Jump to content

ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/బల్‌రన్ - డన్ఫ్‌ర్మ్‌ లైన్

వికీసోర్స్ నుండి

బల్‌రన్ - డన్ఫ్‌ర్మ్‌ లైన్

6

కొంతకాలంనుంచి నిరంతరం అతిసూక్ష్మంగా జాతీయ సంఘటనలమీద, సమస్యలమీద ఆసక్తి వహించి అతి నిశిత దృష్టితో పరిశీలిస్తున్న యువకార్నెగీ బానిసత్వం, రాష్ట్రాల హక్కులు అన్న వివాదగ్రస్త రెండంశాల వల్ల వుత్తర దక్షిణాలమధ్య క్రమంగా వృద్ధిపొందుతున్న తగాదాను గురించి తీవ్రమైన ఆందోళన చెందటం ప్రారంభించాడు. ఈ రాజకీయాలనే మాహాశిలవు మీద తనకు ప్రియమైన జాతీయ నౌక భగ్నం కాబోతున్నదని అతడు నమ్మ లేక పోయినాడు. అతడు నిశ్చయంగా ఆక్లిష్ట పరిస్థితికి సంచరించి తరువాతి కాలంలో అధ్యక్షుడు క్లీన్ లాండ్ అతడ్ని గురించి "అఫెన్సిన్ పార్టి జాన్" అని అన్న దానికి తగ్గట్లు రూపొందాడు. లింకన్ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డ ఫలితంగా 1861 నాటి వసంతారంభంలో దక్షిణ రాష్ట్రాలు విడివడి పోవటం ప్రారంభించాయి. ఆ సమయంలో అతడు ఒక ఆదివారంనాడు గ్రీన్స్‌బర్గ్‌లో తన వుత్తమ మిత్రుడైన మిష్టర్ స్టోళ్స్ యింట్లో అతిథిగా వున్నాడు. అప్పు డతని అతిథేయ విడివడి పోతున్న రాష్ట్రాలను ఆపటానికి బలప్రయోగం చేసేందుకు ఫెడరల్ ప్రభుత్వానికి ఎటువంటిహక్కు లేదన్నప్పుడు విని ఆశ్చర్యపడ్డాడు. "మిష్టర్ స్టోల్స్, మేము నీబోటి వ్యక్తులను ఆరు వారాలల్లో వురితీయబోతున్నాము>" అని ఆండ్రూ విరుచుకు పడ్డాడు.

మిష్టర్ స్టోల్స్ ఈ పరాభవానికి ఏమీ చెయ్యలేక పెద్దపెట్టున నవ్వాడు. 'నాన్సీ' అని ప్రక్కగదిలో వున్న భార్యను పిలిచాడు. "నాన్సీ, ఈ యువస్కాబ్ పిశాచం ఏమంటున్నాడో విను. నాబోటి వాళ్ళను వీరు ఆరువారాలల్లోగానే వురితీయబోతున్నారట."

కానీ ఆరువారాల్లోనే మిస్టర్ స్టోక్స్ ఫెడరల్ సైన్యములో మేనేజరైనాడు. అతడు విడివడిపోయే రాష్ట్రాలమీద సైన్యాన్ని ప్రయోగించరాదనటం రిపబ్లికన్ ప్రభుత్వంమీద ఒక ప్రగాఢమైన డెమాక్రాటి చేసే విమర్శ మాత్రమే పోర్టు సమ్లర్ లో జరిగిన కాల్పులనే సంఘటన అతనికళ్ళు తెరిచేటంత వరకూఅది యుద్ధమని అతడికి అవగతం కాలేదు. రాజకీయ పక్షాలకు సంబంధించిన చిన్ని సంఘర్షణ మాత్రమే అని అతడు అంతవరకూ భావించాడు. ఇరుపక్షాల మధ్య ఏర్పడ్డ విచ్ఛిత్తి ఎంత తీవ్రమయిందో అర్థంచేసుకోలేకపోయిన అతనివంటి వ్యక్తులు మొదట్లో చాలామంది ఉండేవారు.

యుద్ధ సేవ చేయవలసిన అవసరం పెన్సిల్వేనియా రైల్‌రోడ్ కంపెనీలో పనిచేసేవారికి అతివేగంగా వచ్చింది, మిస్టర్ స్కాట్‌ను ట్రాన్స్‌పోర్టేషను శాఖకు యుద్ధ సహ కార్యదర్శిని చేశారు. అతడు వెంటనే తనకు విశ్వాసపాత్రుడయిన ఆండ్రూ కార్నెగీని రైల్వే మనుష్యులతో ఒక సైనిక దళాన్ని కూర్చుకొని మిలిటరీ రైల్‌రోడ్, టెలిగ్రాఫ్‌ల పని చూచేటందుకు సహాయకుడవుగా రమ్మని పిలిపించాడు. ముసాచ్యు సెట్స్‌నుంచి దక్షిణానికి చేరవలసిన సైన్యం బాల్టిమోర్ మీదుగా వెళ్లుతున్నప్పుడు ఒక మూక ఎదుర్కొన్నది. అనేకచోట్ల రైల్వేలైను తెగగొట్టి, వంతెనలను తగలేసి అదిమార్గాలన్నింటినీ పాడుచేసింది. ఏప్రియల్ 19 తరువాత ఒక వారానికి వాషింగ్‌టన్‌కు, ఉత్తరానికీ మధ్య వార్తాప్రసారం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఇది చాలా విషమమైన పరిస్థితి.

ఆ మార్గాన్ని తిరిగి సరిచేయించటం కార్నెగీకి నిర్ణీతమైన ప్రథమ కర్తవ్యం. ప్రయాణం చేయవలసిన సైన్యంలో నుంచి ఎన్నుకొన్న మనుష్యులను, ఒక ఇంజనీరింగ్ దళాన్ని అతడు కనికరమన్నది ఎరగకుండా తరిమి పనిచేయించాడు.

వారాంతంలో బండ్లు తిరిగి నెమ్మదిగా దక్షిణానికి వెళ్ళటం ప్రారంభించాయి. కట్టలను మధ్యమధ్య ధట్టించటానికి ఎంతో ఘనమయిన భారాలను మోయగలందుకు వాటిని బలకరం చెయ్యటానికి తన మనుష్యులను అక్కడ ఆపుదలచేసి నిండా సైనికులున్న రైలుబండి ఇంజన్ పెట్టెలో కూర్చుని తాను బాగుచేయించిన రోడ్డుమీదుగా వాషింగ్టన్ వైపుకు ప్రయాణంచేశాడు. బండిమీద విద్రోహచర్య ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో వాళ్లు అతిజాగరూకులై వెడుతున్నారు. వాషింగ్టన్ ఇంకా చాలామైళ్ళ దూరానవుంది. వున్న ఒక్క తంతితీగను స్తంభాలనుంచి వదులుచేసి నేలమీద మేకుతో గట్టిగా అంటబాతినట్లు ఆండ్రూ గమనించాడు.

"ఇక్కడ ఆపండి. నేను తంతితీగను విడుదలచేయాలి" అన్నాడు ఆండ్రూ ఇంజనీరుతో.

"దాన్ని తెగనరికారా ఏమిటి?" అప్పటికి ఇంకా గాలి బ్రేక్ రాలేదు కనుక ఆవిరిని ఆపి వెనక్కు నడుపుతూ ప్రశ్నించాడు ఇంజనీరు.

"లేదు" అన్నాడు ఆండ్రీ సమాధానంగా." ఎందుకో మరి, మేకులతో నేలకు అంట పాతటం మాత్రమే జరిగింది. తోరణంలా వ్రేలాడుతున్నా అది పని చేస్తుంది. అయితే ఇలా నేలకు బిగిస్తే పనిచెయ్యదు.

పెట్టెలోనుంచి అతడు వేగంగా క్రిందికిదిగి, మేకు దగ్గరకు వెళ్ళి, రెండుచేతులతో బలంకొద్ది మేకును నేలనుంచి బయటికిలాగాడు. బిగించిన వైరును హఠాత్తుగా విడిపించటం వల్ల ఏం జరుగుతుందో అత డప్పు డూహించలేదు. అతని మొగాన గట్టిదెబ్బకొట్టి పైకి ఎగిసిపడ్డది. అతడి చెక్కిలిమీద అడ్డంగా లోతున గీచుకుపోవటంవల్ల నెత్తురు విపరీతంగా కారింది. నెత్తురులో నిండిపోయిన చేతిగుడ్డను మొగాన అడ్డుపెట్టుకొని సైన్యంతో అతడు వాషింగ్టన్ ప్రవేశించాడు. అతర్యద్ధంలో యూనియన్ కోసం తొలిసారిగా నెత్తురును ఒలికించిన వాణ్ని నేనని అతడు తరువాతకాలంలో నవ్వుతూ అంటుండేవాడు. వాషింగ్టన్ చేరగానే యుద్ధశాఖలో తంతివార్తాహారులు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. యుద్ధ సేవకోసం మరి నలుగురికి ఉత్తరువులు పంపించి పిలిపించవలసిందని అధికారులు అతణ్నికోరారు. ఆతడు ఆ వుత్తరువును డేవిడ్ మెక్కార్గోకు తంతిమూలంగా పంపించాడు. అతడు ప్రస్తుతం పెన్సిల్వేనియా రైల్‌రోడ్‌కు టెలిగ్రాఫ్ సూపరింటెండెంటుగా పనిచేస్తున్నాడు. మెక్కార్గో ఆ నలుగురు ఆపరేటర్ల పేర్లను వారు వాషింగ్టన్ చేరటానికి వెంటనే ఏ మార్గాన వస్తున్నది ఒక గంటలోపల తెలియ జేశాడు. వారి వయస్సు పద్ధెనిమిది, ఇరవై మూడు మధ్య వుంటుంది. వాళ్ళలో పెద్దవాడు స్ట్రేస్, తరువాత ప్రభుత్వతంతి సమాచారశాఖకు సూపరింటెండెంటు అయినాడు.

పోటొమాక్ నది మీదుగా వర్జీనియా రాష్ట్రంలోకి వెళ్ళే బాగా దెబ్బతినిపోయిన మార్గాన్ని పునర్మించటం అతనికి తరువాతి కర్తవ్యమైంది. ముఖ్యపట్టణ రక్షణార్ధం ఆప్రాంతానికి ఫెడరల్ సైన్యం వెళ్ళెటందుకు వీలు కలిగించాలంటే ఇది ఎంతైనా అవసరం. ఉన్నతోద్యోగితోసహా అందరూ గడియారం దగ్గర పెట్టుకొని పనిచేసి పోట్‌మాక్ నది మీది పొడుగాటి పాత వంతెనను తిరిగి కొయ్యతోటే నిర్మించడం జరిగింది. చెడగొట్టబడ్డ మొత్తంమార్గాలను, వంతెనలను, తంతి తీగలను సరిచేయిస్తూ, క్రొత్తవి నిర్మిస్తూ ఆ యువకుడయిన ఉన్నతోద్యోగి ఆరువారాలు గడిపాడు. 1861 వేసవిలో ఎన్నడూ ఎరగని ఎండలు కాశాయి. ఆమెరికాలోని నిరాఘ తాపానికి అతడు తట్టుకోలేగపోయినాడు. ఎక్కువసేపు ఎండలో గడపకుండా ఉండటంకోసం అతడు ఎంతో శ్రద్ద తీసుకో వలసివచ్చేది.

యూనియన్‌కు కనువిప్పును కలిగించిన బుల్ బరస్ యుద్ధం జూలై 21 న జరిగింది. ఆ రోజున కార్నెగీ సైన్యాలను ఆహారపదార్ధాలను, ఆయుధసామగ్రిని రైలుమీద యుద్ధరంగానికి చేరుస్తూ వాషింగ్టన్‌కు ఇరవై మైళ్ళదూరంలో వున్న బర్క్స్ స్టేషన్‌లో వున్నాడు. ముఖ్యనగరంలో శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం రాజ్య మేలుతున్నది. అహంకారపూరితులైన దాక్షిణాత్యులను చులకనగా ఓడించవచ్చుననీ, ఆ చిన్ని తిరుగు బాటును అంతమొందించవచ్చునని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.

బర్క్స్ స్టేషన్‌లో రోజంతా తీవ్రంగా శ్రమపడవలసి వచ్చింది. అంబ్యూలెన్సు శకటాలు తీసుకోవస్తున్న క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణం ఊరికే పెరిగిపోతున్నది. వాషింగ్టన్ నుంచి ఇంజన్‌లను, కార్లను తెప్పించి వారిని నగరంలోను, పరిసరాలలోను ఉన్న వైద్యశాలలకు చేర్చే ఏర్పాటు చేయించవలసివచ్చింది. యుద్ధభూమినుంచి వచ్చిన తొలి వార్తలు ఆశాజనకంగానే వున్నవి. మధ్యాహ్నమయ్యేటప్పటికల్లా పరిస్థితిలో మార్పు కన్పించింది. కొందరు దళాలుగాను, కొందరు ఒంటరిద్రిమ్మరులుగాను తిరోగమించివస్తున్న సైనికుల గుంపు స్టేషన్ మీద వెల్లువగా వచ్చి పడింది. ఒక ఘనవిజయానికి బదులుగా దారుణ విపత్తు రానున్నదని వెంటనే స్పష్టమయింది. బండి తరువాత బండిగా గాయపడ్డవాళ్ళను పంపించటం కొనసాగుతూనేవుంది. వాగన్ మార్లాలు తిరిగివచ్చే సైనికుల బండ్లతోను, కొందరు కుటుంబాలతో, కొందరు ఒంటరిగా విజయాన్ని చూడటంకోసం వచ్చిన కాంగ్రెస్ సభ్యుల బండ్లతోను వుద్యోగుల బండ్లతోను క్రిక్కిరిసిపోతున్నవి. దారుణమయిన ఓటమి కలుగుతున్న సమయంలో చీకటి పడింది. కార్నెగీ వాషింగ్టన్ వెళ్ళటంకోసం బండి ఎక్కగానే కాల్పులచప్పుళ్లు మిక్కిలి సన్నిహితంగా వినిపించాయి. ఆ పిమ్మట అతడు చాలా వారాలు వాషింగ్టన్ లోనే వున్నాడు. అతనికి ప్రభుత్వంలోను, సైన్యంలోను వున్న ప్రముఖులందరితో పరిచయం కలిగింది. వీళ్ళల్లో అధ్యక్షుడు లింకన్ ఒకడు. అతడు తనకు సహజమయిన నిష్కాపట్య సౌజన్యాలు గల వ్యక్తిత్వంతో కార్నెగీని గాఢంగా ప్రభావితుడ్ని చేశాడు.

వాషింగ్టన్ లోని ప్రభుత్వం యుద్ధాన్ని గురించి మొదట కొద్ది వారాలల్లో ముగిసిపోయే చిన్న పొంగుమాత్రమే అని అనుకున్నది. అందువల్ల రైల్‌రోడ్‌కు సంబంధించిన స్కాట్, కార్నెగీల వంటి వారిని ఆత్యయిక పరిస్థితిని సరిదిద్దటం కోసమే త్వరితగతిని పంపించటం జరిగింది. నిశ్చేష్టులను చేసేటట్లు బుల్‌రన్‌లో కలిగిన వ్యతిరేకఫలం అధికారవర్గంవారి ఆలోచనారీతినే మార్చివేసింది. యుద్ధం ఒకటో, రెండో, మూడో సంవత్సరాలు సాగుతుందని గుర్తించటం జరిగింది. స్కాట్, కార్నెగీలు బహుకాలం వారి రైల్‌రోడ్ వుద్యోగాలను విడిచిపెట్టి ఉండటానికి వీల్లేదు. అంతేకాక పెన్సిల్వేనియావంటి ప్రముఖమైన రైల్‌రోడ్‌లు యుద్ధాన్ని కొనసాగించటానికి ముఖ్యంగా అవసరాలుగాకూడా ఉన్నవి. స్కాట్, కార్నెగీలు వారి వుద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తన రైలు, తంతిపనులను చూడటం కోసం స్థిరంగా వుండిపోగల వుద్యోగులను నియమించుకున్నది.

పిట్స్‌బర్గుకు తిరిగివచ్చి కార్నెగీ తనవుద్యోగపుతంతువులను అందుకొని, ఆనాటి ఆశాపరులయిన గొప్ప వుద్యోగస్థు లందరూ చేస్తున్నట్లుగానే బయట వ్యాపారాలల్లోని పెట్టుబడులమీద దృష్టి నిలపటం కొనసాగిస్తూనే వున్నాడు. తరువాత వచ్చిన చలికాలపు చివరిభాగంలో చాలావారాలు అతడు గట్టి జబ్బు పడ్డాడు. కార్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు తన బలహీనతను తెలిసికొని స్వాస్థ్యాన్ని చేకూర్చుకోవటం కోసం సెల వడిగాడు. సెలవు మంజూరు చేయబడ్డది. సెలవు ఎక్కడ గడపటమా అన్న ప్రశ్న అతనికి కలగనే లేదు. మే మాసాంతంలో తాను, తల్లి డన్ఫ్‌ర్మ్‌లైస్ చూడడానికి వస్తున్నామని వ్రాశాడు.

జూన్ 23 న వారు లివర్ పూల్‌కు ఓడప్రయాణం చేసేటప్పుడు ఎడబాటు ఎరుగని టామ్ మిల్లర్ వారి వెంటవున్నాడు. అతడు బ్రిటన్ అంతా తిరగటంకోసం బయలు దే రాడు. బండి లివర్ పూల్ నుంచి ఉత్తరంగా నడుస్తున్నప్పుడు ఛివియట్ కొండలను చుట్టి అది స్కాట్లండులో ప్రవేశించినపుడు ఆండ్రూ, అతని తల్లిపొందిన ఆనందం పరాకాష్టనందుకున్నది. అలలుగా కదలాడే పచ్చనిపూల పరవులతో అక్కడి కొండప్రదేశమంతా కప్పబడివున్న దృశ్యాన్ని చూసి మార్గెరెట్ కార్నెగీ "ఓహ్! అక్కడే తంగెడు చెట్టు! తంగెడు చెట్టు" అన్నది నెమ్మదిగా. పొంగి పొరలే సంతోషభాష్పాలను ఆమె ఆపుకోలేకపోయింది. ఇక ఆమె కుమారుడు "పవిత్రమైన ఆనేలమీదపడి ముద్దెట్టు కుందామని నా కనిపించింది" అన్నాడు తరువాత.

వారిని గౌరవించే విషయంలో మేము మేమని పోటీపడ్డ అసంఖ్యాకులయిన బంధువులు వారికి స్వాగతంచెప్పారు. మిసెస్ కార్నెగీ తన కుటుంబంతో, మారిసస్‌లతో వుండిపోయింది. ఆండ్రీ సూటిగా అంకుల్ జార్గిలాండర్ షాపులో వున్న గదికి వెళ్లాడు. అక్కడ యువకులయిన వారిరువురూ ఒకరియెడ ఒకరు వాళ్ళ బాల్యంలో వర్తించినట్లే 'డాడ్‌' 'నైగ్‌' లగా ప్రవర్తించారు. వారు 'డగ్లాస్‌' అనే 18 వశతాబ్థపు విషాదాంత నాటకంలోని ఒక దృశ్యాన్ని చిన్నతనంలో చూసినట్లే చూశారు. అక్షరం తప్పిపోకుండా దరిదాపుగా అందులోని పంక్తులన్నీ జ్ఞప్తికున్నట్లు వాళ్లు సరి చూచుకున్నారు.

ఆ బంధువుల్లోకల్లా పెద్దదయిన ఆంట్ ఛార్లెటీకి ఆండ్రూ మరీ పసిబిడ్డగా వున్ననాటి విశేషాలు కొన్ని బాగా జ్ఞప్తికున్నాయి. ఆమె "నీవు చాలా ఆశాపరుడైన బిడ్డ"వని అతనితో అన్నవి. "నీకు రెండు చెంచాలతో పోయవలసి వచ్చేది. నోటిలోనుంచి ఒకటి తీసేటప్పటికే రెండోదాని కోసం గుక్క పెట్టేవాడివి. ఆండ్రీ అభివృద్ధిని గురించి తెలుసుకోటం విషయంలో ఆమె ఎంతో వెనకపడింది. అతడు రావటం ఎంతో ముఖ్య విషయంగా భావించింది. "నీవు ఏనాటికయినా తిరిగి వచ్చి ఇక్కడ హైస్ట్రీట్‌లో షాపు పెట్ట లేముసుమా" అన్నది. హైస్ట్రీట్‌లో ఆమె అల్లుడికి ఒక గ్రీన్‌గ్రోసర్ షాపువుంది. అతడు ఇతర వీధుల్లోషాపు లున్న వాళ్ళకంటె కొంత అధికుడుగా ఉండేవాడు. ఆమె దృష్టిలో మానవజీవితంలో సాధింపదగ్గ ఘనమైన విషయం ఆ హైస్ట్రీట్ లో షాపు పెట్టటమే.

కార్నెగీ కుటుంబం అమెరికాకు వలసపోవటంకోసం ఇరవై పౌనులు అప్పిచ్చిన మిసెస్ హెన్డర్ సన్ - అయ్‌లీ ఫార్గీ ఇంకా జీవించేవుంది. ఆమె, జానీలకు ఇప్పుడు బాగా లేకపోవటమనే స్థితే లేదు. ఇరవై పౌనులు తగ్గటంవల్లమొదట కొంత తగ్గుదల వచ్చింది. అయితే డన్ఫ్‌ర్మ్‌లైన్ ప్రమాణాలనుబట్టి చూస్తేవా ళ్ళిప్పుడు ఆనందంగా వున్నారు. అప్పు డిచ్చిన అప్పుకుగాను మిసెస్ ఆండర్ సన్‌కు కార్నెగీ ఇరవై పౌనులు 'ఇంట రెస్టు' [వడ్డీ, ప్రీతి అని శ్లేష] అన్నపేరుతో స్వార్థరహితమైన కృత్యానికి గాఢమైన కృతజ్ఞతగా కొన్ని సంవత్సరాలు పంపించటంతో వాళ్ళకు డబ్బు పెరగటం మొదలెట్టింది. ఇప్పు డతడు "నేను ఆ అప్పును ఇప్పుడు తీర్చి వేయటం మంచిదని భావిస్తున్నా" నన్నాడు. "ఆ అప్పు ఇదివరకే తీర్చావుగదా" అన్నది సమాధానంగా.

"ఇచ్చిన 'ఇంట రెష్టు'తో [ప్రీతి, వడ్డీ అని శ్లేష] నేను సంపూర్ణంగా తృప్తి చెందాను."

"వెనక వడ్డీమాత్రమే చెల్లించాను. ఇప్పుడు అసలు ఇచ్చి వేయగల స్తోమత నాకు వచ్చింది" అన్నాడు. అభ్యంతరం చెపుతూ.

"ఆండ్రా, అసలు సంగతి పెట్టుకోకు"అన్నది. ఆ హాస్య సన్నివేశానికి అనుగుణంగా కళ్ళు మిలమిలలాడిస్తూ. "ఉన్న దున్నట్లుగానే అది చాలా మంచి పెట్టుబడి".

అందువలా "ఇంట రెష్టు" క్రింద [ప్రీతి, వడ్డీ అనిశ్లేష] చెల్లింపులు నడుస్తూనే వచ్చాయి.

ఇంటి విషయానికి వస్తే ఆ 18-2 వేసగి ఫెడరల్ ప్రభుత్వానికి తృప్తికరంగా లేదు. యుద్ధభూమిలో దానికి చుక్కెదురుగా వుంది. యుద్ధఫలితాన్ని గురించి తీవ్రమైన అనుమానాలు ప్రారంభమయినాయి. స్కాట్లండులో ముఖ్యంగా డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోకూడా అభిప్రాయం దక్షిణానికి అనుకూలంగా వుంది. అది విని కార్నెగీ విస్తుపోయాడు. యూనియన్ అనుసరిస్తున్నది సన్మార్గమని తెలియజెపుతున్న అంకుల్ లాడర్ ఆ ప్రాంతంలో ఒక్కడై నిలువవలసి వచ్చింది.

తిరిగి జబ్బుచేయటంవల్ల ఆండ్రూ అంకుల్ లాడర్ ఇంట్లో కొన్నివారాలు గడపవలసివచ్చింది. వా ళ్ళిరువురూ అమెరికన్ వ్యవహారాలను గురించిఎన్నో చర్చలు చేశారు. ఒకనాడు అంకుల్ అన్నాడు అతనితో "ఆండ్రూ ! నిన్ను శ్రమకరమైంది అడుగుతున్నానని నాకు తెలుసు. నేను దాచిపెట్టుకొన్నది తీసుకోపోయి నా కోసం అమెరికాలో పెట్టుబడిపెడితే నే నెంతో సంతోషిస్తాను" అన్నాడు.

ఈ విధంగా తనమీద భారాన్ని పడేసినందుకు ఆండ్రూ చకితుడైనాడు. "అంకుల్ డబ్బును ఏ రూపంలో పెట్టుబడి పెట్టమంటావు?" అని అడిగాడు.

"అది నీకే బాగా తెలుసు" అని సమాధానం వచ్చినది. "అయితే దాన్ని యునైటెడ్ స్టేట్స్ బాండ్లకు వినియోగిస్తే నాకు మరికొంత ఎక్కువ సంతోషం. ఎందువల్ల నంటే ఇటువంటి ఘోరమైన ప్రమాద స్థితిలో ఉన్న సమయంలో కూడా ఇలా అనటం నే నా గణతంత్ర రాజ్యాంగము మీద ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోయిన వాడిని కాకపోవటం వల్లనే.

అంకుల్ కోరినట్లుగా కార్నెగీ కొంతడబ్బును ప్రభుత్వ బాండ్లలోను, మరికొంత తనతో సంబంధమున్న అనేక వ్యాపారాలలోనూ పెట్టుబడి పెట్టాడు. చివరకు అంకుల్ లాడర్ పెట్టుబడికి మూడు రెట్ల ప్రతిఫలం వచ్చింది.

జార్జి, జూనియర్ ఇతరులతో ఎంతో ముక్తసరిగా మాట్లాడే స్వభావం గల స్కాచ్ యువకుడు, మంచి సమర్ధుడయిన మెకానికల్ ఇంజనీరు. కెల్విన్ దగ్గర చదువుకున్నాడు. ఆండ్రూన్ అమెరికన్ వ్యాపారాన్ని గురించి,ఖనిజ సంపదను గురించి అతడు అనేక ప్రశ్న లడిగాడు. అమెరికాను చూడాలనీ, అద్భుతమైన ఆ దేశంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనీ అతడికి నిగూఢమయిన అభిలాష వున్నట్లు ఆండ్రి గమనించాడు.

"డాడ్, నీకున్న శిక్షతో, శక్తితో నీ వక్కడచాలా గొప్ప పనులు చేయవచ్చు!" అన్నా డతడు.

డాడ్ అప్పుడు ఇదమిత్థమని ఏది నిర్ణయించి చెప్పలేదు. కానీ అతడు సకాలంలో కార్నెగీ ఉక్కు సామ్రాజ్యంలోని ఒక ప్రముఖ పాత్ర వహించటానికి మహాసముద్రాన్ని దాటాడు.