ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/భంగపడిన తీర్మానం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భంగపడిన తీర్మానం

7

అల్తూనాలో వున్నప్పుడు కార్నెగీ ఒకరైల్ రోడ్ షాపులో తొలిసారిగా ఇనుపబ్రిడ్జీని చూచాడు. అది చిన్న పగుళ్ళ మీదుగా పట్టాలను యివతలనుండి అవతలకి తీసుకోపోవటం కోసం తయారు చేసింది. దీని నమూనాను కంపెనీ వారి ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న హెచ్. జె. అన్విల్ల షాపుల్లోని యాంత్రీక మేధావి జాన్ యల్ పైపర్ సాయంతో నిర్మించాడు. వాళ్లు యిరువురూ కలిసి దానికి పేటెంటు తీసుకొన్నారు. పైపర్ ను షాపుల్లోను, ఆఫీసులోను అందరూ "పైప్" అని వ్యవహరిస్తుంటారు' ఇతడు రైల్ రోడ్ కంపెనీవారికీ వంతెనలను నిర్మించి యిస్తుంటాడు. ఇంత వరకూ ఇతడు తనపని తనంతటినీ కొయ్యతోనే చేస్తుండేవాడు. బ్రిడ్జీలు ఆ దినాలలో కొయ్యది కావటంవల్ల తరచు కాలిపోతుండేవి. వాటికీ, కొట్టుకొని పోతున్న వాటికీ బదులుగా అతి వేగంగా బ్రిడ్జీలను తయారుచేసి యివ్వడంలో యెంతో పేరెక్కినవాడు, "ఒక యింజనీరింగ్ దళాన్నంత టినీ వేసేదానికంటె కాలిపోయిన భ్రిడ్జీదగ్గరకు నేను 'పైపు'ను పంపుతాను "అని అధ్యక్షుడు థామ్స్‌న్" ఇతడ్ని గురించి అన్నాడు.

ప్రస్తుతం 'పైప్‌' ఇనుప బ్రిడ్జిలు కావాలని పరవశుడై వాదిస్తుంటాడు, "ఆండీ; కొయ్యవంతెనల కాలంఅయిపోయిం"దని ఇతడు పదేపదే అంటుండేవాడు. "ఇకనుంచి ఇనుపది తప్ప మరేవి ఉండవు. రాబొయ్యే ఇరవై సంవత్సరాలల్లో మొదటి తరగతి రైల్ రోడ్డుమీద కొయ్య వంతెన అంటూ వుండదు. కాలిపోనివి ఏటి పొంగులకు కొట్టుకొని పోనివీ అయిన యినుప బ్రిడ్జీలను గురించి యోచించు."

అతడు, రైల్‌రోడ్ కంపెనీ వారి బ్రిడ్జీల జనరల్ సూపర్వైజరు ఆరన్ స్ఖిప్లర్ ఇద్దరూ 1862 లో కంపెనీ వుద్యోగాన్ని వదిలేసి తా మిరువురూ భాగస్వాములుగా వంతెనలను నిర్మించే ఒక కంపెనీని ప్రారంభించారు. అయితే వారికి వ్యాపారంలోని కిటుకులు తెలిసిన వాళ్ళు పెట్టుబడి పెట్టగలవాళ్ళు కావాలి. లిన్విల్లి కార్నెగీలను కంపెనీలోకి తీసుకొన్నారు. వీరిలో కార్నెగీ అయిదుగురు భాగస్వాములతో కీస్టొన్ బ్రిడ్జి కంపెనీని స్థాపించాడు. అయిదవ వాడు థామస్ యన్. స్కాట్. వీరు ప్రతివొక్కరు పన్నెండువందలయాబై డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఆరువేల ఆరువందల యాబై డాలర్ల పెట్టుబడితో వొక బ్రిడ్జీలను నిర్మించే కంపెనీని ఆరంభం చెయ్యటం ఈనాటి పారిశ్రామికుల బుద్ధికి పరిహాసాస్పదంగా కనిపించవచ్చు. అయితే అన్నిటి ఖరీదులు కొద్దిలో వుండేవి. వ్యాపారం కొద్దియెత్తున జరుగుతుండేది. చాలా సంస్థలు ఈనాడు మనకు అతి స్వల్పమైన మొత్తంగా కనిపించే మూలధనంతో ఆరంభమయినవే. ఈ పెట్టుబడిదారులు అప్పుడప్పుడూ డబ్బు అప్పుపుచ్చుకోవలసి వస్తుండేది. కానీ వారు ఆ అప్పులను సకాలంలో తీర్చగలుగుతుండేవారు. ఎగుడు దిగుడుపని యేమాత్రం వుండకూడదనీ, నిర్మించే ప్రతి బ్రిడ్జిని చేతనయినంత కట్టుదిట్టంగా నిర్మించాలని వారిలో అందరూ స్థిరనిశ్చయులయినారు. వీరు సక్రమంగా నిర్మించిన బ్రిడ్జీలను గురించి మాటాడుకొంటుండేటప్పుడు థామస్ కార్లైల్ నుంచి గ్రహించిన "ఆనెస్టుబ్రిడ్జ్" [నమ్మకమయిన వంతెన] అన్న పదబంధాన్ని తరుచుగా ప్రయోగిస్తుండేవాళ్లు.

పెన్సిల్వేనియానుంచి పశ్చిమంగా తమ రైలు మార్గాన్ని విస్తృతం చేస్తున్నప్పుడు వొకరైల్‌రోడ్ కంపనీ వీరిని "పిట్స్‌బర్గుకు పశ్చిమంగా వున్న స్ట్యూబెన్ విల్లి దగ్గిర ఓహైయోనదిమీద వొక వొడ్డునుంచి మరొక వొడ్డుకు మూడువందల అడుగుల మధ్య దూరంతో ఒక బ్రిడ్జిని తయారు చేసి యిచ్చె పనికి పూనుకొంటారా" అని అడిగింది. ఇది ఈ కీస్టొన్ సంస్థకు తొలిరోజుల్లో వచ్చిన "సవాలు" ల్లో ఒకటి. అప్పటికి ఉక్కు ఇంకా అమెరికాలో తయారు కావటం లేదు. అంత ఎక్కువ 'మధ్యస్థదూరం'తో పోత ఇనుమును ఉపయోగించి రైల్‌రోడ్డు బ్రిడ్జిని నిర్మించటమంటే ఎంతో గొప్ప సాహసిక చర్య. అయినా వారు ఆ పనిని చేస్తామని అంగీకరించారు. రైల్‌రోడ్ కంపెనీవారి ఉన్నతోద్యోగి నదిని దాటవలసిన ప్రదేశాన్ని పరిశీలించటానికనివచ్చి అక్కడ పడవేసివున్న పోత యినుము దూలాలను చూసి ఆశ్చర్యంతో అన్నాడు. "ఇవి ఓహియో నదిమీద వెళ్ళవలసిన బండ్లను మోయటం ఎలా వున్నా తమ బరువును తాము మోసుకోగలవని నేను భావించటంలేదు."

కానీ అతడు పొరబడ్డాడు. దాన్ని తిరిగి కావలెనని తీసి వేసేటంతవరకూ ఆ వంతెన అనేక సంవత్సరాలు రైలు బండ్ల రాకపోకలకు తట్టుకున్నది. ఏమైనా బ్రిడ్జీ కంపెనీ ఈ పని చేసిన కొద్దికాలం తరువాతనుంచి వంతెనలను నిర్మించటానికి దుక్క ఇనుమునే ఉపయోగించింది. మొదట పై అర్ధచంద్రాకారాలకు (Chords) తరువాత మిగిలిన మరికొన్ని భాగాలకు ఈ దుక్క ఇనుమును ఉపయోగించారు.

పెట్టుబడిదారులు ఎంతో లాభం వస్తుందనుకున్నారు. కానీ కరెన్సీకి ఉల్బణం రావటం వల్లను, యుద్ధ సమయం కనుకను ఖరీదులు విరివిగా పెరిగిపోయినవి. వారి ఆ యవ్యయ పట్టికలో తుది పంక్తిని ఎర్ర సిరాతో వ్రాయవలసి వచ్చింది. అంటే ఏమీ మిగల లేదన్న మాట! ఈ పరిస్థితిని గమనించి పెన్సిల్వేనియాలోన అధ్యక్షుడు ఎక్గాథామ్‌సన్, తన స్వంత బాధ్యతమీద, కీస్టోన్ కంపెనీకి నష్టం లేకుండా మరికొంత అదనంగా మంజూరు చేయించాడు. అతి తీక్షణమయిన కృత జ్ఞతాదృష్టి గల కార్నెగీ ఈ కారణం వల్లనే తరువాత పది సంవత్సరాలకు తాను ప్రారంభన మొదటి ఉక్కు కర్మాగారానికి మిష్టర్ థామ్సన్ పేరు పెట్టటం జరిగింది.

ఇరవై యో శతాబ్దపు పన్ను రేట్లతో పోల్చి చూచుకుంటే దాని తరం చాలా తక్కువే అయినా అంతర్యుద్ధం తెచ్చి పెట్టిన రాబడి పన్నుపోను 1861 లో ఆండ్రూ కార్నెగీ ఆదాయపట్టిక 47,860,67 డాలర్లు అతని రాబడి అయినట్లు చూపించింది. ఈ మొత్తం ఆశ్చర్యకరమైంది. అందులో యిది ఇరవై యేడేళ్ళ యువకుడి ఆదాయం కావటం ఎంతో విశిష్టమైన విషయం. యిందులో అతనికి డివిషన్ సూపరింటెండెంటుగా వచ్చిన జీతం ఇరవై నాలుగువందల డాలర్లు మాత్రమే. ఇందులో మరింత భాగాన్ని అతనికి నూనెమీది పెట్టుబడి తెచ్చి పెట్టింది. అతని స్లీపింగు కార్, కీస్టోస్, ఆడమ్స్ ఎక్‌స్ప్రెస్ మొదలైన పెట్టుబడులు కూడా తగినంత రాబడిని ఇచ్చాయి. మిగిలిన ఆదాయం అతనికి యితరమైన పెట్టుబడులవల్ల వచ్చింది. అతడు నిజంగా "రూపొందుతున్న స్కాచ్ వాడు" అయినాడు. ఆనాటి ఇతని తైలవర్న చిత్ర పదకొండు సంవత్సరాలకు పూర్వం తీసిన ఛాయా చిత్రపటంలోవలె అదే నిగనిగగల శాంతమైన ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. అతని జుట్టు కొంచెంగా నల్లబడ్డది. సొగసైన చిన్ని గడ్డం చేకూరింది.

అతని ఆదాయంలో మరొకపద్దు నలభై రెండువందల యాభైడాలర్లు "క్లోమన్" నుంచి వచ్చింది. ఇది కార్నెగీ ధనసంపత్తిని పెంపొందించిన మరొక వ్యాపారసంస్థ. ఈ సంస్థలోనుంచి వచ్చిన ఆదాయం అతడు తమ్ముడికోసం పెట్టుబడి పెట్టిన దానిమీద వచ్చినది.

ఆండ్రూ క్లొమన్ శక్తిమంతుడు. కానీ సుస్థిరచిత్తం కలవాడు. కొంచెం తగాదా మారి వాడు. మంచి జర్మన్ మెకానిక్. క్లోమన్‌కు అలిఘనీలో ఒక ఫౌండరీ వుంది. ఇతని ఇరుసులకు ఎంతో ప్రఖ్యాతివచ్చింది. యుద్ధం ప్రారంభం కావటంచేత ప్రభుత్వం ఇతడికి చాలా ఆర్డర్లిచ్చింది. అయితే యితడికి తన వ్యాపారాన్ని వృద్ధిచేసుకొనేటందుకు తగిన వస్తు సంపత్తి, ధనసంపత్తి లేవు.

టామ్ మిల్లర్ యితనికి తోడయినాడు. ఇరువురూ కలిసి చిన్ని కార్పొరేషనును స్థాపించారు.

కార్నెగీతో "ఆండీ! నిన్ను కూడా ఇందులోకి తీసుకు రావాలని నా కోరిక కాని క్లొమన్ దీనిని భగ్నంచేశాడు. అతడికి నీవంటే భయం. నీవు ఇందులో చేరితే మొత్తం నీపరం చేసుకొంటావనీ, లేదా నీపరం చేసుకోటానికి ప్రయత్నం చేస్తావనీ అతని అభిప్రాయం" అన్నాడు.మిల్లర్.

ఆ పరిహాసాంశాన్ని గురించి వాళ్లు నవ్వుకున్నారు. అప్పుడు వాళ్ళిరువురూ ఎంత త్వరలో ఆండీ ఇనుము వ్యాపారంలో ప్రవేశించ నున్నాడో అణుమాత్రమయినా ఊహించ లేదు.

యుద్ధశాఖ ఇరుసులకు, ఫిరంగి బండ్లకు విపరీతంగా ఆర్డర్లిస్తున్నది. వీటికే కాకుండా ఇతరమయిన వాటికికూడా ఆర్డర్లు ఊరికే వచ్చిపడుతున్నవి. ఒకరోజున ఫీప్స్-జాన్‌కు చిన్నతమ్ముడు. ఇతడు తరువాత కొద్దిసంవత్సరాలకు చనిపోయాడు-మిల్లర్ ఆశపడుతూ "నాకు ఇనుము వ్యాపారంలో ప్రవేశించాలని వుంది. అయితే యెలా సాధ్యమౌతుందో బోధపడటం లేదు" అన్నాడు.

టామ్ సొగసుగా మీసాలనుగుంజుకుంటూ కొద్దిసేపు ఆలోచించాడు. అతనికి హెన్రీ, ఇంకా బాగా వయసు చేకూరనివాడు. ఒకరోజు "నాకు ఒక క్వార్టరు బదులు ఇస్తావా" అని అన్ననడిగి తెచ్చుకొని స్వంతవ్యాపారాన్ని ఎలా ప్రారంభించుకొన్నాడో స్మృతికి వచ్చింది. అన్న ప్రశ్నార్ధకంగా తనను చూచినప్పుడు హెన్రీ "ఇది అత్యవసరమయినది" అన్నాడు.

జాస్ ఆ క్వార్టరును సందేహించకుండా ఇచ్చాడు.

మర్నాడు 'డిస్పాచ్‌' పత్రికలో 'కావలెను' అన్న ప్రకటన కనిపించింది. "ఉత్సహవంతుడయిన కుర్రవాడు ఏదైనా పనికోరుతున్నారు." ఏమాత్రం దాపరికం లేని ఈ చిన్న ప్రకటనకు ఒక వ్యాపారసంస్థ సమాధానమిచ్చింది.

అది అతనికి 'ఎర్రండ్ బాయ్‌'గా వుద్యోగమిచ్చింది. తలిదండ్రుల ఒప్పుదలతో అతడు బడి విడిచిపెట్టి ఆ పనిలో చేరాడు. ఆనాటినుంచి అతడు ఒక్కరోజునుకూడా వృధాగా పోనివ్వ లేదు. ప్రస్తుతం అతడు ఒక పౌడరు కంపెనీకి బుక్కీపరుగా పనిచేస్తున్నాడు. ఒకమాటు "వయసు ఇరవయి సంవత్సరాలు, నేను ఇంకా ఎందులోనూ ప్రవేశించ లే"దన్నాడు. జీవితమంతా భగ్నమయిన ఒక వృద్ధిడిలా ఆవరించిన నిరాశతో.

టామ్ మిల్లర్ మళ్ళీ ఒకమాటు పరికించాడు. హెన్రీని అతడు బాల్యంనుంచి చూస్తూనే వున్నాడు. మంచి తేజస్సు, ప్రతిభ, న్యాయ తత్పరతగల యువకుడుగా తోచాడతనికి. పైగా అతడు తనకు బహుకాల ప్రియమిత్రుడయిన జాస్‌కు సోదరుడు.

"పెట్టుబడికి నీదగ్గిర డబ్బేమయినా వుందా?" అని అడి గాడతడు.

"లేదు" అన్నాడు హెన్రీ. "అప్పుడప్పుడు కొద్దికొద్దిగా జీతంలోనుంచి మిగుల్చుకొన్నాను. కానీ ఆమొత్తాన్నీ నా కుద్యోగమిచ్చిన వాడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను."

క్లొమన్ అండ్ కంపెనీలో ప్రవేశించటం నీ కిష్టమేనా?

"నా చేతిలో విడిగా డబ్బున్నట్లయితే తప్పక ప్రవేశిస్తాను. కానీ లేదని నిరాశతో చేయిచాచాడు."

"నేను నీకు కొద్దిగా అప్పిస్తాను" అన్నాడు. మిల్లర్. ఆ వ్యాపారం స్థితి ప్రస్తుత మిలావుంది. ఎనిమిది వేల డాలర్ల మూలధనంతో మా సంస్థ స్థాపితమైంది. అయితే దాన్ని అంతా చెల్లించ లేదు. వ్యాపారపు టవసరాలు పెరుగుతున్న కొద్ది దఫాలువారీగా చెల్లించవలెనని చార్టరులోవుంది. కంపెనీ కొత్త యంత్రాలకోసం కొంతఖర్చు పెట్టవలసివుంది. నా దగ్గిర డబ్బు విశేషంగా లేదు. కొద్ది వందలతో నిన్ను అందులో ప్రవేశపెట్టిస్తాను."

హారీ కృతజ్ఞతపూర్వకంగా ఈ మేలుకు అంగీకరించాడు వృద్ధిపొందుతూ. నిశ్చయంగా లాభాలొచ్చే వ్యాపారంలో తనకోసం పెట్టుబడి పెట్టుకోడానికి వినియోగించుకో కుండా దయాళువయిన టామ్ తన దగ్గరవున్న పదహారు వందల డాలర్లలో ఫిప్స్‌కు ఎనిమిదివందల డాలర్లు, విలియం అలెగ్జాండర్లకు ఎనిమిదివందల డాలర్లు అప్పిచ్చాడు. విలియం అలెగ్జాండరు ఇద్దరూ ఒకనాటి "బాటమ్ హూషియర్లు" బాల్యంనుంచి అంత సన్నిహితమయిన అనుబంధం వుండి ఒకరియెడ మరొకరికి అంత శ్రద్థాశక్తులుగల యువక వర్గాన్ని మరొకచోట చూడటం చాలాకష్టం.

గణకుడుగా వుండే యువ ఫిప్స్‌క్లోమన్ అండ్ కంపెనీలో ప్రవేశించాడు. పౌడర్ కంపెనీలో పగలంతా పనిచేసిన తరువాత కొద్దిగా భోజనంచేసి క్లోమను కార్యాలయానికి పరిగెత్తి సాయంత్రం ప్రొద్దుపోయేదాకా పుస్తకాలలో గడిపే వాడు. అతడు ఆ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు, అతనితో సమవయస్కు డయిన టామ్ కార్నెగీ అతనివెంట నిత్యం తప్పనిసరిగా వెడుతుండెవారు. వారు డేవిడ్ జోనాధన్‌లలా అన్యోన్యం అతి సన్నిహితులు. కొన్ని నెల లయిన తరువాత క్లోమను కంపెనీకి మరికొంత డబ్బు కావలసివస్తే తమ్ముడిపేరుతో ఆండ్రూ కార్నెగీ ఆ డబ్బు నిచ్చాడు. అందువల్ల అతడు ఆ సంస్థలో భాగస్తుడైనాడు. అతి శీఘ్రకోపి, అనుమానగ్రస్తుడు అయిన క్లోమన్ కలతలుపెట్టె ధోరణిలోనే ఉంటూవచ్చాడు. ఎవరో తన్ను మోసగించటానికి యత్నిస్తున్నారన్న భయంతో దీనికి తరువాత కొద్దికాలంలోనే అతడు అందరీకి చెందే ఒక తగాదాను పట్టుకొచ్చాడు. థామస్ యన్ మిల్లర్ తన ఇనుముసంస్థలో భాగస్థుడు కాడని పత్రికల్లో ఒక ప్రకటనచేశాడు. దాంతో విసుగువచ్చి మిల్లర్ ఆ కంపెనీలోని తనషేర్లను అమ్మేశాడు.

"టామ్, మనం స్వంతంగానే ఒక రోలింగ్ మిల్లును ఆరంభిద్దా" మన్నాడు ఆండ్రూ కార్నెగీ. "అది మన బ్రిడ్జి కంపెనీకి, ఇతర సంస్థలకు కావలసిన ఇనపసామాన్లను తయారుచేస్తుంది."

"అయితే మనం మీ తమ్ముడు టామ్ కంపెనీతో పోటీ చేయటమౌతుందేమో" అని అభ్యంతరం చెప్పాడు. మిల్లర్ ఇరువురికి చాలినంత వ్యాపారముంది. వాళ్ళిప్పుడు యుద్ధపు కాంట్రాక్టుల పని చూస్తున్నారు. మనం విశేషంగా బ్రిడ్జీలకోసం కృషి చేద్దాం.

అందువల్ల 1864 లో సైక్లోప్స్ ఐరన్ వర్క్స్ ఆరంభింపబడ్డది. క్లోమనుకు నిజంగా తీవ్రకోపంవచ్చింది. అయితే ఆ కోపాన్ని దిగమ్రింగుకోవలసివచ్చింది. యుద్ధం చివరదశకు వచ్చింది. సైన్యానికి సంబంధించిన ఆర్డర్లు సన్నగిల్లిపోవటమే కాకుండా చిన్నవై పోతున్నవి. కొద్దికాలం గడిచాక అతని భాగస్థులు తమ కంపెనీ సైక్లోప్స్‌తో అంతర్లీనం చేద్దామని సూచించారు. మార్పులు, అభివృద్ధులు తల కెక్కేటంత వేగంగా వచ్చేస్తున్నవి. అందుచేత తన కిష్ట మున్నా లేకపోయినా యూనియన్ ఐరన్ వర్క్స్ అన్న క్రొత్త కంపెనీ డైరక్టర్ల బల్లముందు టామ్ మిల్లర్ ఆండ్రు కార్నెగీలతో పాటు అతడు కూర్చోవలసి వచ్చింది.

"టామ్, నీవు చింతించేటంతగా నీకు అపచారం జరిగింది. అయితే ఇప్పుడు నీవే విజేతవైనావు" అన్నాడు ఆండ్రు కార్నెగీ.

కర్మాగారాలను రెంటిని కలిపివేయ లేదు. రెండు విడివిడిగా కూత పెట్టి అతివేగంగా పనిచేస్తున్నవి.

యుద్ధపు చివరదశలో అతని రైల్‌రోడ్ వుద్యోగం పై అధికారులయిన థామ్సన్, స్కాట్‌ల అభిలాషకు భిన్నంగా అంత మొందింది. ఆండ్రూ మార్చి 28, 1865 లో రాజీనామా లేఖను అందజేశాడు. ఎవరి మధ్య పనిచేసి తానెవరి అనురాగాన్ని అనుభవించాడో ఆ పిట్స్‌బర్గు డివిషనులోని వ్యక్తులను ప్రసంసిస్తూ ఒక వీడ్కోలు లేఖ వ్రాశాడు. వారు వీడ్కోలువేళ అనురాగపూర్వకంగా ఒక అందమైన గడియారాన్ని బహుకరించారు. మరొక అలిఘనీ పూర్వ బాలురలలో వాడు బాబ్ పిల్కైరన్ అతని తరువాత ఆ స్థానానికి అధిపతిగా వచ్చాడు. ఏవో డజను ఇతర మైనపనులు తాము అలవోకగా చేసినట్లే కార్నెగీ మిల్లర్లు ఇద్దరూ కొద్ది యెత్తున పిట్స్‌బర్గులో కొమోటివ్ వర్క్స్‌ను స్థాపించారు. అది వీలునుబట్టి మధ్య మధ్య ఒక ఇంజనును తయారు చేస్తున్నది. ఇంతకుపూర్వపు సంవత్సరం కార్నెగీ, అతని ఇరుగు పొరుగైన విలియం కోలిమన్ సరిహద్దుదాటి, ఓహైయోలో ప్రవేశించి మరికొంత నూనెభూమిని కొన్నారు. ఇది చాలా ఫలప్రదమైనది. దీనిమూలంగా క్రొత్త పెట్టుబడులకు ఎంతో ధనం చేకూరింది. తొలిసారిగా రెండు మహా సముద్రాలను రైలుమార్గాలద్వారా కలపివేయటానికి పచ్చకమైదానం, పర్వత శ్రేణిగుండా మార్గాన్ని వేస్తున్న పసిఫిక్ యూనియన్ రైల్‌రోడ్ కంపెనీలో స్టాక్‌నుకొన్నది. ఇందువల్ల లభ్యమైన ధనం వల్లనే 1867 ఆరంభంలో సెయింట్‌లూయీ వద్ద మిసిసిపీ నదిమీద మూడు ఆర్చీలుగల సుప్రసిద్ధమైన వంతెన పనిని కీస్టోన్ బ్రిడ్జి కంపెనీ ఆరంభంచేసింది. దానికి నమూనాను తయారు చేసింది. కెప్టెన్ లిన్విల్లీ పధకాల్లో కొన్ని మార్పులుచేశాడు. తరువాతి శతాబ్దంలో మూడుపాళ్లు గడిచిన తరువాతికూడా ఆ ఇనుపబ్రిడ్జి విస్తారంగా పెరిగిపోయిన రైలుబండ్లరాకపోకల బరువును, వీథికి సంబంధించిన రాకపోకల భారాన్ని భరిస్తున్నది.

ఈ సమయంలో రచయిత బేయర్డ్ టైలర్ యూరప్‌లో కాలినడకన చేసిన ప్రయాణాలను అభివర్ణించే "వ్యూన్ ఎపూట్" అన్న పుస్తకం హోమ్‌వుడ్‌లో ఎక్కువ ప్రీతిపాత్రమయి గ్రంథంగా ఉంటుండేది. కార్నెగీ తీవ్రంగా దేశాటనం చేసినవాడు. ఎన్నో దృశ్యాలను దర్శించినవాడు. చరిత్ర, భూగోళ విజ్ఞానాలంటే ఆసక్తి గలవాడు టైలర్ వంటి అనుభవాలు తనకుకూడా లభించాలని కుతూహలపడ్డాడు. ఒక రోజున అతడు జాన్ వావ్‌డివోర్టుతో అన్నాడు. "ఇప్పటి నుంచి నీవు మూడువందల డాలర్లలను కూడబెట్టుకొని నాతో పాటు యూరఫ్‌లో పాదయాత్ర చేయటానికి ఖర్చు చేస్తావా?"

"చేస్తావా?" అన్నాడు ఆండీ "బాతు ఈదుతుందా? ఐరిష్‌వాడు వుర్ల గడ్డలు తింటాడా?

అనుక్షణం నూనెషేర్ల విలువ రాకెట్లలా పైకిపోతున్నది. జాన్ సలహామీద కార్నెగీ 'బ్లాక్ గోల్డు'లో పెట్టుబడిపెట్టాడు. అది అతివేగంగా ఎంతో డబ్బు నిచ్చింది. వీళ్లు ఇద్దరూ హారీఫిప్స్‌ను ఆహ్వానించారు. అతని కిప్పుడు వీళ్ళతో వెంట వచ్చేందుకు కావలసిన డబ్బున్నది. వసంతారంభంలో స్టీమ రెక్కారు.

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది కార్నెగీ మధ్య మధ్య దీర్ఘమైన సెలవలు పుచ్చుకుంటూ, ధనాన్ని పెంపొందించుకుంటూ, పెద్ద పారిశ్రామిక సామ్రాజాన్ని నిర్మించుకుంటూ,న్నాడు. పెట్టిన సెలవలను విశేషంగా దేశాటనతో గడిపివేస్తున్నాడు. అతడు రచనల్లో, ప్రసంగాలలో, చేసేచేతల్లో తన జీవితానికే కాదు ఏ మానవుని జీవితానికైనా ప్రధాన లక్ష్యం ఇనుము, లేదా ఉక్కు, లేదా మరొకటి ఏదైనా వుత్పత్తి చేయటం కాదు. సమగ్రమైన బుద్ధి వికాసాన్ని, వుత్తమ శీలాన్ని సంపాదించటం మానవజాతి సంక్షేమం కోసం తన సంపదను వినియోగించటము అని స్పష్టంచేశాడు.

దేశంలో వున్నప్పుడు కష్టపడి, సత్య సంధతతో పనిచేశాడు. అయితే అతడిక మరణపర్యంతం పనిచేయాలన్న ఉద్దేశ్యంలేదు. కొద్ది జీతంకోసం వారానికి ఆరు రోజులు, కొన్ని సందర్భాలల్లో ఏడురోజులు గంటలతరబడి తాను శ్రమపడటాన్ని అత డెన్నడూ మరచిపోలేదు. ఇప్పు డాతడు తన ఆత్మకు పుష్టిని చేకూర్చుకోటానికి పూనుకున్నాడు. వాళ్ళమీద విడిచిపెట్టి ఎక్కడకయినా తాను నెలల తరబడి వెళ్ళినా సామర్థ్యంతోను, సత్య సంధతతోను వ్యాపారాన్ని నడిపించగలనన్న వుద్యోగివర్గం అతని కుంది. అట్టిది తనకు చేకూరిందని తన్ను గురించి తా నెప్పుడు గర్విస్తుండేవాడు. తనకు సహచరులునుగా స్వీకరింపదగ్గ శక్తి విశ్వాసపాత్రతగల వ్యక్తులు చాలామంది తన బంధువర్గంలోను బాల్య స్నేహితులలోను వుండటమనేది నిజంగా అతని అదృష్టం. అతడు వ్యాపారధోరణులు భవిష్యత్తులో ఎలా వుండబోయేది, వర్తమానంలో ఎలా నడుస్తున్నదీ గమనించటం ఎన్నడు మానివేయ లేదు.

ఫిప్స్‌కు బంధువయిన జాన్ ప్రాంక్స్ లివర్ పూల్ వద్ద ఈ ముగ్గురు యాత్రికులను కలుసుకొని ఆ యాత్రికబృందంలో చేరుకున్నాడు. నిత్యమైన యువకోత్సాహంతో తరువాత ఈ యాత్రిక చతుష్టయం ఇంగ్లండు ఫ్రాన్స్, జర్మనీ, హంగేరీ, స్విట్జర్‌లాండు, ఇటలీలలో పర్యటనచేశారు. ధరలు పెరిగిపోతుండటం, వెర్రిగా ఆర్ డర్లు వచ్చి పడుతుండటం కర్మాగారాలు రెండు అంచలతో పనిచెయ్యటం మొదలయిన విషయాలతో స్వదేశంనుంచి, ఇంటిదగ్గరనుంచి అతనికి వచ్చే వార్తలు ఎల్లవేళల్లో మంచివిగా వుంటుండేవి. యుద్ధానంతరోల్బణం పరిపూర్ణంగా వుంది. ప్రాచీనము, అధునాతనము అయిన చరిత్రను నిర్మించిన ప్రదేశాలలో పర్యటించటం మంచి సంగీతాన్ని వినటం కళాత్మక వస్తు ప్రదర్శనశాలను మతవిషయక మహానిర్మాణాలను, దుర్గాలను సందర్శించటం అతడు సంతృప్తితో చేశాడు. వెనిస్ నగరంలోని డోజస్ రాజసౌధం మధ్యయుగమందలి వెనిటియస్ ప్రజా రాజ్యంలోని ప్రముఖన్యాయాధిపతులు అతనిలో నిక్షప్తమయి వున్న సాహిత్యశక్తిని మేల్కొల్పటం జరిగింది. పెద్ద అంతర్మందిరంలో వున్నప్పుడు అతడు తన సహచరులను ముగ్గురను పూర్వం పాలకవర్గ సభ్యులయిన మహోద్యోగులు వాళ్ళను డోజస్ సింహాసనంలో ప్రాంక్సు అనే వారుకూర్చున్న మహాసనాల మీద కూర్చుండబెట్టి వారిముందు నిలవబడి

"Most Potent,grave and renvered signiors-

My very noble and approved goodmasters.

[ అతి శక్తిమంతులు, గంభీరులు, గౌరవనీయులయిన ప్రముఖులారా! ఘనతవహించిన ఉదారులయిన, ఉదాత్తులయిన నా యజమానులారా! అంటూ ఆరంభించి ఓధెల్లో చేసిన నివేదనాత్మ కోపన్యాసాన్ని] ఉదాత్తమైన అభినయభంగిమతో వినిపించాడు. యూరపులో ఎక్కడికి వెళ్ళినా అతడు అక్కడి వ్యాపారాలను, పరిశ్రమలను, రవాణారీతులను, పరిశీలించడం మరచిపోలేదు. అందువల్ల ఈ యాత్ర అతనికి వ్యాపారాత్మక దృష్టితో చూసినా ప్రయోజనకారి అయింది. అతడు క్రమంగా పసిఫిక్ సముద్రతీరం వంకకు త్రోసుకొనివస్తున్న యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్డును గురించికూడా మరచిపోలేదు. అతడు స్కాట్‌కు వ్రాశాడు. "సెంట్రల్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ-ది వూడ్రఫ్ స్లీపర్ కంపెనీ-యూనియన్ పసిఫిక్ కంపెనీ దగ్గరనుంచి స్లీపింగ్ కార్ల కాంట్రాక్టును పొందకూడదా?" అని రోము నుంచి వ్రాశాడు. "స్కాట్ సమాధానాన్నిస్తూ" యువకుడా నీవు సమయ మేదో బహుచక్కగా ఊహిస్తావు "ప్రతిస్పర్థుల ఊహలను సమయానికి కని పెడతావు" అని ఆరంభంచేశాడు. వూడ్రఫ్‌ల కార్లను పోలిన స్లీపింగ్ కార్లకు జార్జి. ఎయ్‌వుల్మన్ పేటెంటుపుచ్చుకున్నాడు. అటువంటి పేటెంటుహక్కు అతనికి ఎలా లభ్యమైందని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పేటెంటు కార్యాలయం వారి వర్తన ఊహాతీతంగా వుంటుంది. పుల్మన్ కూడా యూనియన్ పసిఫిక్ కాంట్రాక్టుల కోసం యత్నిస్తున్నాడు. కానీ రైల్‌రోడ్ కార్యవర్గంవారు మరి రెండు సంవత్సరాలవరకూ ఈ విషయాన్ని నిర్ణయించటం వాయిదా వేశారు.

తమ్ముడు టామ్ అయిదుగురు అందగత్తె లయిన సోదరీమణులలో ఒక తెను, లూసీ కోల్మన్‌ను, వివాహం చేసుకోవలసి వుంది. "నీవు ఎక్కడ నివసించదలచుకున్నావో నిశ్చయించుకొన్నావా" అని యాత్రనుంచి తిరిగి వచ్చిన తరువాత అతడు తమ్ముణ్ని ప్రశ్నించాడు.

"లేదు" అన్నాడు టామ్

"ఈ ఇంటిని నీవు పుచ్చుకోటంలో నీ అభిప్రాయమేమిటి!"

అప్పుడు వాళ్ళు హోమ్‌వుడ్ లోని ఇంట్లో ఉదయ భోజనం చేస్తూ భోజనశాలలో వున్నారు.

"ఈ అభిప్రాయం లూసీకి నచ్చితే ఈ ఇల్లు నాకెంతో బాగుంటుంది" అన్నాడు టామ్. "కానీ నీవు ఎక్కడికి వెళ్లుతావు? న్యూయార్క్‌కు వెళ్లుదామన్న ఉద్దేశం ఇంకా నీలో ఊగిసలాడుతున్నదా?"

"ఔను అది చేయదగ్గ పని కడచిన కొన్ని సంవత్సరాలల్లో ఎన్నో పర్యాయాలు నేను అక్కడికి వెళ్ళిరావటం నీవు గమనించావు గదా ? గ్రేట్ బ్రిటన్‌కు లండన్ ఎలా కేంద్రమో యునైటెడ్ స్టేట్సుకు న్యూయార్క్ అలా సమస్తానికీ కేంద్రం కాబోతున్నది. అక్కడి బ్యాంకర్లు ముఖ్యంగా ఆంగ్లేయ కంపెనీలతో సెక్యూరిటీల విషయంలో దౌత్యాలు నడపమని తరుచుగా నన్ను అడుగుతున్నారు. అందుమూలంగా నాకు మంచి కమీషన్లు వస్తాయి. అమ్మా నేను ఇక్కడికి తరుచుగా వస్తూ పోతూ వుంటాము. "అయితే, ఆమె కూడా నీతోబాటు వస్తుందన్న మాట" అన్నాడు టామ్.

"ఔను" అన్నది వాళ్ళ తల్లి. "ఇటువంటిది రానున్నదని నేను ఊహిస్తూనే ఉన్నానుగాని రాత్రే ఆండీ ఈవార్త నాకు చెప్పాడు" హోమ్‌వుడ్ ను విడిచిపెట్టి వెళ్ళటం నా కిష్టంలేదు. కానీ అతని క్షేమానికి వుపకరిస్తే విడిచిపెట్టి వెళ్ళటం నా కిష్టమే."

"నీవు, టామ్, హారీ ఫిప్స్‌ల వంటి భాగస్థులు-మిస్టర్ కొల్‌మన్, పైప్, క్లొమన్‌లను గురించి చెప్పవలసిన పని లేదు. వుండటంచేత ఇక్కడ ఇక నాతో అవసరం లేదు. అయినా ఇక్కడి విషయాలు యెలా నడుస్తుంటవో నేను కనిపెట్టే వుంటాను" అని అతడు సంభాషణను కొనసాగించాడు. ఇరవయ్యోపడిలోనే ఉన్నా ఆత్మశక్తితో సమర్థతతో కర్మాగారాలను నడిపించే నేర్పుగలిగి వ్యాపార మేధావి అని నిరూపించుకున్నప్పటికీ టామ్ ఆ విషయాన్ని నవ్వివేశాడు.

లూసీకి టామ్‌కు వివాహమయింది. అది చాలా సంతోష ప్రదమయిన వివాహంగా పరిణమించింది. వాళ్ళు హోమ్‌వుడ్ గృహాన్ని తీసుకొన్నారు. ఆండ్రూ, అతని తల్లి న్యూయార్కుకు వెళ్లారు.

న్యూయార్క్ మహానగరంలో కల్లా పెద్దది అందమైనది అయిన సెయింట్ నికొలాస్ హోటలులో ఒక వరుస తీసుకొన్నారు. మార్గ రేట్ కార్నెగీ నూతన జీవితరీతికి యథాక్రమంగా అలవాటుపడ్డది. ఆరీతిమీద పెద్ద ప్రీతిని ప్రదర్శింపక పోయినా తృప్తితో వుండటానికి నిశ్చయించుకుంది. విశ్రాంతి కోసం ఆమె మొదటి రాత్రి ఘనంగా అమర్చిన శయ్యమీద వెన్ను వాలుస్తున్నప్పుడు ఇరవై సంవత్సరాలకు పూర్వం ఒక పేద నేతపనివాడు భార్యను, తన ఇద్దరు చిన్న కుర్రవాళ్ళను తీసుకొని అప్పు చేసిన డబ్బుతో అమెరికాకు వలసవచ్చి చుట్టూవున్న అద్భుతాలను వెర్రిగా చూస్తూ న్యూయార్క్ నగరవీధుల్లో వున్నదృశ్యం ఆమెకు తప్పక జ్ఞప్తికి వచ్చి ఉంటుంది.

ఆండ్రూ కార్నెగీ వ్యాపారం తన దగ్గిరకు వస్తుందని తన న్యూయార్క్ కార్యాలయంలో కూర్చో లేదు. వెంటనే అతడు అక్కడి మిసిసిపీ నదిమీద వంతెనలను నిర్మించేటందుకు కాంట్రాక్టులను సంపాదించటం కోసం కెయెకుక్, అయోహలకు పరుగెత్తాడు. కీస్టోన్ బ్రిడ్జిలను నిర్మించటంలో పోత ఇనుముకు బదులుగా దుక్క-ఇనుమును వాడుతున్నందున వాదన చేసి డుబుక్యూ అనే ప్రదేశంలో ఆ మహానది మీదనే జరుగుతున్న నిర్మాణానికి ఒక బ్రిడ్జిని అమ్మటం కోసం తరువాత సంవత్సరంలో అతడు మరొక మారు మిడ్వెష్టుకు వెళ్లాడు.

1868 ముగీయుబోతున్నప్పుడు తన రాబడిన కూడుకోటం కోసం కూర్చు సమయంలో అది 56,110 డాలర్లు అయినట్లు అతడు గమనించాడు. కుర్చీలో వెనక్కు వాలి, కలాన్ని త్రిప్పుతూ, దృష్టిని కొద్దిక్షణాలు గోడమీద నిలిపి మనస్సులో కొంతకాలంనుంచి క్రమక్రమంగా ఘనీభవిస్తున్న ఒక తీర్మానాన్ని కాగితంమీద పెట్టటంకోసం నిర్నయం చేశాడు. మళ్ళా ముందుకు వ్రాలి ఒక విశిష్టమై విజ్ఞాపిక నిలా వ్రాసు కొన్నాడు.

సెయింట్ నికలాస్ హోటల్, న్యూయార్క్.
డిసెంబర్, 1868.


ముప్పది మూడేళ్ళ వయసు! రాబడి సంవత్సరానికి 50,000 డాలర్లు !! రెండేళ్ళకు, సరిగా ఈ సమయానికి, సంవత్సరానికి 50,000 డాలర్లకు తగ్గకుండా నా వ్యాపారాన్నంతటినీ చక్కదిద్దుకుంటాను. ఇంతకుమించి సంపాదన చెయ్యను. ప్రతి సంవత్సరం అదనంగా వచ్చినదాని నంతటిని ధర్మకార్యాలకు వినియోగిస్తాను. ఇతరులకోసం తప్ప వ్యాపారాన్ని పూర్తిగా పరిత్యజిస్తాను.

ఆక్స్‌పర్డ్‌లో నివాస మేర్పరచుకొని, ఉత్తమసాహిత్యకులలో పరిచయం కలిగించుకొని విద్యను పూర్ణంగా ఆర్జిస్తాను. ఇందుకు మూడు సంవత్సరాల తీవ్రకృషి అవసరం. ప్రజల యెదుట నిల్చి ఉపన్యాసాలిచ్చే విషయాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. తరువాత లండన్ నగరంలో నివాసమేర్పరచుకొని ఒక వార్తాపత్రికనో, సమీక్షా పత్రికనో పెట్టుబడి పెట్టికొని, ప్రజా వ్యవహారాలల్లో ముఖ్యంగా దరిద్ర జన విద్యాభివృద్ధులకు సంబంధించిన వాటిల్లో పాల్గొంటూ, దాని జనరల్ మేనేజిమెంటుమీద శ్రద్ధ వహిస్తాను. "మానవుడికి ఆదర్శం అంటూ ఒకటివుండాలి. ధననిధులను ప్రోగుచేయటంకంటే నీచమైన ప్రతిమారాధనం మరొకటి లేదు. ధనపూజకంటే నై చ్యాన్ని కల్పించే ఆరాధన మరొకటి లేదు. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ నెను అతిఘనముగా చొచ్చుకుపోవాలి. తన వర్తనవల్ల ఉన్నతికి తీసుకుపొయ్యే జీవితాన్నే నేను ఎన్నుకోవాలి. అనతికాలంలోనే ఎక్కువ డబ్బును సంపాదించే మార్గాల నన్నింటిని అన్వేషించటంలోనే బుద్ధి నంతటినీ వినియోగిస్తూ మరింత కాలాన్ని వెచ్చించడ మనేది నిత్యంగా త్రిప్పుకోవటమంటూ లేని రీతిగా నన్ను పడవేసి తీరుతుంది. ముప్పది ఐదవ యేట వ్యాపారాన్ని పూర్తిగా విరమించేస్తాను. రానున్న రెండు సంవత్సరాలల్లో శిక్షణను పొందుతూ, క్రమపద్ధతిలో గ్రంథపఠనం చేస్తాను.

రెండు సంవత్సరాలల్లో కాదుగదా జీవితంలో ఎప్పుడైనా సరే వ్యాపారిక సమ్మోహనాలనుంచి తప్పించుకోవటం ఎంత కష్టమో అతడు ఆ సమయంలో కొంచెమైనా వూహించ లేదు. అతడు వ్యాపారానికి స్వస్తి చెప్పేందుకు ఇరవై ఏళ్లు పట్టింది. అయినా ధనసంపాదన కంటే సంస్కృతి మీదనే విశేషాభిమా నాన్ని వెలిబుచ్చే ఈ ప్రకటన నిజానికి సంపద దాన్ని ఆర్జించిన ధనాధిపతిది కాదు, ప్రజా సంక్షేమం కోసం అతని పరంగా వున్నట్రస్టు. అతడు తన ధనాన్ని గురించి అలాగే భావించాలి అన్న ధోరణితో అతడు తరువాత కాలంలో చేసిన బోధల్లో ఎంతటి మన: పూర్వకత వుందో అంతటి మన:పూర్వకతను ప్రదర్శిస్తున్నది. మనుష్య ద్వేషులు కొందరిందులో ప్రకటితమైన తత్వాన్ని మోసకారి తనమని అపహాస్యం చేశారు. కార్నెగీ దీనినంతటినీ హృదయపూర్వకంగానే ఉద్దేశించాడు, తన సంపదను అంతటిని దానం చెయ్యకపోయినా తరువాత కాలంలో చెప్పినదంతా కార్యరూపాన చేసి చూపించే సమయం వచ్చింది.

చదువుకోసం అతడు ఆక్స్‌ఫర్డ్ వెళ్ళ లేదు. ఉపన్యాసాలివ్వటంలో, చరిత్ర, తత్వశాస్త్రము, సాహిత్యము, కళలు అన్న అంశాలల్లో తనజ్ఞానాన్ని పెంపొందించుకోటానికి ఎంతో కృషిచేశాడు. వ్యాపారం తోబాటు, ఆత్మ సంస్కృతిని అభివృద్ధి చేసుకోటంకూడా ఒక ఉద్దేశంగాపెట్టుకొని అతడు ఇంగ్లండుకు తదితర దేశాలకు ఎన్నోమారులు యాత్రచేశాడు. అతడ్ని రెంతూ ఆకర్షించటం ప్రారంభించాయి. అంతరాత్మలో ఉన్నత విషయాలమీద ప్రగాఢమైన ప్రేమ వున్నప్పటికి అతడు వ్యాపారంలో కలుగుతున్న విజయవ్యామోహాన్ని ఎదుర్కో లేక పోతున్నాడు. వ్యాపారానికి స్వస్తి చెప్పటం కోసం కేటాయించుకున్న రెండు సంవత్సరాలల్లో అతడు హృదయ పూర్వకమైన తీవ్రకృషి చేశాడు. అతడు, బాల్టిమోర్ ఓహైయో రైల్‌రోడ్ పెట్టుబడిదారు, జాన్. డబ్లియు. గారెట్‌దగ్గరికి వెళ్ళి హీలింగ్ పార్కర్స్‌బర్గు అన్న రెండు ప్రదేశాలల్లో ఓహెయో నదిమీద కట్టవలసిన రెండు బ్రిడ్జీలకు సంబంధించిన కాంట్రాక్టులను అతడికి అమ్మివేశాడు. చికాగోలో స్లీపింగ్ కార్లను ఉత్పత్తి చేస్తున్న జార్జి యం. పుల్మన్‌ను కలుసుకొన్నాడు. మనుష్యస్వభావం పరిశీలన విషయంలో కించిత్తయినా రోషం లేని తన సహజావబోధ శక్తితో అతనికున్న వ్యాపారిక మహత్తును గుర్తించాడు. కార్నెగీ సహచరులు అతనితో "మనం పుల్మన్ మీదస్వత్వోల్లంఘనం Infringement చేసినందుకు అభియోగం తీసుకురావా" లని తీవ్రదోరణిలో మాట్లాడారు.

"నా అభిప్రాయం అదికాదు. అభియోగాలు న్యాయస్థానంచుట్టూ ఎలా త్రిప్పుతాయో మీకు తెలుసు . డబ్బంతా న్యాయవాదుల పాలు కావటమే జరుగుతుంది. పుల్మన్‌కు చికాగో కార్యస్థానం కావటంవల్ల ఆతనికి మధ్య పశ్చిమ, దూర పశ్చిమ రైలుమార్గాలతో మనకంటే ఎక్కువ సాన్నిహిత్య మున్నది. అందువల్ల అతడికి మంచి అవకాశం, అంతే కాక ఆ యువకుడు పరిశ్రమ రంగంలో ఘనకార్యాల నెన్నింటినో నిర్వర్తింప నున్న అదృష్టశాలి. చేతనయితం మనం అతనితో చేతులు కలుపుదాం" అని కార్నెగీ వారి అభిప్రాయంతో వ్యతిరేకించాడు.

సెయింట్ వికొనిస్ హోటల్ మెట్లముందు 1869 లో ఒక వేసగి సాయంకాలం కార్నెగీ, జార్జి పుల్మన్ దరిదాపుగా ప్రక్క ప్రక్కన నడుస్తున్నప్పుడు అదృష్టదేవత చిరునవ్వు నవ్వినట్లు తోచింది. యూనియన్ పసిఫిక్ డైరెక్టర్లు న్యూయార్క్‌లో కలుసుకొని స్లీపింగ్ కార్ల కాంట్రాక్టు ఇవ్వనున్నారు.

"సుసాయంతనం. మిష్టర్ పుల్మన్" అన్నాడు కార్నెగీ ఉత్సాహంతో.

పుల్మన్ "సుసాయంతనం" అన్నాడు చేదుగా, కానీ కార్నెగీ కలవరపడ లేదు.

"ఇక్కడ మనం కలుసుకోటం ఎంతో చిత్రంగా వుంది" అన్న గమనిక చేశాడు కార్నెగి, కానీ అతడి దగ్గర నుంచి అందుకు సమాధానమైనా రాలేదు. క్షణకాలం కలవరపడి తెప్పరిల్లి కార్నెగీ పసివాడిలా నవ్వి "బాగుంది, మన మిద్దరం ఇక్కడే కలుసుకోటం. మన మిద్దరం మనకు మనమే బుద్ధిహీనులను చేసుకొంటున్నామన్న భావం నీకు కలగటం లేదా?" అన్నాడు.

ప్రతిద్వంది అయిన ఆ ఉత్పత్తిదారు ఆగి ఈవిధంగా తన్ను ఎదిరిస్తున్న వ్యక్తిని పరకాయించి చూచి ఐతే నీఉద్దేశ మేమిటి?" అన్నాడు.

"యూనియన్ పసిఫిక్ వ్యాపార విషయం. దాన్ని గురించి రాగల అవకాశాల నన్నింటినీ పోగొట్టుకుంటూ మన మిరువురమూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోటంలో ప్రయోజనమేముంది?" ఈ మాట పుల్మన్ బుద్ధి కెక్కింది. "అయితే దీన్ని గురించి నీవేమి చేద్దామంటావు" అని అడిగాడు.

"కలిసి పోదాం" అని కార్నెగీ కొంత బిగ్గరగా అన్నాడు. "నీ బృందము, నా బృందము కలిసి ఒక కంపెనీని స్థాపించి యూనియన్ పసిఫిక్ వారికి ఒక సమిష్టి సూచన నిద్దాము."

"దాని పేరేమిటి?"

పేరు అతనికి ప్రధానమయిన ప్రశ్న ఔతుందని కార్నెగీకి తెలుసు, సమాధానం సంసిద్ధంగా వుంది. "ది పుల్మన్ పాలస్ కార్ కంపనీ" అన్నాడు.

మంచులా గడ్డకట్టి వున్న మోము వెంటనే వికసించింది. "నా గదిలోకి రా, మాట్లాడుకుందా"మని ఆహ్వానించాడు.

ఇలా ఆ వ్యాపారాన్ని సాధించటం జరిగింది. సుస్వభావం గల థియోడోర్ వూడ్రఫ్, క్రొత్త కంపెనీకి పేరు పెట్టటాన్ని గురించి కొంచెం అనిష్టం వ్యక్తంచేసినా, ఇలా కలిసిపోవటంవల్ల కలిగేటందుకు వీలున్న ఆర్థిక ప్రయోజనాలను చూపించి చెప్పుకొన్నప్పుడు, ఆ పథకాన్ని అంగీకరించాడు.

కానీ చివరకు ఉక్కు కార్నెగీని తన పాశాలల్లో కట్టి పడేసింది. కొద్ది పరిమాణాలల్లో ఉక్కును తయారుచేయటం పూర్వంనుంచీ జరుగుతూనే వుంది. రైలుపట్టాలు వంతెన దూలాలు వంటి పెద్ద పెద్ద వస్తువులను తయారు చేసేటందు అనువుగా ఇంగ్లండులో హెన్రీ బెస్సిమర్ ఒక క్రొత్త విధానాన్ని కనిపెట్టేటంత వరకూ ఉక్కు వుత్పత్తి యెంతో నెమ్మదిగా జరుగుతుండేది. అప్పడది యెంతో కష్టమయిన పని, నిజంగా ఒక కళ. యిప్పటికి ఆండ్రూ భవిష్య జ్జీవితము నిశ్చింతగా రూపొందింది.