాయలనాటి విజయనగర సామ్రాజ్యమును గురించిన కొన్ని యపూర్వ వృత్తాంతములు మనకు దెలిసియుండవు.

"మల్లూ-ఉస్-సఅదయిన్" పారశీకభాషయందు రచింపబడియున్నది. ఇందులో మన విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించినంత భాగము, బెంగాలు సివిలుసర్వీసులో పనిచేసిన సి. జె. ఓల్డుప్రభు అనునాతనిచే నాంగ్లభాషలోని కనువదింపబడి, సర్ హెన్రీ. యం. ఎలియట్ గారిచే సంస్కరింపబడియెను. ఇపుడా గ్రంథమే మనచారిత్రమునకు మూలాధారము.[1]

హిందూస్థానమునకు రాయబారము

అబ్దుర్‌రజాక్, హిందూస్థానమునుగూర్చి యిట్లువ్రాయుచున్నాడు. (హిజరాశకము 845 వ సంవత్సరమున క్రీస్తుశకము 1441), జ్యేష్టమాసమున నొక శుభదినమున సకల పృధ్వీపతియగు మాఱేడు యీచరిత్రకారుడును ఇషాక్ కుమారుడును నగు అబ్దుర్ రజాక్‌నకు, హిందూస్థానమునకు రాయబారిగా నరుగవలసినదని యాదేశమంపెను. అంతట నాతడు హార్మజు రేవున బయలుదేరి సముద్రమున కావలిగట్టును గూర్చి పయనమయ్యెను.......... హార్మజు పట్టణము ఆరాజధానికి ముఖ్యనగరము. అది గొప్ప రేవు పట్టణము, దానికి "జెరూన్" అని మఱియొక పేరుకూడ గలదు. ఆమహానగరమునకీడయిన పట్టణ మీ ధరాతలమున నింకొకటి కానరాదు. నవద్వీపములనుండి వర్తకు లిక్కడ కేతెంచెదరు. ఈజిప్తు శిరియా, రూమ్, (టుర్కీ) ఆజర్ బైజాన్, ఇరాఖ్, పార్సి, ఖురాసాన్, మావారాల్ నహర్, టుర్కిస్థాన్‌దష్‌తు-ఇకినిచాన్, కల్మక్ దేశములుమున్న గువాటినుండియు, తూర్పున చీన్, మాచీన్, ఖాన్‌చాలిన్ మున్నగు దేశదేశాంతరముల నుండియు వర్తకులు వచ్చుచు పోవుచుందురు. చీనా, జావా, బంగాళము, సింహళము జిర్‌బాద్ నగరములు, తనాసిరి, సకోట్రా, మాలదీవులలోని తొంబదినరములు, మలబారు, అబిస్సీనియా, జాంజిబారు, విజయనగర సామ్రాజ్యపు రేవులు, కలబరిగె, ఘూర్జరము, కంబా, అరేబియా దేశపు రేవులు, ఏడెను, జంబో, మున్నగు నానాద్వీపదేశాంతర పట్టణములనుండి వర్తకులు వారివారి దేశములందు దొరకెడి యపూర్వములయిన వస్తుసామగ్రి నెల్లప్పుడు దెచ్చుచు నిచ్చట నమ్ముకొను చుందురు. వారు దెచ్చెడిసరకులు సూర్యచంద్రాదులు, వర్షములుగూడ మెరుగు పెట్టదలచునంత అపురూపము లయినవి. భూమిపైగల నీయాదేశములనిలేక యన్నిప్రాంతములనుండియు వ్యాపారులి చ్చట తాము దెచ్చినసరకుల నమ్ముకొనుచు నిచ్చటి సరకులను గొంపోవు చుందురు. వారు ఒక్కొక్కప్పుడు తమకు గావలసిన వస్తువులకు సరియగు విలువగల తమసామగ్రిని మార్చుకొందురు. వెండిబంగారముల మీద దప్ప ఈరేవున దిగుమతి వస్తువు మీదవెలచేసి నూటికి పదియవపాలు ఆరాజునకు వర్తకులు రేవుసుంకము చెల్లింప వలయును. అనేక విధములగు మతప్రచారకులు కాఫరులు, నాస్తికులు, మున్నగు నానాదేశీయులగు వారనేకు లీనగరమున గలరు. వారంద రానగరాధీశ్వరుని ధర్మపరిపాలనము క్రింద నే యన్యాయమును బొందక సుఖించు చున్నారు. అందువలన నీ నగరమునకు న్యాయపరిపాలనమునకు ధర్మమునకు ఉనికిపట్టు అను అర్థమిచ్చు "దారుల్ అమాన్" అను ప్రసిద్ధిగలదు. ఈ నగరి వాస్తవ్యులు ఐరాకీయుల వినయ మర్యాదలను హిందువులు నేర్పుతో ప్రకటింతురు.

"ఈ నగరమున నేను ప్రయాణమునకు బూర్వము రెండు మాసము లుండవలసి వచ్చెను. నేను వ్యాపారినేమో యనియు సుంకమీయక పారిపోవ దలచిన వాడనేమో యనియు, రేవుసుంకరులు నన్ను త్వరలో వెడలనీయక పరీక్ష చేయసాగిరి. ఈ పరీక్షలో ఓడలు బయలుదేరు ఋతువు దాటిపోయెను. అంతట వర్షకాల మారంభమై యుండి నందున వర్షములు వెనుకబడి తుపానుల భయము తీఱువరకును నన్ను పయనము సేయనీరైరి. నాతోనుండిన గుఱ్ఱము లను, మనుష్యులెక్కు ఓడలో [2] నుంచ వీలులేదని యా గుర్రముల నొక యోడలోను, నన్ను నాపరివారమును మరియొక యోడలోను నెక్కించిరి. అట్లు ఆ రెండోడలలో నేనును నా పరివారమును పయనమైతిమి.

"ఓడలలోని దుర్వాసన నాకు స్మృతిలేకుండ జేసెను. దానికి తోడు సముద్రప్రయాణము నాకు భయానహమయ్యెను. ఈ రెండు కారణముల వలన నేను మూడు దినములవరకు నూపిరిలేకుండ చచ్చినివానివలె మూర్చ పోయియుంటిని.

"మూడవనాడు నాసికాగ్రమున కొనియూపిరి కనబడినపుడు మావారు నేనింకను జీవించియుంటినని దైర్యము దెచ్చుకొనిరి. నాకు కొంచము తెలివి వచ్చునప్పటికి ఓడమీద నాతోపాటు ప్రయాణము సేయుచుండిన నామిత్రులగు వర్తకులందరు నైక్యకంఠముగ సముద్రప్రయాణమున కనుకూలమైన అదను దాటిపోయిన పిమ్మట బయలు దేరిన నెట్టి యుపద్రవములైన రావచ్చుననియు, అట్టి సమయమున నెవడైన నకాలమరణము నొందిన వానిని వాడే నిందించు కొనవలయును గాని యితరుల నేమనినను లాభము లేదనియు మొదలగు మాటలు నెన్నియో నన్నాడి నిందించి, తుదకు మేమింక నీతో నీయోడమీద రామని యొక్కపెట్టున నంద రును "మస్కాటు" రేవున ఓడ దిగిపోయిరి.[3] పాపము వారందరు నోడకేవును ముందుగానే యిచ్చి యుండినందున యానము పూర్తిగాకుండ నోడ దిగుటచే వారెంతో నష్టవడుటయే కాక సరకుల గూర్చి చాలా చిక్కులుపడిరి.

"ఇక నేనును వారితో పాటు మస్కాటురేవున దిగి యచ్చట మాత్రమాగక "కరియాట్" అను పట్టణమునకు బోయి యచ్చట నివాస మేర్పరచుకొంటిని. ఓడ పయనము పూర్తిగా కుండిన పుడును, అర్ధాంతముగ నెక్కడనైన కొంతకాలము తలదాచుకొన వలసినపుడును, సముద్రవ్యాపారులు దిక్కుమాలిన వారివలె యిడుమల పాలగుదురు. ఆ యిబ్బందులు వారికే తెలియ వలయును. దైవము నిర్దయుడై యుండుట వలనను, నాదురదృష్టము ఇంకను దరిచేరకుండుట వలనను నేను కొంచ మధైర్యము చెందితిని. నా హృదయము బ్రద్దలయిన గాజుముక్కల వలె చెదరిపోయెను. బాధలననుభవింపలేక, తుదకు ప్రాణముపై అసహ్యము కలిగి యంతకన్న చచ్చిన మేలను కొంటిని.

"ఇట్టి స్థితియందు, వేరు గతిలేని మేము కరియాట్ గ్రామమున సముద్రపుటొడ్డున కాపుర ముంటిమి. ఇంతలో మొహరమ్ పండుగవచ్చెను. ఆపండుగల తొలినాటి రాత్రి చంద్రు డతి మనోహరమయిన రేఖతో వెలుగసాగెను. దు:ఖ భాజనమై యంధకార ప్రక్రియనున్న మా దుస్థితికి ఆ మొహరమ్ [4] నాటి విదియచంద్రుడు ఆశా కిరణములను ప్రసరింపజేసెను. ఆయ్యది దక్షిణాయనమైనను సూర్యుని వేడిమి మాత్రము దుస్సహముగా నుండెను. గనులలోని కెంపులును, ఎముకలలో క్రొవ్వునుగూడ కరిగింపజేయు నంతటి వేడిగాడ్పు వీచెను. ఆవేడికి మేము తాళలేక పోతిమి. నేను, నా జ్యేష్ట సోదరుడును, మరికొందరు ప్రియమిత్రులు మొదలగువార లనేకు లాయుష్ణమునకు తాళజాలక ఆరోగ్యము చెడి చాల జబ్బు పడితిమి. అట్లు జబ్బువలన నొకరి తరువాత నొకరు నాలుగు మాసములు బాధపడుచు నచ్చటనే యుండిపోతిమి. కాని ఆయూరివారు కొందరు, కరియాట్ గ్రామమున కంటె సపూర్ అను పట్టణము చాలమంచి ఆరోగ్యకరమైన నగరమనియు, నచ్చట మంచి తియ్యని ఆరోగ్యవంతమైన నీరు లభించుననియు నచ్చటికి బోయిన శీఘ్రమే పున రారోగ్యముగలుగుననియు బలుమారు చెప్పు చుండుటచేత వారిమాటలు విశ్వసించి యింకను లేవలేనిస్థితిలో నున్నపుడు నేను ఓడమీద బయలు దేరితిని. కాని నా దౌర్భాగ్య వశమున అక్కడ బ్రవేశించిన వెంటనే నాకు రోగ మెక్కువయ్యెను. ఇక్కడ నున్నప్పుడే నా పెద్దన్నగారు మవులానా ఆఫీ-వుద్దీన్ అబుల్ సహాబు గారు కాలధర్మమునొంది మమ్మందఱను దు:ఖసముద్రమున ముంచివేసిరి.

"ఎట్టకేలకు ఇక్కడనుండి హిందూస్థానమునకు నోడనెక్కితిమి. పదునెనిమిది దినము లహోరాత్రము లొక్కరీతిగ మాయెడ గాలి బోసికొనుచు నడచెను. పరిశుభ్రమైన యాసముద్రపు గాలివలన నాకు సంపూర్ణముగా తిరిగి ఆరోగ్యము కలిగెను. అటుల పదునెనిమిది దినములు గడచి, పందొమ్మిదవ నాటి యుదయమున, దైవకృపవల్ల సురక్షితముగ కళ్ళికోట రేవున మాయోడ లంగరు దింపెను. ఇంతటి నుంచి నా దేశమున నేను చూచి వినినవింతల నన్నిటిని యధార్థముగ వర్ణించెదను.

"కళ్ళికోట మిక్కిలి నిరపాయకరమైన నౌకాశ్రయము. హర్మజువలె నిచ్చటికు నానా దేశీయులగు వ్యాపారులు, వాణిజ్యార్థమై వచ్చుచు బోవుచుందురు. అబిస్సీనియా, జీర్పాద్, జాంజిబారు దేశీయులనుండి యోడలు సరకు తీసికొని తఱచుగా నీ రేవునకు వచ్చుచుండును. అప్పుడప్పుడు మక్కానగరము నుండియు, నరేబియా దేశపుటితర నగరముల నుండియు నోడలు వచ్చుట గలదు. ఆవచ్చిన యోడలు యిచ్చవచ్చినకాల మాగుచుండును. ఈపట్టణమందెచ్చట జూచినను నాస్తికులు (కాఫరులు, మహమ్మదీయేతరులు) గలరు. అందువలన నీనగరమవశ్యము ముసల్మానులచే జయింపబడదగినది. ఇచ్చట చాలమంది మహమ్మదీయులును గలరు. వారు శుక్రవారమునాడు, నమాజుచేసు కొనుటకై రెండుగోపురములు గల పెద్దమసీదులను కట్టించుకొనిరి. వారలకందఱకును దైవభక్తి పరాయణుడయిన యొక 'కాజీ' కూడగలడు. ఇక్కడి మహమ్మదీయులందఱు "షాఫీ' కులస్థులు సంపన్నులయిన వర్తకులు. సముద్రతీరపు దేశాంతర పట్టణముల నుండి విలువగల వస్తువులను దెచ్చివర్తకులీరేవున దింపుకొనుచు విచ్చలవిడిగ వీథులందును, రచ్చలందును రాజబాటలందును కావలిలేకయే నిలువజేసు కొందురు. ఈనగరమున నెవరికి నేభీతియు నన్యాయ భయమును కలుగనంతటి ధర్మపరిపాలనము గలదు. ఎంతటి విలువగలవస్తు వెచట నిర్భయముగా పారవేసి యుంచినను దొంగభయమనునది లేదు. వర్తకులు తాము నిలువ జేసికొనిన సరకులపై నెవరిని కాపుంచ నక్కరలేకయే రేవుసుంకాధికారులచే భద్రముగా జూడబడుచుండును. రాత్రింబవళ్ళు వారు వాటిచుట్టును కావలి గాయుచుందురు. విదేశవర్తకులు దెచ్చినసరకు అమ్ముడు పడువఱకు వానిపై సుంకమును దీయరు. అమ్మబడిన సరకులకు వెలపై నూటికి 2 8||8 (2 1/2)చొప్పున సుంకము గైకొందురు. ఇతర రేవులను జేరవలసిన సరకుతో నిండిన ఓడలు వాయువశమున గమ్యస్థానమును నగానక నితర రేవులకడ నెక్కడైన మెట్టపట్టిపోయినచో నచ్చటి ప్రజలాయోడలోని సరకులను గొల్లగొట్టు నాచారమున్నది[5] కాని కళ్ళికోటలోనట్లుగాదు. విదేశమునుండి వచ్చిన యోడ అయినప్పటికిని ఎట్టిదుస్థితిలో రేవును జేరినప్పటికి నితర యోడలతో సరిసమానముగ సంరక్షింపబడును. ఆయోడ కెట్టియాపదము వాటిల్లదు.

"మాయేలిక యగుసుల్తాను షా-రుఫీ-ఖాకానీ-సయిద్ నృపాలుడు కళ్ళికోట నగరాధీశున కుత్తమాశ్వములను మేలైన జరీయంగీలు, కుళ్ళాయిలు మొదలగు నమూల్యములయిన యుడుపులను - సంవత్సరాది పండుగనాడు కానుకగా నర్పింప దగినవి - బహుమతులుగా నంపియుండెదు.[6]

"ఇందులకు గారణ మాచక్రవర్తిచే నంపబడిన రాయబారులు బంగాళాదేశము నుండి తిరిగివచ్చు సమయమున, కళ్ళికోటరేవున దిగవలసి వచ్చుటయు, నపుడు వారు నామురీకి మారాజు ప్రశస్తినిగూర్చి విశేషముగా దెలుపుటయు సంభవించెను. ఆరాయబారులు స్వదేశమును చేరినపుడు వారి ముఖమున మా చక్రవర్తి కళ్ళికోటను గూర్చి యంతయు దెలిసికొని యుండెను. మరియు ప్రపంచమున నున్న నృపాలురందఱుగూడ కళ్ళికోట ప్రభువుతో నెయ్యము సలుపుట కిచ్చగింతురనియు, నాతని దేశము నుండి వారి కావశ్యకములయిన సరకులు గొంపోవ బడుచుండు ననియుగూడ వినియుండెను.

"ఇదిజరిగిన కొంత కాలమునకు వంగదేశపు సుల్తాను, జాన్పూరు సుల్తానగు ఇబ్రహీంవలన తన కెక్కువ బాథలు కలుగు చున్నవనియు, నాతని జయించుటకు కొంతసైన్య సహాయ మంప వలసినదనియు, మాచక్రవర్తిని శరణుజొచ్చెను. శరణాగత రక్షకుడగు మాచక్రవర్తి వెంటనే జాన్పూరునకు షెయిఖుల్-ఇస్లామ్ ఖ్వాజాకరీముద్దీన్-అబూ-అల్ మకారిమ్ జామీ అను నాతని రాయబారిగా నంపి, వంగదేశముపై నిక ముందెప్పుడును యుద్ధమునకు బోయి బాధింప వలదనియి, నట్లుగావించిన వాటిల్లు అనర్థములకు తానే నిందించుకొన వలయుననియు జాన్పూరు సుల్తానునకు సందేశమంపియుండెను.[7]

"అందులకు జాంపూరు సుల్తాను చక్రవర్తి యాజ్ఞను శిరసాసహించెను. కళ్ళికోటనగరాధీశు డీవృత్తాంతము వినిన వెంటనే తనదేశమునందు దొరకు విలువగల వింతవస్తువులను ప్రోగుచేసి మాచక్రవర్తి స్నేహమభిలషించుచు నొక రాయబారమంపెను. మరియు తనరాజ్యమున మహమ్మదీయులు ప్రతిశుక్రవారమునాడు నేయాటంకములేక నమాజు చేసికొనుచు, మసీదులలో ఖుతుబాను పఠించు చున్నారనియు, వారందఱు మాయేలిక యనుజ్ఞనిచ్చిన నాతని నామముతోజేర్చి నమాజు చేసికొందురనియు విన్నవింపజేసెను.

"అతనిరాయబారి బంగాళాదేశము నుండి తిరిగివచ్చుచుండిన రాయబారులతో కలసివచ్చుటజేసి, మారాజుకొనువున నున్న సామంతరాజులు కొందరు ఆతని ఆగమనము రాజున కెరిగించి కానుకల నర్పింపజేసిరి. ఆవచ్చిన కళ్ళికోటరాయబారి మహమ్మదీయుడు; మంచివక్త; తనవాచాలత్వముచే రాజును సులభముగ మెప్పించి, పిమ్మట నీవిధముగ ముచ్చటించెను.

"మాయేలిక మీతో నెయ్యమును స్నేహము నెఱప దలచి న న్నంపియున్నాడు. మీరు మాపై ననుగ్రహించి మహమ్మదీయ మతప్రవక్తలను మారాజుకడకు బంపినయెడల అజ్ఞానాంధకారమున నున్న మాదేశపు ప్రజలను, ఏలికను, వెలుతురు లోనికి దెచ్చి పుణ్యముగట్టు కొనినవా రగుదురు." ఆమాటలకు మాచక్రవర్తి మనసుకరిగినవాడై తా నొకరాయబారము బంప నిశ్చయించెను. ఆమహత్కార్యము నిర్వహించుభారము దైవకృపవల్ల యీ అల్పునిపై బడెను. నన్ను కొంద ఱసూయాగ్రస్తులు సముద్రయానమున బోయినవారు మరలతిరిగిరాజాలరనియు, నదిఅపాయకరమనియు నిరుత్సాహపఱచిరి. కాని వారిభయములు బెదరింపులు నిష్ఫలములయ్యెను. మూడుయేండ్లు గడచుసరికి నేనుసుఖముగా స్వదేశము జేరితిని. అప్పటికి నన్ను నిరుత్సాహపఱచినవారు మాత్రము జీవించి యుండరైరి.

కళ్ళికోట నగరము

"కళ్ళికోట రేవులో నోడదిగి యూరిలోనికి బోవునప్పటికి నేను కలలోగూడ కనివిని యెఱుగని యొకవికృతజాతి మనుష్యులు నాకంటబడిరి. ఆట్టివారిని మన మెక్కడను జూడజాలము.

నల్లని దేహచ్ఛాయ వెడదనోరు వ్రేలాడు చెవులు, భీకర స్వరూపము గల్గిన యీ దేశపు స్త్రీపురుషులు మొలపై నొకగుడ్డతప్ప నించుమించుగా దిగంబరులయి యుందురు. కుడిచేతిలో ముత్యమువలె తెల్లనై ప్రకాశించు, నొక కత్తిని, యెడమచేతిలో కాఱుమబ్బువలె నల్లనై కాన్పించు తోలుతో చేయబడిన డాలును ధరించి తిరుగు చుందురు. తిరిపె మెత్తుకొను బిచ్చగాని మొదలుకొని నగరమేలు నృపాలుని వఱకు గూడ నిట్లే యుందురు. ముసల్మానులు మాత్ర మట్లుగాక మంచి విలువకలిగి అందములైన యంగీలను, పచ్చడములను, విరివిగా నరబ్బులవలె ధరించి తమ సంపన్నత్వమును వెల్లడి చేసుకొను చుందురు.

"పట్టణములోనికి బోయిన వెనుక నేను చాలమంది మహమ్మదీయుల తోడను, నాస్తికులగు దేశీయుల తోడను ముచ్చటించితిని. వారు నాకొక యనుకూలమైన భవనమును బసగా నిచ్చిరి. మూడుదినములయిన పిదప నన్ను వారి రాజు నొద్దకు దర్శనార్థము దీసికొని పోయిరి. నేను అచ్చట నితర మనుష్యులవలె మొలగుడ్డ కట్టుకొనియున్న యొకని జూచితిని. అచ్చటి వారంద ఱాతని రాజందురు. వారు తమరాజును సామూరి యని పిలుతురు. ఆతడు మరణించిన వెనుక, నాతని సింహాసనముపై యాతని తోబుట్టువుకుమారుని కూర్చుండ బెట్టుదురట. కడుపున బుట్టిన కుమారునికి గాని, యాతడు లేనప్పుడు సోదరునికి గాని పట్టాభిషేకము చేయుదురట! శౌర్యపరాక్రమాదులవల్ల నెవడు నిచ్చట రాజగుట లేదు. ఇచ్చటి నాస్తికులలో పెక్కు తరగతి జాతులవారు గలరు. బ్రాహ్మణులు, సన్యాసులు మొదలయినవారున్నారు. వారందఱు అనేకమంది దేవతలను గొల్చుచుందురు. విగ్రహపూజలు గావించుచుందురు. ప్రతివర్ణము వారికిని వింతవింత యాచారములు గలవు.

"ఇచ్చటిజనులలో నొకజాతి గలదు. ఆజాతిలోని స్త్రీకి పెక్కుమంది భర్త లుందురు. వారందఱు తమ యిష్టము వచ్చిన వ్యాపారమును జేసికొను చుందురు. ఆభార్యతో గాపురము చేయుటకు రాత్రింబగ ళ్ళిరువదినాలుగుగంటల కాలమును వారుసమానముగా పంచు కొనుచుందురు. ఒకభర్త యాస్త్రీతో నున్నంతకాలము మరియొక భర్త యాస్త్రీకడకు బోరాదు. ఆదేశపు రాజగు సామూరి యీజాతికి చెందినవాడే యట!

"నేను సామూరిని దర్శింప బోవునప్పటికి అతని కొలు వున అప్పటికే రెండుమూడు వేలమంది హిందువులు పైని చెప్పినవిధముగనే దుస్తులు ధరించి సభ నలంకరించి యుండిరి. ముసల్మానులలో ప్రముఖులు గూడ గొంద ఱచ్చట నుండిరి. వారు నన్నుచితాసనమున గూర్చుండ నియమించిన తరువాత నేను మాచక్రవర్తి యిచ్చిన శ్రీముఖమును చదివితిని. పిదప ఆమహారాజు పంపిన కానుకల దెచ్చి యర్పించితిని. సామూరి నా రాయబారమున కంతగౌరవ మొసంగినట్లు కాన్పింపలేదు. అంతట నేను సెలవు తీసికొని నాబసకు తిరిగి వచ్చితిని. హార్మజునగరపు రాజంపిన యుత్తమాస్వములు మొదలయిన సరకులతో నిండిన యోడ ప్రయాణము నందుచాల కష్టముల పాలయి ఓడ దొంగలచే దోపిడి చేయబడి, వస్తువుల నన్నిటిని గోల్పోయి, చిట్టచివరకు ప్రాణములతో కళ్ళికోట చేరుకొనినది. నిజముగా నాప్రియ మిత్రుని ఆయోడలో నుండి బ్రతికివచ్చుట జూచినపుడు నాకు పరమానందమయ్యెను.

"కళ్ళికోటనగరమున అయిదారు మాసములు, నిరుద్యోగినై, గౌరవములేక దు:ఖభాజనమైన జీవనమును గడపితిని. ఆరోజులలో నాకు దు:ఖ మొక్క స్నేహితుడును, కష్టమొక చెలికాడునై యున్నట్లుండెను. అట్లుండ నొకనాడు చీకటిరాత్రి, నేను మంచముపై పరుండి నిద్రించువేళ, విసుగెత్తిన నాప్రాణమునకు కష్టములు గట్టెక్కెనో యన్నట్లు, అంధకారమునుండి వెలికి త్రోయబడినట్లు స్వప్న మొకటి గంటిని. ఆ కలయందు మాచక్రవర్తి కాఖాని సయిద్‌సుల్తాను, నిండు రాజసముతో నన్నుజేరి, ఆదరమొప్ప "నీవింక భయపడకుము, మనసు నూరక నాయాస పెట్టుకొని ఖేదింపకుము. నీకష్టములు త్వరలో తుదిముట్టగలవు" అని గంభీరభాషణముల బలికెను.

"ఉదయమయిన తరువాత నేను నమాజుచేసు కొని కూర్చుండి నపుడు కడచిన రాత్రి కన్న కల జ్ఞప్తికివచ్చి, నన్నొకింత యానంద పరవశునిగా జేసెను.సాధారణముగా స్వప్నములు, తదేక ధ్యానముతో తలపోసి కొనుచున్న వారికి వచ్చును. కలలోని వృత్తాంతములు, పగటిపూట ఎన్నడును జరుగ జాలవు. అయినను కొన్ని స్వప్నములు దైవప్రేరితములనియు, నవి తప్పక జరుగు ననియు పెద్దలు చెప్పుటయు గూడ గలదు. ఖొరానునం దట్టి ప్రమాణము లెన్ని లేవు?

"దైవమునకు నాపై నిప్పటికి కరుణ గలిగెననియు దు:ఖభాజనమైన నాజీవితభాగము సాంతమయ్యెననియు త్వరలో నా కదృష్టము పట్టుట కిది శుభసూచక మనియు, నూరక తలపోయుచు, ఆనందించుచు కాలము గడిపితిని. పండితులయిన వారికి కొందఱికి నాకల వివరించి తెల్పి వారిని దాని యర్థమువిప్పి చెప్పవలసినదని కోరునంతలో విజయనగర చక్రవర్తి కడనుండి యొకదూత వచ్చెననియు, నాచక్రవర్తి చాలసామ్రాజ్యమునేలు సార్వభౌముడనియు, నిపు డాతని రాయబారి సామూరికి పారసీక దేశమునుండి యేతెంచిన రాయబారిని తక్షణము తనయొద్దకు బంపవలసినదనియు, నాజ్ఞాపించు నొక జాబు వ్రాసియుండెననియు దెలియవచ్చెను. సామూరి విజయనగర చక్రవర్తికి సామంతుడు గాకపోయినను, అతడనిన, సామూరి కత్యంత భయముగలదు. ఆచక్రవర్తికి కళ్లికోట వంటి రేవులు మూడువందలు గలవట! మరియు నాతని దేశము మూడుమాసంబులు ప్రయాణము చేసినను తరగనిదట!

"కళ్లికోట మొదలు కాయిల్ వఱకుగల రేవుపట్టణము లనేకము లింకను మలబారు దేశమునందు గలవు. కాయిల్ పట్టణము సింహళద్వీపమున కెదురుగా నుండును. కళ్లికోట నుండి బయలు దేరు ఓడలన్నియు మక్కాకు సాధారణముగా మిరియములు, ఏలకులు, లవంగములు, జాజికాయ మున్నగు సుగంధ ద్రవ్యములను దీసికొని పోవుచుండును. కళ్లికోటలో నుండు నావికులు మంచి సాహసికులు. వారిని చీనిపుత్రులు అని పిలచెదరు. ఒకానొకప్పుడు చీనా దేశీయులు నావికులు కొందఱీకళ్లికోటకు వలసవచ్చి యుండిరట. అందువలన వారి సాహసిక నౌకాయానమును బట్టి యీ కాలపు నావికులకు చీని పుత్రులనుపేరు కలిగినదేమో! కళ్లికోటకు వచ్చెడి యోడలను, రేవులోని యోడలను ఓడదొంగలు దరిజేరరారు. ఆ రేవున యీయా వస్తువులను భేదము లేక సమస్తమును దొరకును. ఆవుమాంసము మాత్రము లభింపదు. ఇక్కడవారు ఆవులను చంపరు. వాటిమాంసమును భుజింపరు. గోవనిన వారల కెంతయో భక్తి. దాని పేడతో చేసినబూడిదను యీ మూర్ఖులు నుదుటిపై ధరింతురు - దౌర్భాగ్యులు!!!

విజయనగర యాత్ర.

"ఈనీచుడు" సామూరివద్ద సెలవుతీసికొని, కళ్లికోట నుండి బయలుదేరి, బందాన రేవుమీదుగా, మలబారు సముద్రతీరమున ప్రయాణము చేయుచు విజయనగర రాజ్యము పొలిమేరల నున్న 'మంగళూరు' రేవును చేరెను. అచ్చట రెండు మూడు దినములుండి మెట్టదారిని విజయనగరమునకై బయలుదేరితిని. మంగళూరు దాటి ముప్పదిమైళ్లు వచ్చునప్పటికి ప్రపంచమునం దెచ్చటను సాటిలేని యొక చక్కని దేవాలయమును జూచితిని. ఆ దేవాలయము పదిగజముల చతురమును అయిదుగజముల ఎత్తును గలిగియున్నది. అదియంతయు కంచులోహముతో చేయబడి యున్నది. ఆ దేవాలయమునకు నాలుగు అంతస్తులుగలవు. అవి యొకదానికంటె నొకటి యెత్తుగ నుండును. అన్నిటికంటె ఎత్తైన అంతస్తులో మనిషి ఎత్తుగల దేవునిసువర్ణవిగ్రహము గలదు. ఆ విగ్రహమునకు రెండు ఎర్రని పెద్ద కెంపులు నేత్రములుగా నమర్పబడి యున్నవి. అవి చూచువారికి, విగ్రహము తనవైపు చూచు చున్నదేమో యనునంత మనోహరముగా నమర్పబడి యున్నవి. ఆ దేవాలయ మంతయును మనోహరమయిన శిల్పపుబనులతో శోభిల్లుచు కనులకు మిరుమిట్లు గొల్పుచుండును.

"అచ్చటి నుండి పోవుచు, ప్రతిదినమును నొక్కొక్క జన సమ్మర్దమయిన పట్టణమునందో గ్రామము చెంతనో ఆగుచు పయనము చేయు చుంటిని. ఇట్లుండ నొకనాడు నేను ఆ కారమున సూర్యుని సైతము కప్పివేయజాలినంత యెత్తైనశిఖరమును జూచితిని. ఆపర్వత మొక యరణ్యమధ్యమున నున్నది ఆయరణ్యమును, పర్వతశిఖరమును దాటి 'బేదునూరు' అను పట్టణము జేరితిని. బేదునూరు నగరమున నిండ్లన్నియు మేడలవలెను సౌధములవలెను గన్పట్టును. ఈ బేదునూరు నందు మిక్కిలి యెత్తయిన యొక ప్రసిద్ధమయిన దేవాలయము గలదు. దాని శిఖరము బేదునూరు నుండి పెక్కుమైళ్లవరకును గాన్పించు చుండును. అతిశయోక్తియని నిందలేకుండ దాని సౌందర్యమును వర్ణించుట కడుకష్టము. ఆ దేవళము నగరమునకు నడుమ విశాలమైన ప్రదేశమునందు, చక్కని పూదోట యందుగలదు. ఆపూదోటయందు పూయనిపుష్పములు, చిగుర్పని ఆకులులేవు. ఆ ఆరామముమధ్య చలువరాతితో గట్టిన మేలైన మంటప మొకటి గలదు. ఆ మంటపము మనిషి యెత్తున నుండును. మంటపము నందలి ఱాళ్ళు నున్నగా చెక్కబడి యొకదానిపై నొకటి సున్నములేకయే అతుక బడినట్లు అమర్చబడి యుండెను. చూపఱ కీమంటప మంతయు నొక్కఱాతితో చెక్కబడినదా యనియుగూడ సందేహము గలుగ జేయుచుండును. ఆ మంటపము నడుమ నల్లఱాతితో నిర్మింపబడిన దేవాలయము గలదు. ఆ దేవాలయముపైన మనుష్యవిగ్రహములు నానావిధములుగ, మూడు బారులుగ నొకదాని క్రిందట నొకటిగా చెక్కబడియుండెను.

"ఎంతటినేర్పరియైనను, చిత్రకారుడు తనగంటముతో గాని, మసిబొగ్గుతోగాని అంతమనోహరముగ నారూపములను చెక్కజాలడని నాయభిప్రాయము.

"ఉన్నతమయిన యాదేవాలయమున శిఖరమునుండి పాదము వఱకు నొకయఱచేతిమేరయినను పూర్వపశ్చిమఖండముల పూర్వ చిత్తరువులతో నిండియుండని స్థలమేలేదు. ఆ దేవాలయము చుట్టును నాలుగేసి యంతస్థులు గల్గి ముప్పది గజములు పొడవును ఇరువది గజములు వెడల్పును ఏబదిగజములయెత్తును గల నాల్గు గోపురములును గలవు.

"ఇతర మంటపములు మొదలగునవన్నియు నిట్లే యతి మనోహరమయిన చెక్కడపు బనులతోడను చిత్తరువుల తోడను శోభిల్లుచున్నవి. ఆకోవెలయందు రాత్రింబవళ్ళు భగవంతుడు స్వీకరింపని ప్రార్థనలు, సంగీతనృత్య వాద్యములు, నై వేద్యములు సమర్పింప బడుచుండును! ఆ దేవాలయను నుండి ధనమును, వెచ్చములను, సమస్తములును ఆగ్రామవాసులు తెచ్చుకొను చుందురు. [8]'నాస్తికులగు' నీహిందువుల కీక్షేత్రము ముసల్మానుల మక్కావంటిదని చెప్పుదురు. ఇచ్చట రెండుమూడు దినములుండి తిరిగి ప్రయాణము సాగించితిని. జిహిజ్జా (క్రీ. శ. 1443-చైత్రము) మాసాంతమున విజయనగర పట్టణమును జేరితిని. నారాక విని సార్వభౌముడు స్వాగత మిచ్చుటకై తగినపరివారమును ఎదురు సన్నాహముచేసి బంపెను. వారు మమ్ముచితరీతుల గౌరవించి, చక్కనియొక సౌధమునకు గొంపోయి విడిదినిచ్చిరి.[9]

"విజయనగర మేలు నృపాలుడు అసాధారణ బలదర్పితుడు. అతని సామ్రాజ్యము సింహళద్వీప ప్రాంతముల నుండి కలబరిగె రాజ్యప్రాంతము వఱకు వ్యాపించి, యెటుచూచిన వేయి యామడల దూరము వ్యాపించియున్నది అతని రాజ్యమునకు పూర్వపశ్చిమ దిశలందు సముద్రములే యెల్లలు. దేశమంతయు చక్కగ సాగు చేయబడుచున్న కనులపండువైన భూములతో నొప్పాఱు చున్నది. ఈక్ష్మాపాలుని రాజ్యమందు దేశదేశాంతర నగరములతో సముద్ర వ్యాపారముచేయు ప్రసిద్ధ రేవుపట్టణములు మూడువందలు గలవట! నగరమందెచ్చట చూచిన రాక్షసులవలెను కొండలవలెను భయంకరములయిన యేనుగులు వేలకొలది గాన్పించు చుండును. ఈరాజు సైన్యము నందు కాల్బలము పదనొకండు లక్షలు గలదు. ఈదేశీయులు తమయేలికను 'రాయ'లని వ్యవహరింతురు. హిందూస్థానమందెచ్చట నీ రాయలంతటి బలదర్పసంపన్నుండగు భూపాలుడింకొకడు లేడని విందుము. ఇచ్చట ప్రజలలో నందరికంటె బ్రాహ్మణులు విశేష గౌరవమును బొందుచు పూజింపబడు చున్నారు.

విజయనగర వృత్తాంతము - సప్తప్రాకారములు.

"విజయనగరము బహువిస్తీర్ణమై, మనోహరమైన మహానగరము. విజయనగరమును బోలిన యనుపమాన భాగ్యవైభవ సౌందర్యములుగల మహానగరమును ప్రపంచమందెచ్చటను ఇంకొకదానిని చూడబోము. మీదుమిక్కిలి వినజాలమన్న అతిశయోక్తి కాదు. ఎంతవిస్తీర్ణము! ఒకప్రాకారము లోపల నింకొక ప్రాకారము చొప్పుననేడు ప్రాకారములు నడుమ గట్టబడిన యీ మహానగరము మిక్కిలి దుర్గమమైనది, ఏడవ ప్రాకారమునకు వెలుపల యేబదిగజముల వెడల్పుగల వాహ్యాళి ప్రదేశముగలదు. అచ్చోట నిలువెత్తున మొనలుదేఱి, కఱుకుగానున్న బండరాళ్ళు దట్టముగా నిలువు లోతున బాతిబెట్టబడి యున్నవి. వాని మూలమున కాలిబంటుగాని రౌతుగాని సులభముగా నాఱాళ్ల నడుమనుండిదూరి పోవజాలడు.[10]

"నగరముచుట్టును గలసప్త ప్రాకారములలో, వెలుపలిది వలయాకారముగా నుండి యెత్తైన యొకశిఖరము పైనున్నది.[11] "అయ్యది ఱాతితోడను సున్నముతోడను గట్టిగాగట్ట బడి బలిష్ఠమైన కవాటమును కలిగియున్నది. ఆద్వారము చెంత రేయింబవళ్లెల్లప్పుడును రక్షకభటులు ఏమరక పడికావలి గాయుచుందురు. వారు దుర్గరక్షణమందెంత అప్రమత్తులుగ నుందురో, యాగంతులకడ నగరప్రవేశపు సుంకమును గైకొనుటలో కూడ నంతటి యప్రమత్తులు.[12] వెలికోటనుండి, లోని రెండవ ప్రాకారమును, దానిని గడచి మూడవ దానిని, అందుండి నాలుగవకోట ద్వారమును అట్లు వరుసగా దాటుచుపోయి యేడవ ప్రాకారమును సమీపించితిమి. ఈకడపటి ప్రాకారము లోపల, రాయల మందిరములు, సౌధములు, సభామంటపములు, కొలువుకూటములు, కచ్చేరీలు గలవు. నగరమునకు వెలుపలగల ఏడవ ప్రాకారమునకు నాలుగు గసనులు గలవు. అం దుత్తరదక్షిణముల వాటికి నడుమను, పూర్వపశ్చిమద్వారముల నడుమను రెండామడల దూరముండును. వెలిప్రాకారములలో మొదటిదానికిని, రెండవదానికిని నడుమగల ప్రదేశమున సారవంతములయి, సాగుచేయబడుచున్న భూములు, ఫలపుష్ప భరతములయిన చక్కనితోటలు పెక్కులు గలవు. అచ్చటచ్చటను మంచి సౌధములును, యిండ్లును, మంచిబావులును, ఆరామములును గలవు. వెలుపలినుంచి మూడవ ప్రాకారము మొదలుకొని లోపలి యేడవ ప్రహరీవరకును, రాజవీధి కిఱు ప్రక్కలను దట్టముగా నిండ్లు, అంగళ్ళు నడుమ నడుమ వీధులు తోటలును గలవు. ఏడవ ప్రాకారములోపల రాయలు నగరును, సభాగారములును, సౌధములును నాలుగు రాజవీథులు గలసికొను మొగయును గలదు. ఆరాజవీధులు నాలుగు నొకదానికొకటి యెదురుగా నున్నవి. ముందుత్తరముగా రాయలు నివసించు నగరుకలదు. ఈనగరు వాకిటనుండియే నాలుగు వీథులును నాలుగు మొగలకు బోవును. ప్రతిరాజవీధి మొగను నగరి వాకిటకు సమీపమున ధనురాకారముగానున్న తోరణముతో గూడిన యెత్తైన గోపురమును, దానిచుట్టును స్తంభములతో నలంకరింపబడిన వసారాయును గలవు. ఈరాజవీథుల మొగలనున్న తోరణగోపురము లన్నిటికంటె నగరి వాకిటను అందమైన గోపురము ఒకటి గలదు. ఈ తోరణగోపురముల క్రిందినుండి నాల్గుముఖములకు బోవు రాజవీథులు మిక్కిలి వెడల్పుగానుండి రమ్యముగానున్నవి." మన యాత్రికుడు వర్ణించిన సప్తప్రాకారములను గూర్చి యొక్కింత దెలుపవలసియున్నది.

విజయనగర వెలిప్రాకారములో మొదటిది హొస్పేటకు నైఋతిదిక్కుగా నున్నది. అచ్చటను గల రెండుకొండల నడుమ గల పెద్ద తటాకమునకు బశ్చిమముగా అబ్దుర్ రజాక్ వర్ణించిన మొదటి దుర్గద్వారము గలదు. ఆదుర్గ సమీపమునగల పెద్దచెఱు విపు డెండిపోయినది, గాని యానగర ముచ్చదశయందుండిన కాలమున, మిక్కిలి లోతుగా నుండి మంచినీరుతో నిండియుండెను. ఆచెఱువు నడుమ నొక బలిష్ఠమైన దుర్గ మిప్పటికిని కలదు. అందు రక్షకభటులు కావలిగాయుచుండెడివారు. రెండవప్రాకారము హొస్పేటకు సమీపములో నుండెను. హొస్పేట (నాగలాపురము) ఆకాలమున జనసమ్మర్దముగా నుండినట్లు అబ్దుర్ రజాక్ వర్ణించుచున్నాడుగదా! మూడవప్రాకారము హొస్పేట కుత్తరముగా బోయియుండవలయును. అదియిపుడు గానరాదు. నాల్గవ ప్రాకారమునందు బలిష్ఠమైన కవాట మున్నది. ఈగోడ "మల్పనగుడి" గ్రామమునకు దక్షిణముగా బోవును. మల్పనగుడి యిప్పటికినిగలదు. పూర్వ మీపేటలో సామంతమండలేశ్వరులు నివసించుచుండినట్లు శిథిలావస్థయందున్న సౌధములు, ఆరామములు మొదలయినవి చాటుచున్నవి. అయిదవ గోడ యీగ్రామమున కుత్తరముగా బోయినది. ఆగోడ చాలభాగము శిథిలమయి పోయినదిగాని, యందలి దుర్గద్వారము మాత్ర మిప్పటికి నిలచియున్నది. ఆరవకోటగోడ కమలాపురపు తటాకమునకు దక్షిణముగా బోయి చుట్టివచ్చును. ఏడవప్రాకార మిప్పటికి మంచిస్థితియం దున్నది. అందున్న నగరులు సౌధములు, మంటపములు, దేవాలయములు, సభాగారములు, మందిరములు మంచి స్థితియందున్నవి. ఈప్రాకారములోని ప్రదేశము తూర్పు పడమరలు రెండుంబాతికమైళ్ళును ఉత్తరదక్షిణములు ఒకమైలును, పొడవును వైశాల్యమును గలిగియున్నది.

ఈ కాలమున విజయనగరమును జూచివచ్చిన వారికి రజాక్ వర్ణనలుబట్టి ప్రాచీన విజయనగరమును అర్థము చేసికొనుట కష్టముగానుండును. ఆతడు వర్ణించిన నాలుగు ధనురాకారముగల తోరణములును మంటపములుగల గోపురములు నిపుడు గానరావు. ఆతడు చెప్పిన నాలుగువీథులలో నొకటి తూర్పుగాబోయి తుంగభద్రమీదుగా నానెగొందెకు పోవును. దానికి తాంబూలపు వీథి యని పిలతురు. ఈవీధి ముఖమున నిలువబడియే మన రజాక్ నగరును ముందు వర్ణించి యుండును. ఈ వీధికి సూటిగా నింకొకవీధి పశ్చిమముగా నరిగి కమలాపురపు కోటగుమ్మముచెంత, నుత్తరముగా తుంగభద్ర హంపీ విరూపాక్ష క్షేత్రములకు బోవువీధిని గలసుకొనును. నగరివాకిటను నాల్గువీథులనడుమ తోరణ, గోపుర, మంటపములనడుమ ప్రదేశము నానావిధములగు అంగళ్ళతో నిండి యానాడు రమణీయకముగా నుండెనుగాబోలు. ఆగోపుర ములు తోరణములు ఎట్లుండెనో యూహించు కొనుటకు మాత్రము ఉత్తరమున తుంగభద్రయొడ్డున గలియు నాలుగువీథుల మొగలుగలిగి శిథిలావస్థయందున్న గోపురమంటపములు జూడ నగును.

విజయనగర రాజవీధులను అబ్దుల్‌రజాక్ ఇట్లు వర్ణించుచున్నాడు.

"రాజవీథులందిరుప్రక్కలను పుష్పలావికలు పరిమళము గ్రమ్ముకొను నానావిధపుష్పములను విక్రయించు చుందురు. అంగళ్ళవాండ్రు తమ యంగళ్ళముంగిట అందమైన మంచెలు గట్టుకొని అందుతమసరకుల నమ్ముకొను చుందురు. ఇట్లిరు ప్రక్కలను అంగళ్ళు, పుష్పలావికలు స్థలమాక్రమించు కొనినను, ఆశ్వికులు, కాలినడక వారు, యేనుగులు రథములు, శకటములు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచు బోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా నీరాజవీథులున్నవి. ఈవీధులు చాలపొడుగై కనుచూపుమేఱకు వ్యాపించియుండి నేడు మనోజ్ఞమయిన దృశ్యము నొసంగుచున్నవి. ఎచ్చట చూచినను పరిమళ భరతములయిన వివిధజాతుల దివ్య కుసుమములే కానవచ్చు చుండును. అన్ని పుష్పములలో నీదేశీయులకు గులాబి (గొజ్జంగి) పూవులన్న మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరకును. ఇచ్చటి ప్రజలకు పువ్వులనిన బ్రాణము. ఆహారమెంత యావశ్యకమో పూవులంతావశ్యకము. భోజనమైన లేకుండ బోవుదురుగాని స్త్రీపురు షులు పూవులు ముడువకుండ, ధరింపకుండ, నెక్కడకు బోలేరు. ఒక్కొక్క విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక వాడవర్తకులు ఒక్కొకచోట గుమిగూడి జుట్టుగావ్యాపారము చేసికొందురు, ఏసరకులవాడ యాసరకులదేగాని యింకొక సరకావాడలో దొరకదు.[13] ఇచ్చటి రత్నవర్తకులు నిర్భయముగా తమసరకులను ఎంతవిలువగల వాటినైనను తమవజ్రవైడూర్య మాణిక్యములను, పచ్చలను, నీలములను, పద్మరాగములను, రత్నములను, మంచి ముత్యములను, పగడములను విచ్చలవిడిగా రాసులక్రింద బోసి నడివీథులందు విక్రయించుకొను చుందురు.

"అత్యంత రామణీయకమై మనోజ్ఞమైన యచ్చోట నగరివాకిట కెదురుగా నున్న నాలుగువీథులందును చక్కని నునుపైన ఱాతికాలువగుండ పరిశుద్ధజలము నగరులోనికి పట్టణము లోనికి నెడతెఱిపిలేక పాఱుచుండును. ఈఱాతికాలువలు పట్టణమునం దంతటను గానుపించును. రాయల సౌధమునకు కుడివైపున మంత్రి శేఖరుని సభాగారమంటపము కలదు[14] ఆ విశాలమంటపమునకు నలుబది స్తంభములు గలవు. వాని కెదురుగా మనిషికంటె యెత్తయిన వసారా యొకటిగలదు. ఆ వసారా యించుమించుగా యిరువది గజములు పొడవును, ఆరుగజములు వెడల్పును గలదిగానున్నది. దీనిని దస్తర్‌ఖానా "దస్తరములకొట్టు" అని పిలుతురు. రాజ్యమునకు సంబంధించిన యావత్తుకాగితములు, పత్రములు మొదలగున వన్నియు, దస్తరములుగా గట్టి యందుంతురు. ఇచ్చటనే కరణములు, తెఱపిలేక లెఖల వ్రాయుచు కూర్చుండియుందురు. ఇచ్చటి జనులు రెందువిధముల వ్రాతసామగ్రి నుపయోగింతురు. అందు మొదటిది: రెండుగజములుపొడవును రెండువ్రేళ్ళ వెడల్పును గల తాటాకులు. ఈజను లాతాటాకులపై గంటములతో పరపర గీకుచు వ్రాయుదురు. ఈవ్రాత అంత శ్రేష్ఠమైనదిగా జనులు తలంపరు. తాటాకులపై గీకబడిన యక్షరములు మసితో వ్రాయబడ నందున రంగుతో కంటికి గానరావు. అదియును గాక తాటియాకులు చిరకాలముండక పోవుటవలన వాటిపైని వ్రాయబడిన అక్షరములును చిరకాలము నిలువజాలవు. ఇక రెండవపద్ధతి: తెల్లని ఫలకములకు నల్లరంగుపూసి వాటిపై, రాతిబలపములను పెట్టి తెల్లగా వ్రాయుట. ఈపద్ధతి చాల మంచిదట. ఇట్లు వ్రాసిన యక్షరములు చాలకాలము నిలచియుండును.[15]

"స్తంభములు గల యాసభామంటపమున నెత్తైన వేదికపై ధన్నాయకుడు (దళవాయి-సర్వసేనాధిపతి) రాజకీయోద్యోగులు పరివేష్టించియుండ కొలువు తీరియుండును.[16] ఉభయ పార్శ్వములందును వేత్రహస్తులు (చోబుదారులు) బారులుతీరి నిలువబడి యుందురు. మంత్రి శేఖరునితో విజ్ఞాపన మ్మొనరించుకొన దలంచినవారు ఈవేత్రహస్తుల నడుమ నడచివచ్చి, ఏదైన యొకవస్తువును కానుకగా నర్పించి, సాష్టాంగ దండప్రణామ మాచరించి లేచి నిలువబడి ముకుళిత హస్తులై శిరమువంచి, మనవి దెలిపికొందురు. ధన్నాయకుడును వారి విన్నపమాలించి, యుచిత రీతిని న్యాయ విమర్శనము గావించి తీర్పిచ్చి పంపివేయును. ఆతని తీర్పునకు తిరుగులేదు. దణ్ణాయడు సభాగారమునుండి వెడలినపుడు కొలువు చాలింపబడును. ఆయనకు ఏడు రంగురంగులగొడుగులు గలవు. ఆతడు బయలుదేరునపు డా యాతపత్రములను గైకొని పరివారము ముందు నడుచును. వేత్రహస్తులు భయపార్శ్వములందును నడచి వత్తురు. వారి ముంగిట శంఖకాహళాది మంగళతూర్యములు పూరించబడుచుండును. ఆతని కిరుప్రక్కలను, వందిమాగధులు కై వారములు సేయుచు స్త్రోత్రపాఠములను జదువుచు "జయీభవ! దిగ్విజియీభవ" యనుచు నడుచుచుందురు. ముందు వేత్రహస్తులు బరాబరులు దెలుపుచుండ, ఇతర సేవకులు ఛత్ర చామరములను బట్టుకొని వెంటరా, దణ్ణాయకుడు (సర్వసేనాధిపతియు మహాప్రధానియు అబ్దుర్‌రజాకు కాలమున నొక్కడేకాబోలు!) బయలువెడలి, రాజమందిరమున కరుగును. రాజనగరునకు దణ్ణాయకుని సభామంటపమునకు నడుమ నేడు కక్ష్యాంతరములు గలవు. ఒక్కొక్క కక్ష్యాంతరము గడచునప్పటి కాతని వెంటబట్టుకొని రాబడు గొడుగులలో నొకటి తరువాత నొకరు వరుసగా మూసి వెనుకనుంచ బడుచుండును. అట్లా దణ్ణాయడు ఏడుకక్ష్యాంతరములను దాటుసరికి ఏడుగొడుగులు వెనుక నుంచబడును. రాజసముఖమును దణ్ణాయకుడొంటరిగ ప్రవేశింప వలయును. ప్రవేశించి రాజ్యమునందలి సర్వవృత్తాంతములను రాయల కెరిగించి, యాతని యాజ్ఞాను గైకొని సెలవు దీసికొని పోవుచుండును. ఈదణ్ణాయకుని నిజమందిరము రాయలనగరునకు వెనుక నున్నది. "నగరునకు ఎడమవైపున ధన్నాయకుని సౌధము, నా వెనుక టంకశాల, గలదు. ఇచ్చటయు నీ దేశమందు చలామణి యగుచున్న నాణెము లన్నియు ముద్రింప బడుచున్నవి. ఈదేశమున మూడు విధముల బంగారు టంకములు, రాగికలిపి ముద్రింప బడుచున్నవి. వానిలో మొదటిది హొన్ను లేక వరహా[17]. ఈవరహా మన దేశపుకొవన్ దీనారములకు రెండింటికి సమానము. వరహాలో సగము విలువగల నాణెమింకొకటి గలదు. దానిపేరు ప్రతాపము.[18] ఇది రెండవ నాణెము. మూడవది బంగారపు పణము. వరహాకు ఇరువది పణములు ప్రతాపమునకు పదిపణములు నిత్తురు. పణమునకు నారు "తర"[19] ములను వెండినాణెములు వచ్చును. 'తర' మునకు మూడు "జితలు"[20] అను రాగిటంకములు వచ్చును. ఈ దేశాచారమునుబట్టి రాయలకు సామంతమండలేశ్వరులు మహామండలేశ్వరులు తామీయవలసిన కప్పమును సంవత్సరమున కొకమారు టంకశాలయందు చెల్లించుచుండుట యలవాటు. ఎవరికైన ధనమీయ దలచినపుడు రాయలు టంకశాలకు వాని కివ్వదలచిన దానికి రాయస మంపును. భటవర్గమున భత్యము నాలుగు నెలల కొకతూరి రాయలిచ్చుచుండును. అందరికిని టంకములనే యిత్తురుగాని, సామంతరాజ్యములపై వచ్చు పన్ను లాదాయమును విలియవేయు నాచారము రాయలపాలనము లందు లేదు.

"ఈ దేశపుజనసంఖ్య యింతయని యుజ్జాయింపుగానైనను చెప్పుటకు వలనుగాదు. ఎచ్చట గాంచినను దేశమంతయు జనసంకీర్ణము. ఇసుకవైచిన రాలనంతమంది జనులున్నారు. రాయల కోశాగారమందు ధనము దాచు కొనుటకై పాతాళపుకొట్టు లనేకములు గలవు. అందు బంగారము వెండి కరిగించి దిమ్మలుగా బోసియుంచుదురట. ఈ దేశమునందు పేదవాని మొదలుకొని భాగ్యవంతుని వఱకు స్త్రీలు, పురుషులు, బాలురు, చివరకు వీధులలో దొమ్మరిలాటలాడు దొమ్మరులు సయితము చేతులకు, దండలకు, మెడలకు, కాళ్ళకు, అమూల్య రత్నాభరణములో, పూత మెఱుగు నగలో ఏవోకొన్నిటిని ధరించుకొందురు."

ఈకాలపు విజయనగర యాత్రికులకు రజాక్ వర్ణించిన రాయల సువర్ణరత్నపు భాండారము అంత:పురసౌధమునకును టంకసాలకు నడుమనున్నట్లు గాన్పించుచున్నది. దానికిలోపల ప్రహరీగోడ యొకటి గలదు. భాండారమంతయు భూమిలో నున్నది. దానికి చుట్టును వీరభటు కావలికాయుటకు వెడల్పయిన త్రోవ యొకటి గలదు. భాండాగారము నలుచదరమైనది. దానిపైన మరియొక అంతస్థు గలదు. ఆఅంతస్థునకు క్రిందభాగమున కర్రసరంభీ గలదు. ఈభాండారము లోనికి మార్గము తూర్పుగా వచ్చును. ఆమార్గమంయు చీకటికోణముగా నుండును. ఆమార్గమునకు చివర పైకి వచ్చుటకు ఱాతిమెట్లు గలవు. ఈ భాండారపు గదినుండి వెలుపలికి బోవుటకు ద్వారము తూర్పువైపున గలదు. ఆగదిలోపల నాలుగు పెద్ద స్తంభములు గలవు. ఈగదియు, దానిపైమిద్దెగదియు వాటిగోడలును, స్తంభములును అవియు తెల్లపాలగచ్చుతో నునుపుచేయబడి యున్నవి. ఇపుడాస్తంభములపై నుండిన సరంబి కూలిపోయినది. గాని క్రిందగదిమాత్రము స్తంభములతో మంచిస్థితియం దున్నది. వర్షము కురిసినను ఈపాతాళపు కొట్టులోనికినీరు దిగకుండుటకై చుట్టు ఎత్తుగా పిట్టప్రహరీగోడ యొకటి నేటికిని గానవచ్చుచున్నది. ప్రౌడదేవరాయలకు క్రీడాభిగామకృతి కర్తయనిబరగు వల్లభరాయని తండ్రియగు త్రిపురాంతకుడు (తిప్పయ్య మంత్రి) నవరత్న సువర్ణ భండార రక్షకుడుగా నుండెను.

ఏనుగులు, వాటిని బట్టుకొనువిధము.

"నగరున కెదురుగా (అనగా తూర్పుగా) ప్రధాన మంత్రి సభామంటపము గలదని దెల్పితినిగదా! ఆసభామంట పమున కెదురుగా రాయల ఏనుగులసాల గలరు. రాయల కీ దేశమందుచాల ఏనుగులు గలవు. కాని వాటిలో మంచివాటిని పెద్దవాటిని మాత్రము రాయలు తన యుపయోగార్థముంచుకొన్నాడు. పట్టణము లోనికి ప్రవేశించునపుడు మనకు తగులు వెలుపలి ఆరేడుప్రాకారముల నడుమ వాయవ్యదిశయందు అనగా ఉత్తరపశ్చిమ ద్వారముల నడుమ, నీయేనుగులను పొర్లించుటకు, పిల్లయేనుగులను పెంచుటకు, మత్తగజములను సాధుచేయుటకును, యేర్పాట్లుగలవు. రాయలకు మంచి చక్కనైన ఐరావతమును బోలిన వెల్లయేను గొకటి కలదు. దానిమీద ముప్పదివరకు నల్లని మచ్చలు గలవు.

"ప్రతియుదయమునీ వెల్లయేనుగును రాయల సమ్ముఖమునకు దీసికొని పోవుదురు. ప్రాత:కాలమున నీ మదకరీంద్రమును దర్శించుట రాయలకు శుభశకునమట. రాయలవారి రాచయేనుగులకు అన్నము వండి పెట్టుదురు. ఆవంట లా కరులముంగిటనే జరుగవలయును. ఉడుకుటయైన తరువాత నాయన్నమునందు కొంచముప్పును, బెల్లమునువేసి, రెండేసి మణుగులు బరువుగల ముద్దలుగా జేసి, నేతిలోగాని, పెరుగులోగాని ముంచి యా జంతువుల నోటిలో నుంతురు. ఆయాహారమును తయారుచేయుటలో సేవకు లే పదార్థమును పొరబాటున వేయుట మరచినను, ఆజంతువులు వారిని జంప నుద్యమించును. రాయలుకూడ వారి పొరబాటును మన్నింపక కఠినముగా శిక్షించును. ఇట్లీ విధమున నా మత్తగజములకు రెండువేళల మేత నిడుదురు. ఏనుగున కొక్కసాలచొప్పున అన్నింటికిని అన్నిసాలలును గలవు. ఆసాలల గోడలు ఎత్తుగానుండి బలిష్ఠములుగా నున్నవి. ఆ గోడలపైన లావుపాటి దూలములును, వానిపైన కర్రసరంబియు గలదు. పైనున్న దూలముల కీ యేనుగుల వీపులకు, మెడలకు, గట్టబడిన నినుప గొలుసులు గట్టిగా గట్టబడియుందురు. ఇట్లుగాక మరి యేవిధమున వాటిని గట్టిబెట్టినను ఆ పెద్ద జంతువులు బలముగల వగుటవలన సులభముగా గొలుసులను వదలించుకొని పాఱిపో గలవు. వీటికి మందఱికాళ్ళకు గొలుసుల సంకెళ్ళుగూడ తగిలించ బడుచుండును.

" ఈ దేశమున జనులు, గజముల నీక్రిందివిధముగా బట్టు కొందురు. అ జంతువులు సాధారణముగా నీరుద్రావు జలాశయములకు బోవు మార్గమునం దొక పెద్దగోయిని త్రవ్వి, దానిపై, వెదుళ్ళను, ఆకులను కప్పి పలచగా మట్టిని జల్లి మామూలు నేలవలె నుంచుదురు. ఎప్పటి త్రోవయే యనుకొని యేనుగు లా గోతిమాద నడువబోయి యందు కూలును. అటుపిమ్మట రెండుమూడు దినములవఱకు మనుష్యుల నెవరిని ఆ చెంతకు బోనీయరు. అట్లు కొన్నిరోజులు జరిగిన పిమ్మట నొక డా మృగముకడ కేగి, దానిని పెద్దకర్ర తీసుకొని యూరకమోదును. ఒకవంక ఆకలిదప్పులచేతను మరియొకవంక బాధాకరములయిన దెబ్బలచేత నొడలునొచ్చియున్న యాకరి కడకు నొకడు హటాత్తుగా బరువెత్తికొని వెళ్ళి దానిని కొట్టుచున్న మనుష్యుని చేతిలోని కర్రలాగుకొని వానినిచావగొట్టునట్లు నటించి పలాయితుని జేసి యాకఱ్ఱను దూరముగా విసిరి పాఱ వేయును. పిమ్మట నాయేనుగున కాహారముగా నింత రొడ్డను, నీటిని యుంచి చల్లగా వెడలిపోవును. ఇట్లు కొన్ని దినములు వరుసగా నీ కపట నాటక మాడబడును. ఒకడు ప్రతిదినమును వచ్చి ఆ యేనుగును చావ మోదుచుండును. రెండవవాడు వానిని తరిమివేసి కర్ర విసరివైచుచు దాని కింతయాహారము వేసిబోవుచుండును. ఇట్లు కొంతకాలము గడచునప్పటి కాజంతువునకు మొదటి వానిపై తీరనికోపమును, రెండవవానిపై నపారమైన ప్రేమయు నంకురించును. అంతట రెండవవాడు మెల్లమెల్లగా యేనుగును మచ్చిక చేసుకొని, దగ్గరకు జేరి, మేనును, తొండమును నిమురుచు, మంచి రుచ్యములయిన పండ్లను, కాయల నొసంగుచు చనువు చేసికొనుచు ఆ యేనుగును, వానియం దత్యంత విశ్వాసముగలదై, తన మెడకు గొలుసులు తగిలించినను యూరకొనును.

"వెనుక నొకసారి, ఈ రాయల గజశాలనుండి, తప్పించుకొని అడవులకు పాఱిపోయిన యొకానొక మత్తేభమును గూర్చి యొకకథ చెప్పుదురు. అప్పుడాతని మావటీడు, దాని వెంటనే చని తఱచుగా నాయేనుగు ఆహారమునకై చరించు తావులందక్కడక్కడ పెద్ద పెద్ద గోతులను త్రవ్వియుంచెనట. మావటీండ్రు ఏనుగులను బట్టుటకే చేయు మాయపన్నుగడ లన్నింటినినాయేనుగు బాగుగానెఱింగిన దగుటచేత, తొండమునందు లావైన దూలమును బట్టుకొని, తనముందు నేలను గొట్టుచు నడచుచు బోవుచుండెను. ఇట్లనుదినమును, మేతకు బోవుచు, జలాశయమును జేఱుచుండెను. అంతట మావటీండ్రకు నా యేనుగును బట్టుకొను నాశ సన్నగిల్లెను. కాని రాయలకు మాత్ర మా ఏనుగును బట్టుకొన వలయనను పట్టుదల తగ్గకపోవుట వలన, వారికి మిక్కిలి ప్రాణసంకట మయ్యెను. అట్టులుండ నొకమావటివాడు ధైర్యము చేసికొని, ప్రాణముపై నాశవదలి యాయేనుగు తఱచుగా బోవుమార్గమున నొకచెట్టుపై దాని కంటబడకుండ దాగుకొని కూర్చుండెను. అట్లుకూర్చుండి యాజంతువు చెట్టుక్రింద నుండి, పోవునపుడు గుభాలున దానిపై కురికి, దానివీపు మీదనుండి, దేహము చుట్టును గుండెల మీదుగా బిగించికట్టబడియున్నత్రాడును గట్టిగాపట్టు కొనెను. ఈయవమానమును భరింపజాలక యాజంతువు, రోషము జెంది, తొండముతో నామావటివాని నెన్నిపాట్లు పెట్టవలయునో యన్నిపాట్లను బెట్టినది. చివరకు వాడెప్పటికిని వీపు మీదనుండి క్రిందకు పడకుండుట గని నేలపైబడి దొర్లనారంభించెను. మావటివాడును మిక్కిలి చురుకు దనము గలవాడును, గడుసు వాడును కావున, నాయేనుగు ఎట్లుదొర్లినను వాడుమాత్రము దానిక్రింద బడకుండ తప్పించు కొనుచు కుంభస్థలములు బ్రద్దలగునేమో యనునట్లు నెత్తి పడ మోదుచుండెను. ఈబాధ భరింపజాలక తుద కామత్తేభము అలసి, సొలలి, మావటివాడు తన్ను గొలుసులతో దేహమంతయుకట్టి, యిష్టమువచ్చిన తావుకు గొంపోవుటకు సమ్మ పించెనట! రాయలేదుట కా మావటివాడు, పట్టుబడిన మదపుటేనుగును గొంపోయెను. దానిని జూచినపుడు సంతుష్టాంతరంగుడై రాయలు వాతని యుచితరీతిని బహూకరించి పంపెనట.

"హిందూస్థానము నందు రాజులు వేటకు ఏనుగుల నెక్కిబోవుదురు, వేటకు బోయినపుడెల్ల, నెలలతరబడి ఆయడవులయం దుండుచు, ఏనుగుల వేటాడుచు, బట్టుకొనుచుందురు. ఏనుగుల వేటయన్న వారికి బరమ సంతోషము[21] రాయల కెవ్వని మీదనైనను కారణముగల్గి అనుగ్రహము దప్పినపుడును, వానినేరము, మిక్కిలి గొప్పదైనపుడును, వానిని యీ మదపుటేనుగుల మ్రోల బడద్రోసి, త్రొక్కించి చంపుదురు. అవి వారిని కాళ్లతో త్రొక్కుచు, దంతములతో బొడుచుచు, తొండములతో చీల్చివేయును. వర్త కులు ఏనుగులను సింహళమునుండి గూడ, ఈదేశమునకు గొనివచ్చి వాటియెత్తును బట్టి, గజమున కింత థరయని నిర్ణయించి యమ్ముచుందురు.

వేశ్య వాటికలు.

"టంకసాల కెదురుగా, కటక పాలుని, కచ్చేరి యున్నది. ఆతని క్రింద ఆనగరక్షణమునకై పండ్రెండు వేలమంది పడికావలి వాండ్రు గలరు. వారికి జీతము క్రింద ప్రతిదినమును మనిషి కొకపణము చొప్పున వేశ్య వాటికల వలన పండ్రెండు వేల పణముల సుంకము వసూలు చేయ బడుచుండును. వేశ్యవాటిక యందలి, వెలయాండ్ర హర్మ్య, సౌధముల విభ్రమ వైభవ సంపదలు, అవ్వీటి విలాసనీతతుల సౌందర్యము మొల్కలేనగవుతో ముద్దుగురియు చున్నవారి నెమ్మోములు, వారి యొయ్యారపు నడకలు, తళుకులు ఎంతటివానినైన వలపించువారి నేర్పరితనపు మినుకులు, మోహనాస్పదములయిన వారి చూపులు ఆహా! హా! వర్ణింపనాకు శక్యముగాదు. వర్ణింప మొదలు వెట్టిన నాకుకూడ మనసు చలించును గావున నింతటితో వారవనితుల విలాసములు వర్ణింప విరమింతును.

"వేశ్యవాటికనుగూర్చి యొకమాట మాత్రము చెప్పక తప్పదు. టంకసాల వెనుక నించుమించుగా నిరువదిగజముల వెడల్పును మూడువందల గజముల పొడవును గల యొక వీధిగలదు. ఆవీథి కిరుప్రక్కలను చక్కని పూబొదరిండ్లతో నిండిన ముంగిట వాకిళ్ళుగల శోభనగృహములు బారులు తీర్చి యున్నవి. ఆ ప్రాంగణములందు చంద్రకాంతశిలానిర్చితములయిన వేదికలు వరుసగా గలవు. ఆ వేదికలకువెనుక, మేడ గోడలపై సింహములు, పులులు, చిరుతపులులు, ఏనుగులు మున్నగు వన్యమృగము లనేకములు జీవము లుట్టిపనినట్టు చిత్రింపబడియున్నవి. అపరాహ్ణమున, ఎండవేడిమి యించుక తగ్గుచుండువేళ నీవారవిలాసినులు చక్కగా నలంకరింపబడిన తమయిండ్ల ప్రాంగణములందున్న చంద్రకాంతశిలావేదికలపై తివాసులమీదను, సోఫాలమీదను, విలాసముగ, హొయలు మీఱి చేటీజనముతో సుఖొపవిష్టులయి, యుందురు. ప్రతి వెలపడుచును ఒడలంతయు, నవరత్నఖచిత మూల్యాభరణములతో, మంచిముత్తెముల హారములతో కన్నులకు మిఱుమిట్లుగొల్పు చక్కదనముతో రంగురంగుల చీరెలుకట్టి యలకరించుకొని, చూచువారల హృదయములను జూఱగొను చుండును. అచ్చటివారందఱు, పదియాఱ్వన్నె కుందనపు శలాకలవలెనుండు నెఱజవ్వనపు సొగసుకత్తెలే! ఒక్కొక్క పడుపుటింటికి ఇద్దరు ముగ్గురు దాసీలుందురు. వారు తమ యజమాను రాండ్రకడ నిలువబడి, మార్గమున బోవువిట కాండ్రను తమనేర్పఱితన ముట్టిపడునట్లు, వెల్లాటకత్తెల సౌందర్య సముద్రములో ముంచివేయ బ్రయత్నించు చుందురు. ఆవీథిని మన్మధుడు తన చెఱకువింటిని, సంధించి, శరంపరలు గ్రుమ్మరించుచు రేబవలు సంచరించుచు యప్సరసలను బోలిన ఆకాంతల వలలోవిరహులగు వారిని బడద్రోయుచుండును. వెల యాండ్ర పొత్తుగూడి సుఖింపగోరువా డీవీధినిబోయి, తన యిచ్చవచ్చిన తరుణిని గోరుకొని బడయవచ్చును. వేశ్యాగృహములందు పరిచారికలు, దాసీలు, మిక్కిలి జాగరూకులయి యుందురు. పడపుటిల్లాండ్రకై వచ్చిన విటులసొ త్తేదయిన నొకగ్రుడ్డిగవ్వైన పోయినను పరిచారికల ప్రాణము మీదికి వచ్చును. వేంటనే వారు గృహమునుండి వెడలగొట్టబడుదురు. ఈనగరపు టేడుప్రహరీలనడుమ లెక్కకుమించిన వేశ్యాగృహములున్నవి. ఈ వేశ్యలవలన రాబట్టబడిన పండ్రెండువేల పణము లనుదినమును నగరు కావలివాండ్ర జీతబత్తెములకై వినియోగింపబడును. ఈ కావలివాం డ్రనుదినమును, అనుక్షణమును ఈయేడు కోటలనడుమ నేమేమిజరుగుచున్నదో, ప్రతిక్షణమును కటకపాలున నకెరిగించుచుండవలయును. ఏవస్తు వెచ్చట పోయినను, ఎక్క డే దొంగతనము జరిగినను తక్షణము నేరస్థుడని వెదకి, పోయిన సొత్తును సొత్తువానికి జేర్పవలయును. నగరమున ఏ నేరమును జరుగ నియ్యరాదు. వారివలన నేలోపమయిన వచ్చినచో, దానికి వారుకొంత జరిమానా నిన్చుకొన వలయును. నాస్నేహితుడొకడు కొందఱి బానిసవాండ్రను కొనియుండ, వారు తమ కావలివాండ్ర యధీనము తప్పించుకొని పారిపోయిరి. ఈ వృత్తాంతమును మేము నగరపాలకునికి (కటక పాలుడు) ఎరిగించినంత, నాతడు మేమున్న పట్టణ ప్రాంతమందంతటను గల బీదసాదలను, పాఱిపోయిన బానిసలను పట్టితెచ్చి యొప్పగింప వలసినదనియు, లేనియెడల వారలను గొనుటకై వెచ్చించిన ధనమును తెచ్చి యీయవలెనని ప్రకటించవలసినదని, తనసేవకుల పడికావలివాండ్రగు కాజ్ఞాపించెను. వారును అట్లు చేసియుండిరి. ఆబీదలు, పాఱిపోయిన వారిని తెచ్చియొప్పగింపలేక నెట్టెటో, మేము ఖర్చు పెట్టిన మొత్తమును దెలిసికొని తెచ్చియిచ్చిరి. ఇట్టివి చోద్యమయిన, యీ విజయనగర మహాపట్టణ వృత్తాంతములు! యీనగర మేలు రాయల పరిపాలనా విశేషములు!"

"ఈచరిత్రకారుడు, రాయలవారి యుద్యోగీయులచే సన్మానింపబడి, యాతనికై నియోగింప బడియున్న రమ్య హర్మ్య తలమున విడిది దిగియుండెను. ప్రయాణపు బడలిక వలన నీతని దేహము మిక్కిలి అలసి సొలసి యుండి నందున పెక్కుదినము లితడు సుఖముగ, నిర్విచారముగ, నాచక్కని సౌధమున, స్వర్గసమమైన యామహానగరమున నేకొదువయును లేక మొహరము పండుగలు వచ్చునంత వఱకు గాలము బుచ్చెను.

రాయల సందర్శన భాగ్యము.

"ఇట్లుండ నొకనాడు రాయలవారి సన్నిధినుండి నా కొఱకై చారులువచ్చి, సార్వభౌముని యాజ్ఞయైనదని, తెలియచేసిరి. ఆసాయంకాలము నేనును సర్వసన్నద్ధుడనై, కొలువు కూటమున కేగి, రాయల సందర్శనప్రాప్తికి పరమానందము నొందుచు, మాయేలిక యభిమతానుసారముగ, నైదు పార సీక యుత్తమాశ్వములను, తొమ్మిదిరకములు ఎర్రపట్టు, మొఖమలు పట్టువస్త్రములను, అంగీగుడ్డలను, రెండుపళ్ళెరములలో బెట్టి, రాయలకు కానుకగా సమర్పించితిని. వెనుక నేను వర్ణించిన నలువది స్తంభములుగల సభామంటపమున నత్యంత వైభవముతో నొకవేదికపై గల సింహాసనముపై రాయలు సుఖోపవిష్టుడై, నాకు దర్శనమిచ్చెను. కర్ణాటక్ష్మాపాలుడగు నా రాయలు ఒకవంక, పండితులు బ్రాహ్మణులు, కవులు, వేదాంతులు, వేశ్యలును, ఒకవంక వీరభటులు, సామంతమండలేశ్వరులు బలిసి కొలుచుచుండ, మహావైభవముతో కొలువు దీరియుండెను. ఆతడు పసుపుపచ్చని పట్టుతో చేయబడిన యుడుపులను ధరించియుండెను. మెడలో, నరత్నఖచితమై వెలలేని మంచిముత్యములచే చుట్టబడిన కంఠపట్టికను నానావిధరత్నభూషణములను ధరించియుండెను. అతని యాభరణముల విలువ ప్రపంచమున నేరత్నవర్తకుడుకూడ కట్టజాలడు; ఆతడు పచ్చని కుందనపు మేనిచాయగలవాడు. కొంచెము పలుచగానుండి పొడవైనవాడు. ఆతనిరూపరేఖాదులుచూడ చాల చిన్నవయసువాడుగా గానుపించినాడు.[22] ఆతని చెక్కి ళ్ళించుక పలుచగా నున్నవి. సొగసైన మీసమున్నది. గడ్డము మాత్రము లేదు. ఆతని చూపులును, దృష్టియు, చల్లనవై హృదయానందకరములై విశ్వాస, భయ, గౌరవములను గలిగింపజాలినవిగ నున్నవి. కొలువు కూటమును ప్రవేశించినపుడు నేనును గౌరవసూచకముగ శిరసువంఛియుంటిని. ప్రతీహారులు రాయలకు నన్నెఱిగించిరి. రాయలును అంతట నన్నుచితరీతిని సంభావించి, తన చెంత గూర్చుండ నాజ్ఞాపించెను. నేనపుడు మాప్రభువుపంపిన నుహృల్లేఖను రాయల కందీయ,[23] ఆతడు దానినితసదుబాసినిగైకొమ్మని యాదేశించి యిట్లని మృదుమధురగంభీర భాషనముల బల్కెను. "మీరాజు అత్యంతాదర గౌరవములతో పుత్తెంచిన రాయబారమును, ఈలేఖను గాంచుటచే నాహృదయము పరమానందభరితమైనది."...నేనాసమయమున నూపిరి సలుపకుండునంతటి దట్టముగా నుడుపులను ధరించినవాడ నగుటచే, తమకమును దాచుకొనజాలమి వలన యుష్ణము పైకుబికి, నాకు ముచ్చెమ్మటలు గ్రమ్మజేసి వైచెను. అంతట నేను చెమటచే బాధనొందు చుండ కరుణార్ద్ర హృదయుడైన రాయలు, తమచేత నున్న వట్టివేళ్ళవీవనను విసరుకొనుటకై నాకు ప్రసాదించిరి. ఆమహా గౌరవమునకు నేను మిక్కిలి అలరితిని. ఇంతలో సేవకులు కొందఱు ఒక బంగరు పళ్ళెములో రెండుమోదల తమలపాకులును, ఇన్ని పోకలును, సుగంధ ద్రవ్యములును, అయిదు నూర్ల పణములగల నొక పట్టుసంచియు, నిరువది దీనారము లెత్తు పచ్చకర్పూరమును, దెచ్చియొసంగిరి. ఆ కర్పూరతాంబూల మందిన తరువాత రాయలు సెలవు తీసికొనుట కనుజ్ఞ నిచ్చిన విడిదికి వచ్చిచేరితిని. నాకు విజయనగరమున నున్నంతకాలము దినవెచ్చమునకై రెండుగొఱ్ఱెలు, ఎనిమిదికోళ్లు, ఒక మణుగు నేయి, ఒకమణుగు పంచదార, రెండువరహాలును, పంపబడుచుండెను. ఈరీతిగ నేను ఆనగరముననున్నంత వఱకు జరుగుచునే యుండెను. వారమునకు రెండుపర్యాయములు, రాయలుతనకొలువునకునన్ను బిలువనంపుచుండెను. సాయంతనపువేళ, నేను సముఖమున కరిగినపుడు, రాయలప్పుడప్పుడు మాయేలికయగు ఖాకాని సయ్యదు సుల్తాను వారినిగూర్చికుశల ప్రశ్నలు చేయుచు వచ్చెను. కొలువుకూటము నుండి సెలవుగైకొని యరుగు సమయమున, తొలినాటియట్లె కర్పూర తాంబూలము బంగారుపణము లయిదువందలుగల పట్టుసంచి యొకటియు, నాకొసంగ బడుచుండెను. ఇట్లు నన్ను బహూకరించు సందర్భమున నొకనాడు రాయలు, నన్నుచూచి, "ఓయీ,! మీరాజులు, తమకొలువు కేతెంచి రాయబారులతో సుఖవినోద గోష్టితో తనివినొందక సహపంక్తిభోజన మిచ్చిగౌరవింతురు. నీవు విమతస్థుడవు, నిజాతీయుడవు నగుటచే నీతో మాకు సహపంక్తి భోజనభాగ్యము లభింపదు గావున, అందులకై చక్రవర్తిచే నంపబడిన నీవంటి రాయబారి కుచితమైన రీతి భోజనమునకు మారుగా, మాగౌరవమును జూపుటకీ సువర్ణటంకము లొసంగితిమి." యని పలికెను.

తమలపాకులు - తాంబూలము

" తాంబూలము నమలుటచే గాబోలునేమి తమలపాకులయొక్క గుణముల వలననేమి, కర్ణాటభూపాలుడుతన అంత:పురమున, ఇంచుమించుగా నేడువందలమంది రాణులను, ఉంపుడు కత్తెలను భరించుకొనుచున్నాడు! అంత:పురములోనికి పదియేండ్లు గడచిన మగచిన్నవాడు సయితముబోరాదు. ఒకొక్కయువతికి, రాణియైనను, ఉంపుడుకత్తె యైనను, ప్రత్యేకముగ వేర్వేఱు వసతులు, పరిచారికలు, దాసదాసీజనమును గలరు. చివరికిద్గరు రాణులయిన, యిద్దరు ఉంపుటాండ్రయినను గలిసి నొక యింట నివసింపరు. ఈవిశాలరాజ్యమం దెచ్చటనయిన సుందరియగు బాలికయుండుట తటస్థించెనేని వెంటనే రాయలామె జననీజనకుల యనుజ్ఞ బడసియో రొక్కమిచ్చియో, ఆబాలికను, మహావైభవముతో తీసుకొని వచ్చి తనవిలాసార్థము అంత:పురమునందు జేర్చుకొను చుండును. రాణివాసమున జేరిన తరువాత నామె యింక పరునికంట బడదు.

రాయలను జంపుటకు జరిగిన ప్రయత్నము

"ఈ చరిత్రకారు డింకను కళ్ళికోటనగరమున, కారణ వశమున వేచియుండిన కాలమున విజయ నగరమున దారుణ మయిన వింత వృత్తాంత మొకటి జరిగియుండెను. అందలి విశేషము లిట్టివి. రాయలసోదరుడు,[24] తన నివాసము కొఱకు నూతనముగా భవనమును నిర్మించుకొనెను. నూతన గృహప్రవేశ మహోత్సవమునాడు రాజధాని యందుగల సకల సామంత మండలేశ్వరులను, సేనాపతులను, నియోగులను, విందారగింప నాహ్వానించెను. ఇచ్చటి దేశీయుల యాచార సంప్రదాయములను బట్టి ఒకరు చూచుచుండగ నింకొకరు భుజింపరు. విందుకై యరుదెంచిన అతిథులందఱు, ఆ నూత్నమందిరమున గల యొక విశాల మంటపమునందు సుఖాసీను లయి యుండిరి. యజమానియో, లేక యాతని పరివారములో పెద్దవారో, యొకరు అతిధులు కూర్చుండియున్న మంటపము కడకు వచ్చి, లోపల సిద్ధమయిన భోజనాదికము నారగించుటకు ఒకని తరువాత నింకొకరిని లోనికి దీసికొని పోవుచుండిరి. ఆమహోత్సవ సందర్భమునకు పట్టణము నందుగల యన్ని వాద్యముల వారిని రప్పించి, రాయల సోదరుడు భేరీ, మృదంగ, డక్కా, కాహళాదవాద్యధ్వనుల చేతను, సంగీతవాద్య విశేషముల చేతను, హర్మ్యమంతయు, గింగురుమని మారుమ్రోగునట్లు కోలాహల శబ్దమును చేయించుచుండెను. ఆ సందడిసమయమున, నొకరి మాట యొకరికి కష్టముమీద సయితము వినబడుటలేదు. ఒక్కొక్క అతిథిని లోనికితీసుకొని పోవుచు, ప్రత్యేకమందిరములందు కూర్చుండ బెట్టుచుండిరి. అట్లు ఒక్కొక్కడే లోనికి బ్రవేశించు నపుడు ద్వారము చెంతను తలుపు చాటున దాగుకొని యుండిన హంతకు లిరువురు, హఠాత్తుగా వాని మీదబడి, తమత్తులత్తికతో బొడిచి ముక్కలు ముక్కలుగ జీల్చివైచుచుండిరి. ఆ నిర్భాగ్యుని శవ మచ్చటినుండి యతిత్వరితముగ గొంపోవబడిన వెంటనే, మరియొక యదృష్టహీనుడు లోనికి ప్రవేశపెట్టబడు చుండెను. ఆనాడు అతిథులయివచ్చిన, అదృష్ఠీనుడెవ్వడును తిరిగి తమ యింటి ముఖమును జూడబోయి యుండలేదు.

"ఆనాడు జరుగుచుండిన మేళ, తాళ, వాయిద్యముల ఘోషవలన, నూతన గృహప్రవేశ సందర్భమున నిరపరాధులగు వారెందరి ప్రాణములు, పరులెరుగకుండ క్రూరముగ గైకొనబడుచుండెనో, యాహంతకుని పరివారము తప్ప నొరులెవ్వరు నెఱుంగరు. ఇట్లు నగరమున నూరును పేరును పలుకుబడియు గల్గి రాజభక్తిగల ప్రతిమనుజుడును దారుణముగ వధింపబడియెను. ఒకమూల నీ దారుణ కృత్యములు జరుగుచుండ, రాయలసోదరుడు, రాయల యంత:పురమునకు జనెను. అచ్చట కావలివాండ్రను మచ్చికలాడి, తనయింట జరుగుచున్న విందునకై యాహ్వానించి, మెల్లగా వారినందరి నొకరి తరువాత నొకరిని తనయింటికి బంపివైచెను. ఇట్లు యించుమించుగా, నగరికావలివాండ్రనందఱిని బంపివైచి, మెల్లగా రాయలను సమీపించెను. రాయల సమ్ముఖమునకు జనునపు డాతడు చేత నొక బంగరుపళ్లెరము బట్టుకొని, యందొక బాకును దాచియుంచి దానిపై తమలపాకులు కప్పివైచి యుంచెను. రాయలను సమీపించితోడనే "జగత్ప్రభూ! ఏలినవారు విందారగించుటకై సర్వము సన్నద్ధము చేయబడినది. ఇక తమరాక మా కనుగ్రహింప వేడెదను." అని పల్కెను. అదృష్టవంతులను, కారణ జన్ములు నగు మహారాజులకు రాబోవు విపత్తులు సూచితమగుచుండునని పెద్దలవలన విందుము. అందుచేతనే కాబోలు రాయ లదృష్టవశమున తన కస్వస్థతగా నున్నదనియు తమ్ముని యాహ్వాన మంగీకరింప జాలకునికి మన్నింపవలయుననియు వేడుకొని విందునకు బోయి యుండలేదు. "రాయ లిట్లుతనమాయోపాయమును భగ్నపఱచుట గ్రహించి, యాగ్రహము పట్టజాలక, నాదుర్మార్గుడు పళ్లెరమునుండి బాకును దీసి రాయల దేహమంతయు తూట్ల పడునట్లుగ హఠాత్తుగ మీదపడి గాయములు గలుగజేసెను. ఈ దారుణ కృత్యమును లేశమయినను అనుమానింపకయున్న వాడుగావున రాయ లసహాయుడై, గాయపడి, సింహాసనము మీదనుండి వెనుకకు పడిపోయెను. అద్దురాత్ముడంతట రాయలు మరణించెనని భావించి, తన చెంతనున్న సేవకున కాతని శిరము ఖండించవలసినదని యాజ్ఞాపించెను. తానును తమకము నాపుకొనజాలక, రాజద్వారాము కడకు బోయి, యచ్చట నున్న పరివారముతో "నేను రాయలను; మంత్రిని ధన్నాయకులను, మండలేశ్వరులను ఎల్లరును జంపితిని. ఇపుడు నేనుసింహాసనమధిష్ఠింపబోవుచున్నాను" అని బిగ్గరగ నఱచెను. ఇంతలో రాయల తలను గొట్టుట కాజ్ఞాపింప బడిన ద్రోహి మెల్లగా రాయలచెంతకు జేరి కత్తి యెత్తునప్పటికి, రాయలు సింహాసనపుకాలు నూతగొని లేచి ఖడ్గమును దీసుకొని యాహంతకుని హృదయము పైనొక్క వ్రేటువేసి క్రిందకు బడద్రోసెను. ఆ సమయమున రాజభక్తి, విశ్వాసములుగల యొక భటుడు అంతవరకు భీతచిత్తుడై మూలను దాగియుండి రాయలు లేచుటయు, జీవించి యుండుటయు గాంచిధైర్యము దెచ్చుకొని, రాయలకుసాహాయ్యము గాబోయి, హంతకుని యమపురి కంపియుండెను. రాయలును, జరిగిన బీభత్సమునకు వెఱగంది యాభటుని సాహాయ్యమున, అంత:పురము లోనికి బోయెను. ఇంతలో నా రాయల సోదరుడు సింహాసనమెక్కి యచ్చటనున్న వారి నందరిని తన్ను రాయలుగా బరిగణింప వలసినదని యాజ్ఞాపించు చుండెను. అదివిని రాయలే మరియొక ద్వారమునుండి ప్రవేశించి "ఓరోరి రాజద్రోహులారా! నే నింకను జీవించి యుండగనే మరియొక దురాత్ము డెట్లు సింహాసన మధిష్ఠింపగలడు? నా కండ్లయెదుట ద్రోహియైన నాసింహాసనము నదివసించియున్న యాతని బట్టుకొనుడు" అని బిగ్గరగ నఱచెను. ఆసందడి నంతయు నిశ్చేష్టులయి యవలోకించుచున్న జనసమూహము ఆదురాలిమానవుని పైబడి కత్తులతో కండకండలుగ జీల్చివైచి చంపివేసిరి. రాయ లంతట కొలువుదీరి, తన యితర సోదరులను, సామంతులను, దళవాయి, ప్రధానులను రాజ బంధువులను రావలసినదని యాజ్ఞాపించెను. మహాప్రధానితప్ప నందరును మృతులైరన్న వృత్తాంతమును దెలిసికొని రాయలు విషణ్ణుడయ్యెను. ధన్నాయకుడనబరుగు ప్రధానమంత్రి, ఈ దారుణ విప్లవమునకు కొంతకాలము క్రిందటనే సింహళ ద్వీపముమీదకు దండయాత్ర వెడలియుండెను. లేకున్న అతడును చచ్చియేయుండును. రాయలును, రాజధానియందిట్టి ఘోరకృత్యము జరుగుటకై చాలతడవు చింతించి ధన్నాయకుని వెంటనే బయలుదేరి త్వరితముగ రావలసినదని సింహళమునకు చారులను పంపెను. ఈ కుట్రయం దేమాత్రమయిన జోక్యముగలవారి నందఱిని బ్రతికియుండగనే కాల్పించియో, ఒడలు చీలిపించియో, మరియొక విధముగనో చంపించి శిక్షించెను. వారికుటుంబముల నన్నింటిని నాశనముచేసి వారిసొత్తు స్వాధీనము చేసుకొనెను. మొదట విందునకును గృహ ప్రవేశ సందర్భమునకును ఆహ్వానము గొనివచ్చినవాడు కూడ మిగిలిన రాజద్రోహులవలెనే శిక్షింపబడెను. ధన్నాయకుడు రాజధానికి తిరిగివచ్చినపుడీ వృత్తాంతమంతయు విని యాశ్చర్యమగ్న మాసనుడయ్యెను. రాయలు ధన్నాయకుని కటాక్షవీక్షణములతో సముఖమునకును చూపినవాడు, అతడు సాష్టాంగముగ నమస్కరించి "యేలినవారీమ హోపద్రవమును సుఖముగ నుంటచేసిన యీ శ్వరునకు నాకృతజ్ఞతావందనము లర్పించుచున్నాను" అని పల్కెను. ఆ సంవత్సరము రాయలకు గొప్పగండము తప్పుటచే, పునర్జీవియయ్యె గావున ధన్నాయకుడు మహర్నవమి మహోత్సవములు ద్విగుణీకృత వైభవముతో జరుపవలసినదని యాజ్ఞాపించి సన్నాహము చేయించెను.

మహర్నవమి - మహోత్సవములు

"ఈ దేశీయులనుపమ భాగ్య, వైభవ, బల సంపన్నులు. అందువలన, తమవిభవమును, ఐశ్వర్యమును, గౌరవమును సగర్వముగ ప్రకటింపవలయునను కౌతుకము గలవారు. మహర్నవమి పండుగ నీరాయలు, ఆతని మండలేశ్వరులు మున్నగువారలు తమతమ యైశ్వర్యవిభవముల ననుసరించి అతి వైభవముగ జరుపుదురు. ఆమహోత్సవములు కన్నుల పండువుగా జూడవలసినదేకాని వర్ణింపనలవిగానిది. అయినను ఆమహర్నవమి వృత్తాంతమును వర్ణింప బ్రయత్నించెదను. ముందుగా సామ్రాజ్యములోని యన్నిప్రాంతముల నుండియు, మండలేశ్వరులను, మహామండలేశ్వరులను, దుర్గాధిపతులను, దళవాయిలును, మహర్నవమి పండుగలకు రాజధానికి రావలసినదని యాజ్ఞాపించును. కొందఱి మండలేశ్వరుల రాజ్యములు రాజధానికి మూడుమాసములు ప్రయాణదూరమునందు గూడ నున్నవి, ఆవచ్చిన సామంత రాజులందఱకును తమ పరివారములో వేయేసియేనుగులకు తక్కువగా కుండ నుండును. తుపానుచే నల్లకల్లోలమైన, యలలచే నొప్పారు మహాసముద్రపు కెరటములవలె నీమత్త గజముల తొండములు విసరు కొనుచు, ఊగుచు లేచుచు ఊపుకొనుచు నడచుచుండును. ఆమత్తేభముల ఘీంకారములు మేఘగర్జనములని భ్రమింప జేయుచుండును. తొండములకు ముఖములకు తళతళమెరయు ఇనుపకత్తులు, బాకులు, బల్లెములు, తాపించిన కవచములును సర్వాలంకారభూషణములతో, వింతవింతరంగులతో, శృంగారింపబడిన చవుడోలులమర్పబడి, నామదకరు లొండొంటి నొరసికొనుచు, తొండములు సాచుచు, విసరుచు మావటీండ్రను బెదరించుచు, చూపరులు విసరుఫలముల నందుకొనుచు నడచుచుండును. ఈయేనుగులపై నొక్కొక్కప్పుడామండలేశ్వరుల పరివారమునకుజెందిన గార డివాండ్రు, దొమ్మరివాండ్రు, విప్రవినోదులు; మున్నగువారు ఆసీనులయితమ నేర్పరితనమును, చూపు విద్యలను ప్రదర్శించుచుందురు. ఈయేనుగుల ముఖములపై, తొండములపై వింత వింతరంగులతో చిత్రింపబడిన రూపములు చిత్రములు చిత్రింపబడి మనోహరముగ ఘట్టంబడియుండును.

"రజాబ్ మాసమునపూర్ణిమనాడు(ఆశ్వీయుజము 1446 క్రి.శ.) విశాలమయిన యొక మైదానము మీద రాయలు డేరాలు వేయించి కొలుయుండెను. అతడేర్పఱచిన ముహూర్తనమునకు రాజ్యమునందలి మహాప్రధానులు, దళవాయిలు, ధన్నాయకులు, మండలేశ్వరులు, బ్రాహ్మణులు, రాక్షసులనుబోలు ఏనుగులు రాయలసమక్షమున కొలువు బలిసియుండిరి.[25]

ఆవిశాలమయిన మైదానమున, నువ్వుగింజలు చల్లిన రాలనియా జనసమూహము, నడుమనడుమ మహోన్నతములయిన ఏనుగులు, వింతరంగులు కనులు మిరుమిట్లు గొల్పుచిత్రములు, పతాకములుగల, అంబారీలు, అన్నియు నొక మహాసముద్రమును దలపునకు దెచ్చుదుండెను.

"సుందరమైన యాబయలునందు, రమణీయమైన మందిరములు, అయిదేసి అంతస్థులు ఎత్తుగలవి అనేకమును నిర్మింపబడి యున్నవి. ఆయంతస్థులయందు అత్యద్భుతములయి, విధములయి, నానావిధరూపములతో సొంపుమీఱిచిత్రములు, చిత్రపటములు వ్రేలాడగట్టబడి యున్నవి. ఆచిత్తరువులలో పక్షులు, జంతువులు, మృగములు, మనుష్యులు, స్త్రీలు, మున్నగునవి యనేకములు చిత్రింపబడియున్నవి. ఇవియన్నియు, నత్యాశ్చర్యకర మైన కళాచాతుర్వముతో చిత్రింపబడిన చిత్తరువులు కాని యొండుకావు. ఇచ్చటి మందిరములలో కొన్ని పాంచాలికాయంత్ర నిర్మితములయినవి గలవు. అనియూరక యప్పుడప్పుడు ప్రదక్షిణము సేయుచుండును. అవి, యొక్కొక్క, ప్రదక్షిణమునందు ఒక్కొక్కవింత రూపమును దాల్చుచుండును. మరియు ప్రతిక్షణమునందును ఆమందిరములు క్రొత్తక్రొత్త శృంగారములతో మనోహరముగ గన్పట్టుచుండును. ఒకమారు చూచి తనవినొందుటకు వీలులేనియందములు, వింతలు, వర్ణింపనలవిగాని శృంగారములు, నాబయలునం దెచ్చట చూచినను గానవచ్చుచుండెను.

"అబయలున కెదురుగా సోపానమంటప మొకటి నిర్మింపబడెను. ఆసోపాన మంటపము స్తంభములపై కట్టబడెను. ఆసోపాన మంటపమునకు తొమ్మిది విశాలములైన అంతస్తులుగలవు. తొమ్మిదవదానిపై రాయలు సింహావస్థుడై కొలువుదీరి యుండెను. నాకీ సోపానమంటపము మీద నేడవయంతస్తు మీద, నాసనమిప్పింపబడి యుండెను. అచ్చట నాపరివారమును, ప్రాణమిత్రులును తప్ప నితరునెవ్వరికిని స్థల మిప్పింప బడలేదు. ఈసోపానమంటపమునకును, మైదానములో నిర్మింపబడిన మందిరములకును నడుమగల విశాలమయిన బయలు నందు వింతవింత విష యములు చూపరులకు గన్పట్టుచుండెను. అందు గాయకులు వీరకధలు పాడువారును విశేషముగా నుండిరి. గాయకులలో జాలమంది జవ్వనులగు స్త్రీలే కలరు. అవిలాసినుల తళుకు చెక్కులు చంద్రునిసోయగమును బోలియుండెను. యౌవనప్రాదుర్భానముతో వికసించువారి నెమ్మోములు వసంతాగమనమున చివురించు తొల్కరివలె మనోజ్ఞములయి యుండెను. సర్వల, కారభూషితలయి, శృంగారంపు కణికలయి, నృత్యము చేయుచున్న యా బాలికల రూపము, సౌందర్యము, విలాసము, హొయలు, శృంగారము, వేయేల వారి వాలుచూపులు మా హృదయములను, గులాబి పుష్పములను జూచినపుడువోలె తహతహలాడించు చుండెను. ఆసౌందర్యవతులు రాయల కెదురుగా నొక అందమైన తెఱవెనుక కూర్చుండిరి. ఇంతలో తటాలున నాతెర రెండువైపులనుండి లాగివేయబడెను. తెఱ దింపినంతలో నాసుందరులు నృత్యముచేయ నారంభించిరి. చూడ ఆహాఏమి ఆనృత్యము! సర్వసంగపరి త్యాగులయిన మునులకు మతిచలింపజేసెడి వారి నృత్యములు, హస్తవిన్యాసములు, కడగంటిచూపులు, ఆహా! మాయాత్మ లానృత్యదర్శనముచే సంతుష్టిచెంది పరవశములయ్యెను.

బొమ్మలాటవాండ్రు, దొమ్మరి, గారడివాండ్రు

"ఇక గారడివాండ్రత్యద్భుతమయిన వింతలను జూపిరి. గజము పొడవును ఒకమారెడు వెడల్పును, మూడునాలుగు గజము లెత్తును గల దూలములను మూడింటిని కలిపి కట్టి యొకచో నుంచిరి. వానిలో మొదటి రెండుదూలముల మీదను, అంతేయెత్తును లావును వెడల్పును గల మరి రెండుదూలముల నమర్చియుంచిరి. వీటిపైన నొకచిన్న దూలము నుంచిరి. ఇయ్యది యంతయు మెట్లవలె నమర్పబడి యుండెను. ఈవిద్యకే శిక్షణగావింపబడిన యేనుగు నొకదానిని దెచ్చిరి. అది మెల్లగా సోపానములుగా గట్టబడిన యాదూలములపై కెక్కెను. మొదటి సోపానము మీదనుండి, రెండవదానమీదకు, అందుండి జేనెడైన వెడల్పులేని మూడవమెట్టు మీదకుకూడ నాఏనుగు నేర్పరితనముతో నెక్కి నాలుగు పాదములను మోపెను. అంతట దానిపాదములు మోపినదూలము ప్రక్క దూలముల నన్నిటిని దీసివైచిరి. అచ్చట నిలువబడిన యాగజము క్రింద దొమ్మరివాండ్రు పాడు వింత పాటలకు తొండముతో తాళము వేయుచు, ఎత్తును, దించుచుండెను.

"మరియొక చోట పదిగజము లెత్తుగల స్తంభము నొక దానిని నిలువబెట్టిరి. అ స్తంభము కొనయం దొక రంధ్రమును జేసి యందుండి మరియొక దూలమును దూర్చి త్రాసువలె నమర్చిరి. ఆవాసమున కొకవైపు ఏనుగంత బరువుగలయొక పెద్దఱాతిని వ్రేలాడగట్టిరి. రెండవ వైపున ఒకగజము పొడవు చాలశాలమును గల యొకపలకను తాళ్ళతోకట్టి వ్రేలాడతీసిరి. ఆపలక కొకబలమైన త్రాడును గట్టిరి. ఒక ఏనుగును దెచ్చి యాపలకమీద నెక్కించి, త్రాసునందువలె, యొకప్రక్క బండరాతిని, మరియొక ప్రక్క యేనుగును ఎక్కించిం త్రాడులాగుచు రాజు ముంగిట ఏతాము తోడుటభినయించిరి. రాయిక్రిందకువచ్చి ఏనుగు, గాలిలో పైన నున్నప్పుడు సయితము తొండమును తనహంగుపాటదారుల పాటలకు లయ, చెడకుండ తాళము వేయునట్లు ఎత్తుచు దించుచుండెను.

పౌరాణికులు, కధకులు, పాటలవాండ్రు, సుద్దులవారు గాయకులు, నటులు, గారడివాండ్రు, విప్రవినోదులు మున్నగువారలకెల్లను రాయలు, వారివారి విద్యాగౌరవమునుబట్టి, సువర్ణాభరణములను, నూతన వస్త్రముల నొసంగి సత్కరించెను. ఇట్లీ మహోత్సవము లెడతెఱపిలేక మూడహోరాత్రములు, అత్యంత వైభవముతో జరిగెను. అచ్చటి వింతలను, విశేషములను ఒక్కొక్కటిగా చెప్పినగాని తనివి తీరదు. అటు చెప్పుటకు తగినంత సావకాశముగాని కాలముగాని లేదు. వాటి నన్నిటిని జూచియుండవలసినదే.

దేవరాయ మహారాయల సందర్శనభాగ్యము

"పండుగ మూడవనాడు రాయలు సోపానమంటపమునుండి పయనమయి ఇంకొక చోటకు బోవును. ఆదినమున నన్ను అచ్చటిపరివారము రాయలసన్నిధికి దోడ్కొనిబోయిరి కర్ణాటాంధ్రాధిపు మధిష్టించియున్న, సింహాసనము మహోన్నతమయి యుండెను. అంతయు స్వర్ణమయమును, రత్నఖచితము నయియుండెను. ఆసింహాసనమును చేసిన యగసాలి యెట్టిశిల్పియోకాని యందలి కళానైపుణ్యము వర్ణనాతీతము. ప్రపంచమందు ఏదేశము నందును ఏరాజున కిట్టిసింహాసన ముండుటనే నెఱుగను. ఇట్టి పనితనమునుగూడ ఎచ్చటను జూచియుండలేదు. సింహాసనము మీద మూడు వరుసల ముత్తెపుసరులంచులుగాకుట్టపడిన పసుపుపచ్చని చీనాపట్టుతో చేయవడిన తల్పముగలదు. ఆముత్యముల సౌరును కాంతియు నద్భుతముగనుండెను. అట్టివాటిని నేనెచ్చను జూచియుండలేదు. ఆమహర్నవమి పండుగలలో రాయ లీసింహాసనముపై యాపట్టుమెత్తపై నాసీనుడైయుండెను. మహర్నవమిపండుగ గడచిన మరునాడు రాయలవారు నన్ను నగరునకు రావలసినదని యాజ్ఞాపించిరి. అప్పుడు సాయంసమయము. నమాజు చేసికొనువేళ. నేను నగరు సమీపించునప్పటికి అచ్చోట పదిచతురపు గజములమేర నొకకూటము సోపాన మంటపమును బోలినది నిర్మింపబడి కానవచ్చెను. ఆమంటపమునకు పైకప్పు, గోడలును, కత్తివెనుక భాగమున్నంత దళసరి బంగారురేకుతో కప్పబడి యందందు మేలయిన నవరత్నములతో మనోహరముగ స్థాపితమయి యుండెను, ఆమంటపములో ఫైనుండి మొదటి అంతస్తుమీద రాయల సింహాసనము అమర్పబడి యుండెను. ఆసింహాసన మంతయు స్వర్ణనిర్మితమే! అదిచాలాయెత్తుగాకూడ నుండెను. రాయలందు రాజసమొప్పనిండుగా కొలువుదీరియుండెను. నేనాప్రభుని సమీపించి బహూకరింపబడి యాసీనుడయిన పిదప మృదుమధుర గంభీరభాషణముల, మాయేలికయగు కాఖానిసయద్ సుల్తాను వారిని గూర్చియు నాతని సామంతులను గూర్చియు ప్రసంగించెను. మాప్రభువున కెంతసైన్య మున్నదనియు అశ్వబలమెంత యుండుననియు నడిగెను. మాదేశపు నగరములందలి వింతలు విసేషములను, అందు ముఖ్యముగ సమరఖండము, హీరాబు, షిరాజు, మొదలగు నగరముల గూర్చిప్రశ్నించెను. నేను మున్నెన్నడు నెఱుగని యపార కరుణావిశేషములతో నాదరించి మన్నించెను. పిమ్మట నన్నుగాంచి "మీరాజు, మాకు నీయట్టి రాయబారినిబంపి మైత్రి నెఱపుచున్నందులకు మేమెంతయు సంతసించినారము. ఇపుడు మేము కొన్ని యేనుగులను, ఇరువురు తుకీబుకొజ్జాలను, అమూల్యములును అద్భుతములు నగు వింతవస్తువులును కానుకగానిచ్చి మీకాఖానిసయదు సుల్తాను వారికి, యోగ్యుడును, నీతికళారహస్యజ్ఞుడునగు నొక రాయబారినిచ్చి, పంపుచున్నాము" అనినాకు సమ్మోదము కలుగ బల్కెను.

"కొలువుకూటము నందు పరివేష్టితులయి యున్న రాజకుమారులలో నొకడు నన్నుజూచి, ద్విభాషిద్వారా రాయల సింహాసనము మీదనున్న జరీనగిషీ, అంచులు లతలు, పుష్పములు అల్లిన నాల్గుమొఖమలు పట్టుసోపాలనుజూపి ఎటులున్నవని ప్రశ్నించెను. ఆతని యభిప్రాయము అట్టివి మా దేశములో చేయజాలరనుట నేనెఱింగి "అవి చాలబాగున్నవి. అట్టివి మాదేశములో తయారుచేయు అలవాటు లేదు. ఒక వేళచేయ దలచిన యింత అందముగను చేయగలరని నానమ్మిక" అని ప్రత్యుత్తర మిచ్చితిని. రాయలును నాప్రత్యుత్తరమునకు సంతసించి ఎప్పటి యట్ల అనేకదీనారములతో నింపబడిసంచుల తాంబూలమును, తనకైప్రత్యేకముగా నుండుకొనిన కొన్నియపరూపపుఫలములనిచ్చి యింటికిబంపివైచెను.

హార్మజు (హురుమంజ) నగరవాసుల మాత్సర్యము

"విజయ నగరమున కొంతకాలమునుండి నివసించుచుండిన హార్మజనగరవాస్తవ్యులు కొందఱు నాకు రాజుజూపిన గౌరవమును, ఆదరమును, ప్రేమను జూచి సహింపజాలక, మీదుమిక్కిలి, మాయేలికకు రాయబార మంపబూనుట విని యోర్చుకొనజాలక మాత్సర్యగ్రస్తులయి యెటులయిన మాస్నేహసౌధమును ధ్వంసముజేయ బ్రయత్నించిరి. ఈఅల్పజ్ఞుడు, నిజముగా ఖాకానిసయిదు సుల్తానువారి నిజమైన రాయబారి కాడనియు, కపటవేషము బూని వచ్చినవాడనియు నొక యపవాదమును వ్యాపింపజేసిరి. నాదురదృష్టవశమున నీవార్త క్రమక్రమముగా, ఆనోటనుండి యానోటబడి రాజ్యోద్యోగుల నుండి మంత్రి దళవాయులకు, తుదకు రాయలవారికి జేరెను. ఆవల జరిగిన వృత్తాంతమును పిమ్మట దెల్పెను.

కల్బరిగపై దండయాత్ర.

"విజయనగరమునందు వృత్తాంతము లిట్టులుండ నన్నింతవఱ కత్యంతాదరగౌరవములతో మన్నించుచుండిన ధన్నాయకుడు (మహాప్రధాని) కలబరిగె రాజ్యముపై దండెత్తి పోయెను. కలబరిగ రాజ్యము నాకాలమున సుల్తాను అల్లాఉద్దీన్ అహమ్మదుషా పరిపాలించు చుండెను. సుల్తాను అహమ్మదుషా, విజయనగరమున దేవరాయలను ఆతని సామంతులను వధించుటకు ప్రయత్నముల వల్లనినిసంతుష్టాంతరంగుడై, రాయలకు తనధూర స్వభావము తేటబడ "ఏడు లక్షలవరహాలనిపుడు నాకుగప్పముగా జెల్లింపుము, లేనియెడల నీరాజ్యమును భస్మీపటలము చేయజాలు సైన్యమును బంపి, నిన్నును నీమతస్థులను రూపుమాపెదను" అనివార్తనంపెను. విజయనగరాధీశుడగు దేవరాయలా మాటలాలకించి క్రోధావేశపరవడై "ఔరా! ఏమి వీనికండకావరము, తురష్కుల ముష్కరత! నేనింకను జీవించియుండగనే, ఎవరో కొద్దిపాటిమంది మావారు, చనిపోయి నంతమాత్రాన అహమ్మదుషా యిట్టి విపరీతపు తలంపుతో నన్ను జయింపదలచెనా మంచిది. మీసుల్తానుతో కయ్యము సేయుటయే మాకు సమ్మతము. మిమ్ములను ఎదుర్కొని సమరము చేయుటకు నాకు దగిన బలగమున్నది, ఒక్కరోజులో నొక లక్షసైన్యమును గూర్పగలను. సూర్యుడు తేజోమూర్తి వెలుగునంతకాలము ప్రతియణువును కనబడును. నాశత్రువులు, నాకుమహోపద్రవము తటస్థించినదనిగాని; నాబంధుమిత్ర పరివారము నశించిరనిగాని నన్నందఱు ద్రోహలయి వీడిరనిగాని యెంచినయెడల వారు మిక్కిలి పొరబడిన వారగుదురు. నాకివి శుభదినములు, నాకిది మంచిదశ, నాకేయాపదయు వాటిల్లదు. నా సైన్యము లెక్కడకు బోయినను జయభేరినే మ్రోగింపగలవు గాని పలాయనము కావు. అదృష్టదేవత నావైపున్నది. ఇపుడు మీసుల్తాను నాదేశములోని ప్రజలను కొల్లగొట్టి ధనమును గొనిపోయి, సయ్యదులకు మౌల్వీలకు నొసంగును. నేను అతని దేసమును ధ్వంసముచేసి నా వేటకాండ్రకును, ద్విజోత్తములకు నొసంగుదును" అని గంభీర భాషణముల దిరస్కరించిపల్కి రాయబారి నవమానించి పంపివైచెను. పిమ్మట ఉభయులును సమర సన్నాహము చేయించి రణరంగమున సైన్యముల నడిపిరి. ఒకరి దేశముల నొకరు కొంతకాలము కొల్లగొట్టిపాడుచేసరి.[26]

ప్రధానమంత్రి హంబనురీర్.[27]

"కలబరిగె రాజ్యముపై దండెత్తిపోయిన, బ్రాహణ ధన్నాయకుని స్థానమున, దేవరాయలు కార్యనిర్వహణమునకై "హంబనురీర్" అనునాతని ప్రధానిగ నియమించెను. రాయల యభిప్రాయమున నీతడు ఆబ్రాహ్మణ ప్రధానియంతటి ప్రజ్ఞావంతుడగుటచే, నా యుద్యోగ మొసగియుండెను. కాని యీతనియంత దుర్మార్గుడును, కుటిలుడును, కౄరుడును, మరియొకడు లేడు. ఇతడు చూచుటకు పొట్టిగను, ఆసహ్యకరముగ నుండును. మీదు మిక్కిలి హీనకుల సంజాతులు, అసూయా పరతంత్రుడు, ముక్కోపి, కుటిల ప్రవర్తనము గలవాడు, దుర్మార్గుడు, నీచుడు, గౌరవమెఱుగనివాడు. వేయేల? యీతనియందు దుర్గుణము లన్నియు మూర్తీభవించినట్లు దోచును. చెప్పుకొనుటకు మంచివిషయ మొకటియైనలేదు. రాజకార్య మీతనిపాలబడిన తోడనే ధర్మాసనము గూడ మాలిన్యపూరిత మయ్యెను. ఆత డధికారము పూనిన తరువాత మొదట గావించిన ఘనకార్యము నాకు ప్రతిదినమును బంపబడు చుండిన దినవెచ్చమును ఆపివేయుట. హురమంజి నగరపువారి కిపుడు నామీద తమకుగల అసూయను దీర్చుకొనుట కవకాశము గలిగెను. ఎన్నెన్ని విధముల నామీద చాడీలు చెప్పి మనస్సు పాడుచేయ వలయునో అన్నియు చెప్పి నామీద ప్రధానికి మునుపున్న దానికంటె నసహ్యము నెక్కువజేసిరి. హంబనురీర్ యభిప్రాయము నెఱిగిన వారందఱు, నాతని యిష్టానుసారముగ, నేను నిజముగా పారశీక చక్రవర్తిచే నంపబడిన రాయబారిని గాననియు వర్తకము చేయదలచివచ్చి, కపటరాయబారినై మెలగుచున్నాననియు నెన్నియో మంతనములను జెప్పుచుండిరి. రాజకీయోద్యోగులు నమ్మునట్లనేక అనృతములను కల్పించి, మెల్లమెల్లగా వాటిని రాయల చెవిసోకునట్లుగూడ జేసిరి.

ఇట్లుదినవెచ్చము లేక, శత్రువుల యసూయకు గురియై ధనములేక, గౌరవముచెడి, నిరాశచెంది, కొంత కాలమెట్లో యాపాపిష్టి రాజ్యమున, దుర్మార్గులయిన విగ్రహారాధకులగు ప్రజలమధ్య కాలము గడిపితిని. నే నిట్లు ఇడుమల బడుచుండినను, అప్పుడప్పుడు పురవీథులందు రాయ లూరేగుచు నా కెదురయినపుడు మదపుటేనుంగు నాపి, చిరునగవుతో, దయారసమొలుక నాయోగక్షేమ మారయుచునే యుండెను. నిజముగా మహారాజు చాలా ఔదార్యము గలవాడు. సుగుణముల పుంజ మనదగిన మహానుభావుడు.

పారశీకదేశమునకు రాయలు రాయబారము నంపుట.

"ఇంతలో బ్రాహ్మణ ధన్నాయకుడు కలబరిగె రాజ్యముపై దండయాత్రలు ముగించి, దురదృష్టవంతులగు కొందరిని బానిసలగను, ఖైదీలుగచు బట్టుకొని, రాజధానికి విజయలక్ష్మీతో మరలివచ్చెచు. ఆతడు రాజధానిని ప్రవేశించిన దినముననే, నా దుస్థితిని గూర్చి విని, హంబనురీర్‌ను చాలమందలించి, ఆ దినముననే నా ఖర్చులకై ఏడువేల పణముల నివ్వవలసినదని టంకసాలకు బరాత మిచ్చెను. విజయనగర వాస్తవ్యులయిన ఖ్వాజ్వా-మసూద్, ఖజామమ్మదు (ఖురా సానుదేశీయుడు, అనువారలను, రాజపరమేశ్వరు డనదగిన రాయలు అనేక అమూల్యాభరణములు, దుస్తులు, రత్నములు, కానుకలు, మొదలయినవి యొసంగి మాపారశీక చక్రవర్తికడకు ప్రతిరాయబార మంపించెను. ఆ సమయముననే, డిల్లీ సుల్తానుగానుండిన ఫిరోజుషావంశీయుడగు ఫతేఖానుగూడ, ఖ్వాజాజమాలుద్దీను అనునాతని తన వకీలుగా, నేర్పఱచి, మాచక్రవర్తికడకు అనేక కానుక లర్పించుచు నొక విన్నపమును బంపించియుండెను.

"నేను విజయనగరమునుండి, రాయలయొద్ద సెలవుగైకొని ప్రయాణమగు రోజున, చక్రవర్తి నన్ను జూచి కృపాలుడై "ఓయీ! నీవు నిజముగా, పారశీకసుల్తాను షారుఖ్ వారి భృత్యుడవు గావనియు, మమ్ము మోసముచేయ నేతెంచినవాడనియు ననేకులు మాతో చెప్పియుండిరి. లేకుండిన మావలన ఇంతకంటె గొప్ప యాదరణకును, గౌరవమునకు నీవు పాత్రుడవైయుందువు. గడచినదానికై నగవవలదు. ఎన్నటికైన నీవు తిరిగి మాకు విశ్వాసము గలిగినపిమ్మట మారాజ్యమునకు మీ సుల్తానువారిచే బంపబడుదువేని మా సామ్రాజ్యగౌరవప్రతిష్ఠలకు దగినరీతిని నిన్ను గౌరవించి బహూకరించెదము" అని పల్కెను.

"మా సుల్తానువారికి వ్రాసిన సుహృలేఖలో దేవరాయ మహారాయలు నావిషయమయి, తన దేశములో బుట్టినయపప్రధ నన్నింటిని నుడువుచు హార్మజు నగరవాస్తవ్యులు జూపిన యసూయతను వర్ణించి, మరియు నీవిధముగా వ్రాయించెను. "మీతోడ మాకు నెయ్యమును, స్నేహమును ఎంతయు మోదావహములును, వాంఛ నీయములును; గాని కొందఱు మాకు అబ్దుర్ రజాకు మీ భృత్యుడు గాడని చెప్పుచు వచ్చిరి; లేకుండిన యింతకంటె నెక్కువగా, మాగౌరవము జూపుచు, మాస్థితికి దగినట్లుగా కానుకల నంపి యుందుము; మీ రాయబారిని ఎక్కువగా గౌరవించియుందుము." పిమ్మటనా ప్రయాణసన్నాహము బూర్తిచేసికొని శుభదినమున స్వదేశమునకై బయనమైతిని.

స్వదేశాభిగమనము; నడుమ తుపాను.

"నా యదృష్టాకాశమున దైవకృప అను భానుడుదయమయ్యెను. ఆశాభువనగోళమున, భాగ్యతార ప్రకాశింప జొచ్చెను. కటికచీకటి రాత్రియందు, సంతోషకాంతులు వెలుగసాగెను. అంతట నాకు దైవమును నమ్మినవారి కేబాధయు నెప్పుడును గల్గదని తోచెను.

"హిందూస్థానమునం దొకచోట మారుమూల నున్నది ఈ విజయనగరము. దేశమంతయు, విగ్రహారాధనపరులు. నేను సంపాదించుకొనిన దంతయు, నాకష్టకాలము వ్యయమయి పోవుటచేత, ప్రయాణమునకు గావలసినంత ధనము నాయొద్ద లేకుండెను. ఇక, నా దురదృష్టపు సంగతులను చెప్పను. ఎట్లో అల్లా నాయందు కరుణాళుడై యుండినందున ప్రయాణము సాగించితిని. షాబాను మాసమున [28]పండ్రెండవ దినమున నేను విజయనగరమునుండి యితర రాయబారులతో పాటు బయలుదేరితిని. పదునెనిమిదిదినము లహోరాత్రములు పయనము గావించి 'రమ్‌జాను'[29] మొదటిరోజున మంగుళూరునగరమున జేరితిని. మంగళూరులో రమ్‌జాను ఉపవాస దినములను జరిపి, పిమ్మట హానూరు రేవునకు బయలుదేరితిమి. మంగళూరులో సయ్యదు అల్లాఉద్దీన్ మషాడి అను మహమ్మయఫకీరు గలడు. అతనికి నూటయిరువది సంవత్సరములు వయస్సుండునని చెప్పుదురు. హిందువులను, ముసల్మానులునుగూడ నాతని మహనీయునిగా భావించి పూజింతురు, అట్టి మహనీయుని సందర్శించి, మాశీర్వాదము బడయుభాగ్యము నాకు లభించునందుల కే నెంతయు నదృష్టవంతుడనని యెంచెదను. ఇచ్చట నుండగనే విజయనగర రాయబారులలో ప్రధానుడగు ఖ్వాజామసూద్ ఆకస్మాత్తుగ మరణించెను.

"హానూరు రేవునందు పారశీకదేశమునకు బోవుటకై యోడ నొకదానిని గుదుర్చుకుని నలుబదిదినముల ప్రయాణమునకు వలసిన సామగ్రినంతయు సమకూర్చితిని. ఇచ్చట శుభశకునమును పరీక్షించి, జిరాగడా మాసమున[30] 25 వ దినమున ఓడలంగరు నెత్తించితిని. ఓడప్రయాణము మాకు చాల యుపద్రవకరమయ్యెను. వరుసగా రెండు మాసము లించుమించుగా తుపాను రేగుచుండుటవలన మేము చాల యిబ్బందుల పాలబడితిమి. ఎట్టకేలకు హిజరాశకము 848 సంవత్సరమున ముహారము పండుగ సమీపించునప్పటికి (ఏప్రిల్=చైత్రము; క్రీ. శ. 1444) సముద్రపు గండములను గడచి మాదేశములోని కలహాట్ [31] శిఖరమును సందర్శింప గల్గితిమి.

సముద్రయాన సమాప్తి: హార్మజునగర ప్రవేశము.

"నాప్రయాణ చారిత్రముగూడ ముగియుచున్నది. మొహరముపండుగ గడచువఱకు మేము మస్కాటురేవును గూర్చి సుఖముగా పయనము సేయుచునే యుంటిమి. మస్కాటు రేవునుజేరి కొంతకాల మచ్చట లంగరుదింపి, సముద్రము మీద తుపానువలన గల్గిన నష్టమును కూడి తేర్చుకొని హార్మజు నగరమునకై ఓడ లంగలెత్తించి పయనము సాగించితిమి. మస్కాటురేవు దాటిన పిదప "ఖూర్‌పకాన్" రేవున రెండుదినములాగి, మరల బయలుదేరితిమి. అప్పటికి వేసవికాలపు వేడి దుర్భరమగుట చేత నారేవున రెండుదినముల వఱకు నాగ వలసి వచ్చెను. ఖూర్‌పకాన్ రేవునుండి బయలుదేరి సురక్షితముగా హార్మజు రేవున సఫార్ నె 12 వ తేదీని మధ్యాహ్నమగునప్పటికి లంగరు దింపితిమి. ఆనాడు శుక్రవారము.

హానూరు రేవునుండి హురుమంజి (హర్మజు) రేవునకు మాకు పయనము చేయుటకు డెబ్బదియైదుదినములు పట్టెను."

యిమ్మడి దేవరాయల పరిపాలనము

రాయబారి అబ్దుర్‌రజాక్ సందర్శించిన దినములలో, కర్ణాటాంధ్ర మహాసామ్రాజ్యమును యిమ్మడి దేవరాయలు (లేక దేవరాయాభిదానులలో రెండవవాడు) పరిపాలించుచుండెను. ఇమ్మడిదేవరాయల వంశము చరిత్రయందు సంగమ వంశమున బిలువబడు చున్నది. విజయనగర సామ్రాజ్యమును, స్థాపించి, దక్షిణ హిందూదేశమునకు రెండున్నర శతాబ్దముల కాలము తురకలవలన హిందూసంఘము. మతము, సాంకరముజెంది, స్వాతంత్ర్యము నశింపకుండ నరికట్టగలుగుటకు బునాదులువేసిన దీసంగమవంశమే! విజయనగర రాజ్యమును నెలకొల్పినది సంగమరాజుకుమారులు హరిహరరాయ బుక్కరాయాదులు. ఒకవంకనుత్తరమున, బహమనీసుల్తాను మహమ్మదు, ఫిరోజుషాహిలవల్ల నేయాపదయు వాటిల్లకుండ, జూచుకొనుచు చెదరిపోయిన, దక్షిణ రాజ్యములనన్నింటిని, సంగమవంశజుల పరిపాలనము క్రిందకుదెచ్చి, సామ్రాజ్యమును రక్షించి వృద్ధిచేసినాడు. రెండవ బుక్కరాయలు. ఆతనివెనుక, విజయనగర సామ్రాజ్యమున కఖండవైభవైశ్వర్యములను, యశమును సంపాదించి, దేశదేశాంతరములనుండి యేతెంచిన రాయబారులకు తనకొలువున కాశ్రయమిచ్చి, ప్రతాపమూర్తియై, దిగంతవిశ్రాంతమైన యశము నార్జించి, కవియై, రసజ్ఞుడై, సార్వభౌముడై ప్రఖ్యాతి జెందినవాడు రెండవ లేక యిమ్మడి దేవరాయలు.

ఇమ్మడి దేవరాయలు శా.శ. 1343 (క్రీ. శ. 1421) శార్వరి సంవత్సరమున వైశాఖ మాసాదిని సింహాసనస్థుడై మాహారాయ బిరుదము ధరించి పరిపాలింప నారంభించెను. అంతకు బూర్వము కూడ నాతడుమూడు సంవత్సరములనుండి, తన తండ్రికి దోడుగా, యౌనరాజ్యపట్టభద్రుడై, తండ్రికిమారుగా, తానే సామ్రాజ్యమును బాలింప నారింభించినట్లు శాసనప్రమాణములు గాన్పించుచున్నవి. న్యూనిజు అను పోర్చుగీసు చరిత్రకారుడు, దేవరాయనికి యరువదియైదు సంవత్సరములు రాజ్యకాలము చెప్పుచున్నాడు. మరియు నీతనితండ్రి, విజయ (బుక్క) రాయలు ఆరు సంవత్సరములు రాజ్యముచేసెనని కూడ దెలుపుచున్నాడు. విజయరాయ, యిమ్మడిదే వరాయలు భయులును, కలిసి, మహారాయబిరుదముతో నీభూమండలినేలు చున్నట్లు. క్రీ.శ. 1418 మొదలుకొని 1421 వఱకును శాసనములు, గాన్పించుచున్నవి. [32]విజయరాయలు, కుమారునితో గలిసి మూడేండ్లును, తన తండ్రి -- సేనలను వెన్నాడి, దేశమును పరశురామ ప్రీతిచేసినాడు. చిరకాలమునుండి తురకలమీదనున్నకసిని, నాటి వారియుక్తులుతో తమ ఎత్తులనునుడిగి దీర్చుకొనిరి.

ఈయుద్దమునందు గాయపడి ఫిరోజుషా రాజధానిని జేరినవెనుక నెంతకాలమో జీవింపలేదు. అతని వెనుక నాతని రెండవ కుమారుడు అహమ్మదు సింహాసమధిష్టించెను. సుల్తాను అహమ్మదుషా, తన తండ్రికి జరిగిన యవమానమునకు అలుక వహించి, విజయనగర రాజ్యసీమలపై దండెత్తివచ్చెను.

అహమ్మదుషాకును, దేవరాయలకును అంతట రెండేండ్లు వరుసగా యుద్ధములు జరిగెను, సుల్తాను, ఆయుద్ధములందు త్రొక్కిన ప్రదేశమునెల్ల నిర్ధూమథామము గావించుచు కౄరుడై, స్త్రీలనక, శిశువులనక, చేతికందినవారి నెల్ల నఱకివేయించెను. ఈయుద్ధములం దొకప్పుడు విజయము, హిందువులకును, మరియొకప్పుడు తురకలకును, గలుగుచు చంచలయై యుండుటజూచి, దేశమున కాటకము రేగుచుండుటచే, సుల్తానును, రాయలును సంధిగావించుకొని, యుద్ధమునుండి విరమించిరి. అదిమొదలుగా, క్రీ.శ. 1435 వ సంవత్సరము వఱకును, దేవరాయలే యుద్ధములును లేక దేశమునందు శాంతియు, సౌఖ్యమును నెలకొల్పి, రాజ్యమును బాలించెను.

క్రీ.శ. 1435 సంవత్సరమున, అహమ్మదుషా మరణించెను. అంతనాతని పుత్రుడు రెండవ అల్లాఉద్దీను, భామినీ రాజ్యభారమును వహించెను. ఆ సంవత్సరమే యాతడు విశేషసైన్యమిచ్చి తన సోదరుదు మహమ్మదుఖానుని రాయలమీదికి, బంపెను. దేవరాయలాసమయమున, తురకలతో సంధిచేసుకొని మహమ్మదుఖానుని సాగనంపెను. ఈ విజయమున కుప్పొంగి మహమ్మదుఖాను, సోదరునిపై దిరుగబడెను. ఈ తిరుగుబాటు నందు, దేవరాయలు, మహమ్మదునకు దోడ్పడియెను. మహమ్మదు, ముద్దకల్లు, షోలాపురము, రాయచూరు, బీజపురము మొదలగు పట్టణములను స్వాధీనము చేసుకొనెను గాని సుల్తాను సైన్యములతో దలపడినపు డపజయమునొంది పాఱిపోయెను. తరువాత సుల్తాను, అనుజుని, తప్పిదమును మన్నించి, రాయచూరుకోట నాతని కిచ్చెను.

విజయనగరమునకును, కలబరిగె సుల్తానులకును జరుగుచుండిన యుద్ధములందు, జయలక్ష్మి చంచలయై యుండుటజూచి, ఇమ్మడి దేవరాయలు, భామినీసుల్తానులకును, తనకు గల విరోధనమును గుఱించి తలపోసి, మంత్రి, పురోహిత, సేనాపతి, సామంత, దండనాధులను, హితులను, బ్రాహ్మణులను బంధువులను ఎల్లరును రావించి, యొక సభగావించి, తనరాజ్యము, భామినీ రాజ్యముకంటె నధికవిస్తీర్ణత కలదనియు, నైశ్వర్యప్రద మైనదనియు, బహు సేనావృతమైనదనియు, అట్లయినను, దురష్కులే యుద్ధములందు జయముగాంచుచుండుటకు గతంబేమియనియు ప్రశ్నించెను. అందులకు పలువురు పలువిధములుగ తమకు తోచినతెఱంగుల విన్నవించిరి. రాయలువారు బల్కినదంతయు విని, తురకల యుద్ధపద్ధతిని తెలిసికొని, తనసేనయందు విలుకాండ్రను, అశ్వదళమును అభివృద్ధి పఱచుకొని రాజ్యము ననేక విధముల పెంపునొందించెను.

రాయలరాజ్యము తుంగభద్రాకృష్ణవేణినదులకు దక్షిణముగా, పూర్వ, పశ్చిమసముద్రముల దాకుచు, సింహళ ద్వీపములలోనికి సయితము వ్యాపించియుండెను. అందువలన నాతని శాసనములు ఇంచుమించుగా, పైజెప్పిన దేశమంతటను గానవచ్చుచున్నవి.

దేవరాయల కర్ణాటసామ్రాజ్యము, చిన్న చిన్న రాజ్యములక్రింద విభజింపబడి, యొక్కొక్క దండనాథునిక్రింద నుంచబడుచుండెను. ఈ రాజ్యములందు, రాయల ప్రతినిధులు పారుపత్యము నిర్వహించుటకు కొందరు (కారకర్తలు) ప్రథానులుండిరి. వారందఱునవసరము వెంబడిని, యొక రాజ్యమునుండి, మరియొక రాజ్యమునకు మార్చబడుచుండిరి. కర్ణాటసామ్రాజ్యములోని మైసూరుప్రాంతము, నాలుగు రాజ్యములుగా పరిపాలింపబడుచుండెను. పశ్చిమరాజ్యము, ఆరగడ రాజ్యమనియు, మంగళూరు ప్రాంతము, మంగళూరు రాజ్యమనియు, కోలారు మండలము, ముళువాయి రాజ్యమనియు, ఈ మూడింటికి నడుమగల దేశము బారకూరు రాజ్యమనియు వ్యవహరింప బడుచుండెను. విజయనగరమునకు సమీపమునగల దేశము పెనుగొండ రాజ్యమనియు, దానికి దక్షణసీమ వేలూరు రాజ్యమనియు, దానికి తూర్పుప్రాంతము చంద్రగిరి రాజ్యమనియు, దానికుత్తరదేశము చంద్రగుత్తి రాజ్యమనియు బిలువబడుచుండెను. మైసూరు ప్రాంతమునకు దక్షిణమున ననగా నిప్పటి కొచ్చి, మలబారు దేశములు తెరకనాంబి రాజ్యమని బిలువబడు చుండెను. చంద్రగిరి రాజ్యమునకు దక్షిణమున రాజగంభీర రాజ్యమను మధుర రాజ్యముండెను. మైసూరు రాజ్యములో జేరిన ఆరగడ రాజ్యమును బ్రహక్షత్రియ వంశుజుడైన రాయప్ప ఒడయుని కుమారుడు శ్రీగిరినాధ బడయరు పరిపాలించుచుండెను. ఆకాలమున గుత్తిలేక, గోవచంద్రగుత్తిరాజ్యమ నొకరితరువాత నొకరు త్ర్యంబకదేవ, హండేయ రాయలనువారలు వరుసగా బాలించియుండిరి. మంగళూరు రాజ్యమును, వరుసగా నాగణఒడయలు, నాగమంగళం దేవరాయఒడయులు నేలియుండిరి. బారకూరు తుళువరాజ్యమును, చందరసఒడయులు, నరసింహదేవవొడయులు బాలించియుండిరి. దేవరాయుల తమ్ములలో వీరపార్వతిరాయుడు తెరకనాంబి రాజ్యమును, ప్రతాపదేవరాయలు వేలూరిరాజ్యమును, శ్రీగిరినాధుడు చంద్రగిరిరాజ్యమును బాలించుచుండిరి. తెలుగు భూమిలోని వినుకొండ రాజ్యమును, వల్లభరాయమంత్రి యేలుచుండెను. ముళువాయి రాజ్యమును అనగాకోలారు మండలమును సాళువ గోపరాజు పరిపాలించు చుండెను.

దేవరాయల రాజ్యపాలనాపద్ధతులు రజాక్ వర్ణించిన వన్నియు యదార్ధములయినట్లు శాసనప్రమాణములు గన్పట్టుచున్నవి. మండలేశ్వరులైన, దేవరాయని ప్రధానులు, రాయలకు బ్రతిగా, నాయా రాజ్యములపై పారుపత్తెము నిర్వహించుచు సమయానుకూలముగ నొక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు మార్చబడుచుండిరి. ఇట్టి ప్రధానులలో పెరుమాళ్ళ దణ్ణాయకుడు పశ్చిమ దేశములకును, చోళ, పాండ్య మండలములు అనగా రాజగంభీర రాజ్యమునకు లక్కణ, సింగణ వొడయులును, పారుపత్తెము నిర్వహించుచుండిరి. ఈ మువ్వురి ప్రధానులలో,లక్కణ దణ్ణాయకుడు, రాయల కార్యకర్తయై మహామంత్రియై, సామ్రాజ్యము నందంతటను పారుపత్తెమునడపు చుండెను. ఇతడే, మన అబ్దుర్ రజాక్, పేర్కొనిన మహాప్రధాని. ఇతడు బ్రాహ్మణుడు. కలబరిగెపై దండెత్తి విజయుడై వచ్చినదీతడే! లక్కణ వొడయలు, దేవరాయల యాజ్ఞ శిరసావహించి సింహళముపై దండెత్తి, యాలంకాధిపతి, కప్పము గట్టుటమాని నందున శిక్షించివచ్చెను, ఇయ్యది. అబ్దుర్ రజాక్ విజయనగరము నందున్నపు డెపుడో జరిగియుండ వలయును. కాని, అంతకు బూర్వము నుండియు లక్కణ ఒడయలకు దక్షిణసముద్రా ధీశ్వరుడని బిరుదముండుటచేత క్రీ.శ. 1441 సంవత్సరమునకు బూర్వమే సింహళద్వీపమును జయించి యుండినట్లు విశ్వసింపవలయును.

ఇమ్మడి దేవరాయల పరిపాలనము శాంతిప్రదమై, యుండినట్లును, ప్రజలు యుద్ధముల వలనగాని, దండయాత్రల వలనగాని, యేయొత్తిడిలేక సుఖముగా నుండిరనియు విశ్వసించుటకు ప్రబల కారణముల నేకములు గన్పట్టుచున్నవి. అన్నిటికంటె పారశీక దేశమునుండి సుల్తానుషా, రుఖ్ ప్రౌడదేవరాయల కడకు రాయబారిగా, అబ్దుల్‌రజాక్‌ను బంపుట, ప్రధానమైనది. రాయలకీర్తి, దిగంత విశ్రాంతయైన దనుటకును, ఆతడు, మహా పరాక్రమశాలి యనుటకు నాతని తోడి నెయ్యము, దేశాంతరముల నుండురాజన్యు లపేక్షించిరనుటకు నింతకంటె వేఱె కారణమేమి గావలయును? అబ్దుర్ రజాక్ విజయనగరమును సందర్శించుటకు బూర్వము నికోలో కోంటి యని ఇటాలియా వాస్తవ్యుడొకడు, వచ్చియుండెను. ఆతడు ప్రౌడదేవరాయల గూర్చి "యాతడు హిందూదేశములోని నృపాలురందరి కంటెను ఎక్కు బలపరాక్రమ సమనిర్వతుడు" అనివ్రాసి యున్నాడు. నికోలో చేసిన విజయనగర వర్ణనము, మన రజాక్ చేసిన వర్ణనలను ఇంచుమించుగా బోలియుండెను. రాజ్యమంతయు శాంతి ప్రదమై, రాజ్యకాలమంతయు సౌఖ్యావహమై యుండుటచేతనే ప్రజలకు విద్యాగోష్ఠియుండుటకును, సాంఘికా చారములందు సంస్కరణములు చేసుకొనుటకు నవకాశము కలిగినది. ఈతని కాలమున, వడైవీడుసీమ బ్రాహ్మణలు - కర్ణాటాంధ్ర ద్రావిడ లాట దేశీదేశీయులు - నప్పటినుండియు, (క్రీ.శ. 1425) వివాహములందు, కన్యాశుల్కమును దీసుకొను నాచారము మానితిమనియు, వివాహములు, కన్యాదానములుగావున కన్యావిక్రయములుగా జరుగరాదనియు, నొడంబడిక జేసుకొనిరి. ఆకట్టడియందు, కులపెద్దలు వ్రాళ్ళుచేసియుండిరి. ఇమ్మడి దేవరాయల కాలమున, విదేశ వాణిజ్యము చక్కగా సాగుచుండెను. రాయలకు మూడువందల రేవులున్నవని రజాక్ వ్రాసినాడు. కాని అది అతిశయోక్తిగా గన్పట్టుచున్నది. ఆంధ్రదేశమున మోటు పల్లి మొదలుకొని తూర్పుతీరమున కన్యాకుమారి వరకును అచ్చటనుండి, పశ్చమతీరమున గోవ వఱకునుగల సముద్రపుటొడ్డు పట్టణములన్నియు రేవులేయని యెంచుకొన్నచో మున్నూరు రేవు లండుటలో నాశ్చర్యకరమైన దేమియు లేదు. విదేశ వాణిజ్యము విరివిగా సాగుటకై రాయల మంచి కట్టడులు చేసినట్లు గాన వచ్చుచున్నది. దేవరాయల కాలమున, రేవుపట్టణములకు అభయశాసనము వీయబడి, ఎగుమతి దిగుమతి సరకులపై సుంకములు, పూర్వ మర్యాదల ననుసరించి కట్టడలు చేయబడెను. ఆంధ్రదేశమున మోటుపల్లి రేవునందున్న దేవరాయల శాసనమందు, దిగుమతి, యెగుమతి సరకులపై సుంకాలు వివరింపబడి యున్నవి. ఇట్టి శాసనము లింకను ఇతర తావులం దెన్నిగలవో!

రాయలు, ఏనుగుల వేటయందు ఎక్కువ ప్రీతిగలవాడని అబ్దుర్‌రజాక్ చెప్పనమాటలు విశ్వసనీయములుగా గన్పట్టుచున్నవి. రాయలకు, తగినంత శాంతియుండిన గాని, ఏనుగులవేట యొకటి యాచారము చేసుకొనుటకవకాశ ముండదుగదా! అతడు ఏనుగుల వేటాడుట మొదట నెలకొల్పిన కారణమున గాబోలు తన నాణెములపై రాయ గజగండ భేరుండయనియు, గజబేటకారయనియు, బిరుదులు వ్రాయుంచు కొన్నాడు. దేవరాయలు, మహాసామ్రాజ్యమునుని నిర్మింప గలుగుటయేగాక దానికి సుస్థిరత్వమును సమకూర్చినగాని, గజకీట విలాసార్థముగా జేయుచుండుటకు తగిన యవకాశముండదు.

ఇమ్మడి దేవరాయలు కవితాప్రియుడు. రసజ్ఞుడు. విశేషించి కవియు గూడనై యుండి, తనయాస్థానమున బెక్కుమంది కవులను పండితులను ఆశ్రయమిచ్చెను. శ్రీనాధుడతని ముత్యాలశాలయందే క్రియాశక్తి ఒడయల సమక్షమున, గౌడడిండిమభట్ట కవి సార్వభౌముని యోడించి, యాతని కంచుడక్కను బగులగొట్టించి, కనకాభిషేకమును బడసినాడు. ఈతనికాలపు పరిస్థితులు శ్రీనాధుని చాటువుల కలసి తెలియ వచ్చుచున్నవి. దేవరాయలు సంస్కృత భాషయందు, కవియైయుండి, "మహానాటక సుధానిధి" యనునొక చంపూ కావ్యమును రచించి, అందు శ్రీరాముని చరిత్రము వర్ణించినాడు.

రాయలసోదరు డొకడు, రాయలపై కుట్రలుబన్ని, కౄరముగ వధింపనెంచినటుల, అబ్దుర్‌రజాక్ వ్రాసిన వ్రాతలు నిజము గావచ్చును. ఆదారుణకృత్యమును దలపెట్టిగ సోదరుడెవడో యింతవఱకు దెలియరాదు. ఆకుట్రలో, తగిలిన గాయములవలన రాయలు, వ్రణపీడితుడై యారుమాసములైన గతించక ముందె (1445 నందు) మరణించెను. ఈతని మరణమునకు బూర్వమె మన రాయబారి విజయనగరము నుండి, స్వదేశమునకు బయలుదేరినట్లు యాతడు వ్రాసిన వానినిబట్టి తెలియుచున్నది.

దేవరాయలు తన్ను జంపుటకు జరిగిన యాప్రయత్నమునందు బాల్గొన్నవారందఱిని చిత్రవధపాలుచేసెను. విజయనగరమిట్టి దురవస్థలో నుండగా భామినీసుల్తానగు రెండవఅల్లా యుద్దీను డీసమాచారము నంతయుగూడ చారులవలన నాకర్ణించి, ధూరుడై యేడులక్షల దీనారములు కప్పము బంపవలసినదనియు, లేకున్న రాజ్యముపై దండెత్తి రాగలననియు వర్తమానమంపెను. రాయలా బెదరింపులకు జంకక, సైన్యమును గూర్చుకుని భామినీ రాజ్యముపై దండెత్తిబోయి మద్దకల్లు కోటనుగొట్టి రాచూరు, వెంగాపురపుకోటలను సాధించి, సాగరు బిజాపురము వఱకును గల తురుష్క రాజ్యమును గొల్లవెట్టుచు దేశమునల్లకల్లోలము చేసివైచెను. ఆయుద్ధములో మహమ్మదీయులకు విశేషముగా బ్రాణనష్టము సంభవించెననియు తుదకొండొరులకు హానికలుగజేసుకొనకుండ సంధిచేసుకొని యెవరిరాజ్యములకువారు వెడలిపోయిరని ఫెరిష్టావ్రాయుచున్నాడు; గాని యది నిజమని విశ్వసింపజాలము. అబ్దుర్ రజాక్, ఆసమయమున, దేవరాయల యాస్థానమునందుండిన వాడగుటచే, నతడు దేవరాయల బ్రాహ్మణ మహాప్రధాని కలబరిగె రాజ్యముపై దండెత్తి, తురుష్కసేనలను జయించి విజయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చుచు, కొందఱి దురదృష్టవంతులగు వీరులను వెంటబెట్టుకొని వచ్చినాడని వ్రాసినది, యదార్థమని యొప్పుకొనక తప్పదు.

దేవరాయని సమకాలీనులలో, రాజమహేంద్రవరము రాజధానిగా, పూర్వాంధ్రదేశమును చిల్కసముద్రము పత్యంతమునేలిన అల్లాడ వీరారెడ్డి, వేమారెడ్లు, మిక్కిలి ప్రఖ్యాంతిగాంచినవారు. వారి యాస్థానమునందే, కవిసార్వభౌముడగు శ్రీనాథుడు తనకౌమార దశనంతయు, గడపి యుండెను. ఈ రెడ్లకును, భామినీ సుల్తానులకును గల స్నేహమువలన, కర్ణాట భూపాలునకు వీరు ప్రబలుశత్రువులుగావలసివచ్చెను.

మన అబ్దుర్ రజాక్, నికోలోకొంటి, విజయనగరమును సందర్శించి పోయిన ఇరువది సంవత్సరములకు పారశీక రాయబారిగా నేతెంచి యుండెను. ఆతడు రాయబారమునకై క్రీ.శ. 1442 వ సంవత్సరము జనవరి 13 వ తేదిని బయలుదేరి ఎట్లో, పడరాని పాట్లుపడి ఆసంవత్సరము నవంబరు మాసాదిని కళ్ళికోట రేవును, జేరగల్గెను. కాని కళ్ళికోటలో నాతడు 1443 వ సంవత్సరము ఏప్రిల్ మాసాదివఱకుండి పోవలసివచ్చెను. అంతట రాయలచే నాహ్వానింపబడి, కళ్ళికోటనుండి బయలుదేరి ఏప్రియల్ మాసాంతమున కచ్చటికిజేరి యది మొదలుకొని డిశెంబరు 5 వ తేది వఱకును విజయనగరము నందుండెను. ఈతడు మహర్నవమి యుత్సవములని, వర్ణించినాడుగాని యాతని వర్ణనలుబట్టి ఆతడు జూచినది, వర్ణించినది, నవరాత్రియుత్సవము లగునోకాదో యని సందియము గలు గుచున్నది. ఆతడు త్రిరాత్రయుత్సవములనే వర్ణించి మహర్నవమి యుత్సవములని జెప్పినాడు. ఆతడు పొరబడి యుండవచ్చును లేదా యీతడు వ్రాసిన చరిత్రలో కొంతభాగము శిధిలముకాగా శేషించిన దానిని సంస్కరించి పూరించినవారు పొరబడియుందురు. అబ్దుర్ రజాక్ రాయల పరిపాలనావసానదశయందుండి, విజయనగర వైభవమునుకన్నులార గాంచి, వర్ణించిన యదృష్టవంతుడు. మన కందువలన చిరస్మరణీయుడు.


 1. నేనీచరిత్రమును ప్రతిపదార్ధముగా తెనిగింపక కొంచము స్వేచ్ఛగా యధామూలముగా తెలుగుచేసితిని. పాఠకు లిందుకు మన్నింతురుగాక.
 2. మనుష్యు లెక్కు ఓడకు "జోగు" అనియు సరకు గొంపోవు వోడకు "కప్పలి" యనియు నాంధ్రమున పేరులు గలవు.
 3. మస్కాటురేవు, హార్మజునగరమునకు దక్షిణమున ఉమాన్ సింధుశాఖ ముఖమున అరేబియాలోనున్నది.
 4. మొహరమ్‌ పండుగ ముసల్మానులకు సంవత్సరాదివంటిది. ఫసలీ అంతటనుంచి లెక్క పెట్టబడుచుండును.
 5. ఇట్టి దురాచారమే యాంధ్రదేశమున కాకతీయ గణపతిదేవుని కాలమునకు బూర్వ ముండినట్లు శాసన ప్రమాణములు గలదు. చూడుడు. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము పుట 126-8; Ep. Ind. Vol. XII p. 188 ff.
 6. అబ్దుర్ రజాక్ రాయబారిగా విజయనగరమునకు బంపబడియుండగా కళ్ళికోటసామూరియే తన యేలిక యనుకొనిన చక్రవర్తియని పొరపడి యాతడు పంపిన కానుకలన్నియు సామూరికి నర్పించెను. పిమ్మట తనతప్పు తెలిసికొని యది యితరులకు దెలియకుండ గడుసుదనముగ గప్పిపుచ్చెను. ముందు చూడుడు.
 7. అబ్దుల్ రజాక్ చెప్పునదంతయు విస్పష్టమగుటలేదు. ఆత డుదహరించినవిషయములు బంగాళాదేశమునకు సరిపోవు. గుజరాత్, దఖిణీసుల్తానుల యుద్ధములకు సరిపోవు నేమోనిర్ణయింపజాలను.
 8. ఇది యొక విష్ణ్వాలయము గావచ్చును. అబ్దుర్ రజాక్ చూచిన దేవాలయ మేయూరిదోగాని తెలియరాదు.
 9. అబ్దుర్ రజాక్ కళ్ళికోటలోనుండగా, యాతనిగూర్చి వినిన దేవరాయ లాతని దన కొల్వున కాహ్వానించి యుండునని సూయలుదొర అభిప్రాయ పడినాడు. కాని యది సరియైన యూహయని నేననుకొనను.
 10. నిలువుగా బాతిపెట్టబడిన యీఱాళ్ళనుగురించి క్రీ.శ. 1520 సంవత్సరమున విజయనగరమును సందర్శింపవచ్చిన "డామినిగోపేయస్" యను బుడతకీచుడు గూడ దానును వాటిని జూచియుంటినని వ్రాసియున్నాడు. తర్వాత తల్లికోట యుద్ధానంతరమున మహమ్మదీయులచే నీనగరము విధ్వస్తము గావింపబడినపు డీప్రాకారమును ఈఱాళ్ళును రూపుమాపబడెను.
 11. అబ్దుర్ రజాక్ వర్ణించిన యీసప్తప్రాకారములు అందందుగల ద్వారములు కవాటములు ఈకాలపు విజయనగర యాత్రికులకు నెచ్చటెచ్చట నున్నవో సులభముగా బోధపడవు. మనయాత్రికుడు పశ్చిమ తీరమునుండి బయలుదేరి విజయనగరమును నైఋతి దిక్కునగల ద్వారము గుండనే ప్రవేశించినట్లు తోచెడిని. అదియే నిశ్చయమని యెంచిన యెడల, నాతని రాక నెఱింగి కర్ణాటక్షితిపాలు డంపిన ప్రతీహారులు, అబ్దుర్ రజాక్ ను, ఎదుర్కొని నగవను ఏడవ వెలిప్రాకారమున నగరమునకు నైఋతి దిక్కుననున్నదనియే నిశ్చయింప వలయును. ఈరాయబారి ప్రవేశించిన మొదటి ద్వారము హోస్పేటకు నైఋతిదిక్కుగాగల రెండుకొండలనడుమ నున్నట్లు గానవచ్చును. ఒక్క మన అబ్దుర్ రజాక్ మాత్రమేకాక తరువాతను అంతకు బూర్వమును వచ్చిన విదేశీయులందరు నీ ద్వారము గుండనే నగరును సొచ్చియుండిరి.
 12. ఈవిధముగ మనదేశమున, ముఖ్యనగరముల వెలుపలగవనుకడనాగంతుకుల కడనుండియు, సుంకముతీయు నాచారము పూర్వముండెను. ఈ బ్రిటిషు పరిపాలనమున నది తీసివేయబడెను.
 13. ఇప్పటి మచిలీబందరు నందు అట్టి విధమయిన బజారున్నది. ఒక్కొకరకపు దినుసు కొకబజారు యిప్పటికిని బందరు నందు గలదు.
 14. అబ్దుర్‌ రజాక్ చూచిన సభామంటపమును, దానికుత్తరముగా నుండిన దస్తరములకొట్టును శిథిలావస్థయం దిపుడు నగరువాకిట నాలుగు వీధుల మొగ కావలిప్రక్క గానుపించుచున్నవి. సభా గారము పూర్వపుశోభతో నిపుడు గానరాదు. శ్రీనాథుడు కనకాభిషేకమును వడసిన మౌక్తికసభాగార మిదియే కావలయును. పూర్వమున ఈ సభామంటపము ఱారుస్తంభములతో, తోరణములతో మనోజ్ఞములయిన రంగురంగుల చిత్తరువులతో నొప్పారుచుండెను కాబోలు. స్తంభములు కర్రవి యనియు సరంబి కూడకర్రతో కట్టబడి రంగురంగుల చిత్తరువులతో శోభిల్లు చుండెననియు, నదియంతయు తల్లికోటయుద్ధానంతరము తురకలచే తగుల పెట్టబడియెననియు సూయలుగా రూహించుచున్నారు. ఇపుడా మంటపమున నలుబది స్తంబపు దిమ్మలుగాక నరువది గానవచ్చు చున్నవి.
 15. శిలాశాసనములు గానచ్చును. అబ్దుర్‌రజాక్ వ్రాయసకాండ్ర దేశాచారములు తెలియనివాడు గావున, పొరబడి యుండవచ్చును.
 16. ధన్నాయకుడు యొకయుద్యోగి యని తెలిసికొనక పోవుటయే కాక నాతడు కొజ్జావాడనియు గూడ రజాక్ పొరబడి వ్రాయుచున్నాడు. ఇమ్మడి దేవరాయని ధన్నాయకుని పేరు నాగన్నయని లూయిరైసు గారు చెప్పుచున్నారు. కాని అబ్దుర్ రజాకు కాలమున మహాప్రథాని లక్కణ ఒడయలని శాసనప్రమాణముగలదు - ముందు చూడుడు.
 17. వరహాకు దీనారమని పేరుండినట్లు శ్రీనాథుని చాటుపద్యమువలననేకాక మహమ్మదీయ చరిత్రకారులవలన గూడ దెలియుచున్నది.
 18. అర్ధవరహాలు-ప్రతాపములు. ఇవి ప్రౌడదేవరాయలచే, ముద్రితమయినవి గావలయును. ఆతనికి ప్రతాపదేవరాయలని బిరుదముగలదు. ఆబిరుద మీటంకమునకు నిలచిపోయి యుండును.
 19. తరమను టంకమున్న సంగతి దెలుపు శ్రాసనప్రమాణము లేమియు ఇంతవరకు గానరాలేదు. ఇవి వెండిపణములుగాని, రూకలుగాని గానవచ్చును. తెలుదేశమున విజయనగరపు నాణెములు రూకలుండెను.
 20. జితలు అను రాగిడబ్బు పేరుగూడ కర్ణాటకదేశములో వ్యవహారమందున్నదేమోగాని యిచ్చట నాకు దెలియదు. అది మహారాష్ట్రభాషాపదము. ఇవి రాగికాసులు గావచ్చును.
 21. అబ్దుర్ రజాక్ తాను విజయనగరమున, విని, చూచిన దానినిబట్టి, హిందూస్థానపు రాజుల కందఱకు నొక్క విధమగు నాచారమును వేడుక వ్యాచారమును సూచించు చున్నాడు. అబ్దుర్ రజాక్ నిజముగా పొరబడినాడనియే మామతము. ఈప్రౌడదేవ రాయలకు ఏనుగులవేట యనిన మిక్కిలి ప్రీతియట! అందువలన నాతనికి గజబెంటదేవరాయలని బిరుదము గలదట. దేవరాయనిబట్టి యాతని వేడుకను ఇతరరాజులకు కూడ రజాకు ముడివెట్టియున్నాడు.
 22. అబ్దుర్‌ రజాక్ వ్రాసిన దీసందర్భమున సంశయమునకు తావొసంగుచున్నది. అప్పటికిరువదియైదు సంవత్సరములనుండియేలుచున్న యిమ్మడిదేవరాయలు యౌవనవయస్కుడెట్లుగునో తెలియదు. ఒకవేళ నీ పారశీక రాయబారి సందర్శించినది, యిమ్మడిదేవరాయ లగునోకాదో? కాకున్న మరియెవరై యుందురు? ఒక్కటి నిజమయి యుండవచ్చును. యిమ్మడి దేవరాయలు క్రీ. 1443 ఏప్రిలుమాసమున క్రూరముగ చంపబడబోయెను. ఆవిఘాతమున, నాతడు మరణించినట్లు అబ్దుర్‌రజాక్ తెలుపలేదు. కావున, యిమ్మడి దేవరాయలు, కాయవంటివాడు గావచ్చుననియు, ధృడకాయుడగుటచేతగాని, పిన్ననాటనే సింహాసనమెక్కి యుండుటవలనగాని వయసుమీఱిన వాడుగాడనియు నూహింపవలయును; సింహాసనమెక్కునాటికి ఇరువదియేండ్లు నవ్నని యనుకొన్నను, రజాక్ చూచునప్పటికి నలువదియైదు సంవత్సరములకంటె నెక్కువ యుండజాలవు.
 23. అబ్దుర్‌ రజాక్ రాయలకొసగవలసిన యుత్తరములను మొదట పొరబడి సామూరి కర్పించెను. సామూరి ఆయుత్తరములు తనకు గావని దెలిసికొనినపుడు అబ్దుర్‌రజాక్‌న కిచ్చివేసియుండును. అందువలననే కళ్ళికోటయం దితనికి ఏమియు గౌరవము జరిగియుండలేదు. తనకు సామూరి సన్నిధిని జరిగిన పరాభవమును, నిరాదరణయు, గడుసుదనముగా నబ్దుర్‌రజాక్ చెప్పక దాచినాడు.
 24. రాయల సోదరునిపేరు రజాక్ తెలుపకున్నాడు. ఇమ్మడి దేవరాయలునకు సోదరు రెందరో ఇప్పటికి దొరకిన శాసనములు తెలుపక సందేహము కలిగించుచున్నవి.
 25. రజాక్ మహర్నవమి యుత్సవమునాడు విజయనగరమున నుండినట్లాతని వ్రాత వలన దెలియుచున్నది అబ్దుర్ రజాక్ మహర్నవమిని మహానవియని బిలిచినాడు.
 26. ఫెరిష్టాకూడ నీ కాలమున (1443 - 4 క్రీ.శ.) దేవరాయలకును, అహమ్మదుషాకును, యుద్ధము సంభవించెనని తెల్పుచు నందులకు వేఱుకారణములను దెలిపియున్నాడు. మూడుమాసముల కాలము యుద్ధము సాగెను. అందు మూడు ఘోరయుద్ధములు జరిగెను. మూడింటియందును కర్ణాటాంధ్ర సైన్యములే గెలుపొందుచువచ్చినివి. చూడుడు: Briggs Forishta Volume II, p.p. 430 - 435.
 27. ఈపదము విపు నేవిధముగ పూర్వస్థితికి సమన్వయింపవలెనో తోచకున్నది. అబ్దుల్ రజాక్ యీపేరును తప్పగా నుచ్చరించి వ్రాసుకొనినట్లు కన్పట్టుచున్నది. అబ్దుర్ రజాక్ గ్రంథముయొక్క మరియొకప్రతియందు "నిమపజీర్" అని యున్నది. కాని పెక్కుప్రతులందు హంబనురీర్ అని యున్నందుల నిదియే సరియైన పాఠమని యెంచదగును. దేవరాయల ప్రధానులలో త్ర్యంబక దేవఒడయలని యొకరును, హండేయరాయలని యింకొకరును గలరు. వారెవరైన యీఅబ్దుర్ రజాక్ కాలమున కొలదికాలము ప్రధానియుద్యోగము నిర్వహించిరేమో తెలియదు. హంబనురీర్ అనునది కొంచమించుమంచుగా త్ర్యంబకదేవ అనుదానికి సరిపోవుచున్నది. త్ర్యంబకదేవుడు చంత్రగుత్తిసీమాధిపతి. ఈవిషయ మింకను విచార్యము.
 28. షాబానుమాసము మనకు పుణ్యమాసమగును.
 29. రమ్‌జాన్ మొదటిరోజు మాఘ శు 2 యో ప్రధమతిధియో యగును.
 30. మాఘమాసాంతము గావచ్చును.
 31. కలహాట్ శిఖరము మస్కాట్ రేవునకు నలుబది మైళ్ళదూరమున నున్నది. దానియెత్తు 6000 అడుగులుండుచు.
 32. Ep. Dar. Vol. X. Introducion, p. xxxv.